30, ఆగస్టు 2015, ఆదివారం

తాళం చెవి


 తాళం చెవి పోయింది

తెలుసు .. ఆనందమంతా అందులోనే ఉందని

నిర్లిప్తత నిరాశ కాని బద్ధకమేదో 

వెతుక్కోవడానికి కాలికి అడ్డం పడుతుంటాయి

మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్నలెన్నెన్నొ

తీరాన విరిగిపడే కెరటాలవుతాయి

నీటిమీద వ్రాసిన రాతలు

ఆకాశపు పలకపై రాసిన అక్షరాలై పోతాయి

అంతుపట్టని రహస్యాలని

అశరీరవాణి గుసగుసగా చెప్పి వెళుతుందేదో

భద్రంగా మనసు మూటలో ముల్లె లా దాచేస్తా

నాలో నే శత్రువు నాలోనే మిత్రువు

ఇక తాళం చెవితో పనేముంది

చీకట్లో ఉండి నా నీడ ని వెతుకుతున్నా

వెలుగులోనున్న వేరొక నీడని హత్తుకోవాలనుకున్నా

సత్యమసత్యాల వెనుక

మానసిక సమాజాన్ని గెలవలేని భీరువు ని

రెక్కలు తెగిన పక్షిని తెరచాప తెగిన నావని

కబోదిలా వేలాడటం అలవాటై

కొత్తతావంటే వెరుపు

కావాలని మరుపు నాశ్రయింపు

ఇక తాళం చెవితో పనేముంది

నిలువుగా పెరుగుదామనుకుంటే

తలని త్రుంచినట్లు త్రుంచేసాక

సాఖోప శాఖలుగా విస్తరించక మానలా

నదిలా సూటిగా సాగాలనుకున్నా

కొండల్లా అడ్డు నిలిచి

పాయలుగా పాయలుగా చీల్చినా

సస్యశ్యామలం చేయక మానలా

ద్రవం లాంటిదాన్నని అర్ధమయినందుకేమో

అవలీలగా పాత్రలలో మారుతుంటానంతే !

ఇక తాళం చెవితో పనేముంది !?


కామెంట్‌లు లేవు: