మాధవుడి ప్రేమ
నాకు ఉహ తెలిసినప్పటి నుండీ కృష్ణుడంటే చాలా ఇష్టం. మా ఇంట్లో నానమ్మ పూజ గదిలో చిన్న చిన్నికృష్ణుడు వెన్న తినే ప్రతిమ వుండేది. ఆ ప్రతిమ తీసుకుని నేను ఆడుకునే బొమ్మలతో కలిపేసేకుని ఆడుకునేదాన్ని. మా నానమ్మ రోజూ నన్ను అడిగి తీసుకుని ఓ పువ్వు పెట్టి దణ్ణం పెట్టుకున్నాక మళ్ళీ ఆమెకు తెలియకుండా తీసుకునేదాన్ని. తల్లి బిడ్డను ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నట్టు ఆ పంచలోహ ప్రతిమను రెండు చేతుల మధ్య పట్టుకుని గుండెకు హత్తుకునేదాన్ని. కొంచెం పెరిగిన తర్వాత గోడ పై మేకుకి వేలాడుతున్న కేలండర్ లో స్వర్గీయ ఎన్టీఆర్ గారు కృష్ణుడు రూపంలో కనిపించేవారు. ఆయనకు ప్రతిరోజూ ఓ నమస్కారం తప్పనిసరి. అలా మనకు చెప్పి చేయించేవారు కదా.. పెద్దలు. ఇక కృష్ణలీలలు వినని ఇల్లు, మన తెలుగు లోగిలి వుంటుందా?
నాకు పదేళ్ళప్పుడు అనుకుంటా అమరదీపం సినిమా చూసాను. అందులో మాధవి..(అనుకుంటా)
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణా!
అంటూ పాట పాడుతుంది.
అది మెదడుకి బాగా యెక్కిపోయింది. గ్రీటింగ్ కార్డ్స్ పై కృష్ణుడు.. సినిమా వాల్ పోస్టర్లు లో
కృష్ణుళ్ళు పేపర్ లో కృష్ణుళ్ళు అన్నీ నావే! టీనేజ్ రాధాకృష్ణుల చిత్రాలు కూడా వుండేవి ఆ సేకరణలో. రేడియోలో వినే యుగళగీతాల ప్రభావం టీనేజ్ లో ఎలా వుంటుందో అనుభవించలేదని అబద్దం చెప్పను నేను. 🙂🥰
ఆ తర్వాత పదవ తరగతి పరీక్షలు అయ్యాక వేసవి సెలవల్లో ఏమీ తోచక శ్రీమద్భగవద్గీత చదివాను. (మా ఇంట్లో నాయనమ్మ నిత్యం చదువుకునేది. పూజాబల్లపై వ్యాసపీఠం పై భగవద్గీత వుండేది. రోజూ ఒక శ్లోకం చదువుకుని ఒక పువ్వు తులసిదళం అక్షింతలు వుంచి నమస్కారం చేసుకోవడం… నా కళ్ళ ముందు దృశ్యమై కదులుతుంది ఇప్పుడు కూడా.)భగవద్గీత నేను చదువుతుంటే కొంతమంది పెద్దలు వారించారు ఈ వయస్సులో చదవకూడదు అని. కానీ నేను వినను కదా! చదివేసాను. నాలో గాంభీర్యం వచ్చేసింది.
నల్లనయ్య అంటే అర్జునుడి స్నేహితుడు .. నాక్కూడా స్నేహితుడు,బోధకుడు అనే ఫీలింగ్ లోకి వచ్చేసాను. తర్వాత అక్కడ కొంత అక్కడ కొంత భారతం చదివాను. ఇక మన ఎన్టీఆర్ నటించిన భారతభాగవత చిత్రాల్లోని కృష్ణ పాత్రల ఆకర్షణ కూడా బలీయంగా వుంటుంది కదా!అలా కృష్ణుడు చెలికాడుగా స్థిరపడిపోయాడు. నాకు పద్దెనిమిదో సంవత్సరంలో పెళ్ళి అయింది. మా అత్తమ్మ కంతలో (ఇదొక బహుమతి సంప్రదాయం) వెండి రంగులో వుండే వేణుమాధవుడి ప్రతిమ పెట్టారు. అందరూ అది వెండిది అనుకుంటారు..కానీ అది జర్మన్ సిల్వర్ దే! మనకు మెటీరియల్ తో పని లేదు విలువతో పని లేదు. నాకు చాలా ఇష్టమైపోయింది. ఆ తర్వాత.. ఈ నలభై సంవత్సరాల్లో నాకు ఎన్ని కృష్ణుడి బొమ్మలు బహుమతిగా వచ్చాయో చెప్పలేను లెక్కలేదు, కాఫీ,కాకరకాయ కూర, మాధవుడు నాకు ఇష్టమని.. నా దగ్గర వారందరికీ తెలుసు.
ఆ ఇష్టం పెరిగి పెరిగి పెద్దదై మర్రి ఊడల్లా విస్తరించింది. పదిహేనేళ్ళ క్రిందట నా బ్లాగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు.. ఆ పేరు తో ప్రయత్నిస్తే లభ్యత లేదు. అందుకే.. నా పేరు పక్కన వనమాలి ని చేర్చి “వనజవనమాలి” అయింది బ్లాగ్ నామధేయం. నాకు కృష్ణ (యాజ్ఞసేని) కృష్ణుడి స్నేహం అపురూపంగా తోస్తుంది. ఇంతకు ముందు వనమాలి పై కవిత్వం రాసుకున్నాను. అదంతా నా కోసమే!
ఇప్పుడు కూడా ఈ “మేల్కొలుపు” కవిత్వం కూడా కేవలం నా కోసమే. ప్లూట్ బేస్ సంగీతం నాకెందుకు ఇష్టమో మీకు ఇప్పటికి అర్దమై వుంటుంది కదా! హరిప్రసాద్ చౌరాసియా, రాజేష్ చేర్తాల, రాకేష్ చౌరాసియా, రమేష్ నాయుడు, MM కీరవాణి సంగీతంలో అలరించేది వీనులవిందు జేసేది.. సమ్మోహిత వేణు గానమే కదా!
ముళ్ళపూడి గారి కథ “కానుక” అమితమైన ఇష్టం, నేను రాసుకున్న “రస స్పర్శ” మరీ ఇష్టం. నాకొచ్చిన కలను..యధాతధంగా ఏకబిగిన రాసిన కథ అది. అబ్బాయి ఇంట్లో అట్లాంటా లో వున్నానప్పుడు.
ఇదండీ… నా కృష్ణ ప్రేమ, మాధవ ప్రేమ, వనమాలి ప్రేమ. నాలో ఏదైనా చైతన్యం వుందంటే…అది..ఆ చైతన్య స్వరూపం మేల్కొలిపేదే అయి వుంటుంది. ఇది భ్రమ భ్రాంతి ఊహ.. ఏమీ కావు. చిత్ ఆనందం. నమో భగవతే వాసుదేవాయ 🙏కృష్ణ ప్రేమలో నేను అన్నీ అనుభవించేసాను. నాకేం కోరికలు లేవు. నా హృదయమంతా కృష్ణ ప్రేమే! ప్రేమే వెలుగు, ప్రేమే చైతన్యం. నేనుండే తావే.. బృందావనం. ❤️❤️❤️
ఈ మధ్య కిట్టయ్య కలలో కనబడకుండా శీతకన్ను వేసాడు. అందుకే ఈ పాటలు కవితలు.
వనమాలీ… వనమాలీ.. ఈ అక్షరాల్లో కూడా నీ సుందర చైతన్య స్వరూపమే 🙏💐❤️🎈
ది తెలంగాణ ఫెడరల్ డాట్ కామ్ లో ఈ రోజు నా కవిత “మేల్కొలుపు” ప్రచురింపబడింది.
ఈ లింక్ లో చదవండీ.. మేల్కొలుపు


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి