నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో..
- వనజ తాతినేని
ఇదిగో.. ఒకసారి వచ్చి వెళ్ళు.
నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో..
ఎంత నిశ్శబ్దంగా అంటే ..
రాత్రి కలలో కి వచ్చినంత నిశ్శబ్దంగా..
ఉదయాన్నే నేను నిద్రలేచి చూసేసరికి
తోటంతా కడిగిన ముత్యంలా వుండాలి
చెట్లన్నీ సంతోషంగా సంగీతం వినిపించాలి
హేమంతం లో మంచు మాత్రమే కురవాలా?.
అప్పుడప్పుడూ వాన కూడా కురిస్తే అదేం నేరం కాదులే?
పాపం ! తరువులు వణికిపోతున్నాయి
చలికోటు వేయటానికి టోపీ పెట్టడానికి
అమ్మ లేనే లేదు.
కోప్పడి నిప్పు గూడు ముందు కూర్చోబెట్టడానికి ఇల్లు లేదు,
గడ్డ కట్టే మంచులో గడగడలాడుతున్న తోటకు
గోరువెచ్చని తల స్నానం చేయించిపో..
ఇంద్రధనుస్సు చూడాలని నాకేం ఆశ లేదులే,
నిశ్శబ్దంగా వచ్చి వెళ్ళిపో..
వేకువజామున స్వరసమ్మేళనం వినాలని
నాకేం కోరికేం లేదులే..
ఇప్పడే వచ్చి వెళ్ళిపో..
కల్లాల్లో ధాన్యపు కుప్పలు తడుస్తాయని
భయం కూడా లేదులే..
త్వరగా వచ్చివెళ్ళిపో.. సిగ్గు పడకు.
రుతువులు గతి తప్పి చాలా కాలమైందిలే.
సడి చేయకుండా వచ్చి వెళ్ళిపో!
©️Vanaja Tatineni
10/12/2025. 09:25 pm.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి