30, మార్చి 2020, సోమవారం

పువ్వై పుట్టి (రాగమాలిక )

ఈ పాటంటే..చాలా యిష్టం . అందుకే .. ఈ శీర్షికతో ఒక కథ కూడా వ్రాసాను. ఆ కథలో ..ముఖ్యపాత్రకు పూవులంటే ఇష్టం. తాను మరణించాక తనకెంతో ఇష్టమైన పూల వృక్షం క్రింద తన గుర్తులను వుంచాలని కోరుకుంది.
ఇక ఈ పాట విషయంలోకి వస్తే ... తెలుగు రీమేక్ చిత్రానికి వేటూరి గారు పాటలకు సాహిత్యం అందించారు. సంగీత నేపధ్యంలో నడిచిన ప్రేమ కథ "రాగమాలిక " చిత్రంలో పాట యిది. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా.

పాట సాహిత్యం : 

పువ్వై పుట్టి  పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వై పుట్టి  పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వుగా ప్రాణాలుపోనీ తావి గా నన్నుండి పోనీ
పువ్వై పుట్టి పూజే చేసిపోనీ.. రాలి పోనీ

నీవే నాకు రాగం సాగనీవే హృదయ తాళం
గీతం నీకు హారం దేవీపాదం  నాకు తీరం
దేవీపూజ వేళకాగ నేనే పూలహారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ చైత్రమాసం
రేగే అగ్ని గుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం
నాదే సూర్య నేత్రం ఇంక  నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం  తీరకుందీ తీపి మోహం
 వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడిపాడే నాట్య వేదం
నీకే అంకితం
పువ్వై పుట్టి  పూజే చేసి పోనీ రాలి పోనీ
పువ్వుగా ప్రాణాలుపోనీ తావి గా నన్నుండి పోనీ

copy rights వుండి video upload చేయడం అభ్యంతరమైతే తెలియజేయగలరు. తొలగించగలను. తెలుగు వెర్షన్ లో ఈ పాట లభ్యం కాకపోవడం వలన ఇక్కడ జత పరిచాను.



27, మార్చి 2020, శుక్రవారం

ఉజ్వల రచనా శిల్పం "దీపశిఖ "

సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం.. 

రచయితలకు క్రాంతి దర్శనం ఊహలలో దొరుకుతుంది. అర్దం చేసుకోగల పాఠకులకూ దొరుకుతుంది. కానీ రచనలలో రచయిత వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళలేడు. అది అర్దం చేసుకుని సమకాలీనతను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలవారు మాములు రచయితలు గానూ.. విపరీతధోరణులను సాహిత్యంలో ప్రవేశపెట్టినవారిని సంచలన రచయితలగానూ  గుర్తించడం లెక్కించడం సర్వసాధారణమైపోయిన రోజులివి.

రచయిత వెళ్ళినంత దూరం పాఠకుడు వెళ్ళగల్గినపుడు.. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది. సమాజానికి వ్యక్తికి దూరం పెరుగుతుంది. సమాజంలో ఇమడలేని మనిషి బాహ్య అంతర్యుద్దాలతో అలసిపోతాడు.అలసిపోతూ కూడా తాము కోరుకున్నదానిని సాధించుకుంటారు. అయితే రచయిత సమాజంలో ప్రస్తుత విలువలుకు అనుగుణంగా నడుచుకుంటూనే ఎవరిని నొప్పించకుండా తాను చెప్పే విషయాన్ని వొప్పిస్తూ ..అది సామాన్యమైన విషయమే అని పాఠకుల చేత ఒప్పింపజేస్తూ కథ వ్రాయడం కత్తి మీద సాములాంటిదే. అలాంటి కథను నేను చదివాను. ఆ కథ పేరు దీపశిఖ . కథా రచయిత శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి. ఈ కథ ఇతివృత్తం మనకు అక్కడక్కడా తారసపడేదే. అయితే జనబాహుళ్యంలో కుహనావిలువలతో బ్రతికే సమాజంలో ... నీతి తప్పి (??) ఒకడుగు ముందుకు వేసి బిడ్డను కనీ తాను అనుకున్నట్లు ఆ బిడ్డను పెంచిన విషయమే ఈ కథ. ఇష్టమైనదాన్ని కావాలనుకున్నప్పుడు హింస లేకుండా దానిని సాధించడం సాధ్యమా అని ప్రశ్నిస్తుంది కూడా ...  

స్త్రీలు పిల్లలను కనడానికి ఎంత ఇష్టపడతారో తనకు ఇష్టమైన పురుషుడి ద్వారా అక్రమ సంబంధం యేర్పరచుకుని పిల్లలను కనడానికి అంతగా ఆలోచిస్తారు జంకుతారు. పిల్లలను కనడానికి పురుషుడితో కూడిక ఇష్టమైనది కాకపోయినా పిల్లలకోసం అయిష్టంగానే కళ్ళుమూసుకుని .. వంశం నిలబెట్టడం కోసం హింసను అనుభవిస్తారు కొందరు.ఒక వివాహిత స్త్తీ తనకు కల్గిన ఇద్దరు పిల్లల తర్వాత తనకి ఇష్టమైన ప్రియుడుతో కూడి ఇష్టంగా బిడ్డను కనీ మిగతా బిడ్డలకన్నా అమితంగా ప్రేమించి అపురూపంగా పెంచుతుంది. ఆ విషయాన్ని కూతురికి ఆ తల్లి ఎలా తెలియజేస్తుంది ..కూతురు ఆ విషయాన్ని ఎలా స్వీకరిస్తుంది .. వివాహం కాకుండానే తల్లి కాబోతున్న తన రూమ్మేట్ కి ఏమి భోదిస్తున్నది అన్నదే .. ఈ "దీపశిఖ" కథ.  రచయిత చెప్పిన తీరు వలన ఈ కథకు ఒక గొప్పదనము ఆపాదించబడింది. అంతే కాక కుటుంబాలలో వ్యక్తుల ఇష్టాన్నో లేదా వేరొకరకమైన సంబంధాన్నో చూసి చూడనట్లు వదిలేస్తూ పరోక్షముగా సహకరించడం అన్నది అత్యంత సాధారణ విషయంగా ఉంటుందనేది సూక్ష్మప్రాయంగా చెప్పబడింది. ఈ రచయిత కాకుండా వేరొక రచయిత ఈ కథను వ్రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకుంటే ... చాలా విమర్శలు వస్తాయనే అభిప్రాయం కూడా  యేర్పడింది. 

ఈ కథ చదివేముందు ...మీకు  నేను ఎరిగిన కొన్ని విషయాలను చెప్పదలచాను. ఆ విషయాలకు కథకు ఏమిటి సంబంధం అని అడగకండి. సంబంధం ఉందని నేను అనుకున్నాను కాబట్టీ .. ఆ విషయాలను ప్రస్తావించడం జరిగింది. 

 నా చిన్నప్పుడు జరిగిన కొందరి విషయాలు నాకు బాగా జ్ఞాపకం. ఆ విషయాల గురించి తప్పొప్పుల బేరీజు వేయడం నాకప్పుడే చూఛాయగా తెలుసు. నాకే కాదు నాతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అదే వయస్సు పిల్లలకు కూడా.. తెలుస్తుంది. అది పెద్దలు మనకు ఉగ్గుపాలతో నేర్పిన సంస్కారం లేదా విలువలు కావచ్చు. మా ఇంటి వెనుక వాళ్ళకు ఒక అమ్మాయి వుండేది. కుడిఎడమగా మా అమ్మ వయస్సు ఆమెది. మా అమ్మ వివాహం చేసుకుని కోడలిగా అడుగుపెట్టిన ఏణర్దానికి ఆమెకు వివాహం అయిందట. మా ఊరికి కొద్ది దూరంలోనే ఆమె భర్త ఊరు. కానీ ఆమె ఎపుడూ అత్తగారింట్లో వుండేది కాదు. ఆమె నాణ్యమైన నల్లని నలుపుతో తీర్చిదిద్దిన శిల్పంలా బారు జడతో అందంగా వుండేది.  ఆమె భర్త ఆమెకు  భిన్నంగా కొద్దిగా పొట్టిగా ఎత్తుపళ్ళుతో  ఏమంత అందంగా కనిపించేవాడు కాదు. నాకు ఉహ తెలుస్తూ వుండేటప్పటికి ఆమెకు నా వయస్సున్న కొడుకు వున్నాడు. ఆ పిల్లాడు మాతో ఆడుతూ పాడుతూ వుండేవాడు. ఆమె భర్త పది పదిహేనురోజులకు ఒకసారి వచ్చి ఆమెను కొడుకును తీసుకువెళతానని బలవంత పెట్టినపుడల్లా.. ఆమె తల్లి అల్లుడిని పట్టరాని కూతలు తిడుతూ.. నీ ఇంట్లో కూటికి గతిలేదు నీళ్ళ మజ్జిగ చుక్కకు గతిలేదు నా కూతురిని పంపను. కావాలంటే నా ఇంట్లోనే పాలేరుగా పడివుండు అని తిట్టిపేసేది. 

ఇక ఆ కూతురేమో సినిమాలో వాణిశ్రీ లాగే పైట వేసుకుని బిగుతు జాకెట్ ధరించి నిత్యం సన్నజాజులు ధరించి.. వయసున్న మగవాళ్లతో పరాచికాలు ఆడుతూ వుండేది. నేను చెంబు తీసుకుని పాటి మీదకు వెళ్ళినపుడో తోటి పిల్లలతో కలిసి ఆడుతున్నప్పుడో నాకు బాబాయి వరుసయ్యే ఆయనతో కలిసి గడ్డి వాముల దగ్గర కనబడేది. అప్పటికి ఆ కనబడటం అనేది పూర్తిగా అర్దం కాకపోయినా అది నాకు తప్పుగా అనిపించేది. అపుడపుడు పెద్దవాళ్ళ మాటల్లో.. ఆ తులసమ్మ కూతురిని మొగుడితో కాపరానికి పంపివ్వదు. దానిపై మన ఇంటి మొగాడికి కన్ను పడకుండా కాపలాకాసుకోలేక చచ్చే చావొచ్చింది అని తిట్టుకోవడం వినబడి మొత్తానికి ఆమె చేస్తున్నది తప్పని బాగా అర్దమైంది. కొన్నాళ్ళకు ఆమె మళ్ళ్ళీ గర్బవతి అయి.. పండంటి బిడ్డను కన్నది. ఆ బిడ్డను చూసి మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కొనే వాళ్ళు. తర్వాత బిడ్డలను వెంటబెట్టుకుని భర్త వెంట కాపురానికి వెళ్ళిపోతే పీడా విరగడైంది అని మెటికలు విరుస్తూ తిట్టి పోసిన ఆడవాళ్ళను చూసాను.

నా బాల్యం కనుమరుగై యుక్తవయస్కురాలినై పెళ్ళి అయి నాకెక బిడ్డ పుట్టాక  హఠాత్తుగా మా ఇంటి వెనుక వున్న తులసమ్మ కూతురిని ఆమె చిన్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె చిన్న కొడుకు నాకు బాబాయి వరసయ్యేతను ఎలా వుంటాడో అచ్చుగుద్దినట్టు అలాగే వున్నాడు. నాలో ఎన్నో ఆలోచనలు. అంత స్పష్టంగా మరొకరి రూపంలో తన ఇంట్లో తన బిడ్డగా చెలామణీ అవుతున్న ఆ బిడ్డను.. ఆమె భర్త ఎలా భరించగల్గాడు? లేదా అతనికసలు  భార్య యొక్క ఆ అక్రమ సంబంధం గురించి తెలియదా.. ? తెలియకపోవడానికి ఆస్కారమే లేదు అంత చిన్న చిన్న పక్క పక్కనే పల్లెటూర్లలో చాలా విషయాలు దాయాలని చూస్తే దాగేవి కూడా కాదు. కానీ.. ఆ తండ్రి బిడ్డను ప్రేమించి పెంచి పెద్ద చేసి తన ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకుకు కొంచెం కూడా ఇవ్వకుండా రెండవ కొడుకుకే వ్రాసి చనిపోయాడు. ఇక ఆమె భర్తతో కలిసి చేసిన కాపురంలో ఎన్ని అనుమానాలు అవమానాలు భరించిందో కానీ.. చిన్న కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. అతనిని ప్రత్యేక ఇష్టంతో చూసేది. 

ఇక మా బాబాయి వరుసయ్యే ఆయనతో ఆకర్షణలో పడిపోయి భర్త దగ్గరకు కాపురానికి వెళ్ళకుండా హిస్టీరియా వచ్చినట్లు ప్రవర్తించే మా బంధువుల అమ్మాయి గుర్తుకొస్తూ వుంటుంది.,ఆమెను భార్య చనిపోయున పెద్ద వయస్సు ఆస్తిపాస్తులున్న పిల్లల తండ్రికిచ్చి వివాహం చేసారు. ఆమె ఆ భర్తతో సరిపెట్టుకోలేక ఎదురుగా ఆకర్షణీయంగా  ఉంగరాల జుట్టతో దబ్బపండులా మెరిసిపోయే నవ యువకుడితో సంబంధం పెట్టుకుని  భర్త దగ్గరకు వెళ్ళమంటే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేది. 

ఇవి వివాహం ముసుగులో కనబడే వ్యక్తి ఆకర్షణ లేదా ప్రేమ లేదా మరొకటో.. పెద్దలు పిల్లల మనసులను అర్దం చేసుకుని వివాహం జరిపించనపుడు వారు తమ అంతరంగాల్లో మరొకరిని జపిస్తూ వారి కోసం తపిస్తూ.. కోరికలతో జ్వలిస్తూ తమను తాము మోసం చేసుకుంటూ జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తూ.. వుంటారు. అటువంటి భార్యలను భరించే భర్తలూ వుంటారు. తనకు పుట్టిన బిడ్డ కాదని తెలిసినా ఆ బిడ్డలను ప్రేమించే భర్తలు భార్యను క్షమించే భర్తలు వుంటారని తర్వాత తర్వాత అర్దం చేసుకున్నాను. స్త్రీలు కూడా తనకు యిష్టమైన పురుషుడితో కూడి.. అతని బిడ్డను అపురూపంగా నవమాసాలూ మోసి కనీ యిష్టంగా పెంచే వాళ్ళు వుంటారు. ఇందులో తప్పొప్పులను మనం బేరీజు వేసుకున్నట్లు వుండకపోవచ్చు. మన ఆలోచనలకు అందని ఇంకొక కోణం వుండవచ్చు. స్త్రీ పర పురుషుడితో కూడిన ప్రతి సమాగమూ.. అనైతికం కాకపోవచ్చేనేది.. కొంచెం సానుభూతితో చూడాల్సిన విషయంగా .. అర్దం చేసుకోవాలని ఈ కథ చదివాక నాకు అర్దమైంది. అలా అని అక్రమసంబంధాలను ప్రోత్సహిస్తున్నామని అనుకోకూడదు. మనకు తారసపడిన విషయాలను ఎలా అర్ధం చేసుకోవాలో మాత్రం తెలుస్తుందని చెప్పడమే నా ఉద్దేశ్యం. 

ఈ కథ చదివాక నేను ఎరిగిన ఆ ఇద్దరు స్త్రీలు నాకు మరింత అర్దమయ్యారు. వారిద్దరినీ నేను ఇపుడు అసహ్యించుకోవడం మానేసి.. మాములు స్త్రీలగా  చూడగల్లుతున్నాను. సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం..  మానసిక పరివర్తన కల్గించడం  కొత్త ఆలోచనలను రేకెత్తించడం అంటే ఇదేనని నాకు అర్దమైంది. వీరలక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు .. ఇంతమంచి కథను వ్రాసినందుకు అభినందనలు. 

"దీపశిఖ  " కథ లింక్ లో ఇక్కడ చదవవచ్చు 

"కొండఫలం" కథల సంపుటిలో  కూడా  చదవవచ్చు .. 


26, మార్చి 2020, గురువారం

First Love Letter To My Dear Grand Child..

💕First Love Letter to My dear Grand child💕

ఇదిగో... ఇపుడే కాఫీ కలుపుకుని వచ్చి తూర్పు గవాక్షం తెరిచానా... నారింజ రంగు సూర్యుడు ఎంత అందంగా వున్నాడో.. అనుకుంటూ కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి మొబైల్ చేతిలోకి తీసుకుని రెండు క్లిక్ లు మనిపించి ఆ అందాల సూరీడ్ని ఫేస్ బుక్ గోడ మీద అందరికీ చూపించాలనే సౌందర్య ఆరాధన, ఆరాటం తీర్చుకుని .. కె జె ఏసుదాస్ మధురంగా ఆలపించిన శివ తాండవం (లాస్య) ని వింటూ చుక్క చుక్క కాఫీ ఆస్వాదిస్తున్న తరుణంలో... మీ నాన్న నుండి నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ లిప్ట్ చేసి .. ఏం చేస్తున్నారు బంగారం, డిన్నర్ అయిందా... అని నా ప్రశ్న.

అమ్మా.. బేబి పుట్టిందమ్మా.. అని ఉద్వేగమైన మాటలు. అపుడేనా.. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమేనా... అని అడిగాను కంగారుగా. ఎవ్విరిథింగ్ ఈజ్ ఫైన్.. అమ్మా. నీ కోడలికి c section జరిగింది. అని చెప్పాడు.. నాకు ఒకేపరి గంగయమునలు కళ్ళలో ఊరుతున్నాయి. వాటిని అణుచుకుంటూ.. అభినందించాను. ఉద్విగ్నతను అణుచుకుంటూ.. ఆశీర్వదించాను. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను.

బంగారూ... నువ్వు వచ్చే శుభవార్త ఎలా వచ్చిందో తెలుసా! .. మార్గశిర మాసపు గురువారం మునిమాపు వేళ రోజులాగా కాకుండా మరింత ప్రత్యేకంగా కామాక్షి దీపాలతో పాటు మరికొన్ని నూనె దీపాలు వెలిగించి .. ఆ దీపకాంతులు ఇల్లంతా చైతన్యశక్తిని నింపుతున్న వేళలో నేను శ్రీసూక్తం వింటున్న సమయంలో అదొక శుభ ఆశీర్వచనమై శుభతరుణమై .. మీ అమ్మ కాల్ చేసి.. "అత్తయ్యా... అమ్మాయి పుడుతుందంట" అని చెప్పినపుడు సంభ్రమం చెందానని చెప్పను కానీ క్షణకాలం తర్వాత సర్దుకుని.. నిండు హృదయంతో నీ రాకను ఆనందం చేసుకున్న క్షణాలు అవి. నిజం చెప్పొద్దూ.. నాక్కూడా వారసత్వ వ్యామోహం వుండింది. ఆ వ్యామోహాన్ని పటాపంచలు చేసి.. శుభసమయంలో మా ఇంట్లో మహాలక్ష్మి పుడుతుందనే వార్తను విన్నాను అని వెంటనే అయిన వాళ్ళందరికీ ఆ శుభవార్తను పంచుకున్నాను.

మీ నాన్న పుట్టినపుడు ఆడపిల్ల పుట్టలేదని ఏడ్చిన నేను.. నువ్వు పట్టే సమయానికి కాలానికి ఆడపిల్ల కాకపోతే బావుండుననుకునే కాలానికి నెట్టబడ్డానని అనుకుంటాను.. బంగారూ.. నా ఆలోచనలో తప్పు వుందని నేను అనుకోను కానీ.. నీ రాకను నీ లాంటి ఆడబిడ్డల రాకను మనఃస్పూర్తిగా ఆహ్వానిస్తాను తల్లీ..!

మా ఇంటి మహలక్ష్మివి నీవు. నువ్వు పుట్టావన్న వార్తను తొలుతగా నాతో పంచుకున్న నాకే వినిపించిన మీ నాన్నకు తెలుసు.. మీ నానమ్మ నీ కోసం ఎన్ని కలలు కంటుందో.. నువ్వు మీ నాన్న లాగే వుంటావని నేను అనుకుంటే.. అమ్మా.. బేబీ నీలాగానే వుందమ్మా, వ్రేళ్ళు కూడా నీకు లాగానే వున్నాయమ్మా అని మురిసిపోతున్నాడు. నిన్ను ముందు మీ అమ్మ చూసిన తర్వాతే మాకెవరికైనా చూపమని నేను హెచ్చరిక చేసాను. మీ అమ్మ నాన్న నా రెండు కళ్ళు అయితే.. వారి కలల పంటవి.. నువ్వు నాకు పంచప్రాణాలు బంగారూ.. మీ అమ్మనాన్న ఏ పేరైనా పెట్టుకోనీ.. నేను నీకు పెట్టుకున్న పేరు “చిత్కళ”. శ్రీ శార్వరి నామ సంవత్సర చైత్ర శుద్ద విదియ బుధవారం 07:13 pm కి రేవతి నక్షత్రం నాల్గవ పాదం మీనరాశిలో జన్మించిన నీకు.. శుభాశీస్సులు బంగారూ.. ఆ శ్రీగిరి పర్వతం నుండి జగత్ మాతాపితురుల కరుణ కటాక్షాలు నీపై సర్వకాలాలు ప్రసరిస్తూనే వుంటాయని నా ప్రగాఢ విశ్వాసం.

నేను చూసుకున్నట్టే నా కొడుకుని భద్రంగా ప్రేమగా చూసుకోవటానికి నువ్వు వచ్చావు తల్లీ..
అమ్మా.. నన్ను వదలవే తల్లీ.. ఎక్కడో దూరంగా వున్నావనుకున్నా.. ఇదిగో ఇక్కడ కూడా నా కూతురి రూపంలో వుండి అనేక జాగ్రత్తలు చెప్పి సాధిస్తున్నావే .. అని మురిపెంగా.. మీ నాన్న చెప్పే మాటలను మధురంగా.. ఊహించుకుంటున్నా.

ఈ కరోన కాలం కాకపోతే నిను భద్రంగా మృదువుగా అపురూపంగా ఒడిలోకి తీసుకుని లాలించాల్సిన నానమ్మను. ఉయ్యాలలో పడుకుని కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏదో రహస్య భాషలో ఎదురుగా వున్న మీ నాన్నతో సంభాషిస్తున్న నిన్ను మొబైల్ కెమెరాలో చూస్తూ ఆ చూపునుండి హృదయం దాకా ప్రవహింపచేసుకుని గుండెతో గుండెను కలిపి భద్రంగా ముడి వేసుకున్నా బంగారూ..

మీ నాన్న కన్నా ప్రియమైనదానవు.. నిను ఒడిలోకి తీసుకుని ఆ పౌత్రి ప్రేమను నిండుగా ఆస్వాదిస్తుంటే.. నువ్వు నా చిటికెన వేలును నీ చిన్ని గుప్పిటలో బిగించి పట్టుకుంటుంటే.. నేను రాసుకున్న “అమ్మ మనసులో మాట “
లేదా “సాయం చేయడానికి చేతులు కావాలి’’ అన్న కవితలు మదిలో మెదులుతుంటాయేమో మరి.

బంగారూ... ముందు ముందు నా ఊహలు నా ఆశలు నా ఆకాంక్షలు అన్నీ వినే శ్రోతవి నువ్వే. అందుకే.. ఈ అక్షరాలలో నా మనసు మాటలను భద్రం చేస్తున్నా.. తర్వాతెపుడో చదువుకుంటావు కదా..

💕 ✍️ప్రేమతో .. నానమ్మ.🎈🎈💕






ఈ నాటి సూర్యోదయం చిత్రాలు.. 

25, మార్చి 2020, బుధవారం

నా బ్లాగ్ మరియు కథలపై పత్ర సమర్పణ



కొద్దిగా ఆలస్యంగా పంచుకుంటున్న విశేషం. 
47 రోజులకు ... నా గోడపైకి మళ్ళీ తిరిగి వచ్చాను. .నా రాకకు కారణం ... కొంచెం సంతోషంగా అనిపించడమే ...
నా చుట్టూ వున్న స్త్రీల జీవితాలని, వారిపై వున్న అణచివేతని చూస్తూ వున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకుంటాను. అప్పుడు నేనూ తోటి స్త్రీల పక్షాన నిలిచి కవిత్వపు జెండానవ్వాలనిపిస్తుంది. నేను విన్నవి, కన్నవి యిన్ని బాహ్య ప్రపంచపు బాధలు నాకు నిద్ర లేకుండా చేసి కలవరపెడతాయి ... అపుడవి కథలుగా రూపం సంతరించుకుంటాయి. వాటిని నా చుట్టూ ఉన్న ప్రపంచం గుర్తించి స్పందన తెలిపినప్పుడు ... నాతో పాటు మరికొందరు సమస్యలను బాధలను గుర్తిస్తున్నారని తెలిసి కొంత తెరిపినపడతాను.
ఇంతకీ విషయం యేమిటంటే ...నా ఫోన్ నెంబర్ కోసం google search చేస్తున్నట్లు నేను గమనించాను. వివరాలు చూద్దామని వెళితే ... ఇటీవలే ప్రచురితమైన ఒక సమీక్ష చదివి ... సంభ్రమాశ్చర్యాలకు లోనై ... వివరంగా చదువుకుంటూ వెళ్ళాను. నేను pen down చేసినప్పుడల్లా ... నన్ను మళ్ళీ నిలబెట్టేవి .ఇలాంటి ఉత్తేజాలే !
Pratyusha Velaga... deportment of English Sri Padmavati Viswavidyalayam ... నేను వ్రాసిన కథలపై సమీక్ష చేయడం (థియరి లో పేపర్ సమర్పించడం )..ఆనందం కల్గించింది ... Thank you so Much ప్రత్యూష .. http://www.jctjournal.com/gallery/107-feb2020.pdf
jctjournal.com gallery లో నేను కనుగొన్న ... ఈ వ్యాసాన్ని మీరు కూడా ఇక్కడ చూడవచ్చు . ప్రత్యూష కి ధన్యవాదాలు.

 వీలు చూసుకుని తనతో ఒకసారి మాట్లాడాలి . నా బ్లాగ్ ని కథలను ఆ అమ్మాయి క్షుణంగా చదివింది . రెండు రోజులు తర్వాత తెలిసింది ..తను పద్మావతి వడ్లమూడి గారి అమ్మాయని. మరింత సంతోషంగా ఫీల్ అయ్యాను.  పద్మ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్పారు. 

https://drive.google.com/…/191TgMwpNAvjdOHEhBAwTX4B6w…/view… లింక్ ఇక్కడ ప్రక్కనే తెరవవచ్చు  > నా బ్లాగ్ మరియు కథలపై ఆంగ్లంలో పత్ర సమర్పణ

కచ్చప సీత


నేను ఊర్మిళ నిద్ర గురించి చదివిన కథలలో మూడవది .. ఇటీవలే చదివాను .  " కచ్చప సీత " తల్లావజ్జల పతంజలి శాస్త్రి . ఆ కథ మార్చి 2020 చినుకు మాస పత్రికలో ప్రచురింపబడింది .
..ఆ కథపై ... నా చిరు వ్యాఖ్యానం .. ఇంకా ఎక్కువచెప్పి రచయితను పలుచన చేయదల్చుకోలేదు .

బాహ్యప్రపంచం నుండి తనను తాను వేరు చేసుకేవడం అంటే లోపలికి ముడుచుకోవడం. ఆ ముడుచుకోవడం కూడా తనను తాను శోధించుకోవడం కోసం. ఆత్మశోధన తనను తాను దృఢంగా నిలబెట్టుకోడానికి నిశ్చలంగా నిర్వీకారంగా మనగల్గడానికి దోహదం చేస్తాయి. మానవ సంబంధాలు అనుబంధాలన్నీ కర్తవ్యాలు కాదు బాధ్యతలు. బాధ్యతలు మోసే వ్యక్తులు  ఎల్లప్పుడూ నొప్పిని కూడా భరిస్తూ వుండాలి.  నొప్పిని  భరించలేక ఊర్మిళ తనను తాను శోధించుకుంటూ బాహ్యప్రపంచపు ఉనికిని మర్చి నిద్ర అనే యోగ స్థితిలోకి వెళ్లిపోయింది. అది మరలా లక్ష్మణుడో లేదా ... సీత వచ్చి కలిసేవరకూ ...
ఆ కథను  పైన ఇచ్చిన లింక్ లో చదవవచ్చు  ...







కథను చదవడానికి  వీలుగా .. డౌన్లోడ్  చేసుకుని చదవండి ప్లీజ్ . 

21, మార్చి 2020, శనివారం

రెండు తీరాల నడుమ నావ

విదేశాలలో పిల్లలుంటే తల్లిదండ్రులకు చాలా అవస్థలు.

వారి మానసిక స్థితిని లంగరు వేయడం కుదరని రెండు తీరాల నడుమ అలల్లాడే నావతో పోల్చుకోవచ్చు.

అనారోగ్యాలు ఒత్తిడితో కూడిన ప్రయాణాల కన్నా కష్టమైనది వేరొకటి వుంది.

అది... అనుబంధాల గొలుసు ముడిపడుతూ తెగనరుకుతూ.. బాధ్యతల నడుమ నలిగే రణరంగంలో మరి మరి క్షతగాత్రమయ్యే హృదయపు అలజడి.

ఈ సడిని అర్ధం చేసుకోదగిన పిల్లలెందరు? కథగా వ్రాయదగిన అంశం ఇది. ఓపిక లేదు వ్రాయడానికి. 😞

విదేశాలకు వెళ్లొచ్చిన తల్లిదండ్రులకందరికీ తెలుసు ..ఆ Pain..ముఖ్యంగా ... బిడ్డలను వారి బిడ్డలను కూడా వొదిలి జీవశ్చవాలుగా బ్రతకడానికి తిరిగి వస్తున్నప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం .

ఇప్పుడు "కొరోన" మహమ్మారి. పిల్లలు అక్కడ తల్లిదండ్రులు మరొక చోట. ఇదొక నరకయాతన.



20, మార్చి 2020, శుక్రవారం

ఊర్మిళ నిద్ర


నేను చదివిన ఊర్మిళ నిద్ర గురించిన కథలలో ఈ కథ రెండవది. మొదటి కథ ... ఓల్గా గారి రచన. రెండవది ఈ కథ. ఎవరికి వారు వైవిధ్యంగా వ్రాసిన కథలు ఇవి. ఎవరి దృకోణంలో నుండి వారు వ్రాసిన కథలు . ఇప్పుడు పరిచయం చేస్తున్న కథకి మూలం తమిళం. తమిళంలో వచ్చిన కథను తెలుగులో అనువాదం చేసిన వారు గౌరి కృపానందన్. అనువాద కథ అని తెలియనంత అద్భుతంగా అచ్చు తెనుగు కథ అనుకునే విధంగా వ్రాయడంలో అనువాద రచయిత సఫలీకృతం కాగల్గారు. (అంటే చదుతున్న మనకు తమిళంలో ఆ కథ చదవకపోయినప్పటికినీ తమిళం మనకు తెలియక పోయినప్పటికినీ కూడా అనుకుంటూ ) నేను ఇంకో కథ ఇటీవల చదివినప్పుడు అప్రయత్నంగా ఈ కథ గుర్తుకొచ్చింది. చదువుదామని చూసే ఈ కథ వెంటనే లభ్యం కాలేదు. వెతికి పట్టుకుని ఇలా భద్రపరుస్తున్నాను. పాఠకుల కోసం ... సాహిత్యాన్ని భద్రపరచడం కూడా అవసరమే ..చదువరులకు సౌలభ్యంగా అందటం కూడా ముఖ్యమే కాబట్టి ఇలా చేయాలన్న తలంపు కల్గింది. 
గౌరి కృపానందన్ గారి అనుమతి కూడా తీసుకోలేదు. అభ్యంతరమైతే తొలగించగలను.  

ఊర్మిళ (క‌థ‌)
తమిళ మూలం : ఎస్‌.ఎమ్‌.ఎ రాం
అనువాదం : గౌరీ కృపానందన్
(ఈ కథ 2019 ఫిబ్రవరి 2 ప్రజాశక్తి స్నేక సంచికలో ప్రచురితమైనది )
ఊర్మిళ ఉద్యానవనంలో అలసటతో కూర్చుని ఉంది. ఎంత సేపని ఇలా జింకలను, నెమళ్ళను, కుందేళ్ళను, పావురాలనూ చూస్తూ కూర్చుని వుండటం? ఆమెకు చిరాకు, కోపం రెండూ వచ్చాయి. ఇంతకు ముందు ఇదే నందనవనం ఆమెకు ఉత్సాహం కలిగించే విధంగా ఉన్నమాట అయితే నిజమే. లక్ష్మణుడు ఆమెతో ఉండటం దానికి కారణమై ఉండవచ్చు. అప్పుడు కూడా అతడు ఆమెతో ఎక్కువసేపు గడిపినట్లుగా ఆమెకు అనిపించలేదు. రాముడి సేవలో గడిపిన సమయం పోగా మిగిలిన సమయంలో ఆమెకు కూడా కొద్దిపాటి సమయాన్ని కేటాయించినట్లుగా అనిపించేది. ఎవరో కావాలని అతడిని తన నుంచి విడదీసి ఉంచారని ఆమె అనుకోవడం లేదు. అయినా తన సోదరి సీత కూడా అతనికంటూ ఒక భార్య ఉందని గుర్తుచేసి మందలించలేదు? ఊర్మిళకు సీత మీద కోపం వచ్చింది.
లక్ష్మణుడు ఆమెతో గడిపే ఆ కొద్ది సమయంలో కూడా ఆ ఉద్యానవనం ఆమెకు ప్రియం కలిగించే విధంగానే ఉండింది. ఒకసారి లక్ష్మణుడిని బలవంతంగా రథం మీద సరయూ నదీ తీరానికి తీసుకు వెళ్ళింది ఊర్మిళ. దారిలో ఇరు వైపులా పచ్చదనంతో ఏపుగా పెరిగిన పంటపొలాలకు మధ్య, నీటిమడుగులో క్రౌంచపక్షులు రెండు సల్లాపిస్తూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని ఆమె ఒకింత సిగ్గుపడుతూ చూపించినప్పుడు, అతను భావరహితంగా, ''చాలా సేపయ్యింది ఊర్మిళా! రాజభవనంలో అన్నగారు వెతుకుతారు'' అన్న మాటలు, ఆమెకు ఇప్పుడు గుర్తుకు వచ్చి చిరాకు కలిగింది.
ఇక మీద అన్నగారు వెతకరు. ఎందుకంటే అన్నగారి నీడగా మారి నీడతో నీడగా కరిగి పోయావు కదా? ఇలా నడచుకోవడానికి నీకు ఎలా మనసు వచ్చింది? నీకు అనుభూతులు నశించి పోయాయి అంటే, రాముడు ఎందుకు నీకు బుద్ధి చెప్పలేదు? నా సోదరి సీతకు బుద్ధ్ది ఎక్కడికి వెళ్ళింది?
దూరంగా ఒక చంపావృక్షం పూలతో విరబూసి ఉంది. అది ఆమెను చూసి నవ్వుతున్నట్లు అనిపించింది. ఊర్మిళకు ఏడుపూ, కోపం ఒక్కసారిగా వచ్చాయి. జనక మహారాజుగారి అంతఃపురపు తోటలో చాలా చంపా వృక్షాలు ఉండేవి. సీత, ఆమె ఆ చెట్ల నీడల్లో పూబంతులతో ఆటాడే వాళ్ళు. కొన్నిసార్లు చెలికత్తెలు పరిహాసం చేసినప్పుడు, ఇద్దరూ గలగలా నవ్వేవాళ్ళు. అలా నవ్విన వెంటనే తిరిగి చూసినప్పుడు, ఆ చెట్లు కూడా విరబూసి, నవ్వుతున్నట్లు గోచరించేవి. అప్పుడు సీత! అనేది. ''ఊర్మిళా! నీకు తెలుసా? ఒక శ్లోకం ఉంది. స్త్రీలు నవ్వితే చంపా వృక్షం పువ్వులు పూస్తుందట. అది నిజమే కాబోలు.''
ఊర్మిళ ఇప్పుడు తన ముందు పూలతో విరాజిల్లుతున్న చంపా వృక్షాన్ని అసూయతో చూసింది. ''అది నిజం కాదు సీతా. ఈ చెట్టు స్త్రీలు ఏడిచినా పువ్వులు పూస్తుంది. దీనికి ఇసుమంత కూడా పద్ధతి అన్నది లేనే లేదు.''
ఆమెకు మిధిలా నగరపు రోజులు గుర్తుకు వచ్చాయి. ఒక వసంత కాలపు ప్రాతః సమయంలో ఆమె సీతతో అంతఃపురం గవాక్షం దగ్గర నిలబడి వేడుక చూస్తూ ఉన్నప్పుడు వయోధికుడైన ఒక మునీశ్వరుడితో, విల్లంబులు ధరించిన ఇద్దరు యువకులు మిరుమిట్లు గొలిపే సౌందర్యంతో నడుస్తూ వెళ్తున్నారు. ఊర్మిళయే వారిని సీతకు చూపించింది. కాస్త తక్కువ ఛాయలో ఒకడు, లేత ఎరుపు రంగులో ఇంకొకడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అందగాడు అని తమలో తాము సిగ్గూ, బిడియంతోనే చర్చించుకున్న విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంది.
సీతను పాణిగ్రహణం చెయ్యడానికి, శివధనుస్సును ఎక్కు పెట్టాలన్న కఠినమైన నిబంధన పెట్టినప్పుడు, ఊర్మిళ, ''ఒసేరు! ఈ జన్మలో నీకు పెళ్లి అవడం కష్టం సుమా'' అని తరచుగా సీతను పరిహాసం చేస్తూ ఉండేది. ఆ రోజు రాజసభలో, మొదటి రోజు చూసిన వాళ్ళల్లో కాస్త ఛాయ తక్కువైన ఆ యువకుడు శివధనుస్సును సునాయాసంగా ఎక్కుపెట్టి నారును బిగించడమే కాకుండా, రెండు ముక్కలుగా చేసినప్పుడు గవాక్షంలో సీత పక్కనే ఉన్న ఊర్మిళ. ''ఒసేరు! నీ మనిషి వీరుడు మాత్రమే కాదు.అధిక ప్రసంగిగా కూడా అనిపిస్తున్నాడు. లేకపోతే, విల్లును ఎక్కుపెడితే చాలు అంటే, ఇలా ఎవరికీ ఉపయోగం లేకుండా విరిచేస్తాడా?'' సీత చెవి దగ్గర తగ్గు స్వరంతో పరిహాసం చేయడం, సీత కష్టపడి నవ్వు ఆపుకోవడం ఇప్పుడు గుర్తు వచ్చింది.
అంతా కలలాగే అనిపిస్తోంది. సీతను రాముడు తనతోనే మర్చిపోకుండా అడవికి తీసుకువెళ్ళడం, లక్ష్మణుడు మాత్రం తనను లక్ష్యం చేయకుండా ఇక్కడే వదిలేసి వెళ్ళడం... ఇది ఎలాంటి న్యాయం?' సీతను పొందడానికి రాముడు పెద్ద విల్లును ఎక్కు పెట్టాల్సి వచ్చినట్లు, నన్ను పొందడానికి కనీసం ఒక చిన్న రాయినైనా నువ్వు బద్దలు కొట్టి ఉండాల్సింది. అప్పుడు నీకు నా యొక్క ప్రత్యేకత తెలిసి ఉండేది. కానీ నేను నీ ప్రయత్నం లేకుండానే, సీతతో పాటు కొసరుగా నీతో అయోధ్యకు వచ్చిన దాన్ని.'
ఆమె కోపం ఇప్పుడు తండ్రి జనకుల మీదికి మళ్ళింది. సీత మాత్రం మీకు ఎలా గొప్ప అయ్యింది? ఆమెకు మీరు ఒక నిబంధన ఉంచినట్లు నాకు మాత్రం ఎందుకు ఉంచలేదు?
కొద్దిసేపటి క్రితం చెలికత్తె సుమంత్రుడు తిరిగి వచ్చిన వివరాన్ని ఆమెకు తెలియజేసింది. వాళ్ళు ముగ్గురూ సరయూ నదీ తీరాన్ని దాటి, రాత్రికి రాత్రే అడవిలో ప్రవేశించిన వర్తమానాన్ని సుమంత్రుడు మోసుకు వచ్చాడు. తమసా నదీ తీరం దాకా వాళ్ళను వెంబడించిన అయోధ్యా ప్రజలు నిరాశతో ఊరుకు తిరిగి వచ్చేశారట.
ఎవరో సుకుమారమైన ఆమె భుజాలను నొక్కి పట్టారు. 'లక్ష్మణుడు మనసు మార్చుకుని తిరిగి వచ్చేశాడేమో?' భ్రమతో ఊర్మిళ తిరిగి చూసింది. ఆమె వెనకాల కారు నలుపుగా ఒక యువతి నిలబడి ఉంది. మేని రంగు నలుపే అయినా ఎవరూ తోసి పుచ్చలేని స్నేహ భావన, ఆకర్షణ ఆమె ముఖంలో ఉన్నాయి. ఆ యువతి పరిచయం ఉన్నదానిలా, గుర్తు తెలియని కొత్త మనిషిలా వినోదమైన అనుభూతికి గురైన ఊర్మిళ అయోమయంగా చూసింది.
''ఎవరు నువ్వు? నువ్వు నాకు పరిచయస్తురాలిలాగానూ. లేని దానిలాగానూ ఉన్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఏం కావాలి నీకు?'' అడిగింది ఊర్మిళ.
ఆ నల్లటి యువతి ఊర్మిళను చూసి చిరునవ్వు నవ్వింది. ''సఖీ! నీ లోపలి మనసుకి నా గురించి తెలుసు. నేను నీకు సన్నిహితురాలిని. చింతలో మునిగిపోయిన ప్రతి మనిషికీ నేను సన్నిహితురాలిని. ఈ సమయంలో నీకు తోడుగా ఉండటం కోసమే నేను వచ్చాను.''
ఊర్మిళ అయోమయం ఎక్కువైయ్యింది. ''లలనా! నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావడం లేదు. నీ తోడు వల్ల నాకు ప్రయోజనం చేకూరుతుందని అనిపించడం లేదు. నా ఏకాంతాన్ని భంగం చేయకుండా నువ్వు వెళ్లిపో.''
'' నిన్ను ఏకాంతంలో తల్లడిల్లేలా చేసి వెళ్లి పోయినవాడి మీద నువ్వు చాలా కోపంతో ఉన్నావని నాకు తెలుసు. నీ ఏకాంతాన్ని పారదోలడానికి వచ్చిన నన్ను కూడా నువ్వు వెళ్ళగొట్టడం ఏ విధంగా న్యాయం ఊర్మిళా?''
ఊర్మిళ నిటారుగా కూర్చుంది. ''ఎవరు నా ఏకాంతానికి కారణభూతులు అయ్యారో, అతని చోటును నువ్వు ఏ విధంగా భర్తీ చెయ్యగలవు? నీ మాటలు వింతగా ఉన్నాయి ఎవరు నువ్వు? నీ పేరు ఏమిటి? నిన్ను ఇక్కడికి పంపించింది ఎవరు?''
ఆ యువతి ఊర్మిళ ముందు వచ్చి కూర్చుంది. ఆమె తలను తన నల్లని వేళ్ళతో ప్రేమతో నిమిరింది. ''నా పేరు నిద్ర. ఎవరి మీద నువ్వు కోపంగా ఉన్నావో అతనే నన్ను నీ దగ్గరికి పంపించాడనుకో రాదూ.'' నవ్వింది.
ఊర్మిళ ఆమె చేతులను తొలిగించింది. ''నిద్ర! నీపేరు బాగా ఉంది. నలుపు కూడా నీ శోభను ఇనుమడింప చేస్తోంది. లక్ష్మణుడే నిన్ను నా దగ్గరికి పంపించాడంటే నమ్మకం కలగడం లేదు. అడవిలో రాముడితో ఉన్నప్పుడు అతనికి నా జ్ఞాపకం వస్తుందని నన్ను నమ్మమంటున్నావా?''
అయినా ఆ యువతి చెప్పింది నిజమే అయి ఉండాలని ఊర్మిళ మనసు ఆరాటపడింది. లక్ష్మణుడు చేసింది అన్యాయమే అయినా అతని మనసు రాయి కాదు.
ఊర్మిళ మనసును గ్రహించిన నిద్రాదేవి అన్నది. ''లక్ష్మణుడు కనికరం లేనివాడు కాదు ఊర్మిళా..! సందర్భాలు, పరిస్థితులు మనుషుల చేతులను కట్టి పడేస్తాయి. రాముడు కూడా సీతను అయోధ్యలోనే ఉండమని బలవంతం చేశాడు. కానీ సీత మొండిగా అతనితో వెళ్ళింది. నువ్వు అలా హఠం చేసి లక్ష్మణుడితో ఎందుకు వెళ్ళలేదు?''
ఊర్మిళ విరక్తిగా నవ్వింది. ''అభిప్రాయం అడిగితే కదా! హఠం చెయ్యడానికి. అదీకాక నా భర్త కోపిష్టి అన్నది నీకు తెలియదా? కోపం అతని బలమా లేక బలహీనమా అని నాకు తెలియదు. నాకు అతని పట్ల ఎందుకో ప్రేమ కన్నా, భయమే ఎక్కువగా ఉంటూ వచ్చింది. శాంతస్వరూపి అయిన అన్నగారికి పూర్తిగా వ్యతిరేకమైన బింబం. రాముడి శాంతస్వభావాన్ని నా సోదరి అనుకూలంగా ఉపయోగించుకుంది.''
నిద్రాదేవి చిలిపిగా నవ్వింది. ''సీత నీ కన్నా తెలివైనది అని ఒప్పుకుంటే నీకేం తక్కువ అవుతుంది ఊర్మిళా? ముగ్గురు అత్తగార్లతో ఉమ్మడి రాజభవన వాసం కన్నా, భర్తతో ఏకాంత పర్ణశాల వాసం ఎంతో సుఖమైనది అని ఆలోచించి ఉంటుంది.''
''నిజమే. కానీ, రాముడికి సీత మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ కూడా ఆమె హఠం జయించడానికి కారణమై ఉండవచ్చు. సీతహఠం చేసి అయినా తనతో వస్తే బాగా ఉంటుంది అని రాముడు ఆశపడి ఉండవచ్చు. కానీ, నా భర్తకు అటువంటి అతీతమైన ప్రేమ నా మీద ఉన్నట్లు నేను ఏ తరుణంలోనూ అనుభూతి చెందలేదు.''
ఊర్మిళ మౌనంగా ఉండిపోయింది. తరువాత కోపంతో నిట్టూర్పు విడుస్తూ ఇలా అంది. ''లక్ష్మణుడిని తరువాత ఎప్పుడైనా నేను కలవడం జరిగితే, అతడిని మరిచిపోకుండా ఒక ప్రశ్న అడగాలి, ''అతను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు అని.''
నిద్రాదేవి ఆమెను జాలితో చూసింది. ఊర్మిళ వేరే ఎక్కడో చూస్తూ ఉంది. ఆ సంధ్యా సమయంలో ఉండి ఉండీ వినిపిస్తూ ఉన్న ఆ పణవ(డప్పు) శబ్దం ఊర్మిళ మనసులో ఏదో తెలియని ఇబ్బందిని కలిగించింది.
నిద్రాదేవి ఊర్మిళ దృష్టిని తన వైపు మళ్ళించింది. ''మనసును చెదరనివ్వకు ఊర్మిళా. నీ భర్త మీద ఉన్న కోపం నాకు అర్థ్ధం అవుతోంది. ఒక వేళ లక్ష్మణుడికి కూడా అది అర్థం అయినందువల్లే అతను నన్ను నీ దగ్గరికి పంపించాడని అనుకుంటున్నాను.'' చనువుగా ఊర్మిళ కనురెప్పలను మెల్లిగా నిమిరింది. ఊర్మిళ ఈసారి ఆమె వేళ్ళను తొలగించలేదు. ఆ స్పర్శలో ఉన్న మృదుత్వం ఇప్పుడు కావలసి వచ్చినట్లు అనిపించింది.
''నన్ను నమ్ము సఖీ! లక్ష్మణుడికి నిజంగానే నీ పట్ల శ్రద్ధ ఉంది. ఒంటరితనపు భారాన్ని నువ్వు కొంచెం కూడా అనుభవించకూడదని, పదునాలుగు సంవత్సరాలు మెలకువతో ఉండి, త్యాగం చెయ్యబోతున్న నిద్ర మొత్తాన్ని నీకు సంక్రమించేలా చెయ్యడానికి నన్ను పంపించాడు. ఈ ఏర్పాటులో మీ ఇద్దరికీ లాభం ఉంటుంది. పాపం! అతను మాత్రం ఏం చెయ్యగలడు? రాత్రీ పగలూ ఎల్లవేళలా రాముడిని సీతనూ కంటికి రెప్పలాగా కాపాడవలసిన బాధ్యతను అతను స్వయంగా స్వీకరించాడు కదా. దానికి అంతరాయం కలుగకుండా నిద్రను త్యాగం చెయ్యడానికి నిశ్చయించుకుని ఉండవచ్చు.'' కాస్త ఆగి ఊర్మిళ ముఖ కళవళికలను పరిశీలించింది నిద్రాదేవి.
ఊర్మిళ తన ముఖంలో ఏ భావాలనూ కనబడనివ్వకుండా మాట్లాడింది. ''నేను ధన్యురాలిని అయ్యాను. లక్ష్మణుడు నా పట్ల ఉంచిన కనికరం గురించి తెలుసుకుని నా మేని గగుర్పాటు చెందుతోంది. భార్య పట్ల ఎంత శ్రద్ధ! ఒక విషయం అర్థం చేసుకో అతివా! బాధ్యతను నెరవేర్చడానికి ఆటంకంగా ఉన్న నిద్రను వ్యర్థం చేయకుండా స్వీకరించడానికి అతనికి ఇంకొకరు కావల్సి వచ్చింది.. నన్ను ఎంపిక చేసుకున్నాడు. అందులోనూ నాకు ఒక స్వాంతన... ఆ మాత్రంగానైనా అతని జ్ఞాపకాలల్లో నేను మిగిలి ఉన్నందుకు.''
ఊర్మిళ కోపాన్ని ఎలా తగ్గించడం, ఎలా సమాధానపరచడం అన్న ఆలోచనతోనే నిద్రాదేవి అన్నది. ''నీ కోపం నాకు అర్థం అయ్యింది. కానీ, ఆలోచించి చూడు. తండ్రి వార్ధక్యాన్ని స్వీకరించిన కొడుకు కధను వినలేదా నువ్వు? ఆ కారణం చేతనే ఆ కొడుకు కావ్యాలలో స్థానం సంపాదించి కీర్తిని పొందాడు. అదేవిధంగా భర్త యొక్క నిద్రను స్వీకరించిన భార్యగా, రేపటి రామ కావ్యంలో నీ త్యాగం కూడా మాట్లాడుకుంటే అది నీకు కీర్తిదాయకం కదా?
ఊర్మిళ కోపాన్ని అణచుకోలేక నిద్రాదేవిని ఎర్రబడిన కళ్ళతో చూసింది.
''అలా నన్ను చూడకు ఊర్మిళా. నీ కళ్ళ ఎరుపు నన్నే భయపెడుతోంది. వాటిలో నేను ఇంకా పదునాలుగు ఏళ్ళు వాసం చేస్తానని లక్ష్మణుడికి మాట ఇచ్చాను.'' తగ్గు స్వరంతో అన్నది నిద్ర.
ఊర్మిళ తన ముఖాన్ని వేరు వైపుకు తిప్పుకుంది. ఆ చీకటి, నిశ్శబ్దం ఊర్మిళ ఒంటరితనాన్ని ఇంకా భారంగా చేసి ఆమె మనసును మరింత భయపెట్టాయి.
తన సోదరి సీతకి గానీ, మాండవికి గానీ, శృతకీర్తికి గానీ ఏర్పడని అనుభవాలు తనకు మాత్రం ఎందుకు కలుగుతున్నాయి? సీత తెలివితేటలుగలది అంటే, మాధవి, శృతకీర్తి భాగ్యవంతులు అని అర్థమా! భర్త ఎక్కడికి వెళ్ళినా అతని నీడలాగా వెళ్ళడమే భాగ్యమా? భర్తనీడ మాత్రమేనా భార్య? స్త్రీకి కూడా పురుషుడిలాగే స్థూల దేహం ఉంది కదా?
నేను లక్ష్మణుడి నీడను కాను. నాకంటూ విడిగా ఎప్పుడూ నా నీడ నాతోనే ఉంది. రాముడు ఉండే చోట సీతకు అయోధ్య అంటే, లక్ష్మణుడు'' లేని చోటు'' నాకు మాత్రం ఎలా అయోధ్యగా మారింది? ఇప్పుడు లక్ష్మణుడు అన్న నిజం ఇక్కడ లేని పక్షంలో, అతని మూలంగా వచ్చినా ఈ అయోధ్య కూడా నిజం కాదు. ఈ చీకటి, ఒంటరి తనం, ఈ కొత్త స్నేహితురాలు నిద్రాదేవి మాత్రమే నిజం.
ఊర్మిళ ఇప్పుడు నిద్రాదేవి వైపు తిరిగింది. ముందే నలుపు రంగులో ఉన్న నిద్ర చీకటితో చీకటిగా కలిసి పోయింది. ఆమె శ్వాస మాత్రమే ఊర్మిళకు సన్నగా వినిపించింది. ఊర్మిళ ఒక నిశ్చయానికి వచ్చింది.
''ఈ ఏర్పాటుకు నేను సమ్మతిస్తున్నాను. కానీ ఎటువంటి పేరుప్రతిష్టలకు గానీ, కీర్తికిగానీ ఆశపడి ిమాత్రంకాదు. నాకు తెలుసు. నువ్వు చెబుతున్న ఆ రేపటి మహా కావ్యంలో నా పేరు ప్రస్తావించబడదు. సోదరుడి కోసం పదునాలుగేళ్ళు నిద్రను త్యాగం చేసిన లక్ష్మణుడికి కావాలంటే అది ఉత్తమమైన త్యాగంగా పరిగణించబడవచ్చు. కానీ, ఎవరూ కూడా నా చేతలను త్యాగంఅని చెప్పి, నన్ను కనికరానికి పాత్రధారిగా మార్చివేయవద్దు. ఎవరి జాలి నుంచీ భిక్షగా ఈ నిద్రను నేను స్వీకరించలేదు. నేనే కోరుకుని, నా సొంత కారణాల కోసం దీనిని వరిస్తున్నాను. ఇది ఒకవిధంగా లక్ష్మణుడికి అతను తన బాధ్యతను నెరవేర్చడానికి నేను చేస్తున్న ఉపకారంగా కావాలంటే ఉండిపోనీ. నిద్రా! నేను తయారుగా ఉన్నాను. పదునాలుగేళ్ళు నువ్వు నా కళ్ళలో నివసించి, ఈ క్షణంలోనే నన్ను నిద్ర పుచ్చు. ఈ సుదీర్ఘమైన నిద్ర ఇతరులు అనుకుంటున్నట్లు లక్ష్మణుడి మీద నాకు ఉన్న తాపాన్ని మర్చి పోవడానికి కాదు. మారుగా నా కోపాన్ని, నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోవడానికి. దయచేసి నాకు కలలు లేని నిద్రను ప్రసాదించు. కలలో కూడా ఎవరి ముఖమూ కనబడడం నాకు ఇష్టం లేదు.''
నిద్రాదేవి ముఖభావాలు ఏవీ ఆ చీకటిలో కనబడలేదు. ఊర్మిళ ఆమె మృదువైన స్పర్శను మాత్రం గ్రహించింది. నిద్రాదేవి ఊర్మిళను తన భుజాల మీద ఆనించుకుని అలాగే అంతఃపురంలోకి తీసుకు వెళ్లి, హంసతూలికా తల్పంలో పడుకోబెట్టింది. మసక వెలుతురులో, నెమలి ఈకతో ఊర్మిళ కళ్ళను మృదువుగా నిమిరింది. ''మెలకువతో అక్కడ ఒకడు, నిద్రపోతూ ఇక్కడ ఒకర్తి ఈ విధంగా పదునాలుగేళ్ళు తమ అందమైన యవ్వనాన్ని అన్యాయంగా వృధా చేసుకోవడానికి సిద్ధపడ్డారు కదా!'' బాధపడుతూ తనలో తానే గొణుక్కుంది నిద్రాదేవి. తరువాత ఊర్మిళ కలలు లేని సుదీర్ఘమైన నిద్రలో మునిగిపోయింది.

పదునాలుగు ఏళ్ళ తరువాత ఒక రోజు...
ఒకప్రాతః కాలంలో, ఎవరో అన్య పురుషుడి స్పర్శ తగిలి సగం నిద్ర, సగం మెలకువ మిశ్రితమైన అవస్థలోఊర్మిళ మెల్లగా కళ్ళుతెరిచింది. ఎదురుగా నిలబడి ఉన్న మనిషి రూపం మసకగా గోచరించింది. చెవుల దగ్గర జుట్టు నెరిసిపోయి ఉంది. చాల రోజులుగా నిద్రలేమి వల్ల కళ్ళు అలసటతో సొమ్మసిల్లి ఉన్నాయి. కళ్ళల్లో ఇప్పుడు కూడా ప్రేమ, ఆప్యాయత తాలూకు సూచనలు ఏవీ కనబడలేదు. మారుగా అదే పాత, అలవాటు పడిపోయిన, బిగుసుకుపోయిన బాధ్యత తాలూకు భావన. అతని మీద ఆమె ఏర్పరచుకున్న, పాత అభిప్రాయాల తాలూకు అవశేషాల రూపకల్పనగా కూడా ఉండిఉండవచ్చు.
లక్ష్మణుడు పందిరి మంచం చివరన కూర్చుని చనువుగా ఊర్మిళ భుజాలను పట్టుకుని ఉన్నాడు.
''అమ్మా! కళ్ళు తెరవండి. ఎవరు వచ్చారో చూడండి.'' వెనక నుంచి చెలికత్తె ఎవరో సంతోషం నిండిన గొంతుతో అంది. ఊర్మిళ కష్టపడి, కళ్ళను పూర్తిగా తెరవడానికి ప్రయత్నించింది. తల్లిపొత్తిళ్ళలో వెచ్చగా నిదురిస్తున్న సమయంలో, ఉన్నట్లుండి ఎదురు చూడని విధంగా చటుక్కున లాగి వేయబడిన చంటిపాపలాగా ఆమె చిరాకు పడింది. '' ఎవరు నువ్వు? ఇంతకు ముందు నిన్ను ఎక్కడా చూసినట్లు లేదే? నా అంతఃపురంలోకి ఎలా వచ్చావు? ఎవరు నిన్ను అనుమతించింది?'' అంటూ లక్ష్మణుడిని శరమారిగా ప్రశ్నించింది.
లక్ష్మణుడు అయోమయంలో పడ్డాడు. అదే సమయం పదునాలుగేళ్ళు సుదీర్ఘమైన విరామంలో, కాలంశరీరంలో ఏర్పరచిన వయసు మార్పుల వల్ల తన బాహ్యరూపం ఆమె మరిచి పోవడం సహజమే. తాను ఎవరు అన్నది ఊర్మిళకు గుర్తు చేసే ప్రయత్నాన్ని ప్రయాసతో పూనుకున్నాడు. ''ఊర్మిళా! నన్నుబాగా పరిశీలించి చూడు. నేను నీ భర్త లక్ష్మణుడిని. పలు సంవత్సరాలకు ముందు, నీ తండ్రి జనకుడి సభలో ఎవరి వల్లనూ ఎక్కు పెట్టడానికి సాధ్యం కాని ఆ పెద్ద విల్లును, మా అన్నయ్య రాముడే విరిచి నీ అక్కయ్య సీతను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలోనే జనకుడి ఇంకొక కుమార్తె అయిన నిన్ను నేను పాణిగ్రహణం చేసుకున్నాను. విధివశాత్తూ నిన్ను విడిచి పెట్టి, పదునాలుగేళ్ళు అన్నయ్య, వదినలతో నేను అడవిలో గడపవలసి వచ్చింది. వనవాసం ముగిసి అందరమూ క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేశాము. వచ్చిన వెంటనే నిన్ను వెళ్లి చూడమని చెప్పి వదిన సీత నన్ను ఇక్కడికి పంపించింది.''లక్ష్మణుడు గుక్క తిప్పుకోకుండా చెప్పి ఆమె వైపు చూశాడు.
ఊర్మిళ కళ్ళను నులుపుకుంది.'ఇప్పుడు కూడా నీ అంతట నువ్వుగా రాలేదు. సీత జ్ఞాపకం చేసిన తరువాతే వచ్చావు.'అణగారి ఉన్న ఊర్మిళ కోపావేశాలు ఇప్పుడు కొత్త వేగంతో మళ్ళీ ఎగసి పడ్డాయి.
''నువ్వు చెప్పే విషయాలు ఏవీ నాకు తెలియదు. నువ్వు చెప్పిన పేర్లు కూడా నా జ్ఞాపకాలలో లేవు. నీ ముఖం, స్వరం, స్పర్శ... ఏవీ నాకు పరిచయం ఉన్నట్లుగా అనిపించడం లేదు. నన్ను విసిగించకుండా వెంటనే వెళ్ళిపో.'' లక్ష్మణుడిని చూసి అరిచింది.
లక్ష్మణుడు వెలవెల పోయాడు. 'నిజంగానే ఈ యువతికి గుర్తు తెలియలేదా? లేకపోతే ఎప్పుడో పదునాలుగు ఏళ్లకు ముందు గాయపడిన ఆమె అస్తిత్వం తనను గుర్తు పట్టడానికి వ్యతిరేకిస్తోందా?'
మొట్టమొదటి సారిగా అతనికి ఏదో అర్థం అవుతున్నట్లు అనిపించింది. అపరాధ భావం తలెత్తింది. దానితో పదునాలుగేళ్ళు మెలకువగా ఉన్న అలసట చేరుకోగా, అతని కళ్ళు మెల్ల మెల్లగా మూతలు పడసాగాయి. ఊర్మిళ నుంచి జరిగి, కొంచం దూరంలో ఉన్న ఆసనంలో ఆనుకుని కూర్చున్నాడు.
ఊర్మిళ కావాలనే అతని వైపు చూడకుండా వేరొక వైపు ముఖం తిప్పుకుంది. కోపంతో ఆమె వక్షాలు ఎగిసి పడుతున్నాయి.
ఊర్మిళ కళ్ళ నుంచి మెల్లిగా కిందికి దిగింది నిద్రాదేవి. ''ఎటువంటి గాయాన్ని అయినా కాలం మాన్పుతుంది. లక్ష్మణా! అంతవరకు ఓపికతో ఎదురుచూడడం కన్నా వేరే దారి లేదు'' అని గొణుక్కుంటూ లక్ష్మణుడు వైపు ఒక నల్లని నీడలాగా నడిచి వెళ్ళింది.
ఊర్మిళ ఇప్పుడు బాగా మేలుకోగా, లక్ష్మణుడు అర్ధంకాని అనుభూతులతో నిద్ర పోసాగాడు.