30, జులై 2011, శనివారం

గురు బ్రహ్మలా! వీరు కుల బ్రహ్మలు..

అంటారు.
కానీ ఇప్పుడు.. చాలా కళాశాలలో..గురువులు కుల మౌడ్యంతోకళ్ళు మూసుకు పోయిన వారే! పిల్లలకి విద్యా బుద్దులతో పాటు మంచి-చెడు ఔచిత్యంని భోధించే గురువులే కులతత్వాన్ని ప్రోత్సహిస్తూ.. తమ కులం కాని వారిని పైశాచిక ధోరణితో..కారణం లేకుండా హింసించడం సర్వ సాధారణం అయిపోయింది.

ఒక ఉదాహరణ చెబుతాను. మేము అద్దెకు ఉంటున్న ఇంట్లోనే.. మాకు సమీపంలో..ఉన్న ఇంజినీరింగ్ కాలేజీ లో..పని చేస్తున్న ఒక మేడం అద్దెకి..వచ్చారు.ఆవిడ మాటల సందర్భంలో..మన వాళ్ళు కాని వారితో నేను అస్సలు మాట్లాడను అని అన్నారు. మరి మీ స్టూడెంట్స్ సంగతేమిటి మరి? అడిగాను. వాళ్ళని అంతే.. ప్రక్కకి నేట్టేయడమే!అన్నారు.
ఇలాటి వారిని గురువు అనాలా?

మనం చాలా సందర్భాలలో.. ఏ పి.హెచ్.డి. స్థాయిలోనో విద్యార్ధులని మార్కులు ఇవ్వకుండా కావాలని హింసిస్తున్నారు అనో, అమ్మాయిలని అయితే లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారనో అని విన్నాం. కొందఱు ఆ సమస్యని ఎదుర్కున్నారు కూడా.
కానీ.. ఈ రోజున చాలా కళాశాలల్లో.. లెక్చరర్స్ ,లాబ్ టెక్నీషియన్స్ తో సహా.. పిల్లలని వివిధ రకాల కారణాలతో వేధిస్తున్నారు. ఇది నిజం.

మనం పిల్లలకి.. తల్లి దండ్రులుగా ఎన్నో నీతి భోదలు చేస్తాం. వారు మనం చెప్పినదానిని ఆచరించడానికి అన్వనయిన్చుకోవడానికి..సంసిద్దతని చేకూర్చు కుంటూ ఉండగానే మన ఒడిని దాటి సమాజం అనే బడిలో..అడుగు పెట్టగానే..అక్కడ తల్లిదండ్రులు చెప్పినదానికి వ్యతిరేకంగా కనబడగానే పెద్దవాళ్ళు చెప్పేదంతా అబద్దం. వాళ్లకి బయట ఎలా ఉందో తెలియదు అనుకుని ఒక స్థిర నిర్ణయం ఏర్పరచుకుని.. ఇంట్లో..చెప్పే మాటలకి వ్యతిరేకంగా చేస్తూ ..చెబుతూ ఉంటారు. సమాజంలో వివిధ రకాల మనస్తత్వాలు..వాళ్ళ మనుసు పై అప్లై అయి.. ఒక విధంగా కన్ప్యూజన్ లో..వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఖచ్చితంగా.. అలాటి దశే .. (అడాల్సేంట్ ఏజ్ ) ఆ దశ లోనే పిల్లల లో రక రకాల పైత్యాలు, విపరీత ధోరణి కి కారణమవుతున్నాయి.

కులం పేరిట, మతం పేరిట,ధనిక -పేద తారతమ్యాలు తో.. వర్గాలు ఏర్పడి.. అకారణ విద్వేషాలు..రగులు కుంటున్నాయి. అది రూపు మాపాల్సింది..గురువులు. వారే కుల పిచ్చిని ప్రోత్సహిస్తుంటే.. కొందఱు అకారణంగా బలి అవుతుంటే.. చూస్తూ ఉండటం కన్నా వేరే మార్గం లేదు. ఖండించి..గొడవలు పెట్టుకునే తీరిక లేదు.మూర్ఖత్వం ముందు తలవంచుకు వెళ్ళడం నేర్చుకున్న సగటు మనుషులం అని అనుకుని నేను కూడా ఆ కోవా మనిషిగానే రాజీ పడతాను , తృప్తి పడతాను.

నాకే ఇలాటి సమస్య వచ్చింది కూడా.. మా అబ్బాయి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు..తనకి..ఫిజిక్స్ రికార్డు వర్క్ ఉండేది. తను రికార్డ్ వర్క్ కంప్లీట్ చేసుకుని.. సబ్మిట్ చేసేందుకు కాలేజ్కి..తీసుకుని వెళ్ళాడు. ఆరోజు.. ఆ.."సర్" లీవ్ లో ఉన్నారు.స్పోర్త్స్ రూమ్లో..బాగ్ లో..పెట్టేసి.. గ్రౌండ్ లో..క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆట పూర్తయ్యాక చూస్తే.. ఆ రూం కి వెళ్లి బాగ్స్ కల్లెక్ట్ చేసుకుని బాగ్ చూసుకుంటే మొబైల్ ఫోన్స్,ఫిజిక్స్ రికార్డ్ ..మాయం. వాటి కోసం రిపోర్ట్ చేయడం.. మరలా రికార్డ్ తయారు చేసుకోవడానికి సమయం లేకపోవడం వాళ్ళ ఆ సంవత్సరం ..అ సబ్జెక్టు వ్రాయడానికి వీలు కాలేదు.అలా ఆ సబ్జెక్ట్ మిగిలిపోయింది.

నెక్స్ట్ ఇయర్లో.. మళ్ళీ రికార్డ్ తయారు చేసుకుని..సబ్మిట్ చేసాడు మా అబ్బాయి. ఎన్నో లోపాలు చూపి రిజెక్ట్ చేసారు..ఆ.. లాబ్ టెక్నీషియన్. నిజానికి మా అబ్బాయి వ్రాసుకున్న రికార్డ్ చూసి వ్రాసుకున్న పిల్లలకి..ఓకే.. చేసారు.మళ్ళీ రికార్డ్ తయారు చేసుకుని వెళితే..అక్కడ పెట్టి వెళ్ళు తర్వాత్ చూస్తాను అన్నారంట. ఆయన ముందున్న బల్లపై పెట్టి వచ్చేసిన కొన్ని రోజుల తర్వాత ..మా అబ్బాయి వెళ్లి.."సర్ ..నా రికార్డ్ కలెక్షన్ చేసారా? ఇస్తారా అని అడగితే..అసలు నీ రికార్డ్ ఎప్పుడు ఇచ్చావ్? అన్నారట. మా అబ్బాయి కి విషయం అర్ధమై పోయింది. తనని వేధించడానికే.. అలా చేస్తున్నారని.

తర్వాత జూనియర్స్ చెప్పారట..నీ రికార్డ్ ల్యాబ్ లో..ఉంది అని. వెంటనే అది తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు పర్మిషన్ లేకుండా లోపలి వెళ్లాడన్న నెపంతో..తిట్టిపోసి.. నీ రికార్డ్ ఇక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారు..? లేదని నేను చెబుతున్నాను కదా..అని అరచి.. గెట్ అవుట్..అని బయటికి..నేట్టించుకుని అవమానం తో..బయటకి రావడం... ఆ రాత్రంతా బాధపడటం..చూసి నేను చాలా ఏడ్చాను. సున్నిత మనస్కుడైన మా అబ్బాయి మనసు గాయపడిన మూలంగా.. ఆ రాత్రంతా నేను మేలుకుని నా బిడ్డకి కాపలా కాసుకోవాల్సి వచ్చింది. నేను వెళ్లి ఆ "సర్" తో..మాట్లాడతాను..అంటే..వద్దమ్మా!..వాడు (గౌరవభావం తగ్గి) ఎలా పడితే అలా మాట్లాడతాడు. నువ్వు వెళ్లి వాడితో..ఏమైనా అనిపించుకుంటే..బాగోదు..నేనే చూసుకుంటాను అన్నాడు. 

 అయినా నేను మళ్ళీ మనసు ఆగక సెక్షన్ హెడ్ ని కలసి మాట్లాడితే..అలా ఏం ఉండదు..నేను చూస్తాను..మేడం! మీరేం..వర్రీ అవకండి..అని మాటల నవనీతం పూసి..పంపించారు. ఒక పది వేలు ఇస్తే.. సబ్జెక్టు కి..మార్కులు ఇస్తారు.అలా ట్రై చేయక పోయారా?అని..ప్యూనుల రాయబారాలు. నేను ఏదైతే అదే అవుతుందని అలా కుదరదే కుదరదని చెప్పాను. మా బాబు వాళ్ళ నాన్న గారు..ఆ డబ్బు ఇచ్చేసి అ వేధింపులు లేకుండా చేస్తే బాగుంటుంది కదా అంటే .. కూడా నేను ఒప్పుకోలేదు.

నిజానికి.. అక్కడ అందరికి తెలుసు. ఆ..ఫిజిక్స్ లాబ్ టెక్నీషియన్ సర్..కుల గజ్జితో పిల్లలని వేధిస్తాడని.డబ్బు ఆశించి పిల్లలని ఇబ్బంది పెడతాడని. ఇక క్యాంపస్ లో చూస్తే.. ఒకే కులం వారు ఒకే చోట వెహికల్స్ పార్క్ చేయడం దగ్గర నుండి..క్లాస్స్ లో కూర్చునే వరకు అన్ని గ్రూప్ రాజకీయాలే! ఇతర కులాలవారు వాళ్ళ వెహికల్స్ మద్య పార్క్ చేసుకుంటే..టైర్లు లో.గాలి తీసేయడం.. కొత్త బండ్లు అయితే.. పదునైన వస్తువులతో..గీకి..అందం చెడగొట్టడం, సైడ్ వ్యూ మిర్రర్స్ మాయం చేయడం..అన్నీ మామూలే! ఇవి.. కుల మౌడ్యం తో కనిపించే సంగతులు. విద్యాలయాల్లో..విద్వేషాలు.

మా అబ్బాయి..ఈ జోన్ లో క్రికెట్ లో కాలేజ్ టీం ని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడటం, కోచ్ తో పాటు కాంప్ లకి వివిధ చోట్లకి వెళ్ళడం.. క్లాస్ లు పోగొట్టుకోవడం,పరీక్షలకి..రెండు రోజుల ముందు పుస్తకం తెరవడం.. అయినా బాగానే వ్రాయడం ఇది పద్ధతి. వాళ్ళ టీం కి .. అటెండెన్స్ లో.. మినహాయిపు ఇచ్చేవారు . కాలేజ్ కి.. పేరు తెచ్చిపెడుతున్నారని. అందుకు కూడా .వేధించేవారు.

 
ఏరా? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? నువ్వు.. కాలేజ్ కి హీరో వి అయినా నా ముందు జీరో వే..అని ఎగతాళి చేస్తూ.. మానసిక హింసకి గురి చేసిన వికృత మనస్తత్వం అక్కడ పేరుకుని ఉండేది. కాలేజ్ కెప్టెన్ గా..యూనివెర్సిటీ ప్లేయర్ గా వి.ఆర్.ఎస్.ఈ .ని ఈ జోన్ లో.. క్రికెట్ విజేతగా నిలపడంలో..ప్రధాన పాత్రధారి అయిన ..చాలా సాఫ్ట్ అయిన కుర్రాడి కే కుల వేధింపు..తప్పలేదు. నేనైతే.. చాలా కోపంతోనూ,బాధతోనూ.అవసరమైతే..వాళ్ళ బ్యాచ్ తో వెళ్లి..ఘోరావ్ చేసినా బాగుండును అనుకునేదాన్ని. ఇలా వేధింపు కి గురికావడం ఒక చేదు గుర్తు. మరువనన్నా మరవలేనిది కదా!

కారణం .. ఆ "సర్" ఎదురైన ప్రతి సారి నమస్కారం పెట్టలేదని, తన బైక్ పై..మా ఇంటి పేరు..వ్రాయించుకుని మా కమ్యూనిటిని చాటుకోవడం..ఇవన్నీ..ఆ "సర్" కి కంటగింపు గా మారి దాదాపు మూడు సంవత్సరాలు వేధించాడు. ఆఖరికి..నాలుగవసారి రికార్డ్ సబ్మిట్ చేసాక వారం లో ఒక సారి అయినా ఆ "సర్'" ముందు నిలబడి.. అకారణంగా తిట్టించుకుని.. తన నోటి దురుసు తనాన్ని భరించి మౌనంగా తలవంచుకుని రావాల్సి వచ్చేది. (నాకు ఇవన్నీ తెలియకుండా చాలా సార్లు జరిగేది. ఎందుకంటే..మా అబ్బాయి అంత సహనం నాకు లేదు. అకారణంగా..ఎవరు తిట్టినా నేను ఉపేక్షించను.) ఇక మా అబ్బాయి అయితే కాలం కలసి రాక వీడితో..తిట్టిన్చుకోవాల్సి వచ్చింది..అనే వాడట తన ఫ్రెండ్స్ తో.. అలా ఆ దెబ్బతో.. మావాడి హీరో ఇజం అంతా..అణిగి పోయి..ఆ లాబ్ టెక్నీషియన్ చుట్టూ తిరిగి..తిరిగి అందరి చేతా..పాపం .."నిఖిల్ "..అనిపించుకునేవాడు. 

 ఒకవేళ స్టూడెంట్స్ వాళ్ళ తిట్లు భరించలేక సహనం కోల్పోయి వయలేంట్ గా మారితే.. "గురువు ని కొట్టిన శిష్యుడు" అని పేపర్ లో..న్యూస్ వచ్చి ఉండేది..అనుకునేదాన్ని. ఆఖరికి సెక్షన్ హెడ్ జోక్యంతో.. సంతకం చేసి మార్కులు ఇస్తూ.. నాన్-సి తో..పెట్టుకుంటే ఏమవుతుందో ..చూసావా? అన్నాడట..ఎగతాళిగా.. ఇలాటి పైశాచిక ధోరణి లో..ఉన్నారు..గురువులు. ఆ ల్యాబ్ టెక్నీషియన్ "సర్" ఎవరో..ఇక్కడ చదువుకునే పిల్లలందరికీ తెలుసు. ఆయనతో..చాలా జాగ్రత్తగా ఉండటం నేర్చుకుంటారు. గౌరవంతో కాదు..భవిష్యత్ ని బలి తీసుకుంటాడనే భయం తో.. .

ఇంకొక స్టూడెంట్ అయితే..ఏడు సంవత్సరాలుగా తిరుగుతూనే ఉన్నాడట. ఎందుకంటే.. ల్యాబ్ లో నోరు పారేసుకుని ఆ స్టూడెంట్ తల్లిని..తిడితే.. ఆ "సర్" కాలర్ పుచ్చుకున్నాడని.. అతనికి. పనిష్మెంట్ ఇస్తూ..అతనికి..ఇంకా రికార్డ్ మార్కులు..ఇవ్వలేదట. పాపం ఈ సంవత్సరంకి..అతనికి విడుదల అవుతుంది. ఏడు ఏళ్ళు శని పీడన అన్నమాట.

చాలా కాలేజెస్ లో..కుల గజ్జి ఓపెన్ సీక్రెట్.. పిల్లలు వేధింపులకి గురి కాకుండా ఉండాలంటే.. కులానికి ఒక కాలేజ్ ఉండాలేమో! లేదా....సబ్జెక్ట్ కి..ఇంత అని.. ముడుపులు సమర్పించుకుంటే..ఇలా వేధింపులు ఉండవు...అంట. ఇలా కొత్త కొత్త విషయాలు.. తెలుసుకుని ఆశ్చర్య పడుతూ..భాదపడుతూ నా కొడుకు కి కల్గిన కష్టం ఇంకొకరికి రాకూడదని..కోరుకుంటూ..

విద్యాలయాలు.. దేవాలయాలు. మన లోని విష సంస్కృతులని, మన ఇంటి సమస్యల ప్రభావాన్ని పిల్లల పై చూపి.. వారికి.. చదువుల వత్తిడే కాకుండా, మానసిక వత్తిడికి..గురి చేసి వారి పువ్వు లాటి మనసులని నలిపి వేయవద్దని కోరుకుంటూ.. గురు బ్రహ్మల్లారా.. కుల బ్రహ్మలు..గా..మిగిలిపోకుండా ఉండాలని..విన్నపం చేస్తూ.. ఇక్కడ నా.. అనుభవం ని పంచుకుంటున్నాను.

28, జులై 2011, గురువారం

పేస్ బుక్ లో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ గారు.

ఈ రోజు నుండి పేస్ బుక్ లో.. మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్  గారు ..మనకి కనబడబోతున్నారట.  ఒకే ఒక్కడు స్తాయిలో..కాకుండా పెద్ద మార్పు ఆశిస్తూ.. ఎల్లప్పుడు  ప్రజలకి సన్నిహితంగా  ఉంటూ..ప్రజా సమస్యలని..ఎక్కువుగా తెలుసుకుంటూ..సరి అయిన రీతిలో..సమస్యలని త్వరిత  గతిన .పరిష్కరించాలనుకోవడం..మంచి పరిణామం కదండీ! అందుకు వారికి అభినందనలు చెబుతూ.. స్వాగతిద్దాం. 
 కొంత మంది చూడండీ..పేస్ బుక్ లో.. సొల్లు కబుర్లు చెప్పుకోవడం తప్ప ఏముంది అని..కామెంట్ చేసేవారికి..ఇది..ఒక సరి అయిన జవాబే కదా!? 
నేను మన ముఖ్యమంత్రి గారికి.. ఒక సమస్య చెప్పదలచానండీ!!
మన రాష్ట్రం లో రేబిస్ టీకాల కొరత ఏమో కాని.. మా ఇంటి ముందు వీధి కుక్క ప్రసవ వేదన పడుతుంది.చూడలేక పోతున్నాను. తగినన్ని పశు వైద్యశాలలు స్తాపించి.. జంతువులకి..సరి అయిన వైద్య సదుపాయం కల్పించే  చర్యలు చేపట్టాలి.అల్లాగే మేము  తాగే నీళ్ళలో..చిల్లగింజ వేసుకోకుండా తాగడం ఎలా? అని అడగాలి... అలా అడగడం తప్పంటారా? .. వర్ధిల్లాలి..అధునాతన ముఖ్యమంత్రి  గారు. జై..ఆంద్ర ప్రదేశ్.!!సర్వేజనా సమస్యారహిత భవంతు..  రేడియో మిర్చి వార్తా సౌజన్యం తో.. ఈ విషయం పంచుకుంటూ.. 

25, జులై 2011, సోమవారం

బాపు బొమ్మగా వాణీశ్రీ

భక్త కన్నప్ప చిత్రం గుర్తుకు రాగానే.. నాకు శ్రీ కాళహస్తి ఎంత గా గుర్తుకు వస్తుందో..! 
అంతగా..కృష్ణంరాజు నటన.. బాపు బొమ్మగా వాణీశ్రీ అభినయం ..అంత గుర్తుకు వస్తాయి.నా చిన్నప్పుడు నాకు ఎనిమిదేళ్ళు అప్పుడు మా పిన్నితో కలసి  ఆ చిత్రం  చూసి..తెగ నచ్చేసి  కాళహస్తి చూడాలని తెగ ఉబలాట పడిపోయి ..అందరిని..శ్రీ  కాళహస్తి ఎప్పుడు వెళతారు.. నన్ను తీసుకుని వెళ్తారా? అని అడిగేదాన్ని. ఎవరు తీసుకుని వెళతాం అనేవాళ్ళు కాదు.  వెళ్ళినా నాకు తేసిసేది కాదు.. తర్వాత తెలిసాక తెగ కోపం వచ్చేసి.. రోషంతో..ముక్కుపుటాలు ..అదురుతూ..ఏడ్చేసి
తెగ పోట్లాడే దాన్ని...
ఆ తర్వాత మా కుటుంబం అంతా  ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణం లో.. శ్రీ కాళహస్తి లో..ఆగి అక్కడ ఒకటి రెండు రోజులు ఉండాలనుకున్నప్లాన్ కి గండిపడింది. తిరుపతిలో మాచెల్లి తప్పి పోయి..ఎలాగోలా..మూడు రోజుల వెదుకులాటలో..దొరికి ..అమ్మయ్య అనుకుని ..ముందు అనుకున్నవి వాయిదా వేసేసి.. తిరుగు ప్రయాణం లో  బస్సు లో నుండి సువర్ణముఖి పరవళ్ళు చూడటమే దక్కింది నాకు... ఇప్పటికి నాకు సువర్ణముఖి అంటే..అప్పటి పరవళ్ల దృశ్యమే..గుర్తు ఉంటుంది.ఈవాల్టి..ఎండిన, తవ్వేసిన నది..దృశ్యం బాధాకరం. 
భక్త కన్నప్ప చిత్రంలో.. చూసిన స్వర్ణముఖి నదిలో.. ఆడిపాడుతూ..గంతులు వేయాలన్న నా కోరిక ..మా బుడమేరు వాగులో..ఆడి పాడి తురుగుతూ..తీర్చుకున్నాన్..లెండి. అలా నా కల వేరవేరి..అలా  ఆ చిత్రం పట్ల గొప్ప ఇమేజ్ ని..మిగిల్చింది.  శివయ్య పై భక్తి  భావనని పెంచింది.ఎంత భక్తి భావం అంటే..ఒడలు పులకిన్చెంత  భక్తి భావం.
అలాగే  ఈ  చిత్రం.. లో..అన్ని విలువలు.. ఇప్పటికి.. నాకు.. ఆశ్చర్యమే! "ముత్యాల ముగ్గు" చిత్రం కన్నా ఎందుకో..ఈ చిత్రం ఇష్టం నాకు. పాటలు  విషయంలో.. సంగీతం చాలా బాగుంటుంది. ఇక సాహిత్యం అయితే..చెప్పనవసరం లేదు.ఇలాటి పాటలు వింటూనే.. తెలుగు మాధుర్యంని.. సాహిత్యం పట్ల మమకారాన్ని పెంచుకున్నాను. కిరాతార్జునీయం అంటే.. ప్రాణం.. వేటూరి ..పద పదమున నటరాజు నర్తనమే..గోచరించెను.  

ఈ పాటలో..ఎంత సహజంగా ప్రకృతిలో.. ప్రకృతి-పురుషుడు,శివుడు-శక్తి ..కలిసిపోయినంత గొప్పగా..ఒక చక్కని అనిర్వచనీయ మైన అనుభూతిని..అందించే పాట.. చూడటం నాకు మైమరపు.మదిలో..ఓ.. మంచి..భావానికి..ఊపిరి పోస్తుంది.   మీరే చూడండీ....ఎంత బాగుంటుందో!  ఎంత గొప్పగా ఉంటుందో!  ఆరుద్ర కలం నుండి వెలువడిన ..పదం పదం ఆస్వాదించి.... సాహిత్యం తో పాటు... దృశ్యాలకి అభిమాని ని.. అయి ..ఆదినారాయణ రావు-సత్యం సంగీతం లో.. తేలియాడుతూ.. ఈ పాట మీతో పంచుకుంటున్నాను. 
   


పాట సాహిత్యం :

ఆకాశం దించాలా..  
నెలవంకా తుంచాలా  సిగలో ఉంచాలా (ఆ) 
చెక్కిలి నువ్వు నొక్కే టప్పటి  చక్కిలిగింతలు చాలు 

ఆకాశం నా నడుమూ.. నెలవంకా నానుదురు
సిగలో నువ్వేరా...

పట్టు  తేనె తెమ్మంటే చెట్టెక్కి  తేస్తానే .. తేస్తానే  
మిన్నాగు మణి నైనా పుట్టలోంచి తీస్తానే.. తీస్తానే 
ఆ.... పట్టు తేనె నీ కన్నాతియ్యంగా ఉంటుందా 
మిన్నాగు మణి కైనా  నీ ఇలువ వస్తుందా
అంతేనా అంతేనా..?.. 
అవును అంతే రా ..
ఆకాశం  అంచులలో భూదేవి కలిసేలా కౌగిట్లో  కరిగేరా (ఆ) 

సూరీడు ఎర్రదనం సింధూరం చేస్తానే.. చేస్తానే.. 
కరి మబ్బు నల్లదనం కాటుక దిద్దేనే ..  దిద్దేనే.. ..
ఆ.. వీవంటి వెచ్చదనం  నన్నేలే సూరీడు 
నీ కంటి చల్లదనం..   నా నీడ నా గూడూ.. 
అంతేనా అంతేనా..?
అవును అంతేరా ... 
మెరిసేటి చుక్కల్లో నెలవంక చుట్టాల తలంబ్రాలు  పోయ్యాలా..
గుండె లోన గువ్వలాగా కాపురం ఉంటె చాలు. (ఆ) 

ఈ పాట ని దృష్టిలో..ఉంచుకునే మహేష్ బాబు ఒక్కడు లో. . చందమామని తుంచి   కొప్పులో ఉంచాలా  వచ్చి ఉంటుంది..అని నవ్వుకుంటాను
ప్రియుని..అతిశయం  ప్రేయసి..మనసులోని..ప్రేమ ముందు విలువ ముందు దిగ దుడుపే కదా! !. పట్టు తేనె నీ కన్నా తీయంగా ఉంటుందా.?  మిన్నాగు మణి కైనా నీ విలువ వస్తుందా  ? నీ వంటి వెచ్చదనం నన్నేలే సూరీడు.నీ కంటి చల్లదనం నా నీడ  నాగూడు . ఇలాటివి ఎంత అర్ధవంతంగా ఉంటాయో!  ఇక పోతే ఈ చిత్ర నిర్మాణం .. శ్రీ కాళహస్తి చుట్టూరా  చిత్రీకరించలేదు. వట్టిసీమ,బుట్టాయిగూడెం.పరిసర ప్రాంతాలలో.. గోదావరి ఒడిలో..చిత్రీకరించారు. తర్వాత తర్వాత చూసి..సువర్ణముఖి అలా ఉండదని తెలిసి ఊసూరుమనిపించింది. అయినా..యే  నదీమ తల్లి ఒడి.. అయినా పచ్చదనాల,చల్లదనాల చిరునామా యే కదా! ఈ పాట లో..అదే చూడండీ!...
.

23, జులై 2011, శనివారం

అసుర సంధ్య వేళ


అమరజీవి చిత్రం ..గుర్తుందా? ఆ చిత్రంలో..ఓ..వింత ప్రేమ కథ. ఆసాంతం అపార్ధాలతో..నడచి..ఆఖరికి ప్రేమించిన ప్రేయసి భర్తకి.. తన కళ్ళని దానం చేసి అమరజీవిగా నిలిచిన..ఓ..ప్రియుని కథ. చిత్రం కన్నా పాటలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామీ "అనే పాట..నాకు బాగా నచ్చుతుంది. వేటూరి గారి .. సాహిత్యం ..చాలా ఇష్టంగా వింటాను.

ఈ పాట తరచూ కోరి మిగతా శ్రోతల వినబడని తిట్లు తింటూ ఉంటాను. ఎందుకంటే ఆరు నిమిషాల పైబడి ఉన్న పాటని ఆస్వాదించడం తెలియకుంటే..పరమ చిరాకు కల్గిస్తుంది. అర్ధమైన వారికి..ఒక రసస్వాదన.శ్రీవారికి ప్రేమలేఖ కన్నా ముందు వేటూరి గారి పద రచన .. ఓ..ప్రేమ లేఖ రూపంలో..ఈ పాట ముందు సాకీగా సాగుతుంది.

ఈ పాట ఒక వేదిక పై సాగుతూ..నాయికా నాయకుల ఊహా లోకంలో సాగుతున్నట్లు గుర్తు...ఉంది. ఒక వేళ ఏమైనా మార్పు ఉంటే.. తప్పని తప్పు సమాచారంకి..మన్నించ గలరు. . ఇక్కడ పాట నేపధ్యం కన్నా పాట సాహిత్యం,సంగీతం,భావం చెప్పదలచాను. ఈ పాట సాహిత్యం కూడా.. చాలా కష్టపడ్డా సేకరించలేక.. వింటూ..వ్రాసుకున్నాను. ఇది అంతా పాట పై మమకారమే! అదీ.. వేటూరి పాట పై..ప్రత్యేక మమకారం.

ఇక కథలో ..నాయకుడేమో.. విరాగి. ప్రేమ దోమ తెలియని సదాచార సన్యాసి. నాయిక ఏమో..అతని పై..ప్రేమ ని మక్కువగా పెంచుకుని సిగ్గు బిడియాలు విడిచి..అతనికి..తన ప్రేమని.మొహాన్ని,కోరికని..బాహాటంగా తెలియ జేస్తుంది. అతనేమో..కాదు పొమ్మంటాడు. తగదు..తగదు పాపం అంటాడు.
కావ్య లక్షణంతో..నాయికా నాయకుల మద్య జరిగిన ప్రేమ,శృంగార &వైరాగ్య భాషణంబులని.. పాటలో..చెప్పడం తెలుగు చిత్రాలలో..కొత్త కాకపోయినా.. ఈ పాట ఆసాంతం ఓ..కావ్యం చూస్తున్న భావాన్ని కల్గిస్తుంది అనడంలో ..సందేహం లేదు అనుకుంటాను.జంధ్యాల గారి దర్శకత్వంలో..ఈ చిత్రం రూపు దిద్దుకుంది. వేటూరి గారి కి..జంధ్యాల గారికి..ఆలోచనల సమతుల్యంలో..ఈ పాట..చూడ చక్కనిది. శ్రవణానంద కరమైనది కూడా.

పాట సాహిత్యం :

శ్రీ రంగనాధ చరణారవింద చారాణ చక్రవర్తి పుంభావ భక్తి ..
ముక్తికై మూడు పుండ్రాలు నుదుటున దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి,నీ అడుగుధమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..
నీ పూజల కు పువ్వుగా, జపములకు మాలగా, పులకించి పూమాలగా..
గళమునను, స్వరమునను, ఉరమునను
ఇహములకు, పరములకు నీదాన నే !.
ధన్యనై ,జీవనవ దాన్యనై తరియించుదాన..
మన్నించవే..!మన్నించవే!! అని విన్న మించు నీ ప్రియ సేవిక ..
దేవ దేవి. .

అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి..ఆడ ఉసురు తగల నీకు స్వామీ.! !
ముసురుకున్న మమతలతో..కొసరిన అపరాధమేమి ?
స్వామీ స్వామీ!
అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు దేవీ ..
స్వామీ ఉసురు తగలనీకు దేవీ..
మరులుకున్నకరిని వీడి మరలి ఈ నర జన్మ మేమి ..దేవి ..దేవీ!

హరి హరి సుర జేష్ట్యాదులు ,కౌశిక వ్యాసాదులు
ఇగ తత్వములను దెలిపి, నియమ నిష్టలకి అలసి
పూనిన శృంగార యోగం ఇది కాదని ..నను కాదని ..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ..పడకు పెడ దారి (అసుర )

నశ్వరమది..నాటక మిది
నాలుగు ఘడియల వెలుగిది..
కడలిని కలిసేవరకే... కావేరికి రూపు ఉన్నదీ
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుని ముంగిట రంగ వల్లికని కానీ..
దేవి..దేవీ..దేవ దేవీ!(అసుర)

అలిగే నట శ్రీ రంగం..తొలగే నట వైకుంటం
యాతన కేల దేహం ..ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము వీక్షణమే మరు తాహము
రంగా! రంగ రంగ శ్రీ రంగ !!
ఎటు ఓపను..ఎటులాపాను?
ఒకసారి.. అనుభవించు ఒడి చేరి..(అసుర)

ఎ పాటలో..జయ ప్రద గారు యెంత బాగా రొమాంటిక్ భావాలు ఒలికిన్చిందో.! అలాగే పాటలో.. సుశీల గారి..స్వరం ఎంత బాగా భావాలని అందించిందో.!! వినడమే తప్ప సంగీత జ్ఞానం లేని దాన్ని..వర్ణించలేను.
ఈ చిత్రం లో..మల్లెపూల మారాణికి బంతి పూల పారాణి,(జయప్రద)ఓదార్పు కన్న చల్లనిది.. (సుమలత) పాటలు..
చాలా బాగుంటాయి.ఇక ఏ.యెన్ .ఆర్ గారి నటనా చాతుర్యం ని.. చెప్పడానికి మాటలే చాలవు.

ఇక పాట వినేయండీ!! అసుర సంధ్య వేళ ఉసురు తగల నీకు స్వామి

ఈ పాటలో నాకు ఇష్టమైన అంశాలు.. జయ ప్రద గారి నటన, వేటూరి గారి సాహిత్యం .సుశీల గారి గళం .. అంతా మధురం.
ఒక అజ్ఞాత మిత్రునికి కృతజ్ఞతలు. తప్పులు గానేను అందించిన సాహిత్యాన్ని సవరించించి నందులకు. మరీ మరీ కృతజ్ఞతలు..తో..ఈ పోస్ట్

22, జులై 2011, శుక్రవారం

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు


ఈ రోజు దాశరధి గారి జయంతి..

దాశరధి గారి మొదటి కవితా సంపుటి "అగ్నిధార"

ఆధునికాంధ్ర సాహితీ చరిత్రలో.. దాశరధి గారిది ఒక ప్రత్యేక అధ్యాయం.ఆయన తెలంగాణలో పుట్టడం మూలంగా..భారత స్వాతంత్ర్య పోరాటంలో..ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం  లేకపోయిందని.. చెపుతారు.దాశరధి అటు భారతావని మొత్తం స్వాతంత్ర్య సమర శంఖం పూరిస్తుంటే.. తెలంగాణం లో..ఆ ప్రాంత విముక్తి కొరకు పోరాడవలసి వచ్చినదంటే ..నిజాం పరపీడన వల్ల ప్రజలు ఎన్ని ఇక్కట్ల పాల్బడ్డారో !

దాశరధి తెలుగు దేశంలో ఒక భాగమైన తెలంగాణా స్వాతంత్రోద్యమానికి శంఖం  పూరించారు. ఆ  ఉద్యమంలో పాల్గొని ఎన్నో కష్ట నష్టములకి  గురి అయ్యారు. జైల్లోను,ఉద్యమంలోను.. బాధతో..కవితావేశంలో.. ఆయన వేలువరించిన ఎన్నో కవితా ఖండికలను..మనం దృష్టిలోకి..తీసుకున్నా అందులో..ప్రధానమైనది.."అగ్నిధార"

తెలంగాణా విముక్తి పోరాటంలో తెలుగువారల సమరగీతం దాశరధి లో..ప్రస్పుటంగా కానవస్తుంది.ఆయన ప్రజా కవి. ప్రేక్షకుని వలె కాకుండా ప్రజల కష్టనష్టాలలో  ..తానోకడిగా కలసిపోయి ఉద్యమ వీరుడిగా "పెన్'' అనే ''గన్"  పట్టి..గళం అనే బుల్లెట్ లు వెలువరించి..ప్రజా శక్తులతో కలసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్య రంగంలో..దూకించారు.

నిజం పాలనలో విసిగి పోయిన తెలంగాణా ప్రజల  ఆవేశం,ఆకాంక్షలన్నీ..దాశరధి కవిత్వంలో..ప్రతిబింబించాయి..రజాకార్ల దుండగాలతో ..ఆస్తుల దోపిడీలతో..గృహదహనాలతో ,స్త్రీల మాన అపహరణ లతో.. మారణ దారుణ కాండ కి అట్టుడికి పోయిన కాలంలో.. దాశరధి ఆగ్రహావేశంతో..

ఓ..నిజాం పిశాచమా!కానరాడు 
నిన్ను బోలిన రాజు మా కెన్నడేని 
తీగెలని తెంపి ,అగ్నిలో దింపినావు 
నా తెలంగాణా కోటి రతనాల వీణ

తర తరాల స్వప్నాల సుందర ఫలమ్ము 
స్వైర భారత భూమి చూపెడెనో  లేదో
విషం గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజం నవాబు జన్మజన్మాలబూజు 

అచట పాపము దౌర్జన్య మావరించి  
తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి 
మత పిశాచం పేదల కుతుక నమిలి
ఉమ్మివేసెను పిప్పి లోకమ్ము మీద 

నా తెలంగాణా  కోటి రతనాల వీణ 
తీవియలు తెగి  విరిగి నదించ కుండే 
నా తెలుగు జాణ ప్రాణమానాలు దోచి
ఈ నిజం పిశాచి  కన్నెర్ర చేసే..

ఇలా.. సాగింది..అగ్నిధార . సమర గీతమై నిలిచింది.నిజాం ..ప్రభుత్వం ఊరుకుంటుందా ? ఇనుపగొలుసులతో  బంధించి ఓరుగల్లు నగర వీధుల్లో..నడిపించింది. నిజామాబాద్ సెంట్రల్ జైలులో నిర్భందించింది. అగ్ని ప్రజ్వరిల్ల కుండా ఆపడం ఎవరి తరం? విప్లవ కవిత్వాన్ని జైలు గోడల మీద శిలాక్షరాలుగా  లిఖించాడు..దాశరధి.
ఆయన ప్రభావంతో..ఎందరో..ఉద్యమంలోకి దుమికి పనిచేసారు. 
తెలంగాణా స్వాతంత్రోద్యమ కవిత ..దాశరధి గళంలో.. పద్య,కావ్య రూపాలలో సాగినా.. ప్రజలు మెచ్చినది..అగ్నిధార..మాత్రమే !

దాశరధి కి కన్నతల్లి అంటే యెంత ఇష్టమో..తెలంగాణ మంటే   అంత ఇష్టం..ఆమెని వేనోల్ కీర్తించి.. తన "రుద్రవీణ" ని ఆమెకి అంకితం  చేసాడు.    

చివరకు నిజాం ప్రభువు..హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో..విలీనం చేసిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత..సమైక్యంలోనే అర్ధం ఉందని తలచి.. సమైక్య భావనకి..నడుం బిగించి.. విశాలాంధ్ర సమైక్యత కోసం పద్యాలు వ్రాసారు. ..
తుంగభద్రానదీ భంగమ్ములిరుక్రేనా 
లోరసిపారుచు రుచు లరయు చుండ 
కృష్ణ వేణీ    తరంగిణీ నాలుకలుచాచి 
దారుల రెండిట "మజా"లరయుచుండ
గోదావరీ వీచికా దివ్యహస్త మ్ము 
లిరుకేలన్కుల మన్ను తరచు చుండ 
కోటి   కిన్నెరసాని మాటి మాటికి పొంగి 
రెండు వైపులా దరు లోడంగోనగా 

ఇటునటును తెల్గు  నేల లారటంనోంది
కలసి పోబో జూచున్న యట్టులనే దోచు 
కలిమివేయుము న తెలంగాణ తల్లి 
మూడుకోట్లునోక్కనే ముడి బిగించి ..

నా కోర్కె దీర్చుమమ్మా! 
నీవు మదీయశ్రు కణ  వినిర్మితమాలా 
నీక మ్ము సమర్పించెద 
గాక ,విశాలాంద్ర మనేడి కల నిజమగుతన్ .. అని నదుల నిలా సమైక్య సూత్రంగా వాడారు. 
ఇలా  ప్రాంతం కొరకు,విశాలాంద్రం  కొరకు....ఆయన కలం నర్థించినది.
పునర్నవం,ఆలోచనాలోచనాలు,తిమిరంలో సమరం.. ఇలా కావ్య సృష్టి సాగింది. 

ఎవడైనా మానవుడే-ఎందుకు ద్వేషించడాలు? రాక్షసి నైనా మైత్రికి రానిత్తును భయం లేదు!

హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభించదు -ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచించదు 

గతాన్ని కాదనలేను ,వర్తమానం వద్దనబోను ,భవిష్యత్ ఒదులుకోను ..కలం నా కంట మాల .. నా పేరు ప్రజా కోటి -నా వూరు  ప్రజా వాటి ..అంటారు. 

బాంబులలో బలం చచ్చి -పాములలో విషం చచ్చి 
ప్రేమములో బలం హెచ్చి -స్నేహంలో  శక్తి హెచ్చి
చిన్న పాటి అంకుశామున-గున్న ఏనుగును వంచే 
కొత్తరకం పడ్డాయి కనుగోన్నాను రండో !..అంటూ.. ఆయన పథం ని మనకి చూపారు. 

తిమిరంతో ఘన సమరం -జరిపిన బ్రతుకే అమరం 
కవితా తేజోవలయం-అవని శాంతికి అది నిలయం ..అని చెప్పారు. సందర్భాలు వేరువేరుల్లో.  

కమ్మని నా తెలంగాణ ..తొమ్మిది జిల్లాలేనా ? 
బహు లాంధ్రకు తెలంగాణ పర్యాయ పదం కాదా....అన్నారు. వేర్పాటు వాదాలు ని ఆయన మందలించారు. 

ఒక్క తెలుగు -ఒక్క  వెలుగు..అని నినదించారు. 

తల్లీ!నిను ముక్కలోనరించ దలచు వారి 
ఆశ అది ఆశలైయున్న అవసరాన 
నీ పదమ్ము ల్ల  పై తల మోపి నేడు 
చించు చుంటి ఆనందాశ్రు బిన్దువులును.. 
.
నవంబర్ ఒకటి..మనమంతా ఒకటి ..

సూర్య చంద్రులున్నంత వరకు తెలుగు జాతి ఏక సూత్రం పై నిలవాలని ఆయన  ఆకాంక్ష. 

కుడి కంటిని  ఎడమ కన్ను పొడిచేనా ?
కుడి చేతిని ఎడమ చేయి నరికేనా ? 
ఒక దేహం-ఒక గేహం మరిచావా ?
ఒక్క తెలుగు ఒక్క వెలుగు మరిచావా? 

విడిపోవుట -చెడిపోవుట 
విడిపోవుట -పడిపోవుట 
కలసియుంట గెలుచుకుంట 
తెలుగు విలువ తెలుసుకునుట ! 
గుండెను రెండుగా చీల్చు మొండితనం పనికి రాదు
మనుషులని ఏకం చేసే మంచితనం కావాలి.... 
ఇది.. ఆయన భావన. 

ఈనాటి స్వార్ద కుటిల రాజకీయ నాయకుల  పన్నాగాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా  రుద్ది.. ప్రాంతాల  పేరిట.వెనకబాటు తనం పేరిట వేరు కుంపట్లు పెట్టి  విధ్వంసాలు సృష్టించే.. నాయకులు.. ఆంద్ర ప్రాంతం వారిని నిజాం ప్రభువులతో పోల్చి.. తెలంగాణ వాదంతో..అవమాన పరస్తున్నారు. అసలు  తెలంగాణ ప్రజల వెనకబాటుతనం ఎందుకు ఉందో.. ఆలోచిస్తూ.. ప్రజల కవి.. వాస్తవ దృక్పధం కల్గిన సమరశీలి దాశరధి..ని ఒకసరి  పరికించి చూస్తే.. తెలుగు వారిగా వారు ఏం కోరుకున్నారో అర్ధం అవుతుంది.తెలుగు దేశాన్ని..ఇంతగా ప్రేమించిన కవి దార్శకనీయత..ఏమిటో..అర్ధం కావాలని..ఒక చిన్ని ఆశతో.. ఈ..వ్యాసం.  
ఆకాశవాణి విజయవాడ "ఏ" కేంద్రంలో  (2004 జూలై ఇరవైరెండు  న) సాహితీ కార్యక్రమంలో.. ప్రసారం  అయిన ..  నా  ప్రసంగ వ్యాసాన్ని కుదించి..ఈ పోస్ట్.. 

దాశరధి ప్రస్థానం -ఓ వెలుతురు బాకు. ఆ బాకు  అజ్ఞాన తిమిరాన్ని..చీల్చి చెండాడాలని.. .. ముకుళిత హస్తములతో..నా అభిమాన కవి..కి..పాదాభి వందనాలతో.. 

20, జులై 2011, బుధవారం

వేయివేణువులు మ్రోగేవేళ..





   వేయివేణువులు మ్రోగేవేళ సాహిత్యం..క్రింద..

వేయి వేణువు మ్రోగేవేళ 
హాయి వెల్లువై పొంగేవేళ  
రాసక్రీడలో చేరేవేళ
రాదమ్మని లాలించేవేళ

నను పాలించగ నడచివచ్చితివా..
మొరనాలింపగా తరలి వచ్చితివా..గోపాలా..(నను) 

అరచెదిరిన తిలకముతో అదిగదిగో రాధమ్మ
అరజారిన పయ్యదతో  అదిగదిగొ గోపెమ్మ
ఎరుపెక్కిన కన్నులతో  ఇదిగిదిగో సత్యభామ
పొద పొదలొ ఎద ఎదలొ 
నీ కొరకై వెదుకుతు ఉండగ(నను)  

కంసుని చెరసాలలొ ఖైదీగా పుట్టావు  
కాంతల కౌగిళ్ళలో ఖైదీగా పెరిగావు 
కరకురాతి గుళ్ళలో ఖైదీగా నిలిచావు  
ఈ భక్తుని గుండె లో ఖైదీగా ఉండాలని (నను)


ఎంత చక్కని పాట. నాకైతే ఎంతో ఇష్టమైన పాట.వనమాలి పాటేదైనా అందునా..వేణువు ఎన్నిమార్లు విన్నా తనివితీరదు. "మామ" స్వరకల్పనలో వేణువు రాతిలో కూడా రాగాలు పలికిస్తుంది.   ఇక సాహిత్యం విషయంకి వస్తే ఆయన రాముడి పేరుని ఇంటి పేరులో కృష్ణుడిని పేరులోను సమన్వయపరచుకున్న దాశరధి కృష్ణమాచార్యులు.దాశరధి గా ప్రతీక.

ఇంతటి భక్తిరసంలో..ముంచెత్తుతూ ఆ సాహిత్యపు సొంపులు చూడండీ!!మధురాతిమధురం. సాహిత్యంలో వారి ముద్రని మరొకసారి చెప్పుకుందాం.

ఆ వనమాలికి భక్తులన్న అలవిమాలిన అనురాగం. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం తాండవిస్తుంది.అందుకేనెమో..అసలే దక్షిణ నాయకుడు.అష్ట భార్యలున్నవాడు.ఆ పై పదహారువేల గోపెమ్మలు.అయినా ఆయన అందరిని సంతోషంగా ఉంచగల్గాడు. ఎందుకంటే నిజంగా ఆయన రెపల్లె లోనో, బృందావనిలోనో ఉండడు.ఆయన నివాసం భక్తుల హృదయాలు. పిలవగానే వడి వడిగా పరుగు పరుగున వాలిపోతాడు.వారిని పాలిస్తాడు..మొరలాలకిస్తాడు. తనని ఆరాదించే భక్తులకి బందీగా ఉంటాడు. అది వనమాలి భక్తులకి..ఇచ్చిన వరం. అదే సంగతిని..బహు సుందరంగా వ్రాసారు..ఆ కవి. నిజంగా ఆ నల్లనయ్య ఆ సాహిత్యానికి, ఆ..మధుర గానానికి..పరుగు పరుగున రాకపోడా అనేంత గొప్పగా ఉంధి సాహిత్యం.
వేణువు ఒకటి మ్రోగితేనే మది ఊగుతుంది.తూగుతుంది. అలాటి వేయి వేణువులు మ్రోగేవెళ ఎంతగానొ ప్రేమించే రాధమ్మని చేరి రాసక్రీడలో..మునిగే వేళ ఆపదలో ఉన్న భక్తుడు పిలవగానే.. ఉన్నపళాన ఆ నల్లన్నయ్య పరుగు పరుగున భక్తుల కడకు వచ్చెస్తే.. 

ఆయనంతే భక్తులని యెప్పుడు పాలించడానికి ..లాలించడానికి.. కనికరించడానికి..సిద్దంగా..ఉండగలడు . కానీ ఆయన దేవేరిలకి కోపం రాదు? మంచిసమయము..భార్యని వదిలేసి వెళ్ళిపోతే?ఇక వారి అవస్తలు..ఇలా..ఉంటాయని చెప్పడం ఒక శౄంగార కావ్యం కూడా..రసమయ జగత్తులో ఉండగా ఆ నల్లనయ్య ఆమెని విడిచి వెళ్ళగా మొహంతో..శయ్యం పై ఆ రాదమ్మ పొరిలి పొరిలి సగం చెరిగిన కుంకుమతో...ఊర్పులు విడుస్తుందని..

ఆ గొపెమ్మ ఏమో..కొరికతొ సగం జారిన పయ్యదతో..కలియచుడుతుందని, ఇక సత్యభామ తనని వొదలి వెళ్ళాడన్న కొపంతోను..వాంచ వల్ల ఎర్రగా మారిన కన్నులతో పొద పొదలోను ఆచూకి కోసం ఎద ఎద లోను వెదుకుతూ ఉంటె..నన్ను పాలి0చగా నువ్వు వచ్చావా గొపాలా!? అని ఆయనని ఆర్ధ్రంగా,ముకుళితమైన మనసుతో..కీర్తిస్తున్నాడు..ఆ భక్తుడు.

చెరసాలలో ఖైదీగా పుట్టి ఇంతుల కౌగిళ్ళలో..ఖైదీగా పెరిగి (అందరు ఆయనని ప్రేమించే వారే..కదా?) కరకు అయిన నల్ల రాతి గుళ్ళలొ ఖైదీగా మారినా (ఆయనని రాతి గుళ్ళల్లో మనమే ఖైదీగా మార్చాము. ఆయన నిజంగా భక్తుల హృదయాలలోనే ఉంటాడని చెబుతారు.)ఈ భక్తుని గుండెళో ఖైదీ కావాలని కొరుకుంటాడు. ఎంత ఆశొ! చూడండీ! అది అపారమైన భక్తికి..చిహ్నం.  
ఎంత చక్కని భావం. ఎన్ని సార్లు విన్నా..మళ్ళీ వినాలనిపించే పాట.ఈ చిత్రంలో శొభన్ బాబు గారు కృష్ణుడిగా ఎంత సుందర రూపమో! ఎ.ఎన్నార్ ఆహార్యం అంత చక్కనిదే !.అందుకే పదికాలాలు నిలిచే పాట. మీరు చూసి విని ఆస్వాదనలో మునిగి తేలాలని బుద్దిమంతుడు చిత్రంలో.. ఈ పాట పరిచయం. వేయి  వేణువులు  

మ్రోగే  వేళ   ఇక్కడ వినండీ!

12, జులై 2011, మంగళవారం

కొన్ని వాస్తవాలు - జీర్ణించుకోలేనివి

ఒక మిత్రుడు పంపిన మంచి విషయం. వేయి ఆలోచనా శతఘ్నులు బ్రద్దలి బాధావేసాలు ముప్పిరిగొని..ఈవిషయం పంచుకొవడం.మీరు ఆలొచించండి. సౌజన్యం WWW.TeluguColours.com

ఆడపిల్లలకు మొబైల్ ఫోన్లు నిషేధం
ఒకపక్క ఆధునిక కాలం పరుగులు తీస్తుంటే,మరోపక్క కుల సంప్రదాయాలు మనుషుల్ని వెనక్కినెట్టడానికి యత్నిస్తున్నాయి. ఒరిస్సాలో పైకలి ఖండయత్ అనే కులం ఒకటి ఉంది. ఆ కుల పెద్దలు ఈ మధ్య ఒక ఫర్మాన జారీచేశారు. దాని ప్రకారం ఆ కులానికి చెందిన పెళ్లికాని యువతులు ఎవరూ మొబైల్ ఫోన్లు వాడరాదు. ఈ ఆంక్షలు ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉంటే పిల్లలు ప్రేమ అనో, ఇంకొకటనో ,ఇతరులతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుందని చెప్పి మొబైల్ ఫోన్స్ పెళ్లికాని పిల్లలు వాడరాదని నిషేధించామని ఆ కుల సంఘం నేతలు చెబుతున్నారు. ఈ విషయమై ఆ కులంలో ఉన్న తల్లిదండ్రులందరికి కూడా విజ్ఞప్తి కూడా పంపారట.పెళ్లికాని పిల్లలు అర్జెంటుగా మొబైల్ ఫోన్ వాడవలసిన అవసరం లేదని కులపెద్దలు భావించారని కుల సంఘం నేత సోమనాద్ నాయక్ చెప్పారు. అనేక విద్యా సంస్థలు మొబైల్ ఫోన్స్ ను తమ ఆవరణలో వాడడాన్ని నిషేదించినప్పుడు తాము కూడా ఈ పనిచేస్తే తప్పేముందని ఆయన ప్రశ్నిస్తున్నారు.ఒడిషాలోని గంజాం జిల్లాలో పైకలి కుటుంబాలు పదివేల వరకు ఉంటాయి.అయితే తమ ఫత్వాను ఉల్లంఘించేవారికి ఎలాంటి శిక్షలు వేయాలన్నది ఇంకా నిర్ణయించలేదు.ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేస్తున్నామని ఇంకా శిక్షల గురించి ఆలోచించలేదని చెబుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ కులం లో పిల్లలంతా పదో తరగతి వరకైనా చదువుకోవాలని కూడా ఈ కుల సఃగం కోరుతోంది.మరి చదువును ప్రోత్సహిస్తూ, అభ్యుదయంలో ఉన్నారనుకోవాలో, లేక మొబైల్ వాడకంపై నిషేదం పెట్టి తిరోగమనంలో ఉన్నారనుకోవాలో!ఈ ప్రమాణాల తంతులో అసలు సత్యం తేలకపోతే వాతల కోర్టుకు వెళతారేమో!

11, జులై 2011, సోమవారం

ప్రకటనల హోరు ..అందమైన రంగుల ప్యాకింగ్ వల

ఒరేయ్!మా ఆవిడ జుట్టు చూస్తే భయము వేస్తున్నది రా! అన్నాడు తన స్నేహితుడితో ఒకతను. "అదేమిటిరా.. అ జుత్తు చూసే కదా ముచ్చ్హట పడి మనువాడావ్?" అన్నాడు స్నేహితుడు.

అధి ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడ వార్నియర్ అనే షామ్పు వాడుతుంది . సరసంలో యెప్పుడైనా జడ నా మెడకి చుట్టుకుందా !? నా మెడకి ఉరి అవుతుందని భయం  అన్నాడు.  

జుట్టుకొసలు పట్టి అమాంతం  లారీని లాగుతుంటే  భయం  వేయదా చెప్పండి  మరి.?
పాపం  అమాయకుడు అనుకున్నాడతని  స్నేహితుడు.


మామయ్య గారు! మీ అమ్మాయి రొజు వంట మాడ్చి మసి చేస్తుంది.అందం తప్ప ఏమి లేని మీ అమ్మాయి నాకొద్దు  తీసుకుపోండి అన్నాడు అల్లుడు కోపంగా.. 

బాబ్బాబు..చచ్చి నీకడుపున పుడతాను జీవితాంతం సరిపడ ఓడోనిల్ ఖర్చు భరించుకుంటాను కాదనకు .బాబు అని బతిమలాడుకుంటున్నాడు మామగారు.

ఆడపిల్ల్లకి పని పాట రాకపోయినా ఇప్పుడు యెంత సౌలభ్యమో కదా?


ప్రత్యాన్మయాలు వెతుక్కోనక్కర లేకుండా..మార్కెట్  లో మన కోసం బొలెడు యేర్పాట్లని చేసేసి పెట్టెసిన వారికి..ఎప్పటికి రుణపడి ఉంటాము కదా!


ఒక లైవ్ ప్రోగ్రాం లో.. ఒక బ్యూటిషియన్ ని ఒక కాలర్ అడుగుతుంది.ఇలా.."మేడం!నేను ఒక సోప్ వాడుతున్నాను. ప్రపంచం అంతా మీ చుట్టు అంటారు కానీ మా పక్కింటి ముసలాయన కూడా నా వైపు కన్నేత్తి చూడటం లేదు.ఏం చేయాలి చెప్పండి.? అంటుంది. 


ఉద్యోగానికి వెళ్ళే ఓ ఆధునిక అమ్మ ఓ.. కొబ్బరి నూనె ఉంటే చాలు అంతా తనే చూసుకుంటుంది అంటుంది.ఇక పిల్లలకి సంరక్షణ కోసం అమ్మలు అవసరం లేదు అన్నమాట.కొన్ని వస్తువులు ఉంటే చాలు.


ఓ పరిమళం సొకితే చాలు.ఓ అమ్మాయి వెంట అబ్బాయిలు..పదికి తక్కువ కాకుండా వెంట బడతారు. కస్తూరి మౄగం వెంట ఆడ జింకలు పడినట్లు.వావి వరుస లేకుండా ఉచ్చనీచాలు మరచి పరుగుతీయడంని మనం కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం.


ఇప్పుడు తేలిసి ఉంటుంది..నేను ఏం చెపుతున్నానో.


వార్తలు తర్వాత నేను ఎక్కువగా చూసేది..నన్ను ఆకర్షించేవి.. ప్రకటనలే!


ప్రకటనలని నేను చాలా ..శ్రద్దగా చూస్థూఉంటాను.కొన్ని ప్రకటనలు..చాలా ఆసక్తికరంగా ఉంటాయి.



మనం నిత్యం చూస్తున్న వ్యాపార ప్రకటనల్లొ ఉన్న అసత్య ప్రేలాపనలని చూడండీ!

ఒక అమ్మాయి శరీరపు కాంతి ముందు బంగారం కూడా దిగదుడుపే అంట. అంటే బంగారం విలువ సబ్బు ధరకి పడిపొతుందా ఏమిటి? అలా ఉన్నా బాగుండును.. బొలెడంత బంగారం కొనే బదులు అమ్మాయికి సబ్బులే జీవితాంతం కొని ఇవ్వడం తేలిక అనుకుంది..అమాయకురాలైన ఓ..తల్లి.


వినియోగదారుణ్ణి అందమైన అసంబద్దమైన ప్రకటనల వలవేసి మోసగించడం అనేది.. వ్యాపార సంస్థలకి వెన్నతో పెట్టిన విద్య అయిపోయింది. ప్రకటనల మాయాజాలంలో వినియోగదారుడు నిత్యం మోసపోతూనే ఉన్నాడు. 


రూపాయి విలువ చేసే షాంపు సాచే కి..సరాసరి కోట్ల రూపాయలు ప్రకటనలకి వెచ్చించి అమ్మకాలు పెంచుకుని నాణ్యతా ప్రమాణాలు తగ్గించి..అందులొ లాభాలు దండుకుంటున్నారు.


ఏ వస్తువుకైన గుండు సూది మొదలుకుని విమాన సంస్థ వరకు అన్నింటికి ప్రచారం అవసరం అయిన రొజులు ఇవి.
వ్యాపర ప్రకటన్ల లో కూడా సౄజనాత్మకత ఉన్న ప్రకటనలు ఉన్నాయి. మరీ అతిశయోక్తంగా ఉన్న ప్రకటనలు చూస్తే విసుగు పుట్టి అసలు ఆ వస్తువులె కొనడం మానేస్తారని తెలియక ఒకరిని చూసి ఇంకొకరు హోరాహోరీగ చానల్స్ పుణ్యమా అని చూసే కళ్ళకి కనికట్టు కడుతున్నారు.


ఒక ప్రకటన ప్రభావం వీక్షకులపై చాలా ప్రభావం చూపుతుంది.షాపింగ్ కి వెల్లినప్పుడు అవసరం ఉన్నా లేకపొయినా అనాలోచితంగా..కొనుక్కుని ఆనక తీరిగ్గా కూర్చుని..దిగులు పడే సందర్భాలు ఉంటాయి.చాలా సైలెంట్గా కొన్ని ప్రకటనలు మనపై ప్రభావం చూపదం వల్ల.. మనం ఆ బ్రాండ్ తప్ప ఇంకేది కొనడానికి ఇష్టపుట్టనంతగా .. నియంత్రించబడతాము.

కొన్ని సెకనల కాలంలో.. ప్రకటనలు వాటి పని అవి చేసుకుని వెళ్ళిపొతాయి.ఓకొసారి ఏది కొనాలో తెలియని అయోమయంతో సతమతమవుతు ఉంటాము. 

హెల్థ్ కేర్ పేరిట,శరీర సంరక్షణ పెరిట మద్య తరగతి ప్రజల జీవన విదానం పై.. ప్రభావం చూపుతూ..ఆర్దికంగా కుదేలు చేస్తున్నాయి.వస్తువుల ధర పెంచాలనుకున్నప్పుడల్లా.. ఒక ఉచిత బహుమతిని అంటగట్టి వస్తువు రేటు పెంచేసి తర్వాత వస్తువు రేటుని పిక్స్డ్ చేసి వినియోదారులని. నిలువునా ముంచేయడం మోసగించడం వ్యాపార సంస్తలు చెస్తున్న పని. యెవరి వల్ల అయితే సంస్తలు మనుగడ సాగిస్తున్నాయో ఆ వినియోగదారుణ్ణి మోసగించడానికి..క్షణ క్షణం ఆలోచిస్తూ ఉంటాయి సంస్థలు. వ్యాపార ప్రకటనలలో సౄజనాత్మకత ఉంటే చాలదు వస్తువు నాణ్యత,విశ్వసనీయత కూడ అవసరం అప్పుడే ప్రకటన ధీర్ఘ కాలం ప్రభావం ఉంటుందనేది జగమెరిగిన సత్యం.


అందమైన రంగుల ప్యాకింగ్ వల లో చిక్కుకున్న వినియోగదారులు నిత్యావసర వస్తువుల కొనుగోలులో..ధరల పెరుగుదలలో తడిచి బతుకు భారమై అత్తెసరు జీవనం సాగుస్తుంటే వందల కొట్ల లాభాలతో..బహుళ అంతస్తుల భవనాలలో నివసిస్తూ ప్రపంచ ధనవంతుల జాబితాలొ చేరి మనకు గర్వకారణం అవుతున్నారు.

ప్రకటనల కోసం ఇప్పుడు అన్ని చోట్లు అనుకూలమే! నాలుగు రోడ్ల కూడలి మొదలుకుని.విమానంల సీట్ల పైన కూడా ప్రకటనల మయమే!


ప్రతిది ఎగ్జిబిషనైజ్ ఐపోయింది.వస్తువినియోగంలో వస్తువ్యామోహంలో అనుబందాలు కూడా పలచనబడిపోతున్నాయి.మెటీరీలిస్టులుగా మారిపోతున్నారు. వస్తు వ్యామోహంలొ..ఇంట్లో అనవసరమైన చెత్త కూడా పేరుకుపోతుంది.


కాలక్షేపపు షాపింగ్ చేసే వారికైతే పర్లేదు కానీ..సామాన్య ప్రజానికం కి..ప్రకటనల ప్రభావం వల్ల చాలా నష్టం.ఒకటికి పదిసార్లు ఆలొచి0చుకుని నాణ్యత చూసుకుని కొనుక్కోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మనశ్శాంతి మిగులుతుంది.


ఇప్పుడైతే మొబైల్ కి మించిన ప్రకటనా స్థలం లేదు వివిద వ్యాపర సంస్థలకి మన నంబర్లని అమ్ముకుని సొమ్ము చేసుకొవడం దగ్గర నుండి మన సహన్న్ని పరిక్షిస్తూ నిత్యం ఎన్నో ప్రకటనలు. తల తీసుకు వెళ్ళి రోట్లో పెట్టినట్లే!


ఏమంటారు? మీరు ప్రకటనల మోజులొ పడకండి. మీ అనుభవాలు పంచుకోండి.


ఆన్ లైన్ షాపింగ్ల లోను.. చాలా మోసాలు.ఇక చానల్స్ లోనైతే గంటల తరబడి ప్రకటనల మయం.బలహీనతల మీద సొమ్ము చేసుకుంటూ. జాతి రాళ్ళు,దిష్టి యంత్రాలు, సురక్షా కవచాలు,ఆయుర్వేద మందులు..కావేవి ప్రకటనలకి అనర్హం. ఇలాటి వాటి బారిన పడకుండా ప్రకటనలని చూసి నవ్వుకుందాం. సరేనా?

10, జులై 2011, ఆదివారం

తాతలు నేతులు మా మూతులు వాసన






నేటి యువత జీవనవిధానం చాలా వేగవంతమైనది.విలాసవంతమైనది ప్రమాదకరమైనది. కొంచమైనా మానసికవికాసం లేక చదువుల ఒత్తిడిలో పడి వాళ్ళు కోరుకున్న దాని కోసమో తల్లిదండ్రులుకివ్వాల్సిన దాని కోసమో విపరీతంగా కష్టపడేవారు ఒకరకమయితే ఇక రెండవవర్గం వారు అటు చదువుసంధ్యలు లేక కుటుంబపరమైన బాధ్యతలు లేక వౄత్తివ్యాపారాలు నిర్వహించే శక్తిసామర్ద్యాలు కొరవై బద్దకస్తుల్లా సోమరితనంగా తయారవుతున్నారు.

పూర్వం వ్యవసాయదారుల కుటుంబాలలొ నలుగురైదుగురు పిల్లలుంటే ఒకరిద్దరిని చదివించి మిగతావారిని వృత్తిలో ఉంచేవారు.మునుపటి తరంలోనే కులవృత్తులకి ఉద్వాసన చెప్పాక ఇక ఇప్పటి తరంలో కులంపేరు చెప్పుకోవడం ఒకింత గొప్పఅయినాక కుల వృత్తులని చేపట్టడం నామోషి అయినాక ఎవరు ఎవరో ఎవరికి తెలియనవసరంలేదు.

ఒకప్పుడు పదెకరాల పొలంఉన్న రైతు ఎంతో కష్టపడితే కానీ సంసారం ఈదడం సాధ్యమయ్యేది. ఇప్పుడు అందులొ పదోవంతు ఉంటే చాలు..హయిగా..దర్జాగా బతికేస్తున్నారు. భూముల ధరలకి రెక్కలొచ్చాక నగరాల చుట్టు ఉన్న చిన్నఫాటి రైతుల పరిస్తితి కూడా యెంతో బాగుంది. ఒక పది సెంట్లు అమ్ముకోవడం ఆడబ్బు అయిపోయేదాకా విలాసవంతంగా బ్రతికేయడం ఆ డబ్బు అయ్యేలోపు మిగిలున్నభూమి నాలుగురెట్ల ధర పలకడం.. మళ్ళీ అమ్ముకుని తినడం పరిపాటి అయిపోయింది.పనీపాటా లేక చోటా మోటా రాజకీయ నాయకులుగా యెదగడం అదిఇధి కాకపోతే రియల్ ఎస్టెట్ బిజినెస్ అనిచెప్పుకోవడం పరిపాటి అయిపోయింది.

పూర్వీకులు సంపాదించిన ఆస్తులని అమ్ముకుంటూ సొమరితనంతో,జల్సాగా విలాసవంతంగా బ్రతకడానికి అలవాటుపడ్డ "లంఫెన్" వర్గపు యువత ఉండటం సర్వ సాదారణం అయిపొయింధి.నగరీకరణవల్ల వచ్చిన ముప్పు ఇది.నాకైతే ఇలాటి యువతని చూస్తున్నామేమిటని చాలా బాధ కల్గుతుంది.

ఒక వైపు డాలర్ల వైపు పరుగులు తీస్తున్న యువత,ఇంకొకవైపు పనిపాటా లేక సొమరితనంతో, విలాసవంతంగా బ్రతికే యువత, ఇంకొకవైపు నిరక్షరాస్యతతో పేదరికంలొ నలిగిపొతున్న యువత వీరందరిమధ్య దేశభవితా నీ భవిత ఎటువైపు?
"తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండీ" అనే యువత మన ముందు ఉంటారేమో!

9, జులై 2011, శనివారం

కలలు కనేందుకు.. కరిగి పోయేందుకు..



అందరికి ఏమో కానీ..నాకు  రోజు ఓ..పాట గురిచి మాట్లాడకపోతే.. ఏదో..వెలితి.. ఈ రోజు అయితే .. 
తెలవారు వేళ కనుమూత పడక  కను ముందు నీ రూపు కనిపించి పోగా.. 
అంటూ.. ఓ..రూపం ఏమి కనబడలేదు కానీ..  ఓ..పాట టక్కున గుర్తుకు వచ్చింది. ఈ మద్య.. ఘోస్ట్ రైటర్స్ ని     పెట్టుకోకుండా  స్వయంగా..వ్రాసుకున్నారు  అని మన బ్లాగ్ లలో.. మధన పడిపోయినప్పుడు  ..ఈ పాట గుర్తుకు వచ్చింది.

ఎందుకంటే  ఈ..పాట నాకు   చాలా ఇష్టం.ఈ పాటకి లిరిక్స్  దాసరి గారు అందించారని..ఉంటుంది. అవునా అని తెగ ఆశ్చర్య పడిపోయే దాన్ని. ఏక కాలంలో..మనుషులు ఎలా..ఇంత గొప్పగా వ్రాయడం..ఇంకా ఏవేవో..చేయడం అని.  నిజాలు కొన్నాళ్ళకి తెలిసిపోయాయి లెండి. బావిలో..కప్పల్లా  ఎప్పుడు ఉండం కదా..! ఈ పాట.."జయసుధ" చిత్రం లో పాట.  జయచంద్రన్..సుశీలమ్మ  కలసి పాడారు. నా ఫేవరేట్ సాంగ్ ఇది.

ఈ సినిమా వచ్చిన కొత్తల్లో కలలు కానీ..కలల్లో  ..రూపాలు..కనిపించే వయసు ఉండేది కాదు కనుక  ఒక వేళ కలలు వచ్చినా.. అబ్బాయిలు వచ్చే వారు కాదు బతికి పోయాను. లేకపోతే  ..నీకు జయసుధ  పిచ్చి,పాటల  పిచ్చి పట్టి  చదువుకోకుండా  .. ఏమిటి అని..మా అమ్మ .. మజ్జిగ కవ్వం తో..కొట్టి ఉండేది.

జయసుధ అంటే పడి చచ్చే దాన్ని కాదు కానీ  ..జయ సుధ గార్ని బాగా దగ్గరగా.. చూసి..ఆవిడ ఆటోగ్రాఫ్  తీసుకుని.. మురిసిపోయాను. ఆవిడ ఓ..సంతకం నాకు ఇచ్చేసి.. పెన్ అక్కడ పడేసి వెంటనే.. సింక్ లో చెయ్యి కడుక్కోవడం..ఇంకా గుర్తు ఉంది నాకు. ఆవిడ   జీవితంలో..ఆ.. ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఊరు..తో ఉన్న సంబంధం ఏమిటో..చెప్పి..ఆమెని చిన్నబరచలేను. కానీ.. అ ఊరు.. నేను..పుట్టినవూరు.  జయ సుధ గారి పై  ..నాకు బోలెడు అభిమానం.(ఇప్పుడు తగ్గిపోయింది లెండి.)  

పాట చెప్పకుండా.. ఏమిటో..ఏదో  ..చేపుతున్నానా? కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని..నాలాటి వాళ్ళని చూసే.. నానుడిగా, వాడుకగా..మారి ఉంటుంది లెండి. నన్ను  ఎవరు అనుకున్న అనుకోక పోయినా..నన్ను నేనే అనుకుని.. నేను యెంత బోల్దో..అనుకోవడం..నా వీపు నేనే తట్టుకుని ప్రోత్శాహించుకోవడం అలవాటు అయిపోయింది. నేను ఇప్పుడు ఎక్కడ  ఉన్నాను అనుకున్నారేమిటి..? బ్లాగ్ లోకంలో.. చాలా నేర్చుకోవచ్చని ఆరు నెలల్లో..తెలిసిపోయిందోచ్!  ఐ యమ్ లక్కీ...కదండీ..?.   

కనురెప్ప పాడింది కను సైగ పాట కనుసైగ పాట. 

తెలవారు వేళ కనుమూత పడగా కనుముందు నీ రూపు కదలాడిపోగా.. ఆ  కనులెందుకు.. ఆ కనులెందుకు  .. కలలు కనేందుకు.. కరిగి పోయేందుకు..     .


వినెయండీ!పాట చాలా బాగుంటుంధి.పాట సాహిత్యానికి.. సినిమాలొ పాట చిత్రీకరణకి పొంతనె ఉండదు.పాట విని విని.. సినిమాని చాలా ఇష్తంగా చూస్తే పరమ చెత్తగా ఉంది అని తెగ బాధ పడిపొయాను.ఏం చెస్తాం?చెవులు మనవే కళ్ళు మనవే అనుకుని..ఫాట పై..అభిమానం అలాగె ఉంచేసుకుని మీ అందరికి..ఈ పరిచయం.kanureppa paadindhi kanusaiga paata

తెల్లారింది.. లేగండో..సిరివెన్నెల సాహిత్యం,గళం




తెల్లారింది  లేగండో ..

పాట  సాహిత్యం :

తెల్లారింది.. లేగండో .. కొక్కొరో కో..
మంచాలింక  దిగండో..కొక్కొరో కో..
పాములాంటి చీకటి  పడగ  దించి పోయింది
భయం లేదు   ఒయం లేదు నిదుర ముసుగు తీయండి.
చావులాటి  సీకటి  చూరు దాటి పోయింది
.భయం లేదు ఒయం లేదు చాపలు చుట్టేయండి.
ముడుసుకున్న రెక్కలిప్పి పిట్ట  చెట్టు ఇడిసింది
మూసుకున్న రెక్క లిరిసి  చూపులెగారనీయండి... (తెల్లారింది)

చురుకు తగ్గిపోయింది చందురుడి కంటికి
చులకనై పోయింది లోకం చీకటికి (చు)
కునుకు వచ్చి తూలిందా చల్లబడ్డ  దీపం
ఎనక రెచ్చిపోయింది  అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసే కన్ను
ముసురుకో దాకా మైకం మన్ను మిన్ను
కాలం కట్టిన గంతలు తీసి
కాంతులు ఎల్లువ  గంతులు వేసి..(తెల్లారింది)

ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం
ఎక్కుపెట్టి  చూసిందా సూరీడు చూపుల బాణం
 కాలి బూదిధైపోదా కమ్ముకున్న నీడ
ఊపిరితో  నిలబడుతుంద చిక్కని పాపాల నీడ

చెమట బొట్టు చమురుగా సూరెడుని  వెలిగిద్దాం
వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గి పూలు పూయిద్దాం(చెమట)
వేకువ చెట్టుల కత్తులు  దూసి
రేతిరి మంచును ముద్దలు చేసి  (తెల్లారింది)
ఇది సిరివెన్నెల సాహిత్యం,గళం..రెండూ.. కలిపి..ఒక పాట.

కళ్ళు లేని వారికే కాదు..కళ్ళు ఉన్నవారికి.. కూడా.. ఓ..వెలుగుపూల బాట.
కళ్ళు chiత్రానికి..ఈ..పాట ను వ్రాసారు. జానపద గీతం లా అనిపిస్తుంది. ఎస్.పి.బాలసుబ్ర మణ్యం గారు..ఈ చిత్రానికి..సంగీతం అందించారు.1988 లో..ఈ చిత్రం వచ్చింది.

సిరివెన్నెల గురించి తెలియడానికి ఈ పాట సాహిత్యం ఒక్కటి చాలు.అంతకు ముందు సిరివెన్నెల గురించి తెలిసిన వారికి ఇప్పుడు వారిపై.. ఈ పాట విన్నాక మరింత అభిమానం పెరుగుతుంధి సాహిత్యపరంగా ఈ పాట చాలా గొప్ప పాట సాహిత్యం వింటూ లిరిక్స్ వ్రాసుకున్నాను.వివరణమరొకసారి.

  

6, జులై 2011, బుధవారం

నది వంటి పరుగు కదా.. మానవ జీవన ప్రయాణం

నగరం నిద్ర పోయిన వేళ.. ఈ చిత్రంలో.. పాటవినగానే నాకు యెంత బాగా నచ్చిందో..చెప్పలేను. నిద్ర పోతున్న మనని నిద్ర లేపుతుంది.

  నట రాజ పూజ చేసి  ఇక్కడ పాట వినండి. వింటూ.. ఇది చూడండీ!

నది వంటి పరుగు కధ మానవ జీవన ప్రయాణం .. సుద్దాల అశోక్ తేజ..గారు అందించిన  సాహిత్యం..యెంత గొప్పగా ఉందో.. 

ఈ..పాట వింటూ ఉంటె.. ఒడలు.. ఎంత   ఉద్విగ్నతకు..గురి అయిందో.. చెప్పలేను..  సాహిత్యం,సంగీతం సమపాళ్ళలో ఉండి.. శంకరమహదేవన్ గళంలో.. ఎంతో.. సరళంగా..అందంగా ఒదిగిపోయింది.. 


నటరాజ పూజ చేసి అభినవ నాట్య యోగమే..మనిషి జీవితం..

నాట్యం ఒక యోగం..నిజంగా.. అది అందరికి రాదు ఆ  భాగ్యం  లభించడం..యోగం కదా!. అలాటి యోగ్య మైన అభినవ  నాట్యం తో....నటరాజ పూజ చేయడం అటువంటిదే ..మనిషి జీవితంని  పోల్చడం.. యెంత ఉత్కృష్ట భావం.. అంకిత భావం తో మనిషి చేసే పని.. భగవంతుని పూజించడం లాంటిదని చెప్పడం కూడా అందుకే  కాబోలు. 

కడ కడలి దాక  ఎడ తెగక సాగు 
నది వంటి పరుగు కద మానవ జీవన ప్రయాణం..

మనిషి జీవితం నది ప్రయాణం లాటిది.. నది నడక  సాగి సాగి...ఆఖరికి..సముద్రుడి ఒడికి   ..చేరడం తోనే.. ప్రయాణం ముగుస్తుంది. .అలాటి   నది ప్రయాణం లాటిదే..మానవ జీవన ప్రయాణం..ని చెప్పడం.. నాకు ఎంత నచ్చిందో!.  ఇలా..ఇంతకీ ముందు..ఎందరో..చెప్పారు..ఇప్పుడు చెపుతున్నారు..ఇక ముందు చెపుతారు. కూడ.. ఎందుకంటే..అది వాస్తమైన పోలిక గనుక. 

జనన మరణముల నడుమ ఉన్న 
ప్రతి  క్షణం  క్షణము... 
ఎన్ని నటనలు,ఎన్ని భంగిమలు
ఎన్ని ముద్రలు, ఎన్నిరసములు 
ఎన్ని భావముల జీవ కళల సంయోగమెల్ల  (నట) 

నిజం ప్రతి క్షణం క్షణం  చావు పుట్టుకుల మద్య ఉన్న ఈ జీవితంలో..  ఎన్ని భావనలు.. ఎన్ని నటనలు, నవరసాల జీవనం అంతా..జీవన కళ లే  .. కదా  !

అమ్మ పేగు నుండి తెగి పడి.. 
నేలమ్మ ఒడిన చేరిన నుండి.. 
ఎన్ని తప్పటడుగులు  ,ఎన్ని తప్పుటడుగులతో కూడుకుని 
ఎన్నెన్ని నడకలు,ఎన్నెన్ని పరుగులు 
ఎన్నెన్ని మలుపులు ఏపూట మజిలీ.. ఏ వైపు కదిలి. 
ఏ శిఖరమునకు పైకి ఎగసి ఎగసి
ఏ లోయలోకి జలపాతమల్లె  
ఇక భువికి దూకి
కడ కడలి దాక ఎడ తెగక సాగు (కడ)
నది వంటి పరుగు కద మానవ జీవన ప్రయాణం.  (నటరాజ)   

ఇంత అర్ధం ఎంత సొంపుగా..మన మాతృ బాష లో ఒదిగి పోయిందో కదా.. !?
మనిషి పాప గా అమ్మ పేగునుండి తెగి పడి.. నేలమ్మ ఒడిన పడి.. ఎన్ని తప్పటడుగులు వేసి నేర్చు కుంటామో..
అలాగే అన్ని తప్పు టడుగులు  వేస్తూ..ఎన్ని విధాలుగా..నడక మార్చుకుంటూ..నడత దిద్దుకుంటూ..ఏయే మలుపుల్లోనో.. ఏ పూటకా పూట మజిలీలు  చేస్తూ..  ఉన్నత శిఖరాలు అధిరోహిస్తామో.. .. ఏ పాతాళంలోకి.. జారి పోతామో.. లేదా సాఫీగా.. జీవన ప్రయాణం  సాగిస్తామో కదా..  ఆ అర్ధం అనంతం అయ్యింది ఇక్కడ. 


ఆది నర్తనం...నకాది మూర్తి ..
దయ భక్తి..తాండవా దీప్తి..
ఆ శంకరునికి..
శైశవము నుండి శవమయ్యేదాక, శివమయ్యే దాక 
ప్రతి నిమిష నిమిష ఆనంద భాష్ఫములతో..ను...
కన్నీటి పుష్ఫములతోను (నట)

ఆది నర్తనం ..ఈ సృష్టిలో..ఆది  నర్తనం..ఈశ్వరునిది. నకాది మూర్తి. న నాశనం లేని..ఆది మూర్తి..శివుడోక్కడే! ఈ సృష్టిలో.. శివునికి  ..ముందు ఎవరు పుట్టలేదు..ఒక వేళ  పుట్టినా.. మనుగడ లేదు. శివుని ముందు వెనుక కూడా.. ఆయన తప్ప ఎవరు లేని ఉండని నాశనం లేని మూర్తి. దయా భక్తి ..నిత్యం..ఆనంద తాండవంతో..లోకాలను దీప్తి తో..వెలిగిమ్పజేసే  ఆ శంకరునకు.. మనం  పుట్టినప్పటి నుండి శవ మయ్యేదాక .. ఆయనలో..కలసి శివ మయ్యేదాక .. ప్రతి క్షణం  ఆనంద భాష్ఫములతూ  ..జీవిస్తూ.... కన్నీటి పుష్ఫముల్తో.. తరిస్తూ..ని అర్ధం  ఉన్నట్లు ఉంది. 
నేను ఈ చిత్రం ఇంకా..చూడలేదు. బహుశా .. చిత్ర నాయిక పై.. చిత్రీకరించి ఉండ వచ్చు అనిపిస్తుంది అర్ధమును బట్టి.


పరుగులెత్తు వేళ   పయనించు త్రోవ 
రాళ్ళు  ముళ్ళు ఎన్నెన్ని ఉన్నా
ఒడిదుడుకులున్నా ,సుడిగాలులున్న 
వెనుతిరగకుండా క్షణమాగకుండా
ప్రతి గాయ గాయమొక భాష్య గేయంబుగా.. 
గుణ పాట్య భాగముగా  తలచి..
అలుపు లేక చేరాల్సి ఉన్న లక్ష్యమును గెలిచి   .
కడ కడలి దాక ఎడ తెగక సాగు (కడ)
నది వంటి పరుగు కద మానవ జీవన  ప్రయాణం  .(నట)

మన నడకలో  ..రాళ్ళు  ముళ్ళు ఎన్ని ఉన్నా..ఒడిదొడుకులు ఉన్న సుడిగాలులు ఎదురైనా..కొట్టుకు పోకుండా 
వెన్ను చూపక తగిలిన గాయాలని.. జీవన భాష్యం చెప్పుకునే గేయము లాగా మార్చుకుని..పాడుకుంటూ.. ఆ.. అనుభవాలని.. గుణ పాటాలుగా..తీసుకుని ..అలుపెరుగక తను అనుకున్న  లక్ష్యం  చేరుకోవడమే.. మనిషి పని.
అని ఉద్భోదిస్తూ..సాగిన సాహిత్యం... ఒకప్పటి..తరంగిణి..పాట.. గుర్తు కు తెస్తుంది.



సుద్దాల అశోక్ తేజ  పాట లోని భావాలు ఎప్పుడు ..నేల విడిచి సాము చేయవు. ఉన్నదానిని ఉన్నట్లు చెప్పడం..హృద్యంగా..చెప్పడం..ఆయన లక్షణం. అందుకే  ..అయన పాట మది మదిని తాకుతుంది...వినగా వినగా.. ఎంత బాగుందో..ఈ పాట. 

పాట లిరిక్ దొరకడం కష్టం అయింది..అయినా.. తీరిక చేసుకుని.. పాట వింటూ.. లిరిక్స్ వ్రాసుకున్నాను. ..వింటూ ఉంటే  సాహిత్యం  ..అమృతం వోలె.. ఉంది. సంగీతం ..యశో కృష్ణ.. చాలా బాగా చేసారు. 

ఆలోచనామృతం సాహిత్యం అంటారు..అందుకే.. ఆ పాట లో..కోరస్..ఉంది..ఎవరి కోరస్ అన్నది నాకు తెలియదు.  నాకు బాగా నచ్చింది. పనిగట్టుకుని..మా అబ్బాయికి  ..కూడా వినిపించాను. తనకి నచ్చింది కూడా.  మీరు కూడా వినేయండి ..నచ్చితే ఒ..కామెంట్ పెట్టేయండీ!
         

4, జులై 2011, సోమవారం

మా ఇంటి వెలుగు



చిన్ని..! నాన్న.. బంగారం..!!  వెల్ కమ్.. మదర్ ఇండియా ... 

నిఖిల్ చంద్ర  తాతినేని 
పదకొండు నెలల క్రితం .. హైదరాబాద్..ఎయిర్ పోర్ట్  లో.. ట్రాలీ లో..నీ లగేజే సర్ది.. ఇన్.. గేటు దాటి.. చెక్ ఇన్ దాటి లొపలకి..పంపించాక..నాగుండె అంతా నీరైంది.ఉబికివస్తున్న దుఖం ని..కనురెప్పల మద్యే దాచేసి..పూడుకుపోయిన గొంతుతో.. మాట రాక.. వచ్చినా నీకు వినబడక.. నువ్వు వెనక్కి వెనక్కి..తిరిగి చూసుకుంటూ వెళుతుంటే.. ఒక్కసారిగా.. నిన్ను వెళ్ళనీయకుండా.. వెనక్కి  ..తీసుకురావలనిపించింది.

నాకు నీ పై ఉన్న ప్రేమ ,మమకారం నీ ఉన్నతికి..నీ పై చదువులకి..అడ్డు కాకూదదనుకుని .. గట్టిగా శ్వాస  తీసుకుని..తమాయించుకున్నాను.

 నీ ముందు ఉన్న వాళ్ళ లగేజ్..చెక్ చేసేలోపే.. నాకు పోన్ చేసి..అమ్మా! ఎక్కడ ఉన్నావమ్మా!  నాకు కనబడు అమ్మా..పిచ్చివాడికి లా లగేజ్ నా చేతికి ఇచ్చి.. వదిలేసావ్..!.నాకు.. లోపల ఏమిటోగా ఉంది..ఇటు వైపు వచ్చి చూడు నేను కనబడతాను..అంటూ.. నువ్వు మాట్లాడిన తీరుకి.. అప్పుడే..నా గుండె..సముద్రమే అయింది.

 నేను.. ఆ విపరీతమైన ఒత్తిడిలో..నుండి బయటపడుతూ.. నిన్ను..దృష్టికి అందేలా   చూసుకుంటూ.. నీకు సమాంతరంగా వచ్చి నిలబడి నిన్ను చూసినప్పుడు.. మన మద్య ఉన్న అద్దాల అరలు..నిన్ను   నన్ను..విడదీసే ఇనపకచ్చడాలు అనిపించాయి..బంగారం. నీకు..నేను కనబడ్డాక అరగంట తర్వాత..  నీ లగేజ్ చెకింగ్ అయ్యాక.. మళ్ళీ వెనక్కి వచ్చి.. నాకు   జాగ్రత్తలు చెపుతూ.. ఉన్న నిన్ను చూసి..నేను స్తిమితపడ్డాను.పర్వాలేదు.. అలవాటు అవుతున్నాడు.. అనుకున్నాను.

ఇరవైరెండేళ్ళ పాటు..నీ తో  పాటు..ఉండి నిన్ను నడిపించిన "అమ్మ" చేతిని..వదిలి నువ్వు ఖండాంతరాలు దాటి వెళుతుంటే.. నిన్నే చూస్తూ ఉండిపోయాను..బంగారం
నాన్నగారు.. జాగ్రత్త, పాపమ్మ జాగ్రత్త..పిన్ని..టేక్ కేర్, బాబాయి..బై., మామయ్యా వెళ్లొస్తాను..మా అమ్మని జాగ్రత్తగా చూసుకోండి..అంటూ అద్దాల తెరల అవతల నుండే.. చేతులు  ఊపుతూ ఉంటే .. నాకు దిగులు ముంచుకు వచ్చింది

కాసేపటిలో..ఓ..లోహవిహంగం ..నిన్ను..మా నుండి విడదీస్తుంది.రెక్కలు ఇచ్చి..నిన్ను..బతుకు..గమ్యం వెతుక్కోమని..పంపిస్తున్నాం అనుకున్నాను.

వెళ్ళినట్లే వెళ్లి.. సడన్గా వెనక్కి తిరిగి..సేక్యూరిటిని..అమాంతం దాటి..  ఐరన్ బారికేడ్ లు దాటి  పరిగెత్తుకుంటూ..వచ్చి నన్ను గట్టిగా హత్తుకుని..అమ్మా! ఐ లవ్ యు..మా..! అంటూ..నా తలమీద చెయ్యేసి.. జాగ్రత్తమ్మా.. హ్యాపీ గా ఉండు..అని.. నాకేం పర్వాలేదు నేను బాగానే ఉంటాను..అని నాకు భరోసా ఇచ్చి.. నా  చేతిని పట్టుకుని.. లొపలకి..వెళుతుంటే..సెక్యూరిటి మాన్..ముచ్చటగా నిన్నేచూస్తూ ఉండటం..నా..చేతిలోనించి నీ చేయి విడవటానికి..సమయం తీసుకోవడం..మీ నాన్నగారు.. అలాగే కించిత్ ఈర్ష్యగా..చూసి నవ్వుకోవడం.. నాకు.. ఆ గురుతులు..ఎంతో..పదిలం ..బంగారం.


పదకొండు నెలలు.. ఎలా గడచాయో తెలియదు. అక్కడ నీ వెతలు.. అనుభవాలు.అన్నీ విని.. ఒక నెల క్రితం.. నిన్ను వీడియోకాల్ లో..చూసినప్పుడు.. గంట సేపు..పొరిలి పొరిలి వచ్చిన  నా దుఖం చూసి..ఇప్పుడు నువ్వు వస్తున్నావు అని..నాకు తెలుసు.ఎవరు వ్రాయ గలరు.. తల్లి కి బిడ్డకి ఉన్న అనుబంధం గురించి..
బంగారం.. అమ్మ మీద ప్రేమ, నీ స్నేహితుల తో.. నీకు ఉన్న అనుబంధం.. ముందు  ఏవి గొప్పవి కాదు.. అని అంటావని నాకు తెలుసు. .అలాగే.. మరి కొన్నేళ్ళకి.. నీ మాతృ  దేశం కోసం.. ఇలాగే వస్తావని.. నీ కలలు ..నెరవేర్చు కొనడానికి అధికంగా శ్రమ పడతావని.. తెలుసు.       ..  .

నీ రాక కై..వేయి కళ్ళతో..ఎదురుచూస్తూ..ఉన్నాను..నాన్నా..!! మన ఇంటి పరిసరాలు..మనుషులు..అంతా చిరునవ్వులతో..స్వాగతం పలుకుతున్నారు..బంగారం. కొన్నాళ్ళ నీ ఎడబాటుని..దిగులుని..మర్చిపోయి.. నీతో..ఆనంచంగా గడపటానికి..మన వాళ్ళందరు..సమాయతమయ్యారు.

నలబై అయిదు రోజులు.. నిను చూసుకుంటూ.. రీ ఛార్జ్ చేసుకుంటాను. . నీ కిష్టమైన పాట.. డోన్ట్  కేర్  నవ్వే  వాళ్ళు  నవ్వనీ  ఎడ్చేవాళ్ళు  ఏడవనీ . 
లో..లా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ.. 

నీవు నా కళ్ళ ఎదుట తిరుగుతూ.. కన్నుల నిండుగా.. చల్లని..చంద్రునిలా వెన్నెల చిరు నవ్వులు.. చిందిస్తూ ఉంటే.. ఈ..అమ్మకి.. కన్నుల పండగ...బంగారం.    








3, జులై 2011, ఆదివారం

స్వరాలతో. "ప్రియరాగాలు"మీటిన మరకతమణి.

మరకతమణి కీరవాణి గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. వారు స్వరపరచిన ప్రతి పాటా నాకు ఇష్టమే.

ప్రతి పూటా.. ఒక పాటైనా విననిదే.. మనసు ఆహ్లాదకరం గ ఉండదు. కీరవాణి రాగం పేరు పెట్టుకున్న "రాజమణి" వయోలిన్,వేణువు,గజ్జెలు,డ్రమ్స్..అన్నీ ఆయన కీ బోర్డ్ పై..నాట్యాలు చేసి..మన మససుని ఆనందగోలికల్లో..ఊగిస్తాయి.

కీరవాణి గారి పుట్టిన రోజు..జూలై 4 సందర్భంగా.. వారికీ..జన్మదిన శుభాకాంక్షలు..అందిస్తూ..
అందరికి..తెలిసినవే..అయినా మరొకసారి వారి గురించి..ఈ..మాటలు.
కీరవాణి స్వరాలు గత ఇరవై సంవత్సరాలుగా తెలుగునాట మారుమ్రోగు తున్నాయి. కీరవాణి స్వరాలూ ఉంటె..ఆ చిత్రం ఆడియో పరంగా సగం విజయం సాధించినట్లే..అని..నమ్మకం కూడా.. మనసు-మమత మొదలు.. నేటి బద్రీనాద్ వరకు.. కీరవాణి స్వరాలకు..పరవశించని వారు వుండరు.

తెలుగు,తమిల్,కన్నడ,మళయాళ,హింది మొదలగు బాషా చిత్రాలకు..గాను..అయన సంగీత దర్శకత్వం వహించారు.అన్నమయ్య చిత్రం కి..సంగీతం అందించి..జాతీయ పురస్కారం అందుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు ని ఆరుసార్లు అందుకున్నారు. కీరవాణి చాలా పాటలు కూడా పాడారు.

ఆయన పాడిన "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాట ..జాతీయ ఉత్తమ గీతంగా అవార్డుని అందించిన పాట వేటూరి గారి కవి కలానికే..ప్రాణం పోసిన పాట. కీరవాణి గారు గీత రచయిత కూడా.. చాలా పాటలు మనం వింటున్నా ..మనకి ఆ సంగతి తెలియదు.

కీరవాణి గారు లిరిక్స్ అందించిన ఈ పాట .. "ప్రియరాగాలు" చిత్రం లో.. పాట.

రాయభారం పంపిందెవరే రాతిరేళల్లో
ప్రేమ జంటను కలిపినదేవరే పూల తోటలలో..
కోకిల్లమ్మని కూయమంటూ.. పల్లె వీణను మీటమంటూ
కల్యాణి రాగాల వర్ణాలతో..
నీ..పా..ట తేట తెలుగు వెలుగు పాట
చల్లన్నమ్మ చద్దిమూట
అన్నమయ్య కీర్తనల ఆనంద కేళిలా
నీ బా ..ట గడుసుపిల్ల జారు పైట గండు మల్లె పూలతోట
పల్లెటూరి బృందావనాల సారంగలీలగా
చిరుమబ్బుల దుప్పటిలో..ముసుగు పెట్టిన జాబిలిలా
నునువెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా
కోడి కూసే వేళ దాక ఉండి పోతే మేలు అంటూ..
గారాలు బేరాలు కానిమ్మంటూ .. (రా)
ఉయ్యా ...ల ఊపి చూడు సందెవేళ పిల్లగాలి శోభనాల
కొండనుంచి కోనఒడికి జారేటి వాగులా..
జంపా..ల జమురాతిరైన వేళ
జాజిపూల జవ్వనాల జంటకోరి జాణ పాడే జావళీ పాటలా
గోపెమ్మలు కలలు కనే గోవిందుని అందములా..
రేపల్లెకు ఊపిరిగా రవళిన్చిన వేణువు చందం లా..
హాయిరాగం తీయమంటూ
మాయచేసి వెళ్ళమంటూ .
నాదాల తానాలు . కానిమ్మంటూ.. (రా)

ఈ పాట సాహిత్యం చేయి తిరిగిన కవి కలం ని తలపిస్తుంది... సాహిత్యం ని ఇంకో పోస్ట్ లో..వివరిస్తాను. ఈ చిత్రంలో.. కూనలమ్మ కూనలమ్మ ,చిన్నా.. చిరు చిరు నవ్వుల కన్నా .. పాటలు హిట్ సాంగ్స్ ..ఎందుకో..ఈ పాట మాత్రం నాకు ఇష్టం. ఈ పాటని ఎస్.పి బాలు, చిత్ర పాడారు.
కీరవాణి గారు ఈ సాహిత్యాన్ని చాలా ఇష్టం గా రాశాననీ ఒక ఇంటర్ వ్యూ లో..చెప్పారు.
వారికి..జన్మ శుభాకాంక్షలు అందిస్తూ..ఈ పాట పరిచయం ద్వారా.. కీరవాణి గారిని.. మరో కొత్త కోణంలో.. చూడటానికి..వీలుగా.. ఈ..పోస్ట్.

మధుర స్వరాలతో.. రాగాలు మీటిన మరకతమణి కి జన్మదిన శుభాకాంక్షలతో ..
మరిన్ని పాటలకి..మధుర సంగీతం అందిస్తూ.. వీనులవిందు చేయాలని.. సంగీత వినీలాకాశంలో.. కీరవాణి గా.. యశస్వి భవగా.. ఉండాలని కోరుకుంటూ..
ఇక్కడ వినేయండి.