30, జులై 2024, మంగళవారం

రెండు కథలు

 రష్యన్ కథ బాగా నచ్చింది.గురువుగారు చెప్పిన మొదట్లో విలువలతో కూడిన విషయాలు విన్నప్పుడు ఎంత తాథ్యాత్మిక రసానందంలో ఓలలాడారో, ఆయన చూసిన విశృఖల వికృత జీవనం తాలూకు అంతే చెవులప్పగించి విన్నారు.

వినడం, అనుభూతి చెందడం బుర్రకు, బుద్దికి సంబంధించినవి. మనస్సుకు సంబంధించిన సూక్ష్మబుద్ది, వివేకం అనేవి   జ్ఞాన సంపన్నులైన గురువులకు, బుద్ధి జీవులకు వుంటుంది తప్ప సామాన్యజనానికి వుండదు. అందుకే కొత్త ఆనందం వెతుక్కుంటు శిష్యులు వెళ్లిపోయారు.

ఆనందానికి విలువలు, వికృతులువుండవేమో.

ఒకప్పుడు   పాత సినిమాలు చూసి అస్వాదించిన జనం , ఇప్పుడు Ott సినిమాలకు అలవాటుపడుతున్నట్టు..

కధ చాలా అద్భతంగావుంది.👌🙏💐💐💐😀






28, జులై 2024, ఆదివారం

బంగారు

 ఒక అనాథ బాలిక కు ఆశ్రయమిచ్చి ఆ బాలిక కోసం ఆలోచించి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన మధ్యతరగతి ఇల్లాలి కథ. ఆఖరికి తనకిప్పుడు ముగ్గురు పిల్లలు అనుకున్న తల్లి కథ. హృద్యమైన కథ. తప్రకుండా వినండీ.. 

కథ రెండు భాగాలుగా ఆడియో బుక్ చేసాను. ఒకదాని కింద్ మరొకటి లంకె ఇస్తున్నాను.. చూడండి. 




25, జులై 2024, గురువారం

భగవద్దర్శనం

 



మనస్సుల్లో దేవుడు. 

ఈ రోజు గురు పౌర్ణమి. 14 ఏళ్ళ క్రిందట ఇదే రోజున నేను నా కొడుకు తో కలిసి శ్రీశైలంలో వున్నాను కదా! గుర్తు చేసుకుంది. గాఢమైన జ్ఞాపకశక్తి ఆమెకు వరమో శాపమో! 

మళ్ళీ శ్రీశైలం వెళ్ళి రావాలి. స్వామి అనుమతి ఇవ్వడం లేదనుకుంటా! దేశానికి వెలుపల వున్నప్పుడు ఎంత తపించిపోయాను.ఒకసారి దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు ఆ తపన లేదు. 

ఎందుకంటే.. మనసు మెదడు పొరలు విచ్చుకున్నాయి. ఆత్మబోధ లేక అజ్ఞాత బోధ నో కోరికలకు కళ్ళెం వేయమనో లేదా పూర్తిగా తగిగించుకోమనో ఉద్భోద చేసాయి అనుకుంది. 

కార్యకారణ సంబంధం లేకుండా ఏవీ జరగవు.ఏమీ కూడా జరగదు. 

“అబ్బాయ్! ఒకసారి పెద్ద గుడికి తీసుకువెళ్ళు. దైవదర్శనం చేసుకోవాలి”. ఆమె.

“నార్త్ కరోలినా లో శివాలయం వుంది బాగా నిర్మించారు అంట.అక్కడికి వెళ్దామండీ”అంది కోడలు. 

ఆ రోజు వస్తుందేమో అని ఎదురుచూస్తూ కూర్చుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక, మైలు, ఏవేవో అడ్డంకులు. సరే కార్తీకమాసం కూడా పూజ చేసుకోవడానికి వీలు కాలేదు ఒకసారి దగ్గరలో వున్న గుడికి వెళ్ళిరావాలి అని గట్టిగా అనుకుంది ఆమె. కొడుకుని మళ్ళీ గట్టిగా అడిగింది..”బాబూ! గుడికి తీసుకుని వెళ్ళు” అని.

ఒక్క కసురు కసిరాడు.నాకు వీలవదు. టైమ్ లేదు అని. ఆ కసురుకు చప్పున కన్నీళ్ళు. 

“ఛీ.. ఛీ .. ఈ మాత్రం దానికే కన్నీళ్ళు రావాలా?” అనుకుంది తన బుద్ది తక్కువ తనానికి. 

మనుమరాలి పుట్టినరోజు వచ్చింది. చక్కగా తలస్నానం చేసుకుని కుటుంబం అంతా తయారయ్యారు.  ఆమె కూడా బయలుదేరింది. “సాయిబాబా గుడి ఆంజనేయ స్వామి గుడి కా” అడిగాడు అబ్బాయి/భర్త. ఆమె మాట్లాడలేదు. కోడలూ మాట్లాడలేదు. 

సాయిబాబా గుడి దగ్గర ఆగింది కారు. ఆమెకు ధ్వజస్థంభం లేని గుడి అంటే అయిష్టత. గడచిన కాలంలో వేళ్ళ మీద లెక్క పెట్టినన్నిసార్లు వెళ్ళిందేమో! అయినా ఏదైతేనేం నలుగురు కూడినచోట అది పవిత్రమైన స్థలమే కదా! అనుకుని లోపలికి వెళ్ళింది. కోడలు పుట్టింటి వైపు వారి పూజలు సతత్సంగాలు క్రేత్ర దర్శనాలు అన్నీ సాయిబాబా చుట్టూనే! ఎవరి సంప్రదాయం వారిది. నాకెందుకు అభ్యంతరం అనుకొంటుంది. మనిషికి మానసిక సంస్కారం ముఖ్యం అనుకుంది. వాకిలి శుభ్రం చేసుకోకుండానే పూజ చేసుకోవడం.. పూజ చేసుకుని వారాల పాటు ప్రసాదం నిర్మాల్యం తీయకపోవడం గమనించి వొకటి రెండుసార్లు చెప్పి ఊరుకుంది. మనసులో భక్తి చాలును. ఆచారాలు పాటింపు ఏముందిలే అని కూడా  మళ్ళీ సర్దుకుంది. ఇవ్వన్నీ ఆలోచించుకుంటూనే దైవదర్శనం చేసుకుని హారతి కార్యక్రమం చూసి ఇంటికి వచ్చారు. 

తర్వాత ఎప్పుడూ గుడికి వెళదాం అని కొడుకును అడగలేదు ఆమె. తర్వాత కోడలు పుట్టినరోజు వచ్చింది. బిజీ షెడ్యూల్ మధ్య కూడా.. కొడుకు కోడలిని సాయిబాబా గుడికి తీసుకొని వెళ్ళడం మర్చిపోలేదు. అమ్మ మనిషి కాదా!? అమ్మకు విలువ లేదా! బంధాలు భ్రాంతులేనా!?

ఆమె వొద్దు వొద్దు అనుకుంటూనే బాధ పడింది. కళ్ళు మూసుకుంది. రెండు కళ్ళూ ధారాపాతంగా వర్షించాయి. 

నమో భగవతే రుద్రాయ శ్రీమాత్రే నమః  అని మనసులో స్మరించుకుంది. 

ఓ చల్లని చేయి ఆమె తలపై పెట్టి ఆశీర్వదించింది. “అన్నిచోట్లా నేను లేనా.. నీలో నేను లేనా? కళ్ళు మూసుకుని చూసుకో అమ్మా” అని. చప్పున కళ్ళు మూసుకుంది. పద్దెనిమిది సెకనులు ఏకాగ్రత గా.. 

శ్రీ శైల మల్లన్న దర్శనం లభించింది. అంతులేని ఆనందం ప్రశాంతమైన ఆనందం.

అది కోరినదే తడవు లభించే అపరిమితమైన ఆనందం. అపాదమస్తకం దర్శన అనుభూతి. 

మనసు మూగబోయింది. 

మొబైల్ చేతిలోకి తీసుకుంది. Pinterest దానంతట అదే ఓపెన్ అయింది. స్క్రీన్ నిండా మల్లన్న దర్శనం. 

“ఇంకెప్పుడూ ఎవరిపైన ఆరోపణ చేయను... ఎవరినీ ఎప్పుడూ గుడికి తీసుకువెళ్ళమని అడగను” అనుకుంది. ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే ఇష్టదైవం మనసు మెదడు నిండా!. 

ఓం నమఃశివాయ 🙏🙏🙏

అనంతానంద భోదాంబునిధిం,

అనంత విక్రమమ్

అంబికా పతిం ఈశానం

అనిశం ప్రణమామ్యాహమ్

నశ్వరం కాని అభయమిచ్చే శంకరా ..

నేను నీ దర్శనాభిలాషిని

జన్మ జన్మల నుండి 

నీ పూజ చేయుటలో దప్పిక గొన్న దానిని

నా మీద కొంచెం దయ చూపు

నీ కన్నా నాకు ఎవరు ఎక్కువ కాదు

నా ప్రాణాలు కేవలం నీ కోసమే !

నా హృదయం పాడింది ..ఓం నమః శివాయ

ఓం నమఃశివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏




23, జులై 2024, మంగళవారం

తిల పాపం తలా పిడికెడు

 కృష్ణా గుంటూరు జిల్లాల్లో మా బంధువుల్లో చాలామంది మతం మారారు. వారి ప్రార్థనలు వారివి. వారి సమూహాలు వారివి. నిజానికి హిందువులుగా వున్నవారు వారిని గతంలో వారి మాదిరిగానే మంచీ చెడు కి కలుపుకోవాలని చూసినా వారు కలవరు. కొత్త మతం పుచ్చుకున్న వారికి గుర్తులెక్కువ అన్నట్లు ప్రసాదాలు తీసుకోరు భోజనం చేయరు. ప్రతిదానికి ప్రార్ధనలు చేస్తారు. హిందువులు తిథి నక్షత్రం వారం వర్జ్యం చూసినట్టు. వివాహ గృహప్రవేశ ముహూర్తాలు మళ్ళీ హిందూ సంప్రదాయమే! హిందువుల ఇళ్ళ మధ్య కావాలని చర్చి నిర్మిస్తారు. తొలి ఏకాదశి వస్తే శివరాత్రి వస్తే కావాలని తెల్లవారుఝామున ప్రార్ధనలు మొదలెడతారు వారి ప్రార్ధన రోజులు కాకపోయినా. ఆరోగ్యం బాగోకపోయినా ఆర్ధిక ఇబ్బందుల్లో వున్నా బైబిల్ తో వెళ్ళి కూర్చుంటారు. ఇష్టం లేదు మొర్రో అన్నా ఊరుకోరు. అయినా దశాబ్దాల తరబడి మా పల్లెల్లో ఎక్కడా గొడవలు లేవు. క్రిస్టమస్ వస్తే కేక్ కట్ చేస్తే నిరభ్యంతరంగా తీసుకుంటాం. అలాగే మా ఊరిలో శివాలయంలో  ముస్లిం లు అభిషేకాలు చేయించుకుంటారు. నేను ఎన్నోసార్లు చూసాను. మాకు డ్రైవర్ గా వచ్చే అతను ముస్లిమ్. కళ్యాణీ బిర్యానీ తెచ్చుకుని కార్ ట్రంక్ లో పెట్టుకుంటాను అంటే కోప్పడతాను. పర్వాలేదు లోపల పెట్టుకో అంటాను. వద్దు మేడమ్! మీరు తినరు గా! వాసన మీకు ఇబ్బంది కల్గిస్తుంది ఏ సి వేస్తాం గా అంటాడు. నా చిన్నప్పటి నుండీ చూసాను.. ఎవరూ ఎవరితోనూ గొడవ పడలేదు. తిట్టుకోలేదు. కొట్టుకోలేదు. మా అమ్మ నా చిన్నప్పుడు దిష్టి మంత్రం ముస్లిమ్ ఆమెతో పెట్టించేది. కాలికి నల్ల దారం కట్టేది. మేము పీర్లు పండక్కి జెండా చెట్టుదాకా వాళ్ళతో కలిసిన జ్ఞాపకం. మా ఊర్లో గంగానమ్మ గుడిలో కడవ పూజకు కప్పల పెళ్ళికి పొంగళ్ళు పెట్టేటప్పుడు జంతు బలి అప్పుడు ముస్లిమ్ లు డప్పు శబ్దానికి చిందేయడం హడావిడి చేయడం సర్వసాధారణం. 

ఏమిటో హిందూ ముస్లిమ్ క్రిష్టియన్ అంటూ మనుషులను విడదీసే సంస్కృతి నాకు భూతద్దం వేసి వెతికినా కానరాదు. స్వయానా మా నాన్నగారి అక్క అంటే నా మేనత్త తాను చనిపోయాక అంతిమ సంస్కారం చర్చి వారే నిర్వహించాలని ముందుగానే డబ్బు చెల్లించుకున్నారు. మాకు ఎవరికీ అభ్యంతరం లేదు. 

సాహిత్యంలో హృదయాన్ని విశాలం చేసుకునే కథలెన్నో చదివాను. కొన్ని కథలు పలుకురాళ్ళ లా తగిలినా.. కథ లో  ఏదో వొక కోణం బాగుందనిపించి.. ఊరుకుంటాను. బాహాటంగా చెప్పి గెలవలేం. వాక్ఫటిమ విసృతజ్ఞానం నాకు లేదులే అనుకుంటా! కొంతమంది కొన్ని కట్టు కథలు చెప్పి మెప్పించడానికి చూసేవారిని ఎండగడుతూ  నిర్మొహమాటంగా చెప్పినట్టు  రాసినప్పుడు .. చూసి సంతోషిస్తాను. సాధారణమైన మనిషిని. ఏవేవో చదివి భయభ్రాంతులకు గురికావడం నాకిష్టం లేదు. 

కులం గురించి మతం గురించి మాట్లాడకూడదు అనుకుంటూనే.. ఈ మాట చెప్పాలనిపించింది. అంతే! 

కొందరు మత విద్వేష కథలు రాస్తూనే వుంటారు.ఎందుకు అంటే చెప్పలేం. మళ్ళీ వారు ఈ దేశంలో కూడా నివసించేవారు కాదు.

ఇంత పెద్ద దేశంలో ఎక్కడో ఏదో జరుగుతూ వుంటాయి. నిజమే కావచ్చు కాకపోవచ్చు.మీడియా కూడా సరిగ్గాలేదు కాబట్టి నిజాలు తెలుసుకోలేం. బాబ్రీ మసీదు కూల్చేసారని గుజరాత్ అల్లర్లు జరిగాయని దేశం అంతా ప్రజలు తమ జీవితాలను అగ్ని గుండాలుగా మార్చుకోలేరు. కారంచేడు లో జరిగిన సంఘటన చుండూరు లో జరిగిన సంఘటనల బట్టి ప్రపంచంలో వున్న కమ్మ రెడ్డి దళిత సోదరులు రక్తం చిందించుకోవడం లేదు. సంఘటనల వెనుక కారణాలు వుంటాయి. మన వ్యక్తిగత జీవితాల్లో వుండటం లేదా? అలాగే! సమస్య అనే వృత్తం లో కూర్చుని దాని గురించే ఆలోచిస్తూ కూర్చోం. బయటపడి జీవితం కొనసాగిస్తాం. పక్కవాళ్ళకు ఆ సమస్య గురించి చెప్పి భయభ్రాంతులకు గురిచేయడం మంచిది కాదు. రేప్ లు జరపడం తప్పు అని అనగల్గం కానీ ఆపే శక్తి మనకు లేదు. రేప్ గురించే మాట్లాడుతూ వుండిపోవడం కూడా సైకోయిజానికి గుర్తు. పసి పిల్లలను హౌస్ అరెస్ట్ చేసే వుంచండి అన్నట్టు వుంటుంది. అది నా అభిప్రాయం. రచనలు కూడా అలా వుండకూడదు అని నా అభిప్రాయం. అక్షరం రెండు వైపులా పదునువున్న కత్తి. మంచి చెడూ రెండూ సృష్టించగలదు.అధ్యయనాలు చేసి పాఠకుడు కథ చదవడు. అందుబాటులో వున్నది చదువుతాడు. అధ్యయనం చేసిన వారే చదవాలనుకుంటే ఆదివారం పత్రికలు వొదిలేసి వెబ్ లో ముద్రించుకోవచ్చు కదా! సాధారణ పాఠకుడిని భయభ్రాంతులకు గురిచేయడం ఎందుకు? 

ఈ మధ్య news channel లో చూసాను. ఒక నాయకుడు  అంటాడు. వంద కోట్ల మంది భారతీయులను చంపే ఆయుధం నా దగ్గర వుంది. బహుశా పాకిస్థాన్ దగ్గరున్న అణ్వస్త్రం అని అతని ఉద్దేశ్యం ఏమో! అతను అలా అన్నాడని నూట యాభై కోట్ల కు దగ్గరగా వున్న దేశ జనాభాలో వందకోట్ల మంది పక్కనే వున్న ముస్లిమ్ ని అనుమానంగా చూడాలా? నమ్మకంగా ప్రశాంతంగా తన బతుకు తను బతకాలా? కొందరు వ్యక్తుల స్వార్ధం కోసం మాత్రమే ఈ మాటల తూటాలు అడప దడప జరిగే సంఘటనలు. వాటిని తలుచుకుంటూ భయపడుతూ బ్రతుకు దుర్భరం చేసుకోం. మనుషుల్లో దాగున్న పైశాచికాన్ని అక్షరాల ఆయుధం తో ప్రేరేపించకూడదు అని నా అభిప్రాయం. ప్రేరేపిస్తే ఎలా వుంటుందో చదువుకున్న అందరికీ తెలుసు. పద్నాలుగేళ్ళ పైగా ఈ రాష్ట్రంలో కులకాష్టం రగిలిస్తూనే వున్నారు. ఈ సారి ప్రజలు వివేకవంతులైనారు. అయినా PayTM batch ఇంకా విషం కక్కుతూనే వుంది. 

నిన్న ఒక చిన్న కామెంట్ పెట్టాను ABN channel live లో. అక్కడ KGF summit జరుగుతుంది సత్యవాణి గారూ మాట్లాడుతున్నారు అప్పుడు. పెనమలూరు బాలికల వసతి గృహం గురించి చెబుతున్నారు. అది నిజం కూడా! మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టాను. మా పోరంకి యువకుడు తోటకూర గోపిచంద్ అంతరిక్ష యాత్రికుడు గా వెళ్ళి వచ్చాడు అని . అంతే నా కామెంట్ కింద ఇద్దరు ముగ్గురు ఎంత అసహ్యంగా వ్యాఖ్యానించారో.. రిపోర్ట్ కొట్టి ఆ కామెంట్ డిలీట్ చేసుకుని వచ్చాను. మనసంతా పాడైపోయింది. మత ద్వేషాలు కుల ద్వేషాలు దేశ దురభిమానం తో మనుషులు కుంచించుకుపోయారు. అందరికీ సంఘాలు వున్నాయి. మా కులానికి వుంటే తప్పేంటి? మా కులం లో పేదవారు లేరా? వాళ్ళ సంక్షేమం కోసం మా కుల అంతర్జాతీయ సంఘం వుంటే తప్పేమిటి? నాకేమీ అర్ధం కావడం లేదు. గర్వంగా మా ప్రాంతపు యువకుడు అంతరిక్షానికి వెళ్ళివచ్చాడు అనే మాట కూడ బూతు లా కనబడితే యెలా? ప్రతి దాంట్లో కులం మతం ప్రాంతం దేశం అద్దడమే! ఇవన్నీ చదువుకోని వారిలో లేవు. మేధావులుగా చెప్పుకునే వారిలోనే వున్నాయి. ఆ భూతాలు మిగతా వారిని భయపెడతాయి మనుగడ లో వుండటానికి అంతే! వీలైతే కథ రూపంలో పెట్టాలి.  మనిషి మారలేదు🥲

కమ్మ రాజధాని అమరావతి 

కమ్మ పరిపాలన 

కమ్మోళ్ల రాజ్యం మాకొద్దు 

కమ్మ లం... లు 

ఏమిటిరా ..బాబూ ఈ శిక్ష మాకు ..  ఎందుకు మా మీద ఇంత ద్వేషం ? ఎందుకు మా మీద ఇంత శిక్ష ? యూ  ట్యూబ్ లో ఛానల్స్ చూడాలంటే భయం న్యూస్  చూడాలంటే చాట్ వైపు దృష్టి వెళ్లకుండా కట్టడి చేసుకోవాలి పేస్ బుక్ తెరవాలంటే భయం  మెసెంజర్ లో నోటిఫికేషన్ చూస్తే జంకు 

ఒక్కటి మాత్రం చెప్పగలను మీలా ..మాకు PayTM బ్యాచ్ లేరు మీ అంత ద్వేషం నీచ సంస్కారం ఉన్నవాళ్ళం కాదు కానీ ఎల్లకాలం చూస్తూ ఊరుకోము ... ఊరుకోము  ఊరుకోము . అని బాహాటంగా చెప్పడం నేర్చుకున్నాను. కులం పేరిట జరిగే వివక్ష అవమానాలను క్షమించం. 

సాహిత్యం సోషియల్ మీడియా రెండూ పతనావస్థ కి చేరుకున్నాయి.😢😢

శబ్దాలు -కాంతులు



శబ్దాలు-కాంతులు/జయంత్ ఖత్రీ/ వేశ్యావాటిక రాత్రి నేపధ్యాన్ని హృదయవిదారక దుస్థితిని చెప్పిన గుజరాతీ కథ. తప్పక వినండీ.. 







22, జులై 2024, సోమవారం

డేగ (వేట కథ)



మనుషులు డేగ ను పెంచుతారు. వేటకు వొదులుతారు. వేట సహజత్వాన్ని కోల్ఫోయి మానవ క్రౌర్యాన్ని అద్దుకుంటే ఎలా వుంటుంది?ఆ పైశాచిక ఆనందాన్ని మనుషులు

ఎలా ఆస్వాదిస్తారు ? అన్నది ఈ కథలో కనబడుతుంది. అరుదైన కథ తప్పక వినండీ.

డేగ - పెర్ హాల్ స్ట్రోమ్  మూల రచన, స్వీడన్ రచయిత. 
 అనువాదం: పురిపండా అప్పలస్వామి .




21, జులై 2024, ఆదివారం

లఘు చిత్రం లో సంస్కరణావాదం

 నీతులు చెప్పే మారాజులందరినీ వాడల వాడల వెంట  త్రిప్పి  వీళ్ళని చూపించాలి. ఛీ,  యాక్ అంటూ. వాంతి  వచ్చినట్టు మొహం పెట్టె అమ్మలక్కలకి  వీళ్ళ కథలు వినిపించాలి. వాళ్ళని చులకనగా చూసే మన  చూపులు మారాలి . సమాజం విసిరి పారేసిన అభాగ్యులు వాళ్ళు .   వికృత ఆలోచనల  సమాజం తయారుచేసిన ఆకలి కేకలు వీళ్ళు. వాళ్ళలో పూట గడవని అతి పేదవాళ్ళు  వాళ్ళని పీక్కు తినే పోలీస్ వాళ్ళు కూడా వుంటారు. రోగాలు రోష్టులతో, మల మూత్రాల మధ్య, మురుగు కాలవలు ప్రక్కన, ఈగలు ముసిరి, దోమకాటులకి బలి పోతూ , కాట్ల కుక్కల మధ్య జీవచ్చవాలై బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి  కోరికలతో కాదు మానవత్వం చూపడానికి వెళ్ళాలి ".. అన్నాడు అభి. 






20, జులై 2024, శనివారం

పడవపాట

 పడవ పాట

నీటిని నమ్మి ఏలేలో 

నేలున్న దీ హైలేసా

 నేలను నమ్మి హైలేసా 

పంటావున్నది హైలేసా 

పంటను నమ్మీ ఏలేలో 

ప్రజలుండారూ హైలేసా 

ప్రజలాకోసం ఏలేలో 

పంటున్నాదీ హైలేసా 

పంటను నమ్మి ఏ లేలో 

కాపున్నాడు హైలేసా 

కాపును నమ్మి ఏలేలో

రాజ్యం ఉండాది హైలేసా

రాజ్యాన్ని నమ్మి ఏ లేలో 

రాజుండాడూ హైలేసా 

రాజ్యంలోనా ఏ లేలో 

నువ్వున్నావు హైలేసా 

నిన్నూ నమ్మీ ఏలేలో 

నేనున్నాను హైలేసా 

మనలను నమ్మీ ఏలేలో 

పడవుండాది హైలేసా 

పడవను నమ్మి ఏలేలో 

బ్రతుకుండాదీ హైలేసా హైలేసా .....హైలేసా



నూనె గానుగ

 సమవృత్తంగళ్ -బాలకృష్ణ మంగాడ్ 

నూనె గానుగ -పి.సత్యవతి

ఈ కథ లో పురుషుడు భార్య ను పశువుగా భావించాడు. ఆమె లో శక్తి తగ్గగానే మరొక స్త్రీని పెళ్ళి చేసుకుని తీసుకు వచ్చాడు. మరి ఆమె ను కూడా పశువు గానే భావించాడు. 

ఏం చేసాడో .. ఈ కథ లో వినండీ.. 

గుండె బరువెక్కే ఈ దృశ్యం ఎప్పుడో ఎక్కడో జరిగి వుంటుంది. అవన్నీ దాటుకునే మనం ఇంత ముందుకు నడిచాం. కథ వినండీ 




18, జులై 2024, గురువారం

మానసిక బంధాలు

 కొన్ని మానసిక  బంధాలు అంతే! ఎవరు విడదీయలేనివి. సమాజం అర్ధం చేసుకోలేని ప్రేమలు కొన్ని. స్వచ్ఛమైన హృదయాల ప్రేమ కథ. వినండీ.. 




ఒక పాట ఒక పాఠం

 ఓ ఆడపిల్ల కు చెప్పిన పాఠం. ఆంటోని షెకోవ్ కథ వినండీ.. 

"అవును. నీలాంటివాళ్లను చూస్తే ఎవరికీ యివ్వాలనిపించదు. మెత్తనివాళ్లను చూస్తే మొత్తాలనిపిస్తుందే, అలాగ. నీ ధైర్యమెంతో తెలుసుకుందామని నిన్నో ఆట పట్టించాను. 

జీవితం నేర్పే పాఠాలు ఎంత క్రూరంగా వుంటాయో యిప్పుడైనా అర్థమైందా? ఇదిగో, నీకు రావలసిన మొత్తం ఎనభై రూబుళ్లూనూ, కాని అమ్మాయీ, మీరు వానపాముల్లాగ ఎలా బతకగలుగుతారీ లోకంలో? పంజాలూ, కొరడా లేకపోయినా కనీసం గోళ్లన్నా వుండాలా లేదా? ఎదిరించటానికి, నీకు రావలసింది న్యాయంగా అడగటానికి కూడా నోరు లేదా? అన్యాయం అని ఒక్క మాట చెప్పలేకపోయావే అంత పిరికి గొడ్డులా వుంటావేం. ఆయుధాల్లేకపోతే పిడికిలితోనైనా ఆత్మరక్షణ చేసుకోగలగాలి.



17, జులై 2024, బుధవారం

అప్ డేట్

 నిశిరాత్రి నీ గృహ ద్వారం ముందు నిలబడే వున్నాను.. నీ పిలుపు అందుతుందని. 

నువ్వు నమ్మవు.. బుుజువు చూపమంటావ్

 రాత్రిపూట ప్రయాణం సాగించిన నీడ ఆచూకీ అక్కడెందుకుంటుంది? . ఇసుక పై నడిచిన గుర్తులు గాలికి చెరిగిపోతాయి. 

బురదలో నడిచిన పాదముద్రలు జడివానకు కొట్టుకెళ్ళాయి. ఇంకెలా నమ్మించను నేను అని వేడుకున్నాడు అతడు,  . 

ఓరి పాతకాలపు ప్రేమికుడా!  నీ కవి భాష తో సంజాయిషీ చెప్పింది చాలు. మా ఇంటి గుమ్మానికి వెన్ను ఆనించి ఓ సెల్ఫీ దిగి నాకు పంపించు చాలు. కాస్త తొందరగా  అప్ డేట్ అవ్వొచ్చు..  రా బాబూ.. అంది  ఆ ప్రేమికురాలు  నిసృహగా. 

నిజమే మరి. టెక్నాలజీ ముంగిట్లో ప్రేమ కూడా అప్ డేట్ అవ్వాల్సిన అవసరం వుంది. 

15, జులై 2024, సోమవారం

పయిలం బిడ్డా!

 పయిలం బిడ్డా! -వనజ తాతినేని

మనుమడా! నా బంగారు తండ్రీ! ఎట్టా వుండావ్? నేను ఫోన్ చేస్తే నీకు అందుతుందో లేదో తెలియడంలా, అందుకే ఈ ఉత్తరం ముక్క రాస్తుండా. ఏడేళ్ళు అయిపోయింది నిన్ను చూసి. ఎప్పుడు వస్తావు రా నాన్నా! ఒక్కసారి వచ్చి ఈ ముదుసలి నాయనమ్మను చూసి పో. వొంటి నిండా హత్తుకుని  పౌత్ర స్పర్శ ని అందించి పో. ఈ ఎండా కాలం దాటిస్తానో లేదో.. భగవంతుడికి యెఱుక.  ఎండలకి భయపడి మీ అమ్మ దగ్గరికి వెళ్లడంలేదు. అన్నట్టు నీకు ఈసారి కొడుకు పుడితే తాత పేరో నాన్న పేరో పెట్టుకోవాలి. పెద్దల పేరు పెడితే పిల్లలు ఉజ్వలంగా వర్ధిల్లుతారని నానుడి. ఇదే మాట మీ అమ్మతో చెబితే మీ అమ్మ విసుక్కొంది. “ తాత ముత్తాల ఆస్థులు కావాలి కానీ వాళ్ళ పేర్లు ఎవరికి కావాలి” అని.  


అబ్బాయ్ ! మీ అమ్మ నీ దగ్గర్నుండి వచ్చాక చాలా నలిగిపోయింది రా. దిగులు ముఖంతో నవ్వడం మర్చిపోయింది. అడగ్గా అడగ్గా.. “ఏం చెప్పను అత్తమ్మా, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదుగా” అని వాపోయింది.  


ఒరేయ్ పొంగుమాలినోడా! నిన్నొక మాట అడుగుతాను చెప్పు?  నీ ఇంట్లో నీ అమ్మ గెస్ట్ ఎట్లా అయితది, నీ పెళ్ళాం బాబాయి కూతురు ఫ్యామిలీ మెంబర్ యెట్లైతదిరా! నేను పాత కాలం యెనిమిదవ తరగతి చదువుకున్నా. మా పంతుళ్ళు యెవరూ యిట్టా చెప్పిండ్లా. నీకు అమెరికా చదువులు యిట్టా నేర్పి వుండాయేమో మరి. మీ అమ్మ ఆ మాట తల్చుకున్నప్పుడల్లా కుమిలి కుమిలి యేడుస్తా వుంటది. నీ తాత మీ నాయన అహంకారం నీ మెదడుకి బాగా యెక్కినట్టు వుంది. నీ భార్యకు మీ అమ్మ గురించి తెలియదే అనుకో, నీక్కూడా తెలియకుండా పోయిందా? అంత మాట అనుడు ఏంట్రా! నేను అక్కడ వుంటే చెంపకి వొక్కటి ఇచ్చి పడేద్దును. 


ఇంకో సంగతి. అదేదో అమెజాన్ లో పుస్తకాలు అమ్ముకుంటారంట గందా, నేను కూడా అప్పుడప్పుడు అంట్లు తోముకునే స్క్రబ్బర్ లు కూడా  తెప్పించుకుంటాలే. అందులో మీ అమ్మ తను రాసిన పుస్తకాలను పెట్టి అమ్ముకోవాలనుకునిందే అనుకో.. ఆ సేల్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడేదానికి ఇంగ్లీష్ మాట్టాడాలంట. నాకు ఇంగ్లీష్ మాట్లాడం రాకపోయే, కాస్తో కూస్తో వచ్చినా జంకు అత్తమ్మా, అబ్బాయిని కోడలిని ఆ పనేదో చేసిపెట్టమని రెండు మూడు సార్లు అడిగా. ఇద్దరూ గమ్ముగా వుండినారు తప్ప ఆ పని చేయలేదు అని బాధ పడింది. నిన్ను చదివించడానికి మీ అమ్మ యెంత కష్టపడింది రా! ఇల్లిల్లు తిరిగి చీరలమ్మింది. డబ్బులు వసూలుకు తిరిగింది. ఎక్కడెక్కడ నాణ్యమైన చీరలు తయారైతాయో తెలుసుకుని అక్కడికిబోయి చీరలు గుత్తంగా కొనుక్కొచ్చి అమ్మేది. చీరలపై కుట్టుపూలు కుట్టేది. పదిమందిని పెట్టి కుట్టించేది.మగరాయుడిలా నిలబడి నీ కోసం కష్టపడితే చైతన్య హాస్టల్లో చదివినోడివి కాదు నువ్వు. ఆ రెండేళ్ళు నువ్వు చదివినందుకే మూడెకరాల పొలం అమ్మిందన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ కాబోయే భార్య ని ఎమ్మెస్ చదివించుకుందామని నువ్వు చెబితే.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని భవిష్యత్ లో నీకు చేదోడు వాదోడు గా వుంటుందని సంతోషించి సరేనంది. ఆ అమ్మి అమెరికా వచ్చాక ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవని నువ్వూ, ఆ పిల్లను కన్నోళ్ళు కాడి కిందపడేస్తే.. అప్పటికప్పుడు తన చేతి గాజులు తీసి అమ్మి చిట్ పాడి ఎల్ ఐ సి లోన్ తీసుకుని నానా అవస్థలు పడి మొదటి సెమిస్టర్ ఫీజు డబ్బులు పంపింది మీ అమ్మ కాదూ! నీ భార్య ఉద్యోగం వచ్చాక తన తల్లికి గాజులు చేయించుకుందంట గాని మీ అమ్మకి ఏమైనా ఇచ్చిందంట్రా! “ఆ అమ్మి కన్నకూతుర్లాంటిదే అనుకున్నా! ఎంత బాగా చూసినా కోడలు  కోడలే! ఎన్నటికీ కూతురు కాలేదు” అని దిగులుగా చెప్పింది మీ అమ్మ. 


 నీ భార్య ని రెండేళ్ళు చదివించిన సొమ్ముతో ఆ నాడే మీ అమ్మ కి ఓ ఇల్లు అమిరివుంటే.. ఇంత వయసొచ్చాక ఇల్లు బాడుగకి ఇచ్చినోళ్ళు యెప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయడానికి నానా అవస్థలు పడేది కాదుగా, ఆమెకు మీ నుండి చిన్నమెత్తు సాయం లేదు వీసమెత్తు గౌరవం లేదు. ఎందుకే వాళ్ళపై నీకంత భ్రమత అని నేను చివాట్లు పెడతా. అయినా వినదు. నా కోడలికి ఆ చీర బాగుంటది ఆ నగ బాగుంటది. నా మనుమరాలికి అది కొనాలి ఈ నగ చేపియ్యాలి అని పరుగులు తీస్తది. నువ్వు పంపిచ్చిన డబ్బులను ఎగాదిగా వాడకుండా పొదుపుగా వాడుకుని మీకే అమర్చిపెట్టుద్ది. నీ కన్నా నేనే నయం గదే! దేశమంతా యాత్రలు తిరిగివచ్చా. నువ్వు పక్కనున్న చంద్రగిరి కోట చూడలేదు అరుణాచలం పోలేదు. ఎప్పుడు డబ్బులు లేవు లేవు అంటావ్, అని మందలిస్తే.. నేను కూడా చెడీబడీ కొనేసి దేశమంతా చుట్టేసి ఖరీదైన చీరలు చుట్టేస్తే నీ మనుమడు చేసిన అప్పులు తీరేవా? బిడ్డ నష్టపోయాడు, మోసపోయాడు, అప్పుల పాలై పోయాడు. వాడికి  నేనెలాగూ  సంపాదించి పెట్టలేను ఈ మాత్రం అండగానైనా వుండకపోతే యెట్టా! కొందరు జల్సాగా అనుభవించడానికే పుట్టి వుంటారు. కొందరు నాలా కష్టపడటానికి పుట్టి వుంటారు అని వేదాంతం చెబ్బుద్ది. అత్త కట్టిన సామ్రాజ్యంలో కోడలు రాజ్యమేలుద్ది అంటారు.మరట్టాగే వుంది నీ ఇంట్లో నీ భార్య తీరు  దానికి నువ్వు వకాల్తా పుచ్చుకుని మీ అమ్మ మీద విరుచుకు పడటమూనూ. 


మీ అమ్మను యెన్నోతూర్లు ఛీత్కరించినావంట. యెన్నోతూర్లు నువ్వు  అమెరికా కి ఇక రాబాకు అని అన్నావంట.  నువ్వెళ్ళిన పద్నాలుగేళ్ళకి మూడుసార్లు కాబోలు నీవుండే కాడికి వచ్చింది. వచ్చినప్పుడల్లా రానూపోనూ విమానం టిక్కెట్లు వచ్చాక ఆడ కట్టే హెల్త్ ఇన్సూరెన్స్  కలిపి నీకు భారం యెక్కువైతదే అనుకో, అయినా అట్లా ఛీత్కరించుకోవడం యేమైనా పద్ధతిగా వుందంట్రా? నిన్ను ఏరా! అంటేనే నచ్చని నువ్వు అమ్మని మాత్రం అగౌరవపర్చవచ్చా! పాపం! మీ అమ్మ మనసు యెంత గాయపడిందో! పద్దాక తల్చుకుని తల్చుకుని ఏడుస్తాది. నీకు ఫోన్ చేస్తే ఇరవై సెకన్లు ముప్పై సెకన్లు. ఫ్రెండ్స్ తో వుంటానంటివి ఆఫీసులో వుంటానంటివి. నీ కోడలికి ఫోన్ చేయ్ అని కట్ చేస్తావు.మీ ఆవిడకి ఫోన్ చేస్తే రెండు మూడు మాటలు. పిల్లదానితో ముచ్చట్లాడదామంటే పైన వుంది అంటది. మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా పిల్ల కనబడేది లేదు. నీ భార్య బాబాయి కూతురికి నీ పిల్లను మాలిమి చేసేస్తిరి. మీ అమ్మ పక్కన పడుకుని పిల్ల రైమ్స్ చూస్తుంటేనో పాటలు పద్యాలు చెప్పుకుంటూ వుంటేనో  దాన్ని బలవంతంగా తీసుకుపోయి నిద్రబుచ్చి చెల్లెలు పక్కన పడుకోబెట్టి బయటకుపోతారు మీరిద్దరూ. అప్పటికి మీ పిల్లను ఆ పిల్ల భద్రంగా చూసేది మా అమ్మ చూడనిది అని అర్థమా!?  ఆ క్షణాల్లో మీ అమ్మ మనసు యెంత నొచ్చుకుని వుంటది, ఆలోచించి చూడు. మీ అమ్మ దగ్గర  నేను వుండినప్పుడు మీ వేషాలన్నీ చానా  చూసాను లే! 


మీ అమ్మ అదేదో ప్రపంచ ప్రసిధ్ది గాంచిన  పుస్తకం కావాలని అడిగిందంట. ఇరవై డాలర్ల ఖరీదు చేసే ఆ పుస్తకం కొనిపెట్టకపోతివి. ఆ పుస్తకం ఆన్ లైన్ లో కుస్తీ పడి చదువుకుంది అంట. బాగా నచ్చింది అంట ఆ పుస్తకం. మీ నగరంలోనే మీకు అరగంట ప్రయాణదూరంలో వున్న ఆ రచయిత్రి స్మారక  కేంద్రం చూడాలని ఉవ్విళ్ళూరిందంట. సంవత్సరన్నర కాలంలో మీ అమ్మకు ఆ ఇల్లు చూపించడానికి నీకు తీరికేలేకపోయిందా? అంత బిజీగా వుండార్రా మీరు? నీకు క్రికెట్ ఆడుకోవడానికి,సినిమాలు చూడటానికి నీ భార్యా పిల్లతో కలిసి ఫ్రెండ్స్ ఇళ్ళకు పార్టీలకు వెళ్ళడానికి తీరుబడి వుంటుంది కానీ మీ అమ్మ అడిగిన చిన్న కోరిక తీర్చడానికి సమయంలేదా? మీ ఇంటికి రెండు మైళ్ళ దూరంలో వున్న లైబ్రరీ లో తను రాసిన పుస్తకాలు వుంచుదామని తనను తీసుకు వెళ్ళమని అడిగి అడిగి అలసి పోయిందట. అందుకూ తీరిక లేదు నీకు. ఇక అక్కడే వున్న తన స్నేహితురాలికి ఆరోగ్యం బాగుండక ఆపరేషన్ చేస్తే  చూడటానికి వెళ్దామని అడిగి అడిగి రోత పుట్టి అడగడం మానుకుంది అంట. ఏం బిడ్డవి రా అయ్యా! మీ అమ్మ ఏమన్నా విమానాలకి టికెట్లు కొని నయాగరా ఫాల్స్ చూపమని అడిగిందా వైట్ హౌస్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించమని అడిగిందా? అరగంట దూరం కార్లో పోయి వచ్చే ప్రదేశం చూపమని అడిగింది. దానికి అయ్యే ఖర్చు నువ్వు ఒకరోజు రెస్టారెంట్లో చిరుతిండి తినే ఖర్చు. నీ భార్య తినే ఐస్ క్రీమ్ అంత ఖర్చు. మీరు ఆర్డర్ పెట్టుకునే పిజ్జాలంత ఖర్చు.  తల్లి చిన్నపాటి కోర్కెను తీర్చలేని నువ్వేం బిడ్డవి రా!? నీకు నచ్చినవి ఇవ్వడం కాదూ అమ్మ అడిగినవి ఇవ్వడం తెలియదూ నీకు. 


మీ అమ్మ ఖరీదైన బహుమానాలు అడిగిందా, విహార యాత్రలు,విందు భోజనాలు అడిగిందా? తలకు మించిన భారం మీదేసుకుని పుట్టినరోజు పండుగలు చేస్తావుంటే చూసి ఊరకుండలేక పెద్దదానిగా, మంచి చెడు బిడ్డకు చెప్పుకుందామనుకుంటే వినే ఓపిక లేకుండే నీకు. కరోనా వచ్చి గదిలో పడివుంటే పదకొండు గంటలైనా ఇన్ని కాఫీ నీళ్ళు దాని ముఖాన పొయ్యకపోయే, అయ్యా!మందులు వేసుకోవాలి గా, ఇంతవరకూ ఏమీ తినకపోతే  యెట్టా?  ఏమైనా పట్టుకుని రా!  అని నీకు ఫోన్ చేసి చెబితే నువ్వు విసుక్కుంటూ కాసిని  పాలు అవెన్ లో కాచి అందులో నాల్గు బ్రెడ్ ముక్కలు వేసుకొచ్చి యిచ్చి యింకెప్పుడూ యిక్కడికి రాబాకు. నా భార్య నీకు చేసిపెట్టదు అని అమ్మను విసుక్కొనే బదులు నీ భార్యను   మందలించవచ్చు కదరా! అంత దద్దమ్మ వి అయిపోయావా నువ్వు? నువ్వు నీ భార్య కలిసి ఎంత అగమానం చేసి పంపినారు!!.

మీ నిరాదరణ  మీ ఛీత్కారాలు మీ మాటలు అన్నీ తల్చుకుని తల్చుకుని గట్టు తెగిన వాగు అవుతది. అట్టాంటప్పుడు దాన్ని చూస్తే కడుపు తరుక్కుపోద్ది. 


మీ అమ్మ కపటం లేని మనిషి రా! మీ నాన్న భర్త గా యెంతో ద్రోహం చేసినాడు. పీకలదాకా తాగొచ్చి తల పగలగొట్టాడు మక్కెలిరగదన్నాడు. ఎంతగానో అవమానించాడు. అలాంటి దుర్మార్గుడి నుండి తప్పించి మీ అమ్మను మేమే దూరంగా పంపించేసాం. నిన్ను పెట్టుకుని ఇరవై యేళ్ళు నీ కోసమే బతికింది పాటుపడింది. అటువంటి మీ అమ్మకు రోగమొస్తే యిన్ని మంచినీళ్ళు పొయ్యడానికి ఇంత కూడు పెట్టడానికి కష్టం అయిపోయిందా నీకు. మీ అమ్మ నీ దగ్గర వుండేదానికి యిష్టపడేది యెందుకో తెలుసా! నీ పిల్లను వొళ్ళో వేసుకుని ఆడించేది ఉప్పుమూట మోసోది, యెత్తుకుని మోసేది స్నానం చేపిచ్చి గోరుముద్దలు తినిపించేది ప్రేమ నిండిన హృదయంతో.  నీ పిల్ల ముద్దు మురిపాల్లో  చిన్నప్పటి  నిన్ను  చూసుకోవడం కోసం.  ఆ పసి స్పర్శ లో వుండే స్వచ్ఛత కోసం. ఆ ప్రేమలో ఆ స్పర్శ లో తన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవడం కోసం అక్కడ వుంటది. ఆమెకు మీ కన్నా యెక్కువగా యెవరుండారని  యిక్కడ వుండాలి చెప్పు.  ఒంటరితనం అనే పెద్ద రోగమే కాకుండా అనేక అనారోగ్యాలకు మందు మనుమరాలు అని, కొడుకు కోడలు దగ్గర వుంటే ఏ బాధలు తన దరిదాపుల్లోకి రావు అని అనుకోవడమే అది చేసిన తప్పా!? అదే పెద్ద శిక్ష అయిపోయింది దానికి. ఆప్యాయంగా కంచంలో ఇంత కూడు వెయ్యకపోయినా పెద్ద దరిద్రం యింట్లోకి వచ్చి కూర్చుంది అనే నవనాడులు కృంగ దీసుకునే మాట అనిపించుకుని గుడ్లనీరు గుడ్ల కుక్కుకుని మనవరాలి కోసం  సంవత్సర కాలం  వుండివచ్చింది. ఇన్ని చూసినాక ఒక సామెత గుర్తొచ్చింది. నీకు అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం అయిపోయింది అని. మీరు చేసినవి చెప్పాలంటే యింకా చాలా వుండాయిలే, కతలు కతలుగా చెప్పింది మీ అమ్మ.  ఎనబై ఏళ్న ముసలిదాన్ని.  సరిగా గుర్తుండక అన్నీ అడగలేకపోతున్నా.  అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంకోసారి ఉత్తరం రాస్తానులే!


ఎక్కడో అక్కడ తప్ప తల్లులు  బిడ్డలకు ఏం ద్రోహం చేస్తారు రా నాయనా! కోడలు కూడా ఓ ఇంటి కూతురే కాబట్టి తప్పు దారిన నడుస్తుంటే  తమ బిడ్డే అని పక్షపాతం చూపకుండా   కొడుకుని మందలిస్తారు. ధర్మం చెబుతారు. నేను మీ తాత అదే చేసినాము. మీ నాన్న ను పెడన పెట్టాము. నిన్ను కూడా అప్పుల పాలు కాకుండా కాపాడుకోవాలని మీ అమ్మ మంచి సెబ్బర చెప్పబోద్దేమో, అంతేగా! నువ్వు మీ అమ్మ మాట ఏనాడైనా విన్నావా పెట్టావా?  మీ అమ్మ నిక్కచ్ఛిగా మాట్లాడుతుంది. మాట కరుకు కావచ్చోమో గానీ దాని  మనసు వెన్న. నేను మంచానా పడితే చూసేది కూడా మీ అమ్మే! నలుగురు కోడళ్ళున్న అత్తగా నేను మీ అమ్మ మనసు వరుస తెలిసిన మనిషిగా చెబుతున్నా! అంతెందుకు? మీ నాన్న పరాయిదాన్ని పెట్టుకుని  ఇరవై యేళ్ళ మిమ్మల్ని వొదిలేసి పోతే కయ్యలు పశువులు మోటరుబండ్లు అన్నీ అమ్ముకుని నాశనం చేస్తే నిన్ను నిలబెట్టింది మీ అమ్మ కాదూ! నీ పెళ్ళప్పుడు వచ్చి  దిష్టిబొమ్మలా నిలబడటం తప్ప మీ అయ్య చేసింది ఏముందిరా కూరలు బాగోలేదు, మర్యాదలు బాగా జరగలేదని వొంకలు పెట్టడం తప్ప. అట్టాంటి మీ నాన్న కు నయం కానీ రాచపుండు పుడితే యింటికి తెచ్చి హాస్ఫిటల్ కి తిప్పుతూ లక్షలు ఖర్చు పెట్టింది.  వచ్చిపోయే మీ నాన్న మరో సంతానాలను ఆదరించి మీ నాన్న కూసే వొంకర కూతలన్నీ భరించింది. ఏడాదిపాటు నరకం చూస్తూ కూడా  మనిషి బతికితే చాలని తాపత్రయపడింది. మీ నాన్నను అరచేతుల మధ్య  పెట్టుకుని చూసింది.ఆఖరికి మీ అమ్మ చేతుల మధ్యనే ఊపిరి వదిలాడు. దూరంగా వుండి  డబ్బులు పంపడం తప్ప మీ అమ్మ మీద రంకెలేయడం తప్ప నువ్వు చూసింది చేసింది ఏడ అని? మీ అమ్మ దగ్గర ఇంకా నీకు ఈయటానికి ఏమీ లేవు ఎముకలు తప్ప. సొమ్ము లేకపోయేసరికి మీ అమ్మ నీ కంటికి గౌరవంగా కనబడటం లేదేమో! అమ్మంటే అంతు లేని సొమ్ము అంటారు.మీ అమ్మ ను పరుల ముందు చులకన చేసుకోబాకు. నువ్వే చులకన చేస్తుంటే నీ భార్య యెట్లా గౌరవిస్తాది విలువనిస్తాది చెప్పు. వాసం గ్రాసం చూస్తున్నావు కదా అని అమ్మ ని బిచ్చగత్తె లాగా చూడకు.తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు నాయనా!   


అమెరికా కో ఇతర దేశాలకు పోయినాళ్ళందరూ కాసిన్ని డబ్బులేసి మనుషులు పోయినప్పుడు వాట్సాప్ కాల్ ల్లో కన్నీళ్ళు పెట్టడం కాదు కావాల్సింది. బతికి వున్నప్పుడు అమ్మా తిన్నావా! ఆరోగ్యం బాగుందా? అని అడగడంతో పాటు అక్కడ మనవాళ్ళ చుట్టూ యెవరెవరు వుండారు? వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు యేమిటి అని ప్రశ్నించుకోవాలి. ఎవరితోనైనా అంటీముట్టనట్లుగా వుంటే  ఇక్కడ  మీకు బంధువులు స్నేహితులు ఎట్టా వుంటారు? నాకు ఎవరూ లేరు అనుకోవడం యెందుకు? ఉన్న వాళ్ళను నువ్వెంత విలువగా ఇష్టంగా పలకరిస్తున్నావ్ చెప్పు? ఈ ముసలి ముండకైనా యెప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడావా? మీ అమ్మ దగ్గర వుంటే నేను  వాట్సాప్  కాల్లో  మాట్లాడటం తప్ప.  అంతెందుకూ! మీ పిన్నమ్మ నిన్ను చిన్నప్పుడు రెండేళ్ళు పెంచింది.తన దగ్గర పెట్టుకుని చదివించింది. నీ ముడ్డి కడిగి నీ మూతి తుడిచి పక్కలో పడుకోబెట్టుకుని చక్కంగా ప్రేమగా పెంచింది. పెరిగి పెద్దవుతుంటే నీకు మంచి భవిష్యత్ వుండాలని తాపత్రయపడింది. అమెరికా లో ఇంకో మూల వున్న దాని బిడ్డ ఏదో ఇబ్బందిలో పడిందేమోనని వెళ్ళి చూసి రమ్మని వేడుకొంది. నువ్వు వొంకలు చెప్పావ్  ఆఖరికి పెడ చెవిన పెట్టావ్. రక్తసంబంధం వున్న వాళ్ళు నీకు ఆప్తుల్లా కనబడకుండా పోయారు. అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ బంధువులు ఎవరూ నీ వాళ్ళు కాకుండా పోయారు. భార్య తరపు బంధువులు ఆత్మ బంధువులై పోయినట్టున్నావ్. నీలాంటి వాళ్ళను చూసే అయినవాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచాల్లో అని అంటారని నీకు తెలియదేమో!.  


పయిలం బిడ్డా! అన్ని బంధాలను పెడన పెట్టి డబ్బు సంపాదనే లోకంగా భార్య మాటే వేదవాక్కు గా బతకబాకు. బతకనేర్చిన మాటలు మాట్టాడబాకు. మళ్ళీ చెబుతుండా, మీ అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తా వుండింది. అది మొగుడు లేకుండా బతకగల్గింది కానీ  బిడ్డ  చూసే  పెడసరపు చూపు భరించలేకపోతుంది. అయినా మీ అమ్మ బతకడం తెలిసిన మొగలాయి. మీ నాన్న ను వొదిలేసి బతికినట్టు నిన్ను నీ పాటికి వొదిలేసి బతకగలదు. అయ్య లేనివాడిగానే పెరిగావ్. వాడూ పొయ్యాడు.  ఇక అమ్మ కూడా లేకుండా  యెవురూ లేని వొంటి గాడివి అయ్యి నీ భార్యబిడ్డలు చాలనుకుని ఒంటిగా బతికేయకు బిడ్డా, పయిలం బిడ్డా! ఈ వేలు కు ఆ వేలు యెడం అంటారు. ఏడనో  సముద్రాల అవతల వున్నవాడివి, మనసులో నైనా ఆలోచనలో నైనా మీ అమ్మ లాగా మనఃస్ఫూర్తిగా నా వాళ్ళు అని అనుకోవడం నేర్చుకో. మనసు నిబ్బరంగా వుంటది.మంచికి చెడుకీ మనుషుల అండ వుంటది. అయినవాళ్ళను దూరం చేసుకోబాకు. మనిషికి రవొంత డబ్బున్నా కొండలాంటి అండ వుండాలి. అది పోబొట్టుకోబాకు.  ఇంట్లో పెద్ద బాలశిక్ష పెట్టుకొని యింటిల్లపాది చదువుకోండి చాలు. అప్పుడు  బయట భగవద్గీత చెప్పబడల్లేదు నువ్వు. అమ్మల గురించి బిడ్డలు బిడ్డలు గురించి అమ్మలు గర్వంగా చెప్పుకోవాలి. ఫిర్యాదు చేయకూడదు. వుంటాను మనుమడా! శుభాశీస్సులతో ..  నాయనమ్మ.  


పిల్లవాడిని మనిషిగా చేయడానికి తల్లికి ఇరవై ఏళ్ళు పడుతుంది. 

అతడిని మరో స్త్రీ ఇరవై నిమిషాల్లో 

“పూల్ “ ని  చేస్తుంది.  - రాబర్ట్ ప్రాస్ట్. 


(బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక - ఏప్రిల్-జూలై సంచిక లో ప్రచురితం)







బ్రాహ్మణత్వం కోల్పోయిన మనిషి

 ప్రేమ్ నగర్ లో అతిథి - అచ్యుత్ తోటేకర్/శిష్ఠా జగన్నాథరావు. బ్రాహ్మణత్వం కోల్పోయిన మనిషి కథ.

ప్రేమ నగర్ లో అతిథి - గోవాలోని దేవదాసీ పద్ధతికి సంబంధించింది. ఈ ఆచారం ఆదికాలం నుంచీ వస్తోంది. సామాజిక చైతన్యం వలన ఈ వ్యవస్థ నెలుగులోకి వచ్చింది. ఈ ఆచారంలోని ఒక నాజూకు భావబంధం ఈ కథలో గొప్పగా చిత్రించబడింది. అశ్లీలం అనిపించకుండా రచయిత అద్భుత పంధాలో కలం నడిపించారు. మీరూ విని ఆస్వాదిస్తారని…


ప్రేమ నగర్ లో  అతిథి




14, జులై 2024, ఆదివారం

అన్ని దుఃఖాలు వొకటి కాదు

 


కుక్క చనిపోయిందని గగ్గోలు పెడుతున్న ఈమెచెట్టంత మనిషి చనిపోతే ఒక్క కన్నీటి చుక్కైనా రాల్చడం లేదు, యే౦ మనిషో పాడు" అంటూ చెవులు కొరుక్కున్నారంట కూడా. భావోద్వేగాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి అప్పుడెందుకు రాలేదో నేను మాత్రం యే౦ చెప్పగలను, అయినా  ఇంకెక్కడ ఉంటుంది దుఃఖం? ఇన్నేళ్ళ దుఃఖం లోలోపలికి యింకిపోయి కడలి లెక్కన లోన  దాగుంది. దాన్ని తోడిపోసే చేద యెవరి చేతిలోనో,చేష్టలోనో  అతని చావులోనో ఎందుకుంటుంది.? కనుల పొరల మధ్య  పొంగుతున్న నదులని ఆపడం ఎవరికైనా సాధ్యమా!? 


13, జులై 2024, శనివారం

కమలాదాస్ కథ వొకటి

 Padmavathi the horlte - Kamala Das

ఈ కథ చదవగానే.. నేను ఫక్కున నవ్వాను. నవ్వుతూనే వున్నాను. ఎంత బాగా రాసారు రచయిత అని ముచ్చటపడ్డాను. ఏమి కథ ఏమి కథ అని అబ్బురపడ్డాను. కథంటే శైలి రాసిన విధానం కూర్పు చూసిన తర్వాతనే ఇతివృత్తం చూస్తాను నేను. కథాంశం అయితే ఆకట్టుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. భక్తుల మనోభావాలు గాయపడితే పడొచ్చుగాక.. నేనూ దేవుడిని విశ్వసిస్తాను తిరుమల కూడా వెళతాను. కానీ కథా రచయిత ఆలోచన వుంది చూడండి.. దేవుడు కూడా సగటు మగవాడే.. అందులో ప్రత్యేకత ఏమీ లేదు అంటుంది. మరి ప్రత్యేకత వుంటే.. భక్తులు ఆయనతో  బేరసారాలు ఏమిటి? కోర్కెలు కోరుకుంటాం మొక్కులు మొక్కడం కోర్కెలు తీరాక ఆ మొక్కులు చెల్లించడం. భగవంతుడికి భక్తుడికి మధ్య చెల్లింపులు ఏమిటీ. భక్తుల నుండి నిష్కల్మషమైన భక్తి తప్ప మరేది కోరుకోడు దేవుడు అని కొందరి భావన. దేవుని చూడటానికి వస్తూ ఫలం పుష్పం తేలేకపోయాను అంటుంది. తర్వాత శరీరమైనా ఇచ్చివుందును కానీ నా శరీరం పాపపంకిలం అయిపోయింది అన్నా కూడా ఆమెలో స్త్రీ నే చూసాడు దేవుడు. ఆఖరిలో ఆ అల్లరిమూక ఆమెని ఎందుకు గౌరవించి భక్తితో నమస్కరించి పక్క కు తొలగారు అంటే.. ఆమె దేవుడి మనిషి అని. ఆమె పవిత్రురాలై పోయింది అని. సాధారణ మానవులతో కూడి ఆమె ఆర్థిక అవసరాల కోసం వేశ్య అయింది (ముద్రింపబడింది) అనుకుంటే మనిషి కాని దేవుడితో కూడటం వల్ల పద్మావతి పవిత్రురాలైపోయింది. 

రచయిత నాస్తికురాలు కాదు. కృష్ణ భక్తురాలు. కానీ  విభిన్నమైన కథలు రాయటంలో  ప్రసిద్దురాలు. కథలో కల్పన పాలు ఎక్కువ. దేవుడు కూడా సాధారణ మానవుడి లాంటివాడే అని ఆలోచించి ఈ కథ రాయడమే గొప్ప సృజన. 

“పద్మావతి ద హార్లెట్” కథ ఇంగ్లీషు నుండి

తెలుగులోకి అనువదించిన వారు: S కాత్యాయని గారూ.. కథను వినండీ.. 

Padmavathi the horlte - Kamala Das

అనువాదం : S కాత్యాయని 

స్వరం: వనజ తాతినేని. 



11, జులై 2024, గురువారం

మాంసాహారం తినే మొక్కలను చూసారా..లేదా విన్నారా!?

 The Hungry Septopus  -Satyajit Ray 

మాంసాహారం తినే మొక్కలను చూసారా..లేదా విన్నారా!? ఈ కథ వినండీ. 

ఆకలిగొన్న సప్తపాశం - సత్యజిత్ రే 

నెపంస్థిస్, వీవస్ ప్లైవల లాంటి మొక్కలు బొద్దింకలు సీతాకోకచిలుకలు గొంగళి పురుగులు లాంటివి తింటాయి. సన్ డ్యూ లాంటి మొక్క మాంసాహారాన్ని తింటుంది. ఇలాంటి కోవ లోవే బట్టర్ వర్ట్, బ్లాడర్ వర్ట్ కూడా! 

అవి కాకుండా సెప్టోపస్ అనే మొక్క కూడా మాంసాహారాన్ని తింటుంది. నికారగువా అనే ప్రాంతంలో గౌటెమాలా దాటిన తర్వాత ఈ చెట్టును చూసాను. అక్కడ ప్రజలు దీన్ని దయ్యపు చెట్టు అని పిలుస్తారు. ఇంకా ఈ చెట్టు గురించి చెప్పాలంటే పూర్తి కథ వినండీ. కథ ఫిక్షన్ కావచ్చేమో కానీ ఈ దెయ్యం చెట్లు వుండటం అబద్దం కాకపోవచ్చు. 

మాంసాహార మొక్కలు/చెట్లు గురించి తెలుసుకోవాలంటే septopus plant గురించి google search చేయండి. అనేక ఆశ్చర్యకరమైన భీతి కల్గించే విషయాలు తెలుస్తాయి. 




బతుకు గంప

 ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఎల్లమ్మని గురించిన ఆలోచనలు నన్ను గందరగోళ పరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి... పద్మ... హరిత... ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులూ లేవు. ఖరీదైన చీరలే కడతారు. ఖరీదైన మనుషుల్లానే కనపడతారు. విందులు, వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్లి వస్తుంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్లు వూహించుకున్నవి వాళ్ల సొంతం కాలేదని వాళ్ల జీవితమంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడూ సుఖమన్న మాట, ఆనందమన్న

మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు గాని, వాటి గురించి ఆలోచించినట్లుగాని కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో వున్నట్లు కనిపించింది.. అంటుంది కథకురాలు. 

మూలింటి చంద్రకళ రచన “బతుకు గంప” కథ వినండీ.. ఈ కథ ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల  విద్యార్ధులకు 10 తరగతి తెలుగువాచకం లో 2 వ పాఠం గా వుంది.. కథ వినండీ. కథ నేను పాఠ్య పుస్తకం నుండే సేకరించాను. ఈ కథ వినిపించడం పట్ల అభ్యంతరం వుంటే.. వీడియో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. 



9, జులై 2024, మంగళవారం

ఇవ్వడంలో వుండే ఆనందం

 పాట తోడు -వనజ తాతినేని

హేమ కి  భలే ఆశ్చర్యమేసింది . వాళ్ళ మధ్య ఏ రక్త సంబంధం, ఏ విధమైన అనుబంధమూ లేదు . పైగా ఎవరైనా అతనికి భిక్షమేస్తున్నా ఓర్చుకోలేకపోయేవారు  ఎప్పుడూ అతనితో  గొడవపడుతూనే ఉండే వారు .  అలాంటిది గౌరి అతన్ని అలా ఆదుకుందంటే.. ఆలోచిస్తుంటే అబ్బురమనిపించింది. తోటి మనిషిపట్ల  ఉండాల్సిన కూసింత కరుణ ఆమె రేపటి పరిస్థితిని కూడా మరపించేసింది. ఇట్టా కాకపొతే ఇంకోలా బతుకు బతకలేమా అన్న ధీమా, తెంపరితనంతో ఏ మాత్రం ఆలోచించకుండా  అతనికి సాయం చేసేసింది. గౌరిలో ఉన్న ఆ గుణం ఆమెకి బాగా నచ్చేసింది   క్రమేపీ క్రమేపీ నాకు మనుషులపై తగ్గిపోయిన నమ్మకం  తిరిగి ఇక్కడిలా సాక్షాత్కారమవడం ఆనందం కల్గించింది అనుకుంది. 

గౌరి రంగడు.. వీరి గురించి తెలుసుకోవాలనుకుంటే కథ వినండీ.. 




8, జులై 2024, సోమవారం

లవ్ ఈజ్ సిల్లీ..

 ప్రతి రాత్రి ప్రేమ గీతాలు పాడేదాన్ని కానీ నిజమైన ప్రేమికుణ్ణి చూడలేదు. ప్రతి రాత్రి నిజమైన ప్రేమ కథలను నక్షత్రాలకు వినిపించేదాన్ని. కానీ ఈనాటికి నిజ ప్రేమికుణ్ణి చూడలేకపోయాను. ఇప్పుడు చూసాను అతనికి సాయం చేయాలి అనుకుంది ఆ నైటింగేల్. కానీ ఆ పక్షి త్యాగం విలువ లేనిదీ గానే ఎందుకు మిగిలింది.!?

ఆస్కారం వైల్డ్  “The Nightingale and the Rose” కథ అనువాదం ఆడియో బుక్ లో… 





వానల్లు కురవాలి

 ఓ  లల్లాయి పాట.. వాన కబుర్లు అని వేరే కబుర్లు చెప్పిన ఆడియో బుక్. 

వింటారు కదూ!



7, జులై 2024, ఆదివారం

ప్రకృతి పుస్తకం

 ప్రకృతి పుస్తకం -వనజ తాతినేని.

నా చుట్టూ నక్షత్రాలు అక్షరాల రూపంలో కాంతులు విరజిమ్ముతున్నాయి. 

మదిలో మెదిలే భావాలు అడవిపూల సౌంగంధాన్ని వెదజల్లుతున్నాయి. 

పుట తిరగేయని ఓ మొహమాటపు మర్యాద సిగ్గు పడుతూ మేఘాల మాటున జాబిలి లా తొంగి చూస్తుంది. 

నా చిన్నారి మనసు తుళ్ళి తుళ్ళీ పదాల వాన చినుకుల్లో సంబరంగా ఆడుకుంటుంది

వాన వెలిసాక ఇంద్రధనుస్సు లోని రంగుల్లన్నీ  పుస్తకాల సీతాకోకచిలుకలై  తోటలోఆడుకుంటున్నాయి.

ఓ తుంటరి సీతాకోక చిలుక నా ముఖంపై వాలింది. కాలమెందుకో స్థంభించిపోయింది.

మమేకమైతే ప్రకృతి ఓ పెద్ద పుస్తక భాండాగారం కదా!

5, జులై 2024, శుక్రవారం

విభిన్న ఆకర్షణ

 విభిన్నమైన ఆకర్షణ 

ముళ్ళ చెట్టు పండ్ల చెట్టు పూల చెట్టు అన్నీ పై పై స్వభావాల్ని ప్రదర్శిస్తాయి. భూమి లోపలంతా వేళ్ళు కలగలుపుకుని పెనవేసుకునే వుంటాయి. 

స్తీ తీగ లాంటిది పురుషుడు ఆధారం అంటారు కానీ.. 

తీగ తను పెనవేసుకున్న మానును ఎదగనివ్వదు. మాను తన కింద తీగను ఎదగనివ్వదు. పరస్పర శత్రువులు. ఒకరిపై వొకరు పై చేయి సాధించాలనే కాచుకుకూర్చుంటారు.



హృదయ దౌర్బల్యాన్ని జయించలేని నీలవేణి

 రైలు కదిలింది. నీలవేణి అందరికీ వీడ్కోలు చెబుతూనే వుంది. అయినా ఆమె కళ్ళు ఫ్లాట్ఫారమ్ పై యెవరి కోసమో వెతుకుతున్నాయి. ఆమె యెవరి కోసం యెదురుచూస్తుందో ఆ వ్యక్తి రానేలేదు.  స్టేషన్ దాటి పెన్న బ్రిడ్జి ని  దాటి పరుగందుకుంది రైలు. తన సీట్ లో కూర్చుంటూ  రాని వ్యక్తికి మనసులో  కృతజ్ఞతలు తెలుపుకుంది. పులి యింకో పులికి స్వాగతం వీడ్కోలు రెండూ పలకదు.తన రాజ్యంలో తనే పులి. ఎవరి మనోవరణంలో వారే పులి. 

కథ ముగిసిందనే అనుకుంటారు అందరూ… కానీ ఇంకో కథ అక్కడ ప్రారంభమవుతుందని రచయిత కూడా ఊహించలేడు. పాత్రల నడకలను రచయిత ముక్కుతాడు వేసి నియంత్రించలేడు.


కథ వినండీ



4, జులై 2024, గురువారం

ఉడ్ రోజ్ పూచిందా?

 ఉడ్ రోజ్ -అబ్బూరి ఛాయాదేవి

కథ వినండీ.. నేనైతే.. కథ లో లీనమై పోయాను. నాకు బాగా నచ్చిన కథ. లోతైన కథ. రెండు పేజీల కథే కానీ .. బోలెడు విషయం ❤️ 

ఈ కథ అనేక భాషల్లో అనువదింపబడింది. తప్పకుండా వినండీ..