23, డిసెంబర్ 2015, బుధవారం

దేవునికి స్తోత్రము

ఫ్రెండ్  రమా రవీంద్ర .. ఫోన్ చేసింది .  హడావిడిగా ఉంది. " ఏమిటి తల్లీ విషయం !? " అన్నాను . బాల సుబ్రహ్మణ్యం గారి పాట ఒకసారి వినిపించు అంది . సరే .గూగుల్ లో వెతికి ప్లే చేసి వినిపించాను. "ఈ పాట లిరిక్స్ తెలుగులో కావాలి అంది "  " దొరకాలి కదా ".. అన్నాను. "దొరకకపోతే నువ్వు వ్రాసి ఇవ్వాల్సిందే! తప్పదు"  అంది. 
ఈ ప్రయత్నమంతా ఎందుకంటే .. డిసెంబర్ 31 స్ట్   కి న్యూ ఇయర్ వేడుకలప్పుడు .. తన ఫ్రెండ్స్ కోసం  ఈ పాట నేర్చుకుని పాడి వాళ్లకి కానుకగా అందించాలని ప్రయత్నం . నా స్నేహితురాలి గొంతు చాలా బావుంటుంది కూడా !  రోజూ .. మా విజయవాడ FM కి కాల్ చేసి మా మాట -మీ పాట కార్యక్రమానికి పాటలు పాడి అలరిస్తూ ఉంటుంది . తన కోరిక ప్రకారం పాటని వింటూ  సాహిత్యం వ్రాసాను. ఎలాగూ వెబ్ లో కూడా సాహిత్యం లేదు కదా.. ఈ పరిచయం .  ఈ పాట  కూడా చాలా బావుంది .. మీరూ వినేయండి . ఇతరులకోసం పని చేయాలి  అప్పుడే సంతృప్తి ..నాకైనా , నా నేస్తం "రమ రవీంద్ర " కైనా .. 

SP. బాలసుబ్రహ్మణ్యం గారు  ..  ఆలపించిన  క్రైస్తవ గీతం 

దేవునికి స్తోత్రం  పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము 
పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము

అనగులగు తన తనయు సుతమున మనుగు భూ నభములను  జీవుల 
అనగులగు తన తనయు సుతమున మనుగు భూ నభములను  జీవుల
ఇరుని  నక్షత్రాదులను  మా మనుగడకి మేలొసగ జేసిన
దేవునికి స్తోత్రం  పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రము

దినములను  రాత్రులను రుతువుల  దివ్యమగు కార్కేలని   నిలిపి  
దినములను  రాత్రులను రుతువుల  దివ్యమగు కార్కేలని   నిలిపి  
తనయులని బహు నెనరు తోడను ఘనముగా  మము సృష్టి జేసిన
దేవునికి స్తోత్రం  పరిశుద్ధుడగు మా దేవునికి...  స్తోత్రము
ఆ .. ఆ... ఆ... ఆ... ఆ .. ఆ... ఆ... ఆ... 

తొల్లి తన నరజాతి శోధన వల్ల  తన మార్గమును వీడి 
తొల్లి తన నరజాతి శోధన వల్ల  తన మార్గమును వీడి 
తల్లడిల్లగా పాప మరణపు ముళ్ళు విరిచిన కర్తయగు 
మా దేవునికి స్తోత్రం  పరిశుద్ధుడగు మా దేవునికి స్తోత్రమూ ... ఊ .. ఊ .. ఊ 







19, డిసెంబర్ 2015, శనివారం

చెలిని చేరలేక (ఖ )



చెలిని చేరలేక(ఖ)




రాత్రి సమయం మూడున్నర అయింది . రాత్రంతా పడక మార్చుకుంటూనే  వున్నాను    మనసు బరువుగా వుంది, అస్థిమితంగా  వుంది. ఇంకా బాగా చెప్పాలంటే  లోపలంతా వుక్కగా వుంది.   ఎవరితో పంచుకోవాలో తెలియడంలేదు, సంతోషాన్ని యెవరికైనా పంచగలం.  బాధనెవరికి పంచగలం ?  ఆప్తులకి మినహా. అందుకే ప్రక్కనే వున్న  మన అన్న వారిని వదిలేసి దూరంగా వున్నాసరే వారినే  మన ఆప్తులుగా జత  చేసుకుంటాం  వాసంతి అంతే కదూ ! ఆమె  గురించిన ఆలోచనలే  నాకీ రాత్రి  నిద్రని దూరం  చేసాయి మరి కొన్ని రాత్రులు యిలాగే వుండబోతాయనుకుంటా !

ఇప్పుడు తనెలా వుందో  అనుకుంటూ మొబైల్ని చేతిలోకి తీసుకున్నాను. ‘whatsaap” లో టింగ్ మంటూ వచ్చిన  మెసేజ్. చాట్ ఓపెన్ చేయకుండానే  డిస్ ప్లే లో కనబడుతున్న సారాంశం.
 ” నేస్తం ! నువ్వు దూరంగా వున్నావనేమో  రాత్రి   నీ స్థానంలో దిండు వచ్చి   నన్ను వోదార్చింది” అని. మనసు మరింత బాధకి గురయింది. నిన్న నేను  విన్న విషయం మర్చిపోలేకపోతున్నాను. రాత్రి    యే౦ జరిగిందో !   అదృష్టవశాత్తూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం విఫలమైంది కాబట్టి  తేలికగా వున్నాను  లేకపోతే… ఆ  వూహే భయంకరంగా వుంది. అయితే నిన్నటి సంభాషణని   అప్రయత్నంగానైనా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి రావడం  బాధాకరం. ఇది నిత్య గాయాల జ్ఞాపకం కూడానూ .

వ్యధల జీవన  సముద్రంలో  మరి కొన్ని కన్నీటి చుక్కలు చేరుతున్నాయి. మరి కొన్ని ఆవిరవుతూ వున్నాయి. నిన్నటి నుండి యెడతెరిపి లేకుండా  ఆలోచిస్తూనే వున్నాను. ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకినట్టే దొరికి మరికొన్ని ప్రశ్నలని ముందు నిలిపి సవాల్ చేస్తుంది.  ప్రశ్నతోనే ఆడదాని జీవితం ముగియాలన్నట్టు.  ఇంటి  పనులు చేసుకుంటూనే వాసంతికి   కొంత ఓదార్పు నివ్వాలనే  ఉద్దేశ్యంతో వొక ఉత్తరం వ్రాయాలనుకున్నాను. ఆలోచన రావడమే తరువాయి  క్షణంలో చేరుకునే ఈ – ఉత్తరం పెన్నిధిగా కనిపించింది నాకు. మెయిల్ బాక్స్ వోపెన్ చేసి వ్రాయడం మొదలెట్టాను.

వాసంతీ..
నాకవకాశం వుంటే   ఈ ఉత్తరానికి బదులు  ఉత్తర క్షణంలోనే నీ దగ్గరకి  చేరాలని నిన్ను హృదయానికి హత్తుకుని  నీ బాధని కొంతైనా పంచుకుని నిన్ను  సేదదీర్చాలని ఉంది. నీకు దైర్య వచనాలనివ్వాలని,  నీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారకూడదని, నీ పిల్లల  భవిష్యత్ ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోవద్దని, నీ వ్యక్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని భర్త పాదాల దగ్గరే పెట్టి నిత్యం అగ్ని సీతలా నీ పవిత్రతని నిరూపించుకోమని   చెప్పడానికి యీ లేఖ వ్రాయడం లేదు .

వాసంతి .. నీకు కొన్ని గాయాల సంగతి చెపుతాను విను. గాయాల సంగతి గాయానికి తెలిసినంతగా మరెవరికి తెలియదు అందుకే నీకు తప్పక కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది . నేనే చెప్పే విషయాలన్నీ యెవ్వరూ యెరుగని అత్యంత రహస్య విషయాలు యివి . చెప్పుకోవడానికి కూడా సరైన మనిషి కావాలంటారు కదా ! ఆ మనిషి జాడ కనబడకేమో యెంతో  గోప్యంగా నాలో దాగిన విషయాలివి. నీకులాగానే  మరికొందరు నాతో  పంచుకున్న వారి వారి చేదు అనుభవాలు. కానీ వీరందరూ నీలా ఆత్మహత్యా ప్రయత్నం చేయలేదు  దైర్యంగా బ్రతికి చూపిస్తున్నారు . అందుకే వారి గురించి నీకు చెప్పాలనిపించింది.

ముందుగా ధరణి .. అనుభవం ఆమె మాటల్లో విన్న నేను యిప్పుడు చెపుతున్నా.  ఎంత బాధ వుందో  చదివి అర్ధం చేసుకో! ధరణి మాటల్లో..

నాకప్పుడు 16 ఏళ్ళు వయసు . నాకప్పుడు చాలా పెద్ద అవమానమే జరిగినట్టయ్యింది  అదేమిటో "చెప్పనా,   పెద్దమనిషయ్యానని  తాటాకులపై కూర్చున్న మూడేళ్లకి కూడా ఆడమగ తేడా తెలియకుండానే అందరితో ఆడి పాడే  మనసు . పెద్దవాళ్ళు యింకా నీకు మగపిల్లలతో ఆటలేంటే అంటే అసలు లెక్కపెట్టని నేను  మగ పిల్లలతో యె౦దుకు ఆడకూదదో తెలియని నాకు వాళ్ళ మాటలు కోపం తెప్పించేవి . వాళ్ళ కళ్ళ  ముందు వాళ్ళు చెప్పినట్టే విని  తర్వాత స్వేచ్ఛగా మసిలేదాన్ని .  ఒక రోజు  బట్టలు వుతికే  చాకలి లక్ష్మి అమ్మ యేదో మాట్లాడుకుంటూ నావైపు అనుమానంగా చూస్తున్నారు . తర్వాత అదేరోజు రాత్రి అమ్మ నాన్నతో  యేదో చెప్పింది తర్వాత వారిద్దరూ అనుమానంగా నావైపే చూస్తూ యేదో మాట్లాడుకుంటున్నారు. తెల్లారి లేవగానే అమ్మ గబా గబా ఇంటిపనులు ముగించుకుని నన్ను కూడా బయటకి వెళ్ళడానికి తయారమని చెప్పి తను తయారయింది . “ఎక్కడికమ్మా వెళుతున్నాం? “అని అడిగాను వుత్సాహంగా. అమ్మ మాట్లాడలేదు.   ప్రక్కన వున్న టవున్ లో యే చుట్టాలింటికో  తీసుకు వెళ్ళి  తర్వాత సినిమాకి తీసుకెళుతుందేమోనని త్వర త్వరగా తయారయ్యాను .

అమ్మ నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది .అమ్మకి బాగొలేదేమో తోడూ తీసుకొచ్చింది అనుకుని అమ్మతో లోపలి వెళ్లాను    నన్ను బయటే కూర్చోబెట్టి లోపలి వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వచ్చింది. తర్వాత నర్స్ వచ్చి నన్ను లోపలి తీసుకు వెళ్ళి లోపలి గదిలో బల్లపై పడుకోబెట్టింది.  “నన్నెందుకిలా  పడుకోబెడుతున్నారు నేను బాగానే వున్నాను కదా”  అంటూ విదిలించుకుని బయటకి రాబోయాను . డాక్టర్  వచ్చి నా భుజంపై చేయి వేసి మృదువుగా అడిగింది “నీకు మూడు నెలలుగా నెలసరి రావడం లేదని అమ్మ భయపడుతుంది, పరీక్ష చేసి చూడాలి అందుకే నువ్వు బల్లపై పడుకోవాలి ” అని చెప్పి బలవంతంగా పడుకోబెట్టి గ్లవుజ్ తొడుక్కున్న  చేయిని  లోపలికి పెట్టి  కెలికి చూస్తూ .. “నువ్వు యెప్పుడన్నా మగాళ్ళతో పడుకున్నావా ? అలా పడుకుంటే నెలసరి రావు,  కడుపు వస్తుంది. అది మీ అమ్మ భయం ” అని ఒక విధంగా నవ్వి చేతిని తీసి తొడుక్కున గ్లవ్స్ తీసి చేతులు కడుక్కుని నాప్కిన్ తో తుడుచుకుంటూ   కుర్చీలో కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్లి కంగారు పడకండి అలాంటిదేమీ లేదు వొకో సారి నెలసరిలు ఆలస్యంగా వస్తూ వుంటాయి ” అని  చెప్పింది . అమ్మ “అమ్మయ్య  మంచి మాట చెప్పారు, యేమైందోనని భయపడి  చచ్చాను ” అని తేలికగా వూపిరి పీల్చుకుంది. ఆనాటి పరీక్ష  అదొక పెద్ద అవమానంగా తోచింది నాకు . 15 ఏళ్ళ పిల్ల శారీరక సంబంధం యేర్పర్చుకుందేమో అని అనుమానపడే తల్లిదండ్రులు, కాలేజీకి పంపితే చెడు తిరుగుళ్ళు తిరుగుతారని ఆలోచించే వాళ్ళు అసలు శరీరాల కలయిక అంటే యేమిటి , తమకి తెలియకుండానే యేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి తో సెక్స్ లో పాల్గొనే వాళ్లకి,  వంచనకి గురయ్యే ఆడపిల్లలకి గుప్పిట మూసి రహస్యాన్ని దాచినందువల్ల  వచ్చే భద్రత కన్నా  అనర్ధమే యెక్కువ జరుగుతుందని అనిపించింది. నిజం చెప్పొద్దూ...   మూడు నెలలు నెలసరి రాకపోతే ఆదుర్దా పడి  అనుమానంగా చూసి , డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి పరీక్ష చేయించడం నా వరకు నాకొక పెద్ద అవమానంగా అనిపించింది.


మళ్ళీ అలాంటి అవమానమే యింకోటి  పదిహేడేళ్ళకే పెళ్ళయ్యి భర్తతో తొలిరాత్రి  నేనేదుర్కొన్న అనుభవం గరళం లాంటిదే!    భర్త  నాతో మాట్లాడిన మొదటి మాట, తొలి రాత్రి పానుపు పై కూర్చున్న నాపై  మొరటుగా చేయివేసి .. అనుభవం  ఉందా! అదే యాంగిల్స్ తెలుసా !? అని.   అవమానంతో మనసు రగిలిపోయింది. దంతాల రెండు వరుసలు గట్టిగా కరచుకున్నాయి. ఏ స్పందనా లేకుండా శరీరాన్ని అప్పగించే పని అప్పుడే మొదలయ్యింది. ప్రతి రాత్రి అతనికి నేనొక అవసరమే తప్ప అతని చేతల్లో, మాటల్లో యేనాడు ప్రేమ దృక్కులని నేనెరగనని చెప్పుకోవడం కూడా నాకు అవమానంగా తోస్తుంది.  భర్త ప్రేమకై పరితపించే బలహీనమైన మనసు కాకూదదనుకుని లేని కాఠిన్యాన్ని  అరువు తెచ్చుకుని కొట్టినట్లు మాట్లాడే దాన్ని.  అలా  అందరిలో  నేనొక పెడసరపు మనిషిననే ముద్ర పడింది    నేనెప్పుడైనా  మగవారితో మాట్లాడుతుంటే అతని చూపులు నా శరీరం చుట్టూ ప్రహరా కాస్తున్నట్లే ఉండేది.  ఎవరైనా బందువులోచ్చి ఇల్లంతా రద్దీగా ఉన్నప్పుడు కూడా అతని ఆకలి తీర్చాల్సిందే!  పడక  సుఖం  అందకపోతే ఆడముండలు యింకొకడిని తగులుకుంటారు  నా దగ్గర మొగతనానికి కొదవేలేదు, రా వచ్చి పడుకో అంటూ అసహ్యంగా ప్రవర్తించే వాడు  సిగ్గుతో చచ్చిపోయే క్షణాలని ( కాదు కాదు యుగాలనాలేమో కదా) యెలా మరచిపోగలను? రోజుకొక స్త్రీ ని అనుభవించాలనే కాంక్ష, పచ్చి త్రాగుబోతైన, అనుమాన పిశాసైన   భర్త  నీడ వేయి పడగల పాము నీడగా భయపడాల్సి రావడంకన్నా వేరొక దురదృష్టం ఉంటుందా చెప్పు . ఓ పదేళ్ళు భరించాక నాపై నాకే జాలేసింది యెదురు తిరిగాను . ఫలితం  నిర్దాక్షిణ్యంగా నడివీదిలోకి నెట్టబడ్డాను. తర్వాత జరిపిన ఒంటరి  పోరాటంలో నేను గెలిచాననుకుంటాను  కానీ అడుగడుగునా శారీరక పవిత్రత అనే అగ్ని పరీక్షని యెదుర్కుంటూనే వున్నాను ” అని ఆవేదన చెందే ధరణిలా లక్షల  మంది స్త్రీ మూర్తులున్నారని  నువ్వు తెలుసుకోవాలి.

మరొకరి సంగతి .ఈ మధ్య   నాకత్యంత సన్నిహితులురాలైన కుసుమ బాధ  విన్నప్పుడు  ఆమె ఆత్మహత్య చేసుకోకుండా బ్రతికి వుండటమే చాలా గొప్పనిపించింది తెలుసా !  ఆమె యెంత  ఆవేదనని మనసులో దాచుకుని నవ్వుతూ ఆ విషయాన్ని చెప్పిందో, ఇప్పుడు గుర్తుకు వచ్చినా కన్నీళ్ళు వస్తాయి మరి . అంత పచ్చిగా వుంటుంది  ఆమె గాయం .


కుసుమ మాటల్లో  ….  ఓ రెండేళ్ళ క్రిందట అనుకుంటా  వొళ్ళు యెరుగని జ్వరంతో మంచం మీద పడి వున్నప్పుడు అటుగా వచ్చిన  నా కొడుకు స్నేహితుడు  పలకరించిపోదామని వచ్చి  నా స్థితిని చూసి హాస్పిటల్ కి తీసుకువెళ్ళి తర్వాత నా ఫ్రెండ్ కి నా విషయం తెలిపి ఆమె వచ్చేదాకా నాతొ హాస్పిటల్ లో వుండి పది రోజులపాటు  నిస్వార్ధంగా సేవ చేసాడు.  నేను బాగా కోలుకున్నాక “నీ ఋణం  తీర్చుకోలేను, యెంతో  సేవ చేసావ్ బాబూ ” అంటే  “మీ అబ్బాయి నాకు స్నేహితుడే కాదు అన్నయ్య లాంటి వాడు. అన్నయ్య యిప్పుడిక్కడ లేకపోతే ఆ భాధ్యత నేను తీసుకోవద్డా  అమ్మా !”  అన్నాడు. నిజంగా అతనిలో నాకు నా కొడుకే కనబడతాడు.   అది మొదలు అప్పుడప్పుడు నాకేదన్నా సాయం కావాలంటే చేసిపెట్టటానికి వస్తూ వుంటాడు. అందుకు వోర్చుకోలేదు  యీ లోకం. నా కొడుకు స్నేహితుడికి నాకు అక్రమ సంబంధం అంట గట్టి నా వెనుక చెప్పుకుంటారట . ఈ విషయం నాకు తెలిసినప్పుడు బ్రతుకు మీదే రోత కల్గింది. రెండు రోజులు యేడ్చాను . తర్వాత గుండె నిబ్బరం చేసుకున్నాను . ఈ సమాజం ఆడదాన్ని వొంటరిగా బతకనీయదు. ఎవరో ఒకరి అండలో వుండాల్సిందే ! వాడు యెంత తలకి మాసిన వెధవైనా సరే ! .  ఒంటరిగా  బ్రతికే దైర్యం  వున్నఆడదానికి  అక్రమ సంబంధాలు అంట గట్టి వినోదంగా చూస్తూ వుంటుంది.  నలుగురు కలిసి నవ్వుకుంటూ మళ్ళీ వాళ్ళు విడిపోయాక యింకో నలుగురు కలిసి అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం యిదంతా సర్వసాధారణం అయిపోయింది. నైతికత అనేది ఆడదానికే వుండాల్సిన ఆభరణమా ! గాయపడి, ఖేద పడి  వున్న ఈ శరీరానికి, మనసుకి యెప్పుడో ప్రిజుడిటీ  వచ్చేసింది .  ఎందుకురా బాబూ!  యె౦దుకమ్మా తల్లుల్లారా,  మళ్ళీ అలాంటి మాటలు మాట్టాడి మా  శరీరంపై  ప్రేమ పుట్టిస్తారు అని నవ్వుకుంటాను .. అని యెంత  బాధగా చెప్పిందో !  నేను కలలో కూడా ఆమె బాధ మరువలేను. ఇలాంటి అనుభవాలు మనందరివీ కాదా !


ఇంకో స్నేహితురాలు కృష్ణప్రియ గరళమైన అనుభవాలు యివి … ఆమె మాటలు యిలా వుంటాయి.
“అసలు మన బాధని గురించి పట్టించుకోని లోకాన్ని మనమెందుకు లక్ష్య పెట్టాలి . ఎవరి బాధలు యెవరి గాయాలు వారివి. ఎదుటివారికి యివన్నీ యెలా తెలుస్తాయి ? చెప్పినా  అర్ధం చేసుకునే సహృదయత వుందంటావా ? సునీతా విలియమ్స్ గురించి కొన్ని చెత్త నోళ్ళు  యిలా వాగుతుంటాయి “అంతరిక్షంలో  అంతమంది మగాళ్ళ మధ్య అన్నాళ్ళు  గడిపివచ్చింది  యేమి లేకుండానే వుందంటారా? ”  అని. ఆ మాటలు  విని మనిషి గా పుట్టినందుకు యెంత విరక్తి కల్గిందో నీకెలా చెప్పగలను. ఇక మన యింట్లో వాళ్ళు మనని అనుమానించడం  తక్కువేం కాదు మనం యెవరితో మాట్లాడినా ఆ సంబంధమేదో వున్నట్టు వూహించుకుంటారు,అనుమానంగా చూస్తారు . రహస్యంగా మనం మాట్లాడుకునే ఫోన్  సంభాషణలు వింటూ వుంటారు కూడా. అందుకు  నా  అత్తగారే ఉదాహరణ అంటూ కృష్ణ ప్రియ  చెప్పిన విషయాలు ఇవి .  భర్త రాజకీయ  నాయకుడి హత్య కేసులో  చిక్కుకుని ఆరేళ్ళు జైలు పాలైతే ఒంటరిగా యెoతో  పోరాటం చేసింది ఆమె ప్రతి అడుగుని, ప్రతి సంభాషణని  కుటుంబం అక్రమ సంబంధం దృష్టితోనే చూసింది. కుటుంబం అండదండలు కావాలని అత్త,మరిది,ఆడపడుచులతో   సన్నిహితంగా వుంటూనే వున్నాను. ఒకసారి  యే౦ జరిగిందో తెలుసా ?   “నా కూతురు  విదేశాలకి వున్నత చదువుకి వెళ్ళే సమయంలో  మా యింటికెదురుగా వున్న బిల్డర్ నుండి  తప్పనిసరై మాట సాయం తీసుకున్నాను . పాపం! అతను కూడా నిస్వార్ధంగా శ్రద్ద తీసుకుని మాట సాయం చేసాడు. అలా నా క్లిష్టమైన పని  సులభంగా జరిగిపోయింది. నా కూతురు  విదేశానికి పయనమై వెళ్ళేటప్పుడు నాకు మాట సాయం చేసినతను కూడా వాళ్ళ యింటి గేటు ముందు నిలబడి వున్నాడు . అతనికి కూడా వెళ్ళొస్తానని చెప్పి చేసిన సాయానికి థాంక్స్ చెప్పి రా …  అని నా కూతురికి  చెప్పాను.. నే చెప్పిన మాట విని నా కూతురు  అతని దగ్గరకి వెళ్లి వెళ్ళొస్తానని చెప్పి వచ్చింది .  అప్పటి నుండి మా అత్తగారికి నా పై యేవో అనుమానం. ఎప్పుడు  కలిసినా అతని గురించి ప్రస్తావన తీసుకు వస్తారు, అతని గురించి నేను యే౦ మాట్లాడతానో అని గమనిస్తూ ఉంటారు.    ఇంటికి వస్తే సరాసరి బెడ్ రూం లోకి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. నా బెడ్ మీద ఒక ప్రక్క  ప్రక్క నలిగి వుందా లేక రెండు వైపులా నలిగి వుందా అని పట్టి పట్టి చూడటం  నేను గమనించాను. ఒకసారి నా ఫ్రెండ్  వచ్చి రాత్రి వేళ  విడిది  చేసి వెళ్ళింది. ఇద్దరం కలసి పడుకుని యెన్నో ముచ్చట్లు చెప్పుకున్నాం,అలాగే నిద్ర పోయాం.   నాకసలే బద్ధకం ఎక్కువ  రోజూ ప్రక్కలు దులిపి  నీట్ గా దుప్పట్లు పరిచే అలవాటు లేనితనం కదా! అదే రోజు మా అత్తగారు వచ్చి చెకింగ్   ఒకవైపే నలిగి వుండాల్సిన ప్రక్క రెండవ వైపు నలిగి వుండటం చూసి యెవరు వచ్చారు?  అని అడిగింది అప్పుడుకి గాని  నాకర్ధమైంది ఆవిడ చెకింగ్ లకి అసలైన అర్ధం ” అని  చెప్పింది"కృష్ణప్రియ.


విని  నివ్వెరపోయాను. ఇలాంటి అనుమానాల మధ్య జీవిస్తున్న  స్త్రీల జీవితాల పట్ల  ప్రేమ వుప్పెనలా  ముంచుకొచ్చింది.  అసలు యీ లోకంలో ఆడ మగ మధ్య శారీరక సంబంధం వుంది   తీరాల్సిందే అన్నట్లు నిర్ణయించేస్తారు . మన  ప్రక్కన వుంది  తండ్రా ,బాబాయా ,అన్న, తమ్ముడా కొడుకా యీ వావి వరుసలేవీ అక్కర్లేదు. అలాగే వయసు తారతమ్యం కూడా పాటించాల్సిన  అవసరం లేదు . ఆడది మగవాడితో మాట్లాడితే రంకు , నవ్వితే రంకు , తోటి మనిషిగా సాయమందిస్తే కూడా రంకులంటగట్టేంతగా సమాజం యెదిగిపోయింది అనిపించింది నాకు.
మనిషికి మనిషికి మధ్య యే  విధమైన సంబంధం వుండకూడదు వుంటే  గింటే ఆ సంబంధం మాత్రమే వుండాలనే ఈ మనుషుల మనస్తత్వాలని చూస్తే జాలి కల్గుతుంది. మనిషికి మనిషికి మధ్య సహజంగా వుండాల్సిన మానవ సంబంధాల స్థానంలో,  ఒకరికొకరు యె౦తో కొంత సాయం చేసుకుని  ప్రేమాభిమానాలు పెంపొందించుకుని మనుగడ సాగించాల్సింది పోయి ప్రతి సంబంధాన్నీ  ఆర్ధిక సంబంధం గాను, శారీరక సంబంధంతో కొలిచే యీ సమాజంలో బతకడం యెంత  అవమానకరంగా వుంటుందో  తెలుసుకోవడానికి  నాకు తెలిసిన సంగతులు చెప్పడం కూడా  మంచిదే అనుకుంటున్నాను.  నీకవి  వుపకరిస్తాయని చెపుతున్నాను తప్ప నిన్ను యింకా  యింకా  ఆందోళనలోకి  నెట్టడానికి కాదని అర్ధం చేసుకుంటావనే నమ్మకంతో వ్రాస్తున్నాను.        


ఈ ఆడపుట్టుకే అవమానకరం . తాటిమట్ట లాంటి నోరున్న మనుషుల పాలబడి నెత్తుటి ముద్దై పోతుంది . ఎనెన్ని అవమానాలు, వినడానికి యెంత అసహ్యంగా వుంటాయో కదా ! ఈ మనుషుల్లో  సున్నితత్వం పోయి క్రూరత్వం చోటు చేసుకుంటుంది.  ఎన్నాళ్ళని ఓర్చుకోగలం?   కంటికి కనబడే ఈ శరీరం చుట్టూ, కనబడిని మనసు చుట్టూ యెన్ని కోట గోడలు కట్టుకోగలం? స్వేచ్చగా, గౌరవంగా మసిలే వీలు మనకి లేదా !? మనమూ  మనుషులమే కదా ! గొడ్డు బతుకూ, బండ బతుకూ అయినా బాగుండేదని అప్పుడప్పుడూ  యేడ్చుకుంటాను . ఏడ్చి  యేడ్చి కసిగా పైకి లేస్తాను .  అద్దం ముందుకు వెళ్లి యే సంకోచం  లేకుండా నన్ను చూసి నేనే నవ్వుకుంటాను.


నాలాగే నువ్వు బాధని దిగమింగుకో ! ముందు నీ కన్నీళ్ళని గట్టిగా తుడుచుకో, బలంగా గుండెల నిండా  వూపిరి తీసుకుని నెమ్మదిగా శ్వాసని  బయటకి వదులు. స్థిరంగా ఆలోచించు. ఈ శారీరక హింస, మానసిక హింస యెన్నాళ్ళు ? అని ప్రశ్నించుకో !  ఓర్చుకున్నన్నాళ్ళు కాపురం సవ్యంగా  సాగిపోతూ ఉంటుంది కనుక ఆ కాపురం విలువైనదిగా నీకు తప్పని సరైనదిగా  కావచ్చు అనిపిస్తుంది .  ఆ కాపురమే కావాలనుకుంటే నీ భర్తని యీ రోజూ  క్షమించేయి. క్షమించగల మనసుంటే జరిగిన దానిని పూర్తిగా మర్చిపో ! లేదా మర్చిపోలేకపోతే క్షమించకు.  భర్త తో కలిసుంటే  నిత్యం అతని అనుమానపు ధృక్కుల నుండి నిన్ను నీవు నిలబెట్టుకోవడం యెంత కష్టమో ,  లేక  భర్త తో విడిపోయి  నీ దారిన నువ్వు బ్రతుకుతూ వున్నాకూడా  నువ్వు యెదుర్కోవలసిన ప్రశ్న కూడా వొకటే అయిందనుకో  యేది మంచని  నీకనిపిస్తే ఆ   నిర్ణయం తీసుకునే శక్తి నీకే ఉండాలి. అందుకు నా సలహా కూడా అవసరం లేదని  నా అభిప్రాయం,


ఆకలి, దారిద్ర్యం, నిరక్షరాస్యత నిలువునా చుట్టేసిన పేదలని  ధనస్వామ్యం తన వుక్కుపాదాలతో  పాతాళానికి తొక్కేస్తుంటే బాగా చదువుకుని వుద్యోగం చేసుకుంటూ పిల్లలని జ్ఞానవంతులుగా సంస్కార వంతులుగా, ప్రేమ మూర్తులుగా తీర్చి దిద్దాల్సిన భాద్యత వున్న నీ భర్త లాంటి వాళ్ళు యింకా యింకా  సగభాగంపై చెలాయించే ఆధిపత్య భావజాలం,  భార్యపై నమ్మకం లేనితనం రోత పుట్టిస్తుంది.  అతనికి మానసిక చికిత్స అవసరమనిపిస్తుంది.  " బ్రతకాలంటే వేరొకరిని చంపాల్సిన పనిలేదు, చావాల్సిన పనిలేదు” అని అతనికి తెలియాలి.


నీకొక కథ  గుర్తుకు రావడం లేదా ? బాట లో  నడుస్తున్న  అతన్ని కుక్క తరుముతుంది భయంతో ఆతను పరుగు పెడుతున్నాడు. ఒకరి సలహా విని ఆగి రాయి పుచ్చుకుని వెనక్కి తిరిగాడు కుక్క వెంటపడటం ఆపింది.  సమాజం కూడా కుక్కలాంటిది.మొరుగుతూనే ఉంటుంది. నిబ్బరంగా నిలబడి యెదురుతిరిగితే తోక ముడుస్తుంది.


మన బతుకలని  మనని బ్రతకనివ్వని ఈ సమాజం వేసే  ఆ ప్రశ్న నీ శరీరపవిత్రత (?) కే సంబంధించిందే  అయి వుండటమన్న దురదృష్టకరమైన  స్థితి  యే ఆడజన్మకి   వద్దు . అది శాపమా ? పాపమా ? అన్నది అసలు ఆలోచించవద్దు . చందమామ చూడటానికి చాలా అందంగా ఉంటుంది అచ్చు స్త్రీ లాగా  అది ఇచ్చే వెన్నెల కూడా చల్లగా ఉంటుంది స్త్రీ యిచ్చే ఆహ్లాదం లాగానే . కానీ చందమామలో ఆ మచ్చ యేమిటో తెలుసా !?  అది మనపై పడుతున్న అవమానాల మచ్చ,  వ్యక్తిత్వం, ఆత్మగౌరం లేకుండా  బతికి వుండటం అన్నింటికన్నా అవమానమనిపిస్తుంది నాకు. నేటి తరం వాళ్ళు మనమనుభవించే అవమానాన్ని, బాధలని వొక్క రోజు కూడా భరించలేరు కూడా ! అయినా అమ్మ మాత్రం అన్ని భరించాలనే ఆలోచన చేస్తారు. పిల్లలు కూడా స్వార్ధపరులే కదా !

ఎవరి ఆలోచనలని బట్టి, మానసికస్థితిని బట్టి వారి ప్రవర్తన బహిర్గతమవుతుంది, అది తెలుసుకో చెలీ !   నీ దుఖాన్ని నేను తీర్చలేను. అలా అని నిన్ను నీ ఖర్మానికి వొదిలి వేయలేను.  నేను యే సలహా  చెప్పలేను. నా మనసంతా బాధగా, పచ్చిగా వుంది. మన ఈ దుఃఖాలు  మనవి మాత్రమే  కాదు  చెలీ !  సమూహాలవి.  ఈ సమూహాలు పెరిగి పెద్దవుతున్నాయి . ఓదార్చే వొడి లేక  భూమాత వొడిని వెతుక్కుంటున్నాయి.   ఆ వొడిని వెదుక్కునే అవసరం నీకు రానీయకు అని మాత్రం చెప్పదలచాను . ఎందుకంటే ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీలు ,  అన్నీ వున్నా కూడా  అణువణువునా నిరాశ నింపుకున్న స్త్రీలు ఆవేశంలో క్షణికంలో నిర్ణయాలు తీసుకుని  జీవితాన్ని అంతం చేసుకుంటారు, ఆ బాట వైపు  నీ చూపు పడనేకూడదు. తగిలిన గాయాలని  గేయం చేసుకుని పాడుతూ సాగిపోవాలి తప్ప గాయం తగులుతుందని శరీరమే లేకుండా చేసుకోవడం ద్రోహం కదా !

జీవితమెలా వున్నా జీవితాన్ని జీవించడమనే ఆనందాన్ని కోల్పోకూడదనే కవి మాటలని గుర్తుకు తెచ్చుకో!  నేనేమి కర్తవ్య బోధ చేయడంలేదు. నా స్నేహితుల గాధలు నా బాధలు  కూడా నీతో చెప్పుకున్నందుకు కొంత తెరిపిగా వుంది. ప్రశాంతంగానూ వుంది.  ఇక ముగిస్తున్నాను చెలీ.                                                                                                                
                                                      ప్రేమతో … నీ నెచ్చెలి “అమృత"

(విహంగ వెబ్ మాస పత్రికలో ప్రచురితం )

11, డిసెంబర్ 2015, శుక్రవారం

రెండు నాల్కల ధోరణి

ఫ్రెండ్స్ !


రచనలు రచనలు గాను కవిత్వం కవిత్వం గా వ్రాసుకుంటే ఎవరైనా హర్షిస్తారు. బాధితులు పీడితులు ఉంటె సహానుభూతి చెందుతారు. కుల మత జాతులకి అతీతంగా స్పందిస్తారు అందులో ఎలాంటి కుట్రలు సందేహాలు ఉండవు. ఈ మధ్య కొందరు సూడో అభ్యుదయవాదులు ముసుగేసుకుని మరీ వచ్చి వారి అసహనాన్ని వ్యక్తిగత ద్వేషాన్ని రచనల్లో, కవిత్వంలో వ్యక్తీకరిస్తున్నారు. ఒక కులాన్నో లేదా ఒక మతాన్నో ఒక వర్గాన్నో టార్గెట్ చేసుకుని వచ్చి వారి ప్రేలాపనలతో ఇతరులని కించపరుస్తున్నారు. అణచివేతకి గురైతే ఎక్కడ గురయ్యారో అక్కడ ప్రశ్నించండి. వ్యక్తులని వదిలేసి సమూహాలకి ఎందుకు ఆపాదిస్తారు ? ఎవడో ఎక్కడో ఏదో చేస్తారు కూస్తారు. దాన్ని పట్టుకుని కులం మొత్తానికి మతం మొత్తానికి జాతి మొత్తానికి ఆపాదించి కసిదీరా తిట్టి దూలానందం పొందుతున్నారు.


చరిత్రలో చాలా పీడనలు అణచివేతలు ఉన్నాయి. అవి ఇంకా అలాగే ఉన్నాయి అసలేమీ మారలేదు అన్నట్లు ఉంటె ఎలా ? క్రమేపీ సమాజం మారుతుంది మనుషులు మారుతున్నారు. అణచివేయబడిన వర్గాలు తెలివి చదువు ఉద్యోగం బలం పెంచుకుని చట్టాల గురించి తెలుసుకుని ప్రశ్నించే స్థాయికి, తిరిగి ఇతరులని బాధించే స్థాయికి చేరుకున్నట్లే ... ఒక్కప్పుడు బలవంతులమని విర్రవీగినవాళ్ళు సైతం వాళ్ళ మూఢత్వాన్ని ఛాందసవాదాన్ని వొదిలి జనబాహుళ్యంలో కలిసిపోతున్నారు. సామరస్యంతో ఇతరులతొ కలసి పోతున్నారు. ఈ విషయాన్ని మరుగున పరిచి మీ వ్యక్తిగత ద్వేషాలని ఒక కులంలో ఉన్న మొత్తానికో ఒక మతంలో ఉన్న మొత్తానికో అపాదించవద్దు. పదే పదే వ్యక్తులకి బదులు సమూహాలకి సమాజం మొత్తానికి మీ ద్వేషాన్ని అంటకట్టవద్దు. మీకెలా ఒక కులం ఉందో మాకు అలాగే ఒక కులం ఉంది. మీకిష్టమైన మతం మీరెలా పాటిస్తారో మా కిష్టమైన మతాన్ని మేమలాగే పాటిస్తాం. మీరు అవహేళనలకి అన్యాయానికి గురైతే ప్రశ్నించండి మా దృష్టికి వచ్చినప్పుడు ఖండించడం, మీకు మద్దతు పలకడం అన్నీ ఉంటాయి. 



అణగారిన వర్గాల తరపున వకాల్తా పుచ్చుకుని (కొందరు ఇలా వకాల్తా పుచ్చుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం నమ్మిన వాళ్ళని నట్టేట ముంచేసిన వాళ్ళు ఉన్నారు) అందరిని ఒకే గాట కట్టేయడం సబబు కాదు. చీము, నెత్తురు, రోషం, అభిమానం మాకూ ఉన్నాయి. ఎల్లకాలం చూసి చూడనట్లు పోవడం కూడా కుదరదు. దయచేసి వివాదాస్పద వ్రాతలు వ్రాయకుండా ఉంటే మంచిది. చదువుకుని సంస్కారవంతంగా ఆలోచించే రచయితలూ కవులు కళాకారులే ఇలా ఉంటె మిగతావారి సంగతేమిటని ఆలోచిస్తున్నారా ? లేదా !? చాలా విచారంగా ఉంది. అభిప్రాయబేధాలు సహజంగానే వస్తూనే ఉంటాయి. కాదనడంలేదు. ఎవరు ఏమీ మారలేదు అనుకుంటే మాత్రం జాలిపడటం తప్ప ఇంకేమీ మాట్లాడలేం . కానీ వంచన చేయడం ఆత్మ వంచన చేసుకోవడం మంచిది కాదు



."సో కాల్డ్ మేధావులు...స్తీవాదులు....సామాజిక సేవేద్దారకులు ...వారి కిష్టమైనపుడు మాట్లాడతారు ...లేకపోతే. .తేలు కుట్టిన దొంగలలా నో రుమూసుకుంటారు. మరల వారే ఇంకొకరి మతాలను కులాలను విమర్శిస్తారు. రెండు నాలుకల నీతి చాలా ఎక్కువ ఉంది" 



పరమత సహనం నా అభిప్రాయం ...


పరమత సహనం భారతీయ ఆత్మ దాని గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నాయకులు వేరు ప్రజలు వేరు . భిన్న సంస్కృతితో తరతరాలుగా మమేకమైపొయిన జాతి మనది. అయిదేళ్ళు పాటు పరిపాలించే నాయకులోచ్చి ఇది ఒక మతానికి చెందిన దేశమనో లేదా ఈ దేశ వారసత్వానికి ప్రతీకలమనో చెప్పుకున్నంత మాత్రాన మిగతా మతాల వారందరూ ఈ జాతీయులు కాకపోతారా? అలాంటి నాయకులకి బుద్ది చెప్పాలంటే వారి కుళ్ళు కుతంత్రాలు అర్ధం చేసుకున్న వారే నడుంబిగించాలి కానీ కొంత మంది కావాలని మంటలని ఎగదోస్తున్నారు. అందుకు విచారంగా ఉంది.


ఈ మధ్య నా కథ ఒకటి ప్రింట్ మీడియాలో ప్రచురింపబడినప్పుడు పాఠకుల స్పందన కోసం మొబైల్ నెంబర్ ఇచ్చాను. వెంటనే ..దేవుడు మీకు స్వస్థత చేకూర్చుతాడు ప్రార్ధనామందిరమునకి రండి తో మొదలెట్టి ప్రతి రోజు సువార్త వాక్యాలు అందించడం మొదలెట్టారు. మరి ఈ రకమైన మత ప్రచారం పట్ల కూడా సహనం వహిస్తూనే ఉన్నాం. మాకు సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో వినాయకుడి గుడి కట్టి పదేళ్ళు అయింది. దానికి దగ్గరలోనే విదేశాల నుండి వచ్చిన సొమ్ముతో ఒక ఇంటిలో చర్చిని నెలకొల్పారు. తెల్లవారుఝామునే పోటాపోటీగా మైకులు పెట్టి మరీ ఆమెన్ - గణేష్ మహారాజ్ కి జై అంటూ వినిపిస్తారు . నిద్ర ఖరాబై ఆరోగ్యాలు పాడై ఏమిటీ శిక్ష అనుకుంటున్నాం తప్ప ఒకరినొకరు తిట్టుకోవడంలేదు.


మనం తల్లి గురించి గొప్ప  కవిత్వం వ్రాస్తాం. చెల్లి గురించి కవిత్వం వ్రాస్తాం. ఆలి గురించి అంతకన్నా గొప్పగా కవిత్వం వ్రాస్తాం. ఆకాశంలో సగమంటూ కీర్తిస్తాం. ఆహా .. ఓహో అనే భట్రాజు పొగడ్తలు వందిమగాదులు ఎందఱో ! ఒక మత పెద్ద ఈ ఆడోళ్ళని గడ్డిపోచ లెక్కన జమకట్టినప్పుడు మాత్రం అస్సలు మాట్లాడరు . అది వాళ్ళ మతానికి సంబంధించిన విషయం మాత్రమే ! కలగజేసుకుంటే ఫత్వాలు జారీ చేయబడతాయని భయం .

అదే ఇంకో మతం స్వామీజీ ఎక్కువమంది పిల్లలని కనాలంటే మాత్రం ..ఈ ఆడజాతి మీద అంతులేని సానుభూతి పుట్టుకొస్తుంది. అప్పుడు మాత్రం బాగా మాట్లాడతారు .


అభ్యుదయమంటే కులమతజాతికి అతీతంగా నిర్భయంగా న్యాయంగా మాట్లాడాలి కదా ! నేను ఈ రెండు నాల్కల ధోరణి గురించే మాట్లాడుతున్నాను.


పరమత సహనం హిందువులకి లేదని వక్కాణించే సూడో మేధావులు వారి మతం వారి వ్యక్తిగతం అనుకుంటారు. పరమతం వారి విశ్వాసాలు మాత్రం సమాజం పై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపణలు చేస్తారు. అసలు ఈ బీఫ్ వివాదాలు లేని గ్రామాలు భారతదేశంలో మూడొంతులు ఉన్నాయంటే నమ్మరు వీళ్ళు.


మా పల్లెటూర్లో హిందూ ముస్లిం క్రిష్టియన్ బేధాలు లేవు ఏమైనా వస్తే అవి అప్పటికప్పుడు సమసిపోయేవే ! మా మధ్య కుహనా మేధావులు లేరు అందుకే మేము ఇంకా స్వచ్చంగా స్వేచ్చగా ఆనందంగా బ్రతకగల్గుతున్నాం అని చెప్పడానికి గర్విస్తున్నాను. జై హింద్ !


24, నవంబర్ 2015, మంగళవారం

జన్మదిన శుభాకాంక్షలు






చిన్ని బంగారం.. !!
ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ..
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ..
భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ...
హృదయపూర్వక శుభాకాంక్షలు ..
నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..
"ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా
నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా
నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా" ప్రేమతో ... "అమ్మ"




23, నవంబర్ 2015, సోమవారం

అక్షరాత్మ ఆశ్లేషం

అక్షరాత్మ ఆశ్లేషం

శరదృతువుని  తరుముతూ హేమంతం  వేగిర పడుతుంది 
ఎడగారున పూసిన  మల్లెలు బొట్లు బొట్లుగా మంచుని కురుస్తున్నాయి  
ఎల కోయిల తోడు లేక అపస్వరాల పాటనే గొంతెత్తి పాడుకుంటాను 
మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి 
ఆలోచనల ఎడారిలో వాక్యం ఎండమావిలా తోస్తుంది 

 కవీ...   ప్రేమగా  పిలిచింది అక్షర కుటీరం  
నువ్వెంత్తెత్తుకి ఎదిగినా గుమ్మంలోనుంచి  తలొంచి లోనికి రమ్మంటుంది   
వెళ్ళకపోయినా తనే  అతిధిలా వచ్చేస్తుంటుంది 

ఎలా ఉన్నావ్ !  ఆత్మీయ పరామర్శ  
బిలంలో చీకటి పిగిలిపోయింది
ముత్యాలసరాలలో  దాగున్న స్పర్శాతీత భావమేదో పరిమళమై అల్లుకుంది 
పూలతోటల్లో జీవన మహోత్సవాన్ని చేసుకుంటున్న సీతాకోక చిలకల లాస్యం 
రేకులు విప్పి భ్రమరం కోసం మధుపాత్రని సిద్దం చేసిన  పద్మం  
పదముల కంటిన ధూళి ప్రదక్షిణ  చేసిన  గర్వం  
పూవుపై రాలిన హిమబింధువు  పూజకెళ్ళి సార్ధకమైన అహం 
క్షణభంగురమైన నురగ బుడగలో వెలిసిన  సప్తవర్ణాల శోభ
అన్నీ సొంతమైపోతాయి అయినా 
ఎప్పుడూ ఇచ్చే అలక్ష్యపు  సమాధానమే...  
చూస్తున్నావుగా అంటూ 

అప్పుడు నిజమైన  ఓ పరికింత తర్వాత 
ఎలా ఉన్నావో చెప్పనా ... ? 
ఎందుకట తెలుసుకోవడం ...  మాటల్లో బింకం 
అదంతా ఒట్టి శబ్దమే... లోలోపట  ఉత్సుకం 

ఏ అలంకారం లేని అమ్మ పాటలా 
భగవంతుని కీర్తించే  సంకీర్తనలా  
నేలరాలిన పూల చేవ్రాలులా 
అభావమైన కంటి బాసలా...ఉన్నావ్   అంది 

పరిహాసమా ... ఉదార విన్యాసమా 
 స్వేచ్చగా గాలికెగురుతూండే  వస్త్రంలాంటి నేను  
 కవిత్వ గులాబీ ముళ్ళకి చిక్కుకున్నాను 
దిగుళ్ళ  పల్లకిని బోయిలా మోస్తున్న హృదయం 
మజిలీ మాట మరచి గమ్యం చేరేదాకా పరుగులెత్తిస్తుంది 

బెంగటిల్లకు ... 
నీలోనే అమృతముంది నీలాగే మళ్ళీ నువ్వు మారడానికి 
అయినా నేనున్నానుగా వాగ్ధాన బీజమేదో హృదయ క్షేత్రంలో నాటుకుంది
అక్షరాత్మ  ఆశ్లేషం నన్ను చుట్టుకుందని చెప్పక్కర్లేదనుకుంటా  :) 






14, నవంబర్ 2015, శనివారం

వెన్నెల పురుషుడు



ఉదయం తొమ్మిది గంటలైనా కాలేదు   సూరీడు మహా  వేడిమీద ఉన్నాడు. వంట గదిలో విజిల్ వేస్తూన్న   కుక్కర్ తో పోటీపడుతూ  కిటికి  ప్రక్కనే  పెరిగిన మామిడిచెట్టుపై  కోయిల కూస్తుంది .  తనూ స్వరం కలపబోయిన ఆమె తన అత్తమామలు ఉన్నారన్న సంగతి గుర్తుకొచ్చి వుత్సాహాన్ని గొంతులోనే అణిచేసుకుంటూ  "వసంతంలో కూయాల్సిన కోయిల  ఆషాడం  చివరిలో కూడా కూస్తుంది వానకారు కోయిల అంటే  యిదేనేమో ! " అనుకుంటూ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి కిటికీ ప్రక్కనే పెట్టింది. అప్పటిదాకా  తెగ సందడి చేసిన కోయిల కూయడం మానేసింది. ఓపికగా వో అయిదు నిమిషాలు వేచిచూసాక మళ్ళీ కోయిల పాట మొదలెట్టింది  కానీ ఆ పాటెందుకో విషాదంగా అనిపించింది, అప్పటిదాకా వగరు చిగురులు తిని గొంతు మంటత్తిందేమో !  రికార్డ్ ని సేవ్ చేయకుండా వదిలేసింది అక్కడ నుండి తన గదిలోకి వచ్చింది వెన్నెల.
విశాలమైన కిటికీ దగ్గర నిలబడి బయటకి చూపు సారించింది ఆమె. చూపు  చిక్కుకుపోయిన చోట  లేలేత వేపకొమ్మల మధ్య పూచిన పూత. ఆనందంతో మొహం విప్పారింది   మళ్ళీ అంతలోనే  అరె ! యిప్పుడు  పూసింది యేమిటీ ? ఉగాదికి కదా పూయాల్సింది.  మొన్నటిదాకా  పండిన కాయలు రాలుతూనే వున్నాయి కదా !   తర్వాత అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ కనుచూపు మేరా చూసింది . ఇందాకటి కోయిల కాకుండా  మరో రాగిరంగు రెక్కల కోయిలొకటి  కొబ్బరాకుని చీల్చి యీనెని ముక్కున కరుచుకుని పోయి మామిడి కొమ్మలపై వుంచింది, బహుశా గూడు కడుతుంది కాబోలు. గుడ్లు పొదగని కోయిలకి మురిపెంగా పిల్లలని పెంచలేని కోయిలకీ  గూడెందుకో ! నిరాశగా అనుకుంది.   
మధ్యాహ్నం  యెప్పుడైందో  అత్తమామలు యెప్పుడు భోజనం చేసారో ప్రొద్దు పడమటికి  యెప్పుడు మారిందో  యేమి తెలియదు. జీవితంలో యేర్పడిన స్తబ్ధతని పూరించుకోవడానికి ఆమెకి  లభించిన వరం  తోటే  అన్నట్లు  బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంది ఆమె.
  సాయంత్రం తోటంతా సందడిగా వుంది. ఎటు చూసినా  సీతాకోక చిలుకల  విన్యాసాలే !  చెట్లపై నివాసముండే రకరకాల పక్షులు అందులో యె౦తో చిన్నవి బుల్బుల్ పిట్టలు యెంత ముద్దుగా వున్నాయో ! క్షణం కుదురుగా ఉండవు వేప చెట్టు మీద నుండి సంపెంగ పూల చెట్టుపైకి సంపెంగ చెట్టుపై నుండి పారిజాతం చెట్టుపైకి చక్కెరలు కొడుతూనే ఉంటాయి. వాటి మధ్య వుడుతలు  కిచ కిచమని  శబ్దాలు చేస్తూ హడావిడిగా తిరుగుతూ జామకాయలు కొరుకుతూ కాసేపు, నేరుడు పళ్ళని తింటూ కాసేపు  జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి.   వేప చెట్టు కొమ్మకి పెద్ద తేనెపట్టు . ఎక్కడెక్కడో  తిరిగి సేకరించుకున్న మకరందాన్ని భద్రంగా దాచుకున్నాయి. ఏ స్వార్ధపు కళ్ళు దానిపై పడకపోవడం మూలంగా ఆనందంగా జుర్రుకుంటున్నాయి.ఎంతదృష్టమో ఈ తేనెటీగలకి. అవును యిన్ని వున్నాయి, రామ చిలుకలు లేవేంటి యీ తోటలో ? చిలుకలు వాలని చెట్టెక్కడైనా వుంటుందా ? అలాగే పావురాలు కూడా ! సృష్టిలో మానవుడికి తప్ప అన్ని ప్రాణకోటికి ఆనందాలున్నాయి. ఎటు తిరిగి  మానవుడు ప్రకృతిని తన స్వార్ధం కోసం నాశనం చెయ్యనంతవరకూ.  తోటకావలి వైపు  రోడ్డుకి ఆనుకుని  కార్లని బైక్ లని   డిస్ట్రిబ్యూట్  చేసే ఓ పెద్ద కంపెనీ వాళ్ళు  కార్  డ్రైవింగ్ స్కూల్  పెట్టారు  . అంతకు క్రితం ఈ స్థలంలో   సర్వీసింగ్ స్టేషన్ వుండేదట .  ఈ లోపలికి   అంతగా యెవరూ రాక పోవడం మూలంగా యీ మాత్రం ఆనవాలైనా మిగిలింది  అంటూ తనలో తనే గొణుక్కుంది.
రాత్రి యింటికొచ్చిన కొడుకుతో పిర్యాదుని వినిపిస్తుంది  ఆమె అత్తగారు  
"కంటికెదురుగా  కరంట్ బోర్డులకి  కందిరీగలు అన్ని గూళ్ళు పెట్టి రొదగా తిరుగుతున్నా పట్టించుకోదు, టాయిలెట్ కిటికీకి దోమతెరకి మధ్య ఉడుతలు గూడు కట్టి పిల్లలని పెంచుతున్నా పట్టించుకోదు . పెళ్లై అయిదేళ్ళు నిండింది కడుపున ఒక కాయైనా కాయలేదు. హాస్పటల్ కి వెళ్లి చూయించుకుని మందూ మాకు వాడదాం అని లేనే లేదు.  వంట పని అయిపోతే చాలు గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. ఎప్పుడూ పుస్తకాలు చదవడం పిచ్చిగీతలు గీయడం యిదేనా పని ? కొడుక్కి భోజనం వడ్డిస్తూ విసుక్కుంటుంది. 
కాసేపటి తర్వాత  లోపలికొచ్చిన శశిధర్   "ఎంత సేపూ ఆ మాను మాకుతో మాటలేనా ! కాస్త మనుషులతో కూడా మాట్లాడొద్దూ ! "
చురుక్కుమంటూ చూసింది
"అమ్మ  బాధపడుతుంది  కాసేపు బయటకొచ్చి కూర్చోని పెద్దవాళ్ళతో మాట్లాడుతూ  టీవి చూడొచ్చుకడా !"  అన్నాడు.
" వాళ్ళతోయేనా  నేను మాట్లాడటం ? మీరు నాతో మాట్లాడరా, నే చెప్పిన మాటలు  వినకూడదా ? అయినా నోట్ల కాయితాల చప్పుడుకి అలవాటు పడిన మీకు నాతో  యేమి మాటలుంటాయి లే ! " అందే కాని  కిటికీని వొదిలి యివతలకి రాలేదు .  ఒక్క క్షణం ఆలోచించినతను చిన్నగా ఆమె ప్రక్కకొచ్చి నిలుచున్నాడు  తనూ బయటకి చూసాడు . కటిక చీకటిలో తోటంతా నిశ్శబ్దంగా వుంది కొబ్బరాకుల మధ్య నుండి వేప కొమ్మల పైనుండి కనబడుతున్న ఆకాశంలో  వెలుగుతున్న నవమినాటి చంద్రుడు . అక్కడక్కడా కనబడుతున్న చుక్కలు.
" ఈ ఇల్లు చూసినప్పుడు నువ్వెంత  సంబరపడ్డావో నాకింకా గుర్తుంది. ఈ మహా నగరం నడిబొడ్డున  యిలాంటి తోట, తోట ప్రక్కనే యిల్లూ మూడంతస్తులు యెత్తున పెరిగిన చెట్లు కిటికిలో నుంచి కనబడే చందమామ కాస్త అద్దె యెక్కువైనా  నీ కోసం భరించాలనుకున్నాను కదా ! " గుర్తు చేసాడతను. తల వూపింది ఆమె . 
ఈ చక్కని చుక్కకి ఆ చంద్రుడితో కబుర్లు ఎందుకు ? ఎదురుగా ఈ చంద్రుడుండగా అంటూ ఆమె మెడ వొంపులో తమకంగా తలాన్చాడు. ఆ మాత్రం సామీప్యతకే ఆమె తనువూ  త్రుళ్ళింది మనసూ  వొరిగింది. చాలా కాలం తర్వాత ఆమెకి వశమయ్యాడతను. .  నువ్వే నా  నా వెన్నెల పురుషుడివి  అడిగింది లతలా  అతన్ని మరో మారు అల్లుకుంటూ .
 "నీకొక నిజం చెప్పాలి, విన్నాక నువ్వు బాధ పడకూడదు యెవరికీ చెప్పకూడదు ఆ రహస్యం మన మధ్యనే ఉండాలి "  ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడతను .
ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది వెన్నెల  
 "మనకి ఐ మీన్  నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందరూ నీలో లోపం వుందేమోనని అనుమానపడుతుంటే  విని నువ్వెక్కడ బాధపడపడతావోనని  నేనే అన్ని  టెస్ట్ లు చేయించుకున్నాను. ఏ మాత్రం పిల్లలు పుట్టే అవకాశంలేదని డాక్టర్స్ చెప్పేశారు." చెప్పాల్సిన విషయం చెప్పేసి అతను  వూపిరి పీల్చుకున్నాడు . 
 ఆమెలో కల్గిన  ఆశాభంగం అతనికి కనబడనీయకుండా  అతన్ని అల్లుకున్న చేతులని వదలకుండా అలాగే ఉంచింది 
ఆమె మౌనం చూసి "పోనీ యింట్లో వాళ్లకి తెలియకుండా  "ఆర్టిఫిషియల్  ఇన్ సెమినేషన్  ద్వారా  ట్రై చేద్దామా ! నాకేం అభ్యంతరం లేదు" అన్నాడతను . ఆమె అడ్డంగా తల ఊపింది .  కళ్ళల్లో నీళ్ళు కనబడకుండా అతని గుండెల్లో తలదాచుకుంది. ఆమెనలాగే పొదివిపట్టుకున్నాడతను.
 తెల్లారిందో లేదో  అతని అమ్మ “ అబ్బాయ్  ! ఈ యింట్లో మేముండలేమురా ! ఇంటికి వెళ్లిపోతాము అంటూ ఖండితంగా చెప్పేసింది. “ఎందుకనమ్మా !? నీ కోడలు వల్ల యేమైనా కష్టంగా ఉందా ? బాగా చూసుకోవడం లేదా ?” కంగారుగా అడిగాడు .
మీ ఆవిడకి పలుకే బంగారం . ఓ మాట మంచి లేని యింట్లో  సౌకర్యాలెన్ని  అమర్చినా,  నవకాయ పిండి వంటలు వడ్డించినా వుండలేము రా ! ఇల్లన్నాక ఓ పిల్లా పీచు అన్నా ఉండొద్దా ! ఆమేమో  ఆ గదిలో, నువ్వేమో డబ్బు రంధిలో. ఎన్నాళ్ళు  గోడలతో, టీవితో  మాట్లాడుకుని బ్రతుకుతాము మీ నాన్నకి యిక్కడ తోచుబడి కావడం లేదంట, మేమిప్పుడే  వెళ్ళిపోతాం  అంది .
వెన్నెలతో యీ విషయం చెప్పినా పెద్దగా స్పందించదు . ఎప్పుడూ తన లోకం తనదే గానీ .. ఎవ్వరిని పట్టించుకోదే ! మనసులో విసుక్కున్నాడు. తల్లి తండ్రి  వూరెళ్ళి పోయాక అతను బయటకెళుతూ  
వంట చేసుకుని వేళకి తిను . ఎప్పుడు కిటికీ దగ్గరే నిలబడి వుండకుండా రెస్ట్ తీసుకో !  సాయంత్రం  పెందలాడే వచ్చేస్తాను  మూవీ కెళ్ళి  బయటెక్కడన్నా డిన్నర్ చేసి వద్దాం అని చెప్పి వెళ్ళాడు .
శశిధర్ కోసం యెదురు చూసి చూసి అలసిపోయి నిద్రపోయింది . అతనెప్పుడో వచ్చి పడుకున్నాడు . ఎన్నోసార్లు సారీ చెపుతూనే నిన్నటిలా కాదు ఈ రోజు త్వరగా వచ్చేస్తాను . నువ్వు నీ ఆలోచనల ధోరణిలో ఉండి  తలుపులు కూడా సరిగ్గా వేసుకోవు కదా ! పోన్లే, నేనే డోర్  లాక్ చేసుకుని వెళతాను అనేవాడు వుదారంగా .
అలా రోజులు, నెలలు గడచి పోతూనే వున్నాయి . వెన్నెలకి కిటికీయే ప్రపంచమూ అయిపపోయింది . కాంతి విహీనమైన కళ్ళు, శుష్కించిన దేహం, మౌనంగా యంత్రంలా మారిపోయింది . ఆమెని చూసి అతను  జాలి పడ్డాడు . ఆమెకి యేమివ్వాలో  అతనికి తెలుసు, యివ్వలేని నిస్సహాయత తెలుసు . పై పై మెరుగుల కోసం అప్రతిహతం అర్రులు చాస్తూ పరిగెత్తడమే తప్ప  నెమ్మళంగా జీవనసారాన్ని జుర్రుకోవడం చేతకానితనంతో సిగ్గుపడుతున్నాడు . ఎలాగోలా  నాలుగు రోజులు తీరిక చేసుకుని ఆమెకి ఇష్టమైన సాగర  సంగమ ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో చిన్న చిరునవ్వు కూడా  లేని ఆమె ముఖం చూస్తే మనసంతా యేదోలా అయిపొయింది . కానీ  ఆ నదీ సాగర సంగమం చూడగానే ఆమె ముఖం విప్పారింది.  "ఇక్కడికి నిన్ననే  నేను అతను వచ్చాం "అంది .
"నిన్నవచ్చావా,  యెవరితో ?" అడిగాడు అయోమయంగా .
"అదే అతనే నా వెన్నెల పురుషుడు"  అంది  ఆమాట  చెపుతున్నప్పుడు  ఆమె ముఖంలో ఏదో తెలియని వివశత్వం
"అవునా! అది నేనేగా ! "చిన్న నవ్వు అతని పెదాల పై .
"ఊహు నువ్వు కాదు. అతను అతనే ! "
"అతనెలా ఉంటాడు!? యెక్కడ ఉంటాడో తెలుసా ? "
 తెలుసు తోటలో వుంటాడు . గుర్తుకు తెచ్చుకున్నట్లు కాసేపాగి చెప్పింది .  అవును కొన్నాళ్ళ క్రితం  మన యింటెనుక తోటలోకి వొక పురుషుడొచ్చాడు. అతన్ని చూస్తుంటే  కవులందరూ మగవాళ్ళని సింహంతో యె౦దుకు పోల్చారో అని చిరాకు కల్గింది .  పొడుగు పొట్టి కాని ఎత్తు. క్రిందికి పైకి ఒకే మందంతో తెల్లని బట్టలతో  దర్జాగా ఉంటాడు  అతని  నడక చాలా ఠీవిగా  ఉండేది.  చందమామ లాంటి గుండ్రటి మొహం,విశాలమైన నొసలు, అందమైన కళ్ళు  ఆ కళ్ళని చూస్తే చాలు దీపాలు వెలుగుతున్నట్టు ఉండేవి. ఆ చూపులతో  మరి కొన్ని దీపాలు వెలిగించుకోవడం అంటే యేమిటో  నా కళ్ళు వెలుగుతుంటే అర్ధమయ్యింది.  అతను పెదవి విప్పి మాట్లాడే వాడే కాదు అతనిది దేహబాష . కళ్ళతోటే కథలు చెప్పేవాడు. నాకు చంద్రుడంటే వున్న యిష్టాన్ని  యెలా కనిపెట్టాడో !  వెన్నెల వాన  రెండు  కలసి కురుస్తున్నపుడు నన్ను జలకాలాటకి తీసుకు వెళ్ళేవాడు. అధర రుధిరంలో పట్టు తేనే రుచి చూపిన వాడు. వెన్నెల్లో కల్గిన  వేడిని మృగ చూర్ణ లేపనం పూసి  సాంత్వన చేకూర్చిన వాడు. నాకు యె౦తగానో నచ్చాడు .  మేమిద్దరం  భూత భవిష్యత్ కాలాన్ని మరిచి వర్తమానంలో  జీవించిన అమృత ఘడియ లవి "
"నువ్వేమైనా కథ చెపుతున్నావా ? లేక కవిత్వం వినిపిస్తున్నావా? నీ భాష అర్ధం కాక చచ్చిపోతున్నా! మామూలు మూడ్ లోకి వచ్చెయ్యి, వింటుంటే  చిరాగ్గా ఉంది " విసుక్కున్నాడతను   
  నేను నిజమే  చెపుతున్నా ! మేమిద్దరం  కలసి యెన్నో రాత్రులు నదీ విహారానికి వెళ్ళాం . చల్లని  రాత్రిలో  మంద్రంగా ప్రవహించే  నది పాయ ప్రక్కన రెల్లుపూల పొదల మధ్యలో యిసుక తిన్నెలపై  ఆ వెన్నెల పురుషుడి సాంగత్యం నాకు బాగా నచ్చింది  ! ఎన్నో సార్లు  గుజ్జనగూళ్ళు  కట్టుకుని ఆడుకున్నాం . జలకాలడుకున్నాం, పడవెక్కి ఆ తీరానికి యీతీరానికి చక్కర్లు కొట్టాము. లంక తోటల్లో పూసిన పూలతో దండలల్లుకుని  వొకరినొకరు అలంకరించుకున్నాం. ఆకుల గుసగుసల  వింటూ  హాయిగా నవ్వుకున్నాం. విరిసయ్యల పై వూసులాడుకున్నాం. ఒకొరికొకరు దేహాన్ని కానుకగా యిచ్చుకున్నాం . స్త్రీ పురుషుల మధ్య  అంత కన్నా విలువైన కానుకలేముంటాయి ?  మా యిరువురి దేహాలు  మాట్లాడుకున్నాయి పోట్లాడుకున్నాయి అలసిపోయాక వొకటినొకటి సేద దీర్చుకున్నాయి ఆ అనుభవం యెంత బావుందో!  ఎప్పుడూ  వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం,  పడుకోవడం యింతేనా జీవితం !? కాస్త ఆత్మకి  అనుభూతి నైవేద్యం పెట్టోద్దూ ! 
  ఆమెసలు  సృహ లో వుండే మాట్లాడుతుందా ? వింటున్న అతనికి   యేదో తెలియని భయం కల్గింది . వెనుక తోటలోకి వచ్చే పురుషులతో యెవరితోనైనా పరిచయం పెంచుకుని తను బయటకెళ్ళ గానే  నచ్చినతనితో కలసి తిరిగి వస్తుందా ? అనుమానం వచ్చింది . మళ్ళీ అంతలోనే ఛ ఛా.. తనెప్పటకీ అలా చేయదు . అయినా తనేగా రోజూ మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళుతున్నాడు . మళ్ళీ అంతలోనే అనుమానం . డూప్లికేట్  కీ వుందేమో  అమ్మనడిగి తెలుసుకోవాలి  "అనేకమైన అనుమానాల మధ్య  "ఇక వెళ్ళిపోదాం రా " అంటూ ఆమెని  బలవంతంగా తీసుకోచ్చేసాడు .
ఇంటికొచ్చాక  సరాసరి గదిలోకి వెళ్లి ఆమె నించునే కిటికీ దగ్గరి వెళ్ళి పట్టి పట్టి పరీక్షించాడు . దోమ కూడా దూరే సందు లేదని నిర్ధారించుకున్నాక కొంచెం రిలీఫ్ గా ఫీలయ్యాడు . ఆమె మాములుగానే వంట చేసింది యిద్దరూ కలసి భోజనం చేసారు.  ఆమె చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంటే కొన్ని నిజంగా జరిగినట్లు అనిపిస్తున్నాయి జరగనట్లు అనిపిస్తున్నాయి . నిద్ర రాక అతను అటునిటు మెదులుతూ వుంటే ఆమె హాయిగా నిద్రపోయింది . నిద్ర పోతున్న ఆమె ముఖం చూసి  పాపం పిచ్చిది .. పొద్దస్తమాను కథలు, కవిత్వం చదువుతూ వుంటుంది. అదే లోకంలో వుంటుంది , ఆమె మాటలు పట్టించుకోకూడదు అనుకుంటే కానీ అతనిని నిద్రా దేవి కరుణించలేదు .
 ఉదయాన్నే నిద్ర లేచిన అతనికి ఆమె  చూపులతో తోటంతా  వెదుకుతున్నట్లు కనబడింది .  ఏమిటీ యిక్కడే  నిలబడి ఉన్నావ్ ? టిఫిన్ రెడీ చేయలేదా ! అడిగాడు .
అతనొచ్చి రాత్రంతా నాకోసం వెతుక్కుని వుంటాడు. మళ్ళీ రాత్రి దాకా అతను  కనబడడేమో ... దిగులుగా మంచం మెక్కింది. అతనికి  వెంటనే యే౦ చేయాలో అర్ధమైంది .   
"డాక్టర్  నేను బాగానే వున్నాను కదా ! నాకు  యే వైద్యమూ వద్దు . నాకు నా వెన్నెల పురుషుడు కనిపిస్తే చాలు . అతన్ని వెతుక్కోవడానికి  వెళ్ళనీయకుండా  నన్ను యిలా  బందించివేస్తే ఎలా ?"    గిన్జుకుంటూ వొదిలితే  చాలు పారిపోయేటట్లు ఉంది
 చూడమ్మా వెన్నెలా నిన్ను అతని దగ్గరకే తీసుకు వెళతాను కానీ "అతనెక్కడ వుంటాడో  తెలుసా !? " డాక్టర్ ప్రశ్న
" తెలుసు, అతను నేను  రెక్కలున్న కారులో  యెవరికీ కనబడకుండా  అలా నదీ తీరం వెంబడి ప్రయాణం  చేసి చేసీ సముద్ర తీరానికి చేరుకున్నాం.  పున్నమి వెన్నెల్లో  అలలఘోషతో  పోటీ పడి  పాటలు పాడుకున్నాం  కెరటాలతో ఆడుకున్నాం .అలా యీ ప్రపంచంతో పని లేకుండా ఆడి  పాడి అలసి పోయే దాకా   ఆ వెన్నెల రాత్రుల్లో విహరించాం.  తిరుగు ప్రయాణమయ్యాం.  అలా పదునాలుగు రోజులపాటు  ప్రయాణం  చేస్తూ వుండగా వుండగా అలసి పోయానేమో,  సోలి అతనిపై  వాలిపోయానేమో!  ఒక పగలు వొక రాత్రి  నాకసలు  మెలుకువే  రాలేదు  కళ్ళు విప్పి చూస్తే  నా వెన్నెల పురుషుడు నా ప్రక్కన లేడు  యెటు  మాయమయ్యాడో యేమో !  ఎంత వెదికినా కనబడలేదు . నా వెన్నెల పురుషుడు నాక్కావాలి  కొసరి కొసరి వడ్డించే అతని తీపి ముద్దుల ఆహారం లేకుండా నేను యెలా జీవించేది ? జీవించిన క్షణాలని నేను యెలా మరిచేది ?  నేను చచ్చిపోతా, నన్ను  వొదిలేయండి, వొదిలేయండి గింజుకుంటుంది ఆమె .
డాక్టర్ ఆమెని  మరింత మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే వున్నాడు. 
"డాక్టర్ గారు  నా కోడలి  సంగతి ఏమిటి ? ఆమె యె౦దుకలా మాట్లాడుతుంది ?  రెండు నెలల  నుండి మంచం పై అలా పడి  వుండటం పిచ్చి పిచ్చిగా  మాట్లాడటం చూస్తుంటే ఏ దెయ్యం పట్టిందోనని  భయమేస్తుందండీ ! ఇలా జరుగుతుందని తెలిస్తే వొంటరిగా వుండనిచ్చేదానిని కాదు." అత్తగారు కన్నీళ్ళతో   
"మీరేమి కంగారు పడకండి . ఆమెకి మంచి వైద్యం చేస్తున్నాం . మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ట్రీట్మెంట్లో భాగంగానే లోపలి రండి అంటూ అత్తగారిని కన్సల్టింగ్ రూమ్ కి తీసుకుని వెళ్ళారు. మీరు శశిధర్ కి తల్లికదా ! “అవునండీ ! నా పేరు విమల ‘అని పరిచయం చేసుకుంది.
మీకొక విషయం చెప్పాలి విమల గారు . మీ కోడలు వొక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి మీ అబ్బాయి ద్వారా పిల్లలు కలిగే అవకాశమే లేదు. మీ అబ్బాయి కూడా భార్యతో చాలా తక్కువ సమయాలు గడుపుతూ ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడు.  మీరేమో పెళ్ళైన యిన్ని సంవత్సరాలకి కూడా తల్లి కాలేదన్న నెపం వేస్తున్నారు. ఆమె అది తట్టుకోలేక మానసికంగా దెబ్బతింది. ఆమె మాములు మనిషి కావాలంటే మీ సహకారం చాలా అవసరం. అంటూ విషయం వివరించాడు డాక్టర్.
అయ్యో ! నాకవన్నీ యేమీ తెలియదు డాక్టర్ ! మా అబ్బాయి కూడా యీ విషయాన్ని నా వరకూ  రానివ్వలేదు. మా అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశంలేకుంటే వేరే మార్గాలు లేవా యేమిటీ !? ఇదేమైనా మా తరమప్పటి సమస్య కాదుగా ! స్త్రీకి ప్రసవ వేదన పడాలని  నట్టింట్లో శిశువు రోదన  వినాలని యె౦డదుకుండదు చెప్పండి ? మునుపటి తరాల మనుషుల్లా  నాకంత చాదస్తం లేదు లెండి. మా అబ్బాయికి లోపం వుందని  అసలు పిల్లలని వద్దనుకోలేను కూడా ! ఏవో మార్గాలుంటాయి కదా ! ఆ పద్దతుల్లో మా కోడలి కడుపున ఓ నలుసు పడేటట్లు చూడండి. మా అబ్బాయితో నేను మాట్లాడతాను. ఏది యేమైనా మా యింట్లో పసి పిల్లల బోసి నవ్వులు విరబూయాల్సిందే ! కోడలికి యివేమీ తెలియకుండా ట్రీట్మెంట్ యివ్వండి .. అందుకు హామీ నేను అంది విమల.
మీరు చాలా సహృదయంతో అర్ధం చేసుకున్నారమ్మా, యె౦తోమంది తమ పిల్లల్లో వున్న లోపాలని కప్పిపుచ్చి యెదుటివాళ్ళపై నిందలేసి విడాకుల వరకు వెళ్ళడం చూసాను. మీ నిర్ణయం చాలాబాగుంది. మీ కోడలికి నయమైపోయి త్వరలోనే  మీకొక అందమైన, ఆరోగ్యకరమైన బిడ్డని కూడా యిస్తుంది . కొన్నాళ్ళు మా పర్యవేక్షణలో వదిలేయండి చాలు. 
"అవునా డాక్టర్ గారు..  చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ఒక చిన్న మాటండీ మీరు యేమీ అభ్యంతర పెట్ట కూడదు. ఈ విషయాన్ని మా కోడలికి తెలియనీయవద్దు తెలిస్తే వొప్పుకోదేమో కూడా “ అనుమానం వ్యక్తం చేసింది. 
“శశిధర్ కూడా ఆ మాటే చెప్పాడమ్మా! వెన్నెల ఆరోగ్యంగా, ఆనందంగా వుండటమే కావాలి అందరికి. ఈ విషయాన్ని మాకొదిలేయండి చాలు “అన్నాడు డాక్టర్ .   
ఏ గాలి ధూళీ సోకిందో బిడ్డకి . ప్రక్కనే వున్న  తోటలో సమాధులు కూడా వున్నాయట. దర్గా దగ్గర కట్టిచ్చుకొచ్చిన యీ తాయెత్తుని  ఆమెకి  కట్టనీయండి"  అని బ్రతిమలాడింది .
 డాక్టర్ నవ్వి  యేమీ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లి పోయాడు 
కోడలి చేతికి  తాయెత్తు కడుతూ "అబ్బాయి ! ఈ పిల్లకి  బాగవుతుండంటావా ? తల్లి తండ్రి అయి మనమే చూసుకోవాలిప్పుడు "  కారే కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ.
"తప్పకుండా బాగవుతుందమ్మా " వొకింత విశ్వాసంతో చెప్పాడతను.  అంతే కాదు  తొమ్మిది  నెలలపాటు ఆమెని పసిపాపలా చూసుకున్నాడు మరో పసిపాపకి జన్మ నిచ్చేదాకా.
హాస్పిటల్ బెడ్ పై ఆమె నీరసంగా కనులు విప్పింది. ఆమె ప్రక్కనే వున్న శశిధర్   "ఇదిగో  నీ వెన్నెల పురుషుడు నీ వొడిలోకే వచ్చాడు చూడు" అంటూ  వుయ్యాలలో వున్న  బిడ్డని జాగ్రత్తగా తెచ్చి  ఆమె చేతుల్లో వుంచాడు.
ఆమె ముఖంలో సంతోషం. "అవును పురుషుడు పుత్రుడురూపంలో  పుడతాడట కదా వీడే నా వెన్నెల పురుషుడు " అంటూ బిడ్డని  గుండెలకి హత్తుకుంది .
 "హమ్మయ్య ! యిక యీ బిడ్డ ఆలనా పాలనలో జరిగినవన్నీ మర్చిపోతుంది" అనుకుంటూ విమల వూపిరి పీల్చుకుంది.
"అన్నట్టు నీకో విషయం చెప్పడం మరచాను వెన్నెలా !  మనం తోట ప్రక్కన వున్న యింటి నుండి  క్రొత్తింటికి  మారిపోయాం, ఇప్పుడు  ఆ యింటికే  వెళుతున్నాం " .
అక్కడా తోట ఉందా  ఆసక్తిగా అడిగిందామె. 
"పార్క్ కూడా వుంది. మన బాబుతో పాటు నువ్వూ  ఆడుకోవచ్చు" నవ్వుతూ చెప్పాడతను.   

( నవంబర్ మాలిక వెబ్ మాస పత్రికలో తరాలు -అంతరాలు శీర్షికన ప్రచురితం )

12, నవంబర్ 2015, గురువారం

ORACLE IN MEMORY

అమ్మ అడుగుజాడలలో అబ్బాయి .  సంతోషమే కదండీ ! మా అబ్బాయి ... "నిఖిల్ "  ఒక బ్లాగ్ వ్రాసుకుంటున్నాడు.  ఆ బ్లాగ్ పేరు : ORACLE IN MEMORY.....

ఇదిగోండి ... ఈలింక్  లో ... ఆ బ్లాగ్ .

ఈ బ్లాగ్ ని సందర్శించండి. మీ విలువైన సూచనలు,అభిప్రాయాలని .. "నిఖిల్ " కి అందించగలరు.


హృదయపూర్వక అభినందనలు ... చిన్నీ బంగారం.

"మనస్సాకాశంలో భావాలు పక్షుల్లా ఎగిరిపోతుంటాయి 
ఆలోచనలటెడారిలో వాక్యం ఎండమావిలా తోస్తుంది
ఎప్పుడో ఒకప్పుడు ... ఆలోచనలకి  అక్షరాలలో 
ఒక రూపం ఏర్పడుతుంది  
ఎంతెత్తుకి  ఎదిగినా గుమ్మంలోనుంచి  
తలొంచి లోనికి రమ్మంటుంది  అక్షర కుటీరం" 
ఈ అక్షర కుటీరంలో ... నీ ఆలోచనలన్నీ పరిఢవిల్లి  ఫలవంతం కావాలని మనసారా దీవిస్తూ ...  ప్రేమతో ...  "అమ్మ"




ఈలింక్ లో

8, నవంబర్ 2015, ఆదివారం

మర్మమేమి

మర్మమేమి 

ఆ రోజు  తెల్లవారుఝామున పిన్ని కొడుకు  గృహ ప్రవేశం.  విజయవాడ బస్టాండ్ లో గుంటూరు బస్ ఎక్కి కూర్చున్నాను. సమయం ఏడవుతున్నా  సూర్యుని పసిడి కిరణాలు పుడమిని తాకడంలేదు . మంచుతెరల మధ్య చలిగా ఉంది కాస్త కాఫీ తాగితే బావుండుననుకున్నా  కానీ బద్ధకం ముందు కాఫీ సెకండరీ అయిపొయింది. మొబైల్ తీసుకుని  ఇయర్పొన్స్ తగిలించుకుని ఇష్టమైన పాటల పొదికని తెరిచి  ఒక పాటని  ఎంపిక చేసుకుని వినడం మొదలెట్టాను." నేనొక అనామికను ఈ కథలో అభిసారికను" ..  ఏదో రిలీజ్ కాని చిత్రంలో పాట. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు . వినడంలో ఇష్టంగా లీనమైపోయాను.  

కొంచెం సేపటికి ఒకమ్మాయి వచ్చి నా ప్రక్కన కూర్చో బోతూ .. విండో సీట్ నాకిస్తారా అనడిగింది.  ఏ సీటై తే ఏమిటీ  గమ్యస్థానం చేరకపోతామా పైగా  కృష్ణమ్మ  బిర బిరలు చూసే భాగ్యం కూడా లేదని నాకనిపించి ఎడమ వైపుకి జరిగి కూర్చున్నాను. ఆమె విండో ప్రక్క సీట్లో హమ్మయ్య అనుకుంటూ  కూర్చుంది. బస్ బయలు దేరటానికి సిద్దంగా ఉన్నట్లు స్టార్ట్ చేసి పెట్టుకుని కొంచెం సేపు ప్లాట్ పారం  మీదే ఉంచడం డ్రైవర్ కి అలవాటనుకుంటా ! ఇంతలోకి ఒక వ్యక్తీ బస్ ఎక్కాడు . డోర్  దగ్గరే నిలబడి బస్ అంతా పరికించి చూసి దిగేసాడు. మళ్ళీ అనుమానంగా బస్ ఎక్కి చూస్తున్నాడు . ఏంటయ్యా ! వస్తావా రావా? మీవాళ్ళు ఎవరైనా రావాలా అని డ్రైవర్ అడుగుతున్నాడు. ఆతను మాట్లాడకుండా దిగేయగానే బస్ కదిలింది . 

నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి అతన్ని చూస్తూనే ఉంది . అతను క్రిందికి దిగగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ ని సైలెంట్ ప్రొఫైల్ లోకి మార్చడం చూసాను . ఆమెకి ఒక కాల్ వచ్చింది . ఆ కాల్ వంక చూస్తూ ఉండిపోయింది కానీ లిఫ్ట్ చేయలేదు . బేగ్ లో ఉన్న రెండో ఫోన్ తీసి చక చక ఒక నంబర్ డయల్  చేసి తల వంచి " వాడికి అనుమానం వచ్చింది " బస్ స్టాండ్ కి వచ్చి ప్రతి బస్ ని చెక్ చేస్తున్నాడు. నేను బురఖా వేసుకుని ఉన్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే  గుర్తు పట్టేసేవాడే ! నేను మళ్ళీ చేస్తాను . వాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు . ఫోన్ తీయక  పొతే అనుమానం వస్తుంది అని కట్ చేసి ..." ఆ చెప్పు ఏంటీ పోన్ చేసావ్ ? " అవతల ఏం  మాట్లాడుతున్నాడో  వినబడదు కదా అప్పటికే బస్  కృష్ణ లంక దాటేస్తుంది నేను కాలేజ్ కి వెళుతున్నానని చెప్పాను కదా ! ఇప్పుడే ప్రభాస్ కాలేజ్ వైపు వెళ్ళడానికి ఆటో ఎక్కుతున్నాను . తర్వాత మాట్లాడతాను అని చెప్పి పోన్ కట్ చేసింది. 

మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి అడిగింది.   ఏమిటి అన్నట్టు చూసాను  నాకొక పోన్ వస్తుంది . మీరు నేను కలసి ఒక ఆటోలో సింగ్ నగర్ స్టాప్ లో నుండి ప్రభాస్ కాలేజ్ వైపుకి వెళ్ళే  ఆటో ఎక్కామని చెప్పాలి ..ప్లీజ్ చాలా ప్రాబ్లం లో ఉన్నాను అంది . ఆమె చెప్పేది వింటూనే నాకు చాలా అయోమయంగా అనిపించింది కానీ  పాపం  ఏదో  ప్రాబ్లం అంటుంది కదా ! అనుకుని అలాగే అని తల ఊపాను నేను అలా అంగీకారం తెలపగానే .. ఒక నంబర్ కి కాల్ చేసి మా ఆయన లైన్ లోకి వస్తాడు మీకు ఇందాక చెప్పినట్లు చెప్పండి అని ఫోన్ నాకిచ్చింది . చెవి దగ్గర పెట్టుకున్నాను అటువైపు నుండి ఒక మాట కూడా అర్ధం కాలేదు . నేను ఒప్పుకున్న విషయం నెత్తి మీద పెద్ద బరువులా తోచి .. నేను మీ ఆవిడ ఇప్పుడే సింగ్ నగర్ దగ్గర ఆటో ఎక్కాం.  ప్రభాస్ కాలేజ్ దగ్గర దిగిపోతాం అని గబా చెప్పేసి ఆ అమ్మాయికి పోన్ ఇచ్చేశాను . విన్నావుగా .. ఇక సాయంత్రం వరకు డిస్ట్రబ్ చేయకు నేను పోన్ స్విచ్ ఆపేస్తున్నా ! క్లాస్ లకి వెళ్ళాలి కదా ! సాయంత్రం ఆన్ చేస్తా . అంటూ  ఆ పోన్ స్విచ్ ఆపేసి ఇంకో చేతిలో ఉన్న పోన్ తీసుకుని వేరొక అతనితో మాట్లాడుతుంది . అతనితోనే అని ఎందుకు అనుకున్నానంటే .. వెధవ ..వాడితో  ఇక సాయంత్రం దాకా గొడవలేదు నేనెక్కడికి రాను బంగారం అనడగుతుంది . ఆపకుండా ఒకటే కబుర్లు . నాకైతే ఒంటికి కారం రాసుకున్నట్టు ఉంది . 

కాసేపటి తర్వాత తనని ఎవరూ గమనించే వారు లేరనుకుని ముఖానికి కట్టుకున్ననఖాబ్   తీసేసింది . నేను ఉలికి పడ్డాను , నుదుటున ఎర్ర రంగు దోస గింజ ఆకారపు  స్టిక్కర్.  స్కార్ఫ్ , నఖాబ్ కట్టుకుంటే - మొగుడు కూడా గుర్తు పట్టలేడు....  ఈ అమ్మాయిలకి ఏం పోయే కాలం వచ్చింది మరీ ఇలా తయారవుతున్నారు. భర్త తో విభేదాలు ఉంటే పెద్దల మధ్య పరిష్కరించుకోవచ్చు లేదా విడాకులు తెసుకోవచ్చు ..ఎందుకీ ముసుగు నాటకాలు ? ప్ర్రాబ్లం  లో ఉన్నానని చెప్పి  నాతొ అబద్దపు సాక్ష్యం చెప్పించినందుకు కోపం  చిరాకోచ్చేసింది నాకు. 

ఆ అమ్మాయి వంక కూడా చూడకుండా ప్రక్క సీట్ వైపు చూసాను . అక్కడ ప్రక్క ప్రక్కనే కూర్చున్న అమ్మాయి అబ్బాయి . అమ్మాయి టైట్  జీన్స్ వేసుకుని పైన టీ  షర్ట్ వేసుకుంది.  శరీరంలో ఒంపుసొంపులన్నీ గీత గీసినట్లు కనబడుతూనే ఉన్నాయి . ముఖానికి మాత్రం స్కార్ప్ కట్టుకుని ఉంది . ప్రక్కన కూర్చున్న కుర్రాడి చేయి ఆమె ఒంటిమీద నాట్యం చేస్తూ ఉంది . నా వెనుక సీట్ లో కూర్చున్న కళ్ళద్దాల పెద్ద మనిషి పేపర్ చదువుకుంటున్నట్లు నటిస్తూనే ఎడమ ప్రక్కన సీట్లో కూర్చున్న జంట  రొమాన్స్ ని ఆస్వాదిస్తూ సొంగ కార్చుకుంటున్నాడు . ఛీ ఛీ .. సభ్యత సంస్కారం లేకుండా పోతుంది జనాలకి విసుక్కుంటూ నేను తెచ్చున్న మాస పత్రిక తీసి అందులో మునిగిపోయాను.  

కొద్ది సేపటికే  నా ఎడమ ప్రక్క సీట్లో కూర్చున్న అమ్మాయి లేచి వాళ్ళ వెనుక సీట్లో కూర్చున్నతనితో  గొడవ పడసాగింది . యూ..  రాస్కెల్ ఎన్ని సార్లని చూస్తూ ఊరుకుంటాం . వెనుక సీట్లో కూర్చున్న వాడివి బుద్దిగా కూర్చుని  నీ ప్రయాణం నువ్వు చేయి. ముందు  సీట్లో ఉన్న నన్ను టచ్ చేస్తావెందుకు ? కోపంగా అడిగింది  నిన్ను నేను టచ్ చేసానా, నేను టచ్ చేసానా ! సరిగ్గా చూసుకో ఎవరు టచ్ చేసారో . పబ్లిక్ లో ఉన్నామనే సెన్స్ లేకుండా బస్ లో కూర్చుని రొమాన్స్ చేస్తున్న మీకు అందరూ అలాగే కనబడుతున్నరేమో అన్నాడు .  ఆ అమ్మాయి రెచ్చిపోయి ఎవరు టచ్ చేసిందో నాకు తెలియదనుకున్నావా ? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు . అంటూ  ఇదిగో అజయ్  ఈ ఉంగరం ఉంచుకో ! ఎవడో బద్మాష్ గాదు పదే  పదే నా ఒంటిమీద  టచ్ చేస్తూ మైమరుపులో పడిపోతే వాడి వ్రేలి నుండి ఈ ఉంగరం లాగేసా ! కసిగా అని   కూర్చుంది  ఆ వెనుక సీట్లో కూర్చున్న పెద్దమనిషి  ఎడమచేతి వ్రేలి వైపు చూసుకుంటూ  కిక్కురుమనకుండా కూర్చున్నాడు. ఇవన్నీ చూస్తుంటే చాలా  అసహ్యమేసింది . లేచి వెళ్ళిపోయి ఆఖరి సీట్ లో కూర్చున్నాను .

నా ప్రక్కనే కూర్చున్న పిల్ల హాయిగా ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటూ ఉంది నన్ను చూసి పలకరింపుగా నవ్వి .. ప్రతి రోజు  ఈ బస్ లలో ఇలాగే గొడవలు పడుతుంటారు అంది . నేనేమీ మాట్లాడలేదు . యూనివర్సిటీ స్టాప్ వచ్చింది. అక్కడ చాలా మంది ముసుగు వేసుకున్న అమ్మాయిలూ , ఆ జంట కూడా  దిగేశారు. వాళ్ళ దారులు వేరైయ్యాయి . 

యూనివర్సిటీ లోపలకి వెళుతున్న అమ్మాయిలని చూసాను . సీతా కోక చిలకల్లా రంగు రంగుల బట్టలు వేసుకుని అందరూ ముఖానికి స్కార్ప్  కట్టుకుని ఉండారు .  అమ్మాయిల ముఖం కనబడకుండా దాచుకున్నంత మాత్రాన వాళ్లకి రోడ్ సైడ్ రోమియోల వల్ల ఈవ్ టీజింగ్ తగ్గుతుందా !? అందంగా ముఖం ఉన్నా లేకపోయినా ఆకారం కనబడుతూనే ఉంది గా ! పైగా అవయవ సౌష్టవాన్ని కనబడకుండా బట్టలు వేసుకుంటున్నారా  అంటే అదీ లేదు.  ఎవరిని మభ్య పెట్టడానికి ఈ ముసుగులు ? ఈ ముసుగులు వల్ల రక్షణ ఏమైనా ఉందా ?  తల్లిదండ్రులకి కూడా బిడ్డల ప్రవర్తన పట్ల నమ్మకం పోతుంది . ఏమైనా అంటే  మీకేమి తెలియదు మీరు ఊరుకోండి అంటూ  విదిలించి పడేస్తారు. దారిపొడవునా ఆలోచిస్తూనే ఉన్నాను .  

గుంటూర్ బస్టాండ్ దగ్గరకి రాగానే  లోపలకి వెళ్ళకుండానే నేను బస్ దిగుదామని లేచి నిలబడ్డాను. నేను మొదట కూర్చున్న సీట్ లో అమ్మాయి బురఖా వేసుకునే బస్ దిగిపోయి నా ముందు నుండే ఎవరిదో బండెక్కి తుర్రున వెళ్ళిపోయింది . పాపం ఆ  మొగుడి అనుమానం నిజమే అయి ఉంటుంది  ఈ కాలపు అమ్మాయిలూ మాములుగా లేరు అనుకున్నాను .  నా ప్రక్కన కూర్చున్న అమ్మాయి లేచి నింపాదిగా బేగ్ లో పెట్టుకున్న బురఖాని తీసి తొడుక్కుంది .  నేను ఆ అమ్మాయి  వంక ఆశ్చర్యంగా చూస్తున్నాను . నన్ను చూసి చిన్నగా నవ్వి  నాతో  పాటు బస్ దిగిపోయింది . 

నేను సిటీ బస్స్టాప్  వైపు అడుగులు వేస్తున్నాను ఆ అమ్మాయి నాతొ పాటే నడుస్తూ .. ఎక్కడికి వెళ్ళాలి ఆంటీ అడిగింది చొరవగా .. బృందావన్  గార్డెన్స్ అన్నాను . అదిగో ఆ బస్ వెళుతుంది అంటూ ఎక్కేసింది. నేను దిగే స్టాప్ లోనే దిగి నాతొ పాటే  నడుస్తూ ఎక్కడికి వెళుతున్నారు అంది  దగ్గరలోనే నూతన గృహప్రవేశ ఆహ్వానం అన్నాను  తనూ అక్కడికే అని చెప్పింది  . లోపలకి రాగానే మళ్ళీ బురఖాని విప్పేసి బాగ్ లో కుక్కేసి .. ఇప్పడు హాయిగా ఉంది అని నా వైపు చూసి స్నేహంగా నవ్వింది .  నీ పేరేమిటమ్మా అడిగాను . షహనాజ్ మేడం  అని చెప్పింది.  నా గురించి అడిగింది చెప్పాను . మీరు నా ఫ్రెండ్ కి ఆంటీ నా !? శృతి  ఇక్కడ లేకపోయినా గృహప్రవేశానికి వెళ్ళమని కాల్ చేసి  మరీ మరీ చెప్పింది. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ .  అందుకే వచ్చాను.  శృతి కూడా మీ గురించి అప్పుడప్పుడూ చెపుతూ ఉండేది.  ఇలా  మిమ్మల్ని కలవడం చాలా సంతోషం అంది. 

షహనాజ్ చాలా కలుపుగోలు మనిషి. ఇంగ్లీష్ టీచర్ గా కూడా పని చేస్తుందట. తన మతాచారాల పట్ల ఎంత గౌరవం ఉందో  అంతకి మించి చాంధసవాదం  పట్ల విముఖత ఉందని గ్రహించాను.  మధ్యాహ్నం భోజనాల తర్వాత  ఎవరూ అప్పటికప్పుడే ఇళ్ళకి వెళ్ళడానికి ప్రయాణం కట్టకూడని  షరతు పెట్టింది మా మరదలు .  చుట్టాలందరూ ఉండిపోయారు కూడా !  సరదాగా  ఆటాపాటా లతో పాటు  రకరకాల పోటీలు నిర్వహించారు కిట్టీ పార్టీల అనుభం అనుకుంటా ! అందరూ భలే చురుకుగా ఉన్నారు. అందరిలోకి నేనే వెనుకబడి ఉన్నాను. నన్ను గెలిపించి బహుమతి ఇవ్వాలని నా మరదలికి తట్టిందో ఏమో  స్త్రీలకి  కవితల పోటీ నిర్వహిస్తే బావుంటుంది అని అనౌన్స్ చేసింది ఆ  కార్యక్రమంలో నేను పాల్గొన్నాను కూడా ! నాకన్నా ముందు  షహనాజ్ పేరు వచ్చింది. ఆమె  "ముసుగెందుకు"  అనే కవిత చదివింది .  ఆ కవిత నాతొ పాటు చాలా మందికి నచ్చింది . హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.  నేను కవిత్వం వినిపించకుండా ముసుగు గురించే మాట్లాడాను . వాతావరణ కాలుష్యం నుండి కాపాడుకోవదానికో చర్మ సంరక్షణ కోసమో అమ్మాయిలూ స్కార్ఫ్ కట్టుకోవడం లేదని  ఆకతాయీ అబ్బాయిల నుండి రక్షించుకొవడానికి కూడా  ఎక్కువమంది స్కార్ఫ్ కట్టుకోవడం లేదని ఆ రోజు జరిగిన బస్ అనుభవాలని వివరించి ముసుగులు విడనాడాలని నేను కోరుకుంటున్నానని చెప్పాను.  అక్కడున్న అమ్మలందరూ నాతొ ఏకీభవించారు కూడా ! అలా చాలా చాలా విషయాలు మాట్లాడుకుంటూ   చాలా సంతోషంగా  మధ్యాహ్నమంతా గడచిపోయింది .  

చీకటి పడబోతుండగా   షహనాజ్ నేను` ఇద్దరం కలిసే తిరుగు ప్రయాణమయ్యాం. దారంతా సంప్రదాయం పేరిట పర్ధా  వెనుక నలిగిపోతున్న తన లాంటి ఆడపిల్లలని గూర్చి చెపుతూనే ఉంది. తామెంత స్వేచ్చ కావాలని కోరుకుంటున్నామో  బురఖాని విడనాడాలని అనుకుంటున్నామో కూడా చెప్పింది.  ఆశ్చర్యంగా అనిపించింది నాకు. 

షహనాజ్ తన గురించి మరింత వివరంగా చెప్పింది. ఎమ్ ఏ బి ఈ డి చేసాను . ఈ గుంటూరు లోనే ఉద్యోగం చేసేదాన్ని విజయవాడ కి చెందిన బాంక్ ఎంప్లాయ్ మ్యాచ్ వచ్చింది బోలెడంత కట్నం ఇచ్చి పెళ్లి చేసారు . ఉద్యోగం చేస్తూనేఉన్నాను .  ఇద్దరు పిల్లలు పుట్టారు . వాళ్ళ పెంపకం అంతా అమ్మ చూసుకునేది. మా ఆయనకీ నెల్లూరు ట్రాన్స్ ఫర్  అయింది. నాకేమో జీతం పెరిగింది . ఉద్యోగం  మానేయమన్నారు . నేను మానేయలేదు అమ్మ  నాన్న సాయంగా ఉందామని ఉన్న ఊరు వదిలేసుకుని గుంటూరుకి కాపురం వచ్చేసారు. ఒక ఏడాది అలా గడిచిందో లేదో మా మధ్య గొడవలు వచ్చేసాయి. బురఖా లేకుండా కాలేజ్ లో తిరుగుతున్నానని అమ్మానాన్నల అండ చూసుకుని పెట్రేగి పోతున్నానని మా ఆయనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాననే గర్వంతో ఎవరిని లెక్క జేయడం లేదని మా అత్తగారు గొడవపెట్టుకునే వాళ్ళు . ఆఖరికి ఉద్యోగం మానేసి అత్తవారింట్లో కాపురం ఉంటేనే నాతోనే కలసి ఉంటానని మా ఆయన పేచీ పెట్టాడు . విసిగిపోయాను.  జాబ్కి రిజైన్ చేసేసి అత్తారింటికి  వెళ్ళిపోయాను.  జీవితం గురించి ఏవేవో కలలు కంటాం కానీ పీడకలల్లాంటి జీవితం మన ముందు ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది. నలబయ్యి వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒదులుకుని ఇప్పుడు ఇంటిప్రక్క స్కూల్ లో ఎనిమిదివేల రూపాయల జీతంతో  టీచర్ గా చేస్తున్నా. అదీ అత్తగారు  అడుగడుగునా విధించే ఆంక్షలతో అంటూ  నవ్వుతూ చెప్పినా అందులో ఉన్న బాధ నాకర్ధమయ్యింది . మెల్లగా ఆమె చేతిని నా చేతిలోకి తీసుకుని ఓదార్పు వచనాన్ని సరఫరా చేసాను . 

బస్ టోల్ గేట్ దగ్గరలో ఆగిపోయింది. ముందు చాలా వాహనాలు ఉన్నాయి. అన్నీ కదిలి టోల్గేట్ చెకింగ్ దాటేసరికి  వర్షం ప్రారంభమయ్యింది.  చలికాలంలో వర్షాకాలం. షహనాజ్ సన్నని కూనీ రాగంతో ఏవో పాటలు పాడుకుంటుంది. భలే పాడుతున్నావే అన్నాను . అవన్నీ ఇంట్లో బంద్. కనీసం మా అమ్మాయి తరానికైనా మా సంప్రదాయాలు మారితే బావుండును. అందుకోసమే నేను పోరాడుతున్నాను మా వాళ్ళని కూడా మార్చాల్సిన అవసరం ఉంది .  నేనొక్కదాన్నే మారాలనుకుంటే విడాకులు తీసుకుంటే అయిపోయి ఉండేది మేడమ్  కానీ నేనలా అనుకోవడం లేదు. మా బంధువులందరికీ  ఒక్కొకటి అర్ధమయ్యే రీతిలో చెప్పుకుంటూ పోతున్నా ! నా రహస్య అజెండా వారికి తెలియదు అని నవ్వింది. ఆ మాట అర్ధమై నేను నవ్వేసా !      

సంప్రదాయాలని విసర్జించి స్వేచ్చగా మసలాలని షహనాజ్ లాంటి వారు  కోరుకుంటుంటే అదే ముసుగుని వేసుకుని పెడదారిన పడుతున్న కొందరిని చూస్తున్నా,. మంచికి చెడుకి ఒకే కత్తి లాగా బురఖా, స్కార్ఫ్ మారడం చూస్తూన్నాం అనుకున్నాను. యాసిడ్ దాడులు, ప్రేమోన్మాదులు,ర్యాగింగ్ వికృతాలతో  పాటు స్కార్ఫ్ మోసాలు కూడా !  బస్  దిగే టప్పుడు ప్రొద్దున  బస్ బస్ వెదుకుతున్న అబ్బాయి మళ్ళీ కనిపించాడు . బహుశా అతని భార్య  ఏ వారధి దగ్గరో దిగిపోయి ఆటో ఎక్కేసి  ప్రభాస్ కాలేజ్ దగ్గరకి వెళ్ళి పోయిందని తెలుసుకోలేలేడేమో కూడా అనుకున్నాను మనసులో .   

వర్షం కురుస్తూనే ఉంది. ఇద్దరం  తడుస్తూనే సిటీ బస్టాండ్ వైపు నడుస్తున్నాం  సడన్ గా మా ఇద్దరి ముందు అతను. ఏయ్ .. ఏమిటిలా దారికి అడ్డం పడుతున్నావ్ .. తప్పుకో అంటూనే ఉన్నా . అతను ప్యాంట్ జేబులో నుండి కత్తి  తీసి  షహనాజ్ పొట్టలోకి దించేసాడు. భయంతో వెర్రి కేకలు పెట్టాను. మళ్ళీ ఇంకోసారి పొడిసేసాడు.  పొడిసిన కత్తిని పైకిలాగి క్రింద పడేసి షహనాజ్ తలకి కట్టుకున్న నకాబ్ ని లాగిపడేసి అలాగే నిలబడిపోయాడు .  క్రింద  పడిపోతున్న షహనాజ్ ని పట్టుకుని హెల్ప్ హెల్ప్ అని కేకలు పెట్టాను . రక్తం దారలుగా  కారుతుంది వర్షపు ధారలలో కలసి పారుతుంది అది చూసాక  వర్షం నా కళ్ళల్లో కురుస్తుంది.  

నా కేకలకి చుట్టూ ఉన్న మనుషులు మమ్మల్ని చుట్టేసి జరిగింది అర్ధమై పారిపోకుండా  అతన్ని గట్టిగా పట్టుకున్నారు .  పోలీస్ లు వచ్చేసారు , అంబులెన్స్ లో షహనాజ్ ని ప్రక్కనే ఉన్న  హాస్పిటల్ కి తీసుకు వెళ్ళారు తనతో నేనూ వెళ్ళాను . కత్తిపోట్లు అంత బలంగా తగల్లేదు కాబట్టి షహనాజ్ కి ప్రాణ భయం  ఏమీ లేదు కానీ .. ఆమె ఇంటి వాళ్ళని తలచుకుంటే ఒణుకు వచ్చేసింది. ఈ సంఘటన దేనికి దారి తీస్తుందో అర్ధం కాలేదు. ఆమె ఇంటి వాళ్ళందరూ హాస్పిటల్ కి వచ్చారు. నేనేవరనే ఆరాలు అనుమానపు చూపులు.   షహనాజ్ మామగారు విషయాన్ని సేకరించుకొచ్చారు.   పొడిచినతన్ని  కత్తితో సహా టూ టవున్ పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్ళారని . అతను చెప్పిన మాటలు ఏమిటంటే  తన  భార్య  బురఖా వేసుకుని ప్రియుడితో తిరుగుతూ తనని మోసం చేస్తుందని .. ఆ రోజు ప్రొద్దున్నే ఆ నల్ల చీర కట్టుకున్నామె  ప్రక్కన కూర్చుని ప్రయాణం చేస్తుంటే తను చూశానని . . తిరిగి వచ్చేటప్పుడు బురఖా వేసుకుని వచ్చేది కూడా తన భార్యే అనుకుని చంపేయబోయానని చెప్పాడట . ఇంకా ఒణికి పోయాన్నేను.   

2, నవంబర్ 2015, సోమవారం

వస్త్రాపహరణమొక సంస్కృతి


మాతృక మాస పత్రిక " గుండె చప్పుడు " లో నా కవిత.  

వస్త్రాపహరణమొక సంస్కృతి
ఇంటా బయటా జాతి గౌరవాల గురించే మాట్లాడుతాం
ఏ జాతి అని అడగకండి . 
ఇక్కడ జాతికి ఒక రంగు ఉండాలి
అన్ని రంగులు అసలు సమానమే కాదు 
అవసరమైతే యుగాలనాటి సంస్కృతిని తెరపైకి ఈడ్చుకొస్తాము
వస్త్రాపహరణం జుట్టుపట్టుకుని ఈడ్వడం లాంటి
అన్ని పర్వాలు ఇక్కడుంటాయి ఆధునీకరణ చేసుంటాయి
ఇక్కడ జాతులకి కొన్ని ధర్మాలుంటాయి
స్వజాతికే ధర్మం కొమ్ముకాస్తుందన్నట్టు
అనుకుంటే పొరబాటే !
చెలగాటం ప్రాణ సంకటం నిత్య వినోదమిక్కడ
ఒక్క ఓట్ల కాలమప్పుడు తప్ప క్రమంతప్పని ఋతువుల్లా
మతం కులం జాతి లింగ వర్గ పేద ధనిక తారతమ్యం మరీ ఉంటుంది
ఇక్కడధికారం అణువణువునా కాపుకాస్తుంది
కడగొట్టు జాతి వాడు పిర్యాదివ్వడం కూడా
పాపమని సొంత రాజ్యాంగం రాసుకున్నారేమో ,
ప్రశ్నించే అధికారాన్ని కాలరాస్తూ కాళ్ళతో మట్టగిస్తూ
బట్టలూడదీస్తారు కళేబరాల్ని ఈడ్చినట్లు నడి రోడ్దున పడేస్తారు
చెత్త మనుషులనుకుని చెత్త ఊడ్చి పడేసినట్లు వదిలేస్తారు
ఆడమగ తేడా లేకుండా నిలువుగా వివస్త్రలు కాబడి
నిశ్చే ష్టులై నడి రోడ్డుపై నిలుచుంటే
నగ్నత్వాన్ని కథలుగా చెప్పుకుంటూ నిలబడిన లోకులు
కాకులు కూడా కాలేకపోయారు
ఇక్కడ కాకులకి కులముంది మతముంది
మీ నగ్నత్వాల సాక్షిగా ఇక్కడ నిజమెప్పుడూ నిష్టూరమే !
మౌనంగా ఉపేక్షించే చచ్చుజాతి పుచ్చుజాతికి
నిలబడిన చోట సంఘీభావం తెలపడానికి కూడా భయమే
ఎవరి ఆయుధం వారి చేతిలోనే ఉండాలిప్పుడు
అరువు ఆయుధాలు ఎన్నటికి దొరకవు
అమ్మల్లారా !
చీరకొంగుల్లో చిటికెడు కారమైనా దాచుకోకుండా
చేతిలో చిన్న చురకత్తైనా లేకుండా ..పిర్యాదు చేయడానికి వెళ్ళకండి .
మీ మీద లెక్కలేనన్ని పిర్యాదు లుంటాయక్కడ
బట్టలిప్పుకుని బరి తెగించి దేశం పరువు తీస్తున్నారని 
పరువు హత్యలు చేయగలరు
లేదా దేవతా వస్త్రాలు ధరించడం
మా జాతి సంస్కృతీ అని చాటేయనూ గలరు 
జాగ్రత్త తల్లీ ! 
ఈ సారి పోలీస్ హవుస్ లకి వెళ్ళేటప్పుడు
తోళ్ళు తాటాకులు కూడా రహస్యంగా తీసుకెళ్ళండి
ఏం జరిగినా రహస్యంగా దాచుకోండి.

1, నవంబర్ 2015, ఆదివారం

ఆంద్ర జ్యోతి లో నా కథ

ఫ్రెండ్స్ .. ఈ రోజు 01-11-2015 ఆంద్ర జ్యోతి ఆదివారం సంచికలో నేను వ్రాసిన కథ ...
"మర్మమేమి"  ఈ లింక్ లో ఉంది.  కథని చదివి మీ మీ అభిప్రాయాలని తప్పకుండా చెపుతారు కదూ ...
వనజ తాతినేని.

లింక్ లో చదవడం కుదరని వారి కోసం ...




26, అక్టోబర్ 2015, సోమవారం

రెక్కల చూపు

ఇటీవల  "రెక్కల చూపు " కథల సంపుటి చదవడం జరిగింది . అందులో అన్ని కథలు బాగున్నాయి సాదా సీదా వచనంతో  ఆసక్తిగా పఠకులని అక్షరాల వెంట పరుగులు తీయించగల రచయిత్రి  శీలా సుభద్ర గారు , ఈ కథలన్నీ వివిధ పత్రికలలో ప్రచురించిన మరియు పోటీలలో బహుమతి పొందిన కథలే !

మన చూపుకి అందినంతవరకు కొంత స్పష్టంగానూ మరి కొంత అస్పష్టంగానూ  చూస్తూ ఉంటాం . రెక్కల చూపు .. ఈ పదం వినగానే ఏదో అర్ధం అయి కానీ భావన . చూపులకి రెక్కలు వస్తే .. మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఏది చూడాలనుకుంటే అది చూసి రావచ్చు . అలా చూపులకి రెక్కలు లేవు  కాబట్టే మనకి నిరీక్షణ. కొన్ని కథలని వివరంగానూ కొన్ని కథలని సూచనా ప్రాయంగాను పరిచయం చేస్తున్నాను .

ముఖ్యంగా మార్పు వెనుక మనిషి కథ చదివి మన జీవితాల్లో వస్తున్న మార్పుకి అనుగుణంగా మనం కూడా సర్దుకుపోవాల్సి ఉందని ఈ కథ చెపుతుంది. చక్కటి కథ . శ్రీ లక్ష్మి గారి కొడుకు రాజుకోడలు రమణీ   విదేశాలలో ఉంటాడు. ఆమెకి కొడుకు కూతురు పింకీని ప్రేమగా హత్తుకోవాలని చిట్టి పొట్టి కబుర్లు చెప్పుకోవాలని ఆరాటం .  రాజు నాలుగైదేళ్ళ  తర్వాత మాతృదేశం వచ్చి ఇక్కడ వాతావరణంలో ఇమడలేక మంచి నీళ్ళు కూడా కొనుక్కుని తాగుతూ  నాలుగురోజులైనా ఉండకుండా తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు తల్లి ఇచ్చిన స్వీట్స్ జంతికలు కూడా లగేజ్ ఎక్కువైందని వదిలేసి వెళ్ళిపోతాడు . పుట్టినప్పటి నుండి ఇక్కడ పెరిగిన వాడే కదా ! అంతలోనే విదేశాల అలవాటుతో ఇక్కడ ఉండలేనని వెళ్ళాడు అని శ్రీ లక్ష్మి తలచుకుని బాధపడుతుంది . కొన్నాళ్ళకి ఆమె పుట్టి పెరిగిన ఊరు కొనసీమకి  భర్త తో సహా వెళుతుంది. నగర జీవనానికి అలవాటైన వాళ్ళు అక్కడ బురదతో నిండిన నేలలో నడుస్తూ చిరాకు పడుతూ   కరంటు లేక  దోమకాటు ని భరిస్తూ వారం రోజులు ఉందామని వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజుకే తిరిగి ప్రయాణ మవుతూ మార్పు వెనుక మనిషి పరిగెత్తాల్సిందే అనుకుంటారు . సౌకర్యానికి అలవాటు పడిన మనుషులు వేరొక చోట జీ వనానికి అలవాటైన మనషులు కొన్నేళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు అతిధులై ఆ వాతావరణంలో ఇమడలేక ఇబ్బంది పడుతూ సొంత గూటికి చేరుకోవాలనుకోవడం మార్పు వెనుక మనిషి పరుగులు తీయడం తప్పదని ఈ కథ చెప్పింది .

కంచె కథ ..  ఈ కాలానికి అవసరమైన కథ. తల్లి బిడ్డని అన్ని వేళలా కంచె అయి కాపాడుకోవాలని చెప్పిన కథ  . చిన్నప్పుడే ఇంటి ప్రక్కతనిని ప్రేమించి పెళ్లి చేసుకుని బస్తీ కి వచ్చేసిన నాగమణి  వాళ్ళమ్మ నోరుగల మనిషి . ముగ్గురు పిల్లలని స్కూల్లో జేర్పించి పైసా ఫీజ్ కూడా కట్టకుండా  సంవత్సరాలు గడిపేస్తూ ఉంటుంది . దయతలచి పరీక్ష ఫీజ్ కూడా ఎవరో ఒకరు కట్టేస్తూ ఉంటారు .  ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమెని వదిలేసి వేరొక స్త్రీ తో ఉంటూ  కుటుంబాన్ని గాలికి ఒదిలేసినా నాలుగిల్లల్లో పని చేసుకుంటా పిల్లలని పెంచుకునే ఒంటరి తల్లి ఆమె . నాగ మణి ఎనిమదవ తరగతి చదువుతూ ఉండాగానే అబ్బాయిలతో స్నేహం చేస్తూ వాళ్ళతోపాటు స్కూల్  టెర్రస్ మీద  టీచర్లకి దొరికిపోతుంది . తల్లిని పిలిపించి బిడ్డని జాగ్రత్తగా పెంచుకోమని చెపుతారు టీచర్లు .  ఆ మాట విన్న నాగమణి తల్లి ఆవేశంతో ఆ పిల్లని కొట్టబోతుంది. మర్నాటి నుండి తనే స్వయంగా స్కూల్ దగ్గర ఒదిలిపెట్టి   మళ్ళీ స్కూల్ వదిలే సమయానికి వచ్చి వెంట తీసుకుని పోతూ .. బిడ్డ ఏ ప్రేమ ఆకర్షణ వలలో చిక్కకుండా ఏ తోడేళ్ళ బారిన పడకుండా కాపాడుకుంటుంది. రచయి త్రి ఈ కథని బాగా వ్రాసారు . కథ మన కళ్ళ ముందు దృశ్య రూపంలో కదిలిపోతుంది.

ఇంకో కథ గోవు మాలచ్చిమి. సరోగ్రసీ మదర్ గా అవతారమెత్తిన పేద మహిళ కథ  నవ మోసాలు మోసి తనది కాని తన బిడ్డని అమ్ముకునే తల్లి  యొక్క మనోభావాలని సున్నితంగా సృశించిన ఈ కథలో వెంకటలక్ష్మి నారాయణ  భార్యాభర్తలు ఉన్న అరెకరం పోలమమ్మి గల్ఫ్ దారిన పట్టిన నారాయణ  వెళ్ళిన కొన్నాళ్ళకే   చావు తప్పి కన్ను లోట్ట బోయి నట్లు  గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తాడు. చేసిన అప్పులు , చేయడానికి పనిలేకపోవడం ,ఆటో అద్దెకి తీసుకుని నడపడం ద్వారా వచ్చే డబ్బు ఆ ఆటో అద్దెకి సరిపోవడంతో  పిల్లలు కూడా పస్తులున్దాల్సి రావడంతో దగ్గర బంధువు మల్లేష్ చెప్పిన మాటలు విని భార్య గర్భం ని కూడా తొమ్మిది నెలలు పాటు అద్దె కి ఇచ్చే పని కి ఒప్పిస్తాడు . తొమ్మిది నెలలు మోసి పండంటి బిడ్డని కనీ  డబ్బిచ్చిన వారి చేతిలో పెడుతుంది ..దానితొ వారి ఆర్ధిక బాధలు తీరిపోతాయి . వెంకట లక్ష్మికి ఉపాధి దొరుకుతుంది .  కానీ డబ్బాశ తో మరొక  మారు ఆమెని  బిడ్డని కనీ ఇమ్మనడానికి  భర్త సమాయతం  చేస్తుంటే ... ఆమె ముందుకు కదలక కాళ్ళు దిమ్మ కట్టి పోయినట్లు అక్కడే పాతే సినట్లు నిలబడుతుంది కట్టు కొయ్యకి కట్టేసిన ఆవు దాని చుట్టూ బాధగా తిరుగుతూ ఉంటుంది . ప్రతి ప్రసవం మనిషికి పునర్జన్మ లాంటిది పుట్టబోతున్న బిడ్డపై ప్రేమతో తల్లి వాంతులని  వికారాలని భరిస్తూ తొమ్మిది నెలలు మోసి పురిటినొప్పులు భరించి బిడ్డని కంటుంది .  ఎవరో డబ్బు విదిల్చేసి పేగు బంధాన్ని తెంచేసి ఆ బిడ్డని లాక్కేలుతుంటే ఏమీ కానిదానిలా చూస్తూ ఉండటం మాత్రు హృదయం భరిచడం ఎంత కష్టమో స్త్రీకి మాత్రమే   తెలుసు . అందుకే కట్టు కొయ్య చుట్టూ తిరిగే గోవు మాలచ్చిమి తో వెంకట లక్ష్మిని పోల్చి మూగ వేదనని మన కళ్ళకి చూపించారు .  

ఈ కథల సంపుటిలో టైటిల్ కథ రెక్కల చూపు . చాలా దుఃఖ పెడ్తుంది కథ .  సావిత్రి భర్త యాదగిరి రిక్షా త్రొక్కుతూ ఉంటాడు. సావిత్రికి మేనమావ అవుతాడు . ఇంకో సంతానం లేని  సావిత్రి తల్లి కూడా వారి దగ్గరే ఉండేది ఒక రోజు సినిమాకని వెళ్లి   జరిగిన యాక్సిడెంట్ లో సావిత్రి భర్త కూతురు చంద్రకళ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోతారు . దెబ్బలు తగిలి కొన్నాళ్ళు మంచం లో ఉండి  సావిత్రి తల్లి చనిపోతుంది . చంద్రకళ కాకుండా సావిత్రికి ఇంకో ఇద్దరు కొడుకులు ఉంటారు . వేంకటేశు ,శ్రీనివాసు . సావిత్రి బీడిలు చుట్టుకుంటూ వచ్చే ఆదాయంతో ఇండ్లలో పని చేస్తూనూ పిల్లలిద్దరిని పోషిచుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ ఉంటుంది వారికి స్కాలర్ షిప్ కూడా రావడంతో ఇబ్బందేమీ లేకుండానే జరిగిపోతుంది . వేంకటేశు తెలివికలవాడు పదవతరగతి వరకు చదువుకుని సిమెంట్ ప్యాక్టరీలో పనికి వెళ్ళే వాడు . కొన్నాళ్ళ తర్వాత పనికి వెళ్ళడం మానేసి ఏవేవో పుస్తకాలు చదువుతూ ఉండేవాడు . అప్పుడప్పుడు కొన్ని రోజులపాటు ఇంటికి రాకుండా కూడా ఉండేవాడు . ఒకసారి అలా వెళ్ళినవేంకటేశు  ఇక ఇంటికి తిరిగి రాదు .  అందరూ సినిమాల పిచ్చితో ఏ బొంబాయి కో  వెళ్ళాడని అనుకుంటారు  కొన్నాళ్ళకి ఒక ఉత్తరం వస్తుంది . అది చదువుకుని తల్లి సావిత్రి కన్నీరు మున్నీరు అవుతూ ఉంటుంది . ఆ ఉత్తరాన్ని చిన్న కొడుకుకి తెలియకుండా చూరులో దాసీ ఎవరు లేనప్పుడు  కొడుకు వ్రాసిన ఉత్తరం తీసి  చదువుకుంటూ  ఉంటుంది . ప్రతి రోజు కొడుకు వస్తాడనిఎదురు  చూస్తూ ఉంటుంది , ఆ ఉత్తరం కూడా వానకి తడిసి అక్షరాలూ మసక బారినా అలాగే ప్లాసిక్ కాగితంలో చుట్టి దాచుకుంటుంది . శ్రీనివాస్ పదవ తరగతి పాసై ఆ ఊర్లోనే కరంట్ పనికి వెళుతూ ఉంటాడు . మధ్యలో ఆతను కూడా ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాడు , తల్లి ఆ పుస్తకాలు చదవడం చూసి తొట్రు పడతాడు . పరీక్షలు అయినాక పుస్తకాలు చదవడం ఏమిటంటే జగ్గన్న ఇచ్చాడని చెపుతాడు  జగ్గన్న అంటే వేంకటేశు దోస్త్ కదా ! ఏం  చెప్పిండు అని అడుగుతుంది . తొందరలోనే అన్న వస్తాడని చెప్పాడని చెపుతాడు. కానీ వెంకటేసుకి బదులు అర్ధరాత్రి వేళ  పోలీసులు  వస్తారు . భయంతో తలుపు  కాదు కదా కిటికీ తలుపు కూడా తీయనివ్వదు సావిత్రి . తెల్లవార్లు భయంతో వణికిపోతూ సూర్యోదయంకి తలుపులు తీస్తారు . ఇంటి వెనుకప్రక్క ఒక గొనె సంచీని చూస్తారు అందులో రక్త సిక్తమైన వెంకటేష్ బట్టలు పెన్ , డైరీ ఇవి కనబడతాయి . జరిగింది అర్ధమై సావిత్రి కూలబడిపోతుంది . ఆమె చూపు చివర వేంకటేశు శ్రీనివాసు లాంటి ఎందఱో కనబడతారు .  ఈ కథ చదివాక మరే కథ చదవలేము. దుఃఖంతో హృదయం భారమవుతుంది.  పేద కుటుంబాల లోని పిల్లలు ఎంతో  కొంత చదువుకుని కుటుంబానికి ఆధారం కాకుండా  విప్లవ సాహిత్యం చదివి పోరు బాట పట్టి అకాల మరణం పాలవుతున్న తీరుని ఎంతో  హృద్యంగా, నర్మ గర్భంగా  చెప్పారీ కథలో.

విద్యల వ్యాపారాన్ని విద్యని కొనుకునే వారి గురించి ఆలోచింపజేసే విధంగా చెప్పిన కథ అంగడి . స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళ యినా పేదవారికి చదువు అందని ద్రాక్ష ఎందుకవుతుందో చెప్పే కథ . వెనుకబడిన కులాలు తరగతుల వారికి పాఠశాలలో ఉచిత విద్య లభిస్తుందని చెప్పేదెవరు ? వారికి తెలిసేది ఎలా అని దిగులు పడతారు . పేదవాడి రిజర్వేషన్స్ మీద పడి  ఏడిచే అగ్ర కులాలవారికి సరైన్న మార్కులు రాకపోయినా ఇంజినీరింగ్ సీట్ కొనుక్కోగల స్తోమత  ప్రవల్లిక లాంటి కుటుంబీకులకి ఉంటుంది కానీ చంద్రిక లాంటి పిల్లలు బాగా చదువుతున్నా కాలేజీ  మెట్లు ఎక్కే పరిస్థితులు లేని వారి ఆర్ధిక స్థితిగతులు ఎప్పటి మారవు చదువు అంగటి సరుకే అని చక్కగా చెప్పారు రచయిత్రి.

వందేమాతరం పాట  సరిగా పాడకపోతే గాంధీ తాతకి కోపం వస్తుంది కదు  నాన్నా ! అప్పుడేమో ఇంగ్లీష్ వాళ్ళతో యుద్ధం చేయలేక  ఓడిపోతే మనం మళ్ళీ వాళ్ళ క్రిందే పని చేయాల్సి వస్తుంది . అందుకే పాట  చక్కగా పాడాలని మాస్టారు  అన్నారు అవునా నాన్నా ! అని  అమాయకంగా ప్రశ్నించినప్పుడు తన మాటలకి మురిసి పోయి గుండెలకి హత్తుకుని తన బుగ్గల మీద ప్రేమగా ముద్దెట్టుకున్నాడు తండ్రి . ఆనాడు అమాయకంగా అడిగిన మాటలు ఇప్పుడు గుర్తొచ్చిన పరమేశానికి చేతికి తడిగా తగిలింది చెంప .  ఇలా ముగుస్తుంది కథ .   స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశకాలు దాటాయో లేదో  మళ్ళీ మనం విదేశీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుపోతున్నాం. మల్టీ నేషనల్ మార్కెట్ ట్రెండ్ మన చిన్న వ్యాపారస్తులని ఎలా నామ రూపాలు లేకుండా చేస్తున్నతీరుని ఆలోచింపజేస్తూ  వ్రాసిన కథ   ఆరోహణంలో అవరోహణం.   అందరూ తప్పక చదవాల్సిన కథ .
ఈ రెక్కల చూపు సంకలనంలో మొత్తం పద్దెనిమిది కథలున్నాయి . వస్తువు దృష్ట్యా అన్నీ మంచి కథలే ! ఏ కథకి ఆ కథ బావుంటుంది . కొన్ని సహానుభూతినీ కల్గిస్తే కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి . సుభద్ర గారి చూపు చాలా విశాలమైంది . కనుకనే ఇప్పటి సామాజిక అంశాలన్నింటిని  కథలుగా మలిచారు .  చాలా కథలు ఆమె అనుభవంలో నుండి వచ్చినవిగా కూడా తోస్తుంది . సుభద్ర గారి రచనలలో స్త్రీల జీవితాల్లో తిష్ట వేసి ఉన్న వేదనని దానికి కారణమైన పురుష అహంకారాన్ని సున్నితంగా విమర్శిస్తూ సాగే ఒక స్త్రీ గొంతుక ఉంది . ఈ సంపుటిలో కథలన్నీ కూడా స్త్రీల జీవితాలలో ఉండే అసహాయత, అంతులేని వేదన కల్గి ఉన్నాయి .  కానీ విశేషం ఏమిటంటే  స్త్రీలు దుఖాన్నీ మోస్తూనే అవసరమైనప్పుడు ఆత్మ విశ్వాసంతో దైర్యంగా బ్రతికి తీరాలనే తపన కల్గి ఉంటాయి . 

చిరుజల్లు కథలో భార్యకి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకున్న భర్త బిడ్డని వద్దనుకున్న ప్రయత్నంలో ఆమె శాశ్వతంగా తల్లి కాలేని పరిస్థితి కల్గినప్పడు శారీరక అనారోగ్యంతో పాటు మానసిక అనారోగ్యం కల్గి నాలుగు గోడలకి పరిమితమయ్యి భర్త నిర్ణయాన్ని కాదనగల్గే దైర్యం ఎందుకు లేకపోయిందో అని తనని ప్రశ్నించుకునే పాత్ర రజని , పెళ్ళికి ముందు ఎన్నో పుస్తకాలు చదువుతూ ఎన్నో విషయాలు చెపుతూ చర్చలలో  ఉత్సాహంగా  పాల్గొంటూ ఉండే లైబ్రేరియన్ జయంతి పెళ్లి తర్వాత  భర్త పిల్లలు నాలుగు గోడల మధ్య పరిమితమై  మేల్ ఇగో ని సంతృప్తి పరచలేక  పుస్తకాలని చదవడమనే ఇష్టాన్ని కొనసాగించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన స్త్రీ కథ , ఆడపిల్ల సంపాదనతో కుటుంబ అవసరాలని తీర్చుకుంటూ ఆమెకి పెళ్లి మాట తలపెట్టకుండా కుటుంబం కోసం అరగదీసే తల్లిదంద్రులున్నప్పుడు తనకేం కావాలో ఆలస్యంగా నయినా తెలుసుకునే మహాలక్ష్మి ఊరేళ్ళాలికథలో .కుటుంబాలని బట్టీ కాకుండా సంస్కారం,మంచితనంతో మనుషులని అంచనా వేస్తూ సుమతి స్నేహానికి విలువనిచ్చే రంజనీ పాత్ర ఉన్న కథ "నివురు" పిడికెడంత ప్రేమకోసం  ఆలంబన కోసం పెళ్ళైన వాడు అని తెలిసి కూడా తన హృదయంలో చోటిచ్చి జీవితంలో భాగమైనా తనకి తన పిల్లలకి కేమికాని పురుషుడుకి ఎంత మాత్రం చోటివ్వకూదనుకునే  సావిత్రి కథ "మూసిన తలుపులు"   ఆడవాళ్ళకి చదువులెందుకు ఉద్యోగాలెందుకు అని స్వార్ధంగా ఆలోచించడం  మగవాళ్ళకే కాదు  ఆడవాళ్ళకి ఉంటుందని తెలిపే కథ "మాయేంద్రజాలం " కథ  వీటన్నింటిలోనూ స్త్రీల గొంతుకే వినిపిస్తుంది . అలాగే మనుషుల్లో మానవత్వం ఇంకా ఉండే అన్నదానికి గుర్తుగా  రోడ్డు ప్రక్కన పడి ముసలమ్మ పట్ల   ముగ్గురు యువకులు చూపిన శ్రద్ద దయ "పరిమళించిన మొగ్గలు" కథ  పేదవాళ్ళకి కడుపు నిండా  తిండే కాదు తలదాచుకోవాడానికి చిన్న  గుడిసె కూడా  లేకుండా సంపన్నుల ఇళ్ళమధ్య నుండి వారిని తరిమేస్తే అకాల మరణం పాలైన బుడ్డీమా కథ "చితికినకల"  నట్టింట్లో తిష్ట వేసిన టీవి ప్రభావంలో కొట్టుకొని పోతూ మనుషుల మధ్య మాటా మంచి లేకుండా ఇల్లాళ్ళు  వ్యాపార ప్రకటనలకి అనుగుణంగా కొనుగోలుకి అలవాటు పడి ఇల్లు గుల్ల చేసుకునే  వైనం చెప్పిన కథ "రంగుల వల" కథ  అన్నీ మన చుట్టూ ఉన్న జీవితాల్లోని కథలే. 

మనిషికి హితం కల్గించేదే సాహిత్యం అంటారు . అలాంటి సాహిత్య ప్రయోజనమే ఈ కథలలో అంతర్లీనంగా ఉంది .  ఆమె కథలని సమీక్షించే వయసు అనుభవం కూడా నాకు లేదు . కథలు చదివిన తర్వాత నాకు కల్గిన స్పందనకి ఈ అక్షర రూపం . కొండని అద్దంలో చూపించే ప్రయత్నం  మాత్రమే  ఇది . అందరూ తప్పకుండా చదవాల్సిన కథలు ఇవి అని మాత్రం చెప్పగలను