వెళితే వెయ్యేళ్ళు వెదుకుతావ్ ! చలం ఊర్వశి పురూరవుడితో అన్న మాటలివి . ఒక స్త్రీ పురుషుడితో అన్న ఈ మాటలు బాగా నచ్చాయి
"పురూరవ" చలం విరచిత రేడియో నాటకం వింటున్న ప్రతిసారి ఏవో కొత్త అర్ధాలు స్పురిస్తాయి. చలం రచనలు కూడా అంతే! పాఠకులు వారి రచనలు పరిచయం లేకున్నా సరే ... ఆయనేదో విచ్చలవిడి శృంగారం గురించి వ్రాసాడట . ఆ పుస్తకాలు చదవడం దండగ అనేమాట ఎక్కువ వింటాం .
అసలు చలం రచనలు అందరూ చదవతగినవి కాదా ? అనే అనుమానంతోనే చదవడం ప్రారంభించి .. కొంత విసుగు తోచి అక్కడ పడేయడం మళ్ళీ చదవాలనిపించడం చదివినదే చదువుతూ ఆలోచించడం మొదలెడతాం .
మిగతా రచనల గురించి ప్రక్కన పెడితే పురూరవ గురించి నేను చదివి, విని తెలుసుకున్న దానికన్నా .. నాకు చలం విరచిత "పురూరవ ' బాగా నచ్చింది . పురూరవ ని నవలా రూపంలో చదవలేదు,. రేడియో నాటకం వినడం మాత్రమే జరిగింది.
చంద్రవంశం లో ప్రసిద్దుడైన పురూరవ చక్రవర్తి గురించి ఇంద్ర లోకంలో చెప్పుకోవడం విన్న ఊర్వశి అతనిపై మోహం పెంచుకుని అతనిని తలపులలో నింపుకుని నాట్యం సరిగా చేయని కారణంగా గురువు భరతముని చేత శపిం పబడి పురూరవుడిని వెదుక్కుంటూ మనుష్య లోకంకి వస్తుంది. ఈ రేడియో నాటకం ఇక్కడ నుండి ప్రారంభం అవుతుంది.
. పురూరవుడిని దగ్గరికి వెళ్లి బిడియం లేకుండా తన ప్రేమని తెలియజేస్తుంది . అతని తిరస్కారానికి గురయి వెళ్ళిపోతుంది . వెళ్ళిన ఆమె కోసం వనమంతా , గుహ గుహ వెదుకుతాడు. ఆమెని కాంచి సంతోషపడతాడు
"నీ అవసరాన్ని నీకు గుర్తించేటట్టు చేసేందుకు... నేను వెళ్ళిపోయాను ".నువ్వెవరో నీకు తెలిపేందుకే వచ్చాను" అని
" స్త్రీ ముందు మోకరించటం నేర్చుకొని నువ్వు ఏం తెలుసుకున్నావ్ ? ఏం జీవించావ్ ? ఎంత అల్పుడివి నువ్వు " అంటుంది
ప్రేమంటే నీం తెలుసు . నీ దృష్టి . విశాలం కాకుండా ఉంటుందా ?నిజంగా ప్రేమిస్తే....
బలీయమైన , అజేయమైన ప్రేమ బంధం వల్ల కాకపొతే ఎందుకు నిన్ను వరిస్తాను ... అంటుంది పురూరువుడితో
ఎప్పటికి గ్రహించవలసింది ... ఇంకొకరు చెప్పడం వల్ల ఎన్నడూ అర్ధం కాదు, క్రమంగా కాలంలో సొంత అనుభవం బోధించాల్సిందే ! మాటలతో నేర్చుకునే విషయాలు చాలా అల్పం . ఎదుగు విశాలంగా.. తెలుస్తాయి . .
తెలియడమంటే అర్ధం ఏమిటి ? అనుభవించే అర్హత కలగటం అనుభవంతో తప్ప వికాసం లేదని సూత్రమే లేకుంటే ఈ ప్రపంచమే అనవసరం ఆ అనుభవాన్వేషనే మీ లోకంలో ఖేదానికి అసలు కారణం అంటూ అసలు నిజం బోధిస్తుంది
స్వేచ్చా ప్రణయం గురించి, ఆనందం గురించి, స్త్రీ లాలిత్యం గురించి ఇలా ఎన్నో విషయాలని పురూరవుడికి బోధిస్తుంది. పురూరవుడి కోరిక మీదట అతనితో కలిసి రాజ్యానికి వచ్చి అతనితో కలసి జీవిస్తూ తన ఆజ్ఞ కి బందీని చేస్తుంది పురూరవుడు భార్యని పోగొట్టుకుని ,రాజ్యాన్ని తనయులకి అప్పగించి ఆమెతో కలసి వనాలకి వెళ్లి తన్మయత్వంతో మునిగిపోయి .. ఇరువురు ఆత్మ సంయోగం ని అనుభవించాక .. ఊర్వశి ఆజ్ఞా ని ధిక్కరించి వెళ్ళిన పురూరవుడికి తనవేరో చెప్పి ఆతనిని వీడి ఈ లోకం నుండి నిష్క్రమిస్తుంది.
ఈ రచన చాలా చాలా నచ్చింది . ఊర్వశి పాత్ర ని మలచిన తీరు చాలా నచ్చింది .
పురుషుడు యుద్దంలో చూపే నేర్పు , రౌద్రం , శౌర్యం యుద్ధం చేయనప్పుడు కూడా కనబడకపోతే అవన్నీ నీలో చాలా అల్పం అన్నమాట . లేదా నేను చాలా అందురాలిని అన్నమాట ..
ఈ హర్మ్యాలు ,ఈ వనాలు వీటిని నిర్మించిన నీ సౌందర్య భావం, ఐశ్వర్య వైభవం నీలో కాక వాటిల్లో కనబడితే నిన్నెవరు ప్రేమిస్తారు ? తమ భర్తలలో ఈ విశాలత్వం ,దర్పం, ఘనత కనబడకనే స్త్రీలు భర్తలని కాక వారి ఐశ్వర్యాలని, వారి కీర్తి ప్రతిష్టలని ప్రేమిస్తారు అన్న నిజం చెపుతూనే .. కార్య శూరత్వం మనిషికి నైతికాభి వృద్దిని ఇవ్వాలి అప్పుడే నీవు జయించిన చక్రవర్తుల కిరీట మణులు నీ కళ్ళల్లో మెరుస్తాయి.. అని ధర్మబోధ చేస్తుంది .
స్త్రీలు అనవసరమైన బేల తనం ప్రదర్శించి మగవాడిని బందీని చేయడం కన్నా ఆత్మాభిమానం ,జ్ఞానం కల్గి ఉండటమే గౌరవం కల్గి ఉంటుందని చెప్పడానికి ..ఇలా అంటుంది ..
" స్త్రీలలో వుండే హాని లేని నటనలు, గౌరవించడాలు, చనువులు,వగలు, ప్రణయ కోపాలు ఇవన్నీ నాకు తెలియక కాదు; ఇన్నేళ్ళూ వాటిననుభవించి అంతకన్నా గౌరవమైన ఉజ్జ్వలమైన ప్రేమకి అర్హుడివైనందునే నా స్నేహార్హత కలిగింది నీకు. నిన్ను లాలించడానికి కాదు; నిన్ను కాల్చి, కరిగించి, శుభ్రపరచి దేవత్వాన్ని ఇవ్వడానికి శపించారెవరో నన్ను" - అని చెపుతుంది
ఇక చలం రచనలలో కనబడే కవిత్వానికి ఇది ఒక మచ్చు తునక ..
ఎంతకూ రాని కాంతి కై మౌనంగా పూరెక్కలమీద కన్నీరు కార్చే రాత్రి వలె నా విరహంలో నేనే అణగి పోతాను.
_ అంటుంది ఊర్వశి.
ఎన్నో సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటూ క్రొత్త అర్ధాలు ఏవో స్పురింపజేస్తూ ఉండే ఈ నాటకం మీరూ వినండి .
విని .. ఊర్వశి పాత్ర ద్వారా స్త్రీ అంతరంగాన్ని ఉన్నతంగా చెప్పిన చలం గారి పై విపరీతమైన అభిమానం పుట్టుకొస్తుంది .
జీవితానుభావం అనంతం , నిరంతర సుందర ప్రయాణం , ఎప్పుడూ చివరనేది లేని ఆనంద అనుభం .. పురూరవ పాత్ర ద్వారా చెప్పించిన .. ఆ మాటలు నిజంగా ఎవరికీ వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోవలసినవే!
(ఈ పోస్ట్ లో చిత్రం గూగుల్ సేకరణ రాజా రవివర్మ చిత్రం ఇది )