31, మే 2013, శుక్రవారం

"కాలాతీత వ్యక్తులు" లో " ఇందిర"

కాలాతీత వ్యక్తులు  సమీక్ష




ఆకాశవాణి విజయవాడ కేంద్రం శతవసంత  సాహితీ మంజీరాలు కార్యక్రమం లో " కాలాతీత వ్యక్తులు " నవల ని ప్రసారం చేసినప్పుడు "ఇందిర" గురించి విన్నాను.  చాలా ఆసక్తిగా అనిపించింది.  

చాలా కాలం తర్వాత    మళ్ళీ కొన్ని నెలల క్రితం "కాలాతీత వ్యక్తులు " లో  కథా నాయిక ఎవరు అన్న సాహితీ వ్యాసం  (ఆంధ్రజ్యోతి - వివిధ - శ్రీ వల్లీ రాధిక ) చదివాను.

ఇటీవల  "కాలాతీతవ్యక్తులు" నవలని కొని చదవడం మొదలెట్టాను ఏకబిగిన చదివింప జేసిన ఈ నవల లోని పాత్ర లన్నింటి లోకి నన్నుఆకర్షించిన  పాత్ర "ఇందిర "

ఇందిర గురించి ఈ పరిచయం..

స్వాతంత్ర్యానంతరం వచ్చిన నవల లన్నింటిలోనూ కొన్ని నవలలను పంచకావ్యాల వంటివని సాహితీ కారులు పేర్కొన్నారు అందులో "కాలాతీత వ్యక్తులు " నవల ఒకటి .
ఈ నవలా రచయిత్రి డా ॥ పి.శ్రీదేవి.
మనకి స్వాతంత్ర్యం వచ్చిన పదేళ్ళకి వ్రాయబడిన సీరియల్ ఇది "తెలుగు స్వతంత్ర" లో 21 వారాల పాటు దారావాహికంగా వచ్చిన నవల ఇది. అప్పుడు గోరా శాస్త్రి గారు ఆ పత్రికకి సంపాదకులుగా ఉన్నారు
.
దేశ స్వాతంత్ర్యానంతరం పాశ్యాత్య నాగరికత ప్రభావంతో స్త్రీలలో వచ్చిన మార్పులకి, వారి ఆలోచన విధానంకి మధ్య తరగతి మనుషుల మనస్తత్వానికి ఈ నవల అద్దం పట్టింది
విశేషం ఏమిటంటే ఇప్పటి కాలానికి కూడా ఇందిర పాత్ర లాంటి స్త్రీలని మనం వ్యతిరేకిస్తూనే ఉండటం.

ఏబది అయిదు సంవత్సరాల క్రితం డా ॥ పి శ్రీదేవి గారు వ్రాసిన ఈ నవలలోని "ఇందిర" పాత్ర ఇప్పటి కాలంలోని చాలా మంది స్త్రీ పాత్రలకీ దర్పణం. స్త్రీ స్వతంత్రంగా ఆలోచించడం,సమాజం ఏమి అనుకున్నా పట్టించుకోకుండా తను బ్రతకాలి అనుకున్నట్లు బ్రతికీ తీరడం, తనదైన వ్యక్తిత్వం కల్గి ఉండటం, దానికి కాపాడుకోవాలని ప్రయత్నించడం ఇవన్నీ ఆ నవలలో గోచరిస్తాయి.

అసలు కాలాతీత వ్యక్తులు నవలలో ప్రధాన పాత్రధారిణి అనే విషయం పై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

"కల్యాణి" పాత్ర ఆ నవలలో మరొక ముఖ్య పాత్ర.

ఈ నవలలోని పాత్ర లన్నింటి కంటే ఇందిర పాత్ర పాఠకులని ఆకర్షిస్తుంది నవలలోని మిగతా పాత్రలన్నీ కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ పాత్ర లేకుంటే ఈ నవల ఇంత ప్రసిద్ది చెంది ఉండేది కాదు .

చాలా మంది కాలానికి అనుగుణంగా కాలగమనంలో ఒదిగిపోయి కాల ప్రవాహంలో కలసి పొతారు. కానీ ఇందిర అలాంటి వ్యక్తి కాదు. చిన్నతనంలోనే తల్లి మరణించినా తండ్రి దురలవాట్లు, భాద్యతా రాహిత్యం మధ్య స్వశక్తితో చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటుంది. చాలీ చాలని జీతం మధ్య అన్ని అవసరాలు తీరక పోవడం, తండ్రిని కూడా తానే పోషించాల్సి రావడం వల్ల కొన్ని సాంఘిక కట్టుబాట్లుని, లోక మర్యాదలని ఎదిరించింది. తనకి నచ్చిన రీతిలో హాయిగా జీవించడం నేర్చుకుంది. ఒక విధంగా కాలానికి లొంగకుండా తనకి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా చలించకుండా మనిషి కృంగకుండా వాటిని ఎదిరించి అవసరం అయితే ఇతరులని మోసం చేయడం, వారిని నిర్దాక్షిణ్యంగా ప్రక్కకి నెట్టించి పరిస్థితులని తనకి అనుకూలంగా మార్చుకుంటుంది.

అందుకే ఇందిర పాత్ర చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఈ నవలలో ప్రధాన పాత్ర ఇందిర. కాలాతీత వ్యక్తిగా కూడా ఆమెనే పేర్కొనవచ్చు. ప్రకాశంతో స్నేహం చేస్తుంది, షికారుగా అతనితో బీచ్ కి వెళుతుంది. ప్రకాశం స్నేహితుడు కృష్ణమూర్తి తో సెకండ్ షో సినిమాకి వెళుతుంది. తన సరదాలు,అవసరాలు తీర్చుకోవడం కోసం వారితో చనువుగాను మెలుగుతుంది. పక్షి లా ఎగిరి పోయే స్వేచ్చ కావాలని తనకి ఆ స్వేచ్చ ఉనప్పటికి తన రెక్కలు పేదరికం అనే తడితో బరువెక్కి ఎగరలేకపోతున్నానని చెప్పుకుంటుంది.

తాను ఉంటున్న ఇంటి పై భాగంలో అద్దెకి ఉంటున్న ప్రకాశం తనతో పాటు తన గదిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటూ కాలేజ్ లో ఆన్సర్ చదువుకుంటున్న కల్యాణిల మధ్య చనువు పెరగడాన్ని గమనించిన ఇందిర ఈర్ష్య పడుతుంది. మగవారి దగ్గర కష్టాలు అన్నీ ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడం చేస్తుంది కల్యాణి అనుకుంటుంది.

ఇందిర పాత్ర ముక్కు సూటి దనం ఇలా ఉంటుంది.

"ఏమిటి ఆలోచిస్తున్నావ్" ప్రకాశం అని అడుగుతుంది ఇందిర
కల్యాణి గురించి అంటాడతను.

"అస్తమాను కల్యాణి కల్యాణి అంటావ్? నా గురించి ఆలోచించు, నేను అంత కన్నా ఎక్కువ బరువు ఈడ్చుకోస్తున్నాను, నా చదువుని మధ్యలో వదిలేసి ఉద్యోగం వెతుక్కోవలసి వస్తుంది. నాన్న సంగతి నీకు తెలుసు, అయినా గడియ గడియకు కాళ్ళు జాపి కూర్చుని ఏడవడం నాకు చేత కాదు, విశాలమైన కళ్ళు తిప్పి వల వలా ఏడ్చే స్తే నీ లాంటి జాలి గుండె కల మగ వాళ్ళు ఆదుకుంటారు. వాళ్లతో నేను కాలక్షేపం చేయలేను ఆమెలా జాలిగా కళ్ళు తిప్పడం నాకు చేత గాదు అంత నంగ నాచి తనం నాకు లేదు. నా బరువుతో ఇంకొకరి పై ఒదిగిపోయి కాలక్షేపం చేద్దామన్న దురాశ నాకు లేదు నేను బలపడి ఇంకొకరికి బలమివ్వాలనే తత్త్వం నాది " అంటుంది.

ఇందిర గురించి చదువుతున్నప్పుడు ఆ పాత్రపై అయిష్టం కల్గుతూ ఉంటుంది ఆమెలో ఈర్ష్య ని గమనిస్తాం ప్రకాశం కల్యాణి కి ఆకర్షితుదవుతున్నాడని తెలుసుకుని అతనిని తనవైపు మళ్ళించు కుంటుంది. పైగా కల్యాణి పై దుష్ప్రచారం చేసి ఆమె తన దారికి అడ్డురాకుండా చేసుకుంటుంది. అలాగే వసుంధర కృష్ణ మూర్తి పై ఇష్టాన్ని పెంచుకుంటుందని గమనించి అతనిని తెలివిగా తను దక్కించుకుంటుంది.

తనకి కావాల్సినదానిని బలవంతంగా అయినా దక్కించుకునే మనస్తత్వం ఆమెది.

ప్రపంచంలో ఒకరి కోసం ఒకరు ఏదీ చేయరు ఎవరి కోసం వాళ్ళే చేసుకుంటారు .. అది నాకు చేతనవును అనుకునే వ్యక్తి ఇందిర.

ప్రకాశం మేనమామ కుదిర్చిన పెళ్లి సంబంధాన్ని వదులుకుని ఆమె కోసం వచ్చినప్పుడు అతనిని తిరస్కరిస్తూ ఇలా అంటుంది.

"సాధారణంగా పిల్లలకి తల్లి దండ్రులు గార్డియన్ లాగా ఉంటారు నా దగ్గరకి వచ్చేసరికి తల్లక్రిండులై నేనే నాన్నకి గార్డియన్ కావాల్సి వచ్చింది ఆడదాని మనసు నీకు తెలియదు ప్రకాశం ! నేను నీకు ఉన్నాను ..నీ సమస్యలు,నీ బరువులు అన్నీ నా మీద వేయి అనగల్గే మగవాడు అవసరమైతే నా కోసం అన్నీ వదిలేసే మొగవాడు కావాలి, ప్రేమ కోరిన త్యాగం చేయలేనివాడు ప్రేమకి అనర్హులు. నీ మీద నేను చాలా మమకారం పెంచుకున్నాను నువ్వొక వెన్నుముక లేని మనిషివని నాకు తెలుసు. తోమగా తోమగా కొంత గట్టిపడతావు అనుకున్నాను. కొన్ని అనుభవాల తర్వాత అయినా ఒక మనిషిలా ప్రవర్తిస్తావనుకున్నాను. పుట్టుక నుండే నువ్వో సగం మనిషివి బీటలు వారిన వ్యక్తిత్వం. బాగు చేయాలని ప్రయత్నించాను కానీ అది నావల్ల కాదు.నీకు నాకు కుదరదు " అని నిర్మొహమాటంగా చెపుతుంది.

ఇదంతా చదువుతున్న పాఠకుడికి ఆమె పాత్ర పట్ల సరి అయిన అభిప్రాయమే కలుగదు. ఇందిర కొలీగ్ వైదేహి అన్నదమ్ములు ఆమెకి ఇష్టం లేని వాడిని చేసుకోమని బలవంతం చేస్తుంటే ఇల్లు విడిచి వచ్చేసి ఇందిర ఇంట్లో ఉంటుంది .. ఆమె ఇందిరతో ఇలా అంటుంది అమ్మాయిలు యాబై సార్లు సంతలో పశువుల బేరంలా నన్ను కూర్చోబెట్టి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అంటే ఇందిర ఇలా అంటుంది . పశువు కాకపొతే మరో నందికేశుడు, జీవితమే పశువుల సంతలా అయినప్పుడు అమాయకంగా సుమతీ శతకంలో నీతులన్నీ వల్లే వేస్తే మనలని వెనక్కి నెట్టడం ఖాయం ఎలాగోలా తీర్ధంలో జనాన్ని మోచేతులతో నెట్టుకుని ముందుకు వెళ్ళడమే అంటుంది.

కావాలని కృష్ణ మూర్తికి దగ్గరవుతుంది తన జీవితం సుఖంగా సాగి పోవాలి అంటే కృష్ణ మూర్తి లాంటి వాడే తగిన వ్యక్తి అనుకుంటుంది అతనికి తగిన చదువు సంధ్యలు లేకపోయినా వెనుక ఉన్న ఆస్తిపాస్తులు ఉండటమే కాదు ఆ అస్తిపాస్తులే అతనిని నాశనం చేసాయి అనుకుంటుంది మనిషిలోని మంచి తనాన్ని గుర్తించి అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంటుంది.

ఇందిర ఏ పని అయినా మంచి అయినా చెడు అయినా తెలిసే చేస్తుంది మొహమాట పడటం అనేది అసలు ఉండనే ఉండదు. తన బ్రతుకు తను బ్రతకాలి అనుకున్నపుడు ఇతరులకి ఇబ్బంది కల్గించినా పట్టించుకోకుండా బ్రతకడం నేర్చుకుంటుంది. ఆమె అతిని ఎప్పుడూ ఇష్టపడదు, అతి ప్రేమ చూపించినా,అతిగా గౌరవించినా ఆమెకి ఇష్టం ఉండదు ఆమె ప్రవర్తన తెలిసి కూడా ఆమెని పెళ్లి చేసుకుంటానికి ముందుకు వచ్చిన కృష్ణ మూర్తి కూడా ఆ విషయాన్నే చెపుతుంది తానూ అతనికి లొంగి ఉండలేనని, తన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఉండలేనని బ్రతుకంతా నిర్భయంగా బ్రతుకుతానని అంటుంది.

పురుషాధిక్య సమాజంలో మధ్య తరగతి కుటుంబం లో డుర్వ్యసనాల తండ్రికి కూతురిగా ఉండి సమాజ పోకడల్ని బాగా అర్ధం చేసుకుని తనని తానూ నిర్మించుకుంటూ, అవసరం అయితే తనని తానూ తగ్గించుకుంటూ, కొందరి బలహీనతలని తనకి అనుకూలంగా మలుచుకుంటూ నచ్చినట్లు ఉండగల్గే ఇందిర ఎక్కడా కూడా తొట్రుబాటు లేకుండా ఎలాంటి ముసుగు వేసుకోకుండా నిర్భయంగా, స్వేచ్చా ప్రవృత్తి తో కనిపిస్తుంది జీవిస్తుంది.

ఇందిర లాంటి స్త్రీని సమాజం హర్షించక పోవచ్చు సమాజంలో కల్యాణి లు లాంటి వారితో పాటు కానీ ఇందిరలు కూడా ఉంటారని చెప్పడమే కావచ్చు స్త్రీల ఆలోచనా విధానం మారుతుందని చెప్పడం కూడా ఈ రచనలో గోచరిస్తుంది.

మనుషులు ఏ లోపాలు లేకుండా ఉండరు. మనుషులు మనుషుల్లాగానే ఉండాలి తమలో ఉన్న లోపాలని సవరించుకుంటూ చైతన్యంగా ఆలోచించుకుంటూ ముందుకు సాగిపోవడమే మంచిదని "కాలాతీత వ్యక్తులు" నవల చెపుతుంది.


పాశ్చత్య నాగరికత ప్రభావంతో చదువులభ్యసించి ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలలో ఆలోచనా పరిణితి పెరిగి వారి వారి అభిరుచిల మేరకు, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జీవించాలనుకోవడం తప్పు కాదు జీవితాన్ని జీవించడం కోసమే అనుకుంటూ ముందుకు సాగే వ్యక్తి ఇందిర పాత్ర. కాలగమనంలో అందరూ మరుగున పడిపోతారు కాలానికి విభిన్నంగా నడుచుకుని తనదైన వ్యక్తిత్వంతో తన చుట్టూ ఉన్న వారి జీవితాలనీ కూడా ప్రభావితం చేస్తూ సాగగల్గితే వారు మరి కొంత కాలం గుర్తుండిపోతారు అది నవలలో పాత్రలు కావచ్చు నిజ జీవితంలో మనుషులు కావచ్చు.

ఈ నవలలోని ఇందిర పాత్రని నేడు అధిక సంఖ్యలో మన సమాజంలో నిత్యం చూస్తుంటేనే ఉంటాము . కానీ ఇప్పటికి కూడా "ఇందిర " ని హర్షించలేక పోతున్నాం. ఇంకా నవలలో మిగిలిన పాత్రలు కల్యాణి,వసుంధర, వైదేహి లాంటి స్త్రీల మధ్య "ఇందిర " కాలాతీత వ్యక్తి తానూ చీకటిలో ఉండాల్సి వచ్చినా వెరువని ధీర, చీకటిని చీల్చుకుంటూ వెలుగుతూ వచ్చిన ఇందిర.

(ఈ నవల దారావాహికంగా సాగి పూర్తి అయిన వెంటనే 8-2-1958 లో సి . సరళా దేవి ఒక సమీక్ష, 2000 సంవత్సరంలో డా॥వి చంద్రశేఖర రావు గారు సమీక్షించారు.

ఇందిర గురించి మనం చదవాలంటే ఇప్పుడు లభ్యమవుతున్న ఈ నవల లో జతపరిచిన రెండు సమీక్షల జోలికి పోకుండా ఆ నవల ని చదివితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం )

ఈ నవల విశాలాంద్ర ప్రచురణ

* ఈ వ్యాసం "సారంగ " వెబ్ పత్రికలో (ప్రధమ సంచిక ) తర్వాత మార్చి నెల "భూమిక " లోను ప్రచురితమైనది.


27, మే 2013, సోమవారం

గాజు మనసు



గాజు మనసు

పంజరంలో పక్షిలా మనసే కాదు జీవితం కూడా                                                                   
పిడికెడు స్వేచ్చ కోసం అల్లాడి  పోతుంటుంది
 తలుపు తెరిచే చేతికై కళ్ళల్లో ఆశ నింపుకుంటూ
గుండెల్లో మంట లార్చుకుంటూ
సోలి పోతుంది

దిగులు మేఘాలు దురాక్రమణ మధ్య
సారించిన చూపుతో
శోధించే ఆలోచనలతో
అగాధాల అంచులలో
అంతుచిక్కని శూన్యంలో  ఊగిసలాడుతుంది
బరువు మోయడం భరించలేనప్పుడు
దుక్కుల లెక్కలో కురిసి తెరిపిన పడుతుంది 

 బంధ  విముక్తని చేసే చేయే  కాదు
 ఆకతాయిగా  భళ్ళున పగలగొట్టే రాయి కూడా
స్వేచ్ఛని  ప్రసాదిస్తుందనీ
తిరిగి అతుక్కునేందుకు  మనసేమీ
గాజు ముక్క  కాదు కనుక
గాజంత పారదర్శకం కాదు గనుక
వ్రక్కలైన ముక్కల్లొ నుండే
ఓ శిధిల శిల్పం ముందుకు నడచి వస్తుంది
పగలగొట్టబడిన పంజరాన్ని వెక్కిరిస్తుంది

కొన్ని అవాంచనీయ సంఘటనలు
మనసులని, జీవితాలని మార్చేస్తాయి
మార్పుని చూపెడతాయి
 రాళ్ళల్లొ వడ్లగింజలా
జీవితం జీవించి చూపాలి కనుక
అదో  మలుపు కనుక 

(మనసు -మనిషి - జీవితం కి  మధ్య నలుగుతూ ..... ఓ నిర్భయ వాక్యం ) కొందరి అనుభవాలు విన్నాక.. వ్రాసీన స్పందన. వ్రాసినది అంతా కవిత్వం అని నేను చెప్పబొవడం లేదు. ఎవరిని ఒప్పుకొమని అనడం లేదు.:)
.

25, మే 2013, శనివారం

అడగని వాడు అశ్వం

ఈ రోజు ఉదయాన్నే ఒకరితో నిర్మొహమాటం గా మాట్లాడేసాను . తర్వాత ఇంకాస్త సున్నితంగా విషయాన్ని చెప్పి ఉండాల్సింది ఏమో ! పాపం అనవసరంగా ఆమెని బాధపెట్టాను అనుకున్నాను .

నేను మాట్లాడింది నా కొడుకు స్నేహితుడి తల్లితొ.. ఆవిడ నాతో చాలా స్నేహంగా ఉంటారు . అందుకే కొంచెం ఇబ్బంది పడ్డాను. తర్వాత అనిపించింది నేను వంద శాతం సబబుగానే మాట్లాడాను అని

నా కొడుకు స్నేహితుని తల్లి పేరు "పద్మ" ఆమె ఈ రోజు కాల్ చేసి ఒక మంచి విషయం చెప్పారు . ఒక ఒంటరి మహిళ ఒంటి చేత్తో కుటుంబ భారాన్ని  మోసి తన పిల్లలిద్దరిని  బాగా చదివించి ప్రయోజకులని చేసారు అని . అందుకు ఆమెని అభినందించాల్సిందే అని చెప్పాను. ఆమె కొడుకు US లో ఉన్నాడు అతనికి వివాహం చేయదలచారు . నా ఎరుకలో ఉన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను . కట్నం ఎంత ఇస్తారు అని అడిగారు
కట్నం ఏమిటండి / అమ్మాయి అబ్బాయితో సమంగా చదివింది జాబ్ కూడా చేస్తుంది ఈడు-జోడు కుటుంబం మంచి-చెడు ఇవి కదా  చూసుకోవాల్సింది అని  అన్నాను . నిజమే అనుకోండి . అసలు కట్నం ఏమి ఇస్తారు అంటే చెప్పాలికదా అన్నారు పద్మ గారు.  సారీ అండీ ! నేను అసలు ఈ విషయం గురించి అయితే నేను మాట్లాడను అలా అడగటం అంటే నా దృష్టి లో చాలా తప్పు వ్యవహారం . అన్నాను . అసలు తల్లిదండ్రులు అమ్మాయికి ఏమి ఇస్తారో తెలుసుకుంటే తప్పేమీ లేదు కదా అన్నారు ఎంత ఇచ్చినా అమ్మాయి ఏమి అమెరికా కి పట్టుకుని వెళ్ళదు  కదండీ అని .. ఆ విషయం గురించి నేను అడగను కట్నం విషయం మాట్లాడటమే నాకు నచ్చదు అని చెప్పేసాను తర్వాత ఫీల్ అయ్యాను పద్మ గారు మనసులో అయినా అనుకునే ఉంటారు .. రేపు ఈమె వాళ్ళ అబ్బాయికి కట్నం అడ గరా..? అని

నిజంగా నాకు అలాంటి ఆలోచనే లేదు  చక్కని అమ్మాయి  విద్యావంతురాలు అయి ఉండి కష్ట సుఖాలు తెలిసిన అమ్మాయికే  ప్రాధాన్యత ఇవ్వాలని మా కుటుంబమంతా కోరుకుంటున్నాం. అమ్మాయి చేత  ఉద్యోగం చేయించాలనే ఉద్దేశ్యం కూడా లేదు .. ఇదే చెపుతున్నాను కూడా .

వరకట్నం అంటే అదో రకం విముఖత నాకు .  వరకట్నం అనే విషయంలో జరిగిన పరిణామాల వల్ల నా తలరాతే మారిపోయిన కఠిన వాస్తవాన్ని నేను ఎప్పటికి మరువలేను కూడా.

ఇప్పుడు తక్కువయ్యాయి ఏమోకాని  ఎనబయ్యో దశకంలో అదొక తీవ్రమయిన దశ.  అంతగా కాకపోయినా ఎంతో కొంత అయినా ఆడపిల్లలు ఇప్పటికి బలి అవుతూనే ఉన్నారు ఉన్నత విద్యావంతులై ఉండి  కూడా స్త్రీ ధనాన్ని ఆశించడం "వెన్నుముక"  లేని తనమే అవుతుంది అయినా ఈ రోజుల్లో అమ్మాయిలూ యేమి తెలివితక్కువ వారు కాదు వారికి అన్ని హక్కులు తెలుసు. ఏ మాత్రం అవకాశం ఉన్నా వాటాలు పంచుకుని మరీ వెళుతున్నారు

ఇప్పటి తరం వారికి చదువులు,అందం చందం ,ఉద్యోగం, వెనుక పెద్దలు సంపాదించిన ఆస్తి అన్నీ కావాలి వారి ఉన్నతి కోసం అహోరాత్రాలు శ్రమించిన తల్లిదండ్రులను మాత్రం  వద్దు అనేలా ఉన్నారు
అలాంటి బిడ్డల కోసం వరకట్నం ఆశించి మరొక తల్లిదండ్రులని బాధ పెట్టడం కూడదని నా ఉద్దేశ్యం

కట్నం అడిగినవాడు గాడిద అంటారు అది విరుద్దమైన పోలిక . గాడిద ఎంత బరువుని మోస్తుందో కదా!  సంసార భారాన్ని ఇద్దరు కలసి మోసుకోవాలి   మోయలేని బరువు మోసే బాధ ఆడపిల్ల తల్లిదండ్రులకి ఇవ్వవద్దని నా ఆలోచన. కాబోయే ఆచరణ కూడా.

"కట్నం అడగని వాడు అశ్వం " అని మనమూ ఓ .. స్టేట్మెంట్ ని ఖరారు చేసేద్దాం బావుంది  అంటారా?

24, మే 2013, శుక్రవారం

చూపుల దొంగాట

ఏమోయ్, ప్రక్కన రమేష్ గారి అమ్మాయి పెళ్లి యీ రోజే కదా!  గుర్తుందా, లేక వంట చేసేసావా అడిగాడు సురేష్

బాగా గుర్తుంది . కానీ నాకక్కడికి వచ్చే ఆసక్తి లేదు మీరు వెళ్ళి రండి అంది  పద్మ

ప్రక్క ప్రక్కనే వుంటాం . ఇలా యేదో వొక  కుంటి సాకు చెప్పి తప్పించుకోవడం బాగోదు  త్వరగా తయారవు  యిలా వెళ్లి అలా  వచ్చేద్దాం  "

 నేను రానండి యెక్కడికి వెళ్ళినా మీతోనే రావాలి, మీకు నచ్చిన చీరే కట్టాలి, మీరు పెట్టుకోమన్న నగలే ధరించాలి మీరు యెవరితో మాట్లాడమంటే వారితో మాట్లాడాలి.ఇలా మర బొమ్మలా బ్రతకడం నా వల్ల కాదు విసుగ్గా అంది

అయితే యేమంటావ్, నీకు నచ్చినట్లు తయారై నీకు నచ్చినట్లే వెళ్ళా లంటావ్ అంతేగా ? ఒక్కసారి వెళ్లి చూస్తే నీకర్ధమవుతుంది ఆడవాళ్ళు యె౦త సౌకర్యవంతంగా  భర్త తో కలసి వెళ్ళ వచ్చో  నీకు చెప్పినా అర్ధంకాదు.

"ఆహా బాగా అర్ధం అవుతుంది, అర్ధం అయ్యే అవకాశం మీరు యిస్తే కదా,  పెళ్లై  పాతికేళ్ళు అయింది. ఏనాడన్నా బంధు మిత్రులతో,యిరుగు పొరుగుతో కలసి నన్ను వెళ్ళనిస్తే  కదా!  మీ ఆయన యెప్పుడు నీ కొంగు పట్టుకునే తిరుగుతాడు,అదంతా ప్రేమేనంటావా అని నన్ను అడిగిన వారు వున్నారు. అది మాత్రం మీరు అర్ధం చేసుకోరు మరి  అంది యెద్దేవాగా

 అంతగా  నువ్వు నొచ్చుకుంటున్నప్పుడు  నీ మాట నేనెందుకు కాదనాలి, నీదారిన నువ్వు వెళ్ళు నాదారిన నేను వెళతాను అన్నాడు సురేష్ .

"సరే! నాకు నచ్చినట్లు నేను వెళతాను వదిలేయండి మహా ప్రభూ" అంది చేతులు జోడించి.

  వెంటనే యింకో  ప్రక్కింటి వారిని పిలిచి యీ రోజు నేను మీతో కలసి పెళ్లికి వస్తాను అని చెప్పింది. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నా  పట్టించుకోకుండా  లోపలకి వచ్చి ఆలోచన చేసింది. అబ్బ, యిన్నాళ్ళకి యీ నస పెట్టె మొగుడు లేకుండా తనకిష్టమైనట్లు అలంకరించుకుని బయటకి వెళ్ళే రోజు వచ్చింది అని మురుసుకుంటూ ..
భర్తని వుద్దేశ్యించి  ఇదిగో మిమ్మల్నే,  అక్కడ అసలు నేనెవరో తెలియనట్లే వుండండి. అసలు నేనెవరో మీరెవరో అన్నట్లు వుండాలి. అలా మీరు వుండ గల్గితే చాలు. అలా కాకుండా ప్రక్కన చేరి అలా నవ్వకు, అంత గట్టిగా మాట్లాడకు యేమిటి అంత విరగబాటు లాంటి మాటలుతో నన్ను హింస పెడితే యెప్పటికి నేను మీతో కలసి బయటకే రాను " అని కచ్చితంగా చెప్పేసింది.

ఏమి నగలు వేసుకోవాలో అనుకుంటూ ఆలోచిస్తూ వుండగానే  సురేష్ తయారై వెళ్ళి పోయాడు. ఆతను అలా వెళ్ళగానే  బీరువా దగ్గరకి  నడచి ఆమెకి  యె౦తో ఇష్టమైన  తెనెరంగు అంచున్న నల్ల చీర తీసుకుంది.  ఆ చీర ముచ్చట పడి కొనుక్కుని ఆరేళ్లయినా వొకే వొకసారి  కట్టింది.  ఏ పంక్షన్ కో వెళ్ళేటప్పుడు తీసి కట్టుకోబోతే వాళ్ళు శుభ కార్యం చేసుకుంటుంటే నల్ల చీర కట్టుకుని వెళతావా?  నలుపు అశుభ సూచకమని వాళ్ళు యేమైనా అనుకుంటారు అంటూ అడ్డు పడేవాడు.  కోయంబత్తూర్ టస్సర్ చీర అది. అల్ ఓవర్ ఎంబ్రాయిడరీ తో నిండి తను కట్టుకుంటే అందరూ తలతిప్పి వొక్కసారి అయినా చూడటం ఖాయం అనుకుంటూ  యిష్టంగా చేతుల్లోకి తీసుకుంది.
అంతలో యింటి  చుట్టుప్రక్కల వారందరూ రెడీ అయి ఆమె కోసం యెదురు  చూస్తున్నారని పిలుపు వచ్చింది.

పదినిమిషాల్లో రెడీ అయి బయటకి వచ్చిన  పద్మ ని చూసిన అందరూ మెచ్చుకోలుగా చూసారు.  ఒకరిద్దరు చీర చాలా బావుందని మెచ్చుకున్నారు . ఇంకొకామె చీరతో పాటు మంగత్రై లో  కొన్న ముత్యాల సెట్ బాగా జోడి కుదిరందని మెచ్చుకుంది.

మొత్తం పది మంది రెండు కిలోమీటర్ల  దూరంలో వివాహ వేదిక చేరడానికి  ఆటో లు వద్దనుకుని బస్ యెక్కి వెళ్ళా లనుకున్నారు. అందుకు ఒక కారణం వుంది.  నిండా నగలు ధరించి ఆడవారు,  పిల్లలు చీకటిగా  నిర్మానుష్యంగా వుండే దారిలో ఆటోలు యెక్కడం కూడా ప్రమాదకరం అని తీర్మానించుకున్నారు. వాళ్ళు రోడ్డు మీదకి రాబోతుం డగానే మూడు బస్సులు వరుసగా వెళ్ళిపోయాయి.  బస్ స్టాప్ లో పావు గంట సేపు  యెదురుచూసినా  అటువైపు వచ్చే బస్ ల  జాడ లేదు. ఉక్కపోత చెమటలు దారాపాతంగా కారిపోతుండగా " ఆయనతో పాటు వెళ్లి వుంటే యివన్నీ తప్పేవి కదా " అని అనుకుని  వెంటనే లేదు లేదు యిలా కూడా చాలా బావుంది, స్వేచ్చగా వుంది అనుకుంది

 అంతలో ఒక బస్ వచ్చేసింది  బిల బిల మంటూ అందరూ యెక్కేసారు. అందరికి కలిపి వొకరు టికెట్ తీసుకోవడం మిగతా అందరూ వారికీ డబ్బు యిచ్చేయబోవడం "భలే వారే, యీ మాత్రం మనం ఒకరికొకరు ఖర్చు పెట్టకూడదా అంటూ నిష్టూరాలు అందరి ముఖాల్లో అదో రకమైన ఆత్మీయ మైన వెలుగు. మనతో పాటు మన లాంటి వారు నలుగురు అనుకునే మధ్యతరగతి మందసాలతో అందరూ సంతోషంగా వేదిక చేరుకున్నారు.
పూల బాటపై నడుస్తూ యిబ్బంది పడుతూ  " డబ్బున్న వారి ఆడంబరమేమో   కాని పువ్వులని త్రొక్కడానికి మనసెలా వొప్పుతుంది "  అని తిట్టుకుంటూ పువ్వులు లేకుండా చూసి జాగ్రత్తగా లోపలి నడిచారు.

హాల్లోకి ప్రవేశించే ద్వారం దగ్గరికి వెళ్ళ గానే యే సి గాలులు ఆహ్లాదంగా అనిపించాయి. పన్నీటి చిలకరింపులుతో  ఆహ్వానం అందుకుంటూ లోపలి నడిచారు. హాలంతా ఖాళీగా ఉంది తెల్లవారుఝామున ముహూర్తం కాబట్టి  అమ్మాయిని  అబ్బాయిని వేదిక పై  ఆసనంలో కూర్చుండ బెట్టి అక్షింతలు వేసి అశ్వీర్వదించే  కార్యక్రమం వుంది. పెళ్ళికొడుకు తరలి రావడం పానకాల కావిడితో విడిదికి వెళ్లి అతిధి సత్కారం చేయడం లాంటి కార్యక్రమాలు వున్నాయి కాబట్టి వారి కోసం యెదురుచూస్తూ వున్నారు. పెళ్లి కొడుకు యింకా రాలేదేమిటా అని  అమ్మాయి తరపు వాళ్ళు హడావిడి పడుతూ వుండటం కనిపించింది.

తెలిసిన వారు కనిపించడం వారిని పలకరిస్తూ అటు ఇటు తిరగడం, హాయిగా సంతోషంగా నవ్వుతూ తిరుగుతున్న పద్మని రెండు కళ్ళు గమనిస్తూనే వున్నాయి.

ఎంత బావుంది ఈమె! అందరికన్నా తక్కువ నగలు పెట్టుకుంది పైగా మంచి పట్టుచీర కట్టలేదు అయినా ఎంత అందంగా ఉంది అనుకుంటూ ఆమె ఎటుతిరిగితే అటే కళ్ళు వెంబడిస్తూనే వున్నాయి . ప్రక్కింటి వాళ్ళింటికి పెళ్ళికని వచ్చిన వారి దూరపు బంధువుల అమ్మాయి "ప్రియ " సందడి కోసం పద్మ గ్రూప్లో చేరింది   ప్రక్కనే వున్న పద్మతో సీక్రెట్గా  చెప్పింది ఆంటీ ! అతనెవరో చూడండి, యిందాకటి నుండి అతను మీ వంకే చూస్తున్నాడు అంది.

 నా మొహం ! నా వంక యె౦దుకు చూస్తాడు నీ వైపే అయి వుంటుంది వొకసారి గమనించుకో ! అంది

ఛీ ... అతని వయసేమిటీ నా వయసేమిటీ ? అసహ్యంగా వుంది  నలబై ప్లస్  లు నాకు వద్దు. డబ్బులు యిచ్చి చూస్తానన్నా నేను చూడనివ్వను అంది గడుసుగా.  నవ్వుకుని యె౦త ఫాస్ట్ గా వున్నారు ఆడపిల్లలు అనుకుంది.

దొంగ చాటుగా అతని వైపు చూసింది అతను  తనవైపు చూస్తున్నాడు ఆ  ఐ  స్మైలింగ్  చాలా బావుంది .వెంటనే  సభ్యత గుర్తుకు వచ్చింది  ఠక్కున తలతిప్పుకుంది,  అప్రయత్నంగా రొమాంటిక్ రాజేష్ గుర్తుకు వచ్చాడు హీరోయిన్లని బుట్టలో పడేసే అతని కనుసైగలు గుర్తుకువచ్చాయి,  వివాహితుల మధ్య కూడా యిలాంటి ఆకర్షణలు వుంటాయి కాబోలు అనుకుని తనని తానూ మందలించు కుంటూ దృష్టి మరల్చుకుంది

ఇంతలో పద్మ మొబైల్ మోగింది బేగ్ ఓపెన్ చేసి మెసేజ్ చూసి ముఖం చిట్లించుకుంది. వీరి ప్రక్క సీట్లో కూర్చున్న అతను తన ఐ ఫోన్ తీసుకుని చూసుకుంటున్నాడు.

అందరు భోజనాల హాలులోకి వెళ్ళారు. వాళ్ళ వెనకాలే అతను వెళ్ళాడు. కానీ సీట్లు ఖాళీగా దొరకక పోవడంతో నిలబడి చూస్తూ వుండిపోయాడు. అంతలో వొక పెద్దాయన వెళ్లి అతనిని పలకరించాడు.అతనికి తెలిసిన వారేమో చాలా సేపు మాట్లాడుతూనే వున్నా అతని చూపంతా పద్మ పైనే వుంది.

అతను చూడకుండా జాగ్రత్త పడుతూ అతను  తనని చూస్తున్నాడో లేదో అని గమనిస్తూనే వుంది. మొత్తానికి యీ చూపుల దొంగాట అరగంట పైగానే గడచింది  అది సరదా గాను అనిపించింది , పద్మకి గర్వంగా అనిపించింది నలబై ప్లస్  అయినా తనలో చార్మ్  తగ్గలేదు అనడానికి నిదర్శనం అతని చూపులే! అతనేమి అసహ్యంగా చూడటంలేదు అసహ్యంగా ప్రవర్తించడమూ లేదు ఆరాధనగా చూస్తున్నాడు. ఏ మనిషి అయినా అందంగానో ,ఆకర్షణీయంగానో వుండాలనుకోవడం తప్పుకాదు, చూడటం తప్పుకాదు కానీ కాస్త విచక్షణ కల్గి వుండటం మర్చిపోకూడదు అనుకుంది. 

విందు భోజనం చేసి ఆ పై ప్రూట్ సలాడ్ తిని భుక్తాయాసం వున్నా సరే ఐస్ క్రీమ్ ని యె౦దుకు వదలాలి అనుకుని అక్కడి దాకా వెళ్ళలేను కాస్త ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టు .. పద్మా అన్నవొకామె  వేడుకోలుకి కరిగి ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళింది. అంతలో ఆతను  అక్కడ ప్రత్యక్షం .

బాబోయ్! వీడేమిట్రా, వదిలేటట్టు లేడు. ఇంకాసేపు ఆగితే ప్రక్కనే కూర్చుని పలకరించేటట్టు వున్నాడనుకుని  గబా గబా అక్కడి నుంచి వచ్చేసి  వెళదాం పదండి అంటూ అందరికన్నా ముందుగా  దారితీసింది పద్మ. అందరూ  వేదిక యెదురుగా వున్న బస్ స్టాప్ వైపు నడిచారు .

వీరి వెనకాలే అతను వస్తున్నాడు అది గమనించిన పద్మ కొద్దిగా చీకట్లోకి జరిగింది. ఆ స్టాప్ లో వున్న  చాలా మందిలో ఆమె కనిపించే అవకాశమే  లేదు. అతను అటు ఇటు ఆశగా వెతుక్కుంటూ కార్ పార్కింగ్ వైపు చూస్తూ హడావిడిగా తిరుగుతూ కనిపించాడు.  బస్ రావడం మళ్ళీ ఆలస్యం.  కిరాయికి ఆటో మాట్లాడుకుని యెక్కబోతుండగా బస్ రానే వచ్చింది బస్. బస్ స్టాప్ కన్నా ముందుకు ఆపాడు. బస్ యెక్కడానికి పరుగు పెడుతున్న ఆమెని  అతను చూడనే చూసాడు   కారులో బస్  వెనుకనే వెంబడించాడు. పద్మ కోపంగా చూసింది వాడిని యిక యే మాత్రం క్షమించకూడదు అనుకుంది

బస్ దిగి యింటిదారి వైపు నడుస్తున్న వారి ప్రక్కనే కారు ఆపి రండి  డ్రాప్ చేస్తాను, నేను కాలనీ లోపలికే వెళుతున్నాను అన్నాడు అతను .నో థాంక్స్, నాకు కాళ్ళున్నాయి అని  వాడిగా చెప్పేసి వడి వడిగా యింట్లోకి వచ్చి పడింది. ఆమె కన్నా ముందే యింటికి వచ్చి వున్న సురేష్ అడిగాడు  "ఎలా వుంది వొంటరి ప్రయాణం" అని.

పరమచెత్తగా వుంది, యిబ్బందిగా వుంది అని చెప్పబోయి తమాయించుకుంది "చాలా బావుంది, చక్కగా ఎంజాయ్ చేసాను " అంది

"వాడెవడో నిన్ను ఆబగా చూస్తుండటాన్ని కూడా ఎంజాయ్ చేసేవా " అడిగాడు

లాగి పెట్టి వొక్కటి యివ్వాలన్నంత కోపం వచ్చింది పద్మకి . మళ్ళీ తమాయించుకుని "అవును " అనగల్గింది దైర్యంగా భర్త అనుమానపు చూపులని యెదుర్కోవడానికి సిద్దపడి మరీనూ  .

19, మే 2013, ఆదివారం

What’s your story? నా బ్లాగ్ గురించి నిన్నటి హిందూ న్యూస్ పేపర్ లో

నా బ్లాగ్ గురించి నిన్నటి  హిందూ న్యూస్ పేపర్  లో ప్రస్తావించడం జరిగింది. అలాగే  "హిందూ" పత్రిక వారు నా ఇంటర్ వ్యూ ఒకటి తీసుకోవడం జరిగింది అది త్వరలో రాబోతుంది కూడా .
నాకు చాలా సంతోషం వేసింది . మన తెలుగు పత్రికలలో నా బ్లాగ్ పరిచయం కూడా రాలేదు . అలాంటి సమయంలో "స్వాతి సానియాల్ " ఇండీ బ్లాగర్ ద్వారా నన్ను గుర్తించి నన్ను ఫేస్ బుక్ లో మెసేజ్ ద్వారా పరిచయం చేసుకున్నారు.  నేను ఆమెకి సమాధానం ఇచ్చే లోపులోనే నా నంబర్ సంపాదించి నాకు కాల్ చేసి నా ఇంటర్ వ్యూ అడిగారు. నాకు పెద్దగా ఆంగ్ల బాష రాకపోవడం వల్ల  తనతో మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడటం గమనించి మెయిల్ ఐ డి  అడిగి పుచ్చుకుని తను ఇంటర్ వ్యూ ప్రశ్నలని పంపించారు . నేను నా ఫ్రెండ్ సాయంతో ఆ ఇంటర్ వ్యూ లో పాల్గొన్నాను. ఎంతో  బిజీ గా ఉండి కూడా నేను తెలుగులో చెప్పినదానిని విని ఆంగ్లంలో తర్జుమా చేసి ఇచ్చిన నా ఫ్రెండ్ కి  హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ ..

స్వాతి సానియాల్ నా గురించి ప్రస్తావించిన ఆర్టికల్ ఇది ఈ ఆర్టికల్ లో నాతో పాటు  మా విజయవాడ కి చెందిన మరి కొందరి గురించిన ప్రస్తావన ఉంది  వారు నాకన్నా ముందు గానే బ్లాగ్ ప్రపంచం ని ఎరిగిన యువత  వారి మధ్యన నేను . ఎంతైనా మా విజయవాడ గ్రేట్ .. కదా  అనిపించింది . :)

When John Barger called it ‘weblog’ in 1997 and Peter Merholz named it ‘blog’ in 1999, no one probably imagined the success blogging could bring. By 2002-03, Indians were starting to appraise the ‘online diaries’.

ఈ లింక్లో ...    చూడండి 

18, మే 2013, శనివారం

చక్కని ప్రసంగం.


 చెప్పేవాళ్ళు  లేక   చెడిపోతారు అంటారు .  ప్రసంగం  విన్నాక యువతకి ఇలాంటి ప్రసంగాలు  వినిపించాల్సిన అవసరం ఉంది అనిపించింది

    రాళ్ళబండి  కవితా  ప్రసాద్ గారి ప్రసంగం  వినండి .... చాలా చక్కని ప్రసంగం.స్పూర్తివంతంగా ఉంది.

ప్రసంగం ఈ లింక్ లో ...



15, మే 2013, బుధవారం

అత్యాశ




ఉదృత మైన ఆలోచనల  అలలు
తాకాయి .. నా మనసు తీరాన్ని
 ఏవేవో అస్పష్ట భావనలు
మోస్తూ  మోస్తూ నేను అలసి పోతాను
అక్షరీకణలొను  సొమ్మసిల్లి పోతాను
పొద్దంతా .. అదే పని
రేయి అంతా ఇంకో రకం సడి
కవితాలాలస జడి అనుకుంటా  
బాహ్య అంతః సంఘర్షణల మధ్య
నేనొక ఒంటరి యోధురాలిని  .

నన్ను నేను వ్యక్తీకరించుకోలేనప్పుడు
వేరొక చోట   స్పష్టతని చేజిక్కించుకోవడం లో
 విఫలం అయినప్పుడు
నాకు నేనే అర్ధం కానప్పుడూ 
ఓ  అస్పష్ట కవిత్వాన్ని అవుతాను .
మళ్ళీ మళ్ళీ   చదువుకుంటూ
మరల మనిషినవుతాను
మరో రోజు మొదలైన చోట
కవి నవుదామని అత్యాశతో

  (కవి సంగమం లో .. నా పరిచయం ఇలా చేసుకోవాలనుకున్నాను .సమయాభావం  వల్ల  నా పైత్యానికి తాళం పడింది ) :)


14, మే 2013, మంగళవారం

ఓ.. మంచి కవిత

ఈ రోజు కవిసంగమం లో ఒక కవిత చదివాను . ఎంత బావుందో చెప్పలేను . స్త్రీలో ఉన్న ఉదాత్త కోణం ని చాలా బాగా చూపారు 
ఇలాంటి కవితలు చదవడం "కవి సంగమం " లో ఉండటం మూలంగానే సాధ్యం అయింది

కవిసంగమం తో పరిచయం లేని మిత్రులతో పంచుకోవాలని ఇక్కడ షేర్ చేస్తున్నాను .  మాతృక మళ యాల కవికి ఆగ్లానువాదం చేసిన వారికి అలాగే తెనుగు సేత కవి యాకూబ్ గారికి, ఈ కవితని షేర్ చేసిన కపిల రామ్  గారికి ధన్యవాదములు చెపుదాము 


 ||కవి యకూబ్ - వరద ||

''రెండున్నరకి పైసా తక్కువైనా కుదరదు ''
పైటని పచ్చికమీద పరిచి
వెల్లికిలా పడికుంది ఆమె!
' ఇక్కడ అమ్మకం పన్నేమీ లేదు '
అతగాడు ఊపిరి పీల్చుకున్నాడు.....
శరీరాన్ని విల్లులా వంచి
ప్రణయ పంచబాణాలు వదిలాడు.
ఇప్పుడిక వరద ముంచెత్తింది
సృష్టి యెప్పుడు శిరసెత్తుతుంది?
బహుశ: అది సృష్టించలేని శృంగారమేమొ?

అంతా అయిపోయి, లేచి వెళ్ళిపోనున్న
అతడి ముఖంలో పగుళ్ళువారిన దిగులు చూసి ఆమె....
'' ఈ యాభై పైసలు తీసుకోండి, బస్సుకు పనికొస్తాయి
యిప్పుడు నడవడం కష్టం!''
***
అతడు కాళ్ళీడ్చుకుంటూ యిల్లు చేరేసరికి
కళ్ళలో వత్తులు వేసుకుని
గుమ్మంలో యెదురుచూస్తోంది తల్లి!
_______________________________________________
మలయాళ మూలానికి ఆంగ్లానువాదం - అయ్యప్ప ఫణిక్కర్ -
తెనుగు సేత - మన కవి యాకూబ్ పేజి 64-65
(ప్రపంచ కవిత్వంతో ఒక సాయంత్రం - సంకలనం నుండి.)

13, మే 2013, సోమవారం

నచ్చని ప్రయాణం

హాయ్ ఫ్రెండ్స్ ! చాలా రోజుల తర్వాత బ్లాగ్ వ్రాయాలని మనఃస్పూర్తిగా ఇష్టం కల్గింది

రోజులు చాలా త్వర  త్వరగా  దొర్లిపోతున్నాయి. చాలా రోజులు పనుల ఒత్తిడిలో నన్ను నేను మరచిపోయాను .
ఆవకాయ పచ్చళ్ళు పట్టడం, పెళ్ళిళ్ళ సీజన్ మూలంగా వృత్తి పరమైన ఒత్తిడి తో బ్లాగ్ వైపు తొంగి చూసే అవకాశమే రాలేదు.

మహిళ లకి బ్లాగ్ నిర్వహణ అంటే మాటలు కాదని ఇప్పుడు నిరూపణ అయింది అయినా సరే .. పనుల ఒత్తిడిని ప్రక్కన పెట్టి "కవి సంగమం " లో పాల్గొనాలని అత్యుత్సాహంతో వెళ్లాను. హిమాయత్ నగర్ లో ఫ్రెండ్ ఇంటిలో మకాం . స్నానం టిఫిన్ అయిన తర్వాత తి.తి.దే .. వారి కళ్యాణ మండపం ప్రక్కనే ఉన్న "స్వామి" వారిని దర్శించుకుని .. బయటకి వచ్చి షాపింగ్ చేయాలనుకుంటే హైదరాబాద్ లో షాప్ లే తెరవలేదు ..ఎమిటి  ఇలా అంటే ఇక్కడ అంతే ! పదకొండు గంటలకి కాని షాపులు తెరవరు అని చెప్పింది సరే .. సుల్తాన్ బజార్ కో,అబిడ్స్ కో షాప్పింగ్ వెళదాం పద అంటూ బయలుదేరదీసాను. లిబర్టీ బస్సు స్టాప్ లో పావు గంట నిలబడినా అటు వైపు  వెళ్ళే బస్ రాలేదు . సరే అటువైపు వద్దు చార్మినార్ వైపు వెళదాం పద అంటూ ..చార్మినార్ వైపు వెళ్ళే బస్ ఎక్కాము. మేము వెళ్లేసరికి ఒక్కో షాప్ తెరుస్తూ ఉన్నారు హైదరాబాద్ "గాజులు" ప్రసిద్ది కనుక ముందు లాడ్ బజార్లో గాజుల కోసం తిరగడం మొదలు పెట్టాము .  మీనాకరి గాజులు అంటే   నాకు చాలా ఆసక్తి. జైపూర్ లో ఆ గాజులు బాగా దొరుకుతాయి. హైదరాబాద్ లో కూడా దొరుకుతాయి కాని అన్ని వెరైటీ లు  దొరకవు అని తెలుసు అయినా ఎక్కడో ఆశ దొరకక పోతాయా .అని  వెదకడం మొదలు పెట్టాము ఒక పట్టాన నాకు గాజులు నచ్చావు ,నచ్చిన గాజులేమో ధర చూస్తే కళ్ళు తిరిగే ధరలు చెపుతున్నారు. బాగా నచ్చిన గాజులు చూస్తే చిన్న సైజో,పెద్ద సైజో దొరుకుతాయి కాని కావాల్సిన సైజ్ దొరకలేదు. ఎలాగోలా ఒక మూడు రకాల గాజులు కొనుక్కుని బయట పడ్డాము. వస్తూ వస్తూ చార్మినార్ ని ఇలా కెమెరా లో బందించుకున్నాను. నువ్వు గాజుల షాప్ లలో కూడా పిక్స్ తీస్తావేమో అనుకున్నాను . ఆ ధ్యాస లేదు నీకు అంది నా ఫ్రెండ్ . అప్పుడు గుర్తుకు వచ్చింది అయ్యో ! ఎన్ని రకాల గాజులని ఫొటోస్ లో తీసి పని .. చక్కగా బ్లాగ్ లోపెట్టి అందరికి చూపే పని అనుకున్నాను. ఏమిటో .. సమయానికి సరిగా గుర్తుండి చావడం లేదు అని తిట్టుకున్నాను కూడా


    

"కవి సంగమం " లో పాల్గొని  తెల్లవారుతూనే కాళ్ళకి చక్రాలు గట్టుకుని ఇంటికి బయలుదేరాను ఎండలు మండిపోతుంటే పగలు ప్రయాణం ఏమిటి ? రాత్రికి వెళ్ళ వచ్చు కదా ! ఈ ఒక్క పూటా ఉండు .అని నా ఫ్రెండ్   బ్రతిమలాడినా వినకుండా నన్ను ట్రైన్ ఎక్కించు నేను వెళ్ళిపోతాను అని పట్టుబట్టాను. ఇక తనేం చెప్పినా నేను విననని అర్ధం అయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి తీసుకు  వచ్చి  ఒ..పావు గంట క్యూలో నిలబడి టికెట్ తెచ్చి ఇచ్చింది.  "ఇంటర్ సిటీ " ఎక్కాలనుకుని వెయిట్ చే స్తూ  . నిలబడ్డాం.  మనుషులు నిలబడటానికే  చోటులేదు ఇంకెక్కడా సీట్ దొరుకుతుంది ? రిజర్వేషన్ బోగీలోకి ఎక్కేసి టి .సి వచ్చినప్పుడు టికెట్ వ్రాయించుకో ! అలా నిలబడి ఎక్కడ వెళతావు అని నా ఫ్రెండ్ గోల. పరవాలేదులే ! ఎంత నాలుగు గంటలసేపే కదా ! సీట్ దొరుకుతుంది లే! అని దీమా గా చెప్పాను .సీట్ దొరకడం కాదు కదా ..  మనం ఎంత ఒత్తిగిల్లి నిలబడ్డా సరే మనుషులని ఒరుసుకుంటూ తిరిగే వ్యక్తులు,  చిరు తిండ్లు అమ్ముకుని తిరిగే వారి మధ్య అటు తొలగి దారి  ఇస్తూ ఇటు తిరిగి  నిలబడుతూ నరక ప్రాయమైన ప్రయాణం చేసాను నిలబడిన మనుషుల మధ్యనే కాస్త వాళ్ళని అవతలకి నెట్టి చతికిల బడే కొందరు అలా కూర్చో గల్గె దైర్యం లేని నాలాంటి కొందరు.  చెమట స్నానాలతో  చిరాకు  పడుతూ కూలింగ్ వాటర్ బాటిల్స్ బాటిల్స్ క్రొద్ది తాగేసి ఎలాగోలా "మధిర " దగ్గర మాత్రం నాకు కూర్చోవడానికి తీరికగా సీట్  దొరికింది అమ్మయ్య .అంటూ నిట్టూర్చి ... ఎలాగోలా 2;30 కి అల్లా ఇంట్లో పడ్దాను

అప్పటికి కాని నాకు ప్రాణం లేచి వచ్చినట్లు అయింది నేను లేకపోతే ..నా వర్కర్స్ అందరూ ఎలా వర్క్ చేస్తారో అన్న దిగులు నా కస్టమర్స్ కి అలాంటి అసంతృప్తి కల్గుతుందో .. అన్న అనుమానం నన్ను ఎక్కడా నిలువనీయదు నా పర్యవేక్షణలో అంతా మాములుగా జరుగుతుంటే అది చాలు అనుకునే .. అతి చిన్న ఆశా జీవిని నేను.

 పై పై మెరుగులు, పెదాలపై అతికించుకున్న నవ్వులు, చూసి చూడనట్లు వెళ్ళిపోయే వారు .. పలకరిస్తే పరువేం బోతుందో లేదా వాళ్ళని మనం పలకరించేది ఏమిటిలే అనుకున్న వాళ్ళు  (వాళ్ళే ఫెస్బూక్ ఫ్రెండ్స్ ఇక్కడ వాల్స్ పై అతి ప్రేమ ఒలకబొస్తారు ) ఇవన్నీ చూసి విరక్తి కల్గింది.ఎవరికీ వారే మేమే గొప్ప లా భ్రమపడి బతుకుతున్నట్టు అనిపించింది

నిజం చెప్పొద్దూ .. హైదరాబాద్ నగరం ,  లాడ్ బజారులో గాజులు కొనుక్కోవడం, కొంత మంది మిత్రులని కలవడం కవి సంగమం, నాకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి .  ఎందుకో నేను చెప్పలేను .  ఈ ప్రయాణం నాకు అసలు నచ్చలేదు. షేర్ చేయదగిన గొప్ప విషయాలు కూడా లేవు అక్కడ. అంతా  లీలా వినోదం. అంతే !

వీటన్నింటి మధ్య .".చార్మినార్ " ఒక్కటే నాకు నచ్చింది . అంతే!

(మనసు చెప్పినదే చేస్తాను, వ్రాస్తాను )

10, మే 2013, శుక్రవారం

కవిసంగమం .. లో నేను


రోజూ కనబడే నక్షత్రాల లోనే
రోజు కనబడని కొత్తదనం చూచి
రోజూ పొందని ఆనందానుభూతి
పొందటం అంటేనే కవిత్వం

అని ఒక కవి మాటలు ..

కవిత్వం అమృతం వంటిదని తెలిస్తే రాక్షసులు దేవతలతో తగాదా పడి  ఉండేవారు కాదని మానవులతో మైత్రి నడిపి కవితామృ తానని సేవిం చే వారని ఇంకొక కవి ఛలోక్తి .

నాకు కవిత్వమంటే చాలా చాలా ఇష్టం .

అందుకేనేమో ..నాకొక చక్కని అవకాశం లభించింది  "లమ్ కాన్ సిరీస్ -5 లో కవిసంగమం వేదిక పై కవిత్వం చదివి వినిపించే అవకాశం లభించింది .

పేస్ బుక్ గ్రూప్ లలో "కవిసంగమం "   తెలుగు కవిత్వానికి  ఎంతో  ఆలంబనగా ఉంది .   వర్ధమాన కవులకి ఒక వేదికగా నిలిచి కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉంది.  "కవిత్వం కావాలి కవిత్వం" అంటూ నిజమైన కవిత్వానికి చిరునామా కావాలని  "కవిసంగమం " కృ షి చేస్తుంది .

రేపు సాయంత్రం 11-05-2013 శనివారం సాయంత్రం 06:00 కి బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లామ్ కాన్  వేదికగా జరిగే కవిసంగమం లో నేను ఒక కవిగా (కవయిత్రి) పాల్గోనబోతున్నాను

మిత్రులందరికి ఇదే ఆహ్వానం . కవిత్వాన్ని ఆస్వాదించడానికి మనమందరం ఒక వేదిక పై కలుసుకుందాం రండి

హైదరాబాద్ లో ఉన్న మిత్రులందరికీ ఆహ్వానం . అవకాశం ఉన్నంతవరకు రాగల్గిన మిత్రులందరికీ  మనఃపూర్వక ఆహ్వానం పలుకుతూ ..

                                                                                  వనజ తాతినేని


8, మే 2013, బుధవారం

ముసుగెందుకు ?

నాగరికత నేర్చిన నడకలు ఇవి . నగ్న సత్యం ఇది .






ముళ్ళ కొమ్మల మధ్యన మగువ . చిత్రించి చూపే కెమెరా కన్నుయొక్క  దృష్టి పథాన్ని దాటి పోలేని మనుగడలో
అవకాశాలకై అర్రులు జాచె కొందరి దిగజారుడు తనానికి అన్నెం పున్నెం తెలియని అభాగ్యులు  బలవుతుండటం అన్యాయం. అశ్లీలతని ప్రోత్శాహించినంతకాలం మన మధ్య ఏమైనా జరగవచ్చు
మీడియాకి నియంత్రణ అవసరం అనిపిస్తుంటుంది


" మెదదు  అంతా.. మన్నేనా!? 
హృదయం అంతా.. బండేనా !?. 
అయినా శరీరం అంతా..
స్వరజతులే ఉండాలా!? 
మీటితే ఎప్పుడు పడితే అప్పుడు.. 
అలరిస్తూనే ఉండాలా!?
మద్యంలాగా.. మగువ కూడా.
తయారు చేసుకున్న వస్తువా!?

(నా కవిత్వంలో ఒక భాగం )

ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే మన మధ్య ఎలాంటి వికృతాలు ఉండవు . ముసుగులేసుకుని బ్రతకనవసరం లేదు .

ఎక్కడ నిజం ఉంటుందో .అక్కడ  నిర్భయం ఉంటుంది.  ఎక్కడ సంస్కారం ఉంటుందో అక్కడ  అర్ధం చేసుకునే తత్త్వం ఉంటుంది.  ఎక్కడ నిబద్దత ఉంటుందో అక్కడ ఆలస్యంగా అయినా అమృత ఫలాలు లభిస్తాయి ఇది నాకు మా గురుతుల్యులు నేర్పిన పాఠం. 

4, మే 2013, శనివారం

తాయిలం


                      పిల్లలిద్దరిని  కాలేజ్ బస్ ఆగే  చోటుకి  తీసుకుని వెళ్ళి  వాళ్ళని దించేసి  వచ్చి  తన మోటార్ బైక్ ని వరండాలో పెట్టి తను ఆఫీసుకి వెళ్ళడానికి  హడావిడిగా తయారయ్యి బయటకి వచ్చాడు నారాయణ .

ఏమోయ్ ! నేను బయలుదేరుతున్నాను ఆఫీస్ కి వెళ్లి వస్తాను  అని చెపుతూ  ఇల్లంతా వెతికాడు భార్య లక్ష్మి కోసం. 
రైలు పెట్టె లలా వున్న నాలుగు గదులలోను ఆమె జాడ కనబడలేదు. ఎక్కడో పనిలో వుండి  వుంటుంది తనేకేమో ఆఫీస్ కి టైం అయిపోతుంది అనుకుని భార్య కోసం  వెదుక్కోకుండా చెప్పులు తొడుక్కుని గేటు వైపు అడుగులు వేసాడో లేదో వెనుక నుండి భార్య పిలుపులు వినవస్తున్నాయి

ఆమె యెక్కడ వుందా అని తలెత్తి చూస్తే డాబాపై బట్టలు ఆరవేయడం ఆపి  పిట్ట గోడ వైపు కి ముందుకు నడచి వస్తూ

"ఏమిటండి ..?  లంచ్ బాక్స్ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు" అని అడిగింది

అప్పుడు చేతి వైపు చూసుకుని "అవును కదా మర్చిపోయానోయ్ . గుర్తు చేసి మంచి పని చేసావు  అంటూ వెనుదిరిగి లోపలకి వెళ్ళాడు . లక్ష్మి కూడా గబా గబా మేడపై నుండి దిగి వచ్చి లంచ్ బాక్స్ సర్ది వుంచిన  సంచీ చేతికందించి.. "దీనిని తీసుకోవడం మర్చిపోలేదు కదా" అంది నారాయణ చేతిలో ఉన్న నవల ని చూపి.

బదులుగా చిన్న చిరునవ్వు నవ్వి వెళ్లొస్తాను  అని చెప్పి  వడి వడిగా  నడిచాడు . ఏమిటో ఈయన చాదస్తం. యిరవై నిమిషాలలో  బైక్ పై ఆఫీస్ కి వెళ్ళే ప్రయాణాన్ని గంట సేపు ట్రాఫిక్ లో పడి  యిరికిరికి వున్న  బస్ లు ఎక్కి వెళ్ళాలని అనుకుంటారు. పైకి  మాత్రం .. వాహనాల ప్రమాదాలు యెక్కువగా వున్నాయి హాయిగా బస్ లో కూర్చుని ప్రయాణం చేసి వెళ్లి రాక ,  యె౦దుకు వచ్చిన యిబ్బంది  అని యితరులకు చెపుతుంటారు కాని అసలు కారణం బస్ లో కూర్చుని ప్రయాణం చేస్తూ హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చని  నారాయణ ఆశ అని .. లక్ష్మి కి తెలుసు

నారాయణకి  చదవడం అనే అలవాటు ఎక్కువ.  ఎప్పుడు యేదో వొకటి చదువుతూనే ఉంటాడు. తినడం పడుకోవడం లాంటి పనులన్నీ యధాలాపంగా చేస్తూ ఉంటాడు.  ఏం అడిగినా యధాలాపంగా సమాధానం చెపుతుంటాడు పప్పులో వుప్పు ఎక్కువైనా, వంకాయ కూర కరుణ యెక్కి చేదుగా వున్నా పట్టించుకోకుండా తినేయడం చూసి హమ్మయ్య!  ఈయనతో వంటతో వచ్చిన యిబ్బందులు పెద్దగా వుండవు అని మురిసి ముక్కలైపోయింది  కాని  ముద్దుగా యేనాడైనా వొక సినిమాకి షికారుకి కూడా తీసుకువెళ్ళని భర్తని చూసి విరక్తి పెంచుకుంది.  ఒకోసారి తిక్క పుట్టి అతని చేతిలోని నవలని  బలవంతంగా లాక్కుని దూరంగా విసిరి పడేసి " ఏమండీ .. ఆ పుస్తకాలనే  కట్టుకోకపోయారా ? నన్నెందుకు కట్టుకున్నట్లో అని అంటే .. "పుస్తకం హస్త భూషణం " అన్నారు కాని..  భార్య భూషణం అని అనలేరు కదోయ్! నువ్వు నా అర్ధ భాగానివి, ఆఫ్ట్రాల్ హస్తంలో ఉండే ఆ పుస్తకం పై నీకు  కినుక యెందుకంటూ  దగ్గరకి తీసుకునే వాడు. ఏమైనా కబుర్లు చెప్పండి అంటే నువ్వు చెపుతూ వుంటే  నేను వినడం బాగుంటుంది అనేవాడు. కాసేపు యిరుగు  ముచ్చట, పొరుగు ముచ్చట చెపుతుంటే రాని  నవ్వుని పెదాలపైకి  బలవంతంగా తెచ్చుకుని నవ్వుతూ వింటూ ఉండేవాడు. ఎప్పుడు వదిలేస్తుందా అప్పుడే వెళ్ళిపోయి  యే నవలో, పత్రికో చదవడానికి బాకీ వున్నట్లు గా . 

 అది గమనించిన  లక్ష్మి  తను మాట మార్చేసి  ఆడవారికి  కబుర్లు యేముంటాయి ? మగవారికంటే చాలా విషయాలు తెలుస్తాయి  ప్రపంచ జ్ఞానం  కూడా యేక్కువే ! మీరే వింతలు విశేషాలు చెప్పండి ప్లీజ్  ప్లీజ్ అని బతిమాలించుకుని ... అప్పుడు ఒక చిన్న నవ్వు విసిరేసి    అందుకే పుస్తకాలు,  పత్రికలూ చదవమని చెప్పేది . అంటూ  .ఓ పత్రిక ని చేతిలో పెట్టి చదివించే వాడు .. అలాంటి భర్త తో  ఓ ఇరవై యేళ్ళు గడచిపోయాయి లక్ష్మి కి.      

ఆ రోజు  నారాయణ యింటికి వచ్చేసరికి యేడు గంటలు అవుతుంది. నారాయణ ని చూస్తూనే...  " అయిదు గంటలకి ఆఫీస్ అయిపోతే రెండు  గంటలు పట్టింది యింటికి రావడానికి. మధ్యలో యే పుస్తకాల పురుగుతోనో మాటల్లో పడి  వుంటారు, నేను నిన్న చెప్పాను  కదండీ  రేపు మా తమ్ముడు వాళ్ళింటికి వెళదామని "  అని విసుక్కుంది లక్ష్మి

 నారాయణ యేమి మాట్లాడకుండా చేతిలోని కూరలు,పండ్లు వుంచిన సంచీని భార్య చేతికి అందించాడు.  స్నానానికి వెళ్ళబోతూ "నాకు కాఫీ  కలుపుతావేమో, తాగాలని పించడం లేదు వద్దు" అని చెప్పాడు.

స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని రేపటి నుండి పేపర్ కూడా మానేద్దాం. మనం తప్ప పిల్లలిద్దరూ పేపర్ ముట్టుకున్న పాపాన పోలేదు మనకి పేపర్ చదవడం అవసరం అంటావా ? .అన్నాడు

కూరలు తీసి ప్రిజ్ద్ లో సర్దుకుంటున్న లక్ష్మి ప్రశ్నార్ధకంగా చూసింది.  " ఖర్చులు పెరిగిపోతున్నాయి పిల్లలకి కావాల్సినవన్నీ  కొని యివ్వాలంటే మనం చాలా వాటిని త్యాగం చేయాలి తప్పదు"  అన్నాడు

"అవునండీ! నేను కూడా పని అమ్మాయిని, బట్టలుతికే  అమ్మాయిని మానిపించి మంచి పనే చేసాను నెలకి వెయ్యి రూపాయలు  వరకూ ఆదా అవుతున్నాయి"  అని చెప్పింది

"వీళ్ళేరి ? " పిల్లలని వుద్దేశ్యించి అడుగుతూ వారి గదిలోకి చూసాడు

పిల్లలు యిద్దరూ చాలా బిజీగా కనిపించారు పెద్దవాడు ఫోన్లో మాట్లాడుతూ చిన్నవాడు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతూ  కనిపించారు.   "వారికి నువ్వన్నా చెప్ప కూడదు కాసేపు  అయినా చదువుకోమని "అని అన్నాడు.

"వాళ్ళూ  పొద్దస్తమాను  చదువుల్లో పడి  కొట్టుకుంటారు కాసేపు ఆట విడుపు వుండాలండి" అంది

 పిల్లలు యిద్దరినీ పిలిచి ప్రక్కన కూర్చోపెట్టుకున్నాడు వాళ్ళ చదువుల గురించి  పరీక్షల గురించి మాట్లాడుతూ టి వి చూస్తూ ఒక గంట సమయం గడిపేశారు. అందరూ కలసి  భోజనం చేసేటప్పుడు  "డాడీ ! నా పెవరేట్ యాక్టర్ నటించిన సినిమా  రేపు రిలీజ్ కాబోతుంది  నా ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళాలి 300 ఇవ్వండి ".. అంటూ  చిన్న వాడి డిమాండ్. ఇక పెద్దవాడు వాసు తన చిట్టా విప్పాడు  " నాన్నా..  నాకు ఈ ఫోన్ నచ్చడం లేదు ఫ్రెండ్స్ అందరూ  నా మొబైల్ పీస్ చూసి డబ్బా  ఫోన్  అని వెక్కిరిస్తున్నారు .సోనీ ఎక్స్పీరియా   చాలా బావుందట." అని మనసులో కోరికని చెప్పేసాడు .

ఆ మాటలు విన్న లక్ష్మి పిల్లలిద్దరిని గట్టిగా కోప్పడింది.  "చిన్నా.. అంత వేలంవెర్రిగా మూడువందలు  పోసి సినిమా మొదటి రోజే మొదటి ఆట చూడాలని యేమైనా ఉందా! అంత త్రోక్కిసలాటలో సినిమా చూడకపోతే యేమి పర్వాలేదు మన యింటి ప్రక్క వున్న ధియోటర్ లో మరో నాలుగు రోజుల తర్వాత చూడవచ్చులే! " అని చెప్పింది

ఇక పెద్దవాడివైపు తిరిగి .. "వాసు నువ్వు పెద్దవాడివి అవుతున్నావ్, యింటి విషయాలు నీకు తెలియాలి చదువుల్లో నీ ప్రతిభని బట్టి  మెడిసన్ లో  మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది అయినప్పటికి దాదాపు నీకు సంవత్సరానికి రెండు లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద కాలేజీల్లో చదువుతున్నావు కదా అని ధనవంతుల  పిల్లలతో నిన్ను పోల్చుకుంటున్నావు, మన ఆర్ధిక పరిస్థితులకి అంత ఖరీదైన పోన్ కొని యివ్వడం సాధ్యమా చెప్పు? " అంటూ లాలనగా అడిగింది

పిల్లలిద్దరూ మౌనంగా వింటూ ఉన్నారు

 "వాసు.. నీకొక విషయం గుర్తుందా!?   నువ్వు మూడవ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంగతి  గుర్తు చేస్తాను విను. నీ కొక తాయిలం యిస్తాను .. ఈ చందమామ పత్రికని చదివి అందులో ఒక కథ మళ్ళీ తిరిగి చెప్పమని నిన్ను అడిగే వాడిని .. ఆ తాయిలం యేమిటో అన్న ఉత్సాహం తో .. నువ్వు చందమామ పత్రికని చదివి అందులో నీకు నచ్చిన కథని నాకు చెప్పే వాడివి ..    ఆ వయసులో చదివిన కథని అర్ధం చేసుకుని తిరిగి     నీ మాటల్లో ఆ కథని  పేర్చుకుని  నాకు  చెప్పేటప్పుడు నేను ఎంత సంతోషించేవాడినో !  అప్పుడు నీకు తాయిలంగా  నీ నుదుటున  ఒక చిన్న ముద్దు ఇచ్చేవాడిని  ఇదేనా ..తాయిలం  అంటే ? అని నీ మోహంలో అసంతృప్తి . అప్పుడు మళ్ళీ నీకొక క్రొత్త చందమామని అసలైన తాయిలం గా యిచ్చేవాడిని. చిన్నప్పుడు నుండి అలా చదివే  అలవాటు వుండబట్టే కదా నీకు వ్యాస రచనల పోటీల్లోనూ యెన్నో  బహుమతులు వచ్చేవి.  అలాగే పరీక్షలలోను అందరికన్నా యెక్కువ మార్కులు వచ్చేవి. అలాంటిది నువ్వు యిప్పుడు క్లాస్ పుస్తకాలు  తప్ప యేవి ముట్టడం  లేదు. అప్పుడప్పుడూ కొన్ని పుస్తకాలు యెంపిక చేసుకుని చదవాలి. అప్పుడే ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది.  ఎప్పుడూ స్నేహితులు, సరదాలు,ముచ్చట్లు .. లేదా ఇంటర్నెట్ యివే లోకం అయిపోయాయి " అని మందలిస్తూ యింకా చెప్పసాగాడు నారాయణ

"జీవితం అన్నింటికీ భాగం ఉండాలి  ఇంటర్నెట్, సినిమాలు,స్నేహితులు ,బంధువులు ,అమ్మ-నాన్న , పుస్తకాలు అన్నింటిని గుప్పిట బంధించుకోవాలి అప్పుడే జీవిస్తున్న జీవితానికి అందం అర్ధం రెండు ఏర్పడతాయి"  అని.

"చెప్పడం అయిందా మీ  సోది ".. అన్నట్లున్న   పిల్లల  ముఖాల్లో  ఫీలింగ్  చూసి యిక చెప్పడం ఆపేసాడు భోజనం బల్ల దగ్గర నుండి లేచి చేయి కడుక్కుని గదిలోకి నడిచాడు నారాయణ  .

అలవాటు ప్రకారం అలమారాలో వున్న ఒక నవలని అందుకున్నాడు. ఎక్కువ కాంతినిచ్చే లైటుని వేయబోయి కరంట్ బిల్ యిచ్చే షాక్ ని గుర్తు తెచ్చుకుని ఆగిపోయాడు.  తీసిన నవలని మళ్ళీ అక్కడే పెట్టి  మంచం పై పడుకున్నాడు. ఒకవేళ నవలపై ఉన్న ప్రీతి తో చదువుతున్నా కూడా  లక్ష్మి వచ్చి యింకా పుస్తకాలు చదువుతూ కూర్చుంటారా? మీరు అలా లైటు వేసుకుని కూర్చుంటే నాకు నిద్ర పట్టక చస్తాను. అంటూ  రోజు దెబ్బలాడుతూ వుంటుంది.  ఒక బెడ్ లాంప్ కొనుక్కోవాలనుకుని బజారంతా తిరిగాడు ఓ మాదిరి లైట్  కూడా  రెండు వేల నుండి రెండున్నర వేలవరకూ  వుండటం చూసి  కొనే వుద్దేశ్యం మానుకుని వెనుతిరిగి  వచ్చేసాడు.  ఓ  రెండేళ్లుగా క్రొత్తగా పుస్తకాలు  యేవీ కొనుక్కున్న దాఖలానూ   లేదు.  ఈ మధ్య వొక స్త్రీ ఆత్మకథ నవలా రూపంలో వచ్చింది ఆ నవల ని కొనాలని,  చదవాలని మనసులో ఉన్నా కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది  పోనీ ఆన్ లైన్ లో చదువుకుందాం అనుకున్నా పిల్లలు తనకి ఆ అవకాశమే యివ్వరు . అయినా  ఆన్ లైన్  లో చదవడం కూడా విసుగే .  వరండాలో హాయిగా  పడక కుర్చీలో పడుకుని చిరుచెమట మధ్య అనేకానేక భావాల పలకరింతలతో తడిసి ముద్దయిపోతూ పుస్తకం చదివితే వచ్చే ఆనందం యింకెందులోనూ రాదు.  వీలయితే చదువుతున్న అక్షరాలన్నింటిని  లేదా నచ్చిన వాక్యాలని సృశిస్తూ చదవడంలో యెంత ఆనందం.  ప్చ్.. ఇక యే మాత్రం నాకత్యంత  యిష్టమైన వ్యాపకం కొనసాగేలా లేదు.  ఈ మహానగరంలో సంసారం యీదడం అంటే సముద్రం యీదడం అన్నమాటే. రేపటి నుండి అసలు వుద్యోగం అయ్యాక మళ్ళీ పార్ట్ టైం వుద్యోగానికి వెళ్ళ బోతున్నాను    అనుకుంటూ  నిట్టూర్చాడు.

 అస్థిమితంగా కదులుతూ చిరాకు తెచ్చుకున్నాడు. మంచం పై నుండి లేచి వెళ్లి మళ్ళీ పుస్తకాల అలమర దగ్గర నిలబడ్డాడు. మూడు అరలలో నిండి వున్న పుస్తకాలన్నింటిని  ఆప్యాయంగా తడిమి చూసుకున్నాడు. పుస్తకాలని తడుముతుంటే తల్లినే చూసిన ఆనందం. తెరచి ఉన్న పుస్తకం గాలికి రెప రెపలాడుతుంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా యిలాగే కదులుతుందేమో అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. తన ఆలోచనలు చిత్రంగా ఉన్నట్లు అనిపించి తనలో తనే నవ్వుకుంటాడు కూడా. ఒక పుస్తకాన్ని తెరచి అక్షరాల వైపు చూసాడు ఈ అక్షరాలతో యెన్నాళ్ళ సావాసం ? దాదాపు నలబై యేళ్ళు అవుతుంది. ఆక్షరమే  తన  వూపిరి అయినట్లు జీవించాడు. సంసార భారంతో  క్రమ క్రమంగా యీ పుస్తకాలు తనకి దూరం అవుతున్నట్లు అనిపిస్తున్నాయి.  మిగిలిన యీ కాసిని పుస్తకాలు కూడా చదివే ఆసక్తి ఉన్నవారికి యిచ్చేస్తాను  పిల్లలు చూస్తే వొక్కరు కూడా పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్న దాఖలా వుండదు. ఇంకెందు యివి అనుకుంటూ   ఒక కధకుడు అన్నట్టు " ఈ జ్ఞాన సముద్రాన్ని  యే సముద్రంలో  పారబోయను " అని తను కూడా అనుకోకుండా వుండాలి అనుకున్నాడు

మీరు వదిలేసినా నేను వీళ్ళకి  క్లాస్స్ తీసుకోవడం ఆపుతానా అన్నట్టు .. ప్రక్క గదిలో  పిల్లలతో లక్ష్మి మాట్లాడుతున్న మాటలు వినబడుతున్నాయి

మీ నాన్న గారికి వున్న యేకైక వ్యసనం పుస్తకాలు చదవడం. ఆయనకి  చిన్న అక్షరాలూ కనబడక చదువుకోవడానికి చాలా యిబ్బంది పడుతున్నారు  కంటి హాస్పిటల్ కి వెళ్ళి  పరీక్ష చేయించుకుని   కళ్ళ జోడు వేయించుకోవడానికి  పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుందని కళ్ళ జోడు వేయించుకోవడాన్ని  సంవత్సరం నుండి వాయిదా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కాఫీ వద్దన్నారు, రేపు వుదయం పేపర్  వేయవద్దని చెప్పబోతున్నారు. రేపటి నుండి పార్ట్ టైం జాబ్ కి వెళ్ళ బోతున్నారు. మీ కోర్కెలు చూస్తే అంతే లేకుండా పోతుంది. ఒక్కడు సంపాదిస్తుంటే ముగ్గురం తిని కూర్చుంటున్నాము.  మీ నాయనమ్మకి మన అందరిని చూడాలని కోరిక. అక్కడి నుండి ఆమె ఒక్కటే ప్రయాణం చేసి రాలేక  మనమందరం  కల్సి వూరు వెళ్ళాలని వున్నాకూడా ప్రయాణం ఖర్చులు అన్నీ లేక్కవేసుకుని వెళ్ళనూలేక మీ నాన్న యె౦త అవస్థ పడుతున్నారో! నాయనమ్మకి డబ్బులు మాత్రమే  పంపించి వూరుకుంటున్నారు "  అంటూ మనసులో బాధనంతటిని  మాటల్లో చూపింది. .

   కాసేపటి తర్వాత  గదిలోకి వచ్చిన భార్యతో  లక్ష్మీ !  మన ఇబ్బందులు మనం పడుతున్నాం  కదా ! ఎందుకవన్నీ  మళ్ళీ  పిల్లలకి చెప్పడం అంటూ మందలించబోయాడు 

లేదండీ, పిల్లలకి యివన్నీ తెలియాలి. మన ఆర్దిక పరిస్థితులని దాచి వారికి కావాల్సినవన్నీ అమర్చడం మంచిది కాదు అని గట్టిగా చెప్పింది.  అదీ నిజమే కదా అనుకున్నాడు.

  " ఏమండీ ! మీకిష్టమైన నవల యేమిటో చెప్పండి నేను చదివి వినిపిస్తాను "అంది .. "నువ్వా..  చదివి వినిపించడమా? " అని ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ 

" అవునండీ ! నేను చదవగలను .ఇదిగో..  మీరెప్పుడు పట్టుకుని వూరేగే  యీ"కొ కు చదువు" చదివి వినిపించనా"  అని అడిగింది . "వద్దులే ! అలా అయితే నాకు చదివినట్లు వుండదు " అని నిజాన్ని చెప్పేసి నాలిక కరుచుకుని  అంతలోనే సర్దుకుని ఆమె వుత్సాహాన్ని యె౦దుకు అడ్డుపడాలి అనుకుని .. చదువు లక్ష్మీ ! నువ్వు చదువుతూ వుంటే వినడం   బావుంటుంది అంటూ ఆమె ప్రక్కగా వచ్చి కూర్చుని ఆమె భుజంపై తలవాల్చి వింటూ వుండిపోయాడు. అలాగే నిద్రపోయాడు కూడా! 

నిద్రపోయిన అతనిని మంచంపై పడుకోబెట్టి " పిచ్చి మారాజు" పుస్తకం తప్ప మరో ప్రపంచమే తెలియదు నేను కాబట్టి ఈయనతో సర్దుకుపోయాను.ఇంకొకరు యెవరైనా అయి వుంటే వొక నగా,నట్రా,సరదానా, షికారా.. అంటూ రోజు విరుచుకుపడేవారు. ఈయన పుస్తకాల పిచ్చి తో జీతంలో  సగభాగం పైగా ధారపోసిన రోజులు ఉన్నాయి. పోనీ కొనుక్కున్న పుస్తకాలన్నింటిని భద్రంగా దాచుకున్నది లేదు. ఏమాత్రం పరిచయం  వున్న మనిషయినా   యింటికి వస్తే  చాలు  వాళ్ళతో పుస్తకాల గురించి మాట్లాడి .. ఇదిగో యీ పుస్తకం చదవండీ ..చాలా బావుంటుంది అని వాళ్ళు వద్దు వద్దు అంటున్నావినకుండా బలవంతంగా వారికి యిచ్చి పంపడం.    

ఎందుకండీ ! యింట్లో   నన్ను  యిబ్బంది పెడుతున్నది చాలదూ !? వాళ్ళు వద్దంటున్నా వినకుండా వాళ్ళ ప్రాణం తీస్తారు అని తను విసుక్కోవడం పరిపాటిగా ఉండేది 

అందుకు  సమాధానంగా  'అక్షరం పరబ్రహ్మ స్వరూపం"  అలాంటి అక్షరాలతో ప్రాణం పోసుకున్న పుస్తకాలని చదవాలి అర్ధం చేసుకోవాలి.  ఆ అర్ధంతో జీవిత పరమార్ధం తెలుసుకోవాలి అని చెప్పేవాడు. నారాయణ మాటలు వినగా వినగా లక్ష్మి కి కూడా పుస్తకాలు చదవడంలో తీపి తెలిసింది. పుస్తకం పై ప్రేమ కల్గింది. అంతకన్నా   యెక్కువ ప్రేమ భర్త పైనా పెరిగింది.   ఇద్దరూ కలసి బిడ్డలకి పుస్తకంపై  స్నేహం పెంచాలని చూసారు కాని చిన్నప్పుడు పుస్తకాలు చదవడం పై  వున్న శ్రద్ద  పెరిగి పెద్దవడంలో తరిగిపోయింది.  అవన్నీ తలచుకుంటూ .. వాళ్లకి మాత్రం ఖాళీ యెక్కడ ఉంటుందిలే ! వాళ్ళ సిలబస్, ప్రేవేట్ క్లాసులు వీటికే టైం సరిపోవడం లేదు అని  అనుకుని కళ్ళు మూసుకుంది లక్ష్మి 

తెల్లవారింది రాత్రి జరిగిందంతా అంతా మర్చిపోయారు. ఎవరి హడావుడి వారిది. నారాయణ రెండు వుద్యోగాలతో అలసి సొలసి  పదకొండు గంటలకి  యింటికి వచ్చేవాడు.  ఈ మాత్రం కష్ట పడకపోతే పిల్లల చదువులు గట్టేక్కవు అని నిర్ణయానికి వచ్చేసాడు కాబట్టి అందుకు తగిన శ్రమకి అలవాటు పడటం నేర్చుకున్నాడు. లక్ష్మి భర్త కోసం పడిగాపులు కాస్తూ  అతని సమయాలకి అలవాటు పడింది.

ఆదివారం వచ్చింది  ప్రొద్దునే నారాయణ పిల్లలిద్దరిని పిలిచి సినిమాకి వెళతారా? అని అడిగాడు . లేదు నాన్నా, కొన్ని బుక్స్ కొనుక్కోవాలి బుక్స్ షాప్ కి తీసుకు వెళ్ళవా  అని అడిగాడు వాసు 

చిన్నా అయితే సినిమాకే వెళతానని అన్నాడు. అప్పుడు వాసు చిన్నాతో ముందు మనిద్దరం నాన్నతో కలసి బుక్స్ షాప్ కి వెళదాము తర్వాత  నువ్వు కావాలనుకుంటే అప్పుడు సినిమాకి వెళదాం సరేనా అన్నాడు.  అన్న మాటలకి అలాగే అంటూ తల వూపాడు చిన్న.  . 

టిఫిన్ చేసి బుక్స్ షాప్ల వైపు ముగ్గురు కలసి మోటార్ బైక్ పై వెళ్ళారు. మీరు యిక్కడే వు౦డండి నాన్నా.. అంటూ పార్కింగ్  ప్లేస్ లోనే తండ్రిని తమ్ముడిని వుంచి    రెండు మూడు షాప్ లకి తిరిగినా కూడా వాసుకి కావలిసిన బుక్ దొరకలేదు. నీకు కావాల్సిన బుక్ అదేనా!? సరిగ్గా విన్నావా..  లేదా ? అని అడిగాడు నారాయణ. సరిగానే తెలుసు నాన్నాకానీ నాకు కావాల్సిన పుస్తకం దొరకడం లేదు  అన్నాడు . 

నేను వస్తున్నాను వుండు..  వేరొక షాప్ లో దొరుకుతుందేమో .. అంటూ నారాయణ,చిన్నకూడా వాసుతో పాటు వేరే షాప్ లోకి వెళ్ళారు. అక్కడ వాసు అడుగుతున్న పుస్తకం పేరు చూసి నారాయణ ఆశ్చర్యపోయాడు ఆ పుస్తకం పేరు  మాక్సిం గోర్కీ "అమ్మ"  తెలుగు అనువాదం కావాలని అడిగాడు . దొరకడం కష్టం కావాలంటే ఇంగ్లీష్ ప్రింట్ వుంది అది తీసుకోమని చెప్పాడు షాపతను 

నాకు వద్దు తెలుగు అనువాదమే కావాలని అడిగాడు.వాసు  నీకు కావాల్సిన నవల యెక్కడ దొరుకుతుందో నేను తీసుకు వెళతాను .. రా. అంటూ  నారాయణ తెలుగు పుస్తకాలు అమ్మే చోటుకి తీసుకు వెళ్ళాడు 

ఏమిటి నారాయణ గారు అసలు కనబడటం లేదు అంటూ ఆ షాప్ యజమానితో పాటు గుమాస్తాలు కూడా    పలకరించారు.  నారాయణ  చిన్నగా నవ్వి .. మా వాడికి  "అమ్మ " కావాలంట . దొరుకుతుందంటారా ? అడిగాడు  ఒక్క పది నిమిషాలు పాటు  కూర్చోండి తెపించి యిస్తాను అని షాప్ లో మనిషిని వేరొక చోటుకి పంపించాడు.ఈ లోపు వాసు చిన్నాని  తీసుకుని  వెళ్లి రాక్స్ లో వున్న  బుక్స్ అన్నింటిని  చూపించసాగాడు. నువ్వు చిన్న చిన్న కవితలు వ్రాస్తూ ఉంటావు కదా ! అదిగో ఈ కవిత్వం బుక్ చూడు, చాలా బాగుంటుంది  . ఈ రచయిత్రి వ్రాసిన "స్ట్రీట్ చిల్డ్రన్ " కవిత మీకు పాఠంగా కూడా  వుంది అంటూ  ఒక పుస్తకాన్ని  చూపించాడు.  . 

అవునా అన్నయ్యా..  .. ఆ కవిత యె౦త బాగుంటుందో ! నాకు చాలా యిష్టం ఆమె వ్రాసిన ఈ కవిత్వం పుస్తకం కూడా నాక్కావాలి . నాన్నతో చెప్పి నేను కొనిపించుకుంటాను అని ఆ పుస్తకం తీసుకుని తండ్రి వైపు వెళ్ళసాగాడు .  వాసు కూడా తమ్ముడితో కలసి నడుస్తూ "ఈ రోజంతా ఈ పుస్తకంలో కవిత్వమే చదవాలి.  సినిమాకి వెళతానని అనకూడదు . ప్రామిస్ ! " అంటూ తమ్ముడి వైపు చేయి చాచాడు వాసు. "ప్రామిస్ అన్నయ్య ..యిక నేను సినిమా సంగతే అడగను సరేనా " అంటూ    నారాయణ దగ్గరికి వచ్చి "నాన్నా నాకొక తాయిలం కావాలి  కాదనకుండా ఇస్తావా ?"  ఆశగా అడిగాడు. 

తాయిలం అనేటప్పటికి నారాయణకి వాసు  చిన్నప్పటి సంగతి జ్ఞాపకం వచ్చింది . చిన్నా వైపు చూస్తూ "చెప్పు నాన్నా ! నీకు యే౦ తాయిలం  కావాలి " అని అడిగాడు ప్రేమగా .. 

"మరి మరి .. ఈ పుస్తకం కావాలి నాన్నా" అంటూ వెనుక దాచుకున్న   "ఆకురాలు కాలం " కవితా సంపుటి ని  ముందుకు పెట్టి చూపించాడు . నారాయణ కళ్ళల్లో సంతోషం పొంగుకు  వచ్చింది పెదవులపై నవ్వు తన్నుకుంటూ వచ్చింది 

అలాగే  అంటూ చిన్నాని దగ్గరికి తీసుకున్నాడు. మరొక చేత్తో వాసు భుజం పై చేయి వేసి తట్టాడు.  

బావుందండి నారాయణ గారు .  మీ పిల్లలకి కావాల్సిన తాయిలాలు తప్పకుండా యివ్వవలసినవే ! ఒకరికి "అమ్మ" మరొకరికి " ఆకురాలు కాలం" .  మీ హాబీని  కొనసాగిస్తూ  మీ పిల్లలు  తెలుగు బాష లోని మొదటి రెండక్షరాలతో పుస్తకాలని యెన్నుకున్నారు మరి.  చాలా  సంతోషకరమైన విషయం అంటూ బిల్ రాస్తూ మీకు  20% డిస్కౌంట్ యిస్తున్నాము. మీలా అందరూ పిల్లలకి యిలాంటి తాయిలాలని యిస్తూనే  వుండాలి. మేము ప్రచురిస్తూనూ వుండాలి అన్నాడు షాపు యజమాని. 

మాలాగా  చదువుతూనూ వుండాలి  అన్నారు వాసు,చిన్న చేతి బొటను వేలిని పైకి లేపి వూపి చూపుతూ.  .     


2, మే 2013, గురువారం

ఆశల సముద్రం



బాల్యం బాగుంటాదని ఎవరన్నారు

ఎంత చేదుగుంటతో

మా పిల్లకాయలని అడిగితే ఎరుకవుతాది

మా కాడ నుండి మీకావాల్సిన బాల్యాన్ని

అరువు తీసుకుంటారా ఎవరయినా

అమ్మిని నేను చెపుతుండా

అట్టాగే ... అబ్బయ్య నడిగి తే ఇట్టా అంటాడు

ఓ సారి మాపాలి  చూడండి

కసువూడ్చి.. కళ్ళా పిజల్లి

ఎనుకగన్న పిల్లకి

మరో తల్లినై సాకుతూనే ఉంటా ..

అంట్ల గిన్నెలు తోముతూ

కూడుకూర వండుతూ

చదువుసందెలు లేక

బండచాకిరి చేసిన..

అమ్మ అయ్యకి..బండ నయ్యారంటిరి.

పైసలకాస పడి..

కసుకాయని కోసి పండబెడితే..

ఆలిని అయ్యానో..

పైసల బేరంలో..లొల్లి నయ్యానో..

ఆశలే కాదు బతుకుకి రోసేసిన ఆడపిల్లని..

పశువుల కొట్లంకడ

మట్టి తట్టలేత్తే కడ

టకరాలు మోసే కాడ,,

మెరక చేను కాడ

మడి దున్నే కాడో

బల్లలు తుడిచే కాడో

ఈడ ఆడని కాదు..

ఏదైనా ఎక్కడైనా..

మా ఉనికి..ఉండనే..ఉంటాది..

అయ్య చెయ్యట్టుకుని ..

బడికిపోవాలనో

ఆసామి కొడుకులా..

అచ్చరాలు దిద్దుకోవాలని ఆశ.

నా..ఈ ఊసులన్ని

పైకి చెప్పినా  చెప్ప లేకున్నా..

నేను బర్రె తోకట్టుకుని..

చెరువు నీళ్ళల్లో.. ఈదుతూనే..ఉండాల.

ఆశల సముద్రపు..నీళ్ళల్లో.. ఈదలేనని.

బాబ్బాబు...  మా బాల్యాన్ని తీసుకోండి కాస్త

ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిల గిల కొట్టుకుంటున్న

మా బాల్యాన్ని దొంగల్లా ఎత్తుకుని పొండి.

మీ నాజూకైన లోకంలోకి గిరాటేయండి





ఇది నా తొలి కవిత దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం (యదాతథం గా  )