6, అక్టోబర్ 2025, సోమవారం

హృదయానికి దగ్గర దారి




హృదయానికి దగ్గర దారి

రాజప్రాసాదం పై చంద్రుడు వడివడిగా ఊరేగుతున్నాడు.

 కోటగోడలపై నుండి అంతఃపురం లోని 27గురు రాచకన్యలు 

కోట గుమ్మాలకు ఆనుకుని ఘడియలు లెక్కెట్టుకుంటున్నారు. 

జంట చకోర పక్షులు వెన్నెలను తాగుతూ  విహరిస్తూ ఉన్నాయి 

 మతిస్థిమితం కోల్పోయిన  విరహిణిలు కొందరు 

లాంతరు చేత ధరించి పతిని వెతుక్కుంటూ బయలుదేరితే 

మరికొందరు బాట వెంబడి కాపుగాసారు 

ఎవరికివారు తమ కౌగిలిలో బంధించాలని. 

రోహిణి  మాత్రం తన ప్రేమనంతా వెన్నెలగా జేసి 

పతి  కార్యంలో  తాను పాలు పంచుకుని శరత్పూర్ణిమని

మరింత శోభాయమానంగా మార్చింది. 

పతి హృదయానికి దగ్గర దారి  కనిపెట్టి.

తత్పూర్వ సూర్యోదయమే

పతి ఇష్టసఖి చెట్టాపట్టాలేసుకుని 

నిశీధి గృహానికి తరలిపోయారు.

కలవరమాయే మదిలో

ఇటీవల రాసిన 3 కథల్లో మొదటి కథ చదవండీ..

 కలవరమాయే మదిలో    - వనజ తాతినేని.(ప్రజాశక్తి స్నేహ ఆదివారం సంచికలో 05/10/2025 న ప్రచురింపబడిన కథ)


ఎలా వున్నావు ! చూడాలనిపిస్తుంది. ఎంత కాలం స్టేటస్ అప్డేట్ ల్లో చూసుకుని కొండంత అండ ఏనుగంత బలం అనుకుందాం? ఒక్కసారి వచ్చిపో.. 


నిద్ర రావడంలేదు.పుస్తకం చేతుల్లో పట్టుకుని మోసే ఓపిక లేదు, స్క్రీన్ కి కళ్ళు వొప్పగించడమే. వృద్దాప్యం ముంచుకొచ్చే సూచన నిద్ర తగ్గిపోవడం అనుకుంటున్నా కానీ ముఖ్య కారణం మాత్రం స్క్రీన్ టైమ్. ఏం చేయను మరి!?  గతకాలపు చేదు తీపి జ్ఞాపకాలతో వర్తమానం యెలా వుంటుందో తెలియని అయోమయంలో యీ రోజు  నిరాశగా గడుస్తుంది. ప్రతిరోజూ ఇలాగే గడుస్తుంది. ఏ ఆలోచనలు లేని ఖాళీ బుర్ర. ఇంకేం చెప్పను!? 


నీకో సంగతి చెప్పనా! నవ్వకూడదు, అందం యెంత తగ్గిందో అని కాదు కానీ యెలా వున్నానో చూసుకోవాలని అద్దం చేత్తో పట్టుకున్నాను.  ఎడమ కనుబొమ లో తెల్ల వెంట్రుక చూసి ఉల్కిపాటు. ఎందుకో మనసు అంగీకరించడం లేదు వయస్సై పోతుందని. నా వయస్సు ఇరవై యెనిమిది దగ్గర ఆగిపోయి ఇరవై యేళ్ళైంది. నా మనస్సేమో నిండు యవ్వనంతో జీవన లాలసతో కొట్టుమిట్టాడుతుంది. ఏదో చేయాలని ఆశ, చేయలేని అసక్తత. కొన్ని జన్మలింతే! 


“ఇంకేం కావాలి నీకు? భర్త లేకపోయినా సమర్ధవంతంగానెట్టుకొచ్చావ్!   పిల్లలిద్దరూ చక్కగా సెటిల్ అయ్యారు. వాళ్ళను చూసుకుంటూ “కృష్ణ రామ”  అనుకుంటూ   గడిపేయడమే!” అని చెప్పే హితోక్తులు ఇనుప సంకెళ్ళే!.  వీళ్ళకూ వాళ్ళకు  చెప్పానా నాకేం కావాలో! నా మనసులో ఏముందో యెవరికైనా చెప్పానా!? కనీసం నీకైనా!  Freedom is the ultimate luxury.  దాన్ని కాపాడుకోవడం విజ్ఞత.  సదా ఆ పనిలోనే వుంటాను కదా! ఎవరికో సంజాయిషీలు యెందుకివ్వాలి?. 


“ఒక్కసారి వచ్చిపో!  కళ్ళ నిండుగా నిన్ను చూసుకోవాలి.  నా జీవితకాల ప్రేమికుడా! వస్తావుగా! ఎదురు చూస్తూ వుంటాను “ సెండ్ ఆప్షన్ నొక్కుతూ వుండగా నిస్త్రాణంగా కళ్ళు మూతలు పడ్డాయి.


*******************


కాలింగ్ బెల్ మోగింది. అతనే అయి వుంటాడు. చీర సర్దుకొని ఉత్సాహం కొని తెచ్చుకుని తలుపు తీసాను. కళ్ళనిండుగా కనిపించాడు. లోపలికి ఆహ్వానించా. ఏవో కానుకలు తెచ్చాడు. అతిథి మర్యాదలు చేయబోయి ఓపికలేక కూర్చుండి పోయా.


ఎలా వున్నావ్! గుండెను చీల్చి గుండె పెట్టినట్లు వుంది పలకరింపు.


సమాధానం బదులు దుఃఖం ముంచుకొచ్చింది. అతను చేతులు చాచాడు. ఒక్క ఉదుటున అతని హృదయం పై తలవాల్చి వెక్కి వెక్కి యేడ్చింది.బేలగా యేడ్చింది. ఘనీభవించిన దుఃఖం అంతా కరిగి నీరై కాల్వలు కట్టేలా యేడ్చింది. హృదయంలోని భారమంతా తీరిపోయేలా యేడ్చింది. ఆ అరగంటసేపు అతను యేమీ మాట్లాడకుండా  వెన్ను సవరిస్తూ తల నిమురుతూ సాంత్వన కలిగించాడు. 


 హేయ్ పిచ్చీ! ఇది నువ్వే నా అసలు ? ఏమిటీ బేలతనం. మరీ ఆరోగ్యం బావుండలేదా ఏమిటీ?  సోఫాలో కూర్చోబెట్టి పక్కనే కూర్చుని చేయి అందుకున్నాడు. జ్వరం కూడా  బాగా వుందే అనుకుంటూ నుదుటిని కూడా తాకి చూసాడు. 


 డైనింగ్ టేబుల్ పైన పెట్టిన టాబ్లెట్స్ ని పట్టి పట్టి చూసి..జ్వరానికి వేసుకునే టాబ్లెట్ తీసుకుని నీళ్ల సీసా కోసం వెతికాడు.అతనికి ఈ ఇల్లు కొత్త. వంటిల్లు ఏదో వెతుక్కొని సీసాలో నీళ్ళు నింపి తెచ్చాడు. 


ముందు ఈ టాబ్లెట్ వేసుకో.. కొద్దిగా ప్రెష్ అయితే హాస్పిటల్ కి వెళదాం. బుద్దిమంతురాలిలా మందు వేసుకున్నాను. స్వయంగా కాఫీ కలిపి తాగించాడు. అందని చోట వచ్చిన భుజం నొప్పికి మందు రాసాడు.బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. కాళ్ళనొప్పులకు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేశాడు. జ్వరం తగ్గేవరకు  నా తల తన ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. నేను స్నానానికి వెళితే పక్క శుభ్రం చేసి బెడ్ షీట్ పిల్లో కవర్లు మార్చాడు. సూప్ చేసి తాగించాడు. ఇంకో డోస్ మందు వేసి పడుకోబెట్టి తాను తెచ్చిన లిల్లీ పూలగుత్తులను ప్లవర్ వాజ్ లో అమర్చాడు. గదంతా సన్నటి పరిమళాలు వెదజల్లుతూ ఉండగా నేను నిద్ర లోకి జారుకున్నాను.


ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయేమో కాళ్ళు చేతులు వేళ్ళు విరుచుకుంటూ మూలుగుతూ వుంటే. కాళ్ళు చేతులు నొక్కుతూ వుండిపోయాడు. రెండు గంటల తర్వాత  జ్వరం తగ్గింది.  యాపిల్ ముక్కలు తినిపించి దుప్పటి కప్పి  వెళ్ళడానికన్నట్టు  లేచాడు. చప్పుడుతో  కళ్ళు తెరిచి చూసి . దగ్గరగా రమ్మని చేతులు చాచాను. అతను నా చేతుల్లో వాలిపోయాడు. పన్నీరా కన్నీరా తేడా తెలియలేదు ఇద్దరికీ. అతని స్పర్శ లోని ప్రేమ నిండిన తడి నన్ను చల్లబరుస్తుంది. ఉద్వేగంతో వొణికిపోతున్నాను. కళ్ళు తెరిచి చూస్తే..అతను సముద్రపు అలలా నను  ముంచేస్తున్నాడు. నేను నదిలా కరిగిపోతున్నాను కలిసిపోతున్నాను. సహజంగా అతను తనలోకి లాక్కుంటున్నాడు. ఉధృతి తగ్గి వేగంగా వచ్చిన అల నెమ్మదిగా వెనక్కి మళ్ళిపోతుంది. ఆ అల నన్నూ లోపలికి లాక్కెళుతుంది.మెల్లగా చల్లగా లోతుగా. ఎంత హాయిగా వుందీ సముద్రం. ఇది చాలు.. ఇది చాలు అనుకుంటూ.. సుఖానుభూతితో కూడిన మైకంలో మునిగి పోయాను..


శబ్దాలేవో వినబడుతున్నాయి.  కళ్ళు తెరిచి చూస్తే  చుట్టూ వెలుగు. సముద్రంలో నుండి మర్మైడ్ లేచినట్లు తేలికగా లేవబోయాను. బెడ్ పై కూలబడి పోయి అయోమయంగా చూసాను. మరికొద్ది సేపటికి తెప్పరిల్లాను. నేను కలలో నుంచి మేల్కొన్నానని అర్థమైంది.  నిరాశ నిండిన నోటి వెంట పావురం మూలుగు లాంటి శబ్దం వెలువడింది. బెడ్ పై మళ్ళీ కూలబడ్డాను.

ఎందుకీ కల!?  తెగ కలవర పడిపోయాను. తీరని లోపలి వాంఛలే కలలు అన్నాడు ఫ్రాయిడ్.

నిజమేనేమో! 


నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది

మోహాలేవో మోసులు వేసి ఊహాగానము చేసే

కలవరమాయే మదిలో నా మదిలో


***********************


చిలక పలుకుల కాలింగ్ బెల్ మోగుతుంది. ఒకటి, రెండూ, మూడు, నాలుగుసార్లు. ఓపిక చేసుకుని అతి కష్టం మీద తలుపు తెరిచింది. ఇంటి యజమాని తో పాటు అతను. 


నీరసం మగత నిండిన నా కళ్ళల్లో ఆశ్చర్యం.


“నువ్వు రమ్మని పిలిస్తే రాకుండా వుంటానా” కళ్ళతోనే అతని జవాబు. 


ఎవరితను? అన్న ప్రశ్నతో పాటు ఇంటి యజమాని అనుమానపు చూపు. 


“మా బంధువులే లెండి” అతను లోపలికి రాగానే గ్రిల్ గేట్ మూసింది. తన అనుమానపు ఆసక్తి చూపులతో మా ఇరువురిని కలిపి కడిగేసి మళ్ళొకసారి జాడించడానికి వస్తానన్నట్టుగా చూసి అయిష్టంగా లిఫ్ట్ వైపు నడిచాడు ఇంటి యజమాని. 


“ఎలా వున్నారు!? ఒంట్లో బాగోలేదనిపించింది. వెంటనే వచ్చేసాను”  ఏ మాత్రం మర్యాద హద్దులు దాటని పురుషోత్తముడి పలకరింపు. 


“ఊ.. పర్వాలేదు” 


అతిథి సత్కారాలు అవసరం లేని మనిషి అయిపోయాడు క్షణంలో. చేయందుకున్నాడు తన రెండవ చేతిని  కలిసిన ఆ కరచాలనం పై  వుంచి ఏదో తెలియని భద్రత భరోసాన్ని కలిగించాడు. నుదుటిపై చేయి వేసి జ్వర తీవ్రత ను లెక్కించాడు. 


“ఎన్ని రోజుల నుండి యిలా?  హాస్పిటల్ కి వెళ్ళలేదా?” 


“ చిన్న జ్వరమే, బ్లడ్ టెస్ట్ కి ఇచ్చాను. వచ్చాక వెళ్తానులే “ 


‘’ చిన్నవే అని కొట్టి పడేయటం నీకలవాటు” 


వెలుపలి ద్వారం వద్ద మళ్ళీ అలికిడి. అతనే వెళ్ళి చూసాడు. ఈ సారి ఇంటి యజమానురాలు. 


‘’ చుట్టాలొచ్చారుగా, పాలు వున్నాయో లేవో నని వచ్చాను’’


“ప్రిడ్జ్ లో రెండు మూడు పేకెట్ లు వున్నాయండీ. వద్దులెండి’’


“అదేలే, ఇన్నేళ్ళలో యెప్పుడూ రాని కొత్త చుట్టం లా వున్నాడు ఈయన అని మా ఆయన చెపితే, ఎవరో అని చూసి పోవడానికి వచ్చాను’’ 


చూసావు కదా! నా పరిస్థితి  అన్నట్టు చూసాను అతని వైపు. 


అతను యే వరుస బంధువో అసలు బంధువో కాదో తెలుసుకుని తీరాలన్నట్లు అక్కడే తచ్చాడుతూ.. ‘’ అంత మరీ బాగోకపోతే మీ అక్క కో అన్నయ్య కో ఫోన్ చెయ్యక పోయారా, లేకపోతే రమ్మంటే నేనైనా తోడు వచ్చేదాన్ని హాస్పిటల్ కి” 


“ చేసానండీ, అన్నయ్య కాసేపట్లో వస్తానన్నాడు “ అని చెప్పాక కానీ ఆమె కదల్లేదు. 


‘’ రక్షణ వ్యవస్థ పటిష్టంగా వుంది” నవ్వాడతను. 


“మరేమనుకున్నావు” తోడుగా నవ్వింది.


అతని వైపు దీర్ఘంగా చూసింది. ఇది చాలు అన్నట్టు చూసింది. కృతజ్ఞతగా చూసింది. ఇంకేం లేదన్నట్టూ చూసింది. 


అతను లేచి నిలబడ్డాడు. వస్తాను అన్నట్టు కళ్ళల్లోకి  చూసి చేతిని అందుకుని రెండు హస్తాల మధ్య మృదువుగా బిగించి వదల్లేక వొదిలాడు.  రాత్రి తాలూకు కల గుర్తొచ్చింది. కలవరపడింది.అతన్ని కాసేపు వుండు అని అనకుండా త్వరితంగా లిఫ్ట్ వరకూ వచ్చి వీడ్కోలు పలికింది. 


తీరా అతనెళ్ళాక నా  ప్రాణం అతను తీసుకుపోయినట్లు  నిస్సత్తువుగా బరువుగా అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చి ద్వారం తలుపులు మూసి   బోల్టు బిగించి తలుపుకి ఆనుకుని నిలబడి.. “అసలెందుకు అడిగానూ అతన్ని, ఒక్కసారి వచ్చిపో! “అని  ప్రశ్నించుకుంది. 


ఊగిసలాడకె మనసా! నువ్వు ఉబలాట పడకే మనసా! SP శైలజ గొంతు యేళ్ళ తరబడి  నరనరాన ప్రవహించే నెత్తుటి చుక్కలో కలిసిపోయి నాట్యం చేస్తుంది. అర్ధం లేని అనుమానం యేదో పీడిస్తూ అతన్ని దూరం పెడుతుంది. మళ్ళీ కావాలనుకుంటుంది. ఊగిసలాడే మనసు తీరని ఆశను పట్టుకుని వేలాడే మూర్ఖురాలు.

 

చుట్టూరా వెరపు లేని సహజీవనం కాలం నడుస్తోంది. వంటరైన వృద్దుల వివాహాలు జరుగుతున్నాయి. నాకు మాత్రం మనసైన స్నేహితుడు  ఇంటికొచ్చి వొక అరగంట గడిపే వీల్లేదు. అయినవాళ్ళ  పరాయివాళ్ళ మోరల్ పోలీసింగ్. కన్నీరు ముంచుకొచ్చింది. అనారోగ్యంగా వున్న తను ఓ ఆత్మీయ స్పర్శ కోరుకోవడం తప్పెలా అవుతుంది?  . 


ఎవరికి ఎవరు సొంతమూ ఎంతవరకీ బంధం!? తెప్పరిల్లింది. మనస్సు దృఢం చేసుకోవాలనుకుంది.  


భారంగా..ఓ నిట్టూర్పు విడిచి కూతురి పురిటికి హాస్పిటల్ కి వెళ్లడానికన్నట్టు సదా  సిద్ధమై వుండే తల్లి లా యెప్పుడూ సిద్ధంగా వుంచుకునే  బేగ్ ని తీసి బయట పడేసి స్నానానికి వెళ్ళింది. 


హాస్పిటల్ ఫైల్ తీసుకుని డెబిట్ క్రెడిట్ కార్డ్ లు పెట్టుకుని  ఫోన్ చూసుకుంటూ బేగ్ తీసుకుని  లిఫ్ట్ వద్దకు వచ్చింది.ఫస్ట్ ప్లోర్ నుండి పైకి వచ్చిన ఇంటి యజమానురాలు. ఆమె ప్రశ్నలకు తావివ్వకుండా..


“హాస్పిటల్ కి వెళుతున్నాను. మా వాళ్ళు యెవరైనా వస్తే క్యూర్ హాస్పిటల్ కి రమ్మని చెప్పండి”  


బుక్ చేసిన ఆటో కోసం ఎదురుచూస్తూ వాట్సాప్ మెసేజ్ లు చూసుకుంటూ.. భృకుటి ముడిచింది.


“ఆటో రావడం ఆలస్యం అవుతుందేమో!  హాస్పిటల్ దగ్గర నన్ను దించమంటారా?” వెనుక వాచ్ డాగ్ లా నిలబడి వున్న ఇంటి యజమాని. 


కాచుక్కూచుని వుంటాడు అంట్ల వెధవ! మనసులో తిట్టుకుని..

“ వద్దండీ, ఆటో వచ్చేస్తుంది. అన్నట్టు మీ అమ్మాయి ఇంట్లోనే వుందా?” 


అదేం ప్రశ్న?  అయినా మా అమ్మాయి సంగతి మీకెందుకన్నట్టు చూసి.. “ఇప్పుడెందుకు ఇంట్లో వుంటుంది కాలేజ్ కి వెళ్ళింది” అన్నాడు దబాయింపుగా. 


“ ఏం లేదు, రాత్రి నాకు తాను వున్న లొకేషన్ షేర్ చేసింది. ఎక్కడో సిటీకి దూరంగా వుంది అది. ఆ మెసేజ్ యిప్పుడే చూసాన్నేను. ఇంటికి వచ్చిందా లేదా ఏదైనా ప్రమాదంలో వుందేమోనని చెపుతున్నా” 


ఇంట్లోకి పరిగెత్తాడు. వెంటనే భార్యతో పాటు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆమె కూతురు పెట్టిన మెసేజ్ చూపించమని అడిగింది. ఆయన  చెప్పలేని భాష లో  భార్యనూ,  కూతుర్ని తిడుతూ వుండగా.. ఆటో వచ్చింది. ఎక్కుతూ అంది.


 “ఇరుగు పొరుగు కదలికలపై చూపే శ్రద్ధ, యెవరింటికి యెవరొచ్చారో,  యెవరు -యెక్కడికి వెళుతున్నారో తెలుసుకోవడం మానేసి  మీ  గూఢచర్యం మీ పిల్లల పై పెట్టండి.వాళ్ళు కనీసం సేఫ్ గా నైనా వుంటారు. అన్నట్టు మీ అమ్మాయి పంపిన మెసేజ్ మీకు ఫార్వార్డ్ చేసాను. ఇక పై నన్ను విసిగించకండి”  ఏళ్ళ తరబడి భరించిన చిరాకు మొహమాటం ఆ క్షణంలో బద్దలైంది.  


ఆటో ఆగేటప్పటికే  అప్పటికే సిద్దంగా వున్న నర్స్ బేగ్ అందుకుంది. మరో నర్స్ మళ్ళీ బాగా వత్తిడికి గురయ్యారా? ఆస్ధమా ఎటాక్ చేసింది?” అని ఆరా తీసింది బిపి పరీక్షిస్తూ.


“లేదు, ఒక వారం రోజులైనా మీతో సేవ చేయించుకోవడానికి మనసైంది”అన్నాను.


జాలిగా చూస్తూ.. “రూమ్ సిద్ధం చేయమంటారా?”


“ఊ” 


వరుసలో నిలబడిన మరో పేషంట్  టెంపరేచర్ బిపి చూస్తూ..“పిల్లలేమో విదేశాల్లో,  ఈమె పుట్టింటికి వచ్చినట్లు అప్పుడప్పుడూ యిక్కడికి  వచ్చి నయం చేయించుకుని వెళుతుంది.  


ఇకపై యీ మాటలు వినడం కూడా అలవాటు చేసుకోవాలి కాబోలు అనుకున్నాను. 


ఇదే హాస్పిటల్ లో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సరస్వతి నా  స్నేహితురాలు.

నన్ను చూడగానే “ఏమిటీ అవతారం! బాగోకపోతే వెంటనే రావు. మానసిక ఒత్తిడి కారణంగా కూడా ఆస్త్మా పెరుగుతుంది అని చెప్పాను కదా!” అంటూ ఆక్సిజన్ పెట్టమని తొందర చేసింది.సీనియర్ పల్మనాలజిస్ట్ ని పిలిపించి చూపించింది. మందులు తెప్పించి  ప్రత్యేకంగా నర్స్ నియమించి. రౌండ్స్ కి వెళ్ళిపోయింది. ఓ పి ముగిసిన తరువాత వచ్చి పక్కనే కూర్చుంది.మూడు గంటల పాటు ఆక్సిజన్ అందిన తర్వాత తెరిపి గా ఉంది ప్రాణం. 

 

“ ఏం ఆలోచిస్తున్నావ్! ఇంకా పిల్లలు, బంధువులు గురించేనా!? మనసు విప్పి చెప్పవే! మా తల్లి వి కదూ!  లాలనగా అడిగింది. 


సైగ చేసాను.  రాసి చూపిస్తానని. పెన్, పేపర్ అందించింది సరస్వతి. 


“సరూ! నా భర్త చనిపోయాక నన్ను నేను చాలా  కుదించుకున్నాను. బిరడాలో బిగించుకున్నాను. ఎవరితోనైనా అదీ అభిరుచులు  కలిసిన వాళ్ళతో నైనా ఎక్కువ  మాట్లాడితే  అది స్నేహమే అయినా కూడా తప్పే అయింది. లోకుల అవాకులు చెవాకులు బిడ్డల చెవిన పడకూడదు అని. 

సత్యమేమిటో తెలియజాలని బిడ్డల మనసు కల్లోల సముద్రంగా మారుతుంది అని. అయినా అపవాదు కాటు నుండి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడేమో పిల్లలు దూరంగా. నన్నేమో ఒంటరితనం అభద్రతాభావం రాకాసి లా చుట్టేస్తోంది. నేనేం చేయను? 


చదివిన సరస్వతి తలెత్తి చూసింది. 


అపరాధి లా తలొంచుకున్న నన్ను చూసి జాలిపడింది. 


“ఇంకా నీ మనసులో ఏదో ఉందే! అది కూడా చెప్పు!  నేను తెలుసుకుని తీరాలి.”


“ఏం లేదు.” తల అడ్డంగా ఊపింది. 


ఊహూ! . చెప్పాల్సిందే! మొండి పట్టు పట్టింది.


కొంచెం రిలాక్స్ గా కూర్చుని హాస్పిటల్ ఫైల్ వొత్తుగా పెట్టుకుని మనస్సంతా అక్షరాల్లో కూర్చింది.. 


“చెవి ఒకటి ఒగ్గి నా హృదయ ఘోష ని  వినేవాడు 

గడ్డకట్టిన మౌనాన్ని చూపుల విల్లంబుతో చేదించినవాడు 

అనివార్య అవసరాల్లో తోడుగా నిలిచినవాడు. 

నా చెవి లోపలి చెవి నా లోపలి స్వరం అతను. 

అతని సమక్షంలో నేను అన్నీ మర్చిపోతాను. 

పసిపాపలా మారిపోతాను. 

అతను కావాలని నాకు  బలంగా అనిపిస్తుంది. 

ఫిజికల్ నీడ్ కాదు, అచ్చంగా కూడా కాదు.

అప్పుడప్పుడు మాత్రమే! మనస్సు దాహంతో అలమటిస్తుంది.

అది ప్రేమ దాహార్తి.  


ప్చ్ !  కానీ అది యెన్నటికీ సాధ్యం కాదు సరూ!  


“ఎందుకు సాధ్యం కాదు,అతనితో నేను మాట్లాడనా! డాక్టర్ గా మాట్లాడతాను” 


 “వద్దులే, వదిలేయ్”. 


“అతనెవరో నాకైనా చెప్పవా మరి.”


 “ ఊహూ! చెప్పను,  


బలవంతం చేయలేదు సరస్వతి. “ ప్రశాంతంగా వుండు, మళ్ళీ రాత్రి కి ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తాన్లే!”  


వెనుక నుండి స్నేహితురాలిని చూస్తూ మనసులో మూగగా అనుకున్నాను. “సరూ! అతను నీ భర్త సాగర్  అని నీకెలా చెప్పనూ?” నో నెవ్వర్!! ఇంకోసారి నీతో యుద్ధం చేయలేను. నేను అనేక రకాలుగా నీకన్నా బలహీనురాలిని. 


కానీ ఒకటి మాత్రం నిజం. నా జీవితానికి మాత్రం నిన్న రాత్రి వచ్చిన కల చాలు!  

కలలు కాఫీ లాంటివి. జీవితానికి stress buster 

కల వరమాయె మదిలో నా మదిలో. హమ్ చేస్తున్నాను.


రాత్రి ఎనిమిదిన్నరకి  సరస్వతి  వచ్చింది.  వేడి వేడి ఇడ్లీ తక్కువ కారం తో స్వయంగా తినిపించింది. వెళ్ళబోతూ మళ్లీ అడిగింది. “ఎవరే అతనూ.. చెప్పవూ! . 


తల అడ్డంగా ఊపాను. 


“కొంపదీసి అతను మా ఆయన కాదు కదా! రెండో ఇన్నింగ్స్ లో కూడా మా ఆయన్నే ప్రేమించానని చెప్పేవనుకో.. అస్సలూరుకోను. ఫ్రెండ్ వని కూడా చూడకుండా ఏ ఇంజెక్షెనో యిచ్చి చంపేస్తాను.’’ బెదిరించింది. పిడుగు పడినట్లుగా చూస్తున్న నాతో  “ఆయనే కావాలని ఎంతో కష్టపడి పోటీపడి డాక్టర్ ని  అయ్యాను. ఆయన కుటుంబానికి  బోలెడంత యెదురిచ్చి ఆయన్ని  దక్కించుకున్నాను మరి.”  నవ్వుతూనే మాటలంటించింది.  


గతుక్కుమన్నాను. నల్లబడిన నా ముఖం కనిపెట్టకుండా చేయి అడ్డం పెట్టుకుని రాని దగ్గు దగ్గాను.

తనకు కావాల్సిన దాని కోసం యెంతకైనా తెగించే సరస్వతి ని నేను మర్చిపోతే కదా! మా తొలివలపుల  తెప్పను నిర్ధాక్షిణ్యంగా  ముంచేసి  సాగర్ ని తన బోట్ లోకి లాక్కోవడం ఆమె నాకు చేసిన అన్యాయం కాదూ! సాగర్ కి  ఆ సంగతి బాగా తెలుసు. ఇంకెప్పుడూ.. నావైపు నుండి అతనికి   “ఒక్కసారి వచ్చిపో” అన్నమాట జారకుండా గుండెను ఇనుప గుండెగా మార్చుకోవాలి. ఇనుప గుండెకు ఏ రక్షణ కవచం అవసరం లేదు ఏ తూటా గాయపర్చలేదు. మహా అయితే తుప్పు పట్టి శిథిలం కాగలదు.  


………………………………0……………………………..……










 

4, అక్టోబర్ 2025, శనివారం

మధ్యాహ్న భోజనం

 మళయాళంలో  కారూర్ నీలకంఠ పిళ్ళై రాసిన కథకు  LR స్వామి గారు తెలుగు అనువాదం చేసారు. ఇలాంటి మంచి కథను ఆడియో బుక్ గా చేసాను. తప్పకుండా వినండీ.