ఎందరో తత్వవేత్తలున్న భారత భూమి సంస్కృతీ సాంప్రదాయాలకు పేరెన్నికగన్నది. అనాదిగా మనదేశంలో భౌతిక విలువలకంటే భౌద్ధిక విలువలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము. ప్రపంచంలోనే మన సంస్కృతి ఔన్నత్యానికి అత్యంత విలువ ఉంది. నాటి వివేకానందుని బోధనలనుండి నేటివరకూ మన సంస్కృతీ సాంప్రదాయాలను విదేశస్తులు మెచ్చుకుంటుంటే మన యువత విదేశీ మోజుతో ఆ గొప్పతనాన్ని తూలనాడడం బాధాకరం. బిజీ గజిబిజి జీవన విధానంలో పడి తల్లిదండ్రులు సైతం వాటిని పిల్లలకు నేర్పే పనిని అవసరమైనంత శ్రద్ధ, బాధ్యతతో చేయడం లేదనిపిస్తోంది. అన్నింటా డబ్బుకే ప్రాధాన్యం పెరగడంతో విలువలు తగ్గిపోతున్నాయి. నేటికీ గ్రామీణ ప్రాంతాలలో అయినా, పట్టణాలలో అయినా చాలా వరకూ తల్లులే ఆ బాధ్యతను కొంతమేరకు నెరవేరుస్తున్నారు. విద్యావ్యవస్థలో, కుటుంబంలో మన సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నం అందరూ చేయాలి. దిగజారిపోతున్న మన ఉన్నత విలువలను నిలబెట్టుకోవలసిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది. స్వయంగా జాతిపిత గాంధీజియే చెప్పారు తన పై చిన్నప్పుడు తన తల్లి చెప్పిన నీతి కథలు బాగా పని చేశాయని. తల్లిదండ్రులను కావడిలో పెట్టి మోసిన శ్రావణకుమారుని కథ తన జీవితంపై ప్రభావం చూపిందని గాంధీజీ అనేవారంటే చిన్నప్పటినుండే పిల్లలపెంపకంలో సంస్కృతీ సాంప్రదాయాల ప్రభావం ఎలా ఉంటుందో గమనించవచ్చు.
ప్రస్తుత కాలంలో ఏ కుటుంబంలోనైనా సంప్రదాయం బ్రతికి ఉందంటే దానికి కారణం మహిళలే! మూడొంతుల సంప్రదాయాన్ని తమ భుజస్కంధాలపై ఇష్టంగానో బలవంతంగానో మోసేది స్త్రీలు. నేటికీ గ్రామీణ ప్రాంతాలతో సహా చూసినా మహిళలే మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడడంలో, పిల్లలకు నేర్పడంలో మేలైన పాత్రను నిర్వహిస్తున్నారు. సమాజమంతా ఈ పాత్రను పోషించాలి. విద్యావిధానంలో కూడా మన సంస్కృతిలోని ఔన్నత్యాన్ని చిన్నతనం నుండే పిల్లలకు అలవడే విధంగా పాఠ్యాంశాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని ఆచారవ్యవహారాలూ తరతరాలుగా మనని అంటిపెట్టుకుని ఉన్నాయంటే కారణం అవి ఇచ్చే శారీరక మానసిక ఆరోగ్యం మాత్రమే కాదు సంప్రదాయాన్ని పాటించడం వల్ల మన ఆహార్యం, నడవడిక హుందాగా ఉండి చూసినవారిలో గౌరవాన్ని పెంపొందిస్తుందని మనకి అనుభవ పూర్వకంగా తెలియడం వల్ల సంప్రదాయాలని ఇంకా పాటిస్తున్నాం.
సదాచారాన్ని తల్లిదండ్రులు ఆచరించడం వల్ల బిడ్డలకి ఎంతో కొంత ఆ సంస్కారం అలవడుతుంది ఆచరణ లోపం ఉన్నా భక్తి భావనలో లోపం ఉండకూడదని మనకి పెద్దలు చెపుతూ ఉంటారు కదా! కానీ నేటి పిల్లలకి మన సంస్కృతీ సంప్రదాయాల పట్ల విముఖత కలుగుతున్నది. వారి జీవన శైలి అంతా .. కేవలం తరగతి గదులకి, పుస్తకాలకే పరిమితం చేయబడటం వల్ల వాళ్ళలో ఆచార వ్యవహారాల పట్ల అనాసక్తి. తల్లిదండ్రులు చెప్పబోయినా వారు వినని పరిస్థితి. అందుకే మన ఆచార వ్యవహారాలలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుని నానాటికి మన సంస్కృతీ సాంప్రదాయం కనుమరుగవుతున్నాయి ..
గతకాలంలో కంటే స్త్రీలలో విద్యావకాశాలు మెరుగవడం, ఉద్యోగ అవకాశం ఉండటం వల్ల అన్నిచోట్లా మార్పులు చోటు చేసుకుంటున్నట్లే గృహజీవనంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి నేటి స్త్రీల ఆలోచనా విధానాలవల్లనే మన సంస్కృతికి సంప్రదాయానికి భంగం వాటిల్లుతుందని అనేవారు ఉన్నారు. ఇంటా బయటా చాకిరి చేసుకుంటున్న మహిళలు కూడా సత్ సంప్రదాయాన్ని పాటిస్తూ కార్తీక స్నానం, తులసి పూజ, ఆకాశ దీప దర్శనం చేసుకుంటున్న వాళ్ళు కొందరైతే బారెడు ప్రోద్దిక్కినా నిద్ర లేవకుండా నిద్ర లేచినా నది నెత్తిన సూర్యుడు వచ్చేటప్పటికి కూడా నైట్ గౌన్ లని మోస్తున్న స్త్రీలు ఉన్నారు. విచిత్ర వస్త్రధారణ చేసుకుని జుట్టు విరబోసుకుని కరాళ నృత్యం చేస్తున్నట్లు ఊగిపోతుండటం, మధుమధ్యపానాల సేవనలో మునిగిపోతుండటాన్ని చూస్తున్నాం. లేదా భక్తి ప్రపత్తులతో మెలగాల్సిన చోట హంగు ఆర్భాటాల ప్రదర్శన ఎక్కువై అదే అసలయిన భక్తి మార్గమని భ్రమలో ఉండేవారిని చూస్తున్నాం
ఇక పురుషుల విషయానికి వస్తే భాద్యతలని విస్మరిస్తున్న పురుషులు ఉన్నారు కారణాలేవైనా ప్రొద్దు గుంకగానే గృహ మార్గం పట్టేవారి సంఖ్యా చాలా తక్కువే! బౌతిక వస్తువుల ప్రలోభానికి లోనయి వేళాపాళా లేని అన్నపానాదులు చేస్తూ, విందు వినోదాలకి, భోగాలాలసకి అధిక ప్రాధాన్యతనిస్తూ, ధనాన్ని సమస్తంగా తలుస్తూ .. దైవం యొక్క ఉనికిని ఆక్షేపిస్తూ పాప పుణ్య మార్గాలని నమ్మకుండా, మత విశ్వాసాలని లెక్క చేయకుండా ఆధునిక జీవన శైలితో జీవన సాగరంలో చుక్కాని లేని నావలా సాగిపోతున్నారనిపిస్తుంది. అశాంతి, అసహనం చోటుచేసుకుని, అభద్రతా భావంలో కళ్ళెం లేని గుర్రంలా పరుగులు పెడుతున్నారు ఇక సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడుకోవడం ఎలా సాధ్యం? ముందు తల్లిదండ్రులు ఆచరించగల్గితే కదా ..మన పిల్లలు మనని అనుసరించగల్గేది.
సాంప్రదాయాన్ని, సదాచారాలని కాదని ఆరోగ్య సూత్రాల కన్నా, శుచి శుభ్రం కన్నా మనకి కావాల్సిన అనుకూలతని ఆపాదించుకుని జీవనాన్ని సాగించడం అలవాటైపోతుంది. దేవతా మూర్తులకి సైతం కుంకుమ అలంకరించం మాని స్టిక్కర్లు అంటించడం, దీపం స్థానే విధ్యుత్ దీపాన్ని ఉంచడం చేస్తున్నారు. గతంలోకన్నా ఇప్పుడు మనకి తెలియని విషయాలు చెప్పేందుకు, తెలుసుకునేందుకు అనేకానేక సౌలభ్యాలున్నాయి మనలో భావ దారిద్ర్యం నెలకొని ఏది మనకి అవసరమో ఏది అనవసరమో తెలుసుకోకుండా లభించిన అవకాశాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉంటున్న టీవి. కార్యక్రమాలని చూస్తూ బద్దకాన్ని పెంచుకుంటున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు సోషియల్ నెట్వర్క్ లలో అధిక సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపపు కబుర్లకి అలవాటు పడిపోతున్నారు. ఇక అక్కడ ఉండే అనేక ప్రలోభాలకి మహిళలు లోనవుతున్నారు. ఈ కాలంలో మహిళల వస్త్రధారణలోను అలంకరణలోను ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆడంబర జీవనంలో కోల్పోతున్నవి తక్కువేమీ కాదు .
ఏ మతాన్ని పాటించని దైవాన్ని విశ్వసించని వారికి కూడా ఆచారవ్యవహారాలు మేలే చేస్తాయి తప్ప ఎలాంటి కీడుని కల్గించవు. విజ్ఞానం,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మనిషికి అత్యంత అవసరమే! ఆధునిక జీవన సరళిలో ఏది బ్రాంతియో ఏది క్రాంతియో తెలుసుకోలేని ఉరుకుల పరుగుల జీవనంలో తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు మన సంస్కృతీ సంప్రదాయాలు విచ్చిన్నం అవుతున్నాయనేది నిజం. అందుకే సంప్రదాయ పరిరక్షణ పేరిట చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీ బోధిస్తున్నారు.
సంస్కృతిని సంప్రదాయాన్ని పాటించకుండా స్త్రీలైనా పురుషులైనా తమని తాము మార్చుకోకుండాను, కుటుంబంలో అందరిని మార్చడానికి ప్రయత్నించకుండానూ ఏ విధమైన ఉత్తమ ఫలితాలని సాధించలేరు కదా! సౌలభ్యం కోసం వస్త్హ్రదారణల, భోజన పద్దతులలో మార్పు అవసరం అయి ఉండవచ్చు. ఆధునికత అంటే మనని మనం కోల్పోవడం ఇతరులని అనుకరించడం కాదు. మనం మనంగానే ఉంటూ ఇతరుల ఆచార వ్యవహారాలని గమనిస్తూ.. వేటిలో మంచి ఎక్కువున్నదో తెలుసుకోవడం మార్పుని ఆమోదయోగ్యంగా మార్చుకోవడంలో అభ్యంతరం లేకపోయినా తరతరాలకి మనం అందించే సంస్కృతీ సంప్రదాయాన్నినిర్లక్ష్యం చేయడం భావ్యం కాదు. సదాచారం పాటించడం, సంస్కృతీ సాంప్రదాయాలని జీవన శైలిలో నిబిడీకృతం చేసుకోవడం ద్వారా మనిషి మనుగడ అర్ధవంతంగా, ఆహ్లాదంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. విచ్చిన్నమవుతున్న సంస్కృతీ సంప్రదాయాల పగ్గాలు స్త్రీ పురుషులిరువురి చేతుల్లోనూ ఉన్నాయి.
ప్రొద్దునే వాకింగ్ ముగించుకుని వచ్చి కారిపోతున్న చెమటని తుడుచుకుంటూ ఇంటిముందు ఇష్టంగా పెచుకున్న పచ్చిక పై పారిజాతం చెట్టుకు ప్రక్కన విశ్రాంతిగా వాలి రాలిపడిన పూల నుండి పరిమళాలను ఇష్టంగా ఆస్వాదిస్తూ అలవాటుగా పేపర్ కోసం వెతికాను
రోజూ అదే సమయానికి సరళ ఒక మంచి నీళ్ళ బాటిల్,ఆ రోజు దినపత్రికలని తీసుకు వచ్చి అక్కడ పెట్టి ఉండేది. ఇంకొక పావు గంట తర్వాత సువాసలు వెదజల్లే కాఫీ కప్పుతో పాటు పోటీపడుతూ "అమ్మ " దేవుడి ముందు వెలిగించిన ఊదొత్తుల పరిమళం కలగలిపి తన నాసికా రంధ్రాలను తాకుతూ హాయిగా అనిపించేవి.
ఈ రోజు పావు గంట దాటినా కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా బయటకి రాలేదు.
"సరళా " అని పిలుస్తూ లోపలకి వెళ్లాను. ఇంటి లోపల ఎక్కడా సరళ కనపడలేదు . ఇంకా నిద్ర లేవలేదా ఏమిటీ? తనకి అనారోగ్యమేమి లేదు కదా ! అనుకుంటూ బెడ్ రూం లోకి వెళ్లి చూసాను . అక్కడ బెడ్ ఖాళీగా ఉంది .
"అమ్మా." . అంటూ పిలుస్తూ క్రిందకొచ్చాను .అమ్మ కనబడలేదు.
అంతలో అనిరుద్ద్ .. వాడి రూం లో నుండి బయటకి వచ్చి .. "నాన్నా! అమ్మా,నానమ్మ ఇద్దరూ రఘు అంకుల్ వాళ్ళింటికి వెళ్ళారు, రఘు అంకుల్ వాళ్ళ అమ్మ అదే తులసమ్మామ్మ చనిపోయారంట . మీరు రాగానే చెప్పమన్నారు, వెంటనే అక్కడికి రమ్మన్నారు " అని చెప్పాడు.
"అరే ! ఎప్పుడు జరిగింది .. ? ఎవరు చెప్పారు ..విషయం కన్ఫర్మ్ గా నీకు తెలుసా అనిరుద్ద్ " .అని అడిగాను
"మీరు అలా వాకింగ్ కి వెళ్ళగానే కాల్ వచ్చింది . తులసమ్మామ్మ ని చూసుకునే హోం నర్స్ కాల్ చేసారు. అమ్మ, నానమ్మ వెంటనే వెళ్ళారు . మీరు మొబైల్ తీసుకువెళ్ళలేదు కదా మీకెలా చెప్పాలో తెలియలేదు" అని చెప్పాడు .
"సరే నేనిప్పుడే వెళతాను" అంటూ నా మొబైల్ తీసుకుని సరళ కి కాల్ చేసాను .
"సరళా .. నేను విన్న విషయం నిజమేనా "? ఇంకా నమ్మలేనట్లుగా అడిగాను .
"అవునండీ, మన కాలనీలో డాక్టర్ కూడా వచ్చి చూసారు. ఆవిడ చనిపోయారు" అంది
కొద్ది క్షణాలు మౌనం
నేను రఘు అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను . ఇంకా వాళ్ళ దగ్గర బంధువులందరికీ చెప్పాను మీరు త్వరగా రండి " అంది .
నేను త్వర త్వరగా డ్రస్ మార్చుకుని రఘు కి ISD కాల్ చేసి మాట్లాడుతూనే ఇంటికి చేరుకున్నాను. రఘు చెపుతున్నాడు "నేను సండే కి కాని రాలేను కృష్ణా ! మళ్ళీ నీకు శ్రమ ఇస్తున్నాను అక్కడ ఏర్పాట్లు అన్నీ నువ్వే చూడాలి ప్లీజ్ !" గొంతులో దుఃఖాన్ని అణుచుకుంటూ చెప్పాడు .
"రఘు ! ఆ విషయం ప్రత్యేకంగా నువ్వు చెప్పాలా ! అన్నీ చూసుకునేందుకు నేనున్నానుగా ! నువ్వేమి వర్రీ అవకు. ముందు టికెట్స్ సంగతి చూసుకో, మళ్ళీ నేను కాల్ చేస్తూనే ఉంటాను ." అని చెపుతూ లోపలకి వచ్చాను. అప్పటికే మా కాలనీ వాసులు కొందరు వచ్చి ఉన్నారు. సరళ పొన్స్ చేస్తూ బిజీ గా కనిపించింది .
మంచం మీదే ప్రాణం పోయింది ఇంకా అలా మంచం మీదే ఉంచారే ! కొందరి ప్రశ్న. "బాక్స్ కోసం ఫోన్ చేసాము అయిదు నిమిషాలలో బాక్స్ వస్తుంది . బాక్స్ లో మార్చుతాం కదా అని అలాగే ఉంచేసామండీ " సరళ చెపుతుంది.
ఇంకొకరు అదే ప్రశ్న వేయకుండా నేను లోపలి నుండి చాప ఒకటి తెచ్చి క్రింద పరచి దానిపై ఒక దుప్పటి పరచి ఇంకో ఇద్దరి సాయం తో తులసమ్మ పిన్ని బౌతికకాయం ని చాప పై పడుకోబెట్టాను . ఆమె ప్రక్కనే నేలమీద చతికిల బడి కూర్చున్నాను . చనిపోయే ముందు కూడా ఆమెలో ఏదో బాధ మొహంపై అలాగే నిలిచిపోయి ఉంది . నా కళ్ళల్లో కన్నీరు జల జలా రాలింది . ఆ చేతులతో కొడుకుతో సమానంగా తినిపించిన ప్రేమ ముద్దలు గుర్తుకు వచ్చాయి జీవితమంతా బాధ పడటానికే దేవుడి దగ్గర అగ్రిమెంట్ రాసుకుని వచ్చి ఉంటుందేమో అన్నట్టుగా ఉండేది. ఆమె ముఖంలో అప్పుడప్పుడు కనిపించే చిన్న చిరునవ్వు మాత్రం కొడుకు కోసమే దాచుకున్నట్లుండేది. గట్టిగా నోరు విప్పి మాట్లాడటం తెలియదు,అందరకి తలలో నాలుకలా ఉండేది తులసమ్మ పిన్ని .
రఘు వాళ్ళ నాన్న నాకే కాదు రఘుకి కూడా అంత బాగా తెలియదు రఘుకి మూడేళ్ళు న్నప్పుడు చనిపోయాడు అంతకు ముందు కూడా ఎప్పుడూ అనారోగ్యంతో మంచంపై ఉండేవాడట రఘు వాళ్ళ నాయనమ్మ ఎప్పుడు తులసమ్మ పిన్నిని తిడుతూ ఉండేదన్నది మాత్రం బాగా జ్ఞాపకం ఉంది .
"నా కొడుకు శుభ్రంగా ఉన్నప్పుడే ఈ ముదనష్టపుది తాళి , బొట్టు గాజులు తీసేసి విధవ ముండ లాగా తయారయింది. పూజ పునస్కారం ఏమిలేకుండా కొంపని కిరస్తానీ కొంప జేసింది. సిరింటదు కాని సీద్రం అబ్బుద్ది అని పెద్దలు ఊరికే అనలేదు . ఈ దేష్ట మొహం చూస్తూ ఉండలేకనే నా కొడుకు చచ్చాడు " అని తిడుతూ ఉండేది.
పుట్టెడు అప్పులు, అత్తా మామలు, ఆదరణ లేని పుట్టిల్లు. పొలం అంతా అప్పుల వాళ్ళు కట్టుకు పోగా నాలుగెకరాల మెట్ట చేను పెట్టుకుని వ్యవసాయంతో ఎదురీదింది. గొడ్ల కాడి పని, నీళ్ళు తోడే పని, చేలో పని ఆ పని ఈ పని మధ్య ఒళ్ళు అరగ దీసుకుని కట్టేలా బండబారి పోయి ఉండేది.
రఘు వాళ్ళిల్లు చెరువు కట్ట ప్రక్కనే మంచి నీళ్ళ బావిని ఆనుకుని ఉండేది . ఊరందరికీ మంచి నీళ్ళ బావి అదే అవడంతో .అందరికి తులసమ్మ పిన్ని పరిచయం ఉండేది ఎవరు మాట్లాడినా క్లుప్తంగా నాలుగు మాటలు మాట్లాడేది ఎక్కువ సమయం బైబిల్ చదువుకుంటూ, ప్రార్ధన చేసుకుంటూ కనబడేది .
మా ఊరి బడి, గుడి, లైబ్రరీ , కోపరేటివ్ బాంక్ అన్నీ ఒకే చోట ఉండేవి. నేను రఘు అక్షరాలు దిద్దుకుంటూ తాయిలాలతో పాటు మనసులో మాట పంచుకుంటూ పదిహేనేళ్ళ పాటు ఇద్దరం కలిసే చదువుకున్నాం. రఘు నాతొ పాటు మా ఇంట్లో చొరవగా తిరగడం వల్ల మా ఇంట్లో ఆచారాలు, పూజలు, అమ్మ చేసే వ్రతాలు చూసెళ్ళి "మన ఇంట్లో అలా ఎందుకు చెయ్యం ? వాళ్ళింట్లో దేవుడు గూడు ఉంది మనం అలా దేవుడు గూడు పెట్టుకుందాం పూజ చేసుకుందాం" అని తులసమ్మ పిన్నిని అడిగేవాడు .
నేను రఘు పక్కనే ఉండేవాడిని కాబట్టి తులసమ్మ పిన్ని ఏం చెపుతుందా.. అని ఆసక్తిగా చూసేవాడిని
"వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు . మన దేవుడికి అలాంటి పూజలు చెయ్యవసరం లేదు ఇదిగో ఈ బైబిల్ చదువుకుని ప్రార్దిస్తే చాలు ఈ లోకాలని ఏలే దేవుడు ఆయనొక్కడే . ఆయనే అన్నీ చూసుకుంటాడు" అని చెప్పీది
"అమ్మా! మనం కమ్మ వాళ్ళమే కదా ! "అడిగేవాడు రఘు.
"అవును " అనేది
"అయితే కమ్మ వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామీ, రాముడు,కృష్ణుడు ,శివుడు ఇలాంటి దేవుళ్ళు ఉన్నారు కదా! మన వాళ్ళందరూ శివాలయం కి, రామాలయం కి వెళుతుంటే నువ్వు ఈ బైబిల్, కనబడని దేవుడు మన దేవుడు అంటావేమిటి ? నాయనమ్మ తాతయ్య కూడా రామా కృష్ణా అంటున్నారు. నువ్వే ఏసయ్యే దేవుడంటూ అందరిలాగా ఉండకుండా వేరేగా ఉంటన్నావు ! నాకు నువ్వు నచ్చలేదు, నన్ను అంటుకోబాకు ".అని దూరంగా పారిపోయేవాడు .
తులసమ్మ పిన్ని వాడిని దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించేది వాడు ఇంకా దూరంగా పారిపోతూ "నువ్వు నాకు అమ్మవే అయితే, మనం కమ్మాళ్ళం అయితే ఊరి చివర వాళ్ళు మా దేవుడు అని చెప్పుకునే వాళ్ళ దేవుడిని ప్రార్ధించడం ఆపేయి " అని కోపంగా చెప్పేవాడు . వాడి కోపంలో ద్వేషం ఉండేది .. ఆ ద్వేషం బలీయంగా ఉండటం మూలంగానేమో క్రమం తప్పకుండా ప్రతి రోజూ గుళ్ళోకి వెళ్ళేవాడు . దేవుడుకి దణ్ణం పెట్టుకునేవాడు .
"ఆ తులసమ్మ కిరస్తానీ మతం పుచ్చుకుంటే పుచ్చుకుంది కానీ .. పిల్లడు మాత్రం గుడికి వస్తున్నాడు .. ఏ నీరు ఆ నీరేమ్మటే పారతాయి కాని ఏరే నీళ్ళు కలుస్తాయా ఏమిటీ ?" అనే వారు కొందరు .
ఏడవ తరగతి చదువుతున్నపుడు రఘు కి వాళ్ళ అమ్మ మీద మరింత ద్వేషం పెరిగింది మా వూరి చివర సుదర్శనం మాస్టారు ఉండేవారు . ఆయన స్కూల్ మాస్టర్. అప్పుడప్పుడు విమానం ఎక్కి విదేశాలకి వెళుతూ ఉండేవాడు యేసు క్రీస్తు గురించి ఎప్పుడూ చెపుతూ ఉండేవాడు . రఘు ఆయన్నీ విపరీతంగా ద్వేషించేవాడు. మన మతాన్ని దేవుళ్ళని వదిలేసి యేసు క్రీస్తే ప్రభువని చెప్పడం నాకు నచ్చలేదని ఆయనతో గొడవ పెట్టుకునే వాడు . ఆయన కూతురు భర్త పాస్టర్ గా పనిచేసేవాడు . సువార్త సభలు పెట్టి మైకులు పెట్టి వారమేసి రోజులపాటు ప్రార్ధనలు ,బైబిలు వాక్యాలు , కొత్తగా మతంలోకి చేరిన వారి అనుభవాలు వినిపించే వారు . మా వూరు చిన్నది అవడం వల్ల ఆ సభలు మా చెవుల్లో రొద పెడుతున్నట్లు ఉండేవి . ఆ సభలు కూడా సంక్రాంతి పడక్కి ముందు పెట్టేవాళ్ళు . వెంకటేశ్వర స్వామీ గుళ్ళో వచ్చే సుప్రభాతం, తిరుప్పావై వినబడకుండా .. కర్ణ కఠోరంగా ఆ పాటలు వినాల్సి రావడం రఘు కే కాదు మా వూర్లో చాలా మందికి అసహనంగా ఉండేది ఈ ఊరుని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ పాస్టర్ ని ఈ వూరు నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నారు కూడా . వాళ్ళలా అనుకున్న కొద్దీ ఆ ఫాస్టర్ ఊర్లో నిట్టాడిలా పాతుకు పోయాడు
ఆ పాస్టర్ .. పేద పిల్లలందరిని చేరదీసి వాళ్ళని పనులకి వెళ్ళకుండా బడికి వెళ్లి చదువుకుంటే నెలకి ఒకొక్కరికి 150 రూపాయలు వచ్చే ఏర్పాటు చేస్తానని ఇంటింటికి తిరిగి చెప్పడం మొదలెట్టాడు. 150 రూపాయలు అంటే తక్కువేమీ కాదు మూడు బస్తాల ధాన్యం ధర ఆ డబ్బు మీద ఆశ తో . మా వూర్లో ఊరిచివర వాడలో వాళ్ళే కాదు మా వాళ్ళ పిల్లల పేర్లు కూడా వ్రాయించారు . వాళ్ళందరి పేర్ల మీద బాంక్ అకౌంట్ తెరిపించి ప్రతి నెలా వారి అకౌంట్ లోకే డబ్బులు జమ అయ్యే ఏర్పాటు చేసాడు పాస్టర్ గారు. డబ్బులు ఊరికే ఇప్పిస్తున్నాడు కాబట్టి ఆయన "దేవుడంటి " వారు అయిపోయారు . ఆయన స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేసిన వారిలో "రఘు " కూడా ఉన్నాడు . రఘు వాళ్ళ అమ్మే వాడికి చెప్పకుండా ఆ పని చేసిందని వాడికి బాగా కోపంగా ఉండేది
" పేదాళ్ళకి సాయం చేస్తారు అంటే వాడి చదువుకి ఉపయోగపడతాయని రాయించాను అంత డబ్బు ఎక్కడ నుండి వస్తుంది పంట పండితే పండే లేక పొతే లేయే ! పాడి గొడ్డు మీదే సంసారం నడవాలంటే ఎట్టా జరుగుద్ది " తులసమ్మ పిన్ని మాటల్లోనూ నిజం ఉండేది కాబట్టి మరో మాట మాటాడటానికి అవకాశం ఉండేది కాదు .
సంవత్సరానికి రెండు సార్లయినా రఘు కి తులసమ్మ పిన్నికి పెద్ద వాగ్వివాదమే నడిచేది . సువార్త సభలు పెట్టినప్పుడే విదేశాల నుండి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చేవారు . వారే మా వూర్లో పిల్లలందరికీ ఆర్ధిక సాయం చేస్తున్నవాళ్లని మా ఆంజనేయులు మాస్టారు చెప్పేవాళ్ళు . వాళ్ళు వచ్చినప్పుడల్లా నెలకి 150 రూపాయలు వచ్చే పిల్లలందరినీ హాజరు పరచి వారికి పరిచయం చేసేవారు . అలా పరిచయం చేయడానికి "రఘు " ని కూడా రమ్మనేవారు . ఆ స్కాలర్షిప్ డబ్బులు నాకొద్దు, నేను అక్కడికి రాను అని మొండి పట్టు పట్టేవాడు తప్ప తులసమ్మ పిన్ని ఎంతబతిమలాడినా వెళ్ళేవాడు కాదు . విదేశీ అతిధులు వచ్చిన ప్రతిసారి రఘుకి ఆరోగ్యం బాగోలేదనో .. బంధువుల ఇంటికి వెళ్ళాడనో సాకు చెప్పి వాడికి బదులు తులసమ్మ పిన్నిని చూపేవారు .
తులసమ్మ పిన్ని కూడా అప్పుడప్పుడు చర్చి కి వెళ్ళడం మొదలెట్టింది . రఘు వాళ్ళ నాయనమ్మ,తాతయ్య మేము బ్రతికుండగానే ఇంటావంటా లేని పనులు చేయడం చూస్తున్నాం . మనమేమిటి, మన కులమేమిటి ,మన సంప్రదాయం ఏమిటీ ? ఫలానా వాళ్ళ కోడలు వూరి చివర వాడల్లోకి వెళూతుందంటే ఎంత పరువు తక్కువ ?
రఘూ ! మీ అమ్మ అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పరా అని రఘుని సతాయించే వారు. మీ అమ్మ అలా చేస్తే ఇకపై దాని చేతి కూడు కూడా తినం . అని కూడా పంతం పట్టుకుని కూర్చున్నారు .
"అమ్మా ! నాయనమ్మ ,తాతయ్య ఏమంటున్నారో విన్నావు కదా ! నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు గట్టిగా ఆదేశించాడు .
రఘు అంత గట్టిగా చెప్పడం చూసి ఇరుగు పొరుగు తులసమ్మ పిన్ని ని మందలించారు తులసమ్మా !బిడ్డ నీ అంత అయ్యాడు వాడికి ఇష్టం లేదని చెపుతున్నాడుగా, ముసలివాళ్ళు ఇంటావంటా లేని పనులని ఏడుస్తున్నారు, వాళ్లకి ఇష్టం లేని పనులు చేయడం ఎందుకు ? ఈ వయసులో వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు ?మానేయకూడదు ఆ ప్రార్ధనేదో ఇంట్లో చేసుకోరాదు అని మందలించారు
ఏమనుకుందో ఏమో తులసమ్మ పిన్ని ఇక ఆ తర్వాత వూరి చివర వాడలో ఉన్న చర్చి వైపు వెళ్ళలేదు
పదవతరగతి అయిపోయి కాలేజీ చదువుకి బెజవాడ లయోలా కాలేజీలో చేరాము . ఆ కాలేజీలో చేరడం కూడా రఘు కి ఇష్టం లేదు. మా ఆంజనేయులు మాస్టారు వాడిని బాగా మందలించారు "ఈ కులం, మతం అన్నీ మన మధ్య మనం ఏర్పరచుకున్నవే ! నీకిష్టం లేకపోతే ఆ మతం గురించి ఆలోచించకు నీకు నచ్చిన మతమే నువ్వు ఆచరించుకో .. మతాలకి సంబంధం లేని విషయం చదువు , అక్కడ మంచి అధ్యాపకులు ఉంటారు స్కాలర్ షిప్ లు వస్తాయి ,నువ్వు బాగా చదువుకోవాలంటే నీకున్న వ్యతిరేకత అంతా మార్చుకుని ఆ కాలేజీలో చేరు " అని హితోపదేశం చేసాక .. అయిష్టంగానే నాతొ పాటు ఆ కాలేజీ లో చేరాడు.
ఫాస్టర్ గారు స్కాలర్ షిప్లు ఏర్పాటు చేయడం వల్ల మాతో పాటు మావూరి బీదబిక్కి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి పట్నం రాగలిగారు. సువార్త సభలు నిర్వహించడం వల్ల తులసమ్మ పిన్ని లాగా చాలా మంది వారి బోధనలు వైపు ఆకర్షితులయ్యారు. అప్పుడే నాకొకటి అర్ధం అయింది . మనషులు సమస్యలలో ఉన్నప్పుడుఆ సమస్యలు తీరక ఏదో ఒక రూపంలో దేవుడు వచ్చి తమని ఆదుకుంటాడనే నమ్మకంతో ఉంటారు . తాము ఆ సమస్యలలో నుండి బయటపడలేనప్పుడు ఇంకొక దేవుడు ఆదుకుంటాడనే భ్రమలో మతం మారి అక్కడ నమ్మకం పెంచుకుంటారు తప్ప అది మనుషుల బలహీనత అని . ఆ బలహీనత ఆధారం చేసుకుని మతమార్పిడి జరుగుతుందని ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అయితే కొద్ది గొప్పో సేవా భావం కలవారు దైవం పట్ల నమ్మకం కలవారు, బలహీనులకి ఎంతోకొంత అండ ఉండి వారికి మంచి చేయాలని పాటుపడతారు అలాంటి రెండో రకంకి చెందిన మనిషి కావడంతో మా వూరిలో ఫాస్టర్ గారిని అందరూ గౌరవించేవారు. కొత్త మతం పుచ్చుకున్న వారిని వ్యతిరేకించిన వారే ఏ నీరు ఆ నీరెంట నడవకుండా పాత నీరులో కొత్తనీరు నిశ్శబ్దంగా కలసిపారుతుందని గ్రహించక తప్పలేదు
పట్నంలో చదివేటప్పుడు రఘు కి డబ్బు పంపడం కోసం అవస్థ పడేది. పంటలకి పెట్టుబడి పెట్టి సరిగా పంట చేతికందక, ముసలి వాళ్ళ ఇద్దరి రోగాలకి, చనిపోతే ఇద్దరి కర్మ కాండ లకి బాగానే అప్పు చేయాల్సి వచ్చింది .
చేసిన అప్పుకి ఉన్న పొలమంతా అమ్మితే గాని బాకీ తీరదని లేక్కలేసుకున్నాడు రఘు .
"పూర్వికులు ఇచ్చినాస్తి. ఆ కొద్దిగా కూడా నిలుపుకోలేకపోతే ఎలాగురా..? నేను చదువు మానేసి ..ఏదో ఒక ఉద్యోగంలో చేరతాను "అన్నాడు .
"ఈ నాలుగు నెలలాగు ఏదో ఒకటి ఆలోచిద్దాం . ముందు నీ చదువు పూర్తి చేయి" అంటూ ఆంజనేయులు మాస్టారు చెప్పారు .
ఒక నెలయ్యేసరికి .. తులసమ్మ పిన్ని రఘుకి ఒక ఉత్తరం వ్రాసింది ఇల్లు, ఇంటి స్థలం అమ్మేసానని ఆ డబ్బుతో అప్పులనీ తీర్చేసానని పొలం అమ్మనవసరం లేదని ఇక ఏ దిగులు లేకుండా రఘు ని బాగా చదువుకోమని తానూ ఇంటికి అవతల ఉన్న నాలుగు సెంట్లు స్థలంలో చిన్న తాటాకిల్లు వేసుకుని అందులో ఉన్నానని .. ఇక ఇబ్బందులు ఏమి లేవని అందులో సారాంశం .
మా ఇద్దరికీ ఆశ్చర్యం అనిపించింది. పాత ఇల్లు అంత ఎక్కువ రేటుకి ఎలా అమ్ముడయిందన్నసందేహం వచ్చింది . ఇంతకీ ఎవరు కొన్నారొ ఆ ఇంటిని అనుకున్నాం. కానీ మళ్ళీ ఉత్తరాలలో ఆ సంగతి గురించి మాట్లాడుకోవడం మర్చిపోయారు
మేము సంక్రాంతి సెలవలకి ఊరు వెళ్ళేటప్పటికి రఘు వాళ్ళింటి రూపు రేఖలే మారిపోయాయి.రోడ్డు మీదకి కనిపించే ఇంటి చుట్టూ వెదురుబద్దలతో అల్లిన దడుల స్థానంలో నిలువెత్తు ప్రహరీ గోడ కట్టేశారు ఇంటి మొత్తం కి చక్కగా రంగులు వేసారు . మిగిలిన ఖాళీ స్థలంలో రెండు మూడు రెల్లుగడ్డి తో కప్పిన చుట్టిళ్ళు కనబడినాయి . ఇంట్లో నుండి బయటకి రావడానికి చక్కగా నాపరాళ్ళ దారి వేసారు .. ప్రహరీ గోడకి తలుపు పెట్టారు, ఆ తలుపు ప్రక్కనే గోడమీద రంగులతో రాసి ఉన్న అక్షరాలూ చూడగానే రఘు ముఖం నల్లబడి పోయింది అక్కడ " ఏసు సువార్త మందిరం " అని ఉంది
చెరువు కట్ట మీదగా గడ్డివాములు వేసే స్థలం లోకి వెళ్ళాడు . అక్కడొక ఒంటి నిట్టాడి పాక వేసి ఉంది . గొడ్ల పాకలో పనిచేకుంటుంది తులసమ్మ పిన్ని. రఘుని చూడలేదు ఆమె ముందుకు వెళ్లి చేతిలో బట్టల బేగ్ ని ఆమె ముందు విసిరి కొట్టి "ఈ ఇల్లు నిన్ను ఎవరు అమ్మమన్నారు ? చర్చి పెట్టడానికి నువ్వు ఇల్లు అమ్మావా? నాకు ఇష్టం లేదని నీకు తెలుసుగా ! అసలు ఇది నా ఇల్లు. నా ఇల్లు అమ్మడానికి నీకేమి అధికారముంది ? కొనడానికి వాళ్ళకేమి అధికారముంది ? వెంటనే వాళ్ళని ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపొమ్మను " అని విరుచుకు పడ్డాడు .
ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టకుండా గుడి అరుగులమీద కూర్చున్నాడు .
"రఘు మా ఇంటికి వెళదాం రారా "అని బతిమలాడి మా ఇంటికి తీసుకు వచ్చాను . సాయంత్రం వాడి చుట్టూ ఊళ్ళో వాళ్ళు చేరి తలా ఒక మాట అనడం మొదలెట్టారు .
" అదివరకి ఊరి చివర చర్చి ఉండేది మీ అమ్మ ఇప్పుడు వాళ్లకి ఇల్లు అమ్మి ఊరి మధ్యకి చర్చి ని తీసుకొచ్చి ఊరంతటిని సంకరం చేసి వదిలిపెట్టింది ఎలాగైనా ఆడ మనిషి - ఆడ పెత్తనం అనిపిచ్చుకుంది . అమ్మేటప్పుడు కనీసం నీకు ఒక మాటైనా చెప్పిందా ..? ఊళ్ళో అయినా ఎవరికైనా చెప్పిందా అంటే అదీ... లేదు. బాకీలాళ్ళకి డబ్బులు కట్టేటప్పుడు బయటపడింది నాలుగెకరాలు పొలం ధర పాతిక సెంట్లున్న స్థలంలో ఉన్న పాత ఇంటికి వచ్చిందని . డబ్బంటే ఎంత ఆశ ఉన్నా.. ఊరిని ఇట్టా .. సంకరం చేసి పెడతారా? మీ అమ్మకి తోడూ ఆ.. ఆంజనేయులు మాస్టారొకడు ఎవరి ఆస్తులు వారిష్టం అమ్ముకుంటారో ఎవరికైనా దానం ఇచ్చుకుంటారో .. మనకి ఎందుకు? వాళ్ళు పీకల్లోతు అప్పుల్లో కూరుకు పొతే మనం చిల్లికాణీ అయినా సాయం చేసామా..? అంటూ మీ అమ్మ తరపున వకాల్తా పుచ్చుకున్నాడు . అది మీ తాత ముత్తాతలు సంపాయించిన ఆస్తి .. మీ అమ్మకి అమ్మేదానికి హక్కు లేదు .పైగా నువ్వు సంతకాలు కూడా పెట్టలేదు .. వాళ్ళని ఖాళీ చేయమని అడ్డం తిరుగు" అని నూరిపోసారు .
ఆ రాత్రి కూడా రఘు ఇంటికి వెళ్ళలేదు . అమ్మ బలవంతం మీద ఏదో తిన్నాననిపించుకుని వరండాలో నులక మంచంపై ఆలోచిస్తూ పడుకున్నాడు , నేను వాడి ప్రక్కనే ఇంకో మంచం పై పడుకుని వాడేం మాట్లాడతాడో అని చూస్తూ ఉన్నాను . బాగా పొద్దు పోయాక తులసమ్మ పిన్ని మా ఇంటికి వచ్చింది ఎన్నడు ఒకరింటికి పోనీ పిన్ని మా ఇంటికి వచ్చేసరికి అందరికి ఆశ్చర్యమయితే వేయలేదు కాని కొడుకు కోసం వెదుక్కుంటూ వచ్చిన తల్లి మనసు అర్ధమై .జాలి కల్గింది .
"బాబూ .. రఘూ కోపం వచ్చిందా ? "అంటూ వాడి తలమీద చేయివేసి నిమరబోయింది ..వాడు విసురుగా ఆ చేయిని తోసేసి .. "నన్ను అంటుకోబాకు, అసలు నాకు నువ్వు అమ్మవే కాదు ". అంటూ దిగ్గున లేచి నించున్నాడు తులసమ్మ పిన్ని కళ్ళల్లో నీళ్ళు
"తప్పు .రఘు .. అమ్మని అలా అనవచ్చా .?" అమ్మ కోప్పడింది
"నేను ఏమి చేసాను .. యశోదమ్మా .. ! వాడట్టా మండి పడతా ఉండాడు . నెత్తి గింజ నేల రాలిన్నాటి నుండి ఏష్టపు బతుకు అయిపొయింది . ఈ ఒక్క బిడ్డ కోసం ఎన్ని అగచాట్లు పడినాను . ఇప్పుడు ఈడు ఇంతై నన్ను సరిగ్గా అర్ధం చేసుకోకుండా ఇట్టా మాట్లాడుతున్నాడు "
"నేను బైబిల్ చదవడం ఇష్టం లేదన్నాడు .. ఆ బైబిల్ ని నేను ఎందుకు చదువుతున్నాను , యేసు ని ఎందుకు కొలుస్తున్నాను అని మీకెవరికైనా అర్ధం అయిందా? పెల్లైయిన ఏడాది లోపే మా ఆయనకీ పెద్ద జబ్బు చేసింది, బతకడం కష్టం అని చెప్పారు . ఎన్ని హాస్పటల్ కి తిప్పినాం . ఒళ్ళు ,ఇల్లు రెండు గుల్లయి పోయాయి ఆయన అట్టా ఉండగానే వీడికి పిట్స్ మొదలయ్యాయి .. ఆయనకీ చూస్తే అట్టా , బతుకాతాడో లేదో నమ్మకం లేదు బిడ్డకి చూస్తే ఇట్టా .. నేను ఏంచేయాలో తోచలేదు .. ఎన్ని మొక్కులు మొక్కాను .. ఎన్ని పూజలు చేసాను ఈ రాళ్ళలో ఉన్న దేవుడే మైనా మా ఆయన రోగం తగ్గించ గల్గారా ? మా ఇంటి ప్రక్క టీచర్ చెప్పింది ప్రభువుని నమ్ముకో .. ఆయన రోగం నయం చేస్తాడని ఆమె మాటల మీద నమ్మకం కుదిరింది. యేసు ని నమ్ముకున్నాను రఘుకి ఫిట్స్ రావడం తగ్గి పోయింది , వాళ్ళ నాన్న కాస్త తేరుకుంటున్నాడు . నా ప్రార్ధనలు ఫలించాయనుకున్నాను . పూర్తిగా నయం కావాలంటే పూర్తిగా ఆయననే నమ్ముకోవాలి మతం మారాలి ,హిందువుల ఆనవాళ్ళు ఏవి ఉండ కూడదని అంటే బొట్టు, గాజులు అన్నీ తీసేసి బాప్టిజం తీసుకున్నాను. అప్పటి నుండి నమ్మినదానిని విడవకుండా పాటిస్తున్నాను . అది తప్పా ? ఎన్నెన్నో మాటలన్నారు మొగుడు చావక ముందే అన్నీ తీసేసింది అందుకే వాడు చచ్చాడని చెప్పుకున్నారు. బతికున్నన్నాళ్ళు మా అత్తా మామ తిట్టి పోశారు . బొట్టు పెట్టుకొని, తాళి కట్టుకోని వాళ్ళ మొగుళ్ళు చాలా మంది బ్రతికే ఉన్నారు, మరి వాళ్ళని చూపిచ్చి నేను అడగవచ్చు గా .. ? ప్రార్ధన కెళితే నా చేతి కూడు తినని శపథం చేసారు ముసలాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అని నా ఇష్టాన్నే చంపుకున్నాను . ఈడు వేలెడంత ఉన్నప్పుడు నుండే నన్ను శాసించడం మొదలెట్టాడు . నా దారిన నేనే పోతన్నా గాని ఎవరినయినా బైబిల్ చదవండి ,ప్రార్ధన చేయండి అని నేను బలవంతం చేసానా?
మీ అందరూ నమ్మే దేవుడు మీకు రాళ్ళల్లో,పాముల్లో ,పశువుల్లో కనబడితే నేను నమ్మే దేవుడు నాకు బైబిల్లో,ప్రార్ధన లో ఉన్నాడని పిస్తుంది . మీరు గుడికి వెళ్లినట్టు నేను చర్చి కి వెళితే అభ్యంతరం పెట్టారు ఇదేట్టా న్యాయం అనిపిచ్చుద్దో మీరెవరైనా చెప్పండి"? .సూటిగా తాకుతున్నాయి ప్రశ్నలు
వింటున్న ఎవరిమీ మాట్లాడలేదు . పిన్ని మళ్ళీ ఆమె గోస చెప్పసాగంది
"నిండా అప్పుల్లో కూరుకు పోయి ఉన్నాను నాలుగెకరాలు పొలం అమ్మే కంటే ఇల్లు అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని ఇల్లు అమ్మాను దానికి తప్పు పడతా ఉండారు ఏ మనూర్లో రామాలయం దగ్గరలో మసీద్ లేదా ? పీర్ల పండక్కి పీర్లు ఊరేగింపులో మీరందరూ ఎదురెల్లి నీళ్ళు పోసి మొక్కట్లేదా ? మరి ఆ మతం వాళ్ళు మాత్రం వేరే మతం కాదా!? వాళ్ళు పరాయి వాళ్ళు కాదా ? నన్నెందుకు తప్పు పడతా ఉండారు ? "
వింటున్న మాకు ఒక్కోమాట గునపంలా గుచ్చుతున్నట్టు ఉంది . రఘు ఏమి మాట్లాడలేదు
నా వైపుకి చూస్తూ .. "కృష్ణా నీకు తెలియదా .. రఘు అంటే నాకెంత ప్రాణమో ! వాడి కోసమే కదా రాత్రింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని ఒంటెద్దు వ్యవసాయం చేస్తూ ఈ కుటుంబాన్ని ఇక్కడిదాకా లాక్కొచ్చా . ఇప్పుడు ఈడే నన్ను అసహ్యించుకుంటూ నన్ను వేలేసినట్లు చూస్తే నేను ఎవరి కోసం బతకాలి, నేను ఎందుకు బతకాలి ? "
ఏడుస్తూ . ముక్కాలి పీట పై నుండి లేచి నిలబడింది .
ఆ మాటలు విన్న నాకు కన్నీరొచ్చింది. అవును, తులసమ్మ పిన్ని ఎంత కష్టపడుతుంది .రఘు వాళ్ళమ్మని అర్ధం చేసుకోవడం లేదని నాకూ వాడిపై కోపం వచ్చింది .
అమ్మ కూడా అదే మాట అంది " రఘు మీ అమ్మని నువ్వే అర్ధం చేసుకోవాలి ఏ దేవుడైతే ఏమైంది ? ఆమెకి కాకర కాయ నచ్చినట్టు ఆ దేవుడు, ఆ మతం నచ్చింది నీకు గుమ్మడి కాయ నచ్చినట్టు ఈ మతం నచ్చింది ఏ మతమయితే ఏముందిలే ! అందరి రక్తం ఒకటే రంగయినట్లు అందరు దేవుళ్ళు ఒకటే ! అసలు కన్నతల్లి ప్రత్యక్ష దైవం అంటారు కదా ! మీ అమ్మని బాధపెట్టే మాటలు మాట్లాడకూడదు , కష్ట పెట్టే పనులు చేయకూడదు ".. అని సుద్దులు చెప్పింది .
"తులసమ్మా ! ఏడవబాకు నీ కష్టం మాకు తెలియదా ఏంటి? రఘు చిన్న పిల్లాడు , వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు తలకెక్కించుకుని ఇప్పుడలా కోపంగా ఉన్నాడు గాని వాడికి నీ పై ప్రేమ ఎందుకుండదు" అని అంటూ
"కృష్ణా ,నువ్వు రఘు ని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళు "అని చెప్పింది .
తులసమ్మ పిన్ని కళ్ళు తుడుచుకుంటూనే ఇంటి దారి పట్టింది. ఆ వెనుకనే రఘు,నేను బయలుదేరాం .
ఆ సంఘటన తర్వాత రఘు ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది . వాళ్ళమ్మ మీద అసలు కోపమే లేకుండా తల్లిని సంతోషంగా ఉంచేవాడు .కాని ఆమె ఆచరిస్తున్న మతం పట్ల వ్యతిరేక వైఖరి మాత్రం వాడి మనసులో అలాగే ఉండిపోయింది
తులసమ్మ పిన్ని ఊరిలోనే ఉండేది మేము హాస్టల్లో ఉంది డిగ్రీ చదువు పూర్తీ చేసాము . తర్వాత ఇద్దరికీ గుంటూరు మెడికల్ కాలేజ్ లో సీట్లు వచ్చాయి . చదువు పూర్త వుతూ ఉండగానే రఘుకి పెళ్ళయిపోయింది. రఘుకి హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేయించింది తులసమ్మ పిన్ని. వియ్యాలవారికి ఆమె ఆచరించే మతం పట్ల అభ్యంతరం ఉండేది . అయితే రఘు లాంటి యోగ్యుడైన వాడిని పెంచిన తల్లి కాబట్టి అల్లుడు హోదాని చూసుకుని ఆమె పరమత ఆచరణకంత ప్రాముఖ్యత నివ్వడం మరచిపోయారు . రఘు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ తల్లిని కూడా తమతో ఉండమని గొడవ చేసేవాడు . కానీ తులసమ్మ పిన్ని పల్లెలోనే ఉండటానికి ఇష్ట పడేది. రఘు సొంత వూర్లో ఇల్లు కట్టడానికి రామాలయం ప్రక్కనే కొంత స్థలాన్ని మార్కెట్లో ఉన్న ధర కన్నా ఎక్కువ ధర పెట్టి కొని ఆ స్థలంలో ఇల్లు కడతాను.. ఆ ఇంట్లో ఉండమని అన్నాడు . ఆమె ఆ గుడి ప్రక్కనే ఉండానికి ఇష్టపడలేదు
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విదేశంలో ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోయాడు . తనతోపాటు తల్లిని తీసుకువెళతానని అంటే అందుకూ ఆమె ఇష్టపడలేదు . "ఎక్కడున్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు నేనీ వూరు వదిలి రానని చెప్పింది . నా సలహా మేరకు నా ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకున్నాడు. సంవత్సరానికి ఒకసారో ,వీలయితే రెండుసార్లు వచ్చి ఆ సమయానికి తులసమ్మ పిన్ని ని అక్కడికి రప్పించుకుని అందరూ కలసి ఆనందంగా గడిపి వెళ్ళడం చేయసాగాడు. వెళ్ళేటప్పుడు పేద పిల్లలకి స్కాలర్ షిప్ లు ఏర్పాటు చేసి వెళ్ళేవాడు
నాలుగేళ్ల క్రితం తులసమ్మ పిన్ని ఆరోగ్యం దెబ్బ తింది. అప్పుడు వచ్చి ఒక నెల రోజులు ఉండి ఆమెకి స్వయంగా సేవలు చేసాడు . ఇక సొంత వూర్లో ఒక్కదాన్నే ఉంచడానికి ఇష్టపడక నమ్మకమైన ఒక మనిషిని కుదిర్చి ఆమెకి సాయంగా ఉంచి వెళ్ళాడు అవసరం అయినప్పుడు సాయంగా కొడుకు కాని కొడుకుని నేనెలాగూ దగ్గరలోనే ఉన్నాను కాబట్టి రఘుకి ఎలాంటి దిగులు లేకుండా ఉంది . అమ్మ నాదగ్గరే ఉండటం తో అమ్మకి తులసమ్మ పిన్నికి ఇద్దరికీ బాగానే కాలక్షేపం అవుతూనే ఉండేది
తన పనులు తానూ చేసుకుంటూ అప్పుడప్పుడూ దగ్గరలో ఉన్న చర్చి కూడా వెళ్లి వస్తూ ఉన్న తులసమ్మ పిన్ని ఏ మాత్రం సూచనలు ఇవ్వకుండానే తనువూ చాలించింది. .. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉన్న నన్ను సరళ తట్టి పిలుస్తుంది
"ఏమండీ .రఘు అన్నయ్య వాళ్ళ మామగారు ఏమిటో అంటున్నారు చూడండి "
ఏమిటన్నట్లు ఆయన వైపు చూసాను "ఆమె శవం ని బాక్స్ లోకి మార్చి ఇదిగో ఈ దండలు వేయండి, తలవైపు దీపం పెట్టండి . అలా అంత సేపు దీపం పెట్టకుండా ఉంచకూడదు " చెపుతున్నారు .
దీపం .. పెట్టటమా ? అడిగాను ఆశ్చర్యంగా . అదేమిటి అలా ఆశ్చర్యంగా అడుగుతున్నావ్ కృష్ణా !ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమె ఎలా ఉంటె మనకెందుకు ? ఇప్పుడు ఆమె రఘు తల్లి మాత్రమే! ! ఆమెకి హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు జరపడమే విధి . పైగా అలా చేయకపోతే రఘుకి కీడు జరుగుతుంది . అది మాత్రం ఆమె కోరుకుంటుందా ? అడుగుతున్నాడాయన .
నేను ఆలోచిస్తూ ఉన్నాను బుర్ర పాదరసంలా పనిచేసింది వెంటనే ఇలా అన్నాను . "రఘు రావడానికి ఎంత లేదన్నా ఇంకా రెండు రోజులు పడుతుంది కాబట్టి బాడీని ఇక్కడ బాక్స్ లో ఉంచడం కంటే మార్చురీ లో ఉంచడం నయం" అన్నాను .
నన్ను సమ ర్దిస్తూ మరి కొందరూ అలాగే చేయడం మంచిదని అన్నారు . అమ్మయ్య ! ఒక గండం గట్టెక్కింది అనుకుని అంబులెన్స్ కి పోన్ చేసాను. ఒకటిన్నర రోజు తర్వాత భార్య పిల్లలతో సహా రఘు వచ్చాడు . ఎయిర్ పోర్ట్ కి ఎదురెళ్ళి నేనే ఇంటికి తీసుకువచ్చాను. మేము ఇంటికి వచ్చే సమయానికి అంబులెన్స్ లో పిన్ని బౌతిక కాయాన్ని ఇంటికి తీసుకు వచ్చారు.రఘు తల్లి శవాన్ని చూస్తూ కన్నీరు కారుస్తూనే ఉన్నాడు . పిల్లలు ఒకసారి ఆమె దగ్గరికి వచ్చి చూసి దూరంగా వెళ్ళిపోయారు . భార్యని తల్లి తల దగ్గర దీపం పెట్టమని చెప్పాడు రఘు .
రఘు మామగారు స్మశాన వాటిక వాళ్లకి ఫోన్ చేసి దహన క్రియలు గురించి మాట్లాడుతున్నారు.
నేను నిర్ఘాంతపోయాను . తల దగ్గర దీపం పెట్టబోతున్న రఘు భార్యని "కాసేపు ఆగమ్మా" .. అని వారించి వాడిని ప్రక్కకి తీసుకువెళ్ళాను .
"ఏంటిరా ఇది ".. అడిగాను
"ఏముంది అన్నీ మాములేగా " అన్నాడు వాడు
"రఘు .. నీకు ఊహ తెలిసినప్పటి నుండి అమ్మని వ్యతిరేకిస్తూనే ఉన్నావు . ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా వ్యతిరేకిస్తున్నావు . ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం నాకేమి నచ్చలేదు " అన్నాను .
"నచ్చడానికి ఏముంది రా కృష్ణా ! ఇప్పడు నేనేమి చేసినా అమ్మకి తెలుస్తుందా ఏమిటీ ! అమ్మ పుట్టుకతో క్రిష్టియన్ ఏమి కాదుగా ! హిందువుగానే పుట్టింది హిందువుగానే ఆమెని కడసాగనంపడంలో ఎవరికీ అభ్యంతరం ఉంటుంది . మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి " అన్నాడు
మరి నువ్వు మధ్యలోనే వచ్చావుగా నువ్వు పోవాలిగా ? అన్నాను కోపంగా ." వాట్ "అన్నాడు ఆశ్చర్యగా అర్ధం కానట్లు
"నేను అంటున్నదీ అదే! నువ్వు ఆమె పుట్టినప్పటినుంచి ఆమెతో ఉండలేదుగా . ఆమెని ఇప్పుడు వదిలేయి" అన్నాను .
"ఎలా వదిలేస్తాను . అమ్మ ఉన్నప్పుడు ఆమెని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అంతగానే ప్రేమిస్తాను ఆమె కి అంతిమ సంస్కారం చేసి ఆమె ఋణం తీర్చుకోవాలి కదా !" అన్నాడు
"మనుషులని ప్రేమించడానికన్నా ముందు వారిని గౌరవించడం నేర్చుకోవాలి . మీ అమ్మని ఎప్పుడైనా గౌరవించావా ? అదే ఆమె అభిప్రాయాలని గౌరవించావా ? ఆమె ఇష్టపడే బైబిల్ ని ఆమె ప్రార్ధనలని అంగీకరించావా? ప్రపంచ దేశాలన్నీ తిరిగావు. మతం, , ఆచారం ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి ఎవరికిష్టం అయినట్లు వారు మార్చుకుంటారు. మార్చుకోవద్దనటానికి, ఇలాగే ఉండాలి అనడానికి ఎవరికీ అధికారం లేదు. వ్యక్తి స్వేచ్చకి భంగం కల్గించమని ఏ రాజ్యాంగంలోను చెప్పబడలేదు. మన హిందూ ధర్మం అసలు చెప్పలేదు. ఆమె చనిపోయాక ఆమె కొడుకుగా నీకు ఆమె శవం మీద కూడా హక్కు ఉండొచ్చు. కానీ ఆమె అవలంభించిన మతాచారం ప్రకారం ఆమె అంతిమ సంస్కారం జరగాలని ఆమె కోరిక . అమ్మ ఈ దగ్గరలో ఉన్న చర్చిలో ఆ విషయమే చెప్పిందట . వారొచ్చి నిన్న నాకు ఆ విషయం గుర్తు చేసి వెళ్ళారు. ఆమె ఇష్ట ప్రకారం మనం అలా పాటించడం అంటే ఆమెని మనం గౌరవించడమే కదా! అది మన విధి కదా ! ఆలోచించు" అన్నాను
" ఏమైందండీ ! అంత సీరియస్ గా చర్చించు కుంటున్నారు అవతల జరగాల్సిన విషయం చూడకుండా " అంటూ దగ్గరికి వచ్చింది సరళ .
"తల్లీకొడుకుల మధ్య కూడా ఈ మత విశ్వాసాలు ఎంతటి అగాధం సృష్టిస్తాయో అన్నది అర్ధమవుతుంటే చాలా బాధగా ఉంది సరళా ."అన్నాను
"ఏమంటున్నారు రఘు అన్నయ్య శవపేటిక,ప్రార్ధన, బరియల్ గ్రౌండ్ కి వద్దంటున్నారా ?"
అవునని తలూపాను . రఘు మామగారు పురమాయించిన మనుషులు పాడే సిద్దం చేస్తున్నారు పూల దండల బుట్టలు, చావు మేళం, టపాసులు అన్నీ వచ్చి చేరుతున్నాయి
రఘు పది నిమిషాలు గడిచినా గదిలో నుండి బయటకి రావడం లేదు .
"సరళా నేను వెళుతున్నాను , ఆ కార్యక్రమం అయ్యాక అమ్మ, నువ్వు వచ్చేయండి " అని అంటూ బయటకి వస్తున్నాను .
"అయ్యో ! అదేమిటండి . మనకి నచ్చలేదని వెళ్ళి పోతామా ? ఇన్నేళ్ళు ఆమెకి మీరు ఒక కొడుకుగానే ఉన్నారు . ఆ కార్యక్రమం ఏదో అయినాక మనమందరం కలిసే వెళ్ళిపోదాం . తర్వాత మీ మిత్రుడు, మీరు ఎలా ఉండదల్చుకున్నారో అలాగే ఉండండి " అంటూ చేయి పట్టుకుని ఆపబోయింది .
"మరణం తర్వాత కూడా తల్లి అభిప్రాయాలని గౌరవించలేని వాడిని, సంస్కారం లేనివాడిని నా స్నేహితుడిగా కాదు మనిషిగా కూడా అంగీకరించలేకపోతున్నాను . డాక్టర్ అన్న డిగ్రీని మెడలో వేసుకుని తిరుగుతున్న వాడిని మరో మత మూడుడుగా చూడలేకపోతున్నాను. ఆ విషయాన్ని జీర్ణం చేసుకోవడం నావల్ల కావడంలేదు అందుకే వెళుతున్నాను ". తల విదుల్చుకుంటూ గుమ్మం దాటి బయటకి రాబోతుండగా ..
"కృష్ణా !ఎక్కడికి రా వెళుతున్నావ్ ? అమ్మ అంతిమ సంస్కారం కి శవపేటిక సిద్దం చేయించకుండా ? " అంటూ దగ్గరగా వచ్చి నా చేయి పట్టుకున్నాడు రఘు.
తులసమ్మ పిన్నికి జరిగే అంతిమ సంస్కారం రఘుని సంస్కార వంతుడిగా మార్చిందనుకుంటే నాకు చాలా సంతోషమేసింది
వాడి చెయ్యి పట్టుకుని తులసమ్మ పిన్నిని ఉంచిన చోటుకి వచ్చాను . ఆమె నిర్జీవ ముఖం చిన్నగా నవ్వుతున్నట్టు కనిపించింది నాకు.
బాధ నిండిన మనిషి హృదయం భారమైనప్పుదు ఆ భారాన్ని తగ్గించేడి కన్నీరే ! మనిషిలో ఉండే సున్నితమైన భావోద్వేగాలని ఎల్ల కాలం అణచి పెట్టడం సాధ్యం కాని పని. ఎంత అణుచుకున్నా ఎప్పుడో ఒకప్పుడు అంతరంగం బహిర్గతమవుతూనే ఉంటుంది. చేసిన తప్పిదాలు,, పొందిన ప్రేమాను రాగాలు, దూరం గా ఉన్నప్పుడు అనుభవించిన ఏకాకితనం లో నుండి బయటపడి తనవారిని వెదుక్కునే టప్పుడు వారిలో జరిగే సంఘర్షణ, ఆత్మ పరిశీలన మొదలై ఒకేసారి అన్ని భావాలు ముప్పిరిగొని, హృదయం ఆర్ద్రంగా మారి కన్నీరు పెల్లుబికి మనసుని పునీతం చేస్తుంది. అప్పుడు తనకి తనవారికి మధ్య ఉన్న దూరాలు తరిగి పోయి ఆనందం తో మనసు మయూరమై ఆడుతుంది .
ఇలా ఒక పాట గురించి .. పరిచయం
నా గీతమాల ఆమనీ .. లో . ఈ లింక్ "విహంగ" లో చూడండి
ఉయ్యాల - జంపాల చిత్రంలో పాట పరిచయం
ఈ పాటని జగ్గయ్య గారి మీద చిత్రీకరించారు .
ఈ పాట ఎప్పుడు విన్నా ప్రతి మనిషి తన అంతరంగాన్ని తడుముకునేటట్లు ఉంటుంది. చెట్టు ఎంత పెరిగినా మూలాలు నేలలోనే విస్తరించి ఉన్నట్లు మనిషి ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎంత ధనం గదించినా వారిని వారి వారి మూలాలు నుండి ఎవరూ విడదీయలేరు అనడానికి ఈ పాట ఒక చక్కని ఉదాహరణ .
ప్రపంచ దేశాల మధ్య దూరాలు తరిగిపోతున్నాయి. సరిహద్దులు చెరిగిపోతున్నాయి.
ఆధునిక జీవన సరళి లో విద్యనభ్యసించడానికి ఉపాది అవకాశాలని వెదుక్కుంటూ ఉన్న ఊరుని కన్న తల్లి దండ్రులని, అయినవాళ్ళందరినీ విడిచి వేల వేల మైళ్ళు దూరానికి వలస వెళుతున్నారు. అక్కడ వారు ఎదుర్కునే వెతలు కి వెరవకుండా , ప్రతికూల వాతావరణం ని తట్టుకుంటూ కూడా జీవన పోరాటం సాగిస్తున్నారు కూడా . అయినప్పటికీ వారి మనస్సులో మాతృ దేశం పట్ల ఉన్న ప్రేమ ,సొంత ఊరిపై మమకారం ఎన్నటికి తగ్గదు . ఏటి లోపలి కెరటాలు యేరు విడిచి ఎలాగైతే పోలేవో మనిషి ఎదలోపలి మమకారం కూడా ఎక్కడి పోదు పల్లవితో మొదలైన ఈ పాట ఆసాంతం హృద్యంగా సాగుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య ,స్నేహితుల మధ్య నెలకొన్న తీయని అనుబంధం చాలా గాడమైనది. మనుషుల మాటలవల్ల,చేష్టల వల్ల గాయ పడిన హృదయాలకి గతంలో వారి మధ్య ఉన్న అనుబంధం,తీయని జ్ఞాపకాలే వారి వారి బంధాన్ని నిలిచేటట్టు చేస్తాయి . రక్త సంబంధం అన్ని బంధాల కన్నా బలమైనది . ఎన్ని విభేదాలు ఉన్నా, ఎంత శతృత్వం నెలకొన్నా తమ వారికి కష్టం కల్గినప్పుడు క్షణ కాలంలో వారిని ఏకం చేస్తుంది
బాధ నిండిన మనిషి హృదయం భారమైనప్పుదు ఆ భారాన్ని తగ్గించేడి కన్నీరే ! మనిషిలో ఉండే సున్నితమైన భావోద్వేగాలని ఎల్ల కాలం అణచి పెట్టడం సాధ్యం కాని పని. ఎంత అణుచుకున్నా ఎప్పుడో ఒకప్పుడు అంతరంగం బహిర్గతమవుతూనే ఉంటుంది. చేసిన తప్పిదాలు,, పొందిన ప్రేమాను రాగాలు, దూరం గా ఉన్నప్పుడు అనుభవించిన ఏకాకితనం లో నుండి బయటపడి తనవారిని వెదుక్కునే టప్పుడు వారిలో జరిగే సంఘర్షణ, ఆత్మ పరిశీలన మొదలై ఒకేసారి అన్ని భావాలు ముప్పిరిగొని, హృదయం ఆర్ద్రంగా మారి కన్నీరు పెల్లుబికి మనసుని పునీతం చేస్తుంది. అప్పుడు తనకి తనవారికి మధ్య ఉన్న దూరాలు తరిగి పోయి ఆనందం తో మనసు మయూరమై ఆడుతుంది .
అందరికి అర్ధమయ్యే సరళమైన పదాలతో .ఎంత బాగా వ్రాసారు ఈ కవి . అంతా నిజమే కదా .! అనుకుని హాయిగా వింటూ ఉంటారు. ఇంత కన్నా పాట కి పరమార్ధం ఏముంది ?
ఈ పాట సాహిత్యం "ఆరుద్ర" గారని కొందరు , కొసరాజు రాఘవయ్య చౌదరి గారని కొందరు ..ఇలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సంగీతం పెండ్యాల నాగేశ్వర రావు గారు .
గాయకుడు : మంగళంపల్లి బాలమురళీ కృష్ణ
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు ॥
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా ..
ఊరు విడిచి వాడ విడిచి ఎంత దూరమేగినా
సొంత ఊరు అయినవారు అంతరాన ఉందురోయ్
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధమూ
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధమూ ...
గాయపడని హృదయాలని జ్ఞాపకాలే అతుకు
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు
కన్నుల నీరు చిందితే తేలికవునులే
కన్నుల నీరు చిందితే తేలికవునులే
తనకి తనవారికి ఎడబాటే లేదులే ఎడబాటే లేదులే .
ఏటి లోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మామకారం ఎక్కడి కి పోదు
ఈ పాట వీడియో లింక్ ఎక్కడ లభ్యం కాకపోవడం వల్ల జత పరచలేకపోయాను. ఇంతకూ ముందు ఈ చిత్రం చూసినవారు శబ్ద చిత్రాన్ని వింటూ పాట దృశ్యం ని గుర్తుతెచ్చుకుంటూ ఆస్వాదనలో మునిగి తేలండి . ఇంకో మంచి పాటతో మరొక నెల లో కలుసుకుందాం మరి . :
ఒక వ్యక్తి తెలియని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే .. వారు ఆ రిక్వెస్ట్ ని తిరస్కరించి .. ఈ వ్యక్తీ ఎవరో నాకు తెలియదు అని రిపోర్ట్ చేస్తే .. facebook వారిని బ్లాక్ లో ఉంచుతుందని ఈ రోజు ఒక క్రొత్త విషయం తెలిసింది .
ఈ మధ్యనే రెండు దఫాలుగా facebook ఫ్రెండ్స్ లిస్టు ని వడపోసి నిక్కమైన మిత్రులనుకున్నవారిని ఉంచాను . రోజుకో నాలుగైదు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చి పడుతున్నాయి . అన్నిటిని నిశితంగా చూసి ఆలోచించిన తర్వాత కాని వారిని నా ఫ్రెండ్స్ లిస్టు లోకి ఆమోదిస్తూ ఆహ్వానం పలుకుతున్నాను. . అనాలోచితంగా కొంత మందిని మన స్నేహితుల లిస్టు లో చేర్చుకోవడం వల్ల ఒక చిన్న చేదు అనుభవాన్ని చవిచూసాను మరి . ఆ విషయం ఏమిటంటే .. ..
మేడమ్.. మా వర్కర్స్ పిలుపు . ఇదిగో ఇలాగే ఈ ఇంటర్నెట్ తో మమేకం అయిపోయానేమో .. వినిపించుకోలేదు .
వర్క్ జరుగుతున్న ప్రక్కనే చైర్ వేసుకుని కూర్చుని పేపర్ చదువుకుంటున్న మా నాన్న గారు .."అమ్మాయ్ ! ఎవరో వచ్చారు చూడు " అని గట్టిగా పిలిచారు .
నేను నాతోపాటు నాకు ఇంటి పనులలో, కస్టమర్స్ వచ్చినప్పుడు చీరలు చూపడం, చక్కగా మడతలు వేసి సర్దడంలో సాయంగా ఉండే అమ్మాయి ఇద్దరం వరండాలోకి వచ్చాము.
ఎదురుగా అపరిచిత ముఖం, చూస్తున్న మాకు ఆశ్చర్యం . ఎందుకంటే సాధారణంగా నా కస్టమర్స్ అందరూ స్త్రీలే ఉంటారు . ఎదురుగా ఉన్నది పురుషుడు. ఏదో అడ్రెస్స్ వెతుక్కుంటూ వచ్చారు కాబోల్సు అనుకుంటూ ..
"చెప్పండి ?" అన్నాను నేను
చేస్తున్న వర్క్ శారీ పైనా ? అని అడిగాడతను
ఓహో.. ఈ రోజు ఈ పురుషపుంగవుడు నా మైండ్ తినడానికి వచ్చినట్టు ఉన్నాడనుకుని .. "కాదండి" ఓన్లీ బ్లౌస్ మాత్రమే" అని చెప్పాను .
"ఇంత హెవీగా వర్క్ చేయిస్తున్నారు . మీ స్వంతానికా ? " చిరాకు పుట్టించే ప్రశ్న.
కొంచెం విసుగ్గా ముఖం పెట్టి .. ‘కాదండీ కస్టమర్ ఆర్డర్ పై చేస్తున్నాం’. చెప్పాను .
‘ఇంత హెవీగా ఎలా వచ్చింది రెడీమేడ్ వర్క్ పీస్ తెచ్చి అటాచ్ చేస్తున్నారా?’
‘కాదండి ..ఆ డిజైన్ ని అలా హెవీగా కనిపించేటట్లు చేయడమే ఈ బెంగాలి వర్కర్స్ చేసేపని’అన్నాను
వర్కర్స్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే వారు రెండు పొడి మాటలలో సంభాషణ ముగించేవేసారు . అతను నిలబడి వర్క్స్ చూస్తున్నాడో , లేక అనేక అనుమానాలతో అక్కడే ఇబ్బందిగా నిలబడి ఉన్న నన్ను చూస్తున్నాడో అర్ధం కాలేదు .
మా నాన్నగారు ప్రశ్నార్దకంగా చూస్తున్నారు . నేను వచ్చినతనితో మాట్లాడేది లేనట్లు లోపలి రాబోయాను.
మళ్ళీ ప్రశ్న "మీరు శారీస్ సేల్స్ చేస్తారా?"
"లేదు" టపీమని అబద్దం చెప్పి లోపలి వచ్చి .. " అవును.. ఈ శాల్తీని ఎక్కడో చూసినట్లు ఉంది " అనుకుని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేసాను .
వెంటనే గుర్తుకు వచ్చేసింది ..ఈ ముఖం facebook లో చూసాను అని గుర్తుకు వచ్చి ఇతనిది ఎక్కడో కదా ! ఇలా మా ఇంటి ముందు ఏమిటీ? అనుకుంటూ అనుమానంతో బయట గేట్ దగ్గరికి వెళ్లి చూసాను .
నా సహాయకురాలు అతను ఎంబ్రాయిడరీ గురించి తెలుసుకోవడానికి వచ్చినట్లు లేదు మిమ్మల్నే చూస్తూ కనిపించాడు, మీకు అతను తెలుసా ? అని అడిగింది
లేదే ! అదే నాకు అనుమానంగా ఉంది . పైగా మా నాన్న గారు గమనిస్తున్నారు .. మనకి తెలిసిన బాపతు అయితే కాదు అని బయటకి దృష్టి సారించి చూస్తే... మా ఇంటికి కొంచెం అవతలగా నిలబడి ఫోన్ చేసుకుంటూ కనిపించాడు .
నేను లోపలకి వచ్చేసి .. వెంటనే facebook ఓపెన్ చేసి చూసాను . సందేహం లేదు అతనే ! నేను వేసిన పోస్ట్ లకి అతిగా కామెంట్ చేస్తున్నాడని అన్ ఫ్రెండ్ ని చేసి పడేసాను . అంతకు ముందు కూడా నాకు అతని నుండి కాల్ వచ్చింది . నా నంబర్ ఎలా తెలుసనీ అడిగాను . అందుకు సమాధానం లేదు . "కవిసంగమం" ప్రచురించిన కవితలలో నా కవిత ఉంది అప్పుడు అడ్రెస్స్ తో పాటు మొబైల్ నంబర్ కూడా ఇవ్వల్సినదిగా కోరడంతో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ కవిత చదివి చాలా మంది ఆ నంబర్ కి కాల్ చేసి అభినందించడం,నేను చాలా సంతోషించడం జరిగింది .
అలాంటిది వేరొకరు ఇలా నా నంబర్ తెలుసుకుని పదే పదే కాల్ చేయడం నాకు నచ్చలేదు . అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసాను . ఒకసారి కాల్ చేసి "మేడమ్.. మా ఆఫీస్ పనుల వల్ల నేను విజయవాడ వస్తున్నాను . మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వస్తాను ' అని అడిగితే "సారీ అండీ ..నేను మీరు వచ్చే రోజు ఊర్లో ఉండటం లేదు . మా మరిదిగారు విదేశాలు నుండి వచ్చారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలసి వేరే పోగ్రాం ప్లాన్ చేసుకున్నాం " అని చెప్పి సున్నితంగా తిరస్కరించాను . అతనేదో సాహిత్య సేవకుడేమో కూడా, మీ రచనలు వేస్తానంటూ ఒకటే ఫోన్స్, ఇక భరించలేక ఆ నంబర్ ని బ్లాక్ చేసేసాను .
ఇవన్నీ గుర్తు చేసుకుంటూ "ఇప్పుడు ఈ వెధవ వెతుక్కుంటూ ఇంటిదాకా వచ్చాడు . కొంచెమైనా సంస్కారం లేకుండా " అని తిట్టుకున్నాను .
అందుకే మా స్త్రీలు వ్యక్తిగత వివరాలు, చిరునామాలు ఇవ్వడానికి వెనుకాడతారు అనుకున్నాను బ్లాగర్ గా పరిచయం అప్పుడు కూడా నేను చిరునామా ఇవ్వడానికి భయపడలేదు . భయపడటం నా లక్షణం కాదు . అడ్రస్ తెలిసినంత మాత్రాన , ఫోన్ నంబర్స్ తెలిసినంత మాత్రాన ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తూ వ్యక్తిగత పరిచయాలు కోసం ప్రాకులాడతారా? అనుకుంటాను. ఎదుటివారు సంస్కారవంతులుగా ఉండటం చేతకానప్పుడు వారిని ఎలా ఫేస్ చేయాలో, ఎలా త్రుంచి వేయాలో కూడా నాకు తెలుసు.
నాకింకో అనుమానం నా లాగా ఇంకొందరిని కూడా అతను అలా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు కూడా ! తమ రచనలు ప్రచురిస్తారని స్త్రీలు ప్రలోభ పడతారా? నాకైతే అసహ్యం వేసింది . ఇలాంటి అనుభవం నాతోపాటు మరికొందరికి ఉండవచ్చు . నాతోపాటు కాస్తో కూస్తో వ్రాయ గల్గిన అందరి ఫ్రెండ్స్ లిస్ట్ లోను అతను ఉన్నాడు. నేనైతే అతని ప్రవర్తన నచ్చడం లేదని అతనికి చెప్పి మరీ బ్లాక్ చేసేసాను .
ఆన్ లైన్ స్నేహాలలో ముఖ్యంగా మన అభిప్రాయాలు, మన ఆలోచన విధానం, స్పందించే మనసు వీటిని బట్టే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది తప్ప వ్యక్తిగత పరిచయాలు పెంచుకోవడానికి ప్రయత్నించేవారి పట్ల అసహ్యం కల్గుతుందన్నది నిజం
ఇలాగే వ్యక్తిగత పరిచయాలు పెంచుకుని ఫోన్ నంబర్స్ ఇచ్చుకుని సోషియల్ నెట్వర్క్స్ లో జరిగే విషయాల గురించి చర్చించుకుని .. ఒకరి గురించి మరొకరు మూడవ వ్యక్తి దగ్గర చెప్పుకుని అవి వారి నుండి వీరికి, వీరి నుండి వారికి చేరి ఆ చేరవేసే వ్యక్తి పురుషుడు అని తెలిసి ఆశ్చర్య పోయాను అటువంటి విషయాలు facebook లో జరిగాయి ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూ అసహ్యకరంగా తిట్టుకున్న కొందరిని చూస్తే భయం, అసహ్యం రెండు కల్గాయి నాకు నా ఫ్రెండ్ ఒకరు ఇలాంటి గొడవల వల్ల అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంది . ఆమె నన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు . "జాగ్రత్తమ్మా" అని
నేను నీలా అంత ఓపెన్ గా ఉండను ఎక్కడ ఎలా ఉండాలో అలా మాత్రమే ఉంటాను, మితిమీరితే తోకలు ఎలా కత్తిరించాలో నాకు తెలుసులే అని నవ్వేసాను కాని .. ఈ విషయం ఆమెకి చెప్పే సమయం రాలేదు
అటువంటి పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం కూడా .
అలాగే పర్సనల్ చాట్ చేయడం కూడా ఇబ్బందికరం వీలైనంత చాట్ కి దూరంగా ఉండండి .. ఎంత మంచి స్నేహమో అయితే తప్ప స్వవిషయాలు పంచుకోకండి
ఎవరైనా ఇబ్బందికరంగా కామెంట్ చేస్తే ఆ కామెంట్ ని తొలగించేయండి , నిర్మొహమాటంగా హెచ్చరించండి , వారి తీరు మార్చుకోకపోతే బ్లాక్ చేసేయండి .
ముక్కు ముఖం తెలియని వ్యక్తుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే .." నో" చెప్పేయండి.
మీ వాల్ పై ఎవరూ పోస్ట్ చేయకుండా సెట్టింగ్ మార్చుకుని జాగ్రత్త పడండి.
రచనలు ప్రచురిస్తాం , జాబ్స్ ఇప్పిస్తాం , మా ప్రాంతాలకి వస్తే మమ్మల్ని సంప్రదించండి ఎటువంటి సాయం కావాలన్నా మమ్మల్ని అడగండి లాంటి మాటలు గురించి ఆలోచించకండి.
ఎవరి పనులు వారు చేసుకుని ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది . ఎటువంటి ప్రలోభాలకి లోను కావద్దు .
ఫ్రెండ్స్ ..తస్మాత్ జాగ్రత్త. facebook లోను , ఇక్కడ కూడా ఉన్న ఫ్రెండ్స్ కి కొంత మందికి చాలా విషయాలు తెలుసు. దుష్టులకి దూరంగా ఉండండి . మీ మానసిక శాంతిని పోగొట్టుకోకండి. లైక్స్ ఇవ్వలేదని ,కామెంట్స్ పెట్టడం లేదని దూరంగా తోసేసేవారిని మీరే మీ లిస్టు నుండి తీసి పడేయండి. లైక్ చేయకపోతే దాడి చేసే మనస్తత్వం ఉన్నవారితో అసలు ఫ్రెండ్షిప్ చేయకండి పోయేది ఏమి లేదు ఒక ఆన్ లైన్ స్నేహం అనే ముసుగు తప్ప .
బాహ్య ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఆన్ లైన్ స్నేహాలలోను అవే ఉన్నాయి . ప్రాంతీయ తత్వం, కులం, మతం తమ వారే గొప్ప వారు అనే భావనలు ఇలా చాలా ఉన్నాయి . అనకాపల్లి నుండి ఆస్టిన్ వరకు లేదా విజయవాడ నుండి వాషింగ్టన్ వరకు ఇలాగే ఉన్నారు . కాకపొతే దారులే మారాయి అంతే !
కార్తీకం వచ్చేసిందోచ్.. గతంలో ..నేను పరిచయం చేసిన పాటే! కొంత వివరణ తో.. ఇలా మళ్ళీ ..
శరదృతువు లో వచ్చే కార్తీక మాసం అంటే అందరికి ఇష్టం కదా ! . శరదృతువు లో అంతకు మునుపు వర్ష ఋతువు తాలాకు నల్లటి మేఘాల స్థానే తెల్లని మబ్బులు తేలికగా కదిలిపోతూ .. చంద్రునితో దోబూచులాట ఆడుతున్నట్లు ఉంటుంది కార్తీకంలో కురిసిన వెన్నెలయితే చల్లగా ఉంటుంది అలాంటి వెన్నెలని ఇష్టపడని వారంటూ ఉండరు . అలాంటి ఆహ్లాదకర వాతావరణంలో ఒక మంచి పాటవింటే బావుంటుంది.సమయానికి తగిన పాటైతే మరీ బావుంటుంది అయితే నాకిష్టమైన పాట... చంద్రోదయం చంద్రోదయం పాట
పాట... వినేద్డామా?
ప్రేమమందిరం చిత్రంలో... పాట ఇది... జయప్రద... అక్కినేని.. ఈ పాటలో... చూడచక్కని.. జంట.. పాట.. ఈ సాహిత్యం... అపురూపం. వేటూరి గారి కలం జాలువార్చిన నిండు పున్నమి వెన్నెల సంతకం.
వెన్నెల, వేణువు.. ఎవరికి.. ఇష్టం ఉండవు.. చెప్పండీ..!.. అలాగే.. నాకు.. ఈ పాటంటే మరీ ఇష్టం. . పాటలు.. వినడం నాకు.. వ్యసనం.. అందునా... మంచి సాహిత్యం- సంగీతం మేళవించిన... పాటలకి... నేను.. బానిసని. ఆహార,నిధ్రలని మరచి మరీ.. వింటాను., అదీ... యుగళ గీతాలని.. మరీ మరీ.. వింటాను.. అందరూ నువ్వసలు పాటలు వినేందుకే పుట్టి ఉంటావని.. కాసిని నవ్వుతాలు మాటలు, మందలింపులు పట్టించుకోకుండానే.. ఇలా అంటూ ఉంటాను దేనికైనా.. మనసుండాలంటారు కదా... మనసున్న కన్నులకే తెలుస్తుంది... అంట.. ఇక్కడ.. చెవులు అనాలేమో..!! వేటూరి గారు తెలుగు నుడికారం ,అచ్చు తెనుగు పదాలని అందంగా అమర్చి వ్రాసిన యుగళ గీతమిది .
.ప్రేయసి ప్రియులు ప్రకృతిలో మమేకమైన వేళలో .. నిండు.. పున్నమి వెన్నెలలో... రెండు.. మనసులు కలసిన.. తరుణంలో... ప్రపంచం ని.. మరచి... విహరించడం .. ఆ అనుభూతిని.. జీవితంలో.. ఒకసారి అయినా.. చవిచూడటం .. ఆ నిండిన అనుభూతిని.. మనసు పొరలలో... పదిలపర్చుకోవడం ఎవరికైనా.. మధురాతి.. మధురం కదా !
పెద్దల కట్టుబాట్లు సడలించుకుని ఒక జంట మబ్బులా కమ్మిన తమ ఎడబాటుని చెరిపేసుకుని మనసులు ముడివేసుకుని కన్నులు కలబోసుకుంటే కార్తీకమే కదా ! ఏకాంతంలో వారి ఆత్మీయ కోగిలిలో చంద్రోదయం కాకుండా ఉంటుందా ..చెప్పండి?
వారివురు కలసిన వేళా నింగి నేల కలసి తాళాలు వేసినట్లు వారిరువురు కలసి అలసి సొలసిన వేళ కడలి నది మేలమాడుకున్నాయి. ఆ రాత్రివేళ పూసిన పున్నాగలు సన్నాయి పాడాయి ఆ చూపులలో.. చెప్పలేని మూగ బాసలున్నాయి.వారిరువురిలో రేగిన అలజడి.. పెదవి పెదవి కలబడితేనే కాని ఆగదన్నట్లు అప్పుడప్పుడే నిద్రలేచిన పొద్దులో వారి తనువుల కలయికలో ఆనంద చంద్రోదయం అయినది .. .
నవరసాలలో రసరాట్టు శృంగారం అంటారు . సకల ప్రాణ కోటి కోరుకునేది . సకల ప్రాణ కోటిలో ఉత్తమ శ్రేణికి చెందినవాళ్ళం అనుకునే మానవులు ఆ రసాన్ని మనసారా,ఉదాత్తంగా ఆస్వాదించాలి. బాహ్య ప్రపంచం నుండి విడివడి ఆత్మలు సంయోగం చెందినట్లు మమేకం కావాలి ఈ పాట సాహిత్యం ఇలాగే ఉంటుంది
పారశీక కవితా సంప్రదాయంలో స్త్రీని సూర్య బింబంతో పోల్చడం ఆనవాయితీ అయితే వేటూరి గారు తన ముందు తరం కవుల నుండి స్త్రీని చంద్ర బింబం తో పోల్చడంని ఆనవాయితీగా పుణికి పుచ్చుకుని ఈ పాట సాహిత్యంలో స్త్రీని జాబిలితో పోల్చారు . కౌగిలితో గల జాబిలితో ..అని ఇక్కడ వ్రాయడం జరిగింది వారిరువురు చుక్కలు కాంచని నేరాలు ఎన్నో చేసేసారు . ఆమె విరహంతో ప్రియునికి కాటుక తో ఉత్తరం వ్రాస్తే ఆ ఉత్తరంలో ప్రేమ లోని గాడతతో పాటు చిలిపి తనం గోచరించిన ఆ ప్రియుడికి ఆనాటి పున్నమి వెన్నెల తగలగానే జ్వరం వచ్చిందని చెప్పడంలో వింతేమి లేదు కదా !
తూరుపున ఉదయించిన సూరీడు తొందర తొందరగా పడమటికి చేరి అక్కడే స్తిరబడి .. రేపటిని మర్చిపోతే .. తొందరపడి విరిసిన పూలపాన్పుపై ఆ విరులూ ఆవిరులై నిట్టూర్పు విడుస్తున్నప్పుడు విరిసిన చంద్రోదయం ఎంత బావుంటుంది . "విరులావిరులౌ .. నిట్టూర్పులలో ...చంద్రోదయం .. చంద్రోదయం.".. .. వాహ్హ్వా..అదే వేటూరి సాహిత్యం ఆ పదాల గారడీ అది. ఎవరికైనా ఆ ఆకర్షణలో పడకుండా ఉండటం సాధ్యం కాదేమో!
వినండి.. తడిసి... ముద్ధయిపొండీ .! పున్నమి.. వెన్నెల అయితే .. ఈ.. పాట వింటేనే ...జ్వరం రావాలనే.. అంతగా....మమేకం అయిపోవాలని.. ఆశిస్తూ...
ఈ పాట సాహిత్యం :
మబ్బులు విడివడి.. మనసులు.. ముడివడి..
కన్నులు కలసిన కార్తీకంలో...
కౌగిలి బిగిసిన ఏకాతంలో... చంద్రోదయం.. చంద్రోదయం..
నీవు నేను కలసిన వేళ.. నింగి నేల.. తాళాలు...
కలసి అలసి సొలసిన వేళ..కడలి నదుల మేళాలు.. ..
పూచిన పున్నాగ పూల సన్నాయి..
చూపులలో.. మూగ బాసలున్నాయి... (2 )
ఇద్దరి అలజడి.. ముద్దుల కలబడి..
నిద్దర లేచిన పొద్దుల్లో... చంద్రోదయం చంద్రోదయం.
చేరి సగమయ్యే.. కౌగిలిలో.. దిక్కులు కలసిన తీరాలు..
కౌగిలిలో గల జాబిలితో... చుక్కలు.. చూడని నేరాలు...
కన్నుల కాటుక చిలిపి.. ఉత్తరాలు..
పున్నమి వెన్నెల తగిలితే.. జ్వరాలు... (2 )
తూరుపు త్వరపడి.. పడమర స్తిరబడి...
విరవిరలాడిన విరి.. పాన్పులలో ...
విరులావిరులౌ .. నిట్టూర్పులలో ...
చంద్రోదయం .. చంద్రోదయం... ..
ఇంత చక్కని తెలుగు పాటకి వన్నెలద్దిన పద గురువు వేటూరికి, సంగీత వినీలాకాశంలో...చందమామ.. కే.వి. మహదేవన్ కి... నీరాజనం.
ఈ చంద్రోదయంని ఇక్కడే.. ఈ కార్తీకపు ఆ వెన్నెల కెరటాలలో.. తడిసి ముద్దయి. తనివితీరా ఆస్వాదించండి..
నీటిపై ప్రయాణం
ప్రయాణీంచిన దూరాన్ని తలచుకుంటే భయమేస్తుంది
ఎవరో నెట్టేసినట్లు వెనుతిరిగి చూడకుండా
నాకేం కావాలో, ఇతరులకేం ఇవ్వాలో తెలియకుండానే
కరిగిన కాలాన్ని చూస్తే దిగులు ముంచుకొస్తుంది
తప్పిదాలు పలక మీద వ్రాసిన అక్షరాలయితే
ఎంత బావుండును
చేసిన వాగ్దానాలు శిలాక్షరాలుగా నిలిచి
హెచ్చరించినా బావుండును
దారిపొడవునా నిలిచిన మైలురాళ్ళు
తరిగే దూరాన్ని గుర్తు చేసినా బావుండును
నడచినదారంతా మటు మాయమై
తొలి అడుగులో నిలిపితే మరీ బావుండును
ఆశా నిహతి నింపుకున్న
నీ గుండెని అడిగి చూడు...
నీ నిట్టూర్పు నడిగి చూడు
చేయాల్సిన ప్రయాణం సంగతేమిటో...
నిశ్శబ్దం ఒక యుద్ధమయితే
అందులోకి జారిపోవడం నిత్యనూతనమయితే
అస్ఫష్టంగానయినా గోచరించని సత్యమేదో
ఇంకా మిగిలి ఉంటుందంటే
నీ ప్రయాణం ఇంకా మొదలెట్టలేదన్నమాటే !
నీటిపై నడిచొచ్చిన గురుతులేవి లేనట్లన్నమాటే
నీకింకో జీవిత ప్రయాణాన్ని ముందుంచినట్లే!