24, నవంబర్ 2017, శుక్రవారం
అమ్మ ఆశీస్సులు
22, నవంబర్ 2017, బుధవారం
చిత్ర కవితలు
ప్రయాణం ఆగినాక .. ఉండటానికి లేకపోవడానికి పెద్దగా తేడా ఏమీ లేదు
అప్పుడెక్కడో ఉన్నావ్ ,మరిప్పుడెక్కడో ఉన్నావ్ . చూపుకి చిక్కకుండా మనసుకి దక్కకుండా
గడ్డిపూవు జీవితాలు ఇవి,ముగియడమే ఓ ప్రహసనం .
ఒక కల చిట్లిపోయిన తర్వాత రెండవసారి కల కంటూ
అవి నిజమవుతాయనుకోవడమే "జీవితం "
కినుక
అందరి హృదయంలో నేనున్నానంటారు
నా హృదయంలో ఎవరున్నారో ఒక్కరైనా అడగరే మరి !
బంధం
ఈ బాహువులు ప్రేమాయుధాలు
బిడ్డని సదా సంరక్షించడంలో
మరింత బల సంపన్నమవుతాయి
మరీ పునీతమవుతాయి
21, నవంబర్ 2017, మంగళవారం
అంతర్జ్వలనంలో నుండి.....
బ్లాగర్ గా యేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని యెనిమిదో సంవత్సరంలో అడుగిడబోతున్నాను. నిజానికి నేను నాలుగేళ్ళు కూడా క్రమబద్దంగా బ్లాగ్ వ్రాయలేదు, అయినా నా బ్లాగ్ కి సందర్శకుల రాక యెక్కువే అని గూగుల్ వీక్షకుల సంఖ్య చెపుతుంది. ఎన్నో వ్రాయూలని వుంటుంది. భుజంనొప్పి నిరుత్సాహం వల్ల వ్రాయడం తగ్గించాను.
ఈ రోజు నాకు బ్లాగ్ రూపొందించి యిచ్చిన నేస్తం "వైష్ణవి" గుర్తు చేసింది బ్లాగ్ పుట్టినరోజని. హృదయపూర్వక ధన్యవాదాలు వైషూ డియర్. పై పై మెరుగుల స్నేహ ప్రపంచపు లోగిళ్ళలో... అసలయిన స్వచ్ఛమైన చిరునామా రూపానివి నీవు.
మళ్ళీ బ్లాగ్ వ్రాస్తూ తీరికలేకుండావుండాలి... చురకత్తి నువ్వు అని ముందుకు నెట్టడానికి నాకు సమీపంలో లేవు... నా ప్రియ నేస్తాలందరూ ... నాకు దూరంగా వున్నా నాహృదయంలోనే వుంటారు. హృదయంతో వింటారు. .. నా సంగతులను... ఈ బ్లాగ్ ముచ్చట్ల రూపంలో.
ఏడేళ్ళు వొక కలలా గడిచిపోయాయి.. ఓ అల అలసి పోకుండా పడి లేస్తూనే వుంది. నవశకానికి దారిచూపింది. దాని వెనుక నువ్వున్నావు. सिर्फ़ तुम. వైషూ.. అందుకు నీకు మరీ మరీ కృతజ్ఞతలు.
నా బ్లాగ్ పుట్టినరోజు... నా మరో పుట్టిననరోజు. నన్ను నేను డైరీ మాదిరి చదువుకుంటూ, సమీక్షించుకుంటూ, విమర్శించుకుంటూ... బ్లాగ్ ఉలితో జీవనశిల్పాన్ని మలచుకున్నాను. ఇంకేమి కావాలి నాకు.. మొన్నీమధ్య సమకాలీన రచయిత వెంకట కృష్ణ గారు యిచ్చిన కితాబ్ "అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి" చాలును కదా! నిజానికి నేను అంతర్జ్వలనంలో నుండి అంతర్జాలం లోకి నడిచొచ్చిన సంగతి నా ప్రియ మిత్రులకే తెలుసు .
పాఠకుల, వీక్షకుల అభిప్రాయాలు. ప్రోత్సాహం ఎల్లప్పుడూ సరి కొత్త ఊపిరిని అందిస్తూ ... 380580 మందిమి మీ బ్లాగ్ దర్శించామని ,149383 సహా బ్లాగర్లు నన్ను చదువుతూనే ఉన్నారని 10202 మంది నేను ఎవరా అని ఆసక్తిగా చూసారని చెపుతుంటే .. నాకు గర్వంగానే కాదు సిగ్గుగా ఉంటుంది ఎందుకు వ్రాయడం మానేసానా ..అని . కొన్నాళ్ళ తర్వాత వ్రాస్తూనే ఉంటాను . ప్రస్తుతానికి విరామసమయం. నా బ్లాగ్ మిత్రులు చాలా మంది ఇక్కడ మిత్ర బృందంలో ఉన్నారు ..వారికి ధన్యవాదాలు తెలుపుతూ ...
"వనజ వనమాలి" కి పుట్టినరోజు శుభాకాంక్షలు .
15, నవంబర్ 2017, బుధవారం
స్వభావం
స్వభావం
ప్రేమో ద్వేషమో అభిమానమో ఆత్మీయతో అలకో ఆరోపణో
అన్నీ సహజంగా అప్పటికప్పుడు ప్రదర్శించడమే నా రీతి
వాటికి అడ్డుకట్టలేయాలని
యెప్పుడు యెంత బయటకు తీయాలో
యెక్కడెంత ముసుగు వేసుకోవాలో అని లెక్కలేసుకుండా
ఈర్ష్య అసూయో ఇసుమంత కూడా లేకుండా
సానుభూతి నసహ్యించుకుంటూ
జాలి దయ వర్షంలా ఎప్పుడు కురుస్తుందో తెలియకుండా
కురిస్తే ఆపకుండా ..
నిర్భయంగా నచ్చినదారిలో నడవవడమే నా మనిషి తనం
అడ్డుకట్టలేస్తే యే మాత్రం ఆగనిదాన్ని
భావనల మార్పుతో ప్రవహించే సెలయేటి సంగీతాన్ని
పదాల కనికట్టుతో కవితలల్లే అక్షర మంత్రదండాన్ని
ఈ పద్యమల్లే నేనే ఒక ప్రపంచాన్ని.
"నేను" అనే ఒక అహాన్నీ.
జ్వలనంలో బూడిదయ్యే వరకూ అది నీటిలో కరిగేంత వరకూ
యేమాత్రం నశించని..స్వభావాన్ని.
6, నవంబర్ 2017, సోమవారం
అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి
బ్లాగర్ ఫ్రెండ్స్ ..మీరూ చదవండి .. నాకెంతో సంతోషం అనిపించింది. ఎందుకంటే అంతర్జాలం నుంచి అంతర్జ్వలనంలోనికి ..అంటూ పరిచయం చేసారు. నేనొక రచయితని అని చెప్పుకోవడం కన్నా నేనొక బ్లాగర్ ని అని చెప్పుకోవడం నాకు గర్వకారణం కూడా .. వెంకట కృష్ణ గారూ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు .
ఈ లింక్ లో ..వెంకట కృష్ణ గారు వ్రాసిన సమీక్ష చూడండి .. అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి
అంతర్జాలం నుండీ అంతర్జ్వలనంలోకి
– వెంకట కృష్ణ
తాతినేని వనజ ఒక బ్లాగర్.బ్లాగులో అనుభూతి కథనాలు రాస్తూ రాస్తూ, నెట్ నుండీ ప్రింట్ లోకి వచ్చారీవిడ.నెట్లో వున్న భావవ్యక్తీకరణ ప్రింట్ లోనూ వుండాలని రాయికి నోరొస్తే,అనే కథాసంపుటిని ప్రచురించారు.వర్చువల్ రియాలిటీ కళ్ళముందు నిజమవటమే యీమె కథలు పుస్తకరూపం దాల్చడం.ఇందులోని కథలు ఒకట్రెండు మినహాయిస్తే అన్నీ వాడిపోని వాస్తవికతలే.రెండు మూడు మినహాయిస్తే అన్నీ నగరజీవిత చిత్రాలే.అయితే అన్ని కథలోనూ సంప్రదాయ సంస్కృతే సమస్యగా నడిపిస్తుంది, పరిష్కారం అన్వేషిస్తుంది.అన్నీ కథలూ స్త్రీ దృక్కోణం నుండి నడిచే కథలు గానేకాకుండా పురుషదృక్కోణం నుండీ నడిచే కథలూ వున్నాయి.సర్వసాక్షి కథనాలతో పాటు మ్యూజింగ్స్ లాంటి అంతరంగకథనాలూ వున్నాయి.మధ్యతరగతి దృక్కోణం నుండి అన్నికథలూ నడిచినా ఆ జీవితమే కాకుండా అట్టడుగు వర్గాల కిందికులాల అనుభవాలూ కథల్లోకొచ్చాయి.స్త్రీవాద ఛాయలున్న కథలు రాసినట్టే,మధ్యతరగతి స్త్రీలు అవకాశవాదులుగా ప్రవర్తించడాన్ని కూడా చిత్రించారు.వెరశి యీమె కథలు ఒక మూసలో కి కుదించి చెప్పడానికి వీలులేనివి.
రాయికి నోరొస్తే-తన అనాది అనుభవాలను తప్పక మాట్లాడుతుంది.అట్లనే చైతన్యం లేని స్త్రీ కి చైతన్యం వేస్తే తనకు జరిగే అవమానాల్ని ప్రశ్నిస్తుందనే సూచనతో వనజ గారు కథ రాసారు.సాఫ్ట్ వేర్ రంగంలో వుండి దేశవిదేశాల్లో గడిపిన ఆధునిక జంటలో పురుషుడికి,సగటు భారతీయ పురుషుడికి లాగానే పుట్టిన పిల్లల తనకు పుట్టినవాళ్ళేనా అనే అనుమానమొస్తుంది.DNA టెస్ట్ చెయించుకొమ్మని పట్టుబట్టి చేయించాక అది తప్పని తేలుతుంది.అయినా భార్యను క్షమాపణ అడగడు, పశ్చాత్తాపం ప్రకటించడు.అలాంటివాడి వైఖరిని నిరసిస్తూ విడిపోయే స్త్రీ కథ యిది.ఎంత ఆధునిక వేషమేసినా భారతీయ మగవాడు నీచ ఆలోచనలు మానడానికి చెప్పే కథ.
ఆడమనిషి గా పుట్టి పెరిగీ చదుకొనీ యెదిగినప్పటి యింటిపేరు ఒక్కసారిగా మాయమై పెళ్లి తోవచ్చిన కొత్త/పరాయీ యింటిపేరు , తర్వాతి జీవితాన్నంతా శాశించడంలోని ఆధిపత్యాన్ని వివరిస్తుంది ఇంటిపేరు కథ.కుంకుమబొట్టు రూపంలో హిందూ సంప్రదాయం చేసే అవమానపు గాయం గుర్తులను గడపబొట్టు కథ వివరిస్తుంది.స్త్రీలకు యెదురయ్యే అనేక అసహనాలు మరీ ముఖ్యంగా యిప్పటికాలపు విపరీతాలవళ్ళ యెదురయ్యే అసహనాలను కొంచెం వ్యంగ్యపు చురకలతో చెప్పిన కథనం ఇల్లాలిఅసహనం.
పై కథలన్నీ అంతోయింతో స్త్రీ వాద దృక్పథం నుండి రాసిన కథలు.అయితే స్త్రీ (మధ్యతరగతి)లలో వుండే అవకాశవాదాన్ని యెత్తి పడుతూ యిదే రచయిత్రి మర్మమేమి,పలచన కానీయకే చెలీ,కూతురైతేనేమీ, ఆనవాలు లాంటి కథలూ రాసారు.
ఈమధ్యకాలంలో ముస్లిమేతర మతాలకు చెందిన ఆడపిల్లలు గూడా నఖాబ్ ధరించి ముఖం కనబడనీయకుండా తిరుగుతూన్నారు. మర్మమేమి కథ యీ పాయింట్ చుట్టూ అల్లబడింది.ఈ కథలో నఖాబ్ ధరించి మొగుడి కళ్ళుగప్పి ప్రియుడితో తిరిగే హిందూ అమ్మాయి వల్ల నఖాబ్ ధరించడం తప్పనిసరి అయిన ముస్లిం యువతి పొరబాటున ఆ బాధిత మొగుడి దాడికి గురవుతుంది.నఖాబ్ దుర్వినియోగం లో వున్న అవకాశవాదాన్ని ప్రశ్నిస్తుంది కథ.అనవసర చనువుతో వగలువొలకబోస్తూ అవకాశవాదం తో స్నేహితురాళ్ళు నూ వాళ్ళభర్తలనూ వుపయోగించుకొనే స్త్రీ లున్నారనీ అట్లాప్రవర్తిస్తూ పలుచనైపోవద్దని స్త్రీ లను హెచ్చరించే కథ పలుచనగానీయకే చెలీ.మహిళల్లోని నెగెటివ్ షేడ్స్ నూ చర్చకు పెట్టడం రచయిత్రి లోని నిష్కర్షను వెళ్ళడిస్తుంది.తల్లిదండ్రులను వ్యాపారాత్మకంగా చూడ్డంలో కొడుకులే కాదు కూతుళ్ళూ తీసిపోరని కూతురైతేనేమి కథలో అంతే నిష్కర్షగా వివరిస్తుంది.ఫ్యాషన్ పేరిట అవమానకరమైన అర్ధనగ్న వస్త్రధారణ చేసే యువతి పోకడలను కంట్రీ వుమెన్ కూతురు కథలో అంతే నిష్కర్షగా విమర్శిస్తుంది.ఈ కథలనే కాదు అవకాశమొచ్చినప్పుడంతా మగపెత్తనాలను నిలదీస్తూ రాసినట్టే స్త్రీ లోని ఆధిపత్యాన్నీ అవకాశవాదాన్నీకూడా యీ రచయిత్రి నిగ్గుదేలుస్తుంది యీ కథలు సంపుటిలో.
అగ్రవర్ణ మధ్యతరగతి జీవితాలను చిత్రించడానికే పరిమితమైపోకుండా యీ సంపుటిలోని ఇంకెన్నాళ్ళు లాఠీకర్ర కథలు కిందికులాల స్త్రీ లను వారిలోని సాహసాన్నీ తెగింపు నూ చిత్రించాయి. ఇంకెన్నాళ్ళు కథలో సాంబమ్మ రాంబాబనే మోసగాడి మాయమాటలకు మొగుడ్ని వదిలేసి వాడికి వూడిగం చేస్తుంది.రాంబాబు సాంబను ఎడాపెడా వాడేసుకొని అప్పులపాల్జేసి పారిపోతాడు.తిరిగి యింకో స్త్రీ తో వుండి, ఆమె మొగుడు తంతే మళ్ళా సాంబమ్మ వద్దకే వచ్చినప్పుడు యీ సారి సాంబమ్మ వాడి మాయలో పడకుండా తన్ని తరిమి కొడుతుంది.సాంబమ్మ వంటి స్త్రీ లు యింకెన్నాళ్ళో మగదురహంకారాల్ని భరించరనీ జీవితానుభవం యిచ్చిన చైతన్యం తో వదిలించుకుంటారనీ చెబుతుంది రచయిత్రి.అలాగే కింది కులాల వ్యక్తులు యెంతో మానవీయంగా చిన్నపాటి అపేక్షలకైనా సదా కృతజ్ఞత గా వుంటారని,వాళ్ళని ఆదరించాలనీ చెబుతుంది రచయిత్రి కాళ్ళచెప్పు కరుస్తాది కథలో.
ఈ సంపుటిలో ముస్లిం జీవితాలను సృజించిన కథలున్నాయి.కాజాబీ,అమాయక ప్రేమను వివరించే జాబిలి హృదయం కథలో,అనివార్య పరిస్థితులలో పెళ్ళయి పిల్లలున్న మాధవ్ తో ఒక స్నేహితురాలి లాగా వుండే కాజాబీని ప్రేమకూ ఆరాధనకూ ప్రతిరూపంగా చిత్రించింది రచయిత్రి.అయితే కథలో వాళ్ళిద్దరి అకాల త్యాగమరణం వాళ్ళకు పుట్టిన పిల్లల్ని అనాథల్ని చేస్తుంది.మహీన్ కథలో, చదువు పట్ల ఆసక్తి వున్న మహీన్ ను పేద తల్లి చదివించలేకపోతుంది. అప్పుడప్పుడు వచ్చి పోయే తండ్రి యిచ్చే డబ్బులతో యిల్లు గడవడమే కష్టంగా వుండడంతో, మహీన్ ఫీజు కట్టడానికి చౌరస్తాలో పూలమ్మడానికి సిద్ధమవుతుంది.ఈ కథలో ముస్లిం స్త్రీలు బహుభార్యాత్వం వల్ల యెదుర్కొంటున్న దైన్యం చిత్రితమైవుంది.ఇప్పుడు కూడా రావా అమ్మా,కథ ఆశా అనే చిన్న పిల్ల తల్లి కోసం పడే తపన.ముస్లిం వ్యక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయి ఒక పాప పుట్టిన తర్వాత అతడి దురలవాట్లు భరించలేక విడిపోతుంది.అయితే పాపను తనవెంట తెచ్చుకోలేకపోయిన విషాదంలో యీకథ, తండ్రి మరణం-తల్లిమారువివాహం,అనే రెండు సంఘటనల నడుమ నలిగిపోయే ఆశాను ఆమె తల్లినీ దుఃఖభరితంగా మిగిలిస్తుంది.
2012 నుండి 2016 మధ్యా యీ రచయిత్రి 24కథలు రాసింది.సొంత బ్లాగు లోనూ వెబ్ మాగజైన్ లోనూ రాస్తూ అచ్చు పత్రికలకు ప్రయాణించింది.బ్లాగ్ రచన సీరియస్ గా చేసేవారికి పత్రికా సంపాదకులు పెట్టే లిమిటేషన్స్ తో నిమిత్తం వుండదు.కథానిర్మాణాలనో,శిల్ప చాతుర్యమనో చెప్పుకునే అడ్డంకులు ఉండవు. స్పాంటేనీటీ ప్రథమగురువు.కాస్తా రాయగలిగిన శక్తివున్న వేలవేల బ్లాగర్లు మనకళ్ళముందు అభిప్రాయప్రకటన చేస్తున్న కాలమిది.అచ్చును కేరేజాట్ అనుకున్నాక వచ్చే ధార చాలా స్వేచ్ఛ గలిగినది.అయితే అది కొండకచో గాఢత లేనిది కూడా.వనజ గారి కథనంలో బ్లాగ్ రచనా స్వేచ్ఛ ఆద్యంతమూ అగుపిస్తుంది.విషయ పరిజ్ణాణమున్న ప్రతి మనసులోనూ జరిగే మ్యూజింగ్ ప్రతికథనూ నడిపిస్తుంది.ఆ స్వేచ్ఛ ఆమెను ఇన్ హిబిషన్ లేని రాతలు రాయడానికి అవకాశమిచ్చింది.వెన్నెలసాక్షిగా విషాదం,స్నేహితుడా నాస్నేహితుడా, లఘు చిత్రం లాంటి కథలు అందుకు వుదాహరణగా నిలుస్తాయి.
ఈ కథలు అర్బన్ కథలుగా అగుపించినా స్థలరీత్యా సంభవించినా వీటి మూలం గ్రామీణమే.కథల్లో వచ్చే కాంట్రడిక్షన్ లన్నీ పాత సాంప్రదాయానికి ఆధునికతకు జరిగే ఘర్షణలే. వీటి తీర్పరిగా యీ రచయిత్రి ఆధునికత వైపుండి భారతీయ సాంప్రదాయం లో వున్న అన్ని చెడుగుల్నీ నిరసిస్తుంది.అంతిమంగా మానవీయత ను ప్రోది చేసేదిగా నిలబడింది. ఈ మెకు పర్యావరణ అపేక్ష వుంది.బయలు నవ్వింది, ఆనవాలు లాంటి కథల్లో అది కనిపిస్తుంది.ప్రకృతి పట్ల పారవశ్యం వుంది.సంగీతమైతే యెప్పుడు వీలుకుదిరితే అప్పుడు తెలుగు సీనీగీతాల చరణాలుగా కథల్లో కొస్తుంది.బ్లాగర్ కున్న స్వేచ్ఛ రీత్యా వయ్యక్తిక అనుభవాల అనుభూతులను కథనం చేయదగ్గ నైపుణ్యం రీత్యా కథకురాలిగా నిలబడ్డ యీమె భవిష్యత్తు లో మంచి కథలు రాయాలని ఆశీంచడం ఆమె బాధ్యత ను గుర్తు చేయడమే. ఈ సంపుటిలోని ఆమెనవ్వు పురిటిగడ్డ లాఠీకర్ర కథలు ఆనుభవ కథనాలుగా అగుపించినా వీటిని మరింత పరిశీలనగా గమనించి సృజించివుంటే యీకథలు యిప్పటి కోస్తాంధ్ర ఆత్మను ఆవిష్కరించివుండేవి.ఆమె నవ్వు కథ యెదోమేరకు కోస్తావ్యాపార సామాజిక స్వభావాన్ని పట్టుకున్న కథ.పురిటి గడ్డ కథ కోస్తాకు వలస వచ్చిన యితర ప్రాంతపు (కూలీ లుగా మారిన) రైతుల విషాదకథ. యీ వలసలు యెందుకు జరుగుతున్నాయనే కోణాన్ని తెరిస్తే, వనజ గారు అర్థం చేసుకోవాల్సిన కుట్రలను అర్థం చేయించే ఆకాశం అనంతమైందని చెప్పేకథ. లాఠీకర్ర , కోస్తాంధ్ర గ్రామీణ ప్రాంత అట్టడుగు వర్గాలు , బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వస్తే , అనివార్యంగా యెదుర్కొనే రాజ్యహింస. ఈ మూడు కథలూ యీ సంపుటి రీత్యా రచయిత్రి లేటెస్ట్ కథలు.ఆ తర్వాతి రాబోయే కథలన్నీ మరింత వైవిధ్యం గా విస్తృతంగా వుండాలని కోరడం అత్యాశ కాదు.
************(*)************
1, నవంబర్ 2017, బుధవారం
చిత్ర కవితలు
అక్కు పక్షులు
కనబడని పంజరాలెన్నో
ఈ ఆడ బ్రతుకులకు
అనుబంధాల సంకెళ్ళెన్నో
పేగు ని తెంచి జన్మ నిచ్చిన అమ్మలకు
ప్రేమతోనో బరువుతోనో తడిసిన రెక్కలతో
స్వేచ్ఛగా యెగరలేని అక్కు పక్షులు
ఈ ఆడమనుషులు.
***********************
లోపం లేని చిత్రం చింత లేని జీవనం
పరిపూర్ణమని భావించే జీవితం
అవి అసత్య ప్రమాణాలే !
కేవలం కవుల కల్పనలే !
జీవితమంటేనే......
అనివార్యమైన ఘర్షణ
*************************
మాధవ సేవ
భక్తులను సంఖ్యల లోనూ
కానుకులను ఆదాయంలోనూ
క్షేత సమాచారాన్ని తెలుసుకోవడం
నిత్యకృత్యమైన వేదన.
*************************
అనుభవం ఇలా చెపుతుంది ..
సహనంతో నిశ్శబ్దంగా వుండండి
నిందలు వేసిన నోళ్లె
వేనోళ్ళ కొనియాడతాయని
******************************
రోజూ వచ్చే చీకటి దాపున
రాబోయే వెలుగు గురించి
కనే కలల వెలుగులే..
నిత్య దీపావళి.