31, జులై 2013, బుధవారం

రక్త సంబంధం

ఫ్రెండ్స్ ! అనుబంధాల అల్లిక గురించి సీరియల్ గా కొన్ని పోస్ట్లు వ్రాదామనుకుంటూనే  ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.
 మన సోదర సోదరుల మధ్య బంధాన్ని "రక్త సంబంధం " అంటూ ఉంటాము కదా !  అలాంటి రక్త సంబంధీకుల గురించే ఈ పోస్ట్.

ఒక చిన్న పాప 4 ఏళ్ళు నిండి 5 వ సంవత్సరంలోకి అడుగిడింది .  రక్త హీనతతో బాధ పడుతున్న ఆ పాపకి అర్జంట్ గా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆ పాప కి కావాల్సిన గ్రూప్ రక్తం దొరకక .. సిటీ లో ఉన్న బ్లడ్ బ్యాంకు లన్నిటి చుట్టూ తిరిగి తిరిగినా కూడా ఆ గ్రూప్ రక్తం దొరకక, అవసర సమయానికి డోనర్స్ లభించక ఆ పాప మరణించింది. అయ్యో! ఈ ఊర్లో మనుషులే లేరా!? ఒక్కరు కూడా రక్తం ఇవ్వలేదు. ఒక్క బ్లడ్ బ్యాంక్ వాడు కనికరం చూపలేదు అని ఆ పాప తల్లి దండ్రులు బంధువులు హృదయ విదారకంగా ఏడుస్తుంటే చూసేవారికి కడుపు తరుక్కు పోయిందట. అది విన్న నాకు ఇలా అనిపించింది   "ఇంతటి కఠినాత్ముల ఉన్న లోకంలో బ్రతకడం ఎందుకని ఆ పాప చనిపోయింది"అని

మన చుట్టూ ఎన్నో బ్లడ్ బాంక్ లు ఉన్నా కూడా అవి సేవా గుణం ముసుగులో వ్యాపారం చేస్తున్నాయని తెలిస్తే మనుషుల్లో మానవత్వం లేదని బాధపడటమే కాదు,  ఆవేశం తన్నుకు వస్తుంది.  అందుబాటులో ఉన్న రక్తాన్ని దాచిపెట్టి రక్తం కావాల్సిన వారికి ఇవ్వకుండా వ్యాపారం చేసుకుంటూ 32 రోజుల తర్వాత ఎవరికీ ఉపయోగ పడనీ రక్తాన్ని మురుగుకాల్వ పరం చేసే బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గు చేటు. ఒక వ్యక్తీ నుంచి సేకరించిన రక్తాన్ని 32 రోజుల పాటు రక్షణ పద్దతులలో భద్ర పరచి అవసరం ఉన్న వారికి ఉపయోగించవచ్చు. ఇక్కడే బ్లడ్ బ్యాంక్ లు వ్యాపారం చేయడం నేర్చాయి .  ఎక్కువ డబ్బుకి అమ్ముకోవడం మొదలెట్టి అందుబాటులో లేదని చెపుతూ ఉంటారు. వారు అనుకున్న ధర వచ్చేదాకా అలాగే చెపుతూ ఆఖరికి వృధా అయినా చేస్తారు కాని అవసర పడిన వారికి ఇవ్వరని ఆసుపత్రుల సిబ్బందే చెపుతుంటారు.  అలాగే  బ్లడ్ బ్యాంక్లు 24 గంటల సేవలో కూడా ఉండటం లేదు ఉదయం 09:00 To  06:00 సమయాలలోనే అందు బాటులో ఉండి ఒక్క బ్లడ్ బ్యాంక్ మాత్రం 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా బ్లడ్ బ్యాంక్ ల వారు టైం టేబుల్ ఏర్పాటు చేసుకుంటారు అందువల్ల ప్రతి రోజు ఏ బ్లడ్ బ్యాంక్ 24 గంటలు అందుబాటులో ఉంటుందో ఆసుపత్రి సిబ్బందికి తప్ప మిగతావారికి తెలియవు. బ్లడ్ బ్యాంక్ లు మూసి ఉండటం వల్ల  అనారోగ్యంలో ఉన్న వారికి సరయిన సమయానికి రక్తం అందక అవసరార్దుల ఆందోళన   ఎలా ఉంటుందో అనుభవిస్తే కాని తెలియదు అని రక్త ప్రదాత బంధువు వ్యాఖ్యానించడం చూసాను

మన దేశ జనాబాకి సంవత్సరానికి   10 లక్షల యూనిట్ ల రక్తం అవసరపడుతుందని తెలుస్తుంది.   కొన్ని సేవా సంస్థలు రక్త  దాతల నుండి రక్తాన్ని సేకరించి  రహస్యంగా తరలించి 7000 యూనిట్ల రక్తం ని అమ్ముకోబోతుండగా ఆ విషయం బయటకి పొక్కి అరెస్ట్ చేయబడ్డారు. బ్లడ్ బ్యాంక్ ల సేవా ముసుగులో ఇలాంటివి బయటకిరానివి ఎన్నో ఉంటాయని చెప్పారు . ఇలాంటి విషయాలని చెపుతుంటే  వింటూ ఆశ్చర్య పోయాను.ఇలాంటి విషయాలు విని తెలుసుకుని స్వచ్చందంగా పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2011 వ సంవత్సరంలో కనగాల విజయ్ కుమార్ అనే వ్యక్తీ ... ఈ సంస్థని ప్రాంభించారు. ఆ సంస్థ అతని తోనే  ప్రారంభం  అయింది




మాకు సమీపంలో ఉన్న ఒక ఇంజినీరింగ్ కాలేజ్ లో ఈ రోజు ఈ  బ్లడ్ బ్యాంక్ పరిచయం జరిగింది . అక్కడ విన్న విషయాలు ఇవి. పైన  నేను చెప్పిన విషయాలని స్టూడెంట్స్ కి వివరిస్తూ బ్లడ్ డొనేట్  చేయవలసిన ఆవశ్యకత గురించి చెప్పారు



 ఈ బ్లడ్ క్రాస్  లో మెంబెర్ అయిన వ్యక్తీ నేరుగా బ్లడ్ ని డొనేట్ చేయవచ్చు. చేయాల్సినదల్లా  మీ పరిసర ప్రాంతాలలో  ఉన్న బ్లడ్ క్రాస్ సంస్థలో మీ వివరాలు అందజేయడమే ! మీ గ్రూప్ రక్తం అవసరమైనప్పుడు మీకు ఈ సంస్థ కార్యకర్తల నుండి ఫోన్ వస్తుంది. మీరు  రక్తం కావాల్సిన వ్యక్తీ ఉన్న హాస్పిటల్ కి నేరుగా వెళ్లి అక్కడ వారికి కావాల్సిన రక్తం ని అందించడమే1 ఈ పనిలో అందరూ స్వచ్చందంగా పని చేస్తారు.  జీత భత్యాలు ఏవి ఉండవు ఎలాంటి చార్జీలు వసూలు చేయబడవు. రక్తం సేకరించడం, దానిని నిల్వ చేయడం లాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా రక్త దాత నుండి రక్త ప్రదాతకి రక్తం లభ్యం అవుతుంది. ఇప్పటికి ఈ బ్లడ్ క్రాస్ సంస్థలో 3 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. వారి వారి ప్రాంతాలలో అవసరం అయినప్పుడు రక్తం ఇవ్వడానికి, మరీ అత్యవసరం అయితే ఇతర ప్రాంతాలకి వెళ్లి కూడా రక్త దానం చేసే వారు ఉన్నారు.అదీ గొప్ప విషయమే కదండీ!















ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఈ బ్లడ్ క్రాస్ సంస్థ లో సభ్యులగా చేరవచ్చును. రక్త దాతలుగా మారవచ్చును. దుర్వినియోగం కాని  రక్త దానం  చేసామన్న సంతృప్తి కల్గుతుంది. స్వచ్చంద సేవ ముసుగు వేసుకున్న సంస్థలకి రక్త దానం చేయడం కన్నా ఈ విధానం చాలా బాగుందని నాకు అనిపించింది. అపాత్రదానం అవకుండా ఉంటుంది కదా! ఇది మనిషికి మనిషికి ఉన్న రక్త సంబంధం. కాదంటారా !?

మనకి రక్త దానం చేసే విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. సరయిన బరువు ఉన్న వ్యక్తులు ఎవరైనా రక్త దానం చేయవచ్చని చెప్పారు . ఈ మధ్య 70 సంవత్సరాలు పై బడిన వ్యక్తీ కూడా బ్లడ్ క్రాస్ ద్వారా రక్తదానం చేసారట. ఇంకేం ...  మనమూ బయలుదేరవచ్చు కదా! ఈ సందర్భంలో  రేడియోలో వినవచ్చే ప్రకటన ఒకటి గుర్తుకు వస్తుంది  thalassemia తో బాధ పడే ఒక పాప ఒక వ్యక్తీ కి థాంక్స్ చెపుతుంది. ఎందుకు ..పాపా ..నాకు థాంక్స్ చెప్పావు, నాకు అసలు నువ్వు పరిచయమే లేదు. నీకు నేను ఏ సహాయం చేసాను అని అడుగుతాడతాను. అప్పుడు ఆ పాప ... ఇప్పుడు చేయకపోయినా ఇక ముందు అయినా చేయండి thalassemia తో బాధపడుతున్న వారి కోసం రక్త దానం చేయండి .. అని చెపుతుంది. అది రక్త దానం యొక్క ఆవశ్యకత. ప్రకటన టచింగ్ గా ఉంది కదా!

రక్తం దొరకక మళ్ళీ మరో పాప చనిపోకూడదు. అని మనకి ఎంతో  సిగ్గు చేటు కదా !

 ఇలా బ్లడ్ క్రాస్ సంస్థలకి  రూపకల్పన చేసే  విజయ కుమార్ లు ఎందఱో కావాలి. కనీసం  అలాంటి సంస్థ లో సభ్యులైనా కావాలని ... నా ఈ చిన్ని ప్రయత్నం.

(   ఏమిటీ సోది అనుకోకుండా ... ఈ పోస్ట్ ని ఓపిక గా చదివిన అందరికి ధన్యవాదములు )

29, జులై 2013, సోమవారం

అంతా నాటకమేనా !?

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం,  ఆత్మ తృప్తి కై మనుషులు ఆడుకునే వింత నాటకం ... అనే పాట  నాణెం లో ఒక వైపుని  మాత్రమే  చూపుతుంది. ఏ జీవితం గురించి అయినా ఒక్కరు చెప్పినదే నిజమని మనం తీర్మానించుకోకూడదు. ఒక జీవితం గురించి నలుగురు చెప్పినప్పుడే ఆ జీవితం గురించి మనకి తెలుస్తుంది అనేది చాలా నిజం.

మనుషుల మధ్య అనుబంధాలు లేకుండా  యాంత్రికంగా, ఏకాకితనం తో బ్రతకడంలో అర్ధమేలేదనిపించిన ఎన్నో అనుభవాలు ఎవరికైనా ఉంటాయి . అనుభవంలోకి రాని  విషయమంటూ కాదు కదా ఇది. మనిషే కాదు పశు పక్ష్యాదులు, జంతు  జీవాలు కూడా ఒంటరిగా మనలేవు . పంచుకునే తోడుంటేనే కష్టానికైనా సుఖానికైనా విలువ.
చాలా మంది అన్ని సౌకర్యాలు ఉంటే  చాలు మనుషులు బ్రతికేయవచ్చు అనుకుంటారు. తోటి మనుషుల పట్ల విముఖత కలగడానికి వారి కారణాలు వారికుండవచ్చు . నలుగురి మధ్య మసలలేక  ఏకాంతం కావాలనుకోవడం వేరు., ఏకాకితనం గా బ్రతకడం వేరు. వారి వారి అభిరుచులు సినిమాలు , సంగీతం,సాహిత్యం, స్నేహితులు,మత్తు మందులు, విందులు, పొందులు కూడా  కొన్నాళ్ళకి వెగటు కల్గిస్తాయి. మన కొరకు ఎవరున్నారు అనుకుని వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉండరు. కొందరు అందరూ ఉండి  కూడా ఏకాకి బ్రతుకు బ్రతకడం కద్దు.

అసలు కుటుంబం అంటే ఏమిటో. ఆ కుటుంబంలో ఇచ్చి పుచ్చు కోవడం అంటే ఏమిటో, వేరొకరి కొరకు తమ ఆసక్తులను చంపుకుని వారి కొరకు త్యాగం చేసుకోవడం, కష్టం వస్తే పంచుకోవడం,సుఖం వస్తే సంతోషించడం , తన కొరకు  ఎదురుచూసే ఒక ప్రాణం, తన వాళ్ళు అనుకుని చుట్టుకునే బంధాలు ఇవేమి లేకపోతే  మనిషికి ఏమి లేనట్లే! ఇప్పటి జనరేషన్ వారికి ఉమ్మడి కుంటుంబంలో ప్రేమలు ఆప్యాయతలు తెలియవు . చిన్న తనం నుండి చదువుల ఒత్తిడి  ఎంత ఉంటుందో అంతకు రెట్టింపు కావాల్సిన వాటిని పెంకితనంతో సాధించుకుంటారు . తల్లిదండ్రులు కూడా వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికే ఉన్నట్లు ఉంటున్నారు. అందుకే నాది - నేను అనే తత్త్వం పెంచి పోషింపబడి ఇతరులతో సర్దుకోలేని, సరి పుచ్చుకోలేని, రాజీ పడని  ధోరణిలో  వింత నడక నడుస్తున్నారు. "ప్రేమ నిచ్చిన ప్రేమ వచ్చును " అనే మాటలో ఎంత నిజం ఉందొ కాని ఒకరి పొడ  గిట్టకుండా బ్రతకడంలో ఆనందాన్ని వెదుక్కుంటున్నారు ఆధార పడటం  అంటే నామోషీ అనుకునే రోజులు వచ్చేసాయి. బ్రతికినన్నాళ్లు నచ్చినట్లు బ్రతకడం, బ్రతకలేనప్పుడు చద్దాం. అప్పుడు సంగతి ఇప్పుడెందుకు ? అని అనుకునే వారిని చూస్తున్నాం.

నాకు ఆరేళ్ళ నుండి తెలిసినతను  ఒకరు ఉన్నారు. మా ఇంటికెదురుగా ఉన్న  బిల్డింగ్ లో ఉండేవాడు. హోటల్ & రెస్టారెంట్ నిర్వహిస్తూ వాటితో పాటు అనేక బిజినెస్ లు చేసేవాడు. గోదావరి జిల్లా అబ్బాయి. తండ్రి చనిపోయాడు. తల్లి పల్లెటూరిలో లంకంత కొంపలో  పనివాళ్ళ సాయంతో పొలాలని చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు విదేశాలలో  ఉంటాడు. పెళ్లి అయి ఏదో తేడాలు వచ్చి ఒక నెలకే విడిపోయారు . రెండో అతను  కూడా  నలబై ఏళ్ళు  దగ్గర పడుతున్నా పెళ్లి పెటాకులు లేకుండా కాలేజీలకి వెళ్ళే అమ్మాయిలకి సైట్ కొడుతూ   జాలీగా గడుపుతూ ఉన్నాడు. ఆ తల్లి అలమటించి పోతుంది. ఇద్దరు కొడుకులు అలా తగలడ్డారు అని.  ఇటీవల కాలంలో డబ్బుతో సర్వ సుఖాలు అనుభవించ వచ్చు అనుకునే వారు పెరుగుతున్నారు అనడానికి ఇలాంటివే ఉదాహరణలు.
జల్సాగా తిరుగుతూ వివాహ జీవితం, కుటుంబం అనవసరం అనుకుంటున్న వారికి  కుటుంబం . కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలు గురించి (సినిమాలలో చూపే అనుబంధాలు కాదు ) కొన్ని సజీవ సంబంధాల గురించి ఒక పోస్ట్ వ్రాస్తాను .

.... అంతా నాటకమేనా !? కాదు, అనుబంధాల అల్లిక  అంటే ఏమిటో ... ఈ నాటి పోస్ట్ పెద్దది అవుతుంది కాబట్టి .. రేపటి పోస్ట్ లో ఆ విషయాలు..

26, జులై 2013, శుక్రవారం

సర్వం వ్యాపార మయం



భక్తి వ్యాపారం అయిపోయిన కాలం ఇది. శ్రీశైలం అంటే ఎంతో ప్రశాంతమైన ప్రదేశం అని అందరూ అనుకుంటూ ఉంటాం. తిరుమల క్షేత్రం తో పోల్చుకుని శ్రీశైల  భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి  క్షేత్రం ని అభివృద్ధి చేయాలనుకుని వ్యాపార మయం చేస్తున్నారనిపిస్తుంది.

దేవస్థానం యొక్క  అధికార గణం ఎప్పుడు పడితే అప్పుడు దర్శన సమయాలని, నియమ నిబంధనలని మార్చేస్తున్నారు. ప్రతి నిత్యం  మల్లి కార్జున స్వామి వారికి సుప్రభాత సేవ , ప్రాతఃకాల అభిషేకం,మంగళ హారతి తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ద్వారా టికెట్ కొనుకున్న భక్తులని  మూలవిరాట్టుకి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తారు. 05:00 to 06:30 గంటల వరకు 250 టికెట్ల వరకు ప్రవేశం కల్పిస్తారు తర్వాత అభిషేకం  కోసం  600  రూపాయల  టికెట్ కొనుక్కున్న భక్తులకి ప్రవేశం కల్పిస్తారు. రోజు వారి పద్దతి అది

ప్రత్యేకదినాలలో ప్రముఖుల దర్శనాలతో, దేవస్థానం ఉద్యోగుల రికమండేషన్ లతో నేరుగా అంతరాలయంలోకి వెళ్ళే భక్తులతో  మిగతా భక్తులకి గంటల తరబడి వేచి ఉండాల్సివస్తుంది. ఎంతో శ్రమకి ఓర్చి గంటల తరబడి క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుని స్వామి దర్శించుకోవాలనుకునే వారికి పడిగాపులు తప్పడం లేదు. మొన్న గురు పూర్ణిమ రోజు అలాగే జరిగింది.  ఆన్ లైన్ లోను ,ముందు రోజు రాత్రి 07:30 గంటలకి ఇచ్చిన టికెట్ లు మొత్తం 1000 టికెట్లకి పైనే ఉన్నాయి. దేవస్థానం వారికి ఆ రోజున వచ్చిన ఆదాయం ఒక్క అభిషేకం టికెట్ల పైన 10 లక్షలు రూపాయలు. ఇక ఉదయం పూట 07:00 నుండి ఇచ్చే అభిషేకం టికెట్ లు  600  రూపాయలవి ఎన్ని ఇచ్చారో... తెలియదు. అడ్వాన్స్ టికెట్ లు 1000 టికెట్ల వరకు ఇచ్చినవారికే మధ్యాహ్నం 03:30 వరకు సమయం సరిపోతుందని అనౌన్స్ చేసారు . 129,130,131 సీరియల్ నంబర్ల  గల మేము 04:45 కి అభిషేకం చేయించుకునే వారు వేచి ఉండే స్థలం కి చేరుకుంటే 11:30 కి స్వామిని అభిషేకించుకునే అనుగ్రహం దక్కింది. ఈలోపు అంతా VIP ల తాకిడి.  ఏం జేస్తాం !? భక్తులు సహనం వహించక తప్పదు కదా !  ఆ రోజున అంతా పక్కా వ్యాపార సంస్కృతి రాజ్యమేలింది అక్కడ. అయినా భగవంతుని కరుణా కటాక్షాలకి లోటు లేదక్కడ .

ఐదారేళ్ళ క్రితం వరకు ధ్వజస్థంభం ని తాకి నమస్కరించుకుని తొలుత నందీశ్వరుని కి మ్రొక్కి ఆయన అనుమతి తీసుకుని ..స్వామి దర్శనానికి వెళ్ళడం  ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు అవేమి లేవు. ఎడమవైపుకు ప్రత్యేక దర్శనం  టికెట్ కొనుక్కున్న వారు వెళ్ళాలి. కుడి వైపు అభిషేకం టికెట్లు కొనుక్కున్న వాళ్ళు వెళ్ళాలి. నేరుగా ఉచిత దర్శనం భక్తుల క్యూ  ఉన్నాయి . ఏ ఒక్కరు నందీశ్వరుని  మొక్కే అవకాశమే లేదు  సంప్రదాయాలు అన్నీ మార్చేసారు.

 ఇక ఆన్లైన్ లో టికెట్ కొనుక్కున్న వారు ఏ మాత్రం ఆలస్యం భరించలేము అన్నట్లు మిగతావారిని త్రోసుకుంటూ లోపలకి జొచ్చుకు వెళ్లాలని ప్రయత్నించడం చూసి వెగటు పుట్టింది. వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే! అయినా నియమ నిబందనలు పాటించరు. సీరియల్ నంబర్ ప్రకారం వారి వంతు వచ్చే వరకు ఆగలేరు. పోటీ పడి మరీ ముందుకు తోసుకు వెళ్ళారు. ఇలాంటి వారే వారు ప్రశాంతంగా ఉండరు ,ఎదుటివారిని ప్రశాంతంగా ఉండనీయరు.

వసతి గృహం దొరకబుచ్చుకోవడం నుండి గంటల తరబడి క్యూ లైన్ లలో నిలబడటం, వర్షం ల  మధ్య ఈ సారి మా శ్రీశైల యాత్ర దిగ్విజయంగా ముగిసింది

ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా "శాకంభరీ " ఉత్సవాలు నిర్వహించారు. . ఆలయ ముఖద్వారాన్ని, ముఖ మండపాన్ని, ద్వజస్థంభంని, నందీశ్వరుణ్ని, మల్లికార్జున స్వామీ అంతరాలయం వరకు కాయగూరలతో అలంకరించారు. అలాగే "అమ్మ " వారిని ప్రత్యేకంగా "శాకంభరి" గా అలమ్కృతం గావించారు . అన్ని రకాల కాయగూరలతో ఎంతో శ్రద్దగా అలంకరించిన వారిని మెచ్చుకోకుండా ఉండలేం అంత సర్వాంగ సుందరంగా అలంకరించారు ఒక్క ఫోటో కూడా తీయలేకపోయాను. ఐ ఫోన్ చేతిలో ఉంది కదా అని కెమెరా పట్టుకుని వెళ్ళలేదు.  బస్ ప్రయాణం లోనే మా అమ్మాయి  డాటా కార్డ్ అంతా వాడేయడం,  నా పోన్ లో చార్జింగ్ అయిపోవడం ,  ప్లగ్ పిన్ సెట్ అవక చార్జ్ చేసుకోవడానికి కుదరక పోవడం ,  e రీచార్జ్  కాని 3G కార్డ్  కాని అక్కడ లభ్యం కాకపోవడం వల్ల ఎన్నో పిక్స్ తీయాలన్న  ఆశ నిరాశ అయిపొయింది ప్చ్ !  కానీ ఎలాగోలా రెండు వీడియో క్లిప్పింగ్స్ మాత్రం పట్టుకొచ్చాను..    (ఎవరైనా పోటోస్ తీసుకోవాలనుకుంటే ఇవన్నీ ప్రయాణంకి  ముందే  సరి చూసుకుని తీసుకువెళ్ళండి. అక్కడ ఏవి దొరకవు  మరి )

ఇక్కడ ఒక విషయం చెప్పాలి ..  ఆ రెండు రోజులు  ఐ పోన్ వాడగల్గే సౌకర్యం లేనందుకు నేను  బాధపడలేదు. పోన్లే.... ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రశాంతంగా రెండు రోజులు ఉండగల్గినందుకు సంతోషం వేసింది.  

చివరిగా ఒక మాట . ప్రశాంతమైన ఆ వాతావరణంలో భగవంతుని సన్నిధిలో గడపాలనుకుని వెళ్ళడం బాగానే ఉంటుంది. కానీ అక్కడ వాతావరణంలో  అంతా వ్యాపార సంస్కృతి యే గోచరించింది. "తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు "  ఇటీవల కేదార్ నాథ్ విలయ తాండవం మన స్మృతిపథం నుండి చెరిగిపోలేదు పుణ్య క్షేత్రాల పవిత్రతని కాపాడుకోవడం ,సర్వం వ్యాపార మయం చేయకుండా ఉంటే బావుంటుంది. భక్తులే కాదు దేవస్థానం వారు కూడా. సర్వం శివమయం స్థానే వ్యాపార మయం అయిపోకుండా ఉంటే చాలా బావుంటుందని అనేక సార్లు అనుకున్నాను.

నిరాడంబరుడు, అభిషేక ప్రియుడు అయిన ఆయనకీ అలంకారాలు,  ఆడంబరాలు బాంక్ లలో కూడబెట్టే దనం సంగతి మరచి పేద-ధనిక తారతమ్యం లేకుండా అందరికి ఆ స్వామీ "స్పర్శదర్శనం '  భాగ్యం ని కలగజేస్తే బావుండును అనిపించింది. ఆ దర్శనం కోసమే .. ఆ స్పర్శ ద్వారా లభించే ఉపసమనం కోసమే నేను పదే పదే స్వామి దర్శన భాగ్యం కోసం ఎదురుచూస్తాను. అదండీ విషయం .  ఓం నమఃశివాయ !

.

25, జులై 2013, గురువారం

విన్నపాలు వినవలె

 మిత్రులారా!  ఈ విన్నపం వింతే... అనుకోండి కానీ.. అవలోకించండి ప్లీజ్ !!

ఇంటర్నెట్  అనే  పుడమి ఒడిలో  ఒక చిన్నపాటి ఆసక్తి  అనే విత్తం నాటి మొలకలా మారి ఈ బ్లాగ్ ప్రపంచంలోకి వచ్చి పడ్డాను.

నాకు వ్రాయాలనే ఆసక్తి లేకుంటే, నేను వ్రాసినవి చదివి నన్ను ప్రోత్సహించిన మితృలు లేకుంటే నేను రెండున్నరేళ్ళు బ్లాగ్ ని నిర్వహించ లేకపోయేదాన్ని కూడా. నేను బ్లాగ్ వ్రాయడం అంటే ఓపెన్ డైరీ వ్రాయడం లాంటిదనే అనుకుంటాను. నా చుట్టూ జరిగే విషయాలని గమనించడం,సమస్యకి స్పందించడం,నా ఆలోచనలకి అక్షరరూపం ఇవ్వడం ద్వారా సఫలీకృతం అయ్యాననే అనుకుంటూ కబుర్లు,  కథలు,కవితలు,వ్యాసాలుగా మలచి ఇక్కడ ఉంచాను

ఈ బ్లాగ్ నడకలో నేను ఎన్నో నేర్చుకున్నాను. కొందరి అకారణద్వేషానికి గురి అయ్యాను . అయినా నేను వెనుకడుగు వేయలేదు. ఒకరకంగా బ్లాగ్ మాత్రమే నా జీవితంకాదు,అయినప్పటికీ పట్టుదలగా బ్లాగ్ వ్రాస్తూనే వచ్చాను.  ఇక్కడ నేను ఏదో సాధించాను అనేదానికన్నా ఒక స్ట్రాంగ్ పర్సన్ గా నన్ను  నేను మలచుకున్నాను. అది నిజంగా నాకు గర్వకారణమే! ఒక తల్లిగా,సామాజిక భాద్యత కల్గిన ఒక పౌరురాలిగా ఎన్నో విషయాలని నేను ఇక్కడ షేర్ చేసుకున్నాను. ఇక్కడ మితృలనుండి అనేక విషయాలు నేర్చుకున్నాను నా ఈ బ్లాగ్ నడకలో నా రాతలని అభిమానించి,నన్ను ప్రోత్సహించిన మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు

ఇండీ బ్లాగర్ లో సభ్యురాలిగా ఉన్న నేను .. ఇప్పుడు ఇండీబ్లాగర్ వారు ప్రకటించిన ఇండీ బ్లాగర్ అవార్డ్ 2013 కి నేను నా బ్లాగ్ ని నామినేట్ చేసాను. నాకు గురుతుల్యులు అయినవారితో పోటీ పడుతున్నాను. ఈ పోటీ స్పూర్తికరంగా సాగుతుందని నాకు తెలుసు. నా బ్లాగ్ ని అభిమానించే మిత్రులందరూ మీ Face Book ID తో లేదా మీ tweet ద్వారాను నా బ్లాగ్ ని రికమండ్ చేసి .. నా బ్లాగ్ పై మీ అమూల్యమైన అభిప్రాయాలని వ్యాఖ్య రూపంలో తెలియజేస్తూ ..  వనజ వనమాలీ బ్లాగ్ కి మీ మద్దతు ని తెలియజేయాలని కోరుకుంటూ ... గెలిపించాలని కోరుకుంటూ... ఈ లింక్ ద్వారా వెళ్లి మీరు మీ మద్దతు తెలుప వచ్చును .

http://www.indiblogger.in/iba/entry.php?edition=1&entry=42783

 ధన్యవాదములతో ..  వనజ తాతినేని




24, జులై 2013, బుధవారం

నా రీచార్జ్ రహస్యం

(నాస్తికులకి ఈ పోస్ట్ నచ్చక పొతే మన్నించాలి )

నిత్య జీవితంలో అనేక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఏ కారణం లేకుండానే డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం... ఎందుకో !? పెద్ద కారణాలు కూడా ఉండనవసరం లేదు . ఈ మధ్య ఎందుకో ..అకస్మాత్ గా మూడీగా,  నిరాసక్తంగా ,నిస్తేజంగా ఉండిపోయాను. ఏ పని ఉత్సాహంగా చేయాలనిపించడం లేదు. చదవాలనిపించడం లేదు. అలాగే బ్లాగ్ వ్రాయడం కూడా . గత రెండేళ్లలో ఇలా ఉండటం మొదటిసారేమో!  ఈ నిస్తేజాన్ని పారద్రోలి కాస్త చురుకుగా ఉండాలంటే మానసిక ఉల్లాసం ఉండాలి. కోల్పోయిన శక్తి ని కూడా గట్టుకోవాలని ... అలా కొద్ది రోజులుగా అనుకుంటూనే ఉన్నాను. కానీ అడుగు బయటకి వేసే ప్రయత్నమయితే  చేయలేదు .  ఒక వారం రోజులుగా ... వెదికి వెదికి... రక రకాల స్వరాలలో "నిర్వాణ షట్కం"  అయితే వింటున్నాను . అంతలో సడన్ గా మా చెల్లి  "అక్కా " శ్రీశైలం వెళదామా ? అని అడిగింది. వెంటనే ..సరే ... అనేసాను . ఓ .  రెండు రోజుల పాటు మల్లికార్జునుడి సన్నిధిలో ఆయన దర్శన భాగ్యం లో ఎంతో మానసిక శాంతి లభించింది . ఆ తపోభూమిలో ..శ్వాసించిన క్షణాలు,రోజులయి... నన్ను నేను రీచార్జ్ చేసుకునేందుకు ఉపకరిస్తాయి. 
నాకెంతో ఇష్టమైన ఈ ప్రదేశం...  నా రీచార్జ్  రహస్యం .... ఇదిగో.. ఇక్కడే ! 





రెండు భిన్న స్వరాలలో " నిర్వాణ షట్కం " ని   ఇక్కడ  విని అలౌకిక ఆనందం లో మునిగి తేలుతూ
శివోహం .. శివోహం .. శివోహం  అనుకుందాం.




శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ |

మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||

అహం ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||

న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||

అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న వా బన్దనం నైవ ముక్తి న బంధః |
చిదానంద రూపః శివోహం శివోహం ||

న మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||

శివోహం శివోహం, శివోహం శివోహం, శివోహం శివోహం | ౨ | 

19, జులై 2013, శుక్రవారం

ప్రకృతి - కాంత

ఆమె ఫలభారం ని మోస్తున్న తరువులా ఉంది
అందరికి అమృత ఫలాలని రాల్చుతూనే ఉంటుంది
 అయినా రాలుగాయిల తాకిడికి బలవుతూనే ఉంటుంది

ఆమె ఒక పూల తీగలా అల్లుకుని  ఉంది
దారెంట వెళుతూ  అందరూ  గాలిలా మారి పరిమళాలను మోసుకు వెళుతున్నా సరే  
తన కోసమేమిమి దాచుకోకుండానే నేలతల్లి  ఒడిలో తనువూ చాలించింది

తనువుకెన్ని  గాయాలు చేసినా గాలి పూరింపగానే
మధుర స్వరాలని పలికించే  వెదురులా ఉంది,
మొదలంటా నరికినా చివురులు తొడిగి  పొదలా పరిఢవిల్లుతూనే ఉంది

సహజాతిసహజమైన  ప్రేమని పంచే బలహీనతలోనే .
కసాయి వేటుకి బలిఅవుతూనే ఉంది.
ప్రకృతి - కాంత కి నరవేటు పెను చేటు







16, జులై 2013, మంగళవారం

కథ కాని జీవితాలు ఇలా....

 పెళ్ళి తర్వాత ..   చాలా మంది జీవితాలలో ఇలా  ఉంటుందని ... నా ఆలోచన

 నాన్సెన్స్.. అది నాకన్నా అందంగా ఉందా ? నాకన్నా ఎక్కువ చదువుకుందా ? నాకన్నా ఎక్కువ సంపాదిస్తుందా  ?  నాకన్నా ధనవంతుల కుటుంబంలో పుట్టి పెరిగిందా ? పెళ్ళయిన తర్వాత కూడా  ఆమెలో  ఏం చూసి ప్రేమించావు ? ఓ ..భార్య  తన భర్తని ఆవేదనతో ప్రశ్నించింది

ఇవన్నీ ఏమికావు . ఆమె నేను చెప్పినట్లు వింటుంది. నిజంగా చెప్పాలంటే .. ఆమె నా చెప్పు చేతల్లో ఉంటుంది అణగిమణగి పడి  ఉంటుంది, నీలా తోక తొక్కినా తాచులా ఉండదు భర్త సమాధానం.

**********************************

ఎప్పుడు నగలు కొనండి , చీరలు కొనండి,కార్లలో తిరగాలి, భవంతులలో  నివసించాలి
అనే కోరికలు తప్ప మనసున్న మగవాడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు అనుకోవేమిటే !? నా ఖర్మ కొద్దీ దొరికావు. నీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక సన్యాసం పుచ్చుకుంటాను  అని  ఒక భర్త ఆవేదన

***********************************

కావాల్సినన్ని నగలు కొంటున్నా,  కోట్లు కూడబెడుతున్నాను. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నాను.పిల్లల గురించి శ్రద్ద తీసుకుంటున్నాను. అయినా కూడా  నా సరదాలు, నా ముచ్చట్లు పై  నీకు అభ్యంతరం ఎందుకుండాలి? ..భర్త  ప్రశ్న
ఎన్ని నగలు నాణ్యాలు భవంతులు,కోట్లు  ఉంటేనేమి భర్త మనసులో స్థానం లేకపోయాక .. ఈ బ్రతుకు ఎంత వేదనో, భరించేవారికే తెలుసు . ఇలా .భార్య కన్నీటి స్వగతం

*************************************

బాగా అందంగా ఉన్నానని,సంపాదిస్తున్నాని, వెనుక ఆస్తిపాస్తులున్నాయని తగని గర్వం. మొగుడంటే  వీసమెత్తు గౌరవం లేదు, అత్తమామలు, భర్త తోబుట్టువులు ఎవరితోనూ సంబంధాలు  ఉండకూడదు. జీవితాంతం తన కొంగట్టుకునే తిరగాలి. గీసిన గీటు  దాటకూడదు. ఇది పెళ్ళాం కాదు బ్రహ్మ రాక్షసి రా  బాబోయ్ .. ఓ ..భర్థ గోడు

**************************************

దొంగ సచ్చినోడా .. పొద్దంతా పనిపాట లేకుండా తిరిగి సాయంత్రానికి త్రాగుడికి కూడా నన్నే డబ్బివ్వమని పీక్కు తింటావా?  బిడ్డలతో పాటు  నీకు పొట్టలోకి   కూడేయ్యగలను కాని మందుకి నేనెక్కడ ఇవ్వగలను .. నువ్వు చావరా పీడా పోద్ది.!  చచ్చాడని ఒక ఏడుపేడిసి.. బిడ్డలని పెంచుకుంటా .. ఓ.. పేద శ్రామికురాలి కంఠశోష

**************************************

సంపాదించడం , తినడం , పడుకోవడం .అంతా యాంత్రికత.  ఫీలింగ్స్ లేవు , ఎమోషనల్ అంటూ ఏమిలేదు. మనసు లేదు, మమత లేదు .అంతా నటన ..చీ వెధవ బ్రతుకు ..  ఆర్ధిక స్వాతంత్ర్యం కల్గి అన్నీ ఉన్నా ఏమి లేని డొల్లతనం ని బహిర్గతం చేస్తూ ..ఒక స్త్రీ వేదన .

******************************************

"పుర్రెకొక ఆలోచన -జిహ్వ కోక రుచి " .జీవితాలలొ కనబడే అనేకానేక  కోణాలు.

కొస మెరుపు : ఏ ఒక్క వ్యక్తి చెప్పినదీ పూర్తీ జీవితం కాదు.   అయినా సరే  జీవితం వెళ్ళి పోతూనే...  ఉంటుంది. 

13, జులై 2013, శనివారం

తృతీయ ప్రకృతి


ఒక ప్రయాణికుడిని రైల్వే  స్టేషన్  నుండి  తన ఆటో లో ఎక్కించుకుని వచ్చి ఐదు  నక్షత్రాల హోటల్ ముందు ఆపాడు శేషు.  డాబుగా ఉన్న ఆ బాబు చేతిలో చిన్న బ్రీఫ్ కేస్ ని పుచ్చుకుని "ఈ లగేజ్ ని రిసెప్షన్ వరకు తెచ్చిపెట్టు, నీకు అక్కడ ఆటో ఫేర్ ఇచ్చేస్తాను " అంటూ సమాధానం కోసం చూడకుండా ముందుకు వడి వడిగా నడుచుకుంటూ వెళుతున్న అతని వెనుకనే లగేజ్ తీసుకుని వెళుతూ  ఇచ్చేదేమో చిల్ల గింజంత చేయించుకునేదేమో ఝామంతా " అని ఓ ముతక సామెతని కాస్త నాగరికం చేసి తిట్టుకుంటూ నడిచాడు శేషు 


రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రయాణికుడి లగేజ్ ని అక్కడ పెట్టి ఆతను ఇచ్చే డబ్బు కోసం ఎదురుచూస్తూ చుట్టుపక్కలంతా చూస్తూ మళ్ళీ ఏదైనా కిరాయి దొరికితే బాగుండు. ఆటో బాడుగ ఇచ్చేస్తే బియ్యం,కూరాకుకి తప్ప ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు చుక్కేసి రెండు రోజులైయింది.   నాటుసారా పూటుగా కొట్టి ఓ అరకోడిని  ఇగురేసి తిని పక్కలో పెళ్ళాంతో ముద్దు ముచ్చట్లు ఆడితే గాని ఈ రోజు తెల్లారగూడదు మరీ సరదా సంతోషం లేని చప్పటి  బతుకైపోయింది అని మనసులో అనుకుంటూ . . సూటు బాబు ఇచ్చిన డబ్బుని లెక్కెట్టుకుంటూ మెట్లవైపు చూసాడు.


 కావాలని జడ ఊగేటట్టు నడుస్తూ బిగుతుగా కట్టిన క్రేప్ చీరలోనుండి స్పష్టంగా కనబడే వెనుకభాగాన్ని అటు ఇటు కదుపుతూ వయ్యారంగా మెట్లెక్కుతున్న ఒక మనిషిని చూసాడు . ఆ నడక కాదు కాని  వెనుక భాగం నుండి చూడగానే అదే విధమైన నడక ఎక్కడో చూసినట్టు గుర్తు ..ఎవరబ్బా ఈ నడక నాకు తెలిసినట్లు ఉంది అనుకుంటూ గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసాడు . వెంటనే శేషు కి ఆ రూపం గుర్తుకుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ   ఆలోచిస్తున్నాడు కానీ ఊహకి అందడడం లేదే?  అనుకుంటూ ఆలోచిస్తూనే ఆమె వైపే చూస్తున్నాడు ఆ వగలాడి మెట్ల చివర మలుపు తిరుగుతూ రిసెప్షన్ వైపు చూసింది . వెంటనే శేషు గొంతు నుండి "మధూ "అన్న కేక వెలువడింది . మెట్లెక్కి ఆమె వైపు గబా గబా వెళ్ళాడు  శేషు తన వెనుక రావడం చూసి ఆమె చీర కొంగుని తలపై కప్పుకుని పరిగెత్తుతూ వెళ్ళి ఒక రూం తాళం తీసి అందులోకి వెళ్ళి తలుపు వేసుకుంది . శేషు మూసిన తలుపు వరకు వెళ్ళి మధూ మధూ..తలుపుతీయి అని తలుపు కొట్టసాగాడు. 


ఒక ఆటో అతను హోటల్లో బస చేసిన ఆమె వైపు చూసి కేకలు పెట్టడం వెనుకనే పరిగెత్తడం చూసి   హోటల్ మేనేజర్ ,ఇద్దరు ముగ్గురు సర్వర్ లు  హడావిడిగా వచ్చి  శేషు ప్రక్కన నిలబడి  " ఏమిటి ఇక్కడ న్యూసెన్స్ .. అలా అరచి గొడవ చేయకూడదు మీకు కావాల్సిన మనిషి లోపల ఉంటే .. రిసెప్షన్ లో వెయిట్  చేయండి .. ఆమెకి చెప్పి పర్మిషన్ తీసుకుని  లోపలకి పంపమంటే  నిన్ను పంపుతాం " .. అంటూ అతనిని అక్కడి నుండి లాక్కెళ్ళే  ప్రయత్నం చేశారు . 


"మేనేజర్ గారు ఒక్క సారి నా మాట వినండి .. లోపలకి వెళ్ళి తలుపేసుకున్నది ..నా అన్న కొడుకు అండీ. వాడు ఇల్లు ఒదిలిపోయి మూడేళ్ళయ్యింది . ఆళ్ళమ్మ పోయె ప్రాణాలు నిలుపుకుని ఆడి  కోసం ఎదురుచూత్తా  ఉంది . ఆడిని తీసుకెళ్ళి ఆళ్ళమ్మకి చూపిత్తే పేనం నిలిపినట్టు . ఒకసారి ఆడిని  మీరైనా పిలవండయ్యా .మీకు పుణ్యం ఉంటది "వేడుకున్నాడు . 


"ఈ రూం లో మగవాళ్ళు ఎవరు లేరే! ఉన్నది ఇద్దరూ ఆడవాళ్ళే ! ఇక్కడ జరుగుతున్న పెళ్ళి కోసం వచ్చారు . నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో .. వెళ్ళెళ్ళు " కసురుకున్నాదు. 


"అయ్యా..నేను అబద్దం చెప్పట్లా, సత్య ప్రమాణకంగా చెపుతున్నా .. నీళ్ళోసుకున్న మా ఆడదాని మీదొట్టేసి చెపుతుండా ..లొపలికి పోయి తలుపపేసుకుంది... మా మధు గాడే ! అయిదుగురు అన్నదమ్ముల మధ్యన అందరికీ కలిపి ఒకే ఒక మగపిల్లగాడు వారసుడు. మా ఆశలన్నీఆడిపైనే,   వాడిని  కాస్త బయటకి పిలవండయా, ఆడితో నే మాట్టాడతాను " అన్నాడు 


"ఈ రూమ్లో ఉన్నది ఆడాళ్ళు అయితే మగాడు అంటాడేమిటి ఒకసారి కిందకి వెళ్ళి రిజిస్టర్ తీసుకురా, ఇప్పుడే తేల్చేద్దాం. ఈ న్యూసెన్స్ ఇలాగే వుంటే ముందు నా ఉద్యోగం ఊడుతుంది అంటూ "నువ్వు ప్రక్కకి రావయ్యా " అంటూ శేషుని కారిడార్ చివరికి లాక్కుని వెళ్ళాడు . 


మేనేజర్ ప్రక్కకి లాక్కెళ్ళినా చూపంతా ఆ గది తలుపుల వైపే ఉంచి జేబులో ఫోన్ తీసి రెండు  మూడుసార్లు ఫోన్ చేసి "తొందరగా మన వాళ్లందరినీ  తీసుకుని వచ్చేయండి "అని చెప్పాడు . 


క్రింద నుండి రిజిస్టర్ తెచ్చి ఈ రూం లో ఉన్న వారి పేర్లు మిస్ మధుబాల ,ఇంకొకరి పేరు మిస్  ప్రీతం  అని చెప్పాడు . "హా.. నేను చెప్పాలా .. ఆ మధు యే నా అన్న కొడుకు మధు "అన్నాడు శేషు . 


ఇంకొకతను వచ్చి మేనేజర్ ని పక్కకి తీసుకుని వెళ్లి చెవిలో ఏదో గుస గుసగా చెప్పాడు. 


ఆతను శేషు దగ్గరకి వచ్చి "నేను ఆ రూమ్లో ఉన్న వారికి క్రిందికి పిలిపిస్తాను క్రిందకి వెళదాం రా.. ఇక్కడ ఉంటే మిగతా రూమ్లో ఉన్న వాళ్ళకు డిస్ట్రబెన్స్ "అంటూ .ముందుకు నడిచాడు  


వాళ్ళిద్దరూ లిఫ్ట్ లో  క్రిందికి వచ్చేసరికి   బిల బిల మంటూ మూడు ఆటోల్లో ఇరవై మంది దాకా దిగేసి శేషుని చుట్టేశారు "ఏడ ఉండాడు రా మన మధు గాడు చూద్దాం పదండి" అని తోసుకుని ముందుకు వెళ్ళారు. తన బలగం చూసేసరికి శేషు కి దైర్యం వచ్చింది .. "నేను చూపిస్తా పదండి "అంటూ ఇందాక మూసుకున్న  తలుపులు ముందే నిలబడి  "మధూ ..ఓరి మధూ బయటకి రారా ఇయిగో మీ అమ్మ కూడా వచ్చింది బయటకి రారా " అని కేకేస్తూ తలుపులు బాదాడు. ఆ చప్పుడుకి ప్రక్క రూం ల వాళ్ళు  తలుపులు తెరుచుకుని తలని బయటకి పెట్టి బయట జరుగుతున్నదానిని ఒక క్షణం చూసి మళ్ళీ తలుపేసుకున్నారు. హోటల్ మేనేజర్ మరో తాళం తీసుకుని వచ్చి రూం తలుపు తీసి లోపల ఉన్న ఆమెని బయటకి రప్పించాడు 


బయటకి వచ్చిన ఆమెని చూసి శేషు పిలిస్తే వచ్చిన వాళ్ళందరికీ ఏమి అర్ధం కాలేదు . శేషు వదిన ఒక్క ఉదుటున ముందుకు వచ్చి ముసుగేసుకుని ముఖం దాచుకున్న ఆమెని చూసింది అనుమానంగా కాళ్ళు చేతులు వంక చూసింది  అమాంతం ఆమెని వెనక్కి తిప్పి వీపు మీద ఉన్న పెద్ద పుట్టుమచ్చని చూసి  "ఒరేయ్ ..కొడుకా " అంటూ చీర ముసుగుని లాగి పడేసింది జడని పట్టుకుని లాగింది తలకి పెట్టుక్కున విగ్ పడిపోయి ఒంటి పైన చీర లేకుండా నిలబడ్డ ఆమెని చూసి  "మధూ  ఏంట్రా ఈ వేషం ? ఇన్నేళ్ళు ఎక్కడికి పోయినావురా?  తోటి పిల్లగాళ్ళతో కలిసి పేజేక్ట్ వర్కు కనీ పోయినవ్ అందరూ తిరిగి వచ్చిరి . నువ్వు ఇంకో ఇద్దరు పిల్లకాయలు అంతు లేకుండా పోయారు నీ కోసరం  ఎదురు చూసి చూసి అలుపొచ్చింది . మీ నాయన ఉండ  నాలుగు కుంటలు అమ్మి ఆడని ఈడని తిరిగి తిరిగి మంచాన పడ్డాడు ఎలుకలాళ్ళ కులంలో పుట్టినా  చెట్లెంబడా పుట్టలెంబడా తిరగనీయకుండా  బడికి పంపితిమి ఇంజినీరింగ్ చదువు చదివావు .. ఇదిగో నాలుగ్నెల్లల్లో ఉజ్జోగం వస్తదని కడుపు నిండి పోయే మాటలు చెప్పి మాయం అయిపోయావు .మళ్ళీ ఇట్టా కనబడ్డావు ! ఆ ఏడుకొండల సామి దయతల్చి మళ్ళీ ఇట్టా కనబడేటట్టు  చేసాడు. ఇంటికి పోదాం రా..బిడ్డా " చేయి పట్టుకు అడిగింది . 


ఆప్ కౌన్ హై .. ఆప్కీ  బాత్  సంజీ  నహీ " అంది మధు 


"ఇదేంటి వీడు ఇలా మాట్టాడతాడు మన మధు గాడు  కాదా " అడిగాడు శేషు అనుమానంగా . "


“మై మధు బాల .. మే గుజరాత్ సే ఆయీ .. ఏ లోగ్ క్యా బాత్ కర్ రహే హై   .. అడిగింది ఆమె . 


బాడ కావ్ ! కన్న తల్లి గుర్తుపట్టి ..ఇంటికి పోదాం రా బిడ్డా అని పిలిస్తే  నాటకాలు ఆడతన్నావా నాటకాలు!!  నువ్వు చీర గట్టి బొట్టు కాటుక పెడితే ఆడముండవై పోతావేమిటిరా, తాళ్ళతో కట్టుకెళ్ళి చెట్టుకి ఉరేత్తా,నోరు మూసుకుని రా . మేనమామ ఆమె జాకెట్ పై చెయ్యేసి  పుచ్చుకుని  ముందుకు లాగుతూ అన్నాడు ."


 మేనేజర్ సాబ్ యే లోగ్  కౌన్ హై, ముజే పరేషాన్ కర్ రహే హై!  పొలీస్ కో బులావో " చెప్పింది ఆమె కీచు  గొంతుతో ..  


ఒరేయ్ నరసింహా, ఈడు  మన మధుగాడేనురా,  ఆ  కాళ్ళు చేతులు ఆ ముక్కట్లు అన్నీ ఆడే ! ఈడికి ఇదేమి పొయ్యేకాలం ? కొజ్జా వేషం వేసుకుని తిరుగుతున్నాడు. ఈడి  కోసం అంతా అల్లలాడిపొయారు కందా !  చదవేస్తే ఉన్న మతి పోయిందంట ఈడిని ఇంటికి తీసుకొచ్చి నలుగురిలో ఊయించుకోడం కన్నా ఆడి ని అట్టాగే వదిలేత్తే మంచిది " అన్నాడు వెంకయ్య ముందు చూపుగా 


"ముందు ఆడిని ఈడ నుండి తీసుకుని పోదాం పదండి" అని  ఆమెని బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో వేసి  పారిపోకుండా అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కూర్చున్నారు 


ఇదంతా చోద్యంగా చూస్తూ అర్ధం అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, అయ్యో!  ఇదేమిటి తమ హోటల్లో దిగిన ఆమెని బలవంతంగా లాక్కెళ్ళారు అర్జంటుగా పోలీస్ స్టేషన్కి చెప్పాలి ఈ విషయం అంటూ  హడావిడి పడ్డాడు హోటల్ మేనేజర్ 


****** 


"అయ్యా ! మధూ .. చెప్పిన మాట ఇనరా!  ఆడాళ్ళ బట్టలే ఎసుకుంటానని గోల చెయ్యకురా ! నిన్ను బలవంతంగా ఎత్తుకొచ్చినమని పోలీసోళ్ళ సతాయింపు, మన పేట లో ఉంచినందుకే  ఊరుకునట్లా ,మన కులపోళ్లలో ఇట్టా ఎవరైనా చేసినారా ఇదెంత తప్పు ? ఆడు ఇక్కడ ఉండాలంటే  తప్పు కట్టాలి ..లేకపోతే పేట నా కొడుకులందరూ  ఇట్టాంటి కొజ్జా  వేషం యేసి కులం పరువు తీయరు ? అని  పంచాయితీలు పెట్టినారు  నువ్వు సూత్తా ఉండావ్ కదా ! మీ నాయన పెద్ద మనుషుల కాడ  లచ్చ రూపాయలు తప్పు కట్టి వచ్చాడు నువ్వు మగాడిగా గుడ్డ గడితేనే, మీసం పెంచితేనే ఈ పేటలో ఉండనీయడానికి ఒప్పుకుంటారట . నువ్వు చీర కట్టి పూలు పెట్టి అందరిని బాయ్యా, అక్కయ్య అంటే మళ్ళీ మన కులం పెద్దోళ్ళు తప్పేత్తారు రా .. ఏం  జరిగిందో ఏమో అన్ని మర్చిపోయి మాములుగా ఉండరా “ బతిమిలాడింది తల్లి . 


 "అమ్మా నే చెపితే వినవేమ్టి ! నేను ఇప్పుడు మధు ని కాదు, మధుబాలని . నేను అమ్మాయిగా మారిపోయి మూడేళ్ళు అయింది మీరందరూ ఇప్పుడిట్టా మదూ మధూ...   అని పిలుస్తా ఉంటే నాకు ఎలర్జీ ! నేను అమ్మాయిని మధుబాల అని పిలువు " చెప్పింది ఆమె 


చేతిలో ఉన్న కొత్త పేంటు చొక్కాని విసిరి పారేసి “నా ఖర్మ రా.. పుట్టినప్పుడు మగ లంజ కొడుకువుగానే పుడితివి గదరా,పదేళ్ళు వచ్చేదాకా తాడిచెట్టుని నిలబెట్టినట్టు నిలబెట్టి నేనే నీళ్ళు పోసినాను కదరా! గడ్డలు మీసాలు వచ్చినాయి ఇంకా నువ్వు ఆడగా ఉండింది ఎక్కడరా .."  అడిగింది . 


" నేను బొంబాయిలో ఆడదానిగా మారిపోయా .." చెప్పింది 


ఏం  మాట్లాడాలో తెలియక గోడకి ఆనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది వెంకమ్మ. పేటలో ఉంటే కులపెద్దలు తప్పేత్తారని ఊరికి దూరంగా ఒంటి నిట్టాడి  ఇల్లు కట్టి అందులోకి మార్చారు ఆమెని 


"ఏమే! రమణా వాడు ఎవరు చెప్పినా ఇనడం లేదు.  ఆడు చెప్పింది నమ్మడానికి  రుజువు చేసుకోవాలన్నా ఒంటి   మీద చెయ్యేయనీయటల్లేదు  ఆడు ఎందుకట్టా మారాడో! అసలు ఆడ మనిషో కాదో కనుక్కోవే!" అంటూ  పెళ్ళాం  రమణ  కి చెప్పాడు శేషు.


రమణ టవున్లో పుట్టి పెరిగింది చదివింది పదవ తరగతే కాని చిన్నప్పటి నుండి చదువుకున్న వాళ్ళందరి మధ్య తిరగడం అస్తమాను టీవి చూడటం మూలంగా కాస్త లోక జ్ఞానం ఎక్కువే. 

మధు ని ఇంటికి పిలిచి ప్రేమగా పలకరించింది "మధుబాల మధుబాల అంటూ పిలిచి ..నువ్వు చాలా అందంగా ఉన్నావు " అని మెచ్చుకుంది. కాసేపు సినిమా కబుర్లు ఈ  కబుర్లు చెప్పింది . 


"అబ్బ నువ్వు ఎంత మంచిదానివి చిన్నమ్మా ! నాకు బాగా నచ్చావ్ ! మా బాబాయి నిన్ను కట్టుకుని మంచి పని జేశాడు " అంటూ ఎదురు పొగిడింది మధు . అలా మాటా మాటా కలిసిన దగ్గర్నుండి చిన్నమ్మా ! చెరుకు గడల జడ వేయవా అని ఒకసారి ,  నీ చీర చాలా బాగుంది నేను కట్టుకోనా అని ఒకసారి,నేను బాడీలు కొనుక్కోవాలి సిటీకి పోదాం పద అని ఇంకో సారి రోజూ రమణ చుట్టూ తిరిగేది  మధుబాల. 


కోటేరేసినట్టు ఉండే ముక్కు సోగ కళ్ళు ఎర్రటి పెదాలు  కాస్త మొరటుగా  ఉన్న గడ్డం తో బిగుతుగా కట్టిన బట్టలతో సన్నగా పిడికెడంత నడుముతో  కులుకుతూ  నడుస్తున్న ఉన్న ఈడిని చూస్తే కొజ్జా గా కావాలని మారినాడు అని ఎవరూ  అనుకోనే అనుకోరు అలా వున్నాడు వీడీతో మంచిగ ఉండి  అసలు విషయం రాబట్టాలి అనుకుంది రమణ.


రమణ తో బాగా చనువు పెరిగాక మధూ ..నువ్వు ఎందుకు ఇలా మారిపోయావ్ అని అడిగింది రమణ . 


అబ్బ ఉండు చిన్నమ్మా! ఈ  పింక్ రంగు బాడీ జాకెట్ లో నుండి  బాగా కనబడతుందా ? ఇవిగో నా గాజులు నా హెయిర్ బాండ్ లు బాగున్నాయా .. ? అంటూ మోచేతులదాకా వేసుకున్న గాజులను జుట్టు నిండా తగిలిచ్చుకున్న రంగు రంగుల హెయిర్ బేండ్ లని చూపించేది. 


చాలా బాగున్నాయి కానీ మధూ.. చెప్పు మధూ ! నాక్కూడా మగవాడిలా మారిపోవాలని ఉంది అని కాళ్ళకి బంధం వేసింది


  “ఎట్టెట్టా ..నీకు  అట్టా అనిపిచ్చుద్దా ! అయితే నా కథ చెపుతా విను” అంటూ ప్రక్కకి వచ్చి దగ్గరిగా కూచుంది. కొంచెం బెరుకుగా అయిష్టంగా  దూరంగా జరిగి  చెప్పు  మధూ  అంది రమణ . 


 మధుబాల  గొంతు సవరించుకుని నిజమైన మధు గా మారింది ఆ గొంతులో వినసొంపు అయిన మాట టవున్ లో చదువుకున్నాళ్ళ మాటలా మారి " చిన్నమ్మా ! చిన్నప్పుడు నుండి నాకు ఆడవాళ్ళు లా ఉండటం ఇష్టం మా అమ్మ నా చేయి పట్టుకుని ఎంత సన్నంగా ఉన్నాయిరా నీ ఏళ్ళు  అరకాసు ఉంగరం అయితే సరి పోను, అరచేయి చూడు మెత్తంగా పూవులా  ఉంది అనేది, నా కాళ్ళు రుద్ది స్నానం చేయిస్తూ ఆడపిల్లల కాళ్ళు రా నీయి మువ్వల పట్టీలు పెడితే బావుండేది అంటుండేది  ఆ మాటలు అన్నీ నాలో అట్టాగే ఉండి పోయినాయి. కాలేజ్ లో ఏ ఆడపిల్ల జడ చూసినా అందంగా డ్రస్ వేసుకున్న వాళ్ళని చూసినా నాకు అలాగే ఉంటే బాగుండేది అనిపించేది నాలో దాక్కుని ఉండే కోరిక పెరిగి పెద్దదైపోయి నేను ఆడదానిగా మారితే బావుండేది అనిపించింది నా చదువు పూర్తిఅయి ప్రాజెక్ట్ వర్క్ కి ముంబాయి వెళ్ళడం అక్కడ నలబై రోజులు ఉన్నప్పుడు  అక్కడ నాకు హిజ్రాలు తో పరిచయం కల్గింది. వాళ్ళతో అప్పుడప్పుడూ మాట్లాడుతుంటే వాళ్ళల్లో చాలా మంది పుట్టుకతో హిజ్రాలు కాదు    ఆడవాళ్ళగా మారిపోవాలనే కోరికతో ఇల్లు వదిలి పారిపోయి వచ్చినవాళ్ళు, ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జండర్ గా మారిన వాళ్ళు  ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా మారినవాళ్ళు, బలవంతంగా  మార్చబడిన వాళ్ళు హిజ్రాలు అని  తెలిసింది .  అవన్నీ విన్నాక నేను అలాగే మారిపోవాలనుకున్నాను.  నాకు పరిచయం ఉన్న హిజ్రాలే నన్ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్ళాడు ఇరవై వేల రూపాయాల ఖర్చుతో  నేను అమ్మాయిగా మారిపోయాను . అనేక రకాల హార్మోన్  ఇంజక్షన్ ల ద్వారా ఆడవాళ్ళలా మారడం ఏమంత కష్టం కాదు . నేను ఇప్పుడు మగాడినే కాదు ఆడదానినే ! చూడు నాకు సన్ను సంకా అన్నీ ఉన్నాయి అంటూ జాకెట్ విప్పేసి కట్టుకున్న  చీర విప్పేసి దిశ మొలతో ఎదురుగా నిలబడ్డాడు.  


మధు రూపం చూసి  రమణకి భయం వేసింది.  చప్పున ప్రక్క గదిలోకి వెళ్ళిపోయి “నేను నమ్మానులే! ముందు గుడ్డలు కట్టుకో ! ఇలా కొజ్జా వాడిలాగా బతకడానికి సిగ్గేయడం లేదా" అడిగింది 


భలేదానివి చిన్నమ్మా! అలా అంటా వెందుకు ? శివుడు రెండుసార్లు ఆడదాని అవతారం ఎత్తాడంట . విష్ణు మూర్తి  అమృతం కోసం మోహిని అవతారం ఎత్తలేదా ! అర్జునుడు  వనవాసంలో విరాటుడి కొలువులో బృహన్నల వేషం వేయలేదా !? హిజ్రాలని మమ్మల్ని వెలివేయకూడదు తెలుసా !  నిజమైన హిజ్రాలకి కొన్ని దైవ శక్తులు  ఉంటాయట అని కొందరి నమ్మకం.   లేక లేక పుట్టిన బిడ్డలకి మా లాంటి వాళ్ళ చేత దీవెనలిప్పిస్తే మంచిదని పెద్దపెద్ద ధనవంతులు  బాగా డబ్బు ఇచ్చి మమ్మల్ని  ఇంటికి తీసుకునిపోతారు.   అలాగే  విందు వినోదాల సమయాలలో మమ్మల్ని తీసుకెళ్లి ఆడించి  పాడించి సంతోష పడతారు. మాకు ఒక గుడి ఉంది "బాహుచర మాత " అన్న గుడి .  అప్పుడప్పుడు మేము అక్కడికి వెళతాము అని వివరంగా చెప్పాడు. అది చెపుతున్నప్పుడు అతని గొంతులో గర్వం తొణికిసలాడింది. 


రమణ నోరు తెరుచుకుని మధు చెప్పే మాటలని వింటూ ఆశ్చర్యంగా చూస్తుంది.


మధు అంతలోనే మాట మార్చి మళ్ళీ మధుబాలగా మారిపోయి .. " ఎవరు ఎట్టా బతకాలనుకున్నారో అలాగే బతకనివ్వాలి .  నేను ఇలాగ ఉండానని మా అమ్మ ఏడ్చి గోల పెట్టుద్ది , నాన్న కి కోపం వచ్చుద్ది ,  అక్కయ్య అసహ్యంగా చూసుద్ది . బావ తప్పుకుని తప్పుకుని తిరుగుతాడు నాకిక్కడ కాళ్ళు చేతులు కట్టేసినట్లు ఉంది. నేను మా వాళ్ళ దగ్గరికే పోతాను  బాబూ! అంది  పైట తిప్పుకుంటూ


  "అవన్నీ ఎందుకు కానీ మీ అమ్మ అయ్యా నలుగురిలో తలెత్తుకోలేక బయట ముఖం చూడట్లా ..!  అయిపోయింది ఏదో అయిపోయింది నువ్వు అదివరకటిలా మాములుగా ఉండు  ఇంకో వారంలో మీరు కొత్తింట్లోకి  పోతున్నారు కదా! అక్కడైతే కులపోళ్ళ కట్టుబాట్లు ఏవి ఉండవ్, మీ అందరూ కలసి ఒకే ఇంట్లో ఉండొచ్చు” చెప్పింది. 


"ఆలోచించి చెపుతా చిన్నమ్మా ! అని వెళ్ళిపోయింది మధు. 


ఆ రాత్రి మధు చెప్పిన విషయాలన్నిటిని  పూస గుచ్చినట్టు  శేషుకు చెప్పింది  అంతా  విని ఈడు ఇక్కడ కుదురుగా ఉంటాడని నేననుకోను.  మగవాళ్ళు కనబడితే మీద మీద పడతాన్నాడు అంట. ఆడాళ్ళు నీల్లోసుకుంటుంటే  వీపు రుద్దుతా అని బాత్రూమ్ లలో   జొరబడుతున్నాడని చెపుతా ఉండారు . ఈడు  ఇక్కడే ఉంటే  ఈడి  మూలంగా అందరూ తన్నులు తినాల. తప్పు కట్టాలా .  వాడిని  పోనిస్తేనే  మంచిదని అన్నకి జెప్పినా!  వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటది మన బెజవాడలో కూడా బేరేజీ మీద, వన్టౌన్ లోను కాసుక్కూకుని ఉంటారు.  ఇలాంటి వెధవ నాకొడుకులందరూ షాపు లెంబడి తిరుగుతా  ఉంటారు, నానా  రకాల చేష్టలు చెత్తా ఉంటారు. వాడిని మనం బలవంతంగా ఇంటో  ఉంచుకోవడం మంచిది కాదు. వాడి దోవన వాడిని పోనిచ్చి  వాడి ఖర్మ అట్టా ఉందను కోవడమే ! మా వదినకి నచ్చ జెప్పాల . లేకపోతే చేపల యాపారంలో కష్టపడి  సంపాయించింది అంతా కులం వాళ్లు వేసే తప్పు లెక్కకి కట్టాల్సి వచ్చుద్ది “ ఆలోచనగా అన్నాడు శేషు. 


"అదీ నిజమే ..బావా " అంది  రమణ 


ఒక వారం తర్వాత నరసింహ కొత్త  ఇంట్లోకి మారాడు కక్కా -ముక్కతో విందు జరగబోతుందగా .. “అమ్మా!నాకు ఈ ఫేంట్  చొక్కా ఎందుకు తెచ్చావే ? అక్కకి తెచ్చినట్టు నాకు చీర జాకెట్ ఎందుకు తేలేదు ? అవి తెచ్చి ఇస్తేనే నేను ఉంటాను లేకపోతే  నేను పోతాను” అంటూ రభస మొదలెట్టింది మధు 


“అయ్యా.. నీకు దణ్ణం పెడతానురా, చుట్టాలందరి ముందు నా పరువు తీయకు ఇప్పుడు ఈ పేంట్ చొక్కా వేసుకో రేపు చీర జాకెట్ కొనిపెడతా అంటూ గడ్డం పుచ్చుకు బతిమలాడింది తల్లి. “ నాకు ఈ బట్టలు వద్దు పో”అంటూ పేంటూ చొక్కా విసిరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధు ఆడదానిలా నడుస్తూ. 


 కళ్ళల్లో నీళ్ళు నింపుకుని కోడలోచ్చి సింగారంలా  తిరగాల్సిన ఈ ఇంట్లో ఈడి  ఆడ  చేష్టలు ఏమిటో! అనుకుంటున్న వెంకమ్మ  వద్దకి వచ్చి " పోతే  పోయాడు వెధవ నా కొడుకు, వాడి గురించి ఇక మర్చిపొవే! " అంటూ  భార్య భుజం మీద చెయ్యేసి చెప్పాడు ఓదార్పుగా నరసింహ.


తెల్లారి “చిన్నమ్మా ! ఓ చిన్నమ్మా !! “అనుకుంటూ వచ్చింది మధు 


“ఏమిటి మధూ  ఆ కేకలు, అన్నం పెట్టనా ? “అడిగింది రమణ 


“వద్దు చిన్నమ్మా ! మా "గురు"  నన్ను వెతుక్కుంటూ ముంబాయి నుండి ఇక్కడికి వచ్చాడు నేను ఆయనతో కలసి బొంబాయి కి పోతున్నా! అక్కడ నాలా డాన్స్ చేసేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారంట, నేను వెళ్ళిపోతా .. అక్కడే హ్యాపీగా బతుకుతా . మాయదారి సంత మాయదారి సంత అని .. మా శేషు బాబాయి గాడు  నన్ను హోటల్ లో చూసి ఉండకపోతే ఇదంతా ఉండకపోవును కదా ! “ అని మెటికలు విరిచి తిప్పుకుంటూ జడ ఊపుకుంటూ వెళ్ళి పోతున్న వాడి వంక చూసి వీడు ఆడ మగ కాని మూడవజాతి, తృతీయ ప్రకృతి.   నాకెట్టాంటి  పుడతాడో !?  అనుకుంటూ కడుపు మీద చెయ్యేసుకుని భయపడింది రమణ. 


(2005 లో వ్రాసిన కథ)

11, జులై 2013, గురువారం

మునగ చెట్టు విరిగింది

ఈ పనిమనిషికి యేమొచ్చి చచ్చిందో, పది రోజులకి యెనిమిది  రోజులు యెగనామం పెట్టింది. తెల్లవారి లేస్తే పనులు చేసుకోవాలా లేదా, వస్తుందా రాదా అని ఆలోచించుకుంటూ బద్దకంతో  పని అలాగే వదిలేసి పదకొండు  గంటలదాకా యెదురుచూసి  చూసి యిక రాదనీ నిర్ధారించుకుని . ఆ  కోపాన్ని   సింక్లో పేరుకుపోయిన అంట్ల గిన్నెల కాస్త యింట్లో వాళ్ళ మీద కాస్త ప్రదర్శిస్తూ యెలాగోలా పనులు  చేసుకుంటూ ఆపసోపాలు పడిపోయింది నీలిమ.
ఇద్దరు  పసి పిల్లలతో వాళ్ళ  నవ్వులతో ,  అల్లరితో  యిల్లంతా వెలుగులుతో పాటు వాళ్ళ యేడుపులు, పేచీలతో, అనారోగ్యంతో యింట్లో వున్న పెద్దవాళ్ళందరికీ  దిక్కుతోచనివ్వని వైనాలు. వీటన్నింటి  మధ్య పనిమనిషి యెగ్గొడితే యెలా వుంటుందో వొక వారం రోజులకి బాగా అనుభవమయింది.

నీలిమ గిన్నెలు తోముకోవడం చూసి బట్టలుతికే ఆమె అడిగింది. ఈ రోజు కూడా  రమణ రాలేదా అని. ఆ అడగడంలో ఆరాదీయడం కన్నా వ్యంగమే  యెక్కువున్నట్లు తోచింది.

వస్తే నేను యె౦దుకు కడుక్కుంటాను అని  సమాధానం యిస్తూ  అక్కడి నుండి లేచి వచ్చేస్తుంటే  మీరు పని వాళ్ళందరిని వూరికే  నమ్మేస్తారండి. పోయిన నెలలోనే కదా కొత్త గ్యాస్ పొయ్యి యిప్పిచ్చారు. ఇక  వాళ్ళు  మీకు పని సరిగ్గా చెయ్యరు, కొన్నాళ్ళకి మీ కంటికి కనబడరు.

రమణ పనికి వస్తుందని జీతం పట్టుకుందామని నేను గ్యాస్ కనక్షన్ యిప్పించలేదు. మగ దిక్కులేని ఆడది. ఇద్దరు పిల్లలనేసుకుని వొంటరిగా ఉంటుంది. "పొయ్యి తడిచిపోయి పుల్లలు లేక అన్నం వండుకోలేదమ్మా పిల్లలు ఆకలితో అట్టాగే పడుకున్నారని చెప్పింది. తెల్లవారి బియ్యమేసుకుని వచ్చి యిక్కడ అన్నం వండుకు వెళ్ళింది. అంత కష్టం లో వుంటే   సాయం చెయ్యాలనిపించిది. మనమూ  బిడ్డలు కలవాళ్లమే  కదా ! పస్తులు వుంటే   చూస్తూ వూరుకోగలమా "

మరి ఆ విశ్వాసం యేది ? వారం రోజులు నాగా పెట్టింది. కనీసం పోన్ చేసి నాకు యిబ్బంది  వచ్చింది.  రావడం కుదరదని చెప్పొచ్చుకదా ! కులం తక్కువ వాళ్ళు అంతేనమ్మా నీతి లేని జాతి అంటూ   యె౦తైనా రమణ మాటకారి. ఆ మాటల వలలో పడిపోయి మీరు దానికి అన్ని డబ్బులు యిచ్చేసారు  అంటూ  తనకి యెప్పుడూ అడ్వాన్స్ గా డబ్బులివ్వని అక్కసుని ప్రదర్శించింది

వంట యింటిలో పని చేసుకుంటున్న నీలిమ పోన్ కి మిస్ కాల్ వచ్చింది. తీసి చూస్తే పని మనిషి రమణ నంబర్ అది. చూసి మెదలకుండా వుండిపోయింది. నిన్న తను పనికి వస్తుందా రాదా అని కనుక్కోవడానికి యెనిమిది సార్లు కాల్ చేసినా పోన్ తీసి మాట్లాడలేదు. ఈ రోజు అది మిస్ కాల్ చేస్తే నేను కాల్ చేసి మాట్లాడాలా? ఆప్త్రాల్ వొక పనిమనిషికి అంత  పొగరా ?  ఎంత పనికోసం ఆధారపడితే మాత్రం అంత  లోకువ అయిపోవాలా? తిరిగి కాల్ చెయ్యనుగాక చెయ్యను అని తీర్మానించుకుని ఆలోచనలో పడింది

ఇప్పుడు పని వాళ్ళు అంతా  హై టెక్ పనివాళ్ళు అయిపోయారు మిస్ కాల్ యిచ్చి పెట్టేయడం  అది చూసుకుని తిరిగి కాల్ చేయాలి . "పనికి రాలేనమ్మా.. పిల్లకి బాగో లేదు  అనో, అర్జంట్ గా వూరు వెళ్ళాలనో వొంక. వారాలకి వారాలు  పని మానేసినా యేమీ అనకూడదు, జీతం కోతకోయకూడదు. ఒకవేళ అలా చేస్తే యింకో పదుగురి చెవుల్లో మన గురించి వినకూడని మాటలు  వినబడతాయి.  వీళ్ళకేనంట రోగాలు నొప్పులు వచ్చేది, వీళ్ళకేనంట చుట్టాలు పక్కాలు ఉండేది అని అనవసర వ్యాఖ్యానాలు.

పని వాళ్ళు మనుషులే ! వాళ్ళకి కష్ట నుఖాలు వుంటాయి రోగాలు నొప్పులు వస్తాయి అని అర్ధం చేసుకోరెందుకు   అని   వొకప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు తెలుస్తున్నాయి వాళ్ళ తెలివితేటలు అని ఆలోచించుకుంటూ వుండగా    ఆర్చుకుని తీర్చుకుని పన్నెండు  గంటలకి వచ్చిన పనిమనిషి రమణ ని చూసి తన్నుకు వస్తున్నకోపాన్ని అదిమిపెట్టుకుని ముఖాన నవ్వు పులుముకుని వచ్చావా తల్లీ ! ఈ నెలలో నీకు రాని  రోజులకి జీతం కోత అని  చెప్పింది .

రమణ అంత కన్నా ధీమాగా "అలాగే కట్ చేయండి " అని గిన్నెలు బయట పడేయండి అమ్మా!  పిల్లలిద్దరికి బాగోలేదు. పెద్దదానికి టైఫాయిడ్ జ్వరం, చిన్నదానికి వాంతులు విరోచనాలు. మరి పిల్లలని చూసుకోవాలి కదా అందుకే యిన్ని రోజులు రాలేదు అంటూ  సంజాయిషీ ఇచ్చుకుంది

మరి ఆ ముక్కే పోన్ చేసి చెప్పొచ్చుకదా ! రోజు వస్తావని యెదురు చూడటం రాకపోతే పనులు చేసుకోవడం అవస్థ పడిపోయాను.

మరి అదే ! మేమంటే యేమిటో అనుకుంటారు గాని  మేము రాకపోతే  యె౦త కష్టమో తెలిస్తే కాని అర్ధమయ్యిది మా విలువ " అంది.

 ఈ పనివాళ్ళతో వచ్చిన చావే ఇది.  ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే  యెక్కువ . "మింగ మెతుకు లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె"  అన్నట్లు  యె౦త గర్వం వొలకబొస్తారో !  ఇన్నాళ్ళు పని మానేసామే అని చిన్నమెత్తు బాధ కూడా ఉండదు వచ్చే జీతం వస్తే యెంత పొతే యెంత అన్నట్టు వుంటారు. అసలు పనికి వొప్పుకున్నాక అన్ని రోజులు పాటు మానేస్తే యెలా అన్న ఇంగితజ్ఞానం  కూడా వుండదు. జీతంతో పాటు రోజు కాస్త కూర పెట్టండి , తలనొప్పిగా వుంది కాస్త టీ పెట్టండి లాంటి డిమాండ్ లతో పాటు అన్నం మిగిలిపోయింది తీసుకువెళ్ళ మంటారా లాంటి  అభ్యర్ధనలు అన్నీ మామూలే! వాళ్ళ తిండి తిప్పలుతో పాటు వాళ్ళ యింట్లో వాళ్ళ రోగాలు నొప్పులు కూడా మనమే పడాలన్నట్టు మాట్లాడతారు. జీతంతో  పాటు భత్యాలు అన్నమాట యివన్నీ. మళ్ళీ పండగలప్పుడు అన్నీ మామూలే. ఈ పని మనిషిని భరించడం కన్నా వొక గంట యెలాగోలా కష్ట పడటం నయం అనుకుని యీ నెల పూర్తవగానే రమణని మానిపించేయాలి అనుకుంది మనసులో

వేసిన అంట్ల  గిన్నెలన్నింటికి మందంగా సబ్బు రాసి గిన్నెలు అరిగిపోతాయేమో అన్నంత సున్నితంగా రుద్ది  రెండు బకెట్లు పట్టే టబ్ లో ఒక ముంచు ముంచి స్టాండ్ లో పడేస్తూ  అయిదు నిమిషాల్లో గిన్నెలు కడగడం ముగించి  కాస్త టీ  పెట్టండమ్మా తలనొప్పిగా వుంది అని గుమ్మం ముందు కూర్చుంది. మనసులో తిట్టుకుంటూనే టీ కి నీళ్ళు పెడుతుంటే కాస్త అల్లం ముక్క కూడా వేయండమ్మా,  మీ మార్కు టీ  తాగి వారం రోజులయింది అని మునగ చెట్టు యెక్కిన్చేసింది. పెద్దపిల్లకి అన్నం పెట్టవద్దు అన్నారమ్మా ! ప్రిజ్ లో ఇడ్లీ పిండి వుంటే  కాస్త పెట్టియ్యండి అమ్మా,
హోటల్ లో యిడ్లీ తినబుద్ది కావడం లేదు, నీలిమ ఆంటీ వాళ్ళ యిడ్లీ బాగుంటది అని నా కూతురు అడిగిందమ్మా అంది. రెండోసారి మునగ చెట్టు యెక్కింది నీలిమ
మౌనంగా ప్రిజ్ డోర్ తీసి పిండి బాక్స్ తీసి నాలుగు యిడ్లీలకి సరిపడా పిండి యింకో బాక్స్ లోకి వేసింది.. టీ తాగుతూ పిల్లల అనారోగ్యాలతో యెంత అవస్థ పడిందీ  చెపుతూ  చిన్నదానికి పత్యం కూర పెట్టాలమ్మా మీరు  బీరకాయ కూర వండారు కదా ! కాస్త కూర వేడి అన్నం వేసి యివ్వండి  అని అడిగింది . అడిగినవన్నీ మళ్ళీ గిన్నెల్లోకి సర్ది యిచ్చింది తిట్టుకుంటూ

అన్నీ తీసుకుని బుట్టలోకి సర్దుకుని "పనిపాట చేసే వాళ్లకి మీరు కాక యెవరు పెడతారమ్మా  యిట్టా  " అని  మళ్ళీ మునగ చెట్టు యెక్కించేసి  అమ్మా,ఒక రెండు వందలు యివ్వండమ్మా ! పిల్లలని సాయంత్రం హాస్పిటల్కి తీసుకుపోవాలి  అంది.


బతక నేర్చిన పనిమనిషి  రమణని  చూసి వొక్క క్షణం కూడా ఆలోచించ కుండానే "నా దగ్గర డబ్బుల్లేవ్, అయ్యగారు యింట్లో  లేరు అని అబద్దమాడేసింది "

సర్లే యే౦ చేస్తాన్లేమ్మా, యింకో అమ్మగారిని అడిగి తీసుకుంటా. చెప్పడం మరిసిపోయాను  సాయంత్రం పనికి రానమ్మా . యెట్టోగట్టా మీరే  చేసుకోవాలి  అని గేట్ వేసి వెళ్ళిపోయింది.

మునగ చెట్టు కొమ్మ విరిగి ఠపీ మని క్రిందపడింది నీలిమ.

7, జులై 2013, ఆదివారం

నా ఏకాంతంలో నేను


                                                                          
ఏకాంతమంటే 
ఏకాకి తనం అని ఎవన్నారు ?

ఏకాంతమంటే  ..
నాలోకి నేను తొంగి చూసుకునే
శత సహస్ర హృదయ దర్శనం
ఆత్మని ఆలింగనం చేసుకున్నప్పటి
అపురూప దివ్య దర్శనం

ఏకాంతాన్ని  వర్ణించడం  అంటే
ఆలోచనలకి నగీషి పెట్టడం
అక్షరాలకి సొబగులు అద్దటం
చిత్రాలకి వర్ణాలద్దడం  కాదు

దీపాలు మలిగిన వేళ
పూలు నేలరాలే వేళ
వేకువ పువ్వు విచ్చుకునే వేళ
తెలివెన్నెల పరుచుకునే వేళ
ఏకాంతంతో  నా ఏకాంతం
ఏకమయ్యే వేళ

దీపం చుట్టూ కాంతి  వ్యాపించినట్లు
నా చుట్టూనూ నాలోనూ నా ఏకాంతమే
సిగ్గు విడిచిన కలలెప్పుడూ  కాచుకు కూర్చుంటాయి
నా ఏకాంతాన్ని భగ్నం చేయడానికన్నట్లు
వేదనలెప్పుడూ  మనసు పొత్తాన్ని తడిపేసినట్లు
ఏకాంతమెప్పుడూ  వెలుగులోకి రాని  కాసారమే

ఉల్కలు రాలినట్లు రాలే  ఆశలని 
ఒడుపుగా పట్టుకున్న కొన్ని అమృత క్షణాలని 
పాకుడు పట్టిన  చేదు జ్ఞాపకాలని
గులకరాళ్ళ గా మార్చి
అజ్ఞాన సముద్రంలోకి విసిరేస్తుంది
నన్ను ఒడ్డున పడేస్తుంది

నా మనోరణ్యాన మరొకరి అడుగుజాడ
కనబడనివ్వని  జాణ తనంతో
నన్ను తప్ప మరొకరిని తాకనివ్వని
అంటరానితనం తోనూ 
అనంత ఆలోచనల 
కసి చాకిరి చేస్తూ ఢస్సిల్లి పోతుంది   
భావ విస్పోటనంతో చెల్లా చెదురవుతుంది
స్రావాలుగా జారుతూ
నా బాహ్య ప్రపంచపు గాలిని  పీల్చుకుంటుంది  
కాలంతో దొర్లుతూ అవశేషం గా
మిగులుతుంది
భిక్షాపాత్రలో  రేపటి నా  ఏకాంతానికి
కొంత ఖాళీ ఉంచుతూ ...
నన్నొక మనీషిగా నిలుపుతూ

5, జులై 2013, శుక్రవారం

ప్రేమ ఉంది - ఫోన్ ఉంది


ఒక వ్యక్తి  క్యాన్సర్ తో బాధపడుతున్నాడు అతనికి  మరో నెల రోజులు మాత్రమే  బ్రతికి ఉంటానని తెలుసు 

అతనికి   ఒక  CD దుకాణంలో పనిచేస్తున్న  ఒక అమ్మాయి  బాగా నచ్చింది.   ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు కానీ తన ప్రేమ గురించి  ఆమెకి ఎప్పుడు .చెప్పడు

 ప్రతి రోజూ అతను  కొంత డబ్బు  ఖర్చు  చేస్తూ ఒక CD కొనుగోలు చేస్తూ ఉంటాడు  ...

ఒక నెల తరువాత అతను మరణించాడు ...

CD షాప్ లో పని చేస్తున్న అమ్మాయి అతని ఇంటికి  వెళ్ళినప్పుడు ...

అతని తల్లి అతను క్యాన్సర్ మరణించాడన్న విషయాన్ని చెపుతుంది   ఆమె అతని గదిలోకి వెళుతుంది అక్కడ అతను  ప్రతి రోజు కొన్న CD లు ఓపెన్ కూడా చేయకుండా అలా పడి  ఉంటాయి.  అవి  చూడగానే ఆ అమ్మాయి క్రింద క్రూచుని  ఏడుపు ప్రారంభించింది

అతను  నీకు  తెలుసా !ఎందుకు .ఏడుస్తున్నావ్ ? అని అడిగిన దానికి ఆమె ఏడుస్తూనే CD లు ఓపెన్ చేసి వాటిల్లో నుండి నాలుగు ప్రేమ లేఖలని బయటకి తీస్తుంది

వారిద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కల్గి ఉంటారు కానీ ఎప్పుడూ వ్యక్తం చేసుకోరు ఆతను  CD లు కొనే నెపంతోనే ఆమెని చూడటానికి వెళ్ళేవాడు ఆమె అతనికి ఆతను కొన్న CD లో ప్రేమ లేఖ పెట్టి ఇచ్చేది

ఒకరి పై ఒకరికి ఉన్న ప్రేమ గురించి తెలుసుకునే సరికి  అలా జరిగిపోయింది

అందుకే మీకు ఎవరిపైనైనా ప్రేమ కల్గితే దాచుకోకండి ..వెంటనే  మీ ప్రేమని ప్రకటించండి ..:) .. అని ఆ కథ సారాంశం

ఏమిటి ..  ఇప్పుడెందుకు ? ఇలా చెపుతారు ? అని అనుకోకండి > ఎక్కడో ఈ కథని చదివి చాలా రోజులయింది . నిన్న హఠాత్తుగా  గుర్తుకు వచ్చింది

 ఆ గుర్తు రావడం ఎందుకనగా ...

మా ప్రక్కన గ్రూప్ హవుస్ కి వాచ్ మేన్ గా పనిచేస్తున్న అతనికి ఇద్దరు కూతుర్లు . పెద్దపిల్ల జిల్లా పరిషత్ స్కూల్లో 9  వ తరగతి చదువుతుంది  10 వ తరగతి అబ్బాయి ఈ  అమ్మాయి ప్రేమ (?) లో పడ్డారు . వేసవి సెలవల తర్వాత  స్కూల్ పునః ప్రారంభమై   ఇరవై రోజులన్నా కాకముందే వీరి ప్రేమ పాకాన పడి టీచర్ల దృష్టిలో పడ్డారు  వారు పిల్ల తండ్రిని పిలిపించి విషయం చెప్పి పంపించారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో తల్లితండ్రి ఇద్దరూ కలసి ఇద్దరు పిల్లలని చితకబాది గేటు బయటకి నెట్టేశారు  చిన్న పిల్ల ఆ పెద్ద పిల్లకి సహకరిస్తుంది అని  ఆ పిల్లకి బాగానే తడి పడింది. విషయం తెలిసినా తెలియకపోయినా కొన్ని విషయాలలో మనం తల దూర్చకూడదు కాబట్టి నేను చప్పుడు కాకుండా బయట గేటుకి తాళం పెట్టుకుని  లోపలకి వచ్చేసాను.

ఈ రోజు ఉదయం మా పనికత్తె  విషయం మోసుకొచ్చింది  అమ్మా! అప్పుడప్పుడు మీ  దగ్గర మొబైల్ ఫోన్ తీసుకుని అతనితో మాట్లాడుతుంటారని తెలిసింది.  అని చెప్పింది

" అయ్యబాబోయ్ ! నాకే పాపం పుణ్యం తెలియదు,  అలాటివన్నీ నా అకౌంట్లో వేయొద్దు, ఏదో కాల్ చేసుకుని ఇస్తానంటే మొహమాటం కొద్ది  ఫోన్  ఇస్తాను కాని " అని చెప్పాను 

మొన్నెప్పుడో . ఆ పిల్ల .నా దగ్గర ససిమ్ కార్డ్ ఉంది  ఓ.. ఖాళీ పోన్ ఇవ్వరా ? అని అడిగింది . నా ఫోన్  లలో సిమ్ కార్డులు తీసేవీలులేదు మీ సిమ్ కార్డ్ అందులో సెట్ అవదని  చెప్పానని  చెప్పాను .

ఇదీ సంగతి ! తల్లిదండ్రులకి తెలియకుండా  పిల్ల దగ్గర సిమ్ కార్డ్  ఉంటుంది. టీనేజ్ ప్రేమలు పరిఢవిల్లుతున్నాయి, ఎలా కాపాడుకోవాలి పిల్లలని ఈ ఆకర్షణల నుండి  !? ఎవరు గైడ్ చేయగలరు ?  మెదడుని  కుమ్మరి పురుగు తొలిచేసినట్లు  బోలెడు ప్రశ్నలు.  ఈ కాలంలో ప్రతి తల్లిదండ్రులకి ఇలాంటి సమస్యలు ఉండేవే !

చెప్పలేని ప్రేమ ఉంది,  ప్రేమని ప్రకటించడానికి ఫోన్  ఉంది  "తేజ" చూపిన  సినిమా సాక్ష్యం ఉంది,    సమయానికి భలే ఉపయోగపడుతుంది అంటూ పిచ్చి ట్యూన్ లో పాట  పాడుకుంటూ 

"  మీకు అది కూడా తెలియదు . ఫోన్  లో కూడా ఎప్పుడూ  విసుక్కుంటారెందుకో !"  నిరసన ప్రత్యక్ష దైవం మీదకి బదిలీ అయింది :)
 
అసలు ఈ ప్రేమని ఎప్పుడు, ఎలా చెప్పాలబ్బా.. ! ఎప్పుడు చెపితే సరియిన సమయం అవుతుందో అర్ధం కాదూ !! అంటూ వారు మట్టిబుర్రని గోక్కుంటున్నారు.
 :)

3, జులై 2013, బుధవారం

పండక మునుపే తన్నుకు చచ్చే ...

ఇప్పుడే   బాపు గారి దర్శకత్వంలో వచ్చిన  చిత్రంలో ఒక పాట  వింటుంటే ఎన్నో ఆలోచనలు .. ఎక్కడెక్కడకో  వెళ్లి పోయాయి 

పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ఒక విడత కూడా పంట పండకుండా నిలువుగా చీలిపోయే పెళ్ళిళ్ళని చూస్తున్న కాలమిది. చాలా నిశబ్దంగా పెళ్ళి పెటాకులై కుటుంబాలు వేదన చెందుతున్న రోజులివి. ఒక మహిళా న్యాయమూర్తి మాటలు గుర్తుకు వచ్చాయి ..  అనేక ఆలోచనలు  అవి ఇలా ..

 పురుషుడు  తను అందవిహీనంగా ఉన్నా ఎలాంటి ఆత్మ నూన్యతా భావానికి  లోనవకుండా  ఎంతో అందమైన భార్యని అయినా భరించగలడు కానీ తనకన్నా  తెలివైన ,పని నైపుణ్యం కల భార్యని భరించలేడన్నది .. చాలా సందర్భాల లో నిజమవుతూ ఉంటుంది

రెండు దశాబ్దాలుగా విడాకులు తీసుకునే వారి సంఖ్యా  పెరుగుతుండటం  ఎందుకంటే .. స్త్రీలకి తాము ఎందుకు అణచి వేయబడుతున్నామో స్పష్టంగా తెలుస్తూ ఉంది. అమ్మమ్మ, అమ్మల కాలం లోలా మౌనంగా అన్నీ భరించి ఉండటం లేదు. స్త్రీలలో ప్రశ్నించే తత్త్వం పెరిగేకొద్దీ పురుషుడిలో అహం మరింత పెరిగి విచక్షణ కోల్పోవడం చాలా సందర్భాలలో జరుగుతుంది.

ఇప్పుడు అధిక ప్రాధాన్యతంతా అమ్మాయిలదే! అధికులమని విర్రవీగే పురుషులకు తామంతకన్నా అధికులమనుకునే స్త్రీ లకి   పొంతన కుదరక వివాహాలు విఫలమవుతున్నాయన్నది సత్యం.

అణుకువగా ఉండటానికి  అన్నీ భరించి ఉండటానికి ఉన్న వ్యత్యాసంలాగానే, చేదోడు వాదోడు గా ఉండటానికిని మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండటానికిని చాలా తేడా ఉంది  వివాహాలు ఎక్కువగా ఇక్కడే విఫలమవుతున్నాయని నాకనిపిస్తూ ఉంటుంది

సంసారం అంటే ఏమిటో చక్కగా వివరించిన భాగాన్ని ఇక్కడే...   అంటే  ఇంటర్నెట్ లోనే చూసాను . అది ఇదిగో ..


చక్కని విషయం కదా!

ఇంతకీ నేను విన్న పాట .. "మీనా " చిత్రంలో పాట  అనుకున్నారు కదూ !
మరి అక్కడే పప్పులో కాలు వేసారు. :)

అంత చక్కని పాటే .. ఈ పాట  కూడా ..

  లేత పచ్చఆకులు, రేయి నల్లవక్కలు , వెన్నెలంటి సున్నం ..ఈ మూడు కలసి మెలిసి  పండినప్పుడే తాంబూలం  అరుణమందారం  అదే కల్యాణం .. అనే పాట

ఆ పాట  వినేయండి ..   ఈ లింక్ లో  "కల్యాణ తాంబూలం" చిత్రం లో పాట.

1, జులై 2013, సోమవారం

ఏకాంతానికి పంచ ముఖాలు

ఏకాంతానికి పంచ ముఖాలు

అదేమీ లెక్క అనకండి .. ఇంకెక్కడైనా అంతకన్నా తక్కువ ఉండొచ్చు మీదు మిక్కిలి ఉండొచ్చు ఇక్కడ మాత్రం ఇంతే ! ఈ అయిదు ముఖాలలో నేను ఉన్నాను.

మనందరికీ  తెలిసిన విషయమేమంటే ... కొంతమంది సమూహంలో కూడా ఏకాంతం లోకి వెళ్ళిపోగలరు, వేరొకరు  ఏకాంతంలో కూడా సమూహాన్ని  దర్శించుకోగలరు

ఏకాంతమంటే నేను నాతోపాటు  ఊహలలో నాకిష్టమైన వ్యక్తీ అనికూడా కొందరు వ్యక్తీకరించవచ్చు

"జిహ్వకొక రుచి పుర్రెకొక ఆలోచన" అంటారు కదా ! ఏ ఒక్కరి వ్యక్తీకరణ ఒకేలా ఉండదు. అది కవిత్వంలో అయితే మరీ భిన్నంగా ఉంటుంది. భిన్న వ్యక్తీకరణలో ఏకాంతాన్ని అందంగా చెప్పిన ఐదుగురి కవిత్వమే  "కవిత్వం లో   ఏకాంతం".

ఈ అయిదుగురి కవిత్వాన్ని నిష్పక్షపాతంగా సమీక్షించిన సీనియర్ కవి" శ్రీనివాస్ వాసుదేవ్  "గారు , థీమ్ కి తగ్గ చిత్రాన్ని అందించిన krishna Ashok గారికి హృదయపూర్వక ధన్యవాదములతో

ఈ లింక్ లోని కవిత్వాన్ని చదివి ఈ వినూత్న ప్రయోగం ని చూసి మీ మీ స్పందనల్ని తెలపాలని కోరుకుంటూ మీముందు ఉంచు తున్నాను    

 

“కవిత్వంలో ఏకాంతం”