31, జనవరి 2012, మంగళవారం

కథా జగత్ - కథా విశ్లేషణ 5

కథా విశ్లేషణకి నేను ఎంపిక చేసుకున్న మరో కథ  రిగ్గింగ్  - నాగసూరి  వేణుగోపాల్ 

ఈ కథ చదవడం మొదలెట్టినప్పటి  నుండి  అక్షరాల వెంట ఆలోచన లేకుండా పరుగెడుతూనే  ఉంటాం. 
సబ్ ఎడిటర్ ఉద్యోగం అంటే మాటలా..? నానా రకాల పైత్యాలని అక్షరాలలో నింపి..పత్రికలకి గురి విసిరిన బాణాలు లాటివి కథలు. ఆ బాణం సబ్ ఎడిటర్కి గుచ్చుకుంటే చాలు.  లక్షల మంది హృదయాలని గుచ్చేసినట్లే! కొండని తవ్వి ఎలుకని పట్టినట్లు కుప్పల తెప్పలుగా వచ్చిపడే కథల కొండని తవ్వి మంచి కథనే ఎలుకని పట్టాలి  దగ్గర మొదలెట్టిన   సబ్ ఎడిటర్   స్వగతం... వింటున్నంత  సేపు హాస్యం వెల్లివిరుస్తూనే ఉంది. చురుకైన చిన్నవైన సంభాషణా చాతుర్యం ఉన్న రచయిత కథ ఇది. పాఠకుల హృదయాలలో కథ తాలూకు దృశ్యం ప్రత్యక్షమవుతుంది. 

ఇక కథ విషయానికి  వస్తే కథల ఎంపిక చాలా విసుగు కల్గించే విషయం. లబ్ధ ప్రతిష్టుల సాదాసీదా కథల మధ్య వర్ధమాన కవుల మంచి కథలు దాక్కుని ఉంటాయి. అందుకనే అన్నీ నచ్చినా నచ్చకపోయినా చదివి తీరక   తప్పని పరిస్థితుల్లో సబ్ ఎడిటర్ స్థానం బాధ్యత కల్గినది,  క్లిష్ట మైనది కూడా.  అలా ఓ.. సబ్ ఎడిటర్  తనలాంటి వారి ఇబ్బందులని  చెపుతూ  ఉండే  కథ  ఈ కథ. 

అలాగే పేరుపొందిన రచయితల,లేదా పరపతి కల్గిన వ్యక్తులు లేదా వారి అనునూయుల రచనలని వెలుగులోకి తెచ్చుకునే ప్రయత్నాలని పైరవీ చేసే విషయాన్ని తెలుపుతుంది.  ప్రచురణ  తర్వాత వారి కథల పై పాఠకుల స్పందనని తెలిపే ప్రక్రియలో ఎలాటి నీచ స్థాయిలోకి దిగజారి స్వయంగా అభిప్రాయాలని వ్రాయించుకుని వాటిని  ప్రచురించమనే ఒత్తిడిని పెంచుతూ చేసే ఫోను కాల్స్ రావడం వంటి దిగజారిన చర్యలు సాహితీ వాతావరణములోనూ వేళ్ళూనుకున్న   కాలుష్యాన్ని చెప్పాయి.

విశేష ఆదరణ పొందటమో,లేదా వివాదాస్పద మవడమో ద్వారా అవార్డులు,సన్మానాలుకి అర్హత లభిస్తుందేమో అనుకోవాలి.  ఒక  రచన  స్థాయిని  పాఠకుల స్పందనతో కూడిన ఉత్తరాలు తెలుపుతాయి. ఉత్తరాల ఆధారంగానే రమణయ్య లాంటి రచయితలూ మరింత గుర్తింప బడతారేమో   కూడా అన్న సందేహమూ వచ్చింది. 

నిజానికి ఇది వాస్తవం కూడా! ఎంతో  మంది  ఈ కథ లోని రచయిత రమణయ్యలా పేరున్న రచయితలూ, ఆర్ధిక బలం కలిగి కథా సంకలనాలు వెలువరిన్చుకోగల్గిన  వారు, సాహితీ స్రష్టలు కూడా ఇంకా ఇంకా వారి రచనలే పత్రికలలో వెలుగు  చూడాలనే తాపత్రయంతో వర్ధమాన కవులకి చోటివ్వక అన్ని చోట్లా వారే దర్శనం ఇస్తారు. ఎంతో  బాగా వ్రాయగల్గిన వర్ధమాన కవులు, రచయితలూ వారికి ప్రముఖ పత్రికల్లో స్థానం లభించక నిరాశ నిసృహలతో కలం మూల పడేస్తారు. వారికి కూసింత ప్రోత్శాహం కూడా లభించని స్థితిని తమ ఆధిపత్యపు చేతుల్లోకి లాక్కునే రమణయ్య లాంటి కొందరి  ప్రముఖ రచయితల మనస్తత్వాన్ని, కీర్తి కండూక కాంక్షని  సున్నితంగా విమర్శిస్తూ చెప్పిన ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. చదువుతున్నంత సేపు  నాకు తెలిసిన కొన్ని వాస్తవ పాత్రలు, పైరవీలు. అన్నీ కళ్ళ ముందు కదలాడి నవ్వు  తన్నుకు వచ్చింది. 

రిగ్గింగ్ ఓట్ల బాలెట్ బాక్స్ లలోనే   కాదు, సాహిత్యరంగం లోను ఉందని నిజాయితీగా  చెప్పిన కథ. అందుకే నాకు నచ్చిన కథ. 

30, జనవరి 2012, సోమవారం

ప్రియమైన పుత్రులున్ గారికి

ప్రియమైన పుత్రులున్ గారికి మీ మాతృ శ్రీ  అనేకానేక అనేకమైన హృదయపూర్వకమైన దీవెనలతో  వ్రాయు  లేఖార్దములు. మీరు అక్కడ క్షేమముగా వున్నారని తలెంచెదను.

మీరు మాతో దూరవాణి ద్వారా కానీ, చిత్ర వాణి ద్వారా కానీ మాటలాడి పది దినములు అయినది. మీ క్షేమ సమాచారముల గురించి.. మేము మిక్కిలి దిగులు చెందుతుంటిమి. ఆ దిగులును మరచినది యెట్లనగా..నేను వొక తీవ్రమైన సమస్యని యెదుర్కొనుచుంటిని. అందువల్ల నేను మీతో మాటలాడుటలో అశ్రద్దగా వున్నాను. మీరు మన మాతృ భాషని పూర్తిగా మరచినట్లు తోచుచున్నది. అందువలన మేము మీకు గ్రాంధికంలో ఉత్తరం వ్రాయటమైనది.అటులైనను..మీరు ఈ లేఖ చదువుటకు తగిన  శ్రద్ద వహించెదరు..అని నా నమ్మిక. 

మీరు నాతో .. మాట్లాడినప్పుడల్లా యేమి చేస్తుంటిరి  ..మాతా శ్రీ  అని పదే పదే అడుగుతూ వుందురు  కదా! పని   లేకపోయినా యెడల ఈగలు,దోమలు తోలుకొనుడు..అని వాడుక మాట యున్నది కదా..అటుల గాకున్ననూ.. నేను పని వున్న నూ ..కూడా మశ్చరములను వేటాడుటయే  ముఖ్యమైన పనిగా వున్నది. ఈ ఋతువు నందు మన వసతి గృహము దరిదాపుల్లో..మశ్చరములు బహుళంగా వున్నవి. మన వసతి గృహం ముందునూ ప్రక్కనూ.. బహుళ అంతస్తుల భవనములు నిర్మింపబడి సముదాయ గృహములగా మారి యున్నవి.  మన గ్రామ పరిపాలనా అధికారులు నిబంధనలకు విరుద్దంగా.. అలా కట్టడములకై  అనుమతిని యిచ్చితిరి కానీ .. జనులు వాడిన నీటిని సక్రమముగా వెడులు క్రియలు చేపట్టక నిర్లక్ష్యం వహించిరి. అందువల్ల.. మశ్చరములు  బహుగా వర్ధిల్లి.. జనుల్ని కుట్టి విపరీతముగా బాధించు చున్నవి. రాజ్యంలో.. ప్రభువులకు   చిత్త శుద్ధి లోపించినట్లే.. అధికారులకునూ  చిత్త శుద్ధి-నీతినియమములు నశించి.. ప్రజలను పెక్కు ఇక్కట్లుకి గురిచేస్తుంటే..పీల్చి పిప్పి అవుతున్న ప్రజలకు. మురుగు దుర్గంధం మరియు  మశ్చరముల కాటు తప్పడం లేదు.

విదేశములలో..  మిడతల దండు ఆకస్మికంగా దాడి చేసి పంటలను నాశనం చేసినట్లు..వార్తా పత్రికలో చదివి యుంటిని కానీ..ఈ మశ్చరముల దండు నాకు కడు  విచిత్రముగా తోచు చున్నది.మశ్చరముల కాటుకు రక్షణగా వుండు నవనీతం వంటి పైపూత మందు వ్రాసుకుని నా శరీరం రంగు మారినది కానీ.. వాటి యొక్క కాటు నుండి మమ్ము మేము రక్షింప మార్గం తోచడం లేదు. పిచికారి మందులు, చక్రముల గాఢమైన పొగలు, తెరలు,వలలు..అన్నియు నిష్ప్రయోజనం అయిపోతున్నవి. 

అదియును గాక  మశ్చరముల నివారణకి యే క్రియలు చేపట్టిననూ..మాకు..శరీర తత్వమునకు సరిపడక నాశికా రంద్రముల నుండి..ధారాపాతమైన స్రావాలు వెలువడుతున్నవి. లేదా.. నాశిక దిబ్బడలు,నయనములు యెర్ర బారుట, అగ్ని మంటలు వచ్చి వైద్యశాలల చుట్టునూ..ప్రదక్షిణములు చేయుట పరిపాటి  అయినది. ఇక  ఉపేక్ష తగదు అని ద్వారములకి,గవాక్షములకి వల చట్రములని బిగింప జేసితిమి. అదియును మితిమీరిన వ్యయం అయి ఈ సంవత్సరము.. పుస్తకముల పండుగకి వెడల వీలు కల్గక  యెన్నటి నుండో.. ఖరీదు   చేయవలెనని అనుకున్న  ఆసక్తి కల్గిన పుస్తములకి గండి కొట్టినవి. నాకు  తీవ్ర విచారం కల్గినది.వల చట్రములు బిగించిననూ కూడా  అదేమీ చిత్రమో..మశ్చరముల.. బెడద వదలక మరింత  యెక్కువ అయినది. 

అప్పుడు..ఒకే ఒక సులభతరమైన బాణం ని ప్రయోగింప జొచ్చితిని. అది..రాముని చేతియందు రావణుని వధించు బాణం వలె..,భీమసేనుడి చేతిలోని.. గద వలే, ఇంకన్నూ చెప్పాలంటే.. సామ్రాట్ అశోకుడి   చేతిలోని వీర   కార్తీకేయ ఖడ్గం   గాను నేను అమితంగా వూహించుకుని.. మశ్చరముల పని యిక ఖాళీ అని మిగుల సంతోషించితిని. ఇంతకూ ఆ బాణం యేమనగా అది విద్యుత్ దండం. ఆ దండముని పట్టుకుని.. అసుర సంధ్య వేళ మొదలిడి..నిశాంత సమయం వరకునూ.. మశ్చరముల వేట కొనసాగించుతూనే వుండితిని. "వంద ఈగలు అయినను తప్పించుకొన వచ్చును గానీ  ఒక్క మశ్చరము కూడా తప్పించుకొన వీలు లేదు అనే నినాదం పూని.. కంటి మీద కునుకు లేకుండా.. వేటాడుతుంటిని. ఆ దశలో.. మేము బాల్యదశలో.. ఆడిన పసుపురంగు బంతి కొట్టే  టెన్నిస్   ఆటను ఆడుతున్నట్లు బంతి ని ఒడుపుగా పట్టుకుని బలంగా కొట్టి ప్రత్యర్దులని  మట్టి కరిపించిన రోజులు మదిలో మెదిలినవి. కానీ ఇక్కడ  ఆట   యేక పక్షమున  తలపించినది. అప్పుడైననూ నేను అపజయం యెరుగను.కానీ మశ్చరముల  సమయ స్ఫూర్తి, తెలివితేటల యందు నేను వోడూతూనే వుంటిని.  అది నా మొదటి రోజు అనుభవము. 

ఇక రెండవ రోజు.. రంద్రాన్వేషణ మొదలెట్టి..  మశ్చరములు వచ్చు మార్గమును సూక్ష్మంగా పరిశీలించి కడు  జాగ్రత్త వహించితిని. అయిననూ కూసింత కూడా..ప్రయోజనం కానరాలేదు. నా శరీరం నందలి రుధిరాన్ని వాటికి విందు భోజనంగా..అందించక తప్పడం లేదు. గానం వినబడకుండా వుండని   మన గృహం నందు.. గానము లేదు వీనుల విందు సంగీతం లేదు.అన్నపానీయముల పనియును లేదు. కర్ణ ద్వయం పేలినట్లు  మశ్చరముల సంగీతం వినుటయే సరి. మాకున్  కక్ష   స్వభావం  మేల్కొని యెల్లప్పుడునూ మీ సంగీతమే..మేము ఆస్వాదించట యేనా..నా గాన కళా ప్రావీణ్యముని వినుడని..  అర్ధ రాత్రుల యందు మేల్కొని  వానికి నా గానము వినిపించితిని. అవి అందుకున్ కూడా  భయపడక.. జారుకోక.. మన యింటి యందె నిశ్చలంగా స్థావరం యేర్పరచుకుని వున్నవి. ఇది..నా రెండో.. అనుభవ దినం.

ఇక మూడో రోజు..  నా బాణం (అదే నా విద్యుత్ దండం)  కార్యరూపం దాల్చనని మోరాయించినది. నేను వెంటనే నా కార్తీకేయ కరవాలమునకై పరుగులు తీసితిని. ఆ దుష్ట అశోకుడి,ఆ క్రూర అశోకుడి,ఆ నీచ   అశోకుడి..  కార్తీకేయేం యెక్కడ యెక్కడ అని వెతికితిని. వేయి క్షాత్రవులని చంపి కానీ వొరలో యిమడని కార్తీకేయం   అంత త్వరగా దొరికినది కాబట్టి సంతసమే! (పనిలో పని గా ఇటులు  మీ పితురులని  తిట్టామని  కోపగించుకోకండి అశోక తనయా..మేము యెపుడైనను అటుల తిట్టు సాహసించెదమా?  చెప్పండి.!? మీ తండ్రి గారికి మాతృ శ్రీ మిమ్ము తిట్టితిరి అని సరదాకి అయిన, హాస్యంగా అయినను ఫిర్యాదు చేయకండి.)  మేము వెంటనే సరి క్రొత్త దండం ని ఖరీదు చేసి..ఆఘమేఘముల మీద  గృహమునకి వచ్చితిమి. పాపం మన పని వారల .. కనుల వెంట ఆనందభాష్పములు. మా యజమానికి యెంత   ద్రయార్ద్ర హృదయము.. మమ్ము మశ్చరముల నుండి కాపాడుటకు యెన్ని అవస్థలు పడుతున్నదని. నాకు వొడలెల్లన్ గర్వం వుప్పొంగినది. పాపము శమించుకాక! వేలాది  మశ్చరములను జంపి.. మేము.. తప్పిదం చేయుచుంటిమి అని ఆత్మ విమర్శ జేసుకుంటిని కానీ మశ్చరముల అమిత కాటు వల్ల అనారోగ్యములు దరి జేరి.. వొళ్ళు యిల్లు గుల్ల అవుతుంటే.. ఇక వుపేక్షించ జాలను  అని కఠోరనిర్ణయం గైకొని..దండ యాత్ర సాగించితి కానీ..  అది మశ్చ రముల జైత్రయాత్ర అని మరునాటికి గానీ తెలియ రాలేదు. 

మరల మర వచ్చు పోవు వసంతములా ..మశ్చరముల దండు..దినదినంబు వృద్ది అగుచున్నది.  జంపుట వల్ల వోపిక నశించుచున్నది. కానీ..  శాశ్వత పరిష్కారం కనబడలేదు. గ్రామ పరిపాలనా విభాగామునకి వెళ్ళి.. ఫిర్యాదుని మరియొకమారు సమర్పించితిని. వారు వచ్చి..శ్వేతవర్ణ పిండి చల్లితిరి కాని అందు సారంబు లేక యధావిధిగా మశ్చరముల బాధ తొలగలేదు. నేను..దీర్ఘముగా యోచన చేసితిని. బాల్యంలో జదివినప్పుడు సరిగా గ్రహించని విషయం తెలుసుకొనుటకు మశ్చరముల జీవిత చక్రముని నిశితంగా పరిశీలించితిని కూడా. ఏవేవో మందులని పిచికారి చేయిన్చితిని. ఆ రోజు మాత్రం కాస్తంత ఉపశాంతి దక్కినది.

మశ్చరముల వేటలో.. మా వుదయపు వ్యాహాళికి స్వస్తి చెప్పితిని. ఎందుకనగా.. మశ్చరములను వేటాడుటయే  ..నాకు అమితమైన వ్యాయామం అయి.. నా చిరు బొజ్జ తగ్గి.. నా బాహు దండముల కొవ్వు కరిగి.. కాస్త నాజూకు  అయితిని కూడా. ఇరుగు పొరుగు వారు.. పూర్తి దినము అంతయూ.. ఆ అంతర్జాలం,రంగుల పెట్టేయందే.. కాలక్షేపం చేయుచుంటిరి. కాస్త వెలుపలకి రండు అని .. ఎక్కెసపు మాటలు వినలేకున్నాను. కానీ మేము చేయు పని యేమంటే.. యెలాగు మశ్చరములను  యెదుర్కొనుట   అన్నదే యోచన అని వారికిన్ చెప్పలేదు.  మేము..అంతర్జాలంలో తల దూర్చి   యెన్ని దినములు అయినదో..నాకు అమితమైన బెంగ గా వున్నది. అతి విలువైన మా సమయములను, నిదురను,అన్న పానీయములని తృజించి సమయము వెచ్చించి ననూ కానీ.. మశ్చరముల బెడద తప్పడం లేదు. 

ఇక మేము విసుగు చెంది.. రాత్రుల సమయం నందు.. నడి మంచం పైననే కూర్చుని విద్యుత్ దండం ప్రక్కన యుంచుకుని మౌనంగా  వీక్షిస్తూ వుంటిమి. మశ్చరముల వద్దకు మేము వెళ్ళకుండా.. అవియే మా వద్దకు వచ్చుట చూసి.. అయ్యో..అనవసరంగా   యిన్ని దినముల  నుండి  జాంటీ రోడ్స్ వలే మైదానం అంతా తిరిగి బంతి పట్టుకొనునట్లు మశ్చరముల వెంటబడి శక్తి కోల్పోయి అలసితినే! అమితంగా డస్సితినే  ..అని తెగ విచారబడితిని. ఎలా అయితేనేమి.. మశ్చరముల దండుని కొంత కట్టడి చేయగల్గితిని. మీ తండ్రి గారు మీ స్వగ్రామములో ఉంటిరి గాన వారు ఈ మశ్చరముల కాటుని తప్పించుకొంటిరి .లేకున్నా వారికి సేవలని జేసి.. వీటి బెదడకి.. నేను  మరింత అలసి పోయి వుందునేమో!  మేము మశ్చరముల నివారణకి మేము యేమి  చేయుచుంటిమో,యెంత పరిశీలన చేయు చుందునో.. వ్రాయుట మొదలిడిన  అదినొక బ్రహుత్ గ్రంధం వ్రాయవచ్చును. ఆ గ్రంధమును ఏ విశ్వ విద్యాలయమునకైనా సమర్పించిన యెడల నాకు పరిశోధనా పత్రం తేలికగా లభించి..నాకున్న  విద్యా విషయ సంబంధమైన కోరిక కూడా (పి.హెచ్.డి)బహు తేలికగా నెరవేరును అని పించుచున్నది.

మీరు నివశించు దేశమున అభివృద్ధి పథం గా వున్నది కాన అక్కడి నివారణ  వుపాయాలని మాకున్ తెలియ పరచి.. సహాయం చేయవలే అని మిమ్మల్ని అడుగ వలెనని అనుకుంటిని.  ఇంతలో మీ సహొదరి గారు.. మాతో మాటలాడినారు. మా రాజ్యమున మశ్చరముల బెడద లేదు.. అని మాతృదేశం లోని మన వెతలకి చింతించినది.  పరిపాలని అసహ్యిన్చుకున్నది. అవినీతి లాగును,దేశ సంతతి లాగునూ.. మశ్చరముల వృద్ది అని అవహేళనం  జేసినది. మాకు బాధ కలిగిననూ..మాటలాడలేదు. ప్రొద్దు గుంకినది. మరల మా వేట ప్రారంభం అవబోతున్నది. ఒక్క విషయం చెప్పి లేఖ ముగించెదను.

మీరు రాత్రిబవళ్ళు  కష్ట పడినను..మేమున్ కష్ట పడినను..మన యొక్క స్వగృహ నిర్మాణం కల నెరవేరుట సుదూరముగా తోచుచున్నది. అందుమూలంగా మేము మీకు సూచించునది యేమన గా..మీ తండ్రి గారిన్ యెలాగు అయినను వొప్పించి కొన్ని గజముల భూమిని విక్రయించి ఆ ధనం వుపయోగించి..  ఊరికి చివరగా..మురుగు, మశ్చరముల,రణ గొణ ధ్వనుల  బాధ లేని  అధునాతన రీతిలో పూర్తి శీతలీకరణ గృహం మాదిరి  వలె  పూర్తి " నవీకరణ  రక్షిత వల "నిర్మిత మైన గృహముని అధునాతనంగా  నిర్మించుకుని.. ప్రశాంతముగా వుండుటకు ఆస్కారముని కలిగించు కొనవలయని..ఆ విధముగా యోచన చేయమని తెలియ పరుస్తూ.. మన  స్వంత యింటి కలని కోరికని తీర్చి సంతోష పరచవలసినదిగా.. చెపుతూ..     

మీరు యెల్లప్పుడు క్షేమంగా వుండుటయే.. మా  మదిలోని కోరిక గా యెరింగి.. జాగ్రత్తగా మసలుకొనుచూ.. వెను వెంటనే..ఈ లేఖకి.. సమాధానమును  గ్రాంధికం గాకున్ననూ  మాతృభాషలో అయినను వ్రాసి..మమ్మల్ని ఆనందింప జేయుదురని   ఆకాంక్షిస్తూ..
                                                  
                                                          ప్రేమ పూర్వకమైన, వాత్శల్య భరితమైన  దీవెనలతో.. మీ మాతృ శ్రీ గారు.

29, జనవరి 2012, ఆదివారం

వేటూరి జీవితం సప్త సాగర గీతం

జీవితం సప్త సాగర గీతం 

జీవితం  సప్త  సాగర  గీతం  ఈ పదంలోనే అనంతమైన అర్ధాలు ఉన్నాయి. 
ఎల్లలు లేని ప్రపంచంలో..సప్త సాగర తీరాలలో..ఎక్కడో ఒక చోట మన తీరం ఉండనే ఉంటుంది.
ఆ తీరంలో మనం జీవన గీతం పాడుకోవడమనే  అర్ధంతో.. జీవితమే సప్త సాగర గీతం..
వెలుగు నీడల వేగం..మనని తరిమే వేగమైన కాలం..వెలుగు -చీకటే కాదు..కష్టం-సుఖం కి కూడా వర్తిస్తుంది కదా!అలా సాగనీ పయనం. కలా ఇలా  కౌగలించే చోట. కలలు వాస్తవం కూడా నిజమైన వేళలో జీవితం సప్త సాగర గీతంలా అందంగా సాగిపోతూనే  ఉంటుంది. 

ఈ పాట  కొందరి దృష్టిలో యుగళ గీతమే. కానీ అర్ధం చేసుకున్నప్పుడు వేదంలాంటి సారాన్ని  గ్రహించవచ్చు. 

"చిన్ని కృష్ణుడు" చిత్రంలో ఈ పాట ని ఆర్.డి.బర్మన్ సంగీత పరంగా.. కలకూజితం ఆశా భోంస్లే గళం పై ఉన్న అమితమైన అభిమానం దృష్ట్యా వింటున్నప్పుడు ఓ చక్కని..గీతమే.!

కానీ అతి మాములుగా వ్రాసిన ఈ పాట యొక్క పల్లవిలో  యెంత అర్ధం ఉందో! వేటూరికి అభివందనం చేయక మానం. నాకు  ఇష్టమైన ఈ పాట సాహిత్యం  ఇదుగోండి.

జీవితం సప్త సాగర గీతం 
వెలుగునీడల వేగం 
సాగనీ పయనం
కల-ఇలా కౌగలించే చోట (జీవితం)

ఏది భువనం ఏది గగనం తారా తోరణం   
ఈ చికాగో సిల్క్ టవర్  స్వర్గ సోపానం 
ఏది సత్యం ఏది స్వప్నం నిజమీ జగతిలో..
ఏది నిజమో ఏది మాయో 
తెలియనీ లోకమూ..
బ్రహ్మ మానసగీతం 
మనిషి గీసిన చిత్రం 
చేతనాత్మక శిల్పం 
మతి కృతి పల్లవించే చోట (మ) 
జీవితం సప్త సాగర గీతం 

ఆ లిబర్టీ శిల్ప శిలలో స్వేచ్చా జ్యోతులు 
ఐక్య రాజ్య  సమితిలోన కలిసే కాంతులు 
ఆకాశాన సాగిపోయే అంతరిక్షాలు 
ఈ మియామి బీచ్ కన్నా ప్రేమ సామ్రాజ్యమూ 
సృష్టికే ఇది అందం
దృష్టి కందని దృశ్యం 
కవులు వ్రాయని కావ్యం
కృషి-ఖుషి సంగమించే చోట (కృషి )
జీవితం సప్త సాగర గీతం..

అంటూ.. అమెరిక సంయుక్త రాష్ట్రాల అందాలని వర్ణించారు. ఎంతైనా మన యమహా  నగరి తర్వాతే అనుకోండి.కానీ ఈ పాట వ్రాసింది   మాత్రం   యమహా నగరి కన్నా ముందు.   

ఈ   వీడియో  లింక్  లో  అమెరికా  అందాలని , పాటని  చూడవచ్చును . 



 వేటూరి గారిని స్మరించుకుంటూ, అలాగే ఆర్.డి.బర్మన్ గారికి, జంధ్యాల గారికి నివాళులతో ఈ పాట పరిచయం . 

చాందిని రాత్ మే

చాందిని   రాత్ మే  ఏక్ బార్    తుజే  

నాకు  చాలా చాలా ఇష్టమైన ఈ పాట " దిల్ ఏ నాదాన్"   చిత్రం లో పాట.

ఈ చిత్రంకి   " ఖయ్యాం"  సంగీత దర్శకత్వం వహించారు.  సంగీతం ఎంత అధ్బుతంగా ఉంటుందో..సాహిత్యం అంతకన్నా బాగుంటుంది. గజల్ తో పోల్చ తగ్గ సాహిత్యం. అందుకే ఈ పాటని తెనుగీకరించ సాహసం చేసాను. ఎక్కడైనా తప్పులు ఉంటే మన్నించాలి. కొన్ని ఉర్దూ పదాలు ఉండటం మూలంగా అనువాదం అంత సులభంగా లేదు కూడా. 

పాటని వింటూ సాహిత్యం గమనించండి. చాలా మంచి పాట .

 వెన్నెల రాత్రిలో ఒకసారి నేను నిన్ను చూసాను.
నన్ను నేను తరచుకుంటూ..లోలోపల సిగ్గుపడుతూ..
వెన్నెల రాత్రిలో నేను నిన్ను చూసాను..
అంటుంది ఆమె.

నీలాకాశంలో  ఎక్కడో   ఉన్న ఊయలలో 
ఏడు రంగుల ఇంద్రధనస్సు ఊయల లో
అద్భుతమైన అందం అలలు అలలుగా ప్రసరిస్తూ ఉంటే  
నన్ను నేను తరచుకుంటూ నన్ను చూసి నేనే సిగుపడుతూ..
వెన్నెల రాత్రిలో.. నేను నిన్నూ చూసాను..
అంటున్నాడు అతను.

సెలయేటి తీరం వద్ద మేల్కొంటునటువంటి ఏవేవో ఊహలలో 
అందమైన నవ్వుని చిందించే..మోమును
నా చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో 
ఒక వర్ణ రంజితమైన గజల్ ని ఆలపిస్తూ ఉండగా..
పూలు కురుస్తూ ఉండగా,ప్రేమ ప్రజ్వల్లిల్లుతూ ఉండగా.. 
ఓ.. వెన్నెల రాత్రిలో నిన్ను  ఒక సారి చూసాను..  
అని ఆమె  చెపుతూ ఉండగా.. 

ఇప్పుడు అతని మనసులో మాట ఎలా ఉందంటే...
విడివడి పరచుకున్న..సువాసనలు వెదజల్లే కురులు 
ఆ సువాసన గాలిలో కలసి కరిగి పోయింది. 
నా ప్రతి శ్వాస ని ప్రోత్శాహిస్తూ..
నన్ను నేను తరచుకుంటూ..నాలో నేను సిగ్గుపడుతూ.. 
ఒక వెన్నెల రాత్రిలో నిన్ను నేను చూసాను...
 అంటున్నాడు.

నీవు ముఖం   మీది ముఖం వంచావు. 
నేను నా ముఖాన్ని చేతుల్లో దాచాను 
 సిగ్గుతోను,గాబరాపడుతూను..  
పూలు కురుస్తూ ఉండగా..ప్రేమ ప్రజ్వ ల్లిల్లుతూ ఉండగా 
వెన్నెల రాత్రిలో నేను నిన్ను చూసాను. ..
అంది ఆమె.             


26, జనవరి 2012, గురువారం

కథా జగత్ - కథా విశ్లేషణ 4

కథా జగత్ - కథా విశ్లేషణ  లో నేను ఎంచుకున్న కథ  కల్పన  - సామాన్య  

ఆకాశం లో సగం అని ఘనం గా చెప్పుకునే మహిళ ల  చదువులు -ఉద్యోగాలు కుటుంబం అనే రారాజుని గెలిపించడానికి గృహిణి కర్తవ్యం ని నెరవేర్చడానికి..ఎలా బలి తీసుకోబడుతున్నాయో.. ఈ కథ చెబు తుంది  . .. పురుష అహంకార, వరకట్న,కుటుంబ హింస లోలోతుల్లో ఎలా ఇంకా వేళ్ళూ నుకునే  ఉన్నాయన్న సంగతిని..మరవకూదదనుకుంటూ.. ఆ పరిధిలోనే స్త్రీల   జీవితాలు వాటికి అనుగుణంగానే  మారతాయని, ఇంకోరకంగా  చెప్పాలంటే   అలా మార్చబడతాయని ఈ  కథ చెపుతుంది.  

కల్పన , సుదీర అనే ఇద్దరు విద్యాధికులు, మాజీ ఉన్నత ఉద్యోగినులయిన తల్లుల గురించి వారి ఆవేదనాభరితమైన ముచ్చట్లలో.. మనం ఈ కథని చదువుతూ..  మహిళల విద్యా ఉద్యోగ అవకాశాలని,శక్తి యుక్తులని సామర్ధ్యాన్ని పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే  కారణాలతో  తల్లి అనే  పాత్రని ఎంతో   ప్రేమ భరితంగాను చేస్తే,   భార్యగా  బరువు-భాద్యతలు వారిని  ఎలా నిస్తేజంగాను  చేస్తాయో తెలుసుకుంటాం.  మారని పురుష ప్రపంచ వైఖరిని గమనిస్తూ..దుయ్యబడుతూ  ముందుకు సాగుతాం.

ఉన్నత ఉద్యగం చేసి లక్షలు సంపాదిస్తున్న కల్పన కి వరకట్న బాధ తప్పలేదు.అత్తగారి ఆజ్ఞానుసారాలు,ఆడబడచు ఆరళ్ళు, భర్త సహకార లేమి వీటన్నిటి మద్య.. అమితంగా నలిగి చదువు ఉద్యగం ఇచ్చిన భరోసాతో..పోరాడి గెలిచినా మళ్ళీ వివాహమనే వ్యాపారము లో..లాభాన్ని లేక్కించుకుని.. భర్తతో కలసి ఉండటానికే ఇష్టపడుతుంది. ఇంటా-బయట చాకిరితో.. తల్లి గా తన అవసరాన్ని బిడ్డకి అందించలేని అసహాయతనంలో..ఉద్యోగం వదులుకోవడం, భర్త అహంకారం లాటి విషయాలు  అన్నీ యెంత ఒత్తిడికి   గురిచేసి.. ఆమెని కేవలం గృహిణిగా మిగిల్చాయో, జీవితం  ఎంత వేదనా భరితం అయ్యిందో.. ? కథ చదువుతుంటే.. ఇది  ఒక్క కల్పన సమస్య మాత్రమేనా అనిపిస్తుంది.  లక్షలాది మంది మహిళల కత్తిమీదసాములాటి  ఇంటి-ఉద్యోగ భాద్యతల్లో .. నలిగి పోతున్నారో..అనిపిస్తుంది.   కథ చదువుతుంటే పురుషుల సహకార లేమితో.. నలిగిపోతున్నఉద్యోగులైన  ఆడ కూతుర్లే  కనిపించారు. 

చదువుకుని ఉద్యోగం చేసి,డబ్బు సంపాదిస్తున్నానే  ధీమాతో..మొగుడికి ఎదురు తిరిగి మాట్లాడటం,కేసులు పెట్టడం చేస్తున్నారు.అది లేకపోబట్టే కాపురాలు చక్కబెట్టు కుంటాం అని తీర్మానిన్చుకోవడం కన్నా తప్పిదం ఇంకోటి   ఉండదేమో!  స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర్యం లభించవచ్చు.ఆర్ధిక స్వేచ్చ లేకుండా..తమ సంపాదన అంతా..భర్త చేతికి అందించి..ఎన్ని ఇక్కట్లుని మౌనంగా సహిస్తారో..చాలా సందర్భాలలో  మనం రుజువు పరచగలం. 

ఈ కథలో సుధీర  చెప్పిన  మానస కథ  ఆఖరికి సుధీర  కథ కూడా.. చదువుకుని ఉద్యోగం చేస్తూ..  రెండు పడవలపై కాళ్ళు ఉంచి జీవన ప్రయాణం చేయలేక  కుటుంబం కోసం,బిడ్డల కోసం  హౌస్ వైఫ్ గా మిగిలినవారే!  ఉద్యోగం పురుష లక్షణంగా..మగవాళ్ళు మారనూ లేదు. స్త్రీలకి సహకారం అందించడం లేదు.  .కొంతలో కొంత ఈ కథ లో స్త్రీలు తమ ఆసక్తుల   మేరకు ఇకబెన క్లాస్స్ లకి వెళ్ళడం,దూర విద్యా కోర్సులలో చేరి చదువుకోవడం కొంత హర్షించ తగ్గ విషయమే! చాలా మంది స్త్రీలకి ఆసక్తి ఉన్నా అలాటి అవకాశం లభించనే లభించదు. అలాగే  కథ ముగింపులో స్త్రీల జీవితాలలో..కనీసం  మంచి చెడు నిర్ణయం తీసుకోవడానికైనా... మన నిర్ణయం మనం తీసుకోవడానికి అయినా.. తప్పనిసరిగా చదువుకుని ఉండాలి అనడం కూడా ఆవేదనగానే ఉంది.చదివిన చదువులు,సంపాదించిన లోకజ్ఞానం అందుకు మాత్రమె ఉపయోగమా? సమాజంలో సగ భాగం అయిన స్త్రీకి సమాజ భాద్యత లేకుండా..కుటుంబానికే పరిమితం కావడమో,  కాబడటమో అన్నది ఇంకా వారు  చీకటి లోకంలోనే ఉన్నట్లు అనిపించక మానదు.

 నాకు ఈ కథలో నచ్చిన విషయం ఏమంటే  స్త్రీల అభివృద్ధి వెనుక దాగిన అణచివేత పై . తెలియని ఆవేదన ఉంది. అది మనలని చుట్టుముట్టుతుంది. ఆధునిక కాలం అమ్మాయిల చదువులు, ఉన్నత ఉద్యోగాలు.. మంచి సంపాదన అంటూ..ఆకాశానికి..ఎత్తేయడం..అందరికి కనిపించే బాహ్య కోణం.

ఇంటా బయట.చాకిరి చేస్తూ..పాత కొత్త తరాల మద్య సంధి కాలంలో.. స్త్రీలు ఎంత నలిగిపోతున్నారో అన్న దానికి..  ఈ కథ . దర్పణం పట్టింది. ఆర్ధిక సమానత్వం కల్గిన స్త్రీని..భార్యగా అంగీకరించలేని..సమాజంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు స్త్రీలకి..చదువు ఉద్యోగాలతో పాటు అన్నీ ఉన్నాయి..వరకట్నం, వేధింపులు,ఆదిపత్య ధోరణి ని భరించాల్సి రావడం..ఇంకా అనేక సాంఘిక సమస్యలు ఉండనే ఉన్నాయి .  అన్ని ఉన్నా.. స్త్రీ లో..మాతృత్వానికి ..పెద్దపీట..వేయడం..స్త్రీఅత్వానికే చిహ్నంగా.. ముగింపునివ్వడం .కధకి వన్నె తెచ్చింది..వాస్తవం కూడా..అదే..!
 కధని.. ఇంకా బాగా వ్రాయవచ్చు. కల్పన తన గురించి చెప్పడంలో..ఇంకా .సున్నితత్వం ఉండాల్సిన్చినదేమో అనిపించినది, అవసరమనిపించిది. అఫ్ కోర్సు..ఇన్ని సమస్యలని ఎదుర్కొన్న  స్త్రీలకి.. సున్నితత్వం  కూడా పోతుందనుకోవచ్చు. . ..చక్కని..కధ అని అనలేను.. వాస్తవాలంటాను. ఆ ఆవేదన తోనే .ఈ కథని విశ్లేషించాను  కూడా..

 తల్లిదండ్రుల తరం మారి ఆడపిల్లలు చదువుకోవాలని కొడుకులతో సమానంగా చదువు చెప్పించింది. కానీ చూశారా మగవాడు మారలేదు. మగవాడి తల్లిదండ్రుల పాత్ర మారలేదు. ఇప్పుడు మనకు అభ్యుదయం పేరిట అదనపు బరువు బాధ్యతలు''.   

ఇది నూటికి నూరు శాతం నిజం.

23, జనవరి 2012, సోమవారం

కాటు ఏదైతేనేం ?

కాటు ఏదైతేనేం

ముప్పాతిక రోజులో అలవాటైన పనులలోనే 
పహారా కాసి కాసి అలసి పోతానేమో 
అమ్మ ఒడిలేకున్నా
ప్రియ సఖుని దండ చేయి లేకున్నా 
దూది మెత్తళ్ళ  స్పర్శలేకున్నా
ఆమె కౌగిలిలో..ఒదిగిపోతాను

ఒళ్ళంతా బహుళ  వస్త్రాల సముదాయంలో 
జాగ్రత్తగా చుట్టుకునే ఉంటాను 
దుర్భేద్యమైన వల కోట నిర్మించుకుంటాను. 
ఒణుకుతూనే  వలదనుకోలేని పవన వీచికలు 

ఇంత రక్షణలో ఇముడ్చుకున్నా 
రహస్యంగా ఐ ఎస్ ఐ ఏజంట్లా
నా రక్షిత సామ్రాజ్యంలో జొరబడి 

అవాంచిత సంగీతాన్ని కర్ణద్వయం పగిలేలా వినిపిస్తూ..
నా చుట్టూ ఎయిర్ వింగ్ విన్యాసాలతో చక్కర్లు కొడుతుంటాయి 
నిద్రిస్తున్న శత్రు స్థావరాల పై అమాంతం దండెత్తి 
కసిదీరా కాటేసి రక్త దాహం తీర్చుకోవడానికి అన్నట్లు. 

పిచికారి మందులు,నవనీతం లాంటి పూతమందులు 
దట్టమైన పొగల గాఢత,పూల పరిమళాల ఆఘ్రానణకి 
అలవాటైపోయి 

సామదాన బేధదండో పాయాలు పనికిరావన్నట్టు   
రావణాసురిడి విక్కటాహాసం ఒకటి  
సమాధానంగా నడుం బిగించి యుద్దానికి ఉపక్రమించి..
మిగిలిన  ఒకే ఒక్క రామ బాణం 
విద్యుత్ దండంతో విన్యాసాలు చేసాను
టప్ టప్ మని ఆచూకి లేకుండా నశించిన శత్రు శేషం చూసి
దోమకాటు తప్పిందని సంతోషించాను.

ప్రక్కనే..  దోమ కాటు కంటే ప్రమాద కరమైన 
ప్రేమ కాటులోచిక్కుకుని 
లవ్ మంత్రం పలవరిస్తున్న అమ్మాయిని చూసి.. 
ఏ దండం వేసి రక్షించాలా  అని .. 
మిగిలిన రాత్రంతా..ఆలోచిస్తున్నాను.


22, జనవరి 2012, ఆదివారం

కథా జగత్ - కథా విశ్లేషణ -3

కథా విశ్లేషణకి నేను ఎంచుకున్న మరో కథ అవశేషం -చంద్రలత   ఈ లింక్ లో కథ చదవవచ్చు.

ఆంధ్రుల అచ్చమైన షడ్రుచుల పచ్చళ్ళ రుచిని పరిచయం చేస్తూ పచ్చళ్ళ తయారీ లోకంలోకి మనని తీసుకువెళ్ళి మనం మరచిన మన మూలాలని పరిచయం చేస్తూ మహిళలు ఆర్ధిక స్వావలంబనని నిలువు టెత్తు  అద్దంలో చూపించి  ప్రపంచీకరణ నేపధ్యంలో మనం మనం కాకుండా అవశేషంగా మిగిలిపోయే దుస్థితికి తీసుకువెళ్ళే పన్నాగాలను చక్కగా వివరించి చెప్పిన కథ  ఇది. 

ముందుగా.. నేటి తరానికి మన సంప్రదాయ ఆహారం ఏమిటో మర్చి పోయేదశలో  కేవలం బర్గర్లు, పిజాలు, సాఫ్ట్ డ్రింక్స్ ఇవే రాజ్యం ఏలుతున్న తరుణంలో చవులూరించే రకరకాల పచ్చళ్ళ లోకంలోకి వెళ్లి రుచి చూసి వచ్చేసామా !?(నేనైతే  రాలేదు ఇంకా అక్కడే ఇన్నాను) తర్వాత పని పాట లేక  లేదా చిన్న పాటి ఆర్ధిక ఆధారం లేక బిడ్డల పై ఆధార పడే అవమాన స్థితిలో ఉన్న ఒంటరి మహిళల  ఆర్ధిక స్వాలంబనకి పచ్చళ్ళ తయారీ ఎలా ఊతమైనదో.. తెలుపుతూ.. ఉన్న చైతన్యం ఉంది ఈ కథలో 

ఆ పచ్చళ్ళని మార్కెటింగ్ చేసుకునే దశలో వారికి కల్గిన అవమానాలని , కుటుంబ సభ్యులనుండి     వచ్చిన వత్తిడులని.. తట్టుకుని ఎలా నిలద్రోక్కుకోగల్గారో చెప్పడం కళ్ళకు కట్టినట్లుగా  ఉంది. 

నిజంగా మహిళా గ్రూప్ల ద్వారా తయారీ అయిన వస్తువులని మార్కెటింగ్ చేసుకునే సదుపాయాలూ అంతంత మాత్రంగానే ఉన్న దశలలో మహిళలు ఆశాజనకంగా ఎలా ముందంజ వేయగలరు? అలాగే పురోగవృద్ది ఎలా సాధ్యం?  ఆ అడ్డంకిలన్నిటింటిని  అధిగమించి ఆత్మవిశ్వాసంతో..తల ఎత్తుకునే  వేళ నడ్డి విరిచేసే కోర్టు ఉత్తర్వు. 

సంప్రదాయ వ్యవసాయరీతులని నాశనం చేసుకుని అధిక ఉత్పత్తుల కోసం నవీన వ్యవసాయ పద్దతులని ఎప్పుడైతే ఆశ్రయించామో  అప్పుడే మనం పండించే పంట సంకరమైపోయింది. అలాగే చీడ పీడా పెరిగిపోయాయి. 
మితిమీరిన ఎరువులవాడకం, క్రిమి సంహారక మందుల వాడకం మూలంగా మనకి తెలియకుండానే మనం పుట్టు రోగాల పాలు అవుతున్నాం.  అధిక దిగుబడి అవసరార్ధం తెలివిగా విదేశి విత్తనాలు మన పంటపొలాల్లో తిష్టవేసాయి.
మనం పండించే పంటల ద్వారా తయారీ అయ్యే ఉత్పత్తులన్నిటికి విదేశి నాణ్యతా ప్రమాణాలుకి సరి పోవడం లేదన్న నెపం వెనుక ఏముందో చదువుకోని  రైతుకు..ఆ పంటలని కొని పచ్చళ్ళ తయారీకి ఉపయోగించిన మహిళకి ఏం తెలుసు? 

ఆరోగ్యానికి  అమితంగా హాని చేసే క్రిమి సంహారక మందులని ప్రభుత్వం ఎందుకు నిషేదించడం లేదు? చిన్న సన్నకారు రైతులకి.. క్రిమి సంహారక మందులు వాడకుండా కంపోస్ట్  ఎరువులు తయారు చేసుకోవడం, సస్యరక్షణా చర్యలు చేసుకోవడం లాంటి అవగాహన ఎంత వరకు ఉంది? ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ఏర్పరచుకొని అంతర్జాతీయ   ప్రమాణాలకి అనుగుణంగా పంట పండించే సాంకేతిక నైపుణ్యం అందుబాటులో ఉంటుందా? వస్తుందా? 

ఒకవేళ అలాటి వ్యవసాయ క్షేత్రాల నిర్వహణలో పండించిన పంట ఉత్పత్తులు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయా?  అసలు ప్రభుత్వాలు రైతుకి గిట్టుబాటు ధరలు కల్పిస్తాయా?  ఈ దేశంలో వ్యవసాయం చేయనీయకుండా కార్పోరేట్ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పే  దుష్ట ఆలోచనలతో..బహుళజాతి సంస్థలు ఈ నేలపై కాలూని  క్రమ క్రమేణా    మన పంటలని, మన ఉనికిని నాశనం చేసే పన్నాగాలు రూపొందుతున్నాయని పాపం పచ్చళ్ళు పట్టుకునే వాళ్లకి ఏం తెలుసు? 

 మన మొక్కలపైనా మన కాయలపైనా ఆఖరికి మన సమస్త ప్రకృతి  సంపద పైనా పేటెంట్ హక్కులని సంపాదించుకుని వాళ్ళకి కావాల్సినది వాళ్ళు తయారీ చేసుకోవడానికి మన నేల,మన జనాన్ని అడ్డంగా ఉపయోగించుకునే కుట్రలలో భాగమని పాపం పచ్చళ్ళు తయారే చేసిన మహిళలకి ఏం తెలుసు? 

 ఆరోగ్యాన్ని నాశనం చేసే అవశేషాలు ఉన్న పంటల ఉత్పత్తులని మనం ఎగుమతి చేసి..నేరారోపణని     ఎదుర్కుంటున్నాం.  చీడ పీడలు లేని రానీయని వాళ్ళ  ఏ బి.టి విత్తనాలో కొనుక్కుని మన పంటనో,మన వంకాయనో,మన మామిడి కాయని ఆఖరికి మనని మనం కోల్పోయి  మనం అవశేషం గా మిగులుతామో..అన్న ఆలోచనని మన కళ్ళ ముందు ఉంచిన ఈ కథ.. నాకు నచ్చిన కథ. కేవలం కథలోని పాత్ర..  "వీసెడంటే ఎంతఅని బ్రౌన్ నిఘంటువులు శబ్ద రత్నాకరాలు,  మరొక ప్రక్క తెవికీలు తెగ వెతికేస్తున్న "సంజీవ" పాత్రకి వాళ్ళ బాబాయి లాటి వారికి మాత్రమే అర్ధమయ్యే కథ ఇది.

అయితే ఈ కథ..చేరవలసిన   చోటుకి చేరుతుందా అనేది మాత్రం పెద్ద ప్రశ్న.  
ఈ దేశంలో వ్యవసాయం చేసుకునే చిన్నపాటి రైతులకి పురుగు మందు అవశేషాలు ఉంటే ఆ పంటకి నాణ్యత లేనట్లే అని తెలిసే అవకాశం ఉందా? ఒకవేళ  అలా  తెలిసినా జాగరూకత వహించే విధంగా నాణ్యమైన  విత్తనాలు లభించడం, చీడ పీడలు లేని  అనుకూల వాతావరణ పరిస్థితులు కానీ..ఉన్నాయా? 

అసలు మన రైతుల జీవితాలు అన్నీ బహుళజాతి సంస్థల గుప్పిట బిగించే కాలం ఎంతో దూరంలో లేవు  అనిపించేలా ఉన్న ప్రభుత్వ విధానాలు గురించి ప్రజలకి చెప్పేదెవరు? 

అవసరం ఉన్న వద్దకు ప్రవహించని జ్ఞానం పుస్తకాలో కథలుగా చదువుకుని అర్ధం  చేసుకున్న వాళ్ళు దిగులు పడటం మాత్రమే ఈ కథలో నాకు కనిపించింది.

నిరక్షరాస్యులు, అవగాహన లేని వ్యవసాయదారులవద్దకు ఈ కథలోని అంశాన్ని  తీసుకుని వెళ్ళగల్గినట్లు వ్రాసి ఉంటే  ..ఇది చైతన్యవంతమైన కథ అయి ఉండటానికి నూటికి నూరు శాతం అర్హత ఉన్న కథ. అలా వ్రాయగల్గిన మంచి కథా రచయిత కూడా చంద్రలత గారు. 

20, జనవరి 2012, శుక్రవారం

ఉషా ఉతుప్ ..తెలుగు లో..రెండు దశాబ్దాల తరువాత



ఉషా ఉతుప్ .. ఆమె పేరు వింటేనే.. ఉప్పెత్తున ఎగసి పడే కడలి కెరటం అలా స్థాణువులా నిలిచి పోయినట్లు..

తెలుగు లో..రెండు దశాబ్దాల తరువాత  ఉష ఉతుప్ పాట  పాడారట. కులు మనాలి  అనే చిత్రంలో  మంచు కొండల   జాబిలీ  మనువు నడచిన ఈ వ్యాలీ ..అనే పాట పాడారట.
 ఆమె అంతకు క్రితం పాడిన కీచురాళ్ళ పాట గుర్తుంది కదా!  పాట జ్ఞానం ఉన్న ఎవరు కూడా.. ఆమె ఉత్సాహాన్ని ,గొంతుని మర్చి పోలేరు కదా! అందుకే ఈ పాటని గుర్తు చేసుకుంటూ..
ఆమె ఇంకా కొన్ని హింది చిత్రాలకి తెలుగు   అనువాదం లోకి చేసి నప్పుడు కొన్ని పాటలు పాడారు కూడా.
అయినా మన తెలుగు పాటంటేనే మనకి   మక్కువ కాబట్టి ఈ పాట ..
ఈ పాట కి సాహిత్యం అందించిన వారు: వేటూరి సుందర రామ మూర్తి 
సంగీతం; ఇళయరాజా 

good evening ladies and gentleman
and hi everybody
welcome to the youth panorama
and welcome to all of us here on stage
welcome to keechuraallu

common everybody hip the beat hip the beat



డుం చ    డుం డుం చ 
చ డుం చ     చ డుం చ 

డుం చ    డుం డుం చ 
చ డుం చ     చ డుం చ

కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు 
కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు 
పోద్దుగూకు వేళ పోకిరోళ్ళు 
రాతిరేల సాగే రాక్ రోలు 
ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు     : కీచురాళ్ళు  :


షడ్జమోన్నత శృతి సారం  : 2 :
అంగారకమాశ్రయామ్యహం  : 2 :


తారలన్ని పాడుతున్న అర్ధరాత్రి వేళలో 
నెల మీద వింత  వంత పాటలు హే... 
మధ్య రాత్రి మిధ్యలోన మందు వేయు చిందులో 
పుట్టె నిద్ర పట్టభద్ర వేటలు 
పిచ్చి కేక మిగిలి తగులుతుంది చచ్చినాకాపట్టు కాకా వెలిగి రగులుతుంది హస్త రేఖ  
కండలన్ని పోయి గుండె ఉన్న రేయి 
మొరాల కీచు కీచుమన్న కీచురాళ్ళు       : కీచురాళ్ళు :

చంద్ర కౌశిక రాగానందం : 2 :
శరదిందం నామామ్యాహం  : 2 :

సూర్య దృష్టి సోకుతున్న శూన్య మాస వేళలో 
చూరు కింద చందమామ పూవులు 
కోకిలమ్మ మూగపోవు వాన కారు కొమ్మలో  
కొండ వాగు వాగుతున్న అందెలు
కృష్ణ రాయ మృదుల హంపి శిధిల శిల్పరాయా  
హిస్టరీ లో కదులు చాటు ఎదల కీచురాయా 
జ్ఞాపకాలు జారి జాతకాలు మారి 
గతాలు తొవ్వి నవ్వుకున్న                    : కీచురాళ్ళు :  


ఇక్కడ   పాటని  డౌన్లోడ్  చేసి  వినేయండి 

లేదా వినడానికి సదుపాయాన్ని వెదికి పట్టుకొచ్చాను వినేయండి.

ఇక్కడ  వినేయండి అలాగే పాట సాహిత్యాన్ని  http://songlyrics-pasupuleti.blogspot.com/2011/10/keechurallu-song lyrics   వారి  నుండి సేకరించాను. వారికి ధన్యవాదములతో.. 

కథా జగత్ - కథా విశ్లేషణ -2

కథా విశ్లేషణకి   నేను ఎంచుకున్న కథ     ఎర  - స్వాతి శ్రీపాద   

కథలో ఆరుగురి ఆడపిల్లలని   పుత్ర వ్యామోహం తో విచక్షణా రహితం కనడం తో పాటు ఆడపిల్లలకి చదువు ఎందుకు దండుగ అనే వివక్ష మధ్య అత్తెసరు చదువు చదివిస్తూ.. ఆ చదువు చెప్పించడం ని ఒక ఎరగా వేసే తల్లిదండ్రులని వాళ్ళలో ఉండే స్వార్ద పరతత్వాన్ని దూది ఏకినట్లు ఏకి పారేశారు రచయిత్రి.

కథలో.. పేరు ఉదహరించక పోయినప్పటికీ స్వీయ కథగా చెప్పుకున్న "స్వీటి" అంతరంగం నుండి వెలువడిన భావ సంద్రమే ఈ "ఎర "  కథ. 

’ఈ ఆడముండల్ని చెప్పుకిందతేళ్ళలా నలిపివేసి అణిచివుంచాలని అందరికంటే చిన్నవాడయిన కొడుక్కి నూరిపోసే ఆయనకు విశాలదృక్పధమా? ..


అని ..ఓ..తండ్రి విష సంస్కృతి ని ఎరిగి చిన్న తనం నుండే.. లోకం పోకడల్ని అర్ధం చేసుకుంటూ..

ఎరని చూపి చేపని వేటాడం అన్నదానిని  మనుషుల నైజానికి అన్వనీయింప జేసుకుంటూ లోకం పోకడని పూర్తిగా ఆకళింపు చేసుకున్న పరిపక్వత   చిహ్నంగా తోస్తూ.. 

స్వీటి .పటిక బెల్లం ముక్క పెడతాను.. చెవి కమ్మ ఎక్కడ దాచావో..చెప్పమని అడిగిన తీరులోనే బీదరికాన్ని అపహాస్యం చేసిన లోకం తీరు పై అసహ్యం కల్గిన స్వీటి అక్కలిద్దరికి అబ్బని చదువు లా చదవకుండా..బాగా చదివి ఉద్యోగం,,డబ్బు సంపాదించడం ..మంచి పరిణామం .

బయట వాళ్ళే  కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా ఆడవాళ్ళని అనుమానించడం అనే విషయాన్ని.. 

"నీ జీతం ఇంతేనా? కాస్త దాచుకున్నావా"లాంటి  ప్రశ్నల దగ్గర ఆరంభించి," అవునూ ఈ నెల ఇంకా  బయట చేరలేదేమిటి ? ఆఫీస్ పేరుచెప్పి ఎక్కడైనా దొమ్మరి తిరుగుళ్ళు నే॑ర్చావా?" 


అంటూ తల్లి ఆనుమానించ డాన్ని  భాదతో వ్యక్తీకరించడం ..లో.. ఆడవారిని నైతిక   విలువల  పేరుతొ.. తమ ఇంటి వాళ్ళే అనుమానించడం అనే మానసిక హింసని హృద్యీకరించిన తీరు నాకు బాగా నచ్చింది. ఇలాటి వాస్తవాలు చెప్పుకోవడం అవసరం కూడా. అలాగే ప్రేమ పేరుతొ.. ఎర వేసి..సమాధానం ఆలస్య మయ్యేటప్పటికే   అసలు స్వరూపాన్ని బయట పెడుతూ.. .. 

" ఏదో పెద్ద నిప్పులాంటిదాననని అనుకుంటూన్నావేమో ...నువ్వెంత నిప్పులాంటి దానవో నాకు తెలుసు..."

అనే అసహ్యకర మాటలు అనిపించుకునే వెగటు మనుషులనుండి పారి పోయి..  జీవిత భాగ స్వామ్యి   ఎంపికలో.. ఆమె  ఎన్నో పరీక్షలు నెగ్గాక..లభించాడన్న ఉత్తముడితో జీవితం పంచుకునే ముందు.. 

 ఈ జీవితం ఈ సుఖాలు పిల్లలు సంసారమనే ఎరకు నన్ను నేను తగిలించుకుని ఏళ్ళుగా కొట్టుమిట్టాడుతున్న నేను ఒడ్డున పడి గిలగిలలాడుతున్న చేపనే... 
   


 అని ఆత్మ పరిశీలనతో  మెలిగే స్వీటి.. వైవాహిక జీవితం ఇచ్చిన అసంతృప్తి  భర్త మరణం తర్వాత..ఆమె ఎదుర్కొన్న  సంఘటనలు  ఇప్పటి కాలంలో పరిస్థితులకి అద్దం  పట్టాయి. 

 ఆ ఈతి బాధల్లోమరొకటి జీవచ్చవంలా మిగిలున్న అతని తల్లి ...ఎంత కోపం వచ్చినా ... అతనే లేకపోయాక నాకేంటి అని విదిలించుకోజూసినా ఏమూలో వున్న జాలో మరింకేమిటో గాని విసుక్కున్నా కసురుకున్నా మళ్ళీ ఆవిడని చూడగానే జాలి వేస్తుంది. తా దూరకంతలేదు మెడకో డోలన్నట్టూంది ఆవిడ

భర్త మరణం తర్వాత కూడా స్త్రీ పై పడిన భాద్యతలో.. ఆమెని ఆమె నిరూపించుకుంది. 

స్నేహం పేరుతొ  మనుషులలో   ఉన్న మరో రూపాన్ని మాటేసి నయవంచనతో మంచి స్నేహం అని నమ్మ బలికిస్తూనే ఒంటరి స్త్రీలని టార్గెట్ చేసుకుని.. వారితో తమ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన ఉన్న వారి గురించి చెపుతూ.. 

అవకాశం దొరకనప్పుడు స్త్రీలతో తమకున్న పరిచయాలకి యధాశక్తి కథలల్లి  అతినీచంగా..స్రీలపై ఎలాటి   ఆరోపణలు చేస్తారో..చెపుతూ 

వాడికి వాడి ఎరకి మరి కొందరు స్త్రీలు చిక్కకుండా..  ఇలాటి వాస్తవాలు (అనే కథ)ని లోకం పైకి  ఎరగా విసరడమే!  
అంటూ..ఈ కథ 

ఇంటాబయటా..మహిళల ప్రగతికి - దుస్థితికి..అద్దం పట్టాయి. అనవసరమైన స్నేహాల పట్ల చిన్న పాటి ఆత్మీయతకి కరిగిపోవడం పట్ల జాగురుకత వహించమని ఉద్భోధ చేసినట్లు ఉంది.

19, జనవరి 2012, గురువారం

కథా జగత్ -కథా విశ్లేషణ -1

కథా జగత్ విశ్లేషణ పోటీ లో.. నేను ఎన్నుకున్న కథ   గోరీమా - అఫ్సర్   గారి కథ

నాకు ఈ కథలో నచ్చిన విషయం .. నచ్చిన పాత్ర గోరీమా. మరియు  
 గ్రామీణ వాతావరణంలో రెండు మతాల  మనుషుల మధ్య పెనవేసుకున్న అనుబంధం ..  

పీర్ల పండుగలో ..ఎలా అయితే అందరు కల్సి మమేకమై.. మాతం పాడుతున్నప్పుడు లీనమై పోయేవారో.. అదే విధంగా గణేశ ఉత్సవం లోను అందరు కలసి వేడుకలో పాల్గొనడం అన్నది సర్వ సాధారణ దృశ్యం.అక్కడ ప్రజలు  పరస్పర  గౌరవంతో,తర తరాలు కలసి మెలిగిన అనుబందం మనకి కళ్ళకి కట్టినట్లు రచయిత చూపించారు. . అయినప్పటికీ .. ఒక కులంకి చెందినవారిలో స్వార్ధం ప్రవేశించి ప్రాణం లేని రాయిని దేవునిగా ప్రతిష్టించి.. గోరీమా..ఇంటి  స్థలాన్ని ఆక్రమించడం ..మొక్కులు పేరిట అక్కడ  జరుగుతున్న ప్రాణ హింస,ఒక కులపు  వాళ్ళ ఆధిపత్య ధోరణి చూసిన పాఠకుడికి   కూడా  ఏహ్యం కల్గింక మానదు. చిన్న చేపని పెద్ద చేప మింగేసినట్లు చెప్పకనే చెప్పారు రచయిత.  

భర్త జ్ఞాపకంగా మిగిలిన ఒకే ఒక్క ఆస్తి.. ఆ ఇంటి కోసం ఆమె  చేసిన పోరాటం స్పూర్తిగా   ఉంది. అన్వర్ చిన్నతనంవల్ల చేతకాని తనం,  సాహెబ్  స్వార్ధం,పలాయనావాదం.. చాలా మందికి ప్రతీక గా కూడా..కనిపిస్తుంది.  
సున్నితమైన ,ప్రేమ  మూర్తి అయిన గోరీమా .. ఆవేశం,ఆవేదన ..చివరి వరకు కూడా ఇంటిని నిలబెట్టుకోవడానికి ఆమె పోరాడిన విధానం..హృదయాన్ని తడిమి తడి చేస్తాయి. 

వ్యక్తులు యెంత ఉన్నత స్థాయికి ఎదిగినా..ఎవరికైనా సొంత ఊరు సొంత ఇల్లు..అనేవి  ఒక బలమైన,మధురమైన ముద్రగా ఆ వ్యక్తి జీవితంలో పెనవేసుకుని ఉంటాయి కాబట్టే.. అలీఫ్.. తన కథనంతో..తన ఊరిని,అక్కడి మార్పులతో పాటు..మనుషులమధ్య అనుబందాన్ని..ఇష్టంగా చెపుతూ.. అలీఫా కి వాళ్ళ అమ్మతో ఉన్న అనుబంధం,చిన్న నాటి ముచ్చట్లు తో పాఠకుడిని   ఆసాంతం అక్కడ గిరికీలు కొట్టిస్తూ.. మన మధ్య జరిగిన కథ గా  జీవం పోసి..  గోరీమా పాత్ర ద్వారా.. ఒక సందేశాన్ని అందించారు. 

జీవితంలో..కొంత కాలాన్ని  సర్వ శక్తులు కేంద్రీకరించి పోరాటం కి అంకితం చేసి .. ఆఖరికి ఓడినా  కూడా.. అక్కడే.. దీనమైన స్థితి లో   కూడా  నా వూరు అనుకుంటూ.. బ్రతికే ఆమెని చూస్తే.. కళ్ళు చెలమలయ్యాయి.  స్త్రీ స్వభావమైన బేలతనం కాకుండా..బలమైన వ్యక్తిత్వం తో..తన అన్నదానికోసం బలవంతులతో..పోరాడి ఓడిన ఆ స్త్రీ   మూర్తి ఎందరికో ఆదర్శనీయం. 

తండ్రి జ్ఞాపకంగా కూడా. కొద్దిపాటి భూమిని  మిగుల్చుకోవాలనే స్వార్ధం లేకుండా... తమకి సంభందించిన భూమిని సొంతం చేసుకోవడానికి  ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా.. ఎలాగోలా కష్ట పడి తనకున్నఅప్పులు తీర్చుకోవాలి,తల్లి కి నచ్చ చెప్పుకోవాలి అన్న తలంపుతో.. తన వారి క్షేమం కోసం   అల్లాని ప్రార్ధించిన మనిషి   తత్వం మానవత్వం  అలీఫా లో కనిపిస్తాయి.  గోరీమా జ్ఞాపకాలతో..గోరీమాని పరిచయం చేసి.. ఆఖరికి గోరీమా గురించి చెప్పకుండా కథ ముగిస్తారేమో అనుకున్న తరుణంలో.. గోరీమాని  గుర్తించడం  కూడా ..ఓ..విషాద యోగమే! గొరీమా గురించి వర్ణించేటప్పుడు.. మనకి తెలియ కుండానే మనం ఆమె పాత్రలోకి ప్రవేశిస్తాం కూడా.
ఈ కథ లోని ప్రతి సన్నివేశం..చాలా అపురూపంగా తోచాయి.

మనకొక.. గొప్ప దార్శనికతని మిగిల్చే ఈ మాటలు ఆఖరిగా మరపురానివిగా ఉంటాయి. 

అందుకే రచయిత అలీఫా తో. ఇలా అనిపించారు

"గోరీమా, ఈ దేశం రాయలేని చరిత్రలో నువ్వొక చరిత్రవి. నువ్వొక తిరుగుబాటువి. నా తరానికి అంతుపట్టని భూపోరాటానివి. సొంత నేలకోసం సంఘాన్నంతా ఎదురొడ్డి నిలిచావు. ఓడినా సరే, నువ్వే గెలిచావు. నీ నేల మీద నువ్వున్నావు. నేను ఈ నేలకి దూరంగా... పిరికిగా పారిపోతున్నాను..."

 నిజానికి ఈ దేశ కాలమాన పరిస్థితుల్లో..పోలిస్తే ..
 ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న  అందరికి వర్తిస్తుంది.కూడా. 

17, జనవరి 2012, మంగళవారం

మా పార్వతక్క

సంక్రాంతి పండుగ సంబరాలలో.. కనుమ, ముక్కనుమ ఆటా-పాటా..లతో..పిల్ల పెద్ద అందరికి ఆటవిడుపు.
 పల్లెటూర్లు లో అయితే.. తిరునాళ్ళ సంబరమే!

ఊరికి దూరంగా ఎక్కడో..రహస్యంగా కోడి పందాలు జరుగుతూ.ఉంటాయి. ఆ స్థలం మాత్రం ఊరిలో అందరికి తెలిసి పోతూనే ఉంటుంది. కోడి పందాలు అనగానే..నాకు మాత్రం ఒక విషాదం అలముకుంటుంది. అది ఓ..వెంటాడే విషాద జ్ఞాపకం.

 బాల్యంలో..మధురమైన జ్ఞాపకాలే కాదు.. విషాదాలు కొన్ని ఉంటాయి కదా! అలా ఒక  విషాదం .

మా చిన్నప్పుడు.. మా అమ్మ  అన్నయ్య,నేను,చెల్లి. కలసి వెళుతుంటే .ముగ్గురికి  కలసి.. కొన్ని డబ్బులు ఇచ్చేది..ఆ డబ్బులు తీసుకుని.. పెందలాడే అన్నం తినేసి..  కోడి పందాలు జరిగే చోటుకి వెళ్ళేవాళ్ళం. అక్కడ కోడి పందేలు జరగడం మాత్రమేకాదు ..గారడీ వాళ్ళు ఉండేవారు. వాళ్ళ విన్యాసాలు చాలా అబ్బురంగా తోచేవి. రెండు గెడకర్రల ఆధారంగా కట్టిన అతిసన్నని బైండింగ్   వైరుపై..ఒక అమ్మాయి చేతిలో ఒక కర్ర పట్టుకుని.. చాలా తేలికగా.. వంకలు వంకలు తిరుగుతూ..(ఇప్పటి కాట్ వాక్ లాగా అన్నమాట) నాలుగైదు సార్లు నడచి చూపించేది. అప్పుడు వారికి చాలా చిల్లర నాణేలు పడుతూ ఉండేయి.

గారడీ వాళ్ళ దగ్గర   ఒక కుక్క ఉండేది.ఆ కుక్క మెడలో తోలు బెల్టు..ఆ బెల్టులో.వేలాడే మూడు చిన్న గంటలు..వెన్నువిరిచి కుక్క విన్యాసంగా నిలబడితే.. చూడటానికి భలే ఉండేది.ఆ కుక్క మండుతున్న రింగ్లో నుండి.. ఆ ఇటు దూకేది. అలాగే ఒక కోతి.. చేతి విన్యాసాలు చూస్తూ.. ఆశ్చర్యంగాను,నవ్వులతోను కాలం గడచిపోయేది . అమ్మకి తెలియకుండా నానమ్మ ఇచ్చిన డబ్బులతో..బెలూన్లు,బొమ్మలు,కొనేవాళ్ళం. అన్నయ్య మాత్రం ఎప్పుడు మౌత్ ఆర్గాన్ కొని ఊదుతూ ఉండేవాడు.  నేను అయితే.. మగ పిల్లలు గోలీలాట ఆడుతుంటే వాళ్ళతో కలసి ఆడుతుండే దాన్ని.

ఎవరైన్నా పెద్దవాళ్ళు.. ఏమిటి అమ్మాయి.. ఆడపిల్లవి  గోలీలాట ఆడుతున్నావ్  అంటే.. ఏ మగపిల్లలే ఆడాలని రూల్ ఏమైనా ఉందా ? అనేదాన్ని .

ఒకసారి ఒక అబ్బాయి తొండి ఆట ఆడుతున్నాడని.. గోలీ తీసుకుని వేసి కొట్టాను.  పాపం నుదుర మీద తగిలి..
బొట బొట రక్తం కారి పోయింది. ఆ తర్వాత నాతో ఎవరయినా  ఆడటానికి కాస్త భయపడుతూ ఉండేవారు.

ఈ ఆటలు కాదు కానీ.. కోడి పందేలు ఆట ఆ ఆట పై  పై పందేలు  కాసే వాళ్ళని చూస్తే.నాకు ..మా పార్వతక్క గుర్తుకొస్తుంది.

పార్వతక్క అంటే అమ్మ చెల్లెలు. తెల్లని రంగులో  గులాబీ రెక్కలు  కలిపితే ఏ వర్ణం వస్తుందో..ఆ రంగులో మెరిసిపోతూ ఉండేది..పార్వతక్కా అనేదాన్ని. పిన్ని అని పిలేచేదాన్ని కాదు. నా చిన్నప్పుడు అంతా.. అమ్మమ్మ వాళ్ళింటి  దగ్గరే పెరిగాను. మా పార్వతక్క పెంపకం అన్నమాట. పిల్లలని పోగేసి బడికి వెళ్ళ కుండా ఆటలాడుతుంటే పార్వతక్క  కొట్టేది అప్పుడు మా రెండో మామయ్య అడ్డు వచ్చి కొట్టనిచ్చేవాడు కాదు.వాళ్ళ ఇద్దరికీ నా మూలంగా గొడవ జరిగేది కూడా.. ఆ మామయ్యకి నేనంటే  చాలా ఇష్టం.నన్ను అలా కొట్టినా సరే మా పార్వతక్కకి నేనంటే   చాలా ఇష్టం. రోజు నాకోసం జామకాయలు   కోసి దాచి ఉంచేది.


అలాగే ముద్ద ముద్దకు నెయ్యి వేసి తినిపించేది.శుభ్రంగా   స్నానం   చేయించి..చక్కగా జడలు వేసి..రిబ్బనలతో.. ఆరు రేకుల పువ్వు వచ్చేటట్లు అందంగా వేసేది.మా చిన్న పిన్ని..తనని చిన్నారక్క అని పిలిచేదాన్ని. తను ఎప్పుడు నన్ను గిచ్చి తెగ కొట్టేది.  మా పార్వతక్కకి.. ఆమెకి కూడా ఎప్పుడు  పోట్లాట జరిగేది. అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు.

ఆ సంవత్సరం వేసవి సెలవలలో ..మా పార్వతక్క పెళ్లై పోయింది . లబ్బీపేట వెంకటేశ్వర స్వామి  గుడిలో ఉన్న మండపంలో..మా పార్వతక్క పెళ్ళి  జరిగింది.ఆ పెళ్ళికి నాకు మా అమ్మ పొడవు లంగా కుట్టించింది. ఆ లంగా వేసుకుని.. సరిగ్గా నడవడం చేతకాక పరుగులు పెట్టడం చేతకాక తెగ అవస్థ పడిపోయాను.


మా బాబాయిది..బళ్ళారి.వాళ్ళకి అక్కడ చాలా పొలాలు ఉండేవి.బంధువుల అబ్బాయి అని మా అమ్మమ్మ తమ్ముడి కొడుకని దూరం అయినా సరే ఇచ్చి చేసారు. పెళ్ళై నాక మా పిన్ని బాబాయి వెంట వెడుతూ.. చాలా ఏడ్చింది. వెళ్ళేటప్పుడు..నన్ను దగ్గరకు తీసుకుని  ముద్దాడి.. చక్కగా బడికి వెళ్లి చదువుకో.. అని అప్పగింతలు పెట్టింది. పెళ్ళి   జరిగిన  తర్వాత  నేను  ఏడుస్తూ ఉన్నప్పుడు  అందరు ఫోటోలు దిగుతున్నారు. మా చిన్న పిన్ని కూడా ఫోటో దిగుతూ.. నన్ను  వద్దని నెట్టివేసింది. అప్పుడు  ఇంకా ఏడుస్తూ ఉంటే.. మా పార్వతక్క కోప్పడి.. నన్ను కూడా నిలబెట్టి  ఫోటో తీయమంది. మా పార్వతక్క  మా చిన్న పిన్నితో.. కలసి దిగిన ఫోటో.. . పై ఫోటో.

ఇక ఆ తర్వాత నన్ను అమ్మ  మా వూరికి తీసుకొచ్చేసి..మా వూర్లో.. కాన్వెంట్ కి పంపింది.
కొన్నాళ్ళకి మా పార్వతక్క సంక్రాంతి పండుగకి..బాబాయి తో  కలసి మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేమందరం కలసి..మా మైలవరం అశోక్ దియేటర్ లో..అల్లూరి సీతా రామరాజు సినిమాకి వెళ్ళాం . ఆ సినిమాకి వెళ్ళినప్పుడు..మా పార్వతక్క నాకు,చెల్లికి  రెండు మూడు రకాల రిబ్బన్లు,గాజులు కొని పెట్టింది.వాళ్ళు  రెండు రోజులు ఉండి వెళ్ళిపోయారు

తర్వాత నాలుగు  రోజులకి..నేను అన్నయ్య కాన్వెంట్కి వెళ్ళామో లేదో..  వెంటనే ఇంటికి వచ్చేసాము. మా పెదనాన్నఒక విషయాన్ని అమ్మకి చెప్పారంట.  .శ్రీనివాసరావు గారింటికి అడవినెక్కలం  నుండి   పోన్ చేసారు. మీ చెల్లెలు ఎండ్రిన్ తాగిందంట..అని .

అమ్మ మా పిన్నిని  తలుచుకుంటూ  గట్టిగా ఏడుస్తూ.. మమ్మల్ని తీసుకుని.. అమ్మమ్మ వాళ్ళ వూరికి బయలుదేరింది. నాకు అమ్మ ఎందుకలా ఏడుస్తుందో..అర్ధం కాలేదు. అసలు ఎండ్రిన్ అంటే ఏమిటి. అది ఎందుకు తాగుతారు,తాగితే ఏమవుతుంది.. బుర్రలో ఎన్నో ప్రశ్నలు.అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాక.. మమ్మల్ని అక్కడే వదిలి పార్వతక్కని  విజయవాడలో..యెన్.సుబ్బారావు గారి హాస్పిటల్ లో జాయిన్ చేసారని అక్కడికి వెళ్ళింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గుంపులు గుంపులు జనం ఏదేదో..మాట్లాడుకుంటూ.

వాళ్ళందరికీ మా హరిమ్మ అత్తయ్య (మా పెద్ద తాత కోడలు)వివరంగా ఏం చెపుతుందో..ఇప్పటికి గుర్తుకు వస్తుంది.


మా వూరికి పండగకి వచ్చి వెళ్ళాక .. అమ్మమ్మ వాళ్ళ వూరిలో..చెరువులో..కోళ్ళ పందేలు   వేస్తున్నారని  బాబాయి  ప్రతి రోజు సరదాగా చూడటానికి వెళుతున్నారట. అలాగే ఆరోజు వెళ్ళారని
సాయంత్రం   తిరిగి వచ్చాక బాబాయిని తన వాచీ కనబడలేదు మీకు కనబడిందా అని పిన్ని అడిగిందని.. దానికి సమాధానంగా ..'ఇంకెక్కడవాచీ..ఈ రోజు..కోడి పందాలప్పుడు..ఆ వాచీని పై పందెం కాసాను ఓడిపోయాను..అని చెప్పారంట.



ఇక పిన్ని ఏం మాట్లాడకుండా ఊరుకుంది అంట.  ఆ రోజే ఉదయాన్నే  ఒక విశేషం కూడా తెలిసింది అంట. పిన్ని తల్లి కాబోతుంది అని. మా హరిమ్మ అత్తయ్య ఏం మరదలా! బెజవాడ వెళుతున్నాను ..ఏమైనా కావాలా ?అని అడిగితే..వదినా దోసకాయలు పట్టుకుని రావా! బొబ్బర్లు దోసకాయ కలిపి కూర వండుకుని తినాలి అని చెప్పినదట. మా హరిమ్మ అత్తయ్య అర్ధం చేసుకుని.. దబ్బ పండు లాటి కొడుకు పుడతాడులే..అంటే.. ఏమి వద్దులే..వదినా ..మా వనజ లాటి కూతురు కావాలి అని చెప్పిందట. (అప్పుడు నేను బొద్దుగా.. ఒత్తైన పొడవైన జుట్టుతో..పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని..గోధుమ రంగు చాయలో..చాలా ఉత్సాహంగా బోలెడు కబుర్లు చెపుతూ ఉండేదాన్ని అని మా పిన్నికి నేనంటే   చాలా ఇష్టం ఉండేది అని మొన్నీమధ్య మా బాబాయి కలసినప్పుడు నాతో చెప్పారు)


అలా మా పిన్ని అడిగిన మర్నాడు ఉదయమే.. మా హరిమ్మ అత్తయ్య.. డాబా మీద నుండి క్రిందకి   దిగి వస్తున్న పిన్నిని చూసి పార్వతి..దోసకాయలు తెచ్చాను..రాత్రి పొద్దుపోయిందని ఇవ్వలేదు..తీసుకొస్తాను ఉండు ..అని చెపుతుంటే..

ఇక మీ పార్వతి ఈ లోకంలో ఉండదు వదినా..కాసేపటికి చచ్చిపోతుంది అని చెప్పిందంట. అప్పటికింకా నిద్ర లేవని బాబాయి ఉలికి పడి బయటికి వచ్చి .. ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి..ఏం మాట్లాడుతున్నావు పార్వతీ.. అంటూ.. ఆమెని పట్టుకునేటప్పడికే నురగలు క్రక్కుతూ..పడిపోయిందంట. ఆమె నుండి ఎండ్రిన్ వాసన.మా మామయ్య ఇంకా పొలాలకి వెళ్ళలేదు. గబా గబా అంతకు ముందు రోజు పొగ తోటకి కొట్టాలని తెచ్చిన   ఎండ్రిన్ సీసా కోసం బీరువా క్రింద చూస్తే కనబడలేదని..డాబా పైకి వెళ్ళి  చూస్తే.అక్కడ అది ఖాళీగా కనబడింది.  జరిగింది అర్ధమై .. గబగబా  కారు మాట్లాడుకుని.. విజయవాడ హాస్పిటల్కి తీసుకు వెళ్ళారట . ఆ మధ్యలోనే..చింత పండు నీళ్ళు,మజ్జిగ బలవంతం గా తాగించి..మందుని బయటికి కక్కించాలని కొన్ని ప్రయత్నాలు చేసారట .అలా మూడు రోజులు హాస్పిటల్ లో.. చావు బ్రతుకుల   మద్య కొట్టుకుంటూ..సృహ వచ్చినప్పుడు..కొన్ని మాటలు చెప్పిందట. అప్పుడు పార్వతక్క ని చూసుకుంటూ అమ్మే ..ఉంది. అమ్మమ్మ బాగా ఏడుస్తుందని హాస్పిటల్ వాళ్ళు ఊరుకోవడం లేదని  ఆమెని ఇంటి దగ్గరే ఉంచేశారు

మా బాబాయి తన వాచీని కోడి పందెం లో..పై పందెం కాసి ఓడిపోయాను అని చెప్పడం వల్ల ఆ వాచీని గెలుచుకున్న వాళ్ళు..ఫలానా మాదల వెంకట్రామయ్య గారి అల్లుడు పండక్కి  వచ్చి వాళ్ళావిడ చేతి వాచీ పందెం కాసాడు అని చెప్పుకుంటే  యెంత పరువు తక్కువ.!? అంత మంచి కుటుంబంలో వాళ్ళ అల్లుడు అలాటి వాడా..అని చులకనగా చెప్పుకుంటారని.. తాతయ్యని.. అలా అని అడిగి నలుగురు చులకనగా మాట్లాడతారని.. ఆలోచించి.. బ్రతక కూడదని అలా చేసానని చెప్పింది..మా పార్వతక్క . మా బాబాయి అలా చేయలేదు..సరదాకి అలా యేడిపించడానికే   అలా చెప్పానని.. ఇలా చేస్తావనుకోలేదు అని బాబాయి తెగ ఏడ్చారు.  పట్టె మంచం నవ్వారు లో..దాచిన వాచీని తీసి అప్పటికప్పుడు చూపించారుకూడానట.(తర్వాత ఆ వాచీని మా చిన్న పిన్ని పెట్టుకుని తిరిగేది.)

అయినా పార్వతక్క బ్రతకలేదు. నేను ఆమె చచ్చిపోతుందని తెలిసి తెగ ఏడ్చాను. అసలు చచ్చిపోవడం అంటే కూడా ఏమిటో  తెలియదు.అయినా మా పార్వతక్కకి..ఏమిటో..జరిగింది..అందరు ఏడుస్తున్నారు..కాబట్టి నాకు ఏడుపు   వస్తుంది. మా పిన్ని సాయంత్రం చచ్చి పోతుంది అనగా ప్రొద్దున్నే నన్ను చూపించమని అడిగిందని..నన్ను తీసుకు వెళ్ళారు. అద్దాల గదిలో ఉన్న పిన్ని దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు. నేను భయం భయంగా పిన్నివంక చూస్తూ ఉన్నాను. .పిన్ని మొహంకి..ఏమిటో..తగిలించారు. నన్ను చూసి పార్వతక్క  తన దగ్గరికి రమ్మని చేత్తో పిలిచింది.నేను వెళ్ళగానే నా చేయి పట్టుకుని..కాసేపటి దాకా వదలలేదు. పార్వతక్కా.. ఇంటికి వెళ్ళిపోదాం  రా..అని నేను అడిగాను. ఆమె  నవ్వినట్లుగా ..నేను వస్తానులే..నువ్వు బాగా చదువుకో..అమ్మ చెప్పినట్లు విను..అని చెప్పింది.ఎందుకో..తెలియదు..నేను ఏడుస్తూనే.. తల ఊపాను.  ఇక నన్నక్కడ ఉండనీయలేదు. ఇంటికి పంపించి వేసారు.ఆ సాయంత్రానికి  పిన్ని చచ్చిపోయింది అని చెప్పారు.

"డాక్టర్ గారు నాకు బ్రతకాలని ఉంది..నన్నుబ్రతికించరూ .." అని అడిగిందని..అమ్మ  ఎప్పుడూ..ఏడుస్తూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉండేది.

మా పార్వతక్కని ఇంటికి తీసుకు వచ్చే టప్పటికి.. నేను అమ్మమ్మ వాళ్ళింట్లో పూసిన రుద్రాక్ష  (గుండు) పూవులని అన్నిటిని కోసి..


నాకు చేతైనట్టు దండ గుచ్చాను.(అంతకు ముందు మా హరిమత్తయ్య పూలదండలు తెమ్మని చెప్పడం విని).పార్వతక్కకి పూలంటే చాలా ఇష్టం. ఆమెకి  చాలా పూలదండలు వేసి..తీసుకువెళ్ళిపోతున్నారు.అప్పుడు నేనూ  వెళ్ళి  నేను గుచ్చిన దండనీ వేసాను.మా అమ్మమ్మ,అమ్మ అందరు అది చూసి బోలెడు ఏడ్చారు.  మా పార్వతక్క మొహం  ఆ దండలో నుండి..ఇంకా తెల్లగా మెరిసిపోతూ..కనిపించింది.

కోడి పందేలు జరిగే చోటుకి కొద్దిగా దూరంలోనే..పార్వతక్కకి..అంత్యక్రియలు జరిగాయి.నేను అందరి వెనుక పడి స్మశానానికి వెళ్ళాను .అందరూ  చిన్న పిల్లలు రాకూడదు ఇంటికెళ్ళు అన్నా వినలేదు. వెళ్ళి  దూరంగా  ఉండి..మంటల్లో కాలి పోతున్న మా పార్వతక్కని చూస్తూ ఉంటే.. మా రెండో..మామయ్య నన్ను ఎత్తుకుని ఏడుస్తూ..ఇంటికి తీసుకు వచ్చాడు.

ఆ తర్వాతెప్పుడు  అమ్మమ్మ వాళ్ళ ఊరు  వెళ్ళినా..  ఒక్కదాన్నే చెరువు కట్ట పై నడచి వెళ్ళి  స్మశానం దగ్గరగా నిలుచుని..  మా పార్వతక్కని కాల్చిన చోటునే చూస్తూ ఉండేదాన్ని. అక్కడ నుండి మా పార్వతక్క లేచి వస్తుందని.

తర్వాత మా అమ్మ చెప్పేది..పార్వతక్క ఎప్పుడూ ఇక  రాదనీ.అది అర్ధం అయ్యాక అలా వెళ్ళడం మానేశాను. తర్వాత మా బాబాయి మళ్ళీ పెళ్ళి  చేసుకున్నాడు. అప్పుడు వాళ్ళకి   పుట్టిన అమ్మాయికి పార్వతి అని పేరు పెట్టుకున్నారు.ఆ అమ్మాయి మా చెల్లి  అనే అనుకుంటాం.  ఆ పార్వతి కొడుకు.ఇప్పుడు  మంచి ఆర్చేర్..పేరు ఓంకార్

యెర్ర జామకాయలు,లబ్బీ పేట వెంకటేశ్వర స్వామి గుడి,అల్లూరి సీతారామరాజు సినిమా..,హెచ్. ఎమ్. టీ వాచీ,   కోడి పందేలు ,గుండు బంతి పూలు వీటన్నిటిని చూసినప్పుడలా ..మా పార్వతక్క గుర్తుకొస్తుంది.  ఇప్పటకీ.. నాకు ఏడుపు వస్తుంది. 

14, జనవరి 2012, శనివారం

రంగుల సంక్రాంతి..

మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మదిలోని ఆశలన్నీ..అందమైన సుమాల రంగవల్లికలా ముంగిట ముగ్గై తీర్చిన వేళ... అందరి హృదయాలలోన ఆనంద సంక్రాంతి..

ఈ క్రింద   చూస్తున్న ముగ్గులన్నీ నిజమైన ముగ్గులు.

ఆ క్షణాన నేను ఆనందనాట్య మాడి ...

ఫోటోగా బంధించి..మన మిత్రులతో పంచుకుని ..

ఆనంద సంక్రాంతి..శుభాకాంక్షలు చెప్పాలని..
ఇలా వచ్చాను.










                                              పుష్ఫాలతో ముంగిట  ముగ్గులు

                                                                          

ఎంతో రసికుడు దేవుడు..  ఎన్ని పూవులు ఎన్ని రంగుల సంక్రాంతి.

ఇది నాకు నచ్చిన సంక్రాంతి. 

13, జనవరి 2012, శుక్రవారం

బ్లాగర్ల సమావేశం-అనుభూతి పుష్ప గుచ్చం

గత ఆదివారం జరిగిన బ్లాగర్ ల సమావేశం (అనకూడదేమో..పట్టుమని పది మంది బ్లాగర్ లు కూడా హాజరు కాలేదు).. కబుర్లు పంచుకుంటానని..మిత్రులకి.. వాగ్దానం ఇచ్చాను.

ఆ విశేషాలు పంచుకోవడం బాగా ఆలస్యం అయింది ఎందుకంటే.. నా కన్నా పూర్తి సమయాన్ని..కేటాయించి..తగిన సహకారం అందించిన..ఆత్రేయ గారు (లిపి లేని బాష బ్లాగ్) వారు..సభ ఆద్యంతం జరిగిన విశేషాలలో..స్వయంగా పాల్గొన్నారు కాబట్టి వారు విశేషాలని బాగా చెప్పగలరు కాబట్టి వారి  బ్లాగ్ లో..చూసిన తర్వాత వ్రాద్దామని ..ఉపేక్షించాను. సడి  చప్పుడు లేకుండా.. వారి శైలిలో.. టపా పేలింది.. ఇంకా కబుర్లు ఏముంటాయి అనుకోకండి..

ముందుగా నేను చెప్పేది ఏమిటంటే.. విజయవాడలో..ఆదివారం వస్తుందంటే చాలు.. సభలు,సమావేశాలు,పుస్తకావిష్కరణలు తెగ జరుగుతుంటాయి. ఒకోసారి ఎటు వెళ్ళాలో అర్ధం కాక ..తేల్చుకోలేక.. శుభ్రంగా తిని..పట్టపగలే  దుప్పటి ముసుగు పెట్టేసే ముందు.. ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేయడం అలవాటు. అలాటి..టైట్ షెడ్యూల్ లో... ఆత్రేయ గారి చెప్పిన కబురుకి..నేను తెగ ఆలోచించాను. అలాగే బ్లాగరుల సమావేశం కి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాను అనుకోండి.

ఉదయమే..తొమ్మిది గంటలకి.. మా ఎక్స్ రే సర్వ సభ్య సమావేశం జరుగుతున్నదని సమాచారం. గత ఏడాది కూడా.. మానేసి ఏదో కుంటి సాకు చెప్పాను. ఈ సంవత్సరం కుదిరేలా లేదు అనుకుని.. ముందు ఆ సమావేశంకి హాజరై.. మధ్యలో.. ఒకసారి ఆత్రేయ గారికి పోనే చేసాను.. నేను కొంచెం ఆలస్యంగా వస్తాను. సమయ పాలన పాటించ నందుకు క్షమించేయాలి అని హామీ ఒకటి ముందస్తుగా తీసుకుని..కాస్త టెన్షన్ నుండి బయట పడ్డాను.
మా ఎక్సరే..ఉపాద్యక్షులలో ఒకరు   అయిన మోహన్ రామ్ ప్రసాద్ గారు (అక్షర మోహనం బ్లాగ్ ),64 కళలు వెబ్ పత్రిక కళాసాగర్ గారు లేక మా సభ కొంచెం బోసియినా..నేను సరి పెట్టుకున్నాను. వారు..మరో వేదికలో ఉన్నారు కదా..అని.

ఎట్టకేలకు.. మా ఎక్స్ రే ..కిరణాల నుండి తప్పించుకుని.. 12 .30 కి..సభా స్థలం చేరుకున్నాం.
సభలోకి అడుగు పెడుతూనే..నలుదిక్కులా.. కళ్ళ తో చెరిగేశాను.మహిళా బ్లాగర్ లు యెంత మంది ఉన్నారా..అని. ఒకే ఒక్కరు కనబడ్డారు. ఉష..అని లోలోపలే నిట్టూర్చి.. పురుష ప్రపంచం వైపు చూసాను. అందరు చాలా ఆసక్తిగా.. రెహ్మాన్ షేక్ గారు చెప్పే విషయాలలో..లీనమై పోయి..ఉన్నారు.


నేను అందులో..మమేకమైపోయి..కొన్ని సందేహాలు అడిగి మరీ తెలుసుకుని..కూసింత..కంప్యూటర్ జ్ఞానం..పెంపొందించు కున్నాను అనుకుంటున్నాను.

వింటూనే ,కావాల్సిన సమాచారం నోట్స్ రాసుకుంటూనే..    ఎవరు ఎవరయి  ఉంటారా..అని ఆలోచిస్తున్నాను. నేను వచ్చే టప్పటికి పరిచయ కార్యక్రమాలు అయిపోవడంతో.. భలే ఇబ్బంది పడ్డాను. మీరు ఎవరు ? ఎక్కడి నుండి వచ్చారు? మీ బ్లాగ్ పేరు ఏమిటి..అని అడగడం ఇబ్బంది అనిపించింది.

బులుసు గార్ని గుర్తు పట్టేశాను. దూరంగా అటువైపు కూర్చుని..గోదావరి జిల్లా వారికి-గుంటూరు   జిల్లా   వారికి గల వైరిని మాటల్లో..పంచుకుంటున్నారు. మధ్యలో.. నేను జోక్యం చేసుకుని.. ఏముందండీ.. కొబ్బరి +యందు మిరప కాయ కలిపి పచ్చడి చేసేద్దాం అండీ.. . మంచి రుచికరం అయిన పచ్చడి తయారు అన్నాను. మధ్యలో ఉన్న విజయవాడ వారిని.. పచ్చడి చేస్తారు..ఇద్దరు కలసి..అన్నారు..నవ్వులాట ..శ్రీకాంత్ గారు.  అప్పటికి వారు నాకు ఎవరో తెలియదు.


అలాగే..సందట్లో సడి చప్పుడు లేకుండా.. సంప్రదాయమైన తీరులో ఉన్న కుర్రాడు..ఫోటో లు తీసుకుంటున్నాడు. అతని పేరు అడిగి తెలుసుకున్నాను. "కౌటిల్య"..నాకు చాలా ముచ్చటేసింది. విశ్వనాధ కౌటిల్యం,పాకవేదం మర్చి పొతే కదా!


అలాగే నవ్వులాట శ్రీకాంత్ ..గారు.. బులుసు గారు,సునీత , కళాసాగర్,రామ్మోహన్ గారు,ఆత్రేయ గారు.. పద్మావతి శర్మ గారు..వీళ్ళు మన బ్లాగర్ లు.


ముఖ్యఘట్టం నిర్వహించిన రెహ్మాన్ షేక్ గారిని చూసి ఆశ్చర్య పోయాను,చిన్న వయసులో.. మన తెలుగు భాష అభ్యున్నతికి ఇలా కృషి చేయడం చాలా గర్వం కలిగించింది. వారికి ధన్యవాదములు.  ఈ సారి సభలు నిర్వహించడానికి..నేను నా వంతు కృషి చేస్తాను అని.. బ్లాగ్ ముఖంగా విన్నమిస్తున్నాను.
నేను అయితే.. విజయవాడలోను,ఆ దరి దాపులా దాదాపు నాకు తెలిసిన వరకు ఓ..నలబై మంది బ్లాగర్ లు ఉన్నారు. వారికి కనీస ఆసక్తి లేక పోవడం కించిత్ బాధ అనిపించింది. అలాగే..మరి కొందరు ఉత్షాహంగా పాల్గొనడం ఆనందం కలిగించింది.


నేను బ్లాగర్ల సమావేశం అనగానే చాలా ఊహించుకున్నాను. స్త్రీ బ్లాగర్ లు అందరు తప్పకుండా వస్తారని..వారితో.. చక్కగా.. బ్లాగ్ ముచ్చట్లు చెప్పుకోవాలని..ఇంకా.. కొన్ని విషయాలు పంచుకోవాలని ( రహస్యం ..వచ్చే బ్లాగర్ ల సమావేశం వరకు దాచి పెడతాను) ఎంతగా అనుకున్నానో!


నేను తోడుగా పిలుచుకుని వచ్చిన పద్మావతి శర్మ గారు,సునీత గారు తప్ప ఎవరు..రాలేదు.


ఈ సారి సమావేశం కి..ఎక్కువ మంది హాజరు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

నా మెయిల్  ఐ .డి. ఆత్రేయ గారి వద్ద లభ్యం . కావాల్సిన వారు తీసుకుని నాతొ  ఆసక్తికర విషయాలు ఏమైనా ఉన్నా.. కార్యాచరణ కార్యక్రమం గురించి కూడా..మాట్లాడవచ్చు.


ఈ సారి సమయం తీసుకుని.. బ్లాగర్ల సమావేశం విజయవంతం చేసి.. తెలుగు భాష వ్యాప్తికి ఉడతాభక్తి సాయం చేయడానికి కంకణం కట్టుకుందాం.


మరొక మనవి..ఇక్కడ గొప్ప బ్లాగర్ లు,చిన్న బ్లాగర్లు అని తేడా వద్దు. అందరు బ్లాగర్ లమే కదా! మంచి పోస్ట్ లతో.. ఆలోచనాత్మకంగా.. సహేతుకంగా మన భావాలని పంచుకుంటూ.. ఆత్మీయంగా ఉందాము.
కొంత మంది..బ్లాగర్లని అయినా కలసిన నా అనుభూతుల పుష్ప గుచ్చం ..ఇది.

అందరం కలసి ఉన్న సమయం తక్కువైనా..అది మర్చిపోలేనిది. .. ఈ పోస్ట్ చూస్తున్న బ్లాగ్ మిత్రు లందరికి.. ఈ బ్లాగ్ముఖంగా..ధన్యవాదములు.


7, జనవరి 2012, శనివారం

ఎవ్వరికీ చెప్పకే

ఎవ్వరికీ చెప్పకే.. అంటే నేను ఊరుకుంటానా? చెయ్యవద్దనే పనే చేస్తాను.

చిన్నప్పుడు నుంచి అంతే..అని మా అమ్మ అనేది. చెయ్యవద్దు అంటే ఆ పనే చేస్తావు.. ఎందుకే ? అనేది.

ఆ పని ఎందుకు చేయకూడదో..నువ్వు చెప్పలేదు కదా అమ్మా!.. అందుకే చేస్తే ఏమవుతుందో..తెలుసుకుందామని చేసాను అనేదాన్ని నిర్భయంగా.. అందుకే అసలు నా దగ్గర ఆ మాట రాకుండా జాగ్రత్తపడటం.. వీలయితే ఏ పని అయినా ఎందుకు చేయకూడదో.. వివరించి చెప్పడం చేసేది..మా అమ్మ.

ఎవరు ఏం చెప్పినా  నమ్మకంగా విన్నట్టే ఉంటుంది. కానీ..ఆఖరికి  తను చేయాలనుకున్నదే చేస్తుంది..అని మా అన్నయ్య   నా గురించి నొక్కి వక్కాణించే మాటలు అన్నమాట.

అలా బాల్యం నుండే..నేనో మొండి ఘటం ని.

ఒక సారి ఏం జరిగింది అంటే..  నేను సెవెంత్ క్లాస్స్ చదువుతూ ఉన్నప్పుడు అన్నమాట. మార్చి నెల ఆఖరు రోజులు.  ఒంటి పూట బడులు. ఉదయ్యాన్నే పెరుగన్నం తినేసి కేరేజీ తీసుకు వెళ్ళకుండా.. ఇంటికి వచ్చి.. ఆవురావురుమంటూ.. అమ్మ కలిపి పెడుతున్న  అన్నం ముద్దలుని  గబా గబా  తినేసి..  ఎక్కడ పడితే అక్కడ ఆ పటినే పడి నిద్రపోయే రోజులు.ఈ కాలంతో పోల్చుకుంటే.. చాలా అమాయకమైన కాలం అది.

రోజూ  మైలవరం బడికి రిక్షాలో వెడుతూ.. వెడుతూ..రిక్షాలోనుంచి హటాత్తుగా దూకేసి  వెళ్ళేదారిలో ఉన్న చింత   చెట్లు క్రింద  పడిన  చింతకాయలు ఏరుకుని.. లేదా..రాలిన మామిడి పిందెలు ఏరుకుని.పరిగెత్తుకుంటూ..ఆపకుండా వెళ్ళిపోతున్న రిక్షాని క్యాచ్ చేసి.. అందులో ఎక్కడం.. భలే థ్రిల్లింగ్ రోజులు అవి.

 "మా రిక్షా చిన్న" రిక్షా ఆపమంటే ఆపే వాడే  కాదు.అందుకే.. మేమే   రిక్షా ఎక్కే టప్పుడే   గుస గుసలాడుకుని ఎవరు  ఎక్కడ దిగి ఏమేమి సేకరించుకుని రిక్షా ఎక్కాలో ప్లాన్ చేసుకునేవారం. ఆ ప్లాను ప్రకారం చేసేవాళ్ళం. నేను  రోజూ  అల్లాగే చేస్తున్నాని మా రిక్షాలో ఒక ఇద్దరు..వాళ్ళు ముందు కూర్చునేవారు నా మీద ఉక్రోషంతో..  నేను రిక్షాలోనుంచి దూకి చెట్ల క్రిందకి పరుగులు తీయగానే.. మా చిన్నతో పాటు పెడల్స్ మీద కాళ్ళువేసి రిక్షా త్రొక్కుతూ. స్పీడ్ గా  పరుగులు తీయిన్చేవారు.అయినా నేను లెక్క చేసేదాన్నే కాదు.నాకు కావాల్సినవి నేను సేకరించుకున్నాకే .. వెళ్ళేదాన్ని. రిక్షాని క్యాచ్ చేసి.. గొప్పగా ఓ..లుక్ ఇచ్చేదాన్ని.    లేకుండా ఏరుకుని వచ్చిన కాయా గట్రా వాళ్లకు ఇచ్చేదాన్ని కూడా..

ఇలా రోజు రిక్షా దూకేసి చెట్ల వెంట   పడుతున్నానని.. మా రిక్షా చిన్న నన్ను మద్యలో..కూర్చేపెట్టి..దిగనీయ కుండా కట్టడి చేసే వాడు...నన్ను అలా బలవంతంగా ఉంచడం నచ్చేది కాదు.

ఒక రోజు నా చూపు.. మా వూరి రోడ్డు నుండి ప్రక్కగా చీలుతూ..ఓ..ఎడ్ల బండి వెళ్ళేంత దారి కనబడింది. ఈ దారి ఎక్కడికి వెళుతుంది..చిన్నా..అడిగాను ఆసక్తిగా..

ఈ  బండ్ల దారి దారి మైలారం  చిన్న చెరువు కట్ట మీదకు వెళుతుంది. ఎనకటి   రోజుల్లో..అందరు ఈ దారి గుండానే వెళ్ళేవారు.ఇప్పుడు రోడ్డు పడినాక అందరు రోడ్డు దారిన  వెళుతున్నారు అని చెప్పాడు.

ఒకసారి అటునుండి వెళదామా..ఆ దారి చూద్దాం . అని .అడిగాను ఉత్సాహంగా.

ఆ డొంక అంత  బాగుండదు..అంతా ముళ్ళే ఉంటాయి..రిక్షా టైర్లు పంచర్ పడతాయి వెళ్ళడం కుదరదు..అన్నాడు.  

మనసులో నిరుత్సాహం. ఏం చేయాలి..?ఒకటే  ఆలోచనలు.

మా క్లాస్స్ లో యేసు కుమారి అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ-నాన్న అన్నలు అందరు మా పొలాల్లో పని చేసే వాళ్ళు. ఆ అమ్మాయి   రోజు..పాపం ఆరు కిలోమీటర్లు నడచి స్కూల్కి  వచ్చేది. వాళ్ళు మా వూరి మొదట్లో ఉన్న హరిజనవాడలో ఉండేవారు. ఆ అమ్మాయి తో నాకు బాగా దోస్తీనే! మళ్లి బయట ఎక్కడ  మాట్లాడేది కాదు. మధ్యానం అన్నం తినే సమయంలో కూడా కలసి కూర్చుని  అన్నం తిందాం రమ్మంటే..వచ్చేది కాదు. వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళు మా ప్రక్కన కూర్చోవద్దని చెప్పే వాళ్ళని  ఆమె  చెప్పేది.

నా తోటి పిల్లలేమో..ఎందుకు ఆ అమ్మాయిని పిలుస్తావు..? వాళ్ళతో..మనం కూర్చోకూడదు. మనం కమ్మవారిమి కదా..అనే వారు. ఎందుకో   ఈ తేడా   నాకు అర్ధమయ్యేది కాదు.

 యేసు కుమారి వాళ్ళ నాన్న మా తాతయ్య,నాన్న వాళ్ళ ముందు..భుజం మీద తుండు తీసి చేతిలో పట్టుకుని.. చెప్పులు చేతిలో పట్టుకుని.. నుంచునే వారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా ఇంటికి పని చేయడానికి వస్తే దాహం వేస్తె..నీళ్ళు ఇస్తే.. దోసిలి నోటిదగ్గర పెట్టుకుని..ఆ దోసిలిలో నీళ్ళు పోసుకుని తాగేవారు. అలాగే అన్నం కూడా.. విస్తరాకులోనో.. గుడ్డ ముక్కలోనో పెట్టుకుని..ముద్దలు చేసుకుని ఎడమ చేతిలో పెట్టుకుని తినే వారు. వాళ్ళ ప్రతి పని నాకు ఆశ్చర్యంగా ఉండేది.      

ఇక  ఆ రోజు ఇంటర్వెల్ లో ఆ అమ్మాయిని అడిగాను.. మన రోడ్డు ప్రక్క నుండి  నుండి సారవ వైపు పొలాల్లోనుండి.  ఓ..డొంక దారి ఉందన్టగా నీకు తెలుసా..అని.

 అందుకు ఆ అమ్మాయి  ఓ..ఆ దారి నాకు తెలుసు.. అప్పుడప్పుడు..ఎక్కువ మంది ఉంటే అటువైపు నుండే నడుచుకుంటూ వస్తాం.  ఆదారి యెంత బాగుంటుందో తెలుసా.. మెత్తటి ఇసుక ..దారి అమ్మట అంతా చిట్టి ఈతకాయ చెట్లు... గచ్చకాయల చెట్లు.. గురివింద గింజల చెట్లు.. ఇక మామిడికాయలు కూడా తెగ కోసుకోవచ్చు.. ఎవరు ఉండరు అని చెప్పింది.

అయితే ఆ దారిలో నన్ను తీసుకు వెళతావా..అని అడిగాను.

అమ్మో.. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు.. నేను రానండి..అంది.

ఏం చేయాలబ్బా.. ! ఈ అమ్మాయి రానంటుంది. నాతో  రిక్షాలో వచ్చే ఎవరు రారు. మా అన్నయ్యకి అసలే భయం. అటు వద్దమ్మా.. అంటాడు. పైగా అమ్మతో చెప్పినా చెపుతాడు.. అనుకున్నాను.  ఆలోచిస్తున్నాను.

స్కూల్  వదిలిన తర్వాత.. యేసు కుమారి వచ్చి నాతో చెప్పింది..నేను నిన్ను తీసుకు వెళతాను.. అంది అయితే ఎవరికి చెప్ప కూడదు అని ఒట్టు పెట్టిన్చుకుంది.  సరే రేపు మధ్యానం అటునుండి వెళదాం అని చెప్పాను.

మరి రిక్షాలో వెళ్ళకపోతే ఊరుకోరుగా.అని అడిగింది.

ఎలాగబ్బా.. మళ్ళీ ఆలోచన. రేపు చెపుతానులే..నీకు ఏ సంగతి..అని చెప్పాను.

ఇంటికి వచ్చి ఆ సంగతే ఆలోచించాను. ఒక ఆలోచన తట్టింది. సరే అదే అమలు చేయాలనుకుని గట్టిగా అనేసుకుని.. మెదలకుండా..ఊరుకున్నాను.

తెల్లవారి..స్కూల్ కి వెళ్ళామా.. మధ్యానం అయ్యిందా.. గబా గబా మా రిక్షా చిన్న దగ్గరికి వచ్చి.. "చిన్నా..నేను ఈ పూట రిక్షాలో రావడం లేదు. మా తెలుగు మాస్టారు.. పరీక్షలు దగ్గరకి వస్తున్నాయి అని ప్రేవేట్ క్లాస్స్ తీసుకుంటాను  అన్నారు అని చెప్పాను.

అంతలో..మా అన్నయ్య..అమ్మాయి! నీకు అన్నం ఎలా..ఆకలి అవుతుందిగా అని అడిగాడు. పర్వాలేదు..మా ఫ్రెండ్ తీసుకువస్తానని  వెళ్ళింది..నాలుగు గంటలకి చిన్న మళ్ళీ వస్తాడుగా..అప్పుడు వస్తాను అని చెప్పాను. అందరు నమ్మేశారు. పాపం ..మా అన్నయ్య.. నేను అన్నం తిననేమో అని దిగులు మొహం పెట్టాడు. నాకు వాడి మొహం చూస్తే,,బాధ వేసింది..కానీ ఆ డొంక దారి చూడాలి అన్న కృత నిశ్చయం ముందు.. అది కొట్టుకు   పోయింది.

సరే..ఇక  నేను చెప్పినది నిజం అనుకుని నమ్మేసి..రిక్షా ఎక్కి అందరు వెళ్ళిపోయారు. మళ్లీ స్కూల్ లోపలకి వెళ్లి.. యేసు కుమారి దగ్గరికి వెళ్లి ఇద్దరం కలసి పంపు కొట్టుకుని కడుపు నిండా మంచి నీళ్ళు తాగి.. ఎవరికి  కనబడకుండా.. స్కూల్ నుండి..బ్లాక్ ఆపీస్ క్వార్టర్స్ దారికి వెళ్లి అక్కడి నుండి..శివాలయం మీదగా.. మార్కెట్ దారి..రామాలయం మీదగా.. సాలీల బజారులోనుండి..కోనేటి కట్ట మీదకి  ఎక్కి.. దానికి ఆనుకుని చిన్న చెరువు కట్ట ఎక్కి..ఎలాగోలా  ఆ డొంక దారిలో పడ్డాం..

అమ్మయ్య ఎవరి కంటా పడలేదు మనం అనుకుని.. ఆడుతూ.. గంతులు వేస్తూ.. ఆ దారిన రావడం మొదలెట్టాం. మద్యలో..పిందెలు అయినా చిట్టి ఈతకాయలు కోసుకున్నాం. గచ్చ కాయలు ఇంకా పగలలేదు...చాలా సేపు వెదుక్కుని  పాత కాయలు..ఏరుకున్నాం. మామిడి కాయలని  కోసి తిన్నాం..ఇంకా చాలా కాయలు..స్కూల్ బేగ్ లో వేసుకున్నాం. ఇవి ఎక్కడవి అంటే.. ఇంట్లో ఏం చెప్పాలో..ఆలోచించుకున్నాను..   నిజంగా ఆ దారి చాలా బాగుంది. పాపం యేసు కుమారికి కాళ్ళు కాలుతున్నాయి. ఆ అమ్మాయికి చెప్పులు లేవు. కాసేపు నా చెప్పులు వేసుకో..అన్నాను...కానీ..ఆ అమ్మాయి వద్దు అంది.  నాకైతే ఆ అమ్మాయి మీద చాలా స్నేహం పుట్టుకు వచ్చింది. నా కోసం యెంత..ఇబ్బంది పడుతుంది..అనుకున్నాను. ఎప్పటికి ఈ అమ్మాయితో..స్నేహం చేయాలి అనుకున్నాను కూడా..

సగం దూరం వచ్చాక  భయం మొదలైంది. దారిలో.. సమాధులు కనబడ్డాయి.దూరంగా రోడ్డు మీద వెళుతున్న బస్ లు  ,లారీల శబ్దాలు తప్ప ఒక్కరు కూడా మనుషులు కనబడటం లేదు. దాహం వేస్తుంది.. ఎక్కడా నీళ్ళే కనబడలేదు. దారి ప్రక్కనే ఉన్న మూడు ముంతలాకుని కోసి.. చిట్టి ఈత   ఆకులో చుట్టి..  ఇది నమలి.. బుగ్గన పెట్టుకో..మంచి నీళ్ళు అవవు అని చెప్పింది.

 ప్రొద్దున ఎప్పుడో తిన్న అన్నమేమో..ఆకలి మొదలైంది.పైగా అలవాటులేని ఎండ..నడక. ఇక నా పని అయిపొయింది. తూనీగలా క్షణం కూడా కుదురు లేకుండా ఎగిరే నేను నేను నడవలేనంటూ..చతికిల బడ్డాను. ఆ అమ్మాయి నా కోసం కూర్చుంది.

అందుకేనండీ.. నేను వద్దన్నాను అంది. ఏం పరవాలేదులే..పద వెళదాం అని.. నడక   సాగించి..   ఎలా అయితేనేం ఊర్లో పడ్డాం.

ఊరు మొదట్లోనే..మా యేసు కుమారి వాళ్ళ ఇల్లు అని చెప్పాను కదా.. మా ఇంటికి వెళదాం రండి అని పిలిచింది. సరే..అని తనతో..వెళ్లాను.

మేము వెళ్ళేటప్పటికి..యేసు కుమారి వాళ్ళ అమ్మ నులక మంచం మీద పడుకుని ఉంది. నేను యేసు కుమారితో..వెళ్ళడం చూసి..గబుక్కున లేచి నిల్చుంది.

ఏమిటి చిన్న అమ్మాయిగారు..ఇలా వచ్చారు అడిగింది. ఏసుకుమారి డొంక దారిన పడి నడచి వచ్చిన సంగతి చెప్పేసింది.

అమ్మో!.. నోరు ఆరిపోయి పడిపోయి ఉంటే ఇంకేమైనా ఉందా? ఆ దారిన ఎవరు సరిగ్గా రారు కూడా. పొద్దుగూకే ఏలకి..ఏ తోట కాపలా వాళ్ళో వచ్చేదాకా అలాగే  పడి ఉంటే ఇంకేమైనా ఉందా.. అయినా అమ్మాయి గారు అడిగిందని నువ్వు తీసుకువత్తావా..? అని యేసుకుమారిని వాళ్ళమ్మ నాలుగు బాదేసింది.

కూర్చో అమ్మాయిగారు.. .అని మంచం చూపించి మర్యాద చేసింది. ముందు మంచి నీళ్ళు తాగు.. మంచి నీళ్ళ బావి నీళ్ళే అని ఇచ్చింది. (అప్పుడు ఊరందరికీ..మంచి నీళ్ళ బావి ఒకటే ఉండేది. కొంత మందిని అందులోనుండి నీరు  తోడనిచ్చే వాళ్ళు కాదు. వాళ్లకి..ఎవరన్న తోడి పోసి బిందెలు నింపితే.. ఇంటికి తెచ్చుకునే వారు . వాటిని భద్రంగా తాగేవాళ్ళని తర్వాత తెలిసింది.)

మంచి నీళ్ళు తాగి..కూర్చున్నాను. అమ్మాయి గారు..కాళ్ళు చేతులు కడుక్కోండి..ఒక ముద్ద తిని ఇంటికి  పోవచ్చు...అంది.

సరే ఏమా ఆకలిగా ఉంది..కదా..బుద్దిగా తల ఊపాను.. యేసు కుమారికి  సత్తు గిన్నెలో అన్నం పెటింది..నాకు ఇత్తడి పళ్ళెంలో అన్నం పెట్టింది.ఇత్తడి గ్లాసుతో.. మంచి నీళ్ళు పెట్టింది. ఈ తేడాలు చూస్తున్నాను. యేసు కుమారిని క్రిందనే కూర్చోమని గదమాయించింది వాళ్ళ అమ్మ.  నాకు ఇచ్చిన అన్నం పళ్ళెం వైపు చూసాను..తెల్లగా లేదు.. అయినా ఆకలి అవుతుంది కాబట్టి తలొంచుకుని గబాల్న తినేసాను. ఆకలి తీరింది. ఎండకి  తిరిగి అలసి పోయానేమో..నిద్ర ముంచుకొచ్చేసింది. అలాగే పడుకుని నిద్రపోయాను.

నాకు మెలుకువ  వచ్చే సరికి  ప్రొద్దు గూకుతుంది.నా వంక కంగారుగా చూస్తూ ఉన్న యేసు కుమారి వాళ్ళమ్మ.

అమ్మాయి గారు ప్రొద్దుగూకుతుంది.ఇంటికాడ అమ్మ గారు కంగారు పడతారమ్మా. యేసు వచ్చి ఇంటికాడకి పంపించి వస్తాది.. వెళ్ళండి అమ్మా..అంది.

ఇక పుస్తకాల బేగ్ భుజాన వేసుకుని నేను బయలు దేరాను. నా దగ్గర నుండి బేగ్ తీసుకుని యేసు కుమారికి ఇచ్చింది వాళ్ళమ్మ. అమ్మాయి గారు.. మా ఇంట్లో తిన్నానని ఇంటిదగ్గర చెప్పబాకండి అంది. నేను.. అర్ధం కాక..అలాగే చూసి ఆలోచించుకుంటూ ఇంటికి  వెళ్ళిపోయాను.

అమ్మ నా వెంట వచ్చిన ఏసుకుమారిని చూసి..   ఏంటి..ఈ పిల్ల వచ్చింది..చిన్నా నిన్ను రిక్షాలో ఎక్కించుకుని రాలేదా..అని అడిగింది.

చిన్నా ..రిక్షా నాకు కనబడలేదమ్మా..అందుకే.. వీళ్ళ  వెంట నడచి వచ్చేసా..అని యెంత బాగా అబద్దం చేప్పేసానో!

సరేలే.. వెళ్లి స్నానం చేయి అన్నం తిందువుగాని..అని నాకు చెప్పి.. ఉండవే.. ఇప్పుడే వస్తాను అని చెప్పి ఏసుకుమారికి ఇంట్లో చేసిన  బోలెడన్ని పప్పులు తెచ్చి ఇచ్చింది.

చీకటి పడుతుంది..తొందరాగా వెళ్ళు అని పంపించేసింది. మేము ఇద్దరం కళ్ళతో సంజ్ఞలు చేసి తెగ నవ్వుకున్నాం.

ఇక ఆ రాత్రికి.. నేను చేసిన గొప్ప  ఎడ్వంచర్ మా అన్నయ్యకి  చెప్పాలి అని ఒక    ప్రక్క, వద్దని ఒక ప్రక్క  మెదడు చెపుతూ ఉంది..ఎందు కంటే..మా అన్నయ్య ప్రతి విషయాన్ని అమ్మకి మోసేస్తాడు. అందుకే అన్నయ్య అంటే  అమ్మకి బోలెడు ప్రేమ కూడాను. ఏమైనా అన్నయ్యకి తెలియనివ్వకూడదు. మరి ఎవరికి చెప్పాలి. ?

 ఆ..తాతయ్యకి.. చెప్పాలి అని  అనుకుని ఆయన ప్రక్కన చేరి పోయి.. పూస గుచ్చినట్లు అన్ని చెప్పేశాను.

అప్పుడు తాతయ్య అన్ని విని..ఇప్పుడు కొంచెం జనం మారుతున్నారు..మా అప్పుడైతే.. ఇంకా చాలా ఇదిగా ఉండేది అని చెప్పి..కులాలు,వృత్తులు,పేద,గొప్ప తేడాలు అన్ని వివరంగా చెప్పారు. (అవన్నీ ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను)అన్నీ చెప్పాక.. వాళ్ళ ఇంట్లో..అన్నం తిన్నానని ఎవరికి చెప్పకే..!అన్నారు.

నేను బుద్దిగా తల ఊపేసి వచ్చి మెల్లగా వచ్చి నానమ్మ ప్రక్కన పడుకుని  నాన్నమ్మకి  చెప్పాను. ఆకలి అయినది తిన్నావు..అన్నానికి ఏం తప్పులే..!అయినా ఆడపిల్లలు అలా తిరగకూడదు.ఈ విషయాలన్నీ ఎవరి చెప్పకు అంది.

అలాగే అని తల ఊపి నేను వెంటనే వెళ్లి మా అమ్మకి చెప్పాను.

అమ్మ  ఏ కళన ఉందొ.. అందరూ మనుషులేలే! ఏమైంది..లే..అంది. అంతలోనే  కానీ ఎవరికి ఈ విషయం గొప్పగా చెప్పకు..అందరికి నచ్చవు అంది.  ఎవరికి  వాళ్ళు ఎవరికి చెప్పకే.! ఎవరికీ చెప్పకే...అంటారు..అసలు ఈ విషయం అంటూ  చెపితే ఏమవుతుందో..ఏమిటో..చూడాలనుకుని..

పోద్దుపోద్దున్నే లేస్తూనే..మా చిన్న నాయనమ్మ దగ్గరికి వెళ్లి ..నాయనమ్మా !నేను ఇలా ఏసుకుమారి వాళ్ళింటికి వెళ్లాను ..అని మొదలు పెట్టగానే..మా అమ్మ గబుక్కున పరిగెత్తుకు వచ్చి నా నోరు మూసేసింది. అప్పటికే నా నోటి నుండి..విషయం వెళ్ళిపోయి ఆమెకి అర్ధం అయి.. ఇక ఒకటే తిట్ల దండకం మొదలెట్టింది.

ఎదవ సంత..ఒక కులం లేదు..గోత్రం లేదు.. యజమాని నౌకరు తేడాలేదు..అంతా భ్రష్టు పట్టిస్తున్నారు.పెద్దవాళ్ళకి చస్తేగా..!? పిల్లలకి రావడానికి. శుద్ధి  శుభ్రం లేని మంద అని ఒకటే..తిట్లు తో..గంటల తరబడి.. తూర్పారబట్టింది అంట. నేను బడికి వెళ్ళిపోయాను కాబట్టి బతికి పోయాను. లేకపొతే ..మా అమ్మ నన్ను  బాగా ఉతికి ఇస్త్రీ చేసేది అనుకున్నాను.

ఇక ఆ తర్వాత మా చిన్న   నాయనమ్మ నన్ను తన దరిదాపులకి రానిచ్చేదికాదు.దూరం దూరం అంటూ..ఒక కర్ర పట్టుకుని.. కొడతానని బెదిరిస్తూ.. ఉండేది. అప్పుడు తెలిసింది  కులాల పట్ల అంతస్తుల పట్ల మా ఇంట్లో వారికి..మా బంధువులకి ఉన్న తేడా..

నాకైతే..ఉక్రోషం ముంచుకొచ్చి..మరి జాన్ సుదర్శనం ని ఎందుకమ్మా కుర్చీ వేసి కూర్చోబెట్టి కాఫీ ఇస్తారు.వాళ్ళది హరిజనవాదేకడా.. యేసు కుమారి వాళ్ళకి చుట్టాలే కదా..! జాన్ సుదర్శనం   ప్రెసిడెంట్ అనా..లేక వాళ్ళ పిల్లలు అందరు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ..అమెరికా లాంటి దేశంలో ఉన్నారనా.?.అని అడిగేదాన్ని.

మా ఇళ్ళల్లో.. బలిపీఠం  సినిమా గురించి, మనుషులు మారాలి సినిమా గురించి బాగా వాదనలు జరిగేవి.మా అమ్మ పుస్తకాలు చదవడం,సినిమాలు చూడటం ,రేడియో వినడం మూలంగా చాలా విషయాలు.. బాగా వాదించేది.

నేను ఏసుకుమారితో  స్నేహంగా ఉండటం నేర్చుకున్నాను. అమ్మ పెట్టిన అప్పచ్చులు దాచుకుని మరీ ఆ అమ్మాయికి పెట్టేదాన్ని. తర్వాత పరీక్షలు   అయిపోయి సెలవలు ఇచ్చారు.

ఇక తర్వాత నేను ఎప్పుడు ఏసుకుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.ఏడవ తరగతి అయిపోయాక ఆ అమ్మాయి కనబడలేదు. ఆ అమ్మాయికి  పెళ్ళైపోయింది అని చెప్పారు.  తర్వాత ఆ అమ్మాయి నాకు ఎప్పుడు కనబడలేదు కూడా.. తరవాత మా వూరిలో చాలా మార్పులు వచ్చినా .. మా చిన్న నాయనమ్మ మాత్రం మారలేదు. ఎప్పుడు ఎవరినో ఒకరిని తిడుతూ.. ఒకకర్ర పట్టుకుని అందరిని దూరంగా జరగమని చూపుతూ..దారివెంట నడిచేది.

ఇప్పటికి నాకు..మా వూరి రోడ్డు..సారవ పొలాలు ప్రక్కన డొంక దారి  గుర్తుకువస్తే..ఏసుకుమారి,ఎవరికి చెప్పకే.విషయం  గుర్తుకు వస్తుంది..అప్రయత్నంగా..నవ్వు వచ్చేస్తుంది.

ఇక మా  ఇంట్లో  అయితే..నాకు . ఏది .చెప్పకూడదో ..ఎందుకు చెప్పాలో..  ఎందుకు చెప్ప కూడదో..అర్ధం కాక తలలు పట్టుకునేవారు.

అమ్మ అయితే..అసలు ఏం చెప్పేది కాదు. ముఖ్యంగా చేయవద్దని. అలా చెపితే.. చెయ్యవద్దనే పనే చేసేదాన్ని.

అందుకే.. ఏ పని అయినా చేయవద్దు అని చెప్పడం కన్నా.. చేస్తే..ఎలాటి ఇబ్బందులు పడతామో..చెప్పడం మొదలెట్టేసి.. నన్ను జ్ఞానవంతురాలిగా..పెంచే పని చేస్తుండేది అమ్మ.

 ఇలాటి విషయాలు..నా జ్ఞాపకాల   దొంతరలో..చాలా  ఉన్నాయి. అవి ఇంకోసారి వ్రాస్తాను.
  

6, జనవరి 2012, శుక్రవారం

పోర్టబిలిటి విజయమో..వీర గర్వమో!

మొబైల్ పోన్ నెంబర్  పోర్టబిలిటి ... ఓడిన  నా పోరాట  పటిమ   

నేను దాదాపుగా ఎనిమిదేళ్ళ క్రితం హచ్..నుండి ఒక మొబైల్ కనెక్షన్ తీసుకున్నాను నాకు అంతా ఫ్యాన్సీ నెంబర్ల అభిరుచి. ఆ నెంబర్ పోస్ట్ పెయిడ్  అయితేనే ఇస్తానని.. నెట్ వర్క్ వాళ్ళు కండీషన్ పెట్టారు. సరే ఆ నంబర్   కావాలంటే..  రోట్లో తల పెట్టక తప్పదు. పెట్టాక రోకళ్ల దెబ్బలు తినక తప్పదు.

కనెక్షన్ తీసుకున్న ఓ..నాలుగేళ్ళు..వేలల్లోనే బిల్లులు చెల్లించి ఉంటాను.  ఎందుకంటె.. మా వర్కర్స్ ఇంటి నుండి ఓ..మిస్ కాల్ వచ్చేది. వాళ్ళు వెంటనే ..ఇంటికి పోన్ చేసుకుంటాం మేడం అనే వాళ్ళు.. మన వర్కర్సే కదా.. పోన్లే పాపం అని ఇచ్చేదాన్ని. నెల తిరిగి వచ్చేసరికి బిల్లు చూస్తే  కళ్ళముందు.. పట్ట పగలు నక్షత్రాలే  ఈస్టమన్ కలర్లో కనిపించేయి. అయినా తాగినోడు  తాళ్ళ పన్ను   కట్టక వేరొకరు ఎందుకు కడతారు చెప్పండి.? మొహం మాడ్చుకుని కట్టేసి బిల్ కట్టేసినాక హచ్ వాడు చెప్పే థాంక్స్ కి ఏడ్వలేక ఓ..వెర్రి నవ్వు నవ్వి బయట పడేదాన్ని.

పనిలో పని ఒకోసారి మెసేజెస్ చార్జ్ కూడా విపరీతంగా ఉండేది. అంతగా.. ఎస్ ఎమ్మెస్ లు చేసేదాన్ని. సరే...  హోం ,పైనాన్స్ శాఖలు రెండూ నావే  కాబట్టి.. వేరొకరితో తిట్ల దండకం,చీవాట్ల వడ్డింపులు ఉండేవి కాదు.  అలా హచ్ వాడిని నా నుండే.. లక్షాదికారిని చేసాక..కాస్త జ్ఞానం తెచ్చుకుని..నేనే లక్షణంగా లక్షాధి కారిగా మెలగాలని నా పోన్ కి బిల్ కట్టడం మానేస్తే.. నెలలో ఓ..పదిరోజులు.. బారింగ్లో పెట్టి.. (పెట్టించుకుని ) తీరిగ్గా బిల్ కట్టాక అవుట్ గోయింగ్ పర్మిషన్ ఇచ్చే టట్లు..తెలివిగా నడుచుకుని..వర్కర్స్ కి ద్రోహం చేసేదాన్ని. అలా నాలుగేళ్ళు గడిచి పోయాయి.

ఇంతలో..ఇల్లు షిఫ్ట్ అయ్యాం. ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ . ఒక్క పాయింట్ అయినా   సిగ్నల్ వస్తే ఒట్టు.  పోన్ అసలు మొగేదే కాదు..ఒకవేళ మ్రోగినా.. వీది గేట్ వరకు వెళితే కానీ మాట్లాడను వీలు ఉండేది కాదు. నాకు ఈ బజారు పోన్ వద్దురా బాబు అంటే..మా అబ్బాయి వినేవాడు కాదు..అమ్మో పాన్సీ నెంబర్ పొతే దొరకదు ..అనేవాడు. సరే ఏదో ఒకటి లే..చావనీ అనుకుని..ప్లాన్ తక్కువలోకి మారి..వేరే నెట్వర్క్ పోన్ తీసుకుని అది వాడుతున్నాను. ఇంతలోకి
నెంబర్ పోర్టబిలిటి  ఆశ రేపి  ఓ..సంవత్సరం..ఆటలాడుకున్నాడు. ఆశగా చూసి   చూసి  అంతా బ్రాంతి ఏనా.. అని పాటలు పాడుకునే అ..శుభ తరుణాన.. పోర్ట బిలిటి..సౌలభ్యం  వస్తునదని ప్రకటన వచ్చి రాగానే.. వోడా..పోన్ ఆఫీసుకి వెళ్లి నెంబర్ మార్చుకోవచ్చు అనుకుని తెగ సంతోష పడి పోయాను.

ఏ మాట కామాట చెప్పుకోవాలి. వోడా పోన్ వాళ్ళు   వొడ  అన్న పేరే కానీ మరీ డీప్ ప్రయ్ చేయరులే అనుకునే దాన్ని.  కానీ తర్వాత తెలిసింది కారు చవకగా లభించే సదుపాయాలూ ఇతర నెట్ వర్క్ ల లో  ఉన్నాయి అని. కానీ ఈ ఫ్యాన్సీ నెంబర్ వదలలేను. ఇలా రోజులు గడుస్తున్నాయి.  ఎట్టకేలకు.. పోర్ట బిలిటీ  నా పాలిట వరమై వచ్చింది.  పోర్టింగ్ నెంబర్ తీసుకోవడం  వోడా  పీడా వదిలించుకోవాలని ప్రయత్నించడం,  వాడు ఏదో సాకు చెప్పడం ఇలా ఓడా స్టోర్స్ చుట్టూ తిరగడం.. మొదలెట్టి  దాదాపు ఏడాది కావస్తుంది. అయినా వాడు నాకు విముక్తి ఇవ్వడు. మీరు  సరి అయిన కారణాలు చూపక పోవడం   వల్ల.. మీ నెంబర్ మార్పు సాధ్యపడదు. అని ఆ కంప్యూటర్ వాయిస్ రికార్డ్  అమ్మణ్ణి నన్ను వాయిస్తుంది.

ఇక వారి సేవలు మనలని మురిపించే విధం నానా రకములు.  పోస్ట్ పైడ్ కి వచ్చే.. ప్రింటెడ్ బిల్లు పంపడం మానేసి రోజుకొక పది మెసేజ్ లతో..బిల్ కట్టాలని గుర్తు చేసే సౌకర్యం ... ఉన్నది . ఇక బిల్ కట్టేస్తాము.ఏదైనాఅవసరం అయితే కస్టమర్   కేర్  ఉండనే ఉంది.  నెట్ వర్క్ వారి సేవలు యెంత   దయగలవి అనుకుంటాను.  అదేమిటో మన అవసరాలని మనం చెప్పా కుండానే గుర్తిన్చేసి..  ప్రొద్దున్నే సుప్రభాతం నుండి..రాత్రి పూట శుభ రాత్రి కూడా చెప్పకుండా  మనని  నాన్ స్టాప్ గా   దిల్ కుషి గా ఉంచే ఎన్నో   సేవల్ దొరుకుతుంటే.. ఇంట్లో..పెళ్ళాం బిడ్డ,అమ్మ అయ్యా ఊసేం ఎత్తకుండా రోజులకి రోజులు డోల్లించే యవచ్చు ..అనుకున్నాడట నాలాటి వెర్రి వెంగళప్ప.
 
కానీ నా నంబర్ ని ఇతర నెట్ వర్క్ లకి మార్చుకోనీయకుండా  ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అలుపెరగక..నేను  పోర్టింగ్ కోడ్ తీసుకోవడం .. నేను పోర్టింగ్ ప్రాసెస్ ని మొదలెట్టడం.. జరుగుతూనే ఉన్నాయి. ఇలా నాలుగు సార్లు వివిధ కారణాలు చెపుతూ  మార్చడం సాధ్యపడని చెప్పకుండానే.. చెపుతూ సహన్నాన్ని పరిక్శిస్తున్నారు.
ఇక ఈ సారి నేను ఉపెక్షించ దలచుకోలేదు. కన్స్యూమర్ కోర్ట్ కి వెళ్ళా లనుకున్కుని ..  సిగ్నల్ ప్రాబ్లం గురించి  తెలియజేస్తూ..నేను ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లు.. వారితో.. ఒక ఆఫీషియల్ స్టాంప్ వేయించుకోవడం చాలా కష్టమై పోయింది. అలాగే..నేను పోర్టింగ్ కి ఎన్నిసార్లు ప్రయత్నించాను. ఏయే కారణాలు వల్ల వాళ్ళు నెంబర్ మార్పిడిని తిరిగి అడ్డుకున్తున్నారో.. అన్నిటిని ఉదాహరిస్తూ.. నేను కట్టిన బిల్లుల వివరాలన్నీ పొందు పరుస్తూ.. మళ్లి ఒక రిక్వెస్ట్ ని స్వయంగా ఇచ్చాను. ఈ సారి తప్పకుండా అయిపోతుంది మేడం..అంటూ..సన్నాయి నొక్కులు నొక్కి.. ప్లాస్టిక్ నవ్వులు పంచి పంపింది  అక్కడున్న ఒక సేవా భామిని.  మళ్ళీ పోర్టింగ్ గడువు ముగిసి పోయింది. నా నెంబర్ నెట్ వర్క్ మారనూ లేదు. నేను వోడాలో వడలా  వేగడం మాన లేదు. అసలు విషయం ఆరా తీద్దును   కదా.. ఏ నెట్ వర్క్ కూడా ప్యాన్సీ నెంబర్ ని  వదులుకోవడం లేదు. పోర్టింగ్ కి అనుమతి ఇవ్వడం లేదు. ఒక ఆలోచన వచ్చి  ఇలా ట్రై చేస్తే!!! కన్స్యూమర్ కోర్ట్ ... ఉందిగా..అని ఆలోచన వచ్చింది.

అదేమిటో..మా విజయవాడలో.. ఉన్న వినియోగ దారుల సేవా కేంద్రం వారు ఇచ్చిన నంబర్ ఎప్పుడూ మోగుతూనే ఉంటుంది.. కానీ ఎవరు..అందుబాటులో ఉండరు. ఇంకా నేను ఏం చేయుదును? నా ఫ్యాన్సీ నంబర్ పిచ్చి కాదు కానీ.. ఎనిమిదేళ్లుగా అందరికి అలవాటైన నంబర్.. మా  కస్టమర్స్ అందరికి అలవాటైన నంబర్.. నేను వదల వీలుపడదు. కారణం ఏమనగా.. నెంబర్ పోర్ట బిలిటి అనేది  ఫ్యాన్సీ నంబర్స్ కాని వాళ్ళకి త్వరితంగా అవుతుంది. నా నంబర్ లాటి నంబర్ కి మాత్రం సాధ్యపడదు.  చచ్చినట్లు..వారి ఇనుప కబంధపు హస్తముల మద్య చిక్కుకుని విల విలలాదాల్సిందే! లేదా..కసిదీరా విసిరి కొట్టాల్సిందే   తప్ప వేరొక ప్రత్యాన్మయం కాన రాదు. రాదు. రాదు అని తీర్మానించుకుని.. :)))))))) తో..  పోన్ వచ్చింది. మరి   నేను మాట్లాడాలి కదా అనుకుని వీది లోకి పరిగెడుతూ.. ఛీ.. పాడు  మొబైల్ పోను - పాడు  జన్మ ..అని తిట్టుకుంటూ.. పోర్ట బిలిటి విజయమో..వీర గర్వమో! టెస్ట్ లు పెట్టుకుంటూనే ఉన్నాను.

ఎవరైనా సలహా చెపితే..  ఆ సలహా వర్కవుట్ అయితే నా తదనంతరం నా ఫ్యాన్సీ నెంబర్ మీకు ఇవ్వగలన ని  హామీ పత్రం రాసి ఇస్తానని మనవి చేస్తూ..  వోడా పై నేను చేసిన పోరాటంలో గెలిచి   నా మొహాన ఓ..విజయ గర్వం నాట్యమాడే దృశ్యం ఊహించుకుంటూ..   (కల లో అయినా ) నిద్ర వస్తుంది..ఫ్రెండ్స్.. శుభరాత్రి..