ఏదైనా లోన దాచుకున్నంత కాలం... పరిమళాన్ని దాచుకున్న మొగ్గ లాగా అది కేవలం మనదీ.. మనకు మాత్రమే సొంతమైనది.
పెదవి దాటినా.. పాళీ కదిలినా.. కీ బోర్డ్ చప్పుడు చేసినా.. కుడి చేతి చూపుడు వేలు ఒక క్లిక్ మనిపించినా వికసించిన పుష్పం నుండి వెలువడిన పరిమళంలా అది మరికొందరిది అందరిదీ..
రహస్యపు పొరలు విప్పకుండా దాచుకున్న అనేకానేక ఆలోచనలు మనసు మమత అన్నీ మన వ్యక్తిగత సంపద. ఎవరూ దోచుకోలేని సంపద. మనిషి ఒగ్గి ముడతలు పడ్డ చర్మం క్రింద దాగున్న నరాలలో ప్రవహించే రక్తంలా అవి చేతనమైనవి. మరణించిన కణాల స్థానాన్ని భర్తీ చేసే సరికొత్త కణాల్లాంటివి. రోజు రోజుకూ సరికొత్త రూపం దాల్చి ఇది ఇలా కాదు అలా అది మరోలా అంటూ అమీబా లా ఆకృతి మార్చుకుంటూ మనకు మాత్రమే సొంతమైన ఆస్థి.
అందుకే అంటారు.. వయస్సు పెరుగుతున్న కొద్దీ నోరు తెరవడం తగ్గాలి అని.
మనం విపరీతంగా ప్రేమించే వారు మనను సరిగా పట్టించుకోవడం లేదని భావన కల్గినా అది నిజమే అయినా అబద్దమైనా.. అది జీర్ణం చేసుకోడంలో విఫలమైతే అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కన్నీరు పై పై ఆరోపణలు అన్నీ మన మనసును ఆలోచననూ పట్టి ఇచ్చేవే!
అందుకే ఆలోచనల ముంత పగలకూడదు.. ప్రకటనల తాళం బద్దలకొట్టకూడదు..సిల్లీ థింగ్స్ అని పలుచన కాకూడదు. .. కొంత దాచుకోండి.మీ విలువైన సంపదను మీరే అనుభవించండి. అంతర్ముఖులై వుండటానికి సాధన చేయాలి.
అని యెన్నో అనుకున్నానా..
హృదయం యెంత పిచ్చిది.. ముడి విప్పొద్దు అంటూనే యెంత త్వరగా బట్టబయలై పోతుందో. అనేక సంశయాలు భయాలను దాచుకోలేక యిష్టమైన వాళ్ళ ముందు బయటపడి పోతుందో! అది ఆలోచనకు ఎంత విభిన్నంగా వుంటుందో.. కదా!
అప్రయత్నంగా.. మేరా దిల్ బి కిత్నా పాగల్ హై.. అని మనసు ఓ అంతర్ముఖి పాట పాడుకుంది..
మనుమరాలిని చూడటానికి వెళ్ళడానికి వేగిరపడుతున్న పడుతున్న మనసు వెళ్ళలేని నిస్సహాయత కలగలసిన అసహనంలో కొడుకుతో కాస్త మాట్లాడి ఎక్కువ పోట్లాడి అర్దం లేని ఆరోపణలెన్నో చేసాక.. కాసిని కన్నీళ్ళు కార్చాక తేలికైన హృదయంతో .. యిలా అనుకున్నాను.
నా కొడుకు సహన సముద్రం. అమ్మను బిడ్డలా వొడిలో పడుకోబెట్టుకుని ప్రేమగా వెన్ను నిమిరినట్లు వొదార్పు వచనాలతో సాంత్వన కల్గించాడు. మరి అమ్మను యెవరు అర్ధం చేసుకుంటారు బిడ్డ తప్ప.
అసలు విషయం యేమిటంటే... తగుదునమ్మా అంటూ అన్నీ బయట పెట్టకూడదు.. కొన్ని దాపెట్టుకోండి అనేది కూడా అవసరమైన మాటే. ఎవరికి వారు అనుభవంలోకి తెచ్చుకుని చూడండి. మీకే తెలుస్తుంది. రహస్యపు అర యెంత ఆనందాన్నిస్తుందో!