24, నవంబర్ 2016, గురువారం

అమ్మ మనసు




ఇదిగో ..ఇప్పుడే పుట్టినట్టు ఉంటుంది సంబరం. నా కళ్ళల్లోకి నిండు వెలుగు నిండుకున్న క్షణాలు ఇవిగో ..అంటూ ఆ క్షణాలకి వెనక్కి ప్రయాణం చేస్తుంటాయి. ఈ పేగు బందానికి అప్పుడే 29 ఏళ్ళు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మధ్య మధ్యలో అమ్మ రెక్కల నుండి దూరంగా జరిగినప్పుడూ ప్రాణమంతా ఓ తలపుగా మారి శ్వాసంతా ఆకాంక్షగా మారి నువ్వు పచ్చగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. ప్రేమ,భాద్యత రెండూ అమ్మాఅబ్బాయి మధ్య బలంగా అల్లుకునే ఉంటాయి. నేనెలా పెంచానో నువ్వెలా పెరిగావో సాక్ష్యంగా నీ నడక, నడత చెపుతూనే ఉంటాయి. కొన్ని ఆశలు ఆకాంక్షలు నీకు చేరువ కాబోయి అడుగు దూరంలోకి వచ్చి చటుక్కున్న వెనుతిరిగి వెళ్ళిపోయి నీకు నిరాశ మిగిల్చినా వయసుకు మించిన పరిపక్వతతో తట్టుకుని నిలబడి నడక సాగించిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది బంగారం. 
ఏరోనాటికల్ ఇంజినీర్ కాబోయీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కాబోయీ, వెండి తెరమీద ఓ అవకాశం రాబోయి మామూలు ఇంజినీరింగ్ చదివిన పిల్లాడివి అయిపోయావు. తర్వాత మంచి భవిష్యత్ నీకు అందిన తరుణాన అడుగడుగునా భగవంతుని కృప నీకు తోడుంది.ఇతరుల పట్ల నువ్వు చూపే ఆదరణ, స్పందన,  నీ మంచి మనసు,నిజాయితీ, నీ విద్వత్తు అన్నీనీ సహజ గుణాలు. వాటిని ఇతరులు క్యాష్ చేసుకున్నంత మాత్రాన నీకు పోయేది ఏదీలేదు.చాలా విలువైన కాలం, మరికొంత ధనంతప్ప.  మనుషులపై నమ్మకం, గౌరవం అలాగే ఉండనీయి బంగారం. నీలా ఉండేవాడు ఒకడున్నాడు అని నిన్ను మోసపుచ్చే వారికి వాళ్ళ అంతరాత్మ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది.  ఒకింత నిర్లక్ష్యం తగ్గించుకుని,ఆత్మనూన్యత తగ్గించుకుని ముందుకు దూసుకువెళ్ళు బంగారం . పోయినవాటిని గురించి బాధ లేదు, సంపాదించిన వాటి పట్ల గర్వమూ వలదు. 

నాకు అసలు సిసలైన ఆస్తులు - అంతస్తులు నీ వ్యక్తిత్వం, నీ విద్వత్తు. ఇవే మా అసలైన ఆస్తులు బంగారం. నాకు దూరంగా ఉన్న ఈ సంవత్సరాలు ఆర్ధిక అవసరాల కోసం నీ మంచి భవిష్యత్ కోసం ఏర్పడినవే .. అమ్మా - చిన్ని బంగారం మధ్యనున్న పేగు బంధానికి కాదు. ఆర్ధిక అవసరాల కన్నా మానసిక అవసరాల కోసం, మంచి చెడు విషయాలు పంచుకోవడం కోసం ప్రేమతో, ఆత్మీయతతో భగవంతుడు వేసిన అత్యుత్తమ బంధం తల్లి బిడ్డ బంధం. ఈ.. నీ పుట్టిన రోజున  ప్రేమగా, గర్వంగా నిన్ను చూసుకుని నిజంగా ఆనందపడే క్షణాలు ఇవి. గర్వంతో తుళ్ళి పడే క్షణాలు ఇవి.  నీ నడకలో రాళ్ళు ,పూలు ఏవి ఎదురైనా క్రుంగక, పొంగక మరింత సహనంతో సౌశీల్యంతో,నీ సహజ గుణాలతో లక్ష్యం వైపు సాగాలి బంగారం. ఇదే అమ్మ కోరిక. 

శ్రీశైల మల్లన్న కరుణ,కృపాకటాక్షం ఎల్లెప్పుడూ నీ పై ప్రసరించాలని "మల్లన్న" ని ప్రార్దిస్తూ .. 

ఇలాంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ..
చైతన్యవంతమైన జీవన గమనం తో.. 
స్ఫూర్తి కరమైన మార్గంలో నడుస్తూ.. 
సుఖసంతోషాలతో..ఆయురారోగ్యములతో.. పుత్ర పౌత్రాభివృద్దితో 
యశస్విభవ గా దేదీప్యమానంగా వెలుగొందాలని ..
మనసారా దీవిస్తూ.. 

భగవంతుని కరుణా కటాక్షములు అన్నింటా లభించాలని కోరుకుంటూ... 
హృదయపూర్వక శుభాకాంక్షలు ..

నిండు మనస్సు తో.. ఆశ్శీస్సులు .. అందిస్తూ..

ప్రేమతో..దీవెనలతో.. అమ్మ.

11, నవంబర్ 2016, శుక్రవారం

నాగలి విద్వంసం





అతని కోసం వెతుకుతున్నాను . 
వెతికి వెతికి అలసి పోయాను .
కనబడ్డప్పుడు యాధాలాపంగా చూసిన చూపే తప్ప 
ఓ తాలు నవ్వు నవ్వని పొదుపరితనం  గుర్తొస్తుంది   
గింజ నేలబడితే చిగురంత పొగరైనా కానరాకుండా 
కళ్ళకద్దుకున్న అతనిని చూసి 
అపహాస్యం చేసిన రోజొకటి జ్ఞప్తికొస్తుంది   

జనారణ్యంలో తప్పిపోయినతన్ని  ఇప్పుడు 
హృదయాన్ని కళ్ళు కుట్టి  మరీ వెతుకుతున్నా 
ఆకాశ హర్మ్యాల మధ్య అతనెక్కడ చిక్కుకున్నాడో 
పొగ గొట్టాల మధ్య మసి బారిపోయాడేమో  
ఆచూకీ దొరకని కొద్దీ అతను పదే పదే  గుర్తుకువస్తున్నాడు 
ఆరగించడానికి కూర్చున్నప్పుడల్లా ఆలోచనలని తెగ తొలిచేస్తుంటే 
కనిపిస్తే చాలు ..తినే మెతుకు మెతుకుని పువ్వులుగా మార్చి 
అతని పదములపై పరవాలని చూస్తున్నా   
ఏ బలవన్మరణ తీరంలోనో రాలి పడకూడదని ప్రార్ధిస్తున్నా

అప్పుల బాధతో బాంధవ్యం నెరిపినవాడు 
కంటి చూరుకి వేలాడే చుక్కతో ఓ బట్ట తడుపు వాన కోసం 
మోరెత్తి ఆకాశం వైపు చూపు సారించినవాడు 
వాన గొడుగు కింద ఆరు అడుగుల నటనే 
సేద్యం అని నమ్మిక కలిగినవాడు 
రాపిడి విలువ గుండెకి మట్టి విలువ 
మనిషికి తెలియాలని తాపత్రయపడినవాడు 
కుంచాల్లో  కొలవడం 
క్వింటాళ్ళలో తూకమేయడం మానేసి 
గజాల్లో నోట్ల ఎత్తుని తలకెత్తుకుంటుంటే 
చేష్టలుడిగి కట్ట తెగిన చెరువైన వాడు  
  
పచ్చదనం  కరువైన వినికిడి నుండి 
మనిషి తనం ఆవిరైపోయిన లోకుల నుండి  
ఏమీ లేని లేమితనంలో నుండి 
అలా అలా నడిచి వెళ్ళిన వైనాన్ని దైన్యాన్ని తలుచుకుని 
కన్నీరు ముంచుకొస్తుంది మున్నేరుని తలపిస్తూ 


బాల్యమంతా దానికి రెట్టింపు యవ్వనమంతా 
పచ్చటి పొలాల్లో తూనీగల్లె ఎగిరినతను 
ఎండకి చలికి గిడసబారి పోయి సత్తువ జారి
పక్వానికి రాకుండా తొడిమ ఊడిపోయిన కాయల్లే  
డొల్లుకుంటూ డొల్లుకుంటూ రద్దీ రోడ్ల కూడలిలో 
అరచెయ్యి చాపి అడుక్కుంటూ కనిపించాడు . 

పరామర్శగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే 
 పచ్చటి  కలలు పగిలిపోయిన జాడలు  
 ప్రక్కన నడుస్తుంటే వేదన  పండి మాగిన వాసన 
 పెదవి విప్పితే లావాలా ప్రవహించే ఆక్రోశం 
ఊరెక్కడుందీ చాటెడు నేలెక్కడుందీ 
వాన కురిసిన నగరాన్ని జేసీబీ సేద్యం చేస్తుంటే 
ఇక నాలాంటి వాడెందుకున్న మాట  
అర్ధరాత్రి అపరాత్రి చెవుల్లో గింగురుమంటుటే
అభివృద్ధి విద్వంసం  
నట్టింట్లో  నృత్యం చేస్తున్నట్లుగా ఉంది  ఫ్రీ  wifi సాక్షిగా. 


7, నవంబర్ 2016, సోమవారం

హృదయాన్ని ఊరడిల్లనీయీ

ఇదిగో వింటున్నావా ..?
ఈ రాత్రి నా నిశ్శబ్ధాన్ని
అందులో కలగలిసిన కొంత జ్వలనాన్ని
విప్లవ గీతాన్ని కన్నీటి భాషానినాదాలని
కొంచెం మనసు పెట్టి విను
 అలా వెన్నుముక  చూపకు
ఎవరి వంతులో ఉన్నది వారే అనుభవించాల్సి ఉన్నా
అయిష్టంలో నైనా వినితీరాల్సిన సమయమిది
జ్ఞాపకాల ఊరేగింపులో అడుగు కలపలేని
ఈ   నిశ్శబ్దాన్ని చెవి ఒగ్గి... కొంచమైనా విను


నా వీపున సంధించలేని ప్రశ్నోత్తరాలెన్నో ఉన్నట్లే
నీ చెంత జవాబు వ్రాయలేని లేఖలెన్నో ఉండి ఉంటాయి
వెతికి వెతికి చేజిక్కించుకోడానికి గతించిన కాలమూ
చేజారిన యవ్వనమూ అవేమన్నా వస్తువులా
బంధంలో బందీగా మారినప్పుడు
బానిసత్వానికి కొత్త అర్ధం తెలుసుకోవడమెందుకు?
కలగంటున్నావేమో... ఊగుతున్నభవిష్యత్ చిత్రపటాన్ని
 సత్యాన్ని  సత్యంగా  బోధిస్తున్న
ఈ నిశ్శబ్ధాన్ని మనసు పెట్టి విను

ఎప్పుడో దహనం కాబడిన కలల బూడిద
ఒరిసిపారే నదిలో కలిసి
పాడుకున్న పాటలోని చరణాల వలె సాగిపోతుంటే
పల్లవొకటే మిగిలి పగిలి పడుతుంది
వర్తమానంలోని  ఈ మహా నిశ్శబ్దాన్ని కొంచెమైనా  విను
నా హృదయాన్ని కొంత ఊరడిల్లనీయీ ..

ఇప్పుడు వినకపోతే మరెప్పుడూ వినలేవేమో ...
ఈ నిశ్శబ్దం చిట్లినా పెళ్ళున బ్రద్దలైనా
సరి క్రొత్త ఆత్మకి దానితో పనిలేదేమో ..