29, ఏప్రిల్ 2013, సోమవారం

వ్రాయకుండా ఉండలేని వ్యసనం

ఛీ ఛీ .. ఏం మనుషులో ...?  మరీ ప్రేమ కి మొహం కి కామం కి తేడా తెలియకుండా బ్రతుకుతున్నారు

అని తిట్టు కుంటున్నాను . అంతలోనే ఊడి  పడింది  నా  స్నేహితురాలు  రమ .

ఏమిటి అన్ని ఛీ లు .. చీత్కారాలు ?  రోజూ అలాంటివి మాములేగా!  అంది

రోజూ ఏమిటి ?

అదే న్యూస్ పేపర్ లో విషయాలు .అంది

న్యూస్ పేపర్ పేరెత్తకు ..నాకు చిరాకు అన్నాను . మరి నీ చిరాకు ఎవరి మీదమ్మా ?

ఎవరి మీద కాదు తల్లీ .. కవిత్వం మీద అన్నాను

కవిత్వానికి ఏమైంది మీ బ్లాగులలో, పేస్ బుక్  లలో బాగానే వర్ధిల్లుతుంది కదా ! అంది .

అందుకే .. నా ఛీ చీలు చీత్కారాలు అని చెప్పాను

ఎందుకో ? మళ్ళీ ప్రశ్న

కవిత్వమా కాకరకాయా ? జనం పైత్యం అంతా వెళ్ళగ్రక్కుతున్నారు నాతొ సహా అన్నాను నాకు కూడా నా మీద కోపమే ! అసలు కవిత్వం రాయకపోతే ఏమిటి నష్టం ? అనుకుంటున్నాను  చెప్పాను

నీకు ఏమిటో అయింది ఆత్మానందస్వామి ఆవహించాడు అంది అనుమానంగా నన్ను చూస్తూ

కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అనుకుంటూ  కాస్త ఆ కళ  అబ్బిన వారిని  అందులో జీవం నింపగల్గిన  వారిని  ప్రోత్సహిస్తే పొయ్యేది  ఏముందిలే .. కాస్త కీ బోర్డ్ అరగడం తప్ప  అని అనుకుంటాను

మంచి కవిత్వం చదివినప్పుడు మాటలురాక స్పందన తెలుప మాటలు రాక మౌనంగా ఉండిపోతాను .ఇంకాస్త  మంచి  కవిత్వం చదివినప్పుడు మరణం అంటూ లేకుండా కవిత్వం చదువుతూనే ఉండాలనుకుంటాను ఇది నా పైత్యం

అలాంటిది నాకు విరక్తి కల్గుతుంది చెప్పాను ఏడుపు ముఖం తో ..

ప్రసూతి వైరాగ్యం లాగా నీకు కవిత్వ వైరాగ్యం బాగానే పట్టుకుందే!? అంది

కవిత్వం కి వస్తువు , అభివ్యక్తం, భాష ,శైలి, రూపం ఇవన్నీ లక్షణాలు

భావ సంపత్తిలో మునిగి తేలిపోతూ అందులో మమేక మయ్యేవాడే కవి

తనలో కలిగే రసానుభూతికి జీవితానుభూతిని అనుభవాన్ని కూడా జత పరచి కవిత్వం వ్రాస్తే దానికి అందం చందం  విశ్వతోముఖత్వం  అయిన కవిత్వం ని  ఆస్వాదించగల్గి నప్పుడే దానికి విలువ పెరుగుతుంది

ఆస్వాదన లేకుండా అసహ్యం కల్గె కవిత్వం వ్రాయడం ఎంత వరకు సమంజసం ? కమిట్మెంట్ ఉండాలి

అలా కాకుండా మనలో కల్గిన వికారాలన్నిటి కి కవిత్వమని పేరు పెట్టి  వక్రీకరించి  వాంతి కల్గించకూడదు

ఏదైనా గుప్పిట మూసి ఉంచితేనే అందం.  కావ్యాలలో ఉన్న అందం ఇప్పటి కవిత్వంకి రాదు లవ్ కి లస్ట్ కి తేడా తెలియని భావ ప్రకటన ని చీత్కరించుకుంటున్నాను అందుకే .. అన్నాను

నీకు చీత్కారం అయితే ఇంకొకరికి ఆనందం కావచ్చు . అలా వ్రాసి మమేకం అయ్యే వాళ్ళ సృష్టిని మార్చలేం నీ దృష్టి నే మార్చుకో తల్లీ  నీకసలే  ఆవేశం ఎక్కువ . ఇప్పుడు వాళ్ళు నీ కళ్ళ ముందు ఉంటే పొడిచి చంపేసే టట్లు ఉన్నావు  కాస్త శాంతించు అని అనునయంగా చెప్పింది

ఒక చల్లని నీళ్ళ బాటిల్ తెచ్చి నా ముందు పెట్టింది గట గట త్రాగేసి కాస్త శాంతపడ్డాను

మన రాతలే, ఇంకా చెప్పాలంటే  మన మాటలే మనకి విలువ తెచ్చి పెడతాయి. గుండెల్లో దైర్యం ఉంది కదా అని బట్టలు విప్పేసుకుని తిరగరు.   మనసైన వాడి పై మనసు ఉంది కదా అని అనువుకాని చోట విప్పేసుకోకూడదు. మోహం ఉంది కదా అని మోహమాట  పడకుండా పచ్చిగా వ్యక్తీకరించ తగదు

అమ్మని అయి ఉంటె నాలుగు పీకేదాన్ని, గురువు ని అయి ఉంటే  మంచిమాటలతో తప్పు తెలియజేసి ఉండేదాన్ని

చెలిని అయ్యి ఉంటె మంద లించే దాన్ని. ఏమి కానందుకు బాధపడుతున్నాను   చెప్పాను విచారంగా

"లోకంలో మంచి చెడు అన్నీ నీకే కావాలి .. నువ్వు మారవు"  అంది  రమ

అవును నాకే కావాలి  కనీసం ఒక మనిషి  అయినా మారాలి.  ఆ మార్పుని  నేను నా కళ్ళారా చూడాలి అది  నా కోరిక .. అని చెప్పాను

ఇంకా ఏమి లేవా .అని అడిగింది

ఎందుకు లేవు ఇలా వ్రాసినందుకు కొందరికి కడుపు మంట ఖాయం . నా మీద దండయాత్ర చేసినా ఆశ్చర్యపోను అన్నాను .

ఈ మద్య పేస్ బుక్ లో ఎవరో బాదపెట్టారు అన్నావు జాగ్రత్త ! అని చెప్పింది

  నేను ఊరుకుంటానా? అప్పుడు నాకు తివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొచ్చాడు అన్నాను

ఆయనెందుకు మధ్యలో అంది

చెప్తా విను .. అని

 ఇలా చెప్పాను నన్ను బాధపెట్టినవారికి

"బోల్డ్ గా ఉన్నానని కేరెక్టర్ లూస్ అనుకోకు .. నా జోలికి వస్తే తోక్కిపడేస్తాను , జాగ్రత్త "  అని

వామ్మో ! నీ జోలికి నేను రాను అంది భయంగా రమ

నవ్వేసాను హాయిగా ...

(నేను మాత్రం ఎవరి జోలికి రాలేదండొయ్ ! కవిత్వం అన్నది భ్రష్టు పట్టడం  చూసి కుమిలి కుమిలి కునారిల్లిపోతూ  ఏదో ఇలా వ్రాసుకున్నాను .అంతే నండీ అంతే !!)

వ్రాయలేకుండా ఉండటం ఒక వ్యసనం  కదా !  మంచిదో -చెడ్డదో!?

మన్నించుమా .. పాట  అప్రయత్నంగా గుర్తుకు వచ్చింది  ఈ మేటర్ కి ఆ పాట కి ఏదో లింక్ ఉందని నా మనసు చెపుతుంది మరి  ఆ రెండు హృదయాలకి అర్ధమైతే చాలును . 

27, ఏప్రిల్ 2013, శనివారం

నీడ



నీడ

ఎటు చూసినా నీడ నీటి సుడుల మధ్య నీడ
నీడన ఏ ఆలోచనా మొక్క మారాకు వెయ్యదే
ఎందుకంత కుంచించు పోతున్నట్లు ఉన్నా
ఆత్మనూన్యత ఊడల్లా విస్తరిస్తుందేమో....
ఈ నీడ  నన్ను వదలేమిటి
కాస్త స్వేచ్చగా మసలనివ్వదేమిటి
పరుగులు తీస్తున్నా వేటాడుతూనే ఉంది
నన్ను కావాలని కోరుకుంటుంది
నా పుట్టుకతో వచ్చిందా ఏమిటి?
నేను లేకుంటే జీవితామంతా శూన్యం గా తోస్తుందంటూ
మాయ మాటలు చెపుతుంది
ఎన్ని మాంత్రిక విద్యలు నేర్చింది !
వదులు నన్ను వదులు  అంటూ గిజుకుంటున్నా
వెంటాడే నీడ, వేటాడే నీడ
ఎంత క్రూరమైనది
నన్ను ప్రాణం లేని శిలని చేసింది
ఇంకో నీడ నన్ను ఆప్యాయంగా
ఆలింగనం చేసుకుంది
లిప్త కాలంలో  లోకం నుండి విడుదల చేసి
పదోన్నతి కల్గిస్తుంది
ఎంత మంచిదీ  ఈ నీడ
నా కన్నా ముందు నడుస్తూ
నన్ను వెంట బెట్టుకుని మరీ  తెసుకువెళుతుంది
బాధలు భయాలు లేని స్వేఛ్చా  లోకంలోకి
నన్ను చేయి పట్టి తీసుకువెళుతుంది
నేను వెళుతున్నా ..
నువ్వు రాకు .. అతి ప్రేమ నటించకు.




23, ఏప్రిల్ 2013, మంగళవారం

శిక్షకి శిక్ష రక్షణ శిక్ష



శిక్షకి శిక్ష  రక్షణ శిక్ష
పూలు, ఒళ్ళు ముళ్ళు ఎన్నాళ్ళీ పోలికలు
వార్తలు కథనాలు కవిత్వాలు నిరసనలు
మళ్ళీ  మాములేనా ?
నిత్యం ఇంతేనా?

కాషాయం ధరించి విశృంకలత్వం రాజ్యమేలుతుంది
విలువలెల్ల వలువ లూడి తెల్లబోవగా
ధర్మ చక్రం సాక్షిగా జాతి సింహాలు తలదించుకుంటున్నాయి
పచ్చందనంగా కాపాడాల్సిన  ఆడపడుచుల ఆక్రందనల వెల్లువతో
 ఈ అవని అగ్ని గోళంగా మారుతుంది

ఈ జాతికి సిగ్గు చీము నెత్తురు లేదని
ఈ జాతి పతాక  కూడా కాపాడలేదని
చేతకాని తనాన్ని చూసి తల్లి సిగ్గుతో తలదాచుకుంది  

 ఏమిచ్చి  కన్నాం ..   ఏమిచ్చి పోషించాము ?
మా రక్త మాంసాల ని ప్రాణంగా  మార్చుకున్న కీచక సంతతి లారా
మానవత్వ మనే పతాకని మోయడానికి ఎన్నని  కోల్పోతాం ?
మానమా ,మర్యాదా ,మన్ననా ?   .

ఎన్ని పాతకాలని జమచేసుకుంటున్నారు
ఎన్ని ఘాతకాలకి ఒడి గడుతున్నారు
చట్టాలు న్యాయ స్థానాలు
దిష్టి బొమ్మలుగా నిలిచిపోయాయేమో

ఆయుధాలు చెప్పట్టండి
చిట్టి తల్లులని ఆడ పడుచులని
కాపాడుకోవడానికి
తెగ నరకండి
అత్యాచారానికి పాలబడ్డ
మృగ మర్మాంగాన్ని కోసి పడేయండి
జీవన్మృతిని  చేయండి

శిక్షకి శిక్ష ఇది .. రక్షణ శిక్ష ఇది


19, ఏప్రిల్ 2013, శుక్రవారం

జాబిలి హృదయం







తెల్లవారు ఝామున ఐదు గంటల సమయం

గుంటూరు  పండ్ల మార్కెట్ అంతా కోలాహాలంగా ఉంది ఇతర రాష్ట్రాల నుండి పండ్ల లోడుతో వచ్చిన లారీలు రకరాకాల భాషలతో కలగా పులగంగా కలసిపోయిన హిందీ ఉర్దూ కలిపి మాట్లాడుకుంటున్న షాపుల వాళ్ళు ,దళారీలు  

అక్కడే మరికొన్ని లారీల నుండి సరుకును దిగుమతి చేస్తున్న ముఠా కూలీలు.  దించిన సరుకుకి రేటు నిర్ణయింఛి అటునుంచి ఆటే మినీ లారీల లోకి ఎక్కిస్తున్న చిన్న తరహా వ్యాపారులు.  వేడి వేడి కాఫీ, టీ  అంటూ  తిరిగే కుర్రాళ్ళు 

వాళ్ళందరి మధ్యనా  "మాధవా.. ఓ మాధవా ! ఎక్కడున్నావయ్యా వచ్చినావా! లేదా ? రెండు రోజులనుండి నీ బిడ్డ నీపై దిగులు పెట్టుకున్నాడు. అబ్బా జాన్, అబ్బాజాన్ అంటూ వీధి వాకిలి వైపు చేయి చూపుతున్నాడు. ఇటొచ్చి వీడిని  తీసుకుని సముదాయించు" అంటూ గుట్టగా పోసిన బత్తాయిల పైగా చూపును లోపలి సారించి మాధవ కోసం వెదికింది. తన పిలుపు విని మాధవా రాకుండా ఉంటాడా అన్నట్టు  నమ్మకంగా చూస్తుంది . 

"బాబీ, మాధవన్న ఈ రోజు కూడా సరుకు అన్లోడ్  కి రాలేదు. ఆయన పెద్ద కొడుకు,బావ మరిది వచ్చినారు, ఆళ్ళ నేమైనా కనుక్కోమందువా ? " అడిగాడు 

"వద్దొద్దు  ఆళ్ళని ఆరా తీసే పని నీకెందుకులే, కాస్త ఎండ పడ్డాక నేనే ఓ సారి ఇంటి వైపుకి పోయోస్తాను ఈ లోపు మీ మాధవన్న వస్తే నేను వచ్చి పోయానని చెప్పు మరసి పోకు "  వెళుతూ వెనక్కి తిరిగి  చూసు కుంటూ  చెప్పి పోయింది . . 

"ఏంటి కాజాబీ ! ఇంత పొద్దుటేలనే  మాధవ కోసం వెతుక్కుంటూన్నావ్? రాత్రేళ రాలేదా ఏమిటీ ? " అని పండ్ల బేరం చేసుకునే కాంతమ్మ హాస్యమాడింది 

"రాత్రేళ  నా కొంగున కట్టుకోవడానికి నేను బుద్ధిమాలినదాన్ని అనుకున్నావా? ఆయనకీ ఓ సంసారం ఉంది నలుగురు పిల్లలు ఉన్నారు  నిత్యం వాళ్ళ మంచి చెడు కనుక్కోడానికైనా ఆయన అక్కడ ఉండొద్దూ." అంటూ 

"రా షాపుకి పోదాం రేటేక్కువ చెప్పానని  నాతావున కొనకుండా పోతున్నావ్. పెట్టి ఒత్తున పడిన కాయలు,నిన్న మిగిలిన కాయలు కొనుక్కుపోయి ఎక్కువ లాభంకి అమ్ముకోవాలని చూస్తావు. నాసి రకం అంట గట్టి రెండోనాడు  యాపారం చేయడం కుదురుద్దా! " అంటూ ముందుకు నడుచుకుంటూ పోయింది 

"ఏం  మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతావు కాజాబీ, మరి అట్టాంటి దానివి ఆ మాధవ వల్లో  ఎట్టా బడ్డావో నాకు ఆశ్చర్యం  " అంది కాంతమ్మ 

"నేను ఆయన వల్ల్లొ పడ్డానో  నా వల్లో ఆయన పడ్డాడో కానీ ఎవరికీ ఎవరు అన్యాయం చేసుకోలేదు అందరూ బాగుండాలనే కదా అనుకుంటున్నాము " అంది   

"అన్యాయం జరిగింది నీకే గదా తల్లీ! ఆయన్ని కట్టుకుని నీ రాత ఏమన్నా మార్చుకున్నావా? ఎనకటికి మాదిరే పొద్దస్థమాను బేరం తప్పటలేదు కదా! అవతల మూడు షాపులున్నై లక్షలకి లక్షలు మిగుల్తున్నాయని చెప్పుకుంటున్నారు " అని రహస్యం చెప్పినట్టు తల వంచి కాజాబీ ముందు వంగి చెప్పింది . 

"జనం వెయ్యి సంపాదిస్తే పదివేలు సంపాదించాడని చెప్పుకుంటారు పదివేలు అప్పుంటే లక్షలు అప్పు ఉందని చాటింపేస్తారు జనం సంగతి నాకు తెలియందా ఏమిటి? ఈడు వచ్చిన కొడుకు చదువుసంధ్యలు ఒంటబట్టక గాలికి తిరుగుతున్నాడని వ్యాపారం నేర్చుకుంటాడని  ఒక షాప్, మాధవ  సంపాదించిది అంతా నేనెక్కడ జేరేసుకుపోతానో అని భయంతో  తమ్ముడిని కాపలా బెట్టింది  మా అక్క. ఆయన ఖాళీగా కూకుంటే ఎట్టా ?  ఇంత మందికి పని కావాలంటే అన్ని షాపులు కావద్దా!? పచ్చి సరుకు, వచ్చిన రోజు వస్తాది,పోయిన రోజులు పోతాయి నమ్మి యాపారం చేస్తున్నాం కానీ లక్షలు పోగేయ్యడానికి కాదు "  అని చెప్పింది 

 "కాజాబీ నీ సంగతి కదా నేను అడిగింది  ఆళ్ళ సంగతి ఎందుకు చెబుతావ్? ఆ మాధవ పై ఒక్క మాట పడనియ్యవు  . ఎంతైనా గొప్ప నవాబుల కుటుంబం లో పుట్టినదానివి . ఆ వాసనలు ఎక్కడికి పోతాయి " అంది.

 " ఆ ఏం నవాబు బతుకో ఏమోలే కాంతమ్మా , ఒకూరి రాజు ఇంకోకూరికి వెట్టాడు లెక్క అంట . మా అబ్బాజాన్ చెపుతూ ఉండేవాడు. పూలమ్మిన చోట కట్టేలమ్మలేక ఈ గుంటూరు నీళ్ళు ప్రాప్తం ఉండి ఈడకి వచ్చిపడ్డాం . అబ్బాజాన్ యాపారంలో కాస్త పుంజుకుని ఇల్లు కట్టాడో లేదో మాయదారి గుండెజబ్బు వచ్చి  చచ్చిపోయినాడు. ఎన్నడు గడప దాటని అమ్మి,చోటే బహెన్, అబ్బాజాన్ వైద్యానికి చేసిన అప్పులు తో బజారున పడబోయాం . మీ గుంటూరోళ్ళు వాములుని తినే సోములు ఎన్ని జిత్తులు వేసినారో  మా ఇల్లు కాజేసి మమ్మల్ని నిలవనీడ లేకుండా చేద్దామని. నేను చొరవ జేసి  మగాడిలా మార్కెట్ కి వచ్చి షాపులో కూకుండ బట్టి సరిపోయింది.  ఆ ఇల్లు నిలబడింది  ఇట్టా జనాలు మోసం జేస్తారనే  నేను చదువుకోకపోయినా బహెన్ ని గవర్నమెంట్ నౌకరీ  వచ్చిందాకా చదివిస్తిని  కదా " అని చెప్పింది.

వందల లెక్కన బత్తాయిలు లెక్కబెడుతూనే మంచి మంచి కాయలు  ఏరుకుంటూ  "ఇన్ని తెలిసిన దానివి, తెలివైన దానివి ఆ మాధవని ఎట్టా చేసుకున్నావే " అడిగింది

సమాధానం చెప్పకుండా  షాప్ లో గుమస్తాగా చేస్తున్న మనిషిని పిలుస్తూ    "ఒరె నరసింహా  ఈ పిల్లగాడిని తీసుకుపోయి అమ్మీ కాడ  వొదిలేసి రా. "నూర్" ని బడి కి పంపమని   చెప్పెసిరా, నేను ఈ రోజు ఇంటికి పోయేటట్లు లేదు " అని తన ఒడిలో ఉన్న చంటి పిల్లాడిని అతనికి ఇచ్చి పంపింది .

"మాధవ మంచి మనిషి కాంతమ్మా, అబ్బ జాన్ పోయినప్పుడు అప్పులాళ్ళు చుట్టేసినప్పుడు ఉన్నపళంగా ఆళ్ళు మాత్రం ఏడ నుండి తెచ్చి ఇస్తారు  అని  అందరికి సర్ది చెప్పాడు.  ఆడాళ్ళు , సూరీడు వెలుగు చూడనోళ్ళు ఉన్న ఇల్లొకటి అప్పుల కింద గట్టుకుంటే వాళ్ళేడకుపోయి బతుకారు అని జెప్పి  మాట సాయం చేసాడు. వాళ్ళు కట్టలేకపోతే నేను కడతాను అని హామీ ఇచ్చి పంపాడు. ఆయన మాటలో ఏం మత్తుందో, మంచితనముందో అందరూ సరే  అని తలలూపి పోయారు ఆయనకీ మాట రానిస్తామా చెప్పు.? ఈ మార్కెట్ లో మగాడిలా చెరిగి యాపారం చేసినా . మాధవతో నెలకోసారి అయినా మాట్టాటింది లేదు ఎప్పుడైనా ఎదురు పడితే పలకరింపు నవ్వొకటి నవ్వడమే. అప్పులోల్లకి   బాకీ డబ్బులు కట్టేటప్పుడు ఒకటి అరా మాట మాట్టడటమే ! ఆ పాటి దానికే గాలి కబుర్లు పుట్టాయి."

"మీ ఆయన ఆ తురక దాన్ని ఉంచుకున్నాడు  కదా! దాని అప్పులన్నీ ఆయనే తీరుస్తున్నాడట అని ఆ ఇల్లాలికి మోసేసినారు. ఆడాళ్ళు డబ్బులు  పోయినా ఊరుకుంటారు కాని మొగుడు పరాయి  దాని వైపు చూత్తే ఊరుకుంటారా?  మాధవ పెండ్లాం మా ఇంటికి వచ్చి నానా రచ్చ చేసి పోయింది చుట్టు ప్రక్కలోళ్ళ మధ్య తల ఎత్తుకోలేకపోయినాము.

ఉన్నపళంగా బయల్దేరి మార్కెట్ కి వచ్చి మాధవ షాప్ కి  బోయినా,  ఏమయ్యా! నీ ఇల్లాలికి అంత నోటి  దురుసు ఎందుకంట ? నీ మీద అంత అనుమానం ఏంటయ్యా ! సరే నన్ను అంటే అంది మొగుడు అనేటి  గౌరవం,  విలువ తెలియకుండా   అలా రోడ్డున బడి కూయడమేనా? ఏమైనా అనుమానాలు ఉంటె మీరు మీరు కూర్చుని మాట్లాడుకుని సర్దుకోవాలి అట్టా మామీద పడితే ఎట్టా అని తగువు పడ్డ. అతగాడు  ఒక నవ్వు నవ్వి జనం అనుకున్నదే నిజం చేసేద్దామా అని అడిగాడు. నాకు గుండె లటుక్కు మంది. నా మనసులో కూడా ఏ  మూలనో  ఆయనంటే  ఇష్టం ఉండబట్టేమో ఏమి మాటాడ లేకపోయా,  సిగ్గేసి అక్కడి నుండి పారిపోయి వచ్చేసా. తర్వాత మా ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందనిపించింది తప్పో ఒప్పో అనే ఆలోచన లేకుండానే మా మధ్యన  సంబంధం మొదలయ్యింది .

నూర్ కడుపున బడి ఆర్నెల్లు వచ్చిందాకా మా అమ్మీ కి కూడా తెలియదు. జనం అనుకుంటా ఉంటే  ఒట్టి కారు కూతలు  అనుకున్నాకదే ! పెళ్లి జేసుకోవే అంటే బహెన్ షాదీ అయినాకే అని జెప్పి నువ్వు ఇట్టా జేసినావే! నేను నలుగురిలో తలెత్తుకుని ఎట్టా బతకాలే! అని అమ్మీ మొత్తుకుంది  అబ్బాజాన్ ని తల్చుకుని  ఏడ్చింది

నేను దైర్యంగానే ఉన్నా ! మాధవ పెండ్లాం, ఆమె బంధువులు గోల చేసారు కిరాయి మనుషులబెట్టి  నన్ను చంపించబోయారు. అప్పుడు మాధవ కాజాబీ కి ఏమైనా అయితే నేను మీకు దక్కను అని. వాళ్లకి గట్టిగా చెప్పాడు .
షాదీ కాకుండా నేను ఏడూ నెలల కడుపెసుకుని తిరుగుతుంటే అమ్మ మంచానపట్టింది. మాధవ  అమరావతి గుళ్ళోకి పోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. ఆ సంగతి తెలిసిన  ఆళ్ళ జనం అంతా   గుడి కాడ  కాపేసారు. సంపాయించిన ఆస్తి ని తాత  ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మొత్తాన్ని ఆయన నలుగురు పిల్లల పేరున బలవంతంగా రాయించుకున్నారు. మీరు అడగక ముందే ఆ పని చేద్దామనుకున్నాను. మీరే మీ ఒంకర బుద్దులని బయట  పెట్టుకున్నారు అని జెప్పి ఆయన ఆ ఇంటిని ఒదిలేసి  ఒంటిగా నా ఎదురుగా  నిలబడ్డాడు

నేనేమైనా తక్కువ తిన్నానా?  నిన్ను నేను పెండ్లి చేసుకోవాలంటే నువ్వు ముసల్మాన్ మతం లోకి మారాలి మతం మార్చుకుంటే  పెండి చేసుకుంటా అని చెప్పినా మతం మార్చుకుంటే మూడు సార్లు  షాదీ  చేసుకోవచ్చని   ఉపాయం  చెప్పినా. మారు మాట్టాడకుండా మతం మార్చుకుని నన్ను మా పద్దతిలోనే షాదీ చేసుకున్నాడు. నాకోక విలువని పెంచాడు . ఆ క్షణానే నేను కాజాబీ అన్న సంగతే మర్చిపోయాను మాధవ పెండ్లాన్ని అయ్యాను.   మా ఇంట్లో   రాముడి పటం  కృష్ణుడి  పటం పెట్టి దణ్ణం పెట్టుకున్నాను

షాదీ అయిన రోజునే చెప్పాను మా ఇంట ఒక్క రోజు కూడా నిదర చేయవద్దు . రోజు మీ ఆవిడ,పిల్లలు ఉన్న ఇంటికే  పోవాలని.  నా కండ్లలోకి ఒకసారి చూసి  అలాగే జాబీ ! అన్నాడు నన్ను ఆయన జాబి, జాబిలీ అని పిలిచేవాడు.

 పెళ్ళి నాడు నేనన్న మాటని నేనెప్పుడూ మార్చలేదు,  ఆయన  కూడా  నేను గీసిన గీతని జవదాటలేదు ఆరేళ్ళు గడిచాయి ఆయన సంపాదనలో నేను చిల్లి కాణీ  కూడా ఎరగను ఏ పండగకో పిల్లలకి కొత్త బట్టలు తప్ప.   నేను యాపారం చేసుకునే నేను బతుకుతున్నాను, నా చెల్లెలికి షాదీ  చేసాను.

అయినా నాకు సొమ్ము పెట్టేస్తున్నాడని  ఆమె సాధింపులు మనుషులకి  మనసు అక్కర్లేదు, ఆమెకి.సొమ్ము కావాలి నగలు కావాలి, చుట్టపక్కాల  ఇంటికి వెళ్ళినప్పుడు మొగుడు కావాలి,. ఎప్పుడో ఒక రోజు ఆలస్యంగా వెళ్ళినా ఊరుకోదు సాపిచి సాపిచ్చి చెవులు మూస్తదని షాపులో పని చేసే గుమాస్తాలు చెపుతుంటారు. మాధవ ఏ రోజు కూడా ఇంటి దగ్గర ఇట్టా  జరిగిందని చెప్ప నే  చెప్పడు . చాలా గొప్ప మడిసి.  చెపుతూ చెపుతూ ఊపిరి తీసుకోవడానికి ఆగింది

 మా ఇద్దరి మధ్య పదిఏండ్లు   వయసు తేడా ఉంది అట్టాగే మేమిద్దరం మొగుడు పెండ్లాం అన్నమాటే కాని రోజు వదలకుండా  కావిలించుకుని పడుకున్నామా! ఇదిగో ఈ మార్కెట్లోనే కళ్ళ నిండా చూసుకుంటాం కరువు తీరా మాట్లాడుకుంటాం.  ఆయన ముప్పొద్దులా  నమాజ్ కి వెళితే నేను రోజు   దేవుడి పటాల ముందు దీపం  ఎలిగిస్తా    మా మతాలూ ఏరే కాని మేము మనుషులం  ఏరే కాదు అట్టాగే  మా మనసులు ఒకటే ! అంటూ ఆగిపోయింది గొంతులో దుఖం  అడ్డుపడి

కాంతమ్మ జాలిగా చూస్తూ ఉంది . " ఇదిగో మూడు రోజులైంది ఇంటికి వెళ్లి.  మొన్న రాలేదు, నిన్న రాలేదు, ఇయ్యాల రాలేదు. ఆయనని చూడకుంటే నాకు ముద్ద దిగదు.  నీళ్ళుఅయినా  మింగలేను. ఎందుకు రాలేదో గుబులుగా ఉంది. ముదనష్టపు దాన్ని నా కోసమే గదా  ఆయన ఎందరితో మాటలు పడ్డాడు. రోజు ఇంటికాడ గరళం మింగినట్టు ఎన్ని చేదు  విసయాలు మింగుతున్నాడో ! ఎందుకయ్యా అన్నేసి మాటలు పడతావు నన్నొదిలేసి పోలేవా అంటే  ఎన్ని  కష్టాలు అయినా భరిస్తా గాని   నిన్ను నట్టేట్లో ముంచేసి  ఒంటి మనిషిని చేయలేను జాబీ"  అంటాడు ఇక చెప్పలేక, ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చింది

" కాంతమ్మా ! లెక్క చూసి డబ్బు ఇచ్చేసి సరుకు తీసుకుని ఈడ నుండి బేగీ  పోమ్మా ,అక్కని ఇంకా ఏడిపించకు "చెప్పాడు  నరసింహ .

" కాజాబీ ! మనసు మల్లె పువ్వు లాంటిదమ్మ . నలిగినా వాసన ఎక్కడికి పోద్ది . మీ ఇద్దరు మంచాళ్ళు . మీ బాధలు భగవంతుండు చూస్తూంటాడు తొందరలోనే అన్ని సర్దుకుంటాయి నాలుగునాళ్ళు ఓర్చుకో తల్లీ ! నీకేమన్నా కష్టాలు కొత్తా!?  అంటూ రిక్షాలోకి సరుకు అంతా ఎత్తుకుంది. జాగ్రత్త తల్లి! బిడ్డలున్నారు ఆళ్ళ ముఖం చూసి ఓర్చుకో "  అని చెప్పి వెళ్ళింది.

కాంతమ్మ వెళ్ళాక కాజాబీ వచ్చి మార్కెట్ బయట ఉన్న చెట్టు క్రింద కూర్చుంది . అక్కడ నుండి చూస్తే మార్కెట్ కి వచ్చీ పోయే వాళ్ళు అందరూ కనబడతా ఉంటారు మాధవ ఇయ్యాలన్నా రాకుండా ఉంటాడా! తను రావాలి  నా కంటి నిండా చూసుకుంటే కాని మనసు నెమ్మది పడదు అనుకుంటుంది మళ్ళీ అంతలోనే ఇంట్లో అక్కేమైనా గొడవ పెట్టుకుందేమో ! మాధవ తనేపు  తొంగి చూడకుంటే తను పేనాలతో  ఉండగలదా? మనసులో మనసులా, శరీరంలో శరీరంలా కలిసిపోయాక ఆయన్ని చూడకుండా ఈ ఎడబాటు ని ఎట్టా తట్టుకునేది ? నా ప్రాణమే నువ్వయ్యా మాధవా ! ఒకసారి వచ్చి కనబడి పోకూడడా ఆణువణువూ ప్రేమ ఉప్పొంగగా మూగగా రోదిస్తూ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ కూసుంది. నరసింహ వచ్చి  ఎంత సేపు ఈడ కూసుంటావ్ ! రా అక్కా లోపటికి పోదాం " అనేదాకా వచ్చేదారివైపే చూస్తూ కూర్చుంది . నరసింహ  మరొకసారి పిలిచిన పిలుపుతో  ఈ లోకంలో పడి  నెమ్మదిగా లేచి షాప్ లోకి పోయి కూర్చుంది

మరునాడు కాంతమ్మ తెల్లవారుఝామున మార్కెట్ కి వచ్చేసరికి గేటు లోనే ఆమెకి కబురు అందించారు .
కాజాబీ చచ్చిపోయింది  అని." అయ్యో ! బిడ్డా  ఎంత పని చేసావే !"అనుకుంటూ కాంతమ్మ కూలబడింది ఆమెకి కాసిని నీళ్ళు తాపించి కూర్చో బెట్టారు

" అయ్యా, నేను ఆ బిడ్డని చూడాలి  వాళ్ళ ఇంటికి తీసుకుని పోండి "  అని అడిగింది . "వాళ్ళ ఇంటికాడ శవం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకు పోయారు  కాజాబీ అక్కడే చచ్చిపోయింది " చెప్పారు .

కాంతమ్మ హాస్పిటల్ కి వెళ్ళింది ఒళ్లంతా కాలిపోయి గుర్తు పట్టడానికి వీలు కాకుండా ఉన్న కాజబీ శవాన్ని చూసి పెద్ద పెట్టున ఏడ్చింది ." ఏం జరిగి ఉంటాదో ? నిన్నే కదా నేనన్ని మాటలు చెప్పి పోయాను  ఇంతలోనే మిత్తవ మింగి పోవాలా  " అని ఏడుస్తూ  అక్కడే ఉన్న నరసింహని   చూసి " ఏం  జరిగింది  నరసింహా"  అని అడిగింది .

నరసింహ చెప్పాడు  "మాధవ బావ కోసం మధ్యానం దాకా  ఎదురు చూసి ఇక ఆగలేక  ఆ ఇంటికి వెళ్ళింది . బావ పంచలోనే ఉయ్యాల  బల్లపై పడుకుని ఉండాడు. అక్కని చూసి లేచి కూర్చుని "నువ్వెందుకు వచ్చావు జాబీ " అని అడిగాడు

"నిన్ను చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడైనా ఉండానా ! రాయ్యా ! మార్కెట్ కి పోదాం " అని అక్క మాధవ బావ చెయ్యి పట్టుకుంది

అంతలో ఆయన భార్య వచ్చి  " ఆయన రాకపోయినా విడిచి పెట్టవా ?  నా కాపురానికి శనిలా దాపురించావ్, ఏం మందు పెట్టావో, ఏం  చేసినా నీయేపు చూడకుండా కట్టడి చేయలేకపోతున్నాం ఒంటి నిట్టాడిలా పాతుకుపోయావు కదే ! ఏళ్ళ తరబడి చూస్తూ ఊరుకుండి  పోయాం ఇక నీ ఆటలు సాగనీయం,  ఆయన ఇక మార్కెట్ వైపుకే రాడు.  నాగపూర్ లో ఆఫీస్ పెట్టాలి,  ఆయన అక్కడే ఉంటాడు నీ దారి నువ్వు చూసుకో లేదా ఇంకొకడిని తగులుకో " అని నానా మాటలంది.  మాధవ బావ కోపంగా  ఆమెపై చేయి ఎత్తాడు.  అక్క ఆ  చెయ్యట్టుకుని కొట్టకుండా  ఆపింది. ఆ చేయి పట్టుకునే  బావని బయటకి తీసుకు రాబోతుంటే "నువ్వు ఆ తురక దాని ఎమ్మట వెళితే నీ నలుగురు పిల్లలు చచ్చినంత ఒట్టే ! " అంది ఆమె .

అంతే ! మాధవ బావ చెయ్యి వదిలేసి అక్క  తిరిగి చూడకుండా  మార్కెట్ కి  వచ్చేసింది.

" బేరం చూసుకో నరసింహ"  అంటూ ఇంటికెల్లిపోయింది.  పోద్దుగూకేటప్పటికి  వంట ఇంట్లోకి పోయి ఒంటిపై  కిరసనాయిల్ పోసుకుని ఆగ్గి  అంటించుకుందట.   ఒళ్ళంతా కాలిపోయిన అక్కని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాక మాధవ బావ వచ్చాడు ఆయనని చూసాకే ప్రాణం వదిలింది. వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ జరిగింది  చెప్పాడు

"అయ్యో బిడ్డా ! ఎంత పని చేస్తివి ! నీ బిడ్డలకి ఇప్పుడు దిక్కెవరన్నది ఆలోచించలేకపోయావే " అంటూ కాంతమ్మ ఏడుస్తూ కూర్చుంది

హాస్పిటల్ వాళ్ళు  మాధవతో సంతకాలు పెట్టించుకుని  కాజాబి శవాన్ని  ఇచ్చారు . కాజాబీ శవాన్ని  ఇంటికి తీసుకు వచ్చారు. ఆమె తల్లి, చెల్లి దుఃఖాన్ని ఎవరు ఆపలేక పోతున్నారు. ఆ రోజు  మార్కెట్ జనం అంతా కాజాబీ ఇంటి ముందే ఉన్నారు.  మాట కొంచెం కఠినం కాని మనసు బంగారం ఏదో వాళ్ళ ఇద్దరికీ జనాల నోళ్ళలో పడి నానాలని  ఉంది కాబట్టి అలా జరిగిపోయింది. ఎప్పుడూ ఆ ఇంటి ఆమెకి ద్రోహం చేయాలని చూడలేదు అన్ని హంగులు అమర్చి పెట్టినా , ఆస్తులన్నీ రాయించుకున్నా కూడా ఇంకా ఏదో ఇచ్చేస్తున్నాడని అతనిని  దూరం చేయబోయారు, ఆమెకి కాజాబీ బిడ్డల ఉసురు తప్పకుండా తగుల్తుంది అని  మాధవ భార్యని శపించారు .

మాధవ పిల్లలిద్దరినీ ఒళ్ళో కూర్చో బెట్టుకుని  మౌనంగా కన్నీరు కారుస్తూనే ఉన్నాడు  కాజాబీ పుట్టినప్పటి నుండి ఆచరించిన వాళ్ళ మత సంప్రదాయం ప్రకారంగానే ఖననం చేసారు. అక్కడి నుండి ఇంటికి వచ్చి బిడ్డలని కాజాబీ అమ్మీ చేతిలో ఉంచి గోడకి వ్రేలాడ దీసిన ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు.   కాజాబీ అతను కలసి దిగిన ఫోటో  అది.

"జాబీ ! నువ్వు ఉన్నప్పుడే కాదు నువ్వు లేకుండా పోయాక కూడా నేను ఈ ఇంటిలో నిదర చేయడం లేదు ఆ ఇంటికే  వెళుతున్నాను నీకు ఇచ్చిన మాటని ఈ మాధవ ఎప్పుడూ దాటడు" అని చెప్పి  తల ఒంచుకుని వెళ్ళిపోయాడు. అది చూసిన కాజాబి అమ్మ చెల్లి మరింత ఏడ్చారు .

 తెల్లావారుతూనే కాజాబీ ఇంటికి వచ్చాడు మాధవ.  అక్కడ ఏమేమి  జరగాలో చూసుకుంటున్నాడు.  మతాచారం ప్రకారం  చేయాల్సిన విధులు అన్నీ ఏ లోటు లేకుండా చేయించడం చేస్తున్నాడు కానీ ఒక్కరితో కూడా మనసు విప్పి మాట్లాడ లేదు.ఎవరు ఏం  చెప్పినా మీ ఇష్టం, ఆలాగే చేద్దాం అంటూ ఉండేవాడు. మార్కెట్ జనం, తెలిసున్నవాళ్ళుపిల్లలని తన కూడా తీసుకు వెళతాడా లేదా అని ఎదురు చూస్తున్నారు.

కాంతమ్మ అయితే ముఖం మీదే అడిగేసింది  "మాధవా !  పిల్లలని ఏం  చేస్తావు  నువ్వే భాద్యత తీసుకోవాలి వాళ్లకి అన్యాయం చేయకు " అని హెచ్చరించింది  .

అలా నలబైరోజుల కార్యక్రమం  అయ్యేదాకా  మాధవ ప్రతి రోజు  కాజాబీ ఇంటికి వచ్చి వెళుతూనే ఉన్నాడు . నలబయ్యోనాడు అన్ని కార్యక్రమాలు అయిపోయి   అందరూ వెళ్ళిపోయాక బిడ్డ లిద్దరికీ తన చేతితో అన్నం తినిపించాడు . ఆ చేత్తో తను రెండు ముద్దలు తిన్నాడు. అలాగే కాజాబీ ఫొటోనే చూస్తూ జాబీ ! నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు కదూ నేను మాత్రం ఉంటాననుకున్నావా? అనుకుంటూ వరండాలో ఉన్న స్తంబానికి జారగిలబడ్డాడు. కాసేపటికి నరసింహ వచ్చి బావా! నీ కోసం మీ బామ్మర్ది వచ్చాడంటూ పిలిచాడు.  ఎంతకీ పలకని అతనిని కదిల్చి చూస్తే  చలనం లేదు.  అతని ప్రాణాలు ఎప్పుడో తన జాబీ ని వెదుక్కుంటూ వెదుక్కుంటూ వెళ్ళిపోయాయి .

కొన్ని మానసిక  బంధాలు అంతే! ఎవరు విడదీయలేనివి, అక్కని వెదుక్కుంటూ  బావ కూడా వెళ్ళిపోయాడు అని ఏడుస్తున్నాడు నరసింహ.

  (చిత్రం : శివ ఆర్ట్స్ .. కానూరు, విజయవాడ ) 

17, ఏప్రిల్ 2013, బుధవారం

పురస్కారాలు

విజయ నామ సంవత్సర మొదటి రోజున  సంప్రదాయంగా  "ఉగాది " పురస్కారాలు అందిస్తారు

చేసుకున్న వాడికి చేసుకున్నంత ఏమో కాని  దక్కించుకున్న వాడికి దక్కించు కున్నంత అనుకుంటాను నేను 

ఉగాది పురస్కారాలకి ఎంట్రీ పంప కూడదా  అని అడిగింది నా ఫ్రెండ్ ఒకరు .

"నాకు అంత అర్హత లేదు ఆసక్తి లేదు"  అన్నాను. 

"ఎదగాలనుకున్నవాడు ముందున్న వారిని తోసుకుని అయినా ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి"  అంది 

"ఎదగడం అంటే " .. అన్నాను

 "అదేనోయి సన్మానాలు చేయించుకోవడం,పురస్కారాలు అందుకోవడం లాంటివి వల్ల    వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి "అంది .

 "చేసిన వాళ్ళకా ! చేయించుకున్న వాళ్ళకా ?" మళ్ళీ నా ప్రశ్న . 

ఇదే నీతో వచ్చిన తంటా ..ఎడ్డెం  అంటే తెడ్డెం అంటావు ఏది సరిగా చెప్పనీయవు, వినవు అని విసుక్కుంది 

కోపం వచ్చేటట్లు ఉందనుకుని  లోలోపల తిట్టుకుంటూనే పైకి నవ్వు పులుముకుంటూ  "ఎవరికో చెప్పలేదు " అన్నాను .

 నా మాట పట్టించుకోకుండా జిల్లా స్థాయిలో "ఉగాది" పురస్కారాలకి ఎంపిక  చేస్తారు  కదా ! నువ్వు ఎంట్రీ పంపు  అంది 

మళ్ళీ అదే మాట అంటావు .. నాకుందా అర్హత !?

"   మరి నాకుందా  అర్హత ? అయినా నేను పంపడం లేదు"  అంది  

 అది నీకు అవసరమేమో ! నాకు ఇంటరెస్ట్ లేదు, వద్దు.  అదే కాదు కథల పోటీలు, కవితల పోటీలు ఇలాంటి వాటిలో కూడా నేను ఎప్పుడు పాల్గొనను నాకు ఆ సత్తా లేదని తెలుసు అన్నాను .. 

  రచయితల సంఘం లో కొందరు నీ పేరుని ప్రపోజ్ చేస్తే చాలు అంది నేను అలాగే పంపాను కదా . నేను చూడు ఉగాది పురస్కారం అందుకుంటాను అంది 

అర్హత లేకుండా లాబియింగ్ చేయించుకుని పురస్కారాలు అందుకోకపోతే ఏమి ? అన్నాను. 

కీర్తి కండూతి అభిలాష మేమేమి సన్యాసిని లేదా యోగిని లిమి  కాదు  కాస్త పేస్ బుక్ లాంటి సోషియల్  నెట్వర్క్ లలో షేర్ చేసుకుని కాసిని కామెంట్ లు మరి కొన్ని లైక్ లు కొట్టించుకోవాలి . అవసరమైతే మెయిన్ పేపర్ లోను, అధమస్తూ జిల్లా ఎడిషన్ లో నైనా ఫోటో రావాలి అప్పుడే కొంచెం సాహితీ సమావేశాలకి, సంగీత కార్యక్రమాలకి హాజరై నందుకు కళా హృదయులు,రచయితలూ , కవులు అన్న ట్యాగ్ వేసుకుని తిరగ వచ్చు అంది 

నువ్వు చెప్పిన బాపతే FB  లో కూడా చూసాను . నాలుగు కవితలు వ్రాశారో  లేదో పోయెట్  ఆర్  పొయెటేస్ అని ట్యాగ్ తగిలించుకుంటారు ఇక పురస్కారాలు, సన్మానాలప్పుడు తీసిన ఫోటోలని అక్కడ  పోస్ట్ చేస్తుంటారు . 

కొంత మందిని చూస్తే జాలి వేస్తుంది.  కవి శివారెడ్డి గారి ప్రక్కన కూర్చుని ఉంటారు వారితో మాట్లాడతారు మీ అంతటి కవితో పరిచయం కల్గినందుకు ధన్యుడిని అయ్యానంటారు 

నా కవిత్వంలో ఏ కవిత నచ్చింది మీకు అనడిగితే  తడబడతారు . మీ గురించి విన్నానండి  అంతే ఇంకా చదవలేదు అంటారు . "సరే చదివి చెప్పండి "అంటారు ఆయన 

" ఎంత మంచి కవితలు ఉన్నా చెత్త కవితలకి బహుమతులు ఎందుకు వస్తాయో, సన్మానాలు ఎందుకు జరుగుతాయో,   పనికట్టుకుని కొంత మందిని  పెట్టుకుని ప్రచురణ కర్తలు పదే  పదే  ఎందుకు  సమీక్షలు చేయిస్తారో, అలాగే ఇష్టం లేని వాళ్ళ రచనలని  చెత్తగా ఉన్నాయని సమీక్షలు రాయిస్తారో అన్నీ తెలుసు నాకు 

పొగిడి నట్టే  పొగుడుతారు,  లోలోపల  గోతులు తీస్తారు .  వెన్నుపోటు పొడుస్తారు  సత్తా లేకపోయినా  ఆదరా బదరా అందలం ఎక్కించాలని చూస్తారు కుల,మత ప్రాతిపదిక పైన  నిచ్చేనలేసి ఎక్కిస్తారు

నువ్వు ఎప్పుడు వినలేదా  సాహితీ రంగం లోను ఎన్నో రాజకీయాలు  ఉంటాయి.  కావలసినవాడు అనుకుంటే అట్టడుగున ఉన్నా ఏడంతస్తుల మేడలో కూర్చో బెడతారు అని చెపుతూ...    ఇదంతా  నీ మీద అక్కసుతోనూ  లేదా ఈర్ష్య తోనూ ఈ మాట  చెప్పడం లేదు నువ్వు అవునన్నా కాదన్నా ఇది నిజం.  మన బెజవాడ లోనే ఇలాంటివి  ఎన్నో చూసాను "  అన్నాను  నేను

అర్ధం అయింది అంటూ ... అవును నువ్వు రెండేళ్ళ పై నుండే బ్లాగ్ వ్రాస్తున్నావ్!  ఎన్నో మంచి వ్యాసాలూ,కథలు ,కవితలు ఉన్నాయి  ఇంత వరకు నీ బ్లాగ్ గురించి  ఈనాడు, ఆంద్ర జ్యోతి, సాక్షి ఆఖరికి ఆంద్ర భూమి, ఆంద్రప్రభ లాంటి వాటిల్లోనూ ఇంకా  చిన్న చిన్న పత్రికలలో కూడా నీ బ్లాగ్ పరిచయం  ఎందుకు రాలేదు?  అంది 

నా ఫ్రెండ్ వి కాబట్టి  ఇదంతా నీకు ఆశ్చర్యం . నాకు ఆశ్చర్యం లేదు,  ఎందుకంటే నాకు పత్రికల లో పనిచేసేవారిలో స్నేహితులు ఎవరూ లేరు కాబట్టి  అన్నాను 

అంతే నంటావా  !  అడిగింది అనుమానంగా . ముమ్మాటికి అంతే ! .అన్నాను 

ఇప్పటికీ  అయినా నేను చెప్పినట్టు విను నలుగురి దృష్టిలో పడతావు అంది.   తల అడ్డంగా ఊపాను ." నీ ఖర్మ " అని వెళ్ళిపోయింది 

 అంతలా వాదించిన ఆమె  ఉగాది పురస్కారం అందుకుంది.  ఎందుకంటే ఎవరు చదవని చూడని నాలుగు పుస్తకాలు అచ్చు  వేయించుకున్నందుకు. రేపో మాపో  ఆ ఫోటో పట్టుకొచ్చి నా FB  లో షేర్ చేయమని  ఇచ్చినా ఆశ్చర్యపడను . అందండీ సంగతి. 

నేటి సాహితీ వాతావరణం లో మోసేవాళ్ళు ఉంటె చాలు తెల్లవారేటప్పటికి మంచి రచయిత్రి or  రచయిత అయిపోతారు 

అది సత్యం . నేను కూడా రాసే సత్తా లేకపోయినా నలుగురు మోసేవాళ్ళ ని  పెట్టుకోవాలి అనుకుంటున్నాను :) 

ఇంకో విషయం చెప్పనా !

అనర్హులకి సన్మానం చేస్తుంటే చూసి నాకు కళ్ళు కడుపు కూడా మండిపోతాయి వాళ్ళకి వేసే దండలు సన్మాన పత్రాలు  అందించడం చూస్తే అవన్నీ చెప్పులు,  చేటలు, కుళ్ళిపోయిన కోడి గుడ్లు వేసినట్లు ఉంటాయి  మరి. 


16, ఏప్రిల్ 2013, మంగళవారం

స్త్రీల కవిత్వం లో ఏం ఉంటుంది?




 "స్త్రీలకి  ఏమి తెలియదు వాళ్ళేమి వ్రాస్తారు పురుష ద్వేషం ప్రకటించడం తప్ప" అనుకుంటారు

నేను చెపుతున్నాను స్త్రీలకి అన్ని తెలుసు .ప్రపంచ పటంలో మనం ఎక్కడ ఉన్నాం? మన  చుట్టూ ప్రపంచం  ఎలా  ఉందో !?  అన్నది కూడా  బాగా తెలుసు.

ముఖ్యంగా స్త్రీలు వ్రాసే కవిత్వం గమనిస్తే అర్ధం చేసుకోవాల్సింది చాలా ఉంది.  వారు వారి కవిత్వంలో దార్శనికతని ప్రతిబింబిస్తున్నారు వంటిల్లు గోడలు దాటి అతరిక్షంలోను ప్రయాణించి ఈ రెండింటి మధ్య స్త్రీలు అన్న కారణంగా చూపబడుతున్న వివక్షని, చిన్న చూపుని గమనిస్తున్నారు, గర్హిస్తున్నారు

పురుషులతో  పోలిస్తే ఎంతోకొంత కాదు బాగానే సగభాగం ప్రగతిలో వారి ప్రమేయం ఉంది కానీ పురుషులు కి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు స్త్రీలకి ఉన్నాయి అవి కాకుండా స్త్రీలకి ప్రత్యేక  సమస్యలు  ఉన్నాయి అందుకనే స్త్రీల కవిత్వంలో ప్రత్యేకంగా వారి సమస్యలని చెప్పాలనే ప్రయత్నం జరుగుతుంటుంది

ఆ సమస్యలు కేవలం స్త్రీల సమస్యలే కాదు ప్రతి ఒక్కరి సమస్య ప్రతి కుటుంబంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్య

స్త్రీలు వ్రాసే కవిత్వంలో సున్నితత్వమే కాదు తెంపరితనం ఉంది అక్కసు ఉంది సమస్య వ్యక్తీకరించే దశలో ఆవేదన ఉంది,ఆక్రోశం ఉంది. వారి కవిత్వంలో ద్వేషం ఉంది.ఎందుకంటే  వారు ఎదుర్కుంటున్న సమస్యలు అనేకం.  లింగ వివక్ష, .కుటుంబ  హింస,లైంగిక వేదింపులు,ఇంటా-బయటా చాకిరి, ఆధునికత పేరిట గాడి తప్పి చేజేతులా సమస్యలు కొని తెచ్చుకోవడం లాంటివి చాలా ఉన్నాయి   వాటిని గుర్తించ గల్గిన అర్ధం చేసుకోగలిన పురుష సహకారం ఉంది. అయినప్ప టికీ స్త్రీలు వ్రాసిన కవిత్వాన్ని ఎగతాళి చేస్తున్న కొంత మందిని చూస్తున్నాం అతర్జాలంలో చాలా చోట్ల  గమనించాను కూడా.

స్త్రీల పట్ల సమదృష్టి రావాలి  సమైక్య భావన రావాలి. స్త్రీలు  గమనిస్తున్నారు   వాళ్ళని ప్రత్యేకంగా విడకొట్టి వారి వ్రాసే కవిత్వాన్ని కించపరచడం చేస్తున్నారు. పెద్దలు,మిత్రులు స్త్రీల కవిత్వంలో ఉండే చిన్న చిన్న లోపాలని మీ మీ సలహాలతో సరిదిద్దండి.  మీరు వ్రాస్తున్నది అసలు కవిత్వమే కాదు అన్నట్టు చూడకండి  గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే దశలోనే  స్త్రీల కవిత్వం ఉందనుకుంటే   ఆ అభిప్రాయం బలంగా ఉంటె స్త్రీలకి తెలుసుకునే అవకాశం కల్పించండి వ్యాసం అయినా కవిత్వం గా మారడానికి కవిసంగమం లో చోటు ఉంది కదా! ఒకప్పుడు పత్రికలలో ప్రచురింప బడ్డ  కవిత్వంలో అవసరమైనంత సవరణలు జరిగి ఉండేవేమో !   బహుశా అందులో లోపాలు కనిపించేవి కావు కానీ అతర్జాలంలో  కవిత్వం ని ఎవరికీ వారు ప్రచురించుకోవడం అనే సౌలభ్యం వల్ల అందులో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటున్నాయి కూడా .

ఇంకొక విషయం ఏమిటంటే సద్విమర్శ ని స్వీకరించాలి  కావాలని చేసే విమర్శలని వదిలేసేయాలి. అత్యుత్సాహంతో ప్రతి అనుభవాన్ని కవిత్వీకరించే కంటే  గాడానుభూతితో,హృదయ స్పందనతో కవిత్వరీకిస్తే ఆ కవిత్వం కి జీవం వస్తుంది ఎన్ని కవితలు వ్రాసాము అనేది లెక్క కాదు కవిత్వం ఆలోచనల్లో ఎంత నానితే అంత క్లుప్తంగా ఉంటుంది అంత లోతుగా ఉంటుంది

ప్రాస కోసం ప్రాకులాడకుండా హృదయం తో స్పందిన్చినప్పుడే కవిత్వం రావాలి ఆ కవిత్వమే దీటుగా నిలుస్తుంది, గీటు  రాయిగా మారుతుంది అని తెలుసు కుందాం

 "కవిసంగమం"  ఈ లింక్

కవిత్వం చదవాలి ,వ్రాయాలి అన్న ఉత్సాహం ఉన్నవారు Facebook  గ్రూఫ్ లలో కవిసంగమం  అనే గ్రూపు లో జాయిన్ అయి కవిత్వం ని ఆస్వాదించవచ్చు

 వ్యాస కర్త : తాతినేని వనజ

( విజయవాడ ఎక్స్ రే  వారి  "నెల నెలా వెన్నెల"  వేదికని ఏడు సంవత్సరాలపాటు  నిర్వహించిన అనుభవంతో వ్రాసిన వ్యాసం )

14, ఏప్రిల్ 2013, ఆదివారం

పరధ్యానం ..

పరధ్యానం .. ఈ మాట కి అసలు అర్ధం ఏమిటీ అని నాకు ఎన్నోసార్లు  అనుమానం వస్తుంది పరుల గురించి ధ్యానమా లేక వేరే విషయాలని ఆలోచిస్తూ అసలు విషయాన్ని పట్టించుకోకుండా  నిర్లక్ష్యంగా ఉండటమో కాని పరధ్యానం గా ఉంటానని  నా పై  ముద్ర పడిపోయింది

మొన్నీ మధ్య మా చెల్లెలు పుట్టిన రోజు వచ్చింది .. ఫలానా తేదీ చెల్లి పుట్టిన రోజు అని గుర్తే కాని ఆ రోజు వచ్చేసరికి మర్చి పోయాను చెల్లి ఆఫీస్ కి వెళుతూ వాళ్ళ ఇంటి తాళం ఇచ్చి వెళ్ళింది . నేను మధ్యహ్నసమయంలో చెల్లి వాళ్ళ అమ్మాయి "అప్పు" ని కాలేజ్ నుండి పర్మిషన్ తీసుకుని ఇంటికి తీసుకు రావాలి అదే రోజు సాయంత్రం ఆ పిల్లకి కంటి ఆసుపత్రిలో చూపించడానికి అపాయింట్మెంట్ తీసుకుని ఉంది.  చెల్లి ఆ  విషయమే చెప్పి " అక్కా  అమ్మాయిని తీసుకు రా " అని చెపి హడావిడిగా వెళ్ళిపోయింది 

కాసేపటి తర్వాత నా మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటే ఒక మెసేజ్ నాకోసం కూర్చుని ఉంది ఫ్రెండ్  ఒకరు ఈ రోజు చెల్లి పుట్టిన రోజు విష్ చేసారా? బ్లెస్సింగ్స్ ఇచ్చారా .? అని .. మళ్ళీ అంతలోనే అన్నయ్య  నుండి ఫోన్ కాల్. అమ్మా ! ఈ రోజు చెల్లి పుట్టినరోజు విష్ చేసావా? అని 

అన్నాయ్ ! గుర్తులేదు అన్నాను కొంచెం దిగులుగా.  ఎప్పుడు ఏదో పరధ్యానం లో ఉంటావు ,ఇప్పుడన్నా విష్ చేయి తను ఫీల్ అవుతుంది అన్నాడు  అన్నయ్య . ఆ మాటకి నిజంగానే  చెల్లి  ఫీల్ అయ్యిందేమో అని  బాధ కల్గింది. అయ్యో ! నా మతి మరపు మండి పోను అని అనుకుంటూ 

చెల్లికి రింగ్ చేసాను విషెస్ చెపుతుంటే వినకుండానే అన్నయ్య కాల్ చేసి గుర్తు చేసాడా అని అడిగింది సిగ్గేసింది 
అసలు నా వంకే చూడలేదు నువ్వు నేను క్రొత్త చీర కట్టుకున్నాను,సరి కొత్త నగలు పెట్టుకున్నాను  నువ్వు ఎక్కడో పరధ్యానంలో ఉన్నావు అని చెప్పింది 

అవన్నీ పట్టించుకోలేదు అని చెప్పి కాస్త సంజాయిషీ ఇచ్చి విష్ చేసి కాల్ కట్ చేసుకున్నాను 

ఎక్కడ ఆలోచిస్తున్నాను  నిజంగా పరధ్యానం లో ఉన్నానేమో ! ఈ పరధ్యానం అనే మాట ఒకసారి మా అత్తమ్మ నోటి వెంట వినగానే అప్పుడు తెగ బాధ పడిపోయాను ఇదేవిటీ ఈవిడ ఇలా అంటారు ? నేను పరద్యానం లో ఉండట మేమిటీ  అని నానా రకాలుగా అర్ధాలు తీసుకుని తెగ బాధ పడిపోయాను కూడా. 

నేను చాలా విషయాలని బాగా గుర్తు పెట్టుకుంటాను . కానీ బాహ్య ప్రపంచంలో నా చుట్టూ జరుగుతున్న విషయాలలో నేను ఆసక్తి చూపను ఎప్పుడు కూడా అమ్మలక్కల కబుర్లు, చీరలు వాళ్ళు కొనుక్కున్న వస్తువులు  గట్రా  వాటి పై దృష్టి పెట్టను అంత ప్రాముఖ్యత ఇవ్వను అవసరం అయితే తప్ప. లేదా వాళ్ళంతట వాళ్ళు  చెపితే తప్ప నేను జోక్యం చేసుకోను అది నాపాలసీ 

ఇక ఆప్తుల పుట్టిన రోజు పెళ్లి రోజులు లాంటివి కూడా గుర్తు పెట్టుకోను మనుషులపై ప్రేమాభిమానాలు ముఖ్యం కాని పలానా తేదీనే వాళ్ళని విష్ చేయాలి దీవెనలు ఇవ్వాలి అనేది  నాకు అంత  గుర్తు ఉండదు కూడా .(నా కొడుకు పుట్టిన రోజు తప్ప )   

పండుగలు,  జాతీయ పర్వదినాలు వస్తే విష్ చేయడం అంటే నాకు చిరాకు . ఈ ఫోన్ లు వచ్చాక టింగ్ టింగ్ అన్న మెసేజెస్, సూర్యుడికన్నా ముందే లేచి పోటీ పడుతూ చెప్పే పండుగ విషెస్ అంటే నాకు పరమ రోతేసి  పోయాయి 
నాలుగేళ్ల నుండి జనవరి ఒకటి వస్తే  ముందు రోజు నుండే మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి,లాండ్ లైన్ సైలెంట్ మోడ్ లో పెట్టి 2వ తేదీ మధ్యాహ్నం వాటికి మోక్షం కల్గిస్తాను 

ఇక బ్లాగులలో అందరూ విషెస్ చెపుతుంటే మనం కూడా ఒక విషెస్ పోస్ట్ రాసి పడేస్తే అందరికి విష్ చేసినట్లు ఉంటుంది అందరూ విష్ చేస్తే మనం చేయాలి కదా తప్పదు కదా .అనుకుంటూ ఒక పోస్ట్ రాసి బాధగా, బరువుగా బదులు తీర్చుకుంటాను (దయ చేసి నొచ్చుకోవద్దు ) 

అసలు పండగ అంటే ఏమిటీ !? మనం మన చుట్టుప్రక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం  అంతే కదా!అప్పుడే పండగ . నన్ను నేను చూసుకున్నా నా చుట్టూ ప్రక్కల వారిని చూసినా ఆ పండగ పూట ఆనందమే కనబడదు నాకు.ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని పండగ కి కావాల్సిన చేసుకోవాల్సిన పిండి వంటలు చేయడం అన్నీ అదొక అదనపు పని.  చాకిరి తో అలసి పోయి ఉంటాం ..ఈ మొహాలకి సంతోషం వస్తుందంటారా? 

 ఎలాంటి ప్రమోదం కల్గించని ఇలాంటి ప్రమాదకర ఆలోచనలు నావి. ఎప్పుడూ ఏ పుస్తకం  చదువుదామా , ఏ పాటని ఎవరు లేని ఏకాంతంలో వింటూ ఆహా,ఓహో అని ఆస్వాదిద్దామ్మా , ఏ ఫ్రెండ్ తో బాతాఖానీ కొడదామా అనే ఆలోచన తప్ప ఇంకా ఏవి పట్టవు గీకినదే గీకి, తోమినదే తోమి, తుడిచినదే  తుడిచి, సర్ది సర్ది లాంటి పనులు అసలు చేయలేను. 

 ఇంకా చెప్పాలంటే మా ఇంటి చుట్టుప్రక్కల వారిలాగా ఒకోకరు నాలుగేసి ఐదేసి రోజులపాటు కష్టపడి చెమటోడ్చి ఆనందంగా వడియాలు పట్టటాలు నావల్ల కాదు   వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు నన్ను అసలు హెల్ప్ కి కూడా పిలవరుమరి.  పిలవనందుకు కొన్ని ధన్యవ్వాదములు చెప్పేసి ... కూరలలో నూనె తగ్గించుకుని వడియాలు ప్లేటుల నిండా పెట్టుకుని  డైటింగ్ పాటించే బంగారు తల్లులు మీరు  అని వాళ్ళ ముందే చెప్పి నవ్వేసి వస్తాను  ఈ వంటిల్లు జైలు తప్పదేమిటీ  భగవంతుడా  అని ప్రార్దిస్తూ , నన్ను నేను తిట్టుకుంటూ ఉంటానా? మళ్ళీ  ఈ వడియాల ప్రహసనాలు కూడానా అవి తెగ బాధ పడిపోవడం నా  లక్షణం   

 రెండేళ్ళ నుండి ఇంకో పని పడింది కదా! మీ అందరికి తెలిసిన వ్యాపకమే లెండి .. మనం చూస్తున్న వింటున్న మన అనుభవపూర్వకమైన  విషయాన్ని  ఒక వ్యాసంగా రాస్తే ఎలా ఉంటుంది ఎలాంటి ఎత్తుగడతో మొదలు పెడితే బావుంటుంది విషయ అవగాహన కల్పించాలంటే ఏ విషయాలు చర్చల్లోకి రావాలి  అనే ఆలోచన చేస్తూ ఉంటాను అన్నమాట .  మా ఫ్రెండ్ ఒకరు నేను అసలు కాల్ చేయడంలేదని కోపం వచ్చి నా నంబర్ డిలీట్ చేసేసానని ఇంకో ఫ్రెండ్ తో చెపుతుంటే విన్నాను కానీ  నేను అదే సమయంలో వాళ్ళని తలుచుకుని వాళ్లకి ఈ పాట  చాలా ఇష్టం అని చెపుతుంటేనే వింటూ   తను వారికి కాల్ చేసింది  ఆ విషయం వారికి తెలియదు కదా !

నిజంగా ఈ బ్లాగ్ వ్రాయడం అనే హాబీ  వల్ల నన్ను  నేను చాల మందికి దూరం చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారు   నేనైతే అలా కాదనుకుంటాను " ఇది నా పర్సనల్ స్పేస్ " ఇక్కడ నేను అనుకున్నట్లు ఉంటాను ఇక్కడ వ్రాసినట్లు నేను జన బాహుళ్యంలో ఉండలేను అక్కడ ఎవరు నొచ్చుకోకుండా ఎవరిని విమర్శించకుండా ఇతరుల కోసం నటిస్తూ బ్రతకాలి ఇక్కడ అలా అవసరం లేదు " అని నేను అనుకుంటాను వ్రాసుకోవడం అనే నాకత్యంత ఇష్టమైన వ్యాపకం ని కుతి తీరా అనుభవిస్తున్నాను.  అందుకోసమే   నా పరధ్యానం. 

ఒక వారం రోజులుగా అలా ఆలోచిస్తూ బ్లాగ్ వైపు కూడా తొంగి చూడలేదు . కొన్ని వ్రాతలు వ్రాసాను కొన్ని స్పందనల్ని కొన్ని జీవితాలని అక్షరీకరించాను  నిజంగా అవన్నీ నా తాయిలాలు . వాటిని చూస్తే నాకు చాలా సంతోషం వాటిని నలుగురికి పంచాలనే ఆశ 

పరధ్యానం అని ఎవరన్నా అంటే నాకు భలే కోపం వస్తూ ఉంటుంది. నాలుగునాళ్ళ  క్రితం "తాయిలం" దాపెట్టి వచ్చాను  మొన్ననే  ఫెమినిస్ట్ "ధాన్యమాలి" ని పైర్ బ్రాండ్  చేసి వదిలాను నిన్ననే "జాబిలి  హృదయం" వ్రాస్తూ బాధలో తడసి ముద్దయి పోయాను ఇందాకనే "కవులమ్మ "కథ చదివి కరిగి నీరై పోయి వచ్చాను. 

ఇలా అందరూ ఇలాగే ఉండాలని చెప్పడం లేదు ఇతరుల గురించి అతి ఆసక్తి మానుకుని స్పందించాల్సిన వాటికి స్పందించి, అభిమానము  చూపాల్సిన చోట అభిమానం ప్రకటించి,  భాద్యత వహించాల్సిన చోట భాద్యత వహిస్తే .  చాలు . 

మనం పుట్టినరోజులు, పెళ్లి రోజులు,  పండుగలు లాంటి వాటికి  అధిక  ప్రాధాన్యత ఇచ్చి విషెస్ చెప్పకుంటే మాత్రం ఏమవుతుంది  చెప్పుకోకపోయినా కొంపలు మునిగి పోవు కదా ! ఇక్కడ ఫోన్ కాల్  ఖర్చుకు వెనుకాడి కాదు,వ్యక్తుల పట్ల అభిమానమ లేక కాదు  

( పండగ రోజున ... ఎప్పుడు నేనే విష్ చేస్తాను నీకు అవన్నీ పట్టవు అన్న నా ఫ్రెండ్ రమ కోసం  ఈ కోపావేశాల పోస్ట్ కోపంలో నిజాలు బయటకి వస్తాయి కదా ! ) 

ఫ్రెండ్స్ ..పరధ్యానం గా  ఉన్నవాళ్ళు ఇలా ఉంటారట...  ఒక వ్యాసంలో చూసి వచ్చాను లింక్ లో చూడగలరు 

 పరధ్యానంగా ఉన్నవారిని అంత తేలికగా తీసిపారేయడానికి వీలులేదు. వీరు...సున్నిత స్వభావులై, కళాత్మక హృదయం కలవారై ఉంటారు. ఎక్కువగా ఊహల్లో వివరిస్తుంటారు. చిత్రకారులు, రైటర్లు.. ఈ కోవకు చెందుతారు. తాము చేయబోయే పనిని రకరకాలుగా ఆలోచిస్తూ, ఊహించుకుంటూ, తమలో తాము మాట్లాడుకుంటూ ఉండటం వల్ల దైనందని జీవితంలో చుట్టుపక్కల వారిని పట్టించుకోరు. చాలా మెతకగా, నెమ్మదస్తులై ఉంటారు. రకరకాల కాంపిటిషన్స్‌లో పాల్గొనాలనే ఉత్సాహాన్ని చూపరు. పైగా వీటికి చాలా దూరంగా ఉంటారు. .

వారిని మీరు కూడా ఏమి అనకూడదని .. కోరుకుంటూ  :) హమ్మయ్య నేను అయితే ఇప్పుడు రైటర్ ని అన్నమాట. ఒక సందేహం తీరిపోయింది 

10, ఏప్రిల్ 2013, బుధవారం

విజయమా వర్ధిల్లు ..!!

విజయమా వర్ధిల్లు ..!!

నిజమేనండి! అందరూ  కోరుకునేది  అదే కదా!  అలా అని అపజయాలు ఉండకూడదు అని అనుకోకూడదు కూడా
ఎవరైనా అపజయం బారిన పడకుండా విజయశిఖరాలని అధిరోహించ గలరా ?
కష్టం వస్తేనే కదా గుండె దిటవు తెలిసేది అని పరీక్షించుకుంటూ విజయం ని ఆకాంక్షిస్తాము

అందులో  "విజయనామ " సంవత్సరంలో అడుగిడబోతున్నాం.. అందుకే విజయమా ! వర్ధిల్లు అని మనసారా ఆకాంక్షిస్తూ ..  విజయ నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలు తెలుపుతూ

మన అందరికి ముఖ్యంగా ఆంధ్రులకి కరంట్ కష్టాలు తీరాలని ,  వర్షాలు బాగా కురియాలని , పంటలు సంవృద్దిగా పండాలని. అలాగే దేశ రాజకీయాలు కూడా బాగా పండాలని,  కొన్ని చెడు తలంపులు పండిన ఆకులు రాలినట్లు రాలి పోవాలని , ప్రేమాభిమానాలు చివురులు వేయాలని,  బ్లాగ్ ప్రపంచం కూడా కుట్రలు కుయుక్తులు, వ్యంగం లేకుండా .. భీకర ,బీభత్స,రౌద్ర రసములు మినహాయించి  మిగిలిన ఆరు రసములు కరుణ ,శాంత ,వీర,హాస్య ,అద్భుత,శృంగార రసముల సమ్మేళితమై అలరారాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ ..

నాకెంతో ఇష్టమైన  ఏటి దాపుల తోట లోపల 

పాటని వినేయండి

మిత్రులందరికీ ... విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు



6, ఏప్రిల్ 2013, శనివారం

ఓ .. ఆత్మీయ ముఖపరిచయం (కష్టేఫలే )

ప్రతి మనిషి  జీవితం లోను  అనేకానేక పరిచయాలు ఉంటాయి   

కొంతమంది మన ప్రక్కనే నివశిస్తున్నప్పటికి కూడా పరిచయస్తులగానే  మిగిలి పోతుంటారు 

మరికొంతమంది ముఖపరిచయం లేకున్నా సరే ఆత్మీయులుగా మారిపోతుంటారు

అలా అభిమానం తో ఎప్పుడైనా  మన అభిమానించే వారిని కలిసే అవకాశం వస్తే అసలు వదులుకోం కదా !

ఈ మధ్య నేను కాకినాడ వైపు వరుసగా మూడుసార్లు వెళ్ళాను ఇక్కడే ఎక్కడో మన బ్లాగ్ ఫ్రెండ్ ఉన్నారు  అనుకుంటాను కదా !పనికట్టుకుని ఎలాగు రాలేం, కనీసం వచ్చినప్పుడైనా సరే అకస్మాత్తుగా వారిని కలిస్తే  ఎలా ఉంటుంది ? వారి సంతోషం ని కనులారా చూడవచ్చు కదా! అని తలపోసాను   కానీ చిరునామా తెలియకుండా వెళితే  ఎలా కనుక్కోగలం అనిపించింది.  అలా రెండుసార్లు అయితే వారి చిరునామా తెలియక కలవకుండానే వచ్చేసాను

ఒకరోజు వారి బ్లాగ్ లో వారి వూరిలో జరిగిన వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ గురించి వ్రాయగానే అయ్యో . !.వీరిది కాకినాడ కాదు కదా! ఇంకా నయం అక్కడ వెతకలేదు అనుకుని చిన్నగా నవ్వుకున్నాను

ఆ తర్వాత ఇంకోవారంలో వారి మెయిల్ అడ్రెస్స్ లభించింది అడపదడపా క్షేమ సమాచారం కనుక్కోవడం వారి వివరాలు తెలుసుకోవడం జరిగిపోయాయి . నేను మీ వూరి వైపు రావాలనుకుంటున్నాను మిమ్మల్ని కలవడానికి రావాలనుకుంటున్నాను అని చెపితే చాలా సంతోషించారు మనఃస్పూర్తిగా ఆహ్వానం పలికి మరింత వివరంగా ఇంటికి చేరుకునే సులభమైన వివరాలు పంపారు

ఇక నా ప్రయాణం తెల్లవారుఝామున మొదలవుతుంది అనగా వారికి రాత్రి పూట 12 గంటల సమయం తర్వాత వారికి మెయిల్ ఇచ్చాను

నేను నాతొ పాటు మరి ఇంకో ముగ్గురు కలసి కారులో బయలుదేరాం

మా ప్రయాణంలో .. మాకు కనిపించిన అద్భత దృశ్యం ఒకటి  మంచు తెరలను చీల్చుకుంటూ పై పైకి వస్తున్న నారింజరంగు సూర్యుడు ఇదిగో   ఇలా...


మధ్య మధ్యలో రోడ్డుని విడదీస్తూ కట్టిన డివైడర్ల పై పూచిన కాగితపు పూల అందాలు, మంచులో తడిచిన గడ్డి పూల సోయగాలు .. మా మాటలు, పెద్ద సౌండ్ తో పెట్టిన పాటలు తో  సమయం ఎలా గడచి పోయిందో  అసలు గుర్తే లేదు.  రావులపాలెం దగ్గరకి చేరుకునేసరికి కాఫీలు తాగాలి అనిపించింది అక్కడ క్రొత్తగా ఓపెన్ చేసిన "అభిరుచి " అనే రెస్టారెంట్  దగ్గర కారు ఆపుకుని టిఫిన్ లు తింటూ పూరీ  లో తినే ఆలు కూరలో ఉప్పు ఎక్కువైన  సంగతి చెప్పి నిమ్మకాయ తెప్పించుకుని నిమ్మ రసం పిండుకుని తినేశాం ఉప్మా లేని పెసరట్టు రుచిని ఆస్వాదించి సర్వర్ల చేతులకు గ్లవ్స్ వేసుకుని వడ్డించాలని, అల్యుమినియమ్  పాయిల్ వేయకుండా ప్లేటులలో అరటి ఆకులు కాని ,అడ్డాకులు కాని వేసుకోవాలని ఉచిత సలహా కూడా చెప్పేసాం. అదేందుకండీ  అంటే పర్యావరణ  పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం అన్నమాట.  కాఫీ త్రాగి ఆ "అభిరుచి " రెస్టారెంట్ యజమానికి వారికి బిల్ ఇస్తూ  మేము వెళ్ళాల్సిన ఊరు పేరు చెప్పి వివరాలు అడిగి చెప్పించుకుని ధన్యవాదములు చెప్పి వచ్చేస్తూ .. మీ రెస్టారెంట్ మంచి అభివృద్దిలోకి వస్తుంది ఇటువైపు వచ్చినప్పుడల్లా వస్తూ ఉంటానని చెప్పి వచ్చాను

అదేంటండి !? అలా చెప్పేశారు .. అని మా డ్రైవర్ ఒకటే నవ్వు. అప్పుడు నేను చెప్పెను . ఆ రెస్టారెంట్ నడిపే అతని దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉంది ప్రతి ఒకరిని ఆహ్వానించడం తో పాటు అంతమంది సర్వర్స్ ఉన్నప్పటికీ కూడా తనే టేబుల్స్ మధ్య తిరుగుతూ మళ్ళీ మళ్ళీ చట్నీ కావాలండీ ? పెసరట్టు వేడిగా ఉంది అదీ ఇమ్మంటారా అండీ ... అంటూ మనుషులని ఊపిరాడనీయకుండా మొహమాట పెట్టేస్తూ ఆర్డర్స్ తీసుకుంటూ స్వయంగా అందిస్తూ తను ఒక సర్వర్లా మారిపోయాడు బిల్ తీసుకోవడానికి మాత్రమే  క్యాష్ కౌంటర్ దగ్గరికి వస్తున్నాడు .. అలాంటి వారు ఉన్నప్పుడు మరి అభివృద్ధి కాకుండా ఎలా ఉంటుంది అన్నాను

తర్వాత కడియం వైపు, మరలా మండ పేట వైపు ప్రయాణం చేసి .. "అనపర్తి " వైపు మళ్ళాము    అక్కడ ఎవరున్నారు .అంటే ... !!??  మన బ్లాగ్ లోకంలోఅందరిని  అత్యంత ఆత్మీయంగా పలకరించే  కష్టేఫలే శర్మగారు ఆ ఊరిలోనే ఉన్నారు  వారు చెప్పిన అడ్రెస్స్ ప్రకారం వారి ఇంటి ముందుకు వెళ్లి కారు ఆపి అందరం దిగాము .

గేటు ప్రక్కనే చిన్న పిల్లలు వ్రాసినట్లు ఉన్న చేతి వ్రాత లో సి .బి శర్మ అన్న పేరుని నిర్ధారించుకుని గేటు తీయబోయి కొంచెం పరికించి చూసాను ఈ గేటు పైనే కదా పసిరిక పాము అల్లుకుని ఉన్నప్పుడు తీసిన ఫోటో ని బ్లాగులో ఉంచారు అనుకుని .. లోపలి వెళ్లి .. కుమారి గారు అని పిలిచాను  ఆ ఇంట్లో నాకు అందరూ తెలిసి ఉన్న దాని లాగా.

వెంటనే కుమారి గారు బయటకి వచ్చేసి ... రండి రండి .అంటూనే తాతగారికి స్నేహితులు వచ్చారని చెప్పమ్మా అని పాపాయితో అన్నారు . ఇంతలో శర్మ గారి భార్య గారు అచ్చు పార్వతమ్మలా పెద్ద ముత్తైదువు లా  వచ్చి లోపలకి ఆహ్వానించారు ఆమె పిలుపులోని ఆప్యాయతకి కరిగిపోతూ కాళ్ళు అయినా కడుక్కొకుండానే .. బిల బిలమంటూ లోపలకి ప్రవేశించాం . ఎదురుగా మాస్టారూ ఆనందంగా బయటకి వస్తూ కనిపించారు   వారికి నమస్కారాలు తెలుపుకుని వచ్చిన నలుగురిమి పరిచయం చేసుకున్నాం

మంచి నీరు త్రాగి ఇంటిని నలువైపులా చూస్తూ మీ ఇల్లు చలువ పందిరి లా చాలా చల్లగా ఉంది అని చెప్పాను. కష్టేఫలె మాస్టారు ఇల్లుని చూద్దురుగాని రండి అని ఇల్లు అంతా  చూపించారు . తూర్పు వైపున గోడకి  లామినేట్ చేసి ఉన్న ఒక సన్మాన పత్రం ని   చూసాను. అది శర్మ గారి కి జరిగిన సన్మాన పత్రమే అనుకుంటాను (చదవలేదు) అలాగే నట్టింట్లో ఒక పెద్దావిడ ఫోటో ఉంది ఆవిడ తనని పెంచుకున్న "అమ్మ" అని చెప్పారు. శర్మ గారి బ్లాగులో ఆవిడ గురించి చదివి ఉండటం వల్ల  ఆమెకి అప్రయత్నం గానే  నమస్కారం చేసుకున్నాను

తర్వాత శర్మగారు  మూడంతస్తుల భవనం కన్నా పైకి పెరిగి ఉన్న పెద్ద  మామిడి చెట్టుని, పనస చెట్టుని చూపించారు   చూపటం ఏమిటీ  వెంటనే  వంకీ కట్టిన కర్రని తీసుకుని వడి వడిగా డాబా మెట్లు ఎక్కి  వద్దు వద్దు అంటున్నాసరే   వినకుండా కొత్తపల్లి మామిడి కాయ  కొబ్బరిలా ఉంటుంది .. వాడి చూడండి అంటూ అందరికి కాయలు కోసి ఇచ్చారు కాయలు క్రింద పడకుండా ఆ కర్రకి ఒక సంచీని కుట్టారు వంకీ తో  కాయని త్రుంచగానే   కాయ నేరుగా  ఆ సంచీలోకి వెళ్ళిపోతుంది ఆ సంచీ ని మా అత్తయ్య గారే కుట్టారు అని కోడలు గారు చెప్పారు.

తర్వాత బాగా కాసిన పనస చెట్టు నుండి పనసపొట్టు కూరకోసం లేత కాయలని తెంపి ఇచ్చారు వాటిని క్రోసేటప్పుడు అమ్మ గారి సూచనలు. అది ముదురుకాయ కూరకి బాగోదు లేత కాయని తుంచండి అంటూ. శర్మ గారికి చెప్పి పనస కాయలు కోయించారు

అన్నీ ఒక సంచీలోకి వేసాక లోపలి వెళ్ళాము . భోజనం చేయమని అడిగారు మేము ఇప్పుడు  వద్దండి,  చేయలేం అని కూడా చెప్పాము భోజనం సమయం కి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడం భావ్యమేనా అని శర్మ గారు బాధపడ్డారు

అమ్మ గారేమో ..ఉప్మా అయినా చేస్తానంటూ వంట ఇంట్లో బిజీ అయిపోతుంటే నా ఫ్రెండ్ వైష్ణవి వెళ్లి ఆ ప్రయత్నాన్ని ఆపి కాఫీ లు తయారు చేసుకుని వచ్చింది . మధ్యలో అమ్మగారు రుచి చూపిన పనసపొట్టు కూర సంగతి కూడా సంతోషంగా చెప్పింది ఒక పావు గంట సేపు కూర్చుని సెలవు తీసుకుని వచ్చేటప్పుడు అమ్మగారు అందరికి పసుపు కుంకుమ ఇచ్చారు. ఉన్న కొద్ది సమయం లోనే వారు చూపిన ఆత్మీయత వారి మాటలు పదే  పదే  గుర్తుకు వస్తున్నాయని నా హైదరాబాద్ స్నేహితురాలు  భారతి అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి మరీ చెప్పింది

ముఖ్యంగా శర్మ గారిలో ప్రసన్నత, విద్వత్తు,ఆత్మీయత అన్ని ప్రస్పుటంగా కనిపించాయి వారి బ్లాగ్ చదివేటప్పుడు  నాకు ఆయన రూపం పై ఎలాటి అస్పష్ట రూపం అయితే  కదలాడేదో అచ్చు అలాంటి రూపమే నాకు అక్కడ ఎదురైంది. వ్రాతల్లోనూ,  మనిషి స్వరూపం లోనూ ఒకే విధమైన  ముద్ర. ఏ మాత్రం తేడా లేని మనిషిని నేను చూసాను. వారి బ్లాగ్ లింక్ ఇక్కడ 

ఒకసారి నా బ్లాగులో "ఊరెందుకు వెళ్ళాలి " అనే పోస్ట్ వ్రాసినప్పుడు "మా ఇంటికి రండి " అని ఆత్మీయంగా ఆహ్వానించారు  అది నేనప్పటికి మరచిపోలేను. అక్కడికి వెళితే నా పుట్టింటికి వెళ్ళిన భావమే కల్గింది నాకు.

బయలుదేరబోతూ .. శర్మ గారి దంపతులని ఒక ఫోటో తీసుకున్నాను .




ఈ పాపాయి శర్మ గారి  మనుమరాలు "శ్రీ విద్య "


వారి దగ్గర నుండి సేలపు తీసుకుని  వెళుతూ  వెళుతూ  ద్వారపూడి లో తీసుకున్న ఫోటో

నాకెంతో ఇష్టమైన ముద్ర నటరాజస్వామి

అక్కడి నుండి బిక్కవోలు మీదుగా ప్రయాణం చేస్తూ నేను గమనించిన విషయం ఏమంటే ప్రతి గ్రామం లోను సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం  నెలకొల్పబడి ఉంది . ఆహా !.. ఎంతైనా గోదావరి జిల్లాల వారి మనసులు బంగారం అనుకున్నాను.  పలకరింపు లోనే కాదు ఆతిధ్యం ఇవ్వడం లోను, కృతజ్ఞతలు తెల్పడంలోను వారికి మించి వేరెవరు ఉండరు అనిపించింది

ఎంత విదేశీయుడు అయినా సరే గోదావరి పై ఆనకట్ట కట్టడానికి రూప కర్త అయిన సర్ ఆర్ధర్ కాటన్ మహాశయుడిని నిత్యం స్మరించు కుంటూ





 వారి విగ్రహం ని ఊరూరా నెలకొల్పుకుని ఆయనని స్మరించుకుంటున్నారు అందుకేనేమో .. ఆయన ప్రాతఃస్మరణీయుడు అని చెప్పుకుంటారు  అని అనుకున్నాను  



ఆ రోజు రాత్రి పూట తిరిగి వస్తూ  చంద్రుడిని వెంట తెచ్చుకున్నాం ఇలా .... 

వ్యక్తిగతమైన పనుల వల్ల  వెళ్ళినప్పటికీ కూడా ... "కష్టేఫలే " శర్మ గారిని కలవడం ఒక మరచిపోని అనుభూతి
నాకే కాదు ఆయన బ్లాగుతో ఏ మాత్రం పరిచయం లేని మరో ముగ్గురికి కూడా. వారు పదే పదే వారి ఆత్మీయతని గుర్తుకు తెచ్చుకుంటూనే  ఉన్నారు .. మళ్ళీ వారి ఇంటికి వెళదామా అని అడుగుతున్నారు  :)

(కష్టేఫలే మాస్టారూ..!  మీ అనుమతి తీసుకోకుండానే మీ ఫోటోలు ప్రచురించాను ఎందుకంటే .. మన బ్లాగ్ మిత్రులు మిమ్మల్ని చూపమని డిమాండ్ చేస్తున్నారు మరి ) 

4, ఏప్రిల్ 2013, గురువారం

FB గాయం

ఒక మనిషికి ఎన్నో నాల్కలు.  పది మంది దగ్గర పది రకాలుగా మాట్లాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య. మరి వారి అవసరాలు అలాంటివి. ఏం  చేస్తాం చెప్పండి. !?

అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలంటే అందరి దగ్గరా నటిస్తున్నట్లే ! కదాఆఆఆఆఆఅ !!!

నిజం చెపితే నిష్టూరంగా ఉంటుంది "యదార్ధవాది లోక విరోధి "అంటారు కదా .. అలాగన్నమాట. ఎవరికీ ఏమి చెప్పనే కూడదు. విమర్శని తట్టుకోలేనప్పుడు వాళ్ళు తమలో లోపాలు ఎలా తెలుసుకుంటారు !?

వారి భావాలు ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ వారి కవిత్వం లో రచనలలో తొంగి చూస్తాయి. అవి పబ్లిక్ అయినప్పుడు పాఠకుల అభిప్రాయాలను హుందాగా తీసుకోవాలి. అలా తీసుకోవడం మానేసి వ్యంగం తో మాటలు విసరడం చూసి నవ్వుకున్నాను. విమర్శని అంగీకరించలేనివారు  ఎన్నటికి ఎదగలేరు కదా!

అప్రయత్నంగా ఒక పాట  గుర్తుకు వస్తూ ఉంది

వేషమూ మార్చెను భాషను  మార్చెను మోసం నేర్చెను
అసలు తానె మారెను అయినా మనిషి మారలేదు
అతని మమత తీరలేదు
మనిషి మారలేదు అతని కాంక్ష తీరను లేదు ... అన్నది తలచుకుంటూనే ఉన్నాను

నిన్నటి నుండి నా ప్రమేయంలేకుండా కొన్ని లైక్ లకి కొన్ని వ్యాఖ్యలకి  కొన్ని వ్యంగ బాణాల కి నొచ్చుకుని..
ఫేస్ బుక్ అకౌంట్ డిలీట్ చేయాలనుకున్నాను . ఫ్రెండ్స్ లిస్టు లోనుండి కొందరిని నిర్దాక్షిణ్యంగా తొలగించాను. మరి కొందరూ లిస్టు లో ఉన్నారు కూడా. మంది ఎక్కువైతే పిర్యాదులు ఎక్కువే!  ఆచి తూచి వ్యవహరించినా  సరే  .. నా ప్రశాంతతని  పోగొట్టుకున్నాను :(:(

 అంతకీ రాత్రి నా ఫ్రెండ్  సున్నితంగా హెచ్చరించింది కూడా  .జాగ్రత్త అని .
 హే .. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు ? నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అన్నాను. తాటి మట్ట నువ్వు డీసెంట్ అని చూడదు. దాని పని అందరిని చీరడమే! పైగా అవసరం లేకపోయినా     ఇతరుల మాటలు వినిపిస్తారు ఏం  మాట్లాడాలో తెలియక "నొప్పించక తానొవ్వక " ఉండటం చాలా కష్టం సుమీ ! అని హెచ్చరించింది

విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకి కోపం !? హె.. భగవాన్ ఈ కష్టాలు ఏమిటి తండ్రీ! అన్నానా !!?

ఫేస్ బుక్ గొడవల్లోకి నన్ను లాగొద్దు తల్లీ ! నా చిత్రాలకి భయం భక్తి లతో లైక్ కొట్టక పోయినా సరే! అంటూ ఆయన మాయం . హతోస్మి .

మరి నా మదికి తగిలిన గాయం ఎవరికీ చెప్పేది ఏమని చెప్పేది!?

అందుకే నా అంతరంగం కి చెప్పుకుని .. ఇప్పట్లో ఫేస్ బుక్ వైపే చూడకూడ దనుకుని  ఒట్టు పెట్టుకున్నాను.

ఇక బ్లాగ్ లోనే ఉంటాను

ఎవరి రాజ్యాలు వారు ఏలు కోండి . నేను అసలు ఎవరికీ పోటీ కాను. నేను ఒట్టి అహంకారిని సుమా !  నా బ్లాగ్ నాకు చాలు చాలు చాలు. అంటాననుకున్నారా? ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఉంటానని చెప్పడం అన్నమాట

3, ఏప్రిల్ 2013, బుధవారం

మహిళా బ్లాగర్ గా నా పరిచయం

జాజిమల్లి  బ్లాగు లో కె.యన్. మల్లీశ్వరి  గారు తెలుగు బ్లాగ్ లోకంలో ఉన్న మహిళా బ్లాగర్ లని పరిచయం చేసే అతి పెద్ద బాధ్యతని తలకెత్తుకున్నారు. వంద మందిని పరిచయం చేయడం అంటే మాటలా చెప్పండి !? చాలా కష్టమైన పని. బ్లాగర్ ల ఇంటర్ వ్యూస్ ని తీసుకోవాలి ప్రచురించిన తర్వాత వచ్చే స్పందనల్ని అప్ డేట్ చేయాలి తగిన సమా ధానం ఇవ్వాలి .. ఇదంతా చాలా కష్టం. అయినప్పటికీ ఆ పనిని దిగ్విజయంగా చేస్తున్న మల్లీశ్వరి  గారిని అభినందిస్తూ ..  ఆమెకి హృదయ పూర్వక దన్యవాదములు తెలుపుతూ ... 

బ్లాగర్ గా పరిచయం చేసినవారిలో 6వ బ్లాగర్ నేను పరిచయం చేయబడ్డాను (జనవరి 15,2013 న ) నా ఆ పరిచయాన్ని, మిగతా బ్లాగర్స్ స్పందనల్ని నా బ్లాగు లో భద్రపరచుకోవాలని ఇలా .. ఉంచాను 

బ్లాగ్లోకపు ఉక్కుమహిళ




బ్లాగర్ పేరు : వనజ తాతినేని/Vanaja Tatineni 
బ్లాగ్ పేరు;వనజ వనమాలి
బ్లాగ్ చిరునామా;https://vanajavanamali,blogspot.com

పుట్టిన తేదీ; 12/03/1967

పుట్టిన స్థలం; కుంటముక్కల (నియర్ మైలవరం ) కృష్ణా జిల్లా

ప్రస్తుత నివాసం; విజయవాడ

వృత్తి, వ్యాపకాలు; గృహిణి,మరియు స్వయం ఉపాధి

బ్లాగ్ మొదలు పెట్టిన తేదీ; నవంబర్ 21/2010

మొత్తం బ్లాగ్ పోస్టులు(ఇంటర్వ్యూ నాటికి);600 పైన

బ్లాగ్ లోని కేటగిరీలు;కథలు,కవిత్వం,వ్యాసాలు,అనుభూతులు-అనుభవాలు,సినిమా పాటల పై వివరణ



బ్లాగ్ ని ఒక మాధ్యమంగా ఎపుడు గుర్తించారు?
ఓ..నాలుగేళ్ళ క్రితం.  బావాలని వెల్లడించుకునే వారికి చక్కని వేదిక. . అందరూ నదులు కానవసరం లేదు. పిల్ల కాలువలు అయినా నయమే కదా !


బ్లాగ్ రచనలో మీ అనుభవాలు?

సంతృప్తికరం గా ఉన్నప్పటికీ  ఏదో లోపం. బ్లాగర్స్ లో అధిక మంది విద్యాధికులు ఉన్నారు. కాని కొత్త వారికి ప్రోత్సాహం తక్కువ. అబ్బ.. వచ్చారులే! వ్రాసారులే ..అన్న ధోరణి ఉంటుంది. బ్లాగ్ అంటే  సాధారణ అవగాహన ఉన్న వ్యక్తులు కూడా నిర్వహించుకోలరు కదా! విద్యాధికులు,సీనియర్ బ్లాగర్స్ మాత్రమే  వ్రాయాలి మిగతా వారు చదివి పొగడ్తలు కురిపించాలి అనే దోరణి అంతర్లీనంగా ఉంటుంది. చాలా సార్లు కొత్త బ్లాగర్స్ బాధ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కవిత్వం అంటే విద్యాధికులు వ్రాసినదే కవిత్వం ,వారు వ్రాసినవే కథలు కాదు. ఓ.. టైలర్ కూడా మంచి కవిత్వం వ్రాయగలరు వారు కూడా బ్లాగ్ నిర్వహించుకోగలరు అని అర్ధం కావాలి..కావాల్సింది సృజనాత్మకత, చదివించ గల్గే  శైలి.
నేను రెండు సంవత్సరాలు క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చి పడ్డాను. సాహిత్యం అంటే ముఖ్యంగా కవిత్వం అంటే  ప్రాణం.  నిర్మొహమాటంగా చెప్పాలంటే ఇందరి బ్లాగర్ల మధ్య నేను పెద్దగా నేను సాధించినది ఏమి లేదు.ఇక్కడా భావ చౌర్యం ఉంది. ఇక్కడా పెద్ద బ్లాగర్,చిన్న బ్లాగర్ అన్న తేడాలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్పాలంటే గ్రూపిజం ఉంది.ఎగతాళి చేసేవారు ఉన్నారు.అనామకులుగా వచ్చి  కామెంట్స్ తో బాధ పెట్టేవారు ఉన్నారు. స్త్రీల సమస్యలపై స్పందించితే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు ఉన్నారు.  అవన్నీ పరిగణ లోకి తీసుకోకుండా.. వ్రాసుకుంటూనే ఉన్నాను. కొన్ని చేదు  అనుభవాలు ఉన్నాయి. చాలా సంతృప్తినిచ్చిన సంతోష సమయాలు ఉన్నాయి.. చాలా బ్లాగ్ లని నేను ఎప్పుడు చదువుతాను.అది నాకెంతో ఇష్టమైన వ్యాపకంగా మారింది. నాకై నేను కేవలం నా కోసమే నేను  గడిపిన ఘన సమయాలు ఇక్కడ నాకు సొంతం. చిన్న చిన్న అసంతృప్తులు తప్ప  అంతా బహు బాగు.

బ్లాగింగ్ వలన ఉండే సానుకూల అంశాలు?పరిమితులు?

మనం  వ్రాసినదానిని ఎవరికో పంపి ప్రచురణ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఇదో చక్కని వేదిక మనం వెలిబుచ్చిన భావాలు నచ్చిన వారు మళ్ళీ మళ్ళీ బ్లాగ్ కి విచ్చేసి చదివి మెచ్చుకుని అభిప్రాయాలని తెలిపి వెళుతూ ఉంటారు. బయట పత్రికలలో ప్రచురింప బడ్డ రచనల పై స్పందన కన్నా.. ఇక్కడ స్పందన ఎక్కువ. అయితే ఇక్కడ అందరూ చదివే అవకాశం లేదు కనుక బాహ్య ప్రపంచానికి బ్లాగ్ రచయితలు తెలిసే అవకాశం లేదు.

మహిళా బ్లాగర్ గా మీ ప్రత్యేకత?

సామాజిక సృహ కల్గిన కథలు,కవిత్వం వ్రాయగల్గ డం. నిత్య జీవనంలో మనకి ఎదురయ్యే  ప్రతి అనుభవాన్ని.ఇంకా  సమాజాన్ని పరిశీలించి.. ఆ విషయాలని వ్యాసాలుగా వ్రాయగలగడం



సాహిత్యంతో మీ పరిచయం?
ఓ.. పదేళ్ళు. ఎక్స్ రే సాహితి సంస్థ తో.. “నెల నెలా వెన్నెల” వేదిక నిర్వహించడంలో ఏడేళ్ళ కి పైగా మమేకం.



స్త్రీగా రాయడంలో మీకు ఇబ్బందులు ఏవైనా ఎదురయ్యాయా?
నాకున్న సమయాన్ని సద్వినియోగ పరచుకుని బ్లాగ్ వ్రాయగల్గుతున్నాను. ఒక గృహిణిగా తీరిక సమయాల్లో బ్లాగింగ్ చేయగలను. కానీ కొందరికి ఉపాధి కల్గించే వృత్తిలో ఉన్నాను. వాళ్ళ తర్వాతే బ్లాగ్. అలాంటప్పుడు నేను అసహనంకి గురి  అయిన రోజులు ఉన్నాయి. ఎంతో  నచ్చిన పోస్ట్  లని చదవడానికి, వ్యాఖ్య ఇవ్వదానికి సమయం ఉండేది కాదు. ప్చ్.. అంతే! ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పడం కూడా కష్టం.  కొన్ని అంశాలు గురించి వ్రాసేటప్పుడు నేను ఒకటికి పది సార్లు ఆలోచించాను. ఉదాహరణకి..సైబర్ సెక్స్  పై  నేను  వ్రాసిన పోస్ట్ ఒకటి.   నేను  వ్రాసిన పోస్ట్ లని నా కొడుకు చదువుతాడు. అలాగే మా కుటుంబ సభ్యులు చదువుతారు. నాకున్న భావ స్వేచ్చ ని అడ్డుకోలేదు కాని కొన్ని రచన లలో.. వ్యక్తి గత అనుభవాలు ఉన్నాయి. ఆ రచనలని వాళ్ళు చదివినప్పుడు అవన్నీ ఎందుకు వ్రాయడం అంటారు. నేనైతే.. నా అనుభవాల తో.. మరియు సామాజిక సృహ తోనూ..కలగలిపి కవిత్వం,కథ,వ్యాసం వ్రాసాను.అవన్నీ  నా వ్యక్తిగతం అని అనుకునే వారు ఉన్నారు తప్ప రచయిత/ రచయిత్రికి  పరిమితులు లేవు అని అర్ధం చేసుకోకపోవడం కొంచెం ఇబ్బంది కల్గిస్తుంది. నా కుటుంబ సభ్యులు  కూడా నా భావ స్వేచ్చని హరించి నట్లు  ఉంటుంది. అలాంటప్పుడు.. నన్ను నేను వ్యక్తీకరించుకోవడంలో (రచయిత్రిగా) విఫలం అయ్యాను కూడా.


జీవన నేపధ్యం?
పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా సంప్రదాయ వ్యవసాయ కుటుంబాలు.  చదవడం,వ్రాయడం, సమాజ పరిశీలన,ఆత్మావలోకనం. (నా గురించి మాత్రమే)


ఎన్నాళ్ళు బ్లాగింగ్ కొనసాగించాలని?
ఎవరి ఒత్తిడి లేకుండా జీవితాంతం వ్రాసుకుంటూనే ఉండాలని కోరొక

సరదాగా ఏవైనా చెప్పండి?
బ్లాగ్ ప్రపంచం నుండి  కాస్త బయటకి రండి.. కిరణ్ బేడి లాగా మారి నడివీదుల్లో సంచరించండి

సీరియస్ గా ఏవైనా చెప్పండి?

నిన్ను నీవు తెలుసుకో, తర్వాత ప్రపంచం నీకు అర్ధమవుతుంది అని నేను అనుకుంటాను.  సమస్యలని ఎదుర్కుంటున్న స్త్రీమూర్తులకి నా పరిధిలో నేను సాయం చేయాలని తాపత్రయం.యూత్ కి కౌన్సిలింగ్ క్లాస్స్ తీసుకోవాలని అభిలాష



మీ బ్లాగ్ పోస్ట్స్ లో మీకు నచ్చిన కధ గానీ వ్యాసం గానీ ఒకటి,కవితలైతే రెండు


నాకు ఎంతో ఇష్టమైన కవితలు రెండు

 
2. దేహ క్రీడలో తెగిన సగం 

3.ఓల్డ్ లవ్  లెటర్ (కథ)

తోటి బ్లాగ్ మిత్రుల స్పందనలు 


88 THOUGHTS ON “బ్లాగ్లోకపు ఉక్కుమహిళ"   

జాజిమల్లి బ్లాగ్ లో  ఈ పరిచయం యొక్క లింక్  అక్కడ  మిత్రుల స్పందన లని చూడండి 

మహిళా బ్లాగర్ గా నా పరిచయం  బ్లాగ్లోకపు ఉక్కు మహిళ