29, జనవరి 2016, శుక్రవారం

నా కెరుకగాని ప్రేమబాష

నా కెరుకగాని ప్రేమబాష


రోజూ దీపం కొండెక్కి పోతుండగా
అసహనపు ఆనవాళ్ళని విదుల్చుకుంటూ
బెట్టు చేస్తున్న నిదురమ్మని 
రారమ్మని బలవంతం చేస్తూ

మూసుకునే రెప్పల మధ్యగా 
నిన్ను కనులలో నింపుకుంటూ
మనసులో  వేయినొక్కటోసారిగా తలచుకుంటాను

దూరం తగ్గిపోయే క్షణం 
ఎన్నడొస్తుందోనని నిట్టూరుస్తూ
దుప్పటి కప్పుకున్నట్లు 
మనసు కప్పుకోవడం చేతకాక ఏమో
 కన్నీటి ధార చెక్కిళ్ళని దాటి 
దయతో ప్రక్కని తడిపెళ్లింది

ఒక ఘడియ తర్వాత  ఆలాపన
నా తలని నువ్వు చెయ్యేసి నిమిరినట్లు
ఆ అనురాగపు స్పర్శ కి 
ఎక్కడో ఏటి మధ్యన పక్షి రెక్కలు
విదిల్చిన చప్పుడు నాలో
ఉలికిపడ్డాను అటునిటు పొర్లినా 
ఆగని అలజడి

అప్రయత్నంగా పలకల పెట్టె ని తెరిచాను
అక్కడ నాకోసం ఓ .. ప్రేమ సందేశం
కాచుకుని కూర్చుంది  అందులో
ఎవరూ నేర్పకుండానే 
నువ్వు నేర్చుకున్న పాఠం ఉంది
అంతకు మించిన నిజమేదో దాగుంది
ప్రకటించే బాష తెలిసి ఉంది
అంకితమిచ్చేందుకు తగిన అర్హత ఉంది
కను చెమరింతల మధ్య 
నడిరేతిరి విరిసిన పద్మంలా 
ముఖం విచ్చుకున్నట్లు
నాలో నవ జీవం తొణికిస లాడుతున్నట్లు 
నాకు నేనే  కొత్తగా

ఈ ఎడారి జీవికి  
ఒయాసిస్ వెతుక్కునే  యాతనలేదు
చీకటిని చీల్చే కిరణాలని 
ఆహ్వానించే తపనలేదు
పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండే చాలు
అన్నివేళలా 
అమ్మయి లాలించే  చల్లని స్పర్శ చాలు

కంటి నిండుగా మది నిండగా
ఒకే ఒక్క చంద్రుడి వెన్నెల వెలుగు చాలు
మా నిఖిల చంద్రుడి అనురాగమే  చాలు

నా కెరుకగాని  ఈ ప్రేమ బాష ఇంత గొప్పదా కన్నా !


అమ్మకే  గురువై  నేర్పావా నాన్నా!?





(ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే)

నిన్నటి రాత్రి నా మానసిక స్థితి..  చిత్రంగా,  ఖచ్చితంగా అదే సమయానికి నా కొడుకు నాకు పంపిన ప్రేమ సందేశానికి ఈ స్పందన

22, జనవరి 2016, శుక్రవారం

ఇట్లు, నీ వెన్నెల


ఓపాట సాహిత్యం వ్రాసిన వారి పేరు రాజ్ కుమార్. ఈ పాట లో మాత్రం చాలా మంది గీత రచయితల పేర్లు ఉన్నాయి. ఒకటైతే పర్వాలేదు కాని
పట్టు మని పది మంది రచయిత పేర్లు ఒక పాట లో విన బడితే ..అదేనండీ ..పేర్లు సాహిత్యంలో జమ కూడితే..
ఓ.. పాట సాహిత్యం లో ఒక చరణం .. అవుతుంది..
అలాగే స్వరాలు ఒలికించే సంగీతదర్శకులు వారి బాణీ లతో సహా వారి పేర్లని కలిపితే ఇదే పాటలో రెండో చరణం అవుతుంది.
ఈ పాటలో మన తెలుగు పాట ఆనవాలు పాట సాహిత్యం లో కలగలసి ..పోయి ఉంది..
ఆ పాట .."ఇట్లు..నీ వెన్నెల" చిత్రంలో పాట.

ల ల ల ల లాలలా ..
ఆత్రేయ గీతమా .. ఇది ఆరుద్ర భావమా
తేనే తేట మాటల్లో నింపిన వేటూరి .. సారమా..
సినారె మనసు పొరలో దాగిన తెలుగింటి అందమా..
ఆడువారి మనసెంతో తెలిసిన పింగళి కలముకి దొరకని తరుణీ

ఆత్రేయ గీతమా .. ఇది ఆరుద్ర భావమా


ఈ వనిత ని చూసిన కవితగా మలిచేవారు కృష్ణ శాస్త్రి.

నిన్ను మరచానని మరుజన్మ ఎత్తడా మహా కవి శ్రీ శ్రీ
నీ మాట వింటే ..మా పదాల రేడు.. సీతారామ శాస్త్రి
నీ.. సోయగాలు వర్ణించ.. పూనేనమ్మా చెలియా ప్రతి రాత్రి
భువన చంద్రుడే.. చిన్నెలు చూసి పరవశించి పోతుంటే
నీ వన్నెలు కన్న వెన్నెలకంటి తరం కాదు అంటుంటే
కన్నులా.. చురకత్తులని మైమరెచెను జొన్నవిత్తుల
ఏమని.. సొగసిరులని అంటున్నాడమ్మా జాలాది
బోసు గిలిగింత అక్షరం నీ చుట్టూ తిరిగేనా కోమలి
సుద్దాలవారి లక్షణం మరి బెట్టు చేసే సౌదామిని
వరమల్లె నను చేరు ప్రాణమా..

ఆత్రేయ గీతమా .. ఇది ఆరుద్ర భావమా


నీ చిలకల పలుకల మధురిమలోన ర సాలూరు స్వరమా..

నీ అలకల మెలికలు ఎవరికీ అందని రమేష్ నాయుడి రాగమా..
నీ చేతి గాజుల సవ్వళ్ళ మాటున ఉన్నది అందిగో మా సత్యమే
ఈ జాణ పదములో గానమే వినబడితే అది చక్రవర్తి పని తనమే
స్వర బ్రహ్మ మహదేవన్ ఒడిలో ఒదిగినట్టి స్వర వీణవా
ఇళయరాజ మది నుండి పుట్టిన పాటలోని సుకుమారమా..
నడుమలో నీ నడకలో శృతి లయలే మీటే కోటి
నీ నవ్వుల విరితోటలో సుధాలోలికించు కీరవాణి
వూసులందించు శ్వాశలో రెహమాన్ నాదాల లాహిరి
దాచుకున్నావా మేనిలో.. మణిశర్మ రాగాల మాధురి..
నన్ను దోచుకున్నావే అందమా..

ఆత్రేయ గీతమా .. ఇది ఆరుద్ర భావమా

తేనే తేట మాటల్లో నింపిన వేటూరి .. సారమా..
సినారె మనసు పొరలో దాగిన తెలుగింటి అందమా..

ఆడువారి మనసెంతో తెలిసిన పింగళి కలముకి దొరకని తరుణీ

ఈ పాటకి సాహిత్యం: రాజ్ కుమార్
సంగీతం: సుందర్

17, జనవరి 2016, ఆదివారం

ముసురు

ముసురు

కొబ్బరాకులతో వేసిన చిన్న గుడిసె. దానిపై ప్లాస్టిక్ పట్టా వేసి వైరుతో  గట్టిగా  కట్టి ఉంది. అయినా సరే బలంగా వీచే గాలికి ఊగుతూ ఉంది. గుడిసె లోపల  ఎలక్ట్రిక్ బల్బు వెలుతురులో కూర్చుని టీవి వంక చూస్తూ అన్నం తింటున్నాడు కోటి. బయట నుంచి వచ్చే చల్లటి గాలి వణుకు పుట్టిస్తుంది.

"ఆ తడక అడ్డం పెట్టగూడదూ. పిల్లలు చలికి చచ్చి పోతున్నారు" అంది రాజ్యం.

"మనం తడకేసుకుని ఎచ్చగా పడుకుంటే దొంగల పని సులువై పోతది. తీసుకున్న రూపాయికి నాయంగా పని చెయ్యాలే రాజ్యం. నువ్వొక  పని చేయి నేను బయట పడుకుంటా . నువ్వు తడకేసుకుని పిల్లల పక్కన పడుకో ." చెప్పాడు కోటి.

"ఏదో ఒకటి చేయ్, నేను చెపితే మాత్రం నువ్వింటావా ఏంటి ?  ఇందాక చెప్పడం మరిసిపోయా ! రేపోద్దుటికి వండటానికి బియ్యం లేవ్ ! ఎవరినన్నా అప్పడిగి తేవాలన్నా ఇక్కడెవరు  తెలియక పోతిరి. పనిచేసే చోట  డబ్బులయితే అడిగి  తెద్దును గాని బియ్యమడిగి తెలేనుగా" .. చెప్పింది.

నీళ్ళ గ్లాసు తీసుకుని బయటకొచ్చి చేయి కడుకున్నాడు. భార్యకేమి సమాధానం చెప్పలేదు. తల పైకెత్తి ఆకాశం వైపు చూసాడు. దట్టంగా మబ్బులు.  వానొచ్చేటట్టుంది. దీపావళి ముసురు గాబోలు. గుడిసె బయట మడత మంచమేసుకుని దుప్పటి కప్పుకుని పడుకోబోతూ  తల ప్రక్కనే టార్చి లైట్ పెట్టానో లేదో అని ఇంకోసారి చూసుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాడు.  గాలికి కొబ్బరి చెట్టుపైనుండి  కాయ రాలిన శబ్దం. ఉలికిపడి కళ్ళు తెరిచాడు. లేచి కూర్చున్నాడు. నిద్ర రావడం లేదు. ఊర్లో అయితే తన చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుకొస్తుంది.  ఇట్టాగే మబ్బులు ముసుగేసిన రోజుల్లో నాయన మాటో అమ్మ మాటో గుప్పున గుర్తుకొచ్చుద్ది    పంట  గింజ  పాల బడుద్దా  నీలబడుద్దా  అని ! గతంలోకి జారిపోయాడు కోటి.

దీపాల అమాసకి ముందు ముసురు పట్టుకుంది. ఇది తుఫాను ముసురో ఏమో ! పంట చేతికందోచ్చే  రోజుల్లో  ఈ మాయదారి ముసురు దెయ్యంలా కాచుకుని ఉంటుంది. "గింజ పాల బడుద్దా  నీల బడుద్దా " అనే గుబులుగా ఉంది.రా కోటీ " అనేవాడు నాయన.  ఆకుపచ్చగా ఉన్నపొలమంతా  బంగారు రంగులోకి మారి కంకుల భారంతో ప్రక్కకి వాలిపోయి కొంత,  ఒకోచోట పడిపోయిమరింత  ఉంటాయి. భయపడినట్టుగానే ప్రతేటా  పంట చేతికొచ్చేసరికి తుఫాన్ వచ్చేది పంటంతా నీళ్ళ పాలయ్యేది.  ఆఖరికి అప్పులే మిగిలేయి. అప్పులు తీర్చలేక మొగుడు చెరువులోకి దిగి చచ్చిపోయాడని చిలకమ్మ ఏడుస్తూ ఉండేది.

వ్యవసాయం చేయడానికి చేసిన  అప్పులు క్రింద పొలమంతా  నాయుడికి  జమ అయిపొయింది. అదే ఏడు  నాయుడు దగ్గర పాలేరుగా మారిపోయాడు కోటి.  తినడానికి గింజలేని ముసురు రాత్రొకటి  కళ్ళ ముందు మెదిలింది.

పండిన వరి కోయకముందే తుఫాన్ పట్టుకుందనే గుబులు నాయుడిదైతే ఇంట్లో గింజలేని దిగులు అమ్మది.  రాత్రి ఇంటికొచ్చి పడుకుంటుంటే "పెద్దోడా ఇంట్లో బియ్యమైపోయాయిరా ! నూకలు కూడా ల్లేవ్, శెట్టి కొట్లో పంటలోచ్చాక అంతకంత కొలుస్తానన్నా అప్పు ఈయడం లేదు." చెప్పింది.

నాయుడింట్లో ఎంతో కొంత తినొచ్చింది గుర్తు చేసుకుంటూ పొట్ట తడుముకున్నాడు.  "ముగ్గురు చిన్నోళ్ళు ఆకలకి తట్టుకోలేక ఏడుస్తుంటే తవుడుని చెరిగి వచ్చిన నూకలతో జావ కాసి వాళ్ళ పొట్టలో బోసా ! అందులోదే కాస్త పొద్దూన్నేక్కూడా ఎత్తిపెట్టి ఉట్టిలో పెట్టానురా ! నాయుడిని బత్తెం అడుగు" గుర్తు చేసింది. అట్టాగే అంటూ కళ్ళు మూసుకున్నాడు. తెల్లారి చెయ్యాల్సిన పనులు కళ్ళ ముందు మెదులుతూ ఉండగా కళ్ళు మూసుకున్నాడు కోటి .

మంచు ఇడవకుండానే తూర్పు పొలంకి ఎల్లాడు  కోటి . దొరసాని కొత్త బియ్యం పొంగలి పెట్టాలని చెప్పింది. పొద్దెక్కే లోపే  ఒక మడైనా పనలు చీల్చి రెండు మోపులకి సరిపడా కోసి దొరింటికి మోయాలి. సద్దన్నం తిని ఆ పనలన్నింటిని పల్చగా ఎండబెట్టాలి. మళ్ళీ పొద్దుగూకక ముందే నూర్పుడు బల్లమీద వడ్లని  రాలగొట్టి తూర్పరాబట్టి చిలకమ్మ ముందు పోస్తే ఆ వడ్లన్నింటిని  ముక్కులిరక్కుండా దంచి, చెరిగి జల్లెడ బట్టి మట్టిబెడ్డలుంటే ఏరేసి కుంచానికెత్తి ఇచ్చేపాటికి ఊరంతా సద్దు మణిగి పోయింది. ఊర్మిల్లమ్మ తినమని పెట్టిన అన్నాన్ని బిడ్డలకి పెట్టాలని పరుగు పరుగునా ఇంటికొచ్చింది చిలకమ్మ  అమ్మ వొచ్చి  వన్నమొండి పెట్టుద్దని ఎదురు చూసి ఎదురుచూసి నేల మీదేపడి నిదరపోయారు తమ్ముళ్ళు నాయాళ్ళు.  ఆళ్ళని లేపి ముద్దు ముద్దలగా తిండి తినిపిస్తుంటే   "ఏమ్మా బియ్యపు  గింజలేవీ తేలే " అడిగాడు కోటి.

"ఊర్మిల్లమ్మ కోడి గుడ్లంత కళ్ళేసుకుని నా ఎంకే చూస్తా ఉందిరా? నోట్లో గింజ కూడా ఏసుకో కూడదని హెచ్చరించింది కూడా !  చెరిగినయి చెరిగినట్టు తాంబూలంలో పోసుకుని పేరు నెయ్యి రాస్తా కూర్చుంది   రేపొద్దున్న ఏకాశీ శనివారమంట. కొత్త బియ్యాన్ని తొలీత రాములోరి  గుళ్ళోకి ప్రసాదం చేయడానికి ఇయ్యాలంట   బెల్లపు పొంగలి పెట్టి గంగానమ్మకిపెట్టి రావాలి తర్వాత ఇంటి చుట్టుపక్కలాళ్ళకి పెట్టుకుంటారు ఆల్లు తింటారు. అడుగో బొడుగో సమయానికి మనం బోతే అల్లా కంటికికనబడితే మన చేతిలో ఏత్తారు. అంతే గదరా " అంది.

"నేను కొత్త బియ్యం సంగతి చెప్పలేదే పదిసేర్ల బియ్యం అడగకపోయావా  అని కదా  నిన్ను అడిగింది"  అన్నాడు ఇసుక్కుంటూ . "అడిగితే అంత తేలిగ్గా ఇచ్చేత్తారేంటి ?  పిచ్చి నాయాల. ఇచ్చే వాళ్ళైతే మన నాలుగెకరాల మాగాణిని  వాళ్ళ ఖాతాలోకి ఎందుకేసుకుంటార్రా పిచ్చి కొడుకా !   ఆశ పడింది చాల్లే గాని ఇక పడుకో అంటూ కాసిని మంచీల్లు తాగి ఇద్దరు తమ్ముళ్ళు పడుకున్న కుక్కి మంచంలోనే చిలకమ్మ   సర్దుకుంది.

నిదర రాటల్లేదు కోటికి. మెసులుతూనే ఉన్నాడు.  "ఎంతాలోసించినా మన బతుకులేవీ మారవులే కోటీ .. కళ్ళు మూసుకుని పడుకో నిదర అదే పట్టింది.  చీకటితోనే ఎల్లి  పొయ్యి గడపలు అలికేసి ముగ్గులు పెట్టాలి. నువ్వు పాలు పిండి ఇయ్యాలి. ఎండెక్కినాక  శెట్టి కాడికెల్లి బతిమలాడుకుంటా పది సేర్లు నూకలియ్యమని. నాల్గు దినాలు గడిస్తే కోతల్లో పడతాము. కూలీ వస్తది కాస్తా కూస్తో పరిగి వస్తది కదా అప్పు తీర్చేయొచ్చు ". చిలకమ్మ మాటల్లో ఆశ.

చిమ్మ చీకట్లోనే నాయుడింటికెల్లారు తల్లి కొడుకు. ఊర్మిలమ్మ బయటకొచ్చి ఇయ్యాల కాదులే దేవుడికి పెట్టేది. చిన్నమ్మి ఇంట్లో ఉండే దినాలు గాదు.  నువ్వు బయలంతా చిమ్మి కల్లాపిజల్లి ముగ్గులేసి పో !  కోటి మావు వేసి వచ్చాడుగందా! అట్టాగే బొమ్మిడాయిలు కూడా దొరుకుతున్నయ్యి అని నాయుడు చెప్పాడు.   అయ్యన్నీ  తెచ్చినాక కబురు పెడతా !  శుభ్రం జేసి ఇచ్చి పో అంటూ   లోపలకి పోయింది. బియ్యమడుగుదామని నోటి మీదకొచ్చింది. తెల్లారక ముందే నీ దరిద్రాన్ని ఇనిపిస్తూ ఉండావని తిట్టిపోస్తదని నోట్టో మాట నోట్తోనే కుక్కుకుని పనిలో బడింది చిలకమ్మ.

రెండు రోజులాగాక వరి కోతలు మొదలు పెట్టారు.మునుం పట్టి నడుంవంచి కోత  కోయడం మొదలెట్టారు. "ఒరేయ్ కోటీ ... అన్నం టిఫినీల మీద కాకులు వాలతొన్నాయ్. మాయదారి కుక్కలు కూడా కాచుకూసున్నాయి  ఈ పనలు నాలుగు  తీసుకెళ్ళి ఆ కేరేజీలపై యేసిరా " అమ్మ ఆరాటం అర్ధమైంది కోటికి. సాయంత్రం  పనలని ఇంటికి పట్టుకెల్లి దంచుకుని వండుకోవచ్చని అర్ధమయింది. కాస్త వత్తుగానే  పనలని కప్పుకుని వచ్చాడు. తీరా ఇంటికి మల్లేటప్పుడు ఆ పనలని మోపు గట్టుకుని బయలదేరబోతే  వెనక్కి పిలిచి మరీ కయ్యలో  పనలపై ఏపిచ్చాడు నాయుడు .  "నీకు ఇయ్య కూడదని కాదురా కోటీ ! మీరు ఇయ్యాలే వడ్లు దంపి వండుకు తింటారు. పొంగలి పెట్టకుండా పంట గింజ ఎసరునీళ్ళలో పడటం మంచిది కాదని అంటారు కదా! మీ ఊర్మిల్లమ్మకి తెలిస్తే రచ్చ రచ్చ చేసుద్ది నీకు తెలియంది కాదుగా " అన్నాడు.

ఉసూరుమంటూ నడిచెళుతున్న తల్లిని చూస్తే దుఃఖమొచ్చింది   కోటికి. మేనమామ ఇంటికి పోయి బియ్యం అప్పుగా   తెచ్చి తల్లి  చేతికిచ్చి వచ్చాడు. "మన కష్టం ఇలువ నీళ్ళ బడటానికి కూడా ఏడుస్తుందిరా! వాళ్లకేమో సిరి మాలచ్చిమి రోజు పాలల్లో బడి ఉడుకుతూ ఉంటుంది. మనం అష్టదరిద్రులుగా పుట్టి ఉంటిమి  ఇది మన ఖర్మ " అంటూ ముక్కు చీదింది.

పనలు ఆరాక  కుప్ప వేయకుండానే  పంట నూర్పిడి చేసి పరిగ గింజలు కూడా ఒదలకుండ మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు నాయుడు. కడుపు మండిపోయింది తల్లి కొడుకులకి. వాలుకుర్చీలో కూర్చుని సిగిరెట్టు కాల్చుకుంటూ  పంట లెక్కలు చూసుకుంటున్నాడు నాయుడు . "అయ్యా ! " అని పిలిచాడు కోటి.

" ఏమిరా కోటీ . నీ లెక్క కూడా జూస్తున్నా ! నీ బాకీ కొంత ఉండింది. ఈ ఏడు కూడా చేసేవంటే తీరిపోద్ది "అన్నాడు .

"అంటే ..ఇంక మూడేలు బాకీ పడ్డానన్నమాట" . అన్నాడు .

"ఏమిరో ..నీకు లెక్కలు బాగా వస్తుండాయ్ రాత్రి బడిలోకి పోతున్నావా ఏందీ ?"

"మా  బతుకులకి బడోకటే తక్కువ . మా తమ్ముళ్ళకి రెండు పూటలా తిండే లేదు . మా యమ్మ నేను పొద్దుగాలం  ఈడనే పని చేస్తా ఉండాము. అయినా పిల్లల నోట్లో గంజి కూడా లేదు. నాలుగు సేర్లు బియ్యం పోయమని అడిగినా లేవంటది ఊర్మిల్లమ్మ.   మీ దగ్గర పంజేసేతప్పుడు మీరుగాక ఎవురప్పిస్తారు అప్పు మాకు?  అందరూ బయట పంజేయడానికి పొతే రోజుకి నూర్రూపాయలు కళ్ళ జూస్తున్టిరి. నాకేమో ఏడాదికి ఆరు బస్తాల ఒడ్లు కొలిసేదానికి కష్టంగా ఉంది. . బత్తెం కొలిసే రోజల్లా తిడతానేఉంటది.ఊర్మిల్లమ్మ" నాయుడి కళ్ళల్లోకి చూస్తూ దైర్యంగా చెప్పాడు

"అయితే ఏమంటావ్ రా ! జీతానికి ఉంటానంటావా పోతానంటావా ! నీ  యవ్వారం  చూస్తే మానేసేటట్టే ఉన్నావ్ ! "
"మీ బాకీ దీరిందాకా మానేయ్యను లేయ్యా ! మా కష్టమేమిటో నీతో చెప్పాలని అంతే! పశువులని కాసుకొచ్చి పేడేత్తిపోసి పాలు తీసిచ్చేది నేను. కూటిలోకి మజ్జిగనీళ్ళు కూడా లేవంటారు. మావోసి చేపలు పట్టుకోచ్చేది నేను. పిత్తబరికెలు కూడా వండుకుని తినమని ఈయరు". తమ్ముళ్ళ కడుపాకలి, రోజు కూడు పెట్టె టప్పుడు ఊర్మిల్లమ్మ సణుగుడు అన్నీ గుర్తుకొచ్చి ఆవేశంగా అడిగేసాడు కోటి .
"మీ నాయన ఎన్నడూ ఇట్టా మాట్టాడలేదురా ! నీ నోరిట్టా  పెగుల్తా ఉంది. విచిత్రంగా ఉందిరా కోటి " ఆశ్చర్యంగా అన్నాడు.
"ఇచిత్రమేముందయ్యా !  మా ఆకలి బాధిది. నా జీతం నెలకి ఒక బస్తా వడ్లు రెండొందల డబ్బులు , మా అమ్మకి నెలకి అయిదొందలు జీతం ఇస్తేనే పనికి వస్తాము . లేకపోతే  ఏరే చోట చూసుకుంటాం."  నిక్కచ్చిగా చెప్పేసాడు.

నాయుడు ఆలోచిస్తున్నాడు. కోటి లాంటి వొళ్ళుఇరగదీసుకుని  పన్జేసేటోడు పల్లెంతా  జల్లెడేసిపట్టినా దొరకడు. ఇన్నేళ్ళు ఆడిని పిల్ల పాలేరు లెక్కనే చూసి జీతం తక్కువిచ్చినా సరిపోయింది. మొన్నకారుకి పొలంలో   పనిచేసినప్పుడు చూస్తుంటే ఇద్దరి లెక్క పని చేసాడు. అడిగినంత కాకపోయినా ఎంతో కొంత పెంచక తప్పదనుకుని "సరేలేరా కోటీ " నలుగురు ఎట్టా ఇస్తే అట్టాగే ఇస్తాను. పొద్దుటే వచ్చేయ్ " అన్నాడు.

"పన్జేసేట ప్పుడు ఒళ్ళు ఎట్టా దాచుకో కూడదో  కష్టమైనప్పుడూ  నోరట్టాగే దాచుకోకూడదని  మా అయ్య చెప్పే వాడు.  నీతోగాక ఎవరితో చెప్పుకోవాలయ్యా ! మా కష్టం నష్టం నువ్వే వినుకోవాల " అంటూ యజమాని పట్ల వినయం చూపించాడు .

అలాగే పదేళ్ళు కష్టపడి తమ్ముళ్ళు  పెద్దై తలోదారి ఎతుక్కునేదాక  నాయుడి దగ్గర విశ్వాసంగానే  ఉన్నాడు.  పదేళ్ళు గడిచి పోయాయి నాయుడు పిల్లలు పట్నం బోయి చదువుకున్నారు విదేశాలకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.  పాత ఇల్లు స్థానే  కొత్త డ్యూ పెక్స్ ఇల్లు వచ్చింది  కోటికి పెళ్ళైంది ఇద్దరాడ పిల్లలు. ఇద్దరు బడికి పోతున్నారు . కోటి తల్లి చిలకమ్మ  ముసలదై పోయి ఇంట్లో పనిపాటా  చేసుకుంటూ ఉంటే  కోటి పెళ్ళాం రాజ్యం నాయుడింట్లో పని జేయడానికి వెళుతుంది.  వాళ్ళ బతుకుల్లో అంతే తేడా !

వానలు సరిగ్గా పడక పంటలు పండకపోయే సరికి పనినే నమ్ముకున్న వాళ్లకి పనిలేక చాలా మంది ఊరిడిసిపెట్టి పట్నం బాట పెట్టారు.  వాళ్ళ లాగా  ఊరిడిసి పోలేక  నాయుడింటిని వదల లేక  అత్తెసరు బ్రతుకు బ్రతుకుతానే ఉండాడు కోటి.  కాస్తో కూస్తో బోరు క్రింద సాగు చేసేది నాయుడోక్కడే! ఏతేత కి వ్యవసాయం లాభసాటిగా లేదురా కోటీ ! అంటూనే సాగు చేస్తానే ఉన్నాడు. వానల్లేక కాలవలు రాక పొలాలన్నీ బీళ్ళు అయిపోయాయి. పశువులకి మేత  కూడా దొరక్క  కళ్ళ నీళ్ళతో కటికాళ్ళకి అమ్ముకున్నారు.

ఒరేయ్ .. కోటి .. కూలోళ్ళతో  పంట కోపిస్తే ఏంమిగిలేటట్టు లేదురా ! అందుకే మిషన్ కోత  కోపిచ్చేద్డామనుకుంటున్నాను  ఏమంటావ్ .. అన్నాడు నాయుడు.

కోటి గుండెల్లో రాయి పడింది. కోతలొస్తున్నాయి బీద బిక్కికి పని దొరికి కొన్నాళ్ళకైనా   కడుపునిండా కూడు దొరుకుద్ది అని ఆశ పడితే .. నాయుడు కోత  మిషన్ అంటన్నాడు నాయుడు మిషన్ దారి బడితే మిగతావాళ్ళు ఊరుకుంటారా ?

నాయుడు లెక్కలేస్తున్నాడు. కోతకి ఎకరానికి పది మంది పడతారు పది నూట యాబైయ్యిలు పదునైదొందలు  కుప్ప వేయటానికి ఆరుగురు ఆడాళ్ళు ఇద్దరు మగాళ్ళు పదిహేడొందలు కూలీ, కుప్ప తొక్కడానికి ఎకరాకి వెయ్యి రూపాయలు, మళ్ళీ తూర్పార బట్టడానికి ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుంటే .. కోత  మిషన్ తో కోపించడమే మేలు.   మిషన్ లు చేలల్లోకి దిగినయ్యి . ఉన్న ఆపాటి పని పోయే!  కోత  మిషన్ లొచ్చి నోట్టోకి పోయే మెతుకులకి కోత పెట్టాయి.

పెద్ద పండక్కి   అమెరికా నుండి వచ్చిన  నాయుడు పిల్లలు వ్యవసాయం లాభసాటిగా లేదని  రియల్ ఎస్టేట్  వాళ్ళకి సగం భూమిని అమ్ముకుని పోయారు. మిగతా సగానికి ఇనప కంచె వేసుకున్నారు. పశువులని అమ్మేసారు. ఇక కోటికి ఆ ఇంట్లో పనిలేకుండా పోయింది. పనిలేక చేతిలో చిల్లి గవ్వ లేక దినదినగండంగా మారడంతో  కోటి కూడా పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పట్నం బాట  పట్టాడు.

నాయుడుకి బంధువయిన  ఓ బిల్డర్ దగ్గర సైట్ వాచ్ మెన్ అవతారమెత్తాడు. పట్నం వచ్చినా పస్తులుండక తప్పడం లేదు. నెలకి రెండు వేలోస్తే ఏ మూలకి సాలడం లేదు.  పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కే  పంపుతున్నా రోజుకో  పుస్తకమంటారు పెన్నంటారు.  రాజ్యం ఇళ్ళల్లో పనులు చేయడానికి వెళతా  ఉంది. అయినా నలుగురి నాలుగేళ్ళు నోట్టోకి ఎల్లడం కష్టంగానే ఉంది.  పద్దాక తల్లిమాట గుర్తుకొస్తుంది. పేదోడి కష్టం పెదవికి చేటు రా కోటీ ! మన కష్టం ఇలువ నీళ్ళలో కూడ ఉడకదు. పెట్టి పుట్టినాళ్ళకి పాలల్లో ఉడుకుద్ది అదంతే "  అని. గతం జ్ఞాపకాలతో రాత్రంతా నిద్రలేని కోటి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాడు.

తెల్లారగానే బయలెల్లి తల్లిని చూసి రావాలనిపించింది  ఊరి మీద బెంగ పుట్టుకొచ్చింది.. "ఊరికెళ్ళొ స్తానే  రాజ్యం.  నాయుడడిగితే ఏదో ఒకటి చెప్పు ... అని  చిరు చీకట్లోనే  బయలుదేరాడు . బస్ చార్జీకి డబ్బులు కూడా లేవు.  తన పాత డొక్కు  సైకిలేసుకునే  బయలుదేరాడు. దారి పొడుగూతా రోడ్డు ప్రక్కగా అంతస్తులు అంతస్తులు వేస్తున్నారు. అందులో కొన్ని కాలేజీలు, కొన్ని జనముండే  ఇళ్ళు. ఎక్కడా పంటపెట్టిన ఆనవాలే కనబడలేదు.  

తార్రోడ్డు దాటి ఊరి బాట పట్టాడు. పచ్చగా కళకళలాడే  పొలాలన్నీ ముక్కలు ముక్కలుగా విడకొట్టి రాళ్ళు పాతేసి ఉన్నాయి ఆ రాళ్ళకి పచ్చరంగు,తెల్ల రంగు రాళ్ళు దూరానికి కూడా కనబడుతూనే ఉన్నాయి బస్ రావడమే గగనమయిన ఆ వూరి రోడ్డులపై  ఎడతెరిపి లేకుండా తెల్లటి పడవలాంటి కార్లు ఎర్ర దుమ్ము కొట్టుకుని తిరుగుతూ ఉన్నాయి. తెల్లటి బట్టలేసుకున్న కొత్త కొత్తవాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ తెగ తిరిగేస్తున్నారు  .

ఎలా ఉండేది ఊరు !?  కోటికి లోలోపల నుండి బాధ తన్నుకొస్తుంది  పచ్చటి వనంలాంటి ఊరు, సీతాకోక చిలకల్లా మనుషులు తిరిగే వూరు ఊరంతా బోసిపోయి ఉంది. ముసలి ముతక తప్ప ఎవరూ లేరు ఊళ్ళో ! ఇంటి ముందుకి పోయి "అమ్మా ! పిలిచాడు. చిలకమ్మ పలకలేదు. తలుపు తోసుకుని లోపటికెళ్ళాడు. అమ్మా ..  చేత్తో తట్టి పిలిచాడు.  తల్లి కళ్ళల్లో ఏదో వెలుగు. "కోటీ ..వచ్చావా ? దీపాల అమాస వచ్చేస్తుందిరా. వరి కోతకోయ్యాలి. లేకపోతే  వాన కురిసి పంటంతా నీళ్ళ పాలై పోద్ది. నాక్కూడా ఒక కొడవలియ్యి. చిన్నోల్లని కూడా చేలోకి రమ్మను,వాళ్ళు  పనలన్నీ గుట్ట మీదకి మోస్తారు"  అంటుంది చిలకమ్మ. తల్లికి మతి భ్రమించిందని అర్ధమయింది కోటికి. "అట్టాగే అమ్మా అట్టాగే! "  అన్నాడు.

తల్లిని లేపి కూర్చో బెట్టాడు. ప్రక్కింటి పిన్నమ్మని పిలిచి నీళ్ళు పోయించి ఉన్నదాంట్లోనే మంచి చీరని కట్టించాడు. తల్లి చిరుగు చీరలని మూట కట్టుకుని  వెనుక కేరేజీ పై పెట్టి ముందు సీటులో తల్లిని కూచ్చోబెట్టుకుని పట్నానికి తిరుగు ప్రయాణమయ్యాడు కోటి.

దారిలో  నాయుడు కనబడి "మీ అమ్మకి పిచ్చి బట్టిందిరా! పట్నంలో పెద్దాసుపత్రిలో చూపిచ్చు. డబ్బులీయబడలా,  ఊరికే చూస్తారు " అన్నాడు .

"వద్దులేయ్యా ! ఆ పిచ్చిలోనే ఆమెని సుఖంగా బతకనీ, ఈ పిచ్చి బతుకుల వైనం ఆమెకి తెలిస్తే గుండాగిపోద్ది" కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.


(ఉషోదయ వెలుగు  త్రై మాసిక పత్రికలో నవంబర్ -డిసెంబర్ సంచిక లో వచ్చిన కథ )



13, జనవరి 2016, బుధవారం

నీవుంటే..వేరే కనులెందుకు




నీవుంటే వేరే కనులెందుకు ... ఈ పాట బాలు పాడిన పాట. బాపు దర్శకత్వం వహించిన చిత్రం. ఆ చిత్రంలో పాటలన్నీ బాగుంటాయని వేరే చెప్పనక్కరలేదు కదా!

బాల్య స్నేహం అంటే ఏమిటో చెప్పే ఎగరేసిన గాలి పటాలు పాటని ఎవరైనా మర్చిపోగలరా? ఆ పాటని ఇక్కడ వినేయండి..


స్నేహితులంటే ..ఎవరైనా కావచ్చు కదా! స్నేహం చిత్రం లో ఈ పాట వింటే.. ఓ..ప్రియమైన స్నేహితురాలికోసం ఓ..పాట పాడితే ఇలా ఉంటుంది. నీవుంటే వేరే కనులెందుకని నీ కంటే వేరే బ్రతుకెందుకని ....

 ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టమైన పాట

పాట సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
సంగీతం;కే.వి.మహదేవన్

నీవుంటే వేరే కనులెందుకు
నీకంటే వేరే బ్రతుకెందుకు
నీ బాట లోని అడుగులు నావే
నా పాట లోని మాటలు నీవే

నీవుంటే వేరే కనులెందుకు
నీకంటే వేరే బ్రతుకెందుకు
నీ బాట లోని అడుగులు నావే
నా పాట లోని మాటలు నీవే

నా ముందుగా నీవుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగా లేకుంటే చీకటి (2 )
నీ చేయి తాకితే తీయని వెన్నెల
చేయి తాకితే తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి జల్లు

నీవుంటే వేరే కనులెందుకు
నీకంటే వేరే బ్రతుకెందుకు

నిన్న రాతిరి ఓ..కల వచ్చింది
ఆ కలలో ఒక దేవత,... దిగివచ్చింది (2 )
చందమామ కావాలా....
ఇంద్రధనువు కావాలా....
అమ్మ నవ్వు చూడాలా..
అక్క ఎదురు రావాలా ....

చంద మా ...మ కా ..వా ..లా ....
ఇంద్రధనువు కావాలా....
అమ్మ నవ్వు చూడాలా..
అక్క ఎదురు రా..వా..లా..
అంటూ అడిగింది.. దేవత అడిగింది..
అప్పుడు నేనేమన్నానో తెలుసా...
..వేరే కనులెందు కని.. నీ కంటే వేరే బ్రతుకెందుకని
ల ల ..హు..హు ..ల ల ల
ల ల ల ..ల ల
లలల ..ల ల ..ఆహాహ
ల ల ల .. ఊహు ..ల ల ల..
ఇదే పాటని విషాదంలో వినండి..


5, జనవరి 2016, మంగళవారం

"ఇంటి పేరు"

బస్ లాయర్ ఆఫీస్ దగ్గరలో ఆగింది . దిగి లోపలికెళ్ళగానే లాయర్ అసిస్టెంట్  "సార్  లేరండి !  నేనే మీకు ఫోన్ చేసి చెపుదామనుకున్నానువచ్చే గురువారం  మీకు విడాకులు వచ్చేస్తాయని చెప్పమన్నారు అని చెప్పింది తలూపి బయటకి వచ్చేసానుబజారు పనులేవో ఉంటేకూడా అటువైపు వెళ్ళాలనిపించలేదుతిన్నగా ఇంటికొచ్చిపడ్డాను. టీవి ఆన్ చేసి సోఫాలో అలా నడుం వాల్చాను. కళ్ళు మూతలు పడిపోయాయి.  

కలలో ..ఎవరొ వెంటబడి  తరుముతున్నట్టు పరిగెత్తలేక తనొక చోట కుప్పకూలిపోయినట్లు వెంబడిస్తున్న వారందరూ చుట్టూ జేరి రాళ్ళతో తనని కొడుతూ "ఇంటి పేరు తండ్రి పేరో భర్త పేరో లేకుండా బ్రతుకుతుందట . అలా లోక విరుద్దంగా బ్రతుకుతానంటే ఊరుకుంటామా కొట్టండి .. ఆమాట అనననే దాకా కొట్టండి చంపండి అంటున్నారు.

వద్దు...  కొట్టకండి నన్ను .. ఈ పేర్లు మోయడమే ఆడదానికి ఒక బాధ . బాధకి వారసులు ఉండాలని కోరుకుంటున్నారా మీరందరూ ? ఏ మాత్రం ఆలోచించకుండా నా వెంట ఎందుకు పడుతున్నారు ?  కాస్త ఆగి ఆలోచించండి ప్లీజ్ ! వేడుకుంటుంది తను. అయినా వాళ్ళందరూ ఏ మాత్రం ఆగలేదు రాళ్ళతో కొడుతూనే ఉన్నారు.
వద్దు... వద్దు అంటూ తను  ఏడుస్తూనే ఉంది. ఏడుపులోనే మెలుకువ వచ్చింది. తర్వాత కూడా ఏడుపే. పగటి కలలు నిజమవుతాయంటారు. నిజంగానే లోకం అలా తరుముతుందా తనని ? 

దుఖం నుండి  తెరిపిన పడటానికి స్నానం చేసొచ్చి తల దువ్వుకుంటూ అద్దంలో చూసుకోసాగానుపాపిడ లేకుండా  జుట్టు దువ్వుకోవడం అలవాటై పోయింది అయినా  వెంట్రుకల మధ్య పాతదారులు  చెరిగిపోలేదు ఎడమ ప్రక్క పదిహేడేళ్ళ పాటున్న ప్రక్క పాపిడి దగ్గర జుట్టు చీలిపోతుందిఅదిచూసి  నవ్వుకుంటూనే  ఆలోచిస్తుంది.  

పెళ్ళికాకముందు ప్రక్క పాపిటపెళ్ళి తర్వాత నిలువు పాపిడి. ఎడమ  ప్రక్క పుట్టిల్లు కుడివైపు అత్తిల్లు లాగా. నిలువు పాపిడి అనే  సాంఘీకం కూడా అత్తింటి ఆనవాయితీ అంట. అదొక్కటేనా కాళ్ళకి పట్టీలు ఒద్దనడం, ముక్కుపుడక పెట్టుకోవాలనడం .. అన్నీ వాళ్ళ ఇష్టప్రకారం నడుచుకోవాల్సిందే! 

ఆడపిల్లని ఎందుకంటారో ఎందరినో అడిగినా అందరూ  ఒకటే  సమాధానం చెప్పేవాళ్ళు.  ఎంత అల్లారుముద్దుగా  అపురూపంగా  పెంచినా ఆడకి వెళ్ళాల్సిందే కదాఅనిపుట్టినప్పటి నుండి  పెరిగిన ఇల్లుఊరుబడిగుడి  ప్రాణం ఉన్న మనుషులు ప్రాణం లేని వస్తువులకి స్థలాలకి కూడా ప్రాణం పోసుకుని ఆణువణువూ అల్లుకున్న మమతలు అన్నీ ఒక్కసారిగా పరాయి అయిపోయినప్పుడు కల్గిన బాధని  చెప్పడం కన్నా  అనుభవిస్తే కానీ అర్ధం కాదు 

దక్షిణపు గోడకానుకుని వరుసగా పెంచిన పూలమొక్కలువెనుకవైపు పెంచుకున్న తీగ మల్లె చెట్టుపెరట్లో వంటింకి ఆనుకుంటూ పెరిగిన కాకర తీగవాటి పచ్చని పూలు,  ఆవరణంలోని పశువులే కానీ వాటితో పెంచున్న మూగ ప్రేమలు అన్నీమనకి దూరమైపోతూన్నప్పుడు పడే బాధముఖ్యంగా చల్లగా తగిలే ఇంటి గోడలు మనస్సులో ఉన్న మాటలెన్నో చెప్పుకున్నా బయటకి చెప్పని రహస్య స్నేహితులుగోడలపై చేతులు వేసి వెళుతున్నా అని రహస్యంగా చెపుతూ లోలోపల దుఖపడిన సమయాలు ఇవన్నీ  ఆడపిల్ల మనసు భోషాణంలో  దాగిన విలువైన సంపదలుఅప్పుడప్పుడు పుట్టింటికి అతిధిగా వెళ్ళినప్పుడు అందరికన్నా ముందు  పాత నేస్తాలని వెదుక్కునే చూపు వాటిని చూసి సంతోషమో విచారమో కల్గిన క్షణాలు. అవన్నీ  ఎవరికీ అర్ధం కాని మానసిక అనుబంధాలుజ్ఞాపకాల పొదరింటిలో కాసేపు విహరించి ఎంత వద్దనుకున్నావచ్చిన  బాధ ననుభవిస్తూ  అందులోనే ఆనందం వెతుక్కుంటూ మళ్ళీ  చిన్నతనంలోకి  వెళ్ళిపోయాయి నా ఆలోచనలు.    

అమ్మ  ఎంతో ఇష్టంగా పెట్టిన పేరు మూడక్షరాలు  "సువర్ణ"  స్కూల్లో చేర్పించేటప్పుడు  అమ్మ ప్రక్కన లేదు నాన్న ఆ పేరుని  కాస్త మార్చేసి తన ప్రియురాలి పేరు అదే "సువర్ణాక్షిమార్చేశాడు అమ్మకి తెలిసి గొడవ పెట్టుకుంది కానీ పేరు మార్చలేకపోయిందితనక్కూడా తన పేరు నాజూకుగా లేదనే బాధ కంటే తనని పేరుతొ పిలిచినప్పుడల్లా తల్లి కళ్ళల్లో  కోపం, అయిష్టత ఎక్కువ కనబడేవి.  ఎవరన్నా  స్నేహితురాళ్ళు సువర్ణాక్షి అని పిలిచినప్పుడల్లా నన్నలా పిలవకండి అని గొడవపడేది.  తన బలవంతంమీద  అలా పిలిచినా  తను ప్రక్కకి వెళ్ళగానే సువర్ణాక్షి  అని పిలిచి వెక్కిరించేవాళ్ళు.  పెళ్ళైన తర్వాత అక్కడందరూ సువర్ణ అని పిలవడంతో  పోయిన పెన్నిది ఏదో దొరికినంత సంబరంగా ఉండేది దరిద్రం ఒదిలిపోయింది అనుకుని సంబరపడింది  కానీ ఇంటి పేరు మారిపోయింది.  ఆ ఇంటి పేరు  తనయవ్వనాన్ని శక్తిని అన్నింటిని పిండుకుని ఒట్టిపోయిన గోవులా మిగిల్చింది 

భరించేవాడు భర్త అంటారు మరి  నా భర్త ఏం  చేసాడు అడుగడుగునా అవమానించాడు, పుట్టింటి నుండి భారీగా కట్న కానుకలు తెచ్చుకోలేదనివంట బాగోలేదని,సుఖ పెట్టడం చేతకాదని,పొగరని అబ్బో .. ఎన్నో ఒంకలుఆ ఒంకలు మాటున ఊరూరా చిన్న ఇళ్ళున్నాయని తెలుసుకుంది. పదేళ్ళు సహనంగా భరించింది  కూడా.  అయినా వైవాహిక జీవితమనే పుట్టు  ఒక రోజు మునిగిపోయింది.  దొరికిన గడ్డిపోచనే ఊతగా చేసుకుని బిడ్డే లోకంగా బ్రతికింది.  కొడుకుని  పెంచి  పెద్దచేయడానికిప్రయోజకుడుని చేయడానికి ఎంతో  శ్రమ పడింది.  తండ్రి నీడ పడకుండా ఎంతగానో  శ్రద్ద తీసుకుంది, అందులో  బాధ ఉందని, బరువయిందని అస్సలనుకోలేదుఇష్టంగాబాధ్యతగా ఆ పని చేసిందిఒంటరి నడకలో ఎన్నో బాధలు, అవమానాలు కొడుకు కోసం  అన్నీ దిగమ్రింగుకుని ఏటికి ఎదురీదుకుంటూ ఒక ఒడ్డుకి చేరింది.    

కొన్నేళ్ళ  క్రితం కొడుకుపెళ్ళికి అతనొచ్చినప్పటి నుండి బంధువులు చెప్పే ఉచిత సలహాలు ఎక్కువైపోతున్నాయీ మధ్యకొడుకు కోసం తన ప్రక్కన భర్తగా నిలబడి ఉండటానికి లోపల ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా సరే అతనికి అర్హతనిచ్చింది. అతను తనని పేరు పెట్టి పిలుస్తున్నా కంపరంగా అనిపించేది .  కారుకూతలు కూసి  నన్నవమానించిన నోటితో నన్నలా  పిలవడానికి సిగ్గేయడంలేదేమో .  నా  ఒళ్ళంతటిని  ఆ కాళ్ళతోనే కదా కుళ్లబొడిచింది ఆ కాళ్ళతోనే  నా ఇంటి గుమ్మం తొక్కడానికి సిగ్గేయడంలేదూ ..  అని అడగాలనిపించేది.   అనుమతివ్వాలేగాని  మళ్ళీ నట్టింట్లోకి వచ్చి కూర్చునేటట్టున్నాడతను.  

ఇన్నేళ్ళు సహజీవనమే చేసాడో, పెళ్ళే చేసుకున్నాడో ..  తెలియదు కానీ ఇద్దరి బిడ్డల తల్లి  తన భాధల నుండి విముక్తి పొందిందిఒక కూతురికి పెళ్లై పిల్లలు. ఇంకో కూతురు చదువుఉన్న ఆస్తులన్నీ ఊడ్చుకుపోయినా జల్సా జీవనం మాత్రం అతన్ని అతుక్కుని ఉందికావాల్సిన డబ్బు కొడుకు విసుక్కుంటూ నయినా పంపుతూనే ఉంటాడు“పాపం .. అతను చాలా నలిగిపోయాడు ఈ వయసులో ఏం కష్టపడగల్గుతాడు మీ నాన్నకి డబ్బులు పంపుతూ ఉండు” అని రహస్యంగా చెప్పాననుకుంటాడు నా తండ్రి. అల్లుడంటే విపరీతమైన సానుభూతి. ఆయన దృష్టిలో నేనొక పొగరబోతుని, రాక్షసిని. వాళ్ళిద్దరూ ఒకే గూటి పక్షుల్లా మెలుగుతూ ఉంటారు. పైకి కనబడకుండా లోపల మంతనాలేవో చేస్తుంటాడు అల్లుడితో.  “మా మరిది ఉండమంటే ఉంటాడు కానీ ఆమె ఒప్పుకోవాలిగా” అంటుంది తోటికోడలు ఇరుగు పొరుగు వారితోఒకప్పుడైతే ఇలాంటి మాటలు వింటే ఆవేశం ముంచుకొచ్చి తెగ పోట్లాడేదాన్నిఇప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకున్నాను. 

 ఇక అత్తగారైతే  కొడుకు మీద ప్రేమతో ఇరవయ్యి ఏళ్ళ  తర్వాత కూడా మానసికంగా తెగిపోయిన బంధాలని ముడివేసే  ప్రయత్నమేదో చేస్తూఉంటారు  ఏమోలే వయసులో ఉన్నప్పుడు అందరూ అట్టా చచ్చినాళ్ళే ఒంట్లో మదమంతా దిగినాక కుక్కలా గుమ్మం ముందుకొచ్చి పడతారుఆడాళ్ళంకష్టం సుఖం తెలిసినవాళ్ళంఓ మూలన పడి  ఉంటాడు ఉండనీయకూడదా” అని చెపుతూ ఉంటుంది 

శక్తి ఉడిగి ఓపిక నశించి దీనుడిలా ఉన్నప్పుడు  నేను తప్ప వేరే దిక్కెవరు లేరని దయ చూపమని వేడుకున్నప్పుడు  కాస్తంత కనికరం చూపించగలనేమో కానీ ఇప్పుడు మాత్రం రానివ్వను అని లోపల అనుకుని పైకి ఇలా అన్నాను "మెత్తగా సాదు జంతువులాగా కనబడతాడు, మనసు నిండా విషమే, పైగా అనుమానం చూపులతో నా ప్రతి కదలికకి ప్రహరీ కాస్తూ అడుగడుగునా నన్ను ఎద్దేవా చేస్తున్నతనిని  నేను భరించలేను. నా కొడుకు  సంపాదించి ఇస్తేనో  నేను కష్టపడితే వచ్చే  డబ్బుతోనో  సీసాలకి సీసాలు తాగి ఓపికగా  వండిపెడుతుంటే ముప్పూటలా తింటూ కూడా రుచికరంగా ఒండి పెట్టలేదని గొణుక్కునేవాడిని  ఇంట్లోకి  రానిచ్చి  కోరి కొరివిపెట్టుకుంటారా ఎవరైనా ? అందుకే అతనికి నా మనసులోనే కాదు నా ఇంట్లో కూడా స్థానం కూడా లేదు" అని చెప్పేసానామెకి.   

తండ్రిపై సానుభూతితో మెలిగే  కొడుకు ఏదో ఒకరోజు నాన్నని ఇక్కడే ఉండనీయమ్మా అనికూడా అడగవచ్చేమో నన్న అనుమానమూ ఉంది. అలాంటి పరిస్థితి రానీయకుండా ఆత్మరక్షణ కోసం కోటగోడలా నాచుట్టూ నేనే  గోడ కట్టుకోవాలనుకుంటాను. ఎవరిపైనో ఆధారపడి బతకడం మానేసినాక నా జీవితానికి సరిపడా సంపాదించుకునే స్థితిలోనే నేనున్నాను గనుక ఎవరి పెత్తనాలు కూడా నాపై సాగవని తెలుసు. నిజాయితీ ఉంటె సరిపోదు ఈ లోకంలో వ్యక్తిత్వంతో బ్రతకాలంటే నోరు కూడా ఉండాలని తెలుసుకుంది కాబట్టి బంధువులందరూ  చాటుగా అవాకులు చెవాకులు పేలడం తప్ప నాఎదురుగా మాట్లాడే దైర్యం చేయరని నాకు తెలుసుమొహమాటం లేకుండా,పెద్ద చిన్నా అనే గౌరవం లేకుండా  జాడించేస్తుంది మనకెందుకు అని తప్పుకుంటారు

అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వలేదనే కోపమో ఆత్మసైర్యంతో బ్రతుకుతున్నందుకు వచ్చిన అక్కసో ఏదైనా కానీ  మొగుడొద్దు అనుకున్నప్పుడు మొగుడు ఇంటి పేరు ఎందుకుదాన్ని కూడా తీసేయి అన్నప్పుడు నేను కోల్పోయిన నా ముప్పై ఏళ్ళ జీవితాన్ని తిరిగి ఇచ్చేసేయ్ లాంటి మాటలేవీ మాట్లాడలేదు.  ఆలోచించాల్సి వచ్చిందిఇంతకు మునుపొకసారి విడాకులకి అప్లై చేసానుకొడుక్కి  అప్పుడు పద్దెనిమిది ఏళ్ళ వయసు.  తండ్రి  ఆస్తులని అమ్ముకుంటుప్పుడు "అలా వదిలేసి ఊరుకుంటావేమిటమ్మా నీకు భాద్యత లేదా  పోట్లాడైనాపోరాడైనా  ఆస్తిని కాపాడి నాకివ్వాలని నీకు తెలియదా " అనడిగాడు .  తనకి  విడాకుల కోసం, వాడికి  ఆస్తిలో పార్టీషన్  కోసం అప్లై చేస్తూ సంతకం పెట్టమంటే అప్పుడాలోచించి వద్దమ్మాఆయన ఆస్తి వద్దు, ఆయన వద్దు ఇప్పుడు కూడా  అందరూ నిన్నే తప్పుపడతారుఅది నాకిష్టం లేదమ్మా అన్న నాకొడుకుని చూస్తే నాకెప్పటికీ గర్వకారణమే 

కొన్నినెలలక్రితం అతనే విడాకుల ప్రస్తావన తెచ్చేసరికి అసలు నా అస్తిత్వమేమిటన్న ప్రశ్న నాముందుకొచ్చింది.  అస్తిత్వమంటే మొగుడు చెప్పుక్రింది తేలులా పడిఉండటం కాదు త్రొక త్రొక్కిన త్రాచులా లేవడం సరిగ్గా నా మనస్తత్వంకూడా అదే అసలాడవాళ్ళందరికి  ఆ సృహ ఎప్పటికి కల్గుతుందో నాక్కూడా ఇరవయ్యి ఏళ్ళుగా అవసరపడని విడాకులు ఇప్పడు కావాలనిపిస్తుంది. ఇంకేమీ ఆలోచించకుండా విడాకులకి అప్లై చేసేసాను  
ఇన్నేళ్ళ తర్వాత అతనిపై  ఆరోపణలు ఏమి చేయదల్చుకోలేదు పద్దెనిమిది ఏళ్ళగా అతనునేను కలసి ఉండని కారణంగా విడాకులు తేలికగానే లభిస్తాయని లాయర్ చెప్పారుఇద్దరి అంగీకారంతో  అధికారికంగా ఉన్న ఆబంధం కూడా తెగిపోతుందిమనిషితో లేని బంధమేదో అతని ఇంటిపేరుతో నాకుంది కాబట్టి నాకు లోలోపల ఏదో చెప్పలేని బాధగాను ఉందిప్రతి దాంట్లోనూ ఆకర్షణ వికర్షణ రెండు ఉంటాయేమో ఇప్పుడలాగే ఉంది. 

దాదాపు ముప్పై ఏళ్ళు నాపేరు ప్రక్కనే మాటేసి నన్నే మరుగున పడేసి  అదిగో ఫలానా వారి కోడలిగా ప్రసిద్ది కెక్కిన తర్వాత బంధం తెంపుకున్నంత తేలికగా ఇంటి పేరుని తెంపేయడం అంత సులువేమీ కాదు. అది అంతగా నా పేరులో కూరుకుపోయింది. తోకలా స్థిరపడిపోయింది.ఈ నాగరికతలో తప్పనిసరై నాపేరులో కలసిపోయింది. అది కొన్నిసార్లు భారంగా అనిపించేది.  ఇన్నేళ్ళపాటు  నా పేరుకి ముందు ఇంటి పేరుని మోసిన దాన్నిఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయంతో ఆ పేరుతో ఉన్న అనుబంధం పటాపంచలై పోతుందా ? ఇన్నాళ్ళు నాదని అనుకున్నదానిని నానుండి ఎవరో బలవంతంగా లాక్కుంటుంటే ఎంత బాధప్రాణమైనదాన్ని ఎవరో వేరు చేస్తున్న భావన ఎంత ఇన్సేన్సిటివ్

అంతలోనే కొడుకు గుర్తుకు వచ్చాడు. అమ్మో నా కొడుకు వాడి కోసం కదా ఈ ఇంటి పేరుని పంటి బిగువునాకన్నీటి మడుగునా భరించింది వాడికి అమ్మగా మిగిలిపోయినందుకైనా ఈ  బరువుని భరించాలనిపించింది క్షణకాలం. ఇదిగో ఇలాంటి సున్నితత్వం కారణంగానే ఆడవాళ్ళు ప్రతిదానితోనూ రాజీపడిపోయి బ్రతుకుతుంటారు ఇలాంటి బలహీనతకి గురికాకూడదనుకుంటూ మనసు హెచ్చరిస్తే అప్పటికప్పుడే  సంభాళించుకున్నాను. 

పైకి బండరాయిలా కనబడినా లోలోపల దాగిన సున్నితత్వమేదో తనలో ఒద్దన్నా బయటపడుతూనే ఉంటుంది. ఏడాది క్రితం అరకొర మిగిలిన ఆస్తులు అమ్ముకున్నప్పుడు వాటా ఇవ్వాలని  గట్టిగా పట్టుపట్టాల్సి వచ్చిందిడబ్బుకోసం మాత్రం కాదుహక్కుని కాపాడుకోవాలనే పట్టుదల. ఇద్దరం కలసి సంతకాలు పెట్టేటప్పుడతనిని  చూసినప్పుడు బాధ కల్గింది . అప్పుడా  బాధని డైరీలో వ్రాసుకుంది.  అప్రయత్నంగానే  అప్పటికప్పుడు డైరీని వెతికి  పేజీలు తిరగేశాను. 

మనిషి మర్మం మాను చేవ బయటకి తెలియవంటారు. అప్పుడప్పుడు నన్ను నేను పరిశీలించుకోవడానికి, తనిఖీ చేసుకోవడానికి, మనసు లోతుల్ని తెలుసుకోవడానికి డైరీ ఓ సాధనం. డైరీని చేతిలో  తీసుకుని చదవసాగాను. అక్షరాల రూపంలో ఉన్న  నా బాధని చూసుకుని తేలిక పడటం అలవాటైపోయింది. అక్షరాల వెంట కళ్ళూ మనసు రెండు కలసి పరుగెడుతున్నాయి .

“నిన్ను చూశాక ....
నిన్ను చూస్తే  దుఃఖం రావాలి
కనీసం కోపమైనా రావాలి
నిన్నారూపాన  చూసినప్పుడైనా
కనీసం జాలి కలగాలి
పోనీ  తోటి మనిషన్న  సృహ కూడా  రాలేదు 
అందరూ  నాటి రాతి గుండె అంటారు
ఇష్టమైనవాళ్ళు  నీకు రెండు గుండె లంటారనుకో !
నిజమే ముప్పై ఏళ్ళ పాటు
నా జీవితంలో  నువ్వు భాగమయ్యాక
మంచిగానో చెడుగానో నీకొక  అనుభవమయ్యాక
నిన్ను చూసాక ఒక చిన్న కదలికైనా ఉండాలి
ఇవేమీ లేవు ఒక నిర్వేదం
నేను రాముడే కావాలనుకున్నాను
నాకు రావణుడు తటస్థపడ్డాడు
తప్పు చేసినా సరిదిద్దుకునే మనిషి కావాలనుకున్నాను
నూరొక్కతప్పులని మౌనంగా ఉపేక్షించాను
భాద్యతగా ఉండాలనుకున్నాను
బరువనినీకడ్డు వస్తున్నాని తోసిపారేసావ్..  
 వాస్తవాన్ని అంగీకరించి హుందాగా నేను తప్పుకున్నాకైనా
ఎలా ఉండాలి నువ్వు ?
నీకు నువ్వంటే ప్రేమ ఉండాలి
కనీసం  నమ్ముకున్న వాళ్ళ పట్ల బాధ్యతైనా ఉండాలి
కనీసం చిన్న ఆశ అయినా ఉండాలి
ఆరోగ్యంపై శ్రద్ద ఉండాలి
ఇవన్నీ లేకుండా కూడా బ్రతుకుండాలి అంటే
ఒక వైరాగ్య భావనైనా ఉండాలి .
కౌగిలించున్నప్పటి సమయాలే కాదు . ..
తర్వాత బోలెడంత జీవితమ్  ఉంటుందన్న సృహ ఉండాలి .
 ఇప్పటికి కూడా ఇవన్నీ లేని  నిన్ను చూస్తుంటే
మనుషులు ఇలా కూడా బ్రతికి ఉంటారా అనిపిస్తుంది .
నీకు నాకు ఉన్న బంధం సహభాగినిగాను  కాదుసహజీవనిగాను  కాదు
అయినా ఏదో ఒక బంధం కలుపుతుంది .. అది ఆర్ధిక బంధం 
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే ...  
అన్న  కార్ల్ మార్క్స్ మాడు పగలగొట్టాలి అనేదాన్ని ఎప్పుడూ ..
ఇప్పుడు నిజమనిపిస్తుంది” అని.  

చదివేసి బాధగా కళ్ళు మూసుకుంది. 

ఇప్పుడతని మీదకన్నా తన మీదే తనకి జాలి కల్గింది. బాధతో పూర్తిగా తడిసిన తనని ఎవరో జాలి వాక్యాలతో మరింత తడపడం ఇష్టంలేక వ్యక్తిగత విషయాలని ఎవరికీ పంచుకోదు. ఉబుసుపోక ఎవరో ఒకరి గురించి అసహ్యంగా మాటాడుకునే కొందరికి ఏమీ తెలియక ఏవేవో కథలల్లుకుంటే కూడా నాకేమీ బాధలేదు  కొందరి దృష్టిలో నేనొక పెడసరపు మనిషిని., ఇంకా మొగుడ్ని వదిలేసిన మనిషిని అంతే!     

తెల్లవారింది .. గతం తాలూకు ఆలోచనలన్నింటిని దుప్పటి దులిపినట్టు దులిపేసుకున్నాను. జీవన పోరాటంలో పడ్డాను. బ్యాంకు ఆఫీసర్ లోన్ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయమని నా ముందు పెట్టాడు.

పూర్తిచేయడం మొదలెట్టాను.

ఫస్ట్ నేమ్  చాలా ఇష్టంగా  చక చక వ్రాసేసాను 

సెకండ్ నేమ్ ... ఆగిపోయాను 

ఏం  వ్రాయాలిప్పుడు ?

రేపు  విడాకులయ్యాక  నా సెకండ్ నేమ్  ఏమిటీ !?

మళ్ళీ ఆడ పేరు తగిలించుకోవాలా? ఆలోచనలో పడ్డాను.  అసలీమధ్య  ఇంటిపేరుతో కూడా చాలా సమస్యలు వస్తున్నాయికులమేమిటో ముఖమ్మీద అడగలేనివాళ్ళు మీ ఇంటి పేరేమిటీ అని అడిగి ఆహా అని ముఖం విప్పార్చుకుని చేతులు కలపడమో ఓహో అంటూ నొసలు విరిచి దూరంగా తొలగి పోవడమో చూస్తున్నానుఇక పిల్లలైతే అసలు పేర్లు మర్చిపోయి ఇంటి పేర్లుతో పిల్చుకోవడం ప్యాషనైపోయింది

మనుషుల నుండి మనుషులని విడదీసే ఈ మతాలూ కులాలు ఇంటి పేర్లు. ఇలా లిస్టు పెరుగుతుందనుకున్నప్పుడు దిగులు ముంచుకొస్తూ ఉంటుంది. మా పొరుగింటామె బాగా చదువుకుంది ఉద్యోగం కూడా చేస్తుందివచ్చిన క్రొత్తల్లో బాగానే మాట్లాడిందిమాటల్లో ఇంటి పేరు అడిగింది చెప్పాను ఓహో మీరు  ఫలానా కులమా మీతో జాగ్రత్తగా ఉండాలి మా వారికి మీరు ఫలానా కులమని తెలిస్తే మాట్లాడితే ఊరుకోరు అంటూ లోపలి వెళ్ళి తలుపేసుకుందినివ్వెరపోయింది తను. 

"వీటన్నింటికన్నా ముందు నేను మనిషిని"  అని గట్టిగా అరవాలనిపించిందిఅగ్రకులమో నిమ్న  కులమో అసలు నాకే పట్టింపు లేదుఇలా ఇరుగు పొరుగు కూడా కులాల కంపుతో కొట్టుకు చస్తుంటే కులాన్ని సూచించే ఇంటి పేరెందుకు అననిపించిందిఆలోచిస్తున్న కొలది లోపలంతా చీకట్లు పురులు విప్పి నాట్యం చేస్తున్నట్లున్నాయి. 

తన స్నేహితురాలి వ్యధ గుర్తుకొచ్చింది ఆమె  తండ్రి ఇంటిపేరు నిలబడాలని వరుసగా ఏడుగురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా కుటుంబనియంత్రణ పాటించలేదు ఎనిమిదో కానుపులో తల్లి  మరణించింది. అప్పటికే పెద్దపిల్ల పెళ్ళీడుకి వచ్చినా మళ్ళీ ఆ తండ్రి పెళ్లి చేసుకున్నాడు వారసుడి కోసమని నిస్సిగ్గుగా చెప్పుకున్నాడు.  ముందు భార్య పిల్లలని గాలికొదిలేసాడు . స్నేహితురాలు  చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో  కష్టపడి చదువుకుంది. మంచి శాస్త్రవేత్త అయి దేశానికి పేరు తెచ్చి గర్వకారణంగా నిలిచినా ఆ తండ్రి తన ఇంటిపేరు ఆడపిల్లలు మోస్తున్నారంటే ఒప్పుకోలేదు. పెళ్లి పెటాకులు లేకుండా కుటుంబ  పరువు తీసేసింది అని తిట్టేవాడట.

వంశోర్దారకుడి పై  పనికిమాలిన ప్రేమలు. వీళ్ళు చచ్చి భూమిలో కప్పబడి మట్టిలో మట్టిలా కలిసిపోయి కాలి బూడిదై మిగిలి నదులలో కలిసిపోయినా ఇంటిపేరు నిలబడాలనే ఆశ మగ సంతానానికే పరిమితం చేసిన పితృస్వామ్య వ్యవస్థ భావజాలాన్ని తోలేయాలి.  సాధ్యపడితే విసర్జించాలి. భర్త పేరునో తండ్రి పేరునో ఇష్టంగా మోయడం వేరు కష్టంగా మోయడం వేరు. వాళ్ళో వీళ్ళో ఇష్టమైనప్పుడు ఇచ్చి వారికి ఇష్టం లేనప్పుడు తీసేసుకోవడం ఎంత అన్యాయం.  ఇప్పుడు నాక్కూడా ఈ ఇంటి పేరు ఇంకో సమస్యగా తోస్తుంది.  నాకసలే ఇంటిపేరు వద్దు. తీర్మానించేసుకున్నాను. 

"అప్లికేషన్ పూర్తీ చేయడానికి ఏమైనా హెల్ప్ కావాలా మేడమ్" బ్యాంక్ ఉద్యోగి మాటలతో ఆలోచనల్లోనుండి బయటపడి  “అవసరమైన ఎటాచ్మెంట్ మర్చిపోయానండీ రేపొచ్చి కలుస్తాను”  అన్జెప్పి ఇంటికొచ్చి పడ్డాను. 

ప్రిజ్డ్ లో నుండి పాలు తీసుకుని చిక్కగా కాఫీ కలుపుకుని వచ్చి త్రాగుతూ సిస్టం ఆన్ చేసానుకొడుకు నుండి మెయిల్ వచ్చినట్లు నోటిఫికేషన్ చూపించింది ఇన్ బాక్స్ ఓపెన్ చేసి చూసాను.

"అమ్మా నీకు మంచి చెడు అన్నీ తెలుసు నిన్ను బలవంతం చేయను కానీ .. ఇప్పుడు ఈ వయసులో నీకు విడాకులెందుకమ్మా నిన్నెవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేనునాన్న నీ దగ్గరకి రాడు, రానివ్వనని నీకు చెప్పాను కదమ్మా ! నాన్న నీ  చేతిలోని బరువుని అందుకోబోయినా, నిండునీళ్ళ బిందెని లోపల పెట్టబొయినా, బియ్యం బస్తా ఎత్తి డబ్బాలోకి ఒంపబోయినా వద్దని తిరస్కరించడం చూసినప్పుడు అనుకున్నాను. ఇన్నేళ్ళు ఒంటరిగానే  ఎన్నో మోసాను  ఇప్పుడు నీ సాయం లేకుండా ఈ పనులు  చేసుకోలేనా !? అన్నట్టు చూసిన చూపు నేను మర్చిపోలేదు.  నన్ను పెంచి పెద్ద చేసి ఇంత ప్రయోజకుడిగా తీర్చి దిద్దిన బరువు భాద్యత అంతా నీదే కదమ్మా ! నీ ఆత్మాభిమానాన్ని ఎన్నటికి చులకన కానీయను.   ఆయనలాగే అంటాడు ఆయన మాటలేవీ  పట్టించుకోవద్దుఇంకోసారి ఆలోచించమ్మా ! "  అని ఉంది

ఫోన్ లో చెప్పడానికి మొహమాటపడి మెయిల్ పెట్టాడని అర్ధమయ్యింది
వెంటనే రిప్లై  వ్రాయసాగాను. 

 " బాబు ! నీకు మీ నాన్న గురించి తెలుసో తెలియదో ..  నేను  నచ్చలేదని ఆమె దగ్గరకి వెళ్ళాడు. ఆమె నచ్చలేదని ఇంకొకరి దగ్గర తేలాడు. ఆ ఇంకొకామె  జబ్బుపడి హాస్పిటలో పడి  ఉంటే  కొన్నాళ్ళకి  చచ్చిపోతుందని తెలిసినాక  ఒకనాడు నాకు  ఫోన్ చేసి ఇంకా ఇక్కడ ఉండే పని లేదు వచ్చేస్తాను అని ఎంత నిసిగ్గుగా చెప్పాడు. ఆ మాట వినగానే పట్టరాని కోపం వచ్చింది . ఎక్కడికి వచ్చేది ..నా ఇంటికి వస్తే కాళ్ళు విరిగిపోతాయి. నీకిష్టమైనప్పుడు రావడానికి ఇష్టం లేనప్పుడు పోవడానికి నా ఇల్లేమీ హోటల్ కాదు సాని కొంప కాదు అని గట్టిగా అరిచి ఫోన్ పెట్టేసాను. 

ఆ మనిషికి  రుచికరంగా తిండి,పొద్దస్తమాను మందు, వేళాపాళా లేని సభ్యత లేని పొందు ఇవి తప్ప ఇంకేమీ అవసరంలేదు. అతని దృష్టిలో జీవితమంటే అనుభవింఛి తీరడమే ఇంకేమీ  కాదు. ఎంత సేపు తన సౌఖ్యం తన విలాసాలు తప్ప ఇతరుల కష్టసుఖాలు ఏమీ పట్టవు ఆడదంటే అతనికి ఆట బొమ్మ. ఆడుకుని ఆడుకుని మొహం మొత్తితే  విసిరి పారేస్తాడు ఇంకొకరిని వెతుక్కుంటాడు. అది మీ నాన్న  నైజం. ఆడవాళ్ళపట్ల అతనికున్న చులకనభావానికి తగినబుద్ధి చెప్పేతీరాలి అని ఎప్పుడో నిర్ణయించుకున్నాను కూడా !అప్పుడు విడాకులకి వేసినప్పుడు నీకిష్టం లేదని ఊరుకున్నాను కానీ ఇప్పుడు నీకు అన్నీ అర్ధం చేసుకునే వయసొచ్చింది.అలాగే నేనిప్పటికైనా నాలానేను బతకాలనుకుంటున్నాను

రకరకాల మనుషుల మధ్యభావాల మధ్యబాధల మధ్య నలిగిపోయానుముసుగేసుకుని నన్ను కష్టపెట్టుకుంటూ దానిని  ఇష్టపడుతూ బ్రతకలేనుమనిషిగా మామూలు మనిషిగా బ్రతకాలనుకుంటున్నానుదేవతక్షమ, ఔన్నత్యం లాంటి గుణాలు నాకపాదించుకోవాలని అస్సల్లేదుచర్యకి ప్రతిచర్య సమాధానం కాదని నాకు తెలుసుకానీ అప్పుడప్పుడు  అసంకల్పిత ప్రతీకారచర్య ఉంటుంది. అలాంటిదే ఈ నా నిర్ణయం కూడా !   నాకోసం నేను బ్రతకాలనే ఎరుక ఎప్పుడో  కల్గింది కాబట్టే  ఈ సంకెళ్ళ నుండి బయట పడాలన్న  సృహ ఇప్పటికైనా  వచ్చింది.  ఇక ఆలస్యం చేయదల్చుకోలేదునేనంటే నేనే వేరే  ఏ తోకలు లేకుండా స్వేచ్చగా ఉండాలనిపిస్తుందిఎవరర్ధం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు.  

పుట్టింటి వాళ్ళు పెళ్లి చేసేసి బాధ్యత తీరిపోయిందని ఊపిరి పీల్చుకుని, భర్త వదిలేసో లేక బయటకి గెంటేసో నడిరోడ్డున పడేసినా కూడా వారి ఇంటిపేరునో, వీరింటి పేరునో మోస్తూ బ్రతకాల్సిందేనా ?  ఆ పేరో  ఈ పేరో ఏదో ఒకటి లేకుండా నేను ఉండలేనా !?  ఉండగల్గాలి నేను నేనుగా ఉండాలి. అది నా కోరిక. 

విశాలాకాశం క్రింద మిట్టమధ్యాహ్నం ఎండలో నిలబడి డాటరాఫ్/వైఫాఫ్ /కేరాఫ్  లాంటివేవి  లేకుండా నన్ను నేను నిలబెట్టుకోవడమంటే  కొందరి దృష్టిలో అనాధగానో, నగ్నంగానో  నిలబడినట్టే అని నాకు తెలుసు.   రెండు సంతకాలతో, కొందరు సాక్షులు మధ్య నా పేరు స్వేచ్ఛగా మసులుతుంది. ఒక అఫిడవిట్ తో అన్నీ సర్దుకుంటాయి. వ్యక్తిగత ఆకాంక్షని సమాజానికి అపాదించాలని నాకు లేదు. ఇది నా బాధ. నా బాధ నుండి బయటపడాలంతే!  అమ్మనని కాకుండా ఒక స్త్రీ ని  అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నాను. ఈ ఒంటరి తల్లి  పెంపకం స్త్రీని అర్ధం చేసుకునే విశాలదృక్ఫదం నీకు నేర్పిందని బలంగా నమ్ముతున్నాను.   ప్రేమతో..  అమ్మ. "  

సెండ్  ఇచ్చేసి... మూడే మూడు అక్షరాలతో తన పేరు  ఫస్ట్ నేమ్ సువర్ణ సెకండ్ నేమ్ సువర్ణ ..  అని వ్రాసుకుని చూసుకున్నానుఅదే పేరుతొ మెయిల్  ఐడి  క్రియేట్ చేసుకుంటూ ఉంటే వెలుతురు గువ్వలేవో ప్రక్కన వాలినట్లు చాలా హాయిగా ఉందనిపించింది

  (2016 జనవరి భూమిక మాస పత్రికలో ప్రచురితం)