చిరుగాలి తన కదలికల్ని..కొమ్మలు ఊపుతూ తెలుపుతుంది.
ఓ..గండు చీమ క్షణం తీరిక లేకుండా తిరుగుతుంది..
పచ్చని సీతాకోక చిలుక అరక్షణంలో తోటంతా తిరిగేసింది.
వీటిని చూస్తూ..నేనే పని పాట లేకుండా కూర్చుని ఉన్నాను...
నాగరిక జీవనంలో ప్రకృతితో మమేకం అయిన సందర్భాలు అరుదుగా ఉంటాయి.అలాంటి సందర్భాలు నాకు ఆయాచితంగా లభించడం ఓ..వరం. అందునా రంగు రంగుల సీతాకోక చిలుకని చూడడటం..
ఏం చేయాలో తోచడం లేదు బోర్ కొడుతుంది..అని అనడం వింటూ ఉంటాం. నాకు బోర్ కొట్టడం అనే పదానికే అర్ధం తెలియదు.ఎందుకంటే ...
భానుని తొలి కిరణాలు భూమిని తాకక ముందే .. నా దిన చర్య ప్రారంభం అవుతుంది.
అబ్బ.. ఇంకొంచెంసేపు పడుకుంటే బావుండును అనుకునే ఛాన్స్ అసలు ఉండదు కాబట్టి లేచి లేవడంతో పాటే వాకిలి శుభ్రంజేసుకుని ముగ్గుపెట్టి... దంత ధావనం చేసుకుంటూ.. ఏ మొక్క కొత్త చివురులు తొడి గిందా .. ఏ కొమ్మకి మొగ్గ పుట్టిందా అని చూసుకుని.. ఆనందించడం ఇష్టమైన పని.
దినపత్రికని చేతిలోకి తీసుకుని ... మళ్ళీ గదిలోకి అడుగుపెట్టి.. చీకటిని పారద్రోలే పరదాలను ప్రక్కకు నెట్టి..కిటికీ తలుపుల్ని తెరచి.. చల్లని పైర గాలులని ఆహ్వానిస్తాను.
మా ఇంటి అదృష్టం ఏమిటంటే.. ఇంటి వెనుక భాగమంతా.. ఒకటి రెండు ఇల్లు తప్ప అంతా తోట భాగమే!రకర కాల ఫల వృక్షాలు, పూల మొక్కలు.
ఆ తోట అనేక పక్షుల కి ఆనవాలం. కోయిల పిలుపులు, పక్షుల కిచ కిచలు, బుల్లి పిట్టల తుర్రు మనే సవ్వడులు.. అంతా కనువిందు మయమే!
కిటికీ ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటూ..దూరంగా వినబడుతున్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో జనరేటర్ సౌండ్ తో పాటు పక్షుల కిచ కిచలు వింటూ.. కూర్చునే ఆ స్థలం నా అభిమాన స్థలం అయిపొయింది.కొంచెం ఖాళీగా ఉన్నానంటే చాలు అక్కడికి వెళ్లి కూర్చుండి పోతాను.
తోట ప్రక్కనే ఉన్న ఓ..కార్పోరేట్ స్కూల్ లో నుండి వినిపించే ప్రార్ధనా గీతం, ప్రతిజ్ఞ, కొన్ని పాఠాలు వినబడుతూ ఉంటాయి.
అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తెరచిన కిటికీ తలుపుల్లో నుండి నిత్యం ఒక గంటన్నరసేపు అయినా ఆస్వాదిస్తాను.
ప్రహరీ గోడని ఆనుకుని మొలిచిన మొక్కలు పెరిగి పెద్దవి అయి..గోడలు నేర్రులిస్తాయని వాటిని మొదలంటా నరికేసినా.. ఎక్కడనుండో..మళ్ళీ మొలిచి.. వాటి లేత పచ్చ ప్రాణాల ఉనికిని తెలుపుతూ తలలు ఊపుతూ మనిషి స్వార్ధాన్నినిరసిస్తున్నట్లు ఉంటాయి.
ఇక తోట కి ప్రత్యేకం.. రంగు రంగుల సీతాకోక చిలుకలు. తోటంతా క్షణం తీరికలేనట్లు తిరుగుతుంటాయి. కను మూసి తెరిచేలోగా చక్కర్లు కొట్టుకుంటూ.. మనిషి చపల చిత్తంకి మేము ప్రతీక అన్నట్లు ఉంటాయి.
ప్రతి రోజు నేను ఎంతో ఇష్టంగా చూసే వ్యాపకం. పసుపు పచ్చని చిన్ని చిన్ని సీతాకోక చిలుకలు ఎంత ఆహ్లాదంగా ఉంటాయో..!!
కెమెరా కన్నుకి చిక్కడానికి కూడా వాటికి ఇష్టం లేనట్లు తిరుగుతుంటాయి. నెలల తరబడి ప్రయత్నం చేస్తే కానీ కొన్ని ఫోటోలు తీయడం సాధ్యం అయింది.
అలసిన మనసులకి సేదదీర్చే శక్తి పరిసరాలకి ఎంతో ఉంటుంది. అలా ప్రాతఃకాలంలో ఆహ్లాదంగా , నిశ్శబ్ద సమయాలని.. ఆస్వాదించడం జీవితంలో ఒక భాగం అయిపొయింది.
సీతాకోక చిలుకల అందం మీరు చూసేయండి..
రంగు రంగుల సీతాకోక చిలుక ..పాట వినేయండి.