28, జులై 2021, బుధవారం

ప్రతి క్షణం నీదని...

 ప్రతి క్షణం నీదని....

ఉదయాన్నే సూర్యోదయానికి ముందే పడక మంచం దిగుతూ.. భూమి ఆధారంపై కాలూనిస్తూ.. నేను విశ్వసించిన భగవంతుడిని తలుచుకుంటూ”ఓం నమఃశివాయ” అనుకుంటాను జీవించడానికి మరొక కొత్త రోజును నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా.  మృతవస్త్రాన్ని కప్పుకున్న రాత్రి తిరిగి పురుడుపోసుకున్నట్టు జీవన అధ్యాయంలో మరొక కొత్త రోజు కొత్త వుత్సాహం అణువణువునా. 

తూరుపు ప్రసవించెను ఉదయభానుడు వికసించెను

మూగనేల పరవశించెను...

వెలుగును మనసారా లోలోనికి ఆస్వాదించాక పురా సంస్కృతి నాకు నేర్పిన సంస్కారాన్ని ఆచరణలో చూపుతాను. ఇంటిముందర ముగ్గు వేయడంలో మనం నిబిడీకృతం చేసుకున్న నిన్నటిరోజు ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. ఉత్సాహంగా వుంటే పెద్దముగ్గులు వేస్తాను. ప్రశాంతంగా వుంటే కుదిరికైన చిన్న ముగ్గును కళాత్మకంగా వేసి చూసుకుని మురిసిపోతాను. చికాకుగా వుంటే మొక్కుబడిగా నాలుగు కర్రలు గీసి మమ అంటూ ముగిస్తాను. అంటే నిన్నటిరోజున నేను జీవించిన జీవితాన్ని యీరోజు నా వాకిట్లో ముగ్గు ఆచూకీ తెలుపుతుందన్నమాట. 

ఇక్కడ కళాత్మకంగా అంటే యేమి లేదు కొద్దిగా యెక్కువ చూపే శ్రద్ద అంతే! 

రోజులో కొన్నిగంటలు మొక్కలకు నా వూహల వూసులను విన్నమించుకుంటాను. పూవులకు నా కలల విందును ఆరగింపజేసి కనుల విందును మూటగట్టుకుంటాను. పమిటచెంగుతోనో చున్నీ కొంగుతోనో బిడ్డ ముఖంపై పట్టిన చిరుచెమటలను తుడిచినట్టు మొక్కలపై పడిన దుమ్ము ధూళిని శుభ్రం చేస్తూ వాటికి చందమామ కథలు చెపుతాను.

నా నేస్తాలు పుస్తకాలు. పుస్తకాలు చదవడమంటే అనేకమందిని చదవడమే! చదవడం అంటే ఆసక్తి తోనో ఆనందం కోసమో కాలక్షేపం కోసమో జ్ఞానం కోసమో. ఫిక్షన్ కానీ నాన్-ఫిక్షన్ కానీ ఆత్మకథలు ప్రపంచస్థాయీ సాహిత్యం యేదైనా కానీయండి పఠనానుభవం జీవితానుభవం అంత గొప్పదికాదు. నా అనుభనమే నా ప్రామాణికం. ఇతరుల అనుభవం లాంటిదే పఠనానుభవం. ఇదంతా కలసి నేనూ నా ధృక్ఫథం. 

ఈ ప్రపంచం మానవుల ముసుగేసుకున్న రాక్షసులతో నిండివుంది అనుకోవడం చాలా తేలిక. అదే మనిషికి మనం కూడా నమూనా నే కదా! ఒంటరిగా గడపడం యిష్టం. సమూహంలో వున్నా సరే! కొత్త ఆలోచనను పంచే మాటలు మాట్లాడటానికి వ్రాయడానికి మాత్రమే యిష్టం చూపుతాను. నాతో సంభాషించేవారితో నా మాటలో ప్రేమను హెచ్చరికను సానుభూతిని మాత్రమే పంచుతాను. నేను ఆవేశాన్ని అణుచుకోలేను. నిర్మొహమాటంగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను. అందుకే నన్ను శత్రువుగా భావించే మిత్రులెక్కువ నాకు. స్వార్ధం మోసం కపటం లేని తావులెక్కడ? అని ప్రశ్నించుకుని.. యెవరికి వారు కొంత తగ్గించుకుంటే బాగుండును కదా, యితరుల కొన్ని ఆకాంక్షలు నెరవేరతాయి అనుకుంటాను. 

మనకు వార్తలలో వెలిగే మహిళలు కాదు సమాజంలో సగభాగమైన స్త్రీలు కావాలి. ఆ రోజులు రావాలి. అందుకోసమే యీ చిన్నపాటి రాతలు. సమాజాన్ని పిల్లల దృష్టితోనూ స్త్రీల దృష్టితో చూసినట్లైతేనే.. మనకు చాలా అర్దమవుతాయి. మితిమీరిన జ్ఞానం అహంకారమూ శాంతినివ్వదు. జ్ఞానం అనేది మృగతృష్ణ. నూతన ఆవిష్కరణలు అభివృద్ధి పథంలో వుంచగలవేమో కానీ శాంతిని ప్రసాదించవు. 

కొబ్బరిచెట్టుకు అల్లుకున్న తమలపాకు తీగ నిమ్మచెట్టు కింద పచ్చగా పెరిగే అల్లం పంట జామచెట్టుకు అల్లించిన దొండతీగె సపోటాచెట్టు యిచ్చిన ఆసరాతో విరగకాసిన పొట్లతీగ. తను బతుకుతూ మరొకరికి యిస్తున్న వూత. ఇంతకన్నా జీవన తాత్వికత యేముంది? 

ప్రకృతికి దగ్గరగా జీవించిన సమయమే మనం ప్రతి క్షణం జీవించడం... జీవించే ప్రయత్నం చేయడం. 

(ఇంకా వుందీ.... మోనోలాగ్)



10, జులై 2021, శనివారం

హృదయం కఠినం కాకపోతే..

ఈ మధ్య నాకు మా అబ్బాయి బహుమతిగా కొంత రొక్కం పంపాడు.
 కొత్త కథల పుస్తకం ప్రచురణ చేయించుకో అమ్మా అన్నాడు. 

 వద్దమ్మా,నాకు నిరాశగా వుంది. ప్రచురణకర్త లే అమ్మకాలు నిరాశాజనకంగా వున్నాయి, వద్దు అన్నారని చెప్పాను. 

 అయితే నీ కథలన్నింటిని వొక్క ఆంగ్ల పదం రాకుండా పూర్తి తెలుగు వచనంలోనే మళ్ళీ వ్రాయి, చాలా బాగుంటుందని అన్నాడు. 

 “ఎందుకలా.. నేనలా వ్రాయలేను” అన్నాను. 

 మన తెలుగు వివిధ భాషలు కలసి సంకరమయం అయిపోయింది. అలా అచ్చ తెలుగులో వ్రాసే వాళ్ళు యిపుడు కూడా వుంటే బాగుంటుందమ్మా అన్నాడు. 

 దానివల్ల ఉపయోగం యేముంది ఆ భాష కావాలంటే యాభై యేళ్ళ వెనక్కి వెళితే చాలు మన సాహిత్యమంతా సంకరం కాని తెనుగులో లభ్యమవుతుంది అని చెప్పాను. అబ్బాయి ఆలోచనల్లో స్పష్టత లేదు కానీ యేదో ఆరాటం వుంది. 

 నా మట్టుకు నేను రకరకాలుగా వ్రాస్తాను. వాక్యం ప్రారంభంలో తప్ప మధ్యలో అచ్చులు వాడను. ముందుగా చలం గారు విశ్వనాధ సత్యనారాయణ గారు కుప్పిలి పద్మ గారి వ్రాతలలో యిలా చూడవచ్చు. వి.ఎ.కె.రంగారావు గారు యిదే సరైనదని వారి స్వహస్తాలతో వ్రాయడం చూసాను. అప్పటినుండి యిలాగే వ్రాస్తూవుంటాను. (విసుగనిపించినపుడు వదిలేస్తాను. వ్రాతలో సౌఖ్యం చూసుకుంటాను) 

 ఇంతకూ.. నా కొడుకిచ్చిన బహుమతి రొక్కం 50,000/ ను కరోన సమయంలో లేమి చుట్టుకుని కటకటలాడుతున్న వారికి వైద్య సహాయానికి మరియు పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళుతూ మరికొందరిని తీసుకుని వెళ్ళడం అన్నదానం చేయడానికి పెద్దలకు వారికి అవసరమైనవి కొని పెట్టడానికి ఖర్చు చేసాను. పుస్తకం వేసి వాటిని యెదురుగా పెట్టుకుని వేదన చెందటం కన్నా యిది యెంతో విలువైన శ్రేష్టమైన పని అని నా మనసు చెప్పింది. 

ఇంకా చాలా వాగ్ధానాలున్నాయి. స్వీయ సంపాదన లేదు. సృష్టించుకోవడానికి అనుకూల సమయం కాదు. రెండింటిలో చేయి పెట్టి కాల్చుకున్నాను కూడా. మితిమీరి ఖర్చు పెట్టకుండా వుండటం కూడా అవసరం. పొదుపు చేయడం కూడా ఆర్జించడం లాంటిదే. అదొక ఆదాయమార్గం అని నా స్థిరమైన అభిప్రాయం. 

 ఎదుటివారు కష్టాలలో వుంటే నాకు బాధ కల్గుతుంది. ఎక్కడ మాట యిచ్చేస్తానో అని భయపడుతూనే వుంటాను. అన్నాక యివ్వాలంటే అబ్బాయిని అడగాలి కదా.. అందుకే పంట డబ్బులు కాకుండా ఇంకా గిఫ్ట్ గా మనీ పంపుతాడు. అబ్బాయికి అమ్మ సంగతి తెలుసు. మన చేయి వాహకమే కదా అంటూంటాను.మాట యిచ్చి చాలాసార్లు యిబ్బంది పడ్డాను.అవసరమైన అత్యవసరమైన ఖర్చులను కూడా వాయిదా వేసుకున్నాను. ఈ విషయం గొప్ప కోసం వ్రాసుకోవడం లేదు. నా బలహీనత వెలిబుచ్చుకోవడం అంతే! హృదయం కఠినం కాకపోతే కూడా అవస్థలే!జాగురుకలై వుండాలి తప్పదు.

 ఏ ఆలోచనైనా క్రియా రూపంలో కనబడకపోతే అది వృధా క్రింద లెక్క. నా యీ ఆలోచనలు వెలిబుచ్చడం కూడా వృధాయేనేమో! నాకైతే తెలియదు. చేయడానికి పనిలేక యీ .. యీ వ్రాతలు.

1, జులై 2021, గురువారం

నాకు నచ్చని నా కథ

నాకు నచ్చని నా కథ “ ఆవలివైపు”

రచయిత కూడా తను వ్రాసిన కథలను పాఠకుడిలా చదువుకోవాలని సెల్ఫ్ ఎడిటింగ్ చేసుకోవాలని అపుడే కథను మంచి శిల్పంతో చెక్కినట్లు అని కొంతమంది సూచనల ద్వారా తెలుసుకున్నాను. “ఏది ఉత్తమ రచన”  పిలకా గణపతిశాస్త్రి గారి వ్యాసం చదివి చాలా విషయాలపట్ల అవగాహన పంచుకున్నాను.

 కథలలో మనుష్యులను మరీ ఉదాత్తంగానో, దుర్భలంగానో, దుర్మార్గంగానో చిత్రీకరించడం నాకు యిష్టం వుండదు. అందుకే ఈ  “ఆవలివైపు” కథని వ్రాయలని అనుకున్నప్పుడు సర్వసాక్షి కోణంలో వ్రాయాలనుకున్నాను. కథని రెండు మూడుసార్లు తిప్పి వ్రాసాను కానీ వేరొకవిధంగా మార్చలేదు. పాత్రలకు పేర్లు కూడా అనవసరం అనిపించింది. ఇతివృత్తం నచ్చకపోవడం కూడా వొక కారణం. నాకు నచ్చలేదని లోకం ఇంకో విధంగా లేదు కదా అన్న అసహనం ఇంకోవైపు.. ఈ కథ పత్రికలో ప్రచురణకు యెంపికై వుంటే బాగుండేది కానీ యెంపిక అవక నన్ను నిరాశ పరిచింది. జీవితాలు వేరు కథలు వేరు అని ఈ కథ వ్రాసాక మరీ అర్ధమైంది.

ఈ కథ నేను వ్రాసినదే అయినా నాకు నచ్చని కారణం ఏమిటంటే... ఈ కథలో దీన స్థితిలో వున్న గర్భిణి స్త్రీ చెత్తకుండీల దగ్గర ఎంగిలి విస్తళ్ళలో ఆహారం యేరుకుని తింటున్న యువకుడు. వీరు నిర్దయ చూపిన సమాజం యొక్క శకలాలు. ఈ స్థితిలో వున్న వ్యక్తులను కథ కోసం వాడుకున్నందుకు నేను సిగ్గుపడ వలసిన విషయం. ఇక మూడవపాత్ర డ్రైవర్ ను కూడా దుర్మార్గంగా చూపాల్సిరావడం. ఈ కథలో ఒకే ఒక పాత్ర  జాలి దయ మానవత్వం చూపించే పాత్ర NRI పాత్ర. ఆ పాత్ర కూడా ఖంగుతింది. మనుషులపై వున్న నమ్మకం సన్నగిల్లింది. ఏ కూస్తో కాస్తో ధనవంతుల పట్ల వ్యతిరేకత చూపిస్తూ మంచిని ప్రకటించిన డ్రైవరు కూడా తన అవసరాల కోసం డబ్బుకు కక్కుర్తి పడి దీన స్థితిలో వున్న యువకుడి దగ్గర వున్న డబ్బు కోసం వెనక్కి వెళ్ళడం. 

ముగ్గురు పేదవారిని  వారి స్తాయిని స్థితిని రచయిత అవమాన పరిచి రెండు పాత్రలకు ఉదాత్తతను అపాదించి.. అంతలోనే  NRI పాత్రకు  ఇతరులకు  సాయం చేయడం పట్ల పూర్తి విముఖతను అపాదించడం భావ్యమనిపించలేదు. మనిషిలో  యే మాత్రం దయ జాలి లేకుండా యితరులకు సహాయం చేయకుండా రాతి మనుషులుగా చిత్రీకరించడం తగదు. ఇకపోతే ఈ కథలో తల్లి పాత్ర ఇతరులకు సహాయం చేసే గుణం వున్నప్పటికీ కూడా తన చుట్టూ వున్న పరిసరాల పట్ల మురికి మనుషుల పట్ల వున్న అసహ్యాన్ని ప్రదర్శిస్తూనే వుండటం. అది పాత్ర స్వభావం. కథ ముగింపుకు వచ్చేసరికి యే  మాత్రం పాజిటివ్  లేకుండా నెగెటివ్ గా ముగియడం నా అసంతృప్తికి కారణమైంది. 

ఈ కథలో వున్నట్టు  100 % వాస్తవం వున్నా జరిగినా కూడా... కొంత కల్పితం జతచేర్చి..  డ్రైవర్ పాత్రను మరొక విధంగా చిత్రీకరించి పేదల పట్ల రచయితకు కొంత గౌరవభావం వున్నట్టుగా వ్రాసి వుండేదాన్ని. అలా చేయకపోవడం వలన  కథలో రచయితగా నా దృక్ఫదం తేటతెల్లమైంది. అందుకే నాకు ఈ కథ నచ్చలేదు అన్నాను. వేరే కథ వ్రాసేటపుడు రచయితకు కొన్ని బాధ్యతలు వుంటాయని అర్దం చేసుకుంటూ వ్రాస్తాను.