ప్రతి క్షణం నీదని....
ఉదయాన్నే సూర్యోదయానికి ముందే పడక మంచం దిగుతూ.. భూమి ఆధారంపై కాలూనిస్తూ.. నేను విశ్వసించిన భగవంతుడిని తలుచుకుంటూ”ఓం నమఃశివాయ” అనుకుంటాను జీవించడానికి మరొక కొత్త రోజును నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా. మృతవస్త్రాన్ని కప్పుకున్న రాత్రి తిరిగి పురుడుపోసుకున్నట్టు జీవన అధ్యాయంలో మరొక కొత్త రోజు కొత్త వుత్సాహం అణువణువునా.
తూరుపు ప్రసవించెను ఉదయభానుడు వికసించెను
మూగనేల పరవశించెను...
వెలుగును మనసారా లోలోనికి ఆస్వాదించాక పురా సంస్కృతి నాకు నేర్పిన సంస్కారాన్ని ఆచరణలో చూపుతాను. ఇంటిముందర ముగ్గు వేయడంలో మనం నిబిడీకృతం చేసుకున్న నిన్నటిరోజు ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. ఉత్సాహంగా వుంటే పెద్దముగ్గులు వేస్తాను. ప్రశాంతంగా వుంటే కుదిరికైన చిన్న ముగ్గును కళాత్మకంగా వేసి చూసుకుని మురిసిపోతాను. చికాకుగా వుంటే మొక్కుబడిగా నాలుగు కర్రలు గీసి మమ అంటూ ముగిస్తాను. అంటే నిన్నటిరోజున నేను జీవించిన జీవితాన్ని యీరోజు నా వాకిట్లో ముగ్గు ఆచూకీ తెలుపుతుందన్నమాట.
ఇక్కడ కళాత్మకంగా అంటే యేమి లేదు కొద్దిగా యెక్కువ చూపే శ్రద్ద అంతే!
రోజులో కొన్నిగంటలు మొక్కలకు నా వూహల వూసులను విన్నమించుకుంటాను. పూవులకు నా కలల విందును ఆరగింపజేసి కనుల విందును మూటగట్టుకుంటాను. పమిటచెంగుతోనో చున్నీ కొంగుతోనో బిడ్డ ముఖంపై పట్టిన చిరుచెమటలను తుడిచినట్టు మొక్కలపై పడిన దుమ్ము ధూళిని శుభ్రం చేస్తూ వాటికి చందమామ కథలు చెపుతాను.
నా నేస్తాలు పుస్తకాలు. పుస్తకాలు చదవడమంటే అనేకమందిని చదవడమే! చదవడం అంటే ఆసక్తి తోనో ఆనందం కోసమో కాలక్షేపం కోసమో జ్ఞానం కోసమో. ఫిక్షన్ కానీ నాన్-ఫిక్షన్ కానీ ఆత్మకథలు ప్రపంచస్థాయీ సాహిత్యం యేదైనా కానీయండి పఠనానుభవం జీవితానుభవం అంత గొప్పదికాదు. నా అనుభనమే నా ప్రామాణికం. ఇతరుల అనుభవం లాంటిదే పఠనానుభవం. ఇదంతా కలసి నేనూ నా ధృక్ఫథం.
ఈ ప్రపంచం మానవుల ముసుగేసుకున్న రాక్షసులతో నిండివుంది అనుకోవడం చాలా తేలిక. అదే మనిషికి మనం కూడా నమూనా నే కదా! ఒంటరిగా గడపడం యిష్టం. సమూహంలో వున్నా సరే! కొత్త ఆలోచనను పంచే మాటలు మాట్లాడటానికి వ్రాయడానికి మాత్రమే యిష్టం చూపుతాను. నాతో సంభాషించేవారితో నా మాటలో ప్రేమను హెచ్చరికను సానుభూతిని మాత్రమే పంచుతాను. నేను ఆవేశాన్ని అణుచుకోలేను. నిర్మొహమాటంగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తాను. అందుకే నన్ను శత్రువుగా భావించే మిత్రులెక్కువ నాకు. స్వార్ధం మోసం కపటం లేని తావులెక్కడ? అని ప్రశ్నించుకుని.. యెవరికి వారు కొంత తగ్గించుకుంటే బాగుండును కదా, యితరుల కొన్ని ఆకాంక్షలు నెరవేరతాయి అనుకుంటాను.
మనకు వార్తలలో వెలిగే మహిళలు కాదు సమాజంలో సగభాగమైన స్త్రీలు కావాలి. ఆ రోజులు రావాలి. అందుకోసమే యీ చిన్నపాటి రాతలు. సమాజాన్ని పిల్లల దృష్టితోనూ స్త్రీల దృష్టితో చూసినట్లైతేనే.. మనకు చాలా అర్దమవుతాయి. మితిమీరిన జ్ఞానం అహంకారమూ శాంతినివ్వదు. జ్ఞానం అనేది మృగతృష్ణ. నూతన ఆవిష్కరణలు అభివృద్ధి పథంలో వుంచగలవేమో కానీ శాంతిని ప్రసాదించవు.
కొబ్బరిచెట్టుకు అల్లుకున్న తమలపాకు తీగ నిమ్మచెట్టు కింద పచ్చగా పెరిగే అల్లం పంట జామచెట్టుకు అల్లించిన దొండతీగె సపోటాచెట్టు యిచ్చిన ఆసరాతో విరగకాసిన పొట్లతీగ. తను బతుకుతూ మరొకరికి యిస్తున్న వూత. ఇంతకన్నా జీవన తాత్వికత యేముంది?
ప్రకృతికి దగ్గరగా జీవించిన సమయమే మనం ప్రతి క్షణం జీవించడం... జీవించే ప్రయత్నం చేయడం.
(ఇంకా వుందీ.... మోనోలాగ్)