10, జులై 2021, శనివారం

హృదయం కఠినం కాకపోతే..

ఈ మధ్య నాకు మా అబ్బాయి బహుమతిగా కొంత రొక్కం పంపాడు.
 కొత్త కథల పుస్తకం ప్రచురణ చేయించుకో అమ్మా అన్నాడు. 

 వద్దమ్మా,నాకు నిరాశగా వుంది. ప్రచురణకర్త లే అమ్మకాలు నిరాశాజనకంగా వున్నాయి, వద్దు అన్నారని చెప్పాను. 

 అయితే నీ కథలన్నింటిని వొక్క ఆంగ్ల పదం రాకుండా పూర్తి తెలుగు వచనంలోనే మళ్ళీ వ్రాయి, చాలా బాగుంటుందని అన్నాడు. 

 “ఎందుకలా.. నేనలా వ్రాయలేను” అన్నాను. 

 మన తెలుగు వివిధ భాషలు కలసి సంకరమయం అయిపోయింది. అలా అచ్చ తెలుగులో వ్రాసే వాళ్ళు యిపుడు కూడా వుంటే బాగుంటుందమ్మా అన్నాడు. 

 దానివల్ల ఉపయోగం యేముంది ఆ భాష కావాలంటే యాభై యేళ్ళ వెనక్కి వెళితే చాలు మన సాహిత్యమంతా సంకరం కాని తెనుగులో లభ్యమవుతుంది అని చెప్పాను. అబ్బాయి ఆలోచనల్లో స్పష్టత లేదు కానీ యేదో ఆరాటం వుంది. 

 నా మట్టుకు నేను రకరకాలుగా వ్రాస్తాను. వాక్యం ప్రారంభంలో తప్ప మధ్యలో అచ్చులు వాడను. ముందుగా చలం గారు విశ్వనాధ సత్యనారాయణ గారు కుప్పిలి పద్మ గారి వ్రాతలలో యిలా చూడవచ్చు. వి.ఎ.కె.రంగారావు గారు యిదే సరైనదని వారి స్వహస్తాలతో వ్రాయడం చూసాను. అప్పటినుండి యిలాగే వ్రాస్తూవుంటాను. (విసుగనిపించినపుడు వదిలేస్తాను. వ్రాతలో సౌఖ్యం చూసుకుంటాను) 

 ఇంతకూ.. నా కొడుకిచ్చిన బహుమతి రొక్కం 50,000/ ను కరోన సమయంలో లేమి చుట్టుకుని కటకటలాడుతున్న వారికి వైద్య సహాయానికి మరియు పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళుతూ మరికొందరిని తీసుకుని వెళ్ళడం అన్నదానం చేయడానికి పెద్దలకు వారికి అవసరమైనవి కొని పెట్టడానికి ఖర్చు చేసాను. పుస్తకం వేసి వాటిని యెదురుగా పెట్టుకుని వేదన చెందటం కన్నా యిది యెంతో విలువైన శ్రేష్టమైన పని అని నా మనసు చెప్పింది. 

ఇంకా చాలా వాగ్ధానాలున్నాయి. స్వీయ సంపాదన లేదు. సృష్టించుకోవడానికి అనుకూల సమయం కాదు. రెండింటిలో చేయి పెట్టి కాల్చుకున్నాను కూడా. మితిమీరి ఖర్చు పెట్టకుండా వుండటం కూడా అవసరం. పొదుపు చేయడం కూడా ఆర్జించడం లాంటిదే. అదొక ఆదాయమార్గం అని నా స్థిరమైన అభిప్రాయం. 

 ఎదుటివారు కష్టాలలో వుంటే నాకు బాధ కల్గుతుంది. ఎక్కడ మాట యిచ్చేస్తానో అని భయపడుతూనే వుంటాను. అన్నాక యివ్వాలంటే అబ్బాయిని అడగాలి కదా.. అందుకే పంట డబ్బులు కాకుండా ఇంకా గిఫ్ట్ గా మనీ పంపుతాడు. అబ్బాయికి అమ్మ సంగతి తెలుసు. మన చేయి వాహకమే కదా అంటూంటాను.మాట యిచ్చి చాలాసార్లు యిబ్బంది పడ్డాను.అవసరమైన అత్యవసరమైన ఖర్చులను కూడా వాయిదా వేసుకున్నాను. ఈ విషయం గొప్ప కోసం వ్రాసుకోవడం లేదు. నా బలహీనత వెలిబుచ్చుకోవడం అంతే! హృదయం కఠినం కాకపోతే కూడా అవస్థలే!జాగురుకలై వుండాలి తప్పదు.

 ఏ ఆలోచనైనా క్రియా రూపంలో కనబడకపోతే అది వృధా క్రింద లెక్క. నా యీ ఆలోచనలు వెలిబుచ్చడం కూడా వృధాయేనేమో! నాకైతే తెలియదు. చేయడానికి పనిలేక యీ .. యీ వ్రాతలు.

కామెంట్‌లు లేవు: