నాకు నచ్చని నా కథ “ ఆవలివైపు”
రచయిత కూడా తను వ్రాసిన కథలను పాఠకుడిలా చదువుకోవాలని సెల్ఫ్ ఎడిటింగ్ చేసుకోవాలని అపుడే కథను మంచి శిల్పంతో చెక్కినట్లు అని కొంతమంది సూచనల ద్వారా తెలుసుకున్నాను. “ఏది ఉత్తమ రచన” పిలకా గణపతిశాస్త్రి గారి వ్యాసం చదివి చాలా విషయాలపట్ల అవగాహన పంచుకున్నాను.
కథలలో మనుష్యులను మరీ ఉదాత్తంగానో, దుర్భలంగానో, దుర్మార్గంగానో చిత్రీకరించడం నాకు యిష్టం వుండదు. అందుకే ఈ “ఆవలివైపు” కథని వ్రాయలని అనుకున్నప్పుడు సర్వసాక్షి కోణంలో వ్రాయాలనుకున్నాను. కథని రెండు మూడుసార్లు తిప్పి వ్రాసాను కానీ వేరొకవిధంగా మార్చలేదు. పాత్రలకు పేర్లు కూడా అనవసరం అనిపించింది. ఇతివృత్తం నచ్చకపోవడం కూడా వొక కారణం. నాకు నచ్చలేదని లోకం ఇంకో విధంగా లేదు కదా అన్న అసహనం ఇంకోవైపు.. ఈ కథ పత్రికలో ప్రచురణకు యెంపికై వుంటే బాగుండేది కానీ యెంపిక అవక నన్ను నిరాశ పరిచింది. జీవితాలు వేరు కథలు వేరు అని ఈ కథ వ్రాసాక మరీ అర్ధమైంది.
ఈ కథ నేను వ్రాసినదే అయినా నాకు నచ్చని కారణం ఏమిటంటే... ఈ కథలో దీన స్థితిలో వున్న గర్భిణి స్త్రీ చెత్తకుండీల దగ్గర ఎంగిలి విస్తళ్ళలో ఆహారం యేరుకుని తింటున్న యువకుడు. వీరు నిర్దయ చూపిన సమాజం యొక్క శకలాలు. ఈ స్థితిలో వున్న వ్యక్తులను కథ కోసం వాడుకున్నందుకు నేను సిగ్గుపడ వలసిన విషయం. ఇక మూడవపాత్ర డ్రైవర్ ను కూడా దుర్మార్గంగా చూపాల్సిరావడం. ఈ కథలో ఒకే ఒక పాత్ర జాలి దయ మానవత్వం చూపించే పాత్ర NRI పాత్ర. ఆ పాత్ర కూడా ఖంగుతింది. మనుషులపై వున్న నమ్మకం సన్నగిల్లింది. ఏ కూస్తో కాస్తో ధనవంతుల పట్ల వ్యతిరేకత చూపిస్తూ మంచిని ప్రకటించిన డ్రైవరు కూడా తన అవసరాల కోసం డబ్బుకు కక్కుర్తి పడి దీన స్థితిలో వున్న యువకుడి దగ్గర వున్న డబ్బు కోసం వెనక్కి వెళ్ళడం.
ముగ్గురు పేదవారిని వారి స్తాయిని స్థితిని రచయిత అవమాన పరిచి రెండు పాత్రలకు ఉదాత్తతను అపాదించి.. అంతలోనే NRI పాత్రకు ఇతరులకు సాయం చేయడం పట్ల పూర్తి విముఖతను అపాదించడం భావ్యమనిపించలేదు. మనిషిలో యే మాత్రం దయ జాలి లేకుండా యితరులకు సహాయం చేయకుండా రాతి మనుషులుగా చిత్రీకరించడం తగదు. ఇకపోతే ఈ కథలో తల్లి పాత్ర ఇతరులకు సహాయం చేసే గుణం వున్నప్పటికీ కూడా తన చుట్టూ వున్న పరిసరాల పట్ల మురికి మనుషుల పట్ల వున్న అసహ్యాన్ని ప్రదర్శిస్తూనే వుండటం. అది పాత్ర స్వభావం. కథ ముగింపుకు వచ్చేసరికి యే మాత్రం పాజిటివ్ లేకుండా నెగెటివ్ గా ముగియడం నా అసంతృప్తికి కారణమైంది.
ఈ కథలో వున్నట్టు 100 % వాస్తవం వున్నా జరిగినా కూడా... కొంత కల్పితం జతచేర్చి.. డ్రైవర్ పాత్రను మరొక విధంగా చిత్రీకరించి పేదల పట్ల రచయితకు కొంత గౌరవభావం వున్నట్టుగా వ్రాసి వుండేదాన్ని. అలా చేయకపోవడం వలన కథలో రచయితగా నా దృక్ఫదం తేటతెల్లమైంది. అందుకే నాకు ఈ కథ నచ్చలేదు అన్నాను. వేరే కథ వ్రాసేటపుడు రచయితకు కొన్ని బాధ్యతలు వుంటాయని అర్దం చేసుకుంటూ వ్రాస్తాను.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి