చాలా రోజుల తర్వాత మనసు పెట్టి ఉద్విగ్నంగా చదివిన రచన " మనసు పొరల్లో "
అసలేం జరిగిందంటే ... అస్తమాను ఆన్లైన్ లో ఉంటానన్నమాటేగానీ చదవడం తగ్గిపోయింది. వెబ్ రీడింగ్ కష్టమైపోయింది. కళ్ళకి సులోచానాలు వచ్చి చేరాయి. ఎప్పుడూ ఫేస్ బుక్ చూడటం సరిపోయింది. గాలి కబుర్లు,సొల్లు కబుర్లు,ద్వేషం నిండిన మాటలు,ఇతర మతాల పట్ల ద్వేషాన్ని నింపుకున్న మనుషులు, వారి ప్రవర్తన, వెకిలితనం ఇవన్నీ చాలా చాలా విసుగనిపించాయి. అప్పుడప్పుడు డీ యాక్టివేట్ చేసి పడేయాలి అనిపించేది సిగిరెట్ తాగడం ఎన్నో సార్లు మానేసాను అని అన్నట్టు.
ఫేస్ బుక్ అంతా మంచి కాదు, అంతా చెడూ కాదు. ఏదో ఆ బుక్ లోపలి పేజీల్లో కాస్త నచ్చిన వాళ్ళ ప్రక్కన కాలక్షేపం చేసాను. మధ్య మధ్యలో వెబ్ పత్రికలూ చదవడం. ఈ వెబ్ పత్రికలూ చాలా వచ్చేసాయి మరి. కౌముది , ఈ మాట, విహంగ,సారంగ, తానా,గో తెలుగు, వాకిలి, పత్రిక, అచ్చంగా తెలుగు, అక్షర, ఇంకా దృష్టికి రానివి ఎన్నో ... అలాగే మధురవాణి కొత్తగా రాబోతున్న అరుగు ..ఇంకా ఏమేమి ఉన్నాయో ! (నా జ్ఞాపక శక్తికి పరీక్ష అన్నమాట ఇది. హమ్మయ్య పాస్ అయి ఉంటాననే అనుకుంటున్నా) అలా ఫేస్ బుక్ కి, వెబ్ పత్రికలకి అతుక్కుపోయి బ్లాగ్ ని అటక పై పెట్టానని అతిగా చింతించిన రోజులున్నాయి. అలాగే "మాగంటి" వారితో వియ్యం అందుకున్నాక కాస్త సమయాలని వారికి కేటాయించి ఆ కుటుంబాలతో కలవడం.. అలా వాటి మధ్య వీటి మధ్య బిజీ బిబీగా రోజులు గడిచి పోతున్నాయి.
అప్పుడప్పుడు చిన్న చిన్న ఘాతాలతో బాధ పెట్టిన ఫేస్ బుక్ ఆకస్మికంగా ఏదో పెద్ద విద్యుత్ ఘాతాన్ని ఇచ్చింది. కాస్త బాధగా పుచ్చుకుని "కల చెదిరింది కథ మారింది కన్నీరే.. ఇక మిగిలింది" అని పాడుకుంటూ (సమయానికి ఆ పాటే గుర్తుకువచ్చింది. తప్పో, ఒప్పో కూడా తెలియరాలేదు. నిజం ) డీ యాక్టివేట్ చేసాను. హమ్మయ్య అంటూ తలబరువు శుభ్రంగా కడుక్కుని... కాసేపు ఏవేవో పుస్తకాలు చదివి మళ్ళీ అలవాటు ప్రకారం సిస్టం ఆన్ చేసాను. కాస్త ఇటువైపు చూసి బ్లాగుల వైపు చూసి బాగానే దిగులుపడి .. ఎలాంటి బ్లాగ్ లోకం !! ఇప్పుడెలా మారిపోయింది !? అని విచారం ముంచుకొచ్చి ... ఇంకో Tab లోకి స్కిప్ అయ్యాను. ఏదో లింక్ పట్టుకుని అలా అలా దీర్ఘంగా మునిగిపోయి ... తర్వాత "కౌముది" లో తేలాను. ఒక కథ చదివి ... ముచ్చటేసింది. "ఒక పువ్వు కథ" .. చాలా బావుందనిపించి ... అలా అలా ఆలోచిస్తూ .. "మనసు పొరల్లో ".. భువన చంద్ర గారి మ్యూజింగ్స్ 26 వ భాగం సెండాఫ్ ఎంత బాధాకరమైనది ... అని చదువుతూ ... నిజంగా అంతే కదూ... కదూ అనుకుంటూ ఆ భాగం మొత్తం చదువుతూ కన్నీటితో తడిసి ముద్దైపోయాను.
అరెరే .. నేను కౌముది వెబ్ పత్రికని చదవకుండా వదిలేస్తూ చాలా పొరబాటు చేసాననుకుంటూ .. వెనక్కి వెళ్లి 2014 జనవరి నుండి 2016 జనవరి వరకు 25 నెలల మనసు పొరలని కదలకుండా చదివేసాను. ఎన్ని సార్లు మనసుకి దగ్గరగా వచ్చిందో ..చెప్పలేను. మనసు పొరల్లోని మధురమైన జ్ఞాపకాలు,చేదు గుళికలు అన్నీ అన్నీ మనసుకెక్కించుకుని తడిసి ముద్దై పోయాను. కొన్ని వాక్యాలు నేను వ్రాస్తే కూడా ఇలాగే ఉంటాయని చాలా... చాలా సార్లు అనిపించింది. అనేక పాటలు, మనసుకి దగ్గరగా వచ్చిన మనుషులు అన్నీ కలల్లోకి వచ్చిన మనుషుల్లా అలా కదలాడుతూ ఉంటే అయిదు గంటలు కదలకుండా ఏకబిగిన చదివేసాను.
భువనచంద్ర గారి మనసు పొరల్లోని వ్యక్తులలో నాకు బాగా నచ్చినవారు డా:గోపాలకృష్ణ గారు, పెద్దమ్మ, బబులి.
ఉమ పట్ల సానుభూతి, 1971 ఇండో పాక్ సరిహద్దులలో జరిగిన యుద్ధం మిగిల్చిన గుండె కోత దుఃఖభరితంగా ఉంది. సుమిత్ర చెప్పిన కథ, ఆమ్రపాలి కథలు విన్నప్పుడు చాలా బాధ, స్నేహపాత్రులు స్వామి , ముజుందార్,కాట్రగడ్డ ప్రసాద్ గార్లు ..ఇలా ఒక్కరూ ఒకో ముద్ర వేసేసారు. ఏ దిగులు కల్గించనిది నమ్రత ఒక్కటే ! ఇక PB శ్రీనివాస్ గారి గేయాల సంఖ్యా, కొవ్వలి నవలల సంఖ్యా చూసి అచ్చెరువొందాను. మనిషికున్న అనేక బాధలనుండి సాంత్వన కల్గించేది, మరపు కల్గించేది సాహిత్యబలం అని నేను మరొకసారి నమ్ముతున్నాను.
జ్ఞాపకాలని ఎవరూ వరుసగా పుస్తకాల్ని షెల్ఫ్ లో సర్దినట్లు క్రమంలో పేర్చలేరు. ఇటుకలతో గోడలు నిర్మించినట్లు నిర్మించలేరు . ఎప్పుడు ఏది గుర్తుకువస్తే అదే ... అలా అలా అలల్లా కదలాడుతూ ఉంటాయి. మనసు పొరల్లో దాగున్న అనేకానేక జ్ఞాపకాలని హృద్యంగా అందిస్తున్న "భువనచంద్ర" గారిని అభినందించకుండా ఉండలేం. మనసుపొరల్లో ని తలుచుకుంటూ ...
అర్జంట్ గా ఇంటిపనులకి, వంట పనికి స్వస్తి చెప్పి (ఎప్పుడూ ఉండే పనే కదా ఇది ముందు సినిమా చూడాలనే ఆత్రుత) మళ్ళీ ఇంకోసారి "మేరానామ్ జోకర్" సినిమా చూడాలి "మళ్ళా" ఎమెస్కో వాళ్ళ ప్రచురణ లో విడుదలయ్యిందో లేదో, వెన్నెలా వెన్నెలా పాట ఇంకో నాలుగుసార్లు చూడాలి అనుకుంటున్నాను. ఇవి ఇప్పటికిప్పుడు నా ఆలోచన. ఇంకా కొన్ని హిందీ పాటలు కూడా చూడాలి.
ఫ్రెండ్స్ .... మీరందరూ కూడా అలా అలా వెళ్లి మనసు పొరల్లో ...
మనసు పిడికెడంత ఆలోచనలు ఆకాశమంత .. మనసు ముంగిట్లోని దృశ్యాదృశ్యాలకి అక్షరరూపాన్ని తప్పక చదవండి .
మళ్ళీ ఇన్నాళ్ళకి నాతో బ్లాగ్ లో పోస్ట్ వ్రాయించిన నా మనసు ... మనసు పొరల్లోకి వెళ్లి సంచరిస్తూనే ఉంది . మళ్ళీ ఇంకో పోస్ట్ త్వరలో వ్రాస్తాననే నమ్మకం కల్గిస్తుంది. మళ్ళీ వస్తాను. వస్తూనే ఉంటాను .
మనసు పొరల్లో ..లింక్ ఇది . http://www.koumudi.net/Monthly/2016/february/index.html (లేటెస్ట్ సంచిక ఇది )
2014 జనవరి సంచిక లింక్ ..
ఇక్కడ నొక్కి ... .ఆ లింక్ లోకి వెళ్లి చదవడం మొదలెట్టండి .