"తన్హాయి" నవలని నేను నవలగానే చదివాను. నేను ఆ నవలని చదక ముందు.. ఆ నవల పై వచ్చిన సమీక్షలని చదవాలనుకున్నాను.
కానీ.. సమీక్షలు చదివి నవల చదివితే.. ఆ సమీక్షల ప్రభావం నాలో ఉన్న
పఠనా శక్తిని చంపేస్తుందేమో అని అనిపించింది.
తన్హాయి నవలని చదవడం మొదలెట్టగానే.. కొంచెం ఆసక్తి. ..ఓహ్.. పెళ్ళయిన వారి మధ్య ప్రేమ చిగురించిందా!? ఏమవుతుందో..చూద్దాం అనుకుంటూ ఏక బిగిన చదవడం మొదలెట్టాను. చదువుతున్న కొద్దీ పరిచయం అవుతున్న ప్రతి పాత్ర లోను..మరో నేను ప్రత్యక్షం అవుతున్నాను. కల్హార,కౌశిక్ ల ప్రేమ,వారి మానసిక సంఘర్షణ .. నాకు తెలిసిన ఎవరిలోనో చూస్తున్నట్లు బలమైన భావన.
కౌశిక్ అనుకుంటాడు..కల్హార మనసు నాది. ఆమె పూర్తిగా నా సొంతం. ఆమెని నాతొ కలసి జీవించడానికి ఒప్పించి నా భార్యకి తెలియకుండా.. ఆమెతో.. కలసి ఉండటం ని సాధ్యం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రేమలో ..ఆ ప్రేమని సొంతం చేసుకోవడంలోను ,మరొకరికి అన్యాయం చేస్తున్నామన్న భావనలోను యెంత మానసిక క్షోభ
ఉంటుందో..చదువు కుంటూ పోతుంటే.. టెన్షన్ మొదలయింది. ఆఖరికి ఏమవుతుందో..అన్న టెన్షన్ తో.. ఆఖరి పేజీలు చదవడం నాకు అలవాటు. కానీ మనసు ఉగ్గ బట్టుకుని ఓపికగా..చదవడం చేసాను. విదేశాలలో జరిగే పెళ్ళిళ్ళు.వారు తీసుకునే స్వేచ్చా నిర్ణయాలు..అందువల్ల కుటుంబానికి జరిగే నష్టాలు గురించి ఆలోచిస్తూనే.. కౌశిక్,కల్హార ల ప్రేమ ఒక తీరం చేరాలని ఆశించాను. కానీ కల్హార యెంత సంఘర్షణ అనుభవించింది. యెంత నిజాయితీగా..తన మనసుని,భావాలని వ్యక్తీకరించ గల్గింది అని నిశితంగా చూసేటప్పటికి ఆ పాత్ర పై..నాకు అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. చదివిన బాగం నే మళ్లీ మళ్లీ చదివాను.
అపుడు.. ఈ నవలపై ఒక సమీక్ష వ్రాస్తే అన్న ఆలోచన వచ్చింది. అది ఒక సాహసమే.. అనుకున్నాను. ఎందుకంటె..సమీక్ష వ్రాయడం అంటే.. ప్రతి పాత్రని నిశితంగా అర్ధం చేసుకోగల్గి ఏ పాత్ర పై అభిమానం ఏర్పరచుకోకుండా నిస్పక్షపాతంగా తప్పు ఒప్పులని చెబుతూ..వ్రాయాలి ఏమో! కానీ నాకు ఈ నవల చదవడం పూర్తయ్యేటప్పటికి "కల్హార"పాత్ర పై..విపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత పుట్టే ప్రేమ పై నెగెటివ్ ఫీలింగ్ .ని ..అది సమంజసమే అని చెప్పడం సాహసం అని చెప్పను. అది సహజం అని కొందరైనా గుర్తించారు కాబట్టి ..అలాటి ప్రేమలోని.. లోతుపాతులని, కలసి బ్రతకాలి అనుకునే టప్పుడు ఉండే సాధ్యా సాధ్యాలని .. చెప్పే ప్రయత్నం చేసారు ..నవలా రచయిత్రి.
మానసిక మైన ప్రేమ మాత్రమే సొంతం చేసుకుని.. బాధతో విడిపోయిన పెళ్ళయిన ప్రేమికులు కల్హార-కౌశిక్ లు. వారి మధ్య శారీరక సంబంధాలు కనుక నెలకొని ఉంటే.. వారి జీవిత భాగస్వామ్యులు చైతన్య,మృదుల..అంత పాజిటివ్‌గా ఆలోచించ గల్గేవారా!? అన్న కోణంలో.. నేను చేసిన ఈ సమీక్ష. ఇది.
ప్రేమ .. ఒక భావ ఉద్వేగం,కొన్ని అనుభూతుల పుష్ప గుచ్చం.
పెళ్లి ..ఒక భాద్యత తో కూడిన ఆలోచనా స్రవంతి.
ఎవరి యెదలో ఎప్పుడు ఈ ప్రేమ జనియిస్తుందో..ఎందుకు మరణిస్తుందో ..! మరణించి బ్రతికి ఉంటుందో..ఎవరు చెప్పలేరు.
భావాలు,అభిరుచులు కలసినంత మాత్రాన ఎవరు స్నేహితులు అయిపోరు.కలవక పోయినా భార్యాభర్తలు కాకుండాను పోరు. కానీ .. ఆమె లేదా అతని ఫీలింగ్ ని తన ఫీలింగ్ గా అనుభూతి చెందే భావం మాత్రం ..ఖచ్చితంగా iప్రేమే!
ఆ ప్రేమలో స్వార్ధం ఉంటుంది కౌశిక్ ప్రేమలో స్వార్ధం ని చూస్తాం మనం, కల్హార మనసు తనది అని తెలుస్తూనే ఉంది. ఆమె మనసు పై సర్వ అధికారంఉన్నప్పుడు..ఆమె శరీరం ని తను కోరుకుంటున్నాడు.అది అతనికి తప్పుగా తోచలేదు. ఎందుకంటె అతను పురుషుడు. ఏ పురుషుడు కూడా నీ మనసుమాత్రమే నాకు కావాలి నీ శరీరం నాకు అక్కర్లేదు అనడు. తనువూ,మనసు కలిస్తేనే పరిపూర్ణం అనుకోవడం కద్దు.
అదే సంఘర్షణ కల్హార మనసులోనూ తలెత్తి..కౌశిక్ ని తను మనసారా కోరుకుంటున్నాని అర్ధం కాగానే.. భయం కల్గుతుంది అది ఆమెలో కల్గిన శారీరక,మానసిక స్పందనలకి పరాకాష్ట. అది మనం గుర్తించ గల్గుతాము కూడా.
కౌశిక్ ని ప్రేమించానని తెలియగానే ఆమె మనసులో తలెత్తిన సంఘర్షణ .. అదే ప్రేమని కొనసాగించాలనే ఉద్దేశ్యం ఉంటే..తర్వాత ఉత్పన్నమయ్యే సమస్యలు ఆమెకళ్ళ ముందు కదలాడి..ఆమెని కట్టడి చేసి ముందుకు వెళ్ళనీయకుండా సంకెళ్ళు వేసాయి కానీ.. కౌశిక్ పై ఆమెకి కల్గిన ప్రేమని మొదలంటా తుడిచివేయలేకపోయింది..అంటే.. మనసు యొక్క ప్రభావం మనిషిని శాసించ లేదని చెప్పకనే చెబుతుంది.
కౌశిక్ కల్హార ల మద్య ఒక ఆకర్షణ ,బలీయమైన మోహం,ఇద్దరు దగ్గరగా ఉండాలనే కాంక్ష కూడా కనబడుతుంది.వ్యక్తీ గతమైన భావనలకి విలువనీయకుండాఇద్దరూ కూడా వారితో ముడిపడిన మిగిలిన వారి గురించి కూడా ఆలోచించుకుని విడివడటం.. "తన్హాయి" చదివిన పాఠకుల అందరి కి నచ్చిన విషయం.
కల్హార మరో రాజేశ్వరి కాలేదు. చినుకుకై పుడమి నోరు తెరిచి నట్టు..కౌశిక్ ప్రేమకై ఆమె అంతరంగం పరితపించింది. అయినను మోహం తో అతని దరి చేరలేదు.కౌశిక్ ప్రేమలో ఆమెకి హృదయ సాంత్వన లభించింది. ఆమె స్నేహితురాలు మోనికా ఇంట్లో వారు ఇరువురు కలసినప్పుడు ప్రేమలోని ఒక ఉద్వేగం తో..వారుఇరువురు ఆత్మీయంగా దగ్గరిగా ఒదిగిపోవడంలో ప్రేమ తప్ప దేహపరమైన కాంక్ష ఉండకపోవడాన్ని మనం చూడవచ్చు.
చైతన్య తో.. గడిపిన జీవితంలో ప్రేమ లేకపోయినా ..ఆ బంధంలో భద్రత ఉంది. తన కూతురి బాగోగులు,సమాజంలో ఒక గౌరవనీయమైన స్థానం కూడా ఉన్నాయి . అందు కోసమే.. ఆ ప్రేమని త్యజించింది.
హటాత్తుగా ..ఆమె కి లభించిన ప్రేమ పాత్ర లో కౌశిక్ ఇచ్చిన ప్రేమామృతం తో నింపబడిన తర్వాత కూడా ఆమె సంశయించింది. నిజాయితీగా తనలో కౌశిక్ పట్లకల్గిన భావ సంచలనాలను చైతన్యకి చెప్పడం అన్నది సాహస నిర్ణయమే!ఇలా ఎందుకు చెప్పడం ? మనసులోనే దాచేసుకోవచ్చు కదా ..అన్న చిరాకు కల్గుతుంది. కానీ కల్హార తనను తానూ మోసగించుకొని,ఇతరులని మోసగించే గుణం లేని నిజాయితీ కల్గిన స్త్రీ.
చైతన్య కూడా .. మీరివురి మధ్య సంబంధం అక్కడి వరకు వెళ్ళిందా..? అనే సందేహాన్ని పదే పదే వ్యక్తీకరిస్తాడు. అది ఒక అనుమాన పూర్వకమైన సందేహం,అవమాన పూర్వక మైన సందేహం కూడా.
అలాంటి సందేహం పురుషునిలో ఉంటుందని తెలుసు కాబట్టీ.. కల్హార పాత్రని కౌశిక్ తో మమేకం
చేయకుండా..శారీరక సంబంధాలకి అతీతమైన ప్రేమ కూడా ఉంటుందని ఒక పాజిటివ్ దృక్పధాన్ని చెప్పే ప్రయత్నంలో సపహలీకృతం అయ్యారనే చెప్పవచ్చు.
రచయిత్రి.. ఈ కోణం లోనే.. కల్హార చుట్టూ..ఒక బలమైన కోట గోడ కట్టారు. స్త్రీ మనసులో పెళ్లి తర్వాత కూడా ప్రేమ జనించడం సహజమైనదే! వివాహ బంధంలోమూడో మనిషి కి ప్రవేశం కొన్ని అసంతృప్తుల మధ్య మాత్రమే సులువు అవుతుంది. ఆ అసంతృప్తి కల్హార మనసులో ఉంది. ప్రేమ లేని పెళ్లి ఉంటుంది. ఉందికూడా. అదే ప్రేమ ఉన్న మనుషులు ఒకటిగా కలసి ఉండటానికి ..అంతకి ముందు ఉన్న బందాలని త్రుంచుకు వెళ్ళ గల్గె సాహసం భారతీయ స్త్రీకి ఉండదు అనికాదు కాని.. ఆ సాహసోపేత నిర్ణయాలు తీసుకునే ముందు..వివేకం కల వ్యక్తిగా ఆలోచించడం, నిజాయితీగా చెప్పడం .. జీవితాంతం ఒక అనుమాన పూరితమైనప్రశ్నకి సమాధానం తానూ చెప్ప గల్గినా కూడా ఆ ప్రశ్న ని ఎదుర్కోడానికి తయారుగా తనని తానూ బలోపేతం చేసుకోవడం సామాన్య విషయమేమీ కాదు.చాలా మంది కల్హార పాత్రని చిన్న చూపు చూస్తారేమో..కూడా! పెళ్లి అయిన స్త్రీకి మళ్ళీ ప్రేమ ఏమిటి? అన్న నిరసన భావం తో పాటు చైతన్య కాబట్టి అర్ధంచేసుకోగల్గాడు..అన్న సానుభూతి చైతన్య పై కలగడం సాధారణ విషయం.
మనసు భావ సంచనల రూపం. దురదృష్టవశాత్తు మనసుని మనం నగ్నీకరించి చెప్పలేం. అలాగే మాట కూడా. మనం మాటకి ముసుగు వేస్తాం. కల్హార తనమనసుని ఎక్కువ కాలం దాచుకోలేకపోయింది. నిజాయితీగా ఏం చేయాలో చెప్పమని చైతన్యని అడుగుతుంది. ఒకవేళ అతను ఆమెని ద్వేషించి ఆమె నుండివిడిపోయినా కూడా ఆమె తప్పుకు ఆమె బాద్యురాలిగా చేసుకునే వ్యక్తిత్వం ఉన్న స్త్రీ.
ఇదే నవలలో.. ఇంకా కొన్ని స్త్రీల పాత్రల కంటే కూడా ఆమె పాత్ర.. విభిన్నమైనది.
పవిత్రత అన్నది అది మానసికమా - శారీరకమా అన్నది ఎవరికి వారు విలువనిచ్చుకునే విషయం. ప్రమాదవశాత్తు పడిన ప్రేమలో.. మనసు జారిపోయినా చాలా సందర్భాలలో కౌశిక్ సన్నిహితంగా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేసినప్పుడల్లా అతనిని కట్టడి చేస్తూ..ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది చైతన్య పదే పదే అడిగినప్పుడు కూడా తానూ మనసునే కోల్పోయింది కాని శరీరాన్ని కౌశిక్ తో పంచుకోలేదు అని చైతన్య కి చెప్పగల్గింది. అదే విషయం వారి మధ్య ఎడబాటు రాకుండా ఎడబాటు కానీయ కుండా ..కాపాడ కల్గింది. చైతన్య కూడా ఒక సాధారణ పురుషుడే! తన వైవాహిక జీవితం అనే కోట కి పగుళ్ళు ఏర్పడినాయి అనితెలియగానే..తన పరువు-ప్రతిష్ట లకి భంగం వాటిల్లుతుందని బాదపడతాడు. భార్యకి తను ఏం తక్కువ చేసాడు ..ఇప్పుడేనా కల్హార ఇలా ప్రవర్తించడం,లేకఇంతకూ ముందు కూడా ఇలాటి ప్రేమ కలాపాలు కొనసా గించి మభ్య పెట్టిందా లాటి ప్రశ్నలు తలెత్తుతాయి. అదే అభద్రతా బావం మృదుల మనసులో కూడాతలెత్తడం సహజం. .
కౌశిక్,కల్హార ల మధ్య శారీరక సంబంధం కనుక ఏర్పడి ఉంటే.. చైతన్య కానీ ,మృదుల కానీ ఆ విషయాన్ని అంతా తేలికగా తీసుకునే వారా!? ఇదంతాఆలోచించేనేమో రచయిత్రి కౌశిక్,కల్హార మధ్య శారీరక దూరాన్ని ఉంచారు ఏమో అనిపించక తప్పదు.
ప్రేమలో మోహం కూడా మిళితమై ఉండటమే..ప్రేమకి పరాకాష్ట. సంపూర్ణ ప్రేమ స్వభావాన్ని అనుభవంలోకి రానీయక ఒక ఆత్మీయ చుంభనంతో ఇరువురుప్రేమికులని విడదీయడం వెనుక.. భారతీయ మనస్తత్వమే గోచరించింది. అదే ఇంకెవరు ఆయినా లేదా రంగనాయకమ్మ లాంటి రచయిత్రి అయి ఉన్నట్లుఅయితే ఆ విషయం కి అంత ప్రాధాన్యత నివ్వరు. ప్రేమ అన్నది మనసుల కలయిక ,శరీరాల కలయిక అన్నదానికి ప్రాముఖ్యత నివ్వరు. నీ మనసులో ప్రేమేకావాలి నీ శరీరం వద్దు అనే ప్రేమికుడు ఎవరైనా ఉన్నారంటే నమ్మశక్యం కాదు.
మన భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ ఇంకా బ్రతికి ఉంది అంటే కారణం అదే! ప్రేమ లేకపోయినా పెళ్లి జరిగాక శారీరకమైన సంబంధం ద్వారా పురుషుడు స్త్రీతో అనుబంధం ఏర్పరచుకుంటాడు. ఆ అనుబందాన్ని బలోపేతం చేసుకుంటాడు.ఒకవేళ పురుషుడు వేరొక ఆకర్షణలో పడినా కూడా స్త్రీలు తప్పని సరి అయిసర్దుకుని ఉండే వారు కావడం వల్ల వివాహ వ్యవస్థకి భంగం వాటిల్లలేదు.
అదే స్త్రీల విషయంలోకి వచ్చేసరికి పెళ్ళికి ముందు ఎన్ని ఊహలు ఉన్నా.. పెళ్లి జరిగిన తర్వాత పురుషుడి చుట్టూ..తన ఆలోచనలని అల్లుకుని..అందుకుఅనుగుణంగా తనని తీర్చి దిద్దుకుంటూ అక్కడే జీవితాన్ని నిర్మించుకుంటుంది.
ప్రపంచం ఏమిటో తెలియని స్త్రీకి పురుషుడే ప్రపంచం. అందుకని ఏమో.. స్త్రీలని వీధి వాకిట నిలబడటానికి కూడా అభ్యంతరం చెప్పేవారు. ప్రపంచాన్ని చూసినస్త్రీకి తనకి కావాల్సినది ఏదో తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న క్రమంలో.. హద్దు దాటుతుంది. ఆ హద్దు దాటే ప్రయత్నంలో తనకి తానే చేటుచేసుకుంటుంది. అసంత్రుప్తులని బడబాగ్నిలా దాచుకుని ..కోర్కెలని అణచుకొని వివాహ జీవితంలో మగ్గిపోతుంది. నాకు కల్హార పాత్రలో ఇదే కనబడింది. సప్తసముద్రాలు దాటినా యెంత ఉద్యోగం చేసినా.. ఆమెలో కల్గిన ప్రేమ రాహిత్యం అన్న భావనని చైతన్య తుడిచి వేయగలడా? కౌశిక్ ని ఆమె మనసు నుండి తుడిచి వేయగలడా!?
స్త్రీ ప్రేమ మానసికం. ప్రేమించిన వ్యక్తి ని ఆలోచనలోను,జ్ఞాపకాలలోను నింపుకుని ప్రేమని క్షణ క్షణం సజీవంగా ఆస్వాదించ గలదు. ఆఉత్తెజంతోనే.. బ్రతక గలననే నిబ్బరం తోనే.. కౌశిక్ తనని వీడి పోతుంటే.. కల్గిన బాధని అనుభవిస్తూ కూడా అలాగే నిలబడి పోయింది.
ప్రతి కలయిక ఒక విడిపోవడానికి నాంది అంటారు. వారి ఎడబాటు మాత్రం జీవిత కాలం బ్రతికి ఉండటానికి అని వారిద్దరికీ మాత్రమే తెలుసు. మరో ఇద్దరికీతెలిసే అవకాశం ఉన్నా కూడా.. వారు మనిషికి ఇచ్చిన ప్రాముఖ్యత మనసుకి ఇవ్వలేదు కాబట్టి..సంప్రదాయమైన వివాహ జీవితం మాత్రం పై పైమెరుగులతో..లోపల డొల్ల గానే మిగిలి ఉంటుంది.
అవగాహన,సర్దుబాటు,రాజీపడటం,సమాజంలో గౌరవం ఈ నాలిగింటి కోసమే ఆ రెండు జంటలు ..మరో రెండు హృదయపు శకలాల పై నిలబడి ఉన్నాయి అన్నది ఎవరు కాదనలేని సత్యం.
ఈ నవలలో నాకు అత్యంత బాగా నచ్చిన పాత్ర కల్హార. తనలో కలిగే భావనలకి ఎక్కడా ముసుగు వేయదు. అనవసరమైన పవిత్రతని ఆపాదించు కోదు.ఎప్పటికప్పుడు సహజంగా ప్రవర్తించడం కనబడుతుంది. రక్త మాంసాలు ఉన్న స్పందన కల్గిన స్త్రీగా.. ఆమె మనసులో కల్గిన భయాలని మరచిపోయే చోటుకౌశిక్ సాన్నిహిత్యమే అని ఆమెకి తెలుసు. అలాగే చైతన్య తో.. తన జీవితం లో కల్గిన లోటు కూడా ఏమి ఉండదు అని అనుకుంటుంది. కౌశిక్ నిప్రేమించడానికి, చైతన్యని ద్వే షించాల్సిన పని లేదు అనుకుంటుంది. ఇద్దరి పైనా ఏక కాలంలో ప్రేమ కల్గినా కూడా అది తప్పు కాదనుకుంటుంది
ప్రేమ లక్షణం బహుశా అదేనేమో!అది అందరికి నచ్చదు కూడా. ఇద్దరి పై ప్రేమ ఏమిటి..అది వళ్ళు బలిసిన ప్రేమ కాకపొతే..అని తిట్టిన్చుకోవాల్సి వచ్చినా సరే రహస్యంగా ఉంచక ఏమో..ఎందుకు కల్గిందో.. ఈ ప్రేమ ..అనుకునే.. స్వచ్చత కల్గిన స్త్రీ మూర్తి కల్హార. ఆమె ప్రేమని..బహుశా కౌశిక్ కూడా పూర్తిగా అర్ధం చేసుకుని ఉండదు. ఒక్క మోనికా తప్ప.
ఒకే ఒక్క రోజు ఆయినా సరే అతనితో సన్నిహితంగా ఉండి సంపూర్ణ జీవితం ని గడపాలనే ఆకాంక్షని వ్యక్త పరుస్తుంది. అక్కడ మనసు,శరీరం రెండు కలసిన కలయికకి యెంత తపించిపోయిందో.. రచయిత్రి సహజంగా వ్రాశారు. అందులో ఎక్కడా కల్హార పాత్రని ద్వైదీ భావనలో ..తేలియాడించనూ ఒక ఇనుప చట్రంలో ను బిగించలేదు. మనసు పిలుపు కన్నా కూడా శరీరం పిలుపు కూడా అంతే బలంగా ఉంటుందని కల్హార పాత్ర ద్వారా.. చెప్పడం ని పాఠకులు జీర్ణించు కోలేరేమో అన్న అనుమానం ఉంది. కాని అలా చెప్పడం సబబుగానే అనిపించింది.
తప్పు ఒప్పు ల దృష్టి తో చూస్తే..ఆంతా తప్పే! అసలు తన్హాయి నవల లో కల్హార పాత్ర చిత్రీకరణే తప్పు. మన మధ్య చైతన్య లు, మృదుల లు ఎక్కువ శాతం, కౌశిక్ లు మరి కొంత శాతం, అతి తక్కువ శాతం మంది మాత్రమే కల్హార లాంటి నిజాయితీ కల్గిన పాత్రలు ఉంటారు.
రచయిత్రి నాలుగు పాత్రలలోనూ తన వ్యక్తి గత అభిప్రాయం ని జోప్పించినా జోప్పించక పోయినా అది పెద్ద పరిగణలోకి నేను తీసుకోలేదు. కల్హార పాత్ర చిత్రీకరణ ని చాలా మంది స్వాగతిస్తారు అనుటలో ఎట్టి సందేహం లేదు.
కల్హార .. వికసిత విరాజ కుసుమం. . బుద్భుదమైనభావ జాలంలోనుండి..జనియించిన సహస్ర భావాల తో అరవిరిసిన పుష్పం..
తనలో కలిగే భావాలని,ఆలోచనలు స్వేచ్చగా వెల్లడించు కునేటప్పుడైనా నిజాయితీ లోపిస్తే.. ఈ మనుషులకి మనసు అనే వ్యర్ధ పదార్ధం ఎందుకు? అని నాకు అనిపించినది అంటే..అంతలా కల్హార పాత్ర చుట్టూ.. నెలల తరబడి నా ఆలోచనలు చుట్టుకుని ఉన్నాయి.
పెళ్ళికి ముందు పెట్టుకునే డేటింగ్ గురించి , ఓపెన్ మేరేజ్ సిస్టం గురించి,వైఫ్ స్వాపింగ్ గురించి మనం చీత్క రించు కుంటున్నాం కానీ మన భారతీయ వివాహ వ్యవస్థలో సంప్రదాయ ముసుగులో.. ఎన్నో మనవి కాని విచ్చలవిడి తనాలు రాజ్యం యేలుతున్నాయి సంప్రదాయవాదులు పాశ్చాత్య నాగరికత తో మన వాళ్ళు చెడిపోతున్నారు అంటున్నారు .కానీ మన వారిలోనూ ఉండే బహు భార్యా తత్వాలు,అక్రమ సంబంధాలు మాటేమిటి!? కొన్ని భావజాలాల మధ్య స్త్రీ స్వేచ్చని అణగ ద్రొక్కిన ..వివాహ వ్యవస్థలో.... కల్హార లాటి వాళ్ళు తమ మనసుని..తమలో పెళ్లి తర్వాత కల్గిన భావ ప్రకంపనలని వెల్లడి చేసే నిజాయితీ తనం అందువల్ల కలిగే పరిణామాలు మంచి-చెడులు .. వాటి మధ్య వివాహ బందానికి ఇస్తున్న ప్రాధాన్యత అందరికి నచ్చి ఉండవచ్చును.
నాకు మాత్రం కౌశిక్ ప్రేమకి దూరం అవుతున్న కల్హార మనసులో వేదన కళ్ళముందు కదలాడుతుంది. ఆమె పాత్రపై సానుభూతి కల్గుతుంది.
"ప్రేమయన నొక పంచభూతముల సమాహారమ్ము!అందుకలయికొక్కటేను,ప్రేమికుల ముందున్న దారి!!" అని సాఖీ గీతం. ఇదేమిటి ..వీరు ఇలా విడిపోయారు అన్న బాధ కల్గింది.కన్నీళ్లు వచ్చాయి.
మనసంటే అచ్చమైన నిజాయితీ.
ఆ మనసుకి లభించే కూసింత ఆలంబన, లభించిన ప్రేమ,జీవన పర్యంతం కాపాడే స్నేహ హస్తం దొరికే చోట మనసు స్వేచ్చగా నిర్భయంగా మసలగల్గుతుంది.
కల్హార మనసుకి తనకి కావలసినది దొరికే చోటు కౌశిక్ హృదయం అని తెలుసు.ఇద్దరు వివాహితుల మధ్య అది సాధ్యం కాదు కనుకనే విడిపోయి ఆ ప్రేమని తలచుకుంటూ.. బ్రతక గలం అని .దూరం అవుతారు. మనసు ఏకాంతంలో తనని తానూ తరచి చూసుకుంటుంది. ప్రపంచం నుండి విడివడి ఆ ఒంటరి తనం లోనే, తనలోనే బ్రతుకుతూ.. కాసిన్ని మధుర జ్ఞాపకాలుతో....సహజీవనం చేస్తుంది. అదే "తన్హాయి"
ఈ నవల లోని కథ పాతదే కావచ్చు. ఎందుకంటె.. వివాహం తరవాత ప్రేమ కూడా చాలా పాతదే! ఒక "సిల్సిలా" చిత్రం.. నా కనుల ముందు..అలా కదలాడింది. ఆఖరిగా ఒకటి అనిపించింది. కల్హార-కౌశిక్ విడిపోయారు కాబట్టి ఇది..ఒక "సిల్సిలా" చిత్రం లా ఉంది. లేకపోతె.. మేఘసందేశం అయి ఉండేది అని.
ఒక వివాహిత స్త్రీ మనసులోని భావ ప్రకంపనలని, అనుభూతులని ..అక్షరీకరించి.. "కల్హార" ని పరిచయం చేసినందుకు. కల్పన రెంటాల గారికి ..అభినందించక తప్పదు.
అలాగే నేను గమనించిన ఒక ..చిన్న అంశం. కలువ పూలతో.. లక్ష్మి దేవిని పూజించడం కాదు.కమలాలు..అని చెప్పాలి కదా! కలువ కి కమలానికి తేడా ఉంది .. ఆ చిన్న విషయంని గమనించలేదేమో అనుకున్నాను. కొన్ని చోట్ల ఇంగ్లీష్ లో ఉన్న సంభాషణ లన్నిటిని తెలుగులో ఉంచితే బాగుండును కదా అనిపించింది కూడా.
ప్రతి పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన స్త్రీ కూడా చదవాల్సిన నవల ఇది.
"ఓ అపురూప ప్రేమ కావ్యం " గా ఉదాహరించుకోవచ్చు కూడా.