31, మార్చి 2012, శనివారం

చిల్డ్రన్స్ చాయిస్ ?

పిల్లలకి కావలసినది ఏమిటో!? తల్లిదండ్రులు, పెద్దలు వారికి తెలియనిస్తున్నారా?

పొత్తిళ్ళలో బిడ్డలు ఆకలి అయినప్పుడు ఏడుస్తారు అది వాళ్ళ బాష. బాధ కల్గినా ఏడుస్తారు. అది చెప్పడానికి బాష రాదు కాబట్టి. వేళకి పాలు పట్టి,లాలి పోసి, జోల పాడి ముద్దు ముద్దుగా వారి ఆలనా పాలనలో మునిగి తేలే తల్లి ఇప్పటి పిల్లలకి కరువు. ఏ అమ్మమో,నాయనమ్మో.. వాళ్లకి అమ్మలు.

అమ్మలేమో..అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ ప్రేమ నంతటిని..ఖరీదైన బట్టలు,బిస్కట్లు,బొమ్మలు కొని తెచ్చి..ఒక రోజో, రెండు రోజులో ముద్దుముచ్చట్లు ఆడి వెళ్ళిపోతారు.  అసలే సంపాదనా పరులైన అమ్మ-నాన్నలాయే! ఎక్కువ రోజులు ఉంటె రెండు రకాల ఇబ్బందులు.  పే లాస్, పిల్లలు అలవాటు అయితే వాళ్ళు వీళ్ళని వదలక వీరు  వారిని వదిలి వెళ్ళలేని బాధలు.అలా పెరిగి పెద్దైన పిల్లలు నర్సరీలు, ఎల్ కేజీ లు, యుకేజీలు దాటి కాన్వెంట్ చదువులు.

ఇక అక్కడ నుండి మొదలవుతాయి.. వాళ్లకి అవసరం ఉన్నా లేకపోయినా సరే  షాపింగ్ కి తీసుకుని వెళతారు. బుజ్జి..కన్నా.. ఈ డ్రస్ నీకు నచ్చిందా? అని అడుగుతుంటారు. నచ్చలేదంటే.. వారికి నచ్చే డ్రస్స్ ఏమిటో..వాళ్ళ ఎంపిక కే   వదిలేసి ..వేలేడేసి లేని బిడ్డలకి ఎంపిక చేసుకునే స్వేచ్చ ఇచ్చామని మురిసి పోతారు. వాళ్ళకి కావాల్సిన బొమ్మలు ,వాళ్ళకి కావాల్సిన ఇన్స్టంట్  తినుబండారాలు..అన్నీ ప్రేమగా సమకూర్చుతారు.

ఇలా చాలా మంది తల్లిదండ్రులకి కలిగే సంతృప్తి. వాళ్ళ కోసమే కదా రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడుతున్నాం. వాళ్లకి కావాలసినది  కొని ఇస్తే తప్పేముంది అంటారు.

ఉదాహరణకి ..ఇది చూడండి. కాళ్ళకి చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో,ముళ్ళ బాటలో  మైళ్ళు మైళ్ళు నడచి వెళ్లి చదువుకుని ఉద్యోగం చేసే తండ్రి  బిడ్డలకి  కష్టం తెలియకూడదనుకుని.. ప్రత్యేకంగా ఆటో మాట్లాడి కాన్వెంట్ కి పంపడం తో పాటు తను చెప్పులు వేసుకోకుండా బాధపడిన రోజులు గుర్తు తెచ్చుకుని ..అవసరం ఉన్నా లేక పోయినా ..ఓ..పది రకాల చెప్పుల జతలు కొని ఇవ్వడం అతి ప్రేమ అనిపించుకుంటుంది. ఖచ్చితంగా చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న పని అదే!

వాళ్ళకి డాన్స్ ఇష్టం. ఊహు.వద్దు. అదేమన్నా  కూడు గుడ్డా పెడుతుందా? వాళ్ళకి ఆర్ట్స్ ఇష్టం..ఆ పిచ్చి గీతలు..లో ఏముంది.? వాళ్లకి ఆటలు ఇష్టం..ఆ.. వాడేమన్నా సచిన్ టెండూల్కర్ అవుతాడా ఏమిటీ?  అనుకుంటారు. వాళ్ళు అడిగింది.. అసలు ఇవ్వం.  వాళ్లకి మెకానిజం అంటే ఆసక్తి..ఇంట్లో ఉన్న రేడియో విప్పేసి మళ్ళీ బిగించే ఆసక్తి. అది మనకి నచ్చదు ..ఇవెక్కడ లో క్లాస్స్ బుద్దులు..రా..! హాయిగా చదువు కోకుండా ..అంటారు.

బిడ్డలు అడగ కుండానే..పుట్టిన రోజు పండుగ వస్తే.. ఫైవ్   స్టార్ చాక్లెట్ లు,కేక్ కటింగ్ కార్యక్రమాలు తల్లిదండ్రులే నేర్పుతున్నారు.డ్రింక్స్,ఐస్-క్రీం లు కి వాళ్ళని మనమే అలవాటు చేస్తున్నాం. ఇంట్లో వండి పెట్టె ఓపిక లేక పిజ్జాలు,బర్గర్లు,అంటూ వాళ్ళని బజారు తిన్డ్లుకి అలవాటు చేస్తున్నది తల్లి దండ్రులే!  ఇతరులతో పోల్చుకుని వాళ్ళ కి బాగా ఖరీదైన బట్టలు కొని ఇవ్వడం,  ప్రక్క వాళ్ళతో పోటీ పడటం.. ముందు పెద్దవాళ్ళ మనస్సులో పేరుకున్న పైత్యమే!

పిల్లలకి వాళ్ళ అవసరాలు ఏమిటో వారికి తెలియకుండానే అన్నీ కొని పెట్టి ..వాళ్ళని సంతుష్టులని చేసాం అనుకుంటారు కాని వారిని ఒకవిధంగా నాశనం చేస్తున్నామని తెలియదు.ఒకో కార్పోరేట్ కాలేజ్ కి ఔటింగ్ టైమింగ్స్ అప్పుడు వెళ్లి చూస్తే..పిల్లల కోసం తల్లిదండ్రులు తెచ్చిన వస్తు సామాగ్రి చూస్తే ఆశ్చర్య పోతాం. మేకప్ కిట్ లు దగ్గర నుంచి.. ఆధునికమైన  ప్యాన్సీ ఆభరణాలు.డ్రై ఫ్రూట్స్,బట్టలు..ఇంకా అప్పటికప్పుడు తినడానికి నాన్వెజ్ పుడ్ .. ఇవ్వన్నీ తీసుకుని తెల్లవారు ఝామునే లేచి  వందల కొద్ది మైళ్ళు ప్రయాణం చేసి వస్తారు. అడగ కుండానే అన్నీ ఇచ్చి.. వారికి కావాల్సిన ఇంజినీరింగ్ ,డాక్టర్,ఐ ఏ .ఎస్, ఐ పి ఎస్..ఇమ్మని అడుగుతుంటారు.

మీ కోసం ఎంతో కష్టపడి మీరు కోరకుండానే అన్నీ ఇస్తున్నాం. మిమ్మల్ని మేము ఏం అడిగాం? బాగా చదువు   కోవడం ..అంతేగా..! అంటారు.

ఎండలో నడచి వెళ్ళే పిల్ల ..గొడుగు కావాలని ఆడకుండానే .. మాచింగ్ గొడుగు లు కొనిపెట్టే అమ్మలు, మద్యాహ్నం  లంచ్ బాక్స్ లోకి చికెన్ తప్ప వేరే కూర వండని అమ్మలు.. లంగా ఓణీ అవుట్ అఫ్ ఫేషన్,,లో వేయిస్ట్ ఫాంట్..పిజిక్ టైట్ టాప్.. పిన్ పాయింట్ హీల్స్ కావాలి. ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యేటప్పటికి  ఒక ఏబై  డ్రెస్ లు అన్నా కావద్దూ.. లేకపోతే..తోటి పిల్లల్లో మన అమ్మాయికి ఇన్సల్ట్.. ఇలా ఆలోచించే అమ్మలు ఇప్పుడు ఉన్నారు.
పోద్దస్తమాను టైలరింగ్ చేసి తొంబై రూపాయలతో కూతురు అడిగిన ప్లేవర్ ఐస్ క్రీం   కొని పెట్టె అమ్మలు . ఐ మాక్స్ దియేటర్ లో తప్ప సినిమా చూడని అమ్మాయిలూ.. ఉన్నారు.ఒక విధంగా అబ్బాయిలే నయం.. మహా అయితే..ఓ..బైక్,ఓ..ఫోన్ ..అడుగుతున్నారు అంతే!

కుటుంబ ఆర్ధిక పరిస్థిని ఎరిగి నడుచుకునే పిల్లలు చాలా తక్కువ. పిల్లలకి విలాసమైన జీవన విధానం నేర్పిన తల్లిదండ్రులు ..ఇక ఎన్ని దొడ్డిదార్లు తోక్కాలో అన్నట్లు ఉంటాయి పరిస్థితులు.

నేను చెపుతున్నది.. నిజమే నండీ ! ఒక జంట సగటు ఉద్యోగులు నెలంతా కష్ట పడితే కాని ఇంటి అవసరాలు,పిల్లల చదువు సాగుతూ..సాధారణంగా బ్రతుకు ఈడ్వ వలసిన కాలం ఇది.

 పిల్లల మీద ప్రేమతో..చిన్నప్పటి నుండే వాళ్ళకి అడిగినడల్లా కొని ఇచ్చి.. కొనుక్కునే స్వేచ్చ ఇచ్చి..వాళ్ళకి ఏం కావాలో, ఏం వద్దో.. నిర్ణయించుకోకుండా.. నిర్ణయించుకోనీయకుండా పిల్లలని పెంచడం జరుగుతుంది. ఆ అతి ప్రేమ పిల్లలకి చాలా కీడు చేస్తుంది కూడా.

అలా అతి మురిపెంగా,గారాబంగా పెరిగిన పిల్లలు ప్రేమ,పెళ్లి,ఉద్యోగం ఇలాటి  ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం ఎదురైతే తట్టుకోగలరా? 

ఇలా  లగ్జరీస్ కి అలవాటు చేసి పిల్లలని కష్టపడమంటే.. అదేనండీ .. చదవడం మాత్రమే అయినా..చదవ గల్గుతారా? తల్లిదండ్రుల కోరికలు తీర్చగల్గుతారా? 

పిల్లలు మనం చేసిన మైనపు ముద్దలు కాదు. వారికి స్వంత అభిప్రాయాలు ఉంటాయి. వాటిని నేరవేర్చుకోనివ్వండి. పిల్లలకి ఏం కావాలో అడగనివ్వండి..వాళ్ళని తెలుసుకోనివ్వండి. ఇవన్నీ మనం చేస్తున్నామా ..అడగ కుండానే అన్నీ ఇచ్చి అడిగినది ఇమ్మంటున్నాం..ఏమో! నేటి తరం  తల్లిదండ్రులే ఆలోచించుకోవాలి.   

మేము నగలు అడిగామా ..నాణ్యాలు అడిగామా? హై టెక్ ప్లాట్ లు,లగ్జరీ కారు  కొనుక్కోడానికి సంపాదించే  అంత ఉద్యోగం వచ్చే చదువు కావాలి..అంతే!

(మొన్నీమధ్య ..మా ఫ్రెండ్ కూతురు  ని చూడటానికి తను చదువుతున్న కార్పోరేట్ కాలేజ్  కి వెళ్ళినప్పుడు అక్కడ చూసొచ్చిన దృశ్యానుభవం తో వ్రాసిన టపా..)  

29, మార్చి 2012, గురువారం

కభి కభీ మేరే దిల్ మే ...

కభి కభీ  మేరే దిల్ మే ... ఈ మాట వింటూ ఉండగానే చప్పున గుర్తుకువచ్చే.. పాట..
కాస్తంత పాటలు  వినే ఆసక్తి ఉన్న ఎవరికైనా ఏ బాష   వారు అయినప్పటికీ కూడా కాస్తంత హిందీ తెలిస్తే చాలు ఈ పాటంటే ఇష్టం ఉంటుంది.మళ్ళీ మళ్ళీ వినాలనుకునే మక్కువ కల్గుతుంది. అలాంటి పాట ఈ పాట.


కభి కభి మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై.. ఈ సాహిత్యం ఒక సినిమా పాట అనుకోవడం కన్నా ..ఓ..క్లాసికల్ పోయెట్రీ అనడం కద్దు. అసాధారణమైన గలమాదుర్యం ఒలింకించ  గల ముఖేష్ గళం నుండి మనకి వినవచ్చే ఈ పాట చాలా హృద్యంగా ఉంటుంది. ఏ కార్తీక మాసపుకాలం లో  చల్లని వెన్నెలలో ఆరుబయట పడుకుని రేడియోలో ఆప్  కి ఫర్మాయిష్ లో వస్తున్న ఆపాటని..తక్కువ సౌండ్లో వింటూ ఉండటం ఉంది చూసారు..  ఓహ్.. గ్రేట్ ఫీల్.

ముఖేష్   గళం మనకి  ఆ పాట తాలూకు అందమైన దృశ్యాలతో..మమైకం చేసి ఓ..అద్భుత ఆనందార్ణవంని మిగిల్చి వెళుతుంది. తరవాత వినవచ్చే పాటలు ఏవి మన చెవిని  బాహ్యంగా కూడా తాకలేవు. ఎన్నోసార్లు ఎంతోసేపు ఆపాట మాధుర్యంలో నే మనం తేలి ఆడుతూ పాడుకుంటూనే ఉంటాం. అది ఆ పాట కున్న విశేషమైన ముద్ర.
ఈ పాటంటే..నాకు చాలా చాలా ఇష్టం. 
ఈ పాట  కి సాహిత్యం సాహిద్ లుధియాన్వి.
సంగీతం: మధురస్వరాల "ఖయ్యాం"
ఈ పాటకి 1977  సంవత్సరంలో ౩ పిలింఫేర్  అవార్డులు వచ్చాయి. సాహిత్యం,సంగీతం,గాయకుడు కి కలిపి.
అలాగే సిలోన్ రేడియో లో వచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన "బినాకా టాప్ టెన్ " లో..మొట్టమొదటి స్థానం లో ఈ పాట చోటుచేసుకుందట. 
ఈ పాట సాహిత్యం హిందీలో నుండి తెలుగులోకి తర్జుమా చేసాను  ..చూడండి

అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.  
 అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమనంటే  ఆ భగవంతుడు నిన్ను నాకోసమే సృష్టించాదేమో అని
అంతకు మునుపు ఆకాశంలో నక్షత్రంగా ఉండి ఉంటావు
అలాంటి నిన్ను నాకోసమే భూమి పైకి పిలుచుకువచ్చాడు

అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమంటే ఈ నీ శరీరం మరియు ఈ నీ చూపులు
నా (కోసం)కు మాత్రమే సంబంధించిన విలువైన సంపద అని
ఈ నీ కురులు ఇచ్చే దట్టమైన నీడ కూడా నా కోసమే
ఈ నీ పెదవులు మరియు కౌగిలి (భుజాలు) నాకు మాత్రమే సొంతమైన సంపద అని

 అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. 
  ఏమనంటే   మ్రోగుతున్న ఈ మంగళ వాయిద్యాల మధ్య ..
తోలిరేయిన నీ మేలి ముసుగు తీస్తూ ఉంటూ నేను
సిగ్గుపడుతూ నీవు నా కౌగిలిలో ఒదిగిపోతూ (ఉంటావని)

 అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.
ఏమనంటే నన్ను ఇలానే నీవు జీవితాంతం నన్నే కోరుకుంటూ ఉంటావని
నీ ప్రేమ నింపుకున్న చూపులతో నా కోసం చూస్తూ ఉంటావని
నాకు తెలుసు ఇదంతా నీకు గుర్తు ఉంటుంది.
అయినా అలా చెప్పానులే
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది.

" అమిత్" ఓ.. అద్భుతమైన కవి. తన ప్రేయసి  "పూజ" కోసం వ్రాసుకున్న కవిత,పాడుకున్న పాట, కలలు కన్నఆశ లు  ఇది.
మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు కదా !అలా పూజ తల్లిదండ్రులు అమిత్ తో కాకుండా ఆమెకి  వేరొకరితో వివాహం నిశ్చయిస్తారు. ప్రేమికుడు హృదయం ముక్కలైపోతుంది.పగిలిన హృదయం తో.. ఆ ఊరినుండి దూరంగా వెళ్ళిపోతూ..ఆ విఫలమైన ప్రేమని తలచుకుంటూ.. అలా ప్రయాణిస్తున్న  రైలు పెట్టెలో  ఒంటరిగా కూర్చుని .. దుఃఖిస్తూ ఉన్నప్పుడు.. అమిత్ కనుకొనుకుల  నుండి జారి నిలిచిన ఒకే ఒక కన్నీటి చుక్కని..అర్ధం చేసుకోగల్గితే చాలు..

స్వచ్చమైన ప్రేమ కి చిరునామా పగిలిన హృదయం కాదని.  హృదయాలని పగలకొట్టే ప్రేమలు వద్దని.

ఆ ఒక్క సన్నివేశం కోసం నేను ఆ చిత్రాన్ని అర్ధరాత్రులు  వరకు మేలుకుని మరీ చూస్తాను. అంత గొప్ప స్క్రీన్ ప్లే.   
అమానత్ అంటే అర్ధం తెలిసిన వారెవరు జీవితంలో మరొకరికి చోటు ఇవ్వరు. అమానత్ ..జన్మతా సంక్రమించిన మనదైన, మనకోసమే పరిమితమైన విలువైన సంపద.  ఇంత కన్నా చెప్పేందుకు  వేరే మాటలే లేవు.
ఈ పాట కాలర్ ట్యూన్ కోసం నేను ఓ..రెండు సంవత్సరాలు ప్రయత్నించాను అంటే..నవ్వుకోకండీ .అంత ఇష్టం నాకు ఈ పాటంటే!
అలాగే కభి కభీ చిత్రంలో .. లతాజీ వెర్షన్లో ఈ పాట చూస్తుంటే..ను, వింటుంటేను  కూడా దుఖం  వస్తుంది.

హిందీలో సాహిత్యం చూడండీ.

Kabhi Kabhi Mere Dil Mein Khayaal Aata Hai
Ki Jaise Tujhko Banaya Gaya Hai Mere Liye
Tu Abse Pehle Sitaaron Mein Bas Rahi Thi Kahin
Tujhe Zameen Pe Bulaya Gaya Hai Mere Liye

Kabhi Kabhi Mere Dil Mein Khayaal Aata Hai
Ki Ye Badan Ye Nigaahein Meri Amaanat Hain
Ye Gesuon Ki Ghani Chhaon Hain Meri Khatir
Ye Honth Aur Ye Baahein Meri Amaanat Hain

Kabhi Kabhi Mere Dil Mein Khayaal Aata Hai
Ki Jaise Bajti Hain Shehnaaiyaan Si Raahon Mein
Suhaag Raat Hain Ghoonghat Utha Raha Hoon Main
Simat Rahi Hai Tu Sharma Ke Apni Baahon Mein

Kabhi Kabhi Mere Dil Mein Khayaal Aata Hai
Ki Jaise Tu Mujhe Chaahegi Umr Bhar Yoohin
Uthegi Meri Taraf Pyaar Ki Nazar Yoohin
Main Jaanta Hoon Ki Tu Geir Hai Magar Yoohin

Kabhi Kabhi Mere Dil Mein Khayaal Aata Hai
Kabhi Kabhi Mere Dil Mein Khayaal Aata Hai

 ఒక ప్రియుడు తన ప్రేయసిని యెంత అద్భుతంగా వర్ణించగలడు. సృష్టిలో ప్రేమ కన్నా మదురమైనది,స్త్రీ కన్నా అందమైనది వేరొకటి ఉండదు..అని అనిపించే మధురాతిమదురమైన రోజులవి. ప్రేమికుడిగా మారిన ప్రతి ఒక్కరు కవి అవుతాడేమో! ఆ కవి తన మనసులో కల్గిన భావాలని ఆవిష్కరించే క్రమం లో ఎన్ని దృశ్యాలు అలా అలా కదలిపోతూ ఉంటాయి. ఎన్ని పాటలు పాడుకుంటారు..అలా.. ఈ పాట దృశ్యం  కావ్యం కూడా..



 యువతి యువకులలో తొలిచూపులోనే ఓ..ఆకర్షణ ఏర్పడి అది ప్రేమగా మారి..  ప్రేయసి ఆలోచనలతో నిదుర రాని రాత్రులలో.. ఆ ప్రేమికుడు ఇలా అనుకుంటున్నాడు

ఎప్పుడు కాదు  ఎందుకంటె..ఎదురుగా నువ్వు ఉన్నప్పుడు,నువ్వు లేనప్పుడు కూడా అప్పుడప్పుడు నా మనసులో ఒక అందమైన ఆలోచన కల్గుతుంటుంది. ఆ భగవంతుడు నిన్ను నా కోసమే సృష్టించి ఉంటాడు. అందుకే నువ్వు నాకు తారస పడ్డావు. అంతకు ముందు ఆకాశంలో ఓ..నక్షత్రం వై వెలుగుతూ ఉండి ఉంటావు. అలాటి నిన్ను నాకోసం ఈ భూమిమీడకు రప్పించి ఉంటాడు దేవుడు..నేను యెంత  అదృష్టవంతుడిని.

అప్పుడప్పుడు నా మనసులో ఆలోచ వస్తూ వుంటుంది అందమైన నీ సౌందర్యం,ప్రేమ నింపుకున్న అందమైన నీ చూపులు కేవలం నాకోసం మాత్రమే ఉండిన,జన్మతా నాకు లభించిన సంపద. అందమైన,  దట్టమైన నీ నీలా కురుల నీడ నాకోసమే ! అమృతాన్ని ఒలికించే, అందించే నీ పెదవులు,నీ బాహుదండాలమధ్య ఒదిగి ఉండటం కూడా నాకు జన్మతా లభించిన విలువైన సంపద.అది నాకు మాత్ర,మే సొంతమైనది.

అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. పవిత్రంగా మ్రోగుతున్న మంగళ వాయిధ్యాలమధ్య మనం సప్తపదులు నడచి వెళ్ళాము. తోలిరేయిన నీ మేలిముసుగు తీస్తూ ఉంటె నీవు అందంగా సిగ్గుపడుతూ నా కౌగిలిలో ఒదిగిపోయే దృశ్యం  తలచుకుంటే యెంత మనోహరంగా ఉంటుంది.
అప్పుడప్పుడు నా మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది. నన్ను ఇలాగే ఉండాలని ..నీవు జీవితాంతం నన్నే కోరుకుంటూ ఉంటావని, ఎల్లప్పుడు నీ ప్రేమ దృక్కులు నావైపే ప్రసరిస్తూ ఉంటాయని నాకు తెలెసును నీకునూ తెలుసును. ఊరికే ఏదో గుర్తు చేసాను అంతే!  అప్పుడప్పుడూ నా మనసులో ఆలోచన  వస్తూ ఉంటుంది ఇలాగున.
అంటాడు అతను.
ఆపాటలోకి.. లీనమై ఆ అందమైన ఆత్మని పట్టుకోగల్గితే.. మన మనోవీధిలో ఎప్పుడూ ఈ పాట విహరిస్తూనే ఉంటుంది. ప్రతి రోజు ఈ పాట వింటున్నా ..ఇంకా ఏదో ఏదో క్రొత్త అర్ధం సృశిస్తూ  ఉంటుంది నాకు.
అందుకే.. ఒంటరి తనంలో ఈ పాట,  ఒంటరితనం సృష్టించుకుని పాట లో మమేకమై నేను.     . 

ఓకే ఫ్రెండ్స్..ఓపికగా చూసినందుకు ధన్యవాదములు.ఈ పాట అర్ధం చేసుకోవడంకోసమే నేను హిందీ నేర్చుకోవడం మొదలెట్టిన రోజులని మర్చి పోను. ఇంత అందమైన పాట..అర్ధం కానందుకు నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కూడా. ఒన్స్ అగైన్ థాంక్ యు వేరి మచ్.

28, మార్చి 2012, బుధవారం

నాకు బాగా ..నచ్చిన బ్లాగ్...

 బ్లాగ్ లోకం లోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి బాగా నచ్చిన బ్లాగ్ లు ..ఉంటూ ఉంటాయి. కనీసం ఒక బ్లాగ్ అయినా అలా నచ్చుతూ ఉంటూనే ఉంటుంది. బ్లాగ్ లవల్ల ఉపయోగాలు ఉంటాయా అనుకోవద్దు. మనకి అనేక సాంకేతిక సలహాలు అవసరపడతాయి .అలాగే నిత్య జీవితంలో మనకి ఎదురైన అనేక సంఘటనలు మనకి అనుభవాన్ని తప్పకుండా నేర్పుతాయి.  ఆ మంచి,లేదా చెడు అనుభవాలు, సరదా సంఘటనలు ఎదుటివారితో పంచుకునేటప్పుడు..మన వ్యక్తిగతం కూడా బహిర్గతం అవుతూ ఉంటుంది. అలా బహిర్గతం అవడం మంచి విషయమో..కాదో నాకు అంతగా తెలియదు. కానీ  . నాకు బాగా ..నచ్చిన బ్లాగ్... ఒకటి ఉంది.

ఆ బ్లాగ్ లో.. చాలా చిన్న విషయాలు నుండి.. పెద్ద పెద్ద అనుభవాల వరకు..చాలా ఓపికగా ,ఒద్దికగా వ్రాస్తూ ఉంటారు.అవి అందరికి ఉపయోగపడతాయి అని నేను అనుకుంటాను. నేను బ్లాగింగ్ మొదలపెట్టిన క్రొత్తల్లో  ఒక రెండు నెలల కాలంలో ..ఆ బ్లాగ్ ని చూడటం జరిగింది. ఆ బ్లాగ్ లో చాలా విశేషాలతో పాటు,మంచి మంచి కొటేషన్స్ ఉన్న చిత్రాలు, మెహంది డిజైన్స్ , ప్ర కృతి చిత్రాలు, ఇలా ఇంకా చాలా  చాలా విషయాలని ఆసక్తిగా మలచి అందిస్తారు. అలాగే..తన బ్లాగ్ లో వచ్చిన స్పందనకి.. ,ప్రశంసలకి వెంటనే ధన్యవాదములు చెప్పే మంచి సంస్కారం ఉన్న బ్లాగ్ అది.   
ఆ బ్లాగ్..లో నేను ఇష్టపడే సాహిత్యం ఉండకపోవచ్చు.కవితలు, సాహిత్య గోష్టిల గురించి సమాచారం ఉండకపోవచ్చును. కానీ.. ఓ..చూడ చక్కని బ్లాగ్. ఆ బ్లాగ్ అందరిని అలరిస్తూ..ఇతరులకి స్పూర్తిగా నిలిచే బ్లాగ్. ఆ బ్లాగ్ వారు ఇలా అంటారు..."ఏ ఒక్కరికైనా ఈ బ్లాగ్ లోని సమాచారం ఉపయోగ పడి.నట్లయితే...ఈ బ్లాగ్ లక్ష్యం నెరవేరినట్లే.."అని. ..
 మన జీవితంలో ఎదురైన ప్రతి వ్యక్తీ మనకి నచ్చకపోవచ్చు. కానీ వారి సృజన మనకి బాగా నచ్చవచ్చు. అలాగే నాకు కూడా..నాకు నచ్చే అంశాలు కానీ,పాటలు కానీ చాలా తక్కువగా ఉండే బ్లాగ్.కానీ ప్రతి పోస్ట్ ని వదలకుండా చూసిన బ్లాగ్ ఏదైనా ఉందంటే..అది.. ఈ బ్లాగే!  చదివించే గుణం,ఇతరులకి ఉపయోగపడే గుణం ఉన్న బ్లాగ్ ఇది.
నచ్చితే మీరు చూడండి.
రాజ్..గారు ఓ.. మంచి బ్లాగ్ ని అందించిన మీకు మనఃపూర్వక ధన్యవాదములు తో..

ఆ బ్లాగ్ పేరు.....

"My VALUABLE LESSONS"

achampetraj.blogspot.in 


26, మార్చి 2012, సోమవారం

నాకు నచ్చిన పోటో గ్రఫీ


కొన్ని  చిత్రాలు .. కొన్ని స్థలాలను అనుబంధంతో  ..పెనవేసుకుని ..కెమెరాలో భద్రంగా ఒదిగి.. ఇలా..కనిపిస్తున్నాయి. ఈ రోజు మా అబ్బాయి ఫొటోస్ చూస్తుంటే.. తన ఫోటో గ్రఫీ నచ్చి ఇలా షేర్ చేసుకుంటున్నాను. నాకు ఎంతో  బాగా నచ్చిన పోటో గ్రఫీ ..
   
తనకి నచ్చిన స్థలం





తను చదువుకుంటున్న   విశ్వవిద్యాలయం


 తన ఫోటో గ్రఫీ లో తనే..


కృష్ణమ్మఒడ్డున..

 

25, మార్చి 2012, ఆదివారం

" వనూ స్ డైరీ విత్ వనమాలి "

"వను  వారు" ఇలా అనుకుంటున్నారు..

ఈ రోజు బ్లాగ్ పోస్ట్ లో  ఏం వ్రాసుకోవాలి? అలవాటు అయిపోయి.. చేతులని కీ బోర్డ్  రా రమ్మని పిలుస్తుంది. ఏం తోచి  చావడం లేదు.

వనమాలీ.. అలా చోద్యం చూస్తూ. మందస్మితంతో.. అక్కడ నిలబడి వీక్షించక పొతే కాస్త సాయం చేస్తే మీ సొమ్మేమ్  పోయిందో ? అసలు నాకు తెలీయక అడుగుతాను  మీరు నన్నెందుకు  ఈ బ్లాగ్ లోకంలోకి నెట్టినట్లు.. ? నేను హాయిగా పుస్తకాలు చదువుకుంటూనో.. స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకునో లేదా .."వను స్ ..డైరీ విత్ వనమాలి " ..అంటూ వ్రాసుకుంటూనో ఉండేదాన్నికదా!. ఇప్పుడు కలం పట్టుకుని  వ్రాత వ్రాసి ఎన్నాళ్ళవుతుందో !

అయినా ..వేటూరి వారు ఒక పాటలో చెప్పినట్టు.. నేనేమంత గొప్పదాన్ని.. అంట? ఉద్యోగాలు చేస్తున్నామా? ఊళ్లు యేలుతున్నామా? నార్మల్లీ హౌస్ వైఫ్. మెదడులో గుజ్జు  వుండదు.అంట్లు తోముకుంటూ,బట్టలు వుతుక్కుంటూ,పిల్లా జెల్లా ని సర్ది ఆపై  హాయిగా టీవి సీరియల్ చూస్తున్నామని, పేపర్లో విశేషాలకి  అలవాటయి అదే ప్రపంచంలో బ్రతుకుతున్నామని అనుకుంటారు. మేము వ్రాసే విషయాలు ఏముంటాయి.. ? కాస్త  నవ్యంగా  వ్రాయడానికి  ఏదైనా  సలహా ఇవ్వవచ్చుగా ..అంది  వను.

బాప్ రే ! వను! (మా వనమాలికి నేను "వను" ని ) ఇంత ఏకధాటిగా మాట్లాడిన మిమ్ము చూస్తుంటే..మాకు గీతోపదేశం సమయమందున..అష్టాదశ  అధ్యాయాలని .. మేము  అర్జునుని తో ఇలాగున   యేకధాటిగా బోధించి వుండలేదే..అని విచారం కల్గినది"  అని అన్నారు హాస్యంగా.

మీ హాస్యం కొంచెం ఆపండి మహాశయా!  వనమాలీ అని పేరు వున్నంతనే..మీరు..ఆ మురళీ లోలుడు అయిపోతారా? నేనేమో భామని అవుతానా?  కొద్దిగా కినుకుగా అడిగింది..వను

"మీకు యేమి తక్కువ.. ప్రేమలో రాధకి, భక్తిలో రుక్మిణికి , అభిమానంలో (అహం అంటే ఇంకేమైనా ఉందా?) భామకి సరి సాటి" అన్నారు వనమాలి  

లోలోపల మురిసి పోతూనే అంత మునగ చెట్టు యెక్కించ వలదు లెండి. మీరన్న రీతిన మేమెక్కడ? మీరెక్కడ ? మీరు అసలే  లీలా వినోదులు. తగవులు పెట్టి చూచి తరించెదరు. మీ బుద్ది యుగాలు   మారినా మారలేదు అంది వను 

యుగాలు అయితే నేమి.. మేము మేమే ! మీరు మీరే కదా!..దేవి. అన్నారు వనమాలి. .

అక్కడ ఆ పోలిక కి కడుపు  మండింది వనుకి

ఆహా!  మేమేమి గొప్ప కాకుండే! మీరుమాత్రం  యెలా గొప్పఅయివుండును.. ? . అని అంది కత్తులు నూరినట్లు.

మీతో.. ఇదే సుమా చాలా చాలా చిక్కు. మేము చెపుతున్నది  సరిగా వినరు,  ఒకవేళ విన్నా  సరిగా అర్ధం చేసుకోరు.మీతో వేగి వేగి నా తల గిర్రున తిరుగుతున్నది.  మీతో వాదన తెగక తల బొప్పి కడుతున్నది. ఆ ప్రభావం మా పై పడి..మా రాచకార్యాలు సరిగా సక్రమంగా జరగకుండే!.. హతవిదీ..అంటూ.. రెండు చేతుల మధ్య ..శిరస్సు వుంచుకుని చటుక్కున కూలబడ్డారు.

ఆ స్థితిలో పతి దేవుని చూసి హృదయం ద్రవింపగా.. వనమాలీ మన్నించవలెను.
అసలే   అఖిల భారతమందున పురుషులు  కొంగ్రత్త చట్టములను చూసి..అగ్గి మీద మొక్క జొన్నల్లా..పేలిపోతున్నారు. వారిని కాస్త సాంత్వన  పరచకుంటే.. తేత్రా యుగం నందు సీతమ్మలా అగ్గిలో దూకి ఆత్మ  త్యాగం చేసేటట్లు వున్నారు..కాస్త వారిని సాంత్వన పరచే విధంగా నాలుగు మాటలు చెపుతారని..అడుగుదామనుకునే లోపునే..మనకి అలవాటైన వాగ్వివాదం మొదలయింది.మన్నించండి.. .వనమాలీ.. అంది వను.

ఆ మాటకి కాస్త ఉపసమనం పొంది..అది కాదు..వనూ ..ఇప్పుడు మేము చెప్పేడు విషయం శ్రద్దగా వినుడు.ఇప్పుడు కలియుగమున పురుషులకి చెప్పవలసినది ఏముంది? తేత్రాయుగమును వదిలివేయుడు. ఆ యుగమును  దాటి  ద్వాపర యుగమున ఈ వనమాలి..అష్ట భార్యలతో,పదుహారు వేల మంది గోపికలతోను కూడి..అనేక కష్టముల పాల్బడి నను .. నా స్వభావ సిద్దమగు ఆనందమునే..అందరికి అందించి..అందరివాడిని అనిపించుకుంటిని. అయినను..నన్ను ఆదర్శంగా తీసుకోకుండా..ముందు యుగమునందు ఆదర్శ పురుషుడిగా నడచిన శ్రీ రామునిని ఆదర్శం చేసుకుని..భారతీయ వివాహ చట్టములు యేర్పడి వుండవచ్చును. అదే  తరుణమున సీతమ్మ కష్టములని పరిగణన లోకి తీసుకుని ..స్త్రీలకి కొంత అనుకూలముగా చట్టములు చేసి వుండవచ్చును.

కాదు శ్రద్దగా వింటూనే వున్నది వను.

వనమాలి  కొనసాగిస్తూ.. ఇంకో విషయం చెప్పెదు    వినుడు.. కలియుగ దైవం అయిన మేము దేవేరిని వదిలి పద్మావతిని చేపట్టి యిద్దరి నడుమున నలిగి శిలనయితిని. అందుకే పురుషులకి అన్ని యుగాలయందునూ   ఏక పత్నీ వ్రతం శ్రేష్టం అయినది అని చెప్పుచుంటిని. అటులనే.. స్త్ర్రీలని ధనం  కోసమును,సేవలు చేయుట కోసమును వివాహమాడుట తగదని చెప్పుచూనే..వారికి పురుషులతో సరి సమానంగా..అస్త్ర,శస్త్రవిద్యల యందునూ,చతుషష్టి   కళలు నేర్చుకోనుడు ఆసక్తులపైననూ నిషేదములు వలదని చెప్పుచుంటిమి. అయిననూ  మా పురుషులు స్త్రీలని తక్కువ స్థాయిలో జూచు చుండబట్టే   ఈ అభిప్రాయ బేదములు తలెత్తి యున్నవి.  పతి అర్ధభాగం తానే  అగునట్టి ఉమయునూ, హృదయమున ప్రతిష్టించుకున్న మీరును, నాలుకపై నుండు..వాగ్దేవినూ స్త్రీ మూర్తులే కదా!మీ మువ్వురు భర్త అంతరంగ మెరిగి మసలుకోనలేదా! ఇప్పుడు స్త్రీలు కూడా అలాగే పతి మనసెరిగి ప్రవర్తించెదరు  అనుటలో సందేహం వలదు.

కానీ స్త్రీ-పురుష బేధం రాకుండా.. పాలునీళ్ళులా కలసి యుండెడి మాట మరచి ఒకరిపై మరొకరు విద్వేషములు పెంచుకొనుట యేల ?  విద్యలు,కొలువులు,బిడ్డల ఆలనా పాలన గృహ నిర్వహణ అన్నీ సమముగా చేసుకుని అందరు సుఖముగా వుండు..యోచన చేయ వలెనని..మా మాటగా చెప్పుచూ ఒక టపా వ్రాయుడు..అని చెప్పి విశ్రమించిరి.

అటులనే వనమాలీ..మీ మాట నేనెపుడైననూ  జవదాటితినా  ? మీరు నేను వేరు కాదు..మీ మాటే..నా మాట కూడాను అంది సంతోషంగా వ్రాయడానికి ఉపక్రమిస్తూ.. వను.

(జిలేబి వారలకు-జన్బునాధాన్ కృష్ణ స్వామీ అయ్యర్ వారలకు అనుకరణగా.. వ్రాసే సాహసం తో..క్షమాపణలతో.. ) 

నమ్మరాదు కొంతమంది పనివారలని .

అయ్యబాబోయి.. నిజమేనండీ! నమ్మరాదు కొంతమంది  పనివారలని,మోసకారి పనివారాలని అనుకుంటూనే ఉంటానా!?

కానీ ఎప్పుడూ టపీ మని బోల్తా పడుతూనే ఉంటాను.

అసలు మా ప్రాంతంలో   ఇంటి పనికి పనివారలు దొరకడం చాలా కష్టం .ఎందుకంటే.. ఆంధ్రావారికి అత్యంత ప్రియమైన పచ్చళ్ళు  "విన్నాను లే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా అంటూ పచ్చళ్ళ ప్రియాని వివిధభారతి వాణిజ్య ప్రకటనలు వింటూ తీరా ఆ పచ్చళ్ళ కంపెనీ ప్రక్కనే చేరాం.అక్కడ ఒక్క పని పురుగు దొరకరు. ఎందుకనగా 
పాపం స్త్రీ జాతిని మూడు షిప్ట్ లల్లో.. ఏళ్ళతరబడి తాత్కాలిక సిబ్బంది పేరుతొ..అరగరుద్ది పనిచేయించుకుంటున్న
ప్రియ పచ్చళ్ళ వారు..మా ప్రాంతపు గృహిణులందరికి చాలా "అప్రియ"మైనవారు. అందుకే మా మహిళా లంతా ప్రియ పచ్చళ్ళు కొనుక్కోం. వారి కన్నా బాగా పట్టుకుని నిల్వ ఉంచుకుంటాం.

అయ్యయ్యో! విషయం సైడ్ ట్రాక్ పై వెళ్ళింది కదండీ..  అలా ఇంట్లో పని చేసేవారాలకి ఇక్కడ బోలెడంత ఇబ్బంది. అయితే ఏమిటీ మా ఇంట్లో పని మేమే చేసుకోలేమా ?అనుకుంటూ..కష్టపడి పోయి పనంతా చేసుకుని..కాస్తంత బొద్దుగా లేకుండా ఆరోగ్యంగా ఉంటారు అందుకు..ప్రియాకి బోలెడన్ని కృతజ్ఞతలు అంటాను నేను.
ఇక మాఇంట ఇంకోరకం పనివారలు.

మా ఇల్లు దుకాణం కాని దుకాణం.ఇల్లు కాని ఇల్లు.అది అంతే లెండి.  ఉదయం తొమ్మిది నుండి రాత్రి ఎనిమిది వరకు దుకాణం. ఈ మధ్య సమయమంతా..కళా ఖండాలు తయారవుతాయి. అందమైన పట్టు చీరలపై అవని పై పూయని అందమైన పూవులు,లతలతో పాటు ప్రాణం పోసారా అన్నట్టు ఉండే మయూరాలు,చిలుకలు,సీతాకోక చిలుకలు.. అందమైన అమ్మాయిలూ,నాట్యకత్తెలు,అందరూ తయారవుతారు. కస్టమర్ల అభిరుచి మేరకు మంచి మంచి డిజైన్ లు తయారుచేసి ఇవ్వడం మా ఇంట పని. దాదాపు పదేళ్ళగా చేసే ఆ పనిలో ఓవందమంది పనివారలు వారి వారి నైపుణ్యం లని చూపి నాకు మాత్రం భలే అందమైన టోపీ పెట్టి వెళ్ళేవారు.

తమిళ్ సోదరసోదరీమణులు,కేరళ కుట్టీలు,కన్నడ కస్తూరిలు,బీహారి లు,లక్నోవాలాలు, బెంగాలీ  బాబులు..కూడాను.    ఇక ప్రింటింగ్ లు డై యింగ్లు, పేచ్ వర్క్ లు   మామూలే!

ఎంతైనా నా దగ్గర పెట్టుబడికి కావలసినంత డబ్బు ఉంది కదండీ!  మరి పని నైపుణ్యం లేకపోయే! అందుకని నా మంచి ముఖం (నేను అనుకోలేదండి వాళ్ళే అనేవారు)చూసి ఈ మేడం తప్పకుండా అడ్వాన్స్ ఇస్తారు అనుకునేవారంట, మేడం మేము ఇప్పుడే కదా..ఇక్కడికి వర్క్ కి  వస్తా అంతకు ముందు చేసేవారికి బాకీ పడ్డాము, మీరు  అడ్వాన్స్ ఇస్తే..ఆ డబ్బు అక్కడ కట్టేసి ఇక్కడికి పనికి వచ్చేస్తాం అనేవారు.

మంచి పనివారలు దొరికారు కదా అనే ఆనందంతో..నేను అడిగినంత అడ్వాన్స్ ఇవ్వడం..నా అడ్వాన్స్ డబ్బు జమ చేయకుండానే..పని చేసిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం.. ఏదో ఒక నాడు.. కండ్ల నీళ్ళతో మేడం ఇండ్ల వాళ్లకి తబీద్ అచ్చా నహీ  మేడం. మే క్యాకరో? మీరు పైసా ఇస్తే ఇండ్లకి వెళ్లి మల్ల వస్తం..అని సగం తెలుగు హిందీ..తమిళ్..అన్నీ కలగలిపి చెప్పి నా మైండ్ ఖరాబ్ చేసి..కొన్నాళ్ళు నాకు ఏ బాష పూర్తిగా రాకుండా యధాశక్తి సహాయం చేయడంతో పాటు భారీ నగదుకి కాళ్ళొచ్చి  వాళ్ళ వెంట నడచి వెళ్లి పోయేయి.

ఏమైనా మన పనివారలు, పాపం మనం కాకుంటే ఎవరు ఇస్తారు..అనుకుని జాలి పడి అప్పటి కప్పుడు అప్పోసోప్పో జేసి.. వాళ్ళ కళ్ళనీళ్ళు తుడిచి ఏం అవదులే  ..! మీ ఇండ్లవాల్లకి ఆరోగ్యం తప్పకుండా బాగుంటుంది లే   కానీ ఇండ్ల వాళ్ళు అని నిజంగా రెండో..మూడో..ఇండ్లు పెట్టకు, వారందరినీ నేను సాకలేను.  ఒకే ఒక ఇల్లు ముద్దు అనేదాన్ని ఏడ్వలేక..నవ్వుతూ..
పోయి వస్తం  మేడమ్ అంటూ పోవడమే కానీ రావడమే లేదు.

అలా రెండు మూడు అనుభవాలు అయ్యాక కాస్త రాటుదేలాననుకున్నాను. మరి కొన్నాళ్ళకి రాయి రప్పని కానే కాను,మామూలు మనిషిని నేను అంటూ కాస్త ఉదారం ప్రవహించి నా మొబైల్ పోన్ తో పోనులు చేసుకోనివ్వడం రూం రెంట్ లు,కరంటు బిల్లులు కట్టడం అన్నీ భరించాను వాళ్ళ పిల్లలకి పీజులుకి డబ్బులు పంపడం..ఇచ్చేటప్పుడు..అప్పుగానే..లెండి.అవి రావు అని తీర్మానించుకున్నాక మాత్రం.. పేద పిల్లల చదువు సహాయార్ధం ఇచ్చిన డబ్బుకి వడ్డీలతో సహా కట్టాల్సి రావడం అన్నమాట. మరి పనివారాల పిల్లల చదువులు ఊరికే ఉందా ఏమిటీ చెప్పండి.!?

పనివారలకి..ఓ..నాలుగు రేడియోలు ఏర్పాటు చేయాలి.ఒకటి వినరండీ..భిన్నత్వంలో ఏకత్వం మాకు వద్దు.మేము రొంబ  ఇష్టపదిన్ పాటల వినవలె.. మీ హిందీ గిందీ మాకు వద్దు అంటే..హిందీ వాళ్ళు తెలుగు పాటలు వినవలె అనేవారు.ఇవన్నీ వద్దు..మా బెంగాలి సినిమాలే వినాలని వాళ్ళు.. మొత్తానికి రోడ్డుపై వెళ్ళేవాళ్ళు కాస్త ఆగి మా ఇంటి వైపు ఓ..సారి అనుమానంగా చూసి..భిన్నత్వం ఏకత్వం అయి నిలిచిన మా పలురకాల శబ్దగృహమున్ గాంచి వెర్రి ఎక్కి పారిపోయేవాళ్ళు.

హే  భగవాన్..అని తలుచుకుంటూ.. ఆయనకీ పెట్టిన రెండు పండ్లో,ఫలమో.. ముక్కులో పోక్కంత ఎవరికి రాదు గనుక ప్రసాద రూపేణా ఓ రెండు డజన్ల కాయలు..అందరికి పంచి పెట్టడం,గంట గంట కొకసారి ఇష్టానుసారములుగా కాఫీలు,టీలు ఇవ్వడం  నాకు తీరికలేని పని. టీలు,కాఫీలు తాగారా..వాటిని శుభ్రపరుచుకోవడం  నా వంతు అన్నమాట. కొందరు సంస్కారవంతులు మాత్రం వారే  శుభ్రం చేసి ఒకచోట పెట్టేవారు. ఒకోసారి మా అత్తమ్మ విసుక్కునేవారు. వాళ్ళని కడిగి పెట్టమని చెప్పవే! వాళ్ళు తాగినవి మనం కడగాలా?అని.

మా ఇంట పనివారు ఉండరు కదండీ.. గొప్పగా పుట్టి పెరిగిన మాఇంట మహిళ పనివారలు తాగిన కప్పులు  కడిగే స్థాయికి వచ్చినందుకు ఒకోసారి బాధ పడేవారు. ఆమెకి ఆ భాద ఎందుకని  వాళ్ళు ఎప్పుడు తాగడం పూర్తి చేస్తారా.. కడిగి లోపల పెట్టాలా అన్నట్లు చూసేదాన్ని. నేనే..కడిగి పెట్టేదాన్ని. మరి ఏం చేస్తాం చెప్పండి? . రోట్లో తలపెట్టాక రోకలి పోటుకు భయపడితే..యెట్లా కుదురుతుంది చెప్పండి. పనివారలు..అతిధులు. కప్ లు కడగమని చెపుతామా?
ఈ అవమాన చర్యలకి తల ఒగ్గలేక..డిస్పోజబుల్ గ్లాస్ లు తెచ్చి పెట్టి..అందులో పోసి ఇవ్వడం చేస్తూ పాపం రోజూ  ఇలా త్రాగితే..వాళ్ళ ఆరోగ్యంకి హాని కదా అనుకుని జాలి పడేదాన్ని.

ఇక బెంగాలీ  బాబులు అయితే..మధ్యాహ్నం  లంచ్ బాక్స్ తెచ్చుకోకుండానే ఉదయం అరగంట ఆలస్యంగా రావడం పని ముగింపు వేళ కన్నా   ముందే లేవడం...అలా చేయసాగాడు.అతని పేరు..రాజ్. బెంగాలీ . ఎప్పుడూ.. ఏదో బుగ్గనపెట్టుకుని..ఏది అడిగినా తల నిలుగానో అడ్డంగానో..ఊపుతాడు తప్ప..నోరు విప్పడు.
మొదట్లో వచ్చిన కొత్తల్లో..కాఫీ ఇచ్చినా ,టీ ఇచ్చినా  తీసుకుని చక్కగా థాంక్స్ మేడం అని చెప్పేవాడు. మా దగ్గర పనిచేసే అమ్మాయిలకి పెళ్లి కాలేదని చెప్పేవాడు. కానీ అతనిది లవ్ మేరేజ్. వాళ్ళ ఇంట్లో ఇతర కులస్థుల అమ్మాయి అని పెళ్ళికి ఒప్పుకోక పోతే  బయటకి వచ్చేసి..ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని..మా వద్దకు వర్క్ కి వస్తే మెచ్చుకుని పని ఇచ్చాను. నలుగురు బిడ్డలకి తండ్రి అయినా మొగ పిల్లవాడు కావాలని పుత్ర వ్యామోహం. పెద్ద పిల్ల ఉదయం పూట "మదర్సా"కి బడి వేళలలో బెంగాలి బడికి వెళ్ళేంత అయింది. కానీ ఏనాడు ఇన్నేళ్ళలో లంచ్ బాక్స్ తెచ్చుకోడు. మేము పంక్షన్స్ కి వెళ్ళినా అతనికి వంట చేసి వెళ్ళాలి. తప్పదు  లేకపోతే ..మన పని వాడు - ఆకలి. 
పంచభక్ష్యాలు వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నా వాడి ఆకలి గుర్తుకు వస్తుంది. అలా నాతొ..రోజు వంట చేయిస్తాడు అన్నమాట .   అతనికి పని కూడా  బాగా రాదు.  కొత్త వర్క్స్ నేర్చుకోడు. వచ్చిన పనిని శ్రద్దగా చేయడు. వచ్చిన డబ్బుని రక రకాల మొబైల్  మోడల్ పోన్ కొనడానికి ఖర్చు పెడతాడు.వర్క్ చేస్తూ..వీడియో సాంగ్స్ చూస్తుంటాడు. మళ్ళీ అతనికి  నేనే,,మెమరీ కార్డు లోకి సేలేక్టేడ్ సాంగ్స్   వెతికి డౌన్లోడ్ చేసి మార్చి ఇవ్వాలి.   ఎప్పుడూ..బోలెడంత బాకీ నే ఉంటుంది. డబ్బు ఇవ్వకపోతే.. "మేడం.. బచ్చోంకి భూక్" అంటాడు.

భగవంతుడా !ఎందుకయ్యా ఇంత..దయార్ద్ర హృదయం ఇచ్చావు అనుకుని నేను దేవుడిని తిట్టుకుని..(లెంపలు వేసుకుంటాను లెండి) వాడికి మాత్రం..మా మేడం అంత మంచి మేడమ్ ఎక్కడా ఉండదు అనిపించుకుని.. ఆ తృప్తి అలవాటు పడిపోయాను. ఈ మధ్యే..విసుగు వచ్చి నాకు నీ పని వద్దు ఏం వద్దు పో అన్నాను . మిగతా వాళ్ళు..మీరే వద్దంటే ఎలా మేడమ్ ?  పిల్లలు ఆకలి..అని జాలిగా చెపుతారు.వాళ్ళ   పైసా డబ్బు   జారనివ్వకుండా  ఎన్నో జాలి కబుర్లు.
మా వద్ద పని మానిపించాక..నాలుగు రోజులు బయట ఎక్కడో చేసి.. వాళ్లకి నచ్చక పెట్టాబెడా సర్దేసి వెళ్లిపోయాడని చెప్పినప్పుడు కొంచెం జాలి కలిగింది కానీ నేను మాత్రం ఈ సారి పాషాణ హృదయంగా మారిపోయాను . అప్పుడప్పుడు అనుకుంటాను ..ఇన్నాళ్ళు అతనిని నేను ఎందుకు భరించాను అని. 
ఇంకొంతమంది.. మన పనివాళ్ళే   కదా..అని ఫ్రీగా ఉండనిస్తే.. ఇంట్లో మనతో పాటు కూర్చోంటారు.

ఒకసారి..బీహారీ..సుషీల్.. అని మంచి పనితనం.కానీ.. మాతో సమానంగా ఉండాలనుకుంటాడు. మేము భోజనం చేస్తూ..భోజనం చేయి సుషీల్ కూర్చోఅంటే ఎంతమంది అతిధులు ఉన్నా వారితో పాటే డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటాడు. మా అబ్బాయి రూమ్లోకి వెళ్లి తన బెడ్ మీద కూర్చుంటాడు. అది మా ఇంట్లోవాళ్ళకి  నచ్చక అతనిని సున్నితంగా వర్క్ లేదని చెప్పి మాన్పించాల్సి వచ్చింది.

 ఉదాహరణకి మా వారు ఒకటి చెప్పేవారు. యెంత బెంజ్ కారు తోలినా.. నేనే కదా తోలేది అనుకుంటాడట..డ్రైవర్ యజమాని  యెంత గొప్పవాడైనా  నా ప్రక్కన కూర్చోక ఏంచేస్తాడు..అన్నట్లు ఉండేది అతని ప్రవర్తన. కారు ఆగిన తర్వాత ముందు దిగి..కారు డోర్ తీసి పట్టుకునేది లగేజ్ లు లోపల పెట్టేది డ్రై వర్  యే అన్న సంగతి మర్చిపోతే..యెట్లా..అని మా వారు అంటారు.

ఏది ఏమైనా పనివారాలకి  మనిషిగా విలువ ఇవ్వాలి. వారి శ్రమకి విలువ ఇవ్వాలి. కానీ వారిని మన ఇంట్లోవారిగా చూస్తే..చాలా ఇబ్బందులు,నష్టాలు ఉన్నాయి. అవి మర్చిపోకూడదు. (ఇతరుల అనుభవాలు-నా అనుభవాలు కూడా) నా స్వయం ఉపాది కల్పనలో.. ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాళ్ళు నాకు ఊతమిచ్చారో..లేదా వారిని వారి కుటుంబాలకి  నేను ఊతం అయ్యానో తెలియదు కానీ నెలకి నలబై నుండి ఏబై వేల ఆదాయం కళ్ళజూచిన రోజులని నేను మర్చిపోను. ఇప్పటికి నాకు అన్ సీజన్లో కూడా ఇరవయ్యి వేలు నిలకడైన  ఆదాయం ఇచ్చే వర్కర్ ల పట్ల చిన్న చూపు లేదు కానీ..     

యజమానికి యజమాని అన్న అహంకారం ఎలా ఉండకూడదో..పని వారాలకి యజమాని పట్ల అంతే గౌరవభావం,పని పట్ల అంకితభావం ఉండాలి అని చెప్పడమే నా ఉద్దేశ్యం 

నా ఇంట్లో ఉన్న దుకాణం కి నేను యజమానిని, వర్కర్స్ లో వర్కర్ ని కూడా. "శ్రమ యేవ  జయతే"..

ఇంకా కొన్ని నష్టాలు,కష్టాలు,అవన్నీ మరొక పోస్ట్ లో.    
          

23, మార్చి 2012, శుక్రవారం

సరాగ ..లో నా కథ .."కంట్రీ విమెన్ కూతురు "

చీర కట్టి ఎలా అశ్లీల ప్రదర్శన చేయవచ్చో..నడి రోడ్లో..  నిలువెత్తు బొమ్మల సాక్షిగా చూపుతున్న షో రూమ్ల వ్యాపార నైపుణ్యాలు..చూస్తుంటే అసహ్యం కలగకుండా మీరు ఆమోద ముద్ర వేస్తుంటే యెంత నొచ్చుకుంటున్నామో! అమ్మల్ని అధునాతనంగా   చూడాలనుకున్న మీ వెర్రి మొర్రి కోర్కెలు..అలాగే మాధురి దీక్షిత్ కూడా ఆశ్చర్య పోయేలా.. గృహిణుల వీపు ప్రదర్శనలు గురించి ఎంతైనా చెప్పవచ్చు..మీలో ఒక్కరన్నా ఆలోచించ గల స్థితిలో ఉంటే..
అసలైన  అందం  అంటే  ఆత్మ  విశ్వాసం  అని, వ్యక్తి కి  వన్నె తగ్గని ఆభరణం వ్యక్తితత్వం అని తెలుసుకోవాలి.  అందంతో..కాదు.. మీకున్న తెలివితేటలతో.. శక్తియుక్తులతో.. సమర్దతా నైపుణ్యంతో.. మగవాళ్ళని ఆకర్షించ గల్గినప్పుడు..మీరు గొప్ప క్రింద లెక్క తప్ప శరీరాలు ఆరబోసుకుని  మాత్రం కాదు.  ఎంతో ఉన్నతమైన చదువులు చదువుతున్న మీకు ఈ పాటి సంస్కారం లేదని..తెలివితేటలూ   లేవని ...
 మిగిలిన కథని.. సరాగ నందనందనం లో.. చూడండి.

 "సరాగ " పత్రికలో నా కథని ఎంపిక చేసిన ..సంపాదక విభాగానికి ..హృదయపూర్వక ధన్యవాదములతో....

18, మార్చి 2012, ఆదివారం

బ్లాగర్ గా నా అనుభవాలు

ఒక బ్లాగర్ గా నా అనుభవాలు..వ్రాయాలని అనిపించింది. అసలు.. నేను ఏ రకం బ్లాగర్ని..అని నాకు బోలెడు సందేహం వచ్చింది. అందుకే.. ఈ ఆత్మ సమీక్ష. బ్లాగ్ (నా బ్లాగ్ ) సమీక్ష.

నే ను వ్యక్తిగతంగా..ఎవరిని నొప్పించను. నొప్పించిన దాఖలు లేవు. అలాగే అసలు కామెంట్స్ కోసం నేను ఎదురు చూడను. నా మనసుకు నచ్చినట్లు వ్రాసుకుంటాను. అది నా ధోరణి.

ఈ బ్లాగ్ లోకం లోకి వచ్చి న తర్వాత ఇక్కడ కొన్ని పోస్ట్ లు extra - ordinary గా నేను వ్రాసినప్పుడు.. గాని.. కథా విశ్లేషణలో నాకు ప్రధమ బహుమతి వచ్చినప్పుడు కానీ.. చాలా మంది చూసి చూడనట్లు పోయారు. కనీస మర్యాద తో కూడా నన్ను విష్ చేయలేదు. అది నాకు బాధ కల్గించింది అని చెప్పను కానీ .. ఒక నిర్లక్ష్యం గమనించాను. నాకు ఆ అర్హత లేదా అని అనుకున్నాను.

ఉదాహరణకి..ఒకటి చెపుతాను.."ఉడాన్" పోస్ట్ నేను కాకుండా ఎవరైనా వ్రాసి ఉంటే.. దానిపై.. ఓ..పెద్ద చర్చ పెట్టి ఉండేవారు. నా దృష్టిలో.. "ఉడాన్" చాలా మంచి కథ. ఎయిర్ పోర్ట్ లోపరిచయమై మూడేళ్ళ తర్వాత పెళ్లి చూపుల్లో కలిసే కథ కన్నా కూడా చాలా చాలా మంచి కథ.

"దేహాన్ని కప్పండి " నువ్వు వదిలేసినా కాడితో.", "అమ్మ మనసు" "సరస్సు" "ఒక మౌనం వెనుక" వారు వారే "లాంటి కవితలు ఎన్నో ప్రశంసలు పొందిన కవితలు ఉన్నాయి. కనీసం ఒక్క రన్నా ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు. అంతెందుకు.. ఈ మధ్య "విహంగ" లో వచ్చిన కవిత.. "దేహ క్రీడలో తెగిన సగం" ..ఆ కవితకి కూడా ఎవరు స్పందించ లేదు. అయినా నేను బ్లాగ్ రాసుకోవడం మానేసానా? లేక అందరిని నా బ్లాగ్ చదవండి అని ఒత్తిడి పెట్టనూ లేదు.

ఇంకొకటి.. జాజిమల్లి బ్లాగ్ లో.. మల్లీశ్వరి గారు.. బ్లాగ్ లలో బ్లాగ్ ల కోసమే వ్రాస్తున్న వారిలో.. మంచి రచనలు ఎవరు వ్రాస్తారో సూచించమంటే.. కేవలం ఒక్కరు కూడా..నా పేరు సూచించలేదు. అంటే.. నాబ్లాగ్ ని ఎవరు గమనించలేదా? గమనించనిదే ఎవరు నా బ్లాగ్ ని చూడనిదే.. కు 45 000 పైగా హిట్స్ ఎలా వచ్చాయి ?

నేను కూడా.. నేను బ్లాగ్ కోసం రాస్తాను.. అని మల్లీశ్వరి గారికి తెలుపనూ లేదు. నేను బ్లాగ్ వ్రాయడం మొదలెట్టి.. 16 నెలలు అయింది. మొదటి నాలుగు నెలలు..నా కవితలు,పాటలే పోస్ట్ చేసాను. అప్పుడు నాకు మామూలు హిట్స్ కూడా లేవు. తర్వాత తర్వాత నా బ్లాగ్ అందరి దృష్టిలోకి వచ్చింది.

మన బ్లాగర్స్ అందరికి ప్రతి రోజు.. బ్లాగ్స్ అన్నీ చూడటం..మంచి పోస్ట్ కనబడితే..స్పందిస్తే.. ఒక కామెంట్ పెట్టడం సాధ్యం కాకపోవచ్చు కూడా. అసలు మన దృష్టికి రాని..మన దృష్టిలో పడని బ్లాగ్స్ ఉండవచ్చును. మొన్న మొన్ననే నేను "నీహారిక" గారి బ్లాగ్ చూసాను.. అలాగే కొన్ని బ్లాగ్ లు అందరు చూడకపోవచ్చును కూడా.అది నేను ఒప్పుకుంటాను. ఎవరి ఒత్తిడులు,ఎవరి అనుభవాలు వారివి. స్పందించనంత మాత్రాన వారిని ద్వేషించ వలసిన పని లేదు.

అయితే.. నేను గమనించిన ఒక విషయం ఏమంటే..లైవ్ ట్రాఫిక్ ఫీడ్ ద్వారా..ఎవరు మన బ్లాగ్ చూస్తున్నారో.. మనకి అర్ధమయి పోతుంది. ఎవరు నా బ్లాగ్ చూస్తున్నారో కూడా నాకు తెలుస్తూనే ఉంటుంది. కాని వాళ్ళు సంవత్సరం కాలంలో ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు . ఎందుకంటే ఈ బ్లాగ్ లోకం లోకి నేను రాగానే వాళ్ళకి నేను ఫాలోయెర్ గా మారలేదు కాబట్టి అని అర్ధం చేసుకున్నాను.


ఒక కొత్త బ్లాగర్ వచ్చి ఒక పోస్ట్ వేయగానే.. ఆహా..ఓహొ..అంటూ.. కామెంట్ ఇచ్చే పెద్ద పెద్ద బ్లాగర్లు ఫాలోయర్ గా వెళ్ళే బ్లాగర్ లు 16 నెలల కాలంలో నా బ్లాగ్ ని చూడలేదంటే.. నేను ఎలా నమ్మేది. ? ఒక కామెంట్ ఇవ్వడానికి సంవత్సరం సమయం తీసుకోవడం ఆశ్చర్యం కాదా?

కొంతమంది ఫాలోయర్ గా వచ్చి బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను మొదటి నుండి ఫాలోయర్ గా ఉండటానికి ఇష్టపడలేదు. అలాగే..నన్ను ఫాలో అవమని నేను అడగనూ లేదు. అందుకే..ఆ గాడ్జెట్ తీసి పడేసాను.
 నేను అప్పుడు అర్ధం చేసుకున్నాను. "దటీజ్ ..గ్రూపిజం." గ్రూపిజం గుప్పిటలో మరి కొందరు.


పిల్లల టాయిలెట్ హాబిట్ పైన కూడా పోస్ట్ లు వ్రాసుకుని..ఆహా ఓహొ.. అనే భట్రాజు పొగడ్తలకి అలవాటు అయిపోయిన గ్రూపిజం వారికి నిరసనతో..ధన్యవాదములు చెప్పుకోవడం మంచిదే కదా అనుకున్నాను.

ఒక ఆమె అయితే.. నేను ఆమె లో ఉన్న మంచి పరిణితి చెందిన రచనా శైలిని ఇష్టపడతాను. ఒక మంచి విషయం చెపుతూ పోస్ట్ పెట్టగానే.. మొట్ట మొదటగా ఆమెకి నేనే కామెంట్ పెట్టాను. ఆ కామెంట్ ఆమె ప్రచురించనేలేదు. నా తర్వాత పెట్టిన కామెంట్స్ అన్నీ వచ్చాయి.అప్పుడు నేను యెంత హర్ట్ అయ్యానో! ఆమె రచనకి సంబందించి చాలా పోస్ట్ లు వచ్చాయి. కానీ నేను చక్కగా చదివాను. రచనలు ఇష్టం కాబట్టి. కానీ వ్యాఖ్యానం చేయలేదు. ఆమె అప్పటి ధోరణి ముల్లులా గుచ్చుకుంటుంటే.. నేను ఎలా మరచి పోగలను?

పాపం ఏ గ్రూప్ లు లేని వాళ్ళు మరి కొందరు ఉన్నారు. వారు అన్ని చోట్లా కనబడతారు. వారికి హృదయ పూర్వక నమస్సులు.

ఇంతకీ నేను చెప్పేది ఏమంటే..ఎవరు మెచ్చుకున్నా..మెచ్చుకోక పోయినా వచ్చిన నష్టం ఏమి లేదు. ఒక చిన్న ప్రశంస..మరింత బాగా నిరూపించుకోవడానికి, ఒక సద్విమర్శ లోపాలు దిద్దుకుని.. మరింత బాగా ఎదగడానికి దోహదపడుతుంది.

అది అందిస్తే ..సంతోషంగా స్వీకరించడం ..వీలయితే..సమయం కేటాయించుకుని.. కృతజ్ఞతలు చెప్పడం కనీస సంస్కారం. అలాంటి సంస్కారం లేనివారిని ఈ బ్లాగ్ లోకంలో చాలా మందిని చూసాను. వీళ్ళ కామెంట్ నాకొక లెక్కా ..అన్న అహం కనబడుతూ ఉన్నట్లు ఉంటుంది కూడా!

చదువులు,హొదాలు,స్థాయి బేధాలు .. ఇవి కాదు కావాల్సింది.

నేను ఎప్పుడో..చదివిన నాకు నచ్చిన నాలుగు మాటలు

"జ్ఞానం ఆర్జించిన వాళ్ళు పండితులు అవుతారు.
ఇతరులకి బోధించినవారు.. గురువులు అవుతారు.
ఇవి లేకున్నా హృదయ సంస్కారం ఉన్న వారు.. మంచి మనుషులు అవుతారు.

PS : నాకు వ్యక్తిగతం గా ఎవరి పైనా ద్వేషం గాని కోపం గాని లేవు. నేను ఎవరిని ఉద్దేశ్య పూర్వకంగా నొప్పించనూ లేదు.

బ్లాగర్ గా నా అనుభవాలు వ్రాసుకున్నాను. ఎవరినైనా ఉద్దేశించినట్లు అనిపిస్తే.. ఒక అభిప్రాయం చెప్పడానికే చెప్పాను తప్ప వారిని అవమానించాలని మాత్రం కాదు అని గమనించ మనవి.

17, మార్చి 2012, శనివారం

సంప్రదాయం - సమానత్వం

నేను మార్చి 8  న ఒక వివాహానికి వెళ్లాను.
అక్కడ కొన్ని ఆసక్తి కర విశేషాలు.
మరీ అంత ఆసక్తికరం  కాదనుకోండి.
మీరు..సరదాగా చూసేయండి.



బుట్టలో పెళ్లి కూతుర్ని మేన మామలు .పెళ్లి  పీటల పైకి తీసుకుని రావడం చూసే వారికి  చాలా సరదా గా ఉంటుంది పాపం పెళ్లి కూతురు మాత్రం..ఆ బుట్టలో ఒదిగి కూర్చోవడానికి చాలా కష్టపడాలి కదా! కొన్ని సంప్రదాయాలు బాగుంటాయి.  నాకు మాత్రం జిలేబి గారి డైలాగ్ "బుట్టలో పడటం" గుర్తుకువచ్చేసింది. ..Lol :)))))))

15, మార్చి 2012, గురువారం

అమ్మకి కోపం వచ్చింది

అమ్మకి కోపం వచ్చింది. ఆ కోపంలో కూడా మార్చి 12 ఎప్పుడు వస్తుందా ..అని టెన్షన్ గా ఎదురు చూసింది.
ప్రతి సంవత్సరం మార్చి 12 కి లేని టెన్షన్ ,ఆత్రుత ఎందుకంటారా?

ఓ.. ఎనిమిది నెలలు వెనక్కి వెళ్ళాలి. ఓ..కొడుకు కి అమ్మ పై ఉన్న ప్రేమ గురించి చెప్పాలి. ఇరవైనాలుగేళ్ళు వచ్చినా అమ్మకి ఆ కొడుకు ఎప్పుడు చిన్న బిడ్డడే! కష్టం విలువ తెలియాలి అనుకుంటుంది కానీ తన బిడ్డ ఏమాత్రం కష్టపడకూడదు అనుకుంటుంది. ఆ కష్టం ఏదో..తను అనుభవించి బిడ్డ చల్లగా సంతోషంగా ఉండాలనుకుంటుంది.అందుకేనేమో తల్లి బిడ్డల  ప్రేమ అన్ని ప్రేమలకన్న విలువైనది కదా!

నేను ఇప్పుడు నా గురించి మా చిరునవ్వుల చంద్రుడు గురించి చెప్పబోతున్నాను. మార్చి 12 కోసం యెంత టెన్షన్ గా ఎదురు చూసానో..అన్న విషయం కూడాను.

గత జూలై లో మా అబ్బాయి నిఖిల్ చంద్ర వచ్చినప్పుడు ఇంటి కోసం కొంత స్థలం కొనడం కోసం ప్రయత్నాలు జరిగాయి. అసలు అప్పటి పరిస్థితుల్లో ఆ స్థలం కొనడం అవసరం లేదు కూడా. కానీ మా మరిది గారి వాటా కి వచ్చిన స్థలాన్ని అమ్మే పరిస్థితిలో వేరేవారి ప్రవేశాన్ని అడ్డుకోవడానికిగాను మేము,మా బావగారు.. కలసి మా మరిది గారి వాటాని కొనవలసి వచ్చింది. ఆ స్థలం విలువ లక్షలలో. స్థలమేమో కొన్ని గజాలు మాత్రమే! మా స్వంత ఇంటి కల అదీ చాలా అందమైన సౌకర్యమైన ఇంటి కల నెరవేరాలంటే ..బాగా విశాలంగా ఇల్లు రావాలంటే ఆ స్థలం తప్పక కొనాల్సిన పరిస్థితి.

అప్పుడు మా దగ్గర డబ్బు అందుబాటులో లేదు. మా అబ్బాయికి ఇప్పటి ఆర్ధిక పరిస్థితుల్లో ఆ స్థలం కలుపుకోవడం ఇష్టం లేదు. కానీ నేనే పట్టుబట్టి కొంటే  బాగుంటుందని ఒప్పించాను.

ఇక డబ్బు కోసం అన్వేషణ. నాకేమో అప్పు చేయడం ఇష్టం లేదు. మరి ఎలా!? మా అబ్బాయి ప్రశ్న .

"చిన్నీ ..నా గోల్డ్ అమ్మేద్దాం "అన్నాను.

వెంటనే.. స్థలం కొనడమే మానేద్దాం. నీ గోల్డ్ అమ్మవద్దు అన్నాడు.

గోల్డ్ మొత్తం అమ్మవద్దు .. సగం అమ్మేద్దాం . అయినా నేను రోజు వాడను కదా! బ్యాంకు లాకర్ లో ఉండే కన్నా ఒక మంచి స్థలం ఉంటె బాగుంటుంది కదా అని చెప్పి ఒప్పించేసరికి నాకు ఒక వారం పట్టింది.

సరే..ఆ తర్వాత నాలుగైదు రోజులకి స్థలం రిజిస్ట్రేషన్ ఉందనగా.. గోల్డ్ అమ్మడానికి సిద్దపడి.. నా ఎనిమిది జతల బంగారు గాజులు (దాదాపు 250 గ్రాములు) అమ్మేయాలనుకుని బయలు దేరాం. .

మా అబ్బాయి.. అమ్మా! నీ గాజులు అమ్మవద్దు. మళ్ళీ చేయిన్చుకోగలం అని తేలికగా అమ్మేయడం చేస్తాం. కానీ ఇప్పుడు ఈ గాజులు అమ్మవద్దమ్మా.. నాకు ఇష్టం లేదు అన్నాడు.

"పర్వాలేదు నాన్నా..నాకయితే అంత సెంటిమెంట్ ఏమీ  లేదు.. అవసరమయినప్పుడు  ఆదుకోవడానికే కదా ... గోల్డ్ ఉండేది "అన్నాను.

ఇప్పటికే రెండు సార్లు ఇలాగే గాజులు అమ్మేసావు. మళ్ళీ ఇవికూడా అమ్మడమా!? వద్దు..అన్నాడు.

నిజంగానే అప్పటికి రెండు సార్లు వ్యాపారం కోసమని పొలాలు,బంగారం అమ్ముకున్న పరిస్థితి. అలాగే మా పెళ్ళికి ముందు ఈ గాజులు పెట్టలేదనే కారణం మీద నా పెళ్లి జరగకుండా సంవత్సరం పాటు వాయిదా పడిన జ్ఞాపకాలు. చాలా బాధాకర అనుభవాలు జ్ఞప్తికి వచ్చాయి ఆ క్షణాన నాకు.

మళ్ళీ నేను ఇంత ఎదిగాక కూడా "నీ చేతుల గాజులు అమ్మడమా! అని బాదపడుతూ.. సడన్ గా  లేచి  "అమ్మా! ..బ్యాంకు కి వెళదాం పద" ..అన్నాడు.

 "ఎందుకు బంగారం : అన్నాను. బంగారం అమ్మవద్దు. గోల్డ్ లోను తీసుకుందాం. ఆ లోన్ తీర్చడం నాకు లైట్ కదా అన్నాడు.

నీ చదువు పూర్తి కాకుండా ఎలా సంపా దించ గలవు . రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు వద్దు.. అని ఖరాఖండిగా చెప్పేసాను.

అమ్మా! నువ్వు ప్రతి విషయానికి టెన్షన్ పడతావు. ఏమి అవదు. నీ గాజులు అమ్మవద్దు. నిదానం గానే.. ఆ బాకీ తీర్చుకుందాం .కనీసం గోల్డ్ లోఅన్ తీసుకోవడం కోసమైనా ఒప్పుకో..అని నన్ను కన్విన్స్ చేసాడు. వెంటనే అసలు ఏమాత్రం ఆలస్యం చేయనీయకుండా బయలదేరదీసి బ్యాంకు కి తీసుకు వెళ్ళాడు.

అమ్మేసేయాలి అని అనుకున్న గాజులతో పాటు .. నాకున్న బంగారాన్ని (కొద్దిగా రోజూ  వేసుకోవడానికి మాత్రం ఉంచి  మిగతా మొత్తాన్ని  నా పేరున , మా అబ్బాయి పేరున కలిపి పెట్టి 7 లక్షల రూపాయలు వరకు లోన్ తీసుకున్నాం.

సరే ఆ స్థలం ని రిజిష్ట్రేషన్ చేయించాం.

ఇంకొక విషయం ఏమిటంటే నేను మా అబ్బాయి స్టడీస్ కోసం US  వెళ్ళాక తన కరిజ్మా బండి అమ్మేసి ఆ డబ్బుకి మరి కొంత జేర్చి.. ఒక గోల్డ్ బిస్కట్ కొని ఉంచాం. కానీ అది అమ్మడం నాకు ఇష్టం లేదు. మా కాబోయే కోడలికి గిఫ్ట్ గా ఇవ్వాలని కొన్న బిస్కెట్ అది. అక్కడ సెంటిమెంట్ అడ్డువచ్చింది నాకు. అందుకే ఈజీగా కాష్ అయ్యే వీలు ఉన్నా సరే ఆ గోల్డ్ బికి ని అమ్మాలనుకోలేదు. ఒక విషయం ఏమంటే బిస్కెట్ రూపంలో ఉన్న గోల్డ్ ని పెట్టుకుని బ్యాంకు వాళ్ళు గోల్డ్ లోన్ ఇవ్వరు.కూడా. నిజానికి ఆ విషయం అప్పటివరకు నాకు తెలియదు. ఏదైతేనేం..?  అప్పటికి అలా.. జరిగి పోయింది. అవసరం కూడా తీరింది ఇబ్బంది లేదు అనుకున్నాను.

ఆగస్ట్ లో మా అబ్బాయి తిరిగి US  కి రిటన్ అయ్యాడు. తను వెళ్ళేటప్పటికి రెండు సెమిస్టర్ లకి సరి పడా పీజులు, ప్రయాణపు చార్జీలు అన్నీ బ్యాంకు లోన్ ద్వారా సమకూర్చి పంపాం. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ చేసి ఇబ్బందికర పరిస్థితుల్లో పడకుండా.

నీకే ..నువ్వు ఇలాగే చెపుతావ్.. రేపు ఈ లోన్స్ అన్నీ తీర్చడానికి నేను బోలెడు కష్టపడి బ్యాంకు వాళ్లకి లోను డబ్బు కట్టాలి. ఆ బాధ లేకుండా ఇప్పుడే నా ఫీజులకి సరిపడా నేను సంపాదించుకుని ఫీజులు  కట్టేసుకుంటాను కదా..అన్నా కూడా నేను వినలేదు. ఫీజు కి సరిపడా డబ్బు  ఇచ్చే పంపాము..

మా ఇంట్లో ఒక పద్దతి.. చిన్నవాడైనా అబ్బాయి చెపితే అమ్మ వినాలి. అమ్మ చెపితే అబ్బాయి వినాలి. ఈ అమ్మా కొడుకు మంచి స్నేహితులు కూడా.

సరే US  వెళ్ళాక ..తన చదువు చదువుకుంటూనే .. దగ్గరలో ఉన్న గ్యాస్ స్టేషన్ లో జాబ్  చేయడం మొదలెట్టాడు . అంతకు ముందు.. ఒక స్టోర్స్ లో జాబ్  చేసేవాడు. అది మానేసి.. గ్యాస్ స్టేషన్ జాబ్.

మా అబ్బాయి మనసులో ఒకటే కోరిక .అదీ వాళ్ళ నానమ్మ తోనూ, మా చెల్లి తోనూ చెప్పేవాడు.అమ్మ పుట్టినరోజు వచ్చే సరికల్లా అమ్మ గోల్డ్ అంతా ఇచ్చేయాలి. అదే అమ్మకి నేను ఇచ్చే గిఫ్ట్ అని.

ఇక అక్కడ గోల్డ్ లోన్ క్లియర్ చేయాలి అని గట్టిగా నిశ్చయించుకుని.. పని గంటలు పెంచుకుని కష్టపడం మొదలెట్టాడు.

నేను US  వెళ్ళేటప్పుడు..అలా జాబ్ చేయకూడదని మాట తీసుకుని ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తే.. వీడేమిటీ ఇలా తయారయ్యాడని నాకు కోపం వచ్చేది. దిగులు వచ్చేసేది. నేను కోప్పడుతున్నానని నాకు ఫోన్ చేయకుండా తప్పించుకోవడం మొదలెట్టాడు. ఒకసారి.. కాల్ చేసి..పది రోజులైంది చిన్ని ..నువ్వు అని అంటే..బిజీగా ఉన్నాను.. తీరిక లేదమ్మా .! .అన్నాడు. వెంటనే నాకు కోపం వచ్చి పోన్ కట్ చేసుకున్నాను.

వెంటనే నాకు రెండు మూడు సార్లు పోన్ చేసినా నేను కట్ చేసినా  సరే పదే పదే పోన్ చేస్తున్నాడు అని స్విచ్ ఆఫ్ చేసుకున్నాను.అలా ఈ అమ్మకి కోపం వచ్చింది.బాగా కోపం వచ్చింది.

అబ్బాయికన్న ఈ అమ్మకి ఏది ఎక్కువ కాదు.. కదా! తర్వాత రెండవ రోజు చీకటితో..కాల్ చేసాడు అబ్బాయి. అమ్మకి కోపం తగ్గిపోయి..పోన్ లిఫ్ట్ చేసింది. తన ఆదుర్ధాని..భయాలని చెప్పింది. ఏడ్చింది కూడా.

ఆ రోజు నుండి.. అబ్బాయి రోజు.. క్రమం తప్పకుండా అమ్మకి పోన్ చేస్తాడు.లేదా జి.చాట్లో వీడియో కాల్ లో కనబడతాడు.

కొడుకు గ్యాస్ స్టేషన్ లో జాబ్ చేస్తుంటే..అమ్మా రాత్రంతా మేలుకుని..కొడుకుకి కబుర్లు చెపుతుంది.

ఆమ్మ మేలుకుని ఉండి తనతో మాట్లాడుతుందని గురుకు రాగానే.. అమ్మా! పొద్దు పోయింది..పడుకో..అని గుడ్ నైట్ చెపుతాడు.

పగలల్లా అమ్మ జి మెయిల్ లో బిజీ స్టేటస్ పడేసి ..(ఎవరికి చాట్ కి చిక్కకుండా ) కొడుకు ఆన్ లైన్ చాటింగ్ కి ఎప్పుడు కనక్ట్ అవుతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తన పనులు మానుకుని అప్పుడప్పుడు.. కొడుకుతో మాట్లాడమే పని గా పెట్టుకుంటుంది. అంతకన్నా.. ఈ అమ్మకి ఏది ఎక్కువ కాదు.

చూడు ... ఇంట్లో.. కాఫీ తాగిన గ్లాస్ కూడా సింక్లో పడేయని నేను..ఎలా కష్టపడుతున్నానో.. అందుకేనా అమెరికా పంపించావ్ ? అని హాస్యమాడేవాడు అబ్బాయి. "డిగ్నిటీ అఫ్ లేబర్.. గురించి చెప్పేది..అమ్మ

ఒక సారి అమ్మ అబ్బాయి వేసుకున్న షర్ట్ చూసి కొత్త షర్ట్ కొనుక్కున్నావా? చాలా బాగుంది బంగారం ..అంది. కాదమ్మా.. బి.ఎఫ్ అన్నాడు.


అమ్మకి అర్ధం కావడానికి క్షణం పట్టింది. కళ్ళల్లో కన్నీరు. "ఇదిగో..ఇలా ఏడుస్తావనే..నేను నీకు ఏమి చెప్పను.".అంటాడు..అబ్బాయి.

"లాస్ట్ వీక్ లో..ప్రక్క గ్యాస్ స్టేషన్ లో షూటింగ్ జరిగింది. అందుకే.. ముందు జాగ్రత్త చర్యగా బి.ఎఫ్ వేసుకున్నానులే"..అని చెపుతాడు.

కొడుకు ఆమ్మ కన్నా మొండి వాడు. తను అనుకున్నదే చేసి తీరతాడు. ఎవరి మాట వినడు కూడా.

ప్రతి రోజు అమ్మకి దిగులు. బిడ్డ బాగుండాలని  క్షేమం కోసం దేవుడికి పూజలు చేసుకుంటుంది. ఒకోసారి తను ఎక్కువగా ఆలోచించుకుని భయపడుతుందని తనని తనే..కోప్పడుకుంటూ ఉంటుంది.

మార్చ్ 12 ఎప్పుడు వస్తుందా అని ఎదురెదురు చూసింది. త్వరగా రోజులు గడిచి పొతే బాగుండును అని పదే పదే కోరుకుంది. ఇక్కడ అమ్మ ఇలాగుంటే అబ్బాయి అయితే.. అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఒక సబ్జక్ట్ ని అట్టిపెట్టుకుని తన యూనివర్సిటీ దగ్గరలోనే ఉండి జాబ్ చేసి అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలనుకుని కంకణం కట్టుకుని జాబ్ చేస్తున్నాడు.

అట్లాంటా లో ఉన్న వాళ్ళ బాబాయి దగ్గరికి వెళ్ళకుండా బాబాయితో మాట్లాడ కుండా కూడా (మాట్లాడితే..ఆ జాబు లు ఎందుకు..మన దగ్గరే బోలెడు జాబ్ లు ఉండగా అని కోప్పడ తాడని ) అలా తన అనుకున్న టార్గెట్ ని అనుకున్న తేదీకి రీచ్ అయ్యాడు.తన కోరిక నెరవేరింది కూడా.

"ఈ మధ్య కాలంలో ..అన్నం తిన కుండా పస్తులుగా  ఉన్న రోజులు ఎన్నో, డాలర్ కోసం ఏకధాటిగా  కష్టపడిన గంటలు ఎన్నో! ఆ క్రమం లో..తను పని చేస్తున్న గ్యాస్ స్టేషన్ నష్టాలని దాటేసి..లాభాల బాటలో పెట్టేటప్పటికి .. ఓనర్ ప్రశంసలు పొంది..గిఫ్ట్ లు కూడా అందుకున్నాను"   అని చెపుతున్నప్పుడు వింటున్న అమ్మకి గర్వంగా ఉంటుంది. అనుకున్న లక్ష్యం కోసం నిబద్దతతో పనిచేస్తున్న కొడుకుని చూసి..  

అమ్మా ! ఒకే ఒక జీవితం పాట విన్నావా? డౌన్లోడ్ చేసుకుని విను బాగుంది అని చెపుతాడు. ఆ పాట విన్న అమ్మకి మళ్ళీ దిగులు వస్తుంది.

అమ్మా! ఈ రోజు ఝుమ్మంది నాదం సినిమా చూసాను. .." లాలి పాడుతుంది ..గాలి". పాట యెంత బాగుందో .. ..అంటాడు.

నా చిన్నప్పుడు..మన ఇద్దరం కలసి చంటి సినిమా చూసాం గుర్తుందా  ? అని అడుగుతాడు 

" మా ఫ్రెండ్ కి మా మమ్మీకి బ్లాగ్ ఉంది చూడు అని చెప్పాను. నువ్వు ఆ రోజే "సరదా బెట్టింగ్స్" పోస్ట్ పెట్టి నా పరువు తీసేశావు" అంటాడు.  అమ్మా అబ్బాయి నవ్వుకుంటారు.

అలాగే అమ్మ కోసం ఒక బోటిక్ ప్లాన్ చేస్తున్నాడు కూడా.

ఇంకో రెండు నెలల్లో వాళ్ళ బాబాయి దగ్గరకి వెళతాడు.

కానీ US  లో ఉండే ఆలోచన మాత్రం లేదు. తనకున్న ఆలోచనలు,లక్ష్యాలు..అన్నీ అమ్మకి చెపుతుంటాడు.
అమ్మ అబ్బాయికి ఎప్పుడు.. తన ఇష్ట ప్రకారమే చేయమని చెపుతుంటుంది.. Go ..Ahead .. అని full support ఇస్తుంది. అబ్బాయికి తనకున్న స్కిల్ల్స్ ని మన దేశం లోనే నిరూపించుకోవాలని కోరిక.

అమ్మది  మనీ మైండ్ కాదు. "జీవితపు తూకంలో..డబ్బు అనేది పడిగట్టు రాళ్ళు కాదు  కాకూడదు " అంటుంది. మేటీయరలిస్ట్ కాదు. ఒడిదుడుకులు,లాభనష్టాలు..అన్నీ సర్వసాదారణమైన విషయాలు. కానీ అమ్మకి అబ్బాయి పి.హెచ్.డి చేయాలని కోరిక. (తన తీరని కోరిక కూడా)

అమ్మ పుట్టిన రోజుకి అబ్బాయి అమ్మ కిచ్చిన కానుక. తానూ కష్టపడి రూపాయి రూపాయి పొదుపు చేసి.. అమ్మకి ఇచ్చిన కానుక. ఆ రోజు అమ్మాలనుకున్న బంగారు గాజులు. ఈ గాజులు వారసత్వపు సంపద కూడా.


అమ్మ జీవితంలో అందుకున్న బహుమతులలో విలువైన బహుమతి (ఖరీదు లో కాదు) ఇది రెండవది. ఆ రెండు బహుమతులు కొడుకు ఇచ్చినవే కావడం ఇంకా ఆనందం.

అమ్మకి పుట్టిన రోజు కానుక

అమ్మకి ఇంతకన్నా గర్వకారణం ఇంకోటి లేదు.

అయినా ఇంకా కోరుకుంటుంది.

ఇలా చెపుతుంది. నీ మాతృ దేశానికి నీ అవసరం ఉంది కన్నా.! మంచి నైపుణ్యం పెంచుకుని మన దేశంలో.. కష్టపడుతూ..మంచి దక్షత తో.. నీ భవిత ఎదగాలని కోరిక. ఇండస్ట్రీ స్టార్ట్ చేసి మరి కొంతమందికి అయినా జీవనోపాది కల్గించాలని కోరిక .బ్రతుకు- బ్రతికించు.. తరహాలో ..ఎదిగి ఒదగాలి అని

"ఎస్..బాస్ అంటూ.. ఒకరి ఆదేశాలమీద ఒకరి క్రింద పనిచేయకు "అన్నది అమ్మ సూత్రం.

అలాగే కొడుకుని మంచి ఉన్నత స్థితిలో చూడాలనుకుంటుంది.

అమ్మా! అన్నం పెట్టమ్మా..అనకుండా .".అమ్మా..అన్నం తిందాం రామ్మా!  అనే కొడుకు,"

ఆమ్మఅర్ధ రాత్రివరకు పుస్తకాలు చదువుకుంటూ అల్లాగే నిద్రపోయినా,

రిమోట్ చేతిలో నుండి జారి అలాగే నిద్ర పోయినా ,

ఆమ్మ గదిలోకి వచ్చి టీవి, లైట్లు ఆఫ్ఫ్ చేసి.. దుప్పటి కప్పి దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకుని భద్రంగా తలుపులు మూసి  అన్ని జాగ్రత్తలు తీసుకునే కొడుకు

ఫ్రెండ్స్ తో..ఎస్ ఏం ఎస్ చాట్ చేస్తున్న అమ్మని "నొక్కింది ఇక చాల్లే పడుకో.."అని ప్రేమగా కసిరే ..కొడుకు,

అమ్మకి పూజ కి కూర్చునే టప్పుడు కావాల్సిన చాప దగ్గర నుండి..డైనింగ్ టేబుల్ పై డిష్ మాట్ ల వరకు..అన్నీ వివరంగా షాపింగ్ చేసుకొచ్చే కొడుకు దగ్గరగా లేకుంటే..అమ్మకి యెంత లోటు.

చిన్నీ! బంగారం.. ఐ మిస్ యూ.. నాన్నా! వారం అవుతుంది..నిన్ను చూసి. వీడియో కాల్ చేయి బంగారం ..అని అమ్మ మెయిల్స్.

అమ్మ కోసం తెచ్చిన లాప్టాప్ లో.. యాపిల్ ట్యూన్స్ నుండి డౌన్లోడ్ చేసి ఇచ్చిన అమ్మకి ఇష్టమైన సాంగ్స్ ఇలా అమ్మ కోసం, నానమ్మ కోసం బహుమతులు. నాన్న గారి కోసం ఎలక్ట్రిక్ సిగార్. ఇలా.. అందరి మనసెరిగి ఉన్న అబ్బాయి ..

ఇక అమ్మ అబ్బాయికి ఇలా చెపుతుంది.....

నా పై నీకు ఉన్న ప్రేమ కన్నా బంగారు వస్తువులు ఎక్కువకాదు బంగారం..అలాగే అమ్మకి నీవు తప్ప మరో ప్రపంచం లేదు కన్నా!

నువ్వు పుట్టాక నేను మనిషిని అనే సంగతి మరచి పోయి  నీ అమ్మని... అనే ఒకే ఒకటి గుర్తెరిగి బ్రతుకుతున్న మీ అమ్మని నాన్నా!

ఈ బంగారాన్ని బ్యాంకు లాకర్ లో భద్రపరచుకుంటాం. కానీ నీకు నా పై ఉన్న ప్రేమని ఏ బ్యాంకు లాకర్ లోను దాయడానికి పట్టదు. అవాజ్యమైన నీ ప్రేమకి ..ఏ బ్యాంకు లాకర్ స్పేస్ ఇవ్వగలవు? చెప్పు కన్నా !

ఆమ్మ ఆశ..ఆశయాల రూపం నువ్వే కన్నా!
"
ఎక్కడ నీవున్నా-నా ఆశలు నీవన్నా
నీతో నీడల్లే నా ప్రాణం ఉందన్నా
నీవు ఇంతకు ఇంతై - అంతకు అంతై ఎదగర ఓ..కన్నా"..... ( ఇంట్లో ఇల్లాలు.వంటింట్లో ప్రియురాలు చిత్రం లో ఒక పాటలో భాగం)

 ప్రేమతో..దీవెనలతో .. అమ్మ

(అమ్మా ! ఇదంతా బ్లాగ్లో రాయాలా!? నీకు మైండ్ లేదసలు అనే చిన్నికి ... నా ఇష్టం ఇది నా బ్లాగ్ కాబట్టి అంటూ
అమ్మ  :)
***********
14/10/2019..

ఈ పోస్ట్ లో ఇప్పుడు మరికొంత చేర్చాల్సింది వుంది అనిపించింది. 2014వ సంవత్సరంలో ... జరిగిన సంగతి.
చెప్పాను కదా ..అమ్మకు అబ్బాయికన్నా ఏదీ ఎక్కువ కాదని ... తన ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం కోసం మరియు కాబోయే కోడలు చదువు కోసం ... కొంత ఫీజు  అవసరానికి .. దాదాపు అయిదు లక్షల రూపాయల విలువ చేసేంత గాజులు విక్రయించేసి అవసరానికి సర్దుకున్నాం. నిజానికి చాలామంది స్త్రీలకు లాగా నాక్కూడా బంగారం ఆర్ధిక భద్రత. అవసరానికి ఆదుకునే అమ్మలాంటిది. ఇక జ్ఞానాన్నిచ్చే విద్యావసరాలకు ఉపయోగపడితే అంతకన్నా కావాల్సింది ఏముందీ? విద్యనే ఆభరణం కన్నా బంగారు ఆభరణాలు ఎక్కువేమీ కాదు కదా !  :)
అలా .. ఈ గాజులు జ్ఞాపకం రూపంలో  యిక్కడ ఫోటోలో  మిగిలాయి.  మళ్ళీ కొనాలి..వేసుకోవాలి అన్నది అంత ముఖ్యవిషయం కాదు. తల్లిదండ్రులను అర్ధం చేసుకోలేని పిల్లలు కేవలం తమ స్వార్ధం కోసమే బ్రతుకుతూ ఆర్ధికంగా వెసులుబాటు లేని తల్లిదండ్రులను ఈసడించుకునే పిల్లలు ఉన్న కాలంలో ... నా కొడుకులాంటి కొడుకు ఉన్నందుకు నేనెప్పుడూ గర్వపడతాను. పిల్లలకు సంస్కారం ఇవ్వగల్గిన తల్లిదండ్రులే సంస్కారం ఉన్న పిల్లలే అత్యంత ధనవంతులు .  ఈ లెక్కన నేను బోలెడంత ఐశ్వర్యవంతురాలిని. అదృష్టవంతురాలిని. భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ .. ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమః  _/|\_ . 

13, మార్చి 2012, మంగళవారం

ఐటం సాంగ్స్ - అశ్లీల సాహిత్యం

ఒకప్పుడు మసక మసక చీకట్లో మల్లెతోట వెనకాల  మాపటేల కలుసుకో.. మనసైనది దొరుకుతుంది ..దొరుకుతుంది..ఆ పాటలో ఒక అర్ధం ఉంది..వింటుంటే ఉత్సాహంగా  ఉండేది .

అలాగే చిత్ర కథలో భాగంగా జానపదగీత శైలిలో ఒక పాట ఉంటే అది ఎంతగా  అలరించేదో చెప్పనవసరం లేదు. "ఆకులు పోకలు ఇవ్వద్దు..నా నోరు ఎర్రగ చేయొద్దు.. ఆశలు నాలో నాలో రేపొద్దు " పాట కానివ్వండి... "మావా..మావా.. ఏమే ఏమే భామా..  పట్టు కుంటే కందిపోవు.."  అనే పాట ..ఇలా ఆ తరహా   పాటల హవా చెల్లిపోయి.. క్లబ్ డాన్సు పాటలు..అవీ మొహం మొత్తి.. హీరోయినే  క్లబ్ డాన్సర్ లాగా   మూరెడు ముక్కలు చుట్టుకుని వాళ్ళ స్థానాన్ని ఆక్రమించుకుని.. నీ కావాల్సింది..నా దగ్గర ఉంది,ఆకుందా వక్కిస్తా..సున్నంతో పోక్కిస్తా.. తరహా పాటలు రాజ్యం యేలి.. అయిదా రేళ్ళు  బాగానే మురిపించాయి.  తర్వాత దాదాపు పదేళ్లుగా  ఐటం సాంగ్స్.

ఐటం సాంగ్ అంటే ..అమ్మో.. అశ్లీల సాహిత్యం .. వినడానికే   భయం వేస్తుంటే..  ఎఫ్ ఎమ్ ల పుణ్యమా అని.. ,చిన్ని తెర మీద వెగటు వేసే డాన్సు ప్రోగ్రాం ల పుణ్యమా అని    ఊదరగొట్టిన పాటలు విన్న మూడేళ్ళ పిల్ల కూడా ఐటం సాంగ్ నేర్చుకుని పాడుతుంటే.. అర్ధం తెలిసిన పెద్ద వాళ్ళు  పరుగులెత్తి ఆ పిల్లల నోర్లు మూయాల్సిన పరిస్థితి.

అసలు ఐటం సాంగ్స్ లో నటించే పేరొందిన తారలకి అసలు సిగ్గే లేదు. కాసుల కోసం రెండు కర్చీఫ్ ల్లాంటి పొదుపైన బట్టలతో.. వళ్ళు ఆరేసుకుంటుంటే.. మనం సినిమా చూడటం లేదుగా.. మనపిల్లలని చూడనీయకుండా కాస్త జాగ్రత్త పడాలి అనుకున్నా..కుదిరి చావదు. ట్రైల్స్ లో ముందుగా చూపేది ఆ ఐటం సాంగ్ లే ..కదా! ఆ పాటలకి సాహిత్యం అందించే రచయితలకి అవకాశం దొరకడమే తరువాయి..దర్శక,నిర్మాత,నటున్ని మెప్పించే రీతిలో..అశ్లీల సాహిత్యం ని ఒలికిన్చేయడమే!

నేను గత నాలుగు మూడేళ్లగా   గమనించింది ఏమిటంటే.. పూరి జగన్నాథ్ ప్రతి చిత్రంలోనూ.. ఒక ఐటం సాంగ్ అశ్లీల సాహిత్యం తో  గుప్పించి జనాల మీదకు వదలడం అలవాటు అయిపొయింది.
ఆ పాటలు వింటూ తిట్టుకోవడం లేకపోతే..వినకుండా కట్టి పడేసుకోవడం...  ఇది ఎలాగు నాలాంటి వినలేని వాళ్ళు చేసే పని. కానీ ..సినిమాలని చూసి..అందులోని ద్వందార్ధ మాటలు, వెగటైన హాస్యం, అశ్లీల దృశ్యాలు మాటేమిటీ!?

ఇప్పుడు వచ్చిన "బిజినెస్ మెన్" లో ఈ పాట చూడండీ!
గీత రచన : భాస్కర భట్ల
ఆయనకీ అవకాశం దొరికింది కదా అనుకుని.. ఈ తరం అమ్మాయిల ఆలోచన క్యాచ్ చేసాను అనుకుని.. ఈ పాట వ్రాసి.. పూరి జగన్నాథ్ ని మెప్పించి ఉండవచ్చు.

ఈ పాట సాహిత్యం గమనిస్తే.. స్త్రీల మనోభావాలని   కించ పరచే విధంగా  ఉన్నాయి .ఎలాంటి  భర్త కావాలో..లేదా సహచరుడు కావాలో అమ్మాయిలకి వెల్లడించే స్వేచ్చ ఉండ వచ్చు. పరిణితి  ఉందనుకోవచ్చు. కానీ.. అందరి వైపునా వకల్తా పుచ్చుకుని మాత్రం.. భాస్కరభట్ల వ్రాయడం.. అది పాటగా ఊరేగడం.. ఒక సారి ఆ పాట చూడండి..!?  అమ్మాయిల ఆలోచనలు ఇలా ఉన్నాయని ఒక పాట రూపంలో చెపుతుంటే.. ఆడ పిల్లలు అమాయకులు అంటారు ఏమిటీ.. ?అని  ఒకరు   నన్నుఅడిగారు.  ఆనక  అదేపనిగా మ్రోగించి ఆ పాటని హిట్ కూడా   చేసేసారు.


ఒక చరణంలో ఇలా ఉంది..

"పొద్దునే   లేపేసి .. మడి  కట్టు   కట్టేసి ..పూజ  గదిలో  కుర్చోబెట్టే  వాడు  మాకొద్దు ...
బికిని  యేసి  బీచ్  లో   వదిలేసే  వాడు  కావాలి"

ఇంత పచ్చిగా  స్త్రీల ఇష్టాల  స్థాయి దిగజార్చే హక్కు వీరికి ఎవరు ఇచ్చారు?  పోనీ అలాటి వర్గాన్ని వీళ్ళు దృష్టిలోకి తీసుకుంటే..   ఆ చిత్రం ని వారు మాత్రమె చూడరు. ఆ సినిమా చూసి..ఆ సాహిత్యాన్ని గమనించి యెంత మంది బహిరంగంగా ఆ పాట పాడుతూ..  తమ పరిసరాలలోని ఆడవాళ్ళని చులకన  చేస్తున్నారు అన్నది చూస్తే గాని తెలియదు..అది  యెంత అవమానకరంగా ఉంటుందో..పాట రాసిన వాళ్లకి ,తీసిన వాళ్లకి ,సిగ్గు ఎగ్గు లేకుండా నటించినవారికి తెలుస్తుందా?

చలన చిత్ర సీమలో గీత రచయితలు అందరు..దాదాపు  పురుషులే! ఆడవారి మనోభావాలని వారు అనుభవించి.. పరకాయ ప్రవేశం చేసి వారి మనస్పందనలు కనుగొని వ్రాసారా అనిపించేరీతిలో వ్రాసిన పాటలు ఎన్నెన్నో..
నెల తప్పేనమ్మ.. నెలత ఎన్నాళ్ళకి నెలవంక పుడతాడు కొన్నాళ్ళకి.. అనే పాటలో .. డా :సి.నా.రె.. స్త్రీల భావనల్ని యెంత చక్కగా వ్యక్తీకరించారో.. అలాగే.. శ్రీవారి కి ప్రేమ లేఖ చిత్రంలో.. మనసా తుళ్ళి పడకే .. ఇలాటి పాటలు చాలా స్త్రీల భావనలకి అద్దం  పట్టేటట్లు   వ్రాసారు.

ఇదేమి ఖర్మమో..సమాజానికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం ఎలాగు ఆశించడం లేదు..నానాటికి  ఈ దిగజార్చడం మితిమీరి పోతుంది.

భాస్కరభట్ల గారు.. మీ ఎరుకలో.. ఎవరైనా మీరు ఈ పాటలో రాసిననట్లు  వారు తారసపడి..మీకు వారి ఆలోచనలు ఇలా ఉన్నాయనివ్యక్తీకరించారా ?   కనీసం మీ ఇంటి ఆడవాల్లకైనా   ఆ స్వేచ్చ ఇచ్చి మనసులో భావాలు ఇలా ఉన్నాయని  చెప్పించగలరా !? అది మీరు హర్షించి,అంగీకరించి..పబ్లిక్ గా   వ్యక్తీకరించడం చాలా గొప్ప  విషయం అనుకుంటాను.  సాహిత్యం ప్రయోజనం ఇతరులని రంజింపజేయడం,ఆలోచింపజేయడం.. మరి మీరు అలాగే భావించి ఈ పాట రాసారా? మీకు భారతీయ స్త్రీ సమాజం మొత్తం మీరు ఉదహరించిన రీతిలో బాడ్ బోయ్స్ ని ఇష్టపడుతుందా!? కాస్త తెలుసుకుని చెప్పండి?

పూరి జగన్నాథ్ గారు.. మీరు జగన్నాదుడిలా.. కమర్షియల్ సినిమా రథ చక్రాలపై..నడవండి. ఎవరికి అభ్యంతరం లేదు. ఒక వేళ ఆ చిత్రం అపజయం పాలు అయితే.. నిర్మాతకి మాత్రమే  నష్టం. మీరు దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలోని ఐటం సాంగ్స్ సాహిత్యం, బూతు డైలాగులు,అపహాస్యం చేష్టలు.. ముందు మీ ఇంట్లో స్త్రీలకి నచ్చుతాయేమో..వాళ్ళు ఆమోద ముద్ర వేస్తారేమో చూడండి.అప్పుడు.. ఈ సమాజం పైకి మీ వికృతమైన ఆలోచనలు విసరండి. ఎందుకండి.. స్త్రీలపై అంత చిన్న చూపు. ? సమాజానికి  వినోదం తో పాటు విలువలు,వలువలు ..కావాలి. అన్ని విప్పేసాక ,ఒగ్గేసాక..మిగలడానికి ఏముంది...!? కేవలం మగవారిని రంజింపజేయడమే మీ కళాత్మక దృష్టి కావచ్చు.  స్త్రీలకి కనీసం కాస్త గౌరవాన్ని ఉంచి,ఇచ్చి సినిమాలు తీయండి అని మనవి.

బ్లాగ్ మిత్రు ల్లారా! వీలయితే.. "ప్రజా సాహితి " మర్చి సంచికలో ."బిజినెస్ మెన్ " పై సినిమా సమీక్ష చూడండి. 21 &  22 పేజీలలో.

ఇక నేను ఇంతగా చీత్కరించుకున్న ఈ  పాట సాహిత్యం ..చూడండి.

శ్రీ  రాముడు  లాంటి  గుణవంతుడు ..సౌమ్యుడు ..ఏక  పత్ని  వ్రతుడు  మాకక్కర్లేదు ..
కసుక్కున  బుగ్గ  గిల్లేసి ..చీర  కొంగు  లాగేసి ..నడుం  మీద  పంటి   గాటు  పెట్టె  చిలిపి  కృష్ణుడే  కావాలి ..

వుయ్   లవ్ ...వుయ్  లవ్ ..వుయ్   లవ్ ..
బాడ్  బోయ్స్ ..బాడ్  బోయ్స్ ..బాడ్  బోయ్స్స్ ....

వుయ్ లవ్   బాడ్  బోయస్స్స్స్ ...ఉయ్య్యయ్య్య్యి
వుయ్  వన్నా  వన్నా  బాడ్  బోయ్స్ ...ఉయ్య్యయ్యి

వుయ్  లవ్  బాడ్  బోయస్స్స్స్
వుయ్   వన్నా  బాడ్  బోయ్స్ .
మామ్మడ   గిచ్చి       ఈడ    గిచ్చి ..పిచేక్కించే   పెనిమిటే  కావాలీ ........
వుయ్  లవ్  బాడ్  బోయ్స్ 
వుయ్  వన్నా    వన్నా  బాడ్  బోయ్స్ .

పొద్దునే   లేపేసి .. మడి  కట్టు   కట్టేసి ..పూజ  గదిలో  కుర్చోబెట్టే  వాడు  మాకొద్దు ...
బికిని  యేసి  బీచ్  లో   వదిలేసే  వాడు  కావాలి
వంటలు  వార్పులు  వద్దని  చెప్పలే ..
ఐ  మాక్స్   లు ..పబ్   లు  తిప్పేస్తున్దాలే ..
హేయ్యి ....అ  నుదుటిన  బొట్టేట్టు ..వాకిట్లో  ముగ్గెట్టు ..అని  ఆర్డర్లేసి  అరిచేవాడు ..మంచోడైన  సారీ  మాకొద్దే ..
వుయ్  లవ్  బాడ్  బోయ్స్  ......

వుయ్ లవ్ ..లవ్  బాడ్  బోయ్స్ ...
ఒరే   రే   ... బబ్బ్లీ    ..మేరే  బిజిలి ..
అరె  బల్బ్ లు  పేలతాయి  షాక్  లు    తగిలి ..
ఒరే  రే ...బబ్బ్లీ ..మేరే  ఇమిలి ..
పులిహరే  చేస్కొనిలీ....

పప్పు  టొమాటో  బేచ్       మాకేందుకయ్య ...
నాటు  కోడి  కాలు ..నా  కాలు  పట్టుకు  లాగేసే  వాడే  కావాలి ..

ఆఫీసు  లో  OT లే   చేసే వాడోద్దె
పడకింట్లో  ఓవర్   టైం  డ్యూటీ  చెయ్యాలే ..
నా  దేవత  నువ్వంటూ ..పూజించే  వాడొద్దు
ఆ  రంభ  ఊర్వశి  నువ్వేనంటు  మీదడిపోయే  రకమే  కావలె ....

వుయ్  లవ్  బాడ్  బోయ్స్  ........

ఇదండీ.. వారి పైత్యం. 

12, మార్చి 2012, సోమవారం

విహంగ లో.. నా కవిత

"దేహ క్రీడలో తెగిన సగం"      నా కవిత.  ."విహంగ"  లో ప్రచురితం ఈ లింక్ లో   చూడండి.
.
దేహక్రీడలో తెగిన సగం 

ఆడి  పాడే అమాయకపు బాల్య  దేహం పై..
మొగ్గలా  పొడుచుకు వస్తున్నప్పుడు..
బలవంతంగా   జొప్పించిన ఆడపిల్లననే జ్ఞానం
పదమూడేళ్ళ ప్రాయంలో..యవ్వనపు దేహం పై..
వసంతం విరిసినప్పుడు  వీడని అమాయకత్వం 

నువ్వు ఆడదానివే సుమా అన్నట్లు 
నఖశిఖ పర్యంత చూపులతో
గుచ్చి గుచ్చి తడిమినప్పుడు
లోలోపల భయం, గగుర్పాటు తో 
అప్పటిదాకా లేని సిగ్గు తెర పైట అయి 
తనువంతా  చుట్టుకునే ముగ్ధత్వం 

కాంక్షల కౌగిలిలో నలిగిపోతున్నా
మోహపు పరవశంతో ఉప్పొంగినా 
నలిగిన  మేనుకు  అవే  తరగని
అలంకారమని సగభాగం నిర్ధారించాక


అనంత సృష్టి  రహస్యపుఅంచులు తాకే 

కేళీ విలాసంలో ముఖ్య భూమిక గా  

కామ్య వస్తువుగా..భోగ వస్తువుగా 

మారిన  కుఛ ద్వయాలకి 

అన్నీ గరళమైన  అనుభావాలే ! 


చిన్నిచేతులతో ..తడిమి  తడిమి ..
ఆకలికి  తడుముకుంటూన్నప్పుడు  
ఆ పాలగుండెలు 
బిడ్డ ఆకలిని తీర్చేఅమృత భాండా లని...
ఆ గుండెలు పరిపూర్ణ  స్త్రీత్వపు చిహ్నాలని
తన్మయత్వం తో..
తెలుసుకున్న క్షణాలు మాత్రం స్వీయానుభావాలు. 

అసహజపు అందాలను ఆబగా చూసే వారికి 
సహజం అసహజమైనా,అసహజం సహజమైనా.. 
ఆ దేహం పై క్రీడలాడునది..ఈ నరజాతి వారసుడు  
చనుబాలు కుడిచిన నాటిని మరచిన బిడ్డడే కదా.. 


అసహజంగా పెరిగిన కణ సముదాయాలని కుతికలోకి.. కోసి.. 
ఓ..సగ భాగాన్ని పనలని పక్కన పడేసినట్లు పడేసాక..
అయ్యో అనే  జాలిచూపులు భరించడం,.  
నువ్విక పనికరావనే..వెలివేతలు..సహించడం కన్నా
ప్రాణం పొతే బాగుండునన్న భావనే అధికం.  


అమ్మ - అమృత భాండం, స్త్రీ-సౌందర్యం..ఉద్దీపనం  సారూప్యమైనవే !


దేహం నదిలో 
ఎత్తు పల్లాలు,ఒంపు సొంపులు ,సొగసులును 
ఆబగా కొలుచుకునే కామచిత్తులకి  
ప్రవాహించినంత మేరా...  పచ్చదన్నాని నింపే 
ఆ నది అంతరంగం అర్ధమయ్యేది ఎన్నడు? 

పరచిన నగ్న దేహం పై మిగిలిన సగం పై 
విశృంఖలం చేసిన గాయం స్రవిస్తూనే ఉంది.
అంతః చక్షువుతో .సౌందర్యపు ఝడిని కనలేని 
వికృతమైన ఆలోచనల కురుపు  
రాచ పుండు కన్నా భయంకర మైనది.

(టాటా మెడికల్  ఇనిస్ట్యూట్ ఆఫ్ కేన్సర్ (ముంబాయి) లో బ్రెస్ట్ కేన్సర్ విభాగంలో కొంతమంది అనుభవాలు విని విచలితమై వ్రాసుకున్న కవిత ఇది.) 

( "విహంగ " వెబ్ మేగజైన్ లో ప్రచురితమైన కవిత)                  

10, మార్చి 2012, శనివారం

లేడి - జనారణ్యం

లేడి - జనారణ్యం   

పొద్దస్తమాను  కూనని వెంటేసుకుని తిరుగుతూ మైదానాల వెంట పచ్చిక బయళ్ళ లో లేలేత చివుళ్ళని తింటూనే.. ఏ ఆపద ఏ వైపు నుండి ముంచుకు వస్తుందో గమనిస్తూనే  చెంగు   చెంగున ఎగురుతూ  అత్యుత్సాహంతో తల్లిని వదిలి  ఎడంగా వెళుతున్న బిడ్డని మందలించి   ఆ ప్రమాదాల ఆచూకి ఎలా ఉంటుందో అరణ్యంలో ఎలా మసలాలో బిడ్డ కూనకి వివరిస్తూ వుంది లేడి.

పొద్దుగుంకే సరికి ఒక చోట సురక్షితమైన పొద చూసుకుని .. బిడ్డని కడుపులో పొదువుకుని.. కాస్త సేద తీరింది తల్లి లేడి.

ఆసలే అల్లరి కూన  తల్లి ప్రక్కనే ఒదిగి పడుకుని  ఉండకుండా తన చిట్టి బుర్రలో తట్టిన ఆలోచనల్ని అన్నింటిని  మాటల రూపంలోకి మార్చి మనిషి భాషలో   తల్లి లేడిని ప్రశ్నించ సాగింది.

"అమ్మా! నాన్న ఎక్కడ? "అంది. ఇన్నాళ్ళుగా  అడగని ప్రశ్న అకస్మాత్ గా అడిగేసరికి తల్లి లేడి సమాధానం చెప్పడానికి కొంచెం తడబడింది.

ఇప్పుడు మీ నాన్న సంగతి యెందుకు? నీ పుట్టుకకి ముందు  నన్ను వలచి నా చుట్టూ తిరిగి.. తనకి కావాల్సింది తను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత నువ్వు పుట్టావు. ఎక్కడైనా కనబడినా చూసి చూడనట్లు వెళ్ళిపోతాడు. ఆతను నీకు నాన్న కావచ్చు.కానీ..మన కానలో పుట్టే  బిడ్డలకి తండ్రి అంటూ యేమి గుర్తింపు ఉండదు.    తల్లి చాటు బిడ్డగా ఎదిగి తర్వాత తన దారి తను చూసుకోవడమే ! అని చెప్పింది.

ఆ మాట నచ్చలేదు లేడి కూనకి. "నేను నాన్నని చూడాల్సిందే ."పట్టు బట్టింది.

రేపు ఎకడైనా కనబడతాడేమో..చూద్దాంలే! పడుకో..అని అప్పటికి ఊరుకో బెట్టింది.

తెల్లవారింది. ఆరుబయలుకి చేరి పచ్చని పచ్చిక కాస్తంత తినగానే తండ్రి సంగతి అడగడం మొదలెట్టింది. అబ్బా ! మళ్ళా మొదలెట్టావా నీ నస భరించలేక చస్తున్నా అని  విసుక్కుంది తల్లి లేడి.

మన జంతు జాతిలోనే ఇలా నాన్న ఎవరో వెతుక్కోవడం ఉంది. మనం నీళ్ళు తాగడానికి వెళ్ళినప్పుడు.. నదికి ఆవల ఒడ్డున ఉన్న ప్రపంచం యెంత బాగుందో ! అమ్మ -నాన్న అన్నయ్య -చెల్లి,అక్క -తమ్ముడు అంటూ పిలుచుకుంటూ ఆనందంగా ఉంటారు. అక్కడ ఆ పిల్లల నాన్న చూడు. పిల్లలకి   తాయిలాలు  యెన్ని కొనిపెడుతున్నాడో! నాకు  నాన్న వుంటే..ఇలా బయట తిరుగుతూ పచ్చికను మంచి రుచికరమైన ఆకులను  వెదుకుతూ తిరగాల్సిన బాధ ఉండేది కాదు. చక్కగా అన్నీ తెచ్చిపెట్టేవాడు అని విచారం వెలిబుచ్చింది పిల్ల లేడి.

ఓహో.. ఈ పిల్ల ఈ జనారణ్యంలో ఉన్న వాళ్ళతో తనని పోల్చుకుంటుందన్నమాట అని తల్లి లేడికి అర్ధమైంది.
లేడి కూనకి బతుకు పాఠం  చెప్పాలనుకోకుండా  స్వయంగా కళ్ళతో చూపాలనుకుంది.

బిడ్డతో యిలా  చెప్పింది. ‘’మానవ జాతిని చూసి మురిసి పోతున్నావ్ కదూ!  అటువైపు వెళదాం నాతో రా.. ఆ లోకం ఎలా ఉంటుందో నీ కళ్ళతో నువ్వే చూద్దువు గాని’’ అంది.

కొత్త లోకాన్ని చూడబోతున్న ఆనందంలో.. లేడికూన ఆ పచ్చికలో పొర్లి పొర్లి ఆడింది.పరుగులు తీసింది. ఆ ఆనందాన్ని  చూస్తూనే.. తను మాత్రం జాగ్రత్తగా ఉంటూ కళ్ళలో వత్తులు   పెట్టుకుని  పిల్ల లేడికి పహారా కాసింది తల్లి లేడి.

చీకటి పడింది.నిదానంగా నదిని దాటి ఈవల ఒడ్డుకి వచ్చారు తల్లి బిడ్డ.

జనారణ్యంలో అడుగు పెట్టారు. జనులకి కనపడకుండా ఓ సురక్షిత స్థలంలో కూనతో మకాం పెట్టింది.
ఒక పురుషుడు ఆ దారి వెంట వస్తున్నాడు. వెనుక  నుండి ఓ కుర్రవాడు..నాన్నా ..నాన్నా అంటూ వెంటపడ్డాడు.

లేడి కూన ఆసక్తిగా చూస్తుంది. "ఒరేయ్.. నువ్వు నా వెంట యెందుకు వచ్చావ్?..ఇంటికి వెళ్ళు" గదమాయించాడు తండ్రి.

"నువ్వురా నాన్నా వెళదాం" అన్నాడు గారంగా..

"నేనిప్పుడు రాను ..నువ్వు వెళ్ళు" విసుక్కున్నాడు తండ్రి .

"ఏం కాదు నువ్వు వస్తేనే నేను వెళతాను" అని మొండికేసాడు  కుర్రవాడు.

"చెపుతుంటే నీక్కాదు" అంటూ చింత బరిక విరిచి కుర్రవాడిని నాలుగు దెబ్బలు వేసాడు.
వాడు ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు.

"ఛీ..పెళ్ళాం,పిల్లలు బాధ్యతలూ అన్నీ కొండ చిలువలా కాళ్ళకు చుట్టుకుంటాయి. ఇంత సుఖం లేదూ సంతోషం లేదూ " అనుకుంటూ  ఆ ఇంటికి దారితీశాడు.

‘’అదేమిటి..వాళ్ళ ఇంటికి వెళ్ళ కుండా వేరే ఇంటికి వచ్చాడు’’అని అడిగింది లేడి కూన తల్లిని.

"ఉష్..మాట్లాడకుండా చూడు"..అని సంజ్ఞ చెంది తల్లి.

ఆ పురుషుడు వెళ్ళిన ఇంటిలో ఉన్న స్త్రీ పిడతంత ముఖాన్ని  చేటంత  చేసుకుని నవ్వుకుంటూ యితనిని లోనికి ఆహ్వానించింది. అడుగడుగునా నవ్వుల హారాలేసి లోనికి  తీసుకునివెళ్ళి.. ముద్దు ముచ్చటగా అతిధి మర్యాదలూ   సేవలు చేసింది. ఇద్దరూ తిన్నారు, మదు రసాలు తాగారు. నడి మంచాన్నే   అరణ్యపు బయలు చేసుకుని ఆనందంగా విహరించారు. అలా కొన్ని  గంటలు గడిచాక ఆతను వెళతాను అన్నట్లు లేచాడు. ఆమె అప్పుడేనా అన్నట్లు చూసింది.

ఆమెకి జేబులోనుండి చేతికి వచ్చినది  తీసి  ఇచ్చాడు. ఆమె అతను వెళ్ళిపోతున్న దిగులుని మరచి ఆనందంగా డబ్బువంక చూసుకుంటుంది.

"మళ్ళీ వస్తాను.ఎక్కడికి వెళ్ళకు,  ఎవరిని రానీయకు" అంటూ అనుమానంగా చూసుకుంటూ తప్పదు అనుకున్నట్లు   కదిలాడు.

ఆసక్తిగా అతని వెనుకనే లేడి బయలుదేరింది కూనా రెండు మెల్లిగా చప్పుడు చేయకుండా అడుగులు వేస్తూ తల్లి వెంట కదిలింది.

ఆతను ఇంటికి వెళుతూనే మూసి ఉన్న తలుపుల్ని ఒక్క తన్ను తన్నాడు. తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకున్నాయి. ఆ శబ్దానికి  చుట్టూ పక్కల ఇళ్ళ వాళ్ళు లేచారు. ఆ ఇంట్లో పిల్లలు లేచారు. తల్లిని భయంతో చుట్టుకున్నారు.

‘’ఏమే! నా మీద కాపలాకి   పిల్లలని  ఉసిగొల్పావా ? అయినా నా ఇష్టమే! నేను తిరుగుతాను,తాగుతాను. నా ఇష్టం వచ్చిన వాళ్ళతో వుంటాను. అడగడానికి నువ్వెరివే నన్ను అడగడానికి ? నీ బాబుగాడు యిచ్చినది యేమన్నా ఖర్చు పెడుతున్నానా? నోరు మూసుకుని చెప్పు క్రింద   తేలులా పడివుండు" అంటూ ఆమెని జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టసాగాడు. ఆమె ఆ తిట్లు,దెబ్బలు భరిస్తూనే పిల్లలకి ఆ దెబ్బలు   ఎక్కడ తగులుతాయో అన్నట్లు పొదువుకుంది.

అతని బలం అంతా ఆమె మీద ప్రదర్శించాక అలుపు వచ్చి పరుపు మంచం ఎక్కి  గురకలు తీసి నిదుర పోయాడు. అప్పటి దాక ఆమె యెక్కి యెక్కి   యేడుస్తూనే   పిల్లలని  చెరోప్రక్కన పడుకోబెట్టుకుని మీ నాన్నకు  వున్నట్టుండి యేదో పిచ్చి లేసింది, భయపడొద్దు"   అంటూ వెన్ను నిమురుతూ నిద్రపుచ్చింది.

ఇదంతా చూస్తున్న లేడి కూన ..’’ఛీ..ఛీ.. యిలాంటి నాన్న అసలు యెవరికీ వద్దు. నాకసలే వద్దు..
ఇంకో  చోటుకి వెళాదం పదమ్మా "  అంటూ తనే ముందుకు అడుగులు వేసింది.

నడిచి నడిచి తెల్లారేసరికి  ఇంకో ఊరు చేరుకున్నారు. అప్పటికి తెల్లవారబోతుంది..
ఒకరి  ఇంట్లో నుండి ..అమ్మాయ్..  తెల్లగా తెల్లవారి పోతుంది.లేవాలి ..ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? ఎప్పటికి అయ్యెను..అని..  నిద్ర మంచం పైనుండే కేకలు   పెట్టడం వినబడింది. పాపం..ఆ అమ్మాయి లేచి పడుతూ..లేస్తూ..ఇంటి పనులు అన్నీ త్వర త్వరగా చేసి.. తల్లి పెట్టే తిండి కోసం  ఎదురు చూస్తుంది.

కొడుకు చక్కగా బారెడు పొద్దెక్కాక  లేచి  బద్దకంగా తయారై  ఓ పెద్ద  గ్లాసుడు పాలు తాగి నేతిలో ముంచిన ఇడ్డెనలు  తిని సంచీ తగిలించుకుని బడికి వెళ్ళాడు. ఇంట్లో వున్న ఆమ్మాయి ఆశగా అడిగింది." అమ్మా  నేనూ  అన్నయ్యలా  బడికి పోతాను" అని.

‘నువ్వు బడికి పొతే.. చిన్నాడిని ఎవరు చూసుకుంటారు ? అయినా చదివి ఊళ్లేలా,ఉద్యోగాలు చెయ్యాలా? నిన్ను చదివిచ్చి బోలెడన్ని కట్నకానుకలు ఇచ్చి పెళ్లి గిల్లి చేయలేం. చదువు వద్దు గిదువు వద్దు. ఇంకోసారి ఈ మాట అడిగితే  వొళ్ళు చీరేస్తాను "అని అంది.

 ఆ అమ్మాయి ఏడుస్తూనే  మూలనున్న చీపురు కట్ట తీసుకుని బర బరా ఊడుస్తూనే "దేవుడా! నన్నెందుకు  ఆడపిల్లగా పుట్టించావ్ నీ జిమ్మడ " అని అమ్మ-నాన్నలని తిట్టలేక  కనబడని  దేవుడిని తిట్టింది.


ఇదంతా చూస్తున్న లేడి కూన తల్లిని అడిగింది..’’ఆడ-మగ తేడా యేమిటీ. ఇద్దరూ  ఒకటి కాదా’’ అడిగింది.

‘’మన రాజ్యంలో యిద్దరూ  వొకటే, యిక్కడ మాత్రం కాదు"  అంది.

"ఎందుకు కాదు? " అని చిరాకు పడింది కూన. తల్లి లేడి మాట్లాడుతూ  “నువ్వింకా  యిక్కడ చాలా చూడాలి. ప్రశ్నలు వేయకూడదు, చూస్తూ అర్ధం చేసుకోవాలి” అంది అనునయంగా.

"ఇక్కడ నాకు నచ్చలేదు.. వెళ్ళిపోదాము  పద"  విసుగ్గా  ముఖం పెట్టింది.

“మనమిప్పుడు ఇక్కడినుండి వెళ్ళడం ప్రమాదం. చీకటి అయ్యే వరకు వుండాల్సిందే” అంటూ.. ఒక పొదలోకి చేరి బయటకి చూస్తూ నిలబడ్డాయి.

తల్లి లేడి అనుకున్న ప్రమాదం రానే వచ్చింది..
దారిన వెళుతున్న వొక మనిషి వీటిని  చూసి “లేడి లేడి.. రెండున్నాయి యిక్కడ” అని అరిచాడు.

“చూసావా... ఇపుడు మనుషులందరూ గూడి మనను బంధించి చంపి కాల్చి తినేస్తారు. పులి సింహం నుండైనా తప్పించుకోవడం సాధ్యమౌను కానీ వీరి నుండి తప్పించుకోవడం మన వల్ల కాదు.శక్తినంతా కూడదీసుకుని అడవిలోకి పారిపోదాం. నువ్వు అనుకున్నంత మంచిలోకం కాదిది. పోదాం పద” అంది. తల్లి లేడి. కూన లేడి బుద్దిగా తల్లిని అనుసరించింది చెంగు చెంగున.
                                                                                                          

9, మార్చి 2012, శుక్రవారం

వ్యాఖ్యకి వ్యాఖ్యానం

వ్యాఖ్యకి ..పోస్ట్ వ్రాయాలిసివచ్చినందుకు మన్నించమని కోరుతూ.... ఈ తరహా ప్రశ్నలకి.. ఇక ఈ బ్లాగ్ లో అవకాశం లేదని తెలియజేస్తూ..  వ్యాఖ్యకి వ్యాఖ్యానం పోస్ట్ అయినందుకు విచారంతో..

"పెళ్ళి వలన మగ వారికి కలిగే లాభం ఏమీటీ ?అన్నదానికి మీరిచ్చిన సమాధానం లో ఎక్కడ కూడా మగవారికి మాత్రమే కలిగే నాలుగు లాభాలు (కనీసం) రాయలేదు.

మగవారు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?

శ్రీనివాస్ గారు. .. శ్రీదేవి బోని కపూర్ ని వివాహం చేసుకున్నాడని తెలిసిన తర్వాత బోని కపూర్   మొదటి భార్య విడాకులు తీసుకుంది. శ్రీకాంత్   నెహతాని  పెళ్లి చేసుకుని అతని భార్య చంద్ర చేతిలో ..రెండు సార్లు పబ్లిక్ లోచెంప దెబ్బలు  తిన్నది జయప్రద.  వాణి గణపతి..భర్త కమలహాసన్ ని వద్దనుకుని విడాకులు తీసుకుంది. మరి వీరందరూ బహు భార్యాతత్వంలో ఒదిగిపోలేదు ఎందుకండీ!? బహు భార్యా తత్వాన్ని నిరసించే   కదా!  ప్రయోజనాలని ఆశించి ఇష్టపడినపుడు..తప్పు అనిపించకపోవచ్చు. కానీ బహుభార్యతత్వం వల్ల.. అలా భరించలేని ఆడవారి మానసిక క్షోభ పరిగణన లోకి  తీసుకోవద్ద ని మీకు అనిపిస్తుందా?  మన పురాణాలలో,చరిత్రలో..బహుభార్యతత్వం వలన ఎవరికి బాధ కలగ లేదంటారా? అదే మగవారు అయితే..బహుభర్తతత్వంతో.. ఉన్న స్త్రీతో ఎందుకు జీవించదల్చుకోరు?  అవన్నీ లేకుండానే ఉండాలనే కదా.. ఇప్పుడు అందరు  ఆశిస్తుంది.   ..
మీ ఉద్దేశ్యం మగవారి కి ప్రయోజనం కలగాలంటే ..ఆడపిల్లకి తల్లిదండ్రులు.. భర్త కొట్టిన్నా తిట్టినా ,బహుభార్యతత్వంతో ఉన్నా.. సరే సర్దుకుపోయి.. నువ్వు అసలు మనిషివే అన్న సంగతి మర్చిపోయి..మగవాడి ఆనందం కోసమే పుట్టావు.అలాగే ఉండాలి అని చెపితే తప్ప మగవాడికి ప్రయోజనం కలగదు అంటారా? ..  .. 
జపాన్ లో ఆడవాళ్ళు అవివాహితులుగానే ఉండిపోతున్నారట. పని వేళలలో అలసి పోయి పిల్లలని కనే తీరిక ,ఓపిక లేక..వారి  పిల్లల పెంపకం ఒక్కరే చేపట్టలేక..మగవారు సహరించక కూడా.  మరి జపాన్ ప్రభుత్వం ..పిల్లలని కన్నందుకు రాయీతీలు ఇస్తాం..ఈ దేశ జనాభాని పెంచండి అని ప్రకటనలు   ఇస్తుంది కూడానట.
మగవాళ్ళకి లేని ప్రయోజనాలు ఆడవాళ్ళకి ఉన్నాయంటారా?
ఆడవారికి సమాన ప్రాతినిధ్యం ఇచ్చి చూస్తే..ఆడవాళ్ళకి పెళ్లి అవసరమా!? అనే ఆలోచన కల్గుతుంది.(మీ ప్రశ్న లాగా)
మీరు పెళ్లి అవసరం లేదనుకుంటే.. అది మీ వ్యక్తిగతం. అలాగే అలా అనుకోనివారి సంగతి మాటేమిటో!?
మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే.. మన భావననో..మన అభిప్రాయాన్నో జనరలైజ్ చెయ్యాలనుకోవడం. అది మంచిది కాదండీ  !
ప్రతిజీవికి జీవించే హక్కు   ఎలా ఉందొ.. తన ఆలోచనని వెల్లడించే హక్కు కూడా ఉన్నప్పుడు.. నచ్చినవారితో  ..మనుగడలో కలసి బ్రతుకుతాం.లేదంటే..ప్రక్కకి   తప్పుకుని  మన దారిన మనం నడుస్తాం. మీరు జెండేర్ సేన్సిటివిటిని ప్రయోజనాల దృష్టితో చూస్తున్నారు. నేను స్త్రీల సమస్యలని పురుషులు అర్ధం చేసుకుని  తగిన సహకారం   అందిస్తూ.. మనుగడలో.. కలసి బతకాలని చెపుతున్నాను. అలాగే.. పురుషులని వేధించి త్యజించి .. ఒంటరి ప్రపంచం ..లో మళ్ళీ బలహీనతలతో..పురుషుల బారిన పడకండి..అని వేధించే స్త్రీలు ఉంటె.. వారికి అర్ధమయ్యే టట్లు కౌన్సిలింగ్ చేయాలని చెపుతున్నాం. అంతే! నేను ఇంత చెప్పాక మీ ప్రశ్న అసహజమైనదిగా అని మీకు అనిపించకపోతే.. మానవ   జాతి తిరోగమనం దిశగా..పయనిస్తుందేమో.. అనుకోవాలి.
ఇంతటితో..ఈ విషయం కి స్వస్తి చెప్పండి. సమయ విలువని  గుర్తించండి.పాటించండి .
ధన్యవాదములు.
ఈ పోస్ట్ కి కామెంట్లు లేవు. గమనించగలరు.

8, మార్చి 2012, గురువారం

రూపకశ్రేణి

భూమికలో ..నేను..
అప్పుడెప్పుడో..భూమికలో నా కవిత.  బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తల్లో ఈ పోస్ట్ వేసాను. అప్పుడు..నేను ఏ సంకలినిలోనూ అంతగా పరిచయం కాలేదు కాబట్టి ..మళ్ళీ ఒకసారి .. ఇక్కడ ..షేర్ చేసుకుంటూ..

"అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభా కాంక్షలు" 

రూపకశ్రేణి

మీ మెదళ్ళకి పట్టిన మురికిని
మేము  శుభ్రం చేయాలని కంకణం కట్టుకుంటే 
నోరు శుభ్రం చేసే కుంచె కదలికలకి
మా నడుము కదలికల్ని చూపించి 
వ్యాపారం చేస్తూనే ఉన్నారు

జుగప్స   కలిగించే చీకటి క్రీడల మాటున
మీ విశృంఖల మనస్తత్వాలతోను 
కలల వర్తకపు విపణి లోనూ  
ఆక్టోపస్ ల్లా రంగు మార్చుకుంటూనే ఉన్నారు..

అజ్ఞానపు అంధకారంతో
అహంకారపు అడుగుజాడలని 
తరగని సంపదలా, క్లోనింగ్ సంతతిలా
ఆవిష్కరిస్తూనే ఉన్నారు
అవి అన్ని కాంచి
అందుకే సలిపిన అలసిన
మా గుండెల మాటున 
బడబాగ్నులు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి ..

మానవాళి మనుగడని
అతి నిశ్శబ్దంగా కబళించే
హెచ్ ఐ వి  లా అని తలపోస్తూ .. 
మా వంటిల్లు సామ్రాజ్యాలు మాచేజారతాయనో 
మీకు బదిలి చేద్దామనే ఆలోచన లేనేలేదు.

మా  సమానత్వపు ఆలోచనల
కాళ్ళు విరిగి కుంటినడక నడుస్తామోనన్న 
అనుమానం లేదు
మా మాతృత్వపు ఛాయలు  
అరువు తెచ్చుకుంటారనే భయం లేదు

మా వాదాలు భేదాలు
అనుభవరాహిత్యాలు 
అన్నీమీ అడుగు జాడలే కదా !

ఇప్పుడిప్పుడే  అన్నింట్లో కాకపోయినా
కొన్నిట్లో అయినా మిమ్మల్ని దాటేసినవాళ్ళం   
ఆఫీసు  వంటిల్లు,మాతృత్వం అన్నీ మీకేనా..!? 
అని మా అధిక సామర్ధ్యం చూసి
లోలోపల దుఖిస్తూ మాకేంలేవా ? 
మేము ద్వితీయ శ్రేణి నా !? 
అంటూ ఘోషించే మీ ప్రశ్నకి మేము సంసిద్ధం. 

3, మార్చి 2012, శనివారం

సలహా చెప్పండి...

మగవాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోవాలి పోస్ట్ చూసి.. ఓ.. మిత్రుడు ఒక మెయిల్ ద్వారా  నా  సలహా కొరకు ఈ విషయం  ని  దృ ష్టికి తెచ్చారు. ఇదేమిటో చూడండి.

  సలహా చెప్పండి...

మీ బ్లాగ్ చూసి అక్కడ పోస్ట్ చేయలేక ఇక్కడ మెయిల్ చేస్తున్నా... ఈ విషయం లో మీరు ఏమి చెప్పుతారు.. నా స్నేహితుడు లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్నాడు.. అమ్మాయికి తల్లి తండ్రి లేరు అన్నయ ఉన్నాడు... వాళ్ళని వాళ్ళ మామ చదివించాడు.. అమ్మాయి  బాగానే చదివింది.. ఇప్పుడు పెళ్లి అయింది అబ్బాయికి అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళని చూసుకోవాలి.. హైదరాబాద్ లో మంచి ఐ టి జాబు చేస్తున్నాడు.. పెళ్లి చేసుకొని కాపురం పెట్టాక కొన్నిరోజులకు ప్రోబ్లమ్స్ స్టార్ట్ అయినాయి.. ఆ అమ్మాయి అమెరికా  వెళ్ళాలి అని.. అంటూ ఉంటుంది. ఏదో సరదాగా అంటుంది ఏమో  లే అనుకున్నాడు.. కాని రాను రాను టార్చర్ పెరిగిపోయింది.  నన్ను మోసం చేశావు నేను అమెరికా  వెళ్ళేదాన్ని నా జీవితం నాశనం చేశావు అని స్టార్ట్ చేసింది.. అమ్మాయికి హై  లెవల్ లో బ్రతకాలి అని బాగా మైండ్ లో పిక్స్  అయిపొయింది.. ఎలా అంటే టీవీ కొందాం అని షాప్ కి వెళ్తే మాములుగా మనం ఎలా టీవీ కొంటాం..  ఏదో 20k r 30k చూస్తాం కాని తను లక్షన్నర టీవీ చూసి ఇది కొను లేకపోతె లేదు అని హోం కి తీసుకోని వచ్చింది.. ఇతను రోజు ఆఫీసు వెళ్లి సాయంత్రం వస్తాడు రాగానే రోజు ఏదో ఒకటి  అంటూనే ఉంటుంది. సరే వాళ్ళ మామ అన్నయ్య లకి  చెప్పాడు..

వాళ్ళ మాటని ఆమె  అసలు పట్టించుకోదు , ఎవడి మాట వినదు.. పండుగకి పిలిస్తే వాడి ఇంటికి పోయేది ఏమిటి అని వాళ్ళ మామనే అంటే ఇంక ఆ అమ్మాయికి  ఎవరు ఏమి చెప్పగలరు..? అబ్బాయి అమ్మా నాన్న వస్తే మన ఇంటికి ఎవరు రావద్దు మనం ఎవరి ఇంటికి వెళ్ళవద్దు అంటుంది అంట. ఈ మద్యనే పాప పుట్టింది మొదటి కాన్పుకి పుట్టింట్లో జరగటం మన ఆనవాయితి వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకోని వెళ్ళాడు ఇంక 2moths కూడా కాలేదు అనుకుంటాను ఇక్కడనుంచి తీసుకొని వెళ్ళు అని కాల్స్..

ఇతను మంచిగా ఉంటావా ? రోజుకొకలా ఇలా ప్రోబ్లమ్స్ చేయను అంటే తీసుకోని వెళతానూ  అని చెప్పాడు.. నేను నీ మీద కేసు పెడుతా అని స్టార్ట్ చేసింది .నువ్వు మీ అమ్మా నాన్న నన్ను టార్చర్ పెడుతున్నారు అని కేసు పెడుతా అని బెదిరిస్తుంది..  పాపని  నాకు ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పాడు..

నేను చెప్పాను ఆమెకోసం అయినా  నువ్వు అమెరికా కి  వెళ్ళు అని . అతను చెప్పాడు అక్కడ వెళ్ళినా  అలా  రెండురోజులే! మళ్ళి ఇంక ఏదో స్టార్ట్ చేస్తది అని. ఇప్పుడు ఈ అబ్బాయి పరిస్తితి ఏమిటి  ఆ అమ్మాయి మారదు ఈ అబ్బాయికి  సంతోషం లేదు ఇలా లైఫ్ లాంగ్ బ్రతకాలా! లేక విడాకులు తీసుకోని విడిపోవాలా? ?

2, మార్చి 2012, శుక్రవారం

" సామాన్య " కల్పన " కథకి "రంగవల్లి పురస్కారం "

కథా  రచయిత్రి, కవయిత్రి  " సామాన్య " గార్కి   " కల్పన "  కథకి    లభించిన      "రంగవల్లి   పురస్కారం  "

సభలో  .. ఆమె కథల పై ప్రముఖుల అభిప్రాయం  ఈ  వీడియో లలో చూడండి .


 సామాన్య  గార్కి  పురస్కారం   వీడియో 1


సామాన్య  గారికి    పురస్కారం   వీడియో 2

మరింత సమాచారం కొరకు "విహంగ"  ఫిబ్రవరి సంచిక చూడండి.

1, మార్చి 2012, గురువారం

మగవారు పెళ్లి ఎందుకు చేసుకోవాలి?

శ్రీనివాస్ గారి సందేహం ..
మగ వారు పెళ్లి  ఎందుకు చేసుకోవాలి? వాళ్లకి పెళ్లి చేసుకొంటే కలిగే లాభాలు ఏమిటీ ?  మీ అభిప్రాయం చెప్పగలరా? పెళ్ళి సాకుతో మగ వారి శ్రమను సమాజం దోచుకోవటం ఎక్కువైంది. మగవారికి పిల్లలు కావాలి కనుక పెళ్ళి అవసరం అని చెప్పవద్దు. మగ వారికి పిల్లల కావాలనేది(వంశం), సమాజం రుద్దిన అభిప్రాయం. దీనిని మన పెద్దలు రామాయణం లాంటి కథల ద్వారా ప్రచారం సాగించారు.
అని నాకు వ్యాఖ్య ద్వారా అభిప్రాయం చెప్పమని అడిగారు.అందుకే ఈ పోస్ట్. 
శ్రీనివాస్ గారు.. మీ ప్రశ్న అసహజంగా ఉంది. 
ఆదిమ మానవుడు పెళ్లి చేసుకోవడం అనే నియమాలు లేనప్పుడు కూడా నరజాతి పుట్టుక ఉంది. ఈ నరజాతి వారసులు.. జంతు ప్రవృత్తి తోనే   మెలిగి జంతువులాగానే జీవించాడు. కాలక్రమేణా  మంచి-చెడు విచక్షణ తో.. కొన్ని కట్టుబాట్లు తో..సమాజంలో సవ్యమైన మనుగడ కోసం స్వేచ్చా ప్రవృత్తిని ఇష్టం గానో,అయిష్టంగానో..మానుకుని... ఒక కుటుంబంగా మసలడానికి తగిన నియమ నిబందనలని ఏర్పరచుకున్నాడు. తన పరిధిలో.. అవకాశం ఉన్నత మేర పురుషుడు బహుభార్య తత్వాని సమర్ధించుకున్నను కాలక్రమేణా అవి మరుగయి..ఒకే స్త్రీ కి -ఒకే పురుషుడు  నిబద్దత తో.. జీవనం సాగించాలని రామాయణ కాలం నాడే చాటి చెప్పడం జరిగింది. 
పురుషుడు వివాహం ఎందుకు చేసుకోవాలి?  మీ ప్రశ్నలో మొదటి భాగం. 
నా జవాబు: మీ పుట్టుకకి ముందు మీ తండ్రి గారు ఈ ప్రశ్న వేసుకుని ఉంటే.. మీరు వారి కొడుకుగా చెలామణి అయ్యే వీలు ఉందా? (క్షమించాలి ఇది..అభిప్రాయం చెప్పడంలో సంధించిన ప్రశ్న మాత్రమే!)
అంటే పురుషుడుకు అవసరం లేని పెళ్లి తో.. పూర్తి బ్రహ్మచర్యం అవలంభించ గలరని  అనుకోవచ్చా? లేదా స్త్రీ సాంగత్యం కోరుకున్నప్పుడు  ఆ అవసరాన్ని సక్రమం కాని రీతిలో.. ఇప్పుడు కొత్తగా మన సంస్క్రతికి అలవాటవుతున్న సహజీవనం ద్వారా..బయలాజికల్ నీడ్స్ ని పొంది.. ఇద్దరు కలసి సంతానం అవసరం లేదనుకుంటే నిజంగా సమాజంలో.. చెత్త కుండీలలో బిడ్డలు ఉండనే ఉండరు. లేదా పురుషుడికి పిల్లలే వద్దనుకుంటే..స్త్రీకి పిల్లలు కావాలని కోరిక ఉంటే.. ఆ పిల్లలకి తండ్రి ఎవరు? అక్రమ సంతానంగా..తల్లి పిల్లలని పెంచాలని అభిలషి స్తుందా  ? 
సమాజం ఆరోగ్యం ఉండటం కోసం కొన్ని నియమాలతో,కట్టుబాట్లుతో.. కుటుంబ వ్యవస్థ మొదలయింది. ఆ కుటుంబాని నే     వద్దనుకుంటే.. సంతానం వద్దనుకుంటే.. మానవజాతి మనుగడ ఎలా? అక్రమ సంతానాల మయమా?  మనం అనాగరిక వారసులమా? 
ఇక మీ రెండో ప్రశ్న ..పెళ్లి వలన లాభం ఏమిటీ? 
నా జవాబు: పెళ్లి వలన మనిషికి స్తిరత్వం వస్తుంది. స్త్రీ-పురుష శారీరక ధర్మాల్ని అనుసరించి..ఆకర్షణ,మొహం,ప్రేమ మొదలగు భావాలు ఒకరిపై మరొకరికి ఏర్పడటం మూలంగా.. యవ్వనంలో ఒక తోడుని,బిడ్డలు పుట్టాక భాద్యతలలో పాలుపంచుకునే..ఒక స్నేహం, వృద్దాప్యంలో..మనిషికి  తన గురించి అవగాహన కల్గిన ఒక తోడు అవసరం. 
అందుకనే తాను ..ఎంపిక చేసుకున్న లేదా పెద్దలచేత ఎంపిక చేయబడ్డ భాగస్వామ్యితో శారీరక మానసిక కలయికలవల్ల.. పరస్పరం ఇచ్చిపుచ్చుకునే దోరణిలో.. అవగాహన కలిగి .. అనుబంధం పెరిగి..బిడ్డలు కలిగి..నా  అనుకున్న భావనలో..ప్రేమ,వాత్చల్యం పుట్టుకుని వచ్చి   వారి ఆలనా పాలనలో.. భాద్యత గల జీవనం లో.. తమని తాము మరచిపోతారు.  పిల్లలని పెంచి ఈ నరజాతి కి మంచి మనుగడని అందిస్తారు. 
బిడ్డలే వద్దనుకుంటే.. నరజాతి ఉంటుందా? 
పెళ్లి పేరిట సమాజం దోచుకోవడం.. అన్నారు.ఇక్కడ మీరన్నది సమాజం కాదని అనుకుంటాను. స్త్రీ అనాలనుకున్నారేమో..అని నాకు అనిపిస్తుంది. 
అయినా మీ ప్రశ్నకే   నా జవాబు:  సమాజం దోచుకుంటుంది అంటున్నారు.సమాజం ఏమి ఇవ్వకుండానే.మీరు సమాజానికి ఏమి ఇవ్వకుండానే ఎదిగారా? 
తల్లి-దండ్రులు జన్మ నిచ్చారు.గురువులు విద్యా బుద్దులు నేర్పారు. మీ శరీరం,మీ జ్ఞానం అన్నీ మీవి మాత్రమే కావు. ఒక వయసు వరకు అయినా తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించారు. 
మీరు ఏ అడవులలోకి వెళ్ళో కందమూలాలు..ప్రకృతి ద్వారా లభించే సహజ వనరులతో..సమాజానికి దూరంగా బ్రతకడం లేదు కదా! సమాజం లో భాగమై పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలోనే బ్రతుకుతున్నారు. ఉద్యోగం అయినా, వ్యాపారం అయినా,సేవ అయినా.. సమాజంలో ఒక భాగమే కదా! మీరు ఆర్జించిన ధనం తోనో, మీ బుద్ది వికాశం   వల్లనో.. మీ స్వంతం ఏదైనా ఉంటే.. మీకు సరిపడా వినియోగించుకున్నాక మిగిలినది,మిగల్చ గల్గిన రూపం లో ఉంటే  ఎప్పటి కైనా  అది ఎవరికో  ఒకరికి చెందుతుంది కదా? ఇక దోచుకోబడేది ఎక్కడ.? సముచితరీతిలో మీరు ఇవ్వడం ఇవ్వక పోవడం మీ ఇష్టం కదా! ఇది మీకు స్వంతమైనది అయితేనే! 
ఇక నేను అనుకున్నట్లు పురుషుడిని సమాజం కాకుండా పెళ్లి పేరుతొ దోచుకుంటున్నది స్త్రీ అయితే ..స్త్రీ కోసం పురుషుడు కష్టపడనవసరం లేదు. స్త్రీ కూడా కష్ట పడగలదు.  పురుషుడి కన్నా సమర్ధవంతంగా ,ఓర్పుతో.. కష్టించే గుణంతో తమని తాము పోషించుకోగలరు. (ఈ ప్రశ్న మీది కాకున్నా నా సమాధానం చెపుతున్నాను). 
పెళ్లి వలన ఉపయోగాలు లేక్కిన్చుకుని,బిడ్డలు వద్దు అనుకుని, పురుషుల శ్రమని సమాజం దోచుకుంటుందని భావించు కుంటున్నప్పుడు  పురుషుడికి సమాజంతో.. పెద్దగా పని లేదు. పుట్టుక మూలం మరచి.. తన స్వేచ్చా ప్రవృత్తితో.. ఇష్టం అయిన రీతిలో బ్రతికేయడమే. మీ కోసమే..మీరు జీవించి.. మీ కోసమే మీరు కష్టించి..మిమ్మల్ని మీరే ప్రేమించుకుని ఒంటరి ప్రపంచంలో.. మీరు మీరే గా ఉండగల్గితే..అది నిజంగా గొప్పే! 
నేను వెలిబుచ్చిన అభిప్రాయం ..ఇది కేవలం నా ఆలోచన మాత్రమే! నా అభిప్రాయం అడిగారు కనుక చెప్పాను. ఇందులో ఎక్కడైనా నొప్పించినట్లు ఉంటే.. అది అభిప్రాయం ది మాత్రమే కాని వ్యక్తిగతంగా పరిగణించడం కాదని భావించండి. అలాగే.. మీరు అజ్ఞాతం గా ఉండకుండా మీ బ్లాగ్ రూపం  వెలిబుచ్చితే ఇంకా బాగుండేది .