ఇంట్లోనుండి బాల్కనీ లోకి వచ్చి నిలబడ్డాను
ఎదురింటి తలుపు తీసే వుంది. తీసే వుందని యె౦దుకంటున్నానంటే తలుపులు మూసి వుంటే లోపల యే౦ జరుగుతుందో తెలియదు కదా! అయినా యెదుటి వారింట్లోనూ, ప్రక్క వారింట్లోనూ,వెనుక వారింట్లో కి తొంగి చూసి యే౦ జరుగుతుందో తెలుసుకోవడం నా అభిమతం కాదు
యధాలాపంగా చూడటం, యేదైనా విభిన్న దృశ్యం అయితే ఆసక్తిగా పరిశీలించడం చేస్తుంటాను.ఎదుటవారు చేసే పనుల పై ఆసక్తి చూపడం మంచిది కాదని తెలుసు.అయినా అదే పని చేయడం వెనుక నా ఉద్దేశ్యం మనుష్యుల నైజం విభిన్న రూపాలలో ఉండటానికి తగిన లాజిక్ వుంటుందని నేను భావించడమే!
నిజంగా ప్రతి మనిషి కూడా తను చేసే పనిలో లాజిక్ ని వెదుక్కుంటాడేమో!
ఎదురింట్లో నేను చూసిన దృశ్యం రోజూ లాంటిదే! రోజులో దాదాపు పద్దెనిమిది గంటలపాటు ఆ టీవి మ్రోగుతూనే ఉంటుంది ఆ టీవి ముందు యెవరు కూర్చుని ఉండరు.
"ఎందుకండీ టీవి చూడటం కుదరనప్పుడు అలా పెట్టేసి వుంచుతారు అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం .."ఔరా"అన్పించక తప్పదు. ఆ మాట యేమిటంటే ..మేము యెవరం టీవి చూడకపోయినా పెట్టి వుంచడం యెందుకంటే మా పని అమ్మాయి కోసమే! అలా టీవిలో వచ్చే మాటలు వింటూ పని చేసుకుంటూ వుంటుంది .టీవి పెట్టకపొతే పనికి రానని మొండికేసింది పనులు చేసుకోలేక విసుగేస్తున్నా, చెవుల్లో హోరుమనిపిస్తున్నా టీవి ని భరించక తప్పదు,తడిసి మోపెడు భారమయ్యే కరంట్ బిల్ కట్టక తప్పదు అందామె . వారి పనిపిల్ల టీవిలో వచ్చే దృశ్యాలని అర కొర చూస్తూ వింటూ పని చేసుకుంటూ వుంటుంది.అదివరకయితే ఆ పిల్లని చూస్తూ నవ్వుకునేదాన్ని కాని యిప్పుడు నాకు "బంగారు " కళ్ళల్లో మెదిలింది. అది అంతే! పదే పదే టీవి పెట్టమని అడుగుతుండేది.
"బంగారు" నా మదిలో మెదలడం ఆ రోజులో యెన్నోసార్లు. ఇంతకీ "బంగారు " యెవరు అంటే వో ఆరు నెలలు కాలం వెనక్కి వెళ్ళాల్సిందే!
రోజులాగే మా చాకలి బట్టలుతుకుంది.ఆ అమ్మాయికి బాల్య దశ వీడలేదు. బాల్యంతో బండ పని చేయించడం నాకిష్టం వుండదు. ఆ పిల్లతో ఆమాట యీ మాట మాట్లాడుతూ సాయం చేస్తూ వున్నాను. ఇంతలో వీధి గేటు ముందు యేదో కలకలం. నేను వెళ్లి చూసాను. యేడెనిమిదిమంది ముష్టి పిల్లలు. వాళ్ళలో యిద్దరు అబ్బాయిలు కొట్టుకుంటూ వుంటే మిగిలినవారు వినోదంగా చూస్తూ నవ్వుకుంటున్నారు.వాళ్ళందరిలో వున్న వొకే వొక అమ్మాయి కొట్టుకుంటున్న వారిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు యేమాత్రం తగ్గక పోగా.. కోడి పుంజుల్లా కలబడుకుంటూనే ఉన్నారు. నేను గట్టిగా వో కేక వేసి మందలిస్తూన్నట్లే .."ఎందుకురా కొట్టుకుని చస్తున్నారు?"
వాళ్ళు సమాధానం చెప్పలేదు కాని ఆ పిల్ల చెప్పింది. రోజువారిలా కాకుండా వొకరు వెళ్ళే వీధిలోకి రెండవ వాడు వెళ్లి యిళ్ళల్లో పదార్ధాలు అడుక్కోవడం వల్ల ..గొడవలు వచ్చాయని. ఆ పిల్ల ఆవిషయం చెపుతూ మాటలకి అనుగుణంగా చక్రాల్లాంటి కళ్ళు త్రిప్పుతూ చేతులు త్రిప్పుతూ చూపడం చూసి ముచ్చటేసింది.ఎనిమిదేళ్ళు ఉంటాయేమో! మంచి రంగే కానీ మట్టి గొట్టుకుని మసి బారినట్లు వుంది.
."ఒరేయ్ మీరిద్దరూ అట్టా కొట్టుకొకండి రా, కావాలంటే యీ రోజు నాకు దొరికినదంతా యిచ్చేస్తాను" అంది. ఆ పిల్ల ఆ మాట అనడం ఆలస్యం వొకడు వచ్చి ఆ పిల్ల గిన్నెలో సేకరించుకుని పెట్టుకున్న ఆహార పదార్ధాలన్నీ తన గిన్నెలోకి వేసుకుని.. ఖాళీ గిన్నెని నేలకేసి కొట్టి వెళ్ళిపోయాడు. "వాడికి ఎందుకిచ్చావ్? నేను నీకు పెట్టను పో..అంటూ ఆ పిల్లని వదిలేసి పోయాడు మరొకడు. "పెట్టకుంటే పోనీలేరా, మీ ఇద్దరు కొట్టుకోకుంటే సాలు" అంటూ ..
పాపం ఆ పిల్ల ఆ ఖాళీ గిన్నెని తీసుకుని వీధి కుళాయి దగ్గరికి వెళ్లి శుభ్రం చేసుకుని కళ్ళు చేతులు కడుక్కుని పొట్ట నిండా మంచి నీళ్ళు త్రాగి యివతలకి వచ్చింది. నాకు ఆ పిల్లని చూస్తే జాలి వేసింది.నేను "అన్నం పెడతాను రా.." అంటూ పిలిచాను వచ్చి గేటు బయట నిలబడింది. భవానీకని తీసి వుంచినఇడ్లీని .ఆ పిల్లకి పెట్టాను. పరుగులు తీస్తూ తన వాళ్ళని వెదుకుతూ వెళ్ళిపోయింది ఆ పిల్ల.
వాళ్ళంతా యెక్కడ ఉంటారు? రోజంతా పనిపాటా లేకుండా గిన్నెలేసుకుని వూరంతా తిరుగుతూ వుంటారు అని అడిగాను భవానీని. చాలా యేళ్ళ నుండి హైస్కూల్ ప్రక్కనే వున్న ఖాళీ స్థలంలో వుంటారమ్మా.! వీళ్ళకి తల్లి దండ్ర్లులు యెవరూ లేరనుకుంటాను అంది.
"రోజు యిలా అడుక్కుని తింటూ బతికేస్తారా ? అంటూ మళ్ళీ అడిగాను.ఒకో రోజు ప్లాస్టిక్ కాగితాలు యేరుకుంటూ వుంటారు.యింకో రోజు చెత్త కుండీల దగ్గర కనబతారు. ఏమి దొరకనినాడు ముష్టికి బయలు దేరతారు" అని చెప్పి వాళ్ళ పనే హాయి " అంది. "యే౦ యె౦దుకని ?" అడిగాను. "కష్టం చేసే పని లేదు కదమ్మా." అంది.
"ఇంకేం అయితే నువ్వు అల్లా వెళ్ళు" అని అన్నాను. "మొదటి నుండి అలా వెళ్ళడం అలవాటు లేదు కదమ్మా."అంది నొచ్చుకున్నట్లు.
"పుట్టిన ప్రతి వొక్కరు పని చేసుకుని బ్రతకాలి.అప్పుడే పని విలువ తెలుస్తుంది.అలా అడుక్కు తినడం యెంత హీనమైనదో, వాళ్ళకి తల్లి తండ్రి యెవరు దిక్కు లేదు కాబట్టి మంచి చెడు చెప్పేవాళ్ళు లేక అలా తయారయ్యారు.అంతే !
మౌనంగా తన పని ముగుంచుకుని వెళ్ళిపోయింది. రోజు అయితే ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టి పంపేదాన్ని. ఈ రోజు.. ఆ ముష్టి పిల్లకి పెట్టడం వల్ల యీ పిల్లకి లేకుండా పోయింది. అనవసరంగా సంభాషణ పెంచి భవానీకి బాధ కల్గించానేమో అనుకున్నాను. తను కూడా వయసుకి మించి బండ చాకిరి చేసే బాల కార్మికురాలే! తండ్రి త్రాగుబోతుతనంతో యేడవ తరగతి చదువుకి గండి పడి నాలుగిళ్ళలో బట్టలుతికే పనిలో పడింది. అందుకే ముష్టి వాళ్ళ పనే హాయి అనుకోగల్గింది అనుకున్నాను.
ఇంతలో ఉయ్యాలలో వున్న పాప నిద్ర లేచి యేడుపు అందుకుంది. " అయ్యో ! యిక నా పని పూర్తి అయినట్టే" అని చింతపడుతూ పాపను సముదాయించుకుంటూనే వంట పూర్తి చేసుకుని ప్రక్కవీధిలో వున్న కాన్వెంట్ లో ఎల్.కే.జీ చదువుతున్న మా బాబుకి క్యారేజ్ తీసుకు వెళ్లాను. ఈ లోపు నిద్ర పోతున్న పాపని కాస్త చూస్తూండమని ప్రక్కింటామెకి చెప్పి వెళ్లాను.
బాబు చదువు కోసమని మావారితో దెబ్బలాడి పల్లె నుండి పట్టణానికి కాపురం మార్చాక కాని తెలిసి రాలేదు అన్ని పనులు చేసుకుంటూ యిద్దరు పిల్లలని సముదాయిన్చుకోవాలంటే తల ప్రాణం తోక కొస్తుంది. ఊర్లో అయితే అత్తగారి సాయం ఉండేది. చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా అని పెద్దలు ఊరికే అనలేదు కదా అని అనుకుంటూ..
పాపని యెత్తుకోవడానికి వొక పిల్లని చూసి మాట్లాడి పంపమంటావా అన్న అమ్మ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది,తను చెప్పిన సమాధానం గుర్తుకు వచ్చింది. పసి పిల్లని మోసేందుకు మరో పసిది బలి అవ్వాలా ! వద్దు అని ఖరాఖండిగా అన్నమాట కూడా గుర్తుకొచ్చింది.నిజమే కదా ! ఇళ్ళలో పనులకి ఆడపిల్లలని బలి చేసేది తల్లిదండ్రులు ,పనులు చేయించుకునే వాళ్ళు కూడా!
నా ఇబ్బందులేవో నేను పడుతూ రోజులు గడుస్తూ ఉన్నాయి. బాబుకి అన్నం తినిపించి వచ్చే వరకు కూడా పాప నిద్ర పోతూనే ఉంది.
ఒక రోజు ఆరోజు నేను చూసిన ముష్టి పిల్ల వీధి గేటు దగ్గరే నిలబడి..యెదురుగా కనబడే టీవి వంక ఆసక్తిగా చూస్తూ నిలబడి వుంది. అది చూసి గేటు తాళం తీసి లోపలకి పిలిచాను. బెరుకు బెరుకుగా లోపలి వచ్చింది. టీవి చూస్తావా? అడిగాను తల ఊపింది. సరే కూర్చో అన్నాను. కూర్చుని టీవిని శ్రద్దగా చూస్తుంది." అన్నం తిన్నావా" అడిగాను అవును కాదు అన్నట్లు మధ్యస్తంగా తల వూపింది.ఒక ప్లాస్టిక్ ప్లేట్ లో అన్నం తీసుకువచ్చి పెట్టి తిను అన్నాను. మొహమాట పడిపోయింది. "నేను లోపలకి వెళతాను లే! తిను" అంటూ బెడ్ రూమ్‌లోకి వెళ్లి కాసేపటి తర్వాత వచ్చి చూస్తే అన్నం తినేసి ప్లేట్ కడిగేసి ప్రక్కన పెట్టి ఉంచింది. "నీకు యెన్నేళ్ళు"? అడిగాను. "తెల్వదు" అంది. "మీ అమ్మ -నాన్న ఎవరు?" మళ్ళీ అడిగాను. "అది తెలవదు" అంది. "మా ఇంట్లో వుంటావా?" అడిగాను. "ఓ.. ఉంటాను" అంది. ఉండటం అంటే వూరికే వుండటం కాదు.అచ్చంగా యిక్కడే వుండి పోవాలి " నాకు సాయం చేయాలి.పాపని ఎత్తుకోవాలి."అన్నాను తలూపింది. "అయితే కాసేపాగిన తర్వాత బజారుకి వెళదాం,నీకు బట్టలు కొని యిస్తాను "అని చెప్పాను. ఆ పిల్ల ముఖంలో సంతోషం. బజారుకి తీసుకు వెళ్లి ఓ..మాదిరి రేటులో మూడు జతల బట్టలు కొంటుంటే షాపతను విచిత్రంగా చూసాడు. ఇంటికి వచ్చాక .ఓ షాంపు పేకెట్ యిచ్చి శుభ్రంగా తల స్నానం చేసి రమ్మని చెప్పాను. స్నానం అయిన తర్వాత కొత్త బట్టలు వేసుకుని కడిగిన ముత్యంలా ఉంది. నీ పేరు ఏమిటి? అడిగాను. "రంభ " అంది. నాకు నవ్వు వచ్చింది. ఆ పేరు యెవరు పెట్టారు? అడిగాను "నేనే పెట్టుకున్నాను"..అంది." సినిమాలు బాగా చూస్తావా? "ఆ చూస్తాను. రైలు స్టేషన్ కాడ,బస్ స్టాండ్ లోను చూత్తాము.ఏరిన సామానుకి డబ్బులు యెక్కువ వస్తే హాల్లో కెళ్ళి చూస్తాం " అని వివరంగా చెప్పింది. ఎక్కడ పడుకుంటావు? రైల్ స్టేషన్ కాడ, ఒకోసారి పోలీసు వాళ్ళు అక్కడ పడుకోవద్దని కొడతారు. అప్పుడు హై స్కూల్ కాడికి చేరుకుంటాం.ఒకోసారి తినడానికి యేమీ వుండదు.అప్పుడు అడుక్కుంటాం..అంటూ వాళ్ళ యెతలు చెపుతుంటే హృదయం కలచి వేసింది.
ఇక నుండి నీ పేరు బంగారు.. బాగుందా ? బంగారు బంగారు.. అని రెండు సార్లు అనుకుని భలే బాగుంది అంది. ఇక నుండి నన్ను "అమ్మా!" అని పిలువు అన్నాను.ఆశ్చర్యంగా చూసింది.
సాయంత్రం అయ్యేసరికి ఆ పిల్ల స్నేహితుల గుంపు గుంపు ఆ పిల్లని వెదుక్కుంటూ మా యింటి ముందుకు వచ్చి పడింది. అది వాళ్ళ దగ్గరకి వెళ్లి నేను యిక యిక్కడే వుంటాను. ఈ అమ్మ నాకు అన్నం పెట్టింది, కొత్త బట్టలు కొని పెట్టింది అంటూ వొంటిమీద బట్టలు చూపింది. ఈ ఇంట్లో టీవి ఉంది. ఆడుకోవడానికి బోలెడు బొమ్మలు ఉండాయి. ఇంకా పాప బాబు కూడా వున్నారు. ఇక నేను మీతో వుండను మీ వెంటరాను అని సంతోషంగా చెప్పింది.
నేనూ బయటకి వచ్చి..ఇక నుండి యీ పిల్ల మీతో రాదు. ఇక్కడే ఉంటుంది అని చెప్పా ను. వారి కళ్ళల్లో ఆశ్చర్యం,కొందరి కళ్ళల్లో ఈర్ష్యా కూడా కనిపించాయి. వారందరికీ తలా ఒక అరటి పండు యిచ్చి యెప్పుడైనా బంగారుని చూడాలనుకుంటే రావచ్చని చెప్పాను. వాళ్ళకి కనబడేదాక చేతులు వూపి లోపలకి వచ్చింది. ఏడుస్తున్న పాపని దానికి అందించి నేను వంట యింట్లోకి వెళ్లాను. తర్వాత బాబుకి స్నానం చేయిస్తుంటే నా ప్రక్కనే నిలబడి చూస్తూ వుంది. బాబుకి హోం వర్క్ చేయిస్తూ నువ్వు కూడా చదువు కోవాలి అన్నాను. కిసుక్కున నవ్వింది. పలక తీసి అక్షరాలూ వ్రాసి ఇచ్చాను. అ,ఆలు వద్దు.. ఏ.బి.సి.డి లు కావాలి అని అడిగింది. నేను నవ్వుకుని వ్రాసి యిచ్చాను. అయిదే అయిదు నిమిషాల్లో నాలుగు అక్షరాలూ వ్రాసి చూపించింది.చురుకైనదే అనుకున్నాను.
ఆ రాత్రి పల్లె నుండి వచ్చిన మావారు హాల్లో చాప మీద పడుకుని వున్న బంగారుని చూసి యెవరు యీ పిల్ల అని అడిగారు. ఊరునుండి అమ్మ తీసుకొచ్చి దింపి వెళ్ళింది అని చెప్పాను. తెల్లవారిన తర్వాత బంగారుని మరొక సారి చూసి యెక్కడో చూసినట్లు వుంది అని అనుమానంగా అడిగారు. నిజం చెప్పాను. ఇలాగే చేరదీయి.. యెప్పుడో వొకప్పుడు అదును చూసుకుని చేతికందినవి వేసుకుని పారిపోతే కాని తెలుస్తుంది అన్నారు. "పాపం దాని మొహం చూస్తే అలా కనబడటం లేదండీ! అన్నాను నేను.
ఎవరు యెవరు యెలాంటి వారో వాళ్ళ ముఖం మీద కనబడుతుందా ఏమిటీ అన్నారు విసుగ్గా.
పాపం ఆ గుంపులో యేడెనిమిది మంది మధ్య అది వొక్కతే ఆడ పిల్లండీ!! వాళ్లతో తిరుగుతూ రేపు పెరిగి పెద్దదైతే దానికి యెన్ని యిబ్బందులు వస్తాయోనండీ! మనం కాస్త జాలి చూపితే మన దగ్గరే ఉంటుంది కదా.. కన్విన్స్ చేస్తూ అడిగాను.
"అలా అని వూర్లో వున్న అనాధలనందరినీ చేరదీస్తావా? తా దూర కంత లేదు కాని వూర్లో వాళ్ళ పాపపుణ్యాలు మనకే కావాలి " అని వ్యంగంగా అన్నారు. మా పుట్టింటి వాళ్ళు బాగా కట్న కానుకలు యివ్వలేదని అప్పుడప్పుడు దెప్పుతూ ఉంటారు. అప్పుడు ఆ మాటలు నాకు బాధ అనిపించలేదు. ఎలాగైనా వొప్పించాలి అన్న పట్టుదలతో.. మనం పూజలు పేరిట యెంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం. దానికన్నా యిలాటి వారికి సాయ పడితే మంచిది కదండీ. మంచి పనులు చేస్తే దేవుడు హర్షిస్తాడు అన్నాను.
సరి సర్లే! తర్వాత యేమైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం వూరుకునేదే లేదు. అన్నారు హెచ్చరికగా.
"అమ్మయ్య ..ఆయన వొప్పుకున్నారు అదే చాలు అనుకున్నాను." ఈ మాటల్లన్నీ వింటున్న బంగారు..
బాబు గారు! నేను అలాంటి పనులు యేమి చేయను. బుద్దిగా వుంటాను.మీరు చెప్పినట్టు చేస్తాను అంది. ఒక్క క్షణం దాని వంక చూసి సరే..జాగ్రత్తగా వుండు, మళ్ళీ మీ వాళ్ళతో కలిసావా యింట్లో నుండి గెంటేయడమే! అని అన్నారు. అది తల వూపి యివతలకి వచ్చేసింది.
నేను నిద్ర లేచినప్పుడే లేచి ,నేను చెప్పిన పనులు అన్నీ చేస్తూ.. వొద్దికగా వుండేది. నెల రోజులు తిరిగేటప్పటికి మా యింట్లో అందరి నోటా దాని పేరు మారు మ్రోగి పోయేది. మా పాప కూడా.. వచ్చీ రాని మాటలతో.. దాని పేరు చెపుతూ వుండేది. అది చూసి చాలా సంతోష పడేది బంగారు. ఆఖరికి దాని వైపు అనుమానంగా చూసే మా వారి మెప్పు కూడా పొందింది. ఆయన దాని కోసం ప్రత్యేకంగా పుస్తకాలు కూడా తీసుకొచ్చి యిచ్చారు. మా అత్త గారు అయితే పనిలో సాయంగా ఉంటుంది తనతో పంపమని అడిగారు. మా వారు "వద్దులేమ్మా అది అక్కడ వుండటం కష్టం అని అన్నారు.
బంగారు మా యింటికి వచ్చిన క్రొత్తల్లో "ఇదేంటి వీళ్ళు ఆ దెష్టపు ముఖం దాన్ని తెచ్చి యింట్లో పెట్టుకున్నారు.అని ముఖం చిట్లించుకునే వాళ్ళు. తర్వాత తర్వాతేమో జీతం భత్యం లేని పని పిల్ల దొరికింది. యే అమ్మ కన్న బిడ్డో! యిక్కడ చాకిరీ చేయడానికి పుట్టింది అనే వారు. నేను బంగారుకి చక్కగా తలదువ్వి జడలు వేస్తుంటే దూరంగా జరిగి పోయేవారు.
బంగారుకి టీవి చూడటం బాగా అలవాటు అయింది. చదువుకో అంటే కాస్త అయిష్టంగా వుండేది.ఖాళీ సమయాల్లో టీవి.పెట్టు అమ్మా చూస్తాను అనేది. కాసేపు చూడనిచ్చి ఆపేసేదాన్ని.ఆ పిల్ల ముఖంలో అసంతృప్తి కనిపించేది , కాసేపు చదువుకో అంటే అయిష్టంగా చూసేది. వచ్చే సంవత్సరం నిన్ను కూడా స్కూల్లో జాయిన్ చేస్తాను. ఇప్పుడు బాగా చదువు కోవాలి అని చెప్పేదాన్ని.
అప్పుడప్పుడు బంగారు ని చూడటానికి తన ఫ్రెండ్స్ వచ్చేవారు. వాళ్ళు వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఉండేది. వాళ్ళు వెళ్ళిపోయాక చాలా దిగులుగా ఉండేది
" .ఏమిటి బంగారు దిగులుగా వున్నావ్ అంటే ఏం లేదమ్మా, మా వాళ్ళు అందరు అలాగే ఉన్నారు. నేను ఒక్కదాన్నే యిక్కడ బాగున్నాను. లోకంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు వున్నారు కదమ్మా..మీకు లాగా అందరూ యెవరో వొకరిని చేరదీసి చూడవచ్చు కదమ్మా అంది. ఆ ప్రశ్నకి సమాధానం నాదగ్గర లేదు. మేమందరం చిన్నప్పటి నుండి కలిసే వున్నాము. నా చిన్నప్పుడు నుండే వాళ్ళ౦దరు యెవరికి యే౦ దొరికినా నాకు తీసుకొచ్చి పెట్టేవారు. ఏది దొరికినా అందరం పంచుకుని తినేవాళ్ళం. నేను కడుపు నిండా తిన్నా వాళ్ళే గుర్తుకొస్తున్నారు,పాపం .. వాళ్ళిప్పుడు యెలా వున్నారో."అంది. దాని చిన్ని మనసులో వాళ్ళ పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి కదిలి పోయాను.
సరేలే ! మనం వారానికి వొకసారి వారికి భోజనం పెడదాం సరేనా అన్నాను. ఆ మాటకే బంగారు ముఖంలో సంతోషం.ఆ రాత్రి అంతా బంగారు అన్న మాటలు గురించే ఆలోచిస్తూ వున్నాను.
అన్నమాట ప్రకారం మా వారు లేకుండా చూసి ఏ పులిహారో,దద్దోజనమో చేసి వారి అందరికి యిచ్చేదాన్ని. ఒక అనాధ శరణాలయం అడ్రస్ సంపాదించి వారందరినీ అక్కడ జాయిన్ చేయించి వచ్చాను. ఇక వాళ్ళ గురించి దిగులు పడకు. వాళ్ళు బాగానే ఉంటారు. బడికి వెళ్లి చదువుకుంటారు అని చెప్పాను. ఒక వారం రోజులకి వాళ్ళని మేము చూడటానికి వెళ్ళేటప్పటికి వొక్కరు కూడా అక్కడ లేరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు అని చెప్పారు.తర్వాత వొక రోజు యిద్దరు పిల్లలు బంగారుని ఛూడటానికి వచ్చారు. శరణాలయం నుండి యె౦దుకు వచ్చేసారని అడిగితే ..అక్కడ సరిగా అన్నం పెట్టడం లేదని ,కొడుతున్నారని,బయట పనులకి పంపిస్తున్నారని చెప్పారు. వాళ్ళు కాసేపు వుండి వెళ్ళిపోయారు.
మర్నాడు ఉదయానికి బంగారుకి మంటల జ్వరం ముంచుకు వచ్చింది. హాస్పిటల్ కి తీసుకుని వెళితే మామూలు జ్వరమే అని చెప్పి మందులు ఇచ్చారు. రెండు రోజులు తర్వాత అలాగే ఉండి జ్వరం వస్తూ ఉంది. . బంగారుని హాస్పిటల్ కి తిప్పడం చూసిన మా వారు.. విసుక్కునే వారు. ఏ దిక్కుమాలిన సంతానమో..ఇది. దీని శరీరంలో ఎయిడ్స్ లాంటివి యేమన్నా దాగి ఉన్నాయేమో.. బజార్లు వెంట తిరిగేపిల్లని తీసుకు వచ్చి యింట్లో పెట్టావ్? ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ డబ్బులు వదిలిస్తున్నావ్?అన్నారు. ఆ మాటకి హడలిపోయాను. ఆయన పల్లెకి వెళ్ళాక మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకు వెళ్లి డాక్టర్ గారికి నా అనుమానాలు అన్నీ చెప్పి బ్లడ్ టెస్ట్‌లు చేయిస్తే నెగిటివ్ అన్న రిపోర్ట్ చూసి ఊపిరి పీల్చుకున్నాను. దానికి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. కాని యెందుకో దిగులుగా వున్నట్టు అనిపించేది. ఆ దిగులు యె౦దుకో నాకు తెలుసు.ఆ దిగులు తీర్చేందుకు నేను ఆసక్తురాలిని. ఒక విధంగా బంగారు మీద కోపం వచ్చేది.
ఒక రోజు మధ్యాహ్నం అన్నం తింటూ.. అమ్మా! నేను మా వాళ్ళ దగ్గరకి వెళ్ళిపోతా అంది. ఎవరే మీ వాళ్ళు అని గద్దించాను కోపంగా.. మా ప్రక్క యింటి వాళ్ళు మా యింటి వైపు తొంగి చూస్తున్నారు. అది మాట్లాడలేదు. .
సాయంత్రం వేళ నా ప్రక్కకి వచ్చి అమ్మా, నేను వెళతానమ్మా..అని అడిగింది. నాకు యేడుపు ముంచుకు వచ్చింది ఆరు నెలలు కాలం దానిని నా బిడ్డగానే చూసాను. ఏం తక్కువ చేసాను.. అయినా అది యిక్కడ వుండనంటుంది నేను మాట్లాడ లేదు.
"అమ్మా! పెన్నలో మునిగి రంగడి గుడిలో ప్రసాదం తిని చిత్తు కాగితాలు యేరుకుని యేదో వొకటి తినడమే బాగుంది నేను యిక్కడ వుండలేను పంపించేయండమ్మా" అంది.కాదంటే మళ్ళీ జ్వరం తెచ్చు కుంటుందని "సరేలే."అన్నాను.
ఉదయం నేను నిద్ర లేచేటప్పటికి బంగారు నిద్ర లేచి వెళ్ళడానికి తయారుగా ఉంది. వెళతాను అంది కాని నిజంగానే వెళ్ళదు అనుకున్న నేను ఖంగుతిన్నాను.బంగారు పాపని ఎత్తుకుని ముద్దాడింది.పాపా పద్దాక యేడ్చి అమ్మని యిబ్బంది పెట్టమాకు. బాబూ ! అల్లరి చేయకుండా అమ్మ చెప్పినట్టు విను అంటూ అప్పగింతలు పెట్టింది. దానికని కొన్న బట్టలు అన్నీ తీసుకోమన్నాను. ఒక పాత బేగ్ ఇచ్చి అది కప్పుకునే దుప్పటి కాక మరో పాత దుప్పటి ఇచ్చాను. బేగ్ చాలా బరువుగా తయారయింది టిఫిన్ పెడితే తినకుండా పొట్లం కట్టింది.ముఖం చూస్తే తేటగా సంతోషంగా కనబడింది. వాళ్ళ వారి దగ్గరకు వెళుతున్నందుకు కాబోలు. బేగ్ తీసుకుని బయలు దేరింది నాకు కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతున్నాయి గుమ్మం మెట్ల మీద కూలబడ్డాను. గేటు దాక వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చింది
"అమ్మా! మా అమ్మ యెవరో నాకు తెల్వదు నువ్వే మా అమ్మ అనుకుంటా వుండాను. ఒక్కసారి నిన్ను వాటేసుకుంటానే " అంది. నేను తల ఊపాను. మెట్ల మీద కూర్చున్న నా ప్రక్కకు వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నా వీపుపై వాలింది అప్రయత్నంగా దాని చుట్టూ నా చేతులు బిగుసుకున్నాయి. కొద్ది సేపు అలా ఉంది. ఓ..నిమిషం తర్వాత నన్ను విడిపించుకుని బేగ్ తీసుకుని వెనక్కి తిరిగి అయినా చూడకుండా పరుగెత్తింది. అది కూడా యేడుస్తుందేమో..నాకు లాగానే అనిపించింది. చాలా సేపు అలానే నిస్తేజంగా కూర్చుండిపోయాను. ఏ పని చేయబుద్ది కాలేదు.
నన్ను నేను విశ్లేషించుకోవడం మొదలు పెట్టాను.బంగారుని చేరదీయడం పట్ల నా స్వార్ధం వుంటే వుండవచ్చు కాక. అది అప్పుడప్పుడు నన్ను అడిగే ప్రశ్నలు, అనాధల జీవితాల గురించి నన్ను ఆలోచింపజేసాయి.మనిషిలో యే మూలో దాగి ఉన్న జాలి దయలతో దానిని చేర దీసి రోజులు గడుస్తున్న కొద్ది దానితో పెంచుకున్న అనుబంధాన్ని అది తేలికగా తెంచుకుని వెళ్ళిపోయింది. అది నాతో శాశ్వతంగా వుంటుందని నేను ఆలోచించడం వల్లనే నాకు యీ బాధ తప్పదనిపించింది.ఏ పని చేస్తున్నా బంగారు నా వెనుక వెనుక తిరుగుతున్నట్లు వుంది. కోపం వస్తుంది. అయినా నేను తనకి యే౦ తక్కువ చేసాను? కడుపున పుట్టిన బిడ్డలా కాకపోయినా బాగానే చూసాను.
వచ్చే యేడాదికి స్కూల్ కి పంపాలనుకున్నాను. నాలుగు అక్షరాలూ నేర్పించి యేదో ఒక కుట్టు సెంటర్లో చేర్పించి దాని బతుకుకి ఒక మార్గం వేయాలనుకుంటే అది యిలా.. వెళ్ళిపోయింది. నాలుగు నెలల క్రితమే అకౌంట్ ఓపెన్ చేసి నెలకి మూడు వందలు లెక్కన సేవింగ్ చేయడం మొదలెట్టింది. యేమిటో..అదిలా వెళ్లి పోయింది. పసి మొగ్గ లాంటి దాని జీవితం యేమవుతుందో, యెవరైనా చిదిమేస్తారేమో అన్న ఆలోచనలు ముంచేస్తున్నాయి.
రెండు రోజులు గడచి పోయాయి.చుట్టూ ప్రక్కల అందరు.. బంగారు చేత గొడ్డు చాకిరి చేయించడం వల్లనే అది వెళ్ళిపోయింది అని యిష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించుకుంటున్నారు.రెండు మూడు రోజులు పల్లెకి వెళదామని అనుకుంది వెంటనే సందేహం ముంచుకొచ్చింది. బంగారు యేదన్న ప్రశ్నలు వస్తే అత్త గారికి యే౦ సమాధానం చెప్పాలి అనుకుని పల్లెకి వెళ్ళే వుద్దేశ్యం మానుకుంది. నాలుగు రోజులుగా పొలం పని ఒత్తిడి వల్ల భర్త యింటికి రావడం లేదు.ఈ రోజో,రేపో రావచ్చు. బంగారు యేది? అని అడిగితే యే౦ సమాధానం చెప్పాలి? ఆలోచిస్తుంది.
ఆరు గంటలు దాటింది. చీకటితో పాటే వర్షం కూడా మొదలయింది. కరంట్ పోతుందని ముందు జాగ్రత్తగానే దీపం బుడ్డి ,కాండిల్స్ అగ్గి పెట్టె అన్నీ రెడీగా పెట్టుకుంది. చాప పరచుకుని పిల్లలని ఆడిస్తూ కూర్చుంది. ఏడుగంటలు సమయంలో కరంట్ పోయింది. వరండా గ్రిల్స్ కి తాళం వేద్దామని వెళ్లి.. వీధి గేటు వైపు చూసాను. జోరున కురుస్తున్న వర్షంలో అప్పుడే మెరిసిన మెరుపు వెలుగులో బంగారు నిలబడి ఉండటం కనబడింది.
బంగారు.. త్వరగా లోపలకి రావే! యెందుకు అలా తడుస్తావ్? అని కేక వేసాను. గబా గబా బంగారు లోపలకి వచ్చింది. తడిసిన దాని బట్టలు విప్పేసి తుడుచుకోమని తుండు ఇచ్చాను. మా వారి పాత షార్ట్ ఒకటి వేసుకోమని యిచ్చాను. వేడి వేడి అన్నం పెట్టాను. ఆత్రంగా తింది . నేను అలానే చూస్తూ వూరుకున్నాను. అన్నం తిని చాప వేసుకుని పడుకుంటూ.. అమ్మా.. నేను యెక్కడికీ వెళ్ళను. యిక్కడే వుంటాను అంది. నేను కోపంగా వెళ్ళడం,రావడం అంతా నీ యిష్టమేనా..? అసలు ఎందుకు వెళ్ళావ్? అని గట్టిగా అరిచాను.అది తలవంచుకుని కూర్చుండిపోయింది. జాలి వేసింది. మళ్ళీ వెళతాను అని అనవు కదా! రెట్టించి అడిగాను. అడ్డంగా తల ఊపింది.
ఆ రాత్రి బంగారుకి విపరీతమైన జ్వరం వచ్చింది .నాకు ఒకటే కంగారు. ఇంట్లో ఉన్న మందులు యేవో ఇచ్చాను.
రాత్రంతా వొకటే కలవరింతలు."ఒరేయ్! నన్ను వదిలేయండి రా, నేను వెళ్ళిపోతాను, నాకు భయం వేస్తుంది..నన్ను కొట్టవద్దు..అన్నా..అంటూ వొకటే యేడుపు . నాకు భయం వేసింది. బంగారుని తట్టి లేపాను. ఏమైంది బంగారు..? అడిగాను. నా గొంతులో వినబడిన ప్రేమకి అది పెద్ద పెట్టున ఏడ్చింది.
"అమ్మా.. నాతో వుండాళ్ళంతా మంచి వాళ్ళు కాదమ్మా.. రైలు స్టేషన్ కాడ యెవరో రౌడీ అన్న దగ్గర పని చేస్తా వుండారు. గంజాయి అమ్ముతున్నారు. రైళ్ళలో దొంగతనాలు చేస్తున్నారు. జేబులు కొట్టేస్తున్నారు. రంగడు గుడి దగ్గర,రాజరాజేశ్వరి గుడి దగ్గర అడుక్కుంటున్నారు. ఏవేవో చెడ్డ పనులు చేస్తున్నారు. కష్ట పడి పని చేస్తే పొట్టలు నిండవు అంట..పని చేస్తాను అన్నా నమ్మి పని చేయించుకునే వాళ్ళు వుండరట. నేను మంచి మాటలు చెప్పబోతే యెగతాళి చేసారు. నన్ను మూలా పేట గుడి దగ్గర వో అన్న దగ్గరికి నన్ను తీసుకు వెళ్ళారు. వాడు నన్ను అక్కడే వుండమన్నాడు. వాడు రాత్రేల వొంటిమీద చెయ్యేసి యేమేమిటో చేయబోయాడు.నేను గట్టిగా అరిచాను, యేడ్చాను. ప్రక్కన వాళ్ళు అలికిడికి వాడు నన్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. నేను అక్కడి నుండి తప్పించుకుని రాత్రంతా తిరుగుతూనే ఉన్నాను. తెల్లారి మా వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్లాను. నన్ను తీసుకువెళ్ళి బొంబాయి వాళ్లకి అమ్మేస్తాడని చానా డబ్బులు వస్తాయని మా వాళ్ళు చెప్పుకుంటున్నారు. భయం వేసి పారిపోయి వచ్చేసానమ్మా" ..అని చెప్పి యెక్కి యెక్కి యేడుస్తుంది. నా గుండె దడ దడ లాడింది. కిటికీ తలుపులు కూడా మూసి వచ్చి మరొక చాప వేసుకుని దాని ప్రక్కనే పడుకున్నాను.
బంగారు ! వాడు నిన్ను యేమి చేయలేదు కదా అన్నాను. ఆ మాట దానికి అర్ధం అయ్యే వయసు లేదు.అర్ధం అయ్యేటట్టు యెలా అడగాలో నాకు తెలియలేదు. ఆ సంగతి అడిగి దానిని యింకా భయపెట్టడం మంచిది కాదని వూరుకున్నాను. మొదటిసారి దానిని కని దిక్కులేనిదానిగా వొదిలేసిన తల్లిని తిట్టి పడేసాను.
బంగారు."అమ్మా.. వాళ్ళు వచ్చి నన్ను పట్టుకు వెళతారేమో, నాకు భయం వేస్తుందమ్మా.." అంటూ నా ప్రక్కకు జరిగి పడుకుంది." నీకేం భయం లేదు నేను ఉన్నానుగా !" అంటూ బంగారు వొంటి మీద చేయి వేసి వెన్ను నిమురుతూ వున్నాను. అది నన్నే చూస్తూ కాసేపటికి నిద్ర పోయింది.
తెల్లవారిన తర్వాత బంగారు భయపడుతున్నట్లే తనతో కలసి పెరిగిన వాడు వొకడు యింకొక మనిషి మా యింటికి వచ్చారు. నాకు కాళ్ళు వొణుకు తున్నా సరే దైర్యం కూడా దీసుకుని బయటకి వచ్చాను.వాళ్ళు బంగారుని పంపివ్వమని అడిగారు.నేను వాళ్లతో పంపడం కుదరదని చెప్పాను. మళ్ళీ యింకో సారి యిటువైపు వస్తే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేస్తాను అని బెదిరించాను. వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఆ రోజే నాకు వరసకు బాబాయ్ అయ్యే హెడ్ కానిస్టేబుల్ని పిలిపించి ఈ విషయం చెప్పాను. ఆయన ఆ యేరియా ఎస్సై దగ్గరకి తీసుకుని వెళ్లి కంప్లైంట్ వ్రాయించి యిప్పించారు. ఒక సాధారణ మైన ఇల్లాలిని నేను ఇవన్నీ చేయడం పోలీస్ స్టేషన్‌కి రావడం మా కుటుంబంలో యెవరికైనా తెలిస్తే నన్ను పుట్టింటికి పంపడం ఖాయం .అదే విషయాన్ని ఎస్సై గారికి చెప్పాను.
మీ యింటి వైపు చూడ కుండా నేను యాక్షన్ తీసుకుంటాను మీకేం భయం లేదు. మళ్ళీ యింకోసారి పోలీస్ స్టేషన్ కి రావాల్సిన అవసరం వుండదు.. మీరు వెళ్ళండమ్మా అని ఆయన హామీ ఇచ్చారు.
నేను బంగారు తిరిగి వచ్చేస్తుంటే నా దగ్గరకు వచ్చి" మీరు చాలా మంచి పని చేస్తున్నారమ్మా!కాస్తంత ప్రేమ అభిమానం చూపి వారి కడుపుకి నాలుగు మెతుకులు పెట్టి మంచి మార్గం చూపితే లక్షల మంది పిల్లలు అనాధలుగా ఉండరు. అనాధలన్నవారే ఈ సమాజంలో వుండరు. ఇన్ని జాడ్యాలు ఉండవు" అని అభినందించారు.
"ఒకోసారి విసుకున్నా మా వారి సహకారం లేకుంటే నేనీ పిల్లని చేరదీసే అవకాశం వుండేది కాదండి "అని చెప్పి సెలవు తీసుకుని వస్తూ మళ్ళీ బంగారు కోసం బట్టలు కొనడానికి షాపుకి వెళ్లాను. ఇంటికి వచ్చాక బంగారు మాములుగానే బాబుతో ఆడుకుంటూ పాపని ఆడిస్తూ నా వెనుక వెనుకనే తిరుగుతూ ఉంది. మళ్ళీ యీ పిల్ల వచ్చేసిందే అంటూ ఇరుగు పొరుగు పలకరింపులు మొదలెట్టారు.
ఆ రాత్రికి బంగారు యింకా భయపడుతూనే వుంటుందేమో అన్నట్టు బంగారు ప్రక్కనే నేను చాప వేసుకుని పడుకున్నాను. అది నిశ్చింతగా నిద్ర పోయింది. అది యిక యెప్పటికి మా యింటిని వదలదు గాక వదలదు. నిద్రపోతున్న దాని అమాయకమైన ముఖం చూస్తూ అనుకున్నాను అవును,నాకిప్పుడు ముగ్గురు బిడ్డలని.
(ఈ కథానిక 2002 వ సంవత్సరంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి "వనితా వాణి " కార్యక్రమం ద్వారా.. ప్రసారం అయినది. )
.