ముసురు
కొబ్బరాకులతో వేసిన చిన్న గుడిసె. దానిపై ప్లాస్టిక్ పట్టా వేసి వైరుతో గట్టిగా కట్టి ఉంది. అయినా సరే బలంగా వీచే గాలికి ఊగుతూ ఉంది. గుడిసె లోపల ఎలక్ట్రిక్ బల్బు వెలుతురులో కూర్చుని టీవి వంక చూస్తూ అన్నం తింటున్నాడు కోటి. బయట నుంచి వచ్చే చల్లటి గాలి వణుకు పుట్టిస్తుంది.
"ఆ తడక అడ్డం పెట్టగూడదూ. పిల్లలు చలికి చచ్చి పోతున్నారు" అంది రాజ్యం.
"మనం తడకేసుకుని ఎచ్చగా పడుకుంటే దొంగల పని సులువై పోతది. తీసుకున్న రూపాయికి నాయంగా పని చెయ్యాలే రాజ్యం. నువ్వొక పని చేయి నేను బయట పడుకుంటా . నువ్వు తడకేసుకుని పిల్లల పక్కన పడుకో ." చెప్పాడు కోటి.
"ఏదో ఒకటి చేయ్, నేను చెపితే మాత్రం నువ్వింటావా ఏంటి ? ఇందాక చెప్పడం మరిసిపోయా ! రేపోద్దుటికి వండటానికి బియ్యం లేవ్ ! ఎవరినన్నా అప్పడిగి తేవాలన్నా ఇక్కడెవరు తెలియక పోతిరి. పనిచేసే చోట డబ్బులయితే అడిగి తెద్దును గాని బియ్యమడిగి తెలేనుగా" .. చెప్పింది.
నీళ్ళ గ్లాసు తీసుకుని బయటకొచ్చి చేయి కడుకున్నాడు. భార్యకేమి సమాధానం చెప్పలేదు. తల పైకెత్తి ఆకాశం వైపు చూసాడు. దట్టంగా మబ్బులు. వానొచ్చేటట్టుంది. దీపావళి ముసురు గాబోలు. గుడిసె బయట మడత మంచమేసుకుని దుప్పటి కప్పుకుని పడుకోబోతూ తల ప్రక్కనే టార్చి లైట్ పెట్టానో లేదో అని ఇంకోసారి చూసుకుని పడుకుని కళ్ళు మూసుకున్నాడు. గాలికి కొబ్బరి చెట్టుపైనుండి కాయ రాలిన శబ్దం. ఉలికిపడి కళ్ళు తెరిచాడు. లేచి కూర్చున్నాడు. నిద్ర రావడం లేదు. ఊర్లో అయితే తన చిన్నప్పుడు ఎలా ఉండేదో గుర్తుకొస్తుంది. ఇట్టాగే మబ్బులు ముసుగేసిన రోజుల్లో నాయన మాటో అమ్మ మాటో గుప్పున గుర్తుకొచ్చుద్ది పంట గింజ పాల బడుద్దా నీలబడుద్దా అని ! గతంలోకి జారిపోయాడు కోటి.
దీపాల అమాసకి ముందు ముసురు పట్టుకుంది. ఇది తుఫాను ముసురో ఏమో ! పంట చేతికందోచ్చే రోజుల్లో ఈ మాయదారి ముసురు దెయ్యంలా కాచుకుని ఉంటుంది. "గింజ పాల బడుద్దా నీల బడుద్దా " అనే గుబులుగా ఉంది.రా కోటీ " అనేవాడు నాయన. ఆకుపచ్చగా ఉన్నపొలమంతా బంగారు రంగులోకి మారి కంకుల భారంతో ప్రక్కకి వాలిపోయి కొంత, ఒకోచోట పడిపోయిమరింత ఉంటాయి. భయపడినట్టుగానే ప్రతేటా పంట చేతికొచ్చేసరికి తుఫాన్ వచ్చేది పంటంతా నీళ్ళ పాలయ్యేది. ఆఖరికి అప్పులే మిగిలేయి. అప్పులు తీర్చలేక మొగుడు చెరువులోకి దిగి చచ్చిపోయాడని చిలకమ్మ ఏడుస్తూ ఉండేది.
వ్యవసాయం చేయడానికి చేసిన అప్పులు క్రింద పొలమంతా నాయుడికి జమ అయిపొయింది. అదే ఏడు నాయుడు దగ్గర పాలేరుగా మారిపోయాడు కోటి. తినడానికి గింజలేని ముసురు రాత్రొకటి కళ్ళ ముందు మెదిలింది.
పండిన వరి కోయకముందే తుఫాన్ పట్టుకుందనే గుబులు నాయుడిదైతే ఇంట్లో గింజలేని దిగులు అమ్మది. రాత్రి ఇంటికొచ్చి పడుకుంటుంటే "పెద్దోడా ఇంట్లో బియ్యమైపోయాయిరా ! నూకలు కూడా ల్లేవ్, శెట్టి కొట్లో పంటలోచ్చాక అంతకంత కొలుస్తానన్నా అప్పు ఈయడం లేదు." చెప్పింది.
నాయుడింట్లో ఎంతో కొంత తినొచ్చింది గుర్తు చేసుకుంటూ పొట్ట తడుముకున్నాడు. "ముగ్గురు చిన్నోళ్ళు ఆకలకి తట్టుకోలేక ఏడుస్తుంటే తవుడుని చెరిగి వచ్చిన నూకలతో జావ కాసి వాళ్ళ పొట్టలో బోసా ! అందులోదే కాస్త పొద్దూన్నేక్కూడా ఎత్తిపెట్టి ఉట్టిలో పెట్టానురా ! నాయుడిని బత్తెం అడుగు" గుర్తు చేసింది. అట్టాగే అంటూ కళ్ళు మూసుకున్నాడు. తెల్లారి చెయ్యాల్సిన పనులు కళ్ళ ముందు మెదులుతూ ఉండగా కళ్ళు మూసుకున్నాడు కోటి .
మంచు ఇడవకుండానే తూర్పు పొలంకి ఎల్లాడు కోటి . దొరసాని కొత్త బియ్యం పొంగలి పెట్టాలని చెప్పింది. పొద్దెక్కే లోపే ఒక మడైనా పనలు చీల్చి రెండు మోపులకి సరిపడా కోసి దొరింటికి మోయాలి. సద్దన్నం తిని ఆ పనలన్నింటిని పల్చగా ఎండబెట్టాలి. మళ్ళీ పొద్దుగూకక ముందే నూర్పుడు బల్లమీద వడ్లని రాలగొట్టి తూర్పరాబట్టి చిలకమ్మ ముందు పోస్తే ఆ వడ్లన్నింటిని ముక్కులిరక్కుండా దంచి, చెరిగి జల్లెడ బట్టి మట్టిబెడ్డలుంటే ఏరేసి కుంచానికెత్తి ఇచ్చేపాటికి ఊరంతా సద్దు మణిగి పోయింది. ఊర్మిల్లమ్మ తినమని పెట్టిన అన్నాన్ని బిడ్డలకి పెట్టాలని పరుగు పరుగునా ఇంటికొచ్చింది చిలకమ్మ అమ్మ వొచ్చి వన్నమొండి పెట్టుద్దని ఎదురు చూసి ఎదురుచూసి నేల మీదేపడి నిదరపోయారు తమ్ముళ్ళు నాయాళ్ళు. ఆళ్ళని లేపి ముద్దు ముద్దలగా తిండి తినిపిస్తుంటే "ఏమ్మా బియ్యపు గింజలేవీ తేలే " అడిగాడు కోటి.
"ఊర్మిల్లమ్మ కోడి గుడ్లంత కళ్ళేసుకుని నా ఎంకే చూస్తా ఉందిరా? నోట్లో గింజ కూడా ఏసుకో కూడదని హెచ్చరించింది కూడా ! చెరిగినయి చెరిగినట్టు తాంబూలంలో పోసుకుని పేరు నెయ్యి రాస్తా కూర్చుంది రేపొద్దున్న ఏకాశీ శనివారమంట. కొత్త బియ్యాన్ని తొలీత రాములోరి గుళ్ళోకి ప్రసాదం చేయడానికి ఇయ్యాలంట బెల్లపు పొంగలి పెట్టి గంగానమ్మకిపెట్టి రావాలి తర్వాత ఇంటి చుట్టుపక్కలాళ్ళకి పెట్టుకుంటారు ఆల్లు తింటారు. అడుగో బొడుగో సమయానికి మనం బోతే అల్లా కంటికికనబడితే మన చేతిలో ఏత్తారు. అంతే గదరా " అంది.
"నేను కొత్త బియ్యం సంగతి చెప్పలేదే పదిసేర్ల బియ్యం అడగకపోయావా అని కదా నిన్ను అడిగింది" అన్నాడు ఇసుక్కుంటూ . "అడిగితే అంత తేలిగ్గా ఇచ్చేత్తారేంటి ? పిచ్చి నాయాల. ఇచ్చే వాళ్ళైతే మన నాలుగెకరాల మాగాణిని వాళ్ళ ఖాతాలోకి ఎందుకేసుకుంటార్రా పిచ్చి కొడుకా ! ఆశ పడింది చాల్లే గాని ఇక పడుకో అంటూ కాసిని మంచీల్లు తాగి ఇద్దరు తమ్ముళ్ళు పడుకున్న కుక్కి మంచంలోనే చిలకమ్మ సర్దుకుంది.
నిదర రాటల్లేదు కోటికి. మెసులుతూనే ఉన్నాడు. "ఎంతాలోసించినా మన బతుకులేవీ మారవులే కోటీ .. కళ్ళు మూసుకుని పడుకో నిదర అదే పట్టింది. చీకటితోనే ఎల్లి పొయ్యి గడపలు అలికేసి ముగ్గులు పెట్టాలి. నువ్వు పాలు పిండి ఇయ్యాలి. ఎండెక్కినాక శెట్టి కాడికెల్లి బతిమలాడుకుంటా పది సేర్లు నూకలియ్యమని. నాల్గు దినాలు గడిస్తే కోతల్లో పడతాము. కూలీ వస్తది కాస్తా కూస్తో పరిగి వస్తది కదా అప్పు తీర్చేయొచ్చు ". చిలకమ్మ మాటల్లో ఆశ.
చిమ్మ చీకట్లోనే నాయుడింటికెల్లారు తల్లి కొడుకు. ఊర్మిలమ్మ బయటకొచ్చి ఇయ్యాల కాదులే దేవుడికి పెట్టేది. చిన్నమ్మి ఇంట్లో ఉండే దినాలు గాదు. నువ్వు బయలంతా చిమ్మి కల్లాపిజల్లి ముగ్గులేసి పో ! కోటి మావు వేసి వచ్చాడుగందా! అట్టాగే బొమ్మిడాయిలు కూడా దొరుకుతున్నయ్యి అని నాయుడు చెప్పాడు. అయ్యన్నీ తెచ్చినాక కబురు పెడతా ! శుభ్రం జేసి ఇచ్చి పో అంటూ లోపలకి పోయింది. బియ్యమడుగుదామని నోటి మీదకొచ్చింది. తెల్లారక ముందే నీ దరిద్రాన్ని ఇనిపిస్తూ ఉండావని తిట్టిపోస్తదని నోట్టో మాట నోట్‌తోనే కుక్కుకుని పనిలో బడింది చిలకమ్మ.
రెండు రోజులాగాక వరి కోతలు మొదలు పెట్టారు.మునుం పట్టి నడుంవంచి కోత కోయడం మొదలెట్టారు. "ఒరేయ్ కోటీ ... అన్నం టిఫినీల మీద కాకులు వాలతొన్నాయ్. మాయదారి కుక్కలు కూడా కాచుకూసున్నాయి ఈ పనలు నాలుగు తీసుకెళ్ళి ఆ కేరేజీలపై యేసిరా " అమ్మ ఆరాటం అర్ధమైంది కోటికి. సాయంత్రం పనలని ఇంటికి పట్టుకెల్లి దంచుకుని వండుకోవచ్చని అర్ధమయింది. కాస్త వత్తుగానే పనలని కప్పుకుని వచ్చాడు. తీరా ఇంటికి మల్లేటప్పుడు ఆ పనలని మోపు గట్టుకుని బయలదేరబోతే వెనక్కి పిలిచి మరీ కయ్యలో పనలపై ఏపిచ్చాడు నాయుడు . "నీకు ఇయ్య కూడదని కాదురా కోటీ ! మీరు ఇయ్యాలే వడ్లు దంపి వండుకు తింటారు. పొంగలి పెట్టకుండా పంట గింజ ఎసరునీళ్ళలో పడటం మంచిది కాదని అంటారు కదా! మీ ఊర్మిల్లమ్మకి తెలిస్తే రచ్చ రచ్చ చేసుద్ది నీకు తెలియంది కాదుగా " అన్నాడు.
ఉసూరుమంటూ నడిచెళుతున్న తల్లిని చూస్తే దుఃఖమొచ్చింది కోటికి. మేనమామ ఇంటికి పోయి బియ్యం అప్పుగా తెచ్చి తల్లి చేతికిచ్చి వచ్చాడు. "మన కష్టం ఇలువ నీళ్ళ బడటానికి కూడా ఏడుస్తుందిరా! వాళ్లకేమో సిరి మాలచ్చిమి రోజు పాలల్లో బడి ఉడుకుతూ ఉంటుంది. మనం అష్టదరిద్రులుగా పుట్టి ఉంటిమి ఇది మన ఖర్మ " అంటూ ముక్కు చీదింది.
పనలు ఆరాక కుప్ప వేయకుండానే పంట నూర్పిడి చేసి పరిగ గింజలు కూడా ఒదలకుండ మొత్తం అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు నాయుడు. కడుపు మండిపోయింది తల్లి కొడుకులకి. వాలుకుర్చీలో కూర్చుని సిగిరెట్టు కాల్చుకుంటూ పంట లెక్కలు చూసుకుంటున్నాడు నాయుడు . "అయ్యా ! " అని పిలిచాడు కోటి.
" ఏమిరా కోటీ . నీ లెక్క కూడా జూస్తున్నా ! నీ బాకీ కొంత ఉండింది. ఈ ఏడు కూడా చేసేవంటే తీరిపోద్ది "అన్నాడు .
"అంటే ..ఇంక మూడేలు బాకీ పడ్డానన్నమాట" . అన్నాడు .
"ఏమిరో ..నీకు లెక్కలు బాగా వస్తుండాయ్ రాత్రి బడిలోకి పోతున్నావా ఏందీ ?"
"మా బతుకులకి బడోకటే తక్కువ . మా తమ్ముళ్ళకి రెండు పూటలా తిండే లేదు . మా యమ్మ నేను పొద్దుగాలం ఈడనే పని చేస్తా ఉండాము. అయినా పిల్లల నోట్లో గంజి కూడా లేదు. నాలుగు సేర్లు బియ్యం పోయమని అడిగినా లేవంటది ఊర్మిల్లమ్మ. మీ దగ్గర పంజేసేతప్పుడు మీరుగాక ఎవురప్పిస్తారు అప్పు మాకు? అందరూ బయట పంజేయడానికి పొతే రోజుకి నూర్రూపాయలు కళ్ళ జూస్తున్టిరి. నాకేమో ఏడాదికి ఆరు బస్తాల ఒడ్లు కొలిసేదానికి కష్టంగా ఉంది. . బత్తెం కొలిసే రోజల్లా తిడతానేఉంటది.ఊర్మిల్లమ్మ" నాయుడి కళ్ళల్లోకి చూస్తూ దైర్యంగా చెప్పాడు
"అయితే ఏమంటావ్ రా ! జీతానికి ఉంటానంటావా పోతానంటావా ! నీ యవ్వారం చూస్తే మానేసేటట్టే ఉన్నావ్ ! "
"మీ బాకీ దీరిందాకా మానేయ్యను లేయ్యా ! మా కష్టమేమిటో నీతో చెప్పాలని అంతే! పశువులని కాసుకొచ్చి పేడేత్తిపోసి పాలు తీసిచ్చేది నేను. కూటిలోకి మజ్జిగనీళ్ళు కూడా లేవంటారు. మావోసి చేపలు పట్టుకోచ్చేది నేను. పిత్తబరికెలు కూడా వండుకుని తినమని ఈయరు". తమ్ముళ్ళ కడుపాకలి, రోజు కూడు పెట్టె టప్పుడు ఊర్మిల్లమ్మ సణుగుడు అన్నీ గుర్తుకొచ్చి ఆవేశంగా అడిగేసాడు కోటి .
"మీ నాయన ఎన్నడూ ఇట్టా మాట్టాడలేదురా ! నీ నోరిట్టా పెగుల్తా ఉంది. విచిత్రంగా ఉందిరా కోటి " ఆశ్చర్యంగా అన్నాడు.
"ఇచిత్రమేముందయ్యా ! మా ఆకలి బాధిది. నా జీతం నెలకి ఒక బస్తా వడ్లు రెండొందల డబ్బులు , మా అమ్మకి నెలకి అయిదొందలు జీతం ఇస్తేనే పనికి వస్తాము . లేకపోతే ఏరే చోట చూసుకుంటాం." నిక్కచ్చిగా చెప్పేసాడు.
నాయుడు ఆలోచిస్తున్నాడు. కోటి లాంటి వొళ్ళుఇరగదీసుకుని పన్జేసేటోడు పల్లెంతా జల్లెడేసిపట్టినా దొరకడు. ఇన్నేళ్ళు ఆడిని పిల్ల పాలేరు లెక్కనే చూసి జీతం తక్కువిచ్చినా సరిపోయింది. మొన్నకారుకి పొలంలో పనిచేసినప్పుడు చూస్తుంటే ఇద్దరి లెక్క పని చేసాడు. అడిగినంత కాకపోయినా ఎంతో కొంత పెంచక తప్పదనుకుని "సరేలేరా కోటీ " నలుగురు ఎట్టా ఇస్తే అట్టాగే ఇస్తాను. పొద్దుటే వచ్చేయ్ " అన్నాడు.
"పన్జేసేట ప్పుడు ఒళ్ళు ఎట్టా దాచుకో కూడదో కష్టమైనప్పుడూ నోరట్టాగే దాచుకోకూడదని మా అయ్య చెప్పే వాడు. నీతోగాక ఎవరితో చెప్పుకోవాలయ్యా ! మా కష్టం నష్టం నువ్వే వినుకోవాల " అంటూ యజమాని పట్ల వినయం చూపించాడు .
అలాగే పదేళ్ళు కష్టపడి తమ్ముళ్ళు పెద్దై తలోదారి ఎతుక్కునేదాక నాయుడి దగ్గర విశ్వాసంగానే ఉన్నాడు. పదేళ్ళు గడిచి పోయాయి నాయుడు పిల్లలు పట్నం బోయి చదువుకున్నారు విదేశాలకి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు. పాత ఇల్లు స్థానే కొత్త డ్యూ పెక్స్ ఇల్లు వచ్చింది కోటికి పెళ్ళైంది ఇద్దరాడ పిల్లలు. ఇద్దరు బడికి పోతున్నారు . కోటి తల్లి చిలకమ్మ ముసలదై పోయి ఇంట్లో పనిపాటా చేసుకుంటూ ఉంటే కోటి పెళ్ళాం రాజ్యం నాయుడింట్లో పని జేయడానికి వెళుతుంది. వాళ్ళ బతుకుల్లో అంతే తేడా !
వానలు సరిగ్గా పడక పంటలు పండకపోయే సరికి పనినే నమ్ముకున్న వాళ్లకి పనిలేక చాలా మంది ఊరిడిసిపెట్టి పట్నం బాట పెట్టారు. వాళ్ళ లాగా ఊరిడిసి పోలేక నాయుడింటిని వదల లేక అత్తెసరు బ్రతుకు బ్రతుకుతానే ఉండాడు కోటి. కాస్తో కూస్తో బోరు క్రింద సాగు చేసేది నాయుడోక్కడే! ఏతేత కి వ్యవసాయం లాభసాటిగా లేదురా కోటీ ! అంటూనే సాగు చేస్తానే ఉన్నాడు. వానల్లేక కాలవలు రాక పొలాలన్నీ బీళ్ళు అయిపోయాయి. పశువులకి మేత కూడా దొరక్క కళ్ళ నీళ్ళతో కటికాళ్ళకి అమ్ముకున్నారు.
ఒరేయ్ .. కోటి .. కూలోళ్ళతో పంట కోపిస్తే ఏంమిగిలేటట్టు లేదురా ! అందుకే మిషన్ కోత కోపిచ్చేద్డామనుకుంటున్నాను ఏమంటావ్ .. అన్నాడు నాయుడు.
కోటి గుండెల్లో రాయి పడింది. కోతలొస్తున్నాయి బీద బిక్కికి పని దొరికి కొన్నాళ్ళకైనా కడుపునిండా కూడు దొరుకుద్ది అని ఆశ పడితే .. నాయుడు కోత మిషన్ అంటన్నాడు నాయుడు మిషన్ దారి బడితే మిగతావాళ్ళు ఊరుకుంటారా ?
నాయుడు లెక్కలేస్తున్నాడు. కోతకి ఎకరానికి పది మంది పడతారు పది నూట యాబైయ్యిలు పదునైదొందలు కుప్ప వేయటానికి ఆరుగురు ఆడాళ్ళు ఇద్దరు మగాళ్ళు పదిహేడొందలు కూలీ, కుప్ప తొక్కడానికి ఎకరాకి వెయ్యి రూపాయలు, మళ్ళీ తూర్పార బట్టడానికి ఖర్చు ఇవన్నీ లెక్కేసుకుంటే .. కోత మిషన్ తో కోపించడమే మేలు. మిషన్ లు చేలల్లోకి దిగినయ్యి . ఉన్న ఆపాటి పని పోయే! కోత మిషన్ లొచ్చి నోట్టోకి పోయే మెతుకులకి కోత పెట్టాయి.
పెద్ద పండక్కి అమెరికా నుండి వచ్చిన నాయుడు పిల్లలు వ్యవసాయం లాభసాటిగా లేదని రియల్ ఎస్టేట్ వాళ్ళకి సగం భూమిని అమ్ముకుని పోయారు. మిగతా సగానికి ఇనప కంచె వేసుకున్నారు. పశువులని అమ్మేసారు. ఇక కోటికి ఆ ఇంట్లో పనిలేకుండా పోయింది. పనిలేక చేతిలో చిల్లి గవ్వ లేక దినదినగండంగా మారడంతో కోటి కూడా పెళ్ళాం పిల్లల్ని తీసుకుని పట్నం బాట పట్టాడు.
నాయుడుకి బంధువయిన ఓ బిల్డర్ దగ్గర సైట్ వాచ్ మెన్ అవతారమెత్తాడు. పట్నం వచ్చినా పస్తులుండక తప్పడం లేదు. నెలకి రెండు వేలోస్తే ఏ మూలకి సాలడం లేదు. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ కే పంపుతున్నా రోజుకో పుస్తకమంటారు పెన్నంటారు. రాజ్యం ఇళ్ళల్లో పనులు చేయడానికి వెళతా ఉంది. అయినా నలుగురి నాలుగేళ్ళు నోట్టోకి ఎల్లడం కష్టంగానే ఉంది. పద్దాక తల్లిమాట గుర్తుకొస్తుంది. పేదోడి కష్టం పెదవికి చేటు రా కోటీ ! మన కష్టం ఇలువ నీళ్ళలో కూడ ఉడకదు. పెట్టి పుట్టినాళ్ళకి పాలల్లో ఉడుకుద్ది అదంతే " అని. గతం జ్ఞాపకాలతో రాత్రంతా నిద్రలేని కోటి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూశాడు.
తెల్లారగానే బయలెల్లి తల్లిని చూసి రావాలనిపించింది ఊరి మీద బెంగ పుట్టుకొచ్చింది.. "ఊరికెళ్ళొ స్తానే రాజ్యం. నాయుడడిగితే ఏదో ఒకటి చెప్పు ... అని చిరు చీకట్లోనే బయలుదేరాడు . బస్ చార్జీకి డబ్బులు కూడా లేవు. తన పాత డొక్కు సైకిలేసుకునే బయలుదేరాడు. దారి పొడుగూతా రోడ్డు ప్రక్కగా అంతస్తులు అంతస్తులు వేస్తున్నారు. అందులో కొన్ని కాలేజీలు, కొన్ని జనముండే ఇళ్ళు. ఎక్కడా పంటపెట్టిన ఆనవాలే కనబడలేదు.
తార్రోడ్డు దాటి ఊరి బాట పట్టాడు. పచ్చగా కళకళలాడే పొలాలన్నీ ముక్కలు ముక్కలుగా విడకొట్టి రాళ్ళు పాతేసి ఉన్నాయి ఆ రాళ్ళకి పచ్చరంగు,తెల్ల రంగు రాళ్ళు దూరానికి కూడా కనబడుతూనే ఉన్నాయి బస్ రావడమే గగనమయిన ఆ వూరి రోడ్డులపై ఎడతెరిపి లేకుండా తెల్లటి పడవలాంటి కార్లు ఎర్ర దుమ్ము కొట్టుకుని తిరుగుతూ ఉన్నాయి. తెల్లటి బట్టలేసుకున్న కొత్త కొత్తవాళ్ళు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ తెగ తిరిగేస్తున్నారు .
ఎలా ఉండేది ఊరు !? కోటికి లోలోపల నుండి బాధ తన్నుకొస్తుంది పచ్చటి వనంలాంటి ఊరు, సీతాకోక చిలకల్లా మనుషులు తిరిగే వూరు ఊరంతా బోసిపోయి ఉంది. ముసలి ముతక తప్ప ఎవరూ లేరు ఊళ్ళో ! ఇంటి ముందుకి పోయి "అమ్మా ! పిలిచాడు. చిలకమ్మ పలకలేదు. తలుపు తోసుకుని లోపటికెళ్ళాడు. అమ్మా .. చేత్తో తట్టి పిలిచాడు. తల్లి కళ్ళల్లో ఏదో వెలుగు. "కోటీ ..వచ్చావా ? దీపాల అమాస వచ్చేస్తుందిరా. వరి కోతకోయ్యాలి. లేకపోతే వాన కురిసి పంటంతా నీళ్ళ పాలై పోద్ది. నాక్కూడా ఒక కొడవలియ్యి. చిన్నోల్లని కూడా చేలోకి రమ్మను,వాళ్ళు పనలన్నీ గుట్ట మీదకి మోస్తారు" అంటుంది చిలకమ్మ. తల్లికి మతి భ్రమించిందని అర్ధమయింది కోటికి. "అట్టాగే అమ్మా అట్టాగే! " అన్నాడు.
తల్లిని లేపి కూర్చో బెట్టాడు. ప్రక్కింటి పిన్నమ్మని పిలిచి నీళ్ళు పోయించి ఉన్నదాంట్లోనే మంచి చీరని కట్టించాడు. తల్లి చిరుగు చీరలని మూట కట్టుకుని వెనుక కేరేజీ పై పెట్టి ముందు సీటులో తల్లిని కూచ్చోబెట్టుకుని పట్నానికి తిరుగు ప్రయాణమయ్యాడు కోటి.
దారిలో నాయుడు కనబడి "మీ అమ్మకి పిచ్చి బట్టిందిరా! పట్నంలో పెద్దాసుపత్రిలో చూపిచ్చు. డబ్బులీయబడలా, ఊరికే చూస్తారు " అన్నాడు .
"వద్దులేయ్యా ! ఆ పిచ్చిలోనే ఆమెని సుఖంగా బతకనీ, ఈ పిచ్చి బతుకుల వైనం ఆమెకి తెలిస్తే గుండాగిపోద్ది" కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.
(ఉషోదయ వెలుగు త్రై మాసిక పత్రికలో నవంబర్ -డిసెంబర్ సంచిక లో వచ్చిన కథ )

1 కామెంట్:
Touching. Unfortunately still such experiences are present in villages. Excellent narration.
కామెంట్‌ను పోస్ట్ చేయండి