29, జనవరి 2016, శుక్రవారం

నా కెరుకగాని ప్రేమబాష

నా కెరుకగాని ప్రేమబాష


రోజూ దీపం కొండెక్కి పోతుండగా
అసహనపు ఆనవాళ్ళని విదుల్చుకుంటూ
బెట్టు చేస్తున్న నిదురమ్మని 
రారమ్మని బలవంతం చేస్తూ

మూసుకునే రెప్పల మధ్యగా 
నిన్ను కనులలో నింపుకుంటూ
మనసులో  వేయినొక్కటోసారిగా తలచుకుంటాను

దూరం తగ్గిపోయే క్షణం 
ఎన్నడొస్తుందోనని నిట్టూరుస్తూ
దుప్పటి కప్పుకున్నట్లు 
మనసు కప్పుకోవడం చేతకాక ఏమో
 కన్నీటి ధార చెక్కిళ్ళని దాటి 
దయతో ప్రక్కని తడిపెళ్లింది

ఒక ఘడియ తర్వాత  ఆలాపన
నా తలని నువ్వు చెయ్యేసి నిమిరినట్లు
ఆ అనురాగపు స్పర్శ కి 
ఎక్కడో ఏటి మధ్యన పక్షి రెక్కలు
విదిల్చిన చప్పుడు నాలో
ఉలికిపడ్డాను అటునిటు పొర్లినా 
ఆగని అలజడి

అప్రయత్నంగా పలకల పెట్టె ని తెరిచాను
అక్కడ నాకోసం ఓ .. ప్రేమ సందేశం
కాచుకుని కూర్చుంది  అందులో
ఎవరూ నేర్పకుండానే 
నువ్వు నేర్చుకున్న పాఠం ఉంది
అంతకు మించిన నిజమేదో దాగుంది
ప్రకటించే బాష తెలిసి ఉంది
అంకితమిచ్చేందుకు తగిన అర్హత ఉంది
కను చెమరింతల మధ్య 
నడిరేతిరి విరిసిన పద్మంలా 
ముఖం విచ్చుకున్నట్లు
నాలో నవ జీవం తొణికిస లాడుతున్నట్లు 
నాకు నేనే  కొత్తగా

ఈ ఎడారి జీవికి  
ఒయాసిస్ వెతుక్కునే  యాతనలేదు
చీకటిని చీల్చే కిరణాలని 
ఆహ్వానించే తపనలేదు
పేగు తెంచుకు పుట్టిన బిడ్డడి అండే చాలు
అన్నివేళలా 
అమ్మయి లాలించే  చల్లని స్పర్శ చాలు

కంటి నిండుగా మది నిండగా
ఒకే ఒక్క చంద్రుడి వెన్నెల వెలుగు చాలు
మా నిఖిల చంద్రుడి అనురాగమే  చాలు

నా కెరుకగాని  ఈ ప్రేమ బాష ఇంత గొప్పదా కన్నా !


అమ్మకే  గురువై  నేర్పావా నాన్నా!?





(ప్రేమ ఎప్పుడు ప్రకటిస్తూ ఉంటేనే ఆనందం కల్గుతుంది. ప్రకటించని ప్రేమ ఎంత గొప్పదైనా నిష్ప్రయోజనమే)

నిన్నటి రాత్రి నా మానసిక స్థితి..  చిత్రంగా,  ఖచ్చితంగా అదే సమయానికి నా కొడుకు నాకు పంపిన ప్రేమ సందేశానికి ఈ స్పందన

కామెంట్‌లు లేవు: