27, జూన్ 2021, ఆదివారం

ముద్దు బంగారమే..

 💕నిహిర బంగారమే💕


ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే 

చిన్ని బంగారమే తల్లి జినుగు బంగారమే 

ముప్ఫై మూడొంకర్ల మూతి వయ్యారాల 

ముప్పొద్దు మురిపాల మేలిమి బంగారమే   

ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే 


రెప్పలు కొంచెం ఎత్తి చూసిందంటే

కనబడే మోము నిండు బంగారమే తల్లి 

యిట్టే చప్పున  కళ్ళు చిలిపిగ చికిలించేసి 

అప్పుడప్పుడు అదును జూసి రాగాలు తీసి 

అంతలోనే గుప్పెడు గారాలొలకబోసి 

ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే


పెడ చూపు చూసేమంటే  అలవిగాని అలక జూపి 

ఆవైపు చూళ్లేదంటే చుర్రున చినబోతుందీ చిలక  

పోరు బంగారమే పిసరంత హోరు బంగారమే 

నిహిర పేరు బంగారమే చిత్కళ తీరు బంగారమే 

ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే


చిట్టి పాదాలెత్తి  నాన్న గుండెలను తంతుంటే నాన్న 

తనువంత మురిసేను వాత్సల్యం వర్షమై కురిసెను  

అమ్మ జుట్టును పీకుతూ వుంటే ఆమెకు పట్టలేని పులకింతై 

ఆ కనుల వెలుగు పుత్తడి పూవులై మెరిసేను    

ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే 


మణితునకలంటి గోళ్ల కొనల తోటి అత్త

తన పాల చెక్కిళ్లు  మీటుతుంటే పాపాయి చెప్పెను 

అర్దమవని కబుర్లు అనేకమ్

ఆకలి అయ్యిందంటే అరక్షణం ఆగక 

ఆగమేఘాలపై అమ్మ ఉరికి రాకుంటే కనుమీను దోయి 

కనక ధారలు గట్టి ఇల్లంతా తడిసింది 

బొజ్జ నిండిన తడవునే ఆ తడిసిన మోము 

వజ్రపు తునకలా తళుకున మెరిసేను 

తిక్క బంగారమే నువుగింజ ముక్కు బంగారమే 

బుగ్గ బంగారమే ఇంచక్కని చుక్క బంగారమే


ఆదిభిక్షువుకు జ్ఞాన భిక్ష పెట్టిన అమ్మ  బంగారమే 

కరుణించేను ఆ తల్లి మా ఇంట తన రూపున  

మా చిత్కళ  తల్లి బంగారమే

మా ఇంట వెలసిన  మాట బంగారమే    


ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే 

నిహిర బంగారమే మా చిత్కళ తీరు బంగారమే..

ముద్దు బంగారమే మా అమ్మ మినుకు బంగారమే

చిన్నితల్లి బంగారమే నా తల్లి బంగారమే..


అన్న ప్రసాద స్వీకరణ (అన్నప్రాసన) సందర్భంగా ... 

ప్రేమతో.. నాయనమ్మ 25/10/2020. విజయదశమి.






కామెంట్‌లు లేవు: