ఉదయం తొమ్మిది గంటలైనా కాలేదు సూరీడు మహా వేడిమీద ఉన్నాడు. వంట గదిలో విజిల్ వేస్తూన్న కుక్కర్ తో పోటీపడుతూ కిటికి ప్రక్కనే పెరిగిన మామిడిచెట్టుపై కోయిల కూస్తుంది . తనూ స్వరం కలపబోయిన ఆమె తన అత్తమామలు ఉన్నారన్న సంగతి గుర్తుకొచ్చి వుత్సాహాన్ని గొంతులోనే అణిచేసుకుంటూ "వసంతంలో కూయాల్సిన కోయిల ఆషాడం చివరిలో కూడా కూస్తుంది వానకారు కోయిల అంటే యిదేనేమో ! " అనుకుంటూ వాయిస్ రికార్డర్ ఆన్ చేసి కిటికీ ప్రక్కనే పెట్టింది. అప్పటిదాకా తెగ సందడి చేసిన కోయిల కూయడం మానేసింది. ఓపికగా వో అయిదు నిమిషాలు వేచిచూసాక మళ్ళీ కోయిల పాట మొదలెట్టింది కానీ ఆ పాటెందుకో విషాదంగా అనిపించింది, అప్పటిదాకా వగరు చిగురులు తిని గొంతు మంటత్తిందేమో ! రికార్డ్ ని సేవ్ చేయకుండా వదిలేసింది అక్కడ నుండి తన గదిలోకి వచ్చింది వెన్నెల.
విశాలమైన కిటికీ దగ్గర నిలబడి బయటకి చూపు సారించింది ఆమె. చూపు చిక్కుకుపోయిన చోట లేలేత వేపకొమ్మల మధ్య పూచిన పూత. ఆనందంతో మొహం విప్పారింది మళ్ళీ అంతలోనే అరె ! యిప్పుడు పూసింది యేమిటీ ? ఉగాదికి కదా పూయాల్సింది. మొన్నటిదాకా పండిన కాయలు రాలుతూనే వున్నాయి కదా ! తర్వాత అత్తయ్యని అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ కనుచూపు మేరా చూసింది . ఇందాకటి కోయిల కాకుండా మరో రాగిరంగు రెక్కల కోయిలొకటి కొబ్బరాకుని చీల్చి యీనెని ముక్కున కరుచుకుని పోయి మామిడి కొమ్మలపై వుంచింది, బహుశా గూడు కడుతుంది కాబోలు. గుడ్లు పొదగని కోయిలకి మురిపెంగా పిల్లలని పెంచలేని కోయిలకీ గూడెందుకో ! నిరాశగా అనుకుంది.
మధ్యాహ్నం యెప్పుడైందో అత్తమామలు యెప్పుడు భోజనం చేసారో ప్రొద్దు పడమటికి యెప్పుడు మారిందో యేమి తెలియదు. జీవితంలో యేర్పడిన స్తబ్ధతని పూరించుకోవడానికి ఆమెకి లభించిన వరం తోటే అన్నట్లు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతుంది ఆమె.
సాయంత్రం తోటంతా సందడిగా వుంది. ఎటు చూసినా సీతాకోక చిలుకల విన్యాసాలే ! చెట్లపై నివాసముండే రకరకాల పక్షులు అందులో యె౦తో చిన్నవి బుల్బుల్ పిట్టలు యెంత ముద్దుగా వున్నాయో ! క్షణం కుదురుగా ఉండవు వేప చెట్టు మీద నుండి సంపెంగ పూల చెట్టుపైకి సంపెంగ చెట్టుపై నుండి పారిజాతం చెట్టుపైకి చక్కెరలు కొడుతూనే ఉంటాయి. వాటి మధ్య వుడుతలు కిచ కిచమని శబ్దాలు చేస్తూ హడావిడిగా తిరుగుతూ జామకాయలు కొరుకుతూ కాసేపు, నేరుడు పళ్ళని తింటూ కాసేపు జీవన మాధుర్యాన్ని అనుభవిస్తున్నాయి. వేప చెట్టు కొమ్మకి పెద్ద తేనెపట్టు . ఎక్కడెక్కడో తిరిగి సేకరించుకున్న మకరందాన్ని భద్రంగా దాచుకున్నాయి. ఏ స్వార్ధపు కళ్ళు దానిపై పడకపోవడం మూలంగా ఆనందంగా జుర్రుకుంటున్నాయి.ఎంతదృష్టమో ఈ తేనెటీగలకి. అవును యిన్ని వున్నాయి, రామ చిలుకలు లేవేంటి యీ తోటలో ? చిలుకలు వాలని చెట్టెక్కడైనా వుంటుందా ? అలాగే పావురాలు కూడా ! సృష్టిలో మానవుడికి తప్ప అన్ని ప్రాణకోటికి ఆనందాలున్నాయి. ఎటు తిరిగి మానవుడు ప్రకృతిని తన స్వార్ధం కోసం నాశనం చెయ్యనంతవరకూ. తోటకావలి వైపు రోడ్డుకి ఆనుకుని కార్లని బైక్ లని డిస్ట్రిబ్యూట్ చేసే ఓ పెద్ద కంపెనీ వాళ్ళు కార్ డ్రైవింగ్ స్కూల్ పెట్టారు . అంతకు క్రితం ఈ స్థలంలో సర్వీసింగ్ స్టేషన్ వుండేదట . ఈ లోపలికి అంతగా యెవరూ రాక పోవడం మూలంగా యీ మాత్రం ఆనవాలైనా మిగిలింది అంటూ తనలో తనే గొణుక్కుంది.
రాత్రి యింటికొచ్చిన కొడుకుతో పిర్యాదుని వినిపిస్తుంది ఆమె అత్తగారు
"కంటికెదురుగా కరంట్ బోర్డులకి కందిరీగలు అన్ని గూళ్ళు పెట్టి రొదగా తిరుగుతున్నా పట్టించుకోదు, టాయిలెట్ కిటికీకి దోమతెరకి మధ్య ఉడుతలు గూడు కట్టి పిల్లలని పెంచుతున్నా పట్టించుకోదు . పెళ్లై అయిదేళ్ళు నిండింది కడుపున ఒక కాయైనా కాయలేదు. హాస్పటల్ కి వెళ్లి చూయించుకుని మందూ మాకు వాడదాం అని లేనే లేదు. వంట పని అయిపోతే చాలు గదిలోకి వెళ్ళి తలుపులేసుకుంటుంది. ఎప్పుడూ పుస్తకాలు చదవడం పిచ్చిగీతలు గీయడం యిదేనా పని ? కొడుక్కి భోజనం వడ్డిస్తూ విసుక్కుంటుంది.
కాసేపటి తర్వాత లోపలికొచ్చిన శశిధర్ "ఎంత సేపూ ఆ మాను మాకుతో మాటలేనా ! కాస్త మనుషులతో కూడా మాట్లాడొద్దూ ! "
చురుక్కుమంటూ చూసింది
"అమ్మ బాధపడుతుంది కాసేపు బయటకొచ్చి కూర్చోని పెద్దవాళ్ళతో మాట్లాడుతూ టీవి చూడొచ్చుకడా !" అన్నాడు.
" వాళ్ళతోయేనా నేను మాట్లాడటం ? మీరు నాతో మాట్లాడరా, నే చెప్పిన మాటలు వినకూడదా ? అయినా నోట్ల కాయితాల చప్పుడుకి అలవాటు పడిన మీకు నాతో యేమి మాటలుంటాయి లే ! " అందే కాని కిటికీని వొదిలి యివతలకి రాలేదు . ఒక్క క్షణం ఆలోచించినతను చిన్నగా ఆమె ప్రక్కకొచ్చి నిలుచున్నాడు తనూ బయటకి చూసాడు . కటిక చీకటిలో తోటంతా నిశ్శబ్దంగా వుంది కొబ్బరాకుల మధ్య నుండి వేప కొమ్మల పైనుండి కనబడుతున్న ఆకాశంలో వెలుగుతున్న నవమినాటి చంద్రుడు . అక్కడక్కడా కనబడుతున్న చుక్కలు.
" ఈ ఇల్లు చూసినప్పుడు నువ్వెంత సంబరపడ్డావో నాకింకా గుర్తుంది. ఈ మహా నగరం నడిబొడ్డున యిలాంటి తోట, తోట ప్రక్కనే యిల్లూ మూడంతస్తులు యెత్తున పెరిగిన చెట్లు కిటికిలో నుంచి కనబడే చందమామ కాస్త అద్దె యెక్కువైనా నీ కోసం భరించాలనుకున్నాను కదా ! " గుర్తు చేసాడతను. తల వూపింది ఆమె .
ఈ చక్కని చుక్కకి ఆ చంద్రుడితో కబుర్లు ఎందుకు ? ఎదురుగా ఈ చంద్రుడుండగా అంటూ ఆమె మెడ వొంపులో తమకంగా తలాన్చాడు. ఆ మాత్రం సామీప్యతకే ఆమె తనువూ త్రుళ్ళింది మనసూ వొరిగింది. చాలా కాలం తర్వాత ఆమెకి వశమయ్యాడతను. . నువ్వే నా నా వెన్నెల పురుషుడివి అడిగింది లతలా అతన్ని మరో మారు అల్లుకుంటూ .
"నీకొక నిజం చెప్పాలి, విన్నాక నువ్వు బాధ పడకూడదు యెవరికీ చెప్పకూడదు ఆ రహస్యం మన మధ్యనే ఉండాలి " ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడతను .
ఏమిటి అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించింది వెన్నెల
"మనకి ఐ మీన్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. అందరూ నీలో లోపం వుందేమోనని అనుమానపడుతుంటే విని నువ్వెక్కడ బాధపడపడతావోనని నేనే అన్ని టెస్ట్ లు చేయించుకున్నాను. ఏ మాత్రం పిల్లలు పుట్టే అవకాశంలేదని డాక్టర్స్ చెప్పేశారు." చెప్పాల్సిన విషయం చెప్పేసి అతను వూపిరి పీల్చుకున్నాడు .
ఆమెలో కల్గిన ఆశాభంగం అతనికి కనబడనీయకుండా అతన్ని అల్లుకున్న చేతులని వదలకుండా అలాగే ఉంచింది
ఆమె మౌనం చూసి "పోనీ యింట్లో వాళ్లకి తెలియకుండా "ఆర్టిఫిషియల్ ఇన్ సెమినేషన్ ద్వారా ట్రై చేద్దామా ! నాకేం అభ్యంతరం లేదు" అన్నాడతను . ఆమె అడ్డంగా తల ఊపింది . కళ్ళల్లో నీళ్ళు కనబడకుండా అతని గుండెల్లో తలదాచుకుంది. ఆమెనలాగే పొదివిపట్టుకున్నాడతను.
తెల్లారిందో లేదో అతని అమ్మ “ అబ్బాయ్ ! ఈ యింట్లో మేముండలేమురా ! ఇంటికి వెళ్లిపోతాము అంటూ ఖండితంగా చెప్పేసింది. “ఎందుకనమ్మా !? నీ కోడలు వల్ల యేమైనా కష్టంగా ఉందా ? బాగా చూసుకోవడం లేదా ?” కంగారుగా అడిగాడు .
మీ ఆవిడకి పలుకే బంగారం . ఓ మాట మంచి లేని యింట్లో సౌకర్యాలెన్ని అమర్చినా, నవకాయ పిండి వంటలు వడ్డించినా వుండలేము రా ! ఇల్లన్నాక ఓ పిల్లా పీచు అన్నా ఉండొద్దా ! ఆమేమో ఆ గదిలో, నువ్వేమో డబ్బు రంధిలో. ఎన్నాళ్ళు గోడలతో, టీవితో మాట్లాడుకుని బ్రతుకుతాము మీ నాన్నకి యిక్కడ తోచుబడి కావడం లేదంట, మేమిప్పుడే వెళ్ళిపోతాం అంది .
వెన్నెలతో యీ విషయం చెప్పినా పెద్దగా స్పందించదు . ఎప్పుడూ తన లోకం తనదే గానీ .. ఎవ్వరిని పట్టించుకోదే ! మనసులో విసుక్కున్నాడు. తల్లి తండ్రి వూరెళ్ళి పోయాక అతను బయటకెళుతూ
వంట చేసుకుని వేళకి తిను . ఎప్పుడు కిటికీ దగ్గరే నిలబడి వుండకుండా రెస్ట్ తీసుకో ! సాయంత్రం పెందలాడే వచ్చేస్తాను మూవీ కెళ్ళి బయటెక్కడన్నా డిన్నర్ చేసి వద్దాం అని చెప్పి వెళ్ళాడు .
శశిధర్ కోసం యెదురు చూసి చూసి అలసిపోయి నిద్రపోయింది . అతనెప్పుడో వచ్చి పడుకున్నాడు . ఎన్నోసార్లు సారీ చెపుతూనే నిన్నటిలా కాదు ఈ రోజు త్వరగా వచ్చేస్తాను . నువ్వు నీ ఆలోచనల ధోరణిలో ఉండి తలుపులు కూడా సరిగ్గా వేసుకోవు కదా ! పోన్లే, నేనే డోర్ లాక్ చేసుకుని వెళతాను అనేవాడు వుదారంగా .
అలా రోజులు, నెలలు గడచి పోతూనే వున్నాయి . వెన్నెలకి కిటికీయే ప్రపంచమూ అయిపపోయింది . కాంతి విహీనమైన కళ్ళు, శుష్కించిన దేహం, మౌనంగా యంత్రంలా మారిపోయింది . ఆమెని చూసి అతను జాలి పడ్డాడు . ఆమెకి యేమివ్వాలో అతనికి తెలుసు, యివ్వలేని నిస్సహాయత తెలుసు . పై పై మెరుగుల కోసం అప్రతిహతం అర్రులు చాస్తూ పరిగెత్తడమే తప్ప నెమ్మళంగా జీవనసారాన్ని జుర్రుకోవడం చేతకానితనంతో సిగ్గుపడుతున్నాడు . ఎలాగోలా నాలుగు రోజులు తీరిక చేసుకుని ఆమెకి ఇష్టమైన సాగర సంగమ ప్రదేశానికి తీసుకు వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణంలో చిన్న చిరునవ్వు కూడా లేని ఆమె ముఖం చూస్తే మనసంతా యేదోలా అయిపొయింది . కానీ ఆ నదీ సాగర సంగమం చూడగానే ఆమె ముఖం విప్పారింది. "ఇక్కడికి నిన్ననే నేను అతను వచ్చాం "అంది .
"నిన్నవచ్చావా, యెవరితో ?" అడిగాడు అయోమయంగా .
"అదే అతనే నా వెన్నెల పురుషుడు" అంది ఆమాట చెపుతున్నప్పుడు ఆమె ముఖంలో ఏదో తెలియని వివశత్వం
"అవునా! అది నేనేగా ! "చిన్న నవ్వు అతని పెదాల పై .
"ఊహు నువ్వు కాదు. అతను అతనే ! "
"అతనెలా ఉంటాడు!? యెక్కడ ఉంటాడో తెలుసా ? "
తెలుసు తోటలో వుంటాడు . గుర్తుకు తెచ్చుకున్నట్లు కాసేపాగి చెప్పింది . అవును కొన్నాళ్ళ క్రితం మన యింటెనుక తోటలోకి వొక పురుషుడొచ్చాడు. అతన్ని చూస్తుంటే కవులందరూ మగవాళ్ళని సింహంతో యె౦దుకు పోల్చారో అని చిరాకు కల్గింది . పొడుగు పొట్టి కాని ఎత్తు. క్రిందికి పైకి ఒకే మందంతో తెల్లని బట్టలతో దర్జాగా ఉంటాడు అతని నడక చాలా ఠీవిగా ఉండేది. చందమామ లాంటి గుండ్రటి మొహం,విశాలమైన నొసలు, అందమైన కళ్ళు ఆ కళ్ళని చూస్తే చాలు దీపాలు వెలుగుతున్నట్టు ఉండేవి. ఆ చూపులతో మరి కొన్ని దీపాలు వెలిగించుకోవడం అంటే యేమిటో నా కళ్ళు వెలుగుతుంటే అర్ధమయ్యింది. అతను పెదవి విప్పి మాట్లాడే వాడే కాదు అతనిది దేహబాష . కళ్ళతోటే కథలు చెప్పేవాడు. నాకు చంద్రుడంటే వున్న యిష్టాన్ని యెలా కనిపెట్టాడో ! వెన్నెల వాన రెండు కలసి కురుస్తున్నపుడు నన్ను జలకాలాటకి తీసుకు వెళ్ళేవాడు. అధర రుధిరంలో పట్టు తేనే రుచి చూపిన వాడు. వెన్నెల్లో కల్గిన వేడిని మృగ చూర్ణ లేపనం పూసి సాంత్వన చేకూర్చిన వాడు. నాకు యె౦తగానో నచ్చాడు . మేమిద్దరం భూత భవిష్యత్ కాలాన్ని మరిచి వర్తమానంలో జీవించిన అమృత ఘడియ లవి "
"నువ్వేమైనా కథ చెపుతున్నావా ? లేక కవిత్వం వినిపిస్తున్నావా? నీ భాష అర్ధం కాక చచ్చిపోతున్నా! మామూలు మూడ్ లోకి వచ్చెయ్యి, వింటుంటే చిరాగ్గా ఉంది " విసుక్కున్నాడతను
నేను నిజమే చెపుతున్నా ! మేమిద్దరం కలసి యెన్నో రాత్రులు నదీ విహారానికి వెళ్ళాం . చల్లని రాత్రిలో మంద్రంగా ప్రవహించే నది పాయ ప్రక్కన రెల్లుపూల పొదల మధ్యలో యిసుక తిన్నెలపై ఆ వెన్నెల పురుషుడి సాంగత్యం నాకు బాగా నచ్చింది ! ఎన్నో సార్లు గుజ్జనగూళ్ళు కట్టుకుని ఆడుకున్నాం . జలకాలడుకున్నాం, పడవెక్కి ఆ తీరానికి యీతీరానికి చక్కర్లు కొట్టాము. లంక తోటల్లో పూసిన పూలతో దండలల్లుకుని వొకరినొకరు అలంకరించుకున్నాం. ఆకుల గుసగుసల వింటూ హాయిగా నవ్వుకున్నాం. విరిసయ్యల పై వూసులాడుకున్నాం. ఒకొరికొకరు దేహాన్ని కానుకగా యిచ్చుకున్నాం . స్త్రీ పురుషుల మధ్య అంత కన్నా విలువైన కానుకలేముంటాయి ? మా యిరువురి దేహాలు మాట్లాడుకున్నాయి పోట్లాడుకున్నాయి అలసిపోయాక వొకటినొకటి సేద దీర్చుకున్నాయి ఆ అనుభవం యెంత బావుందో! ఎప్పుడూ వండుకోవడం, తినడం, సంపాదించుకోవడం, పడుకోవడం యింతేనా జీవితం !? కాస్త ఆత్మకి అనుభూతి నైవేద్యం పెట్టోద్దూ !
ఆమెసలు సృహ లో వుండే మాట్లాడుతుందా ? వింటున్న అతనికి యేదో తెలియని భయం కల్గింది . వెనుక తోటలోకి వచ్చే పురుషులతో యెవరితోనైనా పరిచయం పెంచుకుని తను బయటకెళ్ళ గానే నచ్చినతనితో కలసి తిరిగి వస్తుందా ? అనుమానం వచ్చింది . మళ్ళీ అంతలోనే ఛ ఛా.. తనెప్పటకీ అలా చేయదు . అయినా తనేగా రోజూ మెయిన్ డోర్ లాక్ చేసుకుని వెళుతున్నాడు . మళ్ళీ అంతలోనే అనుమానం . డూప్లికేట్ కీ వుందేమో అమ్మనడిగి తెలుసుకోవాలి "అనేకమైన అనుమానాల మధ్య "ఇక వెళ్ళిపోదాం రా " అంటూ ఆమెని బలవంతంగా తీసుకోచ్చేసాడు .
ఇంటికొచ్చాక సరాసరి గదిలోకి వెళ్లి ఆమె నించునే కిటికీ దగ్గరి వెళ్ళి పట్టి పట్టి పరీక్షించాడు . దోమ కూడా దూరే సందు లేదని నిర్ధారించుకున్నాక కొంచెం రిలీఫ్ గా ఫీలయ్యాడు . ఆమె మాములుగానే వంట చేసింది యిద్దరూ కలసి భోజనం చేసారు. ఆమె చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటుంటే కొన్ని నిజంగా జరిగినట్లు అనిపిస్తున్నాయి జరగనట్లు అనిపిస్తున్నాయి . నిద్ర రాక అతను అటునిటు మెదులుతూ వుంటే ఆమె హాయిగా నిద్రపోయింది . నిద్ర పోతున్న ఆమె ముఖం చూసి పాపం పిచ్చిది .. పొద్దస్తమాను కథలు, కవిత్వం చదువుతూ వుంటుంది. అదే లోకంలో వుంటుంది , ఆమె మాటలు పట్టించుకోకూడదు అనుకుంటే కానీ అతనిని నిద్రా దేవి కరుణించలేదు .
ఉదయాన్నే నిద్ర లేచిన అతనికి ఆమె చూపులతో తోటంతా వెదుకుతున్నట్లు కనబడింది . ఏమిటీ యిక్కడే నిలబడి ఉన్నావ్ ? టిఫిన్ రెడీ చేయలేదా ! అడిగాడు .
అతనొచ్చి రాత్రంతా నాకోసం వెతుక్కుని వుంటాడు. మళ్ళీ రాత్రి దాకా అతను కనబడడేమో ... దిగులుగా మంచం మెక్కింది. అతనికి వెంటనే యే౦ చేయాలో అర్ధమైంది .
"డాక్టర్ నేను బాగానే వున్నాను కదా ! నాకు యే వైద్యమూ వద్దు . నాకు నా వెన్నెల పురుషుడు కనిపిస్తే చాలు . అతన్ని వెతుక్కోవడానికి వెళ్ళనీయకుండా నన్ను యిలా బందించివేస్తే ఎలా ?" గిన్జుకుంటూ వొదిలితే చాలు పారిపోయేటట్లు ఉంది
చూడమ్మా వెన్నెలా నిన్ను అతని దగ్గరకే తీసుకు వెళతాను కానీ "అతనెక్కడ వుంటాడో తెలుసా !? " డాక్టర్ ప్రశ్న
" తెలుసు, అతను నేను రెక్కలున్న కారులో యెవరికీ కనబడకుండా అలా నదీ తీరం వెంబడి ప్రయాణం చేసి చేసీ సముద్ర తీరానికి చేరుకున్నాం. పున్నమి వెన్నెల్లో అలలఘోషతో పోటీ పడి పాటలు పాడుకున్నాం కెరటాలతో ఆడుకున్నాం .అలా యీ ప్రపంచంతో పని లేకుండా ఆడి పాడి అలసి పోయే దాకా ఆ వెన్నెల రాత్రుల్లో విహరించాం. తిరుగు ప్రయాణమయ్యాం. అలా పదునాలుగు రోజులపాటు ప్రయాణం చేస్తూ వుండగా వుండగా అలసి పోయానేమో, సోలి అతనిపై వాలిపోయానేమో! ఒక పగలు వొక రాత్రి నాకసలు మెలుకువే రాలేదు కళ్ళు విప్పి చూస్తే నా వెన్నెల పురుషుడు నా ప్రక్కన లేడు యెటు మాయమయ్యాడో యేమో ! ఎంత వెదికినా కనబడలేదు . నా వెన్నెల పురుషుడు నాక్కావాలి కొసరి కొసరి వడ్డించే అతని తీపి ముద్దుల ఆహారం లేకుండా నేను యెలా జీవించేది ? జీవించిన క్షణాలని నేను యెలా మరిచేది ? నేను చచ్చిపోతా, నన్ను వొదిలేయండి, వొదిలేయండి గింజుకుంటుంది ఆమె .
డాక్టర్ ఆమెని మరింత మాట్లాడించే ప్రయత్నం చేస్తూనే వున్నాడు.
"డాక్టర్ గారు నా కోడలి సంగతి ఏమిటి ? ఆమె యె౦దుకలా మాట్లాడుతుంది ? రెండు నెలల నుండి మంచం పై అలా పడి వుండటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం చూస్తుంటే ఏ దెయ్యం పట్టిందోనని భయమేస్తుందండీ ! ఇలా జరుగుతుందని తెలిస్తే వొంటరిగా వుండనిచ్చేదానిని కాదు." అత్తగారు కన్నీళ్ళతో
"మీరేమి కంగారు పడకండి . ఆమెకి మంచి వైద్యం చేస్తున్నాం . మీతో కూడా కొన్ని విషయాలు మాట్లాడాలి. ట్రీట్మెంట్లో భాగంగానే లోపలి రండి అంటూ అత్తగారిని కన్సల్టింగ్ రూమ్ కి తీసుకుని వెళ్ళారు. మీరు శశిధర్ కి తల్లికదా ! “అవునండీ ! నా పేరు విమల ‘అని పరిచయం చేసుకుంది.
మీకొక విషయం చెప్పాలి విమల గారు . మీ కోడలు వొక రకమైన మానసిక వ్యాధితో బాధపడుతుంది. ఆమెకి మీ అబ్బాయి ద్వారా పిల్లలు కలిగే అవకాశమే లేదు. మీ అబ్బాయి కూడా భార్యతో చాలా తక్కువ సమయాలు గడుపుతూ ఆమెని నిర్లక్ష్యం చేస్తున్నాడు. మీరేమో పెళ్ళైన యిన్ని సంవత్సరాలకి కూడా తల్లి కాలేదన్న నెపం వేస్తున్నారు. ఆమె అది తట్టుకోలేక మానసికంగా దెబ్బతింది. ఆమె మాములు మనిషి కావాలంటే మీ సహకారం చాలా అవసరం. అంటూ విషయం వివరించాడు డాక్టర్.
అయ్యో ! నాకవన్నీ యేమీ తెలియదు డాక్టర్ ! మా అబ్బాయి కూడా యీ విషయాన్ని నా వరకూ రానివ్వలేదు. మా అబ్బాయికి పిల్లలు పుట్టే అవకాశంలేకుంటే వేరే మార్గాలు లేవా యేమిటీ !? ఇదేమైనా మా తరమప్పటి సమస్య కాదుగా ! స్త్రీకి ప్రసవ వేదన పడాలని నట్టింట్లో శిశువు రోదన వినాలని యె౦డదుకుండదు చెప్పండి ? మునుపటి తరాల మనుషుల్లా నాకంత చాదస్తం లేదు లెండి. మా అబ్బాయికి లోపం వుందని అసలు పిల్లలని వద్దనుకోలేను కూడా ! ఏవో మార్గాలుంటాయి కదా ! ఆ పద్దతుల్లో మా కోడలి కడుపున ఓ నలుసు పడేటట్లు చూడండి. మా అబ్బాయితో నేను మాట్లాడతాను. ఏది యేమైనా మా యింట్లో పసి పిల్లల బోసి నవ్వులు విరబూయాల్సిందే ! కోడలికి యివేమీ తెలియకుండా ట్రీట్మెంట్ యివ్వండి .. అందుకు హామీ నేను అంది విమల.
మీరు చాలా సహృదయంతో అర్ధం చేసుకున్నారమ్మా, యె౦తోమంది తమ పిల్లల్లో వున్న లోపాలని కప్పిపుచ్చి యెదుటివాళ్ళపై నిందలేసి విడాకుల వరకు వెళ్ళడం చూసాను. మీ నిర్ణయం చాలాబాగుంది. మీ కోడలికి నయమైపోయి త్వరలోనే మీకొక అందమైన, ఆరోగ్యకరమైన బిడ్డని కూడా యిస్తుంది . కొన్నాళ్ళు మా పర్యవేక్షణలో వదిలేయండి చాలు.
"అవునా డాక్టర్ గారు.. చాలా సంతోషకరమైన విషయం చెప్పారు. ఒక చిన్న మాటండీ మీరు యేమీ అభ్యంతర పెట్ట కూడదు. ఈ విషయాన్ని మా కోడలికి తెలియనీయవద్దు తెలిస్తే వొప్పుకోదేమో కూడా “ అనుమానం వ్యక్తం చేసింది.
“శశిధర్ కూడా ఆ మాటే చెప్పాడమ్మా! వెన్నెల ఆరోగ్యంగా, ఆనందంగా వుండటమే కావాలి అందరికి. ఈ విషయాన్ని మాకొదిలేయండి చాలు “అన్నాడు డాక్టర్ .
ఏ గాలి ధూళీ సోకిందో బిడ్డకి . ప్రక్కనే వున్న తోటలో సమాధులు కూడా వున్నాయట. దర్గా దగ్గర కట్టిచ్చుకొచ్చిన యీ తాయెత్తుని ఆమెకి కట్టనీయండి" అని బ్రతిమలాడింది .
డాక్టర్ నవ్వి యేమీ చెప్పకుండానే అక్కడి నుండి వెళ్లి పోయాడు
కోడలి చేతికి తాయెత్తు కడుతూ "అబ్బాయి ! ఈ పిల్లకి బాగవుతుండంటావా ? తల్లి తండ్రి అయి మనమే చూసుకోవాలిప్పుడు " కారే కన్నీటిని కొంగుతో తుడుచుకుంటూ.
"తప్పకుండా బాగవుతుందమ్మా " వొకింత విశ్వాసంతో చెప్పాడతను. అంతే కాదు తొమ్మిది నెలలపాటు ఆమెని పసిపాపలా చూసుకున్నాడు మరో పసిపాపకి జన్మ నిచ్చేదాకా.
హాస్పిటల్ బెడ్ పై ఆమె నీరసంగా కనులు విప్పింది. ఆమె ప్రక్కనే వున్న శశిధర్ "ఇదిగో నీ వెన్నెల పురుషుడు నీ వొడిలోకే వచ్చాడు చూడు" అంటూ వుయ్యాలలో వున్న బిడ్డని జాగ్రత్తగా తెచ్చి ఆమె చేతుల్లో వుంచాడు.
ఆమె ముఖంలో సంతోషం. "అవును పురుషుడు పుత్రుడురూపంలో పుడతాడట కదా వీడే నా వెన్నెల పురుషుడు " అంటూ బిడ్డని గుండెలకి హత్తుకుంది .
"హమ్మయ్య ! యిక యీ బిడ్డ ఆలనా పాలనలో జరిగినవన్నీ మర్చిపోతుంది" అనుకుంటూ విమల వూపిరి పీల్చుకుంది.
"అన్నట్టు నీకో విషయం చెప్పడం మరచాను వెన్నెలా ! మనం తోట ప్రక్కన వున్న యింటి నుండి క్రొత్తింటికి మారిపోయాం, ఇప్పుడు ఆ యింటికే వెళుతున్నాం " .
అక్కడా తోట ఉందా ఆసక్తిగా అడిగిందామె.
"పార్క్ కూడా వుంది. మన బాబుతో పాటు నువ్వూ ఆడుకోవచ్చు" నవ్వుతూ చెప్పాడతను.
( నవంబర్ మాలిక వెబ్ మాస పత్రికలో తరాలు -అంతరాలు శీర్షికన ప్రచురితం )
3 కామెంట్లు:
కథ బాగుంది .
మేడం కథ బాగుంది. సీరియస్ అంశం ఐనా అందంగా చెప్పారు.
విభిన్న స్వభావాల కలయక పెళ్లి.ఒకరికోసం ఒకరు ఖచ్చితంగా టైం కేటాఇంచాలి.అప్పుడే అనుబంధం బల oగా వుంటుంది.ఒకరి అభిరుచిని ఒకరు నచ్చక పోఇనా గౌరవించాలి.వివాహం అనేదాని విలువ అర్ధమౌతుంది.కధలో అర్దాన్ని కొత్తగా పెళ్లి అయినవాళ్ళు డబ్బు పిచ్చివాళ్ళు గ్రహిస్తారనే ఆశ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి