15, జులై 2024, సోమవారం

పయిలం బిడ్డా!

 పయిలం బిడ్డా! -వనజ తాతినేని

మనుమడా! నా బంగారు తండ్రీ! ఎట్టా వుండావ్? నేను ఫోన్ చేస్తే నీకు అందుతుందో లేదో తెలియడంలా, అందుకే ఈ ఉత్తరం ముక్క రాస్తుండా. ఏడేళ్ళు అయిపోయింది నిన్ను చూసి. ఎప్పుడు వస్తావు రా నాన్నా! ఒక్కసారి వచ్చి ఈ ముదుసలి నాయనమ్మను చూసి పో. వొంటి నిండా హత్తుకుని  పౌత్ర స్పర్శ ని అందించి పో. ఈ ఎండా కాలం దాటిస్తానో లేదో.. భగవంతుడికి యెఱుక.  ఎండలకి భయపడి మీ అమ్మ దగ్గరికి వెళ్లడంలేదు. అన్నట్టు నీకు ఈసారి కొడుకు పుడితే తాత పేరో నాన్న పేరో పెట్టుకోవాలి. పెద్దల పేరు పెడితే పిల్లలు ఉజ్వలంగా వర్ధిల్లుతారని నానుడి. ఇదే మాట మీ అమ్మతో చెబితే మీ అమ్మ విసుక్కొంది. “ తాత ముత్తాల ఆస్థులు కావాలి కానీ వాళ్ళ పేర్లు ఎవరికి కావాలి” అని.  


అబ్బాయ్ ! మీ అమ్మ నీ దగ్గర్నుండి వచ్చాక చాలా నలిగిపోయింది రా. దిగులు ముఖంతో నవ్వడం మర్చిపోయింది. అడగ్గా అడగ్గా.. “ఏం చెప్పను అత్తమ్మా, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదుగా” అని వాపోయింది.  


ఒరేయ్ పొంగుమాలినోడా! నిన్నొక మాట అడుగుతాను చెప్పు?  నీ ఇంట్లో నీ అమ్మ గెస్ట్ ఎట్లా అయితది, నీ పెళ్ళాం బాబాయి కూతురు ఫ్యామిలీ మెంబర్ యెట్లైతదిరా! నేను పాత కాలం యెనిమిదవ తరగతి చదువుకున్నా. మా పంతుళ్ళు యెవరూ యిట్టా చెప్పిండ్లా. నీకు అమెరికా చదువులు యిట్టా నేర్పి వుండాయేమో మరి. మీ అమ్మ ఆ మాట తల్చుకున్నప్పుడల్లా కుమిలి కుమిలి యేడుస్తా వుంటది. నీ తాత మీ నాయన అహంకారం నీ మెదడుకి బాగా యెక్కినట్టు వుంది. నీ భార్యకు మీ అమ్మ గురించి తెలియదే అనుకో, నీక్కూడా తెలియకుండా పోయిందా? అంత మాట అనుడు ఏంట్రా! నేను అక్కడ వుంటే చెంపకి వొక్కటి ఇచ్చి పడేద్దును. 


ఇంకో సంగతి. అదేదో అమెజాన్ లో పుస్తకాలు అమ్ముకుంటారంట గందా, నేను కూడా అప్పుడప్పుడు అంట్లు తోముకునే స్క్రబ్బర్ లు కూడా  తెప్పించుకుంటాలే. అందులో మీ అమ్మ తను రాసిన పుస్తకాలను పెట్టి అమ్ముకోవాలనుకునిందే అనుకో.. ఆ సేల్స్ మేనేజ్మెంట్ తో మాట్లాడేదానికి ఇంగ్లీష్ మాట్టాడాలంట. నాకు ఇంగ్లీష్ మాట్లాడం రాకపోయే, కాస్తో కూస్తో వచ్చినా జంకు అత్తమ్మా, అబ్బాయిని కోడలిని ఆ పనేదో చేసిపెట్టమని రెండు మూడు సార్లు అడిగా. ఇద్దరూ గమ్ముగా వుండినారు తప్ప ఆ పని చేయలేదు అని బాధ పడింది. నిన్ను చదివించడానికి మీ అమ్మ యెంత కష్టపడింది రా! ఇల్లిల్లు తిరిగి చీరలమ్మింది. డబ్బులు వసూలుకు తిరిగింది. ఎక్కడెక్కడ నాణ్యమైన చీరలు తయారైతాయో తెలుసుకుని అక్కడికిబోయి చీరలు గుత్తంగా కొనుక్కొచ్చి అమ్మేది. చీరలపై కుట్టుపూలు కుట్టేది. పదిమందిని పెట్టి కుట్టించేది.మగరాయుడిలా నిలబడి నీ కోసం కష్టపడితే చైతన్య హాస్టల్లో చదివినోడివి కాదు నువ్వు. ఆ రెండేళ్ళు నువ్వు చదివినందుకే మూడెకరాల పొలం అమ్మిందన్న సంగతి నువ్వు మర్చిపోయావు. నీ కాబోయే భార్య ని ఎమ్మెస్ చదివించుకుందామని నువ్వు చెబితే.. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని భవిష్యత్ లో నీకు చేదోడు వాదోడు గా వుంటుందని సంతోషించి సరేనంది. ఆ అమ్మి అమెరికా వచ్చాక ఫీజులు కట్టేదానికి డబ్బులు లేవని నువ్వూ, ఆ పిల్లను కన్నోళ్ళు కాడి కిందపడేస్తే.. అప్పటికప్పుడు తన చేతి గాజులు తీసి అమ్మి చిట్ పాడి ఎల్ ఐ సి లోన్ తీసుకుని నానా అవస్థలు పడి మొదటి సెమిస్టర్ ఫీజు డబ్బులు పంపింది మీ అమ్మ కాదూ! నీ భార్య ఉద్యోగం వచ్చాక తన తల్లికి గాజులు చేయించుకుందంట గాని మీ అమ్మకి ఏమైనా ఇచ్చిందంట్రా! “ఆ అమ్మి కన్నకూతుర్లాంటిదే అనుకున్నా! ఎంత బాగా చూసినా కోడలు  కోడలే! ఎన్నటికీ కూతురు కాలేదు” అని దిగులుగా చెప్పింది మీ అమ్మ. 


 నీ భార్య ని రెండేళ్ళు చదివించిన సొమ్ముతో ఆ నాడే మీ అమ్మ కి ఓ ఇల్లు అమిరివుంటే.. ఇంత వయసొచ్చాక ఇల్లు బాడుగకి ఇచ్చినోళ్ళు యెప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయడానికి నానా అవస్థలు పడేది కాదుగా, ఆమెకు మీ నుండి చిన్నమెత్తు సాయం లేదు వీసమెత్తు గౌరవం లేదు. ఎందుకే వాళ్ళపై నీకంత భ్రమత అని నేను చివాట్లు పెడతా. అయినా వినదు. నా కోడలికి ఆ చీర బాగుంటది ఆ నగ బాగుంటది. నా మనుమరాలికి అది కొనాలి ఈ నగ చేపియ్యాలి అని పరుగులు తీస్తది. నువ్వు పంపిచ్చిన డబ్బులను ఎగాదిగా వాడకుండా పొదుపుగా వాడుకుని మీకే అమర్చిపెట్టుద్ది. నీ కన్నా నేనే నయం గదే! దేశమంతా యాత్రలు తిరిగివచ్చా. నువ్వు పక్కనున్న చంద్రగిరి కోట చూడలేదు అరుణాచలం పోలేదు. ఎప్పుడు డబ్బులు లేవు లేవు అంటావ్, అని మందలిస్తే.. నేను కూడా చెడీబడీ కొనేసి దేశమంతా చుట్టేసి ఖరీదైన చీరలు చుట్టేస్తే నీ మనుమడు చేసిన అప్పులు తీరేవా? బిడ్డ నష్టపోయాడు, మోసపోయాడు, అప్పుల పాలై పోయాడు. వాడికి  నేనెలాగూ  సంపాదించి పెట్టలేను ఈ మాత్రం అండగానైనా వుండకపోతే యెట్టా! కొందరు జల్సాగా అనుభవించడానికే పుట్టి వుంటారు. కొందరు నాలా కష్టపడటానికి పుట్టి వుంటారు అని వేదాంతం చెబ్బుద్ది. అత్త కట్టిన సామ్రాజ్యంలో కోడలు రాజ్యమేలుద్ది అంటారు.మరట్టాగే వుంది నీ ఇంట్లో నీ భార్య తీరు  దానికి నువ్వు వకాల్తా పుచ్చుకుని మీ అమ్మ మీద విరుచుకు పడటమూనూ. 


మీ అమ్మను యెన్నోతూర్లు ఛీత్కరించినావంట. యెన్నోతూర్లు నువ్వు  అమెరికా కి ఇక రాబాకు అని అన్నావంట.  నువ్వెళ్ళిన పద్నాలుగేళ్ళకి మూడుసార్లు కాబోలు నీవుండే కాడికి వచ్చింది. వచ్చినప్పుడల్లా రానూపోనూ విమానం టిక్కెట్లు వచ్చాక ఆడ కట్టే హెల్త్ ఇన్సూరెన్స్  కలిపి నీకు భారం యెక్కువైతదే అనుకో, అయినా అట్లా ఛీత్కరించుకోవడం యేమైనా పద్ధతిగా వుందంట్రా? నిన్ను ఏరా! అంటేనే నచ్చని నువ్వు అమ్మని మాత్రం అగౌరవపర్చవచ్చా! పాపం! మీ అమ్మ మనసు యెంత గాయపడిందో! పద్దాక తల్చుకుని తల్చుకుని ఏడుస్తాది. నీకు ఫోన్ చేస్తే ఇరవై సెకన్లు ముప్పై సెకన్లు. ఫ్రెండ్స్ తో వుంటానంటివి ఆఫీసులో వుంటానంటివి. నీ కోడలికి ఫోన్ చేయ్ అని కట్ చేస్తావు.మీ ఆవిడకి ఫోన్ చేస్తే రెండు మూడు మాటలు. పిల్లదానితో ముచ్చట్లాడదామంటే పైన వుంది అంటది. మూడు నాలుగు రోజులకు ఒకసారి కూడా పిల్ల కనబడేది లేదు. నీ భార్య బాబాయి కూతురికి నీ పిల్లను మాలిమి చేసేస్తిరి. మీ అమ్మ పక్కన పడుకుని పిల్ల రైమ్స్ చూస్తుంటేనో పాటలు పద్యాలు చెప్పుకుంటూ వుంటేనో  దాన్ని బలవంతంగా తీసుకుపోయి నిద్రబుచ్చి చెల్లెలు పక్కన పడుకోబెట్టి బయటకుపోతారు మీరిద్దరూ. అప్పటికి మీ పిల్లను ఆ పిల్ల భద్రంగా చూసేది మా అమ్మ చూడనిది అని అర్థమా!?  ఆ క్షణాల్లో మీ అమ్మ మనసు యెంత నొచ్చుకుని వుంటది, ఆలోచించి చూడు. మీ అమ్మ దగ్గర  నేను వుండినప్పుడు మీ వేషాలన్నీ చానా  చూసాను లే! 


మీ అమ్మ అదేదో ప్రపంచ ప్రసిధ్ది గాంచిన  పుస్తకం కావాలని అడిగిందంట. ఇరవై డాలర్ల ఖరీదు చేసే ఆ పుస్తకం కొనిపెట్టకపోతివి. ఆ పుస్తకం ఆన్ లైన్ లో కుస్తీ పడి చదువుకుంది అంట. బాగా నచ్చింది అంట ఆ పుస్తకం. మీ నగరంలోనే మీకు అరగంట ప్రయాణదూరంలో వున్న ఆ రచయిత్రి స్మారక  కేంద్రం చూడాలని ఉవ్విళ్ళూరిందంట. సంవత్సరన్నర కాలంలో మీ అమ్మకు ఆ ఇల్లు చూపించడానికి నీకు తీరికేలేకపోయిందా? అంత బిజీగా వుండార్రా మీరు? నీకు క్రికెట్ ఆడుకోవడానికి,సినిమాలు చూడటానికి నీ భార్యా పిల్లతో కలిసి ఫ్రెండ్స్ ఇళ్ళకు పార్టీలకు వెళ్ళడానికి తీరుబడి వుంటుంది కానీ మీ అమ్మ అడిగిన చిన్న కోరిక తీర్చడానికి సమయంలేదా? మీ ఇంటికి రెండు మైళ్ళ దూరంలో వున్న లైబ్రరీ లో తను రాసిన పుస్తకాలు వుంచుదామని తనను తీసుకు వెళ్ళమని అడిగి అడిగి అలసి పోయిందట. అందుకూ తీరిక లేదు నీకు. ఇక అక్కడే వున్న తన స్నేహితురాలికి ఆరోగ్యం బాగుండక ఆపరేషన్ చేస్తే  చూడటానికి వెళ్దామని అడిగి అడిగి రోత పుట్టి అడగడం మానుకుంది అంట. ఏం బిడ్డవి రా అయ్యా! మీ అమ్మ ఏమన్నా విమానాలకి టికెట్లు కొని నయాగరా ఫాల్స్ చూపమని అడిగిందా వైట్ హౌస్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూపించమని అడిగిందా? అరగంట దూరం కార్లో పోయి వచ్చే ప్రదేశం చూపమని అడిగింది. దానికి అయ్యే ఖర్చు నువ్వు ఒకరోజు రెస్టారెంట్లో చిరుతిండి తినే ఖర్చు. నీ భార్య తినే ఐస్ క్రీమ్ అంత ఖర్చు. మీరు ఆర్డర్ పెట్టుకునే పిజ్జాలంత ఖర్చు.  తల్లి చిన్నపాటి కోర్కెను తీర్చలేని నువ్వేం బిడ్డవి రా!? నీకు నచ్చినవి ఇవ్వడం కాదూ అమ్మ అడిగినవి ఇవ్వడం తెలియదూ నీకు. 


మీ అమ్మ ఖరీదైన బహుమానాలు అడిగిందా, విహార యాత్రలు,విందు భోజనాలు అడిగిందా? తలకు మించిన భారం మీదేసుకుని పుట్టినరోజు పండుగలు చేస్తావుంటే చూసి ఊరకుండలేక పెద్దదానిగా, మంచి చెడు బిడ్డకు చెప్పుకుందామనుకుంటే వినే ఓపిక లేకుండే నీకు. కరోనా వచ్చి గదిలో పడివుంటే పదకొండు గంటలైనా ఇన్ని కాఫీ నీళ్ళు దాని ముఖాన పొయ్యకపోయే, అయ్యా!మందులు వేసుకోవాలి గా, ఇంతవరకూ ఏమీ తినకపోతే  యెట్టా?  ఏమైనా పట్టుకుని రా!  అని నీకు ఫోన్ చేసి చెబితే నువ్వు విసుక్కుంటూ కాసిని  పాలు అవెన్ లో కాచి అందులో నాల్గు బ్రెడ్ ముక్కలు వేసుకొచ్చి యిచ్చి యింకెప్పుడూ యిక్కడికి రాబాకు. నా భార్య నీకు చేసిపెట్టదు అని అమ్మను విసుక్కొనే బదులు నీ భార్యను   మందలించవచ్చు కదరా! అంత దద్దమ్మ వి అయిపోయావా నువ్వు? నువ్వు నీ భార్య కలిసి ఎంత అగమానం చేసి పంపినారు!!.

మీ నిరాదరణ  మీ ఛీత్కారాలు మీ మాటలు అన్నీ తల్చుకుని తల్చుకుని గట్టు తెగిన వాగు అవుతది. అట్టాంటప్పుడు దాన్ని చూస్తే కడుపు తరుక్కుపోద్ది. 


మీ అమ్మ కపటం లేని మనిషి రా! మీ నాన్న భర్త గా యెంతో ద్రోహం చేసినాడు. పీకలదాకా తాగొచ్చి తల పగలగొట్టాడు మక్కెలిరగదన్నాడు. ఎంతగానో అవమానించాడు. అలాంటి దుర్మార్గుడి నుండి తప్పించి మీ అమ్మను మేమే దూరంగా పంపించేసాం. నిన్ను పెట్టుకుని ఇరవై యేళ్ళు నీ కోసమే బతికింది పాటుపడింది. అటువంటి మీ అమ్మకు రోగమొస్తే యిన్ని మంచినీళ్ళు పొయ్యడానికి ఇంత కూడు పెట్టడానికి కష్టం అయిపోయిందా నీకు. మీ అమ్మ నీ దగ్గర వుండేదానికి యిష్టపడేది యెందుకో తెలుసా! నీ పిల్లను వొళ్ళో వేసుకుని ఆడించేది ఉప్పుమూట మోసోది, యెత్తుకుని మోసేది స్నానం చేపిచ్చి గోరుముద్దలు తినిపించేది ప్రేమ నిండిన హృదయంతో.  నీ పిల్ల ముద్దు మురిపాల్లో  చిన్నప్పటి  నిన్ను  చూసుకోవడం కోసం.  ఆ పసి స్పర్శ లో వుండే స్వచ్ఛత కోసం. ఆ ప్రేమలో ఆ స్పర్శ లో తన బాధలు కష్టాలు అన్నీ మర్చిపోవడం కోసం అక్కడ వుంటది. ఆమెకు మీ కన్నా యెక్కువగా యెవరుండారని  యిక్కడ వుండాలి చెప్పు.  ఒంటరితనం అనే పెద్ద రోగమే కాకుండా అనేక అనారోగ్యాలకు మందు మనుమరాలు అని, కొడుకు కోడలు దగ్గర వుంటే ఏ బాధలు తన దరిదాపుల్లోకి రావు అని అనుకోవడమే అది చేసిన తప్పా!? అదే పెద్ద శిక్ష అయిపోయింది దానికి. ఆప్యాయంగా కంచంలో ఇంత కూడు వెయ్యకపోయినా పెద్ద దరిద్రం యింట్లోకి వచ్చి కూర్చుంది అనే నవనాడులు కృంగ దీసుకునే మాట అనిపించుకుని గుడ్లనీరు గుడ్ల కుక్కుకుని మనవరాలి కోసం  సంవత్సర కాలం  వుండివచ్చింది. ఇన్ని చూసినాక ఒక సామెత గుర్తొచ్చింది. నీకు అమ్మ అల్లం పెళ్ళాం బెల్లం అయిపోయింది అని. మీరు చేసినవి చెప్పాలంటే యింకా చాలా వుండాయిలే, కతలు కతలుగా చెప్పింది మీ అమ్మ.  ఎనబై ఏళ్న ముసలిదాన్ని.  సరిగా గుర్తుండక అన్నీ అడగలేకపోతున్నా.  అవన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంకోసారి ఉత్తరం రాస్తానులే!


ఎక్కడో అక్కడ తప్ప తల్లులు  బిడ్డలకు ఏం ద్రోహం చేస్తారు రా నాయనా! కోడలు కూడా ఓ ఇంటి కూతురే కాబట్టి తప్పు దారిన నడుస్తుంటే  తమ బిడ్డే అని పక్షపాతం చూపకుండా   కొడుకుని మందలిస్తారు. ధర్మం చెబుతారు. నేను మీ తాత అదే చేసినాము. మీ నాన్న ను పెడన పెట్టాము. నిన్ను కూడా అప్పుల పాలు కాకుండా కాపాడుకోవాలని మీ అమ్మ మంచి సెబ్బర చెప్పబోద్దేమో, అంతేగా! నువ్వు మీ అమ్మ మాట ఏనాడైనా విన్నావా పెట్టావా?  మీ అమ్మ నిక్కచ్ఛిగా మాట్లాడుతుంది. మాట కరుకు కావచ్చోమో గానీ దాని  మనసు వెన్న. నేను మంచానా పడితే చూసేది కూడా మీ అమ్మే! నలుగురు కోడళ్ళున్న అత్తగా నేను మీ అమ్మ మనసు వరుస తెలిసిన మనిషిగా చెబుతున్నా! అంతెందుకు? మీ నాన్న పరాయిదాన్ని పెట్టుకుని  ఇరవై యేళ్ళ మిమ్మల్ని వొదిలేసి పోతే కయ్యలు పశువులు మోటరుబండ్లు అన్నీ అమ్ముకుని నాశనం చేస్తే నిన్ను నిలబెట్టింది మీ అమ్మ కాదూ! నీ పెళ్ళప్పుడు వచ్చి  దిష్టిబొమ్మలా నిలబడటం తప్ప మీ అయ్య చేసింది ఏముందిరా కూరలు బాగోలేదు, మర్యాదలు బాగా జరగలేదని వొంకలు పెట్టడం తప్ప. అట్టాంటి మీ నాన్న కు నయం కానీ రాచపుండు పుడితే యింటికి తెచ్చి హాస్ఫిటల్ కి తిప్పుతూ లక్షలు ఖర్చు పెట్టింది.  వచ్చిపోయే మీ నాన్న మరో సంతానాలను ఆదరించి మీ నాన్న కూసే వొంకర కూతలన్నీ భరించింది. ఏడాదిపాటు నరకం చూస్తూ కూడా  మనిషి బతికితే చాలని తాపత్రయపడింది. మీ నాన్నను అరచేతుల మధ్య  పెట్టుకుని చూసింది.ఆఖరికి మీ అమ్మ చేతుల మధ్యనే ఊపిరి వదిలాడు. దూరంగా వుండి  డబ్బులు పంపడం తప్ప మీ అమ్మ మీద రంకెలేయడం తప్ప నువ్వు చూసింది చేసింది ఏడ అని? మీ అమ్మ దగ్గర ఇంకా నీకు ఈయటానికి ఏమీ లేవు ఎముకలు తప్ప. సొమ్ము లేకపోయేసరికి మీ అమ్మ నీ కంటికి గౌరవంగా కనబడటం లేదేమో! అమ్మంటే అంతు లేని సొమ్ము అంటారు.మీ అమ్మ ను పరుల ముందు చులకన చేసుకోబాకు. నువ్వే చులకన చేస్తుంటే నీ భార్య యెట్లా గౌరవిస్తాది విలువనిస్తాది చెప్పు. వాసం గ్రాసం చూస్తున్నావు కదా అని అమ్మ ని బిచ్చగత్తె లాగా చూడకు.తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేరు నాయనా!   


అమెరికా కో ఇతర దేశాలకు పోయినాళ్ళందరూ కాసిన్ని డబ్బులేసి మనుషులు పోయినప్పుడు వాట్సాప్ కాల్ ల్లో కన్నీళ్ళు పెట్టడం కాదు కావాల్సింది. బతికి వున్నప్పుడు అమ్మా తిన్నావా! ఆరోగ్యం బాగుందా? అని అడగడంతో పాటు అక్కడ మనవాళ్ళ చుట్టూ యెవరెవరు వుండారు? వాళ్ళతో మన సంబంధ బాంధవ్యాలు యేమిటి అని ప్రశ్నించుకోవాలి. ఎవరితోనైనా అంటీముట్టనట్లుగా వుంటే  ఇక్కడ  మీకు బంధువులు స్నేహితులు ఎట్టా వుంటారు? నాకు ఎవరూ లేరు అనుకోవడం యెందుకు? ఉన్న వాళ్ళను నువ్వెంత విలువగా ఇష్టంగా పలకరిస్తున్నావ్ చెప్పు? ఈ ముసలి ముండకైనా యెప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడావా? మీ అమ్మ దగ్గర వుంటే నేను  వాట్సాప్  కాల్లో  మాట్లాడటం తప్ప.  అంతెందుకూ! మీ పిన్నమ్మ నిన్ను చిన్నప్పుడు రెండేళ్ళు పెంచింది.తన దగ్గర పెట్టుకుని చదివించింది. నీ ముడ్డి కడిగి నీ మూతి తుడిచి పక్కలో పడుకోబెట్టుకుని చక్కంగా ప్రేమగా పెంచింది. పెరిగి పెద్దవుతుంటే నీకు మంచి భవిష్యత్ వుండాలని తాపత్రయపడింది. అమెరికా లో ఇంకో మూల వున్న దాని బిడ్డ ఏదో ఇబ్బందిలో పడిందేమోనని వెళ్ళి చూసి రమ్మని వేడుకొంది. నువ్వు వొంకలు చెప్పావ్  ఆఖరికి పెడ చెవిన పెట్టావ్. రక్తసంబంధం వున్న వాళ్ళు నీకు ఆప్తుల్లా కనబడకుండా పోయారు. అమ్మ వైపు కానీ నాన్న వైపు కానీ బంధువులు ఎవరూ నీ వాళ్ళు కాకుండా పోయారు. భార్య తరపు బంధువులు ఆత్మ బంధువులై పోయినట్టున్నావ్. నీలాంటి వాళ్ళను చూసే అయినవాళ్ళకు ఆకుల్లో కాని వాళ్ళకు కంచాల్లో అని అంటారని నీకు తెలియదేమో!.  


పయిలం బిడ్డా! అన్ని బంధాలను పెడన పెట్టి డబ్బు సంపాదనే లోకంగా భార్య మాటే వేదవాక్కు గా బతకబాకు. బతకనేర్చిన మాటలు మాట్టాడబాకు. మళ్ళీ చెబుతుండా, మీ అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తా వుండింది. అది మొగుడు లేకుండా బతకగల్గింది కానీ  బిడ్డ  చూసే  పెడసరపు చూపు భరించలేకపోతుంది. అయినా మీ అమ్మ బతకడం తెలిసిన మొగలాయి. మీ నాన్న ను వొదిలేసి బతికినట్టు నిన్ను నీ పాటికి వొదిలేసి బతకగలదు. అయ్య లేనివాడిగానే పెరిగావ్. వాడూ పొయ్యాడు.  ఇక అమ్మ కూడా లేకుండా  యెవురూ లేని వొంటి గాడివి అయ్యి నీ భార్యబిడ్డలు చాలనుకుని ఒంటిగా బతికేయకు బిడ్డా, పయిలం బిడ్డా! ఈ వేలు కు ఆ వేలు యెడం అంటారు. ఏడనో  సముద్రాల అవతల వున్నవాడివి, మనసులో నైనా ఆలోచనలో నైనా మీ అమ్మ లాగా మనఃస్ఫూర్తిగా నా వాళ్ళు అని అనుకోవడం నేర్చుకో. మనసు నిబ్బరంగా వుంటది.మంచికి చెడుకీ మనుషుల అండ వుంటది. అయినవాళ్ళను దూరం చేసుకోబాకు. మనిషికి రవొంత డబ్బున్నా కొండలాంటి అండ వుండాలి. అది పోబొట్టుకోబాకు.  ఇంట్లో పెద్ద బాలశిక్ష పెట్టుకొని యింటిల్లపాది చదువుకోండి చాలు. అప్పుడు  బయట భగవద్గీత చెప్పబడల్లేదు నువ్వు. అమ్మల గురించి బిడ్డలు బిడ్డలు గురించి అమ్మలు గర్వంగా చెప్పుకోవాలి. ఫిర్యాదు చేయకూడదు. వుంటాను మనుమడా! శుభాశీస్సులతో ..  నాయనమ్మ.  


పిల్లవాడిని మనిషిగా చేయడానికి తల్లికి ఇరవై ఏళ్ళు పడుతుంది. 

అతడిని మరో స్త్రీ ఇరవై నిమిషాల్లో 

“పూల్ “ ని  చేస్తుంది.  - రాబర్ట్ ప్రాస్ట్. 


(బహుళ త్రైమాసిక అంతర్జాతీయ మహిళా పత్రిక - ఏప్రిల్-జూలై సంచిక లో ప్రచురితం)







కామెంట్‌లు లేవు: