27, మార్చి 2020, శుక్రవారం

ఉజ్వల రచనా శిల్పం "దీపశిఖ "

సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం.. 

రచయితలకు క్రాంతి దర్శనం ఊహలలో దొరుకుతుంది. అర్దం చేసుకోగల పాఠకులకూ దొరుకుతుంది. కానీ రచనలలో రచయిత వెళ్ళినంత దూరం మనిషి వెళ్ళలేడు. అది అర్దం చేసుకుని సమకాలీనతను ప్రతిబింబిస్తూ రచనలు చేయగలవారు మాములు రచయితలు గానూ.. విపరీతధోరణులను సాహిత్యంలో ప్రవేశపెట్టినవారిని సంచలన రచయితలగానూ  గుర్తించడం లెక్కించడం సర్వసాధారణమైపోయిన రోజులివి.

రచయిత వెళ్ళినంత దూరం పాఠకుడు వెళ్ళగల్గినపుడు.. వ్యక్తి స్వేచ్ఛకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది. సమాజానికి వ్యక్తికి దూరం పెరుగుతుంది. సమాజంలో ఇమడలేని మనిషి బాహ్య అంతర్యుద్దాలతో అలసిపోతాడు.అలసిపోతూ కూడా తాము కోరుకున్నదానిని సాధించుకుంటారు. అయితే రచయిత సమాజంలో ప్రస్తుత విలువలుకు అనుగుణంగా నడుచుకుంటూనే ఎవరిని నొప్పించకుండా తాను చెప్పే విషయాన్ని వొప్పిస్తూ ..అది సామాన్యమైన విషయమే అని పాఠకుల చేత ఒప్పింపజేస్తూ కథ వ్రాయడం కత్తి మీద సాములాంటిదే. అలాంటి కథను నేను చదివాను. ఆ కథ పేరు దీపశిఖ . కథా రచయిత శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మి దేవి. ఈ కథ ఇతివృత్తం మనకు అక్కడక్కడా తారసపడేదే. అయితే జనబాహుళ్యంలో కుహనావిలువలతో బ్రతికే సమాజంలో ... నీతి తప్పి (??) ఒకడుగు ముందుకు వేసి బిడ్డను కనీ తాను అనుకున్నట్లు ఆ బిడ్డను పెంచిన విషయమే ఈ కథ. ఇష్టమైనదాన్ని కావాలనుకున్నప్పుడు హింస లేకుండా దానిని సాధించడం సాధ్యమా అని ప్రశ్నిస్తుంది కూడా ...  

స్త్రీలు పిల్లలను కనడానికి ఎంత ఇష్టపడతారో తనకు ఇష్టమైన పురుషుడి ద్వారా అక్రమ సంబంధం యేర్పరచుకుని పిల్లలను కనడానికి అంతగా ఆలోచిస్తారు జంకుతారు. పిల్లలను కనడానికి పురుషుడితో కూడిక ఇష్టమైనది కాకపోయినా పిల్లలకోసం అయిష్టంగానే కళ్ళుమూసుకుని .. వంశం నిలబెట్టడం కోసం హింసను అనుభవిస్తారు కొందరు.ఒక వివాహిత స్త్తీ తనకు కల్గిన ఇద్దరు పిల్లల తర్వాత తనకి ఇష్టమైన ప్రియుడుతో కూడి ఇష్టంగా బిడ్డను కనీ మిగతా బిడ్డలకన్నా అమితంగా ప్రేమించి అపురూపంగా పెంచుతుంది. ఆ విషయాన్ని కూతురికి ఆ తల్లి ఎలా తెలియజేస్తుంది ..కూతురు ఆ విషయాన్ని ఎలా స్వీకరిస్తుంది .. వివాహం కాకుండానే తల్లి కాబోతున్న తన రూమ్మేట్ కి ఏమి భోదిస్తున్నది అన్నదే .. ఈ "దీపశిఖ" కథ.  రచయిత చెప్పిన తీరు వలన ఈ కథకు ఒక గొప్పదనము ఆపాదించబడింది. అంతే కాక కుటుంబాలలో వ్యక్తుల ఇష్టాన్నో లేదా వేరొకరకమైన సంబంధాన్నో చూసి చూడనట్లు వదిలేస్తూ పరోక్షముగా సహకరించడం అన్నది అత్యంత సాధారణ విషయంగా ఉంటుందనేది సూక్ష్మప్రాయంగా చెప్పబడింది. ఈ రచయిత కాకుండా వేరొక రచయిత ఈ కథను వ్రాస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకుంటే ... చాలా విమర్శలు వస్తాయనే అభిప్రాయం కూడా  యేర్పడింది. 

ఈ కథ చదివేముందు ...మీకు  నేను ఎరిగిన కొన్ని విషయాలను చెప్పదలచాను. ఆ విషయాలకు కథకు ఏమిటి సంబంధం అని అడగకండి. సంబంధం ఉందని నేను అనుకున్నాను కాబట్టీ .. ఆ విషయాలను ప్రస్తావించడం జరిగింది. 

 నా చిన్నప్పుడు జరిగిన కొందరి విషయాలు నాకు బాగా జ్ఞాపకం. ఆ విషయాల గురించి తప్పొప్పుల బేరీజు వేయడం నాకప్పుడే చూఛాయగా తెలుసు. నాకే కాదు నాతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన అదే వయస్సు పిల్లలకు కూడా.. తెలుస్తుంది. అది పెద్దలు మనకు ఉగ్గుపాలతో నేర్పిన సంస్కారం లేదా విలువలు కావచ్చు. మా ఇంటి వెనుక వాళ్ళకు ఒక అమ్మాయి వుండేది. కుడిఎడమగా మా అమ్మ వయస్సు ఆమెది. మా అమ్మ వివాహం చేసుకుని కోడలిగా అడుగుపెట్టిన ఏణర్దానికి ఆమెకు వివాహం అయిందట. మా ఊరికి కొద్ది దూరంలోనే ఆమె భర్త ఊరు. కానీ ఆమె ఎపుడూ అత్తగారింట్లో వుండేది కాదు. ఆమె నాణ్యమైన నల్లని నలుపుతో తీర్చిదిద్దిన శిల్పంలా బారు జడతో అందంగా వుండేది.  ఆమె భర్త ఆమెకు  భిన్నంగా కొద్దిగా పొట్టిగా ఎత్తుపళ్ళుతో  ఏమంత అందంగా కనిపించేవాడు కాదు. నాకు ఉహ తెలుస్తూ వుండేటప్పటికి ఆమెకు నా వయస్సున్న కొడుకు వున్నాడు. ఆ పిల్లాడు మాతో ఆడుతూ పాడుతూ వుండేవాడు. ఆమె భర్త పది పదిహేనురోజులకు ఒకసారి వచ్చి ఆమెను కొడుకును తీసుకువెళతానని బలవంత పెట్టినపుడల్లా.. ఆమె తల్లి అల్లుడిని పట్టరాని కూతలు తిడుతూ.. నీ ఇంట్లో కూటికి గతిలేదు నీళ్ళ మజ్జిగ చుక్కకు గతిలేదు నా కూతురిని పంపను. కావాలంటే నా ఇంట్లోనే పాలేరుగా పడివుండు అని తిట్టిపేసేది. 

ఇక ఆ కూతురేమో సినిమాలో వాణిశ్రీ లాగే పైట వేసుకుని బిగుతు జాకెట్ ధరించి నిత్యం సన్నజాజులు ధరించి.. వయసున్న మగవాళ్లతో పరాచికాలు ఆడుతూ వుండేది. నేను చెంబు తీసుకుని పాటి మీదకు వెళ్ళినపుడో తోటి పిల్లలతో కలిసి ఆడుతున్నప్పుడో నాకు బాబాయి వరుసయ్యే ఆయనతో కలిసి గడ్డి వాముల దగ్గర కనబడేది. అప్పటికి ఆ కనబడటం అనేది పూర్తిగా అర్దం కాకపోయినా అది నాకు తప్పుగా అనిపించేది. అపుడపుడు పెద్దవాళ్ళ మాటల్లో.. ఆ తులసమ్మ కూతురిని మొగుడితో కాపరానికి పంపివ్వదు. దానిపై మన ఇంటి మొగాడికి కన్ను పడకుండా కాపలాకాసుకోలేక చచ్చే చావొచ్చింది అని తిట్టుకోవడం వినబడి మొత్తానికి ఆమె చేస్తున్నది తప్పని బాగా అర్దమైంది. కొన్నాళ్ళకు ఆమె మళ్ళ్ళీ గర్బవతి అయి.. పండంటి బిడ్డను కన్నది. ఆ బిడ్డను చూసి మా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చెవులు కొరుక్కొనే వాళ్ళు. తర్వాత బిడ్డలను వెంటబెట్టుకుని భర్త వెంట కాపురానికి వెళ్ళిపోతే పీడా విరగడైంది అని మెటికలు విరుస్తూ తిట్టి పోసిన ఆడవాళ్ళను చూసాను.

నా బాల్యం కనుమరుగై యుక్తవయస్కురాలినై పెళ్ళి అయి నాకెక బిడ్డ పుట్టాక  హఠాత్తుగా మా ఇంటి వెనుక వున్న తులసమ్మ కూతురిని ఆమె చిన్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆమె చిన్న కొడుకు నాకు బాబాయి వరసయ్యేతను ఎలా వుంటాడో అచ్చుగుద్దినట్టు అలాగే వున్నాడు. నాలో ఎన్నో ఆలోచనలు. అంత స్పష్టంగా మరొకరి రూపంలో తన ఇంట్లో తన బిడ్డగా చెలామణీ అవుతున్న ఆ బిడ్డను.. ఆమె భర్త ఎలా భరించగల్గాడు? లేదా అతనికసలు  భార్య యొక్క ఆ అక్రమ సంబంధం గురించి తెలియదా.. ? తెలియకపోవడానికి ఆస్కారమే లేదు అంత చిన్న చిన్న పక్క పక్కనే పల్లెటూర్లలో చాలా విషయాలు దాయాలని చూస్తే దాగేవి కూడా కాదు. కానీ.. ఆ తండ్రి బిడ్డను ప్రేమించి పెంచి పెద్ద చేసి తన ఆస్తి మొత్తాన్ని పెద్ద కొడుకుకు కొంచెం కూడా ఇవ్వకుండా రెండవ కొడుకుకే వ్రాసి చనిపోయాడు. ఇక ఆమె భర్తతో కలిసి చేసిన కాపురంలో ఎన్ని అనుమానాలు అవమానాలు భరించిందో కానీ.. చిన్న కొడుకంటే ఆమెకు పంచప్రాణాలు. అతనిని ప్రత్యేక ఇష్టంతో చూసేది. 

ఇక మా బాబాయి వరుసయ్యే ఆయనతో ఆకర్షణలో పడిపోయి భర్త దగ్గరకు కాపురానికి వెళ్ళకుండా హిస్టీరియా వచ్చినట్లు ప్రవర్తించే మా బంధువుల అమ్మాయి గుర్తుకొస్తూ వుంటుంది.,ఆమెను భార్య చనిపోయున పెద్ద వయస్సు ఆస్తిపాస్తులున్న పిల్లల తండ్రికిచ్చి వివాహం చేసారు. ఆమె ఆ భర్తతో సరిపెట్టుకోలేక ఎదురుగా ఆకర్షణీయంగా  ఉంగరాల జుట్టతో దబ్బపండులా మెరిసిపోయే నవ యువకుడితో సంబంధం పెట్టుకుని  భర్త దగ్గరకు వెళ్ళమంటే పిచ్చి పట్టినట్లు ప్రవర్తించేది. 

ఇవి వివాహం ముసుగులో కనబడే వ్యక్తి ఆకర్షణ లేదా ప్రేమ లేదా మరొకటో.. పెద్దలు పిల్లల మనసులను అర్దం చేసుకుని వివాహం జరిపించనపుడు వారు తమ అంతరంగాల్లో మరొకరిని జపిస్తూ వారి కోసం తపిస్తూ.. కోరికలతో జ్వలిస్తూ తమను తాము మోసం చేసుకుంటూ జీవిత భాగస్వామికి ద్రోహం చేస్తూ.. వుంటారు. అటువంటి భార్యలను భరించే భర్తలూ వుంటారు. తనకు పుట్టిన బిడ్డ కాదని తెలిసినా ఆ బిడ్డలను ప్రేమించే భర్తలు భార్యను క్షమించే భర్తలు వుంటారని తర్వాత తర్వాత అర్దం చేసుకున్నాను. స్త్రీలు కూడా తనకు యిష్టమైన పురుషుడితో కూడి.. అతని బిడ్డను అపురూపంగా నవమాసాలూ మోసి కనీ యిష్టంగా పెంచే వాళ్ళు వుంటారు. ఇందులో తప్పొప్పులను మనం బేరీజు వేసుకున్నట్లు వుండకపోవచ్చు. మన ఆలోచనలకు అందని ఇంకొక కోణం వుండవచ్చు. స్త్రీ పర పురుషుడితో కూడిన ప్రతి సమాగమూ.. అనైతికం కాకపోవచ్చేనేది.. కొంచెం సానుభూతితో చూడాల్సిన విషయంగా .. అర్దం చేసుకోవాలని ఈ కథ చదివాక నాకు అర్దమైంది. అలా అని అక్రమసంబంధాలను ప్రోత్సహిస్తున్నామని అనుకోకూడదు. మనకు తారసపడిన విషయాలను ఎలా అర్ధం చేసుకోవాలో మాత్రం తెలుస్తుందని చెప్పడమే నా ఉద్దేశ్యం. 

ఈ కథ చదివాక నేను ఎరిగిన ఆ ఇద్దరు స్త్రీలు నాకు మరింత అర్దమయ్యారు. వారిద్దరినీ నేను ఇపుడు అసహ్యించుకోవడం మానేసి.. మాములు స్త్రీలగా  చూడగల్లుతున్నాను. సాహిత్యం యొక్క పరమార్దం హృదయాలను వైశాల్యం చేయడం..  మానసిక పరివర్తన కల్గించడం  కొత్త ఆలోచనలను రేకెత్తించడం అంటే ఇదేనని నాకు అర్దమైంది. వీరలక్ష్మీదేవి గారికి ధన్యవాదాలు .. ఇంతమంచి కథను వ్రాసినందుకు అభినందనలు. 

"దీపశిఖ  " కథ లింక్ లో ఇక్కడ చదవవచ్చు 

"కొండఫలం" కథల సంపుటిలో  కూడా  చదవవచ్చు .. 


కామెంట్‌లు లేవు: