12, అక్టోబర్ 2022, బుధవారం

నల్లకాకి - తెల్లమనసు - కోకిల తల్లి

 కోకిలతల్లి -విశ్లేషణ వి. శాంతి ప్రభోద

సాధారణంగా మనం కాకిని పాపానికి ప్రతీకగా చూస్తాం. 

గత జన్మలో చేసిన పాపాలన్నీ కాకి రూపంలో ఎగిరి పోతాయని నమ్ముతాం. 

కానీ నల్లని కాకి లోని తెల్లని మనసును గమనించం. 

తన జాతికి చెందని కోకిల గుడ్లు పొదిగే దయాగుణాన్ని, సేవా హృదయాన్ని  గుర్తించం.  

వనజ తాతినేని గారి "కోకిల తల్లి" లో ఒక సాధారణ గృహిణి కరుణ గుర్తించింది.   

కాకికి ఉన్న సంస్కారం, క్షమాగుణం, నిస్వార్ధం మనిషిని అయిన  తనకు లేవేంటి అని ప్రశ్నించుకుంటుంది ఈ కథలోని ప్రధాన పాత్ర కరుణ. 


ఈ ప్రకృతిలోని పక్షులు, పువ్వులు , పచ్చని చెట్లు, పువ్వులను వాటి జీవన సంరంభాన్ని సరిగ్గా పట్టించుకోము.  పరిశీలించం. అన్నిటికీ సమయం లేదనుకుంటాం. 

 కానీ ఈ కథలో ప్రధాన పాత్ర కరుణ నిశితంగా గమనిస్తుంది. 

ఆమె గమనిస్తున్నట్టు చెట్టుకు , పువ్వుకు , ప్రకృతికి , కాకికి తెలుసో తెలియదో .. కానీ ఆమె వాటిని ప్రతి రోజూ పరిశీలిస్తూనే ఉంటుంది. మౌనంగా సంభాషిస్తూనే ఉంటుంది. 

బహుశా వాటికి ఆ విషయం తెలియక పోయి ఉండొచ్చు. తెలిస్తే అవి అప్రమత్తంగా ఉంటాయేమో .. అంత సహజంగా ఉండలేవేమో ..!

బిడియపడుతూ ఉంటాయేమో..! 

అక్కడ నుండి వెళ్ళిపోతాయేమో.!


మనిషి అలికిడి ఉన్నచోట పక్షులు అప్రమత్తంగా ఉంటాయి. 

ఇక్కడ ఈ కథలో కరుణకి కాకికి స్నేహం కుదరడం వల్ల, ఆమె పెట్టే ఆహారం వల్ల కాకికి ఆమె నుంచి ఎటువంటి హాని లేదన్న భరోసాతో ఉంది. 


ఒకరి భాష ఒకరికి తెలియకపోయినా వాటి కదలికల ద్వారా, శబ్దం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కరుణ. 


ఆహారం సేకరించలేని ముక్కు విరిగిన మగ కాకికి కూడా  అంతకు మునుపు జతకట్టిన ఆడకాకి ఆహారం సేకరించి పెట్టడం చూస్తే మంచాన పడిన భర్తకు  తెచ్చిపెట్టి పొట్ట నింపే, సేవ చేసే స్త్రీ కనిపించింది. 


కారణాలేవైనా జతగాడు దూరమైన కాకి తర్వాతి కాలంలో మరో మగ కాకితో జతకట్టడం చూసినప్పుడు మానవ సమాజం కూడా అంత స్వేచ్ఛగా జతగాళ్ల విషయంలో ఉంటే మహిళలు అనవసర బరువు మోయాల్సిన అవసరం ఉండదు కదా!


ప్రపంచంలో అన్నింటికన్నా తల్లి ప్రేమ గొప్పది అంటారు.  స్వచ్ఛమైందని చెప్తారు.  నిస్వార్ధమైందని, విశాలమైందని అంటారు. 

తన బిడ్డ ఎలా ఉన్నా, అందంగా ఉన్నా లేకపోయినా, రంగు ఉన్నా లేకపోయినా , లోపం ఉన్నా కన్నతల్లికి తన బిడ్డ అందంగా కనిపిస్తుంది.  ఆ తల్లి బిడ్డ పై చూపే ప్రేమ, ఆదరణ, సంరక్షణ కూడా అంతే అందంగా ఉంటుంది. 

అది మనిషైనా, పక్షి అయినా, జంతువైనా ఏ జీవి అయినా బిడ్డకు కష్టం రాకుండా కాపాడుకోవడానికి యత్నిస్తుంది తల్లి.


కాకి గూట్లో కళ్ళు తెరచిన కోకిల పిల్ల తొలిసారి గొంతు విప్పగానే గమనించిన కాకులు చేసిన గోల విన్న తల్లి కాకి  రివ్వున వచ్చి, తోడేళ్ళ గుంపు బారిన పడి విలవిల్లాడుతున్న జింకపిల్లలా ఉన్న కోకిల పిల్లను కాపాడింది.  బిక్క చచ్చిపోయిన కోకిల పిల్లను ముక్కుతో పరామర్శించి తన రెక్కలను గొడుగుగా కప్పి రక్షణ ఇస్తుంది. నీకు నేనున్నానన్న భరోసా నింపుతుంది.  

 

సొంత తల్లి ప్రేమకు నోచుకోని పిల్లలను కన్నబిడ్డ మాదిరిగా  ఆదరించిన కాకి ఔదార్యం చూసి ఆశ్చర్యపోతుంది కరుణ.  కాకి అంటే గౌరవం రెట్టింపు అవుతుంది. 


శ్రీకర్ మరణం అంచులో ఉన్నప్పుడు భార్య కడుపున పుట్టని బిడ్డలను ఆమెకు  చేరువ చేయాలని ప్రయత్నించినప్పుడు, అంత ఔదార్యం తనకు లేదని వారి బాధ్యత తీసుకోలేనని,  తల్లితండ్రి లేని ఆ బిడ్డలకు నీ ఆస్తిపాస్తులు ఏమిచ్చుకున్నా నాకు అభ్యంతరం లేదు,  నేను నా కొడుకును తప్ప మరెవ్వరినీ నా బిడ్డలుగా పెంచలేనని నిర్ద్వందంగా చెప్పింది కరుణ,

చుట్టూ ఉన్న పరిసరాల్ని, పరిమళాల్ని తనలో ఇముడ్చుకుంటూ అందులో ఇమిడి పోతూ ఉండే కరుణ కాకిని  గమనించడం మొదలు పెట్టాక కోకిల పిల్లకు తల్లి అయి కాపాడుకునే తల్లి సహజ ప్రేమకు ఫిదా అవడమే కాక తనలా ఎందుకు ఉండ లేకపోయిందని ప్రశ్నించుకున్న కథ "కోకిల తల్లి' . 

.

సృష్టిలో స్త్రీ , పురుషుడు ఇద్దరూ ఒకరికొకరు అవసరం. ఎవరి ప్రాముఖ్యత వారిదే.  పునరుత్పత్తి ప్రక్రియ అనివార్యం.  వివాహం ద్వారా ఒక  స్త్రీ ఒక పురుషుడు మధ్య బంధం ఏర్పడుతుంది. ఒకే గూట్లో నివాసం మొదలవుతుంది.  నిరంతర సంబంధం ఏర్పడుతుంది. కలిసి జీవించడంలో, కలిసి భావాలూ వినిమయం చేసుకోవడంలో, కలిసి బాధ్యతలు పంచుకోవడంలో, భావోద్వేగాలు తెలుసుకుంటూ మసలుకోవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహబంధం, భార్య భర్తల బంధం దృఢమవుతుంది.

కానీ, ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, తన లైంగికతకు ప్రాధాన్యం ఇచ్చి తన పురుషత్వానికి విలువనిచ్చి తనతో జీవితం పంచుకోవడానికి వచ్చిన స్త్రీ జీవితాన్ని అగాధంలోకి తోసేస్తుంటారు చాలామంది పురుషులు.  

నీతి, నైతికత, కట్టుబాట్లు వగైరా వగైరా ల భారం స్త్రీల  భుజస్కంధాలపై వేసి పైలా పచ్చిస్ లా తిరిగేస్తుంటారు  భారతీయ పురుషుడు.  

భారతీయ మహిళ తన అనుకునే భద్రపురుషుడి జీవితం కోసం పూజలు , నోములు , వ్రతాలతో కాలక్షేపం చేస్తుంది. తానొక గొప్ప కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాని భ్రమల్లో బతుకుతూ ఉంటుంది.  అతని ప్రేమ తనకే సొంతం కావాలని తాపత్రయపడుతుంది.  అతని క్షేమమే తన క్షేమం అని తలుస్తుంది.  


కోకిల తల్లి లో  కరుణ భర్త శ్రీకర్ సగటు భారతీయ పురుషుడు. ఇంట్లో ఎంత కమ్మని తిండి ఉన్నప్పటికీ బయట రుచుల కోసం వెంపర్లాడుతుంటాడు.  మగవాడిగా అది తన హక్కు అని  భావిస్తాడు.  


ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలని అనిపిస్తున్నది.  ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పింది, ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకునే మగవాడెప్పటికీ తప్పుకాదట. 

ఆడవాళ్ళతో తిరిగిన కస్టమర్ ని ప్రాసిక్యూట్ చెయ్యకూడదట .. ఆహ్హాహ్హా ఏమి తీర్పు?! 

ఈ తీర్పులు ఏమి చెబుతున్నట్లు .. స్త్రిని కామ దృష్టితో చూడడం, ఆమెను లైంగికంగా వాడుకోవడం అతని తప్పుకాదు. కానీ అతనికి చేరువైన ఆమెది తప్పట!

స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న డొల్ల తనాన్ని పోగొట్టి సహజమైన , నిర్మలమైన స్నేహ సంబంధాల్ని ఏర్పరచి పెంపొందించాల్సిన స్థానంలో స్త్రీల స్థాయిని మరింత పలచన చేయడం,  దిగజార్చడం కదా..

ఎన్నో పోరాటాలతో ఉద్యమాలతో సాధించుకున్న చట్టాల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ,  చైతన్యవంతం కావాల్సిన సమాజాన్ని అగాధంలోకి తోసే తీర్పు కదా..!

మగాడు జీవితాంతం తోడు నీడగా ఉంటానని బాస చేసిన భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకోవడం తప్పు కాదని, అది తన మగతనానికి చిహ్నమని విర్రవీగే మగవాళ్ళకి కొమ్ములిచ్చి మరింత భద్ర పురుషుడిగా మార్చిన తీర్పు కదా... 


కోకిల తల్లి కథలో కరుణ భర్త శ్రీకర్ కూడా అటువంటి విలాసపురుషుడే.  తన చిత్త ప్రవృత్తి నేరం కాదని భావించే రకం.  పురుషాహంకారం నరనరాల్లో జీర్ణించుకున్న అతను కట్టుకున్న భార్య, కన్నకొడుకు కంటే ఇతర సంబంధాల్లోకి వెళ్లి వాళ్ళకే సమయం , సొమ్ము ఖర్చు చేసే లాలసుడు.  అలాంటి వాళ్లకు కోర్టులు చట్టాలు శిక్షలు వేయరేమో కానీ ఆత్మగౌరవంతో బతికే స్త్రీ అతని పోకడలను క్షమించదు.  


సహజ సునిశిత మనస్కురాలైన కరుణని అతని ప్రవర్తన ఆందోళనకు, ఆవేదనకు గురి చేసింది. 

నీ లాగే నేను ప్రవర్తిస్తే అని ప్రశ్నిస్తుంది.  బుసలు కొట్టే అతను ఆ ఆలోచన భరించలేడు. అదే గనుక జరిగితే ఆమెను ముక్కలు ముక్కలుగా నరికేస్తా అనే అహంభావి. సగటు పురుషుడు. 

అటువంటి వ్యక్తి భార్యగా తన స్థానం నిలబెట్టుకోవడం కోసం, భద్రపరచుకోవడం, సర్దుబాటు చేసుకోవడం కోసం నేలబారుగా ప్రవర్తించి తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టలేని కరుణ, భార్యాభర్తల బంధాన్ని లాభనష్టాల కాటాలో చూడని కరుణ లోకం దృష్టిలో మొండిది. లౌక్యం తెలియనిది. మొగుడిని కొంగున కట్టుకోవడం తెలియనిది.    


స్త్రీ పురుష సంబంధాల్లో ఉన్న అసమానతలు, డొల్ల తనాన్ని , ద్వంద నీతిని వేలెత్తి చూపే కథ కోకిల తల్లి. 

పిట్టతో, చెట్టుతో , పువ్వుతో మాట్లాడుకుంటూ వాటిలా విశాలంగా వికసించడానికి ప్రయత్నించే కరుణ  కథ కోకిల తల్లి.  


భక్తి పేరుతొ పూజల పేరుతో ఎదుటివారు పెంచుకున్న మొక్కల పూలను తస్కరించడం, చెప్పా పెట్టకుండా కోసేయ్యడం అదేమని అడిగితే అయ్యో దేవుడి పూలు ఆమాత్రం కోసుకోకూడదా అంటూ ఎదురుదాడి చేస్తుంటారు. కస్టపడి, ఇష్టపడి మొక్కలు పెంచుకున్నవారి మనసు ఎంత బాధపడుతుందో అర్ధం చేసుకోరు.  దేవుడి పేరుమీద నిర్ధాక్షిణ్యంగా  మొక్కనుండి వేరు చేసేసి, తాము పుణ్యం పొందాలని తాపత్రయపడిపోతుంటారు కొందరు. 

కానీ ఈ కథలో కరుణ పక్కింటి తోటలో పూలను యిష్టంగా చూసి చూపులతోనే వాటిని తుంపి కనురెప్పలపై వాటి భారాన్ని నెమ్మదిగా మోస్తూ పదిలంగా తెచ్చి ఆదిదంపతుల పాఠం ముందు ఉంచుతుంది.  

పూవు తుంచకుండా, హాని కలిగించకుండా మనసుతోనే అర్పణ చేయడం రచయిత్రి భావుకత, గొప్ప భావన. 


వివాహేతర బంధంలో పురుషుడికి చేరువైన స్త్రీని అల్పంగా చూసిన హైకోర్టు లాగే కొత్త కొత్త అందాలు వెతుక్కునే తన భర్త శ్రీకర్ తో బంధం కొనసాగించిన స్త్రీని నెరజాణ అనడం పంటికింద రాయిలా అనిపించింది. 


వి. శాంతి ప్రబోధ   





కామెంట్‌లు లేవు: