కుంకుడుకాయలో గింజ నలక్కుండా కుంకుడు కాయ కొట్టడం చాలా నేర్పుతో కూడిన పని. అలా చేయగల్గే నేర్పరితనం ఉంటే సంసారం బాగా చక్కదిద్దుకుంటారని .. మా నానమ్మ చెప్పేది.
గింజ నలక్కుండా కుంకుడుకాయ కొట్టడం నేర్చుకోకుండానే పెళ్లి చేస్తే ఎలా నానమ్మ ? అనే కోణంగి ప్రశ్న పుట్టుకొచ్చేది కూడా :)
పెద్దలు చెప్పిన విషయాలు గుర్తుకువచ్చినప్పుదు కొన్ని వాక్యాలు ఆలోచింపజేస్తాయి. ఇసుర్రాయి లో పడిన గింజ నలక్కుండాను, గింజ పగలకుండా కుంకుడు కాయ కొట్టడం రెండూ కష్టమా ? అంటే కష్టమేనేమో .కూడా !
కనబడకుండా ఆడవారి మనసు నొప్పిస్తూ జీవిత కాలం నెట్టేసే మగ వారిని చూస్తున్నప్పుడల్లా ఇసుర్రాయిలో గింజ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎందుకు అపహాస్యంలో, అభద్రతలో ఆడపిల్లల బ్రతుకులు ఉన్నాయని గుబులు పుడుతుంది .
తల్లిదండ్రులు జన్మనిస్తారు. త్వరగా పెళ్ళి చేసి భాద్యత తీరిందనుకుంటారు. అల్లుడిగా వచ్చేవారికి ఎన్ని ఆస్తులున్నాయా అనే తప్ప ఎన్ని దుర్వ్యసనాలు ఉన్నాయో.. ఆలోచించరు . డబ్బుంటే చాలనుకుంటారు. అదే ఆని సమస్యలకి పరిష్కారం చూపుతుందని అనుకుంటారు. ఇసుర్రాయిలో గింజలా నలిగిపోతారు ఆడపిల్లలు. ప్చ్ ..
ఇంకా చెప్పాలంటే ప్రేమ పెళ్ళి లాంటి ఉచ్చులలో పడకుండా పరువుగా పెళ్ళి చేసేసి కుటుంబ గౌరవం కాపాడుకున్నట్లు అవుతుందని తొందరపడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. కులం, మతం పట్టింపులు ఉంటే ఆర్దిక అసమానతలు ఉంటే పిల్లల్ని విడదీసి గొంతు నొక్కి పాశవికంగా హత్య చేసే వాళ్ళు ఉన్నారు . వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉండదు .తల్లిదండ్రులు సోదరుడు భర్త ,బిడ్డల చేతుల్లో కేంద్రీకృతమై జీవత్శవంగా బ్రతికేస్తారు.
ఆడపిల్లలకి చాలా వరకు కష్టాలు పెళ్ళితోనే మొదలవుతాయి . మొగుడు పెళ్ళాన్ని పాలించేవాడు ,సాధించే వాడుగా మారిపోతాడు. అమ్మాయి అమ్మ అవుతుంది. అమ్మ అమ్మాయి గురించి ఆలోచిస్తుంది .
పట్టణ ప్రజలను మినహాయించి మిగిలిన గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారందరినీ పరిశీలిస్తే వారందరూ అమ్మాయిలని కాలేజీ ముఖమైనా చూడకుండా పెళ్ళి చేసేస్తున్నారు .
ఆడపిల్లల మనసులో దాగున్న అనేక కోర్కెలు నెరవేరక,లభించిన జీవితంతో సరిపెట్టుకోలేక అసంతృప్తికి గురై నిస్తేజంగా బ్రతుకు వెళ్ళదీస్తూ ఉన్నారు .చాలా మంది పైకి కనపించినంత నాగరికంగా ఏమి లేరు ప్రజల మూఢ విశ్వాసాలు కొన్ని అలాగే ఉన్నాయి . ముఖ్యంగా కట్న కానుకలు సమస్య మాసిపోనేలేదు. అలాగే మగ పిల్లలు కావాలనుకునే సంస్కృతీ మారలేదు. కుటుంబంలో సాంప్రదాయం పేరిట అనేక ఆంక్షలు అలాగే ఉన్నాయి . భర్త ఎంత అనుచితంగా ప్రవర్తించినా ఎదురు ప్రశ్నించనే కూడదు . స్థిర ఆస్తులు ఎన్ని ఉన్నా .. స్వంతంగా ఖర్చు పెట్టుకోగల ఆర్ధిక స్వాతంత్ర్యం ఉండదు . ఇంటి పనులు, వంట పనులు భారం అనుకునే స్థితి వచ్చింది కూడా తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉండటం వలెనే! ఇంట్లో ఉన్న టీవి మాధ్యమం ద్వారా ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుసుకుంటూ తామున్న పరిస్థితికి బేరీజు వేసుకుని విరక్తి చెంది పిల్లల పెంపకంలోను నిర్లక్ష్యం వహిస్తూ .. పెంకితనం తోనూ, గయ్యాళి తనం తోనో .. పురుషులని సాధిస్తారంటే ఆశ్చర్యం కల్గుతుంది. ఇతరులతో పోల్చుకోవడం, నాగరిక జీవనం పై ఆకాంక్ష లాంటివి చోటు చేసుకుంటాయి .
చదువు, ఆర్ధిక స్వాతంత్ర్యం స్త్రీకి జీవితాన్ని తీర్చి దిద్దుకునే సంయమనంని ఇవ్వడమే కాదు అధిక లాలసతో, తెంపరి తనంతో జీవితాన్ని నాశనం చేసుకునే దైర్యాన్ని ఇస్తున్నాయి .సాంఘిక భద్రత కరువైపోయి ఆడపిల్లలకి మాన ప్రాణ రాక్షణ కరువైపోతుంది కుటుంబ హింస, సామాజిక హింస రాజ్య మేలుతున్నాయి ఇంకా ఇంకా చెప్పాలంటే సమానస్థాయి విద్యావంతులై ఉన్నప్పటికీ కూడా ఆడవాళ్ళనే చిన్న చూపు కూడా ఇంకా మిగిలే ఉంది స్వాభిమానం తో బ్రతకాలనుకోవడం నేరంగా పరిగణించే కాలంలోనే ఉన్నాం . తనకంటూ స్వంత ఇష్టం ,వ్యక్తిత్వం , తనకి నచ్చినది ఎంపిక చేసుకునే స్వేచ్చ కూడా లేని పంజరంలో పక్షిలా బ్రతికే వారు ఉన్నారు . ఇవన్నీ అధిగమించి పురుషునితో దీటుగా ఉన్నత స్థానంలో కూర్చున్నా.. నీకేం తెలుసు ? మాకు నచ్చినట్లు చేస్తాం అనే పురుష పుంగువుల అహంభావం ఉండనే ఉంది. అజ్ఞానంతోనూ .. అహంకారం తోనూ రెండు విధాలుగా నాశనం అయిపోతున్న ఆడ కూతుర్లుకేమి కొదవలేదిప్పుడు . లింగ నిష్పత్తితో బేరీజు వేసుకుని భయపడటం కన్నా చాలా విషయాలలో స్పష్టతకి రావడం అవసరమనిపిస్తుంది.
ముందుగా ఇంట్లో ఉన్న అవరోధాలని దాటగల్గి స్వావలంబన దిశగా అడుగులు వేస్తే సమాజంలో అవరోధాలని అందరూ కలసి చేధించగల్గడం సులువవుతుంది .
(ఈ పోస్ట్ చదివేవారికి చాలామందికి ఆడపిల్లల చదువులు పట్ల వ్యతిరేకత లేకపోవచ్చు . స్త్రీ పురుష సమాన విద్య ఉద్యోగ అవకాశాలు ఉండవచ్చు . అవి లేని వారి గురించి ఆలోచిస్తూ వ్రాసిన పోస్ట్ ఇది. అనవసర వ్యాఖ్యానాలు వలదని మనవి ) .
4 కామెంట్లు:
వనజగారు,ఇవి కొన్ని వాక్యాలు కావు.....వాస్తవాలు.నేటి సమాజంలో జరుగుతున్న వాటికి దర్పణంలా ఉన్నాయి.
excellent andi
మీరన్నది నూరుశాతం నిజం. తగిన విద్యార్హతలు లేకపోవడంతో అమ్మాయిలకు భర్తలు ఎలాంటివారైనా వాళ్లతో పడుండక తప్పనిసరి పరిస్థితివస్తోంది. చాలామంది భర్తలు పాతకాలపు ఆలోచనల్తో పెరిగినవారు కావడం ఇంకొక సమస్య. చాలామంది భర్తలు భార్యలను తమతో సమానంగా పరిగణించరు. భార్యల ఇష్టయిష్టలూ, ఆశయాలను చిన్నచూపుతో కనీసం పట్టించుకోనైనా పట్టించుకోవడం రివాజు. ఇలా అసంతృప్తితో బ్రతుకుతూ, దాన్ని బయటపడనీయక బయటివారికివాత్రం సుఖంగా బ్రతుకుతున్నామని చెప్పుకుంటూ సాగిపోతున్నారు చాలామంది అమ్మాయిలు.
రెండో విషయానికొస్తే ఆడపిల్లల విషయంలో మనం ఒక సంధియుగంలో ఉన్నాం. కొన్నిదశాబ్దాల క్రితంవరకూ ఆడపిల్లలకు అందమూ, అణకువా తప్ప ఇంకేమీ అఖ్ఖర్లేదని భావించాం. చాలామంది ఆడపిల్లలకు అవితప్ప ఇంకేమీ అలవడకుండా జాగ్రత్తగా పెంచాంకూడా. ఆడపిల్లలు అలాగే ఉంటారని, ఉండాలనీ అన్న ప్రోగ్రామింగ్కూడా మగపిల్లలకు జరిగిపోయింది. ఈ తంతు కొన్ని వేలఏళ్ళుగా జరుగుతూండడంవల్ల మన ఆలోచనల్లో ఇది భాగమైపోయింది. ఇప్పుడు ప్రచారమాధ్యమాలైతేనేమీ, పాశ్చాత్య ప్రభావమైతేనేమీ ఆడపిల్లలుకూడా స్వతంత్రంగా వ్యవహరించడం, మగపిల్లలతో పోటీపడడం చేస్తున్నారు. ఇది సహజంగానే పాతతరంవారికీ, పాతతరంవారి భావాలే పవిత్రమైనవనీ, మంచివనీ భావించబడే వాతావరణంలో పెరిగిన అబ్బాయిలకు మింగుడుబడడంలేదు. మనలో అక్షరాస్యత పెరిగిందనుకొని సంతోషపడుతున్నామేగానీ. పాతభావాలను వదిలించడానికి కేవలం అక్షరాస్యత సరిపోదు. ఉన్నతవిద్యకావాలి. కనీసం స్వతంత్రంగా ఆలోచించడం నేర్పే విద్యకావాలి. అటుపక్క కొందరు అమ్మాయిలూ కొత్తగా వచ్చిపడిన స్వాతంత్రమూ, పాతకాలంనాటి అందం-అణకువ భావజాలమధ్య తమకు ఏదిముఖ్యమో తేల్చుకోలేక తప్పటడుగులువేస్తున్నారు. అమ్మాయిలు పూర్తిగా సమర్ధతె తమ వ్యక్తిత్వాలకు గీటురాయి అని భావించి అలా నడుచుకోడానికి ఇంకా కొన్నాళ్ళు పడుతుందేమో.
well said madam
కామెంట్‌ను పోస్ట్ చేయండి