12, ఏప్రిల్ 2017, బుధవారం

మార్పొద్దు మాకు,మార్పొద్దు

నేను వ్రాసిన కథ 2017 ఏప్రిల్ నెల ప్రజాసాహితి మాస పత్రికలో .. 


"మార్పొద్దు మాకు, మార్పొద్దు"


బావ గారు... బావ గారూ  బాగున్నావా ?

రామారావు నవ్వుకుంటూ తలూపాడు.

నీ నెత్తిన  ముత్యాల వాన కురవ, ఎంత బాగ నవ్వుతావ్ ! ముచ్చుమొహం నాయాళ్ళు, మమ్మల్ని చూస్తే చాలు మీదబడి ఏం చేత్తామో అన్నట్టో, ముళ్ళ పంది పక్కన ఉండట్టో అవతలకి పో.. పో  అని తరుముతారు. నువ్వట్టా కాదు,  బంగారు బావ వి .. ఓ ప్లైయింగ్ కిస్ ఇచ్చింది. మళ్ళీ నవ్వాడు రామారావు.

"నవ్వుతో చంపేత్తావా ఏంటి. ముద్దు తీసుకుని జేబులో అన్నా  వేసుకో " అని బుగ్గ గిల్లింది.

"నిన్న అశోక్ నగర్ లో పండ్ల బళ్ళ దగ్గర  చూసాను నిన్ను. ఆటో దిగి యాపిల్ కాయలు తీసుకుని వెళ్ళింది నువ్వే కదూ !"

సమాధానం చెప్పకుండా  రెండు చేతులు కలిపి చప్పట్లు కొడుతూ నవ్వింది

 "మాకొచ్చే లాభం ఎంత ?   రోజూ వచ్చి ఈ వరసాన అన్నేసి కాయలేసుకెళుతుంటే  మేము ఏం బేరాలు చేయగలం అని   పండ్ల బండి అబ్బాయి విచార పడ్డాడు. ఇట్టా అందరి మీద పడి  దోచుకు తినకుండా పని చేసుకోవచ్చుగా "

అన్నాడు   సొరుగు లో నుండి ఇరవై రూపాయల నోటు తీసి ఇస్తూ.

"మీరు మాత్రం వ్యాపారాలు చేసి జనం దగ్గర దోచుకు తినడం లా  అట్టాగే మేమూనూ " బుగ్గ లాగి ముద్దు పెట్టుకుని అతనిచ్చిన నోటు తీసుకుని జాకెట్ లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళింది. రామారావు రోడ్డు పైకి చూసాడు. పది మంది దాకా హిజ్రాలు. అందులో అందరికన్నా ఎక్కువందం ఉన్న మనిషి రోడ్డు మధ్యలో ఉన్న గాంధీ బొమ్మ పక్కనే నిలబడి మిగతావాళ్ళని షాపుల వెంట తిరిగి డబ్బులు వసూలు చేసుకురమ్మని పురమాయిస్తుంది. వారానికి రెండు మూడుసార్లు అదే పని వాళ్లకి.  ఎవరైనా షాపు యజమాని డబ్బివ్వకపోతే ఎందుకివ్వవ్ నువ్వు ? అంటూ వాదనకి దిగుతారు. ఇంకాస్త మొండిగా ఉంటే బూతు సంభాషణలు చేసూ మీద మీద  పడటం కట్టుకున్న చీరని కిందకి లాగి చూడు చూడు అంటూ  రహస్య అంగాన్నిచూపిస్తూ  భయభ్రాంతికి గురి చేస్తారు. వాళ్ళతో ఈ గొడవంతా ఎందుకని చాలా మంది షాపు ముందుకొచ్చి అడగ్గానే పదో పరకో ఇచ్చి పక్కకి పంపేస్తారు.

తర్వాతింకో  రోజూ రామారావు హోటల్ ముందు   అలాంటి సరదా సంభాషణే ! అదే ఇరవై రూపాయల నోటు  ఇచ్చే చేయి. అడిగే అదే  ప్రశ్న .

"రోజూ ఇట్టాగే అంటావ్, మాకు పనెవరు  ఇస్తారెంటీ ? నువ్వు కానీ ఇస్తావా ఈ హోటల్లో పని "అంది హిజ్రా.

"నువ్వు వచ్చి చూడు ..ఇస్తానో లేదో !"

"ఇదే మాటమీద ఉండాలి బావోయ్ ! నా పేరు తేజా. రేపే వస్తా. నా ఇష్టమై నేను పని  మానేస్తే తప్ప నువ్వు నన్ను తీసేయకూడదు . అట్టా  అని మాటియ్యి " అంది అరచేయి ముందుకు చాచి .

"నేను మాటిస్తున్నా, నువ్వు రేపటి నుండి పనిలోకి రావాలి మరి"



జయా! నేను నూనె కొట్టు దగ్గరికి వెళ్లి రావాలి వచ్చి కౌంటర్ లో కూర్చుంటావా  ! క్రిందనుండి రామారావు పిలుపు.

ఇదిగో వచ్చేస్తున్నానండీ  !  వెళుతూ  పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళండి. రెండు పనులు అయిపోతాయి కదా ! అన్న అయిదు నిమిషాలకి రామారావుని పంపి క్యాష్ కౌంటర్ లో కూర్చుంటూ టేబుల్స్ మధ్య గిర గిరా తిరుగుతున్న మనిషిని  తెల్లబోయి చూసింది.


చమ్కీ వర్క్ చీర, వీపంతా కనిపించే జాకెట్, నడుం మడత కనిపించేటట్టు కట్టిన చీర సగం వక్షం కనినిపించేలా వేసుకున్న పైట   మేకప్ ఎంత మందంగా వేసినా షేవింగ్ చేసిన  గెడ్డం గురుతులు, బండ పెదాలకి దిట్టంగా అద్దుకున్న  లిప్టిక్.   నల్లగా బండగా మోటుగా నరాలుబ్బి కనబడుతున్న  చేతులకి  పెట్టుకున్న మెహందీ,  మోచేతులదాకా వేసుకున్న రంగు రంగు చౌక రకం గాజులు, పింక్ కలర్ గోళ్ళ  రంగు

 చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.  " ఎవరీమె !? " అడిగింది అసహ్యంగా ముఖం పెట్టి .

కొత్తగా పనిలో చేరింది . సర్వర్స్ తక్కువై కష్టమర్ కి టిఫిన్స్ అందడం లేటవుతుందని సార్ గారు   పెట్టారమ్మా !అన్నాడు చిన్నా .

ఎక్కడ నుండి తీసుకొచ్చారు ఈ సంతని  ? నిన్ను తీసుకొచ్చింది చాలక ఇంకొకరినా ? ఆయన  చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయ్. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే కష్టమర్స్ వస్తారా ? విసుక్కుంది.

చిన్నా బిక్కమొహం వేసుకుని నిలబడ్డాడు.ఏడాది క్రిందట వాడు అలా హోటల్ కి వచ్చి చేరినవాడే ! రామారావు రైలు దిగి వస్తూ జ్వరంతో పడి ఉన్న వాడిని తీసుకొచ్చాడు. ఎవరు కన్న  బిడ్డో ! వాళ్ళ నాన్న కొట్టాడని ఇంట్లోనుంచి పారిపోయి వచ్చాడంట. తిండి లేక జ్వరంతో సోయతప్పి ఉన్నాడు . నాలుగురోజులుంటే వాడి వివరాలు చెపుతాడు. ఈ లోపు వాడిని కాస్త కనిపెట్టుకుని చూస్తే చాలు  అని చెప్పి ఏడాదైంది. వాడిది ఏ ఊరో చెప్పడు. ఏనాడూ  అమ్మ,నాన్న, ఇల్లని అనడు. తిండి మకాం అన్నీ ఇక్కడే !

నూనె డబ్బాలు వేసుకుని వచ్చీ రాగానే రామారావుతో గొడవపడింది

"అందరూ అట్టా అంటే పేదా బిక్కి ఎట్టా బతుకుతారు జయా.  మనిషన్నాక కాస్తన్నా జాలీ,దయా ఉండొద్దూ  !? మాకు పని ఎవరిస్తారు అంటున్నారు వాళ్ళు . మనం పని ఇచ్చి చూద్దాం . అన్నీ సక్రమంగా ఉన్న వాళ్లకి పనిస్తే మాత్రం మనకి సమస్యలు రాకుండా ఉన్నాయా ? సమస్యలలో ఇది ఒక సమస్య అనుకంటే పోలా ?

" ఈ రోజుల్లో ఎవరిని ఎవరూ  ఉద్దరించక్కర్లేదు. ఎవరినాళ్ళు ఉద్దరించుకుంటే చాలు "

 అదివరకు రైలులో పురుడు పోసిన మనిషి గురించి చెప్పాను చూడు. గుర్తుందా ! అడిగాడు రామారావు.

"  ఊ"

"ఆమే  ఈమె ! " అన్నాడు. ఆమాట చెప్పగానే కొంచెం ప్రసన్నమయింది జయ.

 రిజిస్టార్ ఆఫీస్ లో పనిచేస్తూ మధ్యాహ్నం టిఫిన్ చేయడానికొచ్చిన రవి కుమార్  చేతులు కడుక్కుంటూ "రైలేంటి, పురుడేంటి  రామారావు గారూ " అని అడిగాడు .

"కదిలే  రైలులో ఒక ఆడకూతురికి నొప్పులొస్తే  అందరూ మాకెందుకులే అని పక్క బోగీలోకి వెళ్ళిపోయారట  . అందులో ఆడవాళ్ళూ కూడా బోలెడు మంది  ఉన్నారు  అప్పుడు ఈ తేజా నే నొప్పులు పడుతున్నామె పక్కనుండి  దైర్యంగా పురుడు పోసిందట. వాళ్ళలో స్పందించే గుణం,  మానవత్వం లేదనగలమా ! స్టేషన్ లో బండి ఆగాక మాత్రం అందరూ  వచ్చి ఆమెని మెచ్చుకున్నవాళ్ళే ! ఆ న్యూస్ పేపర్ లో వచ్చింది . ఫోటో కూడా వేసారు. ఆమే ఈమె అంటూ తేజాని చూపించాడు. 

"వెరీ గుడ్, వెరీ గుడ్ .. ఇక్కడేమిటి మరి  " ప్రశ్నార్ధకం అతని గొంతులో. 

"ఈ రోజు నుండి ఇక్కడ సర్వర్ గా పని చేస్తానంటుందండీ ! అవకాశమిచ్చి చూద్దామని "

"వెరీ గుడ్, వెరీ గుడ్ ... మంచి పని చేస్తున్నారు" అంటూ మెచ్చుకున్నాడు. టిఫిన్ సర్వ్  చేసిన తేజాకి పది రూపాయల టిప్  కూడా ఇచ్చాడు.  


రామారావు గారూ! ఏంటండీ ఈ దరిద్రాన్నితీసుకొచ్చి సర్వర్ గా పెట్టారు. తిండి తినబోతే వాంతొస్తుంది. ఆ కొజ్జాదాన్ని మానిపిస్తే తప్ప మీ హోటల్ లో అడుగు పెట్టను. కొంపదీసి దానితో వంటా గింటా చేయించడంలేదు కదా ! అన్నాడు సూర్యనారాయణ. అతనొక రచయిత.  టన్నుల కొద్దీ మానవత్వాన్ని గుమ్మరించి కథలు వ్రాస్తూ ఉంటాడు.

"సర్ ! వాళ్ళ వేష ధారణా కన్నా,  గర్భ దారిద్ర్యం కన్నా మన భావ దారిద్ర్యం ఇంకా నీచమైనది సర్ ! ఆలోచించి చూడండి, మీకే అర్ధమవుతుంది."

"వాళ్ళు ఎట్టా పొతే మనకెందుకండీ, ఎవరి రాత వాళ్ళది.  కుక్క బతుకు కుక్కది, పంది  బతుకు పందిది. ఏమైనా వాళ్ళని చూస్తే అసహ్యమేస్తుందండి." అన్నాడు వీలైనంత అసహ్యంగా ముఖం పెట్టి.


"మనం మాత్రం అందరం  ఒకేలా ఉన్నామా?  ఏ అవకరం లేకుండా ఉన్నామా !  వాళ్ళు అలాగ తప్ప వేరొకలా బతకలేమని తెలిసినవాళ్ళు.  దబాయించో,దౌర్జన్యంగానో, అడుక్కు తింటూనో ఏదో విధంగా బతుకుతున్నారు. అదిష్టం లేనివాళ్ళు పని చేసుకుని బతుకుతామంటున్నారు. వాళ్లకి ఏదో చేయూతనివ్వాల్సింది పోయి అలా  అసహ్యించుకుంటే ఎట్టాగండీ ! పోనీ ఇంకేట్టా బతుకుతాలో  మీరే  ఆలోచన చేసి రేపు చెప్పండి." సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అన్నాడు రామారావు 

ముఖం గంటు పెట్టుకుని వెళ్ళిపోయాడు సూర్యనారాయణ

పరిచయమున్న కొద్దిమందితోనే తనకి పోరాడటమింత కష్టంగా ఉంటే  ఇంత పెద్ద లోకంతో తేజా లాంటి వాళ్ళు ఎలా పోట్లాడగలరు? అందుకే వాళ్ళల్లో ఆ కసి, ద్వేషం అనుకున్నాడు .


.ఆ రాత్రికి తేజకి  వంట చేసే షెడ్లో చివరి గదిని  ఖాళీ చేయించి వసతి సౌకర్యం కూడా కల్పించాడు. చిన్నాకూడా

. నేను ఇక్కడే ఉంటాను అని ఉబలాట పడ్డాడు.  చిన్నాని చూస్తుంటే ఇంటిదగ్గరున్న తమ్ముడు గుర్తొచ్చాడు తేజా కి  పాలు కారే బుగ్గలు.  ప్రతిదాన్ని ఆసక్తి గా ఆశ్చర్యంగా  చూసే కళ్ళు.


" ఒరేయ్ చిన్నా ! తేజాని చూస్తుంటే నీకు భయమేయడంలేదా వాడితో కలిసి ఉంటానంటున్నావ్" అడిగింది జయ.

"భయమెందుకమ్మా .. ఆళ్ళూ మనుషులేగా "అన్నాడు ఆరిందలాగా.

 "నీకెంత ధీమా రా ! తర్వాతెప్పుడైనా ఏడ్చుకుంటూ వచ్చావనుకో నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెడతా ! "అంది జయ.

"బావగారు ... ఏమీ తోచక చచ్చిపోతన్నా. ఏ సినిమాకన్నా  పోదామంటే అక్కడ మా అడ్డాలమంద కనబడి లాక్కునిపోతారు. ఒక టీవి పెట్టకూడదూ."

 "ఇప్పుడు టీవి అడుగుతావ్, కొన్నాళ్ళకి ఏసి అడుగుతావ్ ! నువ్వెప్పుడు పోతావా అనినేను  ఎదురు చూస్తుంటే నువ్వు నిట్టాడిలా పాతుకుంటున్నావ్! ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే  మీ వూరు పోకూడదా తేజా"  అంది జయ.

" ఆయనే ఉంటే బోడిగుండు ఎందుకు అన్నట్టు ఆడ మాత్రం ఎవరుండారక్కా ! ఆదరించి ఇంత ముద్ద పెట్టేవాళ్ళు ఎవరూలేరు. ఎగతాళైన బతుకు కదా ఇది " విచారం నింపుకుని  చెప్పింది.

నిజంగా ఎవరూ లేరా !?

 లెక్కకి చానామంది ఉంటారక్కా, ఉండాల్లందరూ మనకి అయినాళ్ళు కాలేరుగా, పుటకలో లోపం వచ్చిందే అని కడుపులో బెట్టుకుని చూసినాళ్ళు ఎవరూ లేరు. చూడాల్సిన అమ్మేమో చచ్చిపోయింది. దుఃఖం పొర్లుతూ ఉండగా వెక్కి వెక్కి ఏడ్చింది.

 ఏడవకు తేజా .. ఇక్కడ మేమందరం లేమూ అంది భుజం మీద చెయ్యేసి . ఆ మాత్రం దగ్గరితనానికే కరిగిపోయి ఇంకా ఏడ్చింది . జయకి , రామారావుకి కూడా కన్నీళ్ళోచ్చాయి. చిన్నా తేజా పక్కనే అతుక్కుపోయి ఏడవకక్కా.. నాకు ఏడుపొస్తుంది అంటుంటే వాడిని దగ్గరకి తీసుకుంది. .


ఓ పదిరోజులు తర్వాత ఇంట్లో ఉన్న పాత టీవి తీసుకొచ్చి తేజా వాళ్ళ గదిలో పెట్టిచ్చాడు . అర్ధరాత్రి పాటలు చూస్తూ ఒరేయ్ చిన్నా నేను కూడా డాన్స్ వేస్తా. కరీనా కపూర్.కత్రినా కైఫ్ డాన్స్ వేయనా !  అంటూ అడిగి సమాధానం కోసం చూడకుండానే డాన్స్ వేస్తూ ఊగిపోయింది. చిన్నా కళ్ళార్పకుండా  ఆమెనే చూస్తూ  "అక్కా సినిమా వాళ్లకి నీకు  తేడా ఏమీ కనిపించలేదు.అచ్చం ఆళ్ళ లాగే ఉన్నావ్ "అన్నాడు.

"అక్కా ! నేను  కూడా నీలా మారతానక్కా" అంటూ తేజా చీరని  చుట్టుకుని తలపై పిన్ తో పూలు పెట్టి ముందుకు వేలాడేసుకుని  తను కూడా తేజా లాగా డాన్స్ వేయడానికి ప్రయత్నించేవాడు చిన్నా.

"వద్దురా చిన్నా. సార్  గారు మంచాడు. జయక్క మంచిది. బాగా వంట చేయడం నేర్చుకో , నీకు తీరికుంటే చదువుకో, అంతే కానీ నాతొ పోల్చుకోబాకు. పాడు బతుకు మాది". అంటూ కన్నీళ్లు పెట్టింది.


ఎన్నో ఏళ్ళ నుండి అలవాటుగా  ఆ హోటల్ కి వచ్చే సూర్య నారాయణ అతను రాకపోవడమే కాకుండా మరికొందరిని హోటల్కి రాకుండా చెడగొట్టాడు . అదివరకిటికన్నా కస్టమర్స్ తక్కువ రావడం, రామారావు దిగులు పడటం చూసి  "రామారావు గారు మీరు ఆమెకి పనివ్వడం బాగానే ఉంది కానీ ... ఆ అలంకారమే బాగోడం లేదు సార్. నేనొక  అయిడియా చెపుతాను, కాకపోతే మీకు ఖర్చు బాగా అవుతుందేమో "అన్నాడు రవికుమార్. 

"అన్ని  రోజులూ ఒకటేలా గడిస్తే ఏమీ బాగోదు లెండి.  అప్పుడప్పుడూ .. కొన్ని ప్రయోగాలు చేయాలి .. ఏం చేయాలో చెప్పండి"

"హోటల్ లో పని చేసే వాళ్ళందరికీ డ్రెస్ కోడ్ పెట్టేయండి. అప్పుడు జనాల చూపు అంతెక్కువగా ఆమె పై పడదు. అన్నాడు .

అదీ నిజమే ! అనుకున్నదే తడవు అప్పటికప్పుడు  స్టాఫ్ అందరికి రెండేసి జతల  బట్టలు కుట్టిచ్చాడు. దర్జీ వచ్చి కొలతలు తీసుకుంటున్నప్పుడు "బావగారు బావ గారూ ... మీరిట్టా నాకన్యాయం చేత్తారని అనుకోలేదండి. చీర కట్టుకోకుండా, గాజులేసుకుండా, పూలు పెట్టుకోకుండా నేనుండలేనయ్యా" అని మొత్తుకుంది,ముక్కు చీదింది కూడా.  

"నీకు పని కావాలా, అవన్నీ కావాలా ? అవన్నీ కావాలనుకుంటే రాత్రి పూట కట్టుకో,  పెట్టుకో. నీకు పని ఇచ్చి నష్టం తెచ్చుకుని రామారావు గారిని హోటల్ మూసేసుకుని రోడ్డున పడమనడం బాగుందా చెప్పు"  అని  అనునయంగా చెప్పాడు  రవి కుమార్. 

కొంత ఆలోచనతోనూ ,కొంత అయిష్టం తోనూ అందరితో పాటు డ్రెస్ వేసుకుని పని చేయడానికి ఒప్పుకుంది తేజా.


"అదివరకంతా  డ్రెస్ కోడ్ పెట్టామా ! కొత్తగా ఇప్పుడెందుకు?  నలబై ఏబై వేలు అదనపు ఖర్చు కాకపొతే ! ఇలా ఒక్కోటి పెంచుకుంటూ పొతే మనకి మిగిలేది చిప్పే ! ఏటేటా అద్దె పెరుగుతుంది, ఎంత బాగా క్వాలిటీ మెయిన్ టెన్ చేసినా,  నిజాయితీగా ఉన్నా పై వాళ్ళకిచ్చే మామూళ్ళు తగ్గట్లేదు. ఖర్చులు పెరుగుతున్నాయి లాభాలు తగ్గుతున్నాయి. వింటున్నారా..  నేను చెప్పేది మీకే, గోడకి కాదు  అంటూ విసుక్కుంది జయ


"ఊ ... "

" హోటల్ పెట్టి పదేళ్ళు అయింది. సొంత స్థలం కొనలేకపోతున్నాం. వస్తున్నప్పుడే నాలుగురాళ్ళు  వెనకేసుకుంటేనే  కదా  పిల్లలని బాగా చదివించగలం అనుకుంటే నువ్వు  జనాన్ని ఎట్టా ఉద్దరిచ్చాలా అని చూస్తున్నావ్! భగవంతుడే కాపాడాలి మనల్ని "

"ఓసి పిచ్చి మొహమా ! మనమేమి తెచ్చామే?  ఒక మూకుడు రెండు గరిటలు తప్ప. నేను చదివిన డిగ్రీ చదువు ఉద్యోగమిచ్చిందా ? మా నాన్న పట్టుకున్నట్టు  నేనూ గరిట పట్టుకున్నా.  చేతిలో విద్దె ఉంటె ఎక్కడైనా బతగ్గలం. మన పిల్లలకైనా అంతే !  బాగా చదువు చెప్పిద్దాం. వాళ్ళ బతుకులు వాళ్ళే బతుకుతారు. కొంప గట్రా, నగలు నాణ్యాలు అమర్చడం మన వల్ల అవుద్దా  ఏంటి ? "

"ఎప్పుడూ నేల  మీదే నడుస్తానంటావ్, కలలు కని వాటిని నిజం చేసుకుందాం అని పిల్లల విషయంలో అయినా అనుకోవు , నీ లాంటి తండ్రికి పుట్టటం నా పిల్లల అదృష్టం ".


ఆమె మాటల్లో వ్యంగం అర్ధమైంది రామారావుకి. మాటల్లో తన ఆలోచనలు అలా బయటపెడుతుంది తప్ప నేను చేసిన పనికి ఎప్పుడూ  అభ్యంతర పెట్టదు  జయ . ఆమె సహకారం లేకుండా నేనేం చేయగలను అనుకున్నాడు లోలోపల.


ఆ హోటల్ లో  అటు ఇటు కాని మనిషి పని చేస్తుందంట . మనం కూడా వెళ్లి చూసొద్దాం రండి అంటూ వచ్చే వాళ్ళు ఎక్కువయ్యారు. రామారావు హోటల్ కి రష్ ఎక్కువైపోయింది.  వచ్చిన కష్టమర్స్ అందరికి  నమస్కారం చెపుతూ ఆహ్వానించడం, మధ్య మధ్య  ఇంకేమి కావాలి బావగారూ , కాఫీ ఇమ్మంటారా బావగారూ  టీ ఇమ్మంటారా.. రెండూ కలిపి ఇమ్మంటారా ?  అంటూ జోక్స్ వేస్తూ తెగ సందడి చేయడం మొదలెట్టింది. రామారావు  కౌంటర్ లో లేనప్పుడూ టేబుల్స్ మధ్య డాన్స్ వేస్తూ ఇంకా అలరించడం చేస్తుండటంతో  తేజాకి టిప్ లు బాగానే రాసాగాయి.  

అందరూ వస్తున్నారు  అందరికీ లేని పట్టింపు నాకు మాత్రం ఎందుకూ ... అంటూ హోటల్ కి రాసాగాడు సూర్యనారాయణ. కానీ తేజా సర్వ్ చేస్తున్నప్పుడల్లా ఆ పేడి మనిషిని  నాకు సర్వ్  చేయడానికి వీల్లేదు నా ఆచారమంతా భ్రష్టు పట్టి పోతుందంటూ  అసహ్యంగా ముఖం పెట్టుకునే అతని వైఖరిని గమనించాడు  రవి కుమార్.  అతని  కళ్ళు తెరిపించాలనే  ఉద్దేశ్యంతో అతన్ని చూసినప్పుడల్లా చర్చలు చేయడం మొదలెడతాడు."అయ్యా సూర్యనారాయణ గారూ ఆ థర్డ్ జెండర్స్  చదువుకోవడానికి బళ్లోకి  వస్తే హేళన చేసేది మనమే ! ఇళ్ళకి పిలిచి దీవెన లిప్పించుకుని కానుకలివ్వడం అలవాటు చేస్తున్నదీ మనమే ! వాళ్ళు అలా తయారవ్వడానికి ఇతోధికంగా మనమూ ఓ చెయ్యి వేస్తున్నాం కదా ! అది మర్చిపోయి  ఇప్పుడు  చీదరించుకోవడం మాత్రం న్యాయమేనా "అంటాడు .   

వెధవది మనదేముందండీ !ఎలక్షన్సప్పుడు  ఓట్లు కోసం తిరిగిన నాయకులు గెలిచాక వాళ్లకి రేషన్ కార్డ్ ఇప్పించడంలో కూడా సహాయం చెయ్యరు. వీళ్ళకి నిరుద్యోగ భ్రుతో , పెన్షనో ఏర్పాటు చేయొచ్చుగా ! వీళ్ళు జన్నాల్ని పీక్కు తింటుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చుంటారు. మొన్నటికి మొన్న ఓ కోజ్జాది  మా అబ్బాయి చేతిలో ఫోన్ లాక్కుని జంప్ అయిపొయింది. పాతికవేల ఫోన్. ఎవరికీ చెప్పుకోవాలి మేము ... అని వాపోయాడు. 

"నిజమేనండీ .. అట్టా చేయడం మా వాళ్లకలవాటే" అంది తేజా.     


 అలా హిజ్రాల మంచి చెడులు బేరీజు వేసుకుంటూ  రోజులు సాపీగా సాగిపోతున్నప్పుడు   ఒక పోలీస్ వచ్చాడు. అతన్ని చూసి  గబా గబా లోపలి వెళ్ళిపోయింది తేజ .

"ఆ కొజ్జా గాడిని పనిలో పెట్టుకున్నారు. జాగ్రత్త రామారావు గారు. ఏదో ఒక రోజు వాడి మూకతో కలిసి మొత్తం దోచేసి పోతారు " .

 "వాళ్ళు దౌర్జన్యంగా అడిగి తీసుకుంటారు తినేవి  లాక్కెళ తారు  గాని దొంగతనం చేస్తారనే మాట నేనెప్పుడూ వినలేదండీ ! వాళ్ళని మీరెన్ని దొంగతనాల కేసుల్లో అరెస్ట్ చేసారో చెప్పండి సార్ !"

"మొన్నీ మధ్య ఈ  కొజ్జాది బ్యూటీ పార్లర్ కి వెళ్లిందంట. కనబడిన నెక్లెస్ బావుందని పట్టుకు పోయిందట. ఆ బ్యూటీ పార్లర్ ఆమె కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది."

మాట మాటకి కొజ్జా కొజ్జాది అనకపోతే .. పేరుతొ పిలవచ్చు కదండీ . ఆమె పేరు తేజ అని చెపుతుంది గా.

మీరు చెప్పారు కదా ! ఇక నుండి అలాగే పిలుస్తాను " వ్యంగంగా అంటూనే లోపలి వెళ్లి కూర్చుని టిఫిన్ కి ఆర్డర్ పెట్టాడు . తేజ అతనికి సర్వ్  చేసింది. నిలబెట్టి ఏదో అడుగుతున్నాడు. ఇద్దరి మధ్య కాసేపు వాదన.

రోజూ లాగానే రామారావు దగ్గరికి డబ్బుల కోసం వచ్చి నిలబడింది ఒక హిజ్రా .  అనుకోకుండా ఆమె దృష్టి  తేజా పై పడింది.  ఒంటి మీద డ్రెస్ ని, ఆమె చేస్తున్న పనిని ఆశ్చర్యంగా చూసి ...  నువ్వు ఇక్కడ చచ్చావా !? నువ్వు మీ వూరు వెళ్లిపోయావనుకుంటున్నాము.  ఉండు నీ సంగతి పెద్దమ్మ తో చెపుతా .. తర్జన గా వేలు చూపిస్తూ వెళ్ళింది.


 ఆ సాయంత్రం పూట  ఆరేడుమంది. ఎప్పుడూ లోపలికి  రానివాళ్ళు హోటల్ లోపలికి  జొరబడ్డారు . టేబుల్ ముందు   టిఫిన్ కోసం కూర్చున్నారు. వాళ్ళని చూసి తేజా గతుక్కుమంది. వాళ్ళు అడిగినవన్నీ తెచ్చి ఇచ్చింది. తిన్నంత తిని బిల్ ఇస్తాం బయటకి రా. నమ్మకంగా పిలిచారు . వాళ్ళతో కలిసి బయటకొచ్చింది.

"ఉంటే గుంపులో గోవిందలాగా నువ్వూ  మాతోనే ఉండాలి. లేదా మీ వూరికి పోవాలి. ఇక్కడ పనెందుకు చేస్తున్నావ్ ! పెద్దమ్మ నిన్నోచ్చి డబ్బులు కట్టమంది."

 "అక్కోవ్ ! నేనెందుకు డబ్బులు కడతానక్కా  !  ఈ అడ్డా  పెద్దమ్మసొంతమా ఏంటి ?  నేను కష్టపడి సంపాయిచ్చుకుంటున్నా, మీతో కలవాల్సిన పనిలేదు, మీరు చేసే పాడు పనులు చేయాల్సిన అవొసరం లేదు .. మూసుకుని పోండక్కా ! మందలు మందలగా ఎప్పుడూ ఇట్టా  రాబాకండి. నా నోటికాడ కూడు తియ్యబాకండి "అని లోపలికొచ్చేసింది.


పది రోజుల తర్వాత  రాత్రి నిశ్శబ్దపు దుప్పటి కప్పుకోవడానికి తయారుగా ఉంది. హోటల్ మూసేసి పై భాగంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిన కాసేపటికే  రోడ్డు మీద జరుగుతున్న గలాటాని గమనించి బయటకొచ్చాడు రామారావు. పది మంది దాకా ఉన్న హిజ్రా ల సమూహం. వాళ్ళ మధ్యలో తేజా.   వాళ్ళ మాటలే మాట్టాడుతూ నోరేసుకుని అందర్ని  చెలుగుతుంది. వాళ్ళందరూ వ్యూహాత్మకంగా తేజా చుట్టూ దడి కట్టేశారు. ఏదో అనర్ధం జరగబోతుందని సూచనందుతుంది అతనికి .   వాళ్ళని అదుపు చేయడం తన వల్ల కాదనుకుని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తూ ఉండగానే

"పెద్దమ్మ  ఎవరని  అంటావా ! పని చేసి బతుకుతానంటావా !? పని చేసి బతుకుతావంటరా ... పన్జేసి ఆ మాట  అనకుండా కొట్టండి రా నా కొడుకుని" .అంటూ తేజాని  పిడి గుద్దులు గుద్దుతూ  కిందకి నెట్టేసారు.

"ఏంటి గొడవ ? ఎందుకు కొడుతున్నారామెనీ?"  అడుగుతూ గబ గబా కిందకి వస్తూనే ఉన్నాడు రామారావు

"అక్కో ..  మగాడ్ని పిలిచినట్టు వాడు వీడు అంటావేంటక్కా , నేను ఆడదాన్ని కదా . అది ఇది అనొచ్చు గందా ! "దెబ్బలు తిన్న బాధకన్నా కూడా ఆడదాన్ననే సృహ పోతున్నందుకెక్కువ  బాధతో .

"నిన్ను మాలో కలుపుకుంటే మాత్రం నువ్వు మాలాగా  ఉన్నావంట్రా ! పని చేసుకుని బతకాలనే బుద్ధి  నీకెందుకు పుట్టాలిరా !  పైగా పేపర్లో కూడా  సర్వర్ యేషంలో  ఈడి  ఫోటో. అది చూసిన పతోడు మీరు కూడా అట్టా  కష్టపడి బతకొచ్చుగా అంటన్నాడు. నీకు పని ఇచ్చినట్టు మాకెవరు ఇస్తార్రా నాయాలా "  అంటూ కసిగా    అందరూ కలిసి  తేజాని చితక బాదేసి ఆపై ఇనుపరాడ్తో  తలపై బాదేసి  రెడీగా పెట్టుకున్న ఆటో ఎక్కి  పరారైపోయారు.

 రామారావు జరిగిందేమిటో అర్ధమై నిశ్చేస్టుడిలా నిలబడిపోయాడు .


 "అక్కా  తేజక్కా  మాట్టాడక్కా , నువ్వు మాట్టాడకపోతే నాకు భయమేస్తుందక్కా " అక్క తలని ఒడిలో పెట్టుకుని ఏడుస్తున్నాడు చిన్నా.


"ఒరేయ్ ! చిన్నా ..  నువ్వు నాలాగా మారొద్దురా.  మీ ఇంటికెళ్ళి పో. బాగా చదువుకో . నాలాగా మారొద్దురా, మారొద్దు, మా ... రొద్దు ,మా ,,,రొ .. " తల వాల్చేసింది.


పై అంతస్తు నుండి క్రిందికి చూసిన జయకి  చిన్నా ఒడిలో తలవాల్చేసిన తేజా   చీలికలైపోయి రక్తంతో తడిసిన చీర,జాకెట్ , ప్రక్కనే పడి ఉన్న పెడేడ్  బ్రా , తెగిన చెవినే  వ్రేలాడుతున్న బుట్టలోలాకులు, దూరంగా విసిరేసిన  సవరపు జడ  అందులో వాడిన పూలు చాలా వికృతంగా కనబడ్డాయి  వాళ్ళ సమూహం లాగే  మిగిలిన సమాజం లాగే. 


కామెంట్‌లు లేవు: