నాకు నదుల పుట్టుక, వాటి పరీవాహక ప్రాంతాలు నదులొడ్డున వెలిసిన నాగరికత ఇవన్నీ చూడటం, తెలుసుకోవడం ఒక ఆసక్తి. అనుకోకుండా ఒకరోజు అర్ధరాత్రి నదీ తీరానికి వెళ్ళాల్సి వస్తుందని ..మహాభారతంలో గాంధర్వ పర్వంలో ఒకే రేవులో అనేక మంది స్త్రీలు దుఃఖిస్తూ తమ సౌభాగ్యాన్నితుడిచేసుకుంటూ నల్లపూసలని తెంచి వేసినట్లే ఈ ఆధునిక కాలంలో కాస్తో కూస్తో అభ్యుదయ భావాలతో బ్రతికే నాకు అలాంటి స్థితి వస్తుందని నేనేనాడు ఊహించలేదు. అందులో "గడప బొట్టు' లాంటి కథ వ్రాసిన నాకు వాస్తవ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏం చేయాలో అన్న స్పష్టమైన ఆలోచనయితే ఉంది కానీ ఇంత దారుణంగా అర్ధరాత్రి నదీ తీరానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు. అసలలాంటి తలంపే నాకు పెద్ద అవమానంగా తోస్తాను.
ఎందుకంటే.. నాకు చిన్నతనం నుండి భర్త చనిపోయిన స్త్రీలని తోడబుట్టినవారు, బంధువుల మధ్య కూర్చోపెట్టి మరీ చేసే తతంగాలంటే పరమ అసహ్యం . మా పెద్దనాన్నగారి కూతురు అక్కకి ఇలాంటి తంతే నిర్వహించారని తెలిసి బాధపడ్డాను. అక్కని ఇంటికి నిద్రకి పిలిచినప్పుడు ఆమె వస్తున్నప్పుడు ఎదురుగా వెళ్ళొద్దని లోపలి గదిలోకి కూర్చోమని మా అమ్మ ఆజ్ఞ జారీ చేసినా నేను పట్టించుకోలేదు. అక్క వచ్చినప్పుడు ఆమెకి ఎదురుగా వెళ్లి చూసాను కూడా ! ఆనక అమ్మ చేత రెండు మొట్టికాయలు తిన్నాను. మరి కొంత కాలానికి నేను పురిటి మంచంలో ఉండగానే తాతయ్య చనిపోయి మా నాయనమ్మకి అలా చేస్తుంటే తట్టుకోలేక ఏడ్చేసాను. మా అన్నయ్య, చెల్లి మేమంతా వ్యతిరేకించినా మా మాట చెల్లుబాటు కాక అనాగరిక మూక ఆమెని ఆ అర్ధరాత్రి సమయంలో మరింత దుఃఖానికి గురిచేసే తీరారు.
పసుపు రాసుకోవడం, ఇంత మందాన కుంకుమ దిద్దుకోవడం, రంగు రంగుల గాజులేసుకుని, నిర్దాక్షిణ్యంగా పూలని తెంపి జడలో అలంకరించుకోవడం వాటి వల్లే అందంగా ఉన్నామని భ్రమ పడటం లాంటివన్నీ లేని దాన్ని. అలాగే మనిషికన్నా తాళిని గౌరవించడం పరమ పవిత్రంగా కళ్ళకద్దుకోవడం లాంటివన్నీ చేయని పెడసరి మనిషిని కూడా! అకస్మాత్తుగా మా ఇంటికి బంధువులో తెలిసిన వారో వస్తే కొత్తగా మతం పుచ్చకున్న వారి మాదిరిగా కనబడతాను. ఎవరన్నా సుద్దులు చెప్పినా వినేసి, నవ్వేసి ఊరుకుంటాను తప్ప నా కిష్టం లేని పని ఎన్నటికి చేయని మొండిదాన్ని. అలాంటి నా చేత తెల్ల చీర (విధవరాలు కట్టే చీర ) కట్టించి కొంతమంది తృప్తి పడ్డారు. తోడబుట్టిన వారికి మంచిది కాదంట, కీడు జరుగుతుందని కొందరు ఏవేవో వ్యాఖ్యానాలు.
నా భర్తకి పదమూడు నెలల క్రితం ఊపిరి తిత్తుల కేన్సర్ అని నిర్ధారణ అయింది. ఒక ఆధునాతన చికిత్సా కేంద్రం లో ఆ విభాగానికి చెందిన వైద్యులు కూడా కొన్ని నెలలు మించి బ్రతకడం కష్టం.. చికిత్చ కూడా వద్దని సూచించారు. అయినా చికిత్చ చేయించదల్చాము. బ్రతికినన్నాళ్లు వైద్యుల సూచన మేరా నడుచుకుంటూ ఉన్నాను. చికిత్చ చేయించాము.
నలబై రోజుల క్రితం ఆయన చనిపోయిన తర్వాత నాలుగో రోజు నుండీ విపరీతంగా వస్తున్న బంధువులని చూసి నా మనసులో మాటని మా కుటుంబాలలో ఉన్న అత్తలు,ఆడపడుచులు, తోటి కోడళ్ళు అందరూ కలసి కూర్చున్నప్పుడు చెప్పేసాను. పసుపు రాయడాలు కుంకుమ తుడవడం,గాజులు పగల గొట్టడం లాంటి విషయాలు నేను ఏమీ చేయను . నాకు వాటి పట్ల ఆసక్తితో ఎప్పుడూ ధరించలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ధరించి వాటిని తీసేయడం లాంటివి నేను చేయను, మీరందరూ ప్రత్యేకించి ముఖం చూసే రోజు అంటూ రావద్దు, స్వీట్స్ లాంటివి తేవద్దు. వివాహం ద్వారా నాకు ఏదైతే నా శరీరం పై తోడైనవో అవే తీసి ప్రక్కన పెడతాను. మిగతావి నేను చేయను అని చెప్పాను. ఈ తరం వారందరూ హర్షించి మనఃస్పూర్తిగా అభినందించారు. అత్తల తరం వారు కొంత వ్యతిరేకత ..ప్రక్క గదిలోకి వెళ్లి చర్చలు పెట్టారు.
నాకు తెలుసు ..నాకు తెలుసు . నా చుట్టూ ఉన్నవారందరూ దేని గురించి ఆలోచిస్తున్నారో .. నాకొక అగ్ని పరీక్ష పెట్టదల్చారన్నది నాకు సుస్పష్టంగానే తెలిసిపోతుంది. ఇలాంటిది ఏదో ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక సంవత్సర కాలం నుండి నేను తయారుగానే ఉన్నాను. జనన మరణాలు మన చేతిలో ఏమీ ఉండవన్నది రోగికి వైద్యం చేస్తున్న డాక్టర్లకి కూడా తెలియదు.ఏ రోజున ఏమి జరగనున్నదో .. ఆయనకన్నా నేను ముందుగా చనిపోతే ? అన్న ఆలోచన వచ్చి ఆగిపోయేది కూడా ! జరిగేది జరిగి తీరింది. ఇక జరపాల్సింది మా వంతు అన్నట్టు ఉన్నారు ఈ కొందరు. మా అత్త గారు కూడా సాంప్రదాయాలు అని పెట్టింది ఎందుకు ? అవన్నీ చేయకపోతే ఎట్లా ? అని వ్యాఖ్యానించినట్లు విన్నాను. ఎవరి సూచన మేరకో మా అన్నయ్య భార్య గాజులు, పూలు, పసుపు కుంకుమ స్వీట్స్ తెచ్చి నా ఎదురుగా పెట్టింది. స్వీట్స్ తెచ్చి డైనింగ్ టేబుల్ పైన మిగతావన్నీ తీసి అద్దం అరమారలో పెట్టేసాను.
మా హౌస్ ఓనర్ కాల్ చేసి తొమ్మిదో రోజునో, పదకొండో రోజునో, పదిహేనోరోజునో చేసే కార్యక్రమాలు అన్నీ ఇంట్లో చేయవద్దు అని చెప్పారు. పెద్ద కర్మ లాంటి సంస్కరాలన్నీఏమీ ఇంట్లో చేయము,పార్కింగ్ ప్లేస్ లో చేసుకుంటాం అని చెప్పాను . మళ్ళీ తొమ్మిదో రోజు, పదకొండోరోజు అంటూ ప్రత్యేకించి చెపుతుంటే అప్పటికి గాని విషయం నాకర్ధం అయి అలాంటివన్నీ ఏమీ చేయను అని చెప్పాను. దాదాపు పన్నెండు నిమిషాల సమయం అదే విషయం రిపీట్ చేస్తూ వచ్చారు . నాకు మనసుని మెలేసే నొప్పితో పాటు చెవి నొప్పి వచ్చి మాట్లాడటం ముగించాను. సొంతిల్లు లేకపోవడం అంటే ఏమిటో అర్ధం అయి మనో దుఃఖం వెల్లువలా ముంచేసింది నన్ను. తర్వాత రోజు నా కొడుకు పెద్దవాళ్ళు అందరూ కూర్చుని పెద్ద కర్మ రోజు ఎంతమందిని పిలవాలి, ఎంత ఘనంగా చేయాలో బందుమిత్రులకి చేసే విందు భోజనాల్లో ఏమేమి వంటకాలు వడ్డించాలి అని మాట్లాడుకుంటుంటే.. నేను తక్కువ ఖర్చుతో ముగించేసి ..ఏదైనా అనాధ శరణాలయానికి విరాళం ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ మాటని తోసి పుచ్చి ఘనంగా చేయాల్సిందే అన్నాడు నా కొడుకు. చావు కూడా పెళ్ళి లాంటిదే అన్న మాటలని,తీరుని నిజం చేయాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు మరి.
అదే సమయానికి మళ్ళీ నాకొక ఫోన్ కాల్ . మా ఇంటి ఓనర్ పిన్ని గారు .. ఇంట్లో పదకొండో రోజో, పదిహేనో రోజో చేసే కార్యక్రమం చేయొద్దు అని. పైగా ఆ మాటలని విన్నపం అనుకోమని చెపుతుంటే నాకు ఎందుకు బ్రతికి ఉన్నానా అని విరక్తి కల్గింది. నేను దుఃఖిస్తూ ఉంటే మా అబ్బాయి చాలా బాధ పడ్డాడు. మానాన్నగారికి ఏమి చేయాలో కొడుకుగా నేను అన్నీ చేస్తాను . అమ్మని మాత్రం అలా చేయి, ఇలా చేయి అంటూ మీరెవరూ బలవంతపెట్టవద్దు. ఆమెకి ఎలా ఇష్టం అయితే అలా ఉండనీయండి అని చెప్పాక కాస్త సతాయించడం మానుకున్నారు. అర్ధంలేని ఆచారాలతో అనుమానపు భయాలతో సంకోచించే వీళ్ళందరూ చదువుకున్నవారు సెక్యులేషన్,సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు. షేర్లు ధర ఎప్పుడు పతనం అవుతుందో తెలియదన్నట్లు ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు కదా ! ఇంట్లో ఎందుకు చనిపోనిచ్చారు . ఎప్పటి నుండో అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కదా ..ముందు తెలియలేదా అన్న ఆరాలు. ఆయన బాత్ రూమ్ కి స్వయంగా వెళ్లి బయటకి వచ్చిన తర్వాత పడిపోయి మనిషిని లేవదీసే క్రమంలో నా రెండు చేతుల మధ్య ఊపిరి అందక ఊపిరి ఆగిపోయిన మనిషి. నెలలు మాత్రమే బ్రతుకుతారనుకున్న వ్యక్తిని సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాచుకుని కాపాడుతున్నాను. ఆయనకి సమయం వచ్చేసింది వెళ్ళిపోయారు.
విగతజీవిగా మారిన ఆయన్ని రెండు గంటలు నట్టింట్లోనే పరుపు వేసి పడుకోబెట్టాం. సంప్రదాయం ప్రకారం తల వైపు దీపం కూడా వెలిగించలేదు. మార్చురీకి పంపి ఖండాంతరంలో ఉన్న కొడుకు వచ్చిన తర్వాత దహనక్రియలు చేయడం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు జరుపుతూ మా పార్కింగ్ ప్లేస్ లో నుండి ప్రక్కవారి పార్కింగ్ ప్లేస్ లోకి వారి భౌతిక కాయం జరిగినందుకు వారు చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. పైగా ఆ భార్యాభర్త లిరువురు టీచర్ ఒకరు ఎం.ఈ.ఓ ఒకరు. వీరు పాఠశాలల్లో పిల్లలకి ఏం సంస్కారం నేర్పుతారో ! .అడుగడునా మూడాచారాలు. నిత్యం పూజలు చేస్తారు, దుఃఖంలో ఉన్న, వారి ప్రక్కనున్న సాటి మనిషి పట్ల క్రూరంగా వ్యవహరిస్తారు. ఆఖరికి మా పార్కింగ్ ప్లేస్ కి తెరలు అడ్డుకట్టుకుని కార్యక్రమం జరిపించాము. వేరే ఫంక్షన్ హాల్ లో భోజనాలు ఏర్పాటు. ఆరోజు మా ప్రక్క పార్కింగ్ ప్లేస్ లో కారు పార్క్ చేసే ఉంచారు. ఇంకొక వికృతం ఏమిటంటే ..ఆ రోజు నా చేత తెల్ల చీర కట్టించడం నా ముఖం బయటకి కనబడకుండా కట్టడి చేయడం లాంటి మూర్ఖాచారాలు బలవంతంగా అమలు చేయించడంలో మా అత్త గారు కృతక్రుత్యులయ్యారు. అయినా నా స్నేహితురాండ్రు ఇద్దరు నా దగ్గరికి వచ్చి కూర్చుని నాకు అండ అనిపించారు.
ఆయనకీ ఆరోగ్యం బాగోలేదు అని తెలిసిన తర్వాత మొట్టమొదటగా నేను హౌస్ ఓనర్ తోనే విపులంగా మాట్లాడాను. మరి ఒకవేళ ఇంట్లో ఉండగా జరగరానిది జరిగితే మీకేమన్నా అభ్యంతరాలు ఉంటాయా ? అని . మాకు అలాంటివి ఏమీ లేవు ఆంటీ ..ఇంట్లో ఏమీ చేయొద్దు పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకోండి, కార్యక్రమాలు అవి అక్కడే చేసుకోండి అని భరోసా ఇచ్చారు ఆమె. హమ్మయ్య అనుకున్నాను. ఆ భరోసా వల్లనే మావారి స్వగ్రామం వెళ్ళిపోవాలని అనుకుని కూడా ఈ ఇంట్లోనే ఉండిపోయాం. కానీ వారు మరణించిన తర్వాత వీళ్ళందరి మనస్సులో భయాలు, అనేకానేక అనుమానాలు,మూడాచారాలు చూస్తే మనం నాగరిక ప్రపంచంలో ఇంటర్నెట్ యుగంలో బ్రతుకుతున్నామన్నది అబద్ధం అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడు ఉన్నా లేకపోయినా నీడ అంటే సొంత గుడిసె చిన్నదైనా ఉండాలనిపించింది. ఒకానొక దశలో చాలా అసహనంతో ఇంటి ఓనర్స్ కి ఏ ఏ హక్కులైతే ఉంటాయో అద్దెకి ఉన్నవారికి అవే హక్కులుంటాయి. ఆ హక్కులన్నవి ఏమిటో లాయర్ చేత ఒక నోట్ తయారు చేయించి ఇంటి గోడకి అతికించి మరీ చేయాల్సిన కార్యక్రమం చేసుకుంటాం అని అన్నాను . అప్పుడు నాకొక లాయర్ సపోర్ట్ గా కూడా ఉన్నారు. కానీ నేను అలాంటిదేమీ చేయలేదు. నాకిప్పటకీ ఇంటి ఓనర్ల పైన ఎలాంటి కోపం, నిరసన కూడా లేదు. లక్షలు,ఎకరాలు,నివేశన స్థలాలు అన్నీ పోగొట్టుకున్నా ఎప్పుడు పోయినవనే బాధ కూడా లేని నాకు తొలిసారిగా బాధ అనిపించింది. ఇలాంటి సమయాల్లో సొంత ఇల్లు లేకపోవడం అనే అవమానం తట్టుకుని నిలబడాల్సి వచ్చింది.
ఇక తర్వాత రోజునుండి నా దినచర్య మాములుగా సాగిపోవాలి తప్పదు, ఆ సమయాన అనేక మానసిక సంఘర్షణలు ఉన్నా వంట చేయడం అన్నది అందులో ముఖ్యమైనది. నెమ్మదిగా మనసు సంభాళించుకుని లేచి నిలబడి దైనందిత జీవితంలోకి వచ్చేసాను. మంచి రోజు చూసి పుట్టింటికి నిద్రకి వెళ్ళమన్నారు. అయిష్టంగా తల అడ్డంగా ఊపాను . అక్కడ మళ్ళీ హితోక్తులు. పుట్టింటివాళ్ళకి కీడు . ఇప్పుడు వెళ్ళకుండా తర్వాత ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళడం కుదరదు అని . అక్కడ తలవంచాను. మిత్రులు,బంధువులు అందరూ వెళ్ళిపోయారు. పుట్టెడు దుఃఖం వెంటబెట్టుకుని నా కొడుకు వెళ్ళాడు. తర్వాత బ్యాంక్ పనుల నిమిత్తం, కూరగాయలు తెచ్చుకోవడానికి, కరెంట్ బిల్లు కట్టడానికి అన్నింటికీ నేను మాములుగా బయటకి వెళుతున్నాను. నిత్యం సాయిబాబాని కొలిచే వాళ్ళు ఆయన చెప్పినవి, ఆచరించి చూపిన వాటిలో ఒక్క మార్గంలో కూడా నడవరు. ఒకే ఫ్లోర్ లో ఎదురుగా ఉన్న ఇంట్లో మనిషి చనిపోతే చిన్న పలకరింపు కూడా పలకరించని మనుషులని చూసాను నేను .
ఇక ఇంట్లో నుండి అడుగు బయట పెట్టగానే డభేల్ మంటూ ముఖాన తలుపు వేసుకునే వాళ్ళు , నేను కనబడగానే ముఖాన చెంగు వేసుకుని ముఖం దాచుకునే వాళ్ళు ,ఎదురుగా ఎప్పుడూ కనబడే మనుషులే అయినా చిన్న చిరునవ్వు నవ్వకుండా ముఖం బిగదీసుకునేవాళ్ళు ఇవన్నీ షరా మామూలే ! వీళ్ళందరినీ చూసి నేను నవ్వుకుంటాను . నాకు ముఖాన కుంకుమ పెట్టుకోవాలనిపిస్తే మట్టి గాజులు వేసుకోవాలనిపిస్తే పూలు పెట్టుకోవాలని అనిపిస్తే నిరభ్యరంతంగా పెట్టుకుంటాను. ఎవరు ఏమనుకుంటారో అని నేను పట్టించుకోను. వాస్తవ జీవితాల్లో స్త్రీల జీవితంలో మతాలకి సంబంధించిన ఆచారాలు ఇప్పటికి కఠోరంగా ఉన్నాయి. ఇంకా అజ్ఞానం పేరుకునే ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రాజారామ్మోహన్ రాయ్ ,కందుకూరి వీరేశలింగం గారు ఈ మూర్ఖపు సమాజంలోని మనుషులతో ఎంత యుద్ధం చేయాల్సి వచ్చిందో అన్నది తలుచుకుని తెరిపిన పడతాను. ఈ అనుభవం ఇతరుల సానుభూతి ఆశించి పంచుకోవడం లేదు నేను. సమాజం ఇప్పుడు కూడా ఇలాగే ఉంది అని తెలియజేయడానికి మాత్రమే ! నిజంగా నేను చేసిన యుద్దంలో నేను ఓడిపోయాను. ఇది మరీ అవమానంగా ఉంది నాకు. నాలాంటి, మీలాంటి వారు మార్పు కోరుకున్నా మారని, మారనివ్వని మనుషులు మన మధ్యనే ఉన్నారు.
ఇంకో విషయం ఏమిటంటే ..ఇలాంటి మూడాచారాల వల్ల హిందూ ధర్మం పట్ల కూడా విముఖత కల్గుతుంది. మానసిక వికాసం లేని మతం,ఆచారం, ధర్మం మనకి ఏల..అని ఆలోచనలు వస్తాయి. చానల్ కి ఒక లేక నలుగురైదుగురు పండితులు, గురువులు, ప్రవచనకారులు ఉన్నారు కదా ! what is the meaning of culture? what is the meaning of rituals, ? ఏమిటో అన్నది అజ్ఞానులకి తెలియజేయాలి .
"సముద్రమంత అజ్ఞానాన్ని ఎని కాగడాలు వెలిగించి పారద్రోలగలం" అని చలం గారన్నట్లు మతాలూ,ఆచారాలు పేరిట ఉన్నఅజ్ఞానాన్ని మనం పారద్రోలాలని నా ప్రయత్నం నేను చేసాను.
జీవన పోరాటంలో ఎన్నో యుద్దాలు చేసాను .. అన్ని చోట్లా నేనే గెలిచాను . కానీ ఈ యుద్దంలో నిస్సందేహంగా నేను ఓడితిని .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి