1, నవంబర్ 2021, సోమవారం

ప్రేమే నేరమౌనా!?

 భోజనం బల్లపై కంచాలు పెడుతుంది దేవకి. ఎలక్ట్రిక్ కుక్కర్ లో  తయారై వున్న బిర్యాని గిన్నెను డిష్ మ్యాట్ పై ఉంచింది అంతకుముందే.  సోఫాలో కూర్చుని మొబైల్  చూసుకుంటున్న కూతురు తలతిప్పి చూసి మసాలా వాసనను ముక్కుతో ఎగబీల్చి బిర్యానీ అనుకుంటా అంది తమ్ముడితో. మొబైల్ లో నుండి తలెత్తి చూసి బ్రహ్మాండం బద్దలైందన్నమాట అన్నాడతను. 


“అదంతా ప్రేమేనంటావా నాకైతే నమ్మశక్యంగా లేదు”

అని భుజాలను ఎగరేసింది. నిమ్మకాయను ముక్కలుగా కోస్తున్న దేవకి పిల్లలిద్దరిని గమనిస్తూవుంది. 


చేతులు కడుక్కొని వచ్చి బల్లపై వుంచిన కంచాలలోకి బిర్యాని పెట్టి చికెను కూరను వడ్డించి ప్లేట్స్ ను రెండింటిని రెండుచేతులతో తీసుకెళ్ళబోయాడు వాసుదేవరావు.


“ఎక్కడికీ అటుతీసుకువెళతారు, వాళ్ళే వచ్చి ఇక్కడ కూర్చుంటారు” అంది భర్త తో.


“ఎక్కడైతే ఏముంది పిల్లలు తినడం కావాలి కానీ “ అనుకుంటూ ప్లేట్స్ వారిచేతికిచ్చి ఫ్రిజ్ తెరిచి నీళ్ళసీసాలు కూడా వారికి అందించాడు. 


దేవకి భర్త ప్లేట్లో వడ్డించింది. తను వడ్డించుకుని కుర్చీ లాక్కుని కూర్చుంది. భర్త  వచ్చి కూర్చున్నాక తినొచ్చు అని. అతనొచ్చి  ప్లేట్ తీసుకుని వెళ్ళి పిల్లల మధ్య కూర్చున్నాడు. ముగ్గురూ తింటూనే తింటున్నదానికి వొంకలు పెట్టారు. 


“డాడీ అసలామెను ఎందుకు చేయనిచ్చావ్, బిర్యానీ తిన్నట్టు లేదసలు. పసుపేసిన ఉప్మా ముద్ద తిన్నట్టు వుంది. చికెన్ కర్రీ కూడా టేస్ట్ గా లేదు “ అంది కూతురు సిరి.


“మీ డాడీకి వచ్చినట్టు నాకు వంటచేయడం  రాదు.అలాగే రెస్టారెంట్ టేస్ట్ ను తెప్పించడం నావల్లకాదు. శుభ్రంగా ప్రేమగా చేసింది తింటే మీకు ఆరోగ్యం నాకు ఆనందం “ అంది . 


“నీ ఆనందం కోసం మమ్మల్నీ చప్పిడి కూడు రుచిపచీ లేని చెత్తను తినమంటావా, మమ్మీ! మా వల్ల కాదు నీ వంట తినడం. డాడీ నీకు దణ్ణం పెడతాను నువ్వే వంట చేయి “అంది మరొకసారి వడ్డించుకోవడానికి వచ్చి. 


దేవకికి ఒళ్ళు మండిపోయింది. “కుంభాలకు కుంభాలు మెక్కుతానే వుంటావు. వొంకలు పెడతావు. అంత వొంకలు పెట్టేదానివి మీ నాన్ననైనా వండి పెట్టమని అడగడం ఎందుకు?  ముడ్డిమీదకు ముప్పై ఏళ్ళు వస్తున్నాయి వంటచేయడం నేర్చుకోవడమో అమ్మ చేస్తుంటే సాయం చేద్దాం అన్న ఇంగితం మాత్రం లేదు. “


“నా ఇష్టం నేను డాడీతోనే వంట చేయించుకుంటాను ఆయన వండి పెడితేనే తింటాను. నీ ముష్టివంట తినడం నీ దెప్పుళ్ళు భరించడం నావల్ల కాదు “ అంటూ తినడం ఆపి తింటున్న ప్లేట్ ను కోపంగా సింక్ లో పడేసి పంపు కట్టెయ్యకుండానే గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. 


వాసుదేవరావు భార్య వైపు కోపంగా చూసాడు. కొడుకు తల్లి వైపు నిరసనగా చూస్తూ “బ్రహ్మాండం బద్దలవుతుందని నేను ముందే చెప్పాగా” అన్నాడు. 


ఇద్దరూ తిన్నంత తిని నొప్పించే మాటలతో ఆమెకూ కడుపునింపేసారు. కూతురుకు గిన్నెలో పెరుగన్నం కలిపి తీసుకువెళుతూ.. “ ఇపుడు నీ కళ్ళు చల్లబడినయ్యా” అన్నాడు భర్త.


కళ్ళనీళ్ళు తింటున్న కంచంలో పడతాయని చీరచెంగుని అడ్డుపెట్టుకుని ముఖం పక్కకు తిప్పుకుంది. ఇది ఆమెకు కొత్తేమికాదు.. 


పిల్లల భావస్వాతంత్ర్యప్రకటన ఆమెను ముల్లులా గుచ్చుతూనే వుంటుంది. మరీ మనసు నొచ్చుకున్నప్పుడు మాత్రం కళ్ళనీళ్ళు ఊరుతుంటాయి.


ఆలోచనల పరంపర.. 


“పిల్లలతో పంతాలు ఏమిటీ.. వారివి అంతా ” బూ.. బు” అనుకో”


“తండ్రి పిల్లలను ప్రేమిస్తే ఈర్ష్యపడే తల్లిని నిన్నే చూస్తున్నా” అనడం


తనొక పాడి పశువు. సంపాదించి వారికి ఏటి ఎమ్ కార్డును పువ్వులలో పెట్టి అందించే పాడిపశువు” అంతే!


తండ్రి మాత్రం ముద్ద ముద్దకు నెయ్యి పోసి కాలుకందకుండా పిల్లలు ఏవి అడిగితే అవి అపురూపంగా అందించడమే తన పని అన్నట్టు వుంటాడు. సినిమాలు షికార్లు రెస్టారెంట్ లకు తిప్పడం. మొత్తానికి సమాజానికి మంచి తండ్రి మంచి భర్తగా కనబడతాడు.


పైగా దేవకిపైనే నెపం


“ఆమెకు  సంపాదిస్తున్నానని అహంకారం. పేచీకోరు జగమొండి పిల్లలకు ప్రేమ పంచడం రాదు. తల్లి లాగా ట్రీట్ చేయదు. అడుగడుగుకి  ఆంక్షలు పెట్టాలని చూస్తుంది. పిల్లలతో ఫ్రెండ్ లాగా మసలాలి అంటే ఊరుకోదు. క్రమశిక్షణ వుండాలి ఎవరి పనులు వారు చేసుకోవాలి అని అంటుంది అని ప్రచారం చేస్తూ వుంటాడు.


“పిల్లలకు మనం తప్ప ఎవరు చేసి పెడతారు,మనమే కదా అన్నీ “ అని నెత్తికెక్కించుకునే తండ్రి అతను.వారేమో నూతిలో కప్పల్లాగా సమాజసృహ లేకుండా వ్యక్తిగత ఆనందం సంతోషం తప్ప మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా వుంటారు.చదువు ఉద్యోగం స్వీయానందం తప్ప సమాజంతో పనిలేదు అన్నట్టు కేజ్ బర్డ్స్ లాగా తయారయ్యారు. అది భరించలేదు దేవకి.  


ఆమెలో నిత్యనూతన వేదన ఒకటే! తల్లి ఉనికిని భరించలేని పిల్లలను చూస్తున్నాను అది నా దురదృష్టం. చేస్తున్న పని చేయొద్దు అని కూడా అనదు. మరొకసారి ఆలోచించుకో అన్నా కూడా నువ్వేంటి నాకు చెప్పొచ్చేది అన్నట్టు చూస్తారు. ఏ మాటామంతీ అయినా వారి ముగ్గురి మధ్యే. వారి మధ్య తనొక అనామకురాలు.


ఇలా.. భోజనాల బల్లముందు కూర్చునే తానున్న దీనస్థితిని బేరీజు వేసుకుంటుంది.. దేవకి. 


*********


సిరికి చదువు పూర్తైనప్పటి నుండి సంబంధాలు వస్తూనే వున్నాయి. వాసుదేవరావుకు కూతురుని తన సామాజికవర్గం వారికి ఇచ్చి చేయాలని కోరిక. అందుకు సిరి మంచి ఉద్యోగంలో కుదురుకుని ఆర్ధికంగా బలపడితే తన కోరిక సులభమవుతుందని ఆలోచనతో.. చిన్న పిల్ల పాతికేళ్ళన్నా రాకుండా పెళ్ళి ఎలా చేస్తాము అని దాటేసేవాడు. 


సిరికి ఉద్యోగం వచ్చింది. కొడుక్కి చదువు అయిపోయింది. అబ్బాయి కోచింగ్ లు తీసుకోవాలి. అమ్మాయి  ఏదో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుండాలి.. ఎందుకీ బాధంతా.. హైదరాబాద్ లోనే ఇల్లు అద్దెకు తీసుకుని అందరూ కలసి అక్కడ వుండాలని నిర్ణయించుకున్నారు. మీరందరూ ఇలా ఉన్నపళాన వెళ్ళిపోతే వొంటరిగా నేను ఎలా వుండగలను అని దేవకి అనుకోలేదు. పోన్లే పిల్లలు ఉద్యోగాలలో కుదురుకునేదాకా వుండి తర్వాత భర్త వచ్చేస్తాడులే అనుకుంది. 


ఇక వారి ఆలోచనలు చూస్తే మరొకలా. పిల్లలకు రక్షణగా నేను వుండాలి అని తండ్రి అనుకుంటాడు.  డాడీ వుంటే సకలం అమర్చిపెడతాడు. తమకు కావలిసినవి వండి పెడతాడు తమతోపాటు సరదాగా తిరుగుతాడు పైగా అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని సలహాలివ్వడు. లైఫ్ ను ఎంజాయ్ చేయాలి గో హెడ్ అంటూ ప్రోత్సహిస్తాడు అనుకున్న పిల్లలు. కనీసం తల్లి ఒక్కటే ఎలా వుంటుంది అని చిన్నపాటి  ఆలోచన చేయకుండానే తమకు కావాల్సిన వస్తువులను సర్దేసారు. సిరిని ట్రైన్ ఎక్కించి లగేజ్ ను ట్రాన్స్పోర్ట్ లో వేసేసి  తండ్రి కొడుకు టూ వీలర్ వేసుకుని నగరం బాట పట్టేసారు.


ఖాళీ అయిన ఇల్లును చూసి దేవకి గుండె బద్దలైంది. పగలు ఉద్యోగంతో గడిచిపోయినా రాత్రుళ్ళు ఒంటరిగా వుండాలంటే భయమేసింది. 


కనబడని పంజరాలెన్నో

ఈ ఆడ బ్రతుకులకు


అనుబంధాల సంకెళ్ళెన్నో

పేగు ని  తెంచి జన్మ నిచ్చిన అమ్మలకు


 ప్రేమతోనో బరువుతోనో తడిసిన రెక్కలతో  

స్వేచ్ఛగా యెగరలేని  అక్కు పక్షులు 

ఈ ఆడమనుషులు.


అని దుఃఖించింది. 


పిల్లలు చిన్న పిల్లలగా వున్నప్పుడు భర్తకు సరైన ఉపాధి దొరకక పస్తులుండాల్సిన పరిస్దితులలో పోరాటం చేస్తూ చదువు కొనసాగించింది. పసిబిడ్డను ఒడిలో వేసుకుని చదువుతూ వుండేది.ఆమె కష్టం అదృష్టం ఫలించి ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది. కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తన భాద్యత అనుకుంటూ పిల్లల ఆలనపాలన భర్తకు వదిలేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాతైనా పిల్లలను చూసుకోవాలనుకున్నా భర్త సహకారం లభించేది కాదు. వాళ్ళను పెంచడం నీ వల్లకాదులే. వారికి ఇలా తినిపించాలి ఇది పెట్టాలి అంటూ వొంకలు పెట్టేవాడు. నిజమే కాబోలు అని నిర్లక్ష్యం వహించడం వల్ల పిల్లలు అతనికి పూర్తిగా మాలిమి అయిపోతున్నారని గ్రహించేలోగానే అది జరిగిపోయింది. అమ్మా ఆకలవుతుంది అని అడగాల్సిన పిల్లలు డాడీ ఆకలి డాడీ కథలు చెప్పవా.. డాడీ చాక్లెట్ కావాలి డాడీ ఐస్ క్రీం కావాలి లాంటివితో మొదలెట్టి డాడీ ఫిజాలు బర్గర్ లు కావాలి... అని అడగటం వరకే కాదు.. వరుడు చదువు ఉద్యోగం అందం ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్  ఇలా వుంటేనే పెళ్ళి చేసుకుంటా అని తండ్రితో చర్చించేదాకా కూతురు.  


మీరు పెళ్ళి చేసుకుని ఏం సాధించారు. చిన్నప్పటినుండి చూస్తున్నాను.  ఎప్పుడూ గొడవలే! మీరు ఏమి సంతోషం అనుభవించారు? మళ్ళీ అలాంటి ఊబిలోకి నన్ను దించాలని చూస్తున్నారు. నాకసలు పెళ్ళే వద్దని భీష్మించుకున్న కొడుకు అజయ్. అరే! ఇంతలోనే పిల్లలు ఎలా ఎదిగిపోయారు అనిపిస్తుంది దేవకికి.  వారి  ముగ్గురు మాటలకు తాను మూగమనిషిలా తలవూపడం మాత్రమే అలవాటైపోయింది.  


కూతురుకి ముఫ్పై ఏళ్ళు వచ్చినా పెళ్ళి ఊసులేదు. ఉన్న ఉద్యోగంతోపాటు కావాల్సిన  హంగు ఆర్బాటాలు వుండటం తెలిసిన తర్వాతనే  వరుడి గుణగణాలు గురించి విచారణ చేస్తున్నారు. అమ్మాయికి థర్టీ ప్లస్ అయితే ఆమెకన్నా కొద్ది సంవత్సరాలు లేదా సమ వయస్కులనే కావాలనుకుంటారు. వ్యక్తిత్వం గుణసంపన్నత నచ్చడం లేదు ఎవరికీ. మనిషి సంపాదనే అన్నింటికి మూలం అన్నట్టు వుంటున్నారు. మనుషులే అనేకానేక కోర్కెల పుట్టలు. పెరుగుతూ పోవడమే తప్ప ఆగడం వుండదు .అసలు మనిషికి  ఎన్ని సంతోషం కలిగించే వస్తువులు, పరిస్థితులు ఉన్నా, మంచి వాటిని అశ్రద్ధ చేసి మనం అసంతృప్తి నే వెదుక్కుంటున్నామేమో! అనిపించింది దేవకికి. 


ఒకోసారి పిల్లలు గురించి భర్త గురించి తనెందుకు ఇంతలా ఆలోచించడం అని అనుకుంటుంది కానీ నిరంతరం వారి గురించే ఆమె ఆలోచన. ఆ రోజుల్లో భర్త సరైన ఉద్యోగం చేసి కుటుంబపోషణ భారం వహిస్తే అందరి తల్లులలాగానే పిల్లలను తనే పెంచుకునేది కదా! అది చేతకాక  పిల్లలను పెంచడం రాదనే అపవాదు వేసుకుని బ్రతుకుతుంది. పిల్లలకు తనకూ మధ్య వారధిగా వుండాల్సిన భర్త శకునిలా ప్రవర్తిస్తున్నాడు. పిల్లలకూ తనకూ అడ్డుగోడ కట్టి  సైకలాజికల్ గా తనను దెబ్బతీస్తున్నాడు. అది దేవకి భరించలేకపోతుంది. అంతులేని అసహనం పిచ్చి కోపం. ఎవరిపైన ప్రదర్శించాలో తెలియదు. తన ఉద్యోగానికి కూడా న్యాయం చేయలేకపోతుంది. విపరీతమైన కోపం వచ్చినపుడు ఏదైనా వస్తువులను బద్దలు కొడదాం అనిపించేది. మళ్ళీ అవి కొనడానికి సంపాదించడానికి పడిన కష్టం సర్దుబాట్లు గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకునుకుని తనను తాను హింసింసుకోవడం మొదలెట్టింది. 


ఆ విషయాన్ని మాత్రం  సీరియస్ గా తీసుకున్న భర్త పిల్లలు ఆమెను సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు. సఫలం అయ్యారు. ఏముంది అక్కడ!?.. నెపాలన్నీ ఆమె పైనే. కౌన్సిలింగ్ మందులు ఆమెకు మాత్రమే లభించాయి. 


 దేవకి తన బాల్యాన్ని తన స్నేహితులను  బంధువులను అందరిని గుర్తుచేసుకుంటుంది. ఎంత బాగుండేవి ఆ రోజులు. పెద్దగా ఆంక్షలు లేని జీవితం ఆడపిల్లల చదువుకు అభ్యంతరం పెట్టని కుటుంబం స్వేచ్ఛగా నచ్చిన పుస్తకాలు చదువుకోవటం వల్ల జ్ఞానం వికసించడమే కాదు మనుషుల మధ్య కులం మతం ఆస్తి అంతస్తులు భేదం వుండదనే భావంతో వాసుదేవరావుతో స్నేహం చేసింది. అతనికీ అభ్యుదయభావాలు వుండటం వల్ల ఆ స్నేహాన్ని ప్రేమగానూ ప్రేమను వివాహం గానూ మార్చుకున్నాక ఇరువురి కుటుంబాలు వారిని దూరం పెట్టడం జరిగిన తర్వాత వారికి  బ్రతకాలంటే బాగా బ్రతకాలంటే కులం మతం అవసరం లేకపోయినా డబ్బు కావాలని తెలిసింది.  


వాసుదేవరావు అభ్యుదయం భార్యను ఉన్నత చదువుచదివించడానికి బాగా పనికివచ్చింది. తను చదివినా రాని అవకాశాలు భార్య చదువుకుంటే వస్తాయని సులభంగా గ్రహించి తను కష్టపడిన డబ్బుతో భార్యకు ఫీజులు కట్టి చదివించాడు. అతని మాటల్లో చెప్పాలంటే భార్య మీద పెట్టుబడి పెట్టి ఆ లాభాన్ని నెల నెలా వసూలు చేసుకుంటున్నాడు. భార్య అంటే ప్రాణమున్న మనసున్న మనిషి కాదు. డబ్బు సంపాదించే ఒక యంత్రం. పిల్లలను కనిచ్చిన ఉపకరం. ఆమె సంపాదించి యిచ్చిన డబ్బుపై ఆమె నవమోసాలు కనియిచ్చిన బిడ్డలపై ఆధిపత్యం వహిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అతిశ్రద్ద వహిస్తూ మంచి భర్త మంచి తండ్రి స్థానం సంపాదించేసాడు. 


దేవకి కి తెలుసు. తమ వివాహబంధం లో లోతైన వ్యాపార సంబంధమైన చిక్కుముడి ఉందని.ఇద్దరు మనుషులు పదిమంది సాక్షిగా మొదలుపెట్టీ..  మొదట ఆసక్తితో మొదలై తర్వాత తర్వాత  వెగటుపుట్టి  యెవరికివారు ఆ బంధంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయి తప్పుకు తిరుగుదామని చూస్తారు. కానీ అప్పటికే నెత్తికెత్తుకున్న బరువును భాద్యతను దించుకునే వెసులుబాటు ఉండదు గనుక ఒక విధమైన హింసా ప్రవృత్తి బయటపెట్టుకుంటారు. కొంతమందికి మానసిక హింస ఆయుధమైతే మరికొంతమందికి అదీ  మగవాళ్ళైతే శారీరక హింస ప్రదర్శిస్తారు. ఆలుమగల మధ్య స్నేహం ప్రేమ అనే పదాలకు అర్థాలు తెలీకుండానే  అవసరాల ప్రాతిపదికపై రోజులు సంవత్సరాలు గడిచిపోతాయి. వెనుకటి  తరాలు  కూడా ఇలాగే వెళ్ళమారిపోయాయేమో!కొంతమందేమో  అలవాటైన మనుషులకు ప్రదేశాలకు  వస్తుసౌకర్యాలకు వ్యామోహాలకు తలొంచి కొంత అవసరార్థం  ఏదో‌ అలా సర్దుకుని వెళ్ళిపోతూ ఉంటారు. 


తను మాత్రం బిడ్డల ప్రేమ కోసం భర్త స్నేహం కోసం పిడికెడంత ఆత్మీయత కోసం అలమటించిపోతుంది. ఒకోసారి  పిల్లలకూ తనకు మధ్య ఓ తరం  వ్యత్యాసం వుందని వారి ఆలోచనావిధానానికి తమ ఆలోచనావిధానానికి తేడా వుందని  మనసును సర్దిపెట్టుకుంటుంది. కానీ భర్త మళ్ళీ కావాలనే ఏదో ఒక వివాదం రగిలిస్తున్నట్లు అన్పిస్తుంది.  బిడ్డలు తొందరపాటుతో ఒకమాట తూలితే మందలించాల్సిందిపోయి  ముసి ముసిగా నవ్వుకుంటాడు. తనను బిడ్డలు విలువ తక్కువగా ట్రీట్ చేస్తే అతనికి అందులో అంత ఆనందం ఎందుకో అర్దం కాదు. 


భర్త ఆర్ధిక ప్రణాళికల వల్ల చేతిలో డబ్బులు మెదలకపోవడం తన వాళ్ళెవరన్నా సహాయం అడిగినా చేయలేకపోవడం వల్ల వారి దృష్టిలో పిసినారిగా స్వార్దపరురాలిగా మానవత్వం లేని మనిషిగా తన బాగు తను చూసుకునే మనిషిగా ముద్రింపబడిపోయింది. తనకంటూ ఒక్కరంటే ఒక్కరు ఆత్మీయులనువారిని ఆమె మిగుల్చుకోలేకపోయింది. తను ఏమి కోల్పోయిందో అది అర్దమయ్యేసరికి ఆమె మానసికంగా కృంగిపోయింది.అనారోగ్యం చుట్టుముట్టింది. మానసిక అనారోగ్య ముద్ర తోడై.. శుష్కించిపోతుంది. 


ప్రేమించడమే తాను చేసిన నేరమా... 

నిజంగా సైక్రియాటిస్ట్ కౌన్సిలింగ్ అవసరం ఎవరికి!? 


*********


దేవకి ఆలోచిస్తూనే వుంది.


పిల్లలను అర్దం చేసుకునే అవసరం గురించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ యివ్వాలా?

లేక తల్లిదండ్రులను అర్దంచేసుకోవడానికి  పిల్లలకు కౌన్సిలింగ్ అవసరమా.. ? 


ఫ్యాషన్, సినిమాలు, పార్టీలు, పుడ్ ఆర్డరింగ్ లకు అలవాటైపోతున్న యువతకు తెలిసింది మాత్రం ఒక్కటే.డబ్బు బాగా సంపాదించాలని. అంతే! డబ్బు  వుంటే అన్నీ ఉన్నట్టే అనుకుంటున్నారు. అందుకోసమే చదువు తప్ప మనిషిని మౌఖికంగా అంతర్ముఖంగా ఆలోచింపజేసే జ్ఞానం కోసం చదవడమో.. ఏ పని చేసైనా గౌరవంగా సంపాదించాలి అనే ధ్యేయం కోసమైతే కాదు. పరిస్థితులకు అనుగుణంగా బ్రతకడం కూడా తెలియని అయోమయంలో చిన్నపాటి కష్టమొచ్చినా తట్టుకోలేని బలహీనంగా పైపై మెరుగులతో బ్రతుకుతున్నారు. తమ పిల్లలూ అందుకు అతీతం కాదు. 


చదువుకుని ఉద్యోగాలు చేస్తూ నాగరికంగా బ్రతుకుతున్న యువతకు తమ తల్లిదండ్రులు తమను ఎంత కష్టపడి పెంచారో గుర్తుకు చేసుకోవడం అస్సలు యిష్టం వుండదు. వారిని వారి శ్రమను గౌరవించడం తెలియదు. ఆ.. పెంచారులే గొప్పగా.. రేపు మేము ఎలా పెంచుతామో చూడండి అంటూ పిల్లలు అడగకుండానే ముందు ముందే అమర్చి కష్టం తెలియకుండా పెంచుతున్నారు.


స్త్రీలు కూడా సమాన అవకాశాలు పేరిట పోటీపడటం మంచిదే అయినా మరొక విధంగా తనలా ఇబ్బంది పడుతున్నారు. మానసిక వేదన అనుభవిస్తున్నారు.బిడ్డలు పసి బిడ్డలుగా వున్నప్పుడు తల్లి పూర్తి సమయం కేటాయించి బిడ్డలను సంరక్షించలేకపోయినట్లైతే కుటుంబంలోనే అనేక పాత్రలు పసిమనసులలో తల్లి పట్ల ద్వేషం వ్యతిరేకముద్ర వేయడానికి బలంగా పనిచేస్తాయి. 

బి కేర్ పుల్ .. అమ్మల్లారా..అని హెచ్చరించాలనపిస్తుంది.


కొడుకు అజయ్ తో ఒకసారి వివరంగా మాట్లాడింది.“నిన్ను కడుపులో మోస్తున్నప్పుడూ రెండుపూటలా కడుపునిండా ఆహారం తినడానికి లేక ఎంత విలవిలలాడిపోయేదాన్నో. సరైన ఆధారం లేక తినడానికి తిండిలేక పూట  గడవడం కూడా కష్టమైపోతున్నప్పుడూ మళ్ళీ ఇంకొకరికి జన్మనిచ్చి ఆకలికేకలకు బలిచేయడమెందుకు అనే ఆలోచనతో చిన్న జీతానికి కూడా పనిచేసి కడుపునింపుకున్నాను. నా పిల్లలకు ఆకలి తెలియకూడదు అని రాత్రుళ్ళు అదేపనిగా మేల్కొని పోటీపరీక్షలకు పడీపడీ చదివేదాన్ని. అలాంటి కష్టాలన్నీ పడి మిమ్మలను కనీ ఉద్యోగం సంపాదించి మీ నాన్న చేతుల్లో పోస్తుంటే ఆ డబ్బుతో మీరు అడిగినవన్నీ సమకూర్చే  ఆయన మంచి తండ్రయ్యాడు నేను ఎందుకూ పనికిరాని తల్లిని అయ్యాను. ఇదేనా మీరు తల్లిని అర్దం చేసుకుంది అని ఏడ్చింది దేవకి. కొడుకు కాస్త అర్దం చేసుకుంటున్నట్టు అనిపించాడు. కూతురే మరీ కొరకరాని కొయ్య. అన్నీ తండ్రి ఆలోచనలే.. తండ్రి నుంచి నేర్చుకునే మాటలే. తల్లిని బాధ పెడతాయనికూడా వెరపులేదు. 


పిల్లలు సంపాదనా పరులయ్యాక సొంత యింటి కోసం లోన్ అప్లై చేసి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు  ఎవరి కోర్కెలకు అనుగుణంగా వారికి  గదులు కేటాయించడం అయిపోయాక దేవకి కి హాలు ఒక్కటే మిగిలింది. హాలు కూడా అందరి అభిరుచికి అనుగుణంగా రూపొందించాక ఆమెకు వంట గది కూడా మిగలలేదు. అక్కడ కూడా వాసుదేవరావు అభిరుచి ఆక్రమించేసింది. తనది కాని తన యింట్లో తనకు ఇంత స్వేచ్ఛ మిగలకపోయింది అనుకుని వాపోయింది. పోన్లే తన పిల్లలే కదా వారికి కోరికలు వుంటాయని సర్దుకుంది. ఎవరి గదులు వారికి ఏర్పడ్డాక భర్త తనతో అన్యోన్యంగా వుంటాడని ఆశపడింది. ఒంటరిగా వున్నప్పుడైనా తనను కాస్త లాలించి ప్రేమించి గుండెల్లో పొదువుకుని సేదదీరుస్తాడన్న ఆశ అడియాస అయింది. భర్త భాద్యతలను గుర్తుచేయాల్సిరావడమన్న సిగ్గుమాలిన దుస్థితిలో తాను వున్నందుకు విరక్తి చెందింది. 


దేవకిలో పూర్తి నైరాశ్యం అలుముకుంది. ఇంట్లో ఎవరికీ తన అవసరం లేదు తాను సంపాదించే డబ్బు తప్ప. ఆ మాటే అంటే.. నీ డబ్బుతో కట్టిన యిల్లు అవడం మూలంగానే కదా నువ్వు ఈ మాట అంటున్నావు రోజూ నరకం చూపిస్తున్నావ్ నీ యింట్లో నువ్వే వుండు కావాలంటే మేమే వెళ్ళిపోతాం అని ముగ్గురూ వెళ్ళడానికి సిద్దపడిపోయారు. వాళ్ళనే ఆ యింట్లో వుండనిచ్చి తనే వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచన చేసింది కూడా దేవకి. హితురాలుకి సూచనాప్రాయంగా తెలిసి మందలించింది. “ఎక్కడికి వెళతావ్ ఇల్లు వదిలేసి? ఎంతకాలం వుంటావు వారిని ఎవాయిడ్ చేసి? మీ పిల్లల ఆలోచన విధానమే బాగోలేదు.. తల్లిని అర్దం చేసుకోకపోయినా పర్లేదు కానీ ఆమె మనసును బాధ పెట్టకూడదనే ఇంగితజ్ఞానం లేకపోయిందే. కుటుంబ సభ్యుల మధ్య తల్లి బిడ్డల మధ్యే అవగాహన అర్దం చేసుకునేశక్తి లేకపోతే వీళ్ళు ప్రపంచంతో ఎలా సంభాళించుకోగలరు? -


వీరికి వివాహమైతే జీవిత భాగస్వామ్యితో ఎలా సర్దుకోగలరు? ఎల్లకాలం తండ్రి సపోర్ట్ వుంటుందా కొంచెమైనా ఆలోచించరేంటి పిల్లలు!? దేవకి నువ్వు కూడా ఇలా ఊగిసలాడే మనస్తత్వంతో  వుంటే వారు నిన్ను మరీ బలహీనురాలిని చేస్తారు. పిల్లలు కూడా స్వార్దపరులే. వాళ్ళ దారి వారిని చూసుకోనీయ్.. లేదా నువ్వే వారి ప్రవర్తనకు అలవాటు పడిపో” అని గట్టిగా మందలించింది. 


 పిల్లలిద్దరికీ రిమోట్ వర్క్ మూలంగా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. కూతురు ఏదో పరీక్షలకు పడీపడీ చదువుతుంది. వాసుదేవరావు నువ్వు వారిని డిస్ట్రబ్ చేయకు నీకు దణ్ణం పెడతాను అంటూ దణ్ణం పెట్టేసాడు కూడా. దేవకి ఉద్యోగం చేస్తున్న ఊరిలో చిన్న గది అద్దెకు తీసుకుని వుందామనుకుంది ముందు. తర్వాత ఒక ఆరునెలలు మెడికల్ లీవ్ తీసుకుని దూరంగా వెళ్ళి వుందామనుకుంది. ఆర్దిక పరిస్థితులు ఆమెను ఆ ప్రయత్నం విరమించుకోమని హెచ్చరిస్తున్నాయి అంటే కూడా సమంజసనీయం కాదు. ఆమెను అలా మలిచేసేసాడు భర్త. ఆమె సంపాదనను ఎలా ఖర్చుచేయాలో ఏయే బాకీలు తీర్చాలో అన్నీ ఒక ప్రణాళికలా ముందుగానే నిర్ణయించబడేవున్నాయి.  నా పిల్లలూ భర్త నన్ను అర్దంచేసుకోలేకపోయినపుడు ఆ జంజాటాలన్నీ నాకెందుకు అని దేవకి అనుకోలేదు. అలా అనుకోకుండా ఆమెను ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ లో పకడ్బందీగా బంధించివేసాడు భర్త. 


పతి సుతులు  హితులు అంతా స్వార్ధం కంపు డబ్బు కంపు కొడుతున్నారు. రంగు రుచి వాసన లేని రుతువులు దొర్లిపోతున్నాయి. 


దేవకి కి  అపుడపుడు తమ పక్కింటామె గుర్తుకువస్తుంది.ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ అఖండమైన తెలివితేటలు. భర్త సరిగా కుటుంబ భాద్యతలు పట్టించుకోడు. నెలల పర్యంతం కనబడకుండా పోతాడు.ఒక కొడుకు యానిమేషన్ కోర్స్ చేస్తూ దూరంగా వున్నాడు.మరొక కొడుకు ఇంట్లో వుండి చదువుకుంటాడు. పుట్టింటిసాయంతో కుటుంబం జరుపుకుంటున్నానని చెబుతూవుంటుంది. ఆమె నెలలో సగం రోజులు బంధువుల ఇంటికి పుట్టింటికి తిరుగుతూ వుంటుంది. తలకు శ్రద్దగా హెన్నా పెట్టుకుని చేతులకు గోరింటాకు పెట్టుకుని శ్రద్దగా అలంకరించుకుంటుంది. అయ్యో! ఈమెకు వీసమెత్తు దిగులులేకుండా  సరదాగా సంతోషంగా కాలం గడిపేస్తుంది. నాకేమైంది ఆమెలా నేనెందుకలా ఉండలేకపోతున్నానని బేరీజు వేసుకుంటుంది.  ఆమె పిల్లలను కూడా సరిగా పట్టించుకోకుండా వుంటుంది. అమ్మనాన్నలది చెరోదారైనా..ఇంకా ఆ బిడ్డలు సంస్కారం కలవారు. దుష్టసహవాసాలు చేయకుండా మంచి నడవడిక అలవడింది. ఇక సంతోషం ఒకరు ఇస్తే రాదని తమకు తామే ఇచ్చుకోవాలని పక్కింటి ఆమెకు తెలిసినట్లు తనకు తెలియడం లేదు. ఆమెలా వుండాలని గట్టిగా అనుకుంటుంది. కానీ అంత చొరవచేయలేదు. గృహప్రవేశానికైనా తనంతట తాను కొలీగ్స్ ను కూడా పిలవగల్గే చొరవలేకుండా చేసుకుంది. 


“ఒకరిస్తే తీసుకునే ప్రేమ కోసం ఎన్నాళ్ళు పిచ్చిదానిలా ఎదురుచూస్తావ్? మూడ్స్ మార్చుకుని స్నేహితులను కలువు, రూఫ్ గార్డెన్ మొదలెట్టు. నీకు కావాల్సింది వండుకుని తిను. నువ్వు చేసింది తింటున్నారు అనుకుంటే వండిపెట్టు. లేదు అనుకుంటే మానేయ్. స్విగ్గి జొమాటో వాళ్ళు ఇంటికి తెచ్చిస్తున్నారు రోజూ అలా అయితే ఆరోగ్యాలు ఏమికాను డబ్బు ఎంతవుతుందని లెక్కలు వేయకు ప్రశాంతత పోతుంది అని అంతరాత్మ హెచ్చరిస్తూనే వుంటుంది.


*********


దేవకి బాగా ఆలోచించింది. గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంది. తనకు ఫేస్ బుక్ లో పరిచయం అయిన ఒక లాయర్ ద్వారా ప్యామిలీ కోర్డ్ కు విడాకుల కోసం  అప్లై చేసుకుంది. 


ఆమె అప్లికేషన్ తయారుచేస్తున్న లాయర్ ఆమె అభియోగం కోరిక విని ఒకింత ఆశ్చర్యపోయింది. దేవకి కేసు తొందరగానే జడ్జి ముందుకు వెళ్ళింది. వాసుదేవరావు పిల్లలు కూడా విసుగ్గా కోర్టుకు హాజరయ్యారు. 


ముందు దేవకి ని మాట్లాడమని అన్నారు.


దేవకి దైర్యంగా తన కథను చెప్పింది. జడ్జి గారు సానుభూతితో ఆమె కథనంతా విని ఒకే ఒక ప్రశ్న అడిగారు. భర్త నుండి విడాకులు అడగడంలో ఆశ్చర్యం లేదు. కానీ మీరు మాతృత్వపు హక్కును రద్దు చేయమని పిల్లలను భర్తను అనుమతినివ్వమని అడగడమే ఆశ్చర్యంగా వుంది. ఇంత వరకూ ప్రపంచంలో ఎవరూ ఇలాంటి కోరిక కోరి వుండరు” అన్నారు. 


దేవకి సమాధానంగా “నేను భర్త నుండి విడాకులను ఎందుకు కోరుతున్నానో పిల్లల నుండి మాతృత్వపు హక్కును రద్దు చేయమని అందుకే కోరుతున్నాను. అదీ ప్రేమతోనే. నా భర్త నా బిడ్డలు అని ప్రేమించడమే తెలుసు. ముందు ముందు వారిని నేను ద్వేషించకుండా వుండటం కోసమే నేను యీ కోరిక కోరుతున్నాను. నేను ఒక భాద్యత గల పౌరురాలిని.ఉపాధ్యాయురాలిని. క్రమశిక్షణ లోపించిందని భాద్యతారాహిత్యంగా ప్రవర్తించారని పాఠశాలలో పిల్లలనే మందలించలేదు,

దండించలేదు. ఇక కుటుంబంలో నా పిల్లలను ఎలా దండించగలను. వారి ప్రవర్తన వారి నిర్లక్ష్యపు వైఖరి వారి ఆలోచనాధోరణి నాకేమాత్రం రుచించడం లేదు. జీర్ణం కావడం లేదు, నచ్చడం లేదు. నా భర్త కూడా వారినే సమర్దించడం నేను భరించలేకపోతున్నాను. అలా అని వారిని ద్వేషించలేకపోతున్నాను. భర్త నుండి పిల్లల నుండి  నాలుగు ప్రేమ నిండిన మాటలను గౌరవాన్ని కోరుకుని నేను చాలా పెద్ద పొరబాటు చేస్తున్నాను. అవి అంగడిలో దొరికే వస్తువులైతే పస్తులుండి అయినా వాటిని కొనుక్కోగలను. నాభర్త నుండి పిల్లలనుండి తప్ప వేరొకరు వాటిని యిచ్చినా నేను పుచ్చుకోలేను. ప్రేమరాహిత్యంతో నేను రోజూ మనసుకు గాయాన్ని చేసుకోలేను. నా ఓర్పును లేపనంగా పూసుకోలేను. నాకు ఆ బంధాలనుండి విముక్తి కల్గించండి. నేను పూర్తి మానసిక ఆరోగ్యంతో మీకు నా కోరికను నివేదిస్తున్నాను. నా భర్త కష్టించి సంపాదించిన సొమ్ముతో ఫీజులు చెల్లించి నేను చదువుకొన్నందువల్ల.. ఆ చదువు ఆధారంగా ఉద్యోగం చేస్తున్నందువల్ల నేను సర్వీస్ లో వున్నంత కాలమూ నా జీతభత్యాలను నాల్గు భాగాలుగా విభజించి వారు ముగ్గురికి మూడు భాగాలు నాకు ఒక భాగం ఇప్పించే ఏర్పాటు చేయండి. నిర్మించుకున్న ఇల్లు కూడా అదే దామాషాలో లోను డబ్బును జమచేసుకోవాలని అభ్యర్దిస్తున్నాను. నేను ఆ శూన్య మందిరంలో ప్రేమరాహిత్యంతో జీవించలేను. మరణించలేను. నాకు అంత దైర్యం కూడా లేదు.  ఇంటిలో నా వాటా భాగాన్ని కూడా వారినే అనుభవించనీయండి. నేను వారికి దూరంగా వుండదల్చుకున్నాను. ఇది నా అభ్యర్దన. నా భర్త కానీ పిల్లలు కానీ నన్నెప్పుడూ కలవకూడదని నేను మరణించినట్లు మానసికంగా భావించాలని కోరుకుంటున్నాను. ఇదే ఆఖరిసారిగా వారిని నేను కోరుకునే అభ్యర్దన” అని చెప్పింది. 


జడ్జి మౌనంగా ఆమె మాటలను విన్నాడు. బలంగా నిట్టూర్చాడు.. వాసుదేవరావు వైపు పిల్లల వైపు చూసారొకసారి. 


మరలా దేవకి వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వారు.జడ్జిమెంట్ ను చదివి వినిపించడం ప్రారంభించారు. 


*********0********



కామెంట్‌లు లేవు: