కథ ను గూర్చి కొన్ని ఆలోచనలు..
రచయితల సృజనలోనూ ప్రపంచం లోనూ బలమైన వ్యక్తిత్వం వున్న పాత్రలు చాలానే వుంటాయి.
కానీ బలమైన వ్యక్తిత్వం వుండి కూడా బలహీనతలు కూడా ప్రస్పుటంగా కనబడే కొన్ని పాత్రలు వుంటాయి. నిజం చెప్పాలంటే మూసపోసినట్టు వుండే పాత్రల పట్ల నాకు విముఖత. చక్కగా వున్న రచనలో సహజంగా వుండే పాత్రలు కొన్ని లోపభూయిష్టంగా కనబడతాయి. నా రచనల్లో కూడా అలాంటివి వుంటాయి. అక్కడ అది రచయితగా నా ఫెయిల్యూర్ కాదు.బలవంతంగా పాత్రను లోపం లేకుండా సృజించలేను. (ఆ పాత్ర నన్ను ఆవహించి విరుద్ధంగా చేయనివ్వదు కూడా) మానవ సహజమైన లోపాలతో పాత్ర వర్ధిల్లాలని నా భావన. పాత్ర పరివర్తన చెందడం రూపాంతరం చెందడం రచయిత చేతిలో పనైనా సరే యెక్కువసార్లు దాన్ని అలా వొదిలేయటం మంచిది అనుకుంటాను. నాటకీయమైన త్వరితగతమైన కృతకంగా కనబడే మార్పు యెబ్బెట్టుగా వుంటుంది. పాఠకుడి గా అది నాకు విదితమే! పాఠకుడిని మరీ అమాయకంగా లెక్కించకూడదు.
ఒక వుదాహరణ చెబుతాను. ప్రేక్షకులందరూ మెచ్చిన రుద్రవీణ చిత్రంలో సూర్యం(చిరంజీవి) హీరో కాదు ఆ చిత్రంలో అసలైన హీరో బిళహరి శాస్త్రి(జెమినీ గణేషన్) అంటాను. నా దృక్కోణం అదే!
జీవన నాటకంలో పాత్రలే వుంటాయి.. కేరెక్టర్స్ వుండవు.. అన్న వాక్యానికి అనుసరించి నేను రాసిన కథలన్నీ జీవన నాటకంలో పాత్రలే!
ఇంకా కల్పన లేని వాస్తవ జీవిత కథ చిగురులు లేని మోడు లాంటిదని.. ఓ రచయిత అన్నట్టు చదివిన జ్ఞాపకం. అది మరీ గుర్తుంచుకుంటాను.
ఈ మధ్య నేను రాసిన “రంగుల కల“ కథలో ఆమె పాత్ర, ఆ కథలో వర్ణన యెక్కువైంది అని ఆమె పాత్రకు వ్యక్తిత్వం లేదని వొకరు అన్నారు. ఆ ఒక్కరు తప్ప కథను అందరూ మెచ్చుకున్నారు.
ఆ వొక్కరి మాటను దృష్టిలో వుంచుకుని మళ్లీ సమీక్షించు కున్నాను. రచయితగా యే లోపం కనబడలేదు. మూర్తీభవించిన మంచితనం స్పష్టత వ్యక్తిత్వం వుండాలని ఆ వొక్కరు కోరుకుని వుండొచ్చు.ఆమె ట్వంటీ ప్లస్. ఆ వయసులో వుండేవారి విచక్షణా రాహిత్యమే ఆమెలో వుంది. .
అలాగే “ఆమె నవ్వు” కథ లో కృష్ణ పాత్ర ను చూసి ఈమె యేమిటి యిలాంటి కథ రాసింది అన్నారట.. రచయితల కథలన్నీ పది పది కథల పుస్తకాలుగా వేసి కథను అమ్ముకునే రచయితల సంఘం యెడిటర్. మరి ఆయన యేం చదివారు యిన్నేళ్ళుగా యిన్ని కథలు చదివి అన్నాను.
ప్రచురితం కాని యింకో కథ లో పాత్ర “నీలవేణి” పాత్ర ను కూడా నేను బాగా సమీక్షించుకున్నాకే ఆఖరి పేరా రాసాను.
కథ రాసాక రివ్యూ చేసుకోవడం అవసరం. ఈ వాక్యం అవసరమా అని పదిసార్లు ఆలోచించుకోవాలని చెబుతారు. దయానిధి లా పాత్ర అంతర్ముఖుడైతే.. పేజీలకు పేజీలు రాసుకుంటూ పోవడం చూసాం మనం. రచనల్లో యెక్కువ వర్ణనలు వుండటం “ఉత్తమ కథకుడు” అనిపించుకున్న వారి రచనల్లోనూ చూసాం. ప్రస్తుత కాలంలో పత్రికల్లో ప్రచురించే కథలకు నిడివి సమస్య బాగా వుంది. అది యెంత తగ్గితే అంత మంచిది అని భావిస్తున్నారు. కొత్త పాఠకులను అలాగే తయారుచేసుకుందాం అనుకుంటున్నట్టు వుంది. వెబ్ కథలు ఆ సమస్య లేకుండా స్వేచ్ఛ నిచ్చాయి. అన్ని కథలూ క్లుప్తంగా రాయలేం. ఒకోసారి రచయితకు వ్యామోహం యేదో చెప్పాలని. చదివే పాఠకుడికి విసుగు కల్గితే పక్కన పడేసేయవచ్చు. రామాయణం ని మూడు ముక్కలలో చెబితే కోపగించుకోవడం యెలాగో కొన్ని కథలు చదివినప్పుడు అలాగే కోపం రచయిత మరీ పిసినారి గా వున్నాడు అని.
కొందరు ఆంగ్ల కథకులను ఉదహరిస్తారు. అది మరీ విచిత్రం. పత్రికలలో వచ్చే కొన్ని కథలు చదివినప్పుడు రచయితలు తమ వాల్ మీద ప్రచురించుకునే కథకు పెద్ద తేడా వుందని నాకు చాలాసార్లు అనిపించింది. పత్రికలు చదవడం మానేసాను. నిజాయితీ గల పాఠకుడు యెవరైనా కథ బాగుంది అంటే అప్పుడు చదువుతున్నాను. ఇప్పుడు హాయిగా వుంది.
ఒక కథ రాయాలనుకుంటే యెవరి అభిప్రాయమో కన్నా మన కథను మనమే బాగా సమీక్షించుకోవడం యెంత ముఖ్యమో అంత ముఖ్యం. అందుకే కథలు రాయటం తగ్గించి హాయిగా చదువుకుంటున్నాను.
గుర్రపు డెక్క పూలు యివి. 👇
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి