కథల ఒడ్డున.. కాసాపు ఆగుదామా!
సృష్టిలో ఉత్కృష్టభావాన్ని భాగాలుగా విడగొడితే అందులో మాతృప్రేమకే అగ్రస్థానం లభిస్తుంది. అది పశువైనా శిశువైనా సరే. జంతువులు పశుపక్ష్యాదులు అనేక కీటకజాతులలో మాతృప్రేమ సొంతంగా మనుగడ సాగించేంతవరకే పరిమితంగా వుంటుంది. తర్వాతంతా ఆ సంతతి ప్రకృతిలో తమలాగానే ఇంకొకటిగా అనుకుంటూ మనుగడ సాగిస్తాయి.
ప్రత్యేకంగా మనిషికి మాత్రమే కొన్ని బంధాలు అనుబంధాలు జీవితాంతం పెనవేసుకుని వుంటాయి.
అందులో ప్రతి మనిషికి అమూల్యమైనది మాతృప్రేమ. మాతృ ప్రేమకు మించిన ప్రేమ ఉంటుందా లోకంలో అని ఆశ్చర్యపడటం వింతేమి కాదు కూడా.
ఇటీవల కాలంలో అప్పుడప్పుడూ మాతృత్వ లక్షణం మసకబారుతున్నదా అనే అనుమానాలు పొడజూపినట్లనిపించినా.. అనేకానేక ఉదంతాలు విన్నా చూసినా చదివినా హృదయం చెమరిస్తుంది. అమ్మ ప్రేమకు మన అణువణువు అంజలి ఘటిస్తుంది.
చాలాకాలం క్రిందట ఒక ఉర్దూ కథ చదివాను. ఆ కథ చదివిన పిమ్మట చాలా దుఃఖం కల్గింది. ఆ దుఃఖాన్ని అనుభవించడం ప్రతి మనిషికీ చేతనవును కూడా మరీ హృదయం అంత పాషాణం కాకపోయినట్లైతే!
మనకుతల్లి లేదా అమ్మ అనే భావనే అపురూపం. తల్లిబిడ్డలది నాభీసంబంధం. ఎక్కడో దూరంగా బిడ్డకు ఇసుమంత కష్టం కల్గినా నొప్పి కల్గినా.. అది అమ్మ మనసుకు తెలిసిపోతుంది. బిడ్డ క్షేమం కోసం తల్లడిల్లుతుంది. వీలైతే ఆ బాధ తాను భరించి బిడ్డకు ఆ బాధనుండి విముక్తి కల్గించాలని తపన పడుతుంది. కానీ దేహమానసిక బాధలు ఎవరివి వారే భరించాల్సిరావటం ప్రకృతిచ్చిన శిక్ష.
ఈ కథలో తల్లి అత్యంత సాధారణమైన తల్లే. ఆమెలో ఏ ప్రత్యేకతలు లేవు. అయితే మాత్రమేం.. ఆమె నిరంతర ఆలోచనా స్రవంతి కొడుకు చుట్టూనే. అతని బిడ్డల చుట్టూనే. ఏనాడు చిన్న ఆరోపణ కూడా చేయని ఆమె తల్లి ప్రేమ మనల్ని వెక్కివెక్కి ఏడిపిస్తుంది. ఎన్నో ఏళ్ళ తర్వాత తనను చూడవచ్చిన బిడ్డకు రాచమర్యాదలు జరిపించాలని ఘనమైన అతిధి సత్కారాలు చేయాలని అతనికీ అతని బిడ్డలకూ కానుకలనివ్వాలని తపించిపోయింది. ఆ కొడుకుతో పాటు కథ చదువుతున్న మనం కూడా ఉద్విగ్నతకు గురవుతాం. కొడుకు పశ్చాతాపంతో మొదలైన కథ ముగింపుకొచ్చేసరికి అణువణువును కరిగించి కన్నీటి వర్షంలో తడిపేస్తుంది. ఒక స్త్రీ రచయితగా మరొక స్త్రీ అంతరంగ చిత్రణను అద్భుతంగా ఆవిష్కరించిన కథను అందరూ చదివితీరాలనే ఆకాంక్షతో ఈ కథను పరిచయం చేస్తున్నాను..
మీరూ ఈ కథను చదవండి. మనలో ఆవిరైపోతున్న మానవత్వ విలువలను మేలుకొలుపుతుందీ కథ. మనని కనిపెంచిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని మనను సున్నితంగా హెచ్చరిస్తుంది.
రుకైయ్యా రీహానా వ్రాసిన “తల్లి" కథను నేను చదివిన ఉత్తమకధలలో ఒకటిగా పరిచయం చేస్తున్నాను వినండీ..
హృద్యమైన కథ… వినండీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి