మీరు బహుమతిగా ఇవ్వడానికి "జుమ్మా" ని ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదములు . "జుమ్మా " నే ఇవ్వాలని మీకెందుకనిపించిందని వేంపల్లె షరీఫ్ గారు అడిగినప్పుడు చిన్నగా నవ్వేసి ఊరుకున్నాను కానీ నేను సమాధానం చెప్పలేదు .. ఎందుకంటే .. ఇదిగో ఇందుకు ...
జుమ్మాకి లభించిన పురస్కారాన్ని గౌహతిలో అందుకున్న రోజు వేదికపై ఈ రచయిత చదివిన ప్రసంగం "సారంగ" లో వచ్చినప్పుడు చదివి కళ్ళు చెమర్చాయి . అంతకి ముందు అప్పుడప్పుడూ వివిధ పత్రికలలో వచ్చినప్పుడు ఈ సంపుటిలో ఉన్న కొన్నికథలని నేను చదివే ఉన్నాను కానీ జుమ్మా సంకలనంలో వచ్చిన అన్ని కథలని నేను తొలిసారి చదివినప్పుడు .. ఎంతో ఉద్వేగానికి గురై ఈ అబ్బయ్య ఎంత బాగా వ్రాసాడనుకున్నాను అమ్మ మనసుతో . షరీఫ్ వాళ్ళమ్మ అయితే "మా అమ్మ ముండ నాక్కూడా చదువు చెప్పించి ఉంటె .నా బిడ్డ రాసిన కథ నేను కూడా చదువుకుని మురిసి పోయాదాన్ని కదా ! అని విచారపడిందట." ఆ అమ్మ చదవకపోతే ఏం !? ఎంతో మంది అమ్మలు ఈ కథలని చదివి మనఃస్పూర్తిగా మెచ్చుకుని చల్లగా ఉండు బిడ్డా అని దీవించి ఉంటారు . ఇంకా ఇంకా మన జీవితాల్లో ఉన్న కథలకి అక్షర రూపం కల్పించాలనే కోరికని వెలిబుచ్చి ఉంటారు కూడా అననుకున్నాను . ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకుండా సుతిమెత్తగా తానూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశారు .
నాకు బాగా నచ్చిన కథ "ఆకుపచ్చ ముగ్గు " చేతుల్లోనే కాదు మన హృదయాలలోనూ వేసుకోవాల్సిన ముగ్గు అనిపించింది నాకు. అక్కతమ్ముడి మధ్య ఆత్మీయ అనురాగాలకె కాదు హిందూ ముస్లిమ్స్ మతాల మధ్య ఉన్న సూక్మాతిసూక్ష్మమైన తేడాని మన మధ్యన ఉంచి రచయిత దృక్పదాన్ని మనకి పట్టిస్తుంది .
ఆకుపచ్చ ముగ్గు లో అక్క జీనత్ కి ముగ్గులు వేయడమంటే చాలా ఇష్టం . ముస్లిమ్స్ అయినందువల్ల ఇంటి ముందు ముగ్గు వేయడం ఉండదు. చుట్టుప్రక్కల హిందువుల ఇళ్ళముందు ముగ్గులేసుకుంటుంటే ఆమె నోట్స్ పుస్తకాలలోనూ, ఇంటి వెనుక ఇసుకతో ముగ్గులేసుకుంటూ , అరుగులమీద నీటిలో ముంచిన వేలితో ముగ్గులేసుకుంటూ ఉంటుంది . అలా చేతిలో గోరింటాకు పెట్టడం ద్వారా తనలోబలీయంగా అంతర్లీనంగా ముగ్గులువేయాలన్న కోరికని తీర్చుకుంటున్నానని చెపుతుంది. ముగ్గు ఇంటి ముందు వేస్తే తప్పు కానీ చేతిలో వేస్తె కాదుకదా ! ఒక మతానికి మరో మతానికి మధ్య తేడా ఇంతేనా ? ఇంత మాత్రం దానికేనా ఇన్ని మత గొడవులు జరుగుతుంటాయి ? అన్న కథకుడి ఆలోచన మన దృఖ్పదాలని సునిశితం చేస్తాయి . పెళ్ళికి ముందు చెట్టు నుండి కోసుకొచ్చిన బత్తాయి పండులా ఉండే అక్క , పెళ్లై నాక అప్పుడప్పుడూ తమ్ముడి చదువు కోసం డబ్బు సాయం చేసిన అక్క ఒక మాదిరి షావుకారు భార్య అయి ఉండి కూడా వరుసగా ముగ్గురు ఆడపిల్లల్ని కనడం మూలంగా వాళ్ళ భవిష్యత్ గురించి భయపడుతూ, దిగులుపడుతూ ఉంటుంది. ..తన బిడ్డలకి నీవే దిక్కు అని కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం చూస్తే ముస్లిం కుటుంబాలలో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎంత భారంగా అనిపిస్తాయో చెప్పకనే చెపుతాయి .
దస్తగిరి చెట్టు కథలో సెలవల్లో(నానీమా) అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాలనే కోరికను తల్లి పట్టించుకోవడంలేదని దిగులుపడి పోతాడు నూర్జహాన్ కొడుకు. వాళ్ళమ్మ తో ఇలా అంటాడు "నన్ను అమ్మమ్మ వాళ్ళ ఊరికి పంపమంటే పంపకబోతివి రేపు జూడు పొలం కాడికి పోయి పురుగులమందు తాగి చావక పొతే తూ నా కొడుక " అను అంటాడు. అప్పుడు ఆ అమ్మ కదిలి కదిలి ఏడ్చిన వైనం చదువరులకి హృదయం ద్రవింపజేస్తుంది. గ్రామీణప్రాంత ముస్లిం కుటుంబాల ఆర్ధిక స్థితి గతులు ఎంత దయనీయంగా ఉంటాయో చెపుతుందీ కథ . పుట్టింటివారు పేదవారైతే మెట్టినింటి వారు చూసే చిన్న చూపుతో పాటు చాటు మాటుగా పుట్టింటికి సొమ్ము జేరవేస్తుందేమో అన్న అనుమానంతో సూటీ పోటీ మాటలు అత్తచాటు కోడళ్ళందరికి ఏదో ఒక సమయంలో అనుభవమే . అలాగే గ్రామీణ ప్రాంతపు వ్యవసాయదారుల కుటుంబంలో పిల్లలతో పాటు అందరూ శ్రామికులే ! ప్రొద్దునే లేచి తండ్రి పొలానికి వెళితే తర్వాత కేరేజీ పట్టుకుపోయే డ్యూటీ పిల్లలది . కేరేజీని కూడా మోయలేని లేత చేతులు ఎండలో పడి మైళ్ళ దూరం నడుస్తూ కేరేజీని ఆ చేతిలో నుండి ఈ చేతిలోకి మార్చుకుంటూ చేనుకి వెళతాడు . ఈ కథ చదువుతున్నప్పుడు దృశ్యం కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది పసివాళ్ళ బాధని అక్షరాల్లో పొదిగిన తీరుకి కనులు పదే పదే చెమర్చాయి. . కథ ఆఖరిలో ఆ పిల్లవాడు దువా చేస్తాడు ఇలా .. "యాల్లా ! మా అమ్మమ్మ వాళ్ళు బీదవాల్లనే గదా అమ్మీ అక్కడకి పంపనంటాది . మా నానీమా వాళ్లకి ,మాకు కూడా దండిగా డబ్బులివ్వు అప్పడు మా నానీమా ఊరుకి వెళ్ళొచ్చు " అని కోరుకుంటూ దస్తగిరి చెట్టుకి మొక్కుని కట్టుకుంటాడు. (దస్తగిరి చెట్టు అనగానే నాకు పీర్లు పండుగ గుర్తుకొచ్చింది పీర్లు పండుగప్పుడు పీర్లుని ఊరేగించి ఒక చెట్టుదగ్గర భధ్ర పరుస్తారు. ఆ చెట్టుని జెండా చెట్టు అని కూడా అంటారు . ఆ పండుగలో హిందువులు కూడా పాల్గొంటారు . కొంత మంది కోరికలు కోరుకుని నిప్పులమీద నడుస్తారు. అలాగే ముడుపులు కడతారు . కోరిన కోరికలు తీరతాయని విశ్వాసం కూడా హిందూ ముస్లిం ఐక్యత కి ఈ పండుగ ఒక ఉదాహరణ )
జీపొచ్చింది, రజాక్ మియా సేద్యం ఈ రెండు కథలు రైతు జీవన చిత్రాన్ని వ్యదార్ధ యదార్ధ గాధలని పరిచయం చేసింది . ముస్లిం రైతైనా, రెడ్డి రైతైనా వ్యవసాయంలో మిగిలేది దుఃఖమే నన్న సంగతి కథకుడు చెప్పిన తీరు చాలా నచ్చింది . వ్యవసాయం అంటేనే రైతన్న కష్టాలు నష్టాలు . రజాక్ మియా తండ్రి టైలర్ గా పని చేస్తూ ఉంటాడు , మలకోల రెడ్డి సహృదయుడు. పిల్లలు కలవాడివి మిషన్ కుట్టి ఏమి సంపాయిస్తావ్ .. ఈ నాలుగెకరాలు దున్నుకుని బ్రతుకు పో అంటూ రజాక్ మియా తండ్రి పేరున రాసి ఇస్తాడు . తండ్రికాలంలో వ్యవసాయం గిట్టబాటు గానే ఉంటుంది . ఆ నాలుగేకరాలకి ఇంకో ఎకరం చేసి చనిపోతాడు . రజాక్ మియా తరంలో అనావృష్టి కి గురై పంటలు పండక నూకల మూట కోసం రెడ్డి చుట్టూ రోజుల తరబడి తిరిగే తీరు, అతని పొలాన్ని కాజేసేందుకు ఆ రెడ్డి కొడుకు పన్నిన పన్నాగం చదివితే ఆకశంలో గ్రద్ద భూమి పై కోడి పిల్ల పై కన్నేసి అక్కడే చక్కర్లు కొడుతున్నట్టు అనిపించింది. ఇక జీపొచ్చింది కథలో వెంకటరెడ్డి బోరు కోసం పడినపాట్లు చేసిన అప్పులు ఏంటో మంది రైతుల జీవన చిత్రాన్ని కాళ్ళ ముందు ఉంచాయి . కరంట్ బిల్లులు కట్టలేక పంటలు వేయకుండా ఉండలేక ఎండే పంటని కాపాడుకోవడానికి స్టార్టర్ కోసం పడిన ఆరాటం చదువుతుంటే గుండె బరువెక్కుతుంది. రెండు కథల లోనూ ముగింపు మరణంతో గుండెల్ని పిండేస్తుంది. వ్యవసాయం వద్దురా బాబు అనిపిస్తుంది.
ఇక అయ్యవారి చదువు కథ. నేనెప్పుడు ఈ కథ చదివినా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. కుటుంబం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాసరే ఆ పిల్లవాడు అరకొర సౌకర్యాల మధ్య పట్టుదలతో ఒక విధమైన కసి తో చదివి కుటుంబానికి ఓ వెలుగవువుతారు. . కథలో పిల్లాడి తండ్రి వ్యవసాయం కోసం అప్పులు చేస్తాడు . ఆ అప్పులోళ్ళ బారి నుండి తప్పించుకోవాడానికి పోద్దస్తమాను పొలంలోనే గడుపుతాడు . ఆ పిల్లాడు ఇంటి దగ్గర ఉండి చదువుకోవాలనుకుంటాడు కానీ ఆ చదువు సాగదు మధ్య మధ్యలో ఇంటి పనులుతో ప్రోద్దుకూకిపోతుంది . తెల్లారే పరీక్ష . తల్లిని దీపం బుడ్డి పెట్టుకుని చదువుకుంటానని అడగాలనుకుంటాడు . అంతలో ఆ దీపం బుడ్డి కిందపడి అందులో ఉన్న కిరోసిన్ అంతా నేలపాలవుతుంది . తల్లి కోపంగా ఆ పిల్లాడిని కొడుతుంది. పిల్లాడు ఏడుస్తూ పడుకుంటాడు. తండ్రి అప్పు తీసుకున్న వాళ్ళతో చెపుతున్న మాటలకి కళ్ళల్లో కట్టలు తెంచుకున్న దుఃఖం . అలాంటి దుఃఖం లో నుండే కసితో చదువుతాడు తర్వాత ఆ పిల్లాడే స్కూల్ టీచర్ అవుతాడు . ఈ కథలో ఒక చోట పిల్లాడి తల్లి ఇలా అంటుంది " ఆడోల్ల దగ్గర లెక్కలు ఎట్టోచ్చాయిరా ..నేన్నీ కోసం లంజరికం జేయాల. అబ్బడ్నోదిలి నా దగ్గర అడగడానికి సిగ్గన్నా ఉండాల " అంటుంది . గ్రామీణ ప్రాంతాలలో పేద కుటుంబాలలో బయట పనిపాటా చేయకుండా ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి లేని ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని చెప్పిన విధం చివుక్కుమనిపిస్తుంది .
ఇక అంజనం కథలో .. ఎప్పుడో ఇల్లు వదిలిపోయిన కొడుకు కోసం తల్లి పడే తపన అంజనం వేయించి వాళ్ళు చెప్పినట్లు తిరుగుతూ డబ్బుకి డబ్బు పోసి శ్రమ తీసుకుని నిరాశతో అర్ధం పర్ధం లేని సెంటిమెంట్ తో దిగులుని దాచుకుని కొడుకు వస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది . స్వామీజీలు బాబాలు ,గణాచారులు చెప్పే మాయ మాటలకి అమాయకంగా మోసపోవడం వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడాన్నిమన కళ్ళ ముందుంచుతాడు రచయిత. తల్లి మనసుకి ఏ విధంగా స్వాంతన కల్గుందో తెలుసుకుని అందుకు అనుగుణంగానే నడుచుకోవాలనుకుంటాడు .
శుక్రవారం పూట నమాజుకి వెళ్ళాలి . నిష్వార్ధంగా నమాజు చేయాలి . ప్రక్కన బాంబులు పడినా సరే చలించకుండా అల్లా మీదే ద్యాస పెట్టాలి అని చెప్పే తల్లి మసీద్ దగ్గర అపాయం పొంచి ఉందని తెలిస్తే ఆ దరిదాపులలోకే బిడ్డని పోవద్దని హెచ్చరిస్తుంది . దేవుడి పై విశ్వాసం కన్నాకూడా బిడ్డ చల్లగా క్షేమంగా ఉండటమే కావాలి ఆ తల్లికి . మత వైషమ్యాలతో మానవత్వాన్నేమరిచి బాంబులు పేల్చి మారణకాండ సృష్టిస్తే ప్రతి శుక్రవారం ఏ మసీద్ కి వెళ్ళాలన్న అదే దృశ్యాలు వెంటాడతాయి. ఏ శుక్రవారం నెత్తు రోడకుండా చూడు తండ్రీ అని అందరమూ మనఃస్పూర్తిగా ప్రార్దిస్తాం . మనిషికి మనిషికి మధ్య మతం తో ముడిపడని ఆత్మీయ బంధమేదో ఉంది . తల్లి బిడ్డలా మధ్యే కాదు అందరిలో కూడా . జుమ్మా కథలోనూ అదే ఉంది .
పర్దా కథ . ముస్లిం కుటుంబాలలో పర్ధా ముఖ్యమైన ఆచారం . ఆడపిల్లలని ఎండ ముఖాన పడకుండా గదులలోనే మ్రగ్గ బెట్టి మళ్ళీ పర్దా లలోనే మగ్గేవిధంగా ఉంచే ఆచారాల వెనుకనున్న అణచివేత గుండెల్ని మెలి పెడుతుంది
కడుపు నిండిన వాళ్ళకే సంప్రదాయం ఆచారం మొదలైనవి పాటించాలని కంకణం కట్టుకుంటారు . జేజీ ఆ కడుపు నిండనప్పుడు పర్దా నఖాబ్ ల ఊసే లేకుండా బిడ్డలని పెంచి పెద్దజేసుకోవడానికి మగాడిలా కష్టపడింది . ఈ కథలో జేజీ నిలువెత్తు ఆత్మవిశ్వాసం. కథ చదువుతుంటే మనచుట్టూ ఉన్న అనేక ముస్లిం జీవితాలు కనబడతాయి అక్కడ జేజికి పర్దా మాటున మనుమరాలిని బందీ చేయడం అసలు నచ్చదు . అలాగే ఆమెకి అలవాటు లేని పర్దా కట్టుకుని పట్టణ వాతావరణంలోనూ ఇమడలేక కొడుకుకి ఎదురు చెప్పలేక మళ్ళీ పల్లెకి తిరిగి వెళ్ళిపోతుంది. పర్ధాని సర్ది పట్టుకుని నీళ్ళు నిండిన కళ్ళతో వెళుతున్న జేజి వంక నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు పిల్లవాడు ,
రూపాయి కోడి పిల్ల కథ పిల్లల సున్నితమైన మనసుని ,జీవకారుణ్యాన్ని పెద్దల కఠిన మనస్తత్వాన్ని హృద్యంగా చూపించారు . .ఆ పసి మనసు కోడి పిల్ల కోసం పడే తపన తండ్రి కోడి పిల్ల చచ్చిపోతే తినడానికి పనికిరాదనే కోపంతో అంజాద్ని కొట్టి హజ్రత్ దగ్గరకి వెళ్ళమని తరమడం నెత్తురోడుతున్న కోడి కన్నీల్లోడుతున్న అంజాద్ చదువరులకి .. అయ్యో అని మనసు మూలుగుతుంది .
తెలుగు దేవుళ్ళు కథ సున్నితంగా కొట్టిన కొరడా దేబ్బలాంటిది. అసలీ కథని ఎంత బాగా వ్రాసారు ఎంత బాగా వ్రాసారు అని ఎన్నిసార్లు అనుకున్నానో ! పుస్తకం పట్టని అక్షరాస్యులకి చెవుల్లో ఇల్లు అట్టుకుని మరీ వినిపించానీ కథని . అన్ని మతాల పిల్లలు కలిసి చదువుకునే బడిలో ఒక మతానికి సంబంధించిన దేవుడి బొమ్మ స్కూల్ బ్యాడ్జీ పైన ,బెల్ట్ బకిల్ పైన ఉండటమే కాదు స్కూల్లో జరిగిన పోటీలలో గెలిచిన వారికి బహుమతిగా కూడా హిందువుల దేవుళ్ళ బొమ్మలని బహూకరించడం లాంటివన్నీ మతాధిపత్య భావజాలానికి సూచనగానే కనబడతాయి . గౌసియా దానిని తీవ్రంగా గర్హిస్తుంది స్కూల్ యాజమాన్యాలని ప్రశ్నించాలని చాంద్బాషా పై వత్తిడి తెస్తూ ఇలాంటి పనులు ఒంటరిగా చేయడం కంటే పడుగురుతో కల్సి చేయడమే బలం చేకూరుతుందని సలహా కూడా ఇస్తుంది.
చాపరాయి , పలకల పండుగ కూడా మంచి కథలు . మనం ఎన్నో కథలని చదువుతాం . అందులో కొన్ని బాగా నచ్చుతాయి . కొన్ని పర్వాలేదనిపిస్తాయి . కానీ ఆ కథా సంపుటిలో కథలన్నీ ఒకదానికి మించి మరొకటి బావున్నయనుకోవడం చాలా అరుదు . అలాంటి కథా సంపుటే "జుమ్మా"గ్రామీణ జీవితానికి అద్దం పట్టే కథలు ఇవి . ఈ కథలలో పాత్రలు మనకి సుపరిచితమైనవే ! కానీ వాళ్ళ జీవితాల్లోకి జీవన విధానంలోకి జొరబడి ఈ జీవితాలు ఇలా అని చెప్పిన మంచి కథలు ఇవి . చదువుతూ ఉంటె హృదయం ఆర్ద్రమవుతుంది . ఒకోచోట మన కళ్ళు తెలియకుండానే వర్షిస్తాయి .
ఈ కథల గురించి ఇంకా ఎంతో చెప్పాలని ఉంది వ్యక్తీకరించే బాష లేకపోవడం చేతకాకపోవడం కూడా కాదు . కానీ చెప్పలేని మూగతనం . ఎన్నో రాత్రులు తనవి తనవి కానీ జీవితం తాలూకు సంఘటనలు, అనుభవాలు నిద్రపొనీయకుండా కనురెప్పలపై కూర్చుని కథలు అల్లే దాకా స్థిమితంగా ఉండనీయని తనాన్ని ఎలా సంభాళించుకున్నాడో అని అనుకున్నప్పుడు దుఃఖం ముంచుకొస్తుంది . ఎందుకంటే రచయిత తపన ఎంతో కొంత నాకు తెలుసు కాబట్టి .
షరీఫ్ .. మీకు జుమ్మా పునర్జన్మ అని చెప్పారు . నిజం . కథకుడిగా మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. జీతీ రహో ..బేటా ! అమ్మ మనసుతో చెపుతున్నాను సునిశిత పరిశీలన, జీవితానుభవం, గ్రామీణ నేపధ్యాలతో సామాజిక భాద్యతతో మీరింకా మంచి కథలు వ్రాస్తారు ఆ కథలు గుండె గుండె ని తడతాయి . కథలలో ఎందఱో తమని తాము చూసుకుని మురిసిపోతారు . మా బాధలు ఇంత బాగా చెప్పావా బిడ్డా ..అని మురుసుకుని మనసారా దీవిస్తారు . మీ చేతిని ఆప్యాయంగా ముద్దాడతారు. ఇది నిజం .
ఒకటి చెప్పడం మరచాను . ఈ జుమ్మా పుస్తకాన్ని నేను బహుమానంగా పంచింది కూడా శుక్రవారమే !
( 2013 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న "జుమ్మా " కథా సంపుటిలో కథలు ఇవన్నీ ! రచయిత వేంపల్లె షరీఫ్ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి