4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

మహీన్


"మహీన్  మహీన్ ....   ఎక్కడున్నావ్ ? " ఓపిక లేకపోయినా అరుస్తుంది  షమ్మీ 

ఆమె మా ప్రక్కింటి డాబాలో పైభాగాన అద్దెకి ఉంటుంది . మేము కొత్తిల్లు కొనుక్కుని అక్కడికి వచ్చాకనే  పరిచయం.   మిషన్ కుడుతుంది కాబట్టి అందరూ ఆమెతో బాగానే మాట్లాడుతుంటారు . షమ్మీ కూతురు మహీన్ నేను టీచర్ గా పనిచేస్తున్న స్కూల్ లోనే   పిప్త్ క్లాస్ చదువుతుంది.  అనారోగ్యంతో ఉన్న షమ్మీ చిన్న పనికీ  పెద్ద పనికీ  కూతురిని  పిలుస్తూన్నట్లు ఉండే కేకలు నాకలవాటైపోయాయి. తలెత్తి వాళ్ళింటి వైపు చూసాను 

" ఇదిగో ఇక్కడే ఉన్నానమ్మా " వరండాలో నుండి గదిలోకి వస్తూ అంది మహీన్ .

"మీ నాన్న వస్తున్నానని ఫోన్ చేసాడు .. అన్నం వండు , నా ఆరోగ్యం అసలే బావుండలేదు" నీరసంగా అంది.

వెలుగుతున్న కళ్ళతో " నాన్న వస్తున్నాడా  ! ఇప్పుడే వండేస్తాను  ! అంటూ రెండవ గదిలోకి వెళ్ళింది మహీన్ . 
 సరైన పోషణ లేక చిక్కి పోయి  జుట్టంతా రేగిపోయి పిచ్చి దానిలాగా ఉంది.  షమ్మీ కాస్త ఓపిక తెచ్చుకుని జడవేయాల్సింది అనుకున్నాను .   

బియ్యం కడిగిపెట్టి వచ్చి తల్లి ప్రక్కలో కూర్చుని "అమ్మా   ! నాన్న వచ్చాక రేపు  నేను స్కూల్ కి వెళతాను కదా ! "

."............. "

మాట్లాడమ్మా! స్కూల్ కి వెళతాను కదా ! ఆఫ్ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. ఇన్నాళ్ళు స్కూల్ కి వెళ్లలేదని పిల్లలందరూ ఎక్కిరిస్తున్నారు  . ఏడుపు ముఖంతో అడిగింది.  

"నేనేం చేయను.  నాకీ రోగం వచ్చి ఉండకపోతే రోజుకి నాలుగు జాకెట్ లయినా కుట్టి నీకు పీజు కట్టేదాన్ని. . ఆరేళ్ళ నుండి  మీ నాన్న  సంపాదిచ్చి ఇస్తేనే  ఫీజు కట్టానా ? 

ఏమో ! అవన్నీ నాకు తెలియదు .. నువ్వు ఫీజ్ కడితే నేను స్కూల్ కి వెళతాను  పెంకిగా అంది.

మీ ప్రిన్సిపాల్ కి కాస్తైనా జాలి, దయ లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే బాగుంటదని ఆ స్కూల్లో జాయిన్ చేశా ! మీ మేనత్త కొడుకు ఆ స్కూల్ పెట్టినాయనకి స్నేహితుడిగా! ఫీజ్ కట్టలేం,  పెద్ద మనసు చేసుకుని ఈయేటికి ఎట్టాగొట్టా రానీయండి . వచ్చే ఏడూ గవర్నమెంట్ స్కూల్ కి పంపుకుంటా .. అని అడిగాను బాధగా చెపుతుంది. 

నేను షమ్మీని పలకరించి ...  మహీన్ కి పీజ్ కట్టలేదని  స్కూల్ మానిపించారా ? ఆశ్చర్యంగా ఉందే?. అన్నాను . 

"అవునండీ ! వారం రోజులుగా అందుకే  స్కూల్ కి రావడం లేదు."   

"ఆరోగ్యం బాగోలేదని తోడుగా ఉంటుందని అనుకున్నాను "

నా మాట ని పట్టించుకోకుండా  తన ధోరణిలో  తను  "ఆ  స్కూల్ పెట్టినాయన  మా మేనల్లుడికి స్నేహితుడు కూడానూ .. అతన్ని  ఫీజులు తగ్గించమని  అడగడం  కూడా నామోషీ అయినట్లు ఉంది .  ఎలాగోలా ఈ ఏటికి ఫీజులు కట్టేయి వచ్చే ఏడు  నేను సాయం చేస్తా అని మొండి చేయి, బీద నోరు  చూపిచ్చాడు.  మేనమామ ఏ పాటి సంపాదిచ్చి ఇస్తాన్నాడో ఎరగడా? నెలకి ఏబై యేలు సంపాదించుకుంటున్నాడు . పది వేలు అప్పు అడిగినా  ఎప్పుడూ  లేవనే అంటాడు. దయలేని చుట్టాలు ఉండా ఒకటే లేకున్నా ఒకటే ! మంచిగా ఉన్నరోజుల్లో వచ్చి ముప్పూటలా తినిపోతారు" ... అని తిట్టడం మొదలెట్టింది. 

నాకేం మాట్లాడాలో కూడా తోచక అక్కడినుండి లోపలకి వెళ్లాను . లోపలి నుండి  ఓ కన్ను మహీన్ వైపే వేసి చూడసాగాను . 

ఇక ఆ ఆక్రోశం, తిట్లు ఆగవని పదేళ్ళ మహీన్ కి తెలుసు  కాబోలు  నెమ్మదిగా అక్కడి నుండి లేచి అరమారలో ఉన్న పుస్తకాల సంచీని తీసుకుని నేలపై కూర్చుని సంచీలో పుస్తకాలని తీసి ఇష్టంగా హృదయానికి హత్తుకుంది. ఆ పిల్ల  కళ్ళలో నీళ్ళు ఊరాయి. మళ్ళీ పుస్తకాలని సంచీలో సర్ది ఎక్కడుందో అక్కడ పెట్టేసింది . కుక్కర్ మూడు విజిల్స్ వేసేదాకా ఆగి  పొయ్యిని ఆపేసి వచ్చి తల్లి వైపు చూసింది. ఆమె గోడవైపుకి  తిరిగి పడుకుని ఉంది .  మెల్లగా బయటకి వచ్చి మెట్లు దిగి వీధిలో పిల్లలతో కలసి ఆడుకోవడానికి క్రిందికి దిగింది. ఓ గంట ఆడుకుని ఇంట్లోకి వచ్చింది. తల్లి టీవి చూస్తూ ఉంది . స్నానం చేసి వచ్చి చాప పరుచుకుని పడుకుంది . "కాసేపు చదువుకోరాదు ఎప్పుడూ  ఆటలేనా ? " అంటూ మహీన్ ని మందలించి చానల్ మార్చింది . 

"మీ  పెద్దాళ్ళు ఎప్పుడూ ఇంతే అలా చేయి,ఇలా చేయి అని ఆర్డర్ లు వేస్తారు .. మీరు చేసేపని మాత్రం సరిగా చేయరు, నువ్వు టీవి చూస్తుంటే నేనెలా చదువుకోను " అంటూ  విసురుగా లేచి వెళ్ళి టీవి రిమోట్ తీసుకోబోయింది .  

"ఈ రెండు నాటికలు అయిపోనీ,కట్టేస్తా ! నువ్వు కూడా చూడు  బాగుంటాయి " అంది షమ్మీ 
 పూలు మాల కట్టుకుంటూ  "ఇలా కదూ పిల్లలని చెడగోట్టేది"  అనుకుంటూ  మహీన్ ని పిలిచాను . 

అంతలోనే  మహీన్ తండ్రి వచ్చాడు .  ఒక చేతిలో సూట్ కేస్, రెండవ చేతిలో  పొట్టేలు మాంసం సంచీ .తల్లి మంచం పై నుండి లేచి నవ్వు పులుముకుని తండ్రి చేతిలో సూట్కేస్ ని , మాంసం సంచీ అందుకుంది.

ఆ సంచీ చూడగానే మహీన్ కి గుండె  గతుక్కుమంది   చిన్నగా  పిట్ట గోడ దాటి మా వైపుకి వచ్చింది "ఇప్పుడు నేను అల్లం, వెల్లులిపాయలు కోసం కొట్టుకి వెళ్ళాల్సి వస్తుంది, కొట్టతను బాకీ డబ్బులు ఎప్పుడిస్తారు ? అని అడుగుతాడు ఆంటీ ! నేను ఇప్పుడు కొట్టుకి వెళ్ళనంతే! కావాలంటే అమ్మ వెళ్ళే సరుకులు తెచ్చుకుంటుంది "   భీష్మించుకుని  అలాగే కూర్చుని  నాకు పూలు అందిస్తూ కూర్చుంది.

పంపు దగ్గర  కాళ్ళు కడుక్కుని  లోపలికి వస్తూ  నా దగ్గర కూర్చున్న కూతురుని చూసి   "ఏం మహీన్ .. ఎట్లా ఉన్నావ్ ? బాగా చదువుకుంటున్నావా? 

తండ్రి పరామర్శకి కోపం ముంచుకొచ్చింది. "స్కూల్ కి వెళ్ళకుండా ఎట్లా చదువుకుంటారు కొత్త పాఠాలు అర్ధమయ్యేటట్లు ఎవరు చెపుతారు "  అడిగేసింది. 

చూడు  రాధమ్మా ! ఈ పిల్ల మొండితనం ?  "ఫీజులు కట్టలేదని క్లాస్ కి వెళ్ళనివ్వని వాళ్ళకి ఫీజులెందుకు కట్టాలి  వచ్చే ఏడూ ఇంకో స్కూల్లో జాయిన్ చేయిస్తానంటున్నా  ! స్కూల్ గీలు జాన్తానై, ఇంట్లోనే చదువుకో అంటే వినదు, ఒకటే నస"  అంటూ లోపలికి వెళ్ళిపోయాడు . 

మహీన్ కి ఇప్పుడు కూడా నాన్న డబ్బులు తేలేదని అర్ధమై పోయింది. అనుకున్నట్టుగానే షమ్మీ  సరుకులు లిస్టు సంచీ తెచ్చి "శీనంకుల్ కొట్టుకెళ్ళి ఈ సరుకులు పట్టుకు రా! "

"నేనేళ్ళను, నాన్నని వెళ్ళమను"

"నాన్నకి పనులు చెప్పకూడదు, ఇప్పుడుదాకా తిరిగి తిరిగి ఇప్పుడేగా ఇంటికొచ్చాడు " 
"
అయితే నువ్వే వెళ్ళు" మొండికేసింది. వెళ్ళమని చెపుతుంటే నీక్కాదు .. గట్టిగా రెండు దెబ్బలేసింది 

ఏడుస్తూనే సంచీ పట్టుకుని బయలుదేరింది. నేను వస్తున్నాను ఉండు మహీన్ .. నాకు కొన్ని సరుకులు తెచ్చుకోవాలి  అంటూ సంచీ ,డబ్బు తీసుకుని బయలుదేరాను . నాక్కావాల్సిన వస్తువులు తీసుకున్నాక షమ్మీ దగ్గర సరుకుల లిస్టు తీసుకుని "డబ్బులేయీ" అడిగాడతను 

"త్వరలోనే ఇస్తానని అమ్మ చెప్పమందంకుల్ " .

"బియ్యం కొనడానికి డబ్బుల్లేకపోయినా మాంసం కూరలు మాత్రం కావాలి. మీకు అప్పులిచ్చి ఇచ్చి మేము అప్పులు పాలై పోతున్నాం. ఈ నెలలో బాకీ అంతా కట్టకపోతే ఊరుకోనని చెప్పానని మీ అమ్మకి చెప్పు" అంటూనే కావాల్సిన వస్తువులు తీసి ఇచ్చాడు.    

ఇంటికొచ్చిసంచీ తల్లికిచ్చి ముసుగేసుకుని పడుకుంది.గంట  తర్వాత  తల్లి "అన్నం తిందువుగాని రా" అని పిలిచినా లేవకుండా దొంగ నిద్ర నటించింది. అది తెలుస్తూనే ఉంది నాకు 
 గిన్నెలో  మాంసం కూర తీసుకొచ్చి  నాకిస్తూ .. "చూడండి ..ఇప్పుడు దాకా మేలుకువతోనే ఉంది కదా . ఇప్పుడే నిద్రపోయిందా! అన్నీ వేషాలేస్తుంది. ఈ పిల్లకి బడి పిచ్చి పట్టింది " అంటూ వెళ్ళింది.    

తెల్లారి లేచి కొన్ని ఇంటి పనులు చేసి గబా గబా తయారై  స్కూల్ బేగ్ తగిలించుకుని  "అమ్మా ! స్కూల్ కి వెళుతున్నా! నాన్నని  వచ్చి ఫీజు కట్టమను"  అంది . 

"పీజ్ కట్టకుండా ఎట్టా రానిస్తారు. నాన్నకి డబ్బు అందలేదంట" మహీన్ ముఖంలోకి చూస్తూ అంది.   
బేగ్ తీసి మూలకి విసిరి పడేసింది "నేను గవర్నమెంట్ స్కూల్ కి వెళతానంటే వద్దంటారు. ఇక్కడ ఫీజులు కట్టడానికి డబ్బులేవంటారు?"  మరి నేనెట్లా చదువుకోవాలి? " కోపంగా అరిచింది.

ఆ సంవత్సరం  స్కూల్ మొదలైనప్పుడూ జరిగిన సంగతి కళ్ళలో మెదిలింది నాకు. ఇంటి ప్రక్కన గొడ్లచావిడిలో కాపరముండే రాములమ్మ కూతురు ప్రసన్న తో కలసి హైస్కూల్ కి వెళతానని గోల చేసింది. వాళ్ళు ఉత్తరాది నుండి కూలి పనుల కోసం వచ్చి బతుకుతున్నారు. ఆ పిల్ల కూడా పొద్దునేలేచి  రెండిళ్ళలో పనిచేసి తొమ్మిదింటికల్లా స్కూల్ కి వెళుతుంది.

"వాళ్ళతో కలిసి నువ్వు బడికి వెళ్ళడం ఏమిటి ? పిల్లని ఆ మాత్రం చదివించలేకపోయావా అని మా వాళ్ళందరూ తప్పు పడతారు. పీజు కట్టలేకపోతే బడైనా మానేయి కాని గవర్నమెంట్ బడికి వద్దు."  అని మహీన్  తండ్రి హుకుం జారీ చేసాడు.

అప్పుడప్పుడూ  షమ్మీ మాటల్లో  ఆమె  అతనికి  రెండవ భార్య అని తెలుస్తుంది . ఆయన మొదటి భార్య సంతానం ఇద్దరూ ఇంజినీరింగ్ చదువుతున్నారని కూడా  చెప్పింది.  పేరుకి భర్తన్నమాటే  కానీ  మహీన్ తండ్రి సంసారం గురించి ఏమి పట్టించుకోడు. ఏమిటో  ఈ బాధ్యతలేనితనాలు. వీళ్ళ కడుపున పుట్టిన పాపానికి పిల్లలు బలి అవుతారు  అని అనుకునేదాన్న.

వేసవి కాలం సెలవల తర్వాత నా వద్దనే  ఐదువేలు అప్పు పుచ్చుకుని  ఫీజులు కట్టడానికి వచ్చింది షమ్మీ .  నిరుడు కట్టాల్సిన పీజు కొంత, పుస్తకాలకి కొంత జమ వేసుకుని  కొత్త తరగతిలో వేసారు . దసరా సెలవలు కూడా ఇచ్చేసారు.  మళ్ళీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా  కట్టకపోతే  స్కూల్ వాళ్ళు మాత్రం ఎలా క్లాస్ కి రానిస్తారు ? 

"ఎలాగోలా  సర్దుబాటు చేసుకుని పిల్లకి పీజ్ కట్టలేకపోయారా? మహీన్ చాలా బాధపడుతుంది ." అన్నాను నేను 

"అసలీ రెండో పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సింది రాధక్కా !   మొదటి భర్త ఎంత బాగా చూసుకునేవాడు. యాక్సిడెంట్లో చనిపోయి  ఒంటరిదాన్ని చేసాడు. భర్త పొతే మనం పోతామా ? బోలెడు  జీవితం ఉంది .పెళ్ళి చేసుకొమ్మా !  నేను పొతే నీకు అండ  ఎవరు ఉంటారని మా అమ్మ  ఒకటే పోరింది.  ఇతనికి భార్య ఇద్దరాడపిల్లలని  తనతో  కూడా తీసుకుని పుట్టింటికి పోయిందట. ఇక రానట్టే ! చెప్పుల షాప్ ఉంది. బాగా ఆదాయం వస్తుంది అని చెప్పాడు కదా అని పెళ్ళికి ఒప్పుకున్నాను.  పెళ్ళైన ఏడాదికే మహీన్ పుట్టింది. అప్పటికే చెప్పల షాప్ లేదు. ఉన్న పిత్రార్జితాన్ని అన్నదమ్ములందరూ కలిసి  అమ్మి వాటాల్లో వచ్చిందంతా  మొదటి భార్య పిల్లలకే  ఇచ్చేసారు. నాకు  తెలియనీయకుండా.  నిలువ నీడలేదు, ఉద్యోగమూ లేదు. ఇంట్లో కూర్చుంటే బిడ్డతో పాటు భర్తని కూడా నేనే పోషించాల్సి వస్తుంది.  రోజంతా మిషన్ కుట్టినా  అతుకు బోతుకూ వేసుకోవడమే ! ఎన్ని ఖర్చులకని సరిపోతాయి?   పైగా బంధువలిళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి అన్నింటికీ హాజరవ్వాలి.అక్కడ బడాయితనం చూపిస్తూ కానుకలివ్వాలి. అన్నదమ్ముల సరుకు వేసిరావడం, డబ్బు వసూలు చేసుకురావడం లాంటి పనులు చేస్తూ నెలకి ఇరవయ్యి రోజుల పాటు తిరుగుతూనే ఉంటాడు. అలా తిరిగి పనులు చేస్తూనే ఉన్నావ్ కదా ! పిల్లకి పీజు కట్టుకోవాలని డబ్బులడిగి పట్టుకురా అని పోరుతూనే ఉంటాను  . అయినా ఖాళీ చేతులతో ఊపుకుంటూ వచ్చాడు.   అంటూ ... తన గతాన్ని వర్తమానాన్ని కలబోస్తూ  కష్టం నిష్టూరం  అంతా  చెప్పుకొచ్చింది కన్నీళ్ళతో.

ఆమెనెలాఓదార్చాలో తెలియలేదు నాకు మౌనంగా వింటూ కూర్చున్నాను. 

మొగుడి మీద కక్ష ముంచుకొచ్చింది షమ్మీకి  మహీన్ దగ్గరికి వచ్చి ప్రేమగా దగ్గరికి  తీసుకోబోయింది . మహీన్ దూరంగా జరిగింది.        

అయిదవ తరగతి చదువుతున్న మహీన్ కి   కొన్ని తెలుస్తున్నాయి. ఇదిగో ఎలా వ్రాసుకుందో చూడు .. అంటూ  తన నోట్ బుక్ లో వ్రాసుకున్న  విషయాన్ని షమ్మీకి చూపించాను .  

"నాన్నకి  వారానికి రెండుసార్లు ముక్క కావాలి , అమ్మ  వాయిదాల పద్దతిలో ఖరీదైన చీరలు కొనుక్కోవాలి ఇవన్నీ మానేస్తే నాకు ఫీజు కట్టడానికి డబ్బులు రావా ? అని ఒక రోజు  

"స్కూల్  మానేసి  పొద్దస్తమానం ఇంట్లో ఉండటం ఏమి నచ్చలేదు,ఎలాగైనా సరే తను చదువుకోవాలి " అని ఇంకో రోజూ
"బాగా చదివి ఉద్యగం చేయడానికి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి. గవర్నమెంట్ స్కూల్ కి మాత్రం వద్దంటారు. అందరూ చదువుకోవాలనే కదా  ఆ స్కూల్స్ పెట్టింది. ఒకసారి  ప్రసన్నతో వెళ్లి స్కూల్ చూసాను . ఎంత బావుందో ఆ స్కూల్. గేమ్స్ పిరియడ్ ఉందట,  ఆ స్కూల్లో లైబ్రరీ ఎంత బావుంది. మరి ఎందుకు అక్కడ చదవడానికి ఒప్పుకోరో అర్ధం కాదు" అంటూ ఇంకో రొజూ తేదీలు వేసీ  మరీ డైరీ లాగా వ్రాసి పెట్టుకుంది .   

నేను షమ్మీ ఆ వ్రాతలు చూస్తూ ఉండగానే ..   బేగ్ తీసుకుని బయటకొచ్చేసింది. తల్లి వెనుక నుండి పిలుస్తూనే ఉన్నా వినకుండా .. పరిగెత్తుకుంటూ వెళ్లి  స్కూల్ బస్ ఎక్కేసింది. 

"ఏం చేయను  రాధమ్మా ! ఇలా చేస్తే నేనేం చేయగలను " అంటూ అక్కడికక్కడే చతికిలబడి కన్నీళ్లు పెట్టుకుంది. జాలి అనిపించింది 

ఎలాగోలా నేను సర్దుబాటు చేస్తాను  త్వరలో నాకు ఇచ్చేద్దువుగాని, కాసేపాగిన తర్వాత మనమిద్దరం వెళ్లి ఫీజ్ కట్టేద్దాం ..అని చెప్పాను  షమ్మీతో.  

"వద్దు రాధమ్మా ! నేను మీ బాకీ తీర్చలేను,  ఈ రోగంతో నేను బ్రతికీ ఉంటానో లేదో తెలియదు ఎలా జరగాలంటే అలాగే జరుగుద్ది కానీయండి "  అంది 

నేను  స్కూల్ గేట్ లోకి అడుగుపెట్టే టప్పటికే  ఫ్రెండ్స్ ..  మహీన్ ని అడుగుతున్నారు ఇన్నాళ్ళు స్కూల్ కి ఎందుకు రాలేదని, తెలిసిన కొందరూ ఫీజ్ కట్టేసారా? అనినూ . 

అసెంబ్లీ అయ్యాక   క్లాస్ కి వెళ్ళకుండా ఆఫీసు రూమ్ కి వెళ్ళింది.  నేను   మహీన్  వెనుకనే  వెళ్లాను . కరస్పాండెంట్  ముందు కెళ్ళి "సర్" పిలిచింది . 

"మహీన్  ఈ రోజు పీజ్ కట్టేస్తున్నారా ?" అడిగాడు .

"లేదు సార్, మా అమ్మకి ఆరోగ్యం బాగోలేదు , మిషన్ కుట్టలేకపోతుంది, మా నాన్న డబ్బులు తేడు, అయినా సరే నేను ఈ ఇయర్ చదువుకోవాలి సర్. తర్వాతా చదువుకోవాలి,  ఫీజ్ కట్టలేనికారణంగా నా చదువు ఆగకూడదు,  ఎవరు ఆపకూడదు   ఈ ఇయర్ అయ్యే లోపు ఫీజ్ డబ్బులు మొత్తం నేనే కట్టేస్తాను. వచ్చే సంవత్సరం గవర్నమెంట్ స్కూల్ కి వెళతాను . ఫీజ్ కడితేనే నాకు టిసి ఇవ్వండి, కట్టకపోతే ఇవ్వొద్దు . మీరు నన్నిప్పుడు  క్లాస్ కి వెళ్ళనిస్తారా? "సూటిగా అడిగేసింది. ఆ పిల్ల దైర్యానికి, చదువుకోవాలనే ఆకాంక్షకి ముచ్చటేసింది. 

"మీ అమ్మ నాన్న ఫీజ్ కట్టలేకపోతే నువ్వెలా కట్టగలవు? " 

"కడతాను సార్! "దృడంగా చెప్పింది. 

"సరే, క్లాస్ కి వెళ్ళు" అన్నాడాయన . నేను నవ్వుకుంటూ  కరస్పాండెంట్ తో మాట్లాడి మహీన్  కుటుంబ పరిస్థితి చెప్పాను. ఆయన సానుభూతితో సమస్యని అర్ధం చేసుకున్నట్లు అనిపించింది. నేను కొంత డబ్బు కట్టి మరికొంత  తర్వాత కడతారని రిక్వెస్ట్ చేసి ఒప్పించి ఎలాగైతేనేం  మహీన్ చదువు  ఆ సంవత్సరానికి  బ్రేక్  పడకుండా  చేయగల్గాను.

సాయంత్రం స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళడానికి  స్కూల్ బస్ ఎక్కలేదు మహీన్. నేను బస్ స్టాప్ లో నిలబడి ఉంటే నా ఎదురుగా  నాలుగు రోడ్ల కూడలిలో నిలబడి ఉంది 
.
ఆ పరిస్థితిలో గనుక మహీన్ చూస్తే  అవమానంతో క్రుంగిపోయే షమ్మీ ముఖం,  పరువు తీస్తున్నావ్  కదే  అంటూ మహీన్ ని కొడుతున్న  తండ్రి ఆవేశం  నా  కళ్ళ ముందు కదిలాయి.  ఈ లోకంలో లేనట్టు అరుస్తుంది మహీ "మూరేడు ! మూరేడు !" మరువం కలిపిన మల్లె మొగ్గల చెండు ఆమె చేతిలో గర్వంగా నవ్వుతూ వేలాడుతుంది .   

(ఆగస్ట్ 2015 "మాతృక"  మాస పత్రిక లో  వచ్చిన నా కథ )

కామెంట్‌లు లేవు: