రచయితను అయినందుకేనేమో యెవరు కులం, మతం గురించి జనరలైజ్ చేసినా కల్గిన నొప్పిని భరించి .. పరిణామ క్రమంలో వున్నాం కాబట్టి కొన్ని భరించాలి తప్పదు అనుకుంటాను. కొంతమంది అభ్యుదయవాదులు ఇంటలెక్చువల్స్ మారుతున్న క్రమాన్ని జీర్ణించుకోలేక వాళ్ళవాదనలకు బలం చేకూర్చుకోవడానికి మెజారిటీ పీపుల్ ని జనరలైజ్ చేసి తిట్టి అవమానించి తృప్తి పడతారు. అలాంటిదే కమ్మ కులాన్ని తిట్టడం. హిందూ మతాన్ని విమర్శించడం. దీనిపై నా స్పందన.
మనిషి స్పందన భిన్న రూపం . ఒక సంఘటనకి, అన్యాయాలకి, అవినీతికి, వివక్షకి. పీడనకి గురైనప్పుడు దూరంగా వుంటే గళమెత్తి మాట్లాడటం, స్వయంగా నిరసన తెలియజేస్తూ ప్రశించడం ఒకటి. రెండోది టెక్స్ట్ రూపంలో నిరసన. స్పందన తెలియజేయడం. వ్యక్తులు కొన్నిసార్లు తీవ్రంగాను,కొన్ని సార్లు పాక్షికంగానూ ,కొన్నిసార్లు మౌనంగానూ వుంటారు. బాధితులకి అనుకూలంగా మీరెందుకు స్పందించరు,మీరు కూడా పీడితుల పక్షమే అని తీర్మానించేసి భావప్రకటన పేరిట అనవసరంగా నోరు పారేసుకుంటారు కొందరు. కవిత్వాలు రచనలు చేస్తుంటారు. అప్పుడెప్పుడో రోహిత్ మరణం పట్ల,ఆసిఫా పై దారుణం పట్ల నేను పెద్దగా స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు అంటే నేను అంతకన్నా తీవ్రమైన (అనిపించిన) నావ్యక్తి గత సమస్యలలో వుండి ఉండవచ్చు. లేదా వివక్షలు సమాజంలో ఏదో ఒకరూపంలో వుంటూనే వుంటాయి. సున్నిత మనస్కులు పోరాడే ధైర్యం లేక ఒకానొక బలహీన క్షణాల్లో మరణాన్ని కోరి ఆహ్వానించడం అయితే ఆసిఫా పై జరిగిన దారుణం లాంటివి నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతూనే వున్నాయి. ఆసిఫా ప్రత్యేకంగా అనిపించేది ఎందుకంటే అక్కడ మత౦ చోటు చేసుకోవడం దానికి నేను ఖిన్నురాలై మాట్లాడలేకపోవడం, ఒకవిధమైన వైరాగ్యం కూడా వచ్చేసింది.
నిజానికి మనం మన చుట్టూరా వున్న ప్రజలతో మమేకమై కులరహిత, మతసహన జీవన విధానంతో ప్రేమగా శాంతిగా మెలుగుతుంటాం చూడండి అదే అసలు కావాల్సిన జీవన విధానం. ఎక్కడో జరుగుతున్నవాటికి స్పందించి మన తోటివారిని శత్రువులుగా భావిస్తూ అడ్డుగోడలు కట్టుకుని నిత్యం కత్తులు నూరుకోవడం కాదు మనకి కావాల్సింది. ప్రతి మనిషి ఎవరికీ వారు వారి వారి సర్కిల్స్ లో ప్రేమగా శాంతియుతంగా జీవించడానికి కృషి చేయడమే మన జీవన విధానం కావాలి. విద్వేషం నింపుకున్న వారితో మనం మాట్లాడలేము. అదంతే !
స్పందన బావేద్వేగాల నుండి అప్పటికప్పుడు వెలువడేది. రాజకీయ నాయకులకి మల్లే తెచ్చి పెట్టుకునేది కాదు. తూచి కొలిచి వ్యకీకరించేది కాదు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి