17, మే 2018, గురువారం

గంధర్వ గళానికి వీడ్కోలు

కవిలోని భావుకత్వాన్ని. గళం లోని మాధుర్యాన్ని , ప్రవర్తనలోని సున్నితత్వాన్ని 
మాటలో చురుకుదనాన్ని, కల్మషంలేని నవ్వులని 
నడకలో ఠీవిని, స్వార్ధంలేని ప్రేమలని 
స్నేహ గుణంలో ఉన్న స్వచ్చతని 
ఏ మాత్రం సంకోచం లేకుండా ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది 
వ్యక్తులని కాదు గుణాలని ప్రేమించాలనిపిస్తుంది
అందుకనేమో .. మనకి ఇష్టమైన జాబితాలో ఎంతోమంది చేర్చ బడుతూనే ఉంటారు. అలా నా ఇష్ట జాబితాలో వున్న గంధర్వ గళానికి వీడ్కోలు పలికే టపా . 

ఈ రోజు ఫేస్ బుక్ మిత్రురాలు సోదరి విజయ అస్సరి ఓ విషాద వార్తని పంచుకున్నారు. నేను ఆ పోస్ట్ చూసేటప్పుడు యింటికి బయట వున్నాను. నిలబడి వున్నదానినల్లా సమీపంలో  కుర్చీ వెతుక్కుని కూలబడ్డాను. నమ్మశక్యం కాక మళ్ళీ చూసాను. కళ్ళనిండా నీళ్ళు. మసక మసకగా "పుష్పరాజ్ " గారి చిత్రం. గ౦ధర్వ గళం మూగపోయిందా? ఎంత వినసొంపుగా వుండేది. మాట పెదాలపై నుండి వచ్చినట్లు కాకుండా హృదయం నుండి వెలువడుతూ వుండేది. ఒక సారి వింటే వెంటాడే స్వరం. 

ఆకాశవాణి కడప కేంద్ర ఎనౌన్సర్ గా పరిచితమైన స్వరం. అభిరుచి పాటలకన్నా ఆయన వ్యాఖ్యానం వినడానికి శ్రోతలతో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో వారి స్వరం వినడానికే యిష్టపడేదాన్ని. ఒకసారి ఫోన్ ఇన్ లైవ్ లో స్వయంగా చెప్పాను మీ గళానికి నేను పెద్ద ఫేన్ ని సర్ ..అని. గలగలా నవ్వేసారు. స్వరాలజల్లు కురిసినట్టు. మాటే పాటలా వుండేది. కడప వెళ్ళినప్పుడు ఆకాశవాణి  కేంద్రానికి వెళ్లాం. "పుష్పరాజ్ " గారిని  చూడాలనుకుంటున్నాను అని చెపితే అర్జంట్ పనులున్నప్పటికీ మాకోసం వేచి వున్నారు. చాలా ఆత్మీయంగా మాట్లాడారు. పిల్లలతో బయటకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాను. ఎక్కువసేపు వుండలేకపోతున్నాను అని సెలవు తీసుకున్నారు. కార్యకమాల నిర్వహణ  చాలా బాగుండేది. విషయపరిజ్ఞానం చాలా బాగా ఉండేది.శ్రోతలు అచ్చెరువు చెందేలానూ,వ్యంగ్యంగా , అవసరమైనప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడటం విన్నాను.  చక్కగా పాటలు పాడటం విన్నాను. సంగీత సహకారం లేకుండానే ఆ గళం వినిపించే గానమాధుర్యాన్ని  కె జె  యేసుదాస్ గళంతో పోల్చవచ్చు.

నేను అంతగా అభిమానించే గళం శాశ్వతంగా మూగబోయిందని తెలిసి కన్నీరైనాను. ఒకమారు విన్నాక వెంటాడే వేటాడే స్వరం ఇక వినబడదు కానీ ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమైన  కార్యక్రమాల జాబితాలో రికార్డింగ్ వాయిస్ వినబడుతుంది. ఆ విధంగా వారి గళాన్ని మిగిల్చి వెళ్ళారని మిత్రులతో చెప్పుకుని బాధని పంచుకున్నాను. వుయ్ మిస్ యూ   పుష్పరాజ్ సర్. 1993 నుండి కడప రేడియో వినే నేను తర్వాత తర్వాత  మీ స్వరం వినడం కోసమే అభిరుచి కార్యక్రమం వినడానికి తయారుగా వుండేదాన్ని. ఎక్కడో కడప కేంద్రం నుండి వినబడే మీ వాయిస్ నాలుగు వందల కిలోమీటర్లు దూరంగా ఉన్న నాకు వినబడటం అంటే మీ గళం వినగల్గే అదృష్టం కలగటమే! రేడియో ట్రాన్స్ మీటర్ కన్నా శక్తివంతమైన గళం మీది అనుకునేదాన్ని. ఆ గళంలో తీయదనమా ఒక విధమైన గంభీర స్వరంలో దాగున్న మెస్మరైజింగో , ఆ ఉచ్చారణకి నేను వీరాభిమానిని అన్నది నిజం.

ఇకనుండి నా స్నేహితులు "వనజా, ఈ రోజు  డ్యూటిలో పుష్ప రాజ్ గారున్నారు, నీకు ఆయన వాయిస్ చాలా యిష్టం కదా, ఇప్పుడే  అభిరుచికి  కాల్ చేయి అని కాల్ చేసి చెప్పే పని లేకుండా చేసారు సర్. భగవంతుడిచ్చిన వరాలని జాగ్రత్తగా కాపాడుకుని అందరిని అలరించాలని అనుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఇలా అకస్మాత్తుగా వెళ్ళిపోయి చాలా అన్యాయం చేసారు సర్. అందుకు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను సర్. సారీ సర్ .. కలలో కూడా వెంటాడే స్వరం ఇక వినబడదు  అంటే నాకెంత బాధ ఉండాలి. కన్నీళ్ళతో చెపుతున్నా!  పోనీలెండి, మనసు స్థిమిత పరుచుకుని మళ్ళీ చెపుతున్నా, ఆ గంధర్వ లోకంలో తేనెలూరే మీ గళ మాధుర్యాన్ని  మిగతా గంధర్వులకి  వినిపించి ఈర్ష్యతో మిమ్మల్ని క్రిందికి తోసేసేటట్లయినా చేసుకోండి. ఇప్పటి నుండి నేను మీ గళ మాధుర్యాన్ని పసిపాపల గొంతులో వెతుక్కోవడానికి తయారైపోతున్నాను.  జస్ట్ వుయ్ మిస్ యూ పుష్ప రాజ్ సర్ ! గళంతో  ఆల్ ఇండియా రేడియో రికార్డ్ లలో మీరు సజీవం..సజీవం.. సజీవం.


కామెంట్‌లు లేవు: