26, జులై 2018, గురువారం

ఈ కవిత్వ వర్షం ఎలా కురిసిందో !




వెలుతురు బాకు కవితా సంపుటి ఆవిష్కరణ తర్వాత మంచి పాఠకులు విమర్శకులు "పిన్నమనేని మృత్యుంజయరావు "గారు ఒక మాటన్నారు. కొత్త తరం వాళ్ళు ఏమి వ్రాస్తున్నారో ఎలా వ్రాస్తున్నారో చూడకుండానే సీనియర్ కవులు కొత్తవాళ్ళని అవహేళన చేయడం ఎంతమాత్రం తగదని అన్నారు. కవులకి దిశా నిర్దేశం చేయడం మానేసి దశాబ్దాల తరబడి ఇంకా వారి వొరవడి యే కొనసాగాలనుకోవడం కూడా అత్యాశ అవుతుందని అన్నారు. నిజంగా అవే మాటలని కల్పన రెంటాల గారు కూడా తన ముందు మాటలో .. అన్నారు.

కల్పన రెంటాల గారు వ్రాసిన ముందు మాట ..చదవండి.

ఈ కవిత్వ వర్షం ఎలా కురిసిందో!

స్త్రీ వాద కవిత్వ తొలి సంకలనం “ నీలీమేఘాలు” వచ్చిన చారిత్రక సందర్భం నుంచి ఇప్పటి దాక స్త్రీవాద కవిత్వం ఎన్ని దారుల్లో ప్రయాణించిందో , ఎన్నెన్ని మలుపులు తిరిగిందో వనజ కవిత్వం చదువుతున్నప్పుడు అనివార్యం గా ఎవరికైనా గుర్తుకు వస్తుంది. స్త్రీవాద కవిత్వం మొదట్లో వచ్చినంత బలంగా ఇప్పుడు రావటం లేదనో, లేదా ఇప్పుడు అసలు స్త్రీవాద కవిత్వం అనే ముద్ర అవసరం లేదనో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి. నీలిమేఘాల తర్వాత ముద్ర ( స్త్రీల కవిత్వ సంకలనం) , ఇంకొన్ని సంకలనాలు వచ్చినప్పటికీ, బలమైన స్త్రీవాద కవిత్వ సంకలనం మరొకటి మాత్రం రాకపోవటం విచారకరం. అస్తిత్వ ఉద్యమాల్లో రకరకాల ఉప చీలికలు వచ్చాయి. ఆ చీలిక మంచిదో, చెడ్డదో అని వ్యాఖ్యానించటం కన్నా, అవసరం, అనివార్యమని ఒప్పుకొని తీరాలి.

స్త్రీవాద కవిత్వం మొదట్లో ఓ ఉధృతి లాగా వచ్చినప్పటికీ, తర్వాత తర్వాత కూడా ఆ ఉదృతి ఏ మాత్రం తగ్గలేదు. కాకపొతే ఓ విధమైన ఆవేశం స్థానం లో మరింత పదునెక్కిన ఆలోచన చోటు చేసుకుంది. భిన్నమైన పోరాట సన్నివేశాలను , ముఖ్యమైన సామాజిక పరిణామాలను గ్లోబలైజేషన్ నేపథ్యం నుంచి స్త్రీవాద కవయిత్రులు చూసారు. అవన్నీ తప్పనిసరిగా స్త్రీల కవిత్వం లో స్థానం సంపాదించుకున్నాయి. అయితే అవి స్త్రీవాద సాహిత్య విమర్శ లో రికార్డ్ కాలేదు.

స్త్రీవాద కవిత్వ విమర్శ పేరిట వస్తున్న వ్యాసాలూ ’80 ల్లో వచ్చిన కవిత్వం గురించి, కవితల గురించి, కవయిత్రుల గురించి ప్రస్తావించి వదిలేస్తున్నారు తప్ప తర్వాతర్వాత వచ్చిన కవిత్వాన్ని గురించి మరీ ముఖ్యంగా గత పది పదిహేనేళ్ళుగా వస్తున్న కవిత్వాన్ని గురించి, కవయిత్రుల గురించి మాట్లాడటం లేదు. వనజ కవిత్వం చదువుతున్న సందర్భం లో ఆ లోపం మరింత గా కొట్టొచ్చినట్లు కనిపించింది. ఎందరో కవయిత్రులు గత రెండు దశాబ్దాలుగా తెలుగు సామాజిక జీవన సందర్భాన్ని కవిత్వీకరించారు. అవన్నీ వారి వారి వైయక్తిక కవిత్వానుభావాలుగా చూడటం కన్నా, ఒక సామాజిక పరిణామ క్రమ లో భాగం గా చూడాల్సిన అవసరం ఉంది. వనజ కవిత్వం కూడా ఆ ముఖ్యమైన పరిణామ క్రమం లో ఒక భాగం.

“ నిశ్శబ్దాన్ని గెలిచి బతకడమంటే

లోకాలను గెలిచి బ్రతకడం కన్నా

గొప్పని తెలిసి పచ్చని చెట్టు పై

గర్వం గా కూర్చుందీ ఒంటరి పక్షి అలవాటు గా “

దాదాపు పదేళ్లకు పైగా కవిత్వం రాస్తున్న వనజ కవిత్వానికొక మచ్చు తునక ఈ పంక్తులు.

కవిత్వ తాత్త్వికత ను, జీవన భారాన్ని రెండింటినీ సమతుల్యం చేసే ఒక సాహిత్య దృక్పథాన్ని తన రచనల్లో ప్రతిబింబించ గల సమర్థురాలు వనజ. ఆధునిక మహిళ గా కవిత్వం రాయడం అంటే ఏమిటో తెలుసు వనజ కు. ఆమె రాసిన కవితల్లో సగానికి పైగా స్త్రీగా తన అనుభవాలను, అనుభూతులను ఆవిష్కరించింది . ఒక స్త్రీ గా కవి కావటమంటే రెండు రకాల వేదనలను ఆవిష్కరించగలగాలి.

వనజ కవిత్వం మొత్తాన్ని ఒక చోటకు చేర్చుకొని ఒకటే సారి అన్నీ చదువుతున్నప్పుడు వనజ ఎంత భావుకురాలో, సున్నిత మనస్కురాలో అర్థమవుతుంది. కవిత్వానికి కావాల్సినంది ముఖ్యంగా స్పందించే మనసు. ఆ మనసు కి మాట్లాడటం రావాలి. మాటలు గా చెప్పుకోవటం రావాలి.

“ ద్రవం లాంటి దాన్నని అర్థమయినందుకేమో

అవలీల గా పాత్రలలో మారుతుంటానంతే !

ఇక తాళం చెవి తో పనేముంది?”

కవిత్వం రాయటానికి తాళంచెవులతో బంధించని మనసు ఉండాలని గుర్తించిన కవయిత్రి వనజ.

మనసు పలికించే మృదంగ ధ్వనులను అక్షరీకరించే పరసువేది కవిత్వం. ఆ విద్య అందరికీ ఒకేలా దక్కదు. మది లో వచ్చే ప్రతి భావం కవిత రూపం దాల్చనక్కరలేదు. కాకపోతే కవిత్వం రాసే కొత్తల్లో “ డైరీ లో కొన్ని పేజీలు “ ఎప్పుడూ కవిత్వమవుతూనే ఉంటాయి. వాటిని ఇంకొంచెం సానబెడితే, అక్షర శిల్పాలను చెక్కుతూ ఉంటే బలమైన కవిత్వం గా మారుతుంది. లేదంటే కొన్ని కవితలు కేవలం భావాల ప్రోది గా మిగిలిపోతాయి. ఈ తేడా ను గుర్తించే క్రమం లో ఉంది వనజ కవిత్వం.

నిజాన్ని నిర్భయంగా నిష్పూచీగా చెప్పడం ఒకానొక కవిత్వ లక్షణమైతే, వనజ కవిత్వంలో ఆ లక్షణం నిండుగా వుంది. చాలా మంది మొహమాట పడో, సంకోచం వల్లనో, సంశయం తీరకనో చెప్పలేని విషయాల్ని స్పష్టంగా మాటల్లో వ్యక్తం చేయడం వనజ సాహిత్య వ్యక్తిత్వంలో బలంగా కనిపిస్తుంది. ఈ కవిత్వ సంపుటి ద్వారా ఇది ఇంకా ఎక్కువ మందికి తెలిసివచ్చే నిజం. ఆమె కవితలు జ్వలించే “ఆత్మజనిత వాక్యాలు.”

అమ్మ చేతి గాజుల గురించి, అమ్మ మనసు లో మాట గురించి మాట్లాడటం తో పాటు, మోయలేని భారం గా మిగిలిన ఇంటి పేరు గురించి, హాస్టల్ అమ్మాయిల అవస్థల గురించి రాస్తూనే “ అనంత కాలానికి ఉనికి ని....నేను స్త్రీని “ అంటూ బలంగా కవిత్వ గళం విప్పుతుంది.

ముఖ్యంగా స్త్రీల సమస్యలే కేంద్రంగా కథలూ కవిత్వమూ వ్యాసాలు నిరంతరాయంగా ఆమె కలం నించి వస్తూనే వున్నాయి. ఈ కవితలు కూడా ఆమె స్త్రీ-కేంద్రిత ప్రపంచానికి ఇంకో రూపమే. వ్యక్తిగతం అంటూ ఏమీ లేని సామూహిక గానం ఈ కవిత్వం. రాసేది ఇంటి పేరు గురించి కావచ్చు, సామాజిక అత్యాచారాల గురించి కావచ్చు- వనజ కవిగా నూటికి నూరు పాళ్ళు సామూహిక జీవి.

ఉదాహరణలు అనేకం ఇవ్వచ్చు కాని, ఈ విషయం స్పష్టంగా అర్థం కావడానికి “ఇంటి పేరు” కవిత చదివితే చాలు.

ఆడ నుండి ఈడకి నిర్దాక్షిణ్యంగా

నెట్టేసిన ఇంటి పేరు

నాకు మంచి పేరుని తెమ్మన్న ఇంటి పేరు

...నా పైబడ్డ పెనిమిటింటి పేరు.

అనే కవితలో ప్రతి స్త్రీ ఆవేదనా పలికిస్తుంది వనజ. ఈ అంశం ఎందఱో స్త్రీల మనోవేదనే అయినప్పటికీ, ఇప్పటికీ దీన్ని గురించి ఎవరూ కవిత రాసిన ఉదాహరణలు అంతగా లేవు. “నన్ను మేల్కొనీయకుండా/ చీకటిలో ఉంచిన ఇంటి పేరు” అంటూ “నేను”తో మొదలైన ఈ కవిత ఆ వ్యక్తిగత పరిధుల్ని దాటుకొని, “అది లేకుండా నేను లేనా/ అని నాళాలు తెగేలా ప్రశ్నించాలని వుంది,” అనే ధిక్కార ప్రకటనతో కొనసాగుతుంది. ఈ కవితలో బలమైన స్త్రీ చైతన్య ధోరణి కనిపిస్తుంది.

“ మనువు ఒక లోహపు గది

తనువు ఒక మోహపు నది”

అన్న వాక్యాలు చదివినప్పుడు హృదయం బరువెక్కుతుంది . మనువు, తనువు ఓ స్త్రీ కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదేమో అనిపిస్తుంది.

స్త్రీ చైతన్య సంఘర్షణ లను, ఇతర సామాజిక అంశాలని గుండె దిటవుగా పలికించిన వనజ చిక్కని కవిత్వం రాయగలదని చెప్పటానికి మంచి ఉదాహరణ “అలవాటు” కవిత .

“అలవాటుగా” అనే కవితలో ఆమె ఇలా అంటుంది:

పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో

ఒంటరి పక్షి

మౌనిలా ధ్యానం చేస్తుందో

పరద్యానంలో మునిగి పోయిందో

పంజరంకాని చోట కూడా

నిశ్శభ్దాన్ని పూరించేవారు లేక

ఒంటరి తనాన్ని ఆశ్రయించలేక

దిగులు మేఘం తొడుక్కుని

గుబులుగా కూర్చుంది ఒంటరి పక్షి

దిగులు దిగులుగా మొదలయ్యే ఈ కవిత చివరికొచ్చేసరికి ఆశ్చర్యకరమైన భావంలోకి తీసుకువెళ్తుంది.

నిశ్శబ్దాన్ని గెలిచి బ్రతకడమంటే

లోకాలని గెలిచి బ్రతకడం కన్నా

గొప్పని తెలిసి పచ్చని చెట్టుపై

గర్వంగా కూర్చుందీ ఒంటరి పక్షి అలవాటుగా

అనే ముగింపులో వనజ తాత్వికత గాఢమైన ప్రతీకగా రూపు దిద్దుకుంటుంది. ఆశ్చర్యం అనేది బలమైన కవిత్వ ముగింపు. అలాంటి ముగింపుని ఇవ్వడంలోనే కవి భావ విజయం వుంటుంది. వనజ కవితల్లో ఈ ఆశ్చర్యకరమైన ముగింపులకి ఇదొక మచ్చు తునక మాత్రమే.

వనజ కథలైనా, కవిత్వమైనా ఆమెలోని అన్వేషణా తృష్ణ కి సంకేతాలు. ఎవరైనా ఒక వెతుకులాటలో భాగంగానే రాస్తారు. కాని, ఆ వెతుకులాటకి ఎంతో కొంత అర్థం తెలిసినప్పుడు గమ్యం మసకగా అయినా కనిపిస్తుంది. వనజ కవిత్వంలో ఆమె గాఢమైన అనుభవ పరిపక్వత ప్రతి సందర్భంలోనూ వ్యక్తమవుతుంది. ఈ కింది రెండు వాక్యాలు ఆమె సాహిత్య అన్వేషణకి కచ్చితంగా సరిపోతాయి.

ఆఖరికి కథలోనైనా నన్ను నేను వెతుక్కోవాలి

ఎప్పుడో పారేసుకున్న నన్ను నేను వెతుక్కోవాలి

ఏకాంతాన్ని గురించి కవిత్వం రాయని కవి ఉండరు. ఏకాంతం గురించి వనజ భావాలు ఆమె హృదయ భాష గా చదువరులకు అర్థమవుతుంది.

“ ఏకాంత మెప్పుడూ వెలుగు లోకి రాని కాసారమే

ఉల్కలు రాలినట్లు రాలే ఆశలను

ఒడుపు గా పట్టుకున్న కొన్ని అమృత క్షణాలను

పాకుడు పట్టిన చేదు జ్ఞాపకాలను

గులకరాళ్ళు గా మార్చి

అజ్ఞాన సముద్రం లోకి విసిరేస్తుంది.”

మొత్తంగా వనజ కవిత్వం స్త్రీ అంతర్బహిర సంఘర్షణల గురించి, సమాజం లో చుట్టూరా కనిపిస్తున్న అన్యాయాలు, అసమానతల గురించి, ఓ వ్యక్తిగా హృదయగతమైన అనుభూతుల ప్రయాణం గురించి ఇలా మూడు దిశల్లో సాగింది. మొత్తం ఆమె కవితల గురించి మాట్లాడటమో, విశ్లేషించటమో నా ఉద్దేశ్యం కాదు. వనజ కవిత్వం గురించి ఒక చిన్న పరామర్శ చేస్తూ నాకు నచ్చిన రెండు మూడు కవితల వరకూ మాత్రమే ప్రస్తావించాను.

దాదాపుగా పదేళ్ళు గా కవిత్వం రాస్తున్న వనజ కవితలు మొత్తం “ వెలుతురుబాకు” పేరిట పుస్తకంగా వెలువడుతున్న సందర్భంగా రాస్తున్న ఒక ఆత్మీయ పరిచయం మాత్రమే ఇది.

అయితే, కవిత్వం విషయానికి వస్తే కవికి రూప అన్వేషణ కూడా పెద్ద సవాలు. కవిత్వానికి తగిన అంశం దొరకడం ఎంత కష్టమో, ఆ అంశానికి సరిపోయే రూపం దొరకడం అంతే కష్టం. ఈ సంపుటిలో వనజకి కవిత్వ అంశాలు అనేకం దొరికాయి. కాని, వాటికి తగిన రూపాన్వేషణకి ఇదొక ప్రారంభంగానే కనిపిస్తోంది. అయితే, అది మంచి ప్రారంభం! “నన్ను నేను వెతుక్కోవాలి” అని అంటున్న వనజ తన కవిత్వంలో ఈ అన్వేషణని ప్రతి వాక్యంలోనూ చేయగలగాలి. ఈ కవితలు ఆ దిశగా కొత్త ఆశ! “ వెలుతురు బాకు” అన్న పద ప్రయోగం తో ఓ కొత్త దారి లోకి వనజ కవిత్వం ప్రయాణిస్తుందని ఆకాంక్ష.

కల్పనారెంటాల

ఫిబ్రవరి 9, 2016.

కామెంట్‌లు లేవు: