బస్ లో ప్రయాణిస్తూ విండో సీట్ లో కూర్చుని తలపైకెత్తి చూస్తే…ఇరువైపులా పచ్చటి గుబురైన చెట్ల కొమ్మలు పైనున్న ఆకాశాన్ని కనపడనీయకుండా కరచాలనం చేసుకుంటున్నట్లు కింద చూస్తే.. నల్లని తారురోడ్డు. ఆ రోడ్డు పై ప్రయాణం ఆహ్లాదకరం. చింతచెట్లు మామిడిచెట్లు నేరేడు చెట్లు అవి కాలం చేసిన చోట్ల వెలిసిన సుందరమైన గుల్మొహర్ చెట్లు వాటి వెనుక చేనుకు కాపాలాగా నిలిచాయా అన్నట్లుండే తాటిచెట్లు వాటి మధ్య పరిగి చెట్లు చిట్టి ఈత పొదలు..
బెజవాడ నుండి వెళుతుంటే కుడిపక్క బెజవాడ వైపు వస్తుంటే ఎడమ పక్క రహదారి పక్కనే గరప నేలలో మనిషిలో సగమెత్తు పెరిగిన ఆకుపచ్చని పత్తి చేను ఎర్రటి పూలతో శోభనామయంగా కనబడుతుంటూ వుంటాయి. ఆ చేలని దాటి యెత్తుగా కనబడే యెర్రమట్టి చెరువుకట్ట. వెంకటాపురం అనే గ్రామం నుండి తూర్పుకు మా ఊరికి పడమర వైపున వున్న ఆ చెరువుకట్ట రహదారి నా పూర్వీకులు నడిచిన దారి. ఆ చెరువు గట్టుపై నడుస్తుంటే యెర్రటి యెండైనా సరే నల్లేరు నడకే! చెరువు నిండా యెర్రటి నీళ్ళు నీళ్ళ మధ్యలో పచ్చటి పూలతో నల్ల తుమ్మ చెట్లు వాటిపై తెల్లటి కొంగలు రకరకాల పక్షులు కిలకిల రవాలు వేలాడే గిజిగాడి గూళ్ళు. తూముల నుండి కిందకి దక్షిణంగా మాగాణి భూములకు జీవధారగా ప్రవహించే నీటి గలలు.. వాటి మధ్య దూరంగా రోడ్డు పై ప్రయాణించే వాహనాల శబ్దం.
అసలు చెవుటూరు దాటగానే వెంకటాపురం రాకుండానే తారు రోడ్డుపై బస్ లో ప్రయాణిస్తూనే తూర్పున కనబడే మా ఊరు ను కళ్ళారా చూసుకునే అనుభవం యెప్పటికప్పుడు నాకు సరికొత్త అనుభూతి. కానీ ఊరు ముఖ చిత్రం మాత్రం పురా సంస్కృతి. శరీరం బస్ లో ప్రయాణిస్తూనే వుంటుంది. మనసేమో చెంగు చెంగున బస్ దిగేసి..అదిగో కనబడే చెరువు కట్టను వొరసుకుంటూ వేగంగా సారించే చూపుతో పత్తి చేలను మాగాణి పొలాలను దాటి పాటి దొడ్లు మీదగా చింతచెట్లు తాడిచెట్లు సీమ తుమ్మ చెట్లు దాటి ఊరిలో నైబుతి మూలగా నున్న మేడసాని వారిల్లు. ఆ ముందు వరుసలో పొన్నం వారి బెంగుళూరు పెంకుటిల్లు దాటి మూడవ వరుసలో యెత్తుగా కనబడే కుమ్మరి పెంకుటిల్లు మాది అని అనుకోవడం నిలువెత్తు సంబర పడటం. దూరం నుండి కొండ గుర్తుతో మా ఇల్లును అస్పష్టంగా చూసుకోవడంలో అంతులేని ఆనందం. అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ గుండె బరువై కన్నీటి మసకలో మళ్ళెప్పుడు వస్తానో అనుకుంటూ ఆ ఇంటిని మమకారంతో చూసుకోవడం నాకు పరిపాటి.
చెరువు కట్ట మీదగా నడక దారితో వూర్లోకి ప్రవేశిస్తే. చెరువును ఆనుకునే వాలులోకి వున్న గ్రామ దేవత గంగానమ్మ గుడి ఆమెకు యెదురుగా పోతురాజు. ఆ పల్లంలో నుండి పదడుగులు పైకి యెక్కితే ఊరు నైబుతి భాగంలోకి చేరుకుని.. తిన్నగా నడిచి వెళుతూ.. కుడి పక్క మూడవ సందులో రెండవ ఇల్లు మాది.
ఎనిమిది దూలాల పై తూర్పు పడమర ల వైపు సమానంగా వాలుగా వుండే యిల్లు మాది. మా వాటా నాలుగు దూలాల పట్టు. సగభాగం మా చిన్నతాత వాళ్ళది. పడమటి వాలులో రెండు పెద్ద గదులు మధ్యలో నడిమిల్లు తూర్పు వాలులో ఆగ్నేయం మూల ధాన్యం గది(కొట్టు గది) మిగతాదంతా వరండా
తూర్పున యింటికి మధ్యన ఆరడుగుల కన్నా ఇంకా ఎత్తైన సింహద్వారం. గోడలో అమర్చిన సింహద్వారం పై భాగాన తోరణం అటునిటు వ్రేలాడుతూ సగం మాత్రమే కనబడే గుమ్మటాల డిజైన్ గోడకి సింహ ద్వారం పైగానికి మధ్య అడుగున్నర వెడల్పు చెక్క (గొడుగు బల్ల) దాని కిందభాగం కూడా మంచి పనితనంతో చెక్కిన పద్మాల డిజైన్ లతలు తీగలతో చాలా అందంగా ఉండేది. సింహద్వారానికి ఇరువైపులా పెద్ద పెద్ద కిటికీలు. కిటికీ కి దర్వాజాకి మధ్య రెండు వైపులా దీపపు గూళ్ళు. దర్వాజా పైన కిటికీల పైనా నాలుగు అడుగుల యెత్తుతో లతలు పూలతో కూడిన ఆర్చెరీ డిజైన్. ఈ డిజైన్ లలో విపరీతంగా దుమ్ము చేరేది. బూజు కూడా ఎక్కువే. శుభ్రం చేసేటప్పుడల్లా సిమెంటుతో గోడ మందం వరకు నింపేసి సాపు చేపిస్తాను అనేది మా అమ్మ. ఆగ్నేయం మూలాన కొట్టు గది. దానికి నాలుగడుగుల వెడల్పుతో వుండే11 చెక్కలున్న నిలువెత్తు ద్వారం వుండేది.. పైన చూరుకు ఆన్చి కట్టిన గోడ.. ఆ గోడలో ఒక మనిషి యెక్కి లోపలికి దిగేంత వెడల్పు యెత్తుతో ఇంకో కిటికీ వుండేది. మాసూలు కాలంలో ధాన్యం యింటికి తోలుకు వచ్చి గది నిండా నింపిన తర్వాతే మిగతావి దళారికి అమ్మేవారు.
ఇక సింహద్వారం యెదురుగా వరండాకు దిగువునా మూడు మెట్లు దిగితే ఇంటి పొడవునా.. ఆరడుగుల వెడల్పుతో తాటాకు పందిరి.. యెర్రమట్టిలో ఆకుపచ్చని పేడ కలిపి నున్నగా అలికిన నేల పై తెల్లటి నాము ముగ్గులతో కళకళలాడుతూ వుండేది. పడమటి వైపు ప్రత్యేకంగా పెంకులతో కప్పిన పొడవైన వంటిల్లు. ఇంటిని వంటింటిని కలుపుతూ తాటాకు పందిరి.. వెనుక వంటింటి గోడ నుండి వరండా గోడ వరకూ ఉత్తరం వైపున వున్న మిగతా నాలుగు దూలాల పట్టు వున్న మా చిన్న తాత యింటిని విడదీస్తూ మధ్యలో అడుగున్నర వెడల్పు వున్న ఇటుకల గోడ. వంటింటికి యింటికి మధ్య ఖాళీ స్థలంలో గోడను ఆనుకుని రాధాకృష్ణ పూలతీగ (Rangoon Creeper) తీగ మల్లెచెట్టు. కరివేపాకు చెట్టు.. మంచి నీళ్ళ కుండ.. మజ్జిగ కవ్వం గుంజ దానిముందు సిమెంట్ చుట్టు మీద తాటాకు చుట్టు. పడమటింట్లో దీపం గూడు ..ఒక పెద్ద కిటికీ ఉండేది. సాయంత్రం మా అమ్మ సంధ్య వేళ దీపం వెలిగించి ఆ గూట్లో పెట్టి దణ్ణం పెట్టుకునేది. పెద్దలకు పెట్టే దీపం అనేవారు. మూడు అరలున్న చెక్క అరమరాలు ఉండేవి ప్రతి గదిలో. వంటింట్లో అటక ఉండేది.వెలిసె మీద అనేవాళ్ళు. గోడవారగా చెక్క కొట్టి ఉండేది. దానిమీద పాత్రలు బోర్లించేవారు.
మా ఇంటి గోడలు పన్నెండు అడుగుల యెత్తులో రెండడుగుల వెడల్పుతో (ఒక మనిషి పడుకుని దొర్లే అంత ) వుండేవి. గానుగ సున్నం ఇటుక రాళ్ళతో కట్టిన ఇల్లు మాది. ఇంటికి వాడిన కలపంతా టేకు మద్ది వే నంట. దూలాలు దూలాలపైన పై కప్పుకు ఆలంబనగా వుండే చిన్న దూలాలు దంతులు పరందాలు. అన్నీ నల్లగా నిగనిగలాడుతూ వుండేవి. మందంగా ఉండే వెదురు బద్దలు పరచి వాటిమీద చాపలు పరచి కుమ్మరి పెంకుతో ఇల్లు కప్పబడి ఉండేది. పెద్ద పెద్ద గాలివానలకు పెంకు చెదర కుండా సిమెంటుతో బద్దులు కట్టి ఉండేవి.
ఇక మా యింటి వరండా అందం చెప్పనలవి గాదు. నల్లటి రాయి మా అమ్మ పరిశుభ్రానికి మరింత నల్లగా మెరిసిపోయేది. మా అమ్మ కోడలిగా వచ్చే నాటికే ఆ ఇల్లు కట్టి ముప్పై నలబై యేళ్ళు పైబడిందేమో.. సున్నంతో కట్టిన గోడలు.. పెళికలు రాల్చేవి అంట. మా అమ్మ వాటిని రాల్చేసి.. వరండా అంతా సిమెంటుతో గోడలకు నాలుగడుగుల యెత్తు వరకూ ప్లాస్టింగ్ చేయించింది. రెండు రకాల గోడ అతుకులతో బాగుండదని నల్లరంగు వేయించి పైన పట్టీగా మూడంగుళాల ఎర్రటి రంగుతో పట్టీ వేయుంచింది. నల్లగా చేవ దేలిన కలపతో వార్నిష్ మెరుపుతో నిగనిగలాడే దర్వాజాలు మరియు తలుపులు కిటికీలు వాటి రెక్కలు వరండా గోడలు కింద నల్లటి గచ్చు. ఆరంగుళాల యెత్తుతో పసుపు రంగు గడప యెర్రటి పూలు ఆకుపచ్చ తీగలతో గడపబొట్టుతో (మండిగం) యెంతో అందంగా వుండేది.
ఇక ఆ వరండాలో .. పచ్చటి మేనిఛాయతో చక్కని నూరవనెంబరు కాటన్ చీరతో 100% రూబీ కాటన్ తప్ప మరే బట్టతో జాకెట్ కుట్టించని తొడగని మా అమ్మ వొత్తయిన జుట్టు నడుముదాటని జడతో బచ్చలిపండు రంగు కన్నా కొంచెం తక్కువ రంగున్న కుంకుమ బొట్టుతో.. మెట్ల మీద నో మండిగం ముందో కూర్చుని రామాయణమో వీక్లీ పుస్తకమో చదువుకుంటూనో లేదా గడ్డం కింద చేయి వుంచుకుని దీర్ఘంగానో ఆలోచిస్తూ కూర్చున్న ముఖచిత్రం నా కళ్ళ ముందు మెదులుతుంటుంది.
కాస్త మా యింటి గురించి చెప్పడం ఆపి.. మళ్ళీ మా ఊరు ముఖ చిత్రం గురించి చెప్పుకుందాం. పడమటి చెరువు వైపు నుండి మా ఊరిలోకి ప్రవేశించాం అని చెప్పుకుందాం కదా. అది ప్రధానమైన మార్గం కాదు. మా తాతల కాలం వాళ్లు నడిచిన దారి అది. చెరువు కట్ట కింద గంగానమ్మ గుడి పక్కనుండి చెరువు కట్ట యెక్కి రెండు పర్లాంగుల దూరంలో వున్న మంచి నీళ్ళ బావి దగ్గరకు చేరుకుందాం. కొన్ని తరాలముందు ఆ బావి రచయిత ప్రేమ్ చంద్ “ఠాగూర్ కా కువా” అయి వుండవచ్చేమో కానీ నాకు తెలిసేటప్పటికి ఆ బావి మా ఊరందరి ఉమ్మడిసొత్తు. పైన చెరువులో యెర్రటి నీళ్ళు కట్టకింద బావిలో నల్లటి నీరు. ఆ బావిని దాటి తిన్నగా ముందుకు వస్తే బడి లైబ్రరీ బ్యాంక్ చిల్లర కొట్టు పాలకేంద్రం బస్ స్టాప్ వుంటాయి. ఊరి రచ్చబండ కూడా అక్కడే! మనం మళ్ళీ బావి యెడమ పక్కకే వెళదాము.
కట్ట మీదగా వొక పర్లాంగు దూరం వరకూ ముందుకు వెళుతుంటే కట్ట దిగువున కొంత ఖాళీ స్థలాలు వాటిని ఆనుకుని కొన్ని యిళ్ళు.. రెండు పర్లంగుల దూరం వరకూ వుండేవి. కట్ట మీద వొక పర్లాంగు దూరం నడిచాక చెరువుకట్ట ను ఆశ్రయించుకుని కొంతమంది ఉప్పరుల యిండ్లు వారి పశువులు పందుల దొడ్లు వుండేవి. వారి ఇళ్ళు దాటేసరికి పడమటి చెరువు ఆగిపోయేది. చెరువు లో నీరు నిండిన తర్వాత వొక కాలువ ద్వారా తూర్పు చెరువుకు మళ్ళే విధంగా రెండు చెరువులకు వొక కాలువ అనుసంధానంగా వుండేది. ఆ కాలువ మీదనే వొక బ్రడ్జి వూరు ను అటు ఇటు కలుపుతూ సాగే అసలైన వాహన రహదారి వుండేది. పడమటి చెరువుకు దిగువగా వొక చిన్న వీథి తర్వాత వొక పెద్ద వీథి రెండు చెరువులను కలిపే కాలువ కుడిపక్కన కొన్ని వీథులు దాటి దక్షిణం వైపుగాను తూర్పు వైపుగాను ఊరు విస్తరించి వుండేది. ఊర్లో సగభాగం ఇది. ఇక్కడ పేద గొప్ప బీద ధనిక కుటుంబాలు కలగాపులగంగా వుండేవి.కమ్మ కాపు వైశ్య మహ్మదీయులు వెలమ రజక ముదిరాజ్ బ్రహ్మణ కుమ్మరి కంసాలి కుటుంబాలు వుండేవి. ఈ భాగానికి లైబ్రరీ మధ్య భాగంగా రచ్చబండగా వుండేది.కచేరి సావిడి కూడా ఉండేది
ఊరికి ఈశాన్యంలో తూర్పు చెరువును ఆనుకుని వొలికిలి (స్మశానం) తూర్పున చెరువు పడమరన చెరువు తూర్పు దక్షిణాన నైఋతి మూలన మాగాణి భూములు తూర్పున పంట పొలాలకు ఆనుకుని భద్రాచలంలో కొలువైన తీరులోనే మా కుటుంబ ఇలవేల్పు సీతారామచంద్రస్వామి కొలువైన గుడి పాడుబడి వుండేది. ఎందుకు అలా వుందో తెలిసేది కాదు. స్వామి గుడి పక్కనే పెద్ద స్థలంలో ఊడలు దిగిన మర్రి చెట్టు భయం గొల్పుతూ వుండేది. అది దాటి ముందు వెళితే ఒక పెద్ద నీటి గుంత యండేది.
ఇక ఇంకో సగం ఊరు పడమటి చెరువును ఆనుకుని వాయువ్యానికి ఉత్తరానికి విస్తరిస్తూ.. హరిజనుల ఇళ్ళు వుండేవి..ఈ రెండు వాడలకు మధ్య గౌడ గొల్ల కులాల వారు దొమ్మరి కులాల వారిళ్ళు వుండేవి. ఇదంతా కొత్త ఊరు అనే వారు. పాత ఊరు అనేది కాలువకు అవతల వున్న ఊరు. ఈ కొత్త వూరు మధ్య నుండే మా వూరి ప్రధాన రహదారి మైలవరం వైపు వెళుతుంది. విజయవాడ భధ్రాచలం రోడ్డు మార్గంలో కుంటముక్కల అడ్డరోడు దగ్గర నుండి( మైలవరం ఇంకా నాలుగు కిలోమీటర్లు ముందుకే వుంటుంది) నుండి మా వూరు మరొక కొస కు చేరుకోవాంటే రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాలి. ప్రస్తుతానికి అడ్డరోడ్డుకు కిలోమీటరు దూరం మాత్రమే వుండే వరకూ ఊరు ఉత్తరం వైపు విస్తరించి వుంది. ఊరికి ఆగ్నేయ మూలన వుండేది మా ఇల్లు. మా ఊరిలో వొక్క రెడ్డి కులం తప్ప అన్ని కులాల వారు వుండేవారని అనేవారు. ఒకప్పుడు ఊరు బొడ్డు రాయి మా ఇంటి వెనుక ఉండేది అంట. అలాగే మా రెండో పెదనాన్నకు వచ్చిన వాముల దొడ్డి భాగంలో దేవతా విగ్రహాలు ఉండేవి. అందులో వినాయకుడి విగ్రం తీసుకువచ్చి లైబ్రరీ దగ్గర గుడి కట్టి అందులో ఉంచారు మా చిన్నన తనంలో. ఇంకా రెండు నిలువెత్తు విగ్రహాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ విగ్రహాలు నల్లటి శిల్పాలు అయితే కాదు. కాస్త తెల్లగా ఉండేవి. చిన్నప్పుడు మేము సమీపంగా వెళ్ళడానికి భయపడే వాళ్ళం.
(మిగతాది మరికొన్ని భాగాలు గా.. )
మా ఊరు మంచి నీరు బావి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి