మా ఊరు -మా ఇల్లు
మొదటి భాగం నిన్నటి తేదిన ప్రచురించాను. ఇది రెండవ భాగం .
మా ఇంటి వాతావరణం పరిసరాలు గురించి మరికొంత. పడమటి వైపు వంటిల్లు ను ఆనుకుని దక్షిణం వైపు పొంత పొయ్యి మరొకపొయ్యి వుండేది. నీళ్ళు కాయడానికి ఇంకా యెక్కువ సేపు వుడికే మొక్కజొన్నల నూకల మడ్డికూడు వండటానికి పుల్లలు యెక్కువ పడతాయని కందికంప ఉపయోగించేవారు. పొగ యెక్కువ కాబట్టి వంటింట్లో వంట చేయకుండా ఆరుబయట అక్కడ ఆ పనులు చేసేవారు. నాకు ఊహ తెలిసేటప్పటికి మా నాయనమ్మ అక్కడ నీళ్ళు కాయడం మట్టి చట్టిలో పప్పు కూర వండటం లాంటివి చేసేది. మా నానమ్మకు మా అమ్మ మూడో కోడలు. పై ఇద్దరు కొడుకులు కోడళ్ళు వారి పిల్లలు వేర్వేరు ఊళ్ళలో వుండేవారు. మా నాయనమ్మ తాతయ్య ఉత్తరం వైపు గది వంటింట్లో వుండేవారు. మా నాయనమ్మ వంట వేరే. వారి ఆస్థిపాస్తులన్నీ కొడుకులకు పూర్తిగా పంచేసి జీవన చరమాంకంలో చాలా అవస్థలు పడ్డారు. మా నాయనమ్మ తాతయ్య అంటే నడిచే ధర్మం మంచితనం అమాయకత్వం పరోపకారం.. మనుషులంటే అంతులేని ఆపేక్ష. వారిని తలుచుకుంటేనే నాకు గర్వం కల్గడంతోపాటు కళ్ళనిండా కన్నీళ్ళు కూడా వచ్చేస్తాయి. నడిచే దైవాలు లాగే వుండేవారు. మా తాతయ్య అంతే డౌన్ టు యెర్త్ మనిషి.
మా నానమ్మ ది అదో అమాయకత్వం మంచితనం. కోపం వుండేది కాదు. ఉంగరాల జుట్టు చక్రాల లాంటి కళ్ళు ఇందిరాగాంధీ ముక్కులాంటి ముక్కు పల్చటి పెదాలు చామానఛాయతో పొట్టి పొడుగు కానీ యెత్తుతో చక్కని కుదిరకలు వున్న మనిషి. మా తాతయ్య మంచి రంగు కొద్దిగా లావుగా వుండే ముక్కు పెద్ద చెవులు విశాల నేత్రాలు అయిదున్నర అడుగుల యెత్తుతో కాస్త పొట్టిగా అనిపించేవాడు. చాలా కష్టజీవి. కొడుకులను ఏరా అని అరేయ్ వొరేయ్ అని కానీ సంబోధించని సంస్కారవంతమైనమాట. అయ్యా అమ్మా అనే ప్రేమ నిండిన పలుకులు తప్ప మరో విధమైన ఆక్షేపణీయమైన మాట ఆయన నోటివెంట విని యెరుగను నేను. అలాంటి వారి కడుపున వారి పాలిట దుష్టులైన బిడ్డలను కన్నారనే వొక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా పెద్ద మేనత్త మా నాన్న చిన్నతనంలో వుండగానే చనిపోయింది. ఆమె గురించి వినడమే తప్ప ఫోటో కూడా చూడలేదు నేను. ఆమె నాలా యెత్తరిగా ఆకర్షణీయంగా వుండేదని మా చిన్నతాత కూతుళ్ళు అంటూ వుంటారు.
మా నాయనమ్మ గురోపదేశం తీసుకుంది. వేలి కణుపులు లెక్కెట్టుకుంటూ జపం చేసేది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పటం పార్వతీ పరమేశ్వరుల పటం శ్రీరామ పట్టాభిషేకం పటం వుండేవి పూజ గదిలో. వ్యాస పీఠంపై భగవద్గీత చిన్న రాతి వినాయకుడి బొమ్మ పూజ అరుగు పై వుండేవి. తులసమ్మకు పూజ చేసేది. మా నాయనమ్మ అంటే నాకు చాలా యిష్టం. స్త్రీ లలో అమ్మ తర్వాత నాయనమ్మ మా అమ్మ పెద్ద చెల్లి పార్వతి పిన్ని లో నేను మాతృ ప్రేమను అనుభవించానని చెప్పవచ్చు. ఇంటి గురించి చెప్పబోయి మనుషుల గురించి చెబుతున్నాను కదూ.. మా ఇల్లు అంటే మా నాయనమ్మ తాతయ్య కూడా నాకు.
ఇక ఆరుబయట వంట చేసుకునే పొయ్యల తర్వాత దక్షిణం వైపుకు మళ్ళితే పడమటి వైపు గోడకు ఆనుకుని పెద్ద రోలు అందులో పొత్రం వేసి వుండేది. ఆ రోలు మూడడుగుల యెత్తులో వుండేది. ఏదైనా రుబ్బాలంటే వంగి రుబ్బేది నాయనమ్మ. లేదా రోలుపై కాలు చాపుకుని కూర్చొని రుబ్బేది. మాకు ఇంటి ఆవరణ అంటే ఇంటికి దక్షిణం వైపు వున్న స్థలమే! తూర్పున ఆరడుగుల పందిరి దానిముందు రెండు అడుగుల వెడల్పైన త్రోవ తప్ప స్థలం వుండేది కాదు. మా పెద్దతాత కొడుకుకు సంబంధించిన ఇంటి ప్రహరీ గోడ వుండేది. మా నిత్యకృత్యాలకు పశువులు కట్టేసుకోవడానికి గడ్డి వాము వేసుకోవడం చావిడి అంతా దక్షిణం వైపు స్థలమే!
ఆ రోలు యెదురుగా చిన్న దిరిసెన పూలు చెట్టు లాంటిది వుండేది. ఉసిరి ఆకులు లాంటి చిన్న ఆకులు బంతి ఆకారంలో మొగ్గలు విచ్చిన తర్వాత విసినకర్ర ఆకారంలో పూలు ముదురు గోధుమ రంగులోకి మారి చెట్టు కింద వొత్తుగా రాలిపడేవి. అదొక చేదైన వాసన. అలాంటి చెట్టును మళ్ళీ యింత వరకూ చూడలేదు. అదో అడవి జాతి చెట్టు. దానికి గేదె దూడలను కట్టేసే వారు. ఆ పక్కనే త్రిభుజాకారంలో కట్టిన మామిడి పుల్లల మేటు. రెండు నిట్టాళ్ళ గొడ్ల చావిడి. అందులో గడిమంచి. చావిడి వెనుక భాగం లో కంది కంప మేటు దానికి అల్లుకున్న పొట్ల పాదు, బెండ మొక్కలు, వెదురు లేక వాయిలు చువ్వలతో దడి కట్టిన స్నానాల గది.. దానికి పాకిన కాకర తీగ.. స్నానాల దడి గదికి ఇవతల పెద్ద గుండ్రటి తొట్టి.ఆ తొట్టికి ఆనుకొని పెద్ద యెర్రమందార చెట్టు.
చావిట్లో రెండు పాడి గేదెలు. దక్షిణపు వైపు ఇంకా దిగువకు గడ్డివాము వాము వెనుక మునగ చెట్టు సొర తీగ గుమ్మడికాయ తీగ వుండేవి. గడ్డి వాము ముందు చింత చెట్టు ఎరువు దిబ్బ. ఆ తిన్నగా మూడిళ్ళకు ఉమ్మడిగా పెద్ద బావి వుండేది. ఆ బావి నుండే మేము నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. ఆ బావి నుండే కాడికట్టిన ఎద్దుల సాయంతో మోటలతో నీళ్ళు తోడి కాలవల ద్వారా మళ్ళించి పాటి మళ్లలో పొగాకు మిరప పండించే వాళ్లని తాతయ్య చెప్పేవారు. ఆ భూమి అంతా ఐదుగురు కొడుకులకు వారి తర్వాత పిల్లలకు ఇరవై ముప్పై సెంట్లు లెక్క పంచుకుని వాముల దొడ్లు చేసుకున్నారు. మా నాన్న వాటా కూడా వొక పదిసెంట్ల భూమి వుండేది. అందులో గడ్డివాము వేసివుండేది. కూరగాయలు వేసుకునే వాళ్ళం. మునగచెట్టు చింతచెట్టు వుండేది. గచ్చకాయల చెట్లు గురివింద గింజల చెట్టు కూడా వుండేది.సరిహద్దు కర్రలో తాటిచెట్లు సీమ తుమ్మ చెట్లు వుండేవి.
మా నాన్న పెళ్లికి ముందే కొడుకులు ముగ్గురికి సమానంగా ఆస్థిని పంచి యిచ్చేసాడు తాతయ్య. వాళ్ళకు కొడుకులు మనోవర్తి యిచ్చేవారు. వారి ప్రాభవం అప్పటికే కోల్ఫోయారు. నాకు ఊహ తెలిసేటప్పటికి మా తాతయ్యకు కళ్ళజోడు రాలేదు.చేతికర్ర రాలేదు.1915 తర్వాత పుట్టినవారు ఆయి వుండవచ్చని నా అంచనా. మా తాతయ్య ఐదురుగురు కొడుకులలో రెండవ వాడు. మా పెద పెద్దనాన్న శోభన్ బాబు ఒకే వయసు వారంట. జతగా పదవ తరగతి వరకూ మైలవరం వెళ్లి చదువుకున్నారట. మా పెదనాన్న ఇంకో కజిన్ తో కలిసి బెజవాడ బిసెంట్ రోడ్డులో రవి ప్యాన్సీ స్టోర్ పెట్టారంట. అందులో నష్టపోయి భూములు అమ్ముకున్నారట. ఇప్పటికీ రవి ప్యాన్సీ స్టోర్ అక్కడే అదే పేరుతో నడుస్తూనే వుంది.
మా ఇంటి వయస్సు యెక్కువేమీ కాదు. 1940 ల తర్వాత కట్టిన యిల్లే. ఆ తర్వాత మా ఇల్లు పూర్వ ఆకారం కోల్ఫోయింది. దానికి వొక కారణం వుంది. మా తాతయ్య వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు. వారందరూ పుట్టిపెరిన యింట్లోనే వుంటూ రెండవ మూడవ అన్నదమ్ములకు కలిపి పెంకుటిల్లు నాలుగు ఐదు సోదరులకు డాబా యిల్లు కట్టారు. మా పెద తాత పూర్వీకులు నివసించిన యింటిలో వుంటూ కొడుకులిద్దరికీ వేరు వేరు యిళ్లు కట్టించారు. అన్నదమ్ముల కాపురాలు వేరైనా యిళ్లు కలిసి వుండాలనో వొకే వెన్ను కింద వుండాలన్న భావనో లేదా ఖర్చు కలసి వస్తుందనో. మా ఊరిలో అన్నదమ్ముల ఇళ్లు చాలా వరకు అలాగే కట్టి వుండేవి. నిజంగా వాస్తు దోషాలు అదృష్ట దురదృష్టాలు వున్నాయో లేవో గానీ.. దక్షిణం వైపు భాగంలో వారు ఆర్థిక నష్టాలు అనేక కష్టాలు అనుభవించేవారు. ఉత్తరం వైపు వారు పురోగవృద్ధిలో వుంటారనే దానికి ఆధారాలు వుండేవట. అందుకు రుజువులు మా తాతయ్య కాలం నుండి చూపేవారు.
మా తాతయ్య తన తండ్రి ఆయనకు పంచి యిచ్చిన పాతిక యెకరాల భూమి నే ముగ్గురు కొడుకులకు పంచి యిచ్చారు. ఆయన తతిమా అన్నదమ్ముల లా పొలాలు సంపాదించలేదు.. అమ్మనూ లేదు. ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు వచ్చీపోయే బంధుగణం అడిగిన వారికి లేదనకుండా సాయాలు చేయడం ఐదుగురు పిల్లలు ఖర్చులు మా నాయనమ్మ ధారళంగా ఖర్చు పెట్టడం ఇలాంటి కారణాలు వుండేవట. మా తాతయ్యకు ఐదవ తాతయ్యకు సంతానం యెక్కువ. అలాగే మా పెదనాన్నలు పెరిగిన తర్వాత తాతయ్య వారి మాటలను గౌరవించారు. వారి పర్యవేక్షణలో వ్యాపారాలు నష్టాలు.. వారిరువురు పెళ్ళి అయిన తర్వాత ఆస్తులు పంచుకుని ఊరు వదలి వెళ్ళిపోయారు. నాన్న కు పెళ్ళి ఖర్చుల కింద ఇంటిలో వాటా నాన్నకు వదిలేసి వెళ్ళారంట. దక్షిణం ఖాళీ యెక్కువగా వుండి ఇంటి కన్నా లోతు గా వుంటే ఆర్థిక నష్టాలు వుంటాయంటారు. మా తాతయ్య వేరు కాపురం పడినప్పటి నుండి మా ఇల్లు పరిసరాలు అలాగే వుండేవి. మా తాతయ్య నాయనమ్మ చేతికింద ఆర్థికంగా అంత బాగుండింది లేదు. మా పెదనాన్నలు ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోయారు కలిసి రాలేదని.
మా నాన్నకు వ్యవసాయం చేతకాదు. పెళ్ళైన తర్వాత కూడా మా తాతయ్య వ్యవసాయం చేయించి పెట్టేవారంట. మాగాణి పొలం మూడు యెకరాలు వుండేది. వర్షాలు కురిసి చెరువుకు నీళ్ళు వస్తేనే మాగాణి పండేది. మిగతాది గరువునేల, మామిడితోట. వాటి మీద కూడా పెద్దగా ఆదాయం వచ్చేది కాదు. అమ్మ పొలం నాన్న పొలం కలిపి పదిహేను యెకరాలు వుండేది. మాకు పంటలు పండకపోతే.. ధాన్యం కూడా అమ్మమ్మ వాళ్ళు పంపేవారు. అమ్మ కు యిచ్చిన ఆవులకు పుట్టిన కోడె దూడలను అమ్మి పైకం పంపేవారు. అప్పట్లో మాగాణి లో వరి వేయకపోతే పైరుశెనగ వేసేవారు. నడిమింట్లో తెల్లటి వేరుశెనగ కాయలు దూలాలు పైకి ఆనేటట్టు పోయడం.. గడిమంచె వేసి మినుముల బస్తాలు మనిషి యెత్తులో మేటు వేయడం నాకు బాగా గుర్తు. వ్యవసాయం అంత బాగోకపోయినా పాడి మీద కొంత మామిడితోటల్లో కంది వేయడం ద్వారా మామిడి కాపు అమ్మడం ద్వారా డబ్బు వచ్చి మాకు ఆర్ధికంగా అంత లోటుండేది కాదు.
నాకు పదిహేనేళ్ళు వచ్చేదాక బాగానే జరిగిపోయింది. తర్వాత ఆర్ధిక స్థితి తారుమారైంది. భూమి తరగిపోయింది. అప్పటినుండే యింటి వాస్తు బాగుండలేదనే శంక మొదలైంది.మా అమ్మకు ఆ అనుమానం బలపడి వుంది. మా నాన్న వ్యతిరేకించలేదు. దక్షిణపు వైపు స్థలం విడగొట్టి ప్రహరీ గోడలు కట్టారు. దర్వాజాలు మార్చారు. మా ఇల్లు రూపు రేఖలు మారిపోయింది. ఇలా వుండేది.
మా తాతయ్య కష్టించే స్వభావం గురించి మెత్తదనం గురించి కుటుంబ వైభవం గురించి చాలా చెప్పాలి..
(మిగతా భాగం.. తర్వాత)
ఈ చిత్రంలో .. ఫోటో కుడివైపు నుండి చూస్తే మొదటి రెండు జంటలలో .. రెండవ జంట మా తాతయ్య నాయనమ్మ . తాతయ్యలుఅందరూ కూర్చుని ఉన్నారు . వారి వెనుక నిలబడింది నాయనమ్మలు . మధ్యలో కూర్చున్న జంట ..మా నాలుగో తాతయ్య ఏకైక సంతానం మా సాంబశివరావు పెదనాన్న పెద్దమ్మ . వారి జ్ఞాపకంగా ఈ చిత్రం ఒకటే ఉంది మా వద్ద.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి