4, ఏప్రిల్ 2016, సోమవారం

లఘుచిత్రం

లఘుచిత్రం



సీట్ బెల్ట్ పెట్టుకోబోతూండగా ...   కాల్ వచ్చిన  శబ్దం. ఎవరో అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాను. అభి నుండి కాల్. ఎంతో  అవసరమైతే తప్ప కాల్ చేయడని తెలిసిన నేను .. ఆన్సర్ చేసాను.

"రాజా బాబూ ! షార్ట్ ఫిల్మ్  షూటింగ్,ఎడిటింగ్ అన్నీ పూర్తై పోయాయి. యు ట్యూబ్ లో అప్లోడ్ చేసాను. మీరు చూసి ఎలా వుందో చెప్పాలి " అన్నాడు.

ఆఫీస్ కి వెళుతున్నాను అభీ.   చూసి సాయంత్రానికల్లా  చెపుతాను. అయినా నువ్వు చాలా బాగా తీసి వుంటావ్ ! " అన్నాను.

"ఎందుకో..  కొంచెం జంకుగా వుందండీ ..ఎలా రిసీవ్ చేసుకుంటారోనని. నేనాశించిన ప్రయోజనం కొంచెమైనా దక్కితే చాలు. పడిన కష్టమంతా మర్చిపోతాను "

"నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావ్ ! దైర్యంగా వుండు"

కాల్ కట్ అయినాక "అభి " షార్ట్ ఫిల్మ్ గురించి ఆలోచిస్తూ .... అతనికిప్పటికి  రియల్ స్టోరీల కోసం వెతుక్కునే అవసరం తీరినట్లుంది. ఇంతకీ అతని తీసిన చిత్రంలో దేవసేన కథ వుంటుందా ? ఉండే వుంటుంది,  అందులో నాకెలాంటి సందేహం లేదు. ఆమె పాత్ర లేకుండా అభి చిత్రం తీయడమే !? నెవ్వర్ ! అభి చెప్పిన ఆమె కథ విన్న నేనే ఆమెని మర్చిపోలేకపోతే అభి యెట్లా మర్చిపోతాడు ? ఆమె యిప్పుడెలా ఉందో ... . వాళ్ళ  గుడిసెలు వున్నాయో  లేదో .. ? కాలువ కట్టల సుందరీకరణలో  భాగంగా వాళ్లకి ఆ గూడు కూడా లేకుండా చేస్తారేమో ! పైగా యిప్పుడు రాజధాని ప్రాంతం కూడా ! అనుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూనే  వొక యేడాది క్రిందటి జ్ఞాపకంలోకి వెళ్ళిపోయాను.

నేను  చదువు పూర్తి  చేసుకుని యింటికొచ్చిన రోజులవి. ఉద్యోగాల వేటలో  సఫలమవలేక విసుగొస్తున్న రోజులు కూడా.  ఉబుసుపోక నాన్నతో పాటు పొలానికి వెళ్ళేవాడిని. మా పొలం ప్రక్కనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వబడిన కాలువ. సంవత్సరంలో సగం రోజులపాటు నిండుగా   ప్రవహిస్తూనే వుండేది. అందువల్లేనేమో రైతు పేదేమో కాని పొలానికి పేదేమి వుంటుందీ  అన్నట్టుగా  మా చుట్టూ పక్కల పొలాలన్నీ పచ్చని పంటలతో కళకళలాడుతూ వుండేవి. ఆ కాలువ ప్రక్కనే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉండేది  "అభి" వాళ్ళ యిల్లు. వాళ్ళ నాన్న గమలాళ్ళ కోటేశు. చెట్లెక్కి కల్లు గీయడం,అమ్మడం చేస్తుండేవాడు. అతనిదీ నాన్న వయసే,ఒకే వూరివారవడం వల్ల నాన్న, కోటేశు యెక్కువగానే మాట్లాడుకుంటూ వుండేవాళ్ళు.

 చిన్నప్పుటి నుండి యెరిగి వున్నప్పటికీ కూడా   అభిని  చూసినప్పుడు  పలకరించడానికి కొన్ని సెకనుల పాటయినా జంకుతాను కానీ ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే శతృత్వమేమీ లేదు. రూపం చూస్తే రఫ్ గా వున్నట్టు కనబడతాడు. విశాలమైన కళ్ళు.   ఆ కళ్ళల్లో  ఎర్రటి జీరలు, కోటేరు  ముక్కు, నిర్లక్ష్యంగా పెంచి వదిలేసిన జుట్టు. ఎప్పుడూ చుట్టూ పరిశీలిస్తున్నట్లు గిర గిర తిరుగుతుండే కళ్ళు . నాకున్న కొద్ది పాటి పరిచయంలో అతనిపై మంచి అభిప్రాయం కలగడానికి  కారణం అతనొక మంచి ఆర్టిస్ట్ అవడమే ! రోడ్డు ప్రక్కనే వున్న చిన్న రేకుల షెడ్ లో వొక భాగంలో అతని స్టూడియో. కళాకారుడిగా యెన్నో సూక్ష్మ చిత్రాలను రూపొందించడంతో పాటు  కొన్ని సామాజిక రుగ్మతలకి బాణం గురిపెట్టి సందేశాన్నిచ్చే చిత్రాలు గీస్తూ వుంటాడు.  అన్ని పత్రికలూ,అన్ని చానల్స్ అతనిని పరిచయం చేసేసాయి.

అభిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. పదవతరగతి దాటని చదువు. అయినా యెదురుగా వుండే ఇంజినీరింగ్ కాలేజీలో చదివే ప్రతి విద్యార్ధి అతనికి స్నేహితులే!  వయో పరిమితి లేకుండా  చిన్నవాళ్ళూ  పెద్దవాళ్ళూ అందరూ అతని స్నేహవర్షంలో తడిసిన వాళ్ళే!  "అభి" అంటే తెలియని వారు వుండరేమో ! అతను మాత్రం  కుటుంబం పట్ల కొంత నిర్లక్ష్యంగా వుంటాడని అర్ధమవుతూ వుండేది.   తండ్రి తెచ్చే ఆదాయంతోపాటు  తనూ పని చేస్తూ  గుట్టుగా కాపురం నెట్టుకొస్తూ వుంటుంది తల్లి. పేదరికంలో మగ్గుతూ  కూడా గౌరవంగా బ్రతికే కుటుంబం. అభికి పెళ్ళైంది కానీ భార్యెప్పుడూ పుట్టింట్లోనే వుంటుంది. కాస్త సన్నగా   సాధారణంగా వుంటుందామ్మాయి  . అతని పెళ్లి అతనిష్టంతో జరగకపోవడం వల్ల భార్య పట్ల అంత ప్రేమగా వుండడని అతనింటి  దరిదాపుల్లో ఉండే ఓ కుర్రాడు చెపితే విన్నాను.

ఒకరోజు నేనూ, నాన్న పొలంలో ఉండగానే అభీ వాళ్ళ నాన్న రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలిసింది.అతని కోసం బంధువులందరూ యెక్కడెక్కడో వెతుకుతున్నారని విని ...  ఆ రోజు ఉదయాన్నేఅతను కాలువ  కట్టమీదున్న యిళ్ళ  వైపు వెళుతుండగా చూసిన సంగతి చెప్పాను.  అతనిని వెతుక్కొచ్చి జరపవలసిన  కార్యక్రమాలు చేస్తూనే కోటేశు లాంటి మంచి వాడికి యిలాంటి పోరంబోకు కొడుకు యెట్టా పుట్టాడో నని  బంధువులు అనుకోవడమూ విన్నాను.   రెండు రోజుల తర్వాత తండ్రి పోయిన దుఃఖంలో వున్న అతనిని పలకరించి ఓదార్పు మాటలు చెప్పి రావాలని నాన్నతో పాటు   అతనింటికి వెళ్లాను.  

 అభి అమ్మ తన  భర్త గురించి చెపుతూ   ఆయనకీ  మగ పిల్లోడిపై నమ్మకం యెక్కువ . “ఏదో ఒకటి చేస్తున్నాడుగా  చేయనీ,  గీతలు గీస్తే యే౦టీ , రాతలు రాస్తే యే౦టీ ? మంచి పేరు తెచ్చి ఫలానా వాడి కొడుకంటూ నాకొక గర్వం సంపాయించి పెడుతున్నాడుగా” అనేవాడు. ఇప్పుడు ఆయనపోయి నడివీధిలో నిలబడ్డాం. ఏం చెయ్యాలయ్యా ? అంటూ ఏడుస్తుంది.

 తల్లి మాటలతో కన్నీరు మున్నీరుగా యేడుస్తున్నాడతను.  రాజా బాబూ !   నేనేపని చేసినా గర్వంగా   ఱొమ్మిరిచుకుని పదే పదే భుజం తట్టే నాన్నలేడు. ఒరేయ్ అభీ ! ఈ కల్లు గీత, రోతా  నీకెందుకుగాననీ  హాయిగా నీ పని నువ్వు చేసుకోరా , ఇంట్లో మంచి చెడు నేను చూస్తానుగా  అని భరోసా యిచ్చే వాడు. అలా  నడిరోడ్డుపై నెత్తుటి ముద్దై మిగిలిన సాక్ష్యం నా మెదదులో చిత్రమై నిలిచి పోయింది. కుంచె పట్టుకుంటే  ఆ దృశ్యమే మెదులుతుంది. దశదిన కర్మ నాటికి ఎంతో మందికి చిత్రం గీసిచ్చిన నేను  మా నాన్న బొమ్మని గీయలేకపోతున్నాను అంటూ ధారాపాతంగా  యేడుపు. ఇంటికొచ్చాక కూడా ఆ యేడుపు తరుముతూనే వుంది, గుండె బరువెక్కింది.

నాన్నంటే అంతేనేమో ! ఉన్నన్నాళ్ళు బరువంతా నెత్తికెత్తుకుంటారు. ఏదో ఒకరోజు చెప్పా పెట్టకుండా పోయీ  మోయలేని బరువులని మీదేసి పోతారేమో ! మా నాన్నకి  కూడా అలా ఏదన్నాజరిగితే ?. ఊహే భయంకరంగా అనిపించింది. ఉద్యోగం సంగతి ప్రక్కనపెట్టి  కుటుంబ అప్పులూ, ఆదాయాలూ, బాధ్యతలూ తెలుసుకుంటూ  కాలక్షేపంగా కాకుండా సీరియస్ గా మా నాన్నకి చేదోడు వాదోడుగా వుండాలని నిర్ణయించుకున్నాన్నేను.  

చేలోకి వెళ్ళేటప్పుడల్లా అభి వాళ్ళింటి  వైపుగానే వెళుతూండటం వల్ల  కాసేపు ఆగి అతనితో మాట్లాడటం అలవాటైపోయింది. మా మధ్య స్నేహం కూడా పెరిగింది.  ఒక రోజు వాళ్ళమ్మ కష్టం సుఖం చెప్పుకుంటూ  "ఇంటి భాద్యత మర్చి పోయి పనిపాట యేమీ లేకుండా  తిరుగుతున్నాడు ! ఇప్పుడీ సంసారం గతేం కాను, ఆ తిరుగుళ్ళూ ,ఆ బొమ్మలు గీయడాలు మానేసి ఇల్లు గడిచే మార్గం ఆలోచించరా అని చెపుతున్నా వినడంలేదు. కాస్త నువ్వైనా చెప్పు బాబు" అంది .

"ఏదన్నా ఉద్యోగం చేయకూడదూ!  నీ టాలెంట్ కి ఏ అడ్వర్టైజింగ్ కంపెనీ వాళ్లైనా పనిస్తారు కదా " అన్నాను.

 "నాన్న అర్ధం చేసుకున్నట్టు అమ్మ అర్ధం చేసుకోవడం లేదు రాజా బాబూ ! అస్తమాను సాని కొంపలెమ్మట తిరుగుతున్నావ్ అంటుంది"  అన్నాడు  కొంత  నిష్టూరంగా.

"ఆమె అన్నమాటల్లో తప్పేముంది ? మీ నాన్న చనిపోయినరోజున కూడా నువ్వు అటువైపు వెళుతుంటేనే చూసాన్నేను.  నువ్వు అన్నం తినడానికి కూడా రాలేదని నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి రోడ్డుపైకి వస్తేనే మీ నాన్నకి అలా యాక్సిడెంట్ జరిగిందని మీ అమ్మ బాధ కూడా "

"అందరికి  నేను అటువైపు వెళ్ళడమే తెలుసు, కానీ నేను యేమి  చేస్తున్నానో యెవరికీ తెలియదు.తెలిస్తే అంత తేలికగా అంచనావేయరు "

"తాటి చెట్టు క్రింద నిలబడి ఆవుపాలు త్రాగుతున్నా అంటే యెవరూ నమ్మరు అభీ ! అటువైపు వెళ్ళడం మానుకో !"  హితవు  పలికాననుకున్నానప్పుడు. మౌనం వహించాడు.

తల్లి పోరుతో  తండ్రి పోయిన దుఃఖంలో నుండి బయటపడి చిన్న ఉద్యోగం సంపాదించాడు. కాస్త దారిలో పడ్డాడనుకున్నాక  తల్లి మళ్ళీ సాపించడం మొదలుపెట్టింది.

ఒకరోజు అక్కడ  నేనుండగానే "నీకు పెళ్ళయ్యింది, పెళ్ళాం యేళ్ళ తరబడి పుట్టింట్లోనే  పడి వుందని గుర్తుకు రాకపోతే యెట్టాగురా ! అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఆ పిల్లంటే యిష్టం లేదని. ఆ సంగతేంటో తేల్చి చెప్పేస్తే  దానికి మారు మనువు చేసుకుంటారు ". అభికి  తల్లి  మాటలుచురుక్కుమనిపించాయి.

"మంచి రోజు చూసి నువ్వే  కోడలిని యింటికి తీసుకురావచ్చుగా " అంటూ విసుక్కున్నాడు. .

"నేనెళ్ళి  పిల్లని పంపమంటే పంపుతారు కానీ నువ్వెళ్ళి అత్తగారింట్లో రెండు రోజులుండి ఆ పిల్లని తీసుకోచ్చుకుంటే బాగుంటుంది రా ! వాళ్ళకున్న అనుమానాలు తీరి పోతాయి." అంది ఆమె.

ఇద్దరం కలిసి  చేలో నడుస్తూ  మాట్లాడుకుంటున్నాం. "అమ్మలు ఎంత మంచి వాళ్ళు ! నాన్నవున్నప్పుడు అమ్మ మాట పట్టించుకునేవాడినే కాదు. అమ్మలది  యెంత ముందు చూపో!. ఒకపనిచేస్తే నాలుగిందాల మెప్పు రావలనుకుంటారు. " అన్నాడు సంతోషంగా నవ్వుకుంటూ.

"మీ ఆవిడని తీసుకొచ్చాక  అటువైపు వెళ్ళడం మానేయ్"  అన్నా

" మానేయడం కాదు, వెళ్ళడానికి  యెలాగైనా ఆమెని వొప్పించుకోవాలి"

"నీకేమన్నా పిచ్చా! అసలు మతి వుండే మాట్లాడుతున్నావా ? ".

"మీరిలా అంటారని నాకు తెలుసు.  నేనెందుకు అటువైపు వెళతానో కథంతా చెప్పేయాలి మీకు "అంటూ ... పసుపు తోట మధ్యలో కూర్చోపెట్టాడు.

వినక తప్పదన్నట్లు కూర్చున్నాను.

"మంచి సబ్జెక్ట్ దొరికితే డాక్యుమెంటరీ చిత్రాలు తీయాలని  యెన్నాళ్ళగానో ఒక కోరిక. సబ్జెక్ట్ కోసం యెక్కడికైనా వెళ్ళిపోతాను.అప్పుడింట్లో కూడా చెప్పను. కొన్నాళ్ళు  వొక సినిమా డైరెక్టర్ కి  అసిస్టెంట్ గా వున్నాను.
ఒకసారి  అవుట్ సైడ్ బ్రాడ్కాస్టింగ్ కోసం భవానీపురంలోవున్న  రిహేబిటేషన్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ ముంబాయికి అక్రమ ట్రాఫికింగ్ చేయబడ్డ పిల్లలూ ,యువతులూ, వ్యభిచారం కేసుల్లలో పట్టుబడి వెనక్కి తిరిగొచ్చినవారు చాలామంది  వున్నారు. కొంతమంది యింటికి వెళ్ళడానికి యిష్టపడకపోతే అక్కడే  వుంచి యేదో వొక కోచింగ్ యిప్పించే దశలో  వసతి కల్పిస్తారట. మూడంతస్తుల భవనం అది. లోపల చాలా ఖాళీ స్థలం.  చుట్టూ  ఎత్తైన గోడలు.ఇనుప కంచె వేసి వున్నాయి.  గట్టి బందోబస్తు. అందులోకి  వెళ్ళినవాళ్ళు మంచి మనుషులుగా మారి బయటకి రావడానికి  యెన్నో అవకాశాలు. కౌన్సిలింగ్ తరగతులు, విద్యా కోర్సులు అన్ని సదుపాయాలూ  వుండేవి. కానీ అక్కడి నుండి తప్పించుకుని పారిపోదామని చూసేవాళ్ళూ , వాళ్ళ కోసం వచ్చే పాత యజమానులు, కొత్త విటులూ, ఎందఱో వుండేవారక్కడ.

పోగ్రాం   రికార్డింగ్ చేయడం మొదలెట్టాను.  వారు చెప్పుతున్న కథలు వింటుంటే  ముందు భయం, తర్వాత గగుర్పాటు. అందరి కళ్ళ నుండి  ధారా పాతంగా  కన్నీరు. మగవాడు యేడవకూదదన్నది కూడా మర్చిపోయాం.   తర్వాత గడ్డ కట్టిన మౌనం. జీవం లేని వాళ్ళ కళ్ళూ , చిన్న  చిరునవ్వు కూడా పూయని వాళ్ళ ముఖాలు,  నిర్లక్ష్యం ,కాఠిన్యం నిండిన మాటలూ, ఒకరి ముఖాలు వొకరు చూసుకుని వెకిలిగా నవ్వుకోవడాలూ.  రెండు గంటలు రికార్డింగ్  సమయంలో  రెండొందలమంది పతితుల దీనావస్థ  గుండెల్ని పిండేసింది. అన్నం కూడా తినాలనిపించలేదు. అసలెందుకు వాళ్ళు బ్రతికి వున్నారనిపించింది. రెండో రోజు వాళ్ళ కథలు వినడానికి దైర్యం చాల్లేదు. నేనక్కడికి వెళ్ళలేక యింకొకరిని పంపించాను.  దాదాపుగా అందరివి అవే కథలు.  అదే స్వార్ధం, అదే వ్యాపారం, అదే రోగాలు, దిక్కుమాలిన చావులు. నెల రోజులవరకు మనిషిని కాలేకపోయాను.శారీరక సంబంధమంటేనే అసహ్యమేసింది. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది . మన భద్రవలయంలో నుండి కాలు బయటకి పెట్టి  ఆ లోకంలోకి చూస్తే తెలుస్తుంది. లోకం యెంత  హీనమయ్యిందో ! వాళ్ళని అర్ధం చేసుకునే కాస్తంత హృదయం, చెమ్మగిల్లిన కన్నూ, అప్పుడప్పుడు వాళ్ళ ఆకలిని కనిపెట్టి అన్నం పొట్లం అందించే  చేయి.. ఓ చిన్న పలకరింపూ. మనం వీటికి పెద్దగా యే౦  ఖర్చు పెట్టవసరం లేదుగా రాజా బాబూ !.

"నువ్వొక్కడివే యెంతని చేయగలవ్ ! వాళ్ళ ఖర్మ అనుకుని వదిలేయాలి. అనవసరంగా నీ పై చెడ్డ ముద్ర పడుతుంది గా "

 "ఆ గుడిసెలలో వుండే వాళ్ళంతా మనవూరి వారు కానే కాదు. ఎక్కేడె క్కడనుండి వచ్చారో తెలియదు కానీ .. సాయంత్రానికి  రోడ్డుపైకి చేరిపోతారు.విటులు దొరికితే పండగే ! వయసుమళ్ళిన కొంతమంది పనిలేక  అడుక్కుంటారు. అలాంటి వాళ్ళకే కాస్త అన్నం పెడదామని ప్రయత్నం.  నేను వాళ్లకి గొప్పగా చేసే సాయమేమీ లేదు,  నా చేతిలోకి  కాసిని డబ్బులు రాగానే ... హోటల్ కి వెళ్ళి  ఆ డబ్బులకి సరి పడా రోటీ, కూర  ప్యాక్ చేయించుకుని సైకిలెక్కి  వాళ్లిళ్ళకి  వెళ్ళి యిచ్చేసి వస్తుంటాను. మనం చేసే మంచి పని లోకం దృష్టిలో చెడ్డగా కనబడితే దానికి మనమేం చేయలేం, లోకాన్ని చూసి జాలి పడటం తప్ప. వ్యక్తిగతంగా నేను చేసేదే కాకుండా  నా ఫ్రెండ్స్, పెద్ద పెద్ద వాళ్ళు అనాధశారణాలయానికి యిచ్చే విరాళాలని కూడా వాళ్లకిచ్చేస్తాను. అనాధ  పిల్లలంటే యెవరో ఒకరు జాలి చూపుతారు కానీ..  వాళ్లకి సాయం చేయడానికి యెవరూ రారు, అదే విషాదం "

"ఈ.. మనిషే దిగజార్చిన పతితలు.. ఎవరో తెలుసా.. వీరెవరో తెలుసా..మన రక్తం పంచుకున్న ఆడపడచులు.. మనం జారవిడుచుకున్న జాతి పరువులు.. మానవుడు దానవుడులో పాట  గుర్తుకొస్తుంది అభీ "

తెర  మీద కనబడే జీవితాలకన్నా విషాదకరమైన జీవితాలు వాళ్ళవి.   రోజుకొకరి దగ్గరకెళ్ళి  కూర్చుంటాను, వాళ్ళ కథలడిగి తెలుసుకుంటూ వుంటాను. కొందరు ధనవంతుల  కుటుంబాలలో పుట్టినవారూ, ప్రేమ పేరిట మోసపోయినవారూ  వుంటారు. వారి కథని చెపుతూ  పొగిలి పొగిలి యేడుస్తూ వుంటారు" విచారంగా చెప్పాడు.

"ఇంకా యెన్ని కథలు సేకరించాలి? షూటింగ్ యెప్పుడు మొదెలెడతావ్ ? " ఆసక్తిగా అడిగాను.

"మీరొక విషయం వింటే ఆశ్చర్యపోతారు. వాళ్ళు మానాభిమానాలు లేనివాళ్ళని, ఉచ్చనీచాలు మరిచిన వాళ్ళని తేలిగ్గా చూస్తాం కానీ...  వారిలోనూ ఆత్మాభిమానం వున్నవాళ్ళు చాలా మంది వున్నారు. అలా వున్నామె తన  కథ చెప్పింది.  మీకు వినే ఆసక్తి  వుంటే  ఆ కథ  చెపుతాను,  ఆ కథనే  లఘుచిత్రంగా తీయాలని నిర్ణయించుకున్నాను కూడా "

చెప్పు ..చెప్పు  అంటూ అర్జంట్ పని మానుకుని   ఆ కథ కూడా వినడానికి రెడీ అయిపోయాను .

ఒకసారి దేవసేన అనే ఆమె వద్దకి వెళ్లాను. వయసు ముప్పై ఆయిదు నలబై యేళ్ళ మధ్య ఉంటుందేమో, అందంగానే ఉంటుంది. మందు కూడా తాగుతుంది.  అసలే  వాగుడెక్కువ. మందేసుకుంటే యింకా యెక్కువ వాగుడు.  భరించలేం. సమాజపు వికృత రూపాన్ని వికృతమైన భాషలో తిట్టిపోస్తుంది.  ఆమె యింటికి వెళతానంటున్నావ్ జాగ్రత్త ! అదసలు ఆడదే కాదు అని హెచ్చరించాడు నా ఫ్రెండ్. ఏమైనాసరే వెళ్లి తీరాలనే అనుకున్నాను. వెళ్ళేటప్పుడు ... బిర్యానీ,ఐస్ క్రీమ్ తీసుకువెళ్ళాను. తృప్తిగా తినడం చూసాను. తర్వాత నా కోరికని తీర్చుకోమని ఆహ్వానం పలికింది. నేనేమి బదులు పలకలేదు. నన్ను రెచ్చగొడుతూ ఎన్నో ప్రయత్నాలు చేసింది . అయినా నేను చలించలేదని మగాడివి కాదా అని కూడా అవమానించింది. నేను సమాధానం చెప్పకుండా ఆమె యింటి నుండి బయటకి వచ్చేసాను.

తర్వాతెప్పుడో ఆమె తల్లి చనిపోయి మరీ కష్టాలలో వుందని తెలిసీ ఒక బస్తా బియ్యం వేసుకుని  వెళ్లాను.నేను తీసుకెళ్ళిన బియ్యపు బస్తాని గుమ్మం లో నుండే వెనక్కి కొట్టింది . కూటికి మాడి  చావాల్సి వస్తే  కృష్ణలో దూకైనా   చస్తాను కానీ పని జరక్కుండా డబ్బు, వస్తువులు వుచితంగా తీసుకోనని బయటకి నెట్టేసింది. ఆమె ఇంటిముందే బట్టలుతుక్కునే  రాయి మీద  మొండిగా కూర్చున్నాను. కటిక చీకటి, రక్తం తాగేస్తున్న దోమలు, కీచురాళ్ళ శబ్దాలు, వీధి కుక్కల అరుపులు. పన్నెండైనా అక్కడి నుండి కదలలేదు.జాలేసిందో యేమో ! "నాకేమవుతావని ఇట్టా కూర్చున్నావ్,  నీ జాలి నాకు నచ్చలేదు" అంటూ  దేవసేన వచ్చి  చేయిపట్టుకుని యింట్లోకి తీసుకెళ్ళింది. ఆకలవుతుంది అన్నం పెట్టమని అడిగాను. వొండలేదని చెప్పింది. వొండి పెట్టు అని  నేను తెచ్చిన బియ్యం చూపించాను. ఆ బియ్యం సంచీ  అంటుకోకుండానే పొయ్యి వెలిగించి  అన్నం వండి యేదో  పచ్చడేసి పెట్టింది. తనని తినమన్నాను. వద్దని తల అడ్డంగా వూపింది.

నేను తింటూ వుండగా తన కథ చెప్పింది. ఎరుకుల కులం. బుట్టలూ, తట్టలూ  అల్లుకుని బతికేవాళ్ళం. ఉప్పరతట్టలు కొనడానికి వచ్చిన ఆసామి  తోటకి  నమ్మకమైన కాపలా మనిషి కావాలని అడిగితే సంసారమంతాచంకన  పెట్టుకుని చక్కా వచ్చాడు మా నాయన.  మా నాయనని వెదురు కర్రలు నరుక్కురమ్మని అడవికి పంపించి మా అమ్మతో కులికేవాడు. మా నాయనకది  తెలిసేది  కాదు. ధర్మాత్ముడు లాంటి ఆసామి దొరికాడు కష్టం సుఖం చూస్తున్నాడు అని  కుశాల పడేవాడు. ఇప్పుడు తెల్ల బట్టలేసుకుని ఒంటినిండా బంగారం పెట్టుకుని రాజకీయ నాయకుడిగా  తిరుగుతున్నాడు చూడు  ఆయన తండ్రే  ఆ ఆసామి.  పదమూడేళ్ళ పిల్లప్పుడు ఆ ఆసామి కొడుకు, వాడి స్నేహితుడి కామ దాహానికి బలై పోయిన ఆడపిల్లని  నేను.  ఒకసారి అడవి కెళ్ళిన మా నాయన తిరిగి రాలేదు. విషప్పురుగు కుట్టి చచ్చిపోయాడు.  మా అమ్మ నయంకాని రోగమొచ్చి మంచమెక్కింది . నాకే  పని చేతకాదు. అంత చిన్న  వయసులో వున్న నాతో  పని చేయించుకునేవారు కానీ  యెవరూ సరిగా డబ్బులిచ్చే వాళ్ళు కాదు.   ఏ  పని చేసినా మా ఇద్దరికీ  రెండు పూటలా  కడుపు నిండేది కాదు. కడుపు నిండకపోయినా లోకం కంటి నిండా నిద్రపోనీయలేదు. చెయ్యేసి కాలేసి రొచ్చులోకి లాగేస్తుంది. తర్వాత చీత్కరిస్తుంది. అట్టా  ఈ వృత్తిలోకి వచ్చాను. నేనీ  పని చేస్తున్నానని తెలిసినప్పుడు మా అమ్మ ఏడ్చింది. ఆ పని చేయకపోతే  దేంట్లోనన్నా  దూకి చావరాదు. ఒకేడుపు యేడిసి వూరుకుంటాను అని గోల పెట్టేది. తర్వాత నీకు ముద్దవెరు యేస్తారే అమ్మా అనేదాన్ని !  ఎవరో ధర్మాత్ములు యింత ముద్ద పడేస్తారు అనేది నమ్మకంగా. ధర్మాత్ములు యెవరూ వుండరమ్మా,  వుండేదంతా పాపాత్ములే....  అనేదాన్ని.

ఇక్కడికొచ్చిన  వాళ్ళు  ఆకలి తీర్చుకుని రూపాయలని విసిరి కొట్టి వెళ్ళేవారే  కానీ  మా ఆకలి సంగతి ఆలోచించే వాళ్ళెవరు?  మా చావులు యెట్లా రాసి పెట్టి వుంటాయో యేమిటో తెలియదు. పిల్లా పీచు వున్నా వాళ్లకీ  మా గతే  పట్టుద్ది అని వద్దనుకున్నాను,  ఇవ్వాళ  తెల్ల కార్డ్ ఇప్పించమని ఆ తెల్ల బట్టలాయన యింటికెళితే ఆయన పెళ్ళాం  నన్ను చూసి అసహ్యిన్చుకుంది. వరండాలోకి యెందుకొచ్చావ్ ?  వెళ్ళు..  వెళ్ళూ  అంటూ  బయటకి గెంటేసింది. నువ్వు తీర్చలేని నీ మొగుడి వికృత కోర్కెలు తీర్చిన సానిదాన్ని తల్లీ ! అని దణ్ణం పెట్టి వచ్చేసాను. ఈ పని మానేసి  పొలం పనికి , పచ్చళ్ళ కంపెనీలో పనికి  వెళ్ళాను. ఒళ్ళు విరదీసుకునే చాకిరితో పాటు ఈ పనీ  తప్పేది కాదు. ఎవడో ఒకడు చెయ్యేసేవాడు. ఇష్టం లేదంటే నీకిష్టం యేమిటే ... ముండా  అని పచ్చి బూతులు కూసేవాళ్ళు. శరీరం మీద హక్కే  కాదు మనసుకి కూడా మురిపెం ఉండాలి.   ఎంత కడుపాకలి కోసం ఈ పని చేస్తుంటే మాత్రం  మనసు చంపుకుని యెవడితో పడితే వాడితో పొర్లాలంటే యెట్టా కుదురుద్ది. ఎక్కడ చూసినా   చెత్త నా కొడుకేలే ! ఎక్కడికెళ్ళినా యిదే పని చేసేటప్పుడు వొళ్ళు యిరగదీసుకునే కష్టమెందుకు చేయాలని   పనిలో  కెళ్ళడం మానేసా.   ఈ వాడకట్టులో అందరిదీ వొక్కో కథ. ఒకొకరు సంపాదించి యిళ్ళకి పంపుతారు. ఇంకొకళ్ళకి రోజూ గడవదు, హై క్లాస్స్ అపార్మేంట్ల మధ్య ఈ గుడిసెలేంటీ అని వొకో నాకొడుకు రచ్చ చేస్తాడు.  చీకటి పడగానే వాడే మా గుడిసెలు వెతుక్కుంటూ వస్తాడు. ఓట్ల కోసం మమ్మల్ని  ఇట్టాగైనా  వుండనీయడం లేకపోతే  యెప్పుడో  యిక్కడినుండి  లేపేసేవాళ్ళే !   అంటూ భారంగా నిట్టూర్చింది. తినడం కూడా ఆపేసి ఆమె వైపే జాలిగా చూస్తున్నాను.

కాసిని నీళ్ళు త్రాగి  మళ్ళీ చెప్పడం మొదలెట్టింది.  పొట్టకూటికోసం ఈ పని చేస్తున్నాం. ఈ మధ్య మొగుడు చాటు పెళ్ళాలు కూడా మాతో పోటీపడిపోతున్నారు. రోజుకొక చీర కట్టుకు తిరగాలని, బంగారు  నగలు కొనుక్కోవాలని దిగజారిపోతున్నారు.  మా కళ్ళ ముందు నుండే జంటలు జంటలు తోటల్లోకి తిరుగుతూ ఉంటారు.రెడ్ లైట్ ఏరియా లంటారు అక్కడకన్నా యెక్కువ వ్యాపారాలు యిళ్ళ మధ్య యెన్ని  జరగడం లేదు? అంటూ   కడిగిపారేసింది.

సినిమాల వాళ్ళు వేషాల కోసం చేసేది వ్యభిచారం కాదు ?. ధనవంతుల యిళ్ళల్లో సరదాల పేరిట జరిగేవి అది కాదు.   శీలం విలువ ఆకలి వొక్కటే కాదు, ప్రమోషన్, పదవి, చీరలు,నగలు, కారు ఏదైనా కావచ్చంటూ మేడి పండు సంఘం పొట్ట విప్పి పురుగుల్లాంటి  పచ్చి నిజాలని మాట్లాడింది. దిమ్మెరపోయాను. నేనప్పటిదాకా అన్నమే తిన్నానా  ఆమె వొండిన అన్నంలో  మెతుకు మెతుకులొ దాగిన వ్యధని తిన్నానా అనిపించింది.

ఇంకొందరి కథలు చెప్పు అని అడిగాను.  వచ్చిన పని చూసుకుని వెళ్ళాలి కానీ ఈ కథలన్నీ నీకెందుకు ? ఇక చెప్పను అని  మొండికేసింది. బతిమలాడినా వేరొకరి కథ చెప్పలేదు. నేనేమన్నా కథలు చెప్పే పేదరాసి పెద్దమ్మలా కనబడుతున్నానా ! ఎవరి కథ వాళ్ళకే తెలుసు, వాళ్ళే చెప్పుకోవాలి మధ్యలో నాకెందుకు అంది కానీ నోరిప్పలేదు. అప్పుడు నాకు వొకటనిపించింది నీతులు చెప్పే మారాజులందరినీ వాడల వాడల వెంట  త్రిప్పి  వీళ్ళని చూపించాలి. ఛీ,  యాక్ అంటూ. వాంతి  వచ్చినట్టు మొహం పెట్టె అమ్మలక్కలకి  వీళ్ళ కథలు వినిపించాలి. వాళ్ళని చులకనగా చూసే మన  చూపులు మారాలి . సమాజం విసిరి పారేసిన అభాగ్యులు వాళ్ళు .   వికృత ఆలోచనల  సమాజం తయారుచేసిన ఆకలి కేకలు వీళ్ళు. వాళ్ళలో పూట గడవని అతి పేదవాళ్ళు  వాళ్ళని పీక్కు తినే పోలీస్ వాళ్ళు కూడా వుంటారు. రోగాలు రోష్టులతో, మల మూత్రాల మధ్య, మురుగు కాలవలు ప్రక్కన, ఈగలు ముసిరి, దోమకాటులకి బలి పోతూ , కాట్ల కుక్కల మధ్య జీవచ్చవాలై బ్రతుకుతున్న వాళ్ళ దగ్గరికి  కోరికలతో కాదు మానవత్వం చూపడానికి వెళ్ళాలి " అన్నాడు ఆవేశంగా.  

 ఆ క్షణంలో   అభిని చూస్తుంటే అతని పట్ల, కొందరి జీవితాలపట్ల  నాకున్న దురభిప్రాయాలన్నీ పటాపంచలై పోయాయి. ఆ గుడిసెలలో నివసిస్తున్న అభాగినిల  పట్ల మనసులో జాలి,సానుభూతి కల్గాయి.   అభి  వేశ్యలని వుద్దరించడానికి వెళుతున్న తధాగతుడిలా అనిపించాడు. పతితలందరినీ వుద్దరించే శక్తి అతనికి  లేకపోవచ్చు గానీ వాళ్ళ గురించి సమాజానికి చెప్పే అవకాశం అతనికుంది  కదా ! గమళాళ్ళ కోటేశుకి కొడుకు మీద యెంత నమ్మకం.!?  నా కొడుకు చెడ్డ పనులు చేయడయ్యా ! ఏదో వుద్దేశ్యం ఉంటేనే ఆడు అటువైపు వెళతాడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

“తర్వాత యేమైంది? దేవసేన నువ్విచ్చిన బియ్యం బస్తా తీసుకుందా?” అడిగాను

 ఆ సంగతి చెప్పనేలేదు కదూ ! అక్కడికే వస్తున్నా  వినండీ  సంగతి...   అంటూ కొనసాగించాడు . అన్నం తినమని దేవసేనని  బ్రతిమలాడాను. "పనయ్యాకే తిండి సంగతి. ఎవరికి రుణపడి పోవడం నాకిష్టంలేదు " అంది.
అయితే  ఒకసారి కాళ్ళు చాపుకో దేవసేనమ్మా !  అన్నాను.  చాపిన ఆ  కాళ్ళ పై   తల పెట్టుకుని పడుకున్నా. నేనలా  పడుకోవడంలో నాకే వికారం లేదు. మా అమ్మ కాళ్ళపై పడుకున్నట్టే వుంది.  అప్రయత్నంగా ఆమె చేయి  తల్లి చేయిలా మారింది. నా తలని నిమిరింది. కాసేపు అలా పడుకుని ... లేచి వచ్చేస్తూ ... "ఇదిగో ఇలా ఈ అమ్మ లాంటి వాత్సల్యం చాలు.  నీదగ్గర తీసుకున్నదానికి  నేనిచ్చిన  ఖరీదు ఈ బియ్యం బస్తా " అని చెప్పి  బయటకి వచ్చేసాను.

మంచం మీద నుండి  క్రిందికి వురికి పొయ్యిలో వున్న కట్టెపుల్లని తీసుకుని నా వెంట పడింది ..." ఈసారి నా యింటికి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతా... "  అంటూ.   నేను ఆమెకి దొరికితే కదా!  అన్నాడు నవ్వుతూ అభి.

నాకూ  వొకటే నవ్వు పొరలు పొరలుగా, తెరలు తెరలుగా.  నవ్వులాట నవ్వు కాదది. అంటువ్యాధి  నవ్వూ  కాదది. కళ్ళు తడుస్తూ పుట్టుకొచ్చిన నవ్వది.

ఆనాటి  జ్ఞాపకం యింకా సజీవంగా వుందేమో ... మళ్ళీ నవ్వొచింది అప్పటిలాగే  కన్నీళ్ళతో సహా !

(వాకిలి వెబ్ పత్రిక 2016 ఏప్రియల్ సంచికలో ఈ కథ ప్రచురితం )

 కథకి తగ్గట్టుగా ఇంత చక్కని చిత్రం అందించిన కిరణ్ కుమారి గార్కి ధన్యవాదాలు.

1 కామెంట్‌:

Yalamarthy Anuradha చెప్పారు...

కథ చాలా చాలా బాగుంది వనజ గారు . దేవసేన పాత్ర చిత్రణ అద్భుతంగా ఉంది . ఇంకా మీరెన్నో మంచి రచనలు చేయాలి. అభినందనలు.