నా జ్ఞాపకాలు వరుస క్రమంలో వుండక పోవచ్చు. ఎప్పుడు యేది గుర్తుకు వస్తే అది
రాసుకుంటూ వస్తున్నాను.. గమనించగలరు.
మా ఊరి కి తూర్పు పక్కన పడమట పక్కన కూడా మూడు కిలోమీటర్ల
దూరంలో కనుమలు వున్నాయి. ఆ అడవి అంచు దాకా మామిడి తోటలు వుంటాయి. మా వాళ్ళందరూ
గట్టుకాడ తోటలు అనేవారు. ఈ పొలాలన్నీ గరపనేలలు. నీటి వసతి వుండాలే కానీ బంగారం
పండుతుంది అని నానుడి.. ఇంకోపక్క బాడవ పొలం అని అనేవాళ్ళు. నల్లమట్టిలో ఇసుక కలిపిన
నేలలు. ఇంకా పాటినేలలు, మాగాణి పొలం నల్లరేగడి నేలలు వుంటాయి. ఎక్కువగా తొలకరికి
కంది వేసేవాళ్ళు. కందిలో అంతర పంటగా పెసర కానీ జనుము కానీ వేసేవారు. మిరప తోటలు
కూడా వుండేవి కానీ తక్కువ. మాగాణిలో ఒక పంట వరి వేసేవారు. అది అయిపోయిన తర్వాత
ఆరుతడి పంటలు మినుము పెసర పిల్లి పసర ధనియాలు వేసేవారు. ఒకొకరు పైరు శెనగ కూడా
వేసేవారు. వర్షాధారం పంటలే ఎక్కువ. వర్షాలు కురిసి చెరువులు నిండితేనే వరి పండేది.
అందుకని ధాన్యం మళ్ళీ పంట చేతికి వచ్చేదాకా ఎవరూ అమ్మేవారు కాదు. ఇంటి ముందు కొంచెం
మిట్ట లాగా ఎత్తు గా మట్టిపోసి వడ్ల పురి కట్టే వారు. ఆ పురి చుట్టూ వర్షం నీరు
నిల్వకుండా నాప బండలు వేయడమో సిమెంట్ దిమ్మ కట్టడమా చేసేవారు. వరి బస్తాల్లో వేసి
గడమంచి మీద వేసి వుంచితే వడ్ల చిలకలు వచ్చేయి. ధాన్యం పొట్టు మాత్రమే వుండేదట
ఆరుబయట అలా వేస్తే! కొంతమంది వడ్ల ను పాతర వేసి నెలల పాటు మగ్గబెట్టేవారు. రుచి పెరిగి ఆరోగ్యం బాగుంటుంది అని.
వర్షాలు కురవకపోతే కప్పలకు పెళ్ళిచేసేవారు. దున్నపోతును బలి
ఇచ్చేవారు గంగానమ్మ కు. అదొక భయకంపితమైన జ్ఞాపకం. వేపమండలు పట్టుకుని కల్లు
సేవించిన మనుషులు డప్పు మోతకు లయబద్దంగా.. అలుపన్నది లేకుండా ఊగుతూ వుండేవారు.
ఇంటింటి వారు వీథిలో వెళుతున్న ఊరేగింపుకి బిందెలతో ఎదురు వెళ్ళి పసుపు నీళ్ళ వార
పోసి హారతిచ్చేవాళ్ళు. ఎక్కువగా ఆ కార్యక్రమం ఆదివారం వుండేది. అంతకుముందు రోజు
ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని అలికి ముగ్గు పెట్టిన పొయ్యి పై నిండుకుండ అన్నం
వండి ఆ అన్నం వేడిగా వున్నప్పుడే పాలుపోసి తోడు పెట్టేవారు. దానిని సద్దెపారం
అనేవారు. ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పసుపు కుంకుమలు పూలు
కొబ్బరికాయ తీసుకెళ్లి పూజ చేసి సద్దేపారంని గంగానమ్మకు సమర్పించే వారు. అది అయినాక
మూడు ప్రదక్షిణలు చేసిన నూటొనిమిది బిందెల నీటితో అమ్మ వారికి అభిషేకం
చేసేవారు.అదలా సాగుతుండగానే ఊరి చివర నుండి ఊరేగింపు మొదలయ్యేది. అలంకరించిన
దున్నపోతును లాక్కుంటూ. రెండు కప్పలను కావడికుండల్లో అటొకదానిని ఇటొకదానిని
పెట్టుకుని నడక సాగిస్తూ వచ్చేవారు. ఊళ్ళో మగవాళ్ళంతా తప్పనిసరిగా పాల్గొనేవాళ్ళు.
మా ఇల్లు గంగానమ్మ గుడికి దగ్గరగానే వుండేది కాబట్టి… ఆ కాస్త దూరం ఊరేగింపు వెంట
నేను వుండేదాన్ని అదీ ముందు భాగంలో సాగుతూ.. అంతే బాగానే వుండేది. దున్నపోతును బలి
యిచ్చే సమయానికి ఇంటికి పరార్. కొద్దిరోజులు బలి యిచ్చిన జంతువుల అరుపులు రక్తం
భయంతో వణికించేవి. ఒళ్ళు జలదరిచ్చితేనే జీవాన్ని తెగకోసేవారు. ఆ సమయానికి గణాచారికో
ఇంకెవరికో (మొత్తానికి స్త్రీలకు మాత్రమే) గ్రామదేవత ఒంటి మీదకు వచ్చేది.
ఎక్కువసార్లు రెండు మూడు రోజుల్లో వాన పడేది. వరుణుడి దీవెన బట్టి పంటలు. మా
నాయనమ్మ అనేది “జలదీవెన లేకపోతే జనులకు కడగండ్లు అని” .
ఆ రోజుల్లో పంటలు పండకపోయినా
జాగ్రత్తగా దాచుకున్న ఆహార ధాన్యంతో మప్పితంగా రోజులు వెళ్ళమార్చేవారు. ఆ రోజుల్లో
జీవనం సాఫీగా జరగడానికి కారణం చదువుల ఖర్చులు గొంతెమ్మ కోరికలు లేకపోవడం
అనిపిస్తూంది. మిశ్రమ వ్యవసాయ పద్దతిలో ఏదో ఒక పంట రైతును తిండిగింజలకు
సరిపడనంతగానైనా ఆదుకునేది. వారి ముందుచూపులో పశువుల గ్రాసం కూడా వుండేది. జనుము
వేసేవారు. పూతదశలో వుండగానే కోసి యెండబెట్టి గడ్డి వాముల్లో రొండొంచెల పద్దతిలో
భద్రం చేసేవారు.
ప్రతి ఊరికి రైతుకు తాటితోపు తప్పనిసరిగా వుండేది. చేల సరిహద్దుల మధ్య తాటి చెట్లు
నాటేవారు. మగ తాటి చెట్లను పోతు తాళ్ళు అని పెంటి తాళ్ళు అని అనేవారు. పోతు తాళ్ళు
నుండి కల్లు తీసేవారు. పోతు తాడి మువ్వలో నుండి గెలలు వచ్చేయి. వాటిని గులకచళ్ళు
అనేవారు. కల్లు గీసే వాళ్ళు ఆ గులక చళ్ళును కొట్టి వేసి (45 డిగ్రీలలో అని గుర్తు)
దానికి కల్లు ముంతను బిగించేవారు. ఆ గులకచళ్ళను పొయ్యిలో పెడితే చిటపట రవ్వలు
రువ్వేవి. ఆ పూల గరుకు పొడిని దీపావళి పండగకు కాల్చే మతాబులు పూల పొట్లాలు
చుట్టేటప్పుడు ఆ మందులో కలిపేవాళ్ళు. ఇసుకపొలాల్లో ఎర్ర రేగడి పొలాల్లో తాటి చెట్ల
దగ్గర ఎక్కువగా తేళ్ళు వుండేవి. ఆ తేళ్ళు కూడా యెర్రగానే వుండేవి. తాటి తోపుల్ల
వల్ల రైతుకు ఆదాయం వుండేది. తాటి దూలాలు వెదురుకర్రతో వేసిన చావిడి వుండేది. బెంగుళూరు పెంకు ఇళ్లకు తాటి బద్దెలు వేసేవారు. అలాగే పొలాల మధ్య కాలువలు దాటడానికి తాటి బద్దెలు వేసేవారు. నేల బావి మీద తాటి బొత్తాం వేసి వుండేది. తాటి కల్లు తాటి ముంజెలు తాటిపండ్లు తేగలు
తాటి ఆకులు తాటినార తాటి చీపుర్లు ఎన్నెన్ని ప్రయోజనాలని.
మా ఆరెకరాల మామిడితోట
చుట్టూ మూడు పక్కల తాటి చెట్లు వుండేవి. ఒక పక్క వాగు వుండేది. ఆ వాగు పక్క
జీడిమామిడి చెట్లు వుండేవి. ప్రతి ఏటా వేసవి ప్రారంభంలో గుత్తానికి తాటియాకు
అమ్మేవారు. అందుకుగాను కొంత ఆదాయం వచ్చేది. ఒక సంవత్సరం అలా తాటియాకు అమ్మిన
డబ్బుతో మా అమ్మ నాకు పది చిన్నాలుతో ఒక జత పోగులు చేయించింది. (బంగారం ని కాసులు
చిన్నాలు తో తూకం వేయించేవారు అప్పుడు. కాసు అంటే 8 గ్రాములు. 21 చిన్నాలు అయితే ఒక
కాసు) అందుకే ఇప్పటి రైతాంగం కూడా తాటిచెట్లు పెంచడంలో శ్రద్ద చూపితే బాగుంటుంది
అనుకుంటున్నాను నేను. తాటిచెట్లు చాలా ఆలస్యంగా పెరుగుతాయి. కానీ ఒక పది పన్నెండు
ఏళ్ళ తర్వాత ఇచ్చే ఫలితాలు ఒక యాభై ఏళ్ళ వరకూ ఢోకా వుండదు అని చెప్పవచ్చు. చెట్లు
నాటేది ఒకరైనా ఫలితాలు భావితరాలవి.
ఇంకో విషయం గుర్తుకు వచ్చింది నాకు.. బావి మీద
వేసిన దాన్ని తాగాడి అనేవారు. మా బావిపై వేసిన బొత్తం ఊలిపోయినా ఎవరూ
పట్టించుకునేవారు కాదు. తాతల కాలం నాటి ఉమ్మడి బావి అది. అందరూ ఎవరికి వారు వారి
ఆవరణలో బావి తవ్వించుకుంటే మాకు మాత్రం తూర్పున స్థలం లేక బావి తవ్వడానికి వాస్తు
కుదిరేది కాదని అనేవారు. అందుకనే తప్పనిసరిగా ఆ ఉమ్మడి బావినీళ్ళే మాకు ఆధారం. బావి గట్టు
పై ఒక కాలు తాటి బొత్తాం పై ఒక కాలు వేసి వంగి కడవలతో నీళ్ళు తోడేవారు. మా ఇంటి
వాడుకకు ఉదయాన్నే 13 నుండి 15 జోళ్ళు నీళ్ళు పట్టేవి. (జోళ్ళు బహువచనం. జోడు అంటే రెండు
చేతుల్లో రెండు కడవలతో తెచ్చే నీరు. ఒక్కో కడవ పాతిక లీటర్ల వరకూ నీరు పట్టేది.
ఇత్తడి అల్యూమినియం కడవలు వుండేవి. పూర్వం అంతా మట్టి కడవలు.)
ఉదయాన్నే లేచి
కాలకృత్యాలు తీర్చుకుని పశువుల కొట్టం శుభ్రం చేయడం నీళ్ళు నింపడం నా వంతు పని.
రాతిగాబు శుభ్రంగా కడిగి దానిని నింపుతూ వుండేదాన్ని. పశువులకు చిన్న తొట్టిలో
నీళ్ళు నింపడం స్నానాల దొడ్డిలో నీళ్ళు నింపడం అయ్యేటప్పటికి వొళ్ళంతా చెమటలు ధారలు
కట్టేవి. ఎండా కాలంలో ముప్పై అడుగుల లోతులో నీళ్ళు వుంటే వానాకాలం పది అడుగుల
లోతులో తొణికిసలాడుతూ వుండేవి నీళ్ళు. మా నీళ్ళబావి వొక పక్క కూలిపోతూ భయం
కల్గించేది. (అంటే రాతిగోడతో నిర్మించిన బావి అది. ఒక పక్క రాళ్ళు కూలిపోయి మిగతా
భాగం కూడా ఎప్పుడో వొకప్పుడు కూలిపోతుంది అన్నట్టు భయపెట్టేది) దానికి తోడు
ఊలిపోయిన తాటి బొండు కూడా ఇరిగి బావిలో పడుద్దేమో అన్న భయంతోనే నీళ్ళు తోడేదాన్ని. అలా ఏడెనిమిది ఏళ్ళు నీళ్లు తోడాను మోసాను. మా బావి నల్లని నీళ్ళతో కళకళలాడుతూ బహు ఆకర్షణీయంగా కనబడేది. కొబ్బరి తాడు తో అన్ని నీళ్ళు
తోడేసరికి అరచేతులు ఎర్రగా కందిపోయేయి. (కొబ్బరిపీచుతో పేనిన తాడు)
నాకు ఊహ
తెలిసేసరికే మాకు నాగలితో వ్యవసాయం చేయడం మరుగునపడింది. మా ఊర్లో టాక్టర్ వుండేది.
దుక్కి దున్నడానికి టాక్టర్ వచ్చేది. మా నాన్న వ్యవసాయం చేయడానికి వొళ్ళు వొంగేది
కాదు అనుకుంటా. మా నాన్న కాలక్షేపంగా ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుని మా నాన్న
వయస్సు వున్న స్నేహితుడు కాకర్ల రామారావు గారి ట్రాక్టర్ నడపడానికి వెళ్ళిపోయేవాడు.
మా తాతయ్య మా వ్యవసాయం సంగతి చూసుకునేవారు. పశువులను చేనుకు తోలుకు వెళతం కాపు
అయ్యేవరకూ మామిడి తోటకు కాపలాగా వుండటం చేసేవాడు. నాకు పదేళ్ళు వచ్చేసరికి ఇంట్లో
పాలేరు ను పెట్టడం ఆపేసారు. పంటలు పండకపోవడం పశువులు తగ్గడం కారణం కావచ్చు.
పంటభూమి
అంటే రత్నగర్భ అనేవాడు తాతయ్య . ఆ భూమి ని సంపాదించడం కోసం నిలబెట్టడం కోసం యెంత
కష్టపడి వుంటాడు ఆయన. ఉమ్మడి కుటుంబంలో కష్టజీవి ఆయన. ఆయన కళ్ళముందే భూమి అంతా
అన్యాక్రాంతం అయితే యెంత బాధపడి వుంటాడో.. తల్చుకుంటేనే బాధగా వుంటుంది. నా
దృష్టిలో పెద్దలు యిచ్చిన భూములను పోగొట్టుకోవడం నిలుపుకోవడానికి ఏ మాత్రం
కష్టపడకపోవడం అన్నంత దురదృష్టకరమైన విషయం మరొకటి వుండదు.
మా మేనత్త.. ఇలా అంటుంది..
ఏ వంశమైనా మూడు తరాలు దేదీప్యమానంగా వెలిగిపోతుంది అంట. నాలుగోతరం వచ్చేసరికి
అష్టకష్టాలు పడి ఐదో తరం వచ్చేసరికి మళ్ళీ పుంజుకుని వైభవంగా వుంటారట.
తల్లిదండ్రులు తాతలు ముత్తాతలు చేసిన కర్మఫలాలు వారసులు అనుభవించాలట అని చెబుతూ..
మా అమ్మ నాన్న లు ఏ పాపం యెరగరు. మంచిమనసు వున్నవాళ్ళు.అధర్మం యెరగని వాళ్ళు.
ఒకరికి పెట్టడమే తప్ప ఇంకొకరి సొమ్ము చిల్లికాణీకి కూడా ఆశపడని వారు అని చెప్పి
కళ్ళ నీళ్ళు పెట్టుకుంటది. నాకేమో గుండె కన్ను తడైతది.. మనసులో వారిని తలుచుకుని
దణ్ణం పెట్టుకుంటాను.
మా తాతయ్య వాళ్ళు ఆయుకట్టు (కప్పం) పన్ను చెల్లించేవారంట. నిజాం నవాబు
ల కాలంలో కొండపల్లి సంస్థానంలో భాగంగా మా ఊరు వుండేదట.. ఆ విషయాలు మరొక భాగంలో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి