మా ఊరు
మా ఇల్లు పశువుల శాల గడ్డివాము స్థలం వరకూ వీటన్నింటి పొడవునా పడమట వైపు ప్రహరీ వుండేది. దక్షిణం వైపు అంతా పల్లం ఉత్తరం వైపు అసలు స్థలం లేదు. తూర్పు ఓ పదడుగులు అదీ ఉమ్మడి దారి. మా చిన్న తాతగారికి ఉమ్మడి బావిలో నీరు తెచ్చుకోవడానికి గానూ నడక హక్కులు వుండేవి. మాకు వారి ఇంటి ముందు నుండి వీధి లోకి రావడానికి నడక దారి వుండేది. మొట్టమొదటగా మా ఇంటి పరిసరాలు పరిశీలించిన వాస్తు సిద్ధాంతి దక్షిణం స్థలం ఎక్కువ వుండటం అదీ లోతుగా వుండటం వల్ల మీకు ఆర్ధిక నష్టాలు కలిసిరాకపోవడం లాంటివి చెప్పారనుకుంటా. ఇక మా వాళ్ళు ఆ సిద్ధాంతి చెప్పిన అన్ని సవరణలు చేయడానికి పూనుకున్నారు.
ఇంటికి దక్షిణం వైపు వున్న పశువుల శాల స్థలం మధ్య ప్రహరీ నిర్మించారు. పశువుల శాలకు గడ్డివాము వేసుకునే స్థలానికి మధ్య కూడా మరొక గోడ ఆరడుగుల యెత్తులో నిర్మించారు. కొంత మట్టి తోలి స్థలం యెత్తు పెంచారు. అప్పుడు ఆ పశువుల శాల చతురస్రాకారంగా అందంగా తయారైంది. ఆ స్థలంలో ఆగ్నేయ మూల స్నానాల గది కూడా నిర్మించారు. పశువుల శాల నుండి ఉత్తరం వైపు ఇంటి దక్షిణం గోడకు మధ్య నిర్మించిన గోడ కు మధ్య కొంత నైఋతి భాగం పెరిగిందని ఆ పెరిగిన స్థలం వాడకుండా పారు (పనికిరానిదని అర్ధం ) స్థలంగా విడగొట్టి మరొక చిన్న గోడ కట్టారు. అది వాడకూడదని ఎవరూ నడవకూడదని అన్నారని అన్నయ్య నేను ఆ రెండుగోడల మధ్య మట్టి నింపి పూల మొక్కలు వేసాం. వంట ఇల్లు కూలగొట్టి ఆ స్థానం ఖాళీగా వదిలేసి దక్షిణం వైపున ఇంటి సరిహద్దుగా తాటాకు వంట ఇల్లు నిర్మించారు.
ఇక మా నాయనమ్మ తాతయ్య లకు వొక్క గది మాత్రమే మిగిలింది. వంట చేయడానికి ఆరుబయట స్థలం. వర్షం వస్తే కట్టెలు తడిచి వంట చేసుకోవడానికి నానా ఇబ్బంది పడేది. పొగ వచ్చే కట్టెలు మండటానికి ఇనుప గొట్టంతో ఊది ఊది దగ్గుతూ కళ్ళు తుడుచుకునే నానమ్మ రూపం గుర్తొస్తుందిపుడు. 🥲🥲 మా వంటిల్లు ను ఆనుకుని ఇటుకలతో ఆర్చి కట్టి.. అందులో పాటి మట్టి పోసి పశువుల ఎరువు పోసి మూడు రంగుల చామంతి మొక్కలు వేసాం. పారు స్థలంలో కాకర చెట్టు, కనకాంబరం మొక్కలు, బంతి మొక్కలు చిలక గోరింట మొక్కలు మందార బంగాళా బంతి (zinia) మొక్కలు వేసాము. అన్నయ్య నేను ఆ మొక్కలు చుట్టూ తెగ తిరిగేవాళ్ళం. ఒకసారి ఏదో పువ్వు (గడ్డి పువ్వు కూడా కాదనుకుంటా) వున్న మొక్క వచ్చింది. దానికి పువ్వు కూడా వుంది. అది పీకేస్తాను అని నేను, వద్దు.. బాగుంది వుండనివ్వు అని అన్నయ్య. నేను వద్దు అన్నాక వుండనిచ్చే రకాన్ని కాదు కదా! ఆ పువ్వు వున్న చెట్టును మొదలంటా పీకి పడేసాను. అప్పుడు అన్నయ్య కోపంగా వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడు. నేను ఏడుస్తుంటే.. పెరిగి పూలు పూస్తున్న మొక్కను ఎందుకు పీకావు? పిచ్చి మొక్కలు మంచి మొక్కలు అని వుండవు. ఎలా పెరిగేవాటిని అలా పెరగనివ్వాలి. నాశనం చేయకూడదు లాంటి హిత వాక్యాలు చెప్పిన గుర్తు. అప్పటి నుండి ప్రతి మొక్కను సునిశితంగా చూడటం అన్ని పూలను సమదృష్టితో చూడటం అలవడింది నాకు. ఇక సంక్రాంతి సమయం వచ్చేసరికి మా ఇంటి చుట్టూ పూలవనం తయారయ్యేది. ఒకసారి హైదరాబాద్ నుండి మా నాలుగో తాతయ్య కోడలు పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వేణి అక్క వచ్చారు. మా ఇంటి చుట్టూ వేసిన మొక్కలు విరిసిన పూలు చూసి భలే ఆశ్చర్యపోయారు. అది బాగా జ్ఞాపకం వుంది. పొయ్యిలో బూడిద పోసేవాళ్ళం తాతయ్య సలహాతో. అందువల్ల మొక్కలు బాగా పెరిగేవి.
మా నట్టింట్లో చిన్న రాతి రోలు నేల మట్టానికి వుండేది. రైస్ మిల్లు రాని కాలం అది. వానా కాలంలో ఆరుబయట పనిచేయడానికి వీలవనప్పుడు ఆ రాతి రోలుపై రాతి కుంది వేసి రోకళ్ళతో జొన్నలు తొక్కేవారంట. వడ్లు, బియ్యం పిండి,అటుకులు దంచేవారంట. ఇంకా తొక్కుడు లడ్డు కోసం నువ్వులు బెల్లం అన్నీ దంచేవాళ్ళం అని నానమ్మ చెప్పింది. అలాగే కొయ్య కుంది కూడా వుండేది. నల్లమద్ది రోకళ్ళు బరువుగా వుండేవి. వాటికి మందపాటి ఇనుప రేకుతో చేసిన పొన్నులు వుండేవి. అలాగే కలవారి కోడళ్ళ రోకళ్ళకు ఇత్తడి రేకు పొన్నులు వుండటమే గొప్ప అనుకుంటే మా నాయనమ్మకు వాళ్ళ పుట్టింటి వారు వెండి పొన్ను వేయించిన రోకళ్ళను పంపించారంట. ఆ రోజుల్లో ఆడపిల్లకు కాపురానికి వచ్చేటప్పుడు ఇత్తడి సామాను పందిరి నవ్వారు మంచం భోషాణం మైలుపెట్టే పెద్ద కుర్చీ డ్రాయర్ బల్ల తప్పకుండా పంపేవారంట. అవన్నీ నాయనమ్మకు ఇచ్చారు. అత్తగారు కోడలికి వెండి బొట్టు పెట్టె పెడితే అల్లుడికి అత్తగారు వాచీ వెండి సబ్బు పెట్టె సైకిల్ పెట్టేవారంట.
మా నాయనమ్మ పుట్టిల్లు విజయవాడ పక్కన నిడమానూరు. పరిటాల వారి ఆడపడుచు. మేనమామలు అయినంపూడి వారు. మా నాయనమ్మ వారి కూటస్థులు కొంతమంది పరిటాల వారు కనసానపల్లి వెళ్ళిపోయారంట. మా నాయనమ్మ కు పుట్టింటి వారు ఎకరంన్నర మాగాణి ఒంటినిండా బంగారం పెట్టి పంపారంట. అందులో కంటె అనే నగ నవరత్నాల హారం ప్రత్యేకంగా వుండేది అంట. ఆమెకు ఒక అక్క ఊర్లోనే మేనమామకు ఇచ్చారు. ఒక అన్నయ్య. కాలక్రమేణా నాయనమ్మ అన్నయ్య కోర్టు కేసులు మూలంగా ఆస్థి అంతా కోల్పోయారు అని ఆ కేసులకు మూలం మా పెద తాతయ్య అని ఆయన బావమరుదలకు మా తాతయ్య బావ మరిదికి మధ్యనే కేసు నడిచినట్లు చెప్పుకునేవారు. వారి అన్నల కోర్టు కేసులు వాజ్యాలు గురించి ఇక్కడ తోడికోడళ్ళు కూడా పోట్లాడుకునేవారంట. ఆ వాదనలో మా పెదనాయనమ్మ మా నాయనమ్మ మెడలో కంటె పట్టుకుని లాగేదట. ఆమె చాలా గడుసరి.ఆమె దూకుడు చూసి నాయనమ్మ ఆమె మెడలో కాసుల దండ పట్టుకునేది అంట. అలా వుండేవట తగువులు. ఈ విషయం మా పెద్దతాత కూతురు సావిత్రి అత్తయ్య నవ్వుతూ చెప్పేది.
మొత్తానికి కోర్టు తీర్పు వల్ల నాయనమ్మ అన్నయ్య ఆస్తులన్నీ కోల్ఫోతే అన్నయ్యకు ముగ్గురు నలుగురు పిల్లలు వున్నారు ఎలా బతుకుతారు అని అక్క చెల్లెళ్ళు ఇద్దరూ పుట్టింటి వారిచ్చిన పొలం బంగారం అంతా అన్నకు ఇచ్చేసారంట. అదే కాకుండా మా తాతయ్య ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోయాక ఆ కుటుంబానికి పప్పులు ఉప్పులు మిరపకాయలు మామిడికాయలు ధాన్యం పచ్చళ్లు లాంటివన్నీ బండికి వేసి పంపేవారంట. ఆలితట్టు వారు ఆత్మబంధువులగుదురు. కొంపంతా దోచిపెడుతున్నారు అని తాతయ్య సోదరులు వారి భార్యలు అనుకునేవారట. మా తాతయ్య ది జాలి గుణం.
తన కున్నదానిని ఎవరికైనా ఉదారంగా పంచిపెట్టేవాడంట.
ఇక తాతయ్య నాయనమ్మ ను బాగా చూసుకునేవాడంట. ఒక్క తిట్టు తిట్టడం వినలేదు మేము అనేవారు మా బంధువులు. నేను విన్న హాస్య సంభాషణ ఇది..
మీ పుట్టింటి గొప్ప ఏముందిలే.. పెళ్ళికి మేము తెచ్చిచ్చిన చీర కట్టుకుని పీటల మీద కూర్చున్నావు అని నాయనమ్మతో హాస్యం ఆడేవాడు తాతయ్య. అయ్యో! అదో సంబడమా.. ఆ మాత్రం మా పుట్టింటి వాళ్ళకు లేకా..!? పెళ్ళికి అత్తగారు ప్రధానంలో పెట్టిన చీర కట్టుకోవడం ఆచారం కాబట్టి మీరు తెచ్చిన చీర కట్టుకున్నా.. అనేది మా నాయనమ్మ ఉడుక్కుంటూ.
ఇలాంటి కబుర్లన్నీ నాయనమ్మ తాతయ్య తెల్లవారుఝామున లేచి ఏమీ తోచక గతాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పుకునేవారు. అవి అలా నేను విని జ్ఞాపకం పెట్టుకున్నవీనూ ఇవన్నీ. వారి ముచ్చట్లలో గాంధీ గారు నిడమానూరు పెనమలూరు రావడం రేడియో కి లైసెన్స్ తెచ్చుకోవడం లాంటి విషయాలు వుండేవి. మా తాతయ్య కబుర్ల లో వేట విషయాలు నాటకాల విషయాలు కూడా వుండేవి. ఇంకా ఎద్దులు ఏట్లో ఈదడం కూడా అబ్బురం అనిపించే విషయాలు. అవన్నీ తాతయ్య గురించి రాసేటప్పుడు చెబుతాను.
మా నాయనమ్మ కు పదకొండో ఏడు వచ్చాక పెళ్ళైంది అంట. మూడవ తరగతి వరకూ చదువుకుంది. కావ్యాలు చది వేది. భగవద్గీత తప్పు రాకుండా చదివేది. 1938 లో మా పెదనాన్న పుట్టాడంట. ఆయనకు 1957 లో పెళ్ళైంది. మా రెండవ పెదనాన్నకు కూడా అప్పుడే పెళ్ళి జరిగింది. 1963 లో అమ్మ నాన్నల పెళ్ళి. అందరికీ 20 ఏళ్ళు రాకముందే పెళ్ళి అవడం పెద్దల అజమాయిషీ లేకుండా కొడుకులు వ్యవహారవేత్తలుగా మారడం వలనే మా కుటుంబం ఆర్ధికంగా పతనమైంది అనుకుంటానిపుడు. ఇద్దరు మేనత్తలు. ఒకామె మరణించింది మా ఇంటి వెనుక వారికే ఇచ్చారు.రెండో మేనత్తను దగ్గరలోనే ఇచ్చి వివాహం చేసారు. నాయనమ్మ తాతయ్య వారి భాద్యతలు చక్కగా పాటించారు. ఆస్తులు మాత్రమే సంపాదించలేదు. కొడుకులకు అది చిన్న చూపేమో మరి అనుకోవడానికీ లేదు. మా వాళ్లు ఆ తరహా కూడా కాదు.
మా నాయనమ్మ వెంట వొకసారి ఆమె పుట్టింటికి వెళ్ళాను. మా మామిడి తోటలో నుండి నడుచుకుంటూ తోట వెనుక వాగులో దిగి నడుచుకుంటూ పెద్ద వాగు వరకూ చేరి అక్కడ రోడ్డు ఎక్కి.. విజయవాడ బస్ ఎక్కి వెళ్ళడం నిడమానూరు వెళ్ళడం బాగా జ్ఞాపకం నాకు. అప్పుడు మా ఇద్దరి కాళ్ళకు చెప్పులు కూడా లేవు. కాళ్ళు కాలుతూ చిందులేసాను. మా నాయనమ్మతో నాకు అనుబంధం ఎక్కువ. చింత చిగురేసి పప్పు వండేది. వంకాయ చింత చిగురు కూర వండేది. ఉల్లిపాయ వేసి చింత చిగురు వేపుడు చేసేది. చిలకడ దుంపలు నివురులో మగ్గబెట్టి ఇచ్చేది. ఆమె ప్రేమకు మరేది సాటిలేదు. ధనం లేకపోవడం సమస్య కాదు. ఉన్నదానిలో ప్రేమగా పిల్లలకు పెట్టేది. తాటాకు మంట లాంటి కోపం. ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా మాటపట్టింపులు లేకుండా అందరినీ కలుపుకుని పోవడం నోరార పలకరించడం మా నాయనమ్మ స్వభావం. ఒక కాలు వొంగేది కాదు కింద కూర్చోవడం కష్టం అయ్యేది. ఒక చెక్క స్టూల్ మీద కూర్చుండేది. కింద కూర్చుంటే వొక కాలు ఆరజాపి కూర్చోవాల్సి వచ్చేది.
నాకు చిన్నప్పుడు బాగా జుట్టు ఎక్కువ. ఆ స్టూల్ మీద కూర్చుని తల మీద రసం పోసేది. తల యెల్లడానికి (మురికి విడవడానికి ) మూడు సార్లు రసం పోసేది. నీ మనుమరాలికి నీ జుట్టు నీ కొడుకు జుట్టో వస్తే ఆరుసార్లు రుద్దే వాళ్ళేమో అని విసుక్కునేది అమ్మ. మా నాయనమ్మది నాన్నది ఉంగరాల జుట్టు. మా నాన్నకు తన మేనకోడలిని చేసుకోవాలని వుండేదట నాయనమ్మకు. ఆమె బంగారు బొమ్మలా వుంటుంది. నాన్న నలుపు. సరిగ్గా చదువు సంధ్యలు లేవని ఇవ్వన్నన్నారంట. ఎలాగైతేనేం పసిమిరంగు గల కోడలిని ధనవంతులింటి పెద్ద కూతురిని కోడలిగా తెచ్చికుంది నాయనమ్మ. అమ్మను అందరూ ఎర్ర కోడలా.. అని పిలిచేవారు అత్త వరుస అయ్యేవాళ్ళు అందరూనూ. నేను తొమ్మిదేళ్ళు వచ్చాకనే మా వూరు వచ్చాను. అంతకు ముందు అంతా అమ్మమ్మ వాళ్ళింట్లో పెరిగాను. అమ్మమ్మ వాళ్ళింటికి నానమ్మ వాళ్ళింటికి పూర్తీ వ్యతిరేకం. ఇక్కడ ఇల్లు వోట్టిపోయినట్టు వుండేది. అక్కడ పాడి పంట పొలాలు అంతా సంవృద్ది. నాయనమ్మ వెంట నేను హరికథా కాలక్షేపం కి వెళ్ళేదాన్ని. రోటి పచ్చడి చేసి రోట్లోనే అన్నం కలిపి ముద్దలు పెట్టేది. సంక్రాంతి వస్తే కోడిపందాలు వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేది. మట్టి అరుగులు అలికి బొటనవేలితో చుక్కలు పెట్టేది. ముగ్గులు వేసేది. కార్తీక స్నానాలు త్రిమూర్తి వ్రతం చేసేది. ఎదురుగా ఉండే మా తాతయ్య మేనమామ కొడుకు ఇంటికి వెళ్ళేది. మా తాతయ్య మేనమామ కోడుకి కి తాతయ్య పిన్ని కూతురిని ఇచ్చారు.వారి మధ్య బంధుత్వం అనుబంధం బలంగా ఉండేది.ఆమె పేరు నాగరత్నమ్మ. ఆ మామ్మ కోడలు పుష్పవతి అత్తయ్య నాయనమ్మకు ప్రతిరోజూ కూరలు మజ్జిగ ,తినుబండారాలు, కూరగాయలు అన్నీ పంపేవారు. నాయనమ్మ వెళ్లకపోయినా సరే .. బుట్టలో పెట్టి పని ఆమెకు ఆమెకు ఇచ్చి పంపేవారు. వారి ఇల్లు చల్లగుండా.. అని మనఃస్పూర్తిగా అనుకుంటాను ఈ రోజుకి.
నాయనమ్మ తాతయ్య ఆస్తులన్నీ కొడుకులకిచ్చేసి మనోవర్తి తీసుకుంటున్నారు కాబట్టి వారికి చేతినిండా డబ్బు వుండేది కాదు. మా పెదనాన్న లిద్దరూ సమయానికి వారికి ధాన్యం పంపేవారు కాదు. వారి భుక్తి కి కష్టం వచ్చింది. ఇక చిరుతిండ్లు ఎక్కడ? వారు స్వయంశక్తి తో వున్నప్పుడు దండిగా ఏమి తిన్నారో అదే వారికి దక్కింది. యాబై ల్లోకి వచ్చేసరికే దంత సిరి లేకుండా పోయింది. మా అమ్మ వారికి ఇవ్వాల్సింది యెంతో అంత పంట రాగానే వారికి పంపించేది. కానీ వారికి ఏమీ పెట్టేది కాదు అంటే కాదు కానీ మర్యాదకు పెట్టేది ధారాళంగా పెట్టేది కాదు. అది పిండివంటలైనా పాలైనా పెరుగైనా కూరలైనా మామిడి పండ్లైనా పచ్చళ్ళైనా సరే. నాయనమ్మ తాతయ్య నోరు కట్టుకునే బతికారు. అదే దుఃఖంగా వుంటుంది నాకు. మా నాన్నపై వున్న కోపం అంతా అత్తమామలపై చూపేది అమ్మ. ఒకోసారి వాళ్ళు కదిలితే తప్పు మెదిలితే తప్పు అన్నట్టు వుండేది. వాళ్ళ కు వాడుకోవడానికి నీళ్ళు కూడా పోయనిచ్చేది కాదు. నేను తిట్లు తిని అయినా వాళ్ళకు తొట్టినిండా నీళ్ళు వొంపేదాన్ని. మా ఆర్ధికనష్టాలు కష్టాలు మొదలయ్యాక వారికి బాధలు మరింత ఎక్కువయ్యాయి. మానసికంగా నలిగిపోయారు.పెదవి విప్పి ఎవరికీ చెప్పుకునేవారు కాదు. దానికి తోడు మా మేనత్త భర్త ఆమెను విపరీతమైన హింస పెట్టి పుట్టింటికి పంపేశాడు. కూతురు జీవితం గురించి కొడుకులు ఆస్తులు పోగొట్టుకోవడం గురించి దిగులుగా ఉండేది.
ఇంకా తాతయ్య వ్యక్తిత్వం గురించి మంచితనం గురించి రాయడం మొదలు పెట్టనే లేదు. ఆయన గురించి వినాలంటే ఇంకా జీవించి వున్న అన్నదమ్ముల పిల్ల నోట వినాల్సిందే .. అమ్మో ! మా బాబాయి ఎంత బంగారమో ..మా పెదనాన్న కు పిల్లలంటే ఎంత ప్రేమో ..అని అందుకుంటారు. నాన్న మేనత్త కాకుండా ఇంకా ఐదుగురు కజిన్స్ ఉన్నారు. వారిని కదిలిస్తే బోలెడు విషయాలు వరదలా చుట్టేస్తాయి.
గతమెంతో ఘనకీర్తి అని నేను చెప్పుకోవడంలేదు … అందులో మా పూర్వీకుల వెతలు కష్టం ఉన్నాయి. వాటిని దాటుకుంటూ కూడా వారు గొప్పగా బతికారు. ..
ఇంకా ఉంది …నా మనుమరాలు నాయనమ్మా అని పిలిచినప్పుడల్లా.. నాకు మా నాయనమ్మ గుర్తుకొస్తుంది. ఆ జ్ఞాపకాలు బరువైనవి. మా నాయనమ్మ తాతయ్యకు ప్రేమతో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి